ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లల ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్‌లాండ్ వెకేషన్ లో ఉన్నప్పుడు గుండెపోటుతో చనిపోయాడు. కాగా టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. అయితే ఆటలో ఎంత కీర్తిప్రతిష్టలు అందుకున్నాడో వ్యక్తిగత జీవితంలోనూ అన్నే వివాదాలు చుట్టుముట్టాయి. అందుకే వార్న్‌పై బయోపిక్ అనగానే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపింది. ప్రస్తుతం వార్నీ పేరుతో దిగ్గజ స్పిన్నర్ బయోపిక్ తెరకెక్కుతుంది.
అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ లో ఓ అపశ్రుతి చోటు చేసుకుంది. షూటింగ్ లో భాగంగా శృంగార సన్నివేశం చేయబోయి లీడ్ యాక్టర్స్ ఆసుపత్రి పాలయ్యారు. ఈ మూవీలో షేన్ వార్న్ పాత్రలో ఆస్ట్రేలియా నటుడు అలెక్స్ విలియమ్స్ నటిస్తుండగా.. అతని భార్య సిమోన్ పాత్రలో మార్నీ కెన్నెడీ నటిస్తోంది.
ఈ ఇద్దరూ కథలో భాగంగా శృంగారం సీన్‌లో నటించాల్సి వచ్చింది. అయితే అది కాస్తా గాడి తప్పడంతో వీళ్లను హుటాహుటిన ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అలెక్స్ తలకు గాయం కాగా.. కెన్నెడీ మణికట్టుకు దెబ్బ తగిలింది. ప్రమాదంపై మార్నీ కెన్నెడీ స్పందించింది.
"షేన్, సిమోన్ యుక్త వయసులో ఉన్న సమయంలో జరిగే సీన్ అది. మేము కారిడార్ లో నడుస్తూ వెళ్తుంటాం. అక్కడి నుంచి బెడ్‌రూమ్ లోకి దూసుకెళ్లి, అక్కడున్న బెడ్ పై పడిపోవాలన్నది సీన్. కానీ మేమిద్దరం బెడ్ పై కాకుండా కింద పడిపోయాం. వెంటనే మా ఇద్దరినీ ఎమర్జెన్సీ రూమ్ కు తరలించారు. అలెక్స్ తలకు బ్యాండేజ్ వేశారు. నాకు మణికట్టు గాయమైంది" అని కెన్నెడీ చెప్పుకొచ్చింది.
షేన్ వార్న్ జీవితంపై తెరకెక్కుతున్న ఈ మినీ సిరీస్ కు ''వార్నీ'' అనే టైటిల్ పెట్టారు. షేన్ వార్న్ ను అందరూ ముద్దుగా వార్నీ అని పిలిచే వారు. ఈ సిరీస్ లో వార్న్ జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలు, క్రికెట్ లో అతడు అత్యున్నత స్థాయికి ఎదిగిన విధానం, వివాదాలను కూడా చూపించనున్నారు. ఇంగ్లిష్ నటి లిజ్ హర్లీతో వార్న్ కు ఉన్న సంబంధం గురించి కూడా ఈ సిరీస్ లో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.
చదవండి: యాషెస్ సమరం.. పరుగుల వరద పారించిన టాప్-10 బ్యాటర్లు
Comments
Please login to add a commentAdd a comment