180కి పైగా కేసులు, 18 ఏళ్ల జైలుశిక్ష
కావలి: గంజాయి కేసులో పట్టుబడిన ఒక వ్యక్తిని కావలి పోలీసులు విచారించారు. అతని నేర జీవితాన్ని తెలుసుకుని నివ్వెరపోయారు. 180కి పైగా దొంగతనాల కేసులున్నాయి. వాటికి సంబంధించి 18 సంవత్సరాలపాటు అతను జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం గంజాయి కేసులో కావలి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
దొంగతనాలు చేసి..
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన వేలు 25 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి దొంగతనాల బాట పట్టాడు. పగలు రెక్కీ చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను బాగా గమనించేవాడు. చుట్టుపక్కల ఉన్న నివాసాలను, వ్యక్తుల కదలికలను స్వల్ప సమయంలోనే అవగాహన చేసుకుని రాత్రి వెళ్లి దొంగతనం చేసేవాడు. అలా 25 సంవత్సరాలపాటు నేరాలు చేశాడు. వీటికి సంబంధించి 180కి పైగా పోలీసు కేసులను ఎదుర్కొన్నాడు. వాటి తాలూకా జైలు జీవితం అనుభవించాడు. అయితే అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఆటోలో తిరుగుతూ..
వేలుది స్థిర నివాసం బెంగళూరు. వయసు మీద పడటం.. శరీరంలో చురుకుదనం సన్నగిల్లడంతో నేర స్వభావాన్ని మార్చాడు. గంజాయి అమ్మకాలపై దృష్టి పెట్టాడు. ఇందులో భాగంగా ఆటో నడపడం మొదలుపెట్టాడు. అందులో తిరుగుతూ బెంగళూరులోని బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు చేసి సంపాదించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతం నుంచి చౌకగా గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరుకు చేర్చి పొట్లాలు కట్టి అమ్మకాలు చేస్తే మరింత ఆదాయం వస్తుందని భావించాడు. అందులో భాగంగా విశాఖపట్నం ప్రాంతంలో గంజాయి అమ్మకాలు చేసే రాజు అనే వ్యక్తి గురించి తెలుసుకుని ఢీల్ మాట్లాడుకున్నాడు. రెండుసార్లు విశాఖపట్నం వెళ్లి అతడిని కలిసి గంజాయిని పార్సిల్ చేయించుకుని బెంగళూరుకు తీసుకెళ్లి అమ్మి సొమ్ము చేసుకున్నాడు.
దొరికిపోయి..
మూడో ప్రయత్నంలో వేలు దొరికిపోయాడు. గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ విశాఖపట్నం ప్రాంతంలో రాజు వద్ద 10.045 కేజీల గంజాయిని కొనుగోలు చేసి, వాటిని ఆరు ప్యాకెట్లలో పార్సిల్ చేసి ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకుని లారీలో బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. దారిలో కావలి మండలం గౌరవరం వద్ద జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా సమీపంలో బ్యాగ్‌తో దిగి, మరో లారీ ఎక్కడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ పి.శ్రీధర్ సూచనలతో కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ జి.రాజేశ్వరరావు, ఎస్సైలు సీహెచ్ తిరుమలరెడ్డి, ఎం.బాజిబాబు, సిబ్బంది ఆర్.రాధయ్య, కె.ప్రసాద్‌లు టోల్‌ప్లాజా పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. గంజాయి రవాణా గురించి సమాచారం అందడంతో రహస్య ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో వేలు పోలీసులను చూసి కంగారు పడుతూ పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని పట్టుకున్నారు. విచారించగా గంజాయి రవాణా, అమ్మకాలు, ఇంకా తన నేర జీవితాన్ని వెల్లడించాడు.
గంజాయి కేసులో పట్టుబడిన
వ్యక్తి చరిత్ర ఇది
నిందితుడి నేర జీవితంతో
నివ్వెరపోయిన పోలీసులు
ప్రస్తుతం కావలి సబ్‌జైల్లో..
Comments
Please login to add a commentAdd a comment