Yakub Pasha
-
వేసెక్టమీలో దేశంలోనే రాష్ట్రానికి రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వేసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్ మొదటిస్థానంలో ఉంది. దీంతోపాటు వ్యక్తిగత జాబితాలో అత్యధిక సర్జరీలు చేసినందుకు హనుమకొండ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ యాకూబ్‌పాషాకు కేంద్రం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వేసెక్టమీ సర్జరీలు జరగగా, డాక్టర్ యాకూబ్‌పాషా తన 22 ఏళ్ల సర్వీసులో 40 వేలకు పైగా సర్జరీలు నిర్వహించారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ‘నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ సమ్మిట్–2022’లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. శాఖ సిబ్బందిని, హనుమకొండ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ యాకూబ్‌పాషాను ప్రత్యేకంగా అభినందించారు. -
ఇస్మార్ట్ బఫెట్
వారెన్ బఫెట్ ఎవరు? అపర సంపన్నుడు. స్టాక్ ఎక్సేంజి శ్వాసను ఈజీగా పసిగట్టి విజయపథంలో దూసుకుపోతున్న అపరకుబేరుడు. అప్పు చేసైనా సరే, పప్పు కొనకుండా ‘స్మార్ట్‌ఫోన్’ కొనే జమానా ఇది. స్మార్ట్‌ఫోన్ కొనడానికి బఫెట్ అప్పు చేయాల్సిన అవసరం లేదు... స్మార్ట్ఫోనేం ఖర్మ ఏకంగా ‘సార్ట్‌ఫోన్ కంపెనీ’నే కొనగల సంపన్నుడు ఎన్నో సంవత్సరాల నుంచి సాదాసీదా ఫోన్‌నే వాడుతున్నాడు. తన సింపుల్ ఫోన్, పరమ పాత ఫోన్ ప్రస్తావన వచ్చినప్పుడు– ‘‘అలెగ్జండర్ గ్రహంబెల్ దీన్ని కానుకగా ఇచ్చాడు’’ అని చమత్కరిస్తుంటాడు. మరి అలాంటి స్మార్మ్‌ఫోన్ వ్యతిరేకి ఉన్నట్టుండి నెట్వర్క్ ఫిరాయించి, పాత సింపుల్ ఫోన్‌ను పక్కన పెట్టేసి ‘స్మార్ట్‌ఫోన్’ కొనేశాడు. వార్తల్లో వ్యక్తిగా కూడా నిలిచాడు. ‘వారెన్ బఫెట్‌కు ఉన్నట్టుండి స్మార్ట్‌ఫోన్ మీద ఎందుకు మనసు మళ్లింది?’ ఇదే విషయాన్ని భేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు ఈవిధంబుగా ఆన్సర్ చెప్పాడు... ∙∙ స్వర్గంలో ‘అరు’ అనే అప్సరస ఉండేది. ఆమెకు ఒకరోజు స్వర్గం మీద బోర్ కొట్టింది. గాలిలో మార్పు కోసం అలా భూలోకం వెళ్లాలనిపించింది. ‘జై భూలోక’ అని అరిచింది. అంతే...ధగధగ మెరుస్తూ పుష్పకవిమానం ప్రత్యక్షమైంది. ‘‘అమ్మా ఆర్డర్ ఇవ్వండి... ఏడు లోకాల్లో ఏలోకం వెళదాం’’ అని వినయంగా అడిగాడు డ్రైవరుడు. ‘‘భూలోకం తీసుకెళ్లు డ్రైవరా...’’ అని ఆజ్ఞాపించింది అరు. ‘‘అట్టాగే నమ్మా’’ అంటూ ఇంజన్ స్టార్ట్ చేశాడు డ్రైవరుడు. పట్టుమని పదినిమిషాలు కాకుండానే పుష్పక విమానం భూలోకం చేరింది. ∙∙ ‘‘డ్రైవరోత్తమా... ఇది ఏ ప్రాంతం?’’ అని అడిగింది అరు. ‘‘దీనిని యు.ఎస్ దేశం అందురు తల్లీ... యు.ఎస్‌లో ఇది ఒమాహ అను సిటీలోని వోల్డ్ మార్కెట్ ఏరియా’’ అని చెప్పాడు డ్రైవరుడు. ఆ వోల్డ్ మార్కెట్ ఏరియాలో ఒక వ్యక్తి సమాజసేవ చేస్తూ కనిపించాడు. ‘‘డ్రైవరోత్తమా ఎవరా వ్యక్తి?’’ అని అడిగింది అరు. ‘‘అతని పేరు వారెన్ బఫెట్. మహా సంపన్నుడు. బిజినెస్మెన్, ఇన్వెస్టర్, దానాలు బాగా చేస్తుంటాడు. మన కుబేరుల వారి దగ్గర కంటే ఈతని దగ్గరే ఎక్కువగా ధనం ఉందట. అప్పుడప్పుడూ ఇలా సమాజసేవ చేస్తుంటాడు’’ బఫెట్‌ను చూడగానే ‘అరు’ లవ్‌లో పడిపోయింది. ∙∙ స్వర్గలోకానికి తిరిగివచ్చిన తరువాత ‘నువ్వేం మాయచేశావోగానీ...’ పాట ఆమెకు పదేపదే గుర్తుకువస్తోంది. ఎలాగైనా సరే బఫెట్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంది. డైరెక్ట్‌గా బఫెట్ దగ్గరకు వెళ్లి ‘‘నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’’ అంటే అతడికి కోపం రావచ్చు....‘‘ఈ వయసులో నాకు పెళ్లి ఏమిటి!’’ అని తిట్టవచ్చు. అందుకని– దేవుడి కోసం తపస్సు చేసింది. రెండు రోజుల తరువాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ‘‘ఏమి కావాలో కోరుకో’’ అని అడిగాడు దేవుడు. అప్పుడు... ‘‘వారు...అనగా వారెన్ బఫెట్ నన్ను తదేకంగా చూస్తూ ఉండాలి’’ ఓకే! ‘‘నా కళ్లలో కళ్లు పెట్టి చూస్తుండాలి’’ ఓకే! ‘‘నేను తప్ప ఆయనకు మరో లోకం ఉండకూడదు’’ ‘‘ఓకే’’ ‘‘ఆయన నిద్ర నించి లేవగానే నా ముఖమే చూడాలి’’ ‘‘ఓకే’’ ‘‘నా గొంతు వినబడగానే ఎలర్ట్ కావాలి’’ ‘‘ఓకే’’ ‘‘నేను పిలవకపోయినా పిలిచినట్లుగా భ్రమించాలి’’ ‘‘ఓకే’’ ‘‘నేను లేకుండా పక్క దేశానికి కాదు కదా....పక్కింటికి కూడా వెళ్లకూడదు’’ ‘‘ నువ్వు కోరినవన్నీ ఫలిస్తాయి తల్లీ’’ అని మాయమయ్యాడు దేవుడు. వెంటనే అప్సరస అరు ‘స్మార్ట్‌ఫోన్’గా మారింది. వారెన్ బఫెట్ దగ్గరికి చేరింది. శుభం – యాకుబ్ పాషా -
ట్రంప్‌కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!
ట్రంప్ ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అమెరికన్ వంటలు ఎంతమాత్రం నచ్చడం లేదు. పదే పదే ఇండియన్ వంటకాలే గుర్తుకొస్తున్నాయి. ఒక ఫైలు మీద అయితే తన సంతకానికి బదులు ‘ఆంధ్రా నాటుకోడి పులుసు’ అని రాశాడు. ‘‘ఇదేంటి సార్?’’ అని ఆయన పీయే అడగాలనుకున్నాడుగానీ ‘ఎందుకొచ్చిన లొల్లి’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా కామ్‌గా ఉండిపోయాడు. ఆరోజు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ వైట్‌హౌస్‌కు ఫోన్ చేశాడు. ఆ సంభాషణ ఇలా జరిగింది: సెక్రెటరీ: హలో ట్రంపుగారు... ట్రంప్: ‘హలో’ ట్రంపు కాదు... డొనాల్డ్ ట్రంప్‌ని మాట్లాడుతున్నాను...హీ హీ హీ.... సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ... నీ నవ్వు... వినలేక ఛస్తున్నాను... ( ఆ సున్నితమైన నవ్వు ఆగిపోయింది) ట్రంప్: విషయం ఏమిటో చెప్పిచావు... సెక్రెటరీ: ఆ ఇరాన్ వాడు మళ్లీ ‘అణ్వాయుధం తయారుచేస్తున్నాను ఖబడ్దార్’ అంటున్నాడు... ట్రంప్: బాసూ, ఇరాన్ అంటే గుర్తుకు వచ్చింది... నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇరానీ చాయ్ రుచి చూశాను. అబ్బబ్బా ఎంత బాగుందో! ఆ రోజంతా తాగుతూనే ఉన్నాననుకో... సెక్రెటరీ: ఆపవయ్యా నీ ‘టీ’ గోల! ప్రపంచశాంతి గురించి మాట్లాడుదామని ఫోన్ చేస్తే ఇరాన్ టీ గురించి చెప్పి చావగొడుతున్నావు. అసలు మీ రెండు దేశాల వాళ్లు తెల్లారి లేస్తే చాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇదేమన్నా బాగుందా? అని నేను ఐరాస సెక్రెటరీ జనరల్ హోదాలో ప్రశ్నిస్తున్నాను... ట్రంప్: బాసూ... కారాలు మిరియాలు అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు కారం బాగా దట్టించిన రాయలసీమ నాటుకోడి పులుసు రుచి చూశాను... అబ్బా! అదిరిపోయిందనుకో. తింటున్నప్పుడు ఎవరో ‘మిరియాల చారు’ పట్టుకొచ్చారు. అది కలుపుకొని తింటే రుచి ఉంది... నా సామిరంగా... ఇప్పటికి నోట్లో నీళ్లూరుతున్నాయి... (ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?) సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ నీ బ్యాంబూలో సోది... ట్రంప్: అరే... బొంగులో చికెన్ గురించి నీకు చెప్పడం మరిచాను. ఒకరోజు అది వడ్డించారు. ‘బొంగులో చికెన్’ ఈజ్ ట్రడిషనల్ ఫామ్ ఆఫ్ కుకింగ్. ఆల్మోస్ట్ నో ఆయిల్ అండ్ కారం... డిష్ అదిరిపోయింది అనుకో! సెక్రెటరీ: కాస్త నీ చికెన్ గోల ఆపుతావా! కాసేపు ఇండియా–అమెరికా సంబంధాల గురించి మాట్లాడదాం. నువ్వు ఇండియా పర్యటించడం ‘చారిత్రక ఘట్టం’ అనే చెప్పుకోవాలి. ఏమంటావు ట్రంపూ... ట్రంప్: ‘చారిత్రక’ అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు రకరకాల చారుల రుచిచూశాను. ఎంత బాగా నచ్చిందో! మజ్జిగ చారు, మిరియాల చారు, టమాటా చారు... వీటిలో పప్పుచారు హైలెట్ అనుకో... హై ప్రోటీన్ చారు... ప్రిపరేష్ 16 నిమిషాలు, కుక్ 30 నిమిషాలు, టోటల్...46 నిమిషాలు... సింపుల్‌గా చేసుకోవచ్చు... సెక్రెటరీ: ఏమిటయ్యా బాబూ...అప్పటి నుంచి తెగ చావగొడుతున్నావు. నేను మాట్లాడుతున్నదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటీ. ఏమైనా సంబంధం ఉందా? అయినా తప్పు నీది కాదులే...పొద్దున లేచి ఎవడి ముఖం చూసానో... సరే కర్మగాలి చూశానే అనుకో... నీకు ఫోన్ చేయాలని నాకు ఎందుకు అనిపించాలి... దరిద్రం కాకుంటే... ట్రంప్: ఏమిటయ్యో మాటలు మితిమీరి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డోనాల్డ్ ట్రంప్‌తో, అమెరికా ప్రెసిడెంట్‌తో మాట్లాడుతున్నావు. నాకు గానీ తిక్క రేగింది అంటే... సెక్రెటరీ: కూల్ ట్రంప్ కూల్... ట్రంప్: బాసూ... ‘కూల్’ అంటే గుర్తుకు వచ్చింది... ఇండియాలో ఉన్నప్పుడు ‘కుల్ఫీ’ తిన్నానయ్యా... తెగ నచ్చేసిందనుకో... మలై కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ, బటర్ స్కాచ్ కుల్ఫీ, లిచ్చి కుల్ఫీ, కేసర్ పిస్తా కుల్ఫీ, కేసర్ బాదం కుల్ఫీ... ఒక్కటా రెండా... ఎన్నెన్ని కుల్ఫీలు తిన్నానో... సెక్రెటరీ: నీ ఇండియా పర్యటన నా చావుకొచ్చిందయ్యా. బతికుంటే బలుసాకు బిజినెస్ చేసుకొని బతుకుతాను... ఇక సెలవా మరి... ట్రంప్: నువ్వు బలుసాకు అంటే గుర్తుకొచ్చింది... నేను ఇండియా నుంచి తిరుగుప్రయాణం అవుతున్నప్పుడు బ్రహ్మాండమైన విందు ఇచ్చారు. అందులో స్పెషల్ ఏమిటో తెలుసా? బలుసాకు పప్పు, బలుసాకు పప్పుచారు, బలుసాకు మటన్ కర్రీ, బలుసాకు చికెన్ కర్రీ, బలుసాకు ఫిష్ ఫ్రై, బలుసాకు ఫిష్ పులుసు, బలుసాకు బిర్యానీ, బలుసాకు అప్పడాలు, బలుసాకు వడియాలు, బలుసాకు సకినాలు, బలుసాకు కాజా... గమనిక: అటునుంచి ‘సచ్చాన్రో’ అంటూ పెద్ద శబ్దం వినబడి ఫోన్ కట్ అయిపోయింది. అశుభం – యాకుబ్ పాషా -
అలా... బయటికొచ్చాడన్నమాట!
స్వామి నిత్యానంద కోసం గుజరాత్, కర్ణాటక పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఇదే కాకుండా...ఇంటర్‌పోల్ ఆఫీసర్లు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. తాను దేశం విడిచిపోలేదని, హిమాలయా పర్వత సానువుల్లో తపస్సు చేసుకుంటున్నాని సభ్యసమాజానికి వీడియో సందేశం పంపాడు నిత్యానంద. ఇప్పుడు హిమాలయ పర్వత సానువుల్లో ఏం జరుగుతుందో చూద్దామా మరీ... స్వామి నిత్యానంద సీరియస్‌గా తపస్సు చేసుకుంటున్నాడు. అతడి ముందు ‘ప్లీజ్ డోన్ట్ డిస్టర్బ్ మీ’ అనే బోర్డ్ ఉంది. దేవుడు ప్రత్యక్షమైతే ఒక వరం కోరుకోవాలనేది ఆయన ప్లాన్. తాను అడగదలచిన వరాన్ని మనసులో పదేపదే మననం చేసుకుంటున్నాడు... ‘‘స్వామి! నాకు చిన్న వరం ఇవ్వు. కర్ణాటక రాష్ట్రంలో నాకు బిడదిలో ఆశ్రమం ఉంది. ఈ హిమాలయాల్లో కూడా అలాంటిదే ఒక ఆశ్రమాన్ని స్థాపించాలనేది నా కల. నాకు వరం త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను...’’ రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలరోజులు గడిచాయి... దేవుడు ప్రత్యక్షం కాలేదు! విసుగెత్తిన నిత్యానంద తపస్సు విరమించాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది అతని పరిస్థితి. తిరిగి వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా అని ఇక్కడ ఉండాలనిపించడంలేదు. అబ్బో ఏం చలి! ‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు, ఇంతకీ నిత్యానంద హిమాలయాల్లోనే ఉన్నాడా? బయటి ప్రపంచంలోకి వచ్చాడా? తెలిసి కూడా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావో...చైనాకు పంపిస్తా...’’ అని హెచ్చరించాడు బేతాళుడు. ‘‘నిత్యానంద పోలీసులకు దొరికిపోయాడు’’ చెప్పాడు విక్రమార్కుడు. ‘‘అదెలా?’’ ఆశ్చర్యపోయాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు: ‘‘నిత్యానంద బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న మాటేగానీ...ల్యాప్ టాపు పుణ్యమా అని సీఐఏ నుంచి చింతపండు ధరల వరకు ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఈ విషయం పోలీసులకు లేటుగా తెలిసింది. అంతే....‘హిమాలయాల్లో ప్రాణాంతకమైన హిమోనా వైరస్’ అనే ఫేక్ న్యూస్‌ను బ్లాస్ట్ చేశారు. ఈ వైరస్ తనకెక్కడ సోకిందోనని భయపడిపోయి, హిమాలయాలలో నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన ఆస్పత్రిలోకల్లా వెళ్లి ‘నాకు గాని వైరస్ సోకిందా...’ అని టెస్టులు చేయించుకుంటున్న క్రమంలో ఒక హాస్పిటల్లో పోలీసులకు దొరికిపోయాడు నిత్యానంద. ‘‘నేనే లొంగిపోదామని వస్తున్నాను. ఈలోపు మీరు వచ్చారు. నా కోసం మీరు వచ్చినా, మీ కోసం నేను వచ్చినా...మ్యాటర్ సేమ్ కదా...’’ అని పళ్లికిలించాడు నిత్యానంద! బడా బ్యాంక్ రాబరీ! ముంబైలో బ్యాంకు రాబరీ జరిగింది. ఈ రాబరీపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపడానికి యస్పీభయంకర్ అనే అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆరోజు బ్యాంకుకు వచ్చిన వారిలో మన తెలుగు పౌరుడు సుబ్బారాయుడు కూడా ఉన్నాడు. ఆయనను ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు భయంకర్. భయంకర్: మీరు ఆ దొంగల్ని చూశారా? సుబ్బా: మీ మీద ఒట్టండి... చూశానండి... ఓ ముగ్గురు కుర్రాళ్లు ముసుగులు ధరించి వచ్చారండీ...వారితో పాటు ఒక ఏనుగు కూడా వచ్చిందండి. భయంకర్: ఏనుగా????!!!!! సుబ్బా: ఏనుగేనండీ...మీ మీద ఒట్టండి! భయంకర్: అది ఆఫ్రికన్ ఏనుగా? ఇండియన్ ఏనుగా? సుబ్బా: అది మనకెలా తెలుస్తదండీ! ఏనుగూ...ఏనుగూ...నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అని అడగలేం కదండీ...హ్హీ హ్హీ....హ్హీ... భయంకర్: నవ్వింది చాలుగానీ, నేను చెప్పింది శ్రద్ధగా విను...ఆఫ్రికా ఏనుగుల చెవులు పెద్దగా ఉంటాయి...మన ఏనుగుల చెవులు వాటితో పోల్చితే చిన్నగా ఉంటాయి. ఇప్పుడు చెప్పు...అది మన ఏనుగా? ఆఫ్రికన్ ఏనుగా? సుబ్బా: ఎలా చెబుతామండీ? భయంకర్: చూశానంటున్నావు కదా... లలల: అది కూడా మాస్కు ధరించి వచ్చిందండీ... – యాకుబ్ పాషా -
నరకమా? అయితే ఓకే!
అనగనగా ఒక ఊళ్లో బాటిల్ కుమార్ అనే తాగుబోతు ఉండెను. ఒకరోజు ఇతడికి మార్గమధ్యంలో ఒక స్వామిజీ ఎదురయ్యెను. ‘‘నాయనా, తాగిన వాళ్లు నరకానికి వెళ్లెదరు అనే విషయం నీవు ఎరగవా?’’ అన్నారు స్వామిజీ. ‘‘నరకమా!’’ అని పెద్దగా అరిచి మందు కొట్టడం ఆపి గజగజా వణకడం ప్రారంభించాడు బాటిల్ కుమార్. గజగజా షేక్ అవుతున్నాడంటే అతనిలో మార్పు వచ్చిందనుకొని సంతోషించారు స్వామి వారు. ‘‘స్వామి నాదొక డౌటు’’ అన్నాడు బాటిల్ కుమార్. ‘‘ఏమిటి నాయనా అది?’’ అడిగారు స్వామిజీ. ‘‘నేను మందు కొట్టడానికి ప్రధాన కారణం నాకు అప్పులు ఇచ్చే అప్పారావు. వాడు లేకపోతే నేను మందు కొట్టే ఛాన్సే లేదు. మరి ఆడు నరకానికెళ్లడా?’’ మందు కొట్టడం ఆపి అడిగాడు బాటిల్ కుమార్. ‘‘ఎందుకెళ్లడు నాయనా...హండ్రెడు పర్సంటు వెళతాడు’’ అని చెప్పారు స్వామిజీ. ‘‘సరే, వాడేదో బుద్ధిలేక అప్పు ఇచ్చాడు అనుకుందాం. అసలు ఆ సారా అమ్మే సుబ్బయ్య లేకపోతే, నేనెందుకు మందు కొంటాను. కాబట్టి తప్పంతా సుబ్బయ్యదే. మరి ఈ సుబ్బయ్య నరకానికి వెళతాడా?’’ అడిగాడు బాటిల్ కుమార్. ‘‘టు హండ్రెడ్ పర్సెంట్ వెళతాడు నాయనా’’ అన్నారు స్వామిజీ. ‘‘సుబ్బయ్య సంగతి వదిలేయండి. ఆ సోమేష్ కూడా వెళతాడా?’’ అడిగాడు బాటిల్ కుమార్. ‘‘సోమేష్ ఎవరు నాయనా?’’ అడిగారు స్వామి. ‘‘సారా కొట్టులో నా గ్లాస్‌మేట్. మనం తాగి తప్పు చేస్తున్నాం...అని నాలుగు మంచి మాటలు చెప్పకుండా...ఈ భూమండలంలో మనంత అదృష్టవంతులు ఎవరూ లేరు అంటూ సొల్లు మాటలు చెప్పడం తప్పు కాదా!’’ అన్నాడు బాటిల్. ‘‘కచ్చితంగా తప్పే...ఆయన కూడా నరకానికి వెళతాడు నాయనా’’ చెప్పారు స్వామి. ‘‘సరేనండీ, మేమిద్దరం బుద్ధి గడ్డి తిని మందుకొడుతున్నాం అనుకోండి. మరి సారాకొట్టు ముందు చేపలు ఫ్రై చేసి మాకు అమ్మే ఆ చెన్నప్ప మాట ఏమిటి?’’ అడిగాడు బాటిల్. ‘‘ఆయన ఏం చేశాడు నాయనా?’’ ఎప్పటిలాగే అమాయకంగా అడిగారు స్వామి. ‘‘అర బాటిల్‌తోనే కానిచ్చారేమిటండీ...మీ లెవల్‌కి తగ్గట్టు ఈరోజు కూడా ఫుల్‌బాటిల్ కొట్టాల్సిందే...అని రెచ్చగొడుతుంటాడండీ...ఇది తప్పు కదటండీ!’’ అన్నాడు బాటిల్. ‘‘కచ్చింతగా తప్పే...చెన్నప్ప కూడా నరకానికి వెళతాడు నాయనా’’ అని చెప్పారు స్వామిజీ. ‘‘నాయనా, ఇప్పటికైనా మందు మానేస్తున్నావా! లేకపోతే నరకానికి వెళతావు. తెలుసు కదా!’’ అన్నారు స్వామిజీ. ‘‘ఈమాత్రం దానికి భయపడడం ఎందుకు?’’ కూల్‌గా అన్నాడు బాటిల్ కుమార్. ‘‘నాయనా, నువ్వు వెళ్లబోయేది కులు మనాలి కాదు నరకానికి’’ హెచ్చరించారు స్వామిజీ. ‘‘అయితే మాత్రం ఏమిటండీ...’’ అంటూ స్వల్వ విరామం తరువాత సంతోషంగా మళ్లీ మందు కొట్టడం మొదలెట్టాడు బాటిల్ కుమార్. ‘‘అదేమిటి నాయనా...నరకం అంటే భయపడాల్సింది పోయి అంత సంతోషంగా మందు కొడుతున్నావు?!’’ ఆశ్చర్యంగా అడిగారు స్వామిజీ. ‘‘సంతోషం కాకపోతే ఏమిటండీ, అప్పు ఇచ్చే అప్పారావు నరకానికే వస్తాడు, మందు అమ్మే సుబ్బారావు నరకానికే వస్తాడు, నా గ్లాస్‌మేట్ సోమేష్ నరకానికే వస్తాడు. ఫిష్ ఫ్రై అమ్మే చెన్నప్ప సరకానికే వస్తాడు. ఇంతకంటే కావాల్సింది ఏముంది! ఇక్కడిలాగే హాయిగా రోజూ మందు కొట్టవచ్చు. స్వర్గంలో ఏముంటుంది నా బొందా’’ అంటూ పెగ్గెత్తాడు బాటిల్ కుమార్. – యాకుబ్ పాషా -
అదేంటి బట్టలు చింపుకుంటున్నావు
రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ మొదలైంది... ఆఫీసర్ : మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. సాంకేతిక సమస్య వచ్చి పైన ఫ్యాన్లు పని చేయడం లేదని అనుకుందాం. విపరీతంగా ఉక్కబోస్తుంది. అప్పుడు మీరు ఏంచేస్తారు? అప్పారావు : కిటికి తెరుస్తాను సార్. ఆఫీసర్ : గుడ్. కిటికీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? అప్పారావు : విండో ఆఫీసర్ : గుడ్. క్యాబినెట్ విండో అంటే ఏమిటి? అప్పారావు : తెలియదు సార్. ఆఫీసర్ : ఓకే....బేవిండో అంటే? అప్పారావు : తెలియదు సార్. ఆఫీసర్ : ఓకే. ఐబ్రో విండో అంటే? సింగిల్–హంగ్ అండ్ డబుల్ హంగ్ విండోస్ అంటే? స్లైడ్ విండో అంటే? మల్టీ లిటిల్ విండో అంటే? అప్పారావు : తెలియదు సార్. ఆఫీసర్ : ఓకే...ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో కొన్ని వాక్యాలు చెబుతాను. వాటిని తెలుగులో చెబితే...ఉద్యోగం నీకే... అప్పారావు : ఓకేసార్. చెప్పండి. ఆఫీసర్ : బ్రౌజర్ విండో దట్ యూ ఆర్ యూజింగ్ టు వ్యూ ది వెబ్ పేజ్ ఈజ్ ఏ విండో. విండోస్ ఆర్ ఏ యూజర్ టు వర్క్ విత్ మల్టీపుల్ ప్రోగ్రామ్స్... అప్పారావు : !!!!!!! ఆఫీసర్ : అదేంటి కంట్లో అంతులేని ఆశ్చర్యాలు కనిపిస్తున్నాయి? అప్పారావు : అంతా అయోమయంగా ఉంది సార్. కళ్లు తిరుగుతున్నాయి... ఆఫీసర్ : ఓకే నువ్వెళ్లొచ్చు. బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నవారు అప్పారావును చుట్టుముట్టారు. ‘ఇంటర్వ్యూలో ఏమడిగారు?’ అంటూ ప్రశ్నల ఎండ కురిపించారు. అప్పుడు అప్పారావు వారితో ఇలా చెప్పాడు... ‘‘ట్రైన్‌ల్లో ఉక్కపోస్తే ఏంచేస్తావు?’’ అని అడిగాడు. పొరపాటున ‘‘కిటికీ తెరుస్తాను’’ అన్నాను. అంతే...వాడు నా గుండె తెరిచి ఒక్క ఆట ఆడుకున్నాడు. మిత్రులారా...పొరపాటున కూడా ‘కిటికీ తెరుస్తాను’ అనే మాట ఉపయోగించవద్దు. అలా అన్నారంటే...మీ చావును అర్జంటుగా కొరియర్లో తెప్పించుకున్నట్లే. బెస్టాఫ్ లక్’’ అని చెప్పాడు అప్పారావు. ‘సుబ్బారావు... సుబ్బారావు’ అనే పిలువు వినబడడంతో ఇంటర్య్వూ హాల్లోకి పరుగెత్తాడు సుబ్బారావు. ఆఫీసర్ : మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నారనుకుందాం. సాంకేతిక సమస్య వల్ల పైన ఫ్యాన్లు పనిచేయడం లేదనుకుందాం. అప్పుడు మీరు ఏంచేస్తారు? సుబ్బారావు : న్యూస్ పేపర్‌తో అటూ ఇటూ ఊపుకుంటాను సార్. ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో? సుబ్బారావు : షర్ట్ విప్పుతాను సార్. ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో? సుబ్బారావు : బనియన్ విప్పుతాను సార్. ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో? సుబ్బారావు : ప్యాంట్ విప్పుతాను సార్... ఆఫీసర్ : ట్రైన్లో ఉన్న ప్రయాణికులు పెడబొబ్బలు పెడుతూ పారిపోవాలనా నీ ఉద్దేశం! ఇన్ని చెబుతున్నావు...‘కిటికీ తెరుస్తాను సార్. చల్లగాలి తగులుతుంది’ అనే మాట ఎందుకు అనడం లేదు? సుబ్బారావు : పొరపాటున కూడా తెరవను సార్. ఆఫీసర్ : అదేమిటయ్య...కిటకీ తెరిస్తే నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? సుబ్బారావు : మీరు తుపాకితో కాల్చి చంపినా సరే...తెరవను సార్... ఆఫీసర్ : అదిసరే...తుపాకీని ఇంగ్లిష్‌లో ఏమంటారు? సుబ్బారావు : గన్. ఆఫీసర్ : గుడ్. లాంగ్గన్, వాల్గన్, సబ్మెషిన్గన్, షాట్‌గన్, కంబాట్ షాట్‌గన్, సెమీ–ఆటోమెటిక్ షాట్‌గన్, ఫీల్డ్‌గన్, స్పేర్గన్, ఫ్లేర్గన్, క్యాప్గన్, వాటర్‌గన్...వీటి గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు... సుబ్బారావు : !!!!!!! ఆఫీసర్ : అదేమిటి నీ కంట్లో అంతులేని ఆశ్చర్యం కనిపిస్తుంది? సుబ్బారావు : అయోమయంగా ఉంది సార్. ఆఫీసర్ : సరే, నేను కొన్ని ఇంగ్లిష్ వాక్యాలు చెబుతాను. వాటిని తెలుగులో చెప్పు చాలు. ఉద్యోగం నీకే ఇస్తాను. సుబ్బారావు : ఓకే సార్. ఆఫీసర్ : ఏ గన్ ఈజ్ ఏ రేంజ్డ్ వెపన్. దట్ ఆర్ సాలిడ్. బట్ కెన్ ఆల్సో బి లిక్విడ్. ది ఆరిజన్ ఆఫ్ ది ఇంగ్లిష్ వర్డ్ గన్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ ది నేమ్ గివెన్ టు ఏ పర్టిక్యులర్ హిస్టారికల్ వెపన్. డోమినా గునీల్డ వాజ్ ది నేమ్ మెకానికల్ బోల్ట్ త్రోయింగ్ వెపన్ ఆఫ్.... ..... ››...... ..... ... ...... ........ ఆఫీసర్ : అదేంటి బట్టలు చించుకుంటున్నావు. ఇప్పుటి వరకు బానే ఉన్నావు కదా... (సశేషం) – యాకుబ్ పాషా -
నేలమాళిగలో లిటిల్ డెవిల్
ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు. నైట్ ల్యాంప్ వెలుగుతోంది. నా బెడ్ పక్క కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది! కన్నులు నులుముకుని చూశాను. ఓ చిన్నపాప! అయిదేళ్ళు ఉండవచ్చును! తెల్లటి ఫ్రాక్‌లో ఉంది. ఉలికిపడి, ‘‘ఎవరది?’’ అనడిగాను. జవాబు లేదు. రెప్పవేయకుండా నన్నే చూస్తోంది. గోడవైపు తిరిగి స్విచ్ నొక్కడంతో గదిలో ట్యూబ్ లైట్ వెలిగింది. వెనక్కి తిరిగేసరికి పాప అక్కడ లేదు! గతుక్కుమన్నాను. తలగడ పక్కనున్న సెల్ ఫోన్ తీసి ఆన్ చేసి టైమ్ చూశాను. అర్ధరాత్రి కావస్తోంది. నిద్రపోతూన్న నన్ను ఎవరో తట్టిలేపినట్టయి మెలకువ వచ్చింది. ఆ చిన్నారి ఎవరు? ఆ వేళప్పుడు గదిలోకి ఎలా వచ్చింది? అంతలోనే ఎలా అదృశ్యమయింది?... అన్నీ ప్రశ్నలే! జవాబులు దొరకడంలేదు. ఒకవేళ అది కలఅయ్యుంటుందేమోనని చేతి మీద గిల్లుకున్నాను. నొప్పిపుట్టింది. అంటే, అది వాస్తవ చిత్రమేనన్నమాట! భ్రమ కూడా కాదు. బెడ్ దిగి గదంతా చూశాను. ఎవరూ లేరు. గది తలుపులు మూసినవి మూసినట్టే ఉన్నాయి. కిటికీ వద్ద నిలుచుని బయటకు చూశాను. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. దూరంలో ‘జింజీ ఫోర్ట్’ లీలగా కనిపిస్తోంది. మళ్లీ బెడ్ మీద వాలిపోయాను. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడంలేదు. ఆ పసిపాప ఆకారమే కళ్ళ ఎదుట కనిపిస్తోంది. మూసి ఉన్న గదిలోకి ఆ పాప ఎలా వచ్చింది? ఎలా మాయమయింది? అసలు ఆ పాప ఎవరు? మనిషేనా??– ఆ తలంపే ఉలికిపాటుకు గురిచేసింది నన్ను. ఆర్కిటెక్చర్లో పీహెచ్డీ చేస్తున్నాను నేను. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా వివిధ ప్రాచీన దుర్గాలు, కోటలను దర్శించి వాటి ఆర్కిటెక్చర్‌ని అధ్యయనం చేసి థీసిస్ రాయాల్సి ఉంది. ఆ పనిమీదే రెండు రోజుల క్రితం తమిళనాడులో విల్లుపురం జిల్లాలో ఉన్న ‘జింజీ ఫోర్ట్’కి వచ్చాను. సమీపంలో ఉన్న ‘సెంజి’ టౌన్ ని బట్టి దాన్ని ‘సెంజీ ఫోర్ట్’ అని వ్యవహరించడం కూడా కద్దు. ఫోర్ట్ దిగువను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన వసతిగృహం ఉంది. అలనాటి రాజదుర్గానికి చెందిన పురాతన కట్టడం అది. కొద్ది మార్పులతో టూర్స్‌లో వచ్చే డిపార్ట్మెంట్ సిబ్బందికి బసగా మార్చబడింది. రెండే రెండు పోర్షన్స్ నివాసయోగ్యంగా ఉన్నాయి. ఒక్కో పోర్షన్లోనూ రెండు గదులు, ఓ హాలూ ఉన్నాయి. ఆ బిల్డింగ్ వెనుకనున్న గదిలో వుండే ముసలి వాచ్‌మేన్ దాన్ని కనిపెట్టుకుని వుంటాడు. అతని కుటుంబం గ్రామంలో ఉండడం వల్ల ఒంటరిగానే ఉంటున్నాడు. ఇటీవలి కాలంలో అక్కడ దిగకుండా సమీపంలో ఉన్న ‘తిండివనం’ టౌన్‌లోని హోటల్స్‌లో బసచేయనారంభించారట డిపార్ట్ మెంట్ సిబ్బంది. హైదరాబాదులో బైలుదేరినప్పుడే అక్కడ బసచేయడానికి ఆ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి సంపాదించాను. కనీసం రెండు వారాల పాటైనా అక్కడ ఉండవలసివస్తుంది. వాచ్‌మేన్‌కి డబ్బులు ఇచ్చి మూడు పూటలా వండిపెట్టేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. ఉదయం లేచి, కాలకృత్యాలు తీర్చుకుంటూంటే రాత్రి సంఘటన మదిలో మెదిలింది. నా మనసంతా ఆశ్చర్యంతో, రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. గబగబా బ్రేక్ ఫాస్ట్ ముగించి ఫోర్ట్ కి బయలుదేరాను. అక్కడ నేను అధ్యయనం చేయవలసినవి పలు అంశాలు ఉన్నాయి. అప్పటికే పర్యాటకుల సందడి మొదలయింది. మెట్లు, రాతిగుట్టలూ అధిరోహించి కోటను చేరుకునేసరికి చాలా సమయం పట్టడమేకాక, అలసట కూడా ఆవరించుకుంది. సాయంత్రం ఐదు గంటలు అయేసరికి కోట ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వుంటుంది. పరిసరాలను పర్యవేక్షిస్తూ, పర్యాటకులతో సంభాషిస్తూ పైకి ఎక్కసాగాను నేను. జింజీ ఫోర్ట్ అద్భుతమైన పురాతన రాజదుర్గం. తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మింపబడ్డ ఓ చిరుదుర్గాన్ని, పదమూడవ శతాబ్దిలో కురుంబార్ మోడిఫై చేయడమూ, అనంతరం పదిహేను–పదహారు శతాబ్దాలలో ‘జింజీ’ నాయక్స్ దాన్ని విస్తరింపజేయడమూ జరిగాయి. మూడు పెద్ద గుట్టల పైన పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ కోటను బ్రిటిష్ వారు ‘ట్రాయ్ ఆఫ్ ద ఈస్ట్’ అని పిలిచేవారు. ఆ హెరిటేజ్ ఫోర్ట్ ప్రస్తుతం – వాతావరణపు ఆటుపోట్లకు గురయి, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా శిథిలావస్థలో రాతిగుట్టల నడుమ రెక్కలు తెగిపడ్డ పక్షిలా మిగిలి ఉంది. కోట భవంతులు పూర్వవైభవాన్ని కోల్పోయినా చూడచక్కగా ఉన్నాయి. గ్రానైట్ స్టోన్, లైమ్ మోర్టార్ ల కలయిక అవి. వాటి ఆర్కిటెక్చరల్ బ్యూటీ ఆకట్టుకుంటూ విస్మయానికి గురిచేస్తుంది. సాయంత్రం వరకూ ఆ శిథిలాలలో తిరుగాడుతూ అవసరమైన నోట్స్ రాసుకుంటూ, వీడియో, ఫొటోలు తీస్తూ గడిపేశాను. బసకు చేరుకుని ఫ్రెషప్ అయి, వాచ్‌మేన్ తాత ఇచ్చిన టీ తాగుతూంటే గతరాత్రి అనుభవాన్ని అతనితో పంచుకుందామా అనిపించింది. అంతలోనే మనసు మార్చుకున్నాను, నవ్విపోతాడేమోనని. ఆ రాత్రి మెలకువగా ఉండి ఆ పాప మళ్ళీ వస్తుందేమో చూడాలనుకున్నాను. కానీ, రోజంతా అలసిసొలసి ఉండడంతో మంచం ఎక్కగానే గాఢంగా నిద్రపట్టేసింది. ఆ రాత్రి పాప వచ్చిందో లేదో తెలియదుగానీ, నాకు మాత్రం అసలు మెలకువే రాలేదు. అయితే, ఆ మర్నాటి రాత్రి మళ్ళీ మెలకువ వచ్చేసింది. ఎవరో కాలు పట్టుకుని కదుపుతున్నట్టయి కళ్లు తెరచాను. అదే పాప! తెల్లటి ఫ్రాక్ లో. కాళ్ళ దగ్గర. నన్నే చూస్తోంది. అయితే, నేను ట్యూబ్ లైట్ వెలిగించేసరికి అదృశ్యమయిపోయింది! మూసి ఉన్న గదిలోకి ఆ చిన్నారి ఎలా వస్తోంది? ఎలా మాయమవుతోంది?... నాలో అయోమయం అధికమయింది. మర్నాడూ అదే అనుభవం! ఆ రోజు సాయంత్రం నేను ఫోర్ట్ నుంచి తిరిగివచ్చేసరికి వాచ్ మేన్ కూతురట – నలభయ్యేళ్ళ స్త్రీ. పేరు కర్పగం అట. నాకు ఎదురువచ్చింది. ‘‘ఇంద గెస్ట్ హౌస్ లో ఇరకరది నీంగె దానా?’’ (ఈ గెస్ట్ హౌస్ లో ఉంటున్నది మీరేనా?) అనడిగింది అరవంలో. తమిళం కొంతవరకు అర్థంచేసుకోగలను నేను. ఔనన్నాను. పేరు అడిగితే చెప్పాను. ‘‘ఇంద కోటత్తిలే పేయి ఇరుకుదని సొల్లువాంగ. ఉన్నోడె వేలై శీఘ్రమా ముడుచికిటు పోయిడు. అంద తొల్లై నమ్మకెన్నదుకు!’’ (ఈ కోటలో దయ్యాలు ఉన్నాయంటారు. నీ పని త్వరగా పూర్తిచేసుకుని వెళ్ళిపో. ఆ గొడవ మనకెందుకు!) అంది. ఆమె ‘కోటలో దయ్యాలు’ అనేసరికి నా గుండె గతుక్కుమంది. ‘నా గదిలో కనిపించేది దయ్యమా!? కోట నుంచి నన్ను వెన్నంటి వచ్చిందా??’ అన్న తలంపు హఠాత్తుగా మదిని తాకడంతో గుండె ఝల్లుమంది. ఆ రాత్రి పడుకుంటే అదే ఆలోచన మదిని తొలిచేస్తూంటే నిద్ర పట్టలేదు. ఏదో తెలియని భయం కమ్ముకుంది. నిజానికి దయ్యాలు, భూతాల ఉనికి పట్ల నాకు నమ్మకంలేదు. అదంతా పురాతన కాలపు ఫాంటసీ అని నా అభిప్రాయం. అయితే, నాలుగు రోజులుగా అవుతూన్న నా అనుభవానికి సంజాయిషీ ఏమిటి? పగటివేళ కోటలో తిరుగుతూ నోట్స్ రాసుకుంటూ బిజీగా ఉన్నా, మధ్యలో ఆ చిన్నారి గుర్తుకు రాకమానడంలేదు. కోటలో దయ్యాలు తిరగడం గురించి ఫోర్ట్ వాచ్‌మేన్‌ని కదిపాను. అది నిజమేననీ, నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాటిని చూస్తాననీ చెప్పాడు. వాళ్ళు చెబుతున్నది నిజమైతే, ‘కోటలోని దయ్యాలు గెస్ట్ హౌస్ వరకు వస్తాయా!?’. ఆ సంగతి ఏమిటో తేల్చుకోవాలన్న పట్టుదల కలిగింది నాలో. ఆ రోజు రాత్రి –మనిషి పడుకున్నట్టు తలగడలను పక్కమీద పేర్చి పైన దుప్పటి కప్పేసాను. నైట్ ల్యాంప్ వెలిగించి, మంచం పక్కన దాక్కున్నాను. అర్ధరాత్రి అయేసరికి – ఆ ‘లిటిల్ డెవిల్’ బెడ్ దగ్గర ప్రత్యక్షమయింది. దీక్షగా బెడ్ మీది శాల్తీ వంక చూసింది. తరువాత తన బుల్లి చేత్తో మెల్లగా కుదిపింది. అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టుంది, కప్పిన దుప్పటిని లాగేసింది. మంచం మీద ఉన్నది మనిషి కాదని తెలియడంతో అక్కణ్ణుంచి వెళ్ళిపోబోయింది. చటుక్కున బయటకు వచ్చి ఆ చిన్నారి చేయి పట్టుకున్నాను. ‘‘ఎవరు నువ్వు? మనిషివా, దయ్యానివా?’’ అనడిగాను. ఏడుపు లంకించుకుంది ఆ పిల్ల, ‘‘నాన్ పేయి ఇల్లే, అక్కా!’’ అని అరవంలో అంటూ. ట్యూబ్ లైట్ వేసి, బెడ్ మీద నా పక్కన కూర్చోబెట్టుకుని దాని ఏడ్పు ఆపడానికి ప్రయత్నించాను. బిస్కెట్స్ ఇచ్చి తినమన్నాను. కుదుటపడ్డాక ఆ పిల్ల చెబుతూన్న సంగతులు వింటూంటే నా బుర్ర గిర్రున తిరిగిపోయింది. ఆ చిన్నారి పేరు జయంతి. మదురైకి చెందిన అరవపిల్ల. యూకేజీ చదువుతోంది. బయట ఆడుకుంటూంటే ఎవరో ‘ఆంటీ’ ఐస్ క్రీమ్ ఇప్పిస్తానంటూ తీసుకువెళ్ళి, ఎత్తుకువచ్చేసింది. ఆ బిల్డింగులో నేలమాళిగలో ఉన్న ఓ గదిలో బంధించి ఉంచింది. తనలాంటి పిల్లలు మరికొందరు ఉన్నారక్కడ. ఓ పురుషుడు, స్త్రీ రోజూ రాత్రివేళ వచ్చి తమకు చాలీచాలని తిండి పెట్టి వెళ్ళిపోతారు. అమ్మనాన్నలు కావాలని ఏడిస్తే కొడతారు. తాము అక్కడ ఎన్ని రోజులుగా ఉన్నారో ఆ పిల్లలకు తెలియదు. ‘జయంతి స్మార్ట్ గాళ్. పిల్లలందరూ పడుకున్నాక నేలమాళిగను పరిశీలిస్తూంటే, గోడలో ఉన్న రహస్యపు మీట చేతికి తగలడమూ, అక్కడ ఉన్న రహస్యమార్గం తెరచుకోవడమూ జరిగాయి. ఆ మెట్లగుండా ధైర్యంగా పైకి వెళ్ళిందా పిల్ల. పైన ద్వారం వద్ద కప్పబడి ఉన్న డోర్ మ్యాట్ ని ఎలాగో తొలగించి గదిలో ప్రవేశించింది. అది నేను ఉన్న గదే కావడం విశేషం. నిద్రిస్తూన్న నా వద్దకు వచ్చి, నన్ను లేపాలనీ, బూచోళ్ళ గురించి చెప్పాలనీ అనుకునేది. కానీ, నేను కూడా వాళ్ళ మనిషినేమోనన్న భయంతో పారిపోతోంది. పూర్వం రాజుల కాలంలో సెక్యూరిటీ కోసం ప్రతి కట్టడంలోనూ ఓ రహస్యమార్గాన్ని ఏర్పాటుచేసుకోవడం కద్దు. ఆ రహస్యమార్గం గురించి ఎవరికీ తెలిసినట్టులేదు. నన్ను నా పోర్షన్లోని యాంటీరూమ్కి తీసుకువెళ్ళింది జయంతి. ఆ గదిలో ఓ పెద్ద, పాత చెక్కబీరువా ఉంది. అందులో సామాన్లు పెట్టుకోవడమే తప్ప దాని వెనుకపక్క ఎప్పుడూ చూళ్ళేదు నేను. బీరువాకీ, గోడకూ మధ్య తగినంత ఖాళీస్థలం ఉంది. అక్కడ ఓ డోర్ మ్యాటూ, దాని క్రింద రహస్యమార్గమూ కనిపించాయి! జయంతిని తీసుకుని సెల్ ఫోన్ టార్చ్ సాయంతో ఆ ఇరుకు మార్గం గుండా క్రిందకు దిగాను. నేలమాళిగలోని ఆ హాల్లో నేలపైన పరచియున్న జంబుఖానా మీద పడుకుని నిద్రపోతున్నారు సుమారు డజనుమంది చిన్నారులు. బాలబాలికలు – రెండు నుండి ఎనిమిదేళ్ళ వయసులవాళ్ళు అంతా. ఓ మూలగా బాత్ రూమ్ ఉంది. చెక్కస్టాండు పైన పిల్లల బట్టలు, తువాళ్ళూ ఉన్నాయి. ఓ బల్ల మీద ఏవో తినుబండారాలు ఉన్నాయి. హాల్లోంచి ఉన్న సన్నటి నడవా ఓ చిన్న గదికి దారితీసింది. ఆ గదిలో ఓ మూల చెక్కబీరువా, రెండు మడతమంచాలూ తప్ప ఇంకేమీ లేవు. ఆ గదికి తలుపు ఉంది. అది బైటనుండి మూసివున్నట్టు తెలుస్తోంది. ‘బూచోళ్ళు’ ఆ గదిలోంచే వచ్చి వెళతారని చెప్పింది జయంతి. అలికిడికి నిద్రలేచిన పిల్లలు నన్ను చూసి భయంతో ఏడుపు లంకించుకున్నారు. అందరూ అరవపిల్లలే. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి ఎత్తుకురాబడ్డవాళ్ళు. వారిని సముదాయించి, భయం పోగొట్టి, నా గదికి చేర్చాను. అమ్మనాన్నల దగ్గరకు చేర్చుతానని చెప్పడంతో వారి వదనాలు వెలిగిపోయాయి. నాదగ్గర ఉన్న బిస్కెట్స్, బ్రెడ్, పళ్ళూ ఇస్తే ఆవురావురుమంటూ తిని మంచినీళ్ళు తాగారు. వాళ్ళను పడుకోమని చెప్పి, ‘హండ్రెడ్’ కి ఫోన్ చేసి పోలీసులను ఎలర్ట్ చేసాను. పోలీసులు వెంటనే వచ్చి వాచ్ మేన్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ’కొన్ని నెలల క్రితం ఓ దంపతులు వచ్చి తనతో పరిచయం చేసుకున్నారనీ, పైన ఫోర్ట్‌లో ఏదో పనిచేస్తున్నట్టు చెప్పారనీ, వచ్చినపుడల్లా డ్రింక్ బాటిల్స్ తెచ్చిచ్చి తనచేత బాగా తాగించేవారనీ, అంతకు మించి తాను ఏ పాపమూ ఎరుగననీ’ చెప్పాడు అతను. నేలమాళిగ సంగతి తాను ఎరుగననీ, వెనుకపక్క పాడుబడ్డ తలుపుకు ఎప్పట్నుంచో తాళంకప్ప వ్రేలాడుతుంటుందనీ, దాని విషయం తాను ఎన్నడూ పట్టించుకోలేదనీ అన్నాడు. పిల్లల్ని నా గదిలోనే ఉంచి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కిడ్నాపర్స్ కోసం నేలమాళిగలో ఓ రోజంతా మాటువేసారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి తాళం తెరచి లోపల ప్రవేశించిన ‘దంపతులను’ పట్టుకున్నారు. నలభైలలో ఉంటారు ఇద్దరూ. భార్యాభర్తలేనని తెలిపారు. మొదట తమకేమీ తెలియదంటూ బుకాయించినా, పోలీసులు తమదైన శైలిలో ఇంటారాగేట్ చేయడంతో నిజం కక్కకతప్పలేదు వాళ్ళు... అంతర్రాష్ట్ర కిడ్నాపర్స్ గ్యాంగ్‌కు అనుబంధంగా పనిచేస్తూన్న తమిళనాడుకు చెందిన గ్యాంగ్ సభ్యులు వాళ్ళు. చిన్నపిల్లలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎత్తుకువచ్చి, పోలీసుల గాలింపు సద్దుమణిగే వరకు అక్కడ దాచి వుంచుతారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా వారిని అక్కణ్ణుంచి తరలించి అంతర్రాష్ట్ర ముఠాకి అప్పగిస్తారు. ఆ దంపతులు ఇచ్చిన సమాచారంతో, పోలీసులు ఆ చిన్నారులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, ఇతర ముఠాసభ్యులను, అంతర్రాష్ట్ర ముఠాకి చెందిన కొందరినీ అరెస్ట్ చేయడమూ జరిగిపోయాయి. చిన్నారి జయంతి ధైర్యసాహసాలను మెచ్చుకుని, ప్రభుత్వం ఆమె పేరును ‘బ్రేవరీ అవార్డ్’కు కేంద్రానికి సిఫారసు చేసింది. ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావమ్మా?’ అనడిగితే, ‘పోలీసునవుతాను’ అంటూ జయంతి తడుముకోకుండా జవాబిచ్చింది. దాంతో, ప్రభుత్వపు ఖర్చుతో ఆ చిన్నారిని చదివించి, పోలీస్ ఆఫీసర్ ని చేస్తామంటూ హోమ్ మినిస్టర్ ప్రకటించారు. డాక్టరేట్‌ని పొందడం కంటే ఎక్కువ ఆనందం కలిగింది నాకు. ‘షి ఈజ్ రియల్లీ ఎ లిటిల్ డెవిల్!’ అనుకున్నాను మురిపెంగా, జయంతిని తలచుకుంటూ. - తిరుమలశ్రీ -
అప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు!
‘‘హాచ్ హాచ్ హాచ్’’ అని తుమ్ముతూనే విక్రమార్కుడిని ఏదో అడగబోతున్నాడు బేతాళుడు. ‘‘మిస్టర్ బేతాళా, తుమ్మి అయినా అడుగు, అడిగాక అయినా తుమ్ము’’ సలహా ఇచ్చాడు విక్రమార్కుడు. ‘‘సరే’’ అంటూ నాన్‌స్టాప్‌గా నలభై తుమ్ములు తుమ్మిన తరువాత ఇలా అడిగాడు బేతాళుడు. ‘‘రాజా, వుప్పుడు నీకో పిట్టకథ చెబుతాను. ఆ తరువాత కొచ్చెన్ అడుగుతాను...ఒకేనా?’’ అడిగాడు బేతాళుడు. ‘‘ఒకే’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘వాటీజ్ దిస్!’’ కోపంగా ఫైల్ గిరాటు వేశాడు లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ టపుకు టపుకు. అది లండన్ తాజా జనాభా వివరాలను తెలియజేసే ఫైల్. ‘‘ఏమైంది సార్?’’ భయంగా అడిగాడు ఉప మేయర్ హారిస్ జర్మీ డలాఢల్. ‘‘డలాఢల్...నీకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? కేవలం రెండు నెలల్లోనే మన లండన్ జనాభా మూడుకోట్లు పెరిగింది?’’ అన్నాడు మేయర్. ‘‘స్వల్పకాలంలో ఇంత అనూహ్యంగా పెరగిపోవడం ఏమిటి? దీనిమీద ఎంక్వైరీ కమిటీ వేయాల్సిందే’’ పట్టుబట్టాడు ఉపమేయర్. ‘‘గుడ్ ఐడియా...ఇప్పుడే వేస్తాను’’ అని ఎంక్వైరీ కమిటీ వేశాడు మేయర్. ‘‘విక్రమార్కా! లండన్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అదే బంకింగ్‌హామ్ ప్యాలెస్, అదే టవర్ ఆఫ్ లండన్, అదే...బిగ్‌బెన్...ఇప్పటికిప్పుడు అనూహ్యంగా వచ్చిన మార్పులేమీ లేవు. మరి కేవలం రెండు నెలల్లో జనాభా ఇంత అనూహ్యంగా పెరగడానికి కారణం ఏమిటి? తెలిసి కూడా జవాబు చెప్పలేక పోయావో నా జలుబు నీకు అంటిస్తాను’’ అని హెచ్చరించాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇవ్విధంబుగా సమాధానం చెప్పాడు... ఇండియా నుంచి పారిపోయిన విజయ్‌మాల్యాకు లండన్‌లో బోర్ కొడుతోంది. మరోవైపు డబ్బులకు కూడా కటకటగా ఉంది. ఒకరోజు వాష్‌రూమ్‌లో అతనికి ఒకచక్కని ఆలోచన వస్తుంది. వెంటనే అద్దం ముందుకు వచ్చి తన భుజం తానే తట్టుకున్నాడు మాల్యా. మరుసటి రోజు లండన్‌లోని బాకర్ స్రీట్‌లో కొత్త స్కూలు ప్రారంభించాడు. ఆ స్కూలు పేరు: ఈజీ బారోయింగ్...ఈజీ ఫ్లైయింగ్. అనుకున్నట్లుగానే ‘ఈఈ’ స్కూల్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండు నెలల్లోనే పన్నెండు స్కూళ్లు స్టార్ట్ చేశారు. తొలిరోజు క్లాసులో మాల్యా పాఠం... ‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులకు నా నమోవాకాలు. చరిత్రలో ఇప్పటి వరకు అప్పు అపహాస్యానికి గురైంది...అవమానానికి గురైంది... అప్పు చేసిన వారిని అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు... ఈ పరిస్థితి మారాలి...అప్పుకు విలువ పెరగాలి... పూజలో కప్పురం ఎంత అవసరమో, మనిషి అభివృద్ధికి కూడా అప్పు అంతే అవసరం... కప్పురం తాను కరుగుతూ వెలుగునిచ్చినట్లే... అప్పు కూడా ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా మనకు వెలుగునిస్తుంది. అందుకే అంటాను...అప్పుకప్పూరంబు నొక్కపోలిక నుండి... ఈ పోలిక భౌతికమైనది కాదు....గుణాలకు సంబంధించినది! ఇప్పుడు చరిత్ర నుంచి కొన్ని పాఠాలు చెబుతాను: హబ్సన్–గాబ్సన్ థియరీ ప్రకారం. అప్పు చేయడం తప్పు కాదు. దివాలా తీయడం అంతకంటే తప్పుకాదు. ఎటొచ్చి దివాలా తీసిన భయం మీ కళ్లలో ఎప్పటికీ కనిపించకూడదు. అవసరమైతే అబద్ధాలతో ఎదుటివారిని దబాయించాలి. ఈస్ట్–ఇండియా గెజిట్ 1816 నోట్ ప్రకారం... అప్పు చేయడం ఆషామాషీ విషయం కాదు. దానికి ప్రత్యేకమైన తెలివితేటలు ఉండాలి. అట్లాంటి వాళ్లను మొనగాళ్లు అందురు. అందులో నేనొకరిని. గ్రీకు బిజినెస్ ఫిలాసఫీ 1915 ప్రకారం లేచిన సముద్రపు అల తప్పనిసరిగా టప్పుమని కిందికి పడాలి. అది ప్రకృతి ధర్మం. నువ్వు ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినప్పటికీ... ఎప్పుడో ఒకప్పుడు దభాల్న కింద పడాల్సిందే... అదే వ్యాపారధర్మం. కాబట్టి ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇటలీ బిజినెస్ రూల్స్ 1678 ప్రకారం..దివాలా తీసిన తరువాత... హడివిడిగా ఎక్కడికంటే అక్కడికి పారిపోకుండా... మనకు అన్నీ అనుకూలంగా ఉన్న దేశానికి పారిపోవాలి. మాల్యా చెబుతున్న పాఠాలను గోడ చాటు నుంచి విన్నారు ఎంక్వైరీ కమిటీ వాళ్లు. సీన్ కట్ చేస్తే.... మేయర్ ఆఫీసు కార్యాలయం. ‘‘సార్...మన లండన్ జనాభా పెరగడానికి విజయ్ మాల్యానే కారణం’’ అని చెప్పాడు ఎంక్వైరీ కమిటీ పెద్ద (హెడ్). ‘‘ఎలా?’’ కళ్లజోడు చేతుల్లోకి తీసుకుంటూ అత్యంత ఆశ్చర్యంగా అడిగాడు మేయర్. ‘‘అప్పులు చేయడం ఎలా? అవలీలగా పారిపోవడం ఎలా?’’ పేరుతో మొదట స్కూల్, ఆ తరువాత యూనివర్శిటీ స్టార్ట్ చేశాడు మాల్యా. ఈ యూనివర్శిటీలో చేరడానికి దేశాదేశాల నుంచి విద్యార్థులు వెల్లువలా వస్తున్నారు...దీంతో మన లండన్ జనాభా....’’ అసలు విషయం చెప్పాడు ఎంక్వేరీ కమిటీ పెబ్బ. ‘‘మిస్టర్ మాల్యా, రెండురోజుల్లో తట్ట అండ్ బుట్ట సర్దుకొని లండన్ విడిచి వెళ్లకపోతే కఠిన కరాగారా శిక్ష విధించబడుతుంది’’ అని హెచ్చరించాడు మేయర్. ఈ విషాదాన్ని తట్టుకోలేక ఆరోజు బార్‌కు వెళ్లాడు మాల్యా. అక్కడ అతనికో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ మాట ఈమాట మాట్లాడుకున్న తరువాత.... ‘‘అక్కడొక విండో కనిపిస్తుంది చూశావా? అది మామూలు విండో కాదు. మ్యాజిక్ విండో’’ అని చెప్పాడు అతడు. ‘‘మ్యాజిక్ విండోనా!’’ ఆశ్చర్యపోయాడు మాల్యా. ‘‘అవును. మూమూలుగా విండోలో నుంచి దూకితే కాళ్లు విరుగుతాయి. ఈ విండో నుంచి దూకితే గాల్లో తేలిపోతాం’’ అని చెప్పాడు అతడు. ‘‘నువ్వేదో తాగివాగుతున్నట్లున్నావు’’ అతడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు మాల్యా. ‘‘అయితే చూడు...’’ అని ఆ వ్యక్తి విండో నుంచి దూకాడు... గాల్లోకి దూసుకుపోయాడు! ‘చూశావా! నా మాటల్ని నమ్మలేదు కదూ’’ అన్నాడు తిరిగివచ్చి. ‘‘ఇదేదో బాగుందే. నేను సైతం దూకుతాను’’ అని దూకాడు మాల్యా. వెంటనే అతడి రెండు కాళ్లు విరిగాయి. మాల్యా తిరిగి లేచి నడిచేంత వరకు లండన్‌లోని ఉండనివ్వాలని కోర్టు తీర్పు ఇచ్చించి. ‘హమ్మయ్య’ అనుకున్నాడు మాల్యా. ‘‘అదిసరే, ఆడు దూకితే గాల్లో తేలిపోవడం ఏమిటి? ఈడు దూకితే కాళ్లు విరగడం ఏమిటి? ఇంతకీ ఆడు ఎవడు?’’ అడిగాడు బేతాళుడు. ‘‘సూపర్‌మేన్’’ చెప్పాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
మా సీన్మా ఎందుకు ఆడలేదంటే..
‘‘మీ సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. తీరా చూస్తే తుస్సుమనిపించింది. రిలీజ్‌కు ముందు... రికార్డ్‌లు తిరగరాస్తుంది అన్నారు! అలా జరగలేదు సరికదా... సినిమా చరిత్రలోనే అత్యంత తక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలబడింది మీ సినిమా. ఇలా ఎలా జరిగింది?!’’ ‘‘గుడ్ క్వశ్చనండీ. కథ విషయానికి వస్తే... చాలా గొప్ప కథండీ. ఆ కథ రాసినందుకు నేను ఇప్పటికీ గర్వంగా ఫీలవుతాను. ఈ కథ కోసం మూడున్నర సంవత్సరాలు వెచ్చించాను. ఫైనల్ వెర్షన్ కోసం ఆఫ్రికాలోని ఏకో మాకో డురుకు డురుకు ఐలాండ్‌కు వెళ్లాను. కథ విషయానికి వస్తే బ్రహ్మాండమైన కథ... ఎటొచ్చి హీరోగారి ఇమేజ్ కథకు అడ్డుతగిలింది. ఉదాహరణకు కొన్ని సీన్లు చెబుతాను... హీరోగారికి జలుబు చేసి హీరోయిన్ ముందు హాచ్ హాచ్... అని తుమ్మతుంటాడు. ‘‘అసలు హీరో తుమ్మడమేమిటి?’’ అనే నెగెటివ్ ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో వచ్చిందండి. ఎంతైనా హీరో అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదండీ! ముందు ఈ సీన్‌ను మేము వేరేలా ప్లాన్ చేసుకున్నాం... వర్షంలో హీరో బాగా తడుస్తాడు. జలుబు ఎటాక్ అవుతుంది. అప్పుడే హీరోగారిని విలన్లు చుట్టుముట్టి ‘హ్హా హ్హా....’ అని గట్టిగా నవ్వుతారు. ‘‘రేయ్... ఇప్పుడు నీ దగ్గర చిన్న వెపన్ కూడా లేదు’’ అని తమ దగ్గర ఉన్న గన్స్ తీస్తారు విలన్లు. అప్పుడు– వాళ్ల కంటే పెద్దగా నవ్వి సడన్‌గా ఆపి... ‘‘నా దగ్గర మీ అందరికంటే పెద్ద వెపన్ ఉంది’’ అంటాడు హీరో. ‘‘ఏమిటది?’’ షాకై పోతూ అడుగుతారు విలన్లు. ‘‘జలుబు’’ అంటాడు హీరో. విలన్లు ఆశ్చర్యంలో నుంచి తేరుకునేలోపే... ‘హాచ్ హాచ్’ అని గట్టిగా తుమ్ముతాడు హీరో... అంతే అతని ముక్కులో నుంచి ముప్పై బుల్లెట్లు ఏకధాటిగా వచ్చి విలన్లను మట్టి కరిపిస్తాయి. ఈ సీన్ ఉండి ఉంటే బయర్స్ సేఫ్ అయ్యేవారు. కాని సహజత్వం కోసం ప్రయత్నించాం... అది మిస్ ఫైర్ అయ్యింది. ఒక డైరెక్టర్‌గా నేను నమ్మేదేమిటంటే... సినిమా టైటిల్ చూడగానే దానిలో మస్క్యులర్ స్ట్రెంత్ కనిపించాలి. అందుకే బాగా ఆలోచించి ‘పులి చిరుతపులి సింహం ఏనుగు మొసలి’ అని మా సినిమాకు పేరు పెట్టాను. ఇవన్నీ కూడా బలానికి ప్రతీకలు... హీరోగారిని దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ పెట్టడం జరిగింది. కాని... ప్రేక్షక మహాశయులు ఇదో జంతువుల సినిమా అనుకున్నారు. ‘పోట్టర్ మీదో పులి చింహం ముచలి అని రాశారు. సినిమాలో మాత్తరం సీతాకోకచిలక కూడా లేదు’ అని అసంతృప్తికి గురయ్యారు చాలామంది. ఈ విషయంలో ప్రేక్షక మహాశయులకు క్షమాపణ కోరుతున్నాను. హీరో కంట్లో చింతనిప్పులు తప్ప... చిన్న కన్నీటి చుక్కయినా కనిపించరాదు అనేది యాజ్ ఏ డైరెక్టర్‌గా నా ఒపీనియన్ అండీ... అందుకే మా సినిమాలో ఎంత విషాదానికైనా హీరో నవ్వుతూనే ఉంటాడు. ఇక్కడ కూడా కాస్త మిసండర్‌స్టాండింగ్ జరిగిందండీ... హీరోకి పిచ్చేమో అనుకున్నారు ప్రేక్షకమహాశయులు. మా సినిమా ఫ్లాప్ కావడానికి మరో రీజన్ సెన్సార్ వాళ్లు. రొటీన్ సినిమాల్లో అయితే హీరో వైన్‌షాప్‌కు వెళ్లి ‘‘మందు బాటిల్ కావాలి’’ అంటాడు. అలా కాకుండా మా సినిమాలో ‘‘వైన్‌షాప్ కావాలి’’ అంటాడు. ఎందుకు?!!!!!!! అని తెల్లబోతాడు షాప్ఓనర్. ‘మందుకొట్టడానికి’ అంటూ కోటిరూపాయల కట్టను ఓనర్ ముఖం మీద వేసి... కేవలం గంటలో వైన్‌షాప్‌లో ఉన్న బాటిల్స్‌ను చుక్క లేకుండా ఖాళీ చేస్తాడు. ఈ సీన్‌కు పెద్ద అప్లాజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. కాని సెన్సార్ వాళ్లు లేపేశారు! ∙‘కోటి రూపాయల పాట’ అంటుంటారు చూడండి... అలాగే మా సినిమాలోనూ ‘కోటి రూపాయల సీన్’ ఉంది. లెన్త్ సమస్య వల్ల, చెప్పలేని ఇతర కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సీన్ లేపేయాల్సి వచ్చింది. ఈ సీన్ ఉండి ఉంటే సినిమా కచ్చితంగా నిలబడి ఉండేది. ఇంతకీ ఆ సీన్ ఏమిటంటారా... విలన్ కోసం హీరో భూమి నలుచెరగులా భూతద్దం వేసి వెదుకుతుంటాడు. ఈలోపు హీరోకి ఆకాశరామన్న ఫోన్ వస్తుంది. ‘‘ఆడి కోసం వెదకాల్సింది ఇండియాలో కాదు ఈజిప్ట్‌లో.. ఇట్లు మీ శ్రేయోభిలాషి, ఆ నలుగురు’’ అని ఫోన్ పెట్టేస్తాడు ఆ ఆకాశరామన్న. వెంటనే హీరోగారు ‘ఇండియా టు ఈజిప్ట్’ విమానం ఎక్కేస్తాడు. ‘ఇక విలన్‌గాడి పని క్లోజ్’ అనుకుంటారు ప్రేక్షకమహాశయులు. ఈలోపు పెద్ద ట్విస్ట్. ఆకాశంలో విమానం కుప్పకూలిపోతుంది. మంటలు! విశ్రాంతి కార్డు పడుతుంది. సెకండాఫ్‌లో.... అంత పెద్ద ప్రమాదంలో విమానం డ్రైవరు, క్లీనర్‌తో సహా ప్రయాణికులందరూ సచ్చిపోతారండి... ఒకే ఒక్కడు మిగులుతాడండీ... ఆడే మన హీరో. ప్రమాదాన్ని ఊహించిన హీరోగారు తన తల కింద ఉన్న ఎయిర్ దిండు సహాయంతో డఫామని కిందికి దూకేస్తాడండీ... ఈయన ఎక్కడ పడతాడో తెలుసునటండీ? సరాసరి వెళ్లి నైలునదిలోని ఒక పడవలో! ఆ పడవలో ఎవరు ఉంటారో తెలుసునటండీ... హీరో ఎంతో కాలంగా వెదుకుతున్న విలన్!! ఈ సీన్‌కి ఎన్ని వీలలు, చప్పట్లు పడేవో!! సినిమా ఏ రేంజ్లో హిట్టయ్యేదో!... ఈ సీన్లు సినిమాలో లేకపోవడానికి ఆ పొడ్యూసర్ బామ్మర్దే కారణమండీ... స్టోరీ డిస్కషన్లో కూర్చున్న రోజు నుండి తలకు మాసిన డౌట్లు అడుగుతూనే ఉన్నాడు. అతడే బంగారంలాంటి ఈ సీన్లు లేకుండా చేశాడు. ఇక ముందు నేను ఎవరి మాట వినదల్చుకోలేదు. ఎవరి ఒత్తిడికి లోనుకాదల్చుకోలేదు. ఇక నుండి నా సినిమాకు నేనే ప్రొడ్యూసర్. గుర్తుంచుకోండి... నా సినిమా చరిత్రను రీరైట్ చేస్తుంది. రికార్డులు బ్రేక్ చేస్తుంది. సినిమా పేరు కూడా ఇప్పుడే ఎనౌన్స్ చేస్తున్నాను... ‘నా సినిమా చూడకపోయారో...’ ట్యాగ్‌లైన్: ఇది బెదిరింపు కాదు అర్థింపు. – యాకుబ్ పాషా -
రైటర్ కాపీరోవా ఆండ్రూ కథనం ప్రకారం..
‘‘ఏమయ్యా రైటరు!.. ఏ సినిమా చూశావూ... ఏ కథ రాశావూ?’’ అడిగాడు దున్నపోతు రత్తయ్య. నిజానికి ఆయన ఇంటి పేరు ‘దున్నపోతు’ కాదు. నిర్మాతగా ఆయన మొదటి సినిమా ‘దున్నపోతు’. దీంతో ‘దున్నపోతు రతయ్య’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం రైటర్ కాపీరోవా ఆండ్రూ నికోల్ గురించి చెప్పుకుందాం... పేరు చూసి కాఫీ పొడిలో కాలెయ్యవద్దు. వీరు పదహారణాల ఆంధ్రులు. వీరి స్వగ్రామం మండపేట తాలూకలోని లింగపేట. వీరి అసలు పేరు మల్లెల డొల్లయ్య. పై చదువుల కోసం తల్లిదండ్రులు పట్నానికి పంపిస్తే... తెలుగు సినిమా చరిత్రను తిరగరాయాలనే కసితో కాలేజీ ఎగ్గొట్టేవాడు. ప్రతి తాజా సినిమా చూసి విశ్లేషించేవాడు. ‘‘ఆడు అలా తీశాడు కాని... నేను డైరెక్టర్ అయితే ఇలా తీసేవాడిని’’ అని కొత్త స్క్రీన్‌ప్లే చెప్పేవాడు. ‘‘డైరెక్టర్ కావడం అంత వీజీ కాదు... ముందు రైటర్ అవ్వు. ఒక్క సినిమా హిట్ అయినా చాలు డైరెక్టరై పోవచ్చు’’ అని ఎవరో సలహా ఇచ్చారు. ‘‘నా జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు... రైటర్ ఎలా అవుతాను?’’ సమంజసమైన డౌటు అడిగాడు డొల్లయ్య. ‘‘రైటర్ కావడానికి చదవాల్సింది పుస్తకాలు కాదు... చూడాల్సింది యూట్యూట్‌లో సినిమాలు’’ అని సలహా ఇచ్చాడు హితుడు. అలా డొల్లయ్య చూడని సినిమా లేదు. హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలు అన్నిటినీ కంటితో నమిలి మింగేశాడు. న్యూమరాలజిస్ట్ సలహాతో తన పేరును ‘కాపీరోవా ఆండ్రూ నికోల్’గా మార్చుకున్నాడు. ‘‘సార్ మొన్న క్రిమినల్ సినిమా చూసి... కొత్త కథ తయారుచేశానండీ...’’ అని గొంతు సవరించాడు కాపీరోవా ఆండ్రూ నికోల్. ‘‘తెలుగు సినిమా చూసి ఏం కాపీ కొట్టావయ్యా బాబు!’’ ఆశ్చర్యంగా అడిగాడు దున్నపోతు రత్తయ్య. ‘‘నేను చూసింది నాగార్జున, మనీష కోయిరాలా, మహేష్భట్టు క్రిమినల్ కాదండీ! అమెరికన్ యాక్షన్ థ్రిల్లరండీ’’ అన్నాడు అరనవ్వుతో నికోల్.. ‘‘అందులో ఏం దొబ్బేశావు?’’ ఆసక్తిగా అడిగాడు దున్నపోతు. ‘‘ఒక బ్రెయిన్ నుంచి మరొక బ్రెయిన్‌కు మెమొరీస్ ట్రాన్స్ఫర్ చేయడం’’ అని కథ చెప్పడం మొదలుపెట్టాడు కాపీరోవా ఆండ్రూ నికోల్. మన సినిమాలో హీరో పేరు అప్పారావు. పీయంపీ డాక్టరండీ. ఒక్క పేషెంట్‌గా కూడా ఈయన క్లీనిక్‌కు రారండి. ఈ డిప్రెషన్లో సైంటిస్టుగా మారి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అలా చేస్తున్న క్రమంలో ‘క్రిమినల్’ సినిమాలో డా.ఫ్రాంక్లాగా మెమోరీ ట్రాన్స్ఫర్ ఫార్ములా కనుగొంటాడు. అంతే... మన అప్పారావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ ఫార్ములా కోసం వేలంపాట మొదలవుతుంది. ఈ వేలంపాటలో ‘శ్రీకాఠిన్య’ అనే విద్యాసంస్థ అత్యధికంగా డబ్బు చెల్లించి ఈ ఫార్ములాను సొంతం చేసుకుంటుంది. ఇక్కడ మనం ‘శ్రీకాఠిన్య’ గురించి చెప్పుకోవాలి. ‘చావో రేవో ర్యాంకో’ (సీఆర్ఆర్) అనే కొత్త విద్యాసంస్థ ధాటికి ‘శ్రీకాఠిన్య’ ప్రాభవం తగ్గిపోయింది. చదువు విషయంలో ‘సీఆర్ఆర్’ ఎంత స్ట్రిక్ట్ అంటే... ఏ విద్యార్థి అయినా సరిగ్గా చదవకపోతే ఒక గదిలో వేసి కొన్ని తెలుగు సీరియల్స్ చూపించి శిక్షించేవాళ్లు. అందుకే తమ పిల్లల్ని ఎక్కడో చూసుకోవాలని కలలు కనే పేరెంట్స్ ‘ఇక్కడైతేనే బాగుంటుంది’ అని ‘చావో రేవో ర్యాంకో’లో చేర్పించడం ప్రారంభించారు. ఈ దెబ్బకు ‘శ్రీకాఠిన్య’ దివాలా తీసింది. తమ విద్యాసంస్థలను కోళ్లఫామ్లుగా మార్చాలనుకుంటున్న సమయంలో అనుకోని వరం దొరికింది ‘శ్రీకాఠిన్య’కు! అదే మెమొరీ ట్రాన్స్ఫర్!! ‘‘సార్... సిగరెట్ తాగి మిగతా కథ కంటిన్యూ చేస్తాను’’ అని సిగరెట్ ముట్టించాడు రైటర్. ‘‘నాకో డౌటు... అసలే శ్రీకాఠిన్య వాడు దివాలా తీశాడు. ఉప్పుడు ఈ ఫార్ములాతో ఆడేం చేసుకోగలడు?’’ డౌటు అడిగాడు దున్నపోతు రత్తయ్య. ‘‘మంచి డౌటు అడిగారు. ఇంటర్వెల్లో ప్రేక్షకులు దీని గురించే ఆలోచిస్తూ టీలు తాగుతూ, సిగరెట్లు కాలుస్తుంటారు. కథ ఎప్పుడూ సాఫీగా సాగవద్దని మా గురువుగారు చెబుతుంటారు. ప్రేక్షక మహాశయుడు వీలైనంత ఎక్కువగా జట్టు పీక్కునేలా చేయాలట! ఇది కూడా అలాంటి మెలికే! మళ్లీ కథలోకి వద్దాం... ఫార్ములా చేజిక్కించుకున్న వెంటనే పెద్ద ప్రకటన ఇస్తుంది శ్రీకాఠిన్య... ‘‘పేరెంట్స్ మహాశయులకు... నా పిల్లాడు డాక్టర్ కావాలి... ఇంజనీర్ కావాలని ఎవరికి మాత్రం ఉండదు? కలలు ఊరకే రావు. మన కష్టాల్లో నుంచే వస్తాయి. మనలాగా పిల్లలు కష్టపడవద్దనేది ఆ కల. ఆ కలను నిజం చేసుకోవడానికి... మా విద్యాసంస్థలో చేర్పించండి. అవును. మీ డౌటు మాకు అర్థమైంది. ‘మా వాడు చదువులో దద్దమ్మండీ... మా వాడు టెన్త్‌లోనే అత్తెసరు మార్కులతో పాసయ్యాడు... మావాడు చదువు అనే మాట వినగానే పారిపోతున్నాడు... ఇంకా డాక్టరేం అవుతాడు? ఇంజనీర్ ఏం అవుతాడు... మా బొంద!’ అనే కదా మీ డౌటు! ఇవి పాతరోజులు కావండి. కొత్త టెక్నాలజీ వచ్చిన కొత్తరోజులు. మీ వాడు చదువులో రత్నమా? రాయా? అనేది మాకు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయిని మా కాలేజీలో చేర్పించడమే. అంతే... మీ అబ్బాయిని డాక్టర్నో, ఇంజనీర్నో చేసి మీ చేతిలో పెడతాం. రండి... గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి’’ అంతే...‘శ్రీకాఠిన్య’ కాలేజీలో పుంఖానుపుంఖాలుగా విద్యార్థులు చేరారు. చదువులో వెనకబడినవాడా, ముందు పడినవాడా? అనేదానితో సంబంధం లేకుండా అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు’’ అని కథ ముగించాడు రైటర్ నికోల్. ‘‘హౌ?’’ ఆశ్చర్యంగా అడిగాడు రత్తయ్య. ‘‘ఏం లేదండీ... పరీక్షలకు ఒక రోజు ముందు చదువులో వెనకబడిన విద్యార్థులకు బాగా చదివే విద్యార్థుల మెమొరీస్‌ను ట్రాన్స్ఫర్ చేస్తారు. దీంతో జీరో విద్యార్థి సైతం హీరోలా ఆన్సర్పేపర్ రాసి ర్యాంకు తెచ్చుకుంటాడు’’ అసలు విషయం చెప్పాడు రైటర్ నికోలస్. – యాకుబ్ పాషా -
వీరికి అక్కడ ఏం పని?!
శ్రీహరి కోట నుంచి మార్క్–3 రాకెట్ ద్వారా చ్రందయాన్–2 యాత్ర మొదలైన విషయం మీకు తెలిసిందే. సరిగ్గా కొన్ని నెలల తరువాత... రాకెట్ నుంచి విడిపోయిన ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో సెటిలైపోయింది. చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేస్తూ పుంఖాను పుంఖాలుగా ఫొటోలు పంపుతోంది ఆర్బిటర్. నీటిజాడలు, కొన్ని రసాయనాల ఫొటోలు, హీలియం వనరుల ఆనవాలు కనిపెట్టిన ఫొటోలు... ఒక్కటా రెండా... పరంపరగా వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫొటోని వేయికళ్లతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇస్రో సైంటిస్టులు. అలా చూస్తున్న క్రమంలో ఒక ఫొటోని చూసి షాక్ తిన్నారు! సదరు ఆ ఫొటోలో రామ్‌గోపాల్‌వర్మ–కెఏ పాల్ ఎదురుబొదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు!! ‘నిజమా, భ్రమా’ అని ఆ ఫొటోని మళ్లీ మళ్లీ పరిశీలించారు. అక్షరాల నిజమే! ‘‘విక్రమార్కా! ఇంత టఫ్ కొచ్చెన్ నీ లైఫ్టైమ్లోనే ఫేస్ చేసి ఉండవు. ఇప్పుడు చెప్పు...చంద్రమండలం నుంచి ఆర్బిటర్ పంపిన ఫొటోలో రామ్‌గోపాల్‌వర్మ–పాల్లు ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్నకు తెలిసికూడా ఆన్సర్ చెప్పలేకపోయావో...’’ అని హెచ్చరించాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇవ్విధంబుగా సమాధానం చెప్పాడు. ‘‘బేతాళా! నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ పరమ తిక్కలోడని ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలానికి తెలిసిందే. ఈ తిక్కలోడు ఒకసారి తన డాబాపై మందుకొడుతూ, ధాబాలో తెప్పించిన స్పెషల్ చికెన్ నంజుకుంటూ, టీవీలో వస్తున్న ‘కలవారి కోడలు కలికి కామక్షి’ ఎపిసోడ్ నెంబర్–16497 చూస్తూ, టీవీలో ప్రకటనలు వచ్చినప్పుడు అలా చంద్రుడి వైపు చూస్తున్నాడు... అలా చంద్రుడి వైపు చూస్తున్నప్పుడు అతడికి మెరుపులాంటి ఐడియా వచ్చింది. ‘‘టీవీ చానళ్లన్నీ భూమి మీదే ఉన్నాయి. పాపం చంద్రుడిపై ఒక్క టీవీ చానల్ కూడా లేదు. చంద్రుడిపై టీవీ చానల్ మనమే స్టార్ట్ చేద్దాం. మన చానల్ పేరు ‘మూన్‌మూన్‌సేన్’. చంద్రుడిపై తొలి టీవీ చానల్ పెట్టిన దేశంగా నార్త్ కొరియా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి’’ అని చుట్ట వెలిగించాడు. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు. ‘యంయంయస్’ చానల్ కోసం ‘ఖబడ్డార్...నువ్వా నేనా?’ అనే పోగ్రాంను డిజైన్ చేశాడు క్రియేటివ్ హెడ్ కిట్టప్ప సుంగ్ మిన్ జిన్ సూ. ఈ పోగ్రాం కాన్సెప్ట్ ఏందంటే... ఒక టాపిక్‌పై ఇద్దరు వ్యక్తులు భయంకరంగా వాదులాడుకోవాలి. ఆ ఇద్దరూ ఎవరా? అని ప్రపంచం మొత్తం జల్లెడ పట్టి వెదికారు. చివరికి ఇద్దరి పేర్లు ఫైనల్ అయ్యాయి. ఆ ఇద్దరే రామ్‌గోపాల్ వర్మ, పాల్! ‘కేఎన్ఎన్’ (ఖబడ్డార్...నువ్వా నేనా?) కోసం చంద్రమండలపై బ్రహ్మాండమైన సెట్ వేయించారు. చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ కాబట్టి ఇద్దరి బరువుకు రెట్టింపు బరువైన కోట్లు వేయించారు. రెండు భారీ సింహాసనాలను తయారు చేయించి రామ్‌గోపాల్‌వర్మ–పాల్లను ఎదురుబొదురుగా కూర్చోబెట్టారు. చంద్రుడి మీద గాలి ఉండదు కాబట్టి ఇద్దరికీ వంద చొప్పున విసనకర్రలు ఇచ్చారు. చంద్రుడిపై అంతులేని దుమ్ముధూళీ కాబట్టి ఇద్దరికి ఇరవై రిన్ సబ్బులు, మినరల్ వాటర్ బాటిళ్లు, నల్ల కళ్లజోళ్లు ఇచ్చారు. ‘‘మరి వోడ్కా!’’ ఆశగా ఆడిగాడు వర్మ. ‘‘మిత్రమా! భూమి మీద వందకేజీలు ఉన్నవాడు... ఇక్కడ యాబై కేజీల బరువు కూడా ఉండడు. ఎందుకంటావ్? ఎందుకంటే ఇక్కడ గురుత్వకార్షణశక్తి తక్కువ కాబట్టి. అలాగే... ఇక్కడ ఫుల్‌బాటిల్ కొట్టినా నైంటీ ఎమ్ఎల్లో సగం తాగినట్లు కూడా ఉండదు. అసలు ఇక్కడ మత్తు పని చేయదు’’ చెప్పాడు క్రియేటివ్ హెడ్ కిట్టప్ప. ‘‘ఇట్స్ ఓకే’’ అన్నాడు వర్మ మూతి తిప్పుకుంటూ. ‘‘బ్రదర్... డిబేట్ స్టార్ట్ చేద్దామా? ఇంతకీ ఏ టాపిక్ మీద డిబేట్ చేద్దాం?’’ ఉత్సాహంగా వర్మను అడిగాడు పాల్. ‘‘డిబేట్ మీదే స్టార్ట్ చేద్దాం’’ అని ఇలా మొదలు పెట్టాడు వర్మ... ‘‘డిబేట్ ఈజ్ ఏ ప్రాసెస్ దట్ ఇన్వాల్స్ ఫార్మల్ డిస్కషన్ ఆన్ ఏ పర్టిక్యులర్ టాపిక్. యూ నో... డిబేటింగ్ సొసైటీస్ ఎమర్జ్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ ఇది ఎర్లీ 18 సెంచరీ...’’ ‘‘సోదరా ఆగు... ఇంగ్లండ్ అంటే గుర్తుకు వచ్చింది... ప్రిన్స్ ఎడ్వర్డ్... హీ ఈజ్ ద ఫస్ట్ కజిన్ ఆఫ్ క్వీన్ ఎలిజెబెత్, పీటర్ మార్క్... ది ఎల్డర్ చైల్డ్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ ప్రిన్సెస్ రాయల్... వీళ్లందరు కూడానూ.. నా సలహా లేనిదే పొద్దున బ్రష్‌పై పేస్ట్ కూడా పెట్టుకోరు...’’ చెప్పుకుంటూ పోతున్నాడు పాల్. ‘‘మిస్టర్ పాల్... నేనేం మాట్లాడుతున్నాను... నువ్వేం మాట్లాడుతున్నావు? నీకెవరు పరిచయం ఉంటే నాకేంటి?’’ చిరాకు పడ్డాడు వర్మ. ‘‘ఇదిగో ఈ చిరాకే, కోపమే సోదర మానవుల మధ్య చిచ్చు రగులుస్తుంది. ఐక్యతకు తూట్లు పొడుస్తుంది... అందుకే అంటున్నాను... టు సేవ్ ది నేషన్ వుయ్ ఆల్ మస్ట్ వర్క్ టు గెదర్... అందుకే ఐ నీడ్ పొలిటికల్ ఫండ్... ఇండియా షుడ్ లీడ్ ద వరల్డ్... చెట్టో రక్షతి రక్షితః... పెద్దలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి... తగిన చిల్లరతో బస్సులో ప్రయాణించండి... కండక్టర్‌కు సహకరించండి’’ వీరవిహరం చేస్తున్నాడు పాల్. ‘‘మిస్టర్ పాల్... మీరు చిల్లర అంటే గుర్తుకు వచ్చింది... కొన్ని సంవత్సరాల క్రితం మనీ అనే సినిమా తీశాను. సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్‌గా ‘చిల్లర’ అనే సినిమా తీయాలని డిసైడయిపోయాను. అయితే ఆ సమయంలో నాకు ఫ్లాప్‌ల మీద ఫ్లాపులు పిలవని చుట్టంలా వస్తున్నాయి... అయినా సరే... ఎలాగైలా సినిమా చేయాలని డిసైడయిపోయాను... నా దగ్గర బడ్జెట్ చూసుకుంటే చిల్లర తప్ప ఏమీ లేదు... ఈ రూపాయి, రెండు రూపాయల చిల్లరతో సినిమా ఏంచేస్తాం...’’ చెప్పుకుంటూ పోతున్నాడు వర్మ. ‘‘సోదరా... సమయమంటే గుర్తుకు వచ్చింది. సమయమంటే టైమ్... నీ టైమ్ బాగుందా? బ్యాడా? అని ఎందరో అమెరికా ప్రెసిడెంట్లకు చెప్పాను. అవన్నీ నిజమైన విషయం వరల్డ్ అంతటికీ తెలుసు...’’ దూసుకుపోతున్నాడు పాల్. ఈ చర్చల ధాటికి చంద్రుడిపై ధూళి తుపాను వచ్చింది. భూకంపంలాగా చంద్రకంపం కూడా వచ్చింది. అయినా సరే... ఇద్దరు డిబేట్ చేస్తూనే ఉన్నారు... అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, కొరియా ప్రెసిడెంట్‌కు ఫోన్ చేసి ఇలా వార్నింగ్ ఇచ్చాడు... ‘‘ఒరే తిక్కలోడా... నీ చానల్ మూసేసి ఆ ఇద్దరినీ భూమిపైకి పంపించకపోయావో... నిన్ను శాశ్వతంగా పైకి పంపిస్తాను’’ ఈలోపు భూమిపై ‘సేవ్ ది మూవ్’ అనే ఉద్యమం మొదలైంది. – యాకుబ్ పాషా -
కుక్క కాటుకు పప్పు దెబ్బ..!
‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూల్లో కొందరైతే ఇరవై స్టార్లు కూడా ఇచ్చారు (డబ్బులు మరీ ఎక్కువ ముట్టి ఉంటాయని కొందరంటారు). సరే హిట్ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది పుల్లారావు గురించి. ‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ కథ తనదే అంటూ తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాదు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు పుల్లారావు. ఆ ప్రెస్మీట్లో ఒక రిపోర్టర్ ఇలా అడిగాడు... ‘‘మీరు అక్కడెక్కడో రాజమండ్రి దగ్గర గంపలగూడెంలో ఉంటారు. డైరెక్టర్ శభాష్ శంకరేమో హైద్రాబాద్‌లో ఉంటాడు. మరి ఆయన మీ కథను ఎలా కాపీ కొట్టగలుగుతాడు?!’’ అప్పుడు పుల్లారావు ఇలా స్పందించాడు: ‘‘గుడ్క్వశ్చన్ అడిగారు. మా పెద్దమ్మ కుమారుడు దద్దమ్మకుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తాడు. ఓ పాలి తమ్ముడిని చూసి పోదామని బోనాల పండుగరోజు హైదరబాద్‌కు వచ్చానండీ. మా తమ్ముడిగాడితో పాటు హైదరాబాద్‌ను చూసినట్లుంటుంది, ఛాన్సు దొరికితే నా దగ్గర ఉన్న కథలను సినిమావాళ్లకు చెప్పినట్లు ఉంటుందని తట్టాబుట్టాతో దిగనండి. మా దద్దమ్మ కుమార్ రూమ్‌లో ముగ్గురు స్నేహితులు ఉంటారండీ. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.... నాకో వీక్నెస్ ఉందండి. ఎవరైనా నా కథ వింటే, వినాలనే ఆసక్తి కనబరిస్తే చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తానండీ. మా ఊళ్లో అయితే, కేవలం నా కథలు వినడం ద్వారా సొంత ఇళ్లు కట్టుకున్నవాళ్లు ఉన్నారు. అప్పులు తీర్చేసుకున్నవాళ్లు ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు చేసిన వాళ్లు ఉన్నారు. సరే, ఈ సంగతి పక్కన పెడితే రూమ్‌లో దిగిన రెండోరోజే నాలో గొప్ప రైటర్ ఉన్నాడనే విషయాన్ని దద్దమ్మగాడి ఫ్రెండ్స్ కనిపెట్టారు. ‘‘కథ వినిపించు బ్రో’’ అని అడిగేవారు. ‘‘మరి మీరు ఆఫీసుకు వెళ్లాలి కదా...సండే వినిపిస్తానులే’’ అని సర్దిచెప్పబోతే... ‘‘తొక్కలో ఆఫీసు. నీ కథ కంటే ఎక్కువా ఏమిటి? రేపు నువ్వు పే......ద్ద డైరెక్టరైపోతే...గ్రేట్ డైరెక్టర్ పుల్లరావుగారు సినిమాల్లోకి రాకముందు మాకు కథలు చెప్పేవారు తెలుసా! అని గొప్పగా చెప్పుకోవాలని మాకు మాత్రం ఉండదా ఏమిటి. బ్రో...కథ వినిపించు...’’ అని బతిమిలాడేవాళ్లు. పాపం వాళ్లను చూస్తే ముచ్చటేసేది. ఆఫీసు ఎగ్గొట్టి మరీ నా స్టోరీ వినడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే నేనెంత అదృష్టవంతుణ్ణో కదా అని మురిసిపోయేవాడిని. ఈలోపు ఆ ముగ్గురిలో ఒకడు... ‘‘బ్రో...ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఈ టైంలో రూమ్‌లో కూర్చుని కథ వినడం బాగోదు. అలా బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని విందాం’’ అనేవాడు. సరే అని వాళ్లను తీసుకెళ్లి లీటర్ల కొద్ది మందు పోయిస్తూ, బార్లో ఉన్న సమస్త నాన్‌వెజ్ ఐటమ్లు తినిపిస్తూ కథలు చెప్పేవాడిని. ఒకరోజు బార్లో ఇలాగే చెబుతుండగా...మా వెనక సీట్లో కూర్చున్న ఒకడు...జేబులో కాగితం తీసి రాసుకుంటున్నాడు. కొంపదీసి వీడు నా కథను వినలేదు కదా అనే డౌటు వచ్చింది. ఇప్పుడు ఆ డౌటు నిజమైంది. ఆరోజు నేను బార్లో చెప్పింది ‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ కథే! నిజానికి ఆరోజు వాడి దగ్గర ఉన్న కాగితాన్ని లాక్కొని, కాలర్ పట్టుకొని ఉంటే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చేది కాదు. కళామాతల్లి సేవలో ఇప్పటి వరకు పది ఎకరాలకు పైగా అమ్ముకున్నాను. ఇక ఉన్న ఒక ఎకరం అమ్ముకునే ఓపిక లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. కాపీ కథ సంస్కృతిని వ్యతిరేకించండి’’ ‘పుల్లరావు కథ కాపీ కొట్టబడింది’ అని కొందరు– ‘శభాష్ శంకర్ కథకు పుల్లారావు కథకు సంబంధమే లేదు’ అని కొందరు వాదించుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడా ఏకాభిప్రాయం కుదిరి చావడం లేదు. ఈలోపు ‘పుల్లారావు కథను కాపీ కొట్టారా లేదా?’ అనే దానిపై బెట్టింగ్‌లు కూడా మొదలయ్యాయి. వారం తిరిగేలోపే పుల్లరావు సమస్య రాష్ట్ర సమస్య అయింది. నెల తిరిగేలోపు జాతీయ సమస్య అయింది. విషయం ఎక్కడి దాక వెళ్లిందంటే పుల్లరావు వ్యతిరేక–అనుకూల అంటూ ఇండియా రెండుగా చీలిపోయింది. శాంతిభద్రతల సమస్య తుపానులా ముంచుకొచ్చింది. హాలీవుడ్లో లేటెస్ట్గా ‘కాపీకాస్మిక’ అనే మెషిన్ వచ్చింది. ఈ మెషిన్ వల్ల అక్కడ ఎన్నో జటిల సమస్యలు క్షణాల్లో పరిష్కారమయ్యాయి. అవుతున్నాయి. ఈ మెషిన్ ప్రత్యేకత ఏమిటంటే... రెండు పార్ట్లు ఉంటాయి. కుడివైపు ఉన్న పార్ట్‌లో ఆరోపణ చేస్తున్న వారి కథ, ఎడమవైపు ఉన్న పార్ట్‌లో ఆరోపణ ఎదుర్కొంటున్న వారి కథను పెడతారు. అంతే...పది నిమిషాల్లో రిజల్ట్ తెలిసిపోతుంది. 50 శాతం కాపీ కొట్టారా? 70 శాతం కాపీ కొట్టారా? 100 శాతం కాపీ కొట్టారా ?అనేది స్క్రిన్‌పై డిస్ప్లే అవుతుంది. ‘కాపీకాస్మిక’ గురించి గవర్నమెంటుకు తెలిసి ఆఘమేఘాల మీద ఆ మెషిన్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. మొట్టమొదట పుల్లారావు కేసును తీసుకున్నారు. ‘గెలుపు ఎవరిది?’ ‘పుల్లారావు గెలుస్తాడా?’....ఇలా రకరకాల హెడ్డింగ్లతో ప్రత్యక్షప్రసారాన్ని ప్రారంభిచాయి ఛానళ్లు. మెషిన్ కుడి వైపు ఉన్న పార్ట్‌లో...పుల్లారావు కథ పెట్టారు. మెషిన్ ఎడమ వైపు పార్ట్‌లో.... శభాష్ శంకర్ కథ పెట్టారు....ఆ తరువాత స్విచ్ నొక్కారు. దేశమంతా నరాలు తెగేంత ఉత్కంఠ! పదినిమిషాల్లో ఆ ‘కాపీకాస్మిక’ మెషిన్ ముక్కలు చెక్కలయింది...వేడి వేడి పొగలు...రక్తం పారుతోంది!!!!! ‘‘ఇలా అయిందేమిటి!’’ అంటూ హాలివుడ్ సాంకేతిక నిపుణులను పిలిపించారు. వారు ఇండియాకు వచ్చి మెషిన్‌ను పరిశీలించి... ‘‘ఈ కథలను యంత్రమే తట్టుకోలేకపోయింది. మరి మనుషులు ఎలా తట్టుకుంటున్నారు?’’ అని పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు! దీని గురించి మీకేమైనా తెలుసా? – యాకుబ్ పాషా -
దోచేవారెవరురా..!
తొలిసారిగా దేశంలోని దొంగలందరూ సమావేశమయ్యారు. చారల టీషర్ట్ వేసుకున్న సీనియర్ దొంగ చోరకుమార్ మైక్ అందుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు... ‘‘దొంగమిత్రులందరికీ దొంగాభివందనములు. దేశ నలుమూలల నుంచి వచ్చిన దొంగమిత్రులారా!... ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలియజేయడానికి ముందు... తెలుగు సినీ పరిశ్రమకు మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం..’’ ‘‘వాళ్లకు మన మీద ప్రేమ ఎందుకుంటుందండీ బాబూ... నారు పోశారా? నీరు పోశారా? బీరు పోశారా... కనీసం కల్లు అయినా పోశారా?’’ పాయింట్ లేవనెత్తాడు వర్ధమాన దొంగ రాకెట్కుమార్. ‘‘ప్రేమ లేదని ఎందుకనుకోవాలి. ఎన్నో సినిమాలకు మన పేర్లు పెట్టుకున్నారు. మచ్చుకు కొన్ని...’’ అంటూ ఇలా లిస్ట్ చదివాడు చోరకుమార్. దొంగ దొంగలకు దొంగ దొంగ మొగుడు దొంగల దోపిడి దొంగ రాముడు దొంగపెళ్లి దొంగలు బాబోయ్ దొంగలు దొంగోడొచ్చాడు దొంగగారు స్వాగతం యమదొంగ అమ్మదొంగా మంచిదొంగ జేబు దొంగ అడవి దొంగ కొండవీటి దొంగ టక్కరి దొంగ ఘరానా దొంగ భలే దొంగ ఇద్దరు దొంగలు తోడు దొంగలు...’’ ‘‘సరే...ఈ పేర్ల సంగతి పక్కన పెడితే అసలు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే... ఇన్నాళ్లుగా మనం అసంఘటిత రంగంలో ఉన్నాం. ఇప్పుడిక సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది. మన హక్కుల్ని సాధించుకోవాలి... అవి సాధించుకోవాలంటే మనకంటూ ఒక జాతీయసంఘం ఉండాలి. మన తొలి జాతీయ మహాసభ వచ్చేవారం బిహార్‌లోని చోర్గంజ్లో జరుపుకోబోతున్నాం. ఆ సభలలో కొన్ని తీర్మానాలు చేయడం, ప్రతిభావంతులైన దొంగలకు సన్మానం చేయడం, ప్రతిభా పురస్కాలరాలను ఇవ్వడం, లేటెస్ట్ దొంగ గాడ్జెట్స్‌ను పరిచయం చేయడం జరుగుతుంది’’ అని ప్రకటించాడు చోరకుమార్. బిహార్‌లోని చోర్గంజ్. దేశం నలుమూలల నుంచి దొంగలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకుడు డొనాల్డ్ థీఫ్ మైక్ అందుకున్నాడు... ‘‘మిత్రులారా... అనివార్యకారణాల వల్ల విజయ్‌మాల్యా, నీరవ్ మోడీలు ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు వర్తమానం పంపారు. సభ జయప్రదం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు. వారు స్వదేశానికి రాగానే మన సంఘంలో గౌరవ పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన సభ తరపున కొన్ని తీర్మానాలు చదువుతాను... ► స్కూళ్లలో దొంగతనాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి ► సాటి విద్యార్థుల పెన్నులు, బుక్స్, బ్యాగ్‌లు కొట్టేసే చిన్నారి దొంగలకు ఉపకార వేతనాలు ఇవ్వాలి. ► అత్యుత్తమ దొంగలకు ప్రతి యేడు ‘దొంగశ్రీ’ అవార్డ్లు ప్రకటించాలి. ► వయసు మీద పడిన దొంగలకు ఫించన్లు ఇవ్వాలి. ఒకటా రెండా... ఇలా ఎన్నో తీర్మానాలను ఆమోదించారు. తరువాత ‘అత్యుత్తమ దొంగ’ అనే కార్యక్రమం మొదలైంది... దొంగల్లోని అరుదైన ప్రతిభావిశేషాలను పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... ‘‘ఈయన పేరు ఏబీసీడీ. స్క్రిన్ నేమ్ లాగా ఇది ఈయన చోర్ నేమ్. 24 గంటల్లో 84 చోరీలు చేసి దొంగీస్ రికార్డ్‌ల్లోకి ఎక్కాడు’’ ‘‘ఈయన పేరు ఘోటక బ్రహ్మచారి. పేరు చూసి మోసపోవద్దు. ఇప్పటి వరకు పదికి పైగా పెళ్లిళ్లు చేసుకున్నాడు. మామూలుగానైతే పెళ్లిళ్లలోకి బయటివారు దూరి దొంగతనం చేస్తారు. కాని ఈ బ్రహ్మచారి మాత్రం... తన పెళ్లికి వచ్చిన అతిథులను నిలువుదోపిడీ చేస్తాడు. ఎంత కొమ్ములు తిరిగిన డిటెక్టివ్ అయినా...పెళ్లికుమారుడిని పొరపాటున కూడా అనుమానించడనేది ఇతని సిద్ధాంతం. ఈ థియరీకీ కళ్యాణం కట్ కట్... అనే పేరు కూడా పెట్టాడు.’’ ఇలా కొన్ని పరిచయాలైన తరువాత... ‘‘మన దొంగల్లో సైంటిస్ట్‌లు ఉన్నారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈయన పేరు టెక్ శ్రీను. మన దొంగజాతి కోసం ఎన్నో ఉపకరణాలు తయారుచేశాడు. ప్రసుత్తం సంచలనాత్మకమైన, చరిత్రను తిరగరాసే మెషిన్‌ను తయారు చేశాడు. ఇదిగో... ఫ్రిజ్‌లా కనిపిస్తున్న దీని పేరు ‘జాం ఝటక్ హాం ఫటక్’. ఈ మెషిన్‌తో ఇంట్లో కూర్చొనే, కడుపులో చల్ల కదలకుండా ఎంచక్కా దొంగతనాలు చేసుకోవచ్చు. చిన్న దొంగతనాలైతే... గంటకు అయిదు, ఒక మాదిరి దొంగతనాలైతే... గంటకు రెండు. పెద్ద దొంగతనాలైతే... రోజుకు రెండు చొప్పున చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెషిన్‌ను వేలం వేస్తున్నాం. అయితే ఎంత ఎమౌంట్ అయితే పాడుతారో ఆ మొత్తాన్ని ఒక కవర్లో వేసి, తమ పేరు రాసి అప్పటికప్పుడు ఈ మెషిన్ మీద పెట్టాలి’’ అని పాట మొదలుపెట్టాడు పరిచయకర్త. ‘నా పాట కోటి నలభై అయిదు లక్షలు’ అని పాడి ఆ మొత్తాన్ని పెద్దసంచిలో వేసి ‘జాం ఝటక్.. హాంఫటక్’ మెషిన్ మీద పెట్టాడు బెంగాల్ నుంచి వచ్చిన డొంగర్ బెనర్జీ. ‘నా పాట రెండు కోట్ల నలభై లక్షలు’ అని పాడి అట్టి మొత్తాన్ని గోనెసంచిలో వేసి మెషిన్ మీద పెట్టాడు రాజస్థాన్ నుంచి వచ్చి చోర్లాలాచౌహాన్. పాట పదికోట్లు దాటి ఆగిపోయింది. ఈలోపు కరెంట్ పోయింది. కొద్దిసేపట్లోనే పోయిన కరెంట్ వచ్చింది. కానీ ‘జాం ఝటక్’ మెషిన్‌ను కనిపెట్టిన టెక్ శ్రీను మాయమయ్యాడు. ఆయన కనిపెట్టిన మెషిన్ మాయమైంది. ఆ మెషిన్‌పై ఉన్న డబ్బు మాయమైంది. సభ గందరగోళమైంది! – యాకుబ్ పాషా -
దాన వీర శూర కర్ణ
మా ఊరోళ్లకు వేడివేడిగా ఆరోజే విడుదలైన సినిమాలు బోర్ కొట్టేశాయి. విడుదల కాకముందే లీకైన సినిమాలు సెల్ఫోన్లో చూసీచూసీ బొర్ కొట్టేశాయి. పనీపాటలేని అప్లోడింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ట్రెండింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ఇలాంటి మహాబోర్ సమయంలో...‘‘మన గ్రామ సర్పంచి పుట్టిన రోజు సందర్భంగా రేపు రాత్రి మన ఊళ్లో దానవీరశూరకర్ణ నాటకం ఉంటుందహో’’ అనే చాటింపు విని ఊళ్లో ఆబాలగోపాలం ఆనందించారు.‘నాటకం చూడక ఎన్నాళ్లయిందో...ఆరోజులే వేరు’ అనే నాస్టాల్జియాతో వయసు మళ్లిన వాళ్లు...‘నాటకమటా...ఎలా ఉంటుందో చూద్దాం’ అని సోషల్ మీడియా జమానాలో పుట్టిన లేలేత కుర్రోళ్లు...చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆరోజు సర్పంచి పుట్టిన రోజు. ఆయన ఇంటెనకాల పెద్ద గ్రౌండ్లో పెద్ద స్టేజీ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరింటికే ప్రేక్షకదేవుళ్లతో నాటకప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈలలు, కేకల తరువాత నాటకం మొదలైంది....నాటుసార సారయ్య శకుని వేషం కట్టాడు. బాగా కుదిరాడు.‘‘దుర్యోధన... నాకే ఓ కూతురు ఉండి ఉంటే....నీ తలపు, వలపు, నీ కులుకు వేరే వన్నెలాడివైపు పొనిచ్చేవాడినాఏంచేయనూ...మేనమామనై ఉండి కూడా మామను కాలేని దురదృష్టవంతుడిని’’ అని విషాదంగా డైలాగు కొట్టాడు ఇంతలో ప్రేక్షకుల్లో నుంచి ఒక తాగబోతు గట్టిగా అరుస్తూ పైకి లేచాడు. ఇతడు సారయ్యకు స్వయానాబావమరిది. పేరు సారా సాంబయ్య.‘‘ఒరేయ్ సారిగా...నీకు కూతుళ్లు లేకపోవడం ఏందిరా! పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలున్నరు. ఒక్కరి పెళ్లి అయినా చేసినవా? పొద్దున లేసుడు....కల్లుతాగుడు....సాయంత్రం గుడంబ తాగుడు...నీ ముఖానికో నాటకం...’’సాంబయ్య తిట్లు విని ప్రేక్షకులు ఒకటే నవ్వడం! పాపం కళాకారుడు సారయ్య ముఖం మాడిపోయిన పెసరట్టయింది.‘‘ఒరేయ్ సాంబా కూకో....’’ అని సర్పంచి అరిచేసరికి సైలెంట్ అయిపోయాడు సాంబయ్య. ఆతరువాత భీష్మ పాత్రధారి కాషయ్య డైలాగు:‘‘నాయనా...వంశం కోసం బ్రతికున్నంత వరకు వయసంతా ధారబోసిన ఘోటక బ్రహ్మచారిని. నేను మాట ఇవ్వను. ఇచ్చాను అంటే దానికి చచ్చినా తిరుగుండదు. నేను ప్రతిజ్ఞ చేసినానుఅంటే, అంతే...తిరుగుండదు. అందుకే భీష్మప్రతిజ్ఞ అంటారు’’ఈలోపే ప్రేక్షకుల మధ్యలో నుంచి కాషయ్య క్లాస్మేట్ ఒకడు లేచి....‘‘ఒరే కాశీ....వంశం కోసం వయసంతా ధారపోసావా?! పదిహేడేళ్లకే మూడు కాపురాలు పెట్టావు....నువ్వు వయసు ధారపోయడం ఏమిట్రా బెవకూఫ్. పెళ్లి చేసుకుని వదిలేయడమేనా? వాళ్ల బాగోగుల గురించి పట్టించుకునేదిలేదా! మూడో భార్య ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి పిల్లను సాకుతోంది. రెండో భార్య ఎండల్లో కూలీనాలికీ పోతూ కష్టపడుతోంది. మొదటి భార్యను పట్టించుకునే దిక్కేలేదు....భార్యలు కష్టపడుతుంటే నాటకాలంటూ తిరుగుతున్నవేందిరా మొద్దునాయాలా....గబ్బు నాయాలా...’’ అని నాన్‌స్టాప్‌గా తిట్లు మొదలు పెట్టాడు.ఈలోపు లచ్చయ్య అనే వార్డు మెంబరు లేచాడు... ‘‘ఆడిన మాటను తప్పను...అని ఎంత సిగ్గులేకుండా అంటున్నావురా కాశీగా! నన్ను ఉపసర్పంచి చేస్తానని మాటిచ్చావు. చేశావా? చేయకపోతే చెయ్యకపోతివి...నా దగ్గర తీసుకున్న డబ్బైనా ఇచ్చినవా? నీకేమాత్రం సిగ్గున్నా నా డబ్బు నాకు ఇచ్చేయాలి లేదా నన్ను ఉపసర్పంచి చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను’’ అని అవేశంగా అరిచాడు.ఉపసర్పంచి రాజయ్య ఆగ్రహంగా లేచి...‘‘దైవం మీద ఆన. నన్ను పదవీచ్యుతుడిని చేస్తే ఊరుకునేది లేదు. ఫస్ట్‌టైమ్ వార్డ్మెంబర్గా గెలిచాను. భగవంతుని దయతో ఫస్ట్‌టైమ్ ఉపసర్పంచి అయ్యాను. పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే మీ కళ్లు మండిపోయాయి. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండాలా? ఇదేనా డెమోక్రసీ? అని ఈ సందర్భంగా అడుగుతూ, ఓటరు మహాశయులకు నమస్తేచెబుతూ...నా సీట్లో నేను కూసుంటున్నాను’’ అంటూ కూర్చున్నాడు.ఫ్రెండ్స్ మాటలతో భీష్మ పాత్రధారి కాశయ్య హర్ట్ అయ్యాడు....‘‘రేయ్ దొంగనాయల్లారా...టేజీ(స్టేజీ) మీదున్నంత వరకే నేను భీష్ముడిని. టేజీ దిగానా....మాస్....పక్కా మాస్. నా డైలాగులు అయిపోయేంతవరకు గమ్మునుండండి. ఆ తరువాత...మీరు మా ఇంటికొచ్చినా సరే. నన్ను మీ ఇంటికి రమ్మన్నా సరే...ఎక్కడైనాసరే...ఎప్పుడైనా సరే...మొకాలి చిప్పలు పగిలిపోవాలా....ఏం అనుకున్నారో ఏమో....’’ అన్నాడు ఆవేశంగా.సర్పంచి మళ్లీ గట్టిగా అరిచాడు.‘‘నాటకం వేస్తరా? నకరాలు చేస్తరా?’’చిన్నబ్రేక్ తరువాత నాటకం మళ్లీ మొదలైంది.దుర్యోధన సార్వభౌముడు రేకుల కైలాసం ఆవేశంగా తన డైలాగు స్టార్ట్ చేశాడు...‘‘ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి?ఎంత మాట ఎంత మాటా!మట్టికుండలో పుట్టిన నీదే కులం?(ఆ తరువాత డైలాగు మరిచిపోయాడు కైలాసం. ఈ మతిమరుపు వల్లే పదవతరగతి పరీక్ష మూడుసార్లు తప్పాడు. ఇంకా తప్పుతూనే ఉన్నాడు. ఏదో ఒక సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసై తనను తాను ప్రూవ్ చేసుకోవాలనేది కైలాసం ఆశయం. ఎంత పెద్ద మొనగాడైనా స్టేజీ మీద డైలాగులు మరిచిపోవడం కామన్ విషయమని, అలాంటప్పుడు ప్రేక్షకులకు అనుమానం రాకుండా ఫ్లోలో నోటికొచ్చింది దంచుకుంటూ పోవాలని సీనియర్ నటుడు, నటరత్న కల్లు నాగమల్లు చెప్పిన విషయం కైలాసానికి గుర్తుకు వచ్చింది. ఇక చూస్కోండి. ఇలా అందుకున్నాడు...)‘ఆచార్యదేవాఏమంటివి ఏమంటివి?ఇది క్షేత్రపరీక్ష కాని క్షత్రియపరీక్ష కాదు... టెన్త్‌క్లాస్ పరీక్ష కానేకాదు.ఆచార్యదేవా...ఏమంటివి?టెన్త్క్లాస్పరీక్ష పాసు కావడమంటే మామూలనుకుంటివా?పొద్దున లేచి పండ్లు తోముకున్నంత ఈజీ అనుకుంటివా?ఆచార్యాదేవా...క్షేత్రపరీక్ష, క్షత్రియపరీక్షైనా పాస్కావచ్చుగానీ... టెన్త్క్లాసుపరీక్ష పాస్ కావడం అల్లాటప్పా వ్యవహారం అనుకుంటివా...’ఇంకేముంది....ఒన్స్మోర్ అంటూ ఒకటే లీలలు! – యాకుబ్ పాషా -
అందుబాటు ధరలో చందమామ!
2023 అమెరికన్ స్పేస్–ట్రావెల్ కంపెనీ ‘స్పేస్–ఎక్స్’ తొలి ప్రైవేట్ ప్యాసింజర్‌ను చంద్రుడి పైకి పంపింది. ఆ ప్యాసింజర్ పేరు యుసకు మాయిజవా. జపాన్ బిలియనీర్. ఈ యుసకు భూమి మీద ల్యాండయ్యాడో లేదో కనిపించిన టీవీ స్టూడియోల్లోకి దూరి ‘ఆహా చంద్రమండలం’ ‘ఓహో చంద్రమండలం’ అంటూ స్పీచ్‌లు మొదలుపెట్టాడు. ఇల్లు దాటి ఎప్పుడూ పక్క ఊరికి పోనివారు కూడా యుసకు స్పీచ్‌లు విని తెగ ఇదై పోయారు. జీవితంలో ఒక్కసారైనా చంద్రుడి మీదికి వెళ్లి రావాలని కలలు కన్నారు. కానీ ఏం లాభం? యుసకులాంటి బిలియనీర్లకు తప్ప సామాన్యులకు ‘స్పేస్–ఎక్స్’ ధరలు అందుబాటులోకి లేవు. 2025 బిలియనీర్లు, మిలియనీర్లకే కాదు సామాన్యజనానికి కూడా ధరలు అందుబాటులోకి తెచ్చి చారిత్రక విప్లవానికి శ్రీకారం చుట్టింది స్పేస్–ఎక్స్.అదిగో ఆ ఊళ్లో ఏదో అలికిడి అవుతుంది. ఒక్కసారి లుక్కేద్దామా మరీ...‘‘ఏం ఎంకయ్య మామా, ఏటో పయనమైనట్లున్నావు’’‘‘నాకు ఒక్కగానొక్క కూతురు అనే విషయం నీకు తెలుసుకదరా అల్లుడు..’’‘‘ఎటు వెళుతున్నావో చెప్పరా మామా అంటే, నాకు ఒక్కగానొక్క కూతురు అంటావేమిటి నీ యెంకమ్మ. చెవుడుగానీ వచ్చిందా ఏమిటి?’’‘‘నీకు తొందరెక్కువ, ఆగెహే. నేను చెప్పేది ఓపిగ్గా విను. నా ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేశాను అనే విషయం నీకు తెలుసు కదా. నువ్వు అడిగినంత కట్నం ఇస్తాను కోరుకో అల్లుడు అని అల్లుడుగారికి బంపర్ ఆఫర్ ఇచ్చాను. ‘నీ కట్నం ఎవరికి కావాలి! నన్ను చంద్రుడి మీదికి పంపించు చాలు’ అని కోరాడు. రెండు సంవత్సరాల క్రితం కోటీశ్వరులకు తప్ప మనలాంటోళ్లకు చంద్రుడిపైకి వెళ్లే అవకాశం లేనేలేదు. అందుకే తరువాత చూద్దాంలే అల్లుడు అని వాయిదా వేశాను. ఇది దృష్టిలో పెట్టుకొని పోయిన ఏడాది సంక్రాంతికి ఆయన మా ఇంటికి రాలేదు, అమ్మాయిని కూడా పంపలేదు. ఎలారా దేవుడా అని తెగ బాధ పడుతుండగా స్పేస్–ఎక్స్ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిన తీపి వార్త తెలిసింది. ఇప్పుడు ఒక్కసారేమిటి? సంవత్సరానికి ఆరుసార్లు అల్లుడిని చంద్రుడి పైకి పంపించగలను. రేపే మా అల్లుడి చంద్రమండల యాత్ర. అందుకే పట్నం వెళుతున్నాను’’(సరిగ్గా ఆరు నెలల మూడు రోజుల తరువాత...) ‘‘ఏం మామా, దిగులుగా కూర్చున్నవ్? మీ అల్లుడిని చంద్రుడి మీదికి పంపాలనేది నీ ఏకైక కోరిక. అది కూడా నెరవేరింది కదా. ఇంకా దిగులెందుకు?’’‘‘ఏం చంద్రయాత్రో ఏమో...మా అమ్మాయి కాపురం బుగై్గపోయింది’’‘‘ఏమైంది మావా?!’’‘‘మా అల్లుడు చంద్రుడిపైకి వెళ్లి ఆరునెలలు దాటింది. రెండు నెలలు తిరక్కుండానే రావాల్సిన వాడు ఆరునెలలైనా రాకపోయేసరికి ఆందోళన మొదలైంది...’’‘‘ఏదైనా ప్రమాదం జరిగిందా ఏమిటి?’’ ‘‘ప్రమాదమా పాడా! ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ చంద్రమండలం అధికారులతో మాట్లాడితే అల్లుడిని మాతో మాట్లాడించారు. కోషియా మూడుమాజియా అనే కొరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, చావైనా బతుకైనా ఆమెతోనే అన్నాడు అల్లుడు. మీ పెళ్లిని నేను ఆమోదిస్తున్నాను...ముందైతే భూమి మీదికి రావయ్యా మగడా అన్నాను. ‘నేనేమన్నా చెవిలో రాకెట్ పెట్టుకున్నాననుకుంటున్నావా! భూమి మీదికి రాగానే మా ఇద్దరినీ విడదీయాలనేదే కదా నీ రావుగోపాల్రావు ప్లాను. నేను రాను గాక రాను. కూలో నాలో చేసుకొని మేమిద్దరం ఇక్కడే బతుకుతాం’ అన్నాడు గట్టిగా.ఇక ఆరోజు నుంచి రాత్రి కాగానే మా అమ్మాయి ఇంటి నుంచి పరుగెత్తుకు రావడం, ఆకాశంలో చందమామను చూస్తూ...‘చందమామ రావేనా మొగుడిని తేవే’ అని శోకాలు తీస్తూ పాడటం.దాని పాటలు వినలేక ఛస్తున్నాననుకో!’’ మరో ఊళ్లో... ‘‘ఏంటయ్యా కోటేశ్వర్రావు అలా నెత్తి మీద వైట్క్లాత్ వేసుకొని ఏడుస్తున్నావు?’’‘‘చంద్రుడి మీద అడుగు మోపితే నీ ఆస్తులు రెట్టింపు అవుతాయని ఒక జ్యోతిష్యుడు చెబితే ఛలో చంద్రమండలం అంటూ పరుగులు తీశాను. అక్కడికి వెళ్లాక అర్థమైంది....’’‘‘ఏమైంది?’’‘‘నీకు మొదటి నుంచి చెప్పాలి. చంద్రమండలంలోని ముఖ్యమైన ప్రాంతాలను మన ఇండియన్ కంపెనీ ‘మస్కా’కు కాంట్రాక్ట్ ఇచ్చారట. ఈ ‘మస్కా’వాళ్లు అక్కడ తమ తడాఖా చూపిస్తున్నారు. బిగ్ ఫాల్కాన్ రాకెట్లో నుంచి చంద్రుడిపై అడుగుపెట్టగానే... ఆహా! ఎంత అందంగా ఉంది ఈ చంద్రలోకం అన్నాను అక్కడ కనిపించిన వాడితో. ఓకే సార్ అని ఒక చీటీ చేతిలో పెట్టాడు. అందులో 33 డాలర్లు అని ఉంది. మన ఇండియన్ కరెన్సీలో 2,490 రూపాయలన్నమాట. ఎందుకు ఇది? అని అడిగితే...హియరింగ్ ట్యాక్స్. ఈలోకంలో ఏది వృథాగా వినరు. ట్యాక్స్ ఉంటుంది... అని చెప్పాడు. ఆ తరువాత... చంద్రమండలంలో ఒక వీధిలో నడిచి నడిచి ఫుట్‌పాత్‌పై ఉన్న ఒక బెంచిపై కూలబడ్డాను. ఇంతలో నా దగ్గరకు ఒక ఆఫీసర్ వచ్చి రసీదు చేతిలో పెట్టాడు. 249 డాలర్లు అని ఉంది. అనగామన ఇండియన్ కరెన్సీలో 18,290 రూపాయలు. ‘ఎందుకు?’ అని గట్టిగా అరిచాను. ‘ఇక్కడ ఫ్రీగా కూర్చోవడం కుదరదు. బెంచి ట్యాక్స్ ఉంటుంది’ అన్నాడు. ఆ ట్యాక్స్ కూడా కట్టాను. వెంటనే మరో చీటీ చేతిలో పెట్టాడు. ‘ఇది ఎందుకు?’ అని అడిగాను. ఇంతకు ముందు ‘ఎందుకు?’ అని గట్టిగా అరిచారు. ఇది ‘అరుపు ట్యాక్స్’ అన్నాడు. అదీ కట్టాను.‘‘ఛీ... పొరపాటున చంద్రలోకానికి వచ్చాను.భూమి మీద టోల్ట్యాక్స్లాంటి అయిదారు ట్యాక్స్‌లు కడితే సరిపోయేది. ఇక్కడేమిటి? ప్రతిదానికి తొక్కలో ట్యాక్సు’’ అన్నాను.మరో చీటీ చేతిలో పెట్టాడు.‘ఇది ఏమిటి?’ అన్నాను భయంగా.‘ఇన్సల్ట్ ట్యాక్స్.... పది లక్షల నలభైవేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు’ అన్నాడు గంభీరంగా.అదీ కట్టాను.చంద్రుడిపైకి అడుగు పెట్టి మళ్లీ తిరుగురాకెట్ ఎక్కేవరకు... కూర్చుంటే ట్యాక్స్, లేస్తే ట్యాక్స్, తుమ్మితే ట్యాక్సు, దగ్గితే ట్యాక్సు... మాట్లాడితే టాకింగ్ ట్యాక్స్, మాట్లాడకపోతే సైలెన్స్ ట్యాక్స్... ఇలా రకరకాల ట్యాక్స్‌లతో తడిసి మోపెడైంది. నా ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అదీ సంగతి!’’ – యాకుబ్ పాషా -
మహాభక్త శిఖామణి శ్రీశ్రీశ్రీ...
ముల్లోకములలో జరుగు ఘటనలను తన యోగబలంచేత దర్శించగల నారదుడు ఉన్నట్టుండి గట్టిగా కేకేశాడు. కునికిపాట్లు పడుతున్న నాస(నారదుడి సహాయకుడు) మేల్కొని ‘‘అయ్యా! తమరి ఆజ్ఞా’’ అన్నాడు చేతులు కట్టుకుంటూ.‘‘మనం అర్జంటుగా భూలోకానికి వెళ్లి రావలెనోయ్’’ మహతి వీణను మెడలో వేసుకుంటూ అన్నాడు నారదుడు.‘‘ఎందుకు స్వామి?’’ వినయంగా అడిగాడు నాస.‘‘భూలోకంలో ఎవరో మానవుడు ఘోర వీర శూర తపస్సు చేస్తున్నాడు. కనీవిని ఎరగని తపస్సు అది. దేవతలకు ఇన్ఫాం చేశాను. భూలోకం వెళ్లడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదోయ్. త్రిలోకసంచారినైన నాకుతప్పుతుందా! పద వెళ్దాం’’ అని తన అసిస్టెంట్‌ను తొందరచేశాడు నారదుడు.‘యమహా భూలోకవేగవాహన్ 4003’లో వాళ్లు భూలోకానికి చేరుకున్నారు.అటుగా వెళుతున్న వ్యక్తిని పిలిచి...‘‘నీ పేరేమిటోయి?’’ అడిగాడు నారదుడు.‘‘దారినపోయే దానయ్య’’ అని చెప్పాడు ఆ వ్యక్తి.‘‘గుడ్. ఇదేమిటి? ఈ అడవి ఇలా ఉంది. చెట్లతో అడవి ఏర్పడుతుందిగానీ, మీసంగెడ్డాలతో ఇంత పెద్ద అడవి ఏమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. ‘‘దీన్ని గెడ్డమడవి అంటారండీ’’ అని చెప్పాడు దానయ్య.‘‘గెడ్డమడవా? ఇదేం అడవి?’’ ఆరాతీశాడు నారదుడు.‘‘ముందు ఇక్కడ అడవి లేదండి. అసలు ఒక్క చెట్టు కూడా లేదండి. మహాభక్తుడొకరు ఇక్కడ తపస్సు చేస్తుండడం వల్ల ఆయన మీసాలు గెడ్డాలు పెరిగి పెద్దవై, మర్రిచెట్టు ఊడల సైజులో పెరిగి ఇలా ఒక అరణ్యంగా ఏర్పడింది. మీసగెడ్డాలతో ఏర్పడిన ఈ అడవి గిన్నిస్ బుక్‌లోకి మరియు లిమ్కాబుక్‌లోకి కూడా ఎక్కింది. ఈ అడవి ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది....’’ ఇలా నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు దానయ్య.దానయ్య చెప్పిన విషయాలు విన్న తరువాత...‘‘నేను అర్జంటుగా ఆ భక్తశిఖామణిని చూడాలి’’ అంటు కార్లు దూరని ఆ కారడవిలోకి ప్రవేశించి తపస్సు చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాడు.ఆ వ్యక్తి నోటి నుంచి....‘రా....గో....పాల్...ఓం...వర్మ...’ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి.‘‘నాయనా...కళ్లు తెరిచి ఒకసారి చూడు’’ భుజం తట్టాడు నారదుడు.ఆ వ్యక్తి ఒక కన్ను మాత్రమే తెరిచి...‘‘ఎవరు మీరు?’’ అని అడిగాడు.‘‘నన్ను నారదమహర్షి అందురు. అది సరే నీ పేరేమిటి’’ అడిగాడు నారదుడు.‘‘నన్ను రామ్‌గోపాల్‌వర్మ అందురు’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘భక్తులందరూ తమ ఇష్ట దైవనామాన్ని జపిస్తూ తపస్సు చేస్తుంటారు. అదేమిటి...నువ్వు నీ నామాన్నే జపిస్తూ తపస్సు చేస్తున్నావు?’’ అని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ వర్మ ఇలాచెప్పాడు:‘‘దేహమేరా దేవాలయం అన్నాడు శోభన్‌బాబు. మనలో ఒక దేవాలయం ఉన్నప్పుడు దేవుడు మాత్రం ఎందుకు ఉండడనేది నా పాయింట్. నా దేహమే దేవాలయమైనప్పుడు...అందులో దేవుడిని నేనుమాత్రం ఎందుకు కాకూడదు? అందుకే నా పేరుతో నేను జపం చేసుకుంటున్నాను’’ కర్ణకఠోరంగా క్లారిటీ ఇచ్చాడు వర్మ.ఆకాశంలో రెండు మెరుపులు సిగ్గుతో మెరిసాయి. ఉరుము గర్జించబోయి భోరుమని ఏడ్చింది.‘‘నువ్వే దేవుడివైనప్పుడు వరం కోసం వేరే దేవుడి గురించి తపస్సు చేయడం ఎందుకు?’’ అడిగాడు నారదుడు.వర్మ గుడ్లు తేలేశాడు. ఆ తరువాత ఏదో చెప్పబోయాడు.మళ్లీ ఏదోచెప్పబోతుండగా...‘‘భక్తవర్మ! నువ్వు ఏదో ఒకటి చెప్పడం కంటే ఇలా మౌనంగా ఉండటమే చాలా బాగుంది. ఐ అప్రిషియేట్ యూ. సరే...ఏం వరం కావాలో కోరుకో నాయనా’’ అడిగాడు నారదుడు.అదేమిటి? వరాలు ఇచ్చేది శివుడు కదా...సరే ఎవరో ఒకరులే. నాకు అర్జంటుగా వందకోట్లు కావాలండీ.’’ అన్నాడు వర్మ.‘‘వందకోట్లతో ఏంచేస్తావు నాయనా?’’ అడిగాడు నారదుడు.‘వందకోట్లతో ఒక షార్ట్‌ఫిల్మ్ తీసి రికార్డ్ సృష్టించాలనుకుంటున్నాను. అంత పెద్ద బడ్జెట్‌తో షార్ట్‌ఫిల్మ్ తీసిన ఘనత చరిత్రలో నాకే దక్కుతుంది’’ చెప్పాడు వర్మ.‘అలాగే. నీ కోరిక నెరవేరుతుంది. ఇంటికి వెళ్లి చూడు’’ వరం అనుగ్రహించి అక్కడి నుంచి మాయమయ్యాడు నారదుడు.‘ఇవి పెట్టుడు మీసాలు, గెడ్డాలని....ముంబైనుంచి వచ్చిన వాళ్లు ఈ గెడ్డం అడవి సెట్టింగ్ వేశారని పాపం నారదుల వారికి తెలియదు’ అని తనలోతాను నవ్వుకున్నాడు వర్మ.మెరుపు వేగంతో హైదరాబాద్‌కి వెళ్లాడు.తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లాడు. ఎటు చూసినా కోట్లే!టేయిల్ కోట్, మార్నింగ్ కోట్, ఫ్రాక్ కోట్, డిన్నర్ కోట్, స్మోకింగ్ కోట్, డస్టర్ కోట్, ట్రెంచ్ కోట్, రెయిన్ కోటు...ఇలా ప్రపంచ నలుమూలలకు చెందిన వంద కోట్లు ఆ ఇంట్లో ఉన్నాయి.వర్మకు దిమ్మతిరిగింది. ఎన్నడూ లేనిది ‘ఓ మైగాడ్’ అని గట్టిగా అరిచాడు. – యాకుబ్ పాషా -
స్మాల్‌బాస్ షో... విన్నర్ ఎవరు?
కాకులు దూరని కారడవి... చీమలు దూరని చిట్టడవి అది.ఆ అడవి మధ్యలో ఒక కొండపై అందమైన ఇల్లు ఒకటి నిర్మించారు. ఈ ఇంట్లో ఎవరు ఉన్నారో తెలుసా? పలు రంగాల ప్రముఖులతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంపు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్నారు.వీళ్లకు అక్కడేం పని?‘స్మాల్‌బాస్’ అనే టీవీ షోలో భాగంగా ఒక నెలరోజుల పాటు వాళ్లు ఈ ఇంట్లో ఉన్నారు. బట్టలు ఉతుక్కోవడం నుంచి వంట చేసుకోవడం వరకు తమ పనులు తామే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వారం ‘స్మాల్‌బాస్’ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్‌లో విఫలమైన వారు ఎలిమినేట్ అవుతారు.పేషెన్సీ లెవల్‌ను పరీక్షించడానికి, మనిషిలోని ఒరిజినల్ క్యారెక్టర్‌ను బయటికి తీసుకురావడానికి ఉద్దేశించిన టీవీ షో ఇది. అన్ని సవాళ్లను తట్టుకొని చివరి వరకు ఎవరు నిలుస్తారో వారే విజేత.‘డూప్లికేట్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ అని రెండు వేరుగా ఉండవు. నాది ఎప్పుడూ ఒకే క్యారెక్టర్...అది ఒరిజినల్ క్యారెక్టర్. కాబట్టి నేనే విజేత’ అని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మొదటి వారం టాస్క్:‘తన కోపమే తన శత్రువు’ఈ టాస్క్‌లో భాగంగా ఒకరినొకరు రెచ్చగొట్టుకోవాలి. అయినా సరే ఎవరు టెంప్ట్ కావద్దు. కోపం తెచ్చుకోవద్దు. ఒకవేళ తెచ్చుకుంటే షో నుంచి ఎలిమినేట్ అవుతారు.ఆరోజు...‘‘ఎక్స్‌క్యూజ్‌మీ...’’ అంటూ ట్రంపు దగ్గరకి వచ్చాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్.‘‘ఏమిటి మిత్రమా!’’ కిమ్‌ను ప్రేమగా పలకరించాడు ట్రంప్.‘‘ఒకసారి మీ చెంప చూపిస్తారా’’ ఆప్యాయంగా అడిగాడు కిమ్.‘‘ఇదిగో ఇదే నా చెంప’’ అని చూపించాడు ట్రంప్.చుక్కలు కనిపించేలా చెంప మీద ఒక్కటిచ్చుకున్నాడు కిమ్.ట్రంప్‌కు కోపం రాలేదు సరికదా...చిరునవ్వుతో అన్నాడు...‘‘మిత్రమా కుడిచెంప మాత్రమే వాయించావు. ఎడమ చెంప ఏ పాపం చేసింది?’’ఎడమ చెంప మీద కూడా గట్టిగా ఒక్కటి ఇచ్చాడు కిమ్.ఈసారి కూడా కోపం తెచ్చుకోలేదు. ‘థ్యాంక్స్ గురూ’ అంటూ కిమ్ కళ్లలోకి కృతజ్ఞతపూర్వకంగా చూశాడు ట్రంప్.కొద్దిసేపటి తరువాత...‘‘ఏమిటి ట్రంపుగారు ఇలా వచ్చారు?’’ అడిగాడు కిమ్.‘‘ఎప్పుడూ మీ రూమ్‌లోనే ఉంటారా. ఈరోజు నా రూమ్‌కి రావాలి...నా సీట్లో ఆసీనులు కావాలి. ఇంతకుమించి ఈ జన్మకు సార్థకత లేదు’’ మెలికలు తిరుగుతూ అడిగాడు ట్రంప్.‘‘అదెంత పని. ఇప్పుడే వస్తాను’’ అంటూ పరుగులాంటి నడకతో ట్రంప్ రూమ్‌లోకి వచ్చి ఆయన సీట్లో కూర్చున్నాడు కిమ్.అంతే...‘ఢాం...’ అని పే....ద్ద సౌండ్.కిమ్ ప్యాంట్ చీలికలు పేలికలైంది. ముఖం నల్లబారింది.‘‘ముందస్తు ఎన్నికలలాగా.... ముందస్తు దీపావళి అన్నమాట...నీ సీటు కింద లక్ష్మీబాంబులు రెండు పెట్టాను. హ్యాపీ దివాలీ’’ అన్నాడు ట్రంప్.అయినా సరే కిమ్‌కు కొద్దిగా కూడా కోపం రాలేదు.‘‘థ్యాంక్స్ అన్నయ్య. బాంబు చల్లగా ఉంది’’ అని ట్రంప్‌ను ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు.ఇలా హౌజ్మెట్లు ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. ఎవరూ కూడా టెంప్ట్ కాలేదు. కొద్దిగా కూడా కోపం తెచ్చుకోలేదు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఓటింగ్ పెట్టారు.‘ఆహా ఓహో’ కేటగిరీలో అందరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. ఎలిమినేట్’ కేటగిరీలో మాత్రం జీరో! అంటే ‘ఫలానా వ్యక్తిని ఎలిమినేట్ చేయాలి’ అని ప్రేక్షకులు ఎవరినీ కోరడంలేదన్నమాట. ప్రేక్షకులకు అందరూ పిచ్చపిచ్చగా నచ్చేశారు. రెండో వారం టాస్క్:‘ఆవు పేడ తెచ్చి హౌజ్ అలకాలి’ఈ పని ఎవరైనా చేయకపోతే ఎలిమినేట్ అవుతారు.ఆరోజు...తెల్లవారుజామున నాలుగు తరువాత హౌజ్‌లో ఒక్కరూ లేరు. ఆ అడవిలో తలోదిక్కు వెళ్లారు. ఆరుగంటలకల్లా అందరూ పేడతట్టలతో వచ్చారు. తాము తెచ్చిన పేడతో హౌజ్‌ను అలికారు.‘ఈసారి కూడా ఎవరూ ఎలిమినేట్ కాలేదే!’ తలపట్టుకున్నాడు స్మాల్‌బాస్.ప్రేక్షకుల ఎలిమినేట్ లిస్ట్‌లో కూడా ఎవరూ లేరు.మూడో వారం కూడా కఠినమైన టాస్క్ ఇచ్చారు. అయినప్పటికీ అందరూ విన్ అయ్యారు.ఇక చివరి వారం మిగిలింది.‘‘ఫైనల్లో అందరూ విన్ అయ్యారా? ఎవరైనా ఎలిమినేట్ అయ్యారా? గత ఎపిసోడ్లను బట్టి చూస్తే మళ్లీ అందరూ విన్ అవుతారని నాకు బలంగా అనిపిస్తుంది. ఒకవేళ అలాగే జరిగితే షో ఫ్లాప్ అయినట్లే కదా! దీనికి నీ సమాధానం ఏమిటి?’’ భేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు.‘‘పిచ్చిభేతాళా! అందరూ విజేతలు కావడం కాదు...అందరూ హౌజ్ నుంచి పారిపోయారు’’ అంటూ అసలు విషయం చెప్పాడు విక్రమార్కుడు.‘‘అదేమిటి? అసలేం జరిగింది?’’ ఆత్రుతగా అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు: ‘‘చివరి వారం...చావో రేవో అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా హౌజ్మెట్లు ఒక కొత్తవంటకాన్ని కనిపెట్టాలి. ఆ వంటకాన్ని తయారుచేసి ఎవరికో ఒకరికి తప్పనిసరిగా తినిపించాలి. అందరూ ఉత్సాహంగా కొత్త కొత్త వంటలు తయారుచేశారు. కాని తినేవారు ఏరీ? నువ్వు తిను అంటే... కాదు నువ్వు తిను. ఇదే గొడవ. ఈ గొడవలో భాగంగా ఒకరినొకరు చావబాదుకున్నారు. ఇది స్మాల్‌బాస్ నియమాలకు విరుద్ధం. ఎవరూ పోట్లాడుకోవద్దు...అని గట్టిగా అరిచాడు స్మాల్‌బాస్. ఆతరువాత ‘ఇప్పుడు నేను మీకో కొత్త టాస్క్ ఇస్తున్నాను. చాలా సింపుల్. మీరు తయారు చేసిన వంటకాన్ని మీరే తింటే చాలు’ అని ప్రకటించాడు. అంతే...ప్రాణభయంతో ఎటు వాళ్లు అటు పరుగులు తీశారు. హౌజ్‌లో ఒక్కరు ఉంటే ఒట్టు!’’ – యాకుబ్ పాషా -
అయ్యా ఆమె ఎవరు?
మొన్నోరోజు గోడ మీద బాలీవుడ్ సినిమా పోస్టర్ ‘స్త్రీ’ (మీ అభిమాన తార శ్రద్ధా కపూర్ నటించిన) చూసీ చూడగానే మా ఊరి గోడలు గుర్తుకు వచ్చాయి. సినిమా పోస్టర్‌కు మా ఊరి గోడలకు ఏమిటి సంబంధం?ఏమిటా గొడవ అంటారా? ఈ సినిమాలోలాగే మా ఊళ్లోనూ ఒన్స్ అపాన్ ఏ టైమ్ కామెడీ, హారర్ చెట్టాపట్టాలేసుకొని తిరిగాయి. నేడే చదవండి...దసరా ముందో దసరా తరువాతో గుర్తులేదుగానీ ఒక పుకారు ఇలా షికారు చేసింది...అర్ధరాత్రి సమయంలో ఒక అపరిచిత స్త్రీ ఆ ఇంటివాళ్ల బంధువులలో ఎవరిదో ఒకరి గొంతుతో మాట్లాడుతుందట.మన బంధువే కదా అని తలుపు తీయగానే... ఎదుట ఒక యువతి! మీరు ఊహించినట్లుగానే ఆమె కళ్లు చింతనిప్పులు. ఆమె పండ్లు పదునైన కత్తులు. ఆ యువతి కనీవినీ ఎరగని భయానకమైన కంఠంతో...‘‘లోనికి రావచ్చా?’’ అని అడుగుతుందట.ఇక అంతే... సమాధానం చెప్పడానికి నోరు సహకరించదు. పరుగెత్తడానికి కాళ్లు సహకరించవు. గావుకేక పెట్టడం తప్ప మరో గత్యంతరం లేదు.నిజానిజాలు దెయ్యమెరుగు...ఈ పుకారు పుణ్యమా అని ఊరివాళ్లకు నిద్ర కరువైంది. పదేపదే ఇంటి తలుపుల వైపు చూడటమే పనైపోయింది. పుసుక్కున ఏ కుక్కో పిల్లో ఇంటి తలుపు తట్టి చప్పుడు చేసినా సకుటుంబ సపరివారంగా అందరూ భయంతో బిక్కచచ్చేవాళ్లు. తమలో తాము ఇలా గుసగుసలాడుకునేవారు...‘అదిగో అది రానే వచ్చింది’‘మన ఇల్లే దొరికిందా’‘మనం నిద్ర పోయినట్లు నటిస్తే...అది పక్కింటికి వెళ్లి తలుపు కొడుతుంది’ గుర్ర్‌ర్ర్‌ర్ర్...గుర్ర్ర్ర్ర్.. ఈ కృత్రిమ గుర్రుల సౌండ్‌తో వాడవాడంతా దద్దరిల్లేది. మా ఊళ్లో ఎస్పీ భయంకర్ అనే కానిస్టేబుల్ ఉండేవాడు, ఇతని అసలు పేరు లింగమూర్తి. అయితే ఈ పేరుతో అతడిని ఎవరూ పిలిచేవారు కాదు. ఊరందరికి అతడు ‘ఎస్పీ భయంకర్’ మాత్రమే. ఈ భయంకర్గారికి ఒకరోజు చౌరస్తా దగ్గర ఎవరో ‘తలుపుల దెయ్యం’ గురించి చెప్పారు.అంతే, అతను తుపానులా విరుచుకుపడ్డాడు.అగ్నిగుండంలా రగిలిపోయాడు.‘‘మీ తెలివితక్కువతనంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈ కాలంలో దెయ్యాలను నమ్మడమేంటి అసలు! మీరు మనుషులా దెయ్యాలా?’’ అని ఒంటి కాలు మీద నిలబడి అరిచాడు.అంతే కాదు...అసలు ఈ భూమి ఎలా పుట్టింది, సైన్స్ అంటే ఏమిటి? అంతరిక్షంలో ఏం జరుగుతుంది, బిగ్‌బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి....ఇలా కోసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. దీంతో కానిస్టేబుల్ కనకయ్యకు మండింది.‘‘ఒరేయ్ ఆ దెయ్యం కంటే నీ స్పీచ్ భయంకరంగా ఉంది. ఆపరాబాబు’’ అని కనకయ్య అరిస్తేగాని ఎస్పీ భయంకర్ తగ్గలేదు.అలాంటి ఎస్పీ భయంకర్ ఒక అర్ధరాత్రిపూట ‘వామ్మో...వాయ్యో’ అని అరుస్తూ ఇంటి బయటకు వచ్చాడు.‘‘ఏమైంది?’’‘‘ద....ద...ద...ద....ద...దెయ్యం’’ అంటూ మరోసారి జడుసుకున్నాడు.చెంబెడు నీళ్లు తాగిన అనంతరం ఇలా చెప్పాడు:‘‘సరిగ్గా రాత్రి పన్నెండుగంటలు. దబదబమని తలుపు చప్పుడైంది. వొద్దు...తలుపు తీయొద్దు అని మా ఆవిడ అరిచింది. నోరు మూసుకొని పడుకో అని నేను ఆమె మీద అరిచి స్పీడ్‌గా వెళ్లి తలుపు తీశాను...’’‘‘ఏమైంది?’’‘‘ఎవరో ఒక ఆడవ్యక్తి నిల్చొని ఉంది. అంతే నేను కళ్లు తిరిగి పడిపోయాను. ’’ అంటూ కళ్లనీళ్లు తుడుచుకున్నాడు. ఎస్పీ భయంకర్కు తలుపుల దెయ్యం ఎదురైన న్యూస్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. ఏ వీధిలో చూసినా, ఏ ఇంట్లో చూసినా ఇదే ముచ్చట. ఈ ఘటన దరిమిలా భయంకర్ పూర్తిగా డీలా పడిపోయాడు. మెడలో ఏవేవో తాయత్తులు కనిపించేవి. ఏ జేబులో చూసినా కుప్పలుతెప్పలుగా విభూతి కనిపించేది.ఎవరైనా భయంకర్ అని పిలిస్తే...‘‘నా పేరు భయంకర్ కాదు. లింగమూర్తి’’ అని వినయంగా బదులిచ్చేవాడు.ఎలాంటి మనిషి ఎలా అయ్యాడు?ఇంటి గోడల మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాయిస్తే వచ్చిన దెయ్యం వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోతుందని పుకారు బయలుదేరింది. అది పుకారా మారుతి కారా అనేది పక్కన పెడితే...‘‘రాయించుకుంటే పోయేదేముంది? దెయ్యం తప్పా’’ అనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటి గోడల మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాయించుకోవడం మొదలుపెట్టారు. ఈ దెబ్బతో ఆర్టిస్ట్ బొందయ్యకు చేతినిండా గిరాకీ. సంవత్సరం తిరక్కుండానే మంచి ఇళ్లు కట్టాడు.నిజాలు నిలకడ మీద తెలుస్తాయట.అదేమిటోగానీ... నిజాలు సంవత్సరం తరువాత తెలిశాయి. అవి ఇలా ఉన్నాయి:ఒకటి:లింగమూర్తి అలియాస్ ఎస్పీ భయంకర్‌ను భయపెడతాను అని చాలెంజ్ చేసి నిరూపించుకున్నాడు రాజేశం. ఆ అర్ధరాత్రి లింగమూర్తి చూసింది దెయ్యాన్ని కాదు... చీర కట్టి నెత్తిన కొంగు కప్పుకున్నరాజేశాన్ని.రెండు:‘ఓ స్త్రీ రేపు రా’ అనే కాన్సెప్ట్ ఆర్టిస్ట్ బొందయ్యదే. తనకు అట్టే బేరాలు లేకపోవడంతో ‘ఓ స్త్రీ రేపు రా’ అని గోడ మీద రాయిస్తే దెయ్యం వెనక్కి తిరిగిపోతుందనే ప్రచారాన్ని పుట్టించి, పెంచి, పోషించి విజయాన్ని సాధించాడు! – యాకుబ్ పాషా -
బడ బడ బడా దబ దబ దబా
వినాయకచవితి వస్తుందంటే లేదా వచ్చిందంటే బాగా గుర్తుకు వచ్చేది బడ బడ బడా...దబ దబ దబా!ఏ ప్రాంతంలోనైనా ఉందో లేక మా ప్రాంతంలో మాత్రమే ఉందో తెలియదుగానీ చవితి రోజు తిట్లు తింటే శుభం జరుగుతుందనే గట్టి నమ్మకం మా ఊళ్లో ఉండేది. ‘ఇంట్లో వాళ్లు, బంధువుల తిట్లు పనికిరావు. కేవలం బయటి వాళ్ల తిట్లే వర్కవుటవుతాయి’ అనేది కూడా మరో నమ్మకం.మా ఊళ్లో ముక్కోపి రావుగోపాలరావు అని అంతెత్తు మనిషి ఉండేవాడు. ఆయన అసలు పేరు గోపాలు. విలన్లా ఉంటాడని, కంచుకంఠం ఆయన సొంతంఅని కావచ్చు....గోపాలును అందరూ రావుగోపాల్రావు అని పిలుచుకునేవాళ్లు.వినాయకచవితి రోజు ఈ రావుగోపాల్రావు(రా.గో)కు బాగా గిరాకీ ఉండేది.ఏ కారణం లేకుండానే కోపం తెచ్చుకునే రావుగోపాల్‌రావుకి ఆరోజు కావాలని చిరాకో, కోపమో తెప్పించేవారు ఊరి జనాలు. అవి ఎలా ఉండేవంటే....ఒకడు రా.గోని చూసి వెటకారంగా నవ్వేవాడు.మరొకడు ఆయన ముందే ఆయన గొంతును అనుకరించి వెక్కిరించేవాడు.ఇంకొకడు... ఆయన లాల్చి లాగి దూరంగా పరుగెత్తేవాడు.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! తిట్టి తిట్టీ ఆయన అలిసిపోయేవాడే తప్ప, ఆయన్ని కవ్వించి తిట్లు తినాలనుకునే కస్టమర్లకు మాత్రం ఆరోజు కొరత ఉండేది కాదు. ఇక ఇలా కాదు అనుకొని పండుగవస్తే చాలు ఏ చుట్టాల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళ్లి నోరు దాచుకునేవాడు రా.గో ‘‘ఎన్ని పండుగలకని ఇలా పారిపోతావు? ఏదో పరిష్కారం ఆలోచించు’’ అని చుట్ట వెలిగించాడు ఆయన ఆత్మీయుడు ఆముదం. ఈయన అసలు పేరు ఇది కాదు. ముఖం ఎప్పుడూ జిడ్డోడుతుందని ముద్దుగా ఆముదం అని పిలుచుకుంటారు జనాలు.‘‘ఏంజేయమంటావురా ఆముదం? ఈ పండుగ నా సావు కొచ్చింది’’ అని చుట్ట వెలిగించాడు రా.గోఅప్పుడు ఆముదం ఆయన చెవిలో ఏదో ఊదాడు.రా.గో ముఖం చిచ్చుబుడ్డి కంటే పవర్‌ఫుల్‌గా వెలిగిపోయింది!ఆరోజు వినాయకచవితి.కొత్త దుస్తులు ధరించి పాత వీధుల వెంట నడవసాగాడు రా.గో‘‘మనిషికో మాట.... నీకో దెబ్బ’’ అన్నాడు ఎదురుగా వస్తున్నవాడు పళ్లు ఇకిలిస్తు!సర్రుమని కాలింది రా.గోకు!అయినా సరే కూల్‌గా నవ్వాడు. అంతే కాదు తనను తిట్టిన వాడికి నమస్కారం పెట్టాడు. రా.గోలో ఊహించని ఈ సంస్కారానికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అదిరిపడ్డాడు తిట్టినోడు!రా.గో సరిగ్గా సర్కారు బావి దగ్గరకు వచ్చాడో లేదో.... న్యూస్‌పేపర్‌ను ఉండలా చుట్టి ముఖం మీదికి బాల్లా విసిరాడు ఒకడు. అయినా సరే... కూల్‌గా నవ్వాడు రా.గో. స్పీడ్‌గా నడవడం రా.గో అలవాటు. నడుస్తున్న దారిలో ఎవరో అరటి తొక్క విసిరారు. అది తొక్కి భారీ శబ్దంతో కిందపడిపోయాడు రా.గో. అయినా సరే ఓపికగా లేచాడే తప్ప ఎవరినీ తిట్టిన పాపాన పోలేదు.... ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని జరిగినా తనలో ‘కూల్’ని హీట్ కానివ్వలేదు రా.గో. దీంతో కవ్వింపు కస్టమర్లు తగ్గారు.‘అబ్బే! ఈయన్ను నమ్ముకొని లాభం లేదు’ అనుకునే పరిస్థితి వచ్చింది.చవితి రోజు తిట్లు తినడానికి ఉపయోగించే టెక్నిక్‌లలో రా.గో టెక్నిక్ కంటే పాపులర్ టెక్నిక్ ఒకటి ఉంది. అదే ‘బడ బడ బడా... దబ దబ దబా’ టెక్నిక్. దీనిలో భాగంగా ఇంటి మీద రాళ్లు వేస్తారు. తద్వారా ఆ ఇంటి వాళ్ల నుంచి తాజా తిట్లు తింటారు.ఆరోజుల్లో డాబా ఇండ్ల కంటే పెంకుటిళ్లు, రేకుల ఇండ్లే ఎక్కువ కదా.అర్ధరాత్రి తరువాత... బడ బడ బడా దబదబదబామని శబ్దాలు వినిపించేవి. ఇరుగింటి వాడు పొరుగింటి వాడి రేకుల ఇల్లు మీద విధిగా నాలుగు రాళ్లు వేసేవాడు. ఆ సమయంలో ఆసియా ఖండంలోనే అరుదైన తిట్లు వినిపించేవి. ఆ తిట్ల ధాటికి ఎంతోమందికి నిద్ర కరువయ్యేది. ఒకవైపు తిట్ల వర్షం... మరోవైపు పిడుగు శబ్దాల్లాంటి రాళ్ల చప్పుళ్లతో చవితి రాత్రి కాస్తా శివరాత్రి అయ్యేది!కొందరు మాత్రం ‘తిట్లఫలం’ దుండగులకు దక్కవద్దు అనే కారణంతో తమ ఇంటి మీద ఎన్ని రాళ్లు విసిరినా చిన్న తిటై్టనా తిట్టే వాళ్లు కాదు. అలాంటి వాళ్లలో లింగయ్య ఒకడు. ఆయనది రేకుల ఇల్లు. ఆయన ఇంటి మీద ఎవరైనా రాళ్లు విసిరితే...‘‘మీరు రాళ్లు కాదు...గుట్టలేసినా తిట్టను’’ అని గట్టిగా అరిచి ఇంట్లోకి వెళ్లి మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. ఇప్పుడు మీకు ఒక దొంగోడి గురించి చెబుతాను.‘శివరాత్రి రోజు దొంగతనం చేయవద్దు’ అనేది జూనియర్ దొంగలకు సీనియర్లు ఇచ్చే సీరియస్ సలహా. కానీ ‘చవితి రోజు దొంగతనం చేయవద్దు’ అంటూ ఎలాంటి రూల్ లేకపోవడంతో ఒక అప్రెంటీస్ దొంగ చవితిరోజు మా ఊళ్లో దొంగతనానికి వచ్చాడు. తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఈ దొంగ అర్ధరాత్రి దాటిన తరువాత ఒక పెంకుటిల్లు ఎక్కాడు. ఈ ఇంటి పక్కనే ఒక రేకుల ఇల్లు ఉంది. ఆ టైమ్‌లోనే ఎవడో రేకుల ఇంటి మీదికి ఒక రాయి విసిరాడు. ఆ రాయి దొంగను ‘హాయ్’ అని పలకరించి వెళ్లింది తప్ప పెద్దగా గాయపరచలేదు. ఇక రెండోసారి దూసుకువచ్చిన పెద్ద రాయి మాత్రం దొంగ హెడ్‌ను ఆప్యాయంగా ముద్దాడింది. అంతే...‘వామ్మో!!!’ అని ఊరు నిద్రలేచేలా అరిచాడు దొంగోడు.చుట్టుపక్కల వాళ్లందరూ పరుగెత్తుకు వచ్చారు. వాడిని కిందికి దించారు.‘‘ఇల్లు ఎందుకు ఎక్కావురా?’’ అని అడిగాడు ఒకడు.‘‘దూడగడ్డి కోసం ఎక్కి ఉంటాడు’’ అన్నాడు పక్కోడు.నవ్వులే నవ్వులు!‘‘ముందు నీ పేరేమిటో చెప్పు’’ అని ఆ అమాయకపు దొంగ కళ్లలోకి భయంకరంగా చూస్తూ అడిగాడు కాస్త దిట్టంగా ఉన్నవాడు.‘‘నా పేరు...నా పేరు...’’ అని భయంభయంగా దొంగ తడబడుతుంటే వెనక నుంచి ఎవడో ‘దొంగ’ అని అరిచాడు.మళ్లీ నవ్వులే నవ్వులు!!మామూలుగానైతే పెద్ద దొంగ, చిన్న దొంగ, ఒక మోస్తరు దొంగ, తేలికపాటి దొంగ... అనే తేడా లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు దొరికితేచాలు దొంగను కుమ్మేస్తారు. ఎముకల్లో నుంచి సున్నం తీసి మరుసటి రోజు రథం ముగ్గు వేస్తారు. పండుగపూట హింస ఎందుకు అనుకున్నారో ఏమో.... దొంగోడి ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు. పైగా వాడి చేతిలో ఉండ్రాళ్ల సంచి పెట్టి మరీ ఊరు దాటించారు. ఏ దొంగకు పడుతుంది ఇంత అదృష్టం! – యాకుబ్ పాషా -
టెక్ బడి.. ‘బిజ్ ఏక్టివ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏఐ, బ్లాక్ చెయిన్ వంటి కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలంటే సిటీకి రావాలా? ట్రెయినింగ్ సెంటర్లో చేరాలా? ఇవన్నీ వద్దంటోంది స్టార్టప్ కంపెనీ ‘బిజ్ ఏక్టివ్’. ఒకటీ రెండూ కాదు ఏకంగా 87 రకాల టెక్నాలజీ కోర్సులు తమ సైట్ ద్వారానే నేర్చుకోవచ్చని చెబుతోంది ఈ సంస్థ. ‘వరంగల్’ కేంద్రంగా సేవలందిస్తున్న బిజ్ ఏక్టివ్‌లో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల నుంచి కూడా విద్యార్థులున్నారు. మరిన్ని వివరాలు బిజ్ ఏక్టివ్ ఫౌండర్ మహ్మద్ యాకుబ్ పాషా మాటల్లోనే.. ‘‘మాది వరంగల్ జిల్లా మల్లంపల్లి. ఆర్ధిక పరిస్థితుల కారణంగా బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి వరంగల్‌లో ఢిల్లీకి చెందిన ఓ ఎడ్యుకేషన్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. గ్రామీణ ప్రాంతం నుంచి రావటంతో టెక్నాలజీ కోర్సులను అంత త్వరగా అందుకోలేకపోయా. ఇది నా ఉద్యోగంపై ప్రభావం చూపించింది. నాలా ఇతర గ్రామీణ యువత ఇబ్బంది పడకూడదన్న అభిప్రాయంతో అందుబాటు సమయంలో తక్కువ ఖర్చుతో సాంకేతిక కోర్సులను అందించాలనే లక్ష్యంతో బిజ్‌ఏక్టివ్ సర్వీసెస్‌ను ఆరంభించా. 2016 మార్చిలో లక్ష రూపాయల పెట్టుబడితో వరంగల్ కేంద్రంగా ‘బిజ్‌ఏక్టివ్’ సర్వీసెస్‌ను ప్రారంభించా. తెలుగు, హిందీ భాషల్లో గ్రామీణులకు అర్థమయ్యేలా సులువైన పద్ధతుల్లో కోర్సులను అందించడమే మా ప్రత్యేకత. బిజ్‌ఏక్టివ్‌లో 2 ప్యాకేజీలు.. ప్రస్తుతం బిజ్‌ఏక్టివ్‌లో 2 రకాల ప్యాకేజీలున్నాయి. 1. ఎడ్యు అడ్వాన్స్డ్. ధర రూ.2,999. ఇందులో 152 అంశాలకు సంబంధించిన 87 రకాల కంప్యూటర్ కోర్సులుంటాయి. హిందీ భాషలో 10 రకాల కోర్సులుంటాయి. ఇవన్నీ ఆడియో, వీడియో ట్యుటోరియల్స్ రూపంలో ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుతో పాటూ 200 రకాల ఈ–పుస్తకాలను కూడా అందిస్తాం. ఇంటర్నెట్ అందుబాటులో లేనివాళ్ల కోసం ఆయా ప్యాకేజీ కోర్సుల పుస్తకాలను పెన్‌డ్రైవ్‌లో అందిస్తాం. రెండోది, ఎడ్యు అల్టిమేట్. ధర రూ.6,600. ఇందులో మొదటి ప్యాకేజీతో పాటూ షాపింగ్ చేసుకునేందుకు వీలుగా స్మార్ట్ కార్డ్‌ను ఇస్తాం. బిజ్కార్ట్.కామ్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. 4 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. రీచార్జ్, కరెంట్ బిల్లుల వంటి యుటిలిటీ సేవలతో పాటూ బస్, రైలు, విమాన టికెట్లను కూడా బుకింగ్ చేసుకోవచ్చు. నేపాల్, దుబాయ్‌లకు విస్తరణ... ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటూ చెన్నై, ముంబై, కోల్కత్తా, బెంగళూరు నగరాల్లో సేవలందిస్తున్నాం. 18 వేల మంది కస్టమర్లున్నారు. మా ఉత్పత్తులకు నేపాల్, దుబాయ్‌ల నుంచి డిమాండ్ ఉంది. త్వరలోనే ఆయా ప్రాంతా ల్లో కేంద్రాలను ఆరంభించనున్నాం. అనుమతికి దరఖాస్తు చేశాం. ఏడాదిలో లక్ష కస్టమర్లను చేరుకోవాలన్నది లక్ష్యం. అందుకే ఆఫ్‌లైన్‌లో శిక్షణ ప్రారంభించాం. ఇందుకు ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ వేణుగోపాల్ లక్ష్మీపురంను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాం. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మాకు 200 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఏడాదిలో 500 మందికి చేర్చుతాం. మా ప్యాకేజీ అమ్మకం మీద దాదాపు 10 శాతం కమీషన్ ఉంటుంది. గత రెండేళ్లలో రూ.3 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.10 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది టార్గెట్. ప్రస్తుతం మా సంస్థలో 8 మంది ఉద్యోగులున్నారు. పలు ఎన్జీవో, ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు చేస్తున్నాం. ఏడాదిలో రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ అని పాషా వివరించారు. -
గండర గండడు
ఐక్యరాజ్య సమితి వాళ్లకు సీరియస్ సమస్యలలో తలదూర్చి, తీర్పులు చెప్పి చెప్పీ బోర్ కొట్టేసింది. కాస్త రిలాక్స్ కోసం ఏదైనా చేయాలనుకున్నారు. వెంటనే ‘మీలో దమ్మున్నవాడు ఎవరు?’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా అసమాన అద్భుత సాహసాలు చేసేవారికి ‘యోధాను యోధ’ బిరుదు ఇచ్చి భారీ బహుమతి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది ఈ పోటీకి హాజరయ్యారు. అనేక వడపోతల తరువాత అయిదు దేశాల నుంచి అయిదుమంది ఎంపికయ్యారు.వారు ప్రదర్శించిన విద్యలు... మొదటి వాడు:తన పొడవాటి గడ్డాన్ని ఒక కారుకు కట్టి కిలోమీటరు వరకు లాగాడు అమెరికాకు చెందిన మాక్స్వెల్ గూటెన్‌బర్గ్.ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. రెండవవాడు:‘పూల్ ఔర్ కాంటే’ సినిమాలో అజయ్ దేవగణ్లా రన్నింగ్‌లో ఉన్న రెండు బైక్‌ల మీద అటో కాలు ఇటో కాలు వేసి దర్జాగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లాడు జపాన్‌కు చెందిన అమి అకియో తుమితుమి.ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు చరిచారు. మూడోవాడు:‘ఫైర్వాక్’ పేరుతో మండుతున్న నిప్పుల్లో అటు ఇటు అరగంట పాటు నడిచాడు చైనాకు చెందిన షాంగ్ మింగ్ డాంగ్.‘ఇక తప్పుతుందా’ అన్నట్లు చప్పట్లు కొట్టారు ప్రేక్షకులు. నాలుగవవాడు:రకరకాల విషసర్పాలను ఒంటి పై వేసుకొని హంగామా సృష్టించాడు రష్యాకు చెందిన వ్లాడిమీర్ మిస్తోలోవ్.సేమ్ సౌండ్!ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి ఇవన్నీ చూసి చిర్రెత్తుకొచ్చింది.‘‘ఎహే...చిన్నప్పుడు మా ఊరి అంగడిలో ఇంత కంటే మంచి సాహసాలు చూశాను’’ అని పెదవి విరిచాడు.‘‘వీటిని కూడా సాహసాలు అంటారా?’’ అని కోపగించుకున్నాడు ఐరాస కార్యదర్శి. ఈలోపు చివరి వ్యక్తి వచ్చాడు. అతడు అయిదు ఐటమ్స్ చేశాడు. ఏంచేశాడంటే... ఒకటి: తన జేబులో నుంచి ఒక కోడిగుడ్డును బయటకు తీసి దాన్ని ఆకాశంలోకి విసిరి గురిచూసి కాల్చాడు. అంతే.. ఆ గుడ్డులోని సొన కరెక్ట్‌గా వెళ్లి నేలపై ఉన్న పెనంపై పడి వేడి వేడి ఆమ్లెట్ అయింది! ‘అదిరిపోయింది’ అంటూ ప్రేక్షకుల నుంచి అరుపులు. ‘నిజమే సుమీ’ అన్నాడు ఐరాస కార్యదర్శి ఆనందంగా. రెండు: జేబులో నుంచి చిన్న బాక్స్ తీశాడు. అందులో నుంచి ఒక దోమను బయటకు తీసి గాల్లోకి ఎగిరేశాడు. తన అమ్ములపొదిలో నుంచి వాడిగల బాణాన్ని గురిచూసి సంధించాడు. అంతే...ఆ దోమ కళ్లు ఒక పక్క, కాళ్లు ఒక పక్క, రెక్కలు ఒక పక్క పడ్డాయి! ప్రేక్షకులతో పాటు ఐరాస కార్యదర్శి చప్పట్లు చరిచాడు. మూడు: ఒకరాత్రి విమానం ఎక్కి ఆకాశంలోకి దూసుకెళ్లాడు. అంత పెద్ద ఆకాశాన్ని పట్టుకొని అయిదు నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఊపాడు. చింతచెట్టు నుంచి చింతకాయలు రాలిపడ్డట్లు ఆకాశం నుంచి చుక్కలు రాలిపడ్డాయి!‘కేక’ అని అరిచారు ప్రేక్షకులు. ‘డబుల్ కేక’ అని అరిచాడు కార్యదర్శి. నాలుగు: ఒక పెద్ద బకెట్ తీసుకొని హిందూ మహాసముద్రంలోని నీళ్లన్నీ తోడి సçహార ఎడారిలో పోశాడు. అక్కడ ఉన్న ఇసుకను బస్తాల్లో నింపి హిందూ మహాసముద్రంలో నింపాడు! అయిదు: సూర్యుడికి చంద్రుడికి మధ్య పెద్ద తాడు కట్టి దాన్ని ఉయ్యాలగా చేసుకొని ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్...ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ అట్లతద్ది పాటలు పాడాడు. ఇవన్నీ చూసిన తరువాత ‘‘ఈడు మగాడ్రా బుజ్జి...ఈడే విజేత’’ అని ప్రకటించాడు ఐరాస కార్యదర్శి.విజేతను అందరూ చుట్టుముట్టారు. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు. కొందరు అతనిపై పూలవర్షం కురిపించారు. కొందరు అతడి చేతిని ప్రేమగా ముద్డాడారు.‘ఆగండి’ అని గట్టిగా అరిచాడు ఐరాస కార్యదర్శి. గుండు సూది కింద పడినా శబ్దం వినిపించేంత నిశ్శబ్దం! ‘‘ఆనందంలో పడిపోయి అసలు విషయం మరిచిపోయాం. ఈయన పేరేమిటో, ఏ దేశం నుంచి వచ్చాడో తెలుసుకుందాం. ఈ పోటీలో గెలిచిన వ్యక్తి ఏ మూలన ఉన్న స్టేజీ మీదికి వచ్చి తన గురించి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అన్నాడు కార్యదర్శి.‘ఈ గండరగండడు ఏ దేశం వాడో... ఏంచేస్తుంటాడో’ అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నిండిపోయింది. ఈలోపు ప్రేక్షకుల మధ్య నుంచి చినిగిన బట్టలతో స్టేజీ మీదికి వచ్చాడు విజేత. మైక్ అందుకొని...‘‘అభిమానం అనేది బురదలాంటిది. షర్ట్ వెళ్లి బురదలో పడ్డా, బురద వెళ్లి షర్ట్ మీద పడ్డా షర్ట్‌కే డ్యామేజీ!’’ అని మొదలు పెట్టాడు విజేత.‘‘ఆ విషయం తరువాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు...ముందు నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో చెప్పవయ్య!’’ ఆసక్తిగా అడిగాడు కార్యదర్శి.‘‘నా పేరు సిల్వర్స్టార్బాబు, సౌత్ఇండియన్ సినిమాల్లో హీరోగా పని చేస్తుంటాను’’ అంటూ తన గురించి చెప్పి కప్పు అందుకొని ఫొటోకు పోజు ఇచ్చాడు ‘మీలో దమ్మున్నవాడు ఎవరు?’ విజేత! – యాకుబ్ పాషా -
ఒక అఆ కథ!
ఆయన పేరు ఆనందు. ఆనందు కళ్లలోకి సూటిగా చూస్తే... ‘అప్పులోనే ఆనందం ఉంది’ అని చెబుతాయి ఆ కళ్లు. ఆనందును ఆ పేరుతో కాకుండా ‘అఆ’ (అప్పుల ఆనందు) అని పిలుస్తుంటారు అందరూ. ఆ నోటా ఈ నోటా విన్న ఆయన ఆటోబయోగ్రఫీ ప్రకారం... ప్రైమరీ స్కూల్ రోజుల్లో ఆనందు పక్క సీటు వాడి దగ్గర బలపాలు అప్పు చేసేవాడు. ‘‘మొన్న నా బలపం తీసుకున్నావు. ఇవ్వు’’ అని బలపం అప్పిచ్చిన వాడు అడిగితే, ఆనందు అమాయకంగా ముఖం పెట్టి బిగ్గరగా ఏడ్చాడు. ‘‘ఏమైంది?’’ అని పంతులుగారు ఆరా తీస్తే... ‘‘ఈడు నన్ను బలపం ఇవ్వమని కొడుతున్నాడు’’ అని ఏడుపు పొడిగించాడు. వీడి ఏడుపుకు గుండె కరిగిన పంతులుగారు ఆవేశపడిపోయి ఆనందు ఫిర్యాదు చేసిన వాడిని ఓ రేంజ్లో బాదారు. పంతులుగారు క్లాసురూమ్ దాటి బయటికి వెళ్లగానే.... ‘బలపం కావాలట బలపం...గిల్పం కావాలట గిల్పం’ అంటూ బాధితుడ్ని వెక్కిరించాడు ఆనందు. ఈ ఆనందు అప్పుల ఆగడాలు బలపాలతో ఆగలేదు. హైస్కూల్ రోజుల్లో టెక్ట్స్బుక్లు అప్పు అడిగేవాడు. ‘నీ సోషల్ బుక్ ఒక్కసారి ఇవ్వరా’ అని ఎవరో ఒకరి దగ్గర పుస్తకం తీసుకుంటాడు. అంతే... వారం దాటినా ఆ పుస్తకం జాడ తెలియదు. అరువు తెచ్చుకున్న పుస్తకాన్ని ఇంట్లో పాత పెట్టెలో దాచుకొని పదేపదే మురిసిపోయేవాడు. ‘అయ్యో! బుక్‌ను ఎలుకలు కొట్టేశాయి’ అంటూ స్నేహితుని చెవిలో పువ్వు పెట్టేవాడు. ఇక ఇంటర్ రోజుల్లో షర్ట్లు, ప్యాంట్లు అప్పు చేసేవాడు. ‘‘అరే మామా! నీ షర్ట్ సూపర్‌గా ఉంది. ఒకసారి వేసుకొని ఇస్తాను’’ ఎవరో ఒక ఫ్రెండ్‌ను అడిగేవాడు. ‘‘అలాగే’’ అని అమాయకంగా ఇచ్చేవాడు ఆ ఫ్రెండ్. వారం రోజులు దాటినా ఇచ్చిన షర్ట్ తిరిగి రాకపోయేసరికి... ‘‘షర్ట్ ఎప్పుడిస్తావురా?’’ అని వీలైనంత దీనంగా అడిగేవాడు షర్ట్ ఓనరు. ‘‘నీ షర్టు ఎడమజేబు మీద చిన్న చిన్న పువ్వులు డిజైన్ చేయిస్తున్నాను. పూలరంగడు సినిమాలో నాగేశ్వర్రావు షర్ట్‌లా ఉంటుందనుకో’’ అని నమ్మబలికేవాడు. ‘‘అబ్బే! నీకెందుకు అనవసరంగా ఖర్చు’’ అనేవాడు షర్ట్ ఇచ్చిన వాడు మొహమాటంగా. ‘‘ఫ్రెండ్షిప్ అన్నాక డబ్బు గురించి అతిగా ఆలోచించొద్దు’’ అనేవాడు ఆనందు గంభీరంగా. మంచితనం, మమకారం, ఆప్యాయత, అనురాగం, స్నేహధర్మం, త్యాగ్యనిరతి...మొదలైన వాటికి తలదాచుకోడానికి లోకంలో ఎక్కడా చోటు లేక ఆనందులో కొలువున్నవి అనుకునేవాడు షర్ట్ ఓనరు అమాయకంగా. ఒక్క వారం కాదు... ఎన్ని వారాలు గడిచిపోయినా ఆ షర్ట్ ఏమైందో తెలిసేది కాదు. పూలరంగడు ఏమయ్యాడో తెలిసేది కాదు. ‘‘మొన్న ఒక ఫంక్షన్లో ఆనంద్గాడు నీ షర్ట్ వేసుకొని కనిపించాడు!’’ అని ఎవరో ఒకరు చెవిలో వేస్తే ఏడవాలో, నవ్వాలో తెలియక రెండిటినీ మిక్స్ చేసి ఏడుపుగొట్టు నవ్వు నవ్వేవాడు షర్ట్ ఓనరు. పుస్తకాలు పెద్దగా చదవకపోయినా ముళ్లపూడి వారి ‘రుణానందలహరి’ పుస్తకం అంటే ఆనందుకు అమితమైన ఇష్టం. అందులో ఒక పద్యం ఉంటుంది ఇలా... ‘అప్పులు చాలా చేసితిని యర్హత లేదనబోకు లోకమం దప్పులు తప్పులు న్నెరుగనేరని వారెవరైన నుందురే అప్పులస్వామి యా వరుణ, డప్పుల కుప్పలు మేఘవార్నిధుల్ తప్పగునా రుణంబు? రుణదా! శరధీ! కరుణాపయోనిధి!’ రేడియోలో సుప్రభాతం వస్తున్న టైమ్‌లో ఈ పద్యాన్ని రోజూ నిష్ఠగా చదువుకునేవాడు ఆనందు. అలాంటి ఆనందు ఒక ఉద్యోగంవాడయ్యాడు. ఆనందు మాంచి మాటకారి. ఎంత బిగుసుకుపోయిన వాడినైనా ఒక్కరోజులో ఫ్రెండ్‌గా మార్చుకోగలడు. మూడురోజుల్లో క్లోజ్ఫ్రెండును చేసుకోగలడు. వారం తిరిగేలోపు తనకు ప్రేమతో అప్పు ఇచ్చేలా చేసుకోగలడు. ఎన్నో ఉద్యోగాలు మారిన ఆనందు ఎందరో మహానుభావుల దగ్గర ఎన్నో అప్పులు చేశాడు. ఆ అప్పుల పుణ్యమా అని ఆనందు ఆర్థికపరిస్థితి మారిపోయింది. కొండాపూర్‌లో ఖరీదైన ఇళ్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి ‘రుణానందలహరి’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆ ఇంటి గోడలపై అక్కడక్కడా ‘రుణానందలహరి’లో నుంచి ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి. ‘సూర్యుడు సముద్రుడి దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆయన దగ్గర నుంచి భూమి అప్పు తీసుకుంటుంది. దాన్ని సముద్రుడు వాడేసుకుంటాడు. మళ్లీ పై వాడికి అప్పులిస్తాడు’ ‘గొప్పవాళ్లలో అప్పు చేయని వాడెవడు?’ ఒకానొక రోజు ఆనందు గుండెపోటుతో గుటుక్కుమన్నాడు. ఆ ఇల్లు జనాలతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా ఏడుపులే! ‘‘ఈయనకు ఇంత ఫాలోయింగ్ ఉందా?’’ అని అప్పారావు సుబ్బారావుని అడిగాడు. ‘‘ఫాలోయింగా పాడా! ఇక్కడ ఏడుస్తున్న వాళ్లంత ఆయన ఆత్మీయులు కాదు...అప్పులు ఇచ్చిన వాళ్లు! నిన్నటి వరకు తమ అప్పు ఏరోజుకైనా తీర్చకపోతాడనే చిన్న ఆశ ఉండేది. చివరికి ఆ ఆశ కూడా తుపాన్లో దోశలా కొట్టుకుపోయింది. అదీ విషయం’’ అని చెప్పాడు సుబ్బారావు. – యాకుబ్ పాషా -
ఏమో... గాడిద పాడవచ్చు!
విక్రమార్కుడి భుజాల మీద తిష్ట వేసిన బేతాళుడు గొంతు సవరించాడు. క్వశ్చన్ అడగడానికి రెడీ అయ్యాడు.‘‘ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతున్నాను...’’ అని బేతాళుడు అనబోయాడో లేడో విక్రమార్కుడు అడ్డుకొని..‘‘ఆగవయ్యా బాబు’’ అంటూ కసురుకున్నాడు.‘‘మీ మూడ్ బాలేనట్లుంది. తర్వాత అడుగుతాలే...’’ నసిగాడు బేతాళుడు.‘‘మూడ్ బాగుండడం బాలేకపోవడం ఇక్కడ మ్యాటర్ కాదు. ఇదిసరే...నువ్వు ఒకే ఒక్కడు సినిమా చూశావా బేతాళా?’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘ఒకే ఒక్కడే కాదు రాజమౌళి విక్రమార్కుడు సినిమా కూడా చూశాను’’ బదులిచ్చాడు బేతాళుడు.‘‘గుడ్. ఒకేఒక్కడు సినిమాలో అర్జున్‌కు రఘువరన్ ఒక సవాలు విసురుతాడు. నా సీట్లో ఇరవైనాలుగు గంటలు కూర్చుంటే తెలుస్తుంది నీకు అని... గుర్తుందా?’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘ఎందుకు గుర్తు లేదు...ఆ సీన్ ఇప్పుడు నాకెందుకు గుర్తు తెస్తున్నావు?’’ అడిగాడు బేతాళుడు.‘‘ఆ సినిమాలో రఘువరన్‌లా నేను నీకు సవాలు విసురుతున్నాను. నువ్వు కొద్దిసేపు నా పాత్ర పోషించు. ఎప్పుడూ నువ్వు క్వశ్చన్ అడుగుతావు... నేను ఆన్సర్ చెబుతాను కదా! ఈసారి అలా కాదు... నేను క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఆన్సర్ చెప్పాలి. అప్పుడుగానీ అడిగే వాడికి చెప్పేవాడు ఎంత లోకువో తెలియదు’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘దాన్దేముంది రాజా! అడిగేయ్.... ఎంత టఫ్ క్వశ్చన్ అడిగినా జవాబు చెబుతాను’’ ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుండగా అన్నాడు బేతాళుడు.గొంతు విప్పాడు విక్రమార్కుడు...‘‘ఆయన పేరు రంగభూపతినాయుడు. సిటీలో పేరున్న క్రిమినల్ లాయర్. నువ్వు ఎక్స్‌స్పెక్ట్ చేసినట్లుగానే ఆయనకొక ముద్దుల కూతురు. పేరు మృదుల. ఆమె స్వాతిముత్యంకుమార్ ప్రేమలో పడింది.తన పేరులాగే ఈ స్వాతిముత్యంకుమార్ పరమ సాత్వికుడు. భూపతినాయుడు ఆస్తి అంతస్తులతో పోల్చితే స్వాతిముత్యంకుమార్ ఏ మూలకూ సరిపోడు. స్వాతిముత్యంకుమార్ ఓ ఫైన్‌మార్నింగ్ భూపతినాయుడు ఇంటికివెళ్లి కాలింగ్‌బెల్ నొక్కాడు.అప్పుడే నిద్ర లేచిన నాయుడు తలుపులు తీసి ఆవులిస్తూ....‘‘ఎవరు నువ్వు? ఈ టైమ్‌లో ఎందుకువచ్చావు? నీకు నాతో పనెంటీ... ఒకవేళ ఉన్నా ఈ టైమ్‌లో ఏంటి...’’ ప్రశ్నల పరంపరతో దూసుకుపోయాడు భూపతినాయుడు.‘‘నమస్కారం సార్. నా పేరు స్వాతిముత్యం కుమార్. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. మీరు ఆశీర్వదిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’’ అంటూ చెప్పి ఒక కాగితం నాయుడు చేతికి ఇచ్చాడు స్వాతిముత్యంకుమార్.‘‘ఏమన్నావ్? నన్నెవరనుకుంటున్నావ్’’ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు నాయుడు.సరిగ్గా ఆ టైమ్‌లోనే యోగా గురువు యోగానంద్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.‘తన కోపమే తన శత్రువు... హెల్త్ సర్వనాశనం’వెంటనే కూలై పోయి....‘‘మా అమ్మాయిని పెళ్లాడతానంటావు. అంతేకదా! మరి ఈ కాగితం ఏంటమ్మా?’’ అడిగాడు నాయుడు.‘‘నా కండక్ట్ సర్టిఫికెట్ సార్’’ బదులిచ్చాడు స్వాతిముత్యంకుమార్.‘‘మా నాయినే. నీ బ్యాంక్ బాలెన్స్ ఎంత?’’ వెటకారం ధ్వనించేలా అడిగాడు నాయుడు.‘‘ఖాళీ... నా హృదయం అనే బ్యాంకులో మాత్రం వేల కోట్ల కంటే విలువైన ప్రేమ ఉంది’’ తన్మయంగా అన్నాడు స్వాతిముత్యంకుమార్.‘‘నీ కవిత్వానికేంగానీ, చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమా చూశావా? మై డియర్ స్వాతిముత్యం?’’‘‘అప్పుడెప్పుడో టీవీలో వచ్చినప్పుడు చూశాను...’’‘‘అయిదేళ్లలో అయిదు లక్షలు సంపాదిస్తే నా కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని రావుగోపాలరావు చిరంజీవితో అంటాడు. ఆ ఛాలెంజిని చిరంజీవి స్వీకరిస్తాడు. మరి నేను కూడా నీకో ఛాలెంజ్ విసురుతున్నాను. రెడీనా?’’ ‘‘రెడీ’’‘‘అదిగో ఆ మూలన కట్టేసిన గాడిదను చూశావా. గాడిదపాలు ఆరోగ్యానికి మంచివని చెబితే మొన్ననే కొన్నాను. ఈ గాడిదను నీకు ముందస్తు పెళ్లికానుకగా ఇస్తున్నాను.నువ్వు చేయాల్సిందేమిటంటే....వారం తిరిగేలోపు ఈ గాడిద ద్వారా లక్ష రూపాయలు సంపాదించాలి. అలా చేస్తే నీకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను.’’ ‘‘మీ ఛాలెంజిని స్వీకరిస్తాను. వారం తిరిగేలోపు మీ చేతిలో లక్ష కాదు... రెండు లక్షలు పెడతాను’’ ‘‘ఇప్పుడు చెప్పు బేతాళా! స్వాతిముత్యం రెండు లక్షలు సంపాదించాడా? ఒకవేళ సంపాదిస్తే ఎలా సంపాదించాడు? చెప్పకపోయావో.... ఇక నన్నెప్పుడూ వెధవ ప్రశ్నలు అడుగొద్దు’’ హెచ్చరించాడు విక్రమార్కుడు.బేతాళుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు:‘‘గాడిద లాటరీ.... పేరుతో రంగంలోకి దిగాడు స్వాతిముత్యం. ఎవరైనా గాడిద కోసం లాటరీ టికెట్ కొంటారా? ఎందుకు కొనరు? అది ఆషామాషీ గాడిద కాదు. పాటలు పాడే గాడిద. ‘కేవలం వేయి టికెట్లు మాత్రమే... ఒక్కో టికెట్‌కు వేయి రూపాయలు మాత్రమే!’ అని ప్రచారం ప్రారంభించాడు స్వాతిముత్యం. టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆరోజు లక్కీడ్రా తీశారు. లాట్రీ ఎంకయ్య పేరు వచ్చింది. నిజానికి ఎంకయ్య ఇంటిపేరు లాట్రీ కాదు... మాటూరి. లాటరీ టికెట్ల పిచ్చి ఉండడంతో అందరూ ఎంకయ్యను లాట్రీ ఎంకయ్య అని పిలుస్తుంటారు. లాటరీ టికెట్ తగలడంతో తన జన్మధన్యమైంది అనుకున్నాడు ఎంకయ్య. వెయ్యిరూపాయలతో సొంతం చేసుకున్న గాడిదతో దేశవిదేశాల్లో సంగీతకచేరీలు పెట్టి కోట్లు సంపాదించాలని కలలు కంటూ స్వాతిముత్యం ఇంటికి వెళ్లాడు.పాడుతుంది అనుకున్న గాడిద పాడలేదు సరికదా... నాన్‌స్టాప్‌గా ఓండ్ర పెడుతూనే ఉంది.‘అన్యాయం... మోసం’ అని అరిచాడు వెంకయ్య.‘ఇదిగో నీ వెయ్యి రూపాయలు. దీంతో పాటు అయిదు లక్షలు కూడా ఇస్తున్నాను. విషయం మాత్రం ఎక్కడా బయటపెట్టవద్దు’ అని డబ్బుల సంచి ఎంకయ్య చేతిలో పెట్టాడు స్వాతిముత్యం.అంతే... అతడి నోరు మూతపడింది. తన దగ్గర ఉన్న మరో అయిదు లక్షలతో భూపతినాయుడు ఇంటికి వెళ్లాడు స్వాతిముత్యం,‘‘శబ్భాష్ బేతాళా! కఠినమైన ప్రశ్నలు అడగడమే కాదు... కఠినమైన ప్రశ్నలకు జవాబు కూడా చెప్పగలవని రుజువు చేశావు’’ అంటూ భుజం మీది బేతాళుడిని తెగ ప్రశంసించాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
టచ్ చేసి చూడు
మెరుపుకాంతుల మధ్య దివ్యంగా వెలిగిపోతున్నాడు గాడ్ డైనసిస్. ఎందుకో ఆయనకు సడన్‌గా కింగ్ మిడాస్ గుర్తుకు వచ్చాడు. తనలో తాను నవ్వుకున్నాడు. '‘మిడాస్...ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరిలో కంటే నీ దగ్గరే బంగారం ఎక్కువగా ఉంది. అయినా నీకు బంగారం మీద మమకారం పోలేదు...ఇంకెంత బంగారం కావాలి?’’ అని తాను అడిగితే... ‘‘నేను ముట్టిందల్లా బంగారం కావాలి’’ అని ఆశ పడి ఎలా దెబ్బతిన్నాడో గుర్తు తెచ్చుకొని మరోసారి గట్టిగా నవ్వుకున్నాడు డైనసిస్. మిడాస్ కథ ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది. ఈ కథ నుంచి మనుషులు ఏమైనా గుణపాఠం నేర్చుకున్నారా? ఆశకు అంతు ఉండాలని గ్రహించారా? ఒక్కసారి చెక్ చేద్దాం అనుకున్నాడు డైనసిస్. తన ముందున్న గ్లోబ్‌ను గిర్రున తిప్పాడు. అది కరాచి దగ్గర ఆగింది. వెంటనే కరాచీ సందుగొందుల్లో కనిపించీ కనిపించనట్లు ఉన్న ఒక తెల్లటి భవంతిలోకి ప్రత్యక్షమయ్యాడు డైనసిస్. ఆ భవంతిలో దావూద్ ఇబ్రహీం ‘బాంబ్‌బ్లాస్ట్ టుడే’ పత్రికను శ్రద్ధగా చదువుకుంటున్నాడు. ‘‘నాయానా దావూదూ’’ అని వినబడడంతో తలెత్తి చూసి ‘‘క్యాజీ ఎవరు జీ మీరు?’’ అని అడిగాడు దావూద్ కళ్లద్దాలు సవరించుకుంటూ. ‘‘నా పేరు డైనసిస్ నాయనా. నువ్వు కోరిన వరం ఇద్దామని వచ్చాను’’ అని బదులిచ్చాడు డైనసిస్. ‘‘షుక్రియా డైనసిస్ జీ...నేను ఏ వస్తువును టచ్ చేసినా అది తుపాకీ కావాలి. ఈ వరం ఇవ్వండి చాలు’’ అని తన్మయంగా అడిగాడు దావూదు. ‘‘అలాగే నాయనా. రేపు ఉదయం నుంచి నేనిచ్చిన వరం అమల్లోకి వస్తుంది’’ అన్నాడు డైనసిస్. ఈలోపే...‘‘అయ్యయ్యో! కాస్త ఆగండి’’ అని అందోళన పడ్డాడు దావూద్. ‘‘ఏమైంది?’’ అని అడిగాడు డైనసిస్. ‘‘టచ్ చేసినవన్నీ తుపాకులైపోతే నేనేం తిని బతకాలి?’’ కింగ్ మిడాస్ను గుర్తు చేసుకుంటూ భయంగా అన్నాడు దావూద్. ‘‘డోండ్ వరీ దావూదూ...అబ్రకదబ్రక...కబ్రకదిబ్రక...దిబ్రకఅబ్రక అనే మంత్రం చదివి టచ్ చేస్తేగానీ నువ్వు టచ్ చేసినా వస్తువులు తుపాకులుగా మారవు’’ అని అభయం ఇచ్చాడు డైనసిస్. పట్టలేనంత సంతోషంతో ఉదయం కోసం వేచి చూస్తున్నాడు దావూద్ ఇబ్రహీం. డైనసిస్ మరోసారి గ్లోబ్ తిప్పాడు. అది లండన్ దగ్గర ఆగింది. వెంటనే లండన్‌లో ప్రత్యక్షమయ్యాడు డైనసిస్. అది లండన్‌లోని ఖరీదైన ప్రాంతం. ఆ ఖరీదైన ప్రాంతంలో ఖరీదైన ఇంట్లో అతి ఖరీదైన మద్యం తాగుతూ... ‘అప్పు చేసి బిర్యానికూడు తినరా బ్రదరూ’ అని పాడుకుంటున్నాడు విజయ్ మాల్యా. తనని తాను పరిచయం చేసుకొని... ‘‘ఏ వరం కావాలో కోరుకో నాయనా’’ అడిగాడు డైనసిస్. ‘‘ నాకంటూ పెద్ద కోరికలేమీ లేవు. చిన్న కోరిక...అంతే’’ అంటూ సిగ్గుతో మెలికలు తిరిగాడు మాల్యా. ‘‘సిగ్గు లేకుండా అడుగు నాయనా’’ అని ఆఫర్ ఇచ్చాడు డైనసిస్. ‘‘ఏంలేదు...నేను ఏ బిల్డింగ్‌ని టచ్ చేసినా అది బ్యాంక్ కావాలి. నువ్వే కావాలి అంటూ పాట అందుకోవాలి’’ అన్నాడు ఆశగా మాల్యా. ‘‘అలాగే నాయనా’’ అన్నాడు డైనసిస్. ఈలోపే దావూద్‌కు వచ్చిన డౌటే మాల్యాకు వచ్చి అడిగాడు. మంత్రం గురించి చెప్పి ‘డోంట్వరీ’ అని ధైర్యం చెప్పాడు డైనసిస్. మరుసటి రోజు మార్నింగ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు మాల్యా. ఈసారి గ్లోబ్ ముంబై దగ్గర ఆగింది. ముంబైలో ఉన్న ‘ఏసియన్ హార్ట్ హాస్పిటల్’లో విశ్రాంతి తీసుకుంటున్న లాలూప్రసాద్‌యాదవ్ ముందు ప్రత్యక్షమయ్యాడు డైనసిస్. తనని తాను పరిచయం చేసుకొని... ‘‘నీకేం వరం కావాలో కోరుకో లాలూ’’ అని అడిగాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా.... ‘‘నేను ఏ కుర్చీని టచ్ చేసినా అది పీయం కుర్చీ కావాలి’’ ఆశగా అడిగాడు లాలు. ‘‘అలాగే’’ అని మంత్రం గురించి చెప్పి మాయమయ్యాడు డైనసిస్. కట్ చేస్తే... విక్రమార్కుడి భుజం మీద ఉన్న శవం మాట్లాడడం మొదలుపెట్టింది. ‘‘ఇదెక్కడి అన్యాయం రాజా! విపరీతమైన కోరికలు కోరుకున్న వాళ్లను మందలించాల్సింది పోయి ఆ డైనసిస్ ఎడాపెడా వరాలు ఇవ్వడం ఏమిటి? అసలు మరుసటి రోజు మార్నింగ్ ఏం జరిగింది?’’ అడిగింది శవం. అప్పుడు విక్రమార్కుడు ఇలాచెప్పాడు: ‘‘ఆరోజు మార్నింగ్ లేవడం లేవడంతోనే మంత్రం చదువుతూ కనిపించిన వస్తువునల్లా టచ్ చేశాడు దావూద్. ఇంటి నిండా, ఇంటి బయట ఎటు చూసినా తుపాకులే తుపాకులు. కానీ...అవి పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకులు! ఇది అన్యాయం! నన్ను మోసం చేశాడు... అని గట్టిగా అరిచాడు దావూద్. అప్పుడు డైనసిస్ ప్రత్యక్షమై... ఒరేయ్ శుంఠా... నువ్వు టచ్ చేసినవన్నీ తుపాకులవుతాయని వరం ఇచ్చానేగానీ... అవి అసలు సిసలు ఒరిజినల్ తుపాకులని చెప్పలేదే... అన్నాడు. నాలిక కర్చుకున్నాడు దావూద్. ఇక మాల్యా సంగతి. ఉదయం లేవడం లేవడంతోనే బ్రష్ కూడా చేసుకోకుండా... కనిపించిన బిల్డింగ్నల్లా టచ్ చేస్తూ పోయాడు. ఇంకేముంది? ఎటు చూసిన బ్యాంకులే బ్యాంకులు. అవి మాల్యాను చూస్తూ....రారా సరసకు రారా...అని పాడడం మొదలెట్టాయి. దీంతో పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని ఆ బ్యాంకుల్లోకి దూరాడు మాల్యా. షాక్! ఆ బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఎటు చూసిన పుర్రెలే పుర్రెలు! ఒకవైపు స్కల్ బ్యాంక్ అనే బోర్డ్‌ను చూసి జడుసుకున్నాడు మాల్యా. ఇది అన్యాయం అని అరిచాడు. డైనసిస్ ప్రత్యక్షమై... నేను టచ్ చేసిందల్లా బ్యాంక్ కావాలి అన్నావేగానీ... ఏ బ్యాంక్ అనేది క్లియర్‌గా చెప్పలేదు. కాబట్టి నాదేం తప్పులేదు... అని అక్కడి నుంచి మాయమైపోయాడు డైనసిస్. ఇక లాలూ సంగతి. లాలు లేవడం లేవడంతోనే బెడ్ మీది నుంచి దునికి తనకు కనిపించిన కుర్చీని మంత్రం చదువుతూ టచ్ చేశాడు. అంతే.... ఆ కుర్చీలో నుంచి ఒక అస్థిపంజరం ప్రత్యక్షమై.... నమస్తే లాలూ భయ్యా! అని విష్ చేసింది. ఓరియనాయనో... అంటూ పరుగెత్తి ఒక మూల దాక్కున్నాడు లాలు. కొద్దిసేపటి తరువాత... దాక్కున్న మూల నుంచి బయటికి వచ్చి ఇది మోసం అని అరిచాడు. డైనసిస్ ప్రత్యక్షమై... ఇందులో మోసం ఏముంది? నువ్వు పీయం కుర్చీ కావాలి అని అడిగావు ఇచ్చాను అన్నాడు. ఇది పీయం కుర్చీ ఎలా అవుతుంది? ఆక్రోశించాడు లాలు. నువ్వు జడుసుకున్న కుర్చీని పీయం కుర్చీ అని ఈ హాస్పిటల్ వాళ్లు పిలుచుకుంటారు. పింటూ ముఖర్జీ... అంటే షార్ట్‌కట్‌లో పీయం అనే బెంగాలీ వాడు ఈ కుర్చీలో కూర్చొనే తన తుది శ్వాస విడిచాడు. అందుకే ఈ కుర్చీకి పీయం కుర్చీ అని పేరు... అని వివరించాడు డైనసిస్. బిత్తరపోయి పిచ్చిచూపులు చూస్తూ జుట్టు పీక్కున్నాడు లాలు!’’ చెప్పడం ముగించాడు విక్రమార్కుడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే బేతాళుడు నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నాడు! – యాకుబ్ పాషా -
అబ్బబ్బో మా డబ్బా టాకీసు!
ఎర్రటి ఎండాకాలంలో తప్పక గుర్తుకు వస్తుంది.... విశ్వరూపం. ‘విశ్వరూపం’ అనేది కమలాసన్ సినిమా పేరు కాదు... ఒకప్పటి మా ఊరి డబ్బా టాకీస్ పేరు. ఓనరు ఏ కాన్సెప్ట్‌తో ‘విశ్వరూపం’ అని తన టాకీస్‌కు పేరు పెట్టుకున్నాడోగానీ... ఆ టాకీస్ ప్రేక్షకులకు అక్షరాల విశ్వరూపం చూపించేది.మండే ఎండాకాలంలో మ్యాట్నీ షో.పైన రేకుల వేడి. కింద ఇసుక వేడి. మధ్యలో ‘గిర్ర్ర్ర్ర్ర్’ అని తిరిగే పాత సీలింగ్ ఫ్యాన్లు.‘ఫ్యాన్’ అనగా ‘గాలి వీచు సాధనం’. కానీ పైన తిరిగే పాతఫ్యాను రెక్కల నుంచి వేడి వేడి మంటలు వీచేవి. రేకుల వేడి + ఇసుక వేడి+ ఫ్యాన్ వేడి = ఇత్తడి.అయినా సరే, ప్రేక్షక మహాశయులకు ఇదేమీ పెద్ద ఇబ్బంది కాదు. అసలు సిసలు ఇబ్బంది.... ఈ ‘కరెంటు’ అనేది ఉంది చూశారు... దాని గురించే.ఆరోజు సినిమా మాంచి రంజులో ఉంది. క్లైమాక్స్‌కు కాస్త ముందు సీన్లో ముసలి తండ్రి కొడుకు కళ్లలోకి చూస్తూ ఇలా డైలాగ్ కొట్టాడు...‘చూడు రాజా! ఇన్నాళ్లూ ఒక రహస్యాన్ని నా గుండె గుహలో దాచాను’‘రహస్యమా? ఏమిటది?’ అని మూడు అడుగులు ముందుకు గెంతి... తండ్రిని సూటిగా అడిగాడు కొడుకు.‘నువ్వు నా కొడుకువి కాదు’ అన్నాడు ఆ తండ్రి చుట్ట వెలిగిస్తూ కూల్‌గా.‘నాన్న.... గారూ’ అంటూ చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని అరిచాడు రాజా.‘చెవులకు చేతులు అడ్డం పెట్టుకున్నంత మాత్రాన... నిజం అబద్ధమైపోదు మై డియర్ రాజా’ చుట్ట పొగను రింగులు రింగులుగా గాల్లోకి వదులుతూ అన్నాడు తండ్రి.‘ఇంతకీ నేను ఎవరి కొడుకును?’ దీనంగా అడుగుతాడు రాజా.‘నువ్వు కలలో కూడా ఊహించని ఆ వ్యక్తి ఎవరంటే...’ అని ఆ తండ్రి చెప్పబోయాడో లేదో..కరెంట్ పోయింది!ఎండాకాలంలో వేడి వేడి వర్షం... అది ప్రేక్షక మహాశయుల తిట్ల వర్షం!‘ఒరే నా కొడక ఎయ్యరా సిన్మా’‘ఒరేయ్ గాడిద మనవడా... ఎయ్యరా బొమ్మ’ నాన్‌స్టాప్‌గా తిట్లే తిట్లు! ఈలోపు గేటు పరదా తీసి...‘కరెంటు గంట వరకు రాదు. బయటకొచ్చేయండి’ అని గట్టిగా అరిచాడు గేట్‌కీపర్.నానా బూతులు తిట్టుకుంటూ ప్రేక్షక మహాశయులందరూ బయటకు వచ్చారు.గంట గడుస్తుంది.రెండు గంటలు గడుస్తాయి.... అలా గంటలు గడుస్తూనే ఉంటాయి. ఆ టైమ్‌లో డబ్బా టాకీస్ స్పోక్స్‌పర్సన్ రంగంలోకి దిగి ‘మ్యాట్నీ షో క్యాన్సిల్. పాసులు ఇస్తున్నాం. అందరూ రాత్రి ఫస్ట్ షోకు రండీ’ అంటూపాసులు పంచుకుంటూ పోయాడు. ఇప్పుడు ఫస్ట్ షో సంగతి.ఇంటర్వెల్‌కు ముందు ఒక సీన్లో హీరో హీరోయిన్ కళ్లలోకి చూస్తూ...‘ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావు. నీ పేరు కందిపప్పా? అయ్యుండదులే... మరి నీ పేరు ఏమిటి?’ అని అడిగాడో లేదో... ‘చచ్చాన్రో’ అని పెద్దగా సౌండ్ వినిపించింది.‘హీరోయిన్ పేరు చచ్చాన్రో. చాలా కొత్తగా ఉంది’ అని ఒక ప్రేక్షకుడు తన పక్కన కూర్చున్న ఫ్రెండ్ ప్రేక్షకుడితో అన్నాడో లేదో...‘హీరోయిన్ పేరా పాడా! ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు’ అన్నాడు ఫ్రెండ్ ప్రేక్షకుడు.‘వామ్మో! వాయ్యో! చచ్చాన్రో’ అనే అరుపులు వినిపిస్తున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే...పైన తిరుగుతున్న శాతవాహనుల కాలం నాటి పాత సీలింగ్ ఫ్యాన్ ఒకటి విరిగి ఒక ప్రేక్షక మహాశయుడి నెత్తి మీద పడి తల పగిలింది. దీంతో పెద్ద లొల్లి. బాధితుడికుటుంబసభ్యులతోపాటు చుట్టాలుపక్కాలు, కులసంఘం వాళ్లు రంగంలోకి దిగి టాకీస్ ముందు ఆందోళన చేయడం మొదలు పెట్టారు.ఈ దెబ్బకు ఫస్ట్ షో కూడా క్యాన్సిల్! శాంతిభద్రతల దృష్ట్యా సినిమా హాలు రెండు రోజులు మూతపడింది. మూడో రోజు...‘ఈ రోజు అయినా హీరోగాడు ఎవరి కొడుకో తెలుసుకోవాలి’ అనుకున్నారు ప్రేక్షక మహాశయులు. ఆరోజు మ్యాట్నీ షో మొదలైంది... అర్ధగంట గడిచిన తరువాత ఒక కన్నీటిభరిత సీన్...‘నాన్నా! నా పెళ్లి చేయడం కోసం కిడ్నీ అమ్ముకున్నావా? త్యాగం చేయడం నీకే కాదు... నీ రక్తం పంచుకొని పుట్టిన నాకూ చేతనవుతుంది... అన్నయ్య కాలేజీ ఫీజు కోసం నేను నా కిడ్నీ అమ్మేసుకున్నాను నాన్నా!’ అని లీటర్ కన్నీళ్లతో నాన్న కాళ్ల మీద పడింది కూతురు. ఈలోపు ఆ ఇంటి ఇల్లాలు పరుగెత్తుకొచ్చి...‘‘ఏమండీ ఆ అప్పులవాడు మిమ్మల్ని నానామాటలు అంటుంటే... తట్టుకోలేకపోయాను. అప్పు తీర్చడానికి, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నా కిడ్నీని అమ్ముకున్నాను’’ అని గొల్లుమంటుంది.ఫ్యామిలికీ ఫ్యామిలీ కిడ్నీలు అమ్ముకున్న ఈ ట్రాజెడీ సీన్‌కు ప్రేక్షకులు భోర్మని ఏడ్వక పోగా, భళ్లుమని నవ్వుతున్నారు. డొక్కుటాకీస్లో ప్రేక్షకులు మాత్రమే ఉండరు. శ్రీ నల్లులు, పిల్లులు, కుక్కలు కూడా ఉంటాయి. సినిమా చూస్తున్న మత్తులో ప్రేక్షకులు వీటి ఉనికిని పట్టించుకోరు.ఏడ్చే సీన్లో ప్రేక్షకులు పగలబడి ఎందుకు నవ్వారంటే...‘కిడ్నీల సీన్’ చూస్తూ కన్నీళ్లు కారుస్తున్న ఒక ప్రేక్షక మహాశయుడి లుంగీని, సీటు కింద ఉన్న కుక్కలాగి బెంచి క్లాసులోకి పరుగులు తీసింది... అక్కడి నుంచి నేల క్లాసుకు పరుగులు తీసి తెర ముందు అటూ ఇటూ పరుగులు తీస్తుంది. మరోవైపు ‘నా లుంగో... లుంగో’ అంటూ అండర్వేర్ మీద పరుగులు తీస్తున్నాడు బాధితుడు. ఇది చూసి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఈ ఎపిసోడ్ తరువాత కరెంట్ పోయింది.ఆరోజంతా రాలేదు! మరుసటి రోజు సినిమా ప్రొజెక్టర్ కాలిపోయింది... అది రిపేర్ కోసం పట్నానికి వెళ్లింది. రెండు నెలల విరామం. ఆ తరువాత ఏమైందోగానీ.... ఆ డబ్బాటాకీస్ మూతపడింది. ఇప్పుడు అక్కడ టాకీస్ లేదు. కళ్యాణమండపం ఉంది. దీన్ని చూస్తే డొక్కు టాకీస్ గుర్తుకు వస్తుంది. దీంతో పాటు ‘ఇంతకీ ఆ హీరో ఎవరి కొడుకు?’ అనే ప్రశ్న కూడా గుర్తుకు వస్తుంది. మీకేమైనా తెలుసా!! – యాకుబ్ పాషా