Vanisri
-
నటి వాణిశ్రీని పెద్ద సమస్య నుంచి గట్టెక్కించిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై: నటి వాణిశ్రీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండగా నిలిచారు. ఓ పెద్ద సమస్య నుంచి ఆమెను గట్టెక్కించారు. నటి వాణిశ్రీకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఆ స్థలం విలువ దాదాపుగా రూ.20 కోట్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వం.. వాణిశ్రీ భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించారు. చదవండి: బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి! సదరు భూమి పత్రాలను వాణిశ్రీకి స్టాలిన్ అప్పగించారు . ఇదే సందర్భంలో నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారాన్ని కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. తన భూమిని తనకు అప్పగించిన స్టాలిన్ సాయానికి వాణిశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి వాణిశ్రీ
రాపూరు: సీనియర్ నటి వాణిశ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామినిదర్శించుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. వాణిశ్రీతో సెల్ఫీ దిగేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపారు. -
Telugu Movie: 50 ఏళ్ల ‘ప్రేమనగర్’
కొన్ని కథలు భాషల హద్దులు చెరిపేసి, వెళ్ళిన ప్రతిచోటా బాక్సాఫీస్ చరిత్ర సృష్టిస్తాయి. అవి ప్రేమకథలైనప్పుడు, సంగీతం, సాహిత్యం, అభినయం, అలుపెరుగని నిర్మాణం లాంటివి తోడైనప్పుడు తరాలు మారినా చిరస్మరణీయం అవుతాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ – తెలుగు, తమిళ, హిందీ మూడింటిలో హిట్ రూపం – ‘ప్రేమనగర్’. ఒకదశలో ‘ద్రోహి’ (1970) లాంటి ఫ్లాప్ తర్వాత, రూ. 12 లక్షల నష్టంతో, మరొక్క దెబ్బతింటే సినిమాలొదిలి, సేద్యంలోకి వెళ్ళిపోవాలనుకున్న నిర్మాత డి. రామానాయుడునీ, ఆయన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనూ ఇన్నేళ్ళు సుస్థిరంగా నిలిపిన చిత్రం అది. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం, అక్కినేని – వాణిశ్రీ అపూర్వ అభినయం, ఆత్రేయ మాటలు – పాటలు, మహదేవన్ సంగీతం – ఇలా అన్నీ కలసి తెలుగు ‘ప్రేమనగర్’ను తీపిగుర్తుగా మార్చాయి. ప్రణయజీవుల ఊహానివాసం ‘ప్రేమనగర్’ (1971 సెప్టెంబర్ 24) రిలీజై, నేటికి 50 ఏళ్ళు. ఒకరు కొంటే, వేరొకరు తీశారు! ‘ప్రేమనగర్’ నిర్మాణమే ఓ విచిత్రం. అది తీయాలనుకున్నది మొదట రామానాయుడు కాదు. ‘ఆంధ్రప్రభ’ వీక్లీ సీరియల్‌గా హిట్టయిన కౌసల్యాదేవి నవల హక్కులు కొన్నది నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి. అక్కినేనితో తీయడానికి పాలగుమ్మి పద్మరాజు, చంగయ్య లాంటి ప్రసిద్ధులు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కె.ఆర్. విజయ హీరోయిన్. సిన్మా తీద్దామనుకున్న సమయంలో అనుకోని దుర్ఘటనలతో శ్రీధర్‌రెడ్డికి సెంటిమెంట్ పట్టుకుంది. ప్రాజెక్ట్ అటకెక్కింది. అప్పుడే అక్కినేని ‘దసరాబుల్లోడు’ రిలీజై, కలెక్షన్ల వర్షంతో హోరెత్తిస్తోంది. ఆయనతో సినిమా తీయాలనుకొన్న రామానాయుడికి ఈ స్క్రిప్టు విషయం తెలిసింది. రూ. 60 వేలకు కొని, హిట్ హీరోయిన్ వాణిశ్రీ జోడీగా ‘ప్రేమనగర్’ ప్రారంభించారు. ఆపైన అనేక నవలా చిత్రాలు తీసిన సురేష్ సంస్థకూ, రామానాయుడుకూ ఇదే తొలి నవలా ప్రయత్నం. దర్శకుడు ప్రకాశరావు, రచయిత ఆత్రేయ కృషితో నవలలో లేని అనేక అంశాలతో సెకండాఫ్ స్క్రిప్ట్ అంతా కొత్తగా తయారైంది. ఆ రోజుల్లోనే కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా అప్పలాచార్యతో రాయించారు. అప్పట్లో ‘దసరాబుల్లోడు’ రూ. 14 లక్షల్లో తీస్తే, అంతకన్నా ఎక్కువగా రూ. 15 లక్షల్లో కలర్లో తీయాలని సిద్ధపడ్డారు రామానాయుడు. వాహినీ స్టూడియోలో 1971 జనవరి 22న మొదలైన ‘ప్రేమనగర్’ కోసం కళా దర్శకుడు కృష్ణారావు వేసిన హీరో జమీందార్ ఇల్లు, ప్రేమనగర ఫుల్ఫ్లోర్ సెట్ సంచలనం. అది... ఆ ఇద్దరి అపూర్వ ట్రేడ్‌మార్క్ ఇలాంటి ప్రేమకథలు, విషాదదృశ్యాల అభినయాలు అక్కినేనికి కొట్టినపిండి. ‘దేవదాసు’ నుంచి ‘ప్రేమాభిషేకం’ దాకా తెరపై ఆ ఇమేజ్, ఆ గెటప్ ఆయనకే సొంతం. అయితే, ‘దసరాబుల్లోడు’, ఆ వెంటనే ‘ప్రేమనగర్’తో నటిగా వాణిశ్రీ ఇమేజ్ తారస్థాయికి చేరింది. ఇందులో ఆత్మాభిమానం గల నాయిక లత పాత్రలో ఆమె అభినయం అపూర్వం. కథానాయకుడి మొదలు కథంతా ఆ పాత్ర చుట్టూరానే తిరిగే ఈ చిత్రం ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్. ఆ తరువాత అనేక చిత్రాల్లో ఆత్మాభిమానం గల పాత్రలకు వాణిశ్రీయే ట్రేడ్‌మార్క్. ఇక, తలకొప్పు, మోచేతుల దాకా జాకెట్టు, ఆభరణాలు, అందమైన చీరలతో అప్పట్లో ఆమె ఫ్యాషన్ ఐకాన్ అయిపోయారు. అక్కడ నుంచి తెరపై ఆమె చూపిన విభిన్న రకాల స్టయిల్స్ తెలుగు స్త్రీ సమాజాన్ని ప్రభావితం చేయడం ఓ చరిత్ర. రిపీట్ రన్ల... బాక్సాఫీస్ నగర్! ‘ప్రేమనగర్’ రిలీజైన వెంటనే తొలి రెండు వారాలూ తెలుగునాట భారీ వర్షాలు. రామానాయుడికి కంగారు. ఆ రెండు వారాల అవరోధాలనూ అధిగమించి, సినిమా బాగా పికప్ అయింది. వసూళ్ళ వర్షం కురిపించింది. ‘దసరాబుల్లోడు’, వెంటనే ‘ప్రేమనగర్’ బంపర్ హిట్లతో 1971 అక్కినేనికి లక్కీ ఇయరైంది. అప్పట్లో 34 సెంటర్లలో రిలీజైన ఈ చిత్రం 31 కేంద్రాల్లో 50 రోజులాడింది. 13 కేంద్రాల్లో వంద రోజులు, షిఫ్టులతో హైదరాబాద్‌లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అర్ధశతదినోత్సవం నాటికి అంతకు ముందు వసూళ్ళ రికారై్డన ‘దసరాబుల్లోడు’ను ‘ప్రేమనగర్’ దాటేసి, రూ. 33 లక్షల గ్రాస్‌తో కొత్త ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. అప్పటి నుంచి ‘ప్రేమనగర్’ ఎప్పుడు రిలీజైనా వసూళ్ళ వానే. అక్కినేని చిత్రాల్లోకెల్లా రిపీట్ రన్ల పరంగా నంబర్ 1 చిత్రమైంది. హార్ట్ ఆపరేషన్ తర్వాత అక్కినేని రెస్ట్ తీసుకున్న 1975లో ‘ప్రేమనగర్’ రిపీట్‌లో 50 రోజులు ఆడడం విశేషం. మూడు భాషలు... ముగ్గురు స్టార్లు... ‘ప్రేమనగర్’ కథను తెలుగు తర్వాత తమిళ, హిందీల్లోనూ దర్శకుడు ప్రకాశరావుతోనే తీశారు. తమిళ ‘వసంత మాళిగై’లో శివాజీగణేశన్ – వాణిశ్రీ జంట. హిందీ ‘ప్రేమ్‌నగర్’లో రాజేశ్‌ఖన్నా– హేమమాలిని జోడీ. మూడూ పెద్ద హిట్. అన్నిటికీ రామానాయుడే నిర్మాత. ‘విజయా’ నాగిరెడ్డి కుటుంబం ఈ 3 చిత్రాల నిర్మాణంలో భాగస్థులు. ఇప్పటికీ ఈ చిత్ర రైట్స్ తాలూకు రాయల్టీ ఆ కుటుంబాలకు అందుతుండడం ఈ సినిమా సత్తా. అన్నిటికీ పబ్లిసిటీ డిజైనర్ ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ డిజైనర్ ఈశ్వరే. ఈ చిత్రం ఆయన కెరీర్‌ను మరో మెట్టెక్కించింది. అంతకు ముందు ‘రాముడు – భీముడు’, తమిళంలో ‘ఎంగవీట్టు పిళ్ళై’, హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’గా 3 భాషల్లో హిట్. ఆ తరువాత ‘ప్రేమనగర్’ మూడు భాషల్లో హిట్. అక్కడ ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్ కుమార్. ఇక్కడ ఏయన్నార్, శివాజీ, రాజేశ్‌ఖన్నా. అదీ లెక్క. శివాజీ చిత్రాల్లో ‘వసంత మాళిగై’ డైరెక్ట్ 40 వారాలాడిన కెరీర్ బెస్ట్ హిట్. ఎనిమిదిన్నరేళ్ళ క్రితం ఆ తమిళ చిత్రాన్ని డిజిటల్‌గా పూర్తిగా పునరుద్ధరించి, స్కోప్‌లో 2013 మార్చి 8న రీరిలీజ్ చేస్తే, అప్పుడూ హిట్టే. మారిన పాటలు! మారని క్లైమాక్స్! ‘ప్రేమనగర్’లో ఆత్రేయ మాటలు, పాటలు జనం నోట నిలిచాయి. ‘కడవెత్తుకొచ్చిందీ..’, ‘నేను పుట్టాను..’ లాంటి మాస్ పాటలు, ‘తేటతేట తెలుగు’, ‘నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం..’ లాంటి క్లాస్ పాటలు ఇవాళ్టికీ మర్చిపోలేం. ‘తేటతేట తెలుగులా..’ పాట తెలుగులోనే ఉంది. తమిళ, హిందీ వెర్షన్లలో అలాంటి పాటే లేకుండా, సీన్‌తో వదిలేశారు. అలాగే, తెలుగులో క్లైమాక్స్‌లో హీరో విషం తాగి, ‘ఎవరి కోసం’ అంటూ పాట పాడడం విమర్శకు తావిచ్చింది. దాంతో తమిళ, హిందీల్లో జాగ్రత్తపడి, పాట పాడాక, విషం తాగేలా మార్చారు. తెలుగులో సుఖాంతం, విషాదాంతం 2 క్లైమాక్సులూ తీశారు. సుఖాంతంగా రిలీజ్ చేశారు. జనానికి నచ్చకపోతే ఉంటుందని ముందుజాగ్రత్తగా రెండో క్లైమాక్స్ రీలూ అందరికీ పంపారు. సుఖాంతానికి జై కొట్టడంతో, రీలు మార్చే పని రాలేదు. లవ్‌స్టోరీలకు ఇది సెంటిమెంట్ డేట్! ‘ప్రేమనగర్’ బాక్సాఫీస్ హిట్‌తో ఆ రిలీజ్ డేట్ సెంటిమెంట్ అయిపోయింది. సరిగ్గా పదేళ్ళకు 1981లో దాసరి దర్శకత్వంలో అక్కినేనితోనే రూపొందిన దేవదాసీ ప్రేమకథ ‘ప్రేమమందిరం’ చిత్రాన్నీ సెప్టెంబర్ 24నే రామానాయుడు రిలీజ్ చేశారు. మరుసటేడు దాసరి సొంతంగా, అక్కినేనితో నిర్మించిన ప్రేమకావ్యం ‘మేఘసందేశం’ రిలీజ్ డేటూ అదే. తాజాగా ఇప్పుడు అక్కినేని మనుమడు నాగచైతన్య లేటెస్ట్ ‘లవ్‌స్టోరీ’ ఇదే డేట్‌కి రిలీజ్ చేయడం విశేషం. – రెంటాల జయదేవ -
ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అక్కినేని చేసిన సినిమా ఇదే!
పాపులర్ నవలల్ని తెర మీదకు తెస్తే? అంతకన్నా సక్సెస్ ఫార్ములా ఇంకేముంటుంది! ‘సెక్రటరీ’... యద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల. ‘ప్రేమనజర్’ కాంబినేషన్ – దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, అక్కినేని, వాణిశ్రీ లతో సురేశ్మూవీస్ రామానాయుడుకు ‘నవలా చిత్రాల నిర్మాత’ అన్న పేరును సుస్థిరం చేసిన నవల. వంద ముద్రణలు జరుపుకొన్న ‘సెక్రటరీ’ నవలకు ఇప్పుడు 55 వసంతాలు. నవలను సినిమాగా తీసినప్పుడుండే సహజమైన విమర్శలు, భిన్నాభిప్రాయాల మధ్యనే శతదినోత్సవం జరుపుకొన్న ఆ నవలాధారిత చిత్రానికి 45 ఏళ్ళు. అంతర్జాతీయ మహిళా వత్సరం! అరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటి దాకా వంటింటికే పరిమితమైన మధ్యతరగతి అమ్మాయిలు చదువుకొని, కుటుంబ అవసరాల రీత్యా రెక్కలు విప్పుకొని, గడప దాటి ఉద్యోగాలు చేయడం అప్పుడప్పుడే మొదలైంది. మారుతున్న సమాజాన్నీ, చుట్టూ ఉన్న హైక్లాస్ ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ చూస్తూ... అటు మొగ్గలేని, ఇటు మధ్యతరగతి విలువలలో మగ్గలేని ఊగిసలాట ఉంది. ఆ నేపథ్యంలో సెక్రటరీ ఉద్యోగం చేసిన జయంతి అనే అమ్మాయి కథ – యద్దనపూడి రాసిన, రామానాయుడు తీసిన – ‘సెక్రటరీ’. 1975ను ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ కాలఘట్టంలో, నవల వెలువడ్డ పదేళ్ళకొచ్చిన చిత్రం ‘సెక్రటరీ’. రచనలోనూ, తెరపైనా చివరకు పురుషాధిక్యమే బలంగా కనపడినప్పటికీ, ‘‘ఒకరిలా ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను నేనుగా ఉండడమే నాకిష్టం’’ అనే వ్యక్తిత్వమున్న జయంతి పాత్రలో వాణిశ్రీ రాణించిన సందర్భమది. స్టార్ హీరోకు... సెకండ్ ఇన్నింగ్స్! మహిళాదరణ ఉన్న హీరోగా అక్కినేని కెరీర్లో ‘సెక్రటరీ’ది ప్రత్యేక స్థానం. అప్పట్లో గుండె జబ్బుకు చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళారు. తీరా అప్పటికప్పుడు 1974 అక్టోబర్ 18న ఆయనకు ఓపెన్ హార్ట్సర్జరీ చేశారు. డిసెంబర్ మొదట్లో స్వదేశానికి తిరిగొచ్చినా, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నారు. దాంతో, 1975లో ఆయన కొత్త సినిమాలేవీ రిలీజు కాలేదు. పాత ప్రాజెక్ట్ ‘మహాకవి క్షేత్రయ్య’ను కొనసాగించారు. కానీ, పూర్తిస్థాయిలో అక్కినేని రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది ‘సెక్రటరీ’తోనే! అక్కినేని మానసిక సంఘర్షణ... అప్పట్లో సారథీ స్టూడియో అందుబాటులో లేక, తాను ఒకప్పుడు కాదని వచ్చేసిన మద్రాసుకు మళ్ళీ షూటింగులకు వెళ్ళలేక అక్కినేని ఇరుకున పడ్డారు. అమెరికా పర్యటనకు ముందెప్పుడో మొదలై, కుంటినడక నడుస్తున్న ‘క్షేత్రయ్య’ పూర్తి చేయడం కోసం చివరకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చింది. కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు అక్కడ బెంగుళూరులో బొబ్బిలి రాజా ప్యాలెస్ కొని, 1969 నుంచి ‘చాముండేశ్వరీ స్టూడియోస్’ నిర్వహిస్తున్నారు. అక్కడ అక్కినేని తన ‘క్షేత్రయ్య’ షూటింగ్ జరపాల్సి వచ్చింది. అప్పుడిక విధి లేక... సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో, ‘అన్నపూర్ణా స్టూడియోస్’కు శ్రీకారం చుట్టారు. నిర్మాత దుక్కిపాటి సహా శ్రేయోభిలాషులు వద్దన్నా సరే... అక్కినేని సాహసించారు. అక్కడ తొలి షూటింగ్... ఇదే! అన్నపూర్ణా స్టూడియోస్ 1976 జనవరి 14 సాయంత్రం నాలుగు గంటల వేళ ప్రారంభమైంది. అప్పట్లో కొండలు, గుట్టలుగా, సరైన రోడ్డు కూడా లేని ప్రాంతం అది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అండతో అక్కినేని స్వయంగా దేశ రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రథమ పౌరుడి ప్రోటోకాల్ ఏర్పాట్లతో స్టూడియోకు రోడ్డు పడింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీసమేతంగా వచ్చి, స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి స్టూడియోలో ఒక్క ఫ్లోరే సిద్ధమైంది. ఆ ఫ్లోర్‌లోనే ‘సెక్రటరీ’ మొదలెట్టారు నిర్మాత రామానాయుడు. సినీపరిశ్రమను హైదరాబాద్‌కు తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ప్రోత్సా హాలకు అనుగుణంగా ఆవిర్భవించిన అన్నపూర్ణా స్టూడియోలో చిత్రీకరణైన తొలిచిత్రం ‘సెక్రటరీ’. ఆ కథ ఎన్నో చేతులు మారి... జయంతి (వాణిశ్రీ), రాజశేఖరం (అక్కినేని) నాయికా నాయకులు. ఎదుటపడితే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. చాటున మాత్రం ఒకరినొకరు తలుచుకుంటారు. ఒకరికి పొగరు. వేరొకరికి బిగువు. పొగరు దిగి, బిగువు సడలి ఇద్దరి మధ్య ఎలా జత కుదిరిందన్నది ‘సెక్రటరీ’ కథ. దీన్ని సీరియల్‌గా రాసేటప్పటికి యద్దనపూడికి నిండా పాతికేళ్ళు లేవు. గర్భవతి. అలా 1964 – 65ల్లో ఆమె రాసిన ఆ నవల ఓ ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో పడవ లాంటి కారు, మేడ, తోట, నౌకర్లున్న ఆరడుగుల అందగాడైన రాజశేఖరం లాంటి అబ్బాయి తమకు భర్త కావాలని కోరుకోని మధ్యతరగతి అమ్మాయిలు లేరు. అలాగే, ఆత్మాభిమానం నిండిన జయంతిలో తమను తాము వారు చూసుకున్నారు. 1966లో తొలి ముద్రణ నుంచి ఇప్పటికి వంద ఎడిషన్లు... వేల కాపీలు... లక్షలాది పాఠకాభిమానంతో తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల – ‘సెక్రటరీ’. అప్పట్లో ఆ నవలను తెరకెక్కించాలని చాలామంది అనుకున్నారు. ఆ నవల ఎన్నో ఏళ్ళు, ఎందరి చేతులో మారింది. చివ రకు రామానాయుడికి ఆ అదృష్టం దక్కింది. అప్పటికే పాపులర్ నవలల ఆధారంగా వరుసగా ‘ప్రేమనగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’ చిత్రాలు తీసిన ఆయన ‘సెక్రటరీ’ని రిచ్‌గా నిర్మించారు. ఆ పాటలు... ఆ వ్యూహాలు! ‘సెక్రటరీ’ కన్నా నెల రోజుల ముందు ‘క్షేత్రయ్య’ (1976 మార్చి 31) రిలీజైంది. దాన్ని పక్కనపెడితే, ‘దొరబాబు’ (1974 అక్టోబర్ 31) తర్వాత దాదాపు ఏణ్ణర్ధం గ్యాప్‌తో జనం ముందుకు అక్కినేని ఉత్సాహంగా వచ్చిన సినిమా ‘సెక్రటరీ’యే (1976 ఏప్రిల్ 28)! నవలా చిత్రమనే క్యూరియాసిటీ, మంచి పాటలు కలగలిసి సినిమా రిలీజుకు మంచి క్రేజు వచ్చింది. ఆ రోజుల్లో అనూహ్యమైన అడ్వా¯Œ ్స బుకింగ్‌తో కలకలం రేపింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. రామకృష్ణ గళంలో హుషారు గీతం ‘నా పక్కనచోటున్నది ఒక్కరికే...’, ఆత్రేయ మార్కు విషాద రచన ‘మనసు లేని బ్రతుకొక నరకం...’ పాటలు హిట్. ప్రేక్షక జనాకర్షణ కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మంచి వ్యూహాలే వేశారు. నవలలోని పాత్రలకు జనంలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, సినిమా టైటిల్స్‌లో తారల పేర్ల బదులు వారి ఫోటోలు పెట్టి, రాజశేఖరం, జయంతి లాంటి నవలా పాత్రల పేర్లే వేశారు. ‘మొరటోడు నా మొగుడు..’ పాటను సినిమా రిలీజైన కొన్నాళ్ళకు కొత్తగా కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో దక్షిణాది, ఉత్తరాది సినీతారల మధ్య హైదరాబాద్ ఎల్బీ స్టేడియమ్లో బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రిలీజైన అయిదారు వారాలకు ‘సెక్రటరీ’తో పాటు ఆ మ్యాచ్ దృశ్యాల రీలును ప్రదర్శించారు. కానీ, భారీ అంచనాలతో హాలుకొచ్చిన నవలా పాఠకుల ఊహలను సినిమా అందుకోలేకపోయింది. ‘సక్సెసైనా, మేము ఆశించిన అద్భుత విజయం దక్కలేదు. రిపీట్ రన్లో లాభాలొచ్చాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. 6 కేంద్రాల్లో ‘సెక్రటరీ’ వంద రోజులు పూర్తిచేసుకుంది. ‘‘చదవడానికి బాగున్న ‘సెక్రటరీ’లో బాక్సాఫీస్ సూత్రాలు తక్కువ’’ అంటూ, ‘‘ఈ నవలను సిన్మా తీయడం తేలికైన పని కాదు’’ అని స్వయంగా అక్కినేనే శతదినోత్సవ వేదికపై విశ్లేషించారు. ఏమైనా, ‘సెక్రటరీ’ నవల, ఈ నవలా చిత్రం ఇన్నేళ్ళు గడిచినా ఆ తరానికి ఓ తరVýæని పాత జ్ఞాపకాల పేటిక! ‘సారథీ’తో ‘దేవదాసు’ వివాదం ‘సెక్రటరీ’కి ముందు అక్కినేనికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. నవయుగ ఫిలిమ్స్ వారు అక్కినేనికి సన్నిహితులు. నవయుగ వారి సోదర పంపిణీ సంస్థ ‘శ్రీఫిలిమ్స్’లో అక్కినేని భాగస్వామి! హైదరాబాద్ షిఫ్టయి, ఇక్కడే సినిమాలు చేస్తానంటున్న తమ హీరో అక్కినేని కోసం నవయుగ వారు నష్టాల్లో ఉన్న సారథీ స్టూడియోను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. 1971 ప్రాంతంలో అక్కినేని ‘అన్నపూర్ణా ఫిల్మ్స్’ అని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాగా, 1974లో శ్రీఫిలిమ్స్ ఆర్థిక సహకారంతో హీరో కృష్ణ కలర్లో ‘దేవదాసు’ తీయడం సంచలనమైంది. అమెరికాకు వెళ్ళే ఆరు నెలల ముందు అక్కినేని తన పాత ‘దేవదాసు’ హక్కులు కొన్నారు. కృష్ణ ‘దేవదాసు’(1974 డిసెంబర్ 6)కు పోటీగా వారం ముందు ఈ పాతది రిలీజ్ చేయించారు. కృష్ణ ‘దేవదాసు’కు డబ్బులు పెట్టిన తాము నష్టపోతామని నవయుగ వారు వారించినా, అక్కినేని వినలేదు. ఆ పోటీలో కృష్ణ ‘దేవదాసు’ ఫ్లాపైంది. దాంతో, మనసుకు కష్టం కలిగిన నవయుగ వారు ఆ డిసెంబర్ 10న అమెరికా నుంచి వచ్చాక అక్కినేని ‘క్షేత్రయ్య’ షూటింగ్‌కు సారథీ స్టూడియో ఇవ్వడం ఆపేశారు. ‘నష్టాల వల్ల స్టూడియో మూసేశాం’ అన్నారు. ఇక, తప్పక అక్కినేని అన్నపూర్ణా స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఆ జంట... సూపర్ హిట్! అది వాణిశ్రీ హవా సాగుతున్న కాలం. ఆమె కట్టిందే చీరగా, పెట్టిందే బొట్టుగా, చుట్టిందే కొప్పుగా జనం నీరాజనం పడుతున్న సమయం. 1970ల మొదట్నించి ఏడెనిమిదేళ్ళు ఏ సినిమా చూసినా వాణిశ్రీయే! ఏయన్నార్‌తో ‘సెక్రటరీ’ నాటికి ఎన్టీఆర్ (‘ఆరాధన’), కృష్ణ (‘చీకటి వెలుగులు’), శోభన్‌బాబు (‘ప్రేమబంధం’), కృష్ణంరాజు (‘భక్త కన్నప్ప’) – ఇలా పేరున్న ప్రతి హీరో పక్కనా ఆమే! ఆ ఊపులో వచ్చిన ‘సెక్రటరీ’, ఆమె జయంతి పాత్ర జనంలో బోలెడంత ఆసక్తి రేపాయి. శతదినోత్సవ చిత్రం చేశాయి. అక్కినేని – వాణిశ్రీలది అప్పుడు హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో ‘సెక్రటరీ’ దాకా ఆ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సిన్మా లేదు. ఆ ఆరేళ్ళలో తెలుగు సినీ రాజధాని విజయవాడలో రిలీజైన హాలులోనే వంద రోజులాడిన అక్కినేని 8 చిత్రాల్లోనూ వాణిశ్రీయే హీరోయిన్ (1971 – దసరాబుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్. 1972 – విచిత్ర బంధం, కొడుకు – కోడలు. 1973 – బంగారుబాబు. 1974 – మంచివాడు. 1976 – సెక్రటరీ). ఇక అదే కాలంలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘దత్తపుత్రుడు’ (1972) కూడా ఎబౌ ఏవరేజ్‌గా నిలిచి, షిఫ్టులతో శతదినోత్సవం చేసుకోవడం విశేషం. అదే సమయంలో ఇతర హీరోలతోనూ వాణిశ్రీకి మరో ఆరేడు శతదినోత్సవ విజయాలుండడం గమనార్హం. అలా ఆమె ఆ కాలంలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. చివరకు సాక్షాత్తూ అక్కినేని సైతం, ‘‘ఈ ‘సెక్రటరీ’లో నేను నటించకపోయినా ఫరవాలేదు కానీ, వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయవంతం కాదనే నమ్మకం నాకు కలిగింది’’ అని శతదినోత్సవ వేదికపై బాహాటంగా ఒప్పుకోవడం మరీ విశేషం. అన్నపూర్ణా స్టూడియోస్... అలా కట్టారు! ‘‘నాకు నటించడానికి హైదరాబాద్‌లో చోటు లేదని తెలిశాక... నేను విపరీతంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంది అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణానికి ముందు’’ అని అక్కినేని అప్పట్లో తన మానసికస్థితిని వివరించారు. మనుమడు – నేటి హీరో చిన్నారి సుమంత్, పెద్ద కుమారుడు వెంకట్ చేతుల మీదుగా 1975 ఆగస్టు 13 ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌కు శంకుస్థాపన చేయించారు అక్కినేని. ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల స్థలంలో... కొండలను పిండి కొట్టి, బండరాళ్ళను పగలగొట్టి, ఎంతో కష్టం మీద స్టూడియో నిర్మాణం సాగించారు. ఒకపక్క ‘క్షేత్రయ్య’ కోసం తరచూ బెంగుళూరు వెళ్ళి వస్తూ, మరోపక్క ఈ నిర్మాణం పనుల్లో తలమునకలయ్యారు. ‘‘ఇంజనీర్లు లేరు. బండరాళ్ళు కొట్టించడం దగ్గర నుంచి డిజైన్లు, ఇతర ప్లాన్లు వేసుకోవడం వరకూ అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది’’ అని అక్కినేని ఓసారి చెప్పారు. అంతకు ముందు ‘అక్కినేని 60 సినిమాల పండుగ’కు సొంత ఖర్చుతో మద్రాసులో ‘విజయా గార్డె¯Œ ్స’ సిద్ధం చేసిన నిర్మాత బి. నాగిరెడ్డి ఈసారి హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణంలోనూ సలహాలు, సూచనలిచ్చారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా పనివాళ్ళను పంపించారు. ∙అన్నపూర్ణా స్టూడియోస్ తొలి నవలే... సెన్సేషన్ యద్దనపూడి తొలి నవలే ‘సెక్రటరీ’. అప్పట్లో విజయవాడ నుంచి ‘జ్యోతి’ మంత్లీ రాఘవయ్య ప్రారంభించారు. ఆ పత్రిక నడిపిన బాపు – రమణలు కోరగా యద్దనపూడి రాసిన నవల ఇది. అనంతర కాలంలో ‘నవలా రాణి’గా పేరు తెచ్చుకున్న యద్దనపూడి, నిజానికి ‘‘వాళ్ళు అడిగినప్పుడు, నేను కథలే రాశా. నవల రాయడం తెలీదు. ఎప్పుడూ రాయలేదన్నా’’రు. కానీ బాపు – రమణ, ‘‘మీరు రాయగలరు. మరేం లేదు... పెద్ద కథ రాసేయండి’’ అని భరోసా ఇచ్చారు. నవల పేరేమి వేద్దామంటే, అప్పటికప్పుడు యద్దనపూడి ఇంట్లోని తనకిష్టమైన సరస్వతీదేవి బొమ్మ దగ్గర తెల్లకాగితంపై ‘సెక్రటరీ – రచన యద్దనపూడి సులోచనారాణి’ అని రాసిచ్చారు. ఆమె నవలా హీరో చిత్రనిర్మాణవేళలోనే ‘సెక్రటరీ’కి బోలెడంత క్రేజు రావడానికి కారణం నవల. ‘సెక్రటరీ’ మంత్లీ సీరియల్ వచ్చిన రోజుల్లోకి వెళితే... తెలుగులో పాపులర్ సాహిత్యాన్ని మహిళలు ఏలడం మొదలైన కాలమది. లత, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి లాంటి పాపులర్ రచయిత్రుల వెనుక వచ్చి, రేసులో వారిని దాటి దూసుకుపోయిన పేరు యద్దనపూడి. కన్నెవయసులో బందరులో ‘తోడికోడళ్ళు’ సినిమా చూసి, హీరో అక్కినేనిని కలల నిండా నింపుకొన్న యద్దనపూడి, తాను సృష్టించిన కలల లోకపు నవలలకు అదే అక్కినేని కథానాయకుడై ప్రాణం పోస్తాడని ఊహించలేదు. అక్కినేని నటించిన ‘ఆత్మీయులు’, ‘విచిత్ర బంధం’, ‘బంగారు కలలు’, ‘సెక్రటరీ’ చిత్రాలు యద్దనపూడి నవలలే! – రెంటాల జయదేవ -
అక్కడ ఇందిరాగాంధీ, ఇక్కడ వాణిశ్రీ
మగాళ్ళదే పెత్తనమైన రోజుల్లో... అదీ హీరోలదే రాజ్యమైన సినిమా రంగంలో... హీరోయిన్ ప్రాధాన్యంతో సినిమా వస్తే? అదీ ఓ అప్‌కమింగ్ తారతో? పైపెచ్చు, హీరోయిన్ ఓరియంటెడ్ టైటిల్‌తో..అదీ ఏ క్రైమ్ సినిమానో కాకుండా సాంఘికమైతే? ఇప్పుడంటే ఓకే కానీ, బ్లాక్ అండ్ వైట్ కాలంలో... యాభై ఏళ్ళ క్రితం ఇలాంటివి ఆర్థికంగానూ, ఆదరణ రీత్యా కష్టమే. కానీ, వాణిశ్రీ నాయికగా, శోభన్‌బాబుతో దర్శక–నిర్మాత గిడుతూరి సూర్యం చేసిన ప్రయత్నం 1971 మార్చి 25న రిలీజైన ‘కథానాయకురాలు’. ‘తనువా హరిచందనమే...’ లాంటి పాపులర్ పాటలు, విలక్షణమైన విలనీ డైలాగులతో ఆ సినిమా ఇప్పటికీ చాలామందికి గుర్తే. అభ్యుదయ భావాలతో, సామ్యవాదాన్ని ప్రబోధించే భావాలతో సాటి అభ్యుదయ కవులు, రచయితలైన శ్రీశ్రీ, సుంకర సత్యనారాయణ, ఏల్చూరి, రెంటాల గోపాలకృష్ణ తదితరుల సృజనాత్మక భాగస్వామ్యంతో గిడుతూరి చేసిన ఆ ప్రయోగానికి ఇప్పుడు 50 వసంతాలు. లేచింది... నిద్రలేచింది మహిళాలోకం! అది 1971. అప్పుడప్పుడే సమాజంలో మార్పు వస్తోంది. వివిధ రంగాలలో స్త్రీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరా గాంధీ సారథ్యంలో సరికొత్త కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 1966 జనవరిలోనే తొలిసారి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ, తాజాగా మధ్యంతర ఎన్నికలతో దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు. అప్పటికే ఆమె రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతో నెహ్రూ మార్కు సోషలిజానికి తన దూకుడును జోడించారు. ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మహిళ నాయకురాలై, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న వేళ అది. సమాజంలోని మార్పులకు తగ్గట్టుగా సినిమాల్లో కథలు, స్త్రీ పాత్రలు మారాల్సిన సమయం వచ్చింది. స్త్రీలను చేతకానివాళ్ళుగా, వంటింటి కుందేళ్ళుగా చూపిస్తే ఇష్టపడరనే ఆలోచన మొదలైంది. సినీ విశ్లేషకుడు, సినీ పంపిణీ రంగ నిపుణుడు స్వర్గీయ కాట్రగడ్డ నరసయ్య మాటల్లో చెప్పాలంటే, ‘‘సమాజ అభివృద్ధిలో, సంఘంలోని కుళ్ళును కడిగేయడంలో ముఖ్యపాత్ర వహించేవారిగా స్త్రీలను చూపించాల్సిన అవసరం వచ్చింది. తెరపై వీరోచిత చర్యలను కథానాయకులు చేసినట్లే స్త్రీలే ప్రాముఖ్యం వహించే పాత్రలు అవసర’’మయ్యాయి. సరిగ్గా ఆ పరిస్థితుల్లో వచ్చినవే – భానుమతి నటించిన ‘మట్టిలో మాణిక్యం’. ఆ వెనువెంటనే వాణిశ్రీ ‘కథానాయకురాలు’. సూపర్‌హిట్ శోభన్‌బాబు– వాణిశ్రీ ఇందిరా గాంధీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సరిగ్గా వారం రోజులకు వచ్చిన చిత్రం ‘కథానాయకురాలు’. సామ్యవాదాన్ని ప్రబోధిస్తూ, లేడీ ఓరియంటెడ్ టైటిల్‌తో అలా ఓ సినిమా రావడం అప్పట్లో విశేషం. గిడుతూరి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూర్చి, నల్ల వెంకట్రావుతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా హీరోను విప్లవ నాయకుడిగా చూపించడం బాక్సాఫీస్ ఫార్ములా. కానీ, కార్మిక సంఘ నాయకురాలిగా హీరోయిన్ను చూపించడం, ఆమె ఓ ధనిక యజమానితో కార్మిక ప్రయోజనాల కోసం పోరాడడం వెరైటీ. ‘మనుషులు మారాలి’ (1969) లాంటి హిట్స్‌తో పేరు తెచ్చుకొని, హీరోగా స్థిరపడుతున్న రోజుల్లో శోభన్‌బాబు కథానుగుణమైన ఆ టైటిల్‌కి ఒప్పుకోవడం విశేషం. శోభన్–వాణిశ్రీ జంట తర్వాతి కాలంలో ‘చెల్లెలి కాపురం’, ‘జీవన తరంగాలు’, ‘ఖైదీ బాబాయ్’, ‘జీవనజ్యోతి’తో హిట్ పెయిర్‌గా నిలవడం గమనార్హం. ‘కథానాయకురాలు’ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ కథలో చేసిన శోభన్ ఆనక హీరోయిన్ల హీరోగా, హీరోలు సైతం అసూయపడే అందాల నటుడిగా ఇమేజ్ సాధించడం ఓ చరిత్ర. తారాపథానికి... ‘కథానాయకురాలు’ వాణిశ్రీ అనాథైన ఒక పేదపిల్ల చదువు – సంస్కారం అలవరచుకొని, నాయకురాలై, కార్మిక ఉద్యమాన్ని ఎలా జయప్రదంగా నడిపిందీ, సంఘవిద్రోహుల్ని ఎలా ఎదిరించిందీ కార్మిక విప్లవ ప్రబోధ చిత్రం ‘కథానాయకురాలు’ చూపెడుతుంది. కార్మికుల హక్కుల కోసం ప్రాణాలకు తెగించే హీరోయిన్, ధనికుల బిడ్డ అయినా తానెవరో చెప్పకుండా హీరోయిన్ పోరాటానికి అండగా నిలిచే హీరో, కార్మికలోకాన్ని అణచివేయాలనుకొనే మిల్లు నిర్వాహకుడు – ఈ 3 ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ మూడు పాత్రల్లో వాణిశ్రీ, శోభన్‌బాబు, నాగభూషణం ఆకట్టుకుంటారు. ఇంకా అల్లు రామలింగయ్య, కాకరాల, ఛాయాదేవి, రామ్మోహన్, రావుగోపాలరావు, కామెడీకి రాజబాబు– ఇలా పేరున్న తారాగణమే ఉంది. ‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న పాత్రలో నటించారు. అప్పటికే వాణిశ్రీ తారాపథానికి పరుగులు తీస్తున్నారు. ఎన్టీఆర్ ‘కోడలు దిద్దిన కాపురం’, అక్కినేని ‘దసరా బుల్లోడు’ హిట్స్ తరువాత ‘కథానాయకురాలు’ వస్తే, ఆ వెంటనే కృష్ణ ‘అత్తలూ – కోడళ్ళు’, ఆ ఏడాదే శోభన్‌తోనే ‘చెల్లెలి కాపురం’ – ఇలా హీరోలందరి పక్కనా వాణిశ్రీ మెరిశారు. అయితే, ఒక రకంగా ఈ సినిమా వాణిశ్రీ బహుముఖ నటనను తెరపై చూపే రకరకాల గెటప్పులకు అవకాశమిచ్చింది. కార్మికనేతగా, ప్రేయసిగా, హిరణ్యకశిపుడిగా, తమిళ యువతిగా – విభిన్న వేషాలలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు. ఎన్టీఆర్ ‘సంగీతలక్ష్మి’ తీసిన సూర్యమే... దర్శకుడు గిడుతూరి సూర్యం పేరు చెప్పగానే ఎన్టీఆర్ – జమునల ‘సంగీతలక్ష్మి’, యస్వీఆర్ – రామకృష్ణల ‘విక్రమార్క విజయం’, కాంతారావు ‘రణభేరి’, విజయలలిత ‘పంచకల్యాణి– దొంగల రాణి’, మంజుభార్గవి ‘అమృతకలశం’ లాంటి వేర్వేరు కోవల సినిమాలు సినీ ప్రియులకు గుర్తుకొస్తాయి. ప్రసిద్ధ సినీ దర్శకులు కృష్ణన్ – పంజు, భీమ్సింగ్లకు ఆయన శిష్యుడు. లేఖా జర్నలిస్టుగా, రచయితగా జీవితం ప్రారంభించి సినిమాల్లో ఎదిగిన ఆయన ఆ తరం అభ్యుదయ కవి, రచయిత. విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, నాట్యాచార్యులు పసుమర్తి కృష్ణమూర్తి – డి. వేణుగోపాల్‌ల వద్ద కథారచన, చిత్రలేఖనం, కవిత్వం, నాటక రచన, నృత్యం – ఇలా అనేక కళలను నేర్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కళారాధనలో... కమ్యూనిస్టులు అభ్యుదయ కవులు బెల్లంకొండ రామదాసు, అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరిసుబ్రహ్మణ్యం,రెంటాల గోపాల కృష్ణ తదితరులు గిడుతూరికి మిత్రులు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ చదివి, ‘ప్రజానాట్యమండలి’లో, ‘ఇండియన్ నేషనల్ ఆర్ట్ థియేటర్’లో గిడుతూరి నాటక రచన, దర్శకత్వం చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. బలిజేపల్లి వద్ద నాటక, సినీ రచన నేర్చిన ఆయన రష్యా వెళ్ళి, అక్కడి మాస్కో మాస్ ఫిలిమ్ స్టూడియోలో శిక్షణ పొంది వచ్చాక, ఎన్టీఆర్ ‘సంగీత లక్ష్మి’ (1966)తో మొదలుపెట్టి పలు చిత్రాలను రూపొందించారు. ‘సంగీత లక్ష్మి’ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి, ‘సంగీత లక్ష్మి’, ‘కథానాయకురాలు’ రెండూ గిడుతూరి నవలల ఆధారంగా వచ్చిన సినిమాలే. భార్య సరస్వతీదేవి పేరిట ‘శ్రీ సరస్వతీ చిత్ర’ పతాకం నెలకొల్పి, ఆయన సినిమాలు తీశారు. ఏంచేసినా అభ్యుదయ భావాల్ని వదిలిపెట్టలేదు. సినిమాలతో సహా తన ప్రతి సృజనలోనూ వాటిని వీలైనంతగా జొప్పించేవారు. ‘కథానాయకురాలు’ కూడా ఆ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే. ఆ గీతాలన్నీ అభ్యుదయ రచయితలవే! అభ్యుదయ కవులు శ్రీశ్రీ,ఆరుద్ర,ఏల్చూరితో ‘కథానాయకురాలు’కి పాటలు రాయించారు గిడుతూరి. ‘‘సోషలిస్టు విధానాల కోసం మన ఇందిరాగాంధీ బడా నాయకుల్ని ఎదిరించి, ఘనవిజయం సాధించింది! కార్మిక సంక్షేమం కోసం మన కథానాయకురాలు దుష్టశక్తుల నెదిరించి, అపూర్వ విజయం సాధించింది!’’ అని ఈ సినిమా గురించి ఆ రోజుల్లో ప్రముఖంగా ప్రకటించారు. ‘అభినవ ప్రహ్లాద చరితం’ అంటూ దరిద్ర నారాయణుడే దేవుడిగా శ్రీశ్రీ రాసిన నాటకం హైలైట్. అలాగే, ‘మాభూమి’ నాటకకర్త సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ మరో హైలైట్. తర్వాతి కాలంలో ‘ఆంధ్రభూమి’ వీక్లీ ఎడిటర్‌గా పాపులరైన సికరాజు కూడా సినిమాలో జ్యోతిలక్ష్మిపై వచ్చే ‘చూడు షరాబీ...’ అనే శృంగార గీతం రాశారు. సెక్సప్పీల్ వల్లే సక్సెస్‌లా? ‘‘ధనస్వామ్యమా, జనస్వామ్యమా? ఈనాడు దేశానికేది కావాలి?’’ అని కథానాయకురాలు ద్వారా దర్శక – నిర్మాత ప్రశ్న సంధించారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అందమైన లోగో, డిజైన్లతో ఉగాది కానుకగా, 1971 మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి, ఆ ఫిబ్రవరిలోనే గిడుతూరి దర్శకత్వంలోనే ‘విక్రమార్క విజయం’ వచ్చింది. సక్సెస్ అయింది. ఆ వెంటనే స్వీయ నిర్మాణమైన ఈ సాంఘికంతో పలకరించారు గిడుతూరి. దేశంలో సెక్స్, క్రైమ్ చిత్రాలకే తప్ప, చక్కనికథతో సినిమా తీస్తే, దానికి డబ్బు రావడం లేదని అప్పటికే ఆయన ఆవేదన చెందుతూ ఉండేవారు. అందుకు తగ్గట్టే ‘కథానాయకురాలు’ పేరు తెచ్చినంత, డబ్బు తేలేదు. కాకపోతే, బి, సి సెంటర్లలో రిపీట్ రన్లతో ఎంతో కొంత లాభమే తెచ్చింది. అప్పటికే ఆడుతున్న ‘దసరా బుల్లోడు’, ‘రాజకోట రహస్యం’ లాంటి వాణిజ్య సినిమాల మధ్య కార్మిక విప్లవం లాంటి ప్రబోధాలిచ్చిన ‘కథానాయకురాలు’ నలిగిపోయింది. అయితే ‘తనువా...’ లాంటి పాటలతో, మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని చాటిన చిత్రంగా ‘కథానాయకురాలు’ ఇప్పటికీ ప్రత్యేకమే! ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్! అన్ని రకాల పాటలున్న ‘కథానాయకురాలు’లో ‘తనువా హరిచందనమే...’ పాట మాత్రం ఇవాళ్టికీ హైలైట్. హీరో శోభన్ బాబు, హీరోయిన్ వాణిశ్రీల కెరీర్లో పాపులర్ క్లాసికల్ హిట్ సాంగ్ ఇది. ఈ సినిమా రిలీజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందరే 1971 మార్చి 21న ఆలిండియా రేడియో హైదరాబాద్, విజయవాడల్లో వివిధ భారతి – వాణిజ్య ప్రసారాలను ప్రారంభించారు. రేడియోలో తరచూ సినీగీతాలు వినే సావకాశం తెలుగునాట దక్కింది. ఆ వెంటనే ఆ నెలాఖరునే వాణిశ్రీయే హీరోయిన్ గా నటించిన ఎన్టీఆర్ ‘జీవితచక్రం’తో తెలుగు సినిమాలకు రేడియో పబ్లిసిటీ కూడా తొలిసారిగా మొదలైంది. మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా ‘తనువా హరిచందనమే’ పాట ఎస్పీబీ, పి. సుశీల గళాల్లో రేడియోలో తరచూ వినిపిస్తూనే ఉంది. టీవీలో, యూ ట్యూబుల్లో కనిపిస్తూనే ఉంది. ప్రసిద్ధ సినీ గాయని చిత్ర సైతం ఇటీవలే ఓ టీవీ షోలో ఈ పాట పాడడం దీనికున్న పాపులారిటీకి తాజా నిదర్శనం. సినీ రంగంలో ఎ.ఎ. రాజ్ గా ప్రసిద్ధుడైన మ్యూజిక్ డైరెక్టర్ ఆకుల అప్పలరాజుకు ఇది కెరీర్ బెస్ట్ సాంగ్. గమ్మత్తేమిటంటే, తక్కువ పాటలే రాసినా, ఈ ఒక్క పాట సినీ గీత రచయితగా గోన విజయరత్నాన్ని చిరంజీవిని చేసింది. డైలాగుల్లో... విప్లవతత్వం! విలనీ!! గిడుతూరి సూర్యం తన ఆప్తమిత్రుల్లో ఒకరైన ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, నాటకకర్త రెంటాల గోపాలకృష్ణకు సినిమా సంభాషణల రచన బాధ్యత అప్పగించారు. అప్పటికే ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదక వర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న రెంటాల అనేక అనువాదాలు, రచనలు చేసిన సుప్రసిద్ధులు. సినీ రంగంతో అనుబంధం, సినీ విమర్శకుడిగా పేరూ ఉన్నవారు. రంగస్థలంపై పేరున్న రెంటాల అంతకు ముందు గిడుతూరి తీసిన జానపదం ‘పంచకల్యాణి – దొంగలరాణి’ (1969 ఆగస్టు 2)కి డైలాగ్స్ రాశారు. ప్రజానాట్యమండలిలో, బెజవాడ హనుమంతరాయ గ్రంథాలయం ఆంధ్ర ఆర్ట్ థియేటర్లో నటుడిగా, నాటకకర్తగా కృషిచేసిన రెంటాల సామ్యవాదాన్ని ప్రబోధించే సాంఘిక చిత్రం ‘కథానాయకురాలు’లోనూ తన కలం పదును మరోసారి చూపారు. యజమాని, కార్మికుల సంఘర్షణ ప్రధాన ఇతివృత్తమైన ఈ చిత్రానికి రెంటాల రాసిన సంభాషణలు ‘‘ఆయా సన్నివేశాలకు తగినట్టు భావస్ఫోరకంగా, విప్లవతత్వాన్ని వెదజల్లుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అప్పట్లో సినీ విమర్శకులు, సమీక్షకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రత్యేకించి, ‘‘సత్యారావు పాత్ర ధరించిన నటుడు నాగభూషణానికి రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి’’ అని పేర్కొన్నారు. రంగస్థలంపై మిత్రులు ఆచార్య ఆత్రేయ ‘విశ్వశాంతి’, అనిసెట్టి ‘గాలి మేడలు’ సహా అనేక నాటకాల్లో రెంటాల నటించారు. ఈ సినిమాలోనూ ఫ్యాక్టరీలో జీతాల పంపిణీ వేళ కార్మికుడు గోపయ్యగా కీలక ఘట్టంలో వెండితెరపైనా కనిపించడం విశేషం. బొంబాయి స్ఫూర్తితో... బెజవాడ దుర్గాకళామందిరం! 1920 జనవరి 17న ఏలూరులో సంపన్న చేనేత కుటుంబంలో జన్మించిన గిడుతూరి సూర్యంకి కళల పట్ల ఆసక్తి కలగడానికి ప్రేరణ ఒక రకంగా విజయవాడలోని ప్రసిద్ధ శ్రీదుర్గాకళామందిరం. బెజవాడలో నాటకశాలగా మొదలై 90 ఏళ్ళు దాటినా ఇప్పటికీ సినిమా హాలుగా నడుస్తున్న దుర్గాకళామందిరం నిర్మాణంలో గిడుతూరి తండ్రి బంగారు పాత్ర చాలా ఉంది. 1920లలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఆజ్ఞపై బొంబాయి వెళ్ళి, నాటకాలు ప్రదర్శించే థియేటర్లు సందర్శించి వచ్చారు బంగారు. బొంబాయి థియేటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్నీ, స్టేజీ ఏర్పాట్లనూ అనుసరిస్తూ, 1929 జూన్ ప్రాంతంలో పంతులు గారికి విజయవాడలో దుర్గాకళామందిరం నిర్మాణం చేశారు. ప్రదర్శకుల కోసం రొటేటింగ్ డిస్క్, వైర్ వర్క్స్, పాతాళంలోకి వెళ్ళేటట్టు స్టేజీ పైన అక్కడక్కడా పలకలు కిందకు తెరుచుకొనే ఏర్పాట్లు, ఇంకా అనేక టెక్నికల్ సదుపాయాలను కళామందిరంలో గిడుతూరి తండ్రి కల్పించారు. అనేక ప్రఖ్యాత నాటక సంస్థలు ఆయన కూర్చిన టెక్నికల్ సదుపాయాలతో అప్పట్లో అక్కడ అద్భుత ప్రదర్శనలిచ్చేవి. పంతులు గారి ప్రోత్సాహంతో దుర్గాకళామందిరంలో నిత్యం నాటకాలు, మూకీలు చూస్తూ కళల వైపు మొగ్గారు గిడుతూరి. అదే ఆయన సినీరంగ ప్రస్థానానికి బాటలు వేసింది. – రెంటాల జయదేవ చదవండి: హీట్ పెంచుతున్న కృతి.. సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు విషయం ఇదే! -
చెరిగిపోని పచ్చబొట్టు పవిత్రబంధం
కథలోని ప్రధాన పాత్రలకు ఏదో దెబ్బ తగిలి, గతం మర్చిపోవడం ఎప్పుడూ ఓ మంచి వెండితెర కమర్షియల్ పాయింట్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటి దాకా ఈ పాయింట్‌తో అల్లుకున్న కథలు అనేకం. మన అగ్ర హీరోల్లో దాదాపు అందరూ ఈ పాయింట్ ఆధారంగా సినిమాలు చేశారు. సక్సెస్ అందుకున్నారు. కలర్ చిత్రాల జోరు మొదలైన రోజుల్లో దర్శకుడు వి. మధుసూదనరావు, హీరో అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో ఈ పాయింట్‌తో వచ్చిన సక్సెస్ఫుల్ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ‘పవిత్రబంధం’. బిగువైన కథ, పాటలు, హీరోయిన్లు కాంచన, వాణిశ్రీ అందచందాలతో సరిగ్గా 50 ఏళ్ళ క్రితం వచ్చిన ‘పవిత్రబంధం’ ఆ తరానికి ఓ తీపి గుర్తు. ఆ సినిమాలోని ‘గాంధి పుట్టిన దేశమా ఇది’, ‘పచ్చబొట్టూ చెరిగీపోదులే’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందాల తారలతో... ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో సినిమాకు ఒక్కో యు.ఎస్.పి. ఉంటుంది. ‘దేవదాసు’ ఫేమ్ అక్కినేనికి కెరీర్ తొలి రోజుల నుంచీ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎక్కువ. ఒకరికి ఇద్దరు నాయికలతో అలాంటి ప్రేమలు, పెళ్ళిళ్ళ కథలు తెరపై పండించడంలో ఆయనదో ప్రత్యేక ముద్ర. అందుకే, 1950లలో, ’60లలో అలాంటి కుటుంబకథలతో ఆయన తన రేంజ్‌నూ, ఇమేజ్‌నూ పెంచుకుంటూ వచ్చారు. కలర్ సినీశకం మొదలయ్యాక కూడా ఆయన ఆ మార్గం వీడలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల చివరలో అక్కినేని చేసిన అలాంటి ఓ గమ్మతై ్తన ప్రేమ, పెళ్ళి కథ – ‘పవిత్రబంధం’. ‘‘ప్రేమించిన ప్రియురాలు! పెళ్ళాడిన ఇల్లాలు!! ఎవరి అనుబంధం – తరతరాల పవిత్రబంధం?’’ ఒక్కముక్కలో ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్. అప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అందాల నటి కాంచన, సావిత్రి తరువాత అప్పుడప్పుడే స్టార్ హోదాకు ఎదుగుతున్న వాణిశ్రీ ఇందులో అక్కినేని సరసన హీరోయిన్లు. శృంగారాభినయానికి ఒకరు, సెంటిమెంటుకు మరొకరు. ఇక, 1970ల ద్వితీయార్ధానికి హీరోగా స్థిరపడ్డ కృష్ణంరాజు నెగటివ్ రోల్ చేశారు. ఆకట్టుకొనే కథ... కథనం... ‘పవిత్రబంధం’లో ‘‘కల్లకపటాలు లేని పల్లెటూరి వలపులు, అల్లకల్లోలమైన పట్నవాసపు తలపులు’’ చూపారు. అశోక్ మూవీస్ పతాకంపై టి. గోవిందరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వి. మధుసూదనరావు పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దారు. మెదడుకు దెబ్బ తగిలి, కథలోని ప్రధానపాత్ర పాత జ్ఞాపకాలను మర్చిపోవడమనే ఫార్ములాను లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టి, హాస్య, శృంగార రసాలకు ప్రాముఖ్యమిస్తూ అల్లుకున్నారు. అనుకోని విధంగా జీవితంలో ఇద్దరు అమ్మాయిలకు ప్రేమను పంచవలసి వచ్చిన హీరో కథ ఇది. అనాథాశ్రమంలో పెరిగి, ఉన్నత విద్య చదివి, ఉద్యోగం దొరకక పట్నంలో తిరుగుతూ, ఓ పాడైపోయిన బస్సులో నివసిస్తుంటాడు హీరో (అక్కినేని). అతి గారాబంతో పంజరంలా మారిన ఇంట్లో నుంచి బయటపడి, తానెవరో చెప్పని ఓ కల వారింటి అమ్మా యి (కాంచన)ను ప్రేమి స్తాడు. ఇంతలో ఓ కారు ప్రమాదం. హీరో గతాన్ని మర్చిపోతాడు. ఓ పల్లెటూరు చేరతాడు. అనుకోకుండా అక్కడో పల్లెటూరి అమ్మాయి (వాణిశ్రీ)ని కాపాడి, ఆమె ప్రేమ దక్కించుకొని, పెళ్ళి చేసుకొంటాడు. పండంటి పిల్లాడికి తండ్రి అవుతాడు. రైతుగా జీవితం గడుపుతుంటాడు. పట్నానికి పని మీద వెళతాడు. తీరా అప్పుడు రెండోసారి ప్రమాదం. మళ్ళీ మెదడుకు దెబ్బ. ఈ రెండు యాక్సిడెంట్లకు మధ్య జరిగిన కథను హీరో మర్చిపోతాడు. మొదటి యాక్సిడెంట్‌కు ముందు పెద్దింటి అమ్మాయితో జరిపిన పాత ప్రేమకథ మాత్రం గుర్తొచ్చి, పెళ్ళికి సిద్ధమవుతాడు. కనిపించని భర్త కోసం వెతుక్కుంటూ పట్నం వస్తుంది పల్లెటూరి భార్య. అక్కడ హీరో కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య అంతః సంఘర్షణ. ‘పచ్చబొట్టు’ పాట, కన్నకొడుకు (బేబీ డాలీ) జ్ఞాపకాలతో హీరోకు తన పల్లెటూరి పెళ్ళికథా గుర్తొస్తుంది. చివరకు ప్రేమ కన్నా, తాళి కట్టిన అమ్మాయిదే పవిత్రబంధం అనే మహిళా సెంటిమెంటుకే సినిమా జై కొడుతుంది. ఒకమ్మాయి త్యాగంతో మరో అమ్మాయి సంసారం చక్కబడుతుంది. మనిషి, మనసు, డబ్బు– వీటి మధ్య బంధం ఏమిటి? హీరో కథలో పట్నంలో జరిపిన ప్రేమా, పల్లెటూరిలోని పెళ్ళా– ఏది గొప్ప? ఇలా పాత్రల ఘర్షణ, అనుబంధాల పవిత్రత చూపుతుందీ సినిమా. ఆరుద్ర కలం... పాటల బలం... ఈ సినిమాకు ఆరుద్ర రాసిన ‘అట్ల తద్దోయ్ ఆరట్లోయ్..’ (గానం పి. సుశీల బృందం), ‘ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం’ (సుశీల – ఘంటసాల), సంతోష – విషాద సందర్భాలు రెంటిలోనూ వచ్చే ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా’ పాటలు మోస్ట్ పాపులర్. జనపదం మెచ్చే పాటల రచయిత కొసరాజు కలంలోని ‘ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి..’ (సుశీల – స్వర్ణలత) హుషారు రేపింది. అప్పట్లో మంచి మ్యూజికల్ ఆల్బమ్‌గా నిలిచిన ‘పవిత్రబంధం’ సక్సెస్‌కు తారల అభినయంతో పాటు ఈ ఎవర్ గ్రీన్ పాటలూ తోడయ్యాయి. ఈ సినిమాకు ప్రధాన బలమైన పాటలతో పాటు మాటలూ ఆరుద్రే రాశారు. ఆ అసిస్టెంట్లు ఇప్పుడు ఫేమస్! సర్వసాధారణంగా తెలుగునాట సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్ల ముందస్తు పెట్టుబడితో తయారవుతూ వచ్చిన కాలం అది. అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ ‘నవయుగ ఫిలిమ్స్’ సహకారంతో ‘పవిత్రబంధం’ తయారైంది. సహజంగానే, ‘నవయుగ ఫిలిమ్స్’ వారే సినిమాకు ప్రధాన పంపిణీదారులు. చిత్రం ఏమిటంటే, ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధులైన ఓ దర్శకుడు, ఓ నిర్మాత అప్పట్లో ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. వారెవరంటే – దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, నిర్మాత ‘యువచిత్ర’ కె. మురారి. అప్పట్లో దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర సహాయకులుగా పనిచేసిన ఈ ఇద్దరూ కాలక్రమంలో చెరొక శాఖలో స్థిరపడ్డారు. కోదండరామిరెడ్డి తమ గురువులానే పలు కమర్షియల్ హిట్స్ అందించి, దర్శకుడిగా 100 చిత్రాల మార్కుకు కాస్త దూరంలో ఆగారు. ఇక, ‘నవయుగ ఫిలిమ్స్’ అధినేతలైన కాట్రగడ్డ కుటుంబానికే చెందిన మురారి దర్శకత్వం కన్నా నిర్మాణం తన అభిరుచికి సరిపోతుందని అటు మళ్ళారు. ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’ మొదలు ‘నారీ నారీ నడుమ మురారి’ దాకా పలు మ్యూజికల్ హిట్స్ నిర్మించారు. అలా ‘పవిత్రబంధం’ అసిస్టెంట్ డైరెక్టర్లిద్దరూ తర్వాత ఫేమసయ్యారు. విజయవాడ విశ్లేషణకు పెద్ద పీట! ఓ సినిమా రిలీజయ్యాక ఆ చిత్ర యూనిట్ ఆంధ్రదేశంలోని ప్రధాన రిలీజు కేంద్రాలకు వెళ్ళడం, విజయయాత్రలు చేయడం, పత్రికా రచయితలతో సంభాషించడం అప్పట్లో ఓ ఆనవాయితీ. సినీ వ్యాపార, పంపిణీరంగ రాజధాని విజయవాడలో ప్రతి సినిమాకూ అవి తప్పనిసరిగా జరిగేవి. ‘పవిత్రబంధం’కి కూడా ఆ ఆనవాయితీ పాటించారు. విజయవాడలో నవయుగ ఫిలిమ్స్ నిర్వహణ బాధ్యతలతో అప్పటికే తల పండిన ప్రముఖ సినీ వ్యాపార, ప్రచార రంగ నిపుణుడు కాట్రగడ్డ నరసయ్య ఎప్పటికప్పుడు వినూత్న ప్రచార వ్యూహాలతో సినిమాకు ప్రచారం కల్పించేవారు. ‘పవిత్రబంధం’ రిలీజయ్యాక తొలి వారంలోనే ఆయన వినూత్నంగా స్థానిక రచయితలతో చిత్ర యూనిట్ ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. దర్శకుడు వి. మధుసూదనరావు, నిర్మాత టి. గోవిందరాజన్ పాల్గొన్న ఈ ఇష్టాగోష్ఠిలో రావూరి సత్యనారాయణరావు, రెంటాల గోపాల కృష్ణ, వాసిరెడ్డి సీతాదేవి, తుర్లపాటి కుటుంబరావు లాంటి ఆ తరం ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు సినిమాపై తమ అభిప్రాయాలను వివరించడం విశేషం. విజయవాడలో తరచూ రచయితలతో సమావేశాలు జరపడం, వారి అభిప్రాయాలనూ, విశ్లేషణలనూ తెలుసుకోవడం సినిమా పురోగతికి మేలు చేస్తుందని సాక్షాత్తూ దర్శకుడు వి. మధుసూదనరావు అభిప్రాయపడ్డారు. ఆ ఒరవడి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పెను మార్పులు వచ్చిన 1990ల చివరి దాకా కొనసాగడం విశేషం. మొత్తం మీద అక్కినేని, మధుసూదనరావుల కాంబినేషన్ లోని ‘పవిత్రబంధం’ ఓ పాపులర్ చిత్రంగా నిలిచింది. అప్పట్లో రేడియోలో పదే పదే వినిపించిన పాపులర్ పాటలతో ఇప్పటికీ జనానికి గుర్తుండిపోయింది. ఆరుద్ర రాసిన ‘గాంధి పుట్టిన దేశమా ఇది..’ పాట యాభయ్యేళ్ళు గడిచిపోయినా, నేటి సమకాలీన సమాజానికీ వర్తించడం ఓ విశేషం. మారని మన వ్యవస్థకు అద్దం పట్టే ఓ విషాదం. బాక్సాఫీస్ విజయాల లెక్కల కన్నా ఈ బాధామయ పరిస్థితులు, నిరుద్యోగిగా – రైతుగా – ఎస్టేటు యజమానిగా మూడు పార్శా్వలలో అక్కినేని నటన, ఘంటసాల గానం – అన్నీ ఈ సినిమాను చిరస్మరణీయం చేశాయి. కలర్ అక్కినేని వర్సెస్ బ్లాక్ అండ్ వైట్ అక్కినేని! ఓ మాస్ హిట్ సినిమా థియేటర్లలో నడుస్తుండగా... ఆ పక్కనే మరెంత బాగున్న సినిమా మరొకటి వచ్చినా బాక్సాఫీస్ ఎదురీత తప్పదు. అక్కినేని ‘పవిత్రబంధం’కి అలాంటి పరిస్థితే ఎదురైంది. కలర్ చిత్రాలు ఊపందుకుంటున్న సమయంలో వచ్చిన కలర్‌ఫుల్ మాస్ హిట్ అక్కినేని ‘దసరా బుల్లోడు’ (1971 జనవరి 13). ఆ తరువాత సరిగ్గా 6 వారాలకే ‘పవిత్రబంధం’ వచ్చింది. దానికి ‘దసరా బుల్లోడు’ ఊహించని ప్రత్యర్థి అయి కూర్చుంది. సినిమా, తీసుకున్న పాయింట్, తీసిన విధానం, నటీనటులు, పాటలు – ఇలా అన్నీ బాగున్నా, రంగుల చిత్రం ‘దసరా బుల్లోడు’ వెల్లువ నలుపు తెలుపుల ‘పవిత్ర బంధం’ని బాక్సాఫీస్ వద్ద ముంచెత్తింది. కానీ, అంత గట్టి పోటీలోనూ ‘పవిత్రబంధం’ జనాదరణ పొందింది. బెజవాడలో శతదినోత్సవమూ చేసుకుంది. అక్కినేని కథతో... రాఘవేంద్రుడి ముద్దుల ప్రియుడు గమ్మత్తేమిటంటే, విజయవంతమైన చిత్రాలతో విక్టరీ మధుసూదనరావుగా పేరు తెచ్చుకున్న వి. మధుసూదనరావు దగ్గర తొలి రోజుల్లో పనిచేసిన తరువాతి తరం కమర్షియల్ చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు అచ్చంగా ఇదే కథను రంగుల్లో తెరకెక్కించారు. ‘పవిత్ర బంధం’ రిలీజైన 23 ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావు తీసిన ‘ముద్దుల ప్రియుడు’ (1994) చూస్తే – బేసిక్‌గా రెండు కథలూ ఒకటే అని అర్థమవుతుంది. బ్లాక్ అండ్ వైట్ అక్కినేని, వాణిశ్రీ, కాంచన స్థానంలో రెండు దశాబ్దాల తరువాత రంగుల్లో వెంకటేశ్, రంభ, రమ్యకృష్ణ వచ్చారు. కొత్త తరం ప్రేక్షకులకు కావాల్సిన మసాలాలు దట్టిస్తూ, మార్పులూ చేశారు. అప్పటి ‘పవిత్ర బంధం’లానే ఇప్పటి ‘ముద్దుల ప్రియుడు’లోనూ కొన్ని పాటలు (వేటూరి రచనలు ‘వసంతంలా వచ్చిపోవా ఇలా...’, ‘సిరి చందనపు చెక్క లాంటి భామ...’, సిరివెన్నెల రచన ‘నాకే గనక నీతోనే గనక పెళ్ళయితే గనక...’) పదే పదే వినిపించాయి. కీరవాణి మార్కు సంగీతానికి, రాఘవేంద్రరావు మార్కు పూలు – పండ్ల చిత్రీకరణ శైలి, రమ్యకృష్ణ అందం తోడై పాటలు రేడియోలో, టేప్రికార్డర్లలో మారు మోగాయి. కానీ, సినిమా మాత్రం ఆశించిన బాక్సాఫీస్ రిజల్ట్ అందుకోలేకపోయింది. స్వీయ నిర్మాణ సంస్థ ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్‌పై నిర్మించిన రాఘవేంద్రరావుకు నిరాశే మిగిలింది. ఎవర్ గ్రీన్ సాంగ్స్ అక్కినేని సినీ కెరీర్ లో సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అందులోనూ, సామాజిక పరిస్థితులకు సరిపడేలా నిత్యనూతనంగా నిలిచిన పాటలూ అనేకం. అలాంటి పాటలనగానే ఎవరికైనా – అక్కినేని ‘వెలుగు నీడలు’ చిత్రంలో పెండ్యాల సంగీతంలో ఘంటసాల పాడిన శ్రీశ్రీ రచన ‘పాడవోయి భారతీయుడా..’ గుర్తొస్తుంది. ‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోద’నీ, ‘అవినీతి – బంధుప్రీతి – చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు’ననీ అక్కినేని పాత్ర నోట రచయిత పలికిన మాట దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ వర్తించే మాట! ప్రతి స్వాతంత్య్ర దినోత్సవాన జనాన్ని ఆలోచింపజేస్తున్న పాట!! సరిగ్గా అదే పద్ధతిలో చిరస్మరణీయ గీతమైంది – ‘పవిత్రబంధం’లో ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో, ఆరుద్ర రాయగా, ఘంటసాల గళంలో, తెరపై హీరో అక్కినేని నోట వచ్చే ‘గాంధి పుట్టిన దేశమా ఇది.’ ఆ పాటలో ‘ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు’, ‘ఉన్నది మనకు ఓటు – బ్రతుకు తెరువుకే లోటు’ అంటూ సాగే నిరుద్యోగ నాయక పాత్ర ఆవేదన నేటి పరిస్థితులకీ అన్వయిస్తుంది. ‘పేరుకు ప్రజలదే రాజ్యం – పెత్తందార్లకే భోజ్యం’ అంటూ కవి క్రాంతదర్శి అయ్యాడు. – రెంటాల జయదేవ -
ట్రెండ్ సెట్టింగ్ బుల్లోడు
ఒక్కో తరంలో ఒక్కో సినిమా ఉంటుంది. ఒక్కో యాక్టర్ కెరీర్ లో ఒక్కో సినిమా ఉంటుంది. కమర్షియల్ సినిమాలే అయినా... కాసులు కురిపించడంతో పాటు, పాపులర్ కల్చర్ పైనా ప్రభావం చూపెడతాయి. పేరు దగ్గర నుంచి పాటలు, దుస్తుల దాకా అనేక విషయాల్లో ఆ తరాన్నీ, ఆ తరువాతి సినిమాలనూ ప్రభావితం చేస్తాయి. అనేక తరాల పాటు గుర్తుండిపోతాయి. అక్కినేని నటించిన ‘దసరా బుల్లోడు’కి అలాంటి ప్రత్యేకతే ఉంది. ఇప్పటికి సరిగ్గా 50 ఏళ్ళ క్రితం 1971 జనవరి 13న రిలీజైన ‘దసరా బుల్లోడు’ అప్పట్లో ఓ సంచలనం. ఇప్పటికీ ఓ తరానికి తీపి జ్ఞాపకం. అది 1970ల నాటి మాట. తెలుగు తెరపై అప్పుడప్పుడే కలర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కంటే ఖర్చు ఎక్కువయ్యే కలర్ సినిమాలంటే పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ మోజు పెరుగుతున్న కాలం. అలా కలర్ సినిమాల శకం ప్రారంభంలో వచ్చిన చిత్రం ఏయన్నార్ ‘దసరా బుల్లోడు’. ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్ తొలిసారిగా కలర్లో తీసిన సినిమా అది. ఆ సినిమాకు ముందు అక్కినేని ప్రస్థానం వేరు. ‘దసరా బుల్లోడు’ తరువాత ఆ ప్రభావంతో ఆయన తన పంథా మార్చి, చేసిన ప్రయాణం వేరు. అదీ ‘దసరా బుల్లోడు’ స్పెషాలిటీ! జయలలిత లాస్... వాణిశ్రీకి గెయిన్! ‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది – అక్కినేని, ఆయనకు జంటగా నటించిన హీరోయిన్ వాణిశ్రీ. నిజానికి, ఈ చిత్రంలో వాణిశ్రీ కన్నా ముందు హీరోయిన్గా దర్శక, నిర్మాతలు ఎంచుకున్నది – తరువాతి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన జయలలితను! అయితే, అదే సమయంలో నిర్మాత ఎం.ఎస్. రెడ్డి నిర్మిస్తున్న ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ విజయము’లో, ఎమ్జీఆర్ హీరోగా చేస్తున్న చిత్రంలో జయలలిత నటిస్తున్నారు. ఏమైందో ఏమో ‘దసరా బుల్లోడు’ షూటింగ్ వారంలో ఉందనగా, జయలలితకు కుదరదంటూ ఆమె తల్లి లెటర్ పంపారు. దిక్కుతోచని వి.బి. అప్పటికే పేరు తెచ్చుకున్న వాణిశ్రీని అప్పటికప్పుడు హీరోయిన్గా అనుకున్నారు. ఎంత డబ్బయినా ఫరవాలేదని ఆమె డేట్లు ఎడ్జస్ట్ చేయించుకున్నారు. ఆ సినిమాకు ఏయన్నార్ పారితోషికం పాతిక వేలైతే, అర్జెంటుగా వాణిశ్రీ డేట్ల కోసం ఆమె బంధువుకు అడగకుండానే ఇచ్చింది యాభై వేలట! ఆ సంగతి వి.బి.నే స్వయంగా వెల్లడించారు. అలా ‘దసరా బుల్లోడు’ జోడీ అయ్యారు వాణిశ్రీ. అక్కడ నుంచి వాణిశ్రీ హవా మొదలైంది. ‘దసరా బుల్లోడు’ హిట్‌తో వాణిశ్రీకి స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ‘ప్రేమ్‌నగర్’ లాంటి కెరీర్ బెస్ట్‌లు రావడానికి ఈ సినిమా పునాది వేసింది. అక్కినేని, వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే ధోరణి పాకింది. వారిద్దరితో 20+ సినిమాలొచ్చాయి. కష్టాలు దాటిన కలర్ ఫుల్ సినిమా నృత్య దర్శకుడు హీరాలాల్ సారథ్యంలో ‘పచ్చగడ్డి కోసేటి...’ పాట చిత్రీకరణతోనే పచ్చనిచేలలో తొలి రోజు షూటింగ్ ఆరంభమైంది. ప్రముఖ నటీనటులందరూ పాల్గొనగా, రోజుకు 200 మంది యూనిట్‌తో, ఓ తిరణాల లాగా 12 రోజులు ఈ కలర్ చిత్రం షూటింగ్ చేశారు. తీరా అంతా అయ్యాక, మొదటి రోజు మినహా మిగతాదేదీ కెమెరాలో చిత్రీకరణ జరగలేదని తెలిసింది. తరువాత మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఆ రోజుల్లో కొత్తగా ఆరంభమైన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కె.ఎల్.ఎన్. ప్రసాద్ లక్ష్మీఫిలిమ్స్ అండగా నిలిచింది. ఇలా ఎన్నో అవరోధాలు దాటి, ‘దసరా బుల్లోడు’ రిలీజై, జనాదరణ పొందాడు. పంచె కట్టులో, పసందైన పాటలు, స్టెప్పులతో అక్కినేని అలరించారు. తొలి ప్రయత్నంతోనే డైరెక్టర్‌గా వి.బి. హిట్టయ్యారు. వరసగా తెలుగు, తమిళ, హిందీల్లో చిత్రాలను రూపొందించారు. అన్నా వదినల సొంత బిడ్డలా తిరిగే ఓ పల్లెటూరి దసరా బుల్లోడి (అక్కినేని)ని పట్నంలో చదువుకున్న తన కూతురి (చంద్రకళ)కిచ్చి ఆస్తి కాజేయాలని అనుకొంటాడు ఓ దుష్టుడు (నాగభూషణం). కానీ, ఊళ్ళోనే మరో అమ్మాయిని (వాణిశ్రీ)ని ప్రేమిస్తాడు హీరో. ఈ ముగ్గురి ప్రేమకథలో జరిగే ట్విస్టులు, ఒకరి కోసం మరొకరు చేసే త్యాగాలు, విధి ఆడే వింత నాటకాలు ఈ చిత్రకథ. ఎస్వీఆర్, సూర్యకాంతం, గుమ్మడి, అంజలీదేవి, పద్మనాభం – ఇలా భారీ తారాగణం ఉన్న సినిమా ఇది. కలర్ సినిమాల్లో... తెరపై రంగుల్లో అందంగా కనిపించడం కోసం ఆ రోజుల్లో నటీనటులు కాస్తంత మందంగానే మేకప్ దట్టించేవారు. పెదాలు, నోరు ఎర్రగా కనిపించడం కోసం... రంగు గట్టిగానే వేసుకొనేవారు. ‘దసరా బుల్లోడు’ చిత్రాన్ని ఇవాళ బుల్లితెరపై చూస్తున్నా, ఆ సంగతి అర్థమవుతుంటుంది. కథలోని డ్రామా, శృంగారం పాలు, హుషారైన పాటలు, మనసును కదిలించే సన్నివేశాలు కలిసి ఆ రోజుల్లో ఈ చిత్రం జనాన్ని ఓ ఊపు ఊపేసింది. సినిమా మొదట్లోనే దసరా సందర్భంగా హీరోతో పులి వేషం డ్యాన్స్, నెమలి డ్యాన్స్, కోలాటాల లాంటివి చేయడం గ్రామీణ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పాట ప్రయాణదిశ మార్చిన ఆ(బూ)త్రేయ! అలాగే, యాభై ఏళ్ళ క్రితం ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనం. రేడియోలో ఆ పాటలు మోగని రోజు లేదు. వినపడని ఇల్లు లేదు. కె.వి. మహదేవన్ సంగీతం ఒక ఎత్తయితే, ఆత్రేయ సాహిత్యం మరో కొత్త ఎత్తు. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ..’, అలాగే సంతోష, విషాద సందర్భాలు రెంటిలో వచ్చే ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా..’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ – ఇలా పాటలు సూపర్ హిట్. అన్నిటి కన్నా ముఖ్యంగా ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్...’ లాంటి పాపులర్ శృంగార సినీగీత సాహిత్యానికి ఈ సినిమాతోనే తెలుగు నేల స్వాగతం పలికింది. తెలుగు సినిమాకు ఆ రకంగా అది ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి సినీగీతం పూర్తి కమర్షియల్ దిశలోకి మలుపు తిరిగింది. బూతును కూడా పాటలో అందంగా చెప్పారంటూ సినీ గీత రచయిత ఆత్రేయను ‘‘బూత్రేయ’’ అనడం మొదలెట్టారు – గిట్టని జనం. ఎవరేమన్నా అప్పటి నుంచి మారిన కాలం, మారిపోయిన సామాన్యుల అభిరుచికి తగ్గట్టుగా ఆ సుడిగుండంలోనే ఇప్పటిదాకా మన సినీగీతాలు సుడులు తిరుగుతూ ఉండడం గమనార్హం. నాలుగు వారాలకు ఇండస్ట్రీ రికార్డ్! లేట్ రన్లో కూడా ‘దసరా బుల్లోడు’ మరో 3 కేంద్రాలలో (తుని, ప్రొద్దుటూరు, కరీంనగర్) వంద రోజులు ఆడడం విశేషం. అప్పట్లో వసూళ్ళలో ‘దసరా బుల్లోడు’ది ఓ ఇండస్ట్రీ రికార్డు. రిలీజైన తొలి 4 వారాలకే ఆ చిత్రం రూ. 25 లక్షల గ్రాస్ వసూళ్ళు సాధించడం తెలుగు సినీ పరిశ్రమలో అంతకు మునుపెన్నడూ కనివిని ఎరుగని విషయం. ‘దసరా బుల్లోడు’ తరువాత వచ్చిన ఏయన్నార్ ‘ప్రేమ్‌నగర్’ (1971) ఇంకా ఎక్కువ వసూళ్ళు తెచ్చుకొని, తొలి 50 రోజులకు రూ. 33 లక్షల గ్రాస్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘దసరా బుల్లోడు’ మూలకథ ఆధారంగా, కొన్ని మార్పులు చేర్పులతో తరువాత తమిళంలో శ్రీధర్ దర్శకత్వంలో ఎమ్జీఆర్ హీరోగా ‘ఉరిమై కురళ్’ (1974) వచ్చింది. హిట్టయింది. ఇక, వి.బి.నే స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, షబానా ఆజ్మీలతో ‘రాస్తే ప్యార్ కే’ (1982) పేరిట ‘దసరా బుల్లోడు’ను హిందీలో రీమేక్ చేశారు. డైరెక్షన్‌కు అక్కినేని నో! ఇవాళ్టి ప్రముఖ నటుడు జగపతిబాబు తండ్రి, ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాతోనే దర్శకుడయ్యారు. అసలు ఈ కథ తయారు చేసిందీ ఆయనే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, బి.ఎస్సీ చదువుకొన్న ఆయన కృష్ణాజిల్లాలో తాను పుట్టి పెరిగిన పల్లెటూరు, మనుషుల మనస్తత్వాలు, ఇంట్లోని వ్యక్తులు, కళ్ళారా చూసిన వాస్తవ సంఘటనల ఆధారంగా స్వయంగా ఈ కథ సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాకు దర్శకత్వం వహిం చాల్సింది మాత్రం మొదట ఆయన కాదు – జగపతి సంస్థకు పర్మినెంట్ దర్శకుడైన ‘విక్టరీ’ మధుసూదనరావు! తీరా ఆయన బిజీ అన్నారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారు. ఆదుర్తికీ అవలేదు. ఇంతలో వి.బి. రాజేంద్రప్రసాద్ ‘అక్కా చెల్లెలు’ చిత్రాన్ని నిర్మించారు. కానీ, ఆ తరువాతా ఆ దర్శకులంతా బిజీనే! ఇంతలో అక్కినేని సినిమా ఒకటి అనుకోకుండా క్యాన్సిలైంది. ఆ కాల్షీట్లు ఖాళీ అయి, అర్జెంటుగా సినిమా నిర్మించాల్సి వచ్చింది. ‘దసరా బుల్లోడు’ స్క్రిప్టు సిద్ధం చేసి, అక్కి నేనికి వినిపించిన వి.బి చివరకు అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ రంగస్థల నటుడు, నిర్మాతగా అనుభవజ్ఞుడైన వి.బి. రాజేంద్ర ప్రసాద్‌నే డైరెక్ట్ చేయాల్సిందని ప్రోత్సహించారు ఏయన్నార్. తామంతా వెన్నంటి ఉంటామన్నారు. ‘‘కాదూ... కూడదంటే, ఇక నీ సినిమాల్లో నటించను’’ అని బెదిరించారు కూడా! దాంతో, రాజేంద్రప్రసాద్ సాహసించి దర్శకుడు కాక తప్పలేదు. అక్కినేనికి తొలి గోల్డెన్ జూబ్లీ హిట్! కమర్షియల్‌గా ‘దసరా బుల్లోడు’ పెద్ద హిట్. ఆ రోజుల్లో ఈ సినిమా 35 ప్రింట్లతో రిలీజైంది. 29 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 22 సెంటర్లలో (హాలు షిఫ్ట్ అయిన కర్నూలుతో కలిపి) శతదినోత్సవం చేసుకుంది. చిత్ర యూనిట్ తరలి రాగా, ట్రాక్టర్లో అక్కినేనిని ఊరేగిస్తూ, గుడివాడ నీలా మహల్ థియేటర్లో 1971 ఏప్రిల్ 24న వంద రోజుల వేడుక ఘనంగా జరిపారు. ఆ మరునాడే హైదరాబాద్ శాంతి థియేటర్లోనూ శతదినోత్సవం చేశారు. ‘దసరా బుల్లోడు’ రిలీజైన పదిహేను వారాలకు అక్కినేనిదే ‘సుపుత్రుడు’ వచ్చింది. ఆ కొత్త సినిమా రిలీజ్ కోసం అనేక కేంద్రాలలో పాత ‘దసరా బుల్లోడు’ను పక్కకు తప్పించారు. అయినా, 4 కేంద్రాలలో (విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, షిఫ్టయిన గుంటూరుల్లో) 16వ వారం నుంచి కూడా ‘దసరా బుల్లోడు’ హవా కొనసాగింది. వాటిలో 200 రోజులు ఆడింది. తిరుపతిలో కొద్ది గ్యాప్ తరువాత 213వ రోజు నుంచి మరో 6 వారాలు సినిమా ఆడింది. ఇక, హైదరాబాద్‌లో షిప్టింగులు, గ్యాప్‌లతో ‘దసరా బుల్లోడు’ ఏకంగా 365 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. అలా అక్కినేని సినీకెరీర్ లో 50 వారాలు ఆడిన తొలి స్వర్ణోత్సవ (గోల్డెన్ జూబ్లీ) చిత్రంగా చరిత్ర కెక్కింది. తర్వాత మరో దశాబ్దికి ‘ప్రేమాభి షేకం’(1981)తో అక్కినేని మరో గోల్డెన్ జూబ్లీ హిట్ సాధించారు. అది దసరా బుల్లోడు కారు! ‘దసరా బుల్లోడు’ తెలుగులో అంత పేరు, వసూళ్ళు సాధించినా అతి మంచితనం వల్ల దర్శక, నిర్మాత రాజేంద్రప్రసాద్‌కు లాభాలు మిగల్లేదు. సాక్షాత్తూ ఆయనే ఆ తరువాతి కాలంలో ఆ సంగతి వెల్లడించారు. ‘దసరా బుల్లోడు’లో ప్రధానభాగం అమలాపురంలో, విజయవాడ చుట్టుపక్కల భట్లపెనుమర్రు తదితర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం షూటింగులో వాడిన ఎర్రటి ‘బీచ్ బగ్గీ’ అనే ఫారిన్ కారు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్! దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తనకు విజయం అందించిన ‘దసరా బుల్లోడు’ అన్నా, ఆ చిన్న కారు అన్నా జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్‌కు పంచప్రాణాలు. అదే కారును నాగార్జున హీరోగా తీసిన ‘కెప్టెన్ నాగార్జున’లో కూడా వాడారు. అయితే, 1990లలో ఒకానొక దశలో జీవితంలో అన్నీ కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డారు వి.బి. ఆ పరిస్థితుల్లో ఆ కారును అమ్మేయాల్సి వచ్చింది. అపురూప జ్ఞాపకమైన ఆ కారును అలా అమ్మే యాల్సి వచ్చినందుకు ఆయన చాలా బాధ పడ్డారు. విశేషం ఏమిటంటే, వి.బి. రాజేంద్రప్రసాద్ తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షరరూపమిస్తూ, ఆ పుస్తకానికి కూడా ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టడం! – రెంటాల జయదేవ -
నటి వాణిశ్రీకి పుత్రశోకం
ప్రఖ్యాత నటీమణి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ్ కార్తీక్ (36) శుక్రవారం రాత్రి హఠాన్మరణం పొందారు. అభినయ వెంకటేశ్ కార్తీక్ బెంగళూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల చెన్నై వెళ్లిన ఆయన తండ్రి కరుణాకరన్‌తో పాటు చెంగల్పట్టు జిల్లాలోని తిరుకళికుండ్రం గ్రామంలో ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. కార్తీక్ భార్య, పిల్లలు చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న వాణిశ్రీ ఇంట్లో ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా అభినయ వెంకటేశ్ కార్తీక్ తండ్రి వద్దే ఉండిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి ఫామ్‌హౌస్‌లో గుండెపోటు కారణంగా నిద్రలోనే కార్తీక్ మృతి చెందినట్టు వాణిశ్రీ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వాణిశ్రీ కుటుంబసభ్యులు ఖండించారు. అభినయ వెంకటేశ్ కార్తీక్ భౌతికకాయాన్ని శనివారం చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. వాణిశ్రీకి పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు. కార్తీక్ మృతిపై చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. – సాక్షి, చెన్నై -
సినీనటి వాణిశ్రీకి పుత్రశోకం
-
సినీనటి వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య
సాక్షి, చెన్నై : సీనియర్ నటి వాణిశ్రీ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెంగల్పట్టు జిల్లా తిరుక్కళుకుండ్రంలోని ఫాంహౌస్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అభినయ్ బెంగళూరు నుంచి వచ్చాక హోం క్వారంటైన్లో ఉన్నారు. అయితే ఆయన అనూహ్యంగా శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా అభినయ్ భార్య కూడా వైద్యురాలు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు అభినయ్ మృతిపై తిరుక్కళుకుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హోం క్వారంటైన్లో ఉన్న ఆయన తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కాగా వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. అభినయ్ గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది. కుమారుడు హఠాన్మరణంతో వాణిశ్రీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (‘తనే విడాకులు కోరుకున్నాడు’) -
గజాసుర గర్భంలో శివుడు!
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు శివుడు, వాణిశ్రీ పార్వతిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన అచంచలమైనది’’ అన్నాడు శివుడు తన భక్తుడైన గజాసురుడి గురించి. ‘‘స్వామీ! అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు’’ అన్నది పార్వతి. ‘‘మంచిచెడులు ఎంచుకొని వరాలు ఇవ్వడం ధర్మం కాదు’’ అన్నాడు శివుడు. ‘‘ఒకరికి ఇచ్చిన వరం మరొకరికి శాపం కారాదు’’ అన్నది పార్వతి. ‘‘ఆరాధించే భక్తులను అనుగ్రహించకపోవడం మాకు వీలుకాదు’’ అన్నాడు శివుడు. ‘‘దానివల్ల లోకం నాశనమైతే?’’ అడిగింది పార్వతి. ‘‘నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయం నుండి నవయురాగారంభం అవుతుంది’’ అన్నాడు శివుడు. ‘‘అయితే మీ అర్ధాంగి మాట...’’ పార్వతి. ‘‘మన్నించలేదని మథనపడకు. అకుంఠితదీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తున్ని చూడు...’’ అన్నాడు శివుడు. భూలోకంలో... ‘‘ఓం...నమశ్శివాయ’’ అంటూ గజాసురుడు భీకరంగా తపస్సు చేస్తున్నాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో... ‘‘పరమేశ్వరా! భక్తవత్సలుడవని కరుణామయుడవని అంటారే! ఈ దాసునిపై నీకు ఇంకా దయ రాలేదా! నీ మనసు కరగలేదా? ఈ దాసునికి నీ దివ్యమంగళ రూపం దర్శించే భాగ్యం కలిగించవా ప్రభూ! నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు...’’ అని ఖడ్గంతో గజాసురుడు శిరచ్ఛేధనం చేసుకోబోతుండగా శివుడు ప్రత్యక్షమై...‘‘ఆగు గజాసురా!’’ అని వారించాడు. శివుడిని చూడగానే గజాసురుడి కళ్లల్లో వెలుగు నిండింది. ‘‘స్వామీ! ముక్కంటి దేవరా! గౌరీ మనోహరా... గంగాధరా! కరుణించవా స్వామీ!’’ భక్తి పారవశ్యంతో అన్నాడు గజాసురుడు. ‘‘అనితరసాధ్యమైన నీ ఆరాధననకు సంతసించాను. నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. ఏం కావాలో కోరుకో!’’ భక్తుణ్ణి అడిగాడు శివుడు. అప్పుడు గజాసురుడు తన మనసులో మాట సూటిగా అడిగాడు... ‘‘ప్రభూ! నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువుండాలి’’ ‘‘గజాసురా! ఏమి ఈ విపరీతమైన కోరిక. అనంతమూ, సకల జనాదరణీయమైన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా?’’ అడిగాడు శివుడు. ‘‘స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామీ! నా కోరికను మన్నించవలె’’ అని తన విపరీత కోరికను సమర్థించుకున్నాడు గజాసురుడు. ‘‘గజాసురా! దుర్భరమైన ఈ వరం ఏ విపరీతాలకు దారి తీస్తుందో తెలుసా?’’ హెచ్చరించాడు శివుడు. ‘‘నీ చరణాలను నమ్ముకున్న నేను ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను స్వామీ!’’ అన్నాడు పట్టు వదలని గజాసురుడు. ఇక చేసేదేమీ లేక శివుడు గజాసురుడు అడిగిన వరాన్ని ఇచ్చాడు. గజాసురుడి ముందు జంగమయ్యలు ప్రదర్శన ఇచ్చారు. ‘‘మీ ప్రదర్శనకు మెచ్చినాము. ఏమి కావలెనో కోరుకోండి’’ అన్నాడు గజాసురుడు. పక్కనే ఉన్న నారదుడు మాత్రం– ‘‘గజాసురా! తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరుతారో ఏమో’’ అని హెచ్చరించాడు. ‘‘ఏం కోరినా ఇస్తా నారదా! మేము అపరపరమేశ్వర అవతారులం. వరాలను అనుగ్రహించడంలో ఆ శివునికి ఏమీ తీసిపోం’’ అన్నాడు. ఆ మాటల్లో గర్వం ప్రతిధ్వనిస్తోంది. ‘‘అది నిజమే. ఈ అపరపరమేశ్వరుడు ఆడిన మాట తప్పనివాడు. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనకు తగిన బహుమానం లభిస్తుంది. కోరుకోండి. సందేహించకండి’’ అన్నారు వందిమాగధులు. ‘‘మేము అందరిలాంటి యాచకులం కాదు జంగమయ్యలం. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి’’ అని అడిగారు జంగమయ్యలు. ‘‘ఏమిటి ఈ విపరీతమై కోరిక!’’ ‘‘వీరు గంగిరెద్దుల వారు కాదు. కపట వేషధారులు... బ్రహ్మ, విష్ణువులు..’’ అంటున్నారు గజాసురుడి పరివారం. నిజమే... వారు గంగిరెద్దుల వారు కాదు... బ్రహ్మ, విష్ణువులు. ‘‘ఎంత మోసం!’’ అన్నాడు గజాసురుడు. ‘‘మోసం కాదు గజాసురా! లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయాల్సి వచ్చింది. అందరివాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా?’’ ‘‘అందరి హృదయంలో వెలిగే ఆ ఆరని జ్యోతిని నీ గర్భకుహరంలో బంధించడం దుశ్చర్య కాదా! ఆదిదంపతులను వేరు చేయుట దురుద్దేశం కాదా!’’... అన్నారు బ్రహ్మ, విష్ణువులు. ‘‘నారాయణ! మాట ఇచ్చేముందు నా మాట విని ఉంటే ఇంతవరకు వచ్చేదా?’’ అన్నాడు నారదుడు. ‘‘ఏమంటావు గజాసురా! అపరపరమేశ్వరుడిలా ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే. ఇప్పుడేమంటావు ఆడిన మాట తప్పుతావా?’’ ఎత్తిపొడిచారు బ్రహ్మ, విష్ణువులు. ‘‘అన్నమాట కాదన్నమాట మేమెరుగం. అయినా చేతులతో తీసివ్వడానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే ఫాలలోచనుడిని బయటికి రప్పించి తీసుకెళ్లండి’’ అన్నాడు గజాసురుడు. ‘‘శివున్ని రప్పించడం అంటే కుప్పిగంతులు వేసినట్లు కాదు. తీసుకెళ్లమనండి చూద్దాం’’ అని రెచ్చగొట్టారు వందిమాగధులు. ‘సాంబ సదాశివ శంభోశంకర పరమ దయాకర భక్త వశంకర నంది వాహన నాగభూషణ భయవిమోచన... కాలలోచన... కడుపు చీల్చుకొని రా’ అంటూ గానం చేస్తున్నారు బ్రహ్మ, విష్ణువులు. అంతే... గజాసురుడి కడుపులో భరించలేని నొప్పి మొదలైంది. కొద్దిసేపట్లోనే... అతడి కడుపును చీల్చుకుంటూ శివలింగం బయటికి వచ్చింది. ‘‘భక్త వశంకరా! సుర పక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా! వరం ఇచ్చినట్లే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామీ!’’ మరణశయ్యపై ఉన్నాడు గజాసురుడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై... ‘‘గజాసురా! విపరీతమై వరాలు విపత్కరాలని ఆనాడే నిన్ను హెచ్చరించాను’’ అంటూ గతాన్ని గుర్తు చేశాడు. ‘‘నిజమే స్వామీ! అజ్ఞానంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని గ్రహించలేకపోయాను. కాని దానికి ఇంత శిక్ష విధిస్తావా! అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకారబంధురం చేసి వెళ్లిపోతావా!’’ అని దుఃఖిస్తున్నాడు మృత్యువుకు చేరువులో ఉన్న గజాసురుడు. సమాధానం - శ్రీ వినాయక విజయం -
కథలు చెప్పకండి
అనంతపురం న్యూసిటీ: ప్రసవానంతరం బాలింతను, చంటిబిడ్డను గమ్యస్థానాలకు చేర్చాల్సిన ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు ఆస్పత్రి ఆవరణలోనే అధిక సంఖ్యలో ఉండటంపై వైద్య ఆరోగ్యశాఖ ఉమెన్, చైల్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వాణిశ్రీ ‘జీవీకే గ్రూపు’ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె అనంతపురం సర్వజనాస్పత్రిని పరిశీలించారు. ప్రసవాల నివేదికను పరిశీలించి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలపై ఆరా తీశారు. అసలు చాలా వాహనాలను వాడటమే లేదని తెలిసింది. అక్కడి నుంచి సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్వద్దకు వెళ్లిన ఆమెకు ఆరుబయట ఆరువాహనాలు కనిపించాయి. డ్రైవర్ల లైసెన్స్, బ్యాడ్జీలను పరిశీలించారు. డ్రెస్‌కోడ్ లేకపోవడంపై మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటలవుతున్నా వాహనాలన్నీ ఇక్కడే ఉంటే ఎలా అంటూ ప్రశ్నించడంతో.. ‘బాలింతలు వాహనాల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు’ అని వాహనాల నిర్వాహకుడు సమాధానమిచ్చారు. పేదలు డబ్బు ఖర్చు చేసుకోవాలని అనుకోరు.. కథలు చెప్పకండి అంటూ జాయింట్ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందేనంటూ ఆదేశించారు. నిర్వహణ సరిగా లేనందున మూడు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను రద్దు చేశామని తెలిపారు. అంతకు ముందు జాయింట్ డైరెక్టర్ ఆస్పత్రిలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఆర్ఎంఓతో సమావేశమయ్యారు. ప్రసవాలు బాగానే చేస్తున్నారని, డిశ్చార్జ్ అయ్యాక తల్లీబిడ్డలను గమ్యస్థానాలకు చేర్చకపోతే మిగతా ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే కాకుండా ఏ సమస్య వచ్చినా ప్రజలు 108కు ఫోన్ చేసి, సేవలు వినియోగించుకోవాలన్నారు. బరువు తక్కువ బిడ్డ పుట్టకూడదు బరువు తక్కువ బిడ్డ పుట్టకూడదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్‌కు జాయింట్ డైరెక్టర్ సూచించారు. డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఆమె సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తక్కువ బరువు కారణంగానే శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వీటిని అధిగమించాలంటే గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ జ్యోత్స్న, విశ్రాంత డీఐఓ డాక్టర్ పురుషోత్తం, పీఓడీటీటీ డాక్టర్ సుజాత, ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, మేనేజర్ శ్వేత, గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ కెజియాపాల్ ఉన్నారు. -
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
కవిత్వానికి చమత్కారాన్ని జోడించి చక్కలిగింతలు పెట్టిన కవి ఆరుద్ర. ఇంకా చెప్పాలంటే చమత్కారాన్ని కూడా కవిత్వంగా మలవగలిగిన కవి ఆరుద్ర. పద ప్రయోగాల్లోనూ, వ్యక్తీకరణల్లోనూ ఆరుద్ర మార్కు తెలుస్తుంది. ‘మహాబలుడు’ చిత్రం కోసం ఆరుద్ర ‘ఓ ఓ విశాల గగనములో చందమామా ప్రశాంత సమయములో కలువలేమా’ పాట రాశారు. అందులోని ఒక చరణంలో– ‘వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి’ అంటాడు నాయకుడు. దానికి బదులుగా– ‘వొలికే మధువు కొసరే వధువు రెండూ నీవే’ అని బదులిస్తుంది నాయిక. 1969లో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.పి.కోదండపాణి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం గాయనీ గాయకులు. దర్శకుడు సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్. వాణిశ్రీ,కృష్ణ నటీనటులు. -
వాణిశ్రీ ఇంట విషాదం
సాక్షి, చెన్నై : సీనియర్ నటి వాణిశ్రీ సోదరి కాంతమ్మ(70) గుండెపోటుతో మరణించారు. శనివారం ఉదయం చెన్నైలోని ఆమె స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కాంతమ్మ స్వస్థలం నెల్లూరు. ప్రస్తుతం ఆమె బంధువులు అమెరికాలో ఉండటంతో వారు వచ్చిన తరువాతే అంత్యక్రియలు నిర్వహించే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. -
చెంగాళమ్మ సేవలో వాణిశ్రీ
సూళ్లూరుపేట: ప్రముఖ సినీనటీ, నాటితరం కథానాయిక వాణిశ్రీ సోమవారం సూళ్లూరుపేటలో చెంగాళమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయం వద్ద పాలక మండలి చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వరరెడ్డి ఆహ్వానం పలికి, అమ్మవారి వద్ద పూజలు చేయించారు. అనంతరం ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మే 31 నుంచి జూన్ 6 వరకూ జరుగనున్న చెంగాళమ్మ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా చైర్మన్ ముప్పాళ్ల వాణిశ్రీని ఆహ్వానించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆకుతోట రమేష్ పాల్గొన్నారు. -
సినీ రంగంలో భానుమతి స్థానం శాశ్వతం
ఒంగోలు కల్చరల్ : సినీ రంగంలో ప్రముఖ దర్శకురాలు, నటీమణి భానుమతి రామకృష్ణ స్థానం శాశ్వితమైనదని ఆమె పేరిట తనను పురస్కారంతో సత్కరించడం ఆనందంగా ఉందని కళాభినేత్రి వాణిశ్రీ పేర్కొన్నారు. ఘంటశాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక గుంటూరు రోడ్డులోని ఏ వన్ ఫంక్షన్ హాలులో ఏర్పాటైన అభినందన సభలో వాణిశ్రీ పాల్గొని ప్రసంగించారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకునేందుకు తాను కృషి చేశానని ఆమె వివరించారు. తమ గొప్పతనానికి తెరవెనుక ఎంతో మంది ప్రోత్సాహం కారణమని పేర్కొన్నారు. అభిమానులు చెక్కిన శిల్పంగా ఆమె తనను తాను అభివర్ణించుకున్నారు. డాక్టర్ భానుమతి రామకృష్ణ కాంస్య విగ్రహాన్ని ఒంగోలులో ప్రతిష్టించేందుకు అభిమానులు పూనుకోవాలని ఆమె కోరారు. సినీ రంగంలో భానుమతిని అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. 50, 60 ఏళ్ల క్రితమే చండీ రాణి అనే సినిమాతో దర్శకత్వం వహించడం ద్వారా భానుమతి తమ గొప్పతనాన్ని నిరూపించుకున్నారన్నారు. భానుమతి నటన, గానం, సంభాషణా చాతుర్యం ఎవరూ అనుకరించలేరని ఆమె శ్లాఘించారు. ప్రముఖ గాయని పి.సుశీల పాటలు వింటూ తాను ఎదిగానని, ఇది మల్లెల వేళయనీ వంటి పాటల ద్వారా గాయనిగా పీ సుశీల గొప్ప అభినయం ప్రదర్శించే అవకాశాన్ని తనకు కల్పించారని తెలిపారు. నేడు సృజనాత్మకత లోపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు సైతం సెల్ఫోన్లు, వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్ వంటి వాటికి అలవాటు పడుతున్నారని, చదువుకోవాల్సిన వయసులో వారు అటువంటి వాటికి ఆకర్షితులు కావడం వారి భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించారు. మా నటనను చూడండి తప్ప, మా తప్పులు ఎంచకండి అని హితవుపలికారు. మళ్లీ జన్మంటూ ఉంటే వాణిశ్రీగానే పుడతానని ఆమె తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఆమెను డాక్టర్ భానుమతి రామకృష్ణ పురస్కారంతో వాణిశ్రీని సత్కరించారు. ఘంటశాల పురస్కారాన్ని ప్రముఖ గాయని పి.సుశీలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లవకుశ సినిమా తనకు, మరో గాయని లీలకు గాయనిలుగా ప్రాణం పోసిందన్నారు. 83 మంది హీరోయిన్లకు పాటలు పాడిన ఘనత మీదేనంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారని ఆమె గుర్తుచేసుకున్నారు. జగమే రామమయం అనే శ్లోకాన్ని, సోగ్గాడే చిన్నినానయన పాటను పాడి వినిపించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది కొత్త గాయకులను తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి ఎంజె.ప్రయదర్శిని అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాణిశ్రీ, సుశీలను సత్కరించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎల్.సునీల్‌కుమార్‌రెడ్డి , ఘంటశాల నేషనల్‌ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు టి.విజయకాంత్, కలెక్టర్ వినయ్‌చంద్ తల్లి గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని పురస్కారాలతో సత్కరించారు. -
కోరిక తీర్చలేదని.. కక్షగట్టారు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆమెకు తల్లిదండ్రుల్లేరు.. పేదరికం కారణంగా వివాహమూ కాలేదు.. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.. అయినా ఆ నిరుపేదరాలిపై కక్షగట్టారు. నాలుగు మెతుకులు పెడుతున్న ఆ చిన్న ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. ఆమె చేసిన తప్పల్లా.. పై అధికారి కోరిక తీర్చకపోవడమే. దీంతో ఉపాధి కోల్పోయి వీధినపడ్డ ఆ అభాగ్యురాలు తనకు న్యాయం చేయాలంటూ ‘సాక్షి’ని ఆశ్రయించింది. ఉద్యోగమే ఆధారం: విజయనగరం జిల్లా జామి మండలం, లొట్లపల్లి గ్రామానికి చెందిన ఆమె పేరు జన్నెల వాణిశ్రీ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఐదుగురు ఆడపిల్లల్లో వాణిశ్రీ చిన్నమ్మాయి. ఇంటర్ వరకు చదివిన వాణిశ్రీ నాలుగేళ్ల పాటు కూలి పనులకెళ్లారు. 2006లో ఉపాధి హామీ పథకం రావడంతో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచీ మరో వ్యాపకం లేకుండా విధులకు అంకితమయ్యారు. 2008–09 సంవత్సరాల్లో తల్లిదండ్రులు కాలం చేశారు. ఒకప్పుడు కట్నం ఇవ్వలేక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేకపోయారు. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో ఆమె జీవితం లేదు. కోరిక తీర్చు.. లేదా డబ్బులు కట్టు! ఈ నేపథ్యంలో పైఅధికారి కన్ను తనపై పడుతుందని ఆమె ఊహించలేదు. అతని బుద్ధి తెలిసి కుంగిపోయారు. డబ్బుకి పేదనైనా.. గుణానికి కాదంటూ అతని కోరికను తిరస్కరించారు. అదే ఆమె చేసిన నేరమన్నట్లు ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఉన్నవి, లేనివి కల్పించారు. రికార్డులు తారుమారు చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమెను విధులకు రావొద్దన్నారు. ఆపై ఈ నెల 16వ తేదీన ఉద్యోగంలోంచి తొలగించారు. ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాలి లేదా.. రూ.30 వేలైనా ఇవ్వాలని పైఅధికారి చేసిన ప్రతిపాదన విని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం కోసం డ్వామా పీడీకి, జిల్లా కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విచారించాకే చర్యలు ఫిబ్రవరి నుంచి వాణిశ్రీ విధులకు హాజరు కావడం లేదు. దీనిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశాం. ఆమె స్థానంలో జన్మభూమి కమిటీ సూచించిన వ్యక్తిని నియమించాం. – శ్రీహరి, ఐదు మండలాల క్లస్టర్ ఏపీడీ. ఆమె మాటలు అవాస్తవం ఫీల్డ్ అసిస్టెంట్ వాణిశ్రీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆమెను ఏ రకంగానూ వేధించలేదు. విధి నిర్వహణలో ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటుంది. రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. ఆమెను తొలగించడానికి ఇంకా చాలా కారణాలున్నాయి. ఆమె స్థానంలో ఎవరో ఒకరిచే పనిచేయించుకోవాలి కాబట్టి వేరొకరిని నియమించుకున్నాం. – పి.కామేశ్వరరావు, ఉపాధి హామీ ఏపీవో, జామి మండలం. -
అలమేటి నటి
ఫస్ట్ పర్సన్ వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ నెక్ల్లెస్, వాణిశ్రీ చెవి కమ్మలు, వాణిశ్రీ ఉంగరం, వాణిశ్రీ చీరకట్టు... వెరసి వాణిశ్రీ ఒక శిల్పం. ఒకనాడు ఎందరో యువకుల కలల రాణి, ఎన్నో నవలల క థానాయిక వాణిశ్రీ. నెల్లూరులో పుట్టి చెన్నై చేరుకుని సినీ వినీలాకాశంలో వెలిగిన తార ఆమె. నేటికీ ఎందరో ప్రేక్షకుల అపురూప జ్ఞాపకం. నటి సావిత్రి పై ‘సావిత్రి కళాపీఠం’ రూపొందిస్తున్న డాక్యుమెంటరీకి క్లాప్ ఇవ్వడానికి ఇటీవల విజయవాడ వచ్చిన వాణిశ్రీ సాక్షి ‘ఫ్యామిలీ’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.... రత్నకుమారిని వాణిశ్రీగా మార్చింది ఎస్విఆర్ అని అంటారు... ఆయన నన్ను మార్చలేదు. కేవలం నా పేరును మార్చారు. నా మొదటి పేరు వాణిశ్రీ కాదని అందరికీ తెలుసు. నా స్నేహితులు, మావారు కుమారి అని, బయటివారంతా వాణిశ్రీ అని పిలుస్తారు. ఎస్విఆర్ ‘వాణి’ అనేవారు. ఎన్టిఆర్ ‘వాణిశ్రీ గారు’ అనేవారు. చాలామంది ‘వాణమ్మా’ అనేవారు. ఇండస్ట్రీలో మీ స్ట్రగుల్ గురించి... నా రంగు గురించే కదా మీరు అనడం. నేను నల్లగా ఉన్నానని హీరోయిన్గా ఎలా పనికొస్తానని అందరూ అనేవారు. టాలెంట్ ఉంటే ఏ డిఫెక్టూ ఏమీ చేయలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు నాకు ఇండస్ట్రీ అవసరం ఉంది. ఆ తరవాత ఇండస్ట్రీకి నేను అవసరమయ్యాను. మీ కొప్పు గురించి? అస్వి అనే లండన్ స్టయిలిస్ట్ ఒకసారి మన పరిశ్రమకు వచ్చాడు. ఆయనకు విగ్గును శుభ్రం చేయడానికి ఇస్తే దానితో కొప్పులాంటి స్టయిల్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఆయనే నాకు హెయిర్ స్టయిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో ఆయన రోజుకి 100 రూపాయలు తీసుకునేవాడు. ఔట్డోర్కు రావాలంటే 500 రూపాయలు. మిగిలిన చాలామంది ఆర్టిస్టులు రోజుకు 15 రూపాయలు తీసుకునే హెయిర్ స్టయిలిస్ట్‌ను పెట్టుకున్నారు. నేను రాజీపడేదాన్ని కాదు. నా హెయిర్ స్టయిలిస్ట్ వల్ల నా స్టయిల్ ఒకటి స్థిరపడింది. మీ చీరకట్టు, ట్రెండ్ గురించి... సన్నగా ఉండేదాన్ని. అందంగా చీర కట్టుకునేదాన్ని. వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ నెక్లెస్ అనే ట్రెండ్ ఏర్పడింది. ఆ రోజుల్లోనే రెండు చీరలు అతికి కుట్టించి మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. బ్లౌజ్‌కి బెల్ హ్యాండ్స్ చేయించాను. ఇదంతా ఆడవాళ్లు విపరీతంగా చెప్పుకునేవారు. మీ ఫుడ్ బిల్ చాలా తక్కువని చెప్పుకుంటారు... సెట్లో ‘ఏంటండీ మీ బిల్లు చిన్నదిగా ఉంది. మీరేమీ తెప్పించుకోరా’ అని నన్ను అడిగేవారు. మంచినీళ్లు, పండ్లు, అన్నం అన్నీ మా అమ్మ తెచ్చేది. కొందరు హీరోయిన్లతో వాళ్ల తమ్ముళ్లు, తల్లిదండ్రులు అందరూ వస్తారు. మరి వాళ్ల బిల్లులు పెరిగిపోవా. మీ ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? మొదట యూనిట్లో పెట్టేదే తినేదాన్ని. మేం కొంచెం స్థిమిత పడి, నాకు డబ్బు వచ్చి, కారు కొనుక్కుని, మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాక, మా అమ్మగారే వంట చేసి మాకు కారేజీ పంపేవారు. గోధుమ అన్నం, ఆకు కూరలు, చికెన్ పీస్, పెరుగు, పళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు... నా ఆహారం. షూటింగ్లో లైటింగ్ ఎక్కువ వేస్తారు కనుక శరీరం డీహైడ్రేట్ అయిపోతుందని అమ్మ బత్తాయి రసం తాగమనేది. షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక మేకప్ అంతా పోవడానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసేదాన్ని. సన్నగా ఉండటానికి వాకింగ్, స్కిపింగ్, డాన్స్ చేసేదాన్ని. డాన్స్ అంటే భరతనాట్యం కాదు... ఏదో ఒకపాట వేసుకుని చాలా సేపు ఎగురుతూ అదే ఎక్సర్సైజ్గా చేసేదాన్ని. ఆ రోజుల్లో షూటింగ్లో ఎలా ఉండేది... షూటింగ్‌కి వస్తే అందరూ సరదాగా ఉండేవాళ్లం. సూర్యకాంతం గారైతే అందరికీ పులిహోర, బూరెలు తెచ్చేవారు. ఆవిడతో ఒక అమ్మాయి వచ్చేది. తెల్లగా బొద్దుగా ఉండేది. ఆవిడను నేను ‘మంచమ్మ’ అని పిలిచేదాన్ని. ఆవిడ నన్ను ‘నా బంగారు, తినమ్మా’ అని పెట్టేది. అలాగే జి.వరలక్ష్మిగారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. సీనియర్ నటులు మీకు సూచనలిచ్చేవారా? ఎన్‌టిర్, సావిత్రి వంటి వాళ్లు మాకు ఎలా నటించాలి, మాలో ఏ లోపాలు ఉన్నాయి వంటివి ఏమీ చెప్పేవారు కాదు. ఎస్విఆర్, ఏఎన్నార్ వంటి వారు మాత్రం చెప్పేవారు. షూటింగ్లో ఎవ రెవరు ఎలా ఉండేవారు? ఎన్టిఆర్ గారు అందరినీ గౌరవ వాచకంతో పిలిచేవారు. ఆయన పాత్రలను ఆవాహన చేసుకునేవారు. యమధర్మరాజు వేషం వేసినప్పుడు ఆయన కిరీటం బరువు 12 కిలోలు. ఒకసారి తీస్తే మళ్లీ ఎలా పెడతారో తెలియదు గనక షూటింగ్ గ్యాప్‌లో కూడా కిరీటం తీసేవారు కాదు. ఆయన అలా కూర్చున్నప్పుడు ఫ్యాన్ వెయ్యమని గాని, బయటకు వెళ్తానని గాని ఏమీ అనేవారు కాదు. రంగారావుగారు మాత్రం షూటింగ్ అయిపోగానే క్యారెక్టర్‌ను మర్చిపోయే వారు. నాగేశ్వరరావుగారు చలాకీగా ఉండేవారు. ఎన్టిఆర్ గారు తప్ప షూటింగ్ అయిపోగానే అందరం మామూలుగా మాట్లాడుకునేవాళ్లం. ఏఎన్నార్ గారి గురించి... ఆయన ఒక తండ్రిలా, సోదరునిలా, స్నేహితునిలా ఉండేవారు. అన్నపూర్ణ స్టూడియో కడుతున్న సమయంలో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో ఆయన స్టూడియో కడుతున్న పనివాళ్ల దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. అప్పుడు ఆయన్ని ‘మేస్త్రిగారు’ అనేదాన్ని. ఆయన నవ్వేవారు. అందరి మంచి చూసేవారు. మిగిలినవారితో ఎలా ఉండేవారు? మార్కస్ బార్ట్లే వంటి వారు అరవై ఏళ్ల వయసులో నిలబడితే నేను ఎలా కూర్చుంటాను చెప్పండి. ఆయన కెమెరామెన్. లైటింగ్ ఎరేంజ్మెంట్స్ చేస్తున్నంతసేపూ నేను కూడా నిల్చునేదాన్ని. నా కోసం వాళ్లు కష్టపడుతుంటే నేను కూర్చోవడమేమిటి అనుకునేదాన్ని. నన్ను చూసి మిగతావాళ్లు కూడా నిలబడేవారు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌తో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండేవాళ్లం. నాగయ్య గారి గురించి... మేం వచ్చేటప్పటికే ఆయన తండ్రి పాత్రలు వేస్తున్నారు. ఆయన్ని మేమందరం నాన్నగారు అనేవాళ్లం. మా ఇంటి నుంచి వంకాయలు, సొరకాయలు పంపేవాళ్లం ఆయనకు. లేతకాయలు ఇచ్చామని మెచ్చుకునేవారు. కృష్ణ గారి గురించి... సినీపరిశ్రమలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. కౌబాయ్, జేమ్స్‌బాండ్, 70 ఎం.ఎం, సినిమా స్కోప్... లాభం వస్తుందా రాదా అని ఆలోచించేవారు కాదు. ‘దసరాబుల్లోడు’ చిత్రంలో ‘ఎట్టాగో ఉన్నాదె...’ పాటలో అలా ఎలా వేయగలిగారు? ఆ పాట షూటింగ్ కోటిపల్లి రేవులో జరిగింది. అక్కడ ఎవ్వరూ లేరు. రెండు తాడిచెట్లు, మేము అంతే. అదీకాకుండా హీరాలాల్ మాస్టారు తిక్కమనిషి. ఆయన చెప్పినట్లు చేయకపోతే ఆయనకు కోపం. ఈ పాట పొద్దున్న ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు చేశాం. అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కెరీర్లో ఎదుగుతున్నప్పుడు ఇలాంటివి తప్పవు. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికీ ఆ పాటను అరెరెరె అంటూ పాడుకుంటూనే ఉన్నారు. ఆ సినిమా తరవాత పాత్ర ఔచిత్యం పోతుందని, మమ్మల్ని కాకుండా అలాంటి పాటల కోసం వేరేవారిని పెట్టడం మొదలు పెట్టారు. మీరు తలుచుకోదగ్గ మనుషులు.... చంద్రకళ చాలా తెలివిగల మనిషి. మంచి కూచిపూడి డాన్సర్. తెలుగు, తమిళం, కన్నడం, కొంకిణీ మాట్లాడేవారు. భానుమతిగారు చాలా ప్రజ్ఞాశాలి. డెరైక్షన్, పాటలు, కెమెరా, నటన... సినీపరిశ్రమ వారితోనే ప్రారంభమైంది. ఎవరికీ భయపడని చక్రపాణి గారు ఆవిడకు భయపడేవారు. వారిద్దరికీ ‘మిస్సమ్మ’ సినిమాలో గొడవైంది. సినిమా కొంత తీసిన తరవాత నిన్ను తీసేస్తున్నాను, ఆ నెగిటివ్‌లు కాల్చిపడేస్తున్నాను అన్నారు చక్రపాణిగారు. అలాంటి పట్టుదల ఆయనకు. చక్రపాణిగారు సన్నగా పొడవుగా ఉండేవారు. టీబీ వచ్చి ఒక లంగ్ తీసేసినా నిబ్బరంగా జీవితం గడిపారు. ఒకసారి నన్ను పిలిచి ‘వాణిశ్రీ... ఎవరో శ్యామ్ బెనగల్ మేక ప్ లేకుండా నీతో సినిమా తీస్తున్నారటగా.. నువ్వు చెయ్యకు.. నీ ఒంటికి ఆముదం పూసి కూర్చో పెడతారు. నీ గ్లామర్‌ను నమ్ముకొని నీ మీద మేం కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అన్నారు. ‘కోషిష్’ రీమేక్ అవకాశం వస్తే అది చేయడం కూడా ఆయనకు ఇష్టం లేదు. ‘అందులో జయబాధురి, సంజీవ్‌కుమార్ మూగవారిగా నటించారు. జనాలు నువ్వు, నాగేశ్వరరావు మాట్లాడుతుంటే చూడటానికి వస్తారుగాని మూగోళ్లుగా ఉంటే చూడరు’ అన్నారు. చక్రపాణి గారి మాటను గౌరవిస్తూ కోషిష్ చేయలేదు. శ్యామ్‌బెనగల్‌తో చేశాను. ఆ సినిమా ‘అనుగ్రహం’. మరాఠీ నవల ఆధారంగా రూపొందింది. సినిమా రిలీజ్ కాలేదు. అవార్డు మాత్రం వచ్చింది, బాపు దర్శకత్వంలో మేకప్ లేకుండా ‘గోరంత దీపం’ చేశాను. ఆ సినిమా చూసి అదొక మేకప్ అనుకున్నారు జనం. నేటి టెక్నాలజీ ఫాలో అవుతున్నారా? మిక్సీలు గ్రైండర్లు వచ్చాక సోమరితనం పెరిగిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక నంబర్లు గుర్తుపెట్టుకోవడం తగ్గిపోయింది. గతంలో 150 నెంబర్లు గుర్తుపెట్టుకునేదాన్ని. సెట్లో ఎవరికి ఫోన్ నంబరు కావాలన్నా నన్నే అడిగేవారు. సురేష్ ప్రొడక్షన్ అనగానే టకీమని 429468 చెప్పేసేదాన్ని. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు లేవు కదా... లేవు. కాని హీరోయిన్లు కూడా ఉన్నవాటినే చేయకతప్పదు కదా. దొరికిన క్యారెక్టర్లే బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటి కథానాయికల గురించి... అందరూ బాగానే చేస్తున్నారు. వాళ్లని మౌల్డ్ చేసే నేర్పరితనం డెరైక్టర్ చేతిలో ఉంటుంది. నాకు అనుష్క బాగా నచ్చుతుంది. నేటి తరానికి మీరిచ్చే సలహా... కష్టపడి పని చేయి. ఎవరికీ డబ్బు ఎగ్గొట్టకు. వచ్చిన డబ్బులు దాచుకో అంటూ ఆదిత్య హృదయమ్ చదువుతూ ఇంటర్వ్యూ ముగించారు వాణిశ్రీ. ప్రస్తుత ఆహార విహారాలు భోజనం, శారీరక పరిశుభ్రత, ఆహార వ్యవహారాలు... ఇవన్నీ కలిపి పేనిన దారమే మన భారతీయత. మాంసాహారం తినకూడదు. ఒక ప్రాణిని హింసించి ఆ డెడ్ సెల్స్ తిన్నామంటే ఆధ్యాత్మికత మీద మనసు నిలబడదు. ధ్యానం కుదరదు. కొంచెం అన్నం, పప్పు, నెయ్యి తింటేనే నిద్ర వచ్చేస్తుంది. ఇక మాంసం, చేపలు తింటే నిద్ర ఎక్కడ ఆగుతుంది? ప్రస్తుతం రోజూ వంట, పూజ, సూర్య నమస్కారాలు చేస్తున్నాను. పుస్తకాలు చదువుతున్నాను. త్రివిక్రమ్ ఎలా చేస్తాడో చూడాలనిపిస్తుంది త్రివిక్రమ్ కొత్తగా ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాడు. ఆయన దర్శకత్వం చేసేటప్పుడు దగ్గర నుంచి చూడాలనిపిస్తుంది. మానవ సంబంధాల గురించి, మన సంస్కృతి గురించి బాగా చెబుతున్నాడు. బన్నీ, మహేష్‌బాబు, రవితేజ నాకు చాలా ఇష్టం. వీళ్లు నిజంగానే అలా ఉంటారా, దర్శకుడు చెప్పి ఇలా చేయిస్తూ ఉంటారా అని తెలుసుకోవడానికి వాళ్ల షూటింగ్ చూడాలనిపిస్తుంది. కంకణం ఎవరికి ఇస్తున్నారు? నాది చాలా పెద్ద జుట్టు. ‘సతీసావిత్రి’లో నా ఒరిజినల్ హెయిర్ చూడచ్చు. రోజూ తలంటుకొని, జుట్టు చిక్కు తీసేదాన్ని. ఒకసారి ఒక సన్మానసభ వారు నాకు కంకణం వేస్తామని చెప్పడానికి మా ఇంటికి వచ్చారు. అంతకు మూడు నెలల క్రితమే తిరుపతి వెళ్లి గుండు చేయించుకున్నాను. సన్మానం చేసే ఆవిడ ‘మీ జుట్టు ఏమైపోయిందండీ. అసలే మీకు స్వర్ణ కంకణం వేయాలనుకుంటున్నాము’ అంది. వెంటనే నేను ‘సన్మానం నాకు చేస్తున్నారా, నా జుట్టుకి చేస్తున్నారా’ అని అడిగేసరికి ఆవిడ అవాక్కయ్యింది. పైపై అందాలకు ప్రాధాన్యం ఇస్తే నాకు నచ్చదు. సంభాషణ: డా. వైజయంతి -
డబుల్ గ్లామర్
గ్లామర్ పాయింట్ చాలా యేళ్ల క్రితం ‘గంగ-మంగ’ అనే సినిమా విడుదలయ్యింది. అందులో ఇద్దరు వాణిశ్రీలు ఉంటారు. ఒకరు సాఫ్ట్. మరొకరు ఫాస్ట్. ఒక వాణిశ్రీ అమాయకత్వంతో గుండెలు పిండేస్తే, మరో వాణిశ్రీ హీరోలను మించి ఫైట్లు చేసి అదరగొట్టేసింది. వాణిశ్రీ ఫ్యాన్స అందరూ రెండు విభిన్నమైన పాత్రల్లో ఆమెను చూసి యమా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సినిమా హిందీ వెర్షన్లో ‘హేమామాలిని’ని చూసి ఆమె ఫ్యాన్స కూడా విజిల్స్ వేశారు. అప్పుడే కాదు... ఇప్పటికీ హీరోయిన్ డ్యూయెల్ రోల్ చేస్తే ఫ్యాన్స ఎగబడి చూస్తున్నారు. అందుకే అడపా దడపా హీరోయిన్లు ద్విపాత్రాభినయం చేస్తూనే ఉంటారు. ‘ఓం శాంతి ఓం’లో దీపికా పదుకొనె, ‘చారులత’లో ప్రియమణి, ‘తను వెడ్స మను రిటర్న్స’లో కంగనా, రీసెంట్గా విడుదలైన ‘మయూరి’లో నయనతార తదితరులు రెండేసి డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మురిపించారు. ప్రియాంకాచోప్రా అయితే త్వరలో రానున్న ఓ సినిమాలో పదమూడు పాత్రలు చేస్తోందట. ఎవరు ఎన్ని పాత్రలు వేసినా, ఎంత బాగా చేసినా... డ్యూయెల్ రోల్ చేయడంలో శ్రీదేవి స్టైలే వేరు. పలు భాషల్లో పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఆమె... ‘చాల్బాజ్’ అనే హిందీ చిత్రంతో డ్యూయెల్ రోల్‌కి ఓ స్టాండర్డని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు! -
ఇంటింటి రాట్నం
