Sangareddy
-
వైద్యసేవల్లో నిర్లక్ష్యం తగదు
● రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ ● దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీదుబ్బాక: ప్రభుత్వం పేదలకు అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని వార్డులను కలియ తిరిగారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా అన్ని సౌకర్యాలున్నట్లు తెలిపారు. -
● ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ● ఐకేపీ ద్వారా 2 లక్షల క్వింటాళ్ల పైచిలుకు కొనుగోలు ● గతం కంటే 40% అదనం ● తరుగు, దోపిడీ నివారించాం
నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఐకేపీ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో 2లక్షల క్వింటాళ్ల పైచిలుకు వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గతం కంటే 40% అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు. దీనికి పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ధాన్యం మరింత అదనమని తెలిపారు. గత ప్రభుత్వంలో నాయకులు, దళారులు కుమ్మకై ్క క్వింటాలుకు వరి ధాన్యం తూకం వేస్తే 8 నుంచి 9 కిలోల తరుగు తీసి దోపిడీ చేసేవారని ఆరోపించారు. ప్రస్తుతం ప్యాడీ క్లీనర్‌లో వేయనందున 2 కిలోలలోపు మాత్రమే తరుగు తీస్తున్నారని తెలిపారు. గతంలో రైసుమిల్లర్లతో కుమ్మకై ్క రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద కొన్న ధాన్యం ఆయా నిర్దేశించిన రైసుమిల్లులకు పంపిస్తే వెంటనే అన్లోడ్ చేస్తున్నారని, కొత్త పాలసీతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఖేడ్ బసవేశ్వర ప్రాజెక్టుకు సర్వే చేయక, డీపీఆర్ రూపొందించక, నిధులు కేటాయించక ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికే జీవో తెచ్చి శంకుస్థాపన చేశారని ఆరోపించారు. ఎనిమిది టీఎంసీల నీటిని సింగూరుకు మళ్లించి బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించాలని తాను డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, హన్మాండ్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, న్యాయవాది సంగన్న పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసిన కలెక్టర్
కొండపాక(గజ్వేల్): దుద్దెడ శివారులో గల హరిత మినర్వా హోటల్ వద్ద రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ ఫ్యాక్టరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్ లను బుధవారం కలెక్టర్ మనుచౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. వేర్వురుగా కలిసి పూల మొక్కను అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో హోటల్లో వద్ద కొద్ది సేపు వారు ఆగారు. జిల్లాలో వివిధ శాఖల పనితీరును కలెక్టర్‌ను అడిగి తెలుసుకుంటూ మెరుగైన పాలన అందేలా కృషి చేయాలన్నారు. రుక్మిణీ పాండురంగ స్వామి జాతర ప్రారంభం కంది(సంగారెడ్డి): మండల కేంద్రం కందిలో రుక్మిణీ పాండురంగ స్వామి జాతర ప్రారంభమైంది. జాతరలో భాగంగా బుధవారం ఉ.11 గంటలకు స్వామివారి కల్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉ.11గంటలకు గరుడోత్సవం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహతి, అష్టదిక్పాలక బలిహరణ హోమం, రాత్రి 10 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు దీపక్ దేశ్ ముఖ్, సునీల్ దేశ్‌ముఖ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలి
ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి గజ్వేల్‌రూరల్: విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఏర్పర్చుకొని వాటి ఆశయ సాధనకు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి అన్నారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ సమీపంలోని సురభి దయాకర్ రావు ఫార్మసీ కళాశాలలో బీ ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం ఓరియెంటేషన్ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కలను సాకారం చేయడానికి విద్యార్థులు మంచి క్రమశిక్షణతో భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం అకాడమిక్ స్థాయిలో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గణేశ్, డాక్టర్ స్వాతి, చెరుకు నరేశ్ రెడ్డి, సౌందర్య, సౌమ్య, పూజిత, భారతి, శ్రీముఖి, అరుణ, లుబ్బ, రాజేశ్వరి, కృష్ణ, మజీద్, అరుణ, ప్రవీణ్, కరుణాకర్, అనిల్, లింగం, తదితరులు పాల్గొన్నారు. -
తాత ఆత్మహత్య
మనవడి మరణం జీర్ణించుకోలేక..పాపన్నపేట మండలం పొడిచన్పల్లి తండాలో ఘటన పాపన్నపేట(మెదక్): అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడు 15 నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి నా మనవడు లేని జీవితం నాకొద్దు.. నేను కూడా చనిపోతానంటూ తాత మానసిక రోగిగా మారాడు. చివరకు మనవడు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలోనే ముసలి తాత ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పాపన్నపేట మండలం పొడిచన్పల్లి తండాకు చెందిన పాల్త్య భద్యా(68) లాలీ దంపతులకు మోహన్, శంకర్, శ్రీనివాస్ సంతానం. మోహన్‌కు కుమారుడు మురళీతోపాటు కూతురు ఉంది. మురళీ ఢిల్లీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదివే సమయంలో బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ వ్యసనాలకు లోనై అప్పుల పాలయ్యాడు. అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక 2023 ఆగస్టులో తండా శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనవడిపై అంతులేని ప్రేమ కలిగిన ఫాల్త్య భద్యా అప్పటి నుంచి ‘మనవడు లేని జీవితం నాకొద్దు.. నేను చనిపోతానంటూ’మానసిక రోగిగా మారాడు. ఎప్పుడూ ఒంటరిగా గడుపుతూ మనవడి జ్ఞాపకాలను తలచుకుంటూ కుటుంబీకులతో వాపోయేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనవడు ఆత్మహత్య చేసుకున్న పరిసరాల్లోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి కుమారుడు మోహన్ ఫిర్యాదు మేరకు పాపన్నపేట ఏఎస్ఐ సంగన్న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనస్తాపంతో యువకుడు.. కొండపాక(గజ్వేల్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుండాయనగర్ గ్రామానికి చెందిన కొందరు కూలీలు కుకునూరుపల్లి శివారులో ఉన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర రెడీమిక్స్ కంపెనీలో కొన్నేళ్లుగా కూలీ పని చేస్తున్నారు. ఇందులో ఓ కూలీ మహానంద సర్దార్కు బుండాయానగర్లోని ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. కానీ మహానంద తండ్రికి పెళ్లి నచ్చకపోవడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో కంపెనీకి సమీపంలోని ఓ రైతు వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ టవర్‌కు బుధవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కూలీ రాణా సర్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నిమ్జ్‌కు హుందాయ్
407 ఎకరాల్లో భారీ పరిశ్రమ ● సుమారు వెయ్యి మందికి ఉపాధి ● కొనసాగుతున్న భూసార పరీక్షలు సంగారెడ్డి జోన్: జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటు కాబోతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో మరో భారీ పరిశ్రమ రానుంది. ఇప్పటికే అక్కడ వేమ్ టెక్నాలజీ పరి శ్రమ ఏర్పాటు పనులు కొనసాగుతుండగా మరో భారీ పరిశ్రమ హుందాయ్ ఏర్పాటుకు భూములను కేటాయించారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే పూర్తైన 6 వేల ఎకరాల భూసేకరణ జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో సుమారు 12 వేలకు పైగా ఎకరాల్లో నిమ్జ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పటికే మొదటి విడత పూర్తికాగా రెండో విడతలో భూసేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకు సుమారు 6,000 ఎకరాల భూసేకరణ పూర్తి అయింది. కొనసాగుతున్న మట్టి పరీక్షలు ప్రముఖ హుందాయ్ పరిశ్రమ సుమారు 407 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామ శివారులో పరిశ్రమ ఏర్పాటుకు భూమిని కేటాయించారు. పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన భూములలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమ టెక్నికల్ బృందం సభ్యులు సుమారు 50 పాయింట్లలో 20 మీటర్ల మేర లోతులో డ్రిల్ మిషన్ సహాయంతో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మట్టి నమూనాలు, పరీక్షలు పూర్తి కాగానే, పరిశ్రమ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లు సమాచారం. రూ. 2,100 కోట్ల మేర పెట్టుబడులు నిమ్జ్‌లో ఏర్పాటుకానున్న హుందాయ్ పరిశ్రమలో వాహనాల టెస్టింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,100కోట్ల మేర పెట్టుబడులతో పరిశ్రమను స్థాపించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో వందల సంఖ్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగనుంది. ఇప్పటికే నిమ్జ్‌లో వేమ్ టెక్నాలజీ పరిశ్రమ ఏర్పాటు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ పరిశ్రమ 511 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనున్నారు. తొలిదశలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో సుమారు 1,000 మందికిపైగా ఉపాధి లభించనుంది. పరిశ్రమ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే పరిశ్రమ ప్రతినిధులతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో సమావేశం నిర్వహించారు. పూర్తికావొచ్చిన రహదారి పనులు నిమ్జ్ ప్రాంతాన్ని, జాతీయరహదారి 65కు అనుసంధానం చేస్తూ జహీరాబాద్ మండలం హుగ్గెళ్లి నుంచి ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ వరకు 9.5 కిలోమీటర్ల పొడవునా రహదారిని అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం తుదిదశలో ఉంది. రహదారి నిర్మాణానికి రూ.1,000 కోట్ల నిధులతో పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. వేగంగా ‘వేమ్’ పరిశ్రమ పనులు -
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
సంగారెడ్డి: గ్రంథాలయ వారోత్సవాలు సంగారెడ్డిలో కేంద్ర గ్రంథాలయంలో బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జి.అంజయ్య, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర ఆధ్వర్యంలో వారం రోజులపాటు కొనసాగాయి. వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో విజేతలు అయిన 60 మంది విద్యార్థులకు అంజయ్య బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సహాయ గ్రంథపాలకులు శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్, శోభారాణి, సిబ్బంది వరలక్ష్మి, సావిత్రి, మంజుల, కృష్ణమూర్తి జిల్లాలోని అన్ని మండలాల లైబ్రేరియన్లు పాల్గొన్నారు. -
మట్టి దిబ్బలు, పిచ్చిమొక్కలే..
మట్టికుప్పలు.. రాళ్లు.. పిచ్చి మొక్కలతో సుడా టౌన్ షిప్ అధ్వానంగా తయారైంది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇప్పటి వరకు మూడు సార్లు వేలం పాట నిర్వహించినా 27 ప్లాట్లే విక్రయించారు. ఇంకా 79 ప్లాట్లు మిగిలి ఉన్నాయి. మరోవైపు టౌన్షిప్లో పనులు అసంపూర్తిగా ఉండటం.. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం కూడా ఎవరూ ఆసక్తి చూపడంలేదన్న చర్చ జరుగుతోంది. సాక్షి, సిద్దిపేట: గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022న విడుదల చేసిన జీఓ (234) ప్రకారం సిద్దిపేట పట్టణ శివారు మిట్టపల్లి సమీపంలో 14 ఎకరాల అసైన్డ్ భూములను సుడా సేకరించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అసైన్డ్ ల్యాండ్ పూలింగ్తో లే అవుట్ చేశారు. భూమిని పూర్తి చదును చేయగా అందులో 67,760 గజాల భూమి ఉంది. ప్రధాన రోడ్డు 60ఫీట్లు, అంతర్గత రోడ్లు 33ఫీట్లతో నిర్మించారు. రోడ్లకు 23,909 గజాలు, పార్కులకు 6,099 గజాలు, ఇతర మౌలిక సదుపాయలకు 2,392 గజాలు కేటాయించారు. 35,360 గజాల స్థలం మిగలగా అందులో 161 ప్లాట్లను విభజించారు. అందులో 10 మంది రైతులకు 55 ప్లాట్లను సుమారుగా 10,861 గజాల భూమిని అందించగా 101 ప్లాట్లలో 24,499 గజాల స్థలం సుడాకు మిగిలింది. వీటి ని వేలం పాట ద్వారా ప్లాట్లను విక్రయిస్తున్నారు. మూడు సార్లు వేలం సుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ టౌన్ షిప్లో మూడు సార్లు వేలం నిర్వహించగా 27 ప్లాట్లను కొనుగోలు చేశారు. గత సంవత్సరం మే 29, 30 తేదీల్లో వేలం పాట నిర్వహించగా 17 మంది దక్కించుకున్నారు. అందులో ఇప్పటి వరకు 13 మంది మాత్రమే పూర్తిగా డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకా నలుగురు మొత్తం డబ్బులు చెల్లించకపోవడంతో వారికి రిజిస్ట్రేషన్‌ను సుడా చేయలేదు. అధ్వానంగా సుడా టౌన్ షిప్ ఇలా ఉంటే ప్లాట్లు కొనేదెలా? మూడు సార్లు వేలం వేసినా 27 ప్లాట్లే విక్రయం ఆసక్తిచూపని కొనుగోలు దారులు -
కోతలు పూర్తయినా టార్పాలిన్లేవీ!
● టార్పాలిన్లు అందక రైతుల ఇక్కట్లు ● అద్దెకు తెచ్చుకుంటున్న వైనం ● సబ్సిడీపై అందించాలి: రైతుల డిమాండ్ హత్నూర(సంగారెడ్డి): రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడంతోపాటు, వర్షానికి తడవకుండా వాడుకునే టార్పాలిన్లను ప్రభుత్వం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రాయితీపై వ్యవసాయశాఖ నుంచి అందించే టార్పాలిన్లు ఇప్పుడు రైతులకు ఇవ్వడం లేదు. దీంతో ధాన్యం ఆరబెట్టుకునేందుకు, వర్షానికి తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను అద్దెకు తెచ్చుకుని రూ.వేలను రైతులు నష్టపోతున్నారు. వరి కోతలు పూర్తి కావస్తున్నా టార్పాలిన్లు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎనిమిది అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పుతో మందంగా ఉండే టార్పాలిన్లు బహిరంగ మార్కెట్లో రూ.2,500 అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు 50% సబ్సిడీపై వీటిని రైతులకు అందించేవారు. కానీ ప్రస్తుతం సబ్సిడీపై అందించకపోవడంతో రైతులు చేసేదేమీ లేక అద్దెకు తెచ్చుకోవడంతో అదనంగా వేలాది రూపాయలు భారం భరిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సైతం రైతులకు టార్పాలిన్లను అందించడం లేదని దీంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సబ్సిడీపై టార్పాలిన్లను అందించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. సబ్సిడీపై అందించాలి టార్పాలిన్లను సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం అందించాలి. వడ్లు ఆరబెట్టేందుకు అద్దె ఇచ్చి తెచ్చుకుంటున్నాం.రూ.1,000 నుంచి 2,000 ఖర్చవుతున్నాయి. దశరథ, రైతు, నస్తీపూర్ ప్రభుత్వం అందించడం లేదు ప్రభుత్వం సబ్సిడీపై ప్రస్తుతం టార్పాలిన్లను అందజేయడం లేదు. ఐదేళ్ల నుంచి టార్పాలిన్లను ప్రభు త్వం అందించడం నిలిపివేసింది. దీంతో తాము రైతులకు రాయితీపై అందించలేకపోతున్నాం. శ్రీనివాసరావు, మండల వ్యవసాయశాఖ అధికారి -
పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిసంగారెడ్డి జోన్: కలెక్టరేట్ కార్యాలయ పరిసరాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం కలియదిరిగి పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సముదాయంలోని వివిధ శాఖల అధికారులతో పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద పరిశుభ్రత ఆయా శాఖల అధికారులదే బాధ్యతన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం అమలు చేయాలని స్పష్టం చేశారు. వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో పూర్తి చేయాలిసమగ్ర సర్వేపై అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రాయికోడ్(అందోల్): ఈ నెల 23 వరకు సకాలంలో సమగ్ర కుటుంబ కుల గణన సర్వే ను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మండలంలోని కోడూర్ గ్రామంలో సర్వే సక్రమంగా సాగడంలేదని ఎన్యుమరేటర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఆ గ్రామంలో చేప ట్టిన సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. సర్వే ఫామ్‌లో ఎన్యుమరేటర్లు నమో దు చేసిన అంశాలను పరిశీలించారు. మండలంలో 80% సర్వే పూర్తయినట్లు మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్ అడిషనల్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మండలంలోని అల్లాపూర్ శివారులో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. రంగోత్సవ్ ఆర్ట్స్ పోటీల్లో మెరిసిన గురుకుల విద్యార్థులుజహీరాబాద్ టౌన్: ముంబైకు చెందిన రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయి లో నిర్వహించిన పలు ఆర్ట్స్ పోటీలో దిగ్వాల్లోని న్యాల్కల్ మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు పలు పతకాలు సాధించారు. గ్రీటింగ్ కార్డ్ తయారీ, టాటూ, హ్యాండ్ రైటింగ్, కార్టూన్ , స్కెచింగ్, ఫోటోగ్రఫీ అంశాలలో పోటీలు నిర్వహించగా గురుకులానికి చెందిన 53 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు గెలుచుకున్నారు. మొత్తంగా 20 స్వర్ణ, 15 కాంస్య, 10 రజత పతకాలతో పాటు నలుగురు కాన్సోలేషన్ బహుమతులు కూడా గెలుచుకున్నారని గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.రాములు బుధవారం మీడియాకు తెలిపారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి’నారాయణఖేడ్: రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాల ర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయా లని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సీహెచ్ అశోక్ డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని దొడ్డి కొమురయ్య విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో బుధవా రం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన విద్యా ర్థులు డబ్బులు చెల్లించకపోవడంతో టీసీలు పొందక చదువును మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ‘కార్మికులకు భద్రత కరువు’సంగారెడ్డి ఎడ్యుకేషన్: పరిశ్రమలలో కార్మికులకు సరైన భద్రత లేకపోవడంతో నిత్యం వారు ప్రమాదాలకు గురవుతున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బోయిని ప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...పరిశ్రమలలో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నారు. సదాశివపేట ప్రాంతంలోని బ్లూ క్రాఫ్ట్, ఆక్సిజెంట్, ఫార్మా పరిశ్రమలు కార్మికులకు సరైన భద్రత కల్పించకపోవడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమయ్యాయన్నారు. -
నేటి నుంచి వైజ్ఞానిక ప్రదర్శనలు
డీఈవో వెంకటేశ్వర్లు సంగారెడ్డిఎడ్యుకేషన్: విద్యార్థులలో దాగివున్న శాసీ్త్రయ నైపుణ్యాన్ని వెలికితీయడంతోపాటు విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఏటా ప్రభుత్వం నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి (డీఈవో) వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డిలోని శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది అన్ని యాజమాన్యాల పాఠశాలలు కలిపి సుమారు 850వరకు ఎగ్జిబిట్స్ ప్రదర్శనకు వస్తుండగా ఇన్‌స్పైర్‌కు 95 ఎగ్జిబిట్ రానున్నాయన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రధాన అంశంగా సుస్థిర భవిష్యత్తు కోసం శాస్త్ర సాంకేతికత (సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్) అనే అంశానికి ఏడు ఉప అంశాలతో జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో 1.రవాణా కమ్యూనికేషన్ 2.వ్యర్థాల నిర్వహణ 3.ఆహారం ఆరోగ్యం, పరిశుభ్రత 4.సహజ వ్యవసాయం 5.విపత్తుల నిర్వహణ 6.గణిత నమూనాలు, గణన ఆలోచనలు 7.వనరుల నిర్వహణ లాంటి ఉప అంశాలు ఉన్నాయని వివరించారు. విద్యార్థులు తమకు సంబంధించిన ఉప అంశాల వారీగా కేటాయించిన కౌంటర్లలో ఉదయం ఉదయం 7:30 నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపికై న మంచి ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయికి పంపించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి ,మాజీ సైన్స్ అధికారి విజయ్ కుమార్, నోడల్ అధికారి లింభాజీ, సంగారెడ్డి మండల విద్యాధికారి శ్రీ విద్యాసాగర్, కోహిర్ మండల విద్యాధికారి, ప్రింట్ అండ్ మీడియా కన్వీనర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం.. దళారుల పాలు
పల్లెలో ధాన్యం దళారుల పాలవుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాత తిప్పలు పడుతున్నాడు. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ నిరాశే ఎదురవుతోంది. తేమశాతం, తాలు పేరిట తూకంలో కోత.. హమాలీలు, లారీల కొరత, డబ్బులు త్వరగా ఖాతాలో జమకాకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు పొలం వద్దకే వచ్చి రైతుల నుంచి పచ్చి వడ్లను కొంటున్నారు. – హుస్నాబాద్‌రూరల్ రైతుల వద్ద పచ్చి వడ్లు కొనుగోలు ● నిత్యం వ్యాన్లలో ధాన్యం సేకరణ ●● ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకకు తరలింపు ● ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కరువు ● తప్పక మధ్యవర్తులకు అమ్ముతున్న వైనం ● తేమ సాకుతో తక్కువ ధరకే విక్రయం -
కంది సాగులో సస్యరక్షణ చర్యలు
టేక్మాల్(మెదక్): కందిపంటసాగులో సస్య రక్షణ చర్యలను పాటిస్తే పంట దిగుబడులను అధికంగా పొందవచ్చును. తగిన మోతాదులో ఆశించిన తెగులు నివారించేందుకు మందులను పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులను సంప్రదించి మెలకువలను పాటించాలని టేక్మాల్ వ్యవసాయాధికారి రామ్ ప్రసాద్ (7036110220) తెలిపారు. ఆకుచుట్టు పురుగు : కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు నశిస్తుంది. ఆకులను పూతను చుట్టుగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు 1.6 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మిల్లీ లీటర్ల క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలుచు పురుగు : ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుంచి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్య రక్షణ తప్పక పాటించాలి. సమగ్ర సస్యరక్షణ : ● వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు శోశస్థ దశలు ఏరుకు తినటానికి వీలవుతుంది. ● ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైనా జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుములు, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ● ఖరీఫ్‌లో అంతర పంటగా 7 సాళ్లు, రబీలో 3 సార్లు పెసర, మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సాళ్లు జొన్న రక్షిత పైరుగా విత్తాలి. ● పచ్చ పురుగును తట్టుకునే ఐసీపీఎల్ –332, యల్ఆర్జీ 41 రకాలను లేక పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల యల్ఆర్జీ –38 కంది రకాలను సాగు చేయాలి. ● పైరు విత్తిన 90–100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి. ● ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ● పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. ● పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5 శాతం వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి టేక్మాల్ వ్యవసాయాధికారి రామ్ ప్రసాద్ -
చెత్తను డంప్‌యార్డులో వేసి వస్తుండగా..
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి నర్సాపూర్ రూరల్: చెరువులో మునిగి యువకుడు చెందిన ఘటన నర్సాపూర్ మండలం రుస్తుంపేటలో బుధవారం చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై లింగం, గ్రామస్తుల కథనం మేరకు.. రుస్తుంపేట గ్రామ పంచాయతీకి సంబంధించి చెత్తను తరలించే ట్రాక్టర్ డంప్‌యార్డ్‌లో చెత్తను వేసి తిరిగొస్తుంది. ఈ క్రమంలో చెరువు కట్టపై అదుపుతప్పి చెరువులో పడగా ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ పులిమేటి రమేశ్(26) నీటిలో మునిగి మృతి చెందాడు. రమేశ్ తండ్రి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కా ర్మికుడిగా పని చేస్తున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ రాకపోవడంతో తాత్కాలికంగా రమేశ్‌ను నియమించి చెత్తను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
No Headline
హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 9 కేంద్రాలను ప్రారంభించగా మంచీళ్లబండ గ్రామాల్లో ఇప్పటి వరకు ధాన్యం సేకరణ జరుగలేదు. మిగితా 8 కేంద్రాల నుంచి 249 మంది రైతుల నుంచి 11,378 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో రెండు మండలాల్లో 27 కేంద్రాలను ఏర్పాటు 119 మంది రైతుల నుంచి 54,635 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గత ఖరీఫ్ సీజన్‌కు 1.10 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో గత ఖరీఫ్ సీజన్‌కు 32 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించగా ఈసారి 11,378 క్వింటాళ్ల ధాన్యమే సేకరించారు. అందులో మంచీళ్ల బండ గ్రామంలో ధాన్యం సేకరణ జరగలేదు. కేశ్వాపూర్, మీర్జాపూర్, మంచీళ్లబండ, టేకుల తండా, మల్లంపల్లి, యాటకార్ల పల్లె గ్రామాల నుంచి నిత్యం 10 వ్యాన్లలో పచ్చి ధాన్యం సేకరించిన వ్యాపారులు ఆంధ్రా, మహారాష్ట్ర, కర్నాటకకు తరలిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు ధాన్యం మొదట ఇచ్చిన రైతులకు డబ్బులు చెల్లించి చివరకు మిగిలిన రైతులకు డబ్బులను ఎగవేస్తారు. కొనుగోళ్లలోనూ కోత పెడుతూ.. అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పోటీగా వాళ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతుల పంట చేను వద్దకే వెళ్లి ధాన్యం సేకరిస్తున్నారు. ఒక క్వింటాల్‌కు రూ.1,910 కొనుగోలు చేయడంతోపాటు 40 కిలోల బస్తాకు సంచి కిలో, మట్టి కిలో కోత పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి వ్యాపారులు రైతులకు నగదు జమ చేయడానికి 15 నుంచి 20 రోజుల గడువు పెడుతున్నారు. రైతుల వద్ద ధాన్యం ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకే కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ మార్కెట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలవిడిగా ధాన్యం సేకరించి ఆంధ్రాకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై నమ్మకం లేక.. ప్రభుత్వము రైతు భరోసా డబ్బులు వేయకపోవడం, రుణమాఫీ పూర్తిగా చేయకపోవడంతో ధాన్యం డబ్బులు సైతం సకాలంలో ఇయ్యదనే అపోహ రైతుల్లో నెలకొంది. ధాన్యం అరబెట్టేందుకు ఇబ్బందులు పడటం చూసిన వ్యాపారులు ఈ దందాకు తెరలేపినట్లు సమాచారం ప్రభుత్వము కొనుగోలు కేంద్రాల్లో రూ.2,330లకు కొనుగోలు చేస్తున్నా అక్కడ ధాన్యం అరబెట్టే సౌకర్యాలు లేకపోవడం, తూకం వేసే సమయంలో తేమ శాతం సమస్యలు రైతులను దళారుల వైపు మల్లిస్తున్నాయి. అధికారులు స్పందించి గ్యారంటీ లేని ప్రైవేటు వ్యాపారులను కట్టడి చేయకపోతే రైతులు మోసపోయే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
చెట్టును ఢీకొట్టిన ఆటో: డ్రైవర్ మృతి
దుబ్బాక: చెట్టును ఆటో ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాయపోల్ మండలం వడ్డేపల్లి గుర్రాలసోప చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం మేరకు.. నిజామాబాద్‌కు చెందిన బిల్లివాల చంద్రకాంత్ (36) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ నుంచి ఉదయం ఆటోలో రాంసాగర్ గ్రామంలో ఉన్న చెల్లెలు ఇంటికొచ్చాడు. తిరిగి సాయంత్రం నిజామాబాద్‌కు వెళ్తుండగా గుర్రాలసోప సమీపంలోని గజ్వేల్– చేగుంట మార్గంలో ఆటోను అతివేగంగా నడపడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్కుర్తి రఘుపతి తెలిపారు. -
బ్యాంకుల్లో అలారమ్ సిస్టమ్ తప్పనిసరి
గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి కొండపాక(గజ్వేల్): బ్యాంకులో దోపిడీలు జరిగేటప్పుడు అలారమ్ మోగేలా చూసుకోవాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలోని సేఫ్ అండ్ సెక్యూరిటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వివిద బ్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా పురుశోత్తంరెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఎల్లవేళలా పని చేస్తున్నాయా లేదానన్న విషయాన్ని ప్రతీ రోజు మానిటరింగ్ చేసుకోవాలన్నారు. నేర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అలారమ్ వచ్చే సిస్టమ్ ఎల్లవేళలా పని చేసేలా ఉండాలన్నారు. బ్యాంకులో కిటికీలు, డోర్స్, స్ట్రాంగ్ రూమ్స్‌లను 15 రోజులకోమారు పని చేస్తున్నాయా.. లేదా అన్న విషయాన్ని పరిశీలించుకోవాలన్నారు. ఆయా బ్యాంకు మేనేజర్ల వద్ద ఎస్సై ఫోన్ నంబరు అందుబాటులో ఉండాలన్నారు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు డబ్బులు, బంగారు ఆభరణాలను తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా సెక్యూరిటీ మేజర్స్‌ను వెంట తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్సై శ్రీనివాస్, ఆయా బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల అవసరం చూసి దగా
వానాకాలం పంటకు ప్రభుత్వం రైతు బంధు వేయలేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రం వడ్లు అమ్మితే డబ్బులు ఏసేది ఏం నమ్మకం. వానాకాలం పంట పెట్టుబడికి తెచ్చిన షావుకారికి డబ్బులు కట్టాలని వరి కోసిన వెంటనే పందిళ్ల మిల్లులో క్వింటాల్ ధర రూ.1,950 అని సంచి కిలో, మట్టి కిలో క్యాష్ కటింగ్‌తో 15 క్వింటాళ్లకు లెక్క చేసి డబ్బులు ఇచ్చారు. ఎండిన వడ్లకు అదే ధర, పచ్చి వడ్లకు అదే ధర పెట్టి రైతుల అవసరం చూసి వ్యాపారులు మోసాలు చేస్తున్నారు. – చుక్క శ్రీనివాస్, పొట్లపల్లి -
మానసిక వ్యాధితో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాలలో ఘటన సిద్దిపేటఅర్బన్: మానసిక వ్యాధితో బాధపడుతున్న విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాల డీన్, సిద్దిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన విద్యార్థిని 11న మిట్టపల్లిలోని మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరింది. విద్యార్థిని ఏడేళ్లుగా ఓసీడీ అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. చికిత్స తీసుకుంటున్నా తగ్గలేదు. ఈ క్రమంలో కళాశాలలో చేరిన యువతి తీవ్ర ఒత్తిడికిలోనై 17న హాస్టల్ భవనం మొదటి అంతస్తులో నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని విద్యార్థిని ముందు రోజే సూసైడ్ నోట్ రాసిపెట్టింది. అందులో ‘సారీ నాన్న, అమ్మ, చెల్లి.. చదువుకునే సమయంలో మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. మందులతో నయం కావడం లేదని, ఏడేళ్లుగా ఓసీడీతో బాధ పడుతున్నానని, తనకు సహకరించిన, కఠిన సమయాల్లో ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు’ అని ఉంది. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ మధు, త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ కళాశాలకు చేరుకొని విచారణ జరిపారు. విద్యార్థిని తల్లిదండ్రుల అభ్యర్థనకు మేరకు కళాశాల యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తమ విచారణలో తెలిసిందని ఏసీపీ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామన్నారు. ఘటనపై కుటుంబీకులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు నర్సాపూర్ రూరల్: భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వరరావు ఫార్మా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సూచించారు. బుధవారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని విష్ణు ఫార్మా కళాశాల విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫార్మాసిస్టులు కేవలం ఫార్మా రంగంలో కాకుండా ఇతర రంగాల్లో సైతం రాణించవచ్చు అన్నారు. అమెరికాలో ఉన్న ఫార్మసీ సిస్టమ్‌ను ఇండియాలో అమలు చేస్తే ఇక్కడి హెల్త్ సిటీ మరింత మెరుగు పడుతుందన్నారు. కార్యక్రమంలో విష్ణు విద్యాసంస్థల సెక్రెటరీ ఆదిత్య విస్సం, కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, డీన్ లక్ష్మీప్రసాద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విష్ణు ఫార్మా కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
పటాన్చెరు టౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా బురహన్పూర్కు చెందిన సురేశ్ కుటుంబం బతుకుదెరువు కోసం వచ్చి కూలీ పని చేసుకుంటూ పటాన్చెరు గౌతమ్‌నగర్ కాలనీలో ఉంటున్నారు. 10వ తేదీ కూలి పనికోసం ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం(పటాన్చెరు): బాలిక అదృశ్యమైన ఘటన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జేపీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. కొల్లూరు పోలీసుల కథనం మేరకు.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జేపీ కాలనీకు నివాసం ఉండే మన్సింగ్ కొద్దినెలల కిందట ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వలసొచ్చారు. ఆయనకు 17 ఏళ్ల కూతురు ఉంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల, స్నేహితుల వద్ద ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. బుధవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
మందుబాబులకు జరిమానా
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా, ఒకరికి జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి ఐదు రోజుల కిందట నిర్వహించిన వాహన తనిఖీల్లో ఏడుగురు పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో బుధవారం హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.12 వేలు జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ నర్సాపూర్ రూరల్: గంజాయి విక్రయించడంతోపాటు ఇతర గ్రామాలకు తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్ ఎకై ్సజ్ సీఐ పద్మ తెలిపారు. ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన మహమ్మద్ షాజిద్ ఖాన్ గంజాయి విక్రయించడంతోపాటు ఇతర గ్రామాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. బుధవారం నర్సాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారి అర్బన్ పార్క్ సమీపంలో గంజాయి తరలిస్తుండగా స్కూటీతోపాటు షాజీద్ ఖాన్‌ను అరెస్టు చేసి 104 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీ నం చేసుకున్నాం. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎకై ్సజ్ ఎస్ఐ అరుణ సిబ్బంది పాల్గొన్నారు. లారీలో తరలిస్తున్న ఇద్దరు.. చేగుంట(తూప్రాన్): లారీలో ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని వడియారం శివారులో జాతీయ రహదారిపై లారీలో గంజాయి తరలిస్తున్న బుధవారం సమాచారం అందింది. ఈ మేరకు లారీని పట్టుకోగా 725 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. వెస్ట్ బెంగాల్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి పంపిస్తున్న గంజాయిని అంజరూల్, షేక్ రహీం దొంగచాటుగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. పంచనామా నిర్వహించి గంజాయితోపాటు 2 సెల్ఫోన్లు, లారీని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. విక్రేతలను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ చిన్నశంకరంపేట(మెదక్): గంజాయి నిర్మూలనకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పారిశ్రామికవాడలో తనిఖీలు నిర్వహించిన ఎ కై ్సజ్ టాస్క్ఫోర్స్మెంట్ బృందం ఇద్దరు వినియోగదారులను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. బుధవారం అర్థరాత్రి ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించి ఇద్దరు వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. మీర్జాపల్లి రోడ్డులోని పరిశ్రమలో పని చేసే కార్మికులు గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. -
కలెక్టర్‌కు నోటీసులు
బొల్లారం కమిషనర్‌కు కూడా.. జిన్నారం(పటాన్చెరు): జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ నుంచి సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి, బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారుకు నోటీసులు వచ్చాయి. ఇటీవల బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో సవ్య కర్మచారి నర్సింహ విధినిర్వహణలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి నోటీసులు జారీ అయ్యాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నోటీసులో కమిషన్ కార్యదర్శి రాహుల్ కశ్యప్ సూచించారు. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరారు. కార్మికుడి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. సోషల్ వర్కర్ షాబుద్దీన్ అనే వ్యక్తి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. -
తాగునీటికి విల‘విల్లా’!
రూ. కోట్లు వెచ్చించి విల్లాలు కొన్నా తప్పని ఇక్కట్లు ● గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసుల నిత్య గోస రామచంద్రాపురం(పటాన్చెరు): అన్నీ ఉన్నా అల్లుడి నోట్లు శని అన్న చందంగా ఉంది గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసుల పరిస్థితి. కోట్ల రూపాయ లు వెచ్చించి విల్లాలు కొన్నామన్న సంతృప్తి కన్నా.. గుక్కెడు తాగు నీరందడం లేదన్న వెలితి నిత్యం వెంటాడుతోంది. తమ విల్లాలకు సకల వసతులున్నా.. కనీస అవసరమైనా తాగునీటి సౌకర్యం కరువైంది. దీంతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణానాతీతం. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ వాసులు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసిన వీరికి మాత్రం తాగునీటి సరఫరా లేక అనేక ఇబ్బందులు తప్పడంలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మాన్‌నగర్‌లో భూమిని కేటాయించింది. 40 లక్షల లీటర్ల సామర్థ్యంగల సంపు, 20 లక్షల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం, 22 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం కోసం సుమారు రూ.30 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు 2022 నవంబరు 10న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాన చేశా రు. కానీ రెండేళ్లు గడిచినా ట్యాంకు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో గేటెడ్ కమ్యూనిటీ కాలసీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 60 గేటెడ్ కమ్యూనిటీ కాలనీలున్నాయి. ఈ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీలో ఉన్న బోరు నీటినే వారు వినియోగించుకుంటున్నారు, కాగా, సంపు పనులను పూర్తిచేసి కొద్ధి రోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా 20 లక్షల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడానికి మూడు నెలలు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే గానీ గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసుల నీటి గోస తప్పేటట్లు లేదు. -
వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● దివ్యాంగుల క్రీడా పోటీలు ప్రారంభంప్రజలను చైతన్యపరిచేలా ప్రదర్శనలుసంగారెడ్డి జోన్: వైకల్యం శరీరానికి మాత్రమే అవుతుంది.. మనసుకు కాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే దివ్యాంగులూ అద్భుత విజయాలను సాధించగలరని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. దివ్యాంగుల క్రీడల ప్రాముఖ్యత, స్ఫూర్తిదాయకమైన విజయాల గురుంచి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికి చదువు అత్యంత కీలకం అన్నారు. చదువుతోనే మనం మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. ఐఏఎస్ శిక్షణ సమయంలో తన బ్యాచ్‌మేట్ అజయ్ అరోరా గురించి ఆమె ప్రస్తావిస్తూ, ఆయన పూర్తిగా అంధుడు, తన పట్టుదలతో ఐఏఎస్ సాధించి, ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. చదువులో మంచి స్థాయిని సాధించి జీవితంలో ముందుకు వెళ్లాలని, మీ ప్రయత్నం మీ కుటుంబానికి, సమాజానికి గర్వకారణం కావాలని, ఉన్నత శిఖరాలు అందుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కాగా, దివ్యాంగుల క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. సోలార్ సొసైటీని స్థాపించి, తానే ఆదాయం పొందడమే కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించడం ద్వారా అందరికి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, యువజన సంక్షేమ శాఖ అధికారి ఖాసీంబేగ్, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు సాయికుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్య పరిచే విధంగా కళాజాత ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు సందర్భంగా తెలంగాణ సాంస్కృత సారధి కళాయాత్ర కార్యక్రమాలను జిల్లాలో ముమ్మరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నుంచి డిసెంబరు 7వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజా పాలన కళాయాత్ర వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంస్కృతిక సారధి కళాబృందాలు ప్రతిరోజు మూడు గ్రామాలలో ఆటపాటలు నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చేరువ చేసే విధంగా కళా ప్రదర్శనలు జరగాలన్నారు. కార్యక్రమాలను మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలసత్వం వహిస్తే సంబధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజా రాణి, డీపీఆర్ఓ ఏడుకొండలు తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.