ఆలస్యంగా నడుస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
రామగుండం: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో దట్టమైన పొగమంచు అలముకుంటోంది. దీనికారణంగా న్యూఢిల్లీ నుంచి బయలుదేరే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యంతో దక్షిణాది రాష్ట్రాల ప్రయాణికులు, శబరిమలైకి వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగానే రైలు నంబరు 12626 న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లాల్సిన కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రామగుండం రావాల్సి ఉండగా.. సుమారు ఆరు గంటలు ఆలస్యంగా.. రాత్రి 11 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ – వై జాగ్ మధ్య నడిచే నంబరు 20806 ఏపీ ఎ క్స్‌ప్రెస్ నాలుగు గంటలు, న్యూఢిల్లీ – చైన్నె నంబరు 12616 జీటీ ఎక్స్‌ప్రెస్ మూడు గంట లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచుతో సిగ్నల్స్ కనిపించవని, జనవరి చివరి వరకూ రైళ్లు ఇలాగే ఆలస్యంగా నడిచే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు వివరిస్తున్నారు.
అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటం
గోదావరిఖనిటౌన్: మనదేశంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసమే భీమ్‌కోరేగాం యుద్ధం జరిగిందని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేశ్ అన్నారు. నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి తొలుత పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నగర సమీపంలోని గోదావరి నదీతీరంలో భీమ్ కోరే గాం స్థూపం నిర్మించాలని డిమాండ్ చేశారు. సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, నాయకులు ఇరుగురాల కిష్టయ్య, శనిగారపు రామస్వామి, దుబాసి బొందయ్య, నారాయణ, న వాబ్, అశోక్, కరీం, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
దళారుల పాలవుతున్న పత్తి
ఎలిగేడు(పెద్దపల్లి): తెల్లబంగారం దళారుల పాలవుతోంది. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభించకపోవడంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రైతుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి క్వింటాలుకు రూ.7,500 మద్దతు ధర చెల్లిస్తుండగా.. మార్కెట్ వరకు తీసుకెళ్లడం, కూలీలు, ట్రాక్టర్ కిరాయి తదితర ఖర్చులు రైతులకు ఆర్థికంగా భారమవుతున్నాయి. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేందుకు రోజులతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో రైతులు గ్రామాల్లోనే దళారులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.7,100కు మించి ధర చెల్లించడంలేదు. ధూళికట్ట, ముప్పిరితోట, లాలపల్లి, రాములపల్లి, ర్యాకల్‌దేవుపల్లి తదితర గ్రామాల్లో దళారులే పత్తి అత్యధికంగా కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు ఆశించిన ఆదాయం రాక ఆర్థికంగా నష్టపోతున్నారు.
చంద్రకళకు పురస్కారం
జ్యోతినగర్(రామగుండం) : ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన గోలివాడ చంద్రకళ సావిత్రీ బాయి ఫూలే రాష్ట్రస్థాయి మహిళా ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. మహిళా సా ధికారత కోసం చంద్రకళ చేస్తున్న సేవలను గుర్తించిన బీసీ సంక్షేమ సంఘం.. ఈ అవా ర్డుకు ఎంపిక చేసినట్లు అవార్డుల కమిటీ చైర్‌పర్సన్ బి.మణి మంజరి ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రకళ 25 ఏళ్లుగా మహిళా ఆర్థికాభివృద్ధి, మహిళా అభ్యుదయంపై సామాజిక సేవలు అందిస్తున్నారు. ఈనెల 3న ఆమెకు హైదరాబాద్ పురస్కారం అందిస్తారు. ఆమెను మహిళలు, శ్రీసీతారామ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment