వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
దుత్తలూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన 565వ జాతీయ రహదారిపై దుత్తలూరు – నర్రవాడ మార్గమధ్యలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నర్రవాడ బీసీ కాలనీకి చెందిన సవరం వెంగయ్య (55) దుత్తలూరు – నర్రవాడ మధ్య ఉన్న ఓ పెట్రోలు బంకు వద్దకు వెళ్లాడు. తన టీవీఎస్ మోపెడ్‌కు పెట్రోలు పట్టించుకుని నర్రవాడకు బయలుదేరాడు. ఈ సమయంలో నర్రవాడ నుంచి దుత్తలూరు వైపు వెళ్తున్న కారు మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంగయ్య తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా డాక్టర్లు పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. వెంగయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
బైక్ అదుపుతప్పి..
సీతారామపురం: మండలంలోని నారాయణప్పపేట గ్రామ సమీపాన మోటార్‌బైక్ అదుపుతప్పి మన్నెం శ్రీను అలియాస్ ఓబులేసు (56) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వరికుంటపాడుకు చెందిన మన్నెం శ్రీను బంధువు ఒకరు నారాయణప్పపేట గ్రామ సమీపాన ఉన్న తోటలో కాపలాదారుడిగా ఉన్నాడు. అతడిని కలిసేందుకు మంగళవారం రాత్రి శ్రీను బైక్‌పై నారాయణప్పపేటకు బయలుదేరాడు. తోట సమీపానికి వచ్చేసరికి రాయిని ఢీకొని బైక్ అదుపు తప్పింది. దీంతో ఓబులేసు తలకు గాయాలై మృతిచెందాడు. మృతదేహాన్ని ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకృష్ణారెడ్డి బుధవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment