కార్మికుల సంక్షేమానికి నిరంతర పోరాటం : సీపీఎం
అమరచింత: కార్మికులు, కర్షకుల సంక్షేమానికి సీపీఎం నిరంతరం పోరాటాలు చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలో జరిగిన శ్రీనివాసులు వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరై జీఎస్ స్తూపం వద్ద శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాసులు చిన్న వయసులోనే కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడై ప్రజా సమస్యల పరిష్కరానికి ఎన్నో ఉద్యమాలు చేశారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు అధికసంఖ్యలో ఉండటంతో వారి కూలి పెంపుతో పాటు పనిదినాలు, పీఎఫ్ వర్తింపునకు యాజమాన్యాలతో పోరాడారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాసేందుకు కుట్రలు చేస్తున్నాయని.. అలాంటి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని, ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్, సీపీఎం మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేశ్, ఆర్‌ఎన్ రమేష్, అజయ్, రాఘవేంద్ర, రవి, శ్యాంసుందర్, బుచ్చన్న, మాజీ సర్పంచ్ టి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment