సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
షాద్‌నగర్ (రంగారెడ్డి): రాజకీయాల కోసం రైతుల ను బలి చేయొద్దని, రుణమాఫీ చేయడంతోపాటు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు.
తెలంగాణ అమరవీరులకు ఒక్కనాడు పువ్వు పెట్టని, జై తెలంగాణ అనని, ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేసుకుంటే బాధేస్తోందని తెలిపా రు. ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చినా..బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదని మండిపడ్డారు.
పాలమూరును 80 శాతం పూర్తి చేశాం
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్‌ఎస్ హయాంలోనే 80శాతం పనులు పూర్తి చేశామని, కాల్వలు తవ్వితే పొలాలకు నీళ్లు వస్తాయని, ఈ పని పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని హరీశ్ తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయని, జాతీయ హోదా సాధించడంలో ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుకు అప్పగించారన్నారు.
కాంగ్రెస్, టీడీపీ పాలనలో 1984 నుంచి 2014 వరకు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ద్వారా రైతుకు సాగు నీరు అందించలేదని అన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 36 లక్షల ఎకరాలకు నీరందించిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment