ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నిజాంపేట్: నిజాంపేట పరిధిలోని జర్నలిస్టు కాలనీ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జశ్వంత్ గౌడ్(17) గురువారం తెల్లవారుజామున హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాజు, రాధికల కుమారుడు జశ్వంత్ ఇంటర్ చదువుతూ కొద్దిరోజులుగా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆత్మహత్య సమాచారం అందుకున్న కాలేజీ సిబ్బంది జశ్వంత్‌ను ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. వెంటనే కాలేజీ సిబ్బంది బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ‘అమ్మ.. నాన్న నన్ను క్షమించండి..నా చావుతోనైన మన కష్టాలు తీరాలి..కొందరి కారణంగానే నేను చనిపోతున్నా..’ అని వారి పేర్లు సైతం సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అమ్మను, చెల్లిని జాగ్రత్తగా చూసుకో నాన్న అని లెటర్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. జశ్వంత్ సూసైడ్ నోట్‌లో కొందరి పేర్లు ప్రస్తావిస్తూ..వీరి మూలంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొనడంతో బంధువులతో ఏమైనా గొడవలు ఉన్నాయా?అనే కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాచుపల్లి పోలీసులు మాత్రం మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జశ్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుసున్న విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు ఆందోళనకు దిగాయి.
కల్వర్టును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
శంషాబాద్: కల్వర్టును కారు ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ కారు డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రీపురంలో నివాసం ఉంటున్న పఠాన్ అమీర్‌ఖాన్ జబ్జార్(31) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం శంషాబాద్ నుంచి ప్రయాణికుడిని ఎక్కించుకుని ఎయిర్‌పోర్టుకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఆశారాం బాపూజీ ఆశ్రమానికి దగ్గరలో కల్వర్టు ఢీ కొట్టడంతో కారు ముందుభాగం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న అమీర్‌ఖాన్‌కు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న ప్రయాణికుడి కాలిగి గాయం కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment