ఆకలితో అలమటిస్తున్నారు..
● ప్రభుత్వ హైస్కూళ్లలో నిలిచిన అల్పాహార పథకం ● అర్ధాకలితో అలమటిస్తున్న పేద విద్యార్థులు ● చదవుపై దృష్టి పెట్టలేకపోతున్నారని తల్లిదండ్రుల వేదన ● దాతలు ముందుకు రావాలంటున్న ఉపాధ్యాయులు
ఎలిగేడు(పెద్దపల్లి): ఈఏడాది మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పరీక్షలకు ఇంకా సుమారు రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది. అయితే, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కలెక్టర్ చొరవతో అన్ని జిల్లాల కన్నా ముందుగానే.. గత సెప్టెంబర్ నుంచి ఉదయం, సాయంత్రం టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది.
చదువులో వెనుకబడిన వారిపై..
చదువులో వెనుకబడిన వారిపై స్టడీ అవర్స్‌లో ప్రత్యేక దృష్టి సారించేలా జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులను అప్రతమత్తం చేస్తోంది. ఇందుకోసం విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటున్నారు. అయితే ఉదయం 9.15 గంటలకు బడులు ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే ఇళ్లనుంచి బయలుదేరి వస్తున్నారు. ఆలోగా తమ ఇళ్లలో వంటలు తయారు కావడం లేదు. కేవలం పాలు లేదా టీ తాగి బడులకు వస్తున్నారు. సాయంత్రం 4.15 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇంటికి వెళ్లే సరికి రాత్రి 6 గంటలవుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మినహా ఇతర ఆహారం ఏమీ అందడం లేదు. దీంతో చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తూ చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు.
నిలిచిన పథకం..
గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతీ విద్యార్థికి రూ.10 చొప్పున నిర్వాహకులకు చెల్లించింది. కొన్నిసార్లు దాతల సాయం కూడా తీసుకుంది. దీనిని మరింత మెరుగుపర్చాలని రాష్ట విద్యాశాఖ భావించినా.. ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. పథకం ప్రారంభమైన కొన్నిరోజులకే అసెంబ్లీ ఎన్నికలు రావడం, బీఆర్‌ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా సాగిపోయాయి. ఈ పరిణామాలతో అల్పాహార పథకం అటకెక్కింది.
జిల్లాలో టెన్త్ విద్యార్థులు 2,419 మంది..
జిల్లాలోని 103 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో 2,419మంది పదోతరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా. టెన్త్ ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో మన జిల్లా ఎనిమిదో స్థానం ద క్కించుకుంది. ఈసారి మెరుగైన లేదా ప్రథమ స్థానం సాధించేలా విద్యాశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కానీ, చిన్నారుల ఆక లి తీర్చే మార్గంపై దృష్టి సారించలేకపోతున్నారు.
స్నాక్స్ ఇవ్వండి
స్టడీ అవర్స్ కోసం పొద్దున్నే బడికి వస్తున్నం. ఇంట్లో నుంచి వచ్చేటప్పటికి వంటలు తయారు కావడంలేదు. బడికి వచ్చాక మధ్యాహ్న భోజనం చేస్తున్నం. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు మళ్లీ స్టడీ అవర్స్ ఉంటుంది. అప్పుడు ఆకలైతంది. ఈ సమయంలో మాకు స్నాక్స్ ఇస్తే ఆకలి తీరుతుంది. ఈ దిశగా సార్లు చర్యలు తీసుకోవాలి.
– కోడూరి సాహిత్య,
పదో తరగతి, ఎలిగేడు
ఆకలి తీర్చేతేనే ఏకాగ్రత
పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేక తరగతలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందించాల్సి ఉంది. కానీ, అందడంలేదు. దాతలు, ప్రభుత్వం ముందుకు వచ్చి అల్పాహారం, స్నాక్స్ అందిస్తే విద్యార్థుల ఆకలి తీరుతుంది. ఏకాగ్రతతో పాఠ్యాంశాలు చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఈసారి 100శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. – దేవేందర్‌రావు,
హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, ఎలిగేడు
విద్యార్థి జీవితంలో పదో తరగతి
అత్యంత కీలకం. ఇందులో మంచి మార్కులు సాధిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు పడుతాయి. ఇందుకోసమే జిల్లా విద్యాశాఖ అధికారులు సర్కారు బడుల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ సమయాల్లో చిన్నారుల ఆకలి తీర్చేందుకు దాతల సాయంతో కొంత కాలం పాటు అల్పాహారం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు చేతులు ఎత్తేసింది. ఫలితంగా అర్ధాకలితో పాఠాలు అర్థంకాక విద్యార్థులు సతమతమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment