సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక ఘట్టం బీఆర్‌ఎస్‌లో పూర్తవగా.. కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా సందిగ్ధమే. హస్తం పార్టీ తొలిజాబితా ప్రకటించినా జిల్లా నుంచి ఒక్కరికి కూడా చోటు లభించకపోవడం గమనార్హం. మరోవైపు బీఆర్‌ఎస్‌లో మాత్రం ఉత్కంఠకు తెర పడింది. నెలన్నర రోజుల ముందు నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ అభ్యర్థులుగా ఖరారైనప్పటికీ బీ ఫారం అందుకునే వరకు వారిలో టెన్షన్ నెలకొంది.
ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. టికెట్ పరంగా మళ్లీ ఏమైనా అడ్డంకులు వస్తాయా అనే సందిగ్ధం వారిని వెంటాడింది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వారు బీఫారాలు అందుకోవడంతో దీనికి ఫుల్‌స్టాప్ పడింది. గులాబీ పార్టీ అభ్యర్థులు ఇకప్రచార పర్వంలో దూకుడుగా ముందుకెళ్లనున్నారు.
కాంగ్రెస్‌లో మాత్రం ఉత్కంఠ!
కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కాగా, రాష్ట్రంలో 55 మందికి చోటు కల్పించారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్ అభ్యర్థులను ఖరారు చేయగా, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ఏ నియోజకవర్గ అభ్యర్థికి ఇందులో చోటు దక్కలేదు.
దీంతో రెండో జాబితా వరకు వేచి చూడాల్సిందే. కాగా ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ నుంచి శ్యామ్‌నాయక్ పేర్లు తెరపైకి వచ్చాయి. మొదటి జాబితాలోనే ఈ పేర్లు ఉంటాయేమోనని భావించారు. అయితే తొలి జాబితాలో ఎలాంటి వివాదాలు లేకుండా నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించినట్లు పార్టీ పేర్కొంది. దీంతో రెండో జాబితా వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment