ఏలూరు: ‘నువ్వు, నీ కుటుంబ సభ్యులు నా ఇంటి చుట్టూ తిరిగినా, చివరకు నా కాళ్లు పట్టుకున్నా నీకు మంచి నీటి కుళాయి ఇవ్వను. నీకు చేతనైంది చేసుకో’ అంటూ సర్పంచ్ పరుష పదజాలంతో తమని దూషించాడని పాస్టర్ మరపాక విజయరావు అవేదన వ్యక్తం చేశారు. ఈఏడాది ఏప్రిల్ నుంచి తాగునీటి కుళాయి ఇవ్వండి అని అనేకసార్లు అడిగినా పట్టించుకోకుండా ఇష్టానురీతిలో సర్పంచ్ మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాట్రాయి మండలం టీడీపీ నేత, కృష్ణారావుపాలెం సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు చేసిన నిర్వాకం.
దీనిపై అదే గ్రామానికి చెందిన పాస్టర్ మరపాక విజయరావు బుధవారం చాట్రాయి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో కుళాయి మంజూరు చేయాలంటూ సర్పంచ్‌ని అడగ్గా నీకు కుళాయి ఇవ్వనని నా కాళ్లు పట్టుకున్నా సరే నేను సర్పంచ్ పదవిలో ఉన్నంత వరకూ నీటి మంచినీటి కుళాయి ఇవ్వనని మాట్లాడారని వివరించారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజుని అడగ్గా నేటి వరకు కుళాయి మంజూరు చేయలేదని ఆయన అన్నారు.
సర్పంచ్ తమపె కక్షసాధింపుతో కుళాయి మంజూరు చేయడంలేదని దయచేసి కుళాయి మంజూరు చేయాలంటూ మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ మురళీ మోహనరావుకి వినతి పత్రం అందచేశారు. ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ మురళీ మోహనరావు మాట్లాడుతూ ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్ష్ రాజీంద్రన్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment