TS Special
-
47% కొలువులు మహిళలకే
సాక్షి, హైదరాబాద్: గడిచిన మూడు నెలల్లో మొత్తం 28,942 కొలువులను భర్తీ చేయగా, అందులో 13,571 (47 శాతం) కొలువులను మహిళలు, 15,371 (51 శాతం) ఉద్యోగాలను పురుషులు దక్కించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్గా అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.3 జారీ చేయగా, దీనితో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు, పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోటా మాత్రమే ఉన్నా, వారు ఏకంగా 47 శాతం ఉద్యోగాలను దక్కించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాల మేరకు 2022 లోనే రాష్ట్ర ప్రభుత్వం 7593 మెమో జారీ చేసిందని, దాని ఆధారంగానే ప్రభుత్వం ఇటీవల జీవో నం. 3 జారీ చేసిందని అధికారవర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్ మెట్రో రైల్ సక్సెస్.. ఒక కేస్‌స్టడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రాజె క్టుపై ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ప్రశంసలు కురిపించింది. విశ్వవిద్యా లయానికి చెందిన మేనేజ్ మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీ షనర్లకు మెట్రో ప్రాజెక్టు విజయగాథ ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే స్టాన్ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్ఎస్ఐఆర్) తాజా సంచికలో (స్ప్రింగ్–2024) ప్రచురించింది. ఇది ఒక భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవం అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావలసిన నాయకత్వ లక్షణాలు, తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్ అందజేస్తుంది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని పలు ప్రాజెక్టులపైన విస్తృత అధ్యయనాల్లో భాగంగా ఐఎస్బీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపైన క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ఒక కేస్ స్టడీగా ఎంపిక చేసుకొని ప్రచురించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు సంస్థ ఎండీ ఎన్వీఎస్రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచినట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఒకదశలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ క్రమంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దాన్ని సుసాధ్యం చేశారని జర్నల్‌లో ప్రశంసించారు. ప్రాజెక్టును విజయపథంలో నడిపించారని, ఇది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని ఈ కేస్ స్టడీ తెలియజేసింది. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ విస్తృత ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యల్లో సమర్ధవంతమైన నాయకత్వ ప్రతిభను ఎన్వీఎస్ కనబరిచినట్లు జర్నల్‌లో ప్రచురితమైంది. -
2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని, 71రోజుల్లో ఇప్పటికే 31వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో సుమారు రూ.47కోట్లతో నిర్మించిన కె–హబ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు ధనసరి అనుసూయ(సీతక్క), కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కె–హబ్‌లో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే నాలుగు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు యూనివర్సిటీల్లోని యువతను రెచ్చగొట్టి దాదాపు పదేళ్లు అ«ధికారంలో ఉన్న గత ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించకుండా విస్మరించిందని విమర్శించారు. -
12కిపైగా స్థానాలు మనవే
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ డజనుకు పైగా స్థానాల్లో పైచేయి సాధిస్తుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఓట్లు సాధిస్తుందని, ఓట్ల శాతం కూడా చాలా మెరుగవుతుందన్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో ఆదివారం జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు పార్టీ నేతలు, కేడర్ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో పాలన ముందుకు సాగడం లేదు ‘కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు కావస్తున్నా పాలన ముందుకు సాగడం లేదు. అవగాహన లేమితో అధికార పార్టీ నేతలు రాష్ట్రానికి నష్టం జరిగేలా వరుస తప్పులు చేస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న తప్పులు, ఆగడాలను ప్రజల్లో ఎండగడుదాం. పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్న ఘటనలు ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉండే వారికి ఆత్మ విశ్వాసం అవసరం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై పనిచేసే వారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు.’ అని కేసీఆర్ పేర్కొన్నారు. జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్? జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ పేరు దాదాపు ఖరారైంది. ఒకటి రెండు రోజుల్లో అనిల్ పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఈ మేరకు జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్ఎస్ కీలక నేతలతో జరిగిన భేటీలో కేసీఆర్ సూచన ప్రాయంగా వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే లింగాయత్ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ సరైన అభ్యర్థి అవుతారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. 2019 ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. హరీశ్‌కు సమన్వయకర్తల నియామకం బాధ్యతలు జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయకర్తల నియామకం బాధ్యతను మాజీ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించినట్లు సమాచారం. కాగా మెదక్ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్న సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నేత బీరయ్య యాదవ్ ఆదివారం కేసీఆర్‌ను కలిశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనకు పోటీ అవకాశం కల్పించాలని కోరారు. కేసీఆర్‌తో జరిగిన భేటీలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.5 లక్షల బీమా!
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కింద స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఎస్‌హెచ్‌జీ మహిళలు మరణిస్తే వారికి సంబంధించిన రుణాలను సైతం మాఫీ చేయనుంది. మరణించిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు సంబంధించిన రుణ బకాయిలను ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ బకాయిలను పూర్తిగా మాఫీ చేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ఐకేపీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు, పోలీసుల యూనిఫామ్‌లను కుట్టే బాధ్యతను సైతం ఎస్‌హెచ్‌జీ మహిళలకే అప్పగించనుంది. వీరి ద్వారానే ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారితో నాప్కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన యంత్ర పరికరాలను కూడా పరిశీలించింది. మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని ఆ పరిధిలోని ఎస్‌హెచ్‌జీలకు యూనిఫామ్‌లు కుట్టడం, శానిటరీ నాప్కిన్ల తయారీలో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చాన్స్ ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ 2018 నుంచి నిలిచిపోగా, త్వరలో మళ్లీ పునరుద్ధరిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ లేని రుణాలతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆర్థిక, కుటుంబ స్థితిగతులు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ లేని రుణాల పంపిణీ పునః ప్రారంభించడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మహిళలకు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీమా ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని రైతు బీమా పథకం తరహాలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించనుంది. అన్ని తరహా మరణాలకు జీవిత బీమా వర్తించనుంది. మహిళ మరణించిన పక్షంలో నామినీ ఖాతాలో రూ.5 లక్షలను బీమా కంపెనీ జమ చేస్తుంది. 61 లక్షల మంది మహిళలకు బీమా 18–60 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు మాత్రమే ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో సభ్యులుగా ఉండడానికి అర్హులు కాబట్టి వారికే ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 6.1 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 61లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 1.74 లక్షల గ్రూపుల్లో 17.40 లక్షల మంది, గ్రామీణ ప్రాంతాల్లోని 4.36 లక్షల గ్రూపుల్లో 43.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి చింతకాని: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇవ్వని మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో నిర్వహించే మహిళా సదస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. ఏడాదికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించనున్నట్లు..ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలు దశాబ్ద కాలానికి పైగా ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిసోయారని, అయితే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని భట్టి తెలిపారు. -
డీఏపై కేబినెట్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుతో పాటు ఇతర అంశాలపై ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై కక్ష గట్టి రద్దు చేస్తే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేశారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనని, మంత్రివర్గ ఉప సంఘం శాఖల వారీగా సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఆదివారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనసాగింపుపై త్వరలో నిర్ణయం గత పదేళ్లుగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉద్యోగులకు అవకాశం లభించలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే వ్యవహరించారని విమర్శించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నర్‌ను సంప్రదించి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపుతామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవమన్నారు. బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్! ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ బాపు జయశంకరే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ, తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని, శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని తెలిపారు. తెలంగాణ బాపు తానే అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని విమర్శించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకరే అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలన ను గాడిలో పెడుతున్నామని, తాము పదేళ్లు అధి కారంలో ఉండటం ఖాయమని సీఎం అన్నారు. -
అక్రమాల టై‘టానిక్’
సాక్షి, హైదరాబాద్: ఎలైట్ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్ బిజినెస్) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్ పెట్టి ఇంకెవరూ ఎలైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్’ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలైట్ స్టోర్ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్బీసీఎల్కూ ఆయనే బాస్ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్ నడిపించిందని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారంటే టానిక్ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎలైట్ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్ బాటిళ్లు ఎప్పుడూ డిస్ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి. చైన్ బిజినెస్ స్థాయికి ప్రణాళిక.. ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్ అడిగిందే తడవుగా ఎక్సై జ్ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది. క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది. అచ్చం మాతృ టానిక్ షాపులాగానే ఎలైట్గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్ చైన్షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్ చైన్షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్ సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్), వాకిన్ స్టోర్లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్ ఎలైట్ వాకిన్ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చే యాల్సిన రెండు వేతన సవరణ బకాయిల్లో ఒకదా న్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. 2017లో జరగాల్సిన వేతన సవరణకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ఫిట్మెంట్ కాకుండా మధ్యంతర భృతితో సరిపెట్టింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 21 శా తం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ న అందుకోబోయే మే నెల వేతనంతో దీని చెల్లింపు ప్రారంభం కానుంది. ఈ ఏడేళ్లకు సంబంధించిన బ కాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించను న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ లేకుండా బకా యిలను మాత్రమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఇలా పేరుకుపోయి: రాష్ట్ర విభజనకు ముందు 2013లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, నాటి విభజన హడావుడిలో ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ లో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంటుంది. 2013 వేతన సవరణ తర్వాత 2017లో, మళ్లీ 2021లో జరగాల్సి ఉంది. ఈ రెండూ అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2017 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు 2018లో సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్ప టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ప్రభు త్వం దాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల చ ర్చల అనంతరం 16 శాతం మధ్యంతర భృతిని కమిటీ ప్రకటించింది. 2018 జూన్ నుంచి అది కొనసాగుతోంది. ఈలోపు 20 21లో మరో వేతన సవరణ గడువు దాటి పోయింది. గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు బకాయిల చెల్లింపుపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. త్వరలో పార్ల మెంటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం, ఒక వేతన సవరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బస్‌భవన్‌లో ప్రకటించారు. ఎంత పెరుగుతుందంటే..: గత ఆరేళ్లుగా 16 శాతం ఐఆర్‌ను లెక్కగడుతూ ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇప్పుడు దాన్ని తొలగించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి చెల్లిస్తారు. ఉద్యోగుల మూల వేతనంపై మాత్రమే ఐఆర్‌ను లెక్కిస్తారు. దీంతో ఆ పెరుగుదల తక్కువ గా ఉంటుంది. ఫిట్‌మెంట్‌ను మూలవేతనంతో పా టు కరువు భత్యం, ఇంక్రిమెంట్లపై లెక్కిస్తారు. దీంతో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీపై రూ.418.11కోట్ల భారం పడనుందని అంచనా. కాగా, ఆర్టీసీ ఉద్యో గుల్లో 41.47 శాతం మంది కండక్టర్లు, 35.20 శాతం మంది డ్రైవర్లు, 5 శాతం మంది మెకానిక్‌లు, 3.34 శాతం మంది శ్రామిక్లున్నారు. వీరి వేతనాల్లో పెరుగుదల ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. స్వాగతిస్తున్నాం: టీఎంయూ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పే స్కేలు, బాండ్స్ డబ్బులు ఇచ్ఛిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌కు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నిర్ణయం: ఎన్ఎంయూ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేయడం గొప్ప నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి, నరేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పీఎఫ్ వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిల సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘30 శాతం అనుకుంటే.. 21 శాతమే ఇచ్చారు’ వేతన సవరణ 30 శాతం చేస్తుందనుకుంటే 21శాతంతో సరిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణగౌడ్, సుద్దాల సురేశ్ ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. -
కాళేశ్వరం ఇంజనీర్లకు.. క్రాస్ ఎగ్జామినేషన్!
సాక్షి, హైదరాబాద్: ‘బ్యారేజీలను డిజైన్ల ప్రకారమే కట్టారా. డిజైన్లను ఉల్లంఘించి ఏమైన పనులు చేశారా? నిర్మాణంలో డిజైన్లు మార్చితే ఆమోదం తీసుకున్నారా? సరైన ఇన్వెస్టిగేషన్లు చేశారా ? భూసార పరీక్షల కోసం డైమండ్ డ్రిల్లింగ్ చేశారా ? ప్లానింగ్ ఏ విధంగా చేశారు ? క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి ముందు పరీక్షలు జరిపారా? క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ విభాగాలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాయా? ..అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాల్లో పాల్గొన్న ఇంజనీర్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రిటైర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ శనివారం మూడో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:40 గంటల వరకు జలసౌధలో నిర్మాణం(ఎగ్జిక్యూషన్), క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్ విభాగాల ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థతో విడివిడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో వారి పాత్రపై ప్రశ్నలను సంధించింది. ఒక విభాగం ఇంజనీర్లు అందించిన సమాచారంలో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి మరో విభాగం ఇంజనీర్లకు సంబంధిత ప్రశ్నలు వేసి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన 2016 నుంచి ఇప్పటి దాకా వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, బదిలీ అయిన ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. కమిటీ ఇంజనీర్లను ప్రశి్నస్తున్న సమయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, ఇతర ఉన్నత స్థాయి అధికారులను సైతం లోపలికి అనుమతించలేదు. డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం.. బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున వాటితో సంబంధం ఉన్న వారంతా సంబంధిత ఫైళ్లతో ఢిల్లీకి రావాలని చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించారు. భారీ సంఖ్యలో ఫైళ్లు, ఉద్యోగులను ఢిల్లీకి పంపించడం సాధ్యం కాదని, నిపుణుల కమిటీలో నుంచి ఎవరైనా మళ్లీ హైదరాబాద్‌కు వస్తే ఇంజనీర్లందరినీ పిలిపించి అవసరమైన ఇతర సమాచారాన్ని అందిస్తామని నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేయగా, అయ్యర్ సానుకూలంగా స్పందించారు. కమిటీకి ఈఆర్టీ, జీపీఆర్ టెస్టుల నివేదికలు.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని గతంలో ఎన్డీఎస్ఏ కోరింది. తాజాగా నిపుణుల కమిటీ మొత్తంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఇదే 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని కోరగా, నీటిపారుదల శాఖ అందించింది. దాదాపు 90శాతం సమాచారాన్ని వెంటనే నాలుగు బ్యాగుల్లో నింపి అప్పగించామని, వాటి బరువు 100 కేజీల కంటే ఎక్కువే ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వండి: ఈఎన్సీ(జనరల్) అనిల్ ప్రాణహిత నదికి ఏటా మే నుంచే వరదలు ప్రారంభమవుతాయని, బ్యారేజీలకి మరింత నష్టం జరగకుండా ఆ లోపే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, మరమ్మతులను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదికను అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేయగా, కమిటీ సానుకూలంగా స్పందించింది. నీటిపారుదల శాఖ అందించిన సమాచారంపై లోతుగా అధ్యయనం జరపడానికే కమిటీకి కనీసం నెల రోజుల సమయం పట్టనుందని అధికారులు అంటున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూప్యానల్(డీఎస్ఆర్పీ) తయారుచేసిన నివేదికను ఎన్డీఎస్ నిపుణుల కమిటీకి అందించారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్ చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ అప్/ డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాకులతో పాటు బ్యారేజీ కుంగిన చోట అదనంగా సీకెంట్ పైల్స్, స్టీల్ పైల్స్ వేసి... తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరదలన్నీ పూర్తిస్థాయిలో తగ్గాకే గేట్లు దించాలని కమిటీ గుర్తు చేసింది. మాజీ ఈఎన్సీలు దూరం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన రిటైర్డ్ ఇంజనీర్లు సైతం నిపుణుల కమిటీ ముందుకు హాజరు కావాలని నీటిపారుదల శాఖ ఆదేశించగా, ఇద్దరు మాజీ ఈఎన్సీలు సి. మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు దూరంగా ఉన్నారు. నిపుణుల కమిటీ పిలిస్తే వస్తానని పూర్వ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ సమ్మతి తెలిపి... హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండగా, ఆరోగ్యం బాగాలేదని మాజీ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరు కాలేదు. -
వ్యవసాయ కార్పొరేషన్లపై ఏసీబీ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఆయన వ్యవసాయశాఖలోని ఒక కార్పొరేషన్ ఎండీ.. టెండర్లు, పనుల్లో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు మొదలు అన్నింటిలోనూ వసూళ్లేనని.. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆయన హైదరాబాద్‌లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక విల్లా, హైదరాబాద్ పరిసరాల్లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ♦ ఇదేశాఖలోని ఓ కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు రెండు విల్లాలు, రెండు ప్లాట్లు, నగర శివారులో ఐదెకరాల ఫాంహౌస్ ఉందని సమాచారం. మరో కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, ఐదుచోట్ల ఇళ్ల స్థలాలు, నగర సమీపంలో రెండెకరాల భూమి ఉన్నాయి. ఒక కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారికి ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయి. ♦ ..వ్యవసాయశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనే జర్లపై వస్తున్న ఫిర్యాదుల్లోని అంశాలివి. దీనిపై దృష్టిపెట్టిన ఏసీబీ కొందరు పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. రెండు కార్పొరేషన్ల ఎండీలపై నేరుగా ఫిర్యాదులు అందడంతో.. ఏసీబీ అధికారులు లోతుగా పరిశీల న చేపట్టి, రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే ఆయా ఉద్యోగులను పిలిపించి విచారించేందుకు, సోదాలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయా కార్పొరేషన్ల జనరల్ మేనేజర్లు, మేనేజర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వ్యవసా య ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఐఏఎస్‌ల విచారణతో.. వ్యవసాయశాఖలోని 11 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇద్దరు ఐఏఎస్‌లను విచారణ అధికారులుగా నియమించారు కూడా. దీంతో భారీగా దండుకున్న అధికారుల్లో దడ మొదలైంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, దీని నుంచి బయటపడేందుకు పలువురు ఎండీలు, జనరల్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మార్క్‌ఫెడ్‌లో భారీగా ఉల్లంఘనలు! వ్యవసాయశాఖ పరిధిలో మార్క్‌ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, హాకా, టెస్కాబ్, సీడ్ కార్పొరేషన్ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో వందల కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. మార్క్‌ఫెడ్ లోనైతే ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. దానిద్వారానే రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రైతుల పంటలను కూడా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం, రైతుల నుంచి కొన్న పంటలను విక్రయించాక వచ్చే డబ్బును బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అధికా రులు ఆయా లావాదేవీలను ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకులతో నిర్వహిస్తుండటంపై విమర్శలు న్నా యి. ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారుతు న్నట్టు ఆరోప ణలు న్నాయి. ఎరువుల నుంచి గన్నీ బ్యాగుల దాకా.. ఎరువుల రవాణా టెండర్లు అధికారులకు వరాల జల్లు కురిపిస్తాయని.. రూ.వంద కోట్లకు పైబడి ఉండే ఈ టెండర్లను ఒకే కంపెనీకే వచ్చేలా నిబంధనలు రూపొందించి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కంపెనీకే టెండర్ దక్కుతూ వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇక గన్నీ బ్యాగుల టెండర్లలోనూ కొందరు అధికారులు కంపెనీల నుంచి కమీషన్లు అందుకుంటున్నారన్న సమాచారం ఉంది. ♦ 2019–20లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నను టెండర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో దాదాపు రూ.1,200 కోట్లు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఎండీ స్థాయి అధికారి నుంచి మేనేజర్ల వరకు కోట్లలో కమీషన్లు ముట్టినట్లు ఫిర్యాదులున్నాయి. మార్క్‌ఫెడ్‌కు రూ.3 వేల కోట్ల అప్పులుంటే, ఈ స్కాం వల్లే సగం అప్పు పేరుకుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అసలు పదేళ్లుగా మార్క్‌ఫెడ్ జనరల్ బాడీ సమావేశం జరగలేదంటే నిబంధనల ఉల్లంఘన ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నాయి. మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి తన పోస్టును కాపాడుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ♦ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లోనైతే జిల్లా మేనేజర్లు కూడా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో కొందరిని అడ్డుపెట్టుకొని పైస్థా యి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమా లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవే ట్ గోదాములతో సంబంధాలు పెట్టుకుని.. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌ను దివాలా తీయిస్తున్నా రన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పనులకు టెండర్లకు వెళ్లకుండా పాత వాటినే కొనసాగిస్తూ నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. ♦ ఆయిల్‌ఫెడ్‌లో సిద్దిపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతుల టెండర్‌ను తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీకి కాకుండా మరో కంపెనీకి ఇవ్వడం వివాదం రేపింది. కోర్టులో ఈ వివాదం ముగిసింది. కానీ ఈ వ్యవహారంలో కొందరు అధికారులు పాత్ర పోషించారని.. కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ♦ నిబంధనలకు విరుద్ధంగా ఆయిల్‌ఫెడ్‌లో రూ.కోటిన్నర, వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో రూ.కోటి మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద కేటాయించారు. ♦ హాకాలో శనగల కొనుగోలు వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఇందులో ఎండీ పాత్ర కంటే అప్పటి ఒక ప్రజాప్రతినిధి జోక్యమే అన్ని విధాలుగా హాకాను భ్రష్టుపట్టించిందనే విమర్శ లున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి శనగలు సరఫరా చేసే బాధ్యత తీసుకొని వాటిని విని యోగదారులకు కాకుండా వ్యాపారులకు కమీష న్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ♦ ఇక ఆగ్రోస్‌ను పెద్దగా అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ యాంత్రీకరణ అమలుకాకపోవడంతో ఆగ్రోస్ కునారిల్లిపోయింది. ♦ ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధి తన పదవిని అడ్డుపెట్టుకొని రూ.500 కోట్ల దాకా వెనకేసుకున్నట్టు ఆరోపణ లున్నాయి. అధికారం ద్వారా అనేక వ్యాపారాలు చేసి కమీషన్లు వసూలు చేశారని, అధికారులు తనకు నచ్చినట్టుగా వ్యవహరించేలా చేశాడని సమాచారం. అదే ఇప్పుడు సదరు కార్పొ రేషన్‌ను బోనులో నిలబెట్టిందని అంటున్నారు. ఇప్పటికీ చక్రం తిప్పుతున్న మాజీ చైర్మన్లు గత ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారు ఇప్పుడు మాజీలుగా మారినా కొత్త ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఆయా కార్పొరేషన్ ఎండీలు, ఇతర మేనేజర్లు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తూ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే పార్టీ మారి మళ్లీ ఇదే కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వస్తామనీ బెదిరిస్తున్నట్టు సమాచారం. కొందరు ఇప్పటికీ కార్పొరేషన్ల డ్రైవర్లను వాడుకుంటున్నట్టు తెలిసింది. సదరు మాజీ చైర్మన్లతో కలసి అక్రమాలకు పాల్పడిన పలువురు ఎండీలు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
65 ఐటీఐల్లో స్కిల్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అధికారులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పవన్ భగేరియాతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు, ఇప్పుడున్న కోర్సులకు మధ్య భారీ అంతరముందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. రూ.2,700 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్ల నిర్మాణం, యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెడతారు. అన్ని రంగాల్లో యువత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను ఎంపిక చేశారు. ప్రతి ఏడాదీ వీటితో 9000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తారు. ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి మొదలయ్యే అకడమిక్ సెషన్‌కు వర్క్ షాప్‌లను అందుబాటులో ఉంచాలని, సరిపడేంత మంది ట్యూటర్లను నియమించాలని ముఖ్యమంత్రి టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సూచించారు. కేవలం శిక్షణనివ్వటమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యాంపస్ ప్లేస్మెంట్లపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్లేస్‌మెంట్‌సెల్ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్ సూచించారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు హైదరాబాద్‌ను స్కిల్ డెవెలప్మెంట్హబ్గా తయారు చేసేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
కాళేశ్వరం అధికారులపై NDSA కమిటీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇంజనీర్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చీఫ్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సీరియస్ అయ్యారు. శనివారం ప్రాజెక్టు పరిశీలన అనంతరం జలసౌధలో జరిగిన కీలక సమావేశంలో ఇది చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు.. కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలిచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో.. ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్ అయ్యర్ వాళ్లపై గరం అయ్యారు. ఇలా సమావేశంలో మూడుసార్లు ఆయన అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మూడు బ్యారేజీలకు పని చేసిన వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అలాగే.. 2016 నుంచి ప్రస్తుతం (ఈనెల 8వ తేదీ దాకా) బ్యారేజీల ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ, మోడల్ స్టడీస్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పాల్గొన్నవారు.. ఆయా విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు బదిలీ అయినవారు, పదవీ విరమణ చేసినవారు కూడా విధిగా ఈ మీటింగ్‌కు హాజరు కావడంతో ఎన్డీఎస్ఏ కమిటీ కీలక సమాచారాన్నే రాబట్టే ప్రయత్ని చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక తమ పర్యటన నేటితో ముగియడంతో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ బృందం ఢిల్లీకి పయనం అయ్యింది. అంతకు ముందు.. గురు, శుక్ర వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ సందర్శించింది. భద్రత నడుమ.. కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. నాలుగు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. -
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. కాగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. కొత్త పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తోంది అని వ్యాఖ్యలు చేశారు. -
ఉక్కపోత పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలకు సమాంతరంగా రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వేగంగా నపమోదవుతోంది. శుక్రవారం రాష్ట్రంలోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 38.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా... ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతా చోట్ల ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతోంది. -
వైఎస్ విజన్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విజన్, విధానాల వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ అధికారంలోకి రాక ముందు హైదరాబాద్‌లో స్థిరాస్తి మార్కెట్ పూర్తిగా క్షీణ దశలో ఉండేదని, ఆయన సీఎం పదవి చేపట్టాక దూరదృష్టితో నగరాభివృద్ధి కోసం చేపట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే వంటి విప్లవాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని గుర్తుచేశారు. దీంతో అప్పుడు పుంజుకున్న స్థిరాస్తి మార్కెట్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉందని చెప్పారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ 13వ ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో బిల్డర్లు కూడా భాగస్వాములేనన్నారు. బిల్డర్లు ఎంత వ్యాపారం చేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బిల్డర్లను వ్యాపారస్తులుగా చూసే విధానాలకు స్వస్తిచెప్పి పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటామని పొంగులేటి హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మరింత పెంచి హైదరాబాద్ దాహార్తిని తీరుస్తామని, నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. నిర్మాణ అనుమతులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని పేర్కొన్నారు. ధరణిలో 8.5 లక్షల దరఖాస్తులు పెండింగ్.. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వం ఎన్నో విధ్వంసాలకు పాల్పడిందని, సామాన్యులకు కలిగిన ఇబ్బందులను కళ్లారా చూస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రస్తుతం ధరణిలో 8.5–9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిలో 5.8 లక్షల దరఖాస్తులను సహేతుక కారణాల్లేకుండానే తిరస్కరించారని విమర్శించారు. స్పెషల్ డ్రైవ్‌లతో గత వారం రోజులలో 80 వేల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించామని పొంగులేటి చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఉన్న లొసుగులను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామన్నారు. పారదర్శక రెవెన్యూ వ్యవస్థను సామా న్యుల చెంతకు తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైఎస్సార్ లాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి అన్నారు. మూసీ రిఫర్‌ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లతో ప్రధాన నగరంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ జాతీయ మాజీ అధ్య క్షుడు సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు నుంచి ట్రైబల్ వర్సిటీలో క్లాసులు
ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్), బీఏ (సోషల్ సైన్స్) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్ వస్తే కాంపౌండ్ వాల్, డీపీఆర్, టెండర్ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. యూజీసీ అ«దీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్ ఎగ్జామినేషన్ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి హనుమకొండ కల్చరల్: పవిత్రమైన మహాశివరాత్రి రోజున వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని మహాశివుడికి అంకితం చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీరుద్రేశ్వరశివలింగానికి అభిõÙకం నిర్వ హించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం
లక్డీకాపూల్ (హైదరాబాద్): తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పేద ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ, సంస్థకు మంచి గుర్తింపు తేవడానికి నిమ్స్ వైద్యులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శుక్రవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డీఎస్ఏ ల్యాబ్, యూఎస్ ఎయిడ్ సంస్థ సహకారంతో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్‌లతో పాటు రూ.2 కోట్ల విలువైన సీటీఐసీయూను ప్రారంభించారు. స్కిల్ ల్యాబ్‌లో సీపీఆర్ విధానాన్ని ఆయన స్వయంగా చేసి మెళకువలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్‌కు జాతీయస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ ఉందని.. దాని కొనసాగింపునకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, ఆసుపత్రులతో పాటు నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తోందని వివరించారు. నిమ్స్‌లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ సిల్క్ లాబ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం కొత్తగా నియుక్తులైన 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 300 మంది స్టాఫ్ నర్సులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగం అధిపతి సాయి సతీశ్, యూఎస్ ఎయిడ్ డాక్టర్ వరప్రసాద్, హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నిమ్స్, ప్రభుత్వ అనుసంధానకర్త డాక్టర్ మార్త రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలి. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం ఉందని సీఎం అన్నారు. ఇదీ చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి? -
ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత
దుండిగల్: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్(ఐఏఆర్ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పనులను అడ్డగించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేయడంతో పాటు పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తరువాత మరో సారి కూల్చివేతలు కొనసాగించగా కళాశాల యాజమాన్యం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూల్చివేతలను నిలిపివేశారు. కళాశాలకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐఏఆర్ఈ కళాశాలలో కూల్చివేతలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే కళాశాల చైర్మన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కళాశాలకు వచ్చి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. 20 రోజుల్లోపే చర్యలు.. దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును ఫిబ్రవరి 20వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్వయంగా పరిశీలించారు. సుమారు 8.24 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారు లు అప్పట్లోనే ఆయనకు నివేదిక ఇచ్చారు. అదే నెల 22వ తేదీన ఎఫ్టీఎల్ సరిహద్దులను ఏర్పాటు చేసి షెడ్డులు, ఇతర నిర్మాణాలను తొలగించారు. తాజాగా ఐదు అంతస్తుల శాశ్వత భవనంలో రెండు అంతస్తుల మేర కొంత భాగాన్ని కూల్చారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నా...ఆగలేదు: మర్రి రాజశేఖర్‌రెడ్డి 25 సంవత్సరాల నుంచి కళాశాలను నడిపిస్తున్నాం. అప్పటి నుంచి ఏ ఒక్క అధికారి కూడా నోటీసు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అనుమతులు తీసుకున్నాం. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చిన తరువాత రెగ్యులరైజేషన్ చేసుకోవాలని సూచించడంతో 2015లోనే రెగ్యులరైజ్ కోసం రూ.90 లక్షలు చెల్లించాం. కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. ఇది మా పట్టా భూమి. మేము కొనుగోలు చేశాం. చిన్న చిన్న డీవియేషన్లు ఉంటే రెగ్యులరైజ్ చేసుకుంటాం. వారం క్రితం నోటీసు ఇచ్చారు.. కోర్టు ద్వారా సమాధానం ఇస్తామని చెప్పినా కనీసం సమయం కూడా ఇవ్వలేదు. -
రయ్ రయ్‌మనేలా
కంటోన్మెంట్: ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుంది. రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు తీరిపోనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ.2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిపోవడంతో ఇంధన రూపంలో వ్యయం తగ్గిపోనుంది. కారిడార్ నిర్మాణం ఇలా రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యా ట్నీ సెంటర్ నుంచి మొదలై కార్ఖానా, తిరు మలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ సమీపంలోని ఓఆర్ ఆర్ జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 11.12 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్ వద్ద), అల్వాల్ వద్ద (0.310 కిలోమీటర్ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ పర్ డే –పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 35,825గా ఉంది. ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మా ర్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలి పోతున్నారు. సమయం హరించుకుపోవడంతో పా టు ఇంధన వ్యయం పెరుగుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలి సిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బాధలు తొలగిపోతాయి. ముఖ్యాంశాలు... ♦ మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ. ♦ ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ. ♦ అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ. ♦ పియర్స్: 287 ♦ అవసరమైన భూమి: 197.20 ఎకరాలు ♦ రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు ♦ ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు ♦ ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు ఇవీ ప్రయోజనాలు ♦ రాజీవ్ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు చెల్లు ♦ కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణం ♦ ఇంధనం మిగులుతో వాహనదారులకు తగ్గనున్న వ్యయం ♦ సికింద్రాబాద్ నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ వరకు చేరుకునే అవకాశం ♦ మేడ్చల్–మల్కాజిగిరి–సిద్దిపేట–కరీంనగర్–పెద్దపల్లి–మంచిర్యాల, కొమురం భీం జిల్లా ప్రజలు లబ్ధిపొందనున్నారు. -
సింగరేణికి తాడిచెర్ల–2 బొగ్గు గని
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థకి తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడానికి అన్ని అనుకూలతలున్నాయని భట్టి వివరించారు. త్వరలో సింగరేణికి బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామని ప్రహ్లద్ జోషీ హామీ ఇచ్చారని భట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్‌లోనూ ఉత్పత్తిని ప్రారంభించే నిమిత్తం అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రాష్ట్రంలోని సబ్స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సహకరించాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌ను కోరామన్నారు. ఈ అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి వెంట ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సింగరేణి ఇన్చార్జీ సీఎండీ బలరామ్ ఉన్నారు. కాగా, తాడిచెర్ల బ్లాక్–2 గనిని సింగరేణికి కేటాయిస్తే సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి ఏటా 5మిలియన్ టన్నులకు పెరగనుంది. తాడిచర్ల బ్లాక్ 2 గని ద్వారా 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంజనీర్లు కాదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఎవరికి వారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లనే అవి కూలిపోయాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్తు ఆలోచనా జ్ఞానం కోల్పోయారని భట్టి మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అధికారులు చెప్పినట్లు చేయడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం చర్చలు జరుపుతోందని, సమయం, సందర్భాన్ని బట్టి జాబితా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరో ముందుగా ప్రకటించారని తాము తొందరపడబోమని వ్యాఖ్యానించారు. -
మహా జాతర షురూ
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున ఆ ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఉద యం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాక మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్న ను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ గౌతమి, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. -
20 రకాల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. మొత్తం 20 రకాల సమాచారం కావాలని అడిగింది. మూడు బ్యారేజీల డిజైన్లు, వాటి నిర్మాణంపై అధ్యయనం జరిపి లోపాలను గుర్తించి పరిష్కారాలను సిఫారసు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించి పరీశీలన జరిపింది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడంతో అప్పట్లో ఎన్డీఎస్ఏ నియమించిన మరో నిపుణుల కమిటీ, ఆ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని అప్పట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకులకు సంబంధించిన అదే విధమైన 20 రకాల సమాచారాన్ని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. పగుళ్లు, పునాది పరిశీలన అయ్యర్ నేతృత్వంలో సైంటిస్టులు యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, డైరెక్టర్లు శివకుమార్‌శర్మ, రాహుల్‌కుమార్, అమితాబ్ మీనాలతో కూడిన బృందం మేడిగడ్డను తనిఖీ చేసింది. బ్యారేజీ అప్ స్ట్రీమ్‌లోకి దిగి 6, 7, 8 బ్లాక్‌లను నిశితంగా పరిశీలించింది. డౌన్ స్ట్రీమ్‌లోకి కూడా కాలినడకన వెళ్లి బ్యారేజీ కుంగిన తీరు, పగుళ్లు, పునాది ఎలా ఉందీ చూసింది. కుంగినప్పటి నుంచి ఎలాంటి పరీక్షలు జరిపారు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయత్రం 6.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజినీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మీడియా ప్రతినిధులను బ్యారేజీ లోపలికి అనుమతించ లేదు. కాగా నేడు సుందిళ్ల బ్యారేజీని కమిటీ సందర్శించనుంది. ఎట్టకేలకు ‘జియో’ సెక్షనల్ డ్రాయింగ్స్ మేడిగడ్డ బ్యారేజీ కింద భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’ డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించిన ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్స్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంపై గతంలో ఎన్డీఎస్ఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లోతైన పరిశీలన కోసం జియోలాజికల్ వివరాలతో కూడిన బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను సమర్పించాలని కోరింది. అయితే ఇలాంటి డ్రాయింగ్స్‌ను తయారు చేయకుండానే బ్యారేజీని నిర్మించడంతో అప్పట్లో అధికారులు వాటిని సమర్పించలేకపోయారు. కానీ ఎన్డీఎస్ఏ పదేపదే కోరుతుండడంతో ఇటీవల జియోలాజికల్ వివరాలతో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను రూపొందించి ఎన్డీఎస్ఏకు నీటిపారుదల శాఖ పంపించింది. -
త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన వివరించారు. విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’’అనే అంశంపై గురువారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం విద్య, ఐటీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా నైపుణ్య లేమితో ఉపాధి అవకాశాలు కోల్పోరాదని, ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్థులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్ తదితరులు ప్రసంగించారు. -
15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమా న్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండ టంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యా హ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.