గిర్రుమని తిరుగుతుంది రంగులరాట్నం.గిర్రుమని తిరుగుతాయి... కళ్లలో నీళ్లు.ఒకసారి ప్రేమ పైనుంటుంది.మరోసారి పగ పైనుంటుంది.కానీ ఈ జీవితరాట్నం... తిరిగినంతసేపూ ఏదీశాశ్వతంగా పైన ఉండదు అని అర్థం అవుతుంది.మన ఇళ్లల్లో కూడా ఇలాంటి తల్లి, తండ్రి,అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కొడుకులు కోడళ్లు, వాళ్ల ఆత్మీయతలు, అపార్థాలు, మనస్పర్థలు కనబడతాయి.సినిమాలో చివరికి రాజకీయం ఓ పెద్ద ఘట్టంలాకనబడుతుంది. కానీ సినిమా అంతటా కుటుంబంలో ఉన్న రాజకీయం కీలక పాత్ర పోషిస్తుంది.ఎవరూ చెడ్డవాళ్లు కాదు. అందరూ మంచివాళ్లే.కానీ ఒకరికొకరు ఎల్లవేళలా మంచివాళ్లు కాదు.అది.. ఈ రంగులరాట్నం మనందరికీ తిరుగులేకుండా చెప్పేది.మనల్ని తిరిగి తిరిగి ఆలోచించేలా చేసేది. ‘తల్లీ, తరతరాలుగా మా కుటుంబాన్ని చల్లగా చూశావ్. ఈనాడు కాని దేశాలకు ప్రయాణం చేయిస్తున్నావ్. మమ్మల్ని ఒక కంట కనిపెట్టి కాపాడే భారం నీదే తల్లి’.గ్రామదేవతను వేడుకుంది అంజలీదేవి. అమె భర్త సుందర్రామయ్య (కృష్ణమూర్తి), పెద్ద కొడుకు సూర్యం (రామ్మోహన్), చిన్న కొడుకు వాసు (చంద్రమోహన్), కూతురు జయ (విజయనిర్మల).. అంతా దేవతకు దండం పెట్టుకున్నారు.ఒకప్పుడు పదిలక్షల ఆస్తికి వారసుడైన సుందర్రామయ్య వాటాలో ఇప్పుడు అప్పులు పోగా మిగిలిన ఆస్తి మూడెకరాలు. ఆ మూడెకరాలను అమ్ముకుని, పిల్లలకైనా చదువు చెప్పించుకుని ప్రయోజకులను చేద్దామన్న ఆశతో భార్యాబిడ్డల్ని తీసుకుని పట్టణానికి బయల్దేరాడు. శ్రీ మోహన విలాస్ కాఫీ హోటల్లో వాడుకగా నూనె డబ్బాలు వేస్తున్నాడు సుందర్రామయ్య. సడన్‌గా ఆ హోటల్ యజమాని దివాలా తీశాడు. సుందర్రామయ్యకు కుప్పకూలిపోయి, గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ భారం అంజలీదేవిపై పడింది. ‘సీతమ్మా.. మన ఊరొచ్చెయ్’ అన్నారు బంధువులు. అంజలీదేవికి భర్త మాటలు, సూర్యపై ఆయన పెట్టుకున్న ఆశలు గుర్తొచ్చాయి. ‘రాను. నేను ఈ ఊరు విడిచి రాను. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ ఊరు వచ్చారో... అది నెరవేరి తీరాలి. అది నెరవేరి తీరాలి’ అంది. భర్త ఆశయం ప్రకారం అక్కడే ఉండి సూర్యాన్ని లాయర్ని చేయాలని తీర్మానించుకుంది. అందుకోసం ఎంత కష్టాన్నయినా భరించాలనుకుంది. పాలు అమ్ముతోంది. దోసెలు పోస్తోంది. సూర్య చక్కగా చదువుకుంటున్నాడు. కానీ తల్లిపడే కష్టమే తెలియడం లేదు. వాసు చదువుకుంటూనే, తల్లి కష్టానికి చేదోడుగా ఉంటున్నాడు. వాసుకు స్పోర్ట్స్‌లో, కుస్తీ పోటీల్లో బోలెడన్ని కప్పులు, మెడల్స్! వాటన్నిటినీ ప్రాణ సమానంగా చూసుకుంటున్నాడు. వ్యాయామశాల ప్రొఫెసర్ శంకర్రావుకు వాసు ప్రియశిష్యుడు. వాళ్ల అమ్మాయికి (పెద్దయ్యాక వాణిశ్రీ) వాసు అంటే అభిమానం. అంజలీదేవి కష్టపడుతోంది. దగ్గుతూ వాకిలి ఊడుస్తోంది. దగ్గు ఎక్కువైంది. జ్వరం వచ్చింది. పని చేయలేకపోతోంది. సూర్య తల్లిదగ్గరకు వచ్చాడు. ‘అసలీ దోసెలు వ్యాపారం వల్లే నీకు జ్వరం వచ్చింది. మీ అమ్మ దోసెలు అమ్ముతోందని అంతా నన్ను ఎగతాళి చేసేవారే’ అన్నాడు. ‘నీకోసం ఈ దోసెల వ్యాపారమే కాదు, ఇంటింటా ముష్టెత్తమన్నా సంతోషంగా చేస్తానయ్యా.. సూరీ’ అంది ఆ అమ్మ. పరీక్ష ఫీజు 50 రూపాయలు రేపే కట్టాలన్నాడు సూర్య. పాతబాకీ కోసం ఎన్నాళ్లని తిరగనూ అన్నాడు అప్పులిచ్చిన కిట్టయ్య అప్పుడే వచ్చి. ‘రేపట్లోగా 150 చెల్లించాలి. లేకుంటే చెంబూ తపేళా పడేస్తాను’అన్నాడు కిట్టయ్య. ‘అంతవరకు రానివ్వను. ఎలాగైనా డబ్బు తెస్తాను’ అన్నాడు వాసు. అన్నట్టే డబ్బు తెచ్చాడు! ‘ఎక్కడిదిరా ఇంత డబ్బు?’... అన్న అడిగాడు. ‘నువ్వేం కంగారు పడకు ఎక్కడా కన్నం వేయలేదులే’.. తమ్ముడు చెప్పాడు. ‘ఇంత డబ్బు ఎక్కడ తెచ్చావురా’.. అమ్మ భయంగా అడిగింది. ‘కప్పులు, మెడల్స్ అమ్మేశాను’ ఏడుస్తూ చెప్పాడు. ‘వాసూ... నా చిట్టి తండ్రీ... ఊరుకో’ అంది అమ్మ. సూర్య లాయర్ అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ అప్పలస్వామి (రమణారెడ్డి) సూర్యను తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. లాయర్ అండ ఉంటే తన అక్రమ వ్యాపారాలు సక్రమంగా సాగుతాయని అతడి ప్లాన్. అన్నకొడుకు సుబ్బారాయుడి చేత కూతురికి చెప్పించాడు... సూర్యను చేసుకుంటే వచ్చే లాభం ఏమిటో. ఆమె కూడా తన లాభం తను చూసుకుంది. పెళ్లికి ముందు అతనితో కొన్ని షరతులు మాట్లాడాలి అంది. నా వ్యక్తిత్వానికి భంగం రాకూడదు. నేచెప్పినట్లు అతను నడుచుకోవాలి. అతను మనింట్లో ఉండాలే కానీ వాళ్లింటికి నేను వెళ్లను. అత్త ఆడబిడ్డ నా చెప్పుచేతల్లో ఉండాలి. నాకు తెలీకుండా వాళ్ల బంధువులెవరూ మనింటికి రాకూడదు. సపోజ్ వచ్చారనుకో... మనం చెప్పినట్లు నడుచుకోవాలి. కోర్టులో ఎన్ని పనులున్నా రోజూ క్లబ్బులకి, సినిమాలకి నాతో రావాలి. ఈ షరతులన్నిటికీ అతను ఒప్పుకుంటాడేమో కనుక్కో అంది. కనుక్కోనవసరం లేదన్నాడు సుబ్బారాయుడు. అక్కణ్ణుంచి సూర్య దగ్గరకు వెళ్లాడు. ‘వనజ మా బాబాయికి ఒక్కతే కూతురు. బోలెడంత ఆస్తి. చచ్చేటంత పలుకుబడి. మరో రహస్యం. ఈ రోజుల్లో మగాడు పైకి రావాలీ అంటే పెళ్లాం ఫార్వార్డ్ అండ్ ఫ్యాషనబుల్‌గా ఉండాలి. మా వనజలాంటి పెళ్లామే ఉంటే నీకు ఏనాటికైనా విదేశీ యాత్ర. ఏమంటావ్’ అన్నాడు. ఏమంటాడు? ఒకే అన్నాడు సూర్య. అమ్మను కూడా ఒప్పించాడు. పెళ్లయిపోయింది. అప్పలస్వామి హ్యాపీ. సూర్యం, అతడి భార్య, తల్లి, తమ్ముడు, చెల్లి వేరే కొత్తింట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇంకో ట్రాక్‌లో సూర్య చెల్లికి, ఆమె స్నేహితురాలు అన్నయ్య అయిన వేణుకి మనసులు కలిసాయి. మరో ట్రాక్‌లో చంద్రమోహన్‌కి, ప్రొఫెసర్ శంకర్రావు కూతురు వాణీశ్రీకి మధ్య ప్రేమ. కోటీశ్వరుడి కొడుకైన వేణుతో విజయనిర్మల పెళ్లి జరిగింది. మెట్టినింటికి వెళ్లిపోయింది. తన భర్త ఫొటోని స్టోర్ రూమ్‌లో పడేయడంతో కలత చెందిన అంజలీదేవి కూడా ఇల్లొదిలి వెళ్లి చిన్న కొడుకు చంద్రమోహన్ దగ్గర ఉంది. చంద్రమోహన్ ఉండేది తన గురువుగారి దగ్గర పార్క్ వీధి ఇంట్లో. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. వాసుని కన్విన్స్ చేసి అతడి చేత నామినేషన్ వేయించారు గురువు శంకర్రావు దగ్గరుండే అతడి శ్రేయోభిలాషులు.అప్పలస్వామి మీద అదే వార్డుకి నిలబడ్డాడు వాసు. అప్పలస్వామి, సుబ్బరాయుడు. ఐడియా వేశారు. వాసు మీదకి అతడి అన్న సూర్యాన్ని పోటీగా నిలబెట్టారు. ‘సూర్యం నెగ్గితే మనం నె గ్గినట్టే. సూర్యం ఓడితే ఇక అన్నదమ్ములు మొహమొహాలు చూసుకోరు. ఇక ఆ దెబ్బతో వాసుగాడి పీడా విరగడైపోతుంది’ ఇదీ పథకం. ‘‘అమ్మా... అన్నయ్యల మధ్య ఈ పోటీ ఆపాలమ్మా. అన్నయ్యలిద్దరూ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దెబ్బలాట కూడా జరగొచ్చంటున్నారు. నాకేదో భయంగా ఉందమ్మా’ అంది విజయనిర్మల. ‘భయపడి చేసేదేముందమ్మా... ఇది అన్నదమ్ముల మధ్య పోటీ కాదు. భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష అని ఆ తల్లి హృదయం ఆక్రోశించింది. వాసు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఖరి నిమిషంలో రమణారెడ్డి మరో పథకం వేశాడు. సూర్యం చేత తల్లికి చెప్పించి ఎన్నికల నుంచి వాసు ఉపసంహరించుకునేలా చేశాడు. ‘ఈ ఎలక్షన్ నుంచి వాసు తప్పుకుంటాడు’ అని చంద్రమోహన్ గురువు ప్రకటించాడు. సూర్య ఏకగ్రీవం అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యాడు.మిగిలింది చంద్రమోహన్, వాణిశ్రీల పెళ్లి. ముహూర్తం రోజు రానే వచ్చింది. చంద్రమోహన్, వాణిశ్రీల పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి సూర్యం రాలేదు. నోటీసులు వచ్చాయి! శంకర్రావు ఇల్లు జప్తు. పార్క్ లెసైన్సు రద్దు. ఇదీ సారాంశం. పెళ్లయిపోయింది. నోటీసులు చూసి గురూజీ కుప్పకూలిపోయాడు. ‘వాడు మనిషో, రాక్షసుడో ఇప్పుడే తెలుస్తాని అని అన్న దగ్గరికి బయల్దేరాడు వాసు. ‘మీ పాదాల పట్టుకుని ప్రమాణం చేసి చెప్తున్నాను. పార్క్ నోటీసు రద్దన్నా కావాలి. లేదా మా అమ్మకు ఒక్కడే కొడుకు మిగలాలి’ అని బయల్దేరాడు. అతడి వెనకే జనం. అన్నదమ్ములిద్దరూ కొట్టుకుంటున్నారు. రక్తాలు కారుతున్నాయి. తల్లి పరుగెత్తుకొచ్చింది. సూర్య విసిరిన టీపాయ్ తల్లి తలకు తగిలింది. ఆమె నేలపై ఒరిగిపోయింది. సూర్యంలో పరివర్తన మొదలైంది. కొడుకులిద్దరి రక్తాన్ని చూసి ఆ తల్లి దుఃఖించింది. ఈ ఘోరం చూడ్డానికేనా నన్ను బ్రతికించావు అని దేవుడిని అడిగింది. ‘ఈ పాపమంతా నాదేనమ్మా,. నిన్ను గాయపరిచిన ఈ చేతులు... ’ అంటూ రోదిస్తున్నాడు సూర్యం. ‘ఇది ఏపాటి గాయం నాయనా. ద్వేషాలతో, ఈర్ష్యలతో, స్వార్థాలతో, స్వాభిమానాలతో, పగలతో, ప్రతీకారాలతో, పశుప్రాయులై ఏనాడు మీ బ్రతుకును నరకంగా చేసుకున్నారో ఆ నాడే మీ తల్లి హృదయం గాయపడింది నాయనా... ’‘అమ్మా... నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా’ ఏడుస్తున్నాడు సూర్యం. ‘ఈ క్షణం నుంచి నీ పలుకే నాకు వేదవాక్కు. నీ పాదాలకు ప్రమాణం చేస్తున్నానమ్మా. ఆజ్ఞాపించమ్మా..’ అన్నాడు సూర్యం. ‘తల్లి తనకోసం ఏం కోరుతుంది నాయనా. ఏది కోరినా తన బిడ్డల కోసం. వాళ్ల ఆనందం కోసం. ముగ్గురు బిడ్డలను కన్న మీ తల్లి మొదలు 40 కోట్ల ప్రజలను కన్న భరతమాత వరకు ఏ తల్లయినా మనసారా వాంఛించేది ఒక్కటే. తన బిడ్డల అభ్యున్నతి. వాళ్ల ఆనందం. ఐకమత్యం. అన్యోన్యత’ అంది తల్లి. అదే ఊరు. అదే గ్రామదేవత. ఆమె ఆశీర్వాదం కోసం ఈ తల్లీ కొడుకులు ఆ దేవత ఎదుట నిలుచుని ఉన్నారు.మళ్లీ అదే పాట.. ‘కలిమి నిలవదు.. లేమి మిగలదు.. కలకాలం ఒక రీతి గడవదు. ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నము’ సినిమా ఎండ్. పాటలు 1. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేరదిగివచ్చునో... 2. కనరాని దేవుడే కనిపించినాడే 3. వెన్నెల రేయి చందమామ వెచ్చగ ఉన్నది మావా 4. కోయిల కోయ్ అని పిలిచినది... ఓయ్ అని నా మది పలికినది. 5. కన్నుల దాగిన అనురాగం మన పెదవులకందని నవరాగం నటీ నటులు అంజలీదేవి (సీతమ్మ) చంద్రమోహన్ (వాసు), రామ్మోహన్ (సూర్య) వాణిశ్రీ (జమునారాణి), సుకన్య (సూర్య భార్య) రమణారెడ్డి (అప్పలస్వామి) పుష్పవల్లి (అప్పలస్వామి భార్య) కృష్ణమూర్తి (సుందర్రామయ్య) విజయనిర్మల (సూర్య, వాసుల చెల్లెలు) త్యాగరాజు (వస్తాదు శంకర్రావు) వివరాలు-విశేషాలు విడుదల: 1966 దర్శకత్వం: బి.ఎన్.రెడ్డి సంగీతం: ఎస్.రాజేశ్వర్‌రావు, బి.గోపాలం మాటలు: డి.వి.నరసరాజు నేపథ్యగానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్. జానకీ తదితరులు పాటలు: కొసరాజు, దాశరథి, సి.నారాయణరెడ్డి -
చీకటినీడలు
ఈ ప్రపంచంలో కాంతినిచ్చేది ప్రేమ. చీకటిని తొలగించేది త్యాగం. నీడగా నిలబడేది బంధం. కాంతి లేనప్పుడు చీకటి కనబడుతుంది. కాంతి ఉన్నప్పుడు నీడ కనబడుతుంది. కానీ చీకటిలో కూడా నీడ ఉంటుంది అంటే నమ్ముతారా? కనబడదు కాబట్టి నమ్మరా?! అజ్ఞాతం అనే నీడలో ఉన్నంత వెలుగు కోటి దీపాల్లో కూడా ఉండదని ఈ సినిమా చెబుతుంది. వెలుగు కిందైనా కనబడతానని నీడకు స్వార్థం ఉండొచ్చు. కానీ చీకటి పక్కన నీడ కనపడాలని అనుకోదు. నీడ అనే కుంచెతో త్యాగమన్న చీకటిని వెలుగులా చిత్రీకరించారు. వెలుగుల కన్నీటితో కడిగే ఈ జీవనజ్యోతిని మళ్లీ చూడాలి. మానసిక చికిత్సాలయం. ఆ ఆలయంలో ఉంది వాణిశ్రీ. బిడ్డను పోగొట్టుకుని మతి స్థిమితం తప్పిన అమ్మ ఆమె. సొంత బిడ్డ కాకపోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువే. ఇరవై ఏళ్లుగా ఆ బిడ్డను మరువలేక, బిడ్డ ఇంకా బతికే ఉన్నాడన్న భ్రమలో ఉంది. దోసిళ్లలోని బొమ్మ బిడ్డను కనురెప్పల్లో పెట్టుకుని క్షణక్షణం మురిసిపోతోంది. చిన్న చప్పుడైంది. ‘ష్... ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు..’ అంది ఆ అమ్మ. శోభన్‌బాబు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెకు పండ్లూ ఫలాలు ఇచ్చాడు. బొమ్మలూ ఇచ్చాడు. అవీ ఆమె కోసమే. బిడ్డ ఉన్నాడు అనుకుంటున్న భార్య కోసం ఆ బొమ్మలు తెచ్చాడు. ఈ భార్యాభర్తలు... చెట్టంత బిడ్డలు ఉండవలసిన వయసులో ఉన్నవారు. వాణిశ్రీ బిడ్డ కోసం బతుకుతుంటే, శోభన్‌బాబు వాణిశ్రీ కోసం బతుకుతున్నాడు. ‘అవునూ మీరెవరు? రోజూ నాకు పలహారాలు, బాబుకు బొమ్మలు తెస్తారు! నేను మీకేమౌతాను?’ అంది వాణిశ్రీ. శోభన్‌బాబు ఆవేదనగా నవ్వాడు. ‘నువ్వా? నాకా? హు... గుడికి దీపం ఏమౌతుంది? దీపానికి వెలుగు ఏమౌతుంది? అదే నువ్వూ నాకు అవుతావు’ అన్నాడు. ఆమెకేం అర్థం కాలేదు. ‘పిల్లాడి’ ధ్యాసలో పడిపోయింది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమౌతోంది శోభ. శోభ అంటే చిన్న వాణిశ్రీ. మతిస్థిమితం తప్పిన పెద్ద వాణిశ్రీ కూతురు ఆమె. ఆ విషయం ఆమెకు తెలీదు. తను బాబాయి అనుకుంటున్న శోభన్‌బాబే తన తండ్రి అని కూడా ఆమె తెలీదు. పైగా ఆయనంటే అయిష్టం. చిన్న వాణిశ్రీకి ఓ కొడుకు. వాడంటే ఆమెకు పంచప్రాణాలు. వాణ్ణి విడిచి క్షణం కూడా ఉండలేదు. ‘అన్నట్లు అమెరికా వెళ్లే ముందు ఒకసారి వాసు (సత్యనారాయణ తమ్ముడు శోభన్‌బాబు) దగ్గరికి వెళ్లాలి మనం’ అన్నాడు సత్యనారాయణ. చి. వాణిశ్రీ చికాకు పడింది. తప్పనిసరై అమ్మ, నాన్నలతో కలిసి బిడ్డను తీసుకుని పొరుగూరిలో ఉన్న ‘బాబాయ్’ ఇంటికి వెళ్లింది. (సినిమాలో అమెరికా అల్లుడి మాట వినిపిస్తుంది తప్ప, మనిషి కనిపించడు. ఎందుకంటే ఇది ఒకట్రెండు రోజుల్లో ముగిసే కథ. మధ్యలోనిది అంతా ఫ్లాష్‌బ్యాక్). రాత్రి బాగా పొద్దు పోయింది. శోభన్‌బాబు తాగుతున్నాడు. ‘లక్ష్మి ఎలా ఉంది?’ అడిగాడు సత్యనారాయణ. లక్ష్మి అంటే మానసిక చికిత్సాలయంలో ఉన్న వాణిశ్రీ. ‘కన్న కూతురు భర్త దగ్గరకు అమెరికా వెళుతుంటే మనసారా ఆశీర్వదించలేని నికృష్ణపు బతుకు బతుకుతోంది’ అన్నాడు శోభన్‌బాబు బాధగా. అప్పుడే అటుగా వచ్చిన చి. వాణిశ్రీ ఈ మాటను వింది. పరుగున శుభ దగ్గరికి వెళ్లింది. ‘మమ్మీ మమ్మీ’ ‘ఏమిటమ్మా...’ ‘నేనెవరి కూతుర్ని, నిజం చెప్పు’. ‘ఏమిటా అర్థంలేని మాటలు? కలవరిస్తున్నావా? ఏంటమ్మా నీకెందుకా సందేహం వచ్చింది?’ ‘ఎందుకా? తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. (శోభా అని తల్లి అరుస్తుంది) ‘చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆ లక్ష్మి ఎవరు? నేను ఎవరి బిడ్డను. నిజం చెప్పండి. మాట్లాడరేం’ అంది చి.వాణిశ్రీ. ‘కన్నతండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చి ప్రశ్నలు’ అన్నాడు శోభన్‌బాబు సత్యనారాయణను చూపిస్తూ. ‘‘బాబాయ్ నేనేం పసిపాపను కాదు, మాటలతో మరిపించడానికి. నిజం చెప్పండి. ఎందుకలా కంగారు పడుతున్నారు? మాట్లాడరే.. నా పుట్టుక అంత అపవిత్రమైనదా? నా తల్లి... కడుపున పుట్టిన బిడ్డను కన్న కూతురు అని చెప్పుకోలేనంత పాపిష్టిదా? పచ్చిగా బతుకుతున్న కులహీనురాలా? కులటా?’ ‘శోభా’ పెద్దగా అరిచాడు శోభన్‌బాబు. ‘నీ తల్లి కులట కాదమ్మా. కుల దైవం. పతిత కాదమ్మా దేవత. నా జీవన జ్యోతి. నేనింకా బతికున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలకూట విషం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే నీ కోసం అమ్మా నీ కోసం. అవునమ్మా నువ్వు, నాకు లక్ష్మికి పవిత్ర మాంగల్యానుబంధానికి ఫలితంగా పుట్టిన బిడ్డవు’. ‘అవునమ్మా... వాసు నీ కన్న తండ్రి’ అన్నాడు సత్యనారాయణ. చిన్న వాణిశ్రీ ఖిన్నురాలైంది. ‘అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను’ అని అడిగింది. ‘అదంతా ఒక పెద్ద కథమ్మా. ఏ కవీ కల్పించలేని యదార్థ జీవితం’ అన్నాడు శోభన్‌బాబు. (ఇక్కడ ఫ్లాష్ బాక్ మొదలౌతుంది). అల్లు రామలింగయ్య టీచర్. సత్యనారాయణ పెద్ద కొడుకు. శోభన్‌బాబు చిన్న కొడుకు. పెద్దకొడుక్కి పెళ్లయిపోయింది. కోడలు శుభ ఉద్యోగం చేస్తోంది వాళ్లకో బిడ్డ. ఇల్లు పీకి పందిరేసే వయసు. ఆ ఇంట్లోకి రెండో కోడలుగా అడుగు పెట్టింది. వాణిశ్రీ. ఇంట్లో అందరి అభిమానాన్ని చూరగొంది. ఇంటెడు పని చేస్తుంది. బావగారి కొడుకు ఆలనా పాలనా తనే తీసుకుంది. తోడికోడలు ఉద్యోగి కదా అందుకు. శుభకు ఒకడే కొడుకు. ఆపరేషన్ కూడా అయింది. ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకే ఆ ఇంట్లో వాడు స్పెషల్. ఇప్పుడు వాణిశ్రీ కోడలుగా వచ్చాక వాడు ఇంకా స్పెషల్ అయ్యాడు. వాణిశ్రీ ఎప్పుడూ ఆ పిల్లాడిని వెంటేసుని తిరుగుతుంది. భర్త పనిచేసే ఆఫీసుకు కూడా అలాగే వెళుతుంది. వాడంటే అంత ఇష్టం. రోజులు గడుస్తుంటాయి. శుభ కొడుకు వాణిశ్రీకి బాగా మాలిమి అవుతాడు. అమ్మా అమ్మా అంటూ తిరుగుతాడు. అసలు అమ్మను పట్టించుకోడు. పిల్లాడి విషయంలో వాణిశ్రీని తప్పు పడుతుంది శుభ ఓరోజు భర్త దగ్గర. ‘నూరేళ్లు సలక్షణంగా బతికవలసిన నా బాబు... ఆ గొడ్రాలి చేతిలో పెరిగి అల్పాయుష్కుడవడం నేను సహించలేను’ అని గట్టిగా అరిచింది శుభ. ఆ అరుపు వాణిశ్రీకి వినిపించింది. కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘నేను గొడ్రాలినా’’ అని శోభన్ని అడిగింది. ‘పిల్లాపాపల్లేని వాళ్లు బాబుని పెంచకూడదా?’ అని అడిగింది. శోభన్, వాణిశ్రీని అక్కున చేర్చుకున్నాడు. ‘లక్ష్మీ... ఎండిపోయిన చెట్లైనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి మూడు పావులు, ఆరుకాయలుగా రాలేదా... అలాంటి చల్లటి మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు?’ అని అనునయించాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒకటవుతారు.... చాలాకాలం తర్వాత. ఆ మర్నాడే బెంగుళూరు వెళ్లిపోతాడు శోభన్. ఇక్కడ వాణిశ్రీకి గుడికి బయల్దేరింది. నానమ్మని అడిగి బాబు (శుభ కొడుకు) కూడా బయటికి వెళ్తాడు. గుడి దగ్గర రద్దీగా ఉంది. అమ్మను వెతుక్కుంటూ వెనకాలే వెళ్లాడు. అంతా అక్కడ రథం లాగుతున్నారు. అక్కడ వాడు వాణిశ్రీని చూసి అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. వాణిశ్రీ కూడా వాడిని చూసింది. ‘బాబూ బాబూ అక్కడే ఉండు’ అని దగ్గరకు వస్తుంటుంది. ఆలోపే వాడు రథం చక్రాల కింద పడి చచ్చిపోతాడు. సినిమాకు ఇది టర్నింగ్ పాయింట్. వాణిశ్రీకి ఎప్పుడూ బాబే గుర్తుకు వస్తుంటాడు. ఎక్కడ చూసినా వాడే కనిపిస్తుంటాడు! ఎవ ర్ని చూసినా వాడే అనుకుంటుంది. చివరికి వాణిశ్రీ మతి స్థిమితం తప్పి ఎటో వెళ్లిపోతుంది. పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. వెతికి ఇంటికి తెస్తారు. ‘మెంటల్లీ షాక్డ్. గర్భవతి కూడా. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని’ చెప్తాడు డాక్టర్. నెలలు నిండుతాయి. ఆడపిల్ల పుడుతుంది. ఆమే... చిన్న వాణిశ్రీ. ‘ఈ పరిస్థితిల్లో బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. అన్నయ్యా... పోయిన మీ బిడ్డను మళ్లీ తెచ్చిచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండీ లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగే పెంచుకోగలరా’ అని అడుగుతాడు శోభన్. అలా సత్యనారాయణ, శుభ... చి.వాణిశ్రీని తమ బిడ్డలా అక్కున చేర్చుకుంటారు. అక్కడ మానసిక చికిత్సాలయంలో పెద్ద వాణిశ్రీ, ఇక్కడ అసలు తల్లిదండ్రులు కాని సత్యనారాయణ, శుభల దగ్గర చిన్న వాణిశ్రీ ఉంటారు. శోభన్ రోజూ వెళ్లి చికిత్సాలయంలో భార్యను చూసి వస్తుంటాడు. ఇదీ ఫ్లాష్ బ్యాక్. అంతా విన్నాక... ‘నేను వెంటనే మా అమ్మను చూడాలి’ అంటుంది చి. వాణిశ్రీ. ‘నీకేమైనా పిచ్చిపట్టిందా? నీకీ విషయం తెలియకూడదనే అమ్మా మేము ఇంతకాలం తాపత్రయ పడింది’ అన్నాడు సత్యనారాయణ. ‘చూడాలి. చూసి తీరాలి’ అంటుంది. వెళుతుంది. అమ్మను చూస్తుంది. బొమ్మ బిడ్డను ఎత్తుకుని పాడుతుంటుంది పెద్ద వాణిశ్రీ. అదే పాట... ముద్దుల మా బాబు...పాట. చి. వాణిశ్రీ ఏడుస్తుంది. అమ్మ దగ్గరికి తన కొడుకును పంపుదామనుకుంటుంది. పెద్ద వాణిశ్రీలా వేషం చేసుకుని ఆ వేషానికి వాడిని అలవాటు చేస్తుంది. లాస్ట్ సీన్: మెంటల్ హాస్పిటల్లో వాణిశ్రీని ఏడిపిస్తుంటారు మిగతా రోగులు. చర్చిలో కూర్చొని ఏడుస్తుంటుంది. కూతురు వాణిశ్రీ వస్తుంది. ‘ఎందుకేడుస్తున్నావ్’ అని అడుగుతుంది తల్లిని. ‘నా బాబు కనిపించడం లేదు’ ‘ఎలా ఉంటాడు?’ చెప్తుంది. ‘ఓహో... మీ వారు తీసుకెళ్లారన్న మాట. రోజూ వచ్చి మీకు పండ్లు పలహారాలు ఇచ్చే మీవారు తీసుకెళ్లారు. మీకు మీ వారిని, మీ బాబుని చూపిస్తాను. మరి నేనడిగింది ఇస్తారా?’ అంటుంది చిన్న వాణిశ్రీ. ‘నా బిడ్డలాంటి దానివి ఏమడిగినా ఇస్తాను. అడుగు’ అంటుంది. కూతురు వాణిశ్రీ ఏడుస్తుంది. ‘అమ్మా అమ్మా’ అని ఏడుస్తుంది. ‘మీ అమ్మ లేదా ఎందుకేడుస్తున్నావ్’ అంటుంది. ‘ఉంది నా మనసులో, నా చుట్టూ, నా ఎదురుగా ఉంది’ అంటుంది. ఆశీర్వదించమంటుంది. శోభన్‌బాబు, బాబు పచ్చికలో ఆడుకుంటుంటుంటే తీసుకెళ్లి ‘అడుగోనమ్మా మీ బాబు అని తన బాబుని చూపెడుతుంది. పెద్ద వాణిశ్రీకి గతం గుర్తుకొస్తుంది. ‘అమ్మా’ అని పిల్లాడు ఆమె దగ్గరికి వెళతాడు. శోభన్ కూతురివైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఎంత త్యాగం చేశావమ్మా... అంటాడు. ‘త్యాగం కాదు.. కన్నబిడ్డగా నా రుణం తీర్చుకుంటున్నాను’ అంటుంది. తన బిడ్డను, తన తల్లి దగ్గర వదిలి చి. వాణిశ్రీ వెళ్లిపోతుంది. ఇదీ కథ. మళ్లీ చూడండి రామ్ ఎడిటర్, ఫీచర్స్ -
ఆగస్టు 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సునిల్ ఛెత్రి (పుట్‌బాల్ క్రీడాకారుడు), వాణిశ్రీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల ధైర్యం, సహనం, కొత్త ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల అంకిత భావం కలిగి ఉండటం వంటి లక్షణాలుంటాయి. పుట్టిన తేదీ 3 దేవగురువైన బృహస్పతికి సంబంధించింది కావడం వల్ల నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి ఉండి, మేధావిగా గుర్తింపబడతారు. మీ సంవత్సర సంఖ్య 1. ఇది పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి చిహ్నం. అందువల్ల అనుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. ప్రేమికులు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయమిది. కోర్టుకేసులు, న్యాయసంబంధమైన వివాదాలు ఉన్న వారు కొంచెం సంయమనం పాటించాలి. లక్కీ నంబర్స్: 1,3,5,9; లక్కీ కలర్స్: ఎల్లో, రోజ్, పర్పుల్, గోల్డెన్, శాండల్. లక్కీ డేస్: మంగళ, గురు, ఆదివారాలు; సూచనలు: సాయిబాబాను, దత్తాత్రేయిడిని ఆరాదించడం, దక్షిణామూర్తి స్తోత్రం, ఆదిత్యహృదయపారాయణం చేయడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
నన్ను నటిగా ఆకాశానికి ఎత్తారు:వాణిశ్రీ
హైదరాబాద్: వీబీ రాజేంద్ర ప్రసాద్ సినిమా నిర్మాణ సంస్థ జగపతి బేనర్‌పై చిత్రం అంటే అందులో పనిచేసే అందరికీ పండుగేనని అలనాటి హీరోయిన్ కళాభినేత్రి వాణిశ్రీ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారని తెలిసిన తరువాత ఆమె ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ మొదటిసారి దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్టయిన సంచలన చిత్రం దసరాబుల్లోడు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహార శైలిని, నడవడికను అనేక విధాల కొనియాడారు. వాణిశ్రీ మాటల్లోనే... రాజేంద్ర ప్రసాద్ గొప్ప వ్యక్తిత్వం గలవారు. అందరినీ ఎంతగానో గౌరవించేవారు. మంచి మనసున్న వ్యక్తి. ఆ నాటి అగ్ర హీరోలతో పోల్చితే నాకు అత్యధిక రెమ్యూనరేష్ ఇచ్చి ఆకాశానికి ఎత్తారు. దసరాబుల్లోడు, బంగారు బాబు రెండు చిత్రాలతో నన్ను బాగా హైలెట్ చేశారు. అప్పటివరకు ప్రతి చిత్రంలో నేను ధరించే చీరలను నేనే సెలక్ చేసుకునేదానిని. ఆయన సినిమాలలో మాత్రం చీరలను ఆయనే సెలక్ చేసేవారు. ఆయన గొప్ప నిర్మాత అయినప్పటికీ సినిమాటిక్ వ్యవహారాలు ఏమీ ఆయనకు లేవు.భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా చిరస్మరణీయుడు. -
సావిత్రిలా పేరు తెచ్చుకోవాలి
ప్రఖ్యాత నటీమణి సావిత్రిలా పేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ అంటున్నారు నటి అనుష్క. అభినయంలో సత్తా ఏమిటో అరుంధతి చిత్రంతోనే చాటుకున్నారు. అయితే త్వరలో నటనకు స్వస్తి చెప్పబోతున్నారని, కారణం పెళ్లి పీట లెక్కనునున్నారరన్నది తాజా ప్రచారం. ఇలాంటి పరిస్థితిలో ఈ ముద్దుగుమ్మ మాత్రం నటి ప్రేక్షకుల హృదయాల్లో సరైన స్థానం సంపాదించుకోలేదని మహానటి సావిత్రి లా పేరుసంపాదించుకోవాలని అనడం విశేషం. ఇంకా ఈ బ్యూటీ భావాలేమిటో చూద్దాం. ప్రస్తుత నటీమణులు సీజన్ పండ్లు లాంటి వారేనన్నారు. ఒక్కో సీజన్లో ఒక్కోనటి చిత్రం విజయం సాధిస్తుందన్నారు. తాను మాత్రం జయాపజయాలను సమంగా స్వీకరిస్తానని తెలిపారు. కొన్ని చిత్రాల్లో అందాలారబోస్తూ మరికొన్ని చిత్రాల్లో నటనాభినయాన్ని చాటుతున్నట్లు చెప్పారు. దర్శకుడు చెప్పినట్లు నటిస్తానన్నారు. మరో విషయం ఏమిటంటే విజయం అనేది ఏ ఒక్కరితోనో వచ్చేది కాదని, అది సమష్టి కృషితోనే సాధ్యమన్నారు. నెంబర్‌వన్ స్థానంపై ఆశ లేదన్నారు. నాటి నటీమణులు సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద లాంటి వారు ఇప్పటికి 14 ఏళ్ల కు ర్రాళ్లకు తెలిసేలా చిరస్థాయిగా గుర్తింపు పొందారన్నారు. మరో విషయం ఏమిటంటే వారి కాలంలో ఇప్పటిలా ప్రసార సాధనాలు లేవన్నారు. అయినా వారు పోషించిన పాత్రలు గుర్తుండిపోయాయని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు ట్విట్టర్లు, పేస్బుక్ లాంటి పలు ప్రసార సాధనాలున్నా తనతో సహా నేటి నాయికలకు, అభిమానుల్లో అంతగా గుర్తింపు లేదన్నది వాస్తవం అన్నారు. అందువల్లే సావిత్రిలా మంచి పాత్రలో నటించి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేలా మంచి పాత్రలను ఇక ముందు కూడా పోషించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. -
మోడరన్ అమ్మలు..గ్లామరస్ అత్తలు..!
కన్నాంబ, రుష్యేంద్రమణి, శాంతకుమారి, సూర్యకాంతం, హేమలత... ఒకప్పటి సినీ స్వర్ణయుగంలో అమ్మ పాత్రయినా, అత్త పాత్రయినా వాళ్లు చేయాల్సిందే! ఆ తర్వాత అంజలీదేవి, సావిత్రి, నిర్మలమ్మ, శారద, వాణిశ్రీ, అన్నపూర్ణ, శ్రీవిద్య లాంటి మేటి తారలు అమ్మలుగా, అత్తమ్మలుగా వెండితెరను అలరించారు. వీరిలో కొందర్ని మినహాయిస్తే.. మిగిలిన అందరూ తొలుత వెండితెరపై నాయికలుగా వెలిగినవారే. అయితే.. అమ్మ పాత్రల్లోకి టర్న్ అయ్యాక వారి దృక్కోణంలో మార్పొచ్చింది. వారి ఆలోచనంతా... ఆయా పాత్రల ఔచిత్యంపైనే. దానికి తగ్గట్టే బిహేవ్ చేసేవారు. వారి దృష్టిలో అక్కడ అందానికి స్థానం లేదు. అయితే... పోనుపోనూ జనరేషన్లో మార్పొచ్చింది. దానికి తగ్గట్టే దర్శకుల ధోరణి కూడా మారింది. అందం హీరోయిన్లకేనా? అమ్మలు, అత్తమ్మలు అందంగా ఉండకూడదా? అనే కొత్త వాదన వెలుగులోకొచ్చింది. ఇంకేముంది... మోడరన్ అమ్మలు, గ్లామరస్ అత్తల ట్రెండ్ మొదలైంది. వెండితెరపై ఓ రేంజ్లో గ్లామర్‌ని ఒలికించిన కథానాయికలందరూ తమ ఇన్నింగ్స్ ముగిశాక.. గ్లామర్ మదర్స్‌గా కనిపించడం మొదలుపెట్టారు. గ్లామర్ మదర్స్ అంటే మొన్నటిదాకా లక్ష్మి, జయప్రద, జయసుధ, సుహాసిని, భానుప్రియ, రమ్యకృష్ణ, శరణ్య, దేవయాని, ప్రగతి, కుష్బూ, రోజా.. తదితర కథానాయికల పేర్లే వినిపించేవి. అయితే.. సినిమాను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌లుక్‌లో ప్రెజెంట్ చేయాలని తపించే కొంతమంది దర్శకులు... కథానాయికల విషయంలోనే కాక, నయా ఆంటీల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండటం మొదలుపెట్టారు. కొత్తనీరు రావడం, పాతనీరు కొట్టుకుపోవడం కామనే కదా! పైగా ‘అత్తారింటికి దారేది’తో ఆంటీ పాత్రలకు అమాంతం క్రేజ్ వచ్చేసింది. మోడ్రన్ మదర్‌గా నదియా అందరికంటే ముందు వరుసలో నిలబడ్డారు. సినిమాకు యాభై లక్షల రూపాయలు పైనే వసూలు చేస్తూ... అత్త పాత్రలకు కొత్త పాపులార్టీ తీసుకొచ్చారు. మరి నదియాకు ప్రత్యామ్నాయం ఎవరు? ప్రస్తుతం ఫిలింనగర్లో ఇదే చర్చ. ఆ చర్చకు తెరదించుతూ... మేమున్నామంటూ నలుగురు నయా ఆంటీలు ముందుకొచ్చారు. వారే... మీనా, రవీనా టాండన్, సిమ్రాన్, పూర్ణిమ. తెలుగుతెరపై మీనాది ఓ శకం అంటే తప్పేం కాదు. అగ్రహీరోలందరితో జతకట్టడమే కాక, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి సత్తా చాటారు మీనా. దాదాపు పదిహేనేళ్ల పాటు కథానాయికగా కొనసాగిన మీనా.. 2009లో వివాహం చేసుకున్నారు. తెలుగులో కథానాయికగా ఆమె చివరి సినిమా ‘తరిగొండ వెంగమాంబ’. పెళ్లి తర్వాత కూడా చిన్నాచితకా పాత్రలు పోషించినా... పూర్తిస్థాయిలో మాత్రం నటనపై దృష్టి పెట్టలేదు. అయితే... మలయాళంలో మోహన్‌లాల్‌తో నటించిన ‘దృశ్యం’ చిత్రం ఆమె ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చింది. ఇక నుంచి గ్లామర్ మదర్‌గా రాణించాలని మీనా భావిస్తున్నట్లు సమాచారం. ‘దృశ్యం’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌కు జోడీగా, మాతృకలో పోషించిన పాత్రనే పోషిస్తున్నారు మీనా. పెళ్లీడొచ్చిన ఇద్దరు పిల్లలకు తల్లిగా ఇందులో కనిపిస్తారామె. పైగా మీనా, వెంకటేష్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం... ఇలా అన్నీ వందరోజుల సినిమాలే. మళ్లీ ఈ సినిమాతో మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంతో మళ్లీ తెలుగుతెరపై తళుక్కున మెరిశారు రవీనా టాండన్. ఒకప్పుడు రవీనా అంటే యువతరం గుండె చప్పుడు. బాలీవుడ్ తెరపై ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బంగారుబుల్లోడు, ఆకాశవీధిలో, రథసారధి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారామె. ఇన్నాళ్ల తర్వాత కూడా తరగని అందంతో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో కనిపించారు. ఆ గ్లామర్‌లో ఏ మాత్రం వన్నె తగ్గలే దని ఇక్కడి యువతరం కితాబులు ఇచ్చేశారు కూడా. తెలుగులో మంచి పాత్రలు చేయాలని ఉందని ఇటీవల మీడియా సాక్షిగా చెప్పారు. అంటే, త్వరలో నయా ఆంటీగా రవీనా హవా మొదలవ్వబోతోందన్నమాట. సిమ్రాన్ కూడా అమ్మగా, అత్తమ్మగా కనిపించడానికి రెడీ అయిపోయారు. 2009లో బాలయ్యతో కలిసి ‘ఒక్కమగాడు’లో నటించినా... సిమ్రాన్‌కి పెద్దగా కలిసిరాలేదు. కృష్ణభగవాన్‌తో ‘జాన్ అప్పారావు 40 ప్లస్’ చేశాక మళ్లీ తెలుగులో నటించలేదు సిమ్రాన్. అయితే... ప్రస్తుతం నడుస్తున్న గ్లామర్ ఆంటీల ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకొని తాను కూడా అందాల అంటీగా కనిపించడానికి రెడీ అయిపోయారు. నాని హీరోగా రూపొందుతోన్న ‘ఆహా కళ్యాణం’ సినిమాతోనే ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. మున్ముందు అంతా తన హవానే అని ధీమాగా చెబుతున్నారు సిమ్రాన్. ఇక పూర్ణిమ వీళ్లందరికంటే కాస్త సీనియర్. ముద్దమందారం, నాలుగుస్థంభాలాట, ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య, మా పల్లెలో గోపాలుడు... ఈ చిత్రాలను తలచుకుంటే... ముందు గుర్తొచ్చేది పూర్ణిమే. గ్లామర్ తారగా కంటే... నటిగానే ఎక్కువగా ప్రేక్షకాభిమానాన్ని పొందారు తను. ఆమె కూడా ఇప్పుడు గ్లామర్ మదర్‌గా కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. పెళ్లయ్యాక... చాలాకాలంగా తెరకు దూరంగా ఉన్న పూర్ణిమ... ‘గ్రాడ్యుయేట్’, ‘తొలిసారిగా’, ‘మిస్టర్ లవంగం’, ‘33 ప్రేమకథలు’, ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ తదితర చిత్రాల్లో అమ్మగా చేశారు. మొత్తానికి... ఈ సరికొత్త ట్రెండ్ మన సీనియర్ కథానాయికల సెకండ్ ఇన్నింగ్స్‌కి బాగా కలిసొచ్చింది. హీరోయిన్లతో పోటీపడుతూ గ్లామరస్‌గా కనబడటం వాళ్లకూ సంతోషమే కదా! పేరుకి పేరు... గ్లామర్‌కి గ్లామర్..!