సౌకర్యాలు నిల్!
మంగపేట: జిల్లాలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. కనీసం తాగునీరు, కూర్చునేందుకు నీడ వసతి కూడా లేకపోవడం గమనార్హం. ధాన్యం కొనుగోలు కేంద్రాల మంజూరులో అధికారులు చూపిన శ్రద్ధ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై చూపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. చాలా వరకు కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అనువైన స్థలాలు లేకున్నా అధికారులు అనుమతులు ఇవ్వడంతో పంట పొలాలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్ల వెంట ఎక్కడ బడితే అక్కడ నిర్వాహకులు కొనుగోళ్లు చేపడతున్నారు. వర్షం వస్తే కప్పేందుకు టార్ఫాలిన్లు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
సౌకర్యాల బాధ్యత నిర్వాహకులదే..
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహణకు స్థలంతో పాటు రైతులకు తాగునీరు, నీడ తదితర వసతులు కల్పించాల్సిన పూర్తి బాధ్యత ఆయా కేంద్రాల నిర్వాహకులదే అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఐకేపీ (డీఆర్‌డీఏ) కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు క్వింటాకు రూ.32 కమీషన్ వస్తుంది. అందులో 65శాతం సీ్త్ర నిధికి, కూలీలకు 25శాతం, జిల్లా సమాఖ్యకు 10శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా మ్యాక్స్, ఓడీసీఎంఎస్, జీసీసీ కేంద్రాల నిర్వాహకులకు క్వింటాకు రూ.34 నుంచి 36 వరకు కమీషన్ వస్తుంది. పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులకు ఒక్కో లారీకి రూ.1000 చొప్పున కమీషన్ వస్తుంది. ఇలా వారికి వచ్చే కమీషన్ డబ్బుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహణ, ఇతర సదుపాయాల ఏర్పాటుకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారా లేదా అని మాత్రం అధికారులు పర్యవేక్షించడం లేదు. దాని వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
దళారుల దందాకు
నిర్వాహకుల సహకారం
కొందరు ఎరువులు, పురుగు మందుల షాపు యజమానులు, రైతులకు పెట్టుబడి పెట్టిన వారు ధాన్యం కొనుగోళ్ల దందాను సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పథకం ప్రకారంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దళారులతో కుమ్మక్కె తేమశాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. దీంతో అదే ధాన్యాన్ని దళారులు క్వింటాకు 5కేజీల తరుగుతో పాటు ప్రభుత్వ మద్దతు ధర కాకుండా క్వింటాకు రూ.100 నుంచి 150 తక్కువ చెల్లిస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. అలా కొనుగోలు చేసిన ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే కౌలు రైతుల పేరిట విక్రయిస్తున్నట్లు సమాచారం. దళారుల వ్యాపారానికి సహకరిస్తున్న కేంద్రాల నిర్వాహకులకు ఒక్కో గన్నీ సంచి ధాన్యానికి రూ.5చొప్పున కమీషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం విక్రయించిన 2, 3 రోజుల్లోనే వారి డబ్బులు కూడా ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
రైతు పేరిట వ్యాపారుల నుంచి ఎవరైనా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేసినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ధాన్యం విక్రయించింది రైతా లేదా వ్యాపారస్తుడా అనేది స్థానిక కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలుస్తుంది. వ్యాపారుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ముందే సంబంధిత రైతులకు ఏఈఓ టోకెన్ ఇస్తారు. అదే రైతు పేరుతో ట్యాబ్‌లో వివరాలను ఆన్‌లైన్ చేస్తారు. టోకెన్ ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
– రాంపతి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి
●
జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కరువు
పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు
పట్టించుకోని అధికారులు
ఇబ్బందులు పడుతున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment