TS Special
-
గ్రూప్–2, గ్రూప్– 3 ఖాళీల గుర్తింపునకు కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్– 2, గ్రూప్–3 ఉద్యోగ ఖాళీల కసరత్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. శాఖల వారీగా గుర్తించిన గ్రూప్–2, గ్రూ ప్–3 ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో సమ ర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖాధిపతులను ఆదేశించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు మెమో జారీ చేశారు. 2022 ఆగస్టు 30వ తేదీ నాటికి గుర్తించిన ఖాళీలకు అనుగుణంగా భర్తీకి అప్పట్లో ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈమేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. ఆగస్టు 2022 తర్వాత నుంచి గుర్తించిన ఖాళీలు, మంజూరై ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు రానున్న ఏడాది కా లంలో ఖాళీ కానున్న గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల వివరాలను గురువారం సాయంత్రం 5గంటల్లోగా సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్‌ను ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ అధికారులు పంపించారు. కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు... ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి వాటి భర్తీ ప్రక్రియకు సంబంధించిన చర్యలు వేగ వంతం చేసింది. గ్రూప్–2 కేటగిరీలో 783 ఖాళీలుండగా... వీటికి సంబంధించి అర్హత పరీక్షలను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అదేవిధంగా గ్రూప్–3 కేటగిరీలో 1388 ఖాళీల భర్తీకి గాను ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో అర్హత పరీక్షలను నిర్వహించనుంది. తాజాగా ఈ రెండు కేటగిరీల్లో ఖాళీల గుర్తింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీలను గుర్తిస్తే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుండగా... కొత్త ఖాళీలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేక ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలా? అనే కోణంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. -
చంద్రబాబు చేసింది వెయ్యి కోట్ల భూకుంభకోణం
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ మూలనైనా ఎకరానికి వంద కోట్ల ధర ఉంది. అలాంటిది 850 ఎకరాలంటే దాదాపు లక్ష కోట్ల రుపాయల విలువ. కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కోట్ల విలువైన భూమిని పక్కదారి పట్టించడమంటే చంద్రబాబు ఘనత అర్థం చేసుకోవచ్చు. 1999-2004 మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని బయటకు రాకుండా చేయడానికి నానా పాట్లు పడ్డా.. చివరికి హైకోర్టు తీర్పు రావడంతో బాబు కుంభకోణమంతా బట్టబయలైంది. సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు, విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ సౌకర్యాలు 100 శాతం ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకీ అది ఏర్పాటైన 4 రోజుల్లో వందల ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఇది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చిచెప్పింది. ఐఎంజీ భారత్ (పిటిషనర్) పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఆ ఒప్పందాన్ని ఏవిధంగానూ సమర్ధించలేమని ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. దీనిపై మీరు సీబీఐ విచారణ జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఈ అంశంపైనే దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వా రం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం అంటూ.. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) 2003, ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9నే చంద్రబా బు నేతృత్వంలోని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఎంజీ భారత్‌తో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్రీడల్లో రాష్ట్ర యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం అంటూ ఈ ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అకాడెమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం అంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలు అప్పగించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఐఎంజీ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2004, ఫ్రిబవరిలో గచ్చి»ౌలిలో ఎంతో విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీ భారత్‌కు అప్పగించింది (సేల్ డీడ్ చేసింది). అయితే 2006లో ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఐఎంజీ భారత్‌తో అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ, ఆ మేరకు సేల్‌డీడ్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో 2007 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం సంబంధిత లావాదేవీలు రద్దు చేయడమే కాకుండా ఐఎంజీ చెల్లించిన మొత్తాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి కేబినెట్ ఆమోదం లేదు: ఏజీ ‘పూర్తి కేబినెట్ ఆమోదం లేకుండా నాటి ప్రభుత్వం ఎంఓయూపై సంతకాలు చేసింది. ఆ సమయంలో భూమి విలువ ఎకరం రూ.13 లక్షలు ఉండగా, పిటిషనర్‌కు రూ.50 వేల స్వల్ప మొత్తానికే సరైన ఎలాంటి కారణం లేకుండా విక్రయించారు. ఐఎంజీ భారత్‌కు అమెరికన్ కంపెనీ అయిన ఐఎంజీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ దానికి అనుబంధ సంస్థ అంటూ మోసగించారు. అందుకే తదుపరి ప్రభుత్వం ఎంవోయూను రద్దు చేసింది. పరిహారం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఒక్క ఐఎంజీ కోసమే కాదు. ఇది ఇతర భూ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఇలా చట్టం తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం శాసనసభకు ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2007లో చేసిన చట్టం అమల్లోకి వచ్చింది..’అంటూ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ..‘ఒక ఐఎంజీ భారత్ కోసమే చట్టాన్ని తేవడం సమరి్థనీయం కాదు. ఎంవోయూను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు..’అంటూ వాదించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఆమోదం: ధర్మాసనం ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ ఏర్పాటైన తర్వాతి రోజే, ఎలాంటి విచారణ చేసుకోకుండానే 6న నాటి యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చలరల్ డిపార్ట్మెంట్ కంపెనీకి ఆమోదం తెలుపుతూ సర్క్యులర్ జారీ చేసింది. అదే రోజు నలుగురు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి ఆగమేఘాలపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత 9వ తేదీన ఎంవోయూ కుదుర్చుకున్నారు. స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియాల నిర్వహణకయ్యే ఖర్చు ఏడాదికి రూ.2.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. తొలి మూడేళ్లపాటు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ బిల్లులనూ 100 శాతం తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీన్ని తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యంగా పిటిషనర్‌కు అంతర్జాతీయ క్రీడా సంస్థ (ఐఎంజీ, అమెరికా)తో సంబంధం గానీ, గతంలో క్రీడా రంగంలో అనుభవం గానీ లేవు. ఉన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించలేదు. ప్రభుత్వం రద్దయ్యాక 400 ఎకరాలకు సేల్‌డీడ్! 2003, నవంబర్ 14నే చంద్రబాబు ప్రభుత్వం రద్దయ్యింది. తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే కొనసాగింది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలోనే 400 ఎకరాలను నామమాత్రపు ధరకు ఐఎంజీ భారత్‌కు అప్పగిస్తూ సేల్‌డీడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు చట్టం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే ప్రభావితం అయినా, 2007లో భూములపై రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలతోనే చట్టాన్ని రూపొందించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన కారణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రభుత్వానికి ఈ అధికారం కలి్పంచింది. జాగ్రత్తగా గమనిస్తే.. కంపెనీ ఏర్పాటైన కేవలం 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే వందల ఎకరాల భూములు అప్పగించారు. మరే ఇతర కంపెనీకి రాష్ట్రంలో అంత స్వల్ప సమయంలో ఇలా భూములు ధారాదత్తం చేయలేదు. పిటిషనర్‌కు పరిహారం కోరే హక్కు ఉంది. అయితే 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని తన ఒక్క కంపెనీ కోసమే అంటూ సవాల్ చేయలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణకే వైఎస్ సర్కార్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ప్రభుత్వం ఉల్లంఘించిందన్న వాదన కూడా సరికాదు. ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే 2007లో వైఎస్ సర్కార్ చట్టం తీసుకొచ్చింది. అది ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం కాదన్న విషయం గ్రహించాలి. కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లో వేల కోట్ల భూములు గతంలో మరే ఇతర కంపెనీకి ప్రభుత్వం కేటాయించినట్లుగా ఐఎంజీ నిరూపించలేకపోయింది. అలాగే ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటును అడ్డుకునేందుకు ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు కూడా జరగలేదు. సేల్ డీడ్‌ను రద్దు చేయకూడదనే వాదన ఆమోదానికి అర్హమైనది కాదు. ఎంఓయూనే రద్దయినప్పుడు సేల్‌డీడ్ అమల్లో ఉండటం సాధ్యం కాదు..’అంటూ ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు లేఖ రాశామన్నారుగా.. ‘ఐఎంజీ భారత్‌కు భూముల అప్పగింతపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశాం అన్నారు.. ఎంత వరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా? లేక మమల్నే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఐఎంజీ భారత్‌కు భూముల కేటాయింపు, ఎంవోయూ, సేల్‌డీడ్.. ఇలా అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ టి.శ్రీరంగారావుతో పాటు మరొకరు 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగిందని, దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం మరోసారి సీజే ధర్మాసనం విచారించింది. సీబీఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయం ధర్మాసనం కోరింది. ఆయన తమకు కొంత సమయం కావాలనడాన్ని, ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలియజేస్తాననడాన్ని తప్పుబట్టింది. ఇంకా ఎంతకాలం ఆగాలని, వారంలోగా ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా గతంలో ఇదే పిల్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం కోరితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ తెలియజేయడం గమనార్హం. -
మన సంస్కృతికి చిహ్నం చీరకట్టు
ఖైరతాబాద్ (హైదరాబాద్): చీరకట్టు అంటే భారతదేశ సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం అని...చీర అంటే సంతోషం, గౌరవానికి చిరునామా అని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘శారీ వాకథాన్’లో గవర్నర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు– 2024 వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన శారీ వాకథాన్‌లో వందలాది మంది మహిళలు, విద్యార్థినులు చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తాను విదేశాల్లో చదువుకునే సమయంలో ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా చీర ఎలా కడతారంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో పాసైన సందర్భంగా ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న మహిళలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం బెలూన్స్ ఎగురవేసి శారీ వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, పద్మశ్రీ ఆనంద శంకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్‌తో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చుకానున్నట్లు అంచనా. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే నిలిపివేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, నిర్మాణాల కూల్చివేతలకు ఆటంకం వంటి కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే అడ్డంకులన్నీ తొలగిపోయి డీపీఆర్ సహా అన్ని పనులు పూర్తయినప్పటికీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కూడా నిర్లక్ష్యం చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించి, బడ్జెట్లోనూ నిధులు కేటాయించింది. డ్రోన్ సర్వే... ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం గత ఆగస్టులో డ్రోన్ సర్వే నిర్వహించారు. దారుల్షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 103 మతపరమైన, ఇతర సున్నితమైన కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పు లు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ ద్వారా సేకరించిన డేటా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేశారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా వరకు మె ట్రో రైలు అందుబాటులోకి వస్తే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించవచ్చు. అలాగే, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ వీక్షించే అవకాశం ఉంటుంది. ఐదు స్టేషన్లు: ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి నుంచి దారు షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్ను మా వరకు ఈ 5.5 కి.మీ. అలైన్మెంట్ ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తరువాత సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. -
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్‌హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. గతంలో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్ పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్‌లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్‌ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, నిర్వహణపై నిశిత పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. రెండేళ్ల క్రితమే ఉత్తర రింగుకు సంబంధించి కసరత్తు ప్రారంభించి అలైన్‌మెంటు ఖరారు చేసినా, ఇప్పటివరకు టెండర్ల దశకు రాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం కదలిక వచ్చింది. 162 కి.మీ. నిడివి ఉండే ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం చెల్లింపు ప్రక్రియలో భాగంగా గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేసేందుకు అంతా సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలవనున్నారు. ఉత్తర భాగానికి సంబంధించిన పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 4 వరసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అవసరం ఉందని కేంద్రం తేల్చింది. ఈ భాగంలో రోడ్డు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని సొంతంగా భరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈ పీసీ) పద్ధతిలో టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థను గుర్తించాలని నిర్ణయించింది. రోడ్డు నిర్మాణం తర్వాత ఏర్పాటు చేసే టోల్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మరో టెండరు పిలిచి కాంట్రాక్టు సంస్థను గుర్తించనుంది. కేంద్రమే టోల్ రుసుమును వసూలు చేసుకుంటుంది. బీఓటీ కాకుంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్! దక్షిణ భాగానికి వచ్చే సరికి ఈపీసీ టెండరింగ్‌కు వెళ్లొద్దని ప్రాథమికంగా నిర్ణయించింది. దాదాపు 180 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగాన్ని నిర్మించే ప్రాంతంలో ఉండే పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్యను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఉత్తర ప్రాంతంతో పోలిస్తే దక్షిణ భాగం పరిధిలో వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. దీంతో అసలు దక్షిణ భాగానికి నాలుగు వరసల రోడ్డు అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరకు రింగురోడ్డులా ఉండాలంటే రెండు భాగాలూ ఒకే తరహాలో ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అయితే ఈపీసీ పద్ధతిలో కాకుండా, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో దక్షిణ భాగానికి టెండర్లు పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పద్ధతిలో.. నిర్మాణ సంస్థ సొంత నిధులతో రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ధారిత కాలం ఆ రోడ్డుపై టోల్‌ను వసూలు చేసుకోవటం ద్వారా ఆ ఖర్చును రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పని తలకెత్తుకునేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రాని పరిస్థితి నెలకొంటే.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) పద్ధతిలో టెండర్లు పిలవాలని భావి స్తోంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్మాణ వ్యయంలో 40% మొత్తాన్ని పది వాయిదాల్లో చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. వచ్చే జూన్, జూలైలలో దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంటుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. -
‘కాళేశ్వరా’నికి హాలిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ విధాన, పరిశోధన విభాగం డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిత్తల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మూడు బ్యారేజీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు చేయాలని... 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించి నివేదిక సమర్పించాకే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఆస్కారముందని ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే 4 నెలలపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసులకు అనుగుణంగా జూలై తొలి వారం తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ సిఫారసులు, సూచనల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న కమిటీ బ్యారేజీల పరిశీలనకు రానుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కమిటీలో కీలక విభాగాల నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై ఏర్పాటైన కమిటీలో పలు కీలక విభాగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యు.సి. విద్యారి్థ, పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్.పాటిల్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (బీసీడీ) శివకుమార్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (గేట్స్)/ఎన్డీఎస్ఎఏ డైరెక్టర్ (విపత్తులు) రాహుల్ కుమార్‌సింగ్‌లు ఈ కమిటీ సభ్యులుగా, ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా కమిటీ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే లోపాలను నిర్ధారించిన ఓ కమిటీ... గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీక్ అయ్యాయి. ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గతంలో ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. అన్నారం బ్యారేజీ పునాదుల దిగువన పాతిన సెకెంట్ పైల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీలో పదేపదే బుంగలు ఏర్పడుతున్నాయని మరో నివేదికలో స్పష్టం చేసింది. మూడు బ్యారేజీలను ఒకే తరహాలో డిజైన్, సాంకేతికతతో నిర్మించినందున మూడింటిలోనూ లోపాలు ఉంటాయని, అన్నింటికీ జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై సమగ్ర అధ్యయనం జరిపి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. డ్యామ్ సేఫ్టీ చట్టం–2021లోని 2వ షెడ్యూల్లోని 8వ క్లాజు కింద ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్ఏ నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలపై అధ్యయనం కోసం కమిటీకి ఎన్డీఎస్ఏ జారీ చేసిన విధివిధానాలు.. ► మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తనిఖీలు నిర్వహించాలి. బ్యారేజీల స్థలం, హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను నిర్ధారించడానికి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇతర భాగస్వామ్యవర్గాలతో చర్చించాలి. ► ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్, డిజైన్ల నివేదికలు, పరీక్షలు, స్థల తనిఖీ నివేదికలు, బ్యారేజీల తనిఖీ నివేదికలు, మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నాణ్యత హామీల నివేదికలను పరిశీలించాలి. ► బ్యారేజీ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇతర వ్యవహారాల్లో పాలుపంచుకున్న భాగస్వామ్యవర్గాల (ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు)తో సంప్రదింపులు జరపాలి. ► బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు దోహదపడిన భౌతిక/గణిత నమూనా అధ్యయనాలను పరిశీలించాలి. (బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు ముందు ప్రయోగాత్మకంగా ల్యాబ్స్‌లలో నమూనా బ్యారేజీలను రూపొందించి వరదలను తట్టుకోవడంలో వాటి పనితీరును పరీక్షిస్తారు) ► మూడు బ్యారేజీల్లోని సమస్యలను గుర్తించి నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలు, చేపట్టాల్సిన తదుపరి అధ్యయనాలు/పరిశోధనలను సిఫారసు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను సూచించాలి. -
9 వేల ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ రికార్డు స్థాయి వేగంతో జరిగింది. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) భర్తీ చేసింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ మొదట్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించింది. కానీ భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని భావించిన ప్రభుత్వం గురుకుల నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు దూకుడుగా భర్తీ ప్రక్రియ చేపట్టింది. గతంలో దాదాపు 4 వేల ఉద్యోగ నియామకాలను ఏడాది కాలంలో పూర్తి చేయగా.. ఇప్పుడు ఏకంగా 9వేల ఉద్యోగాల భర్తీని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసింది. గత నెలలో 2 వేలకు పైగా ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయగా.. ఇప్పుడు మరో 6,500 మందికి అందించనుంది. గత ఏప్రిల్‌లో ప్రకటనలు జారీ చేసి.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ గతేడాది ఏప్రిల్ 5వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. 9 వేల ఉద్యోగాలకు ఏక కాలంలో 9 నోటిఫికేషన్లు విడుదల చేసి రికార్డు సృష్టించింది. అదే నెల 17వ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరించి గతేడాది ఆగస్టులో పరీక్షలను నిర్వహించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానం అవలంభించింది. సెప్టెంబర్ నెలలో అర్హత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను విడుదల చేసింది. దీనితో పాటు క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు స్వీకరించడం, తిరిగి తుది కీలను ఖరారు చేయడం దాదాపు నెలరోజుల వ్యవధిలో పూర్తి చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో కొంత జాప్యం జరిగింది. తాజాగా రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి జీవోలు విడుదల చేయడంతో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమమైంది. అర్హత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వివిధ కేటగిరీల్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం, అనంతరం డెమో పరీక్షలు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను వెబ్సైట్లో ప్రచురించడం లాంటివన్నీ కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. నేటి మధ్యాహ్నం నియామక పత్రాలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 6,500 మంది ఎంపికయ్యారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని లాల్ బహద్దూర్ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు, గురుకుల సొసైటీ కార్యదర్శులు, సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సోమవారం నియామకపత్రాలు ఇస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఆయా జిల్లాల అభ్యర్థులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. -
గుట్టలెక్కి.. పోలియో చుక్కలు వేసి..
వాజేడు: ఇద్దరే ఇద్దరు పిల్లలున్న గ్రామమది. అయితేనేం.. దారిలేని ఆ గ్రామానికి వైద్య సిబ్బంది గుట్టలెక్కి నడిచి వెళ్లారు. పోలియో చుక్కలు వేసి వచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధి పెనుగోలు గ్రామం గుట్టలపై ఉంది. అక్కడికి వెళ్లాలంటే మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం. అంతా రాళ్ల దారి. ఈ గ్రామంలో అయిదేళ్లలోపు పిల్లలు ఇద్దరున్నారు. పల్స్ పోలియోలో భాగంగా ఆ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి వాజేడు పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, లఖాన్, ధర్మయ్య ఆదివారం కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు పిల్లలకు పోలియో చుక్కలు వేసి భోజనం చేసి తిరిగి పీహెచ్‌సీకి చేరుకున్నారు. -
TS: డ్వాక్రా మహిళలకు శుభవార్త
సాక్షి, ఖమ్మం జిల్లా: డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు మధిర మండలం రొంపిమల్ల రోడ్డు శంకుస్థాపన సభలో ఆయన వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. -
రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్క్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలతో పాటు, రాయితీలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. అత్యధిక ఉద్యోగాలు కల్పించడానికి అనువుగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను) కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో భట్టి మాట్లాడారు. డెయిరీ అభివృద్ధికి అవకాశాలు రాష్ట్రంలో పాల ఉత్పత్తికి, వినియోగానికి మధ్య వ్యత్యాసం అధికంగా ఉందని, అందువల్ల పాడి పరిశ్రమ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించేలా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులను మూసీకి అనుసంధానం చేసి మూసీలో స్వచ్ఛమైన నీరు పారే విధంగా ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలిపారు. నది పరివాహక ప్రాంతంలో ఫ్లై ఓవర్లు, చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్‌లు, బోటింగ్ తదితర అభివృద్ధి పనులు పీపీపీ విధానంలో చేపడతామని వివరించారు. నగర శివార్లలో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టెక్స్టైల్, గ్రానైట్, ఐటీ సెక్టార్, మైన్ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటివరకు 18.50 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నట్లు భట్టి తెలిపారు. -
రైతులకు ఉచితంగా పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: రైతులు పైసా ఖర్చు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచి ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున గత ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి బయటకు వచ్చింది. దీంతో కొంతకాలంగా రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు రైతుల ప్రీమియం వాటాను తామే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. క్లస్టర్ల వారీగా అమలు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా ప్రకారం..రాష్ట్ర రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సీజన్లకు కలిపి దాదాపు రూ.2 వేల కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఫసల్ బీమా పథకంలో చేరే విషయమై కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. పంటల బీమా పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజిస్తారు. కాగా బీమా పథకంలో ఉన్న వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తారు. అకాల వర్షాలతో నష్టపోతే ఒక రకమైన ప్రీమియం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షం పడి నష్టం జరిగితే మరో రకమైన ప్రీమియం, దిగుబడి తక్కువ వస్తే అందుకు సంబంధించి మరో ప్రీమియం ఇలా వివిధ రకాలుగా పథకంలో వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో ఏ క్లస్టర్లలో ఎటువంటి వాతావరణం ఉంటుందన్న దానికి అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తారు. బీమా కంపెనీలు కోట్ చేసే ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. -
టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ను జాతీయ స్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలు వరించాయి. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో ఈ అవార్డులు లభించాయి. నష్టాలను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో అంతర్గతంగా చేస్తున్న కొత్త ఆవిష్కరణలకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 2022–23కుగాను తెలంగాణ ఆర్టీసీని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. నాలుగు ఫస్ట్.. ఒకటి సెకండ్.. రోడ్డు భద్రత విభాగానికి సంబంధించి మఫిసిల్ కేటగిరీ (బస్సుల సంఖ్య 4,001–7,500 ఉన్న సంస్థల పరిధి)లో ఆర్టీసీ మొదటి స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ... రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమేయం తక్కువ ఉండేలా చూడటంలో టీఎస్ఆర్టీసీ తొలి నుంచీ టాపర్‌గా ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు కారణమైన నిష్పత్తి 0.05గా ఉంది. ఇంధన పొదుపులోనూ ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరుకు తిరిగే కిలోమీటర్ల (కేఎంపీఎల్) విషయంలో ఉత్తమంగా నిలిచింది. మఫిసిల్ కేటగిరీలో 5.35 కేఎంపీఎల్‌తో మొదటి స్థానం, పట్టణ ప్రాంతాల కేటగిరీలో 4.61 కేఎంపీఎల్‌తో రెండో స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరు డీజిల్‌కు దాదాపు 5.14 కి.మీ. మేర తిరుగుతున్నాయి. ఇక సిబ్బంది సంక్షేమం, ఉత్పాదకత కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసింది. తీవ్ర గుండె సమస్యలున్న 250 మందిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తోంది. సిబ్బంది నైపుణ్యం పెరిగేలా సామూహిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి ఈ పురస్కారం లభించింది. డిజిటల్ కార్యక్రమాల అమలు విభాగంలోనూ సంస్థకు మొదటి స్థానం సాధించింది. ప్రయాణికులు, సిబ్బంది కోసం కొత్త యాప్‌లు, టికెట్ల రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు, బస్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్ తదితరాలకు ఈ పురస్కారం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ పురస్కారాలు లభించాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనగా ఉత్తమ పనితీరుతో టీఎస్ఆర్టీసీ దేశంలోని ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. -
బీఆర్ఎస్ స్కైవేల కల నెరవేరింది
సాక్షి, హైదరాబాద్: రక్షణ శాఖ ఎలివేటెడ్ స్కైవేల నిర్మాణానికి పచ్చజెండా ఊపడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కల నెరవేరిందని, దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే వీటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటి వల్ల హైదరాబాద్ నలుదిశలా విస్తరించేందుకు, ప్రగతిపథంలో దూసుకుపోవడానికి మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. వీటి కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని కోరుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత పదేళ్ల కాలంగా అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. గత జూలై 31వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్–కరీంనగర్, హైదరాబాద్–నాగ్‌పూర్ జాతీయ రహదారులకు సంబంధించిన ఎలివేటెడ్ స్కైవేల నిర్మాణంతో ఇంతకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వాస్తవానికి గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రణాళికలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అనేక కీలక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతర సంప్రదింపులు జరిపామని కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పాటు తాను, ఇతర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతిపత్రాలు అంద జేశామని గుర్తు చేశారు. ప్రతిసారీ వారు సాను కూలంగా స్పందించారని తెలిపారు. కేంద్ర ప్రభు త్వాన్ని ఒప్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులు, యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదా లు తెలిపారు. ఇది ఏ ఒక్కరితోనో సాధ్యం కాలేదని, సమష్టి విజయమని స్పష్టం చేశారు. ఎల్బీనగర్తో పాటు ఇతర రూట్లలో ఇలాంటి అడ్డంకులు లేకపోవడంతో అనేక ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేయగలిగామని గుర్తుచేశారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ రూట్లలో రెండు ఫ్లైఓవర్లకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టాలని కోరారు. -
అంగన్వాడీల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ హాజరు చేపట్టాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూడాలని, అవసర మైనచోట కొత్త భవనాలను నిర్మించాలని సూచించారు. శనివారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సీఎం సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించడ మే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 35వేల అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారు లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘ఉపాధి హామీ’ లింకేజీతో సొంత భవనాలు రాష్ట్రంలో 12,315 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికి శాశ్వత ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేçపట్టాలన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకేలా అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని.. ఇందుకోసం ప్రత్యేక డిజైన్ రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఆరు నెలలకోసారి వారోత్సవాలు.. మహిళా శిశుసంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మేనిఫెస్టో కోసం ప్రజల వద్దకు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వికసిత్ భారత్ సంకల్ప పత్రం పేరిట ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణకు బీజేపీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలు తెలుసు కునేలా ’వికసి త్ భారత్ మోదీ కీ గ్యారంటీ’ పేరు తో చేపట్టిన కార్యక్రమాన్ని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఇతర నాయకు లతో కలిసి ‘మరో సారి మన మోదీ సర్కార్ ’ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. రిమోట్ నొక్కి డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అభిప్రాయాలు నేరుగా ప్రధానికి.. వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని నేరుగా ప్రధాని మోదీకి తెలియజేసేలా ఏర్పాట్లు చేసినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. వివిధ గ్రూపులతో సమావేశాలు (మిలన్, సంవాద్), ఇంటింటికీ వెళ్లడం,ౖ సోషల్ మీడియా (వాట్సాప్), ప్రచార, ప్రసార (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా) తదితర రూపాల్లో అభిప్రాయ సేకరణ జరపనున్న ట్టు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సూచనల పెట్టె (సజెషన్స్ బాక్సులు) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ గ్రూపులతో సమా వేశాలకు సంబంధించి.. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మార్చి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. శక్తికి తగ్గట్టుగా విరాళాలివ్వండి ఆశా, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, రైతులు, సహకార సంఘాలు, కార్మికులు, జాతీయ అవార్డుల విజేతలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు తదితరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని కిషన్‌రెడ్డి వివ రించారు. కళాకారులు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని రకాల చేతి వృత్తుల కళాకారులు, సఫాయీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పూజా రులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, దళిత సంఘాల నాయకులు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు.. ఇలా అన్ని వర్గాల ఇంటింటికీ వెళ్లి అభి ప్రాయాలు సేకరిస్తామన్నారు. ‘ప్రజలతో నడిచే పార్టీ బీజేపీ కోసం ప్రజల శక్తికి తగ్గట్లుగా ఆర్థిక సాయం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతు న్నాం. నమో యాప్ ద్వారానే పార్టీకి ఆర్థిక సాయం చేయాలి..’అని విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ద్వారా తాను స్వయంగా పార్టీకి విరాళం పంపారు. -
గన్‌మెన్ కావాలని..
ఉప్పల్: బీజేపీ నేతపై హత్యాయత్నం బూటకమని పోలీసులు తేల్చారు. తనకు రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రాణహాని ఉందని పోలీసులను నమ్మించే ప్రయత్నంలో తనపై తానే హత్యాయత్నం చేయించుకున్న రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యల్లగోని భాస్కర్ గౌడ్, సినీ నిర్మాతగా, రియల్ వ్యాపారిగా పని చేసేవాడు. ఈ నెల 24న అతను తనపై హత్యాయత్నం జరిగిందని రక్త గాయాలతో ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో పలు అసక్తికరమైన అంశాలు గుర్తించారు. సెటిల్మెంట్లు..రియల్ దందాలు భాస్కర్ గౌడ్ పలు సినిమాలకు నిర్మాత వ్యవహరించాడు. బీజేపీ రాష్ట్ర స్వచ్చ్ భారత్ అభియాన్ కనీ్వనర్‌గా, జాతీయ హిందీ సలహాదారు కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. బోడుప్పల్లో ఆఫీసు ఏర్పాటు చేసిన అతను భూ తగాదాలకు సంబంధించిన సెటిల్ మెంట్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడిపై ఉప్పల్, నాచారం, కీసర తదితర పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. పలుకుబడి కోసం పథకం.. ఈ నేపథ్యంలో ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు గన్మెన్న్ను నియమించుకోవాలని భావింన భాస్కర్ గౌడ్ తన స్నేహితుడు శివ కిషోర్ గౌడ్‌తో కలిసి పథకం రూపొందించాడు. హత్యాయత్నం జరిగితే కాని గన్మెన్లను ఇవ్వరని తెలియడంతో శివకిషోర్ తన స్నేహితుడు యదగిరితో కలిసి ఈ నెల 22 న నాగోల్‌లోని అమరావతి బార్ వద్ద పథకం రంచారు. యాదగిరి స్నేహితులు కొండా అరుణ్,సృజన్ రెడ్డి, ఆకుల ప్రశాంత్, మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్ తదితరులు భాస్కర్ గౌడ్‌పై ఫేక్ హత్యాయత్నం చేయాలని నిర్ణయించారు. ఇందుకుగాను ర. 2.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా ర. 50,000 ఇచ్చారు. 24న ఉప్పల్ ఏషియన్ థియేటర్ వైపు నుంచి భాస్కర్ గౌడ్ కారులో డ్రైవర్‌తో కలిసి ఉప్పల్ భగాయత్లోకి రాగానే వనం టీ స్టాల్ వద్ద ఉన్న శివకుమార్ స్నేహితులు డ్రైవర్‌పై, భాస్కర్ గౌడ్‌పై కత్తితో దాడి చేసి పారి పోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యాయత్నం బూటకమని తేల్చారు. పోలీసులను తప్పుదోవ పట్టింనందుకుగాను పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుండీ హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు, ర. 2 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. సవవేశంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ,ఎస్ఐ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పలువురికి ప్రభుత్వ ఉద్యోగాల జాక్‌పాట్
సిరిసిల్ల/ఉస్మానియాయూనివర్సిటీ/జన్నారం/చందుర్తి(వేములవాడ)/కోరుట్ల/మేడిపల్లి/మెట్పల్లి రూరల్: 4..3..2..4..2.. ఏ కార్పొరేట్ కళాశాల విద్యార్థులో సాధించిన ర్యాంకులు కావివి. ఒక్కొక్కరు నాలుగేసి..మూడేసి.. రెండేసి చొప్పున సాధించిన ప్రభుత్వోద్యోగాలు ఇవి. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు మనీషా నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది. ఇప్పటికే గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలల్లో టీజీటీ, పీజీటీ అధ్యాపకురాలిగా, ఉపాధ్యాయినిగా ఎంపికైంది. తాజాగా గురువారం వెలువడిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గురువారం మధ్యాహ్నం వెల్లడైన డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో ఎంఏ సోషల్ విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. అలాగే ఓయూ క్యాంపస్‌లోని ఈఎంఎంఆర్‌సీ నైట్‌వాచ్‌మన్ ప్రవీణ్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల ప్రకటించిన గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన అంచ అర్చన అలియాస్ వనజ.. ఇటీవల వెలువడిన ప్రభుత్వ గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లిష్ టీచర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించింది. గురువారం వెలువడిన ప్రభుత్వ గురుకుల జూనియర్ లెక్చరర్ (ఇంగ్లిష్) ఫలితాల్లోనూ ఎంపికైంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన నాగుల నరేశ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో నిర్వహించిన ఈఎంఆర్ఎస్ పీజీటీ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన గురుకుల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చూపి టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్ ఇంగ్లిష్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సత్తక్కపల్లికి చెందిన కొడిమ్యాల పావని 17 రోజుల వ్యవధిలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఫిబ్రవరి 13న పీజీటీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 41వ ర్యాంకు సాధించింది. జూనియర్ లెక్చరర్ (మ్యాథమెటిక్స్)లో రాష్ట్రస్థాయిలో 139వ ర్యాంకు సాధించి, ఉద్యోగానికి ఎంపికైంది. -
రాజధానిలోనే ఎక్కువ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీలో అత్యధిక పోస్టులు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 టీచర్ పోస్టులు భర్తీ చేయనుండగా రంగారెడ్డి జిల్లాలో 379 ఖాళీలున్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లు (ఎస్జీటీల) అవసరం ఎక్కువగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా టీచర్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. -
ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తిరుమలేశ్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్ఎస్పీడీసీఎల్కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్ లోకల్ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు. -
నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్!
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం (మార్చి 1) నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ కోసం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిట్టల్ గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ‘ధరణి’దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ►తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ టీమ్‌లలో తహసీల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందితోపాటు పారాలీగల్ వలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించాలి. వారికి దీనికి అవసరమైన శిక్షణను కూడా ఇప్పించాలి. ►పెండింగ్ దరఖాస్తులను మాడ్యూళ్లు లేదా గ్రామాల వారీగా ఈ బృందాలకు అప్పగించాలి. ►దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వీఆర్వోల ద్వారా లేదంటే వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సదరు దరఖాస్తుదారులకు పంపాలి. ►సేత్వార్, ఖస్రా, సీస్లా పహాణి, ఇతర పాత పహాణీలు, పాత 1బీ రిజిస్టర్లు, ధరణిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్ దరఖాస్తులను, వాటితోపాటు వచి్చన డాక్యుమెంట్లను ఈ బృందాలు పరిశీలించాలి. అసైన్డ్, ఇనామ్, పీవోటీ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల వివరాలను కూడా క్షుణ్నంగా తనిఖీ చేయాలి. ►అవసరమనుకుంటే ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపాలి. స్థానికంగా సదరు భూముల గురించి విచారించాలి. చివరిగా నివేదికను రూపొందించి.. సదరు దరఖాస్తును ఆమోదించాలా, తిరస్కరించాలా అన్నది పొందుపర్చాలి. ► ప్రత్యేక బృందాల నివేదికలను తహసీల్దార్లు పైస్థాయి అధికారులకు పంపాలి. వారు వాటిని పరిశీలించి దరఖాస్తు ఆమోదానికి లేదా తిరస్కారానికి గల కారణాలను తెలియజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ►ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి. ఒక్కటి కూడా పెండింగ్‌లో ఉండకూడదు. ఇందుకు కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. నానక్‌రాంగూడలో నూతనంగా విస్తరించిన మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను గురువారం ఆయన అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఎంఈఐసీ ఉండటం మెడ్‌టెక్ ఆవిష్కరణలకు హాట్‌స్పాట్‌గా ఎదుగుతుందనడానికి నిదర్శనమన్నారు. ఈ ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధికి ఆదర్శవంతమైన గమ్య స్థానంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడ్‌ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంస్థ పురోభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సి ద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ, అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నా రు. మెడ్‌ట్రానిక్ చైర్మన్, సీఈఓ జెఫ్‌మార్తా మాట్లా డుతూ ఆర్అండ్డీ సౌకర్యాన్ని విస్తరించడానికి, భవిష్యత్తులో 1,500 మందికి ఉపాధి కల్పించడానికి మెడ్‌ట్రానిక్ ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఈఐసీ ఉపాధ్యక్షుడు, సైట్ లీడర్ దివ్యప్రకాశ్ జోషి మాట్లాడారు. అనంతరం మంత్రి మెడ్‌ట్రానిక్ సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన యంత్ర పరికరాలు వాటి పనితీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫోర్సిస్ ఇంక్ నూతన కార్యాలయం ప్రారంభం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు పూర్తిగా అనుకూలంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఫోర్సిస్ ఇంక్‌నూతన కార్యాలయాన్ని శ్రీధర్‌బాబు, అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సా మాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ భారతదేశం, అమెరికా భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా బలమైన ద్వైపాక్షిక స్నేహంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫోర్సిస్ సంస్థ వ్యవస్థాపకులు జేపీ వేజెండ్ల, ఐల్యా బ్స్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడారు. -
నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న భారత రాష్ట్ర సమితి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శిస్తుంది. ఉదయం 8.30కు తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరే ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక బ్లాక్‌లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజూ ఐదువేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది. మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీని కూడా ఈ బృందం సందర్శిస్తుంది. అన్నారం బ్యా రేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై పవర్ పాయింట్ప్రజెంటేషన్ ఇస్తారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థితిగతులను మీడియా కు వివరిస్తారు. బీఆర్ఎస్ బృందంతో కొందరు సాగునీటిరంగ నిపుణులు కూడా మేడిగడ్డను సంద ర్శిస్తారు. త్వరలో మరికొందరు నిపుణులు కూడా వి.ప్రకాశ్ నేతృత్వంలో సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్టీ స్తారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టులో లోపాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ సందర్శన ద్వారా వాస్తవాలను వెల్లడిస్తామని బీఆర్ఎస్ చెప్తోంది. ఓ వైపు దెబ్బతిన్న బ్యారేజీకి మరమ్మతులు చేస్తూనే మరోవైపు కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోయొచ్చని బీఆర్ఎస్ చెప్తోంది. మేడిగడ్డ మరమ్మతుల పట్ల రాష్ట్ర ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు నేరుగా, సోషల్ మీడియా ద్వారా వివరిస్తామని చెప్తోంది. తొలిసారి కేటీఆర్ రాక.. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి మంత్రి హరీశ్‌రావు ప దుల సార్లు వచ్చి పనులను పరిశీలించారు. కానీ కేటీఆర్ రాలేదు. ప్రస్తుతం బ్యారేజీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా కేటీఆర్ బ్యారేజీ వద్దకు రానున్నారు. -
గోవా జైలే డ్రగ్స్‌కు అడ్డా.. 500 మందితో నెట్వర్క్..
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్‌తో స్టాన్లీ పట్టుబడ్డాడు. ఇక, స్టాన్లీ డ్రగ్స్ లింక్స్.. పోలీసుల కస్టడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్‌న్యాబ్) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో స్టాన్లీకి విదేశాల నుంచి మాదకద్రవ్యాలు చేరవేసే వ్యవహారం అంతా గోవాలోని కోల్వలే జైలు కేంద్రంగా సాగిందని వెల్లడికావడంతో టీఎస్‌న్యాబ్ అటువైపు దృష్టి సారించింది. అక్కడి జైల్లో ఖైదీలుగా ఉన్న నైజీరియన్ ఓక్రాతోపాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న ఫైజల్‌లను తీసుకువచ్చే ప్రయత్నాల్లో తలమునకలైంది. న్యాయస్థానం అనుమతితో ఓ బృందం ఇప్పటికే గోవాకు వెళ్లింది. వారిద్దరినీ విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇక, గోవా కేంద్రంగా సింథటిక్ డ్రగ్స్‌ను సరఫరా చేయడంలో స్టాన్లీ ముఠా ఆరితేరింది. ఆ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన స్టాన్లీ సుమారు రూ.8 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో ఇటీవల టీఎస్‌న్యాబ్‌కు చిక్కాడు. అతడిని విచారించిన క్రమంలో ఈ ముఠాకు యూరోపియన్ దేశాల నుంచి డ్రగ్స్ అందుతున్నట్లు తేలింది. ఆయా దేశాల నుంచి ఓడల్లో తొలుత ముంబైకి సరకు చేరుతున్నట్లు, అక్కడి నుంచి హైదరాబాద్ సహా దేశంలోని ఇతర మెట్రో నగరాలకు సరఫరా అవుతున్నట్టు నిర్ధారణయింది. కొకైన్, ఎల్ఎస్డీ బ్లాట్స్, చరస్, హెరాయిన్, అంపిటమైన్, మారిజువానా, ఓజీ కుష్.. తదితర మాదకద్రవ్యాల్ని ఈ ముఠా తెప్పించి అవసరమైన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారానికి గోవాలోని కోల్వలే జైలు కేంద్రబిందువుగా ఉన్నట్లు, జైల్లో ఉన్న ఓక్రా, ఫైజల్‌లు సెల్ఫోన్ల ద్వారానే డ్రగ్స్ కోసం విదేశాలకు అర్డర్లు పంపిస్తున్నట్లు, సరకు చేరిన అనంతరం సౌరవ్ అనే పెడ్లర్ ద్వారా స్టాన్లీ సహా ఇతర డ్రగ్ ముఠాలకు దాన్ని అందజేసేలా ఓక్రా నెట్‌వర్క్‌ను సృష్టించినట్టు విచారణలో స్టాన్లీ వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణలో వెల్లడైన అంశాలను టీఎస్‌న్యాబ్ బృందం ఐదారు రోజుల క్రితం గోవా పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేసింది. అనంతరం కోల్వలే జైల్లో అక్కడి అధికారులు తనిఖీలు నిర్వహించగా ఖైదీల వద్ద 16 సెల్ఫోన్లు లభించడం కలకలం రేపింది. ఎఫ్ఎస్ఎల్లో సెల్ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషించడంపై ప్రస్తుతం గోవా పోలీసులు దృష్టి సారించారు. సదరు కాల్‌డేటాను తెప్పించుకోవడంతోపాటు ఓక్రా, ఫైజల్‌లను ఇక్కడికి తీసుకొచ్చి విచారిస్తే ఈ ముఠా లీలలతోపాటు యూరోపియన్ దేశాల్లో డ్రగ్స్ సరఫరా దందాపై కీలక సమాచారం లభిస్తుందని టీఎస్‌న్యాబ్ భావిస్తోంది. -
రాడిసన్ హోటల్: మలుపులు తిరుగుతున్న డ్రగ్స్ పార్టీ కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా, మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఇక, ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మీర్జా వహీద్ వద్ద అబ్బాస్ తరుచుగా కొకైన్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్‌ను గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు అబ్బాస్ అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్‌ను రూ.14వేలకు కొని గజ్జల వివేక్‌కు విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమీషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ అలవాటుపడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్‌లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈనెల 16, 18, 19, 24న సైతం గజ్జల వివేక్‌కు అబ్బాస్ కొకైన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు. ఇక, గజ్జల వివేక్ డ్రగ్ పార్టీల వివరాలను వాట్సాప్ చాటింగ్స్, గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో గజ్జల వివేక్ స్నేహితులు, సహ నిందితులు దర్శకుడు క్రిష్, సెలగంసెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘు చరణ్, సందీప్, స్వేత, లిషి, నేయిల్ సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి తదితరుల ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు.. రాడిసన్ హోటల్లో మొత్తం 200 కెమెరాలుండగా, 20 మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ పార్టీలకు ఎవరెవరు వస్తున్నారనే సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పార్టీలు నిర్వహించిన 1200, 1204 గదుల సమీపంలోని కెమెరాలు పనిచేయడం లేదని ఓ అధికారి తెలిపారు.