Kurnool
-
వైభవంగా ప్రతిష్ఠోత్సవాలు
గోనెగండ్ల: మండల పరిధిలోని పెద్దనేలటూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈశ్వర దేవాలయంలో గణేశ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివలింగం, పార్వతిదేవి, బసవేశ్వర, గోపుర కలశం, ధ్వజస్తంభ, నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాన్ని కల్లుహళ్లి సంస్థాన మఠం పీఠాధిపతి చెన్న వీరశివాచార్య మహాస్వాములు, కోటేకల్లు పరమేశ్వరస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. గోపుర కలశాన్ని గ్రామ పురవీధుల గుండా ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. గణేశ, నవగ్రహ కలశపూజ, అష్ట దిక్కుల కలశ పూజ, శిలా విగ్రహాల జలాధివాసం, ధాన్యాదివాసం, హోమం నక్షత్ర కలశ పూజ నిర్వహించారు. కార్యక్రమానికి స్థానికులతో పాటు వివిధ పట్టణాలు, గ్రా మాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పార్వతి కళ్యాణం కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలను గ్రామానికి చెందిన జహంగీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం సీఐ గంగాధర్ కూచిపూడి నృత్యప్రదర్శన చేసిన వారికీ షీల్డ్, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు శిల్పి శ్రీనివాసులు, బసవరాజు, వీరన్న గౌడ్, వెంకటరాముడు, లింగన్న, కేసారం తదితరులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు ఉపయోగం
మాలాంటి పేద విద్యార్థులకు అంబేడ్కర్ గురుకుల కళాశాల నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రం ఎంతో ఉపయోగం. ఇక్కడ ఇంటర్మీడియెట్‌తోపాటు నీట్‌కు శిక్షణ ఇస్తారు. నేను 2016–2018 బ్యాచ్ విద్యార్థిని. 2019లో నీట్లో ర్యాంక్ రావడంతో కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువులతోపాటు క్రమశిక్షణ నేర్పిస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ ప్రోగాం చేస్తున్నా. ఇంకా నాలుగు నెలలు ఉంటే కోర్సు పూర్తవుతుంది. –శివనాయక్,కర్నూలు మెడికల్‌కళాశాల విద్యార్థి మొదటి ప్రయత్నంలోనే ఐఐటీ సీటు మాది పశ్చిమగోదావరి జిల్లా. 2018లో అంబేడ్కర్ గురుకుల కళాశాల ఎంట్రెన్స్ టెస్ట్‌లో ర్యాంక్ రావడంతో చిన్నటేకూరు గురుకుల అకాడమీలో సీటు వచ్చింది. 2018–2020 సంవత్సరంలో చిన్నటేకూరు గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్‌తోపాటు ఐఐటీ శిక్షణ తీసుకున్నాను. అధ్యాపకుల ప్రోత్సహం, మెలకువలతో 2020లో నిర్వహించిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకు రావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ఐఐటీలో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సీటు వచ్చింది. ఇక్కడ మూడేళ్ల బీటెక్‌తోపాటు, రెండేళ్ల ఎంటెక్ చదవవచ్చు. ప్రస్తుతం ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాను. గేట్‌కు సన్నద్ధం అవుతున్నాను. ఆల్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ సాధిస్తానని నమ్మకం ఉంది. – పి.ప్రకాష్‌బాబు, పశ్చిమగోదావరి జిల్లా ఎక్కువసీట్లు సాధించేలా ప్రణాళికలు జూపాడుబంగ్లా గురుకుల కళాశాల నుంచి చిన్నటే కూరు ఐఐటీ, మెడికల్ అకాడమీ డైరెక్టర్‌గా నూత నంగా బాధ్యతలు చేపట్టాను. ఈ ఏడాది జరగబోయే నీట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలో 2023–24 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించేలా అధ్యాపకులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విద్యార్థులకు పరీక్షలంటే భయం పోయేలా పూర్వ విద్యార్థులతోపాటు ఇతర ప్రముఖులతో మోటివేషన్ క్లాసేస్ చెప్పిస్తాం. – ఉమా మహేశ్వరప్ప, అకాడమీ డైరెక్టర్ -
ఇసుక టిప్పర్లను అడ్డుకున్న రేమట ప్రజలు
● తమ గ్రామం మీదుగా వెళ్లొద్దంటూ నిరసన కర్నూలు(రూరల్): తమ గ్రామం మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ రేమట గ్రామస్తులు రోడ్డెక్కారు. సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె ఇసుక రీచ్‌లకు వెళ్తున్న ఇసుక టిప్పర్లను బుధవారం వారు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. భారీ టిప్పర్ల రాకపోకల మూలంగా కర్నూలు జెడ్పీటీసీ సభ్యుడు, గ్రామ నాయకుడు, ప్రసన్నకుమార్‌తోపాటు గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు సైతం టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. గంటల తరబడి టిప్పర్లను అడ్డుకుని వెనక్కు పంపించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ తమ గ్రామ ప్రజల ఇబ్బందులను అధికారులు గుర్తించి టిప్పర్ల రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక రీచ్‌కు నిడ్జూరు, జి.సింగవరం మీదుగా వెళ్లాల్సిన టిప్పర్లు ఉల్చాలతోపాటు తమ గ్రామం మీదుగా వెళ్లడం సమంజసం కాదన్నారు. కేవలం 12 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని భావించి తమ గ్రామాల మీదుగా వెళ్లడం తగదన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వందల వాహనాలు వెళ్లడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు, రైతులు ఉదయం ఇరుకైన రోడ్డుపై వెళ్లేందుకు జంకుతున్నారన్నారు. వాహనాల శబ్ధాలకు ఎద్దులు బెదిరిపోతున్నాయన్నారు. కేవలం ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వం నిర్మించిన రోడ్డు ధ్వంసం అయ్యిందన్నారు. అధికారులు స్పందించి తమ గ్రామం మీదుగా ఇసుక టిప్పర్లు రాకపోకలు సాగుకుండా చూడాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
దృష్టి మరల్చి.. సెల్ కొట్టేసి!
● చేతివాటం ప్రదర్శించిన దొంగలు ఆత్మకూరు: దొంగలు చేతివాటం ప్రదర్శించారు. కాలినడకున వెళ్తున్న వ్యక్తి దృష్టి మరల్చి అతని జోబులోని సెల్‌ఫోన్‌ను చాకచక్యంగా కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాత బస్టాండ్ నుంచి గౌడ్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్‌కు వచ్చే కర్నూలు–గుంటూరు రహదారిపై ఓ వ్యక్తి బైక్‌పై వస్తూ కింద పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ బైక్‌ను వదిలేశాడు. అక్కడే కాలినడకన అటుగా వెళ్తున్న మల్లికార్జున అనే వ్యక్తి బండిని పైకి లేపి సాయం చేశాడు. ఈ క్రమంలో మరో వ్యక్తి వచ్చి బండిని పైకి లేపేందుకు సాయపడుతున్నట్లు నటించి మల్లికార్జున జేబులో నుంచి సెల్‌ఫోన్ కొట్టేశాడు. అనంతరం బైక్‌పై నుంచి కిందపడిన వ్యక్తి బైక్ వద్ద సెల్‌ఫోన్ కొట్టిన వ్యక్తి ఇద్దరూ అదే బైక్‌పై నంద్యాల టర్నింగ్ వైపు వెళ్లారు. మల్లికార్జున కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత సెల్‌ఫోన్ జేబులో లేకపోవడంతో చోరీ చేశారని గమనించి కేకలు వేశాడు. అయితే అప్పటికే బైక్‌పై దుండగులు పరారయ్యా రు. రూ.30 వేల విలువైన సెల్‌ఫోన్ కొట్టేశారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నారాయణరెడ్డి గౌడ్ సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి జేబులో నుంచి సెల్‌ఫోన్ తీసిన దృశ్యాన్ని గుర్తించారు. అనంతనం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
చైన్ స్నాచర్ల కలకలం
కోడుమూరు రూరల్: స్థానిక గణేష్‌నగర్‌లో నివాసముంటున్న ఓ మహిళా టీచర్ బుధవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు చైన్ స్నాచర్లు ప్రయత్నించడం కలంకలం సృష్టించింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. ఉపాధ్యాయురాలు అనసూయ ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలోని చైన్ లాగారు. ఈ ప్రయత్నంలో మెడలోని గొలుసు తెగిపోయినప్పటికీ కింద పడిపోవడడం, ఆమె పెద్దగా కేకలు వేయడంతో దుండగులు వదిలేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం సమీపంలోని డాబాలు, నివాసాల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. నలుపురంగు టీవీఎస్ స్పోర్ట్స్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ముందు కూర్చున్న ఒకరు ఎరుపు రంగు టీషర్ట్, వెనుక కూర్చున్న మరొకరు గ్రీన్ కలర్ టీషర్టు వేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు యత్నం -
కోలుకోలేక వృద్ధురాలి మృతి
చాగలమర్రి: కాలిన గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు కోలుకోలేక బుధవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నేలంపాడు గ్రామానికి చెందిన గుర్రమ్మ(79) ఈనెల 16న ఇంటి వద్ద దీపాలు వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు వెంటనే ఆళ్లగడ్డకు తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి ప్యాపిలి: మండల పరిధిలోని నేరేడుచెర్ల గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఈడిగ నాగరత్నమ్మ (69) మృతి చెందింది. నేరేడుచెర్ల గ్రామానికి చెందిన నాగరత్నమ్మ పశువులను మేపేందుకు అడవికి వెళ్లింది. కొండ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త సుబ్బరాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రాచర్ల పోలీసులు తెలిపారు. రిటైర్డ్ ఏడీ మృతి కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ విశ్రాంత సహాయ సంచాలకులు (రిటైర్డ్ ఏడీ) డాక్టర్ మల్లికార్జునయ్య(84) బుధవారం మృతిచెందారు. ఈయన కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధ పడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లికార్జునయ్య ఐక్యరాజ్య సమితి స్పాన్షర్డ్ పోగ్రామ్ రిండర్ పెస్ట్ ఎరడికేషన్ స్కీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలకు సేవలందించారు. వెటర్నరీ మెడిసిన్ వృత్తికి విశిష్ట సేవలు అందించమే గాకుండా మాస్టర్ ఇన్ వెటరినరీ సర్జరీ చేసిన వారిలో మొదటివారు. ఈయన భార్య సౌభాగ్యలక్ష్మి సిల్వర్‌జుబ్లీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. -
పరికరాల నిర్వహణపై అవగాహన కల్పించాలి
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యంలో రాణిస్తున్న రైతులకు వాటి పరికరాల నిర్వహణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. బుధవారం స్థానిక ఉద్యానభవన్‌లో సూక్ష్మ సేద్యం పరికరాలు, మెటీరియల్ సరఫరా చేసే కంపెనీలు, ఎంఐఏఓలు, రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ ఉమాదేవీ మాట్లాడుతూ రైతులకు డ్రిప్ పరికరాలు సరఫరా చేయడంతోపాటు వాటి పనితీరు, నిర్వహణపై అవగాహన కల్పించాలన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో 70 శాతం నీరు సాగుకు, 22 శాతం పరిశ్రమలకు, మిగిలిన 8 శాతం నీరు తాగు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇతర రంగాల నుంచి సాగునీటికి పోటీతత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అగ్రానమిస్ట్ ఏఎస్ సుబ్బారావు సూక్ష్మ సేద్యంలోని మెలకువలను వివరించారు. శిక్షణ పొందిన రైతులు, ఎంఐఏఓలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ రాజాకృష్ణారెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి -
జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థిని
పాణ్యం: మండల పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థిని బిలావత్ విజయలక్ష్మీబాయి జాతీ య స్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కె.రామునాయక్ తెలిపారు. బుధవారం విద్యార్థినిని ఎంఈఓ–2సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, కోచ్ అశోక్‌రెడ్డి, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి హర్షవర్ధన్‌లతో కలిసి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రి న్సిపాల్ మాట్లాడుతూ తమ విద్యార్థిని విజయలక్ష్మీబాయి ఈనెల 16 నుంచి 18 వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించిన స్కూల్‌గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ అంతర్ జిల్లా హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి వచ్చే నెల రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. హౌస్వైరింగ్–ఎలక్ట్రీషియన్‌లో ఉచిత శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా లోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ హౌస్ వైరింగ్–ఎలక్ట్రీషియన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ కే.పుష్పక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు ఉండి చదవడం, రాయడం వచ్చిన వారు అర్హులని, 30 రోజుల శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు ఆరు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్‌తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరి న్ని వివరాలకు కల్లూరు తహసీల్దారు కార్యాలయం పక్కన కెనరా బ్యాంకు హౌసింగ్ బోర్డు బ్రాంచ్‌లో (మూడవ అంతస్తు) సంప్రదించాలన్నారు. లేదా 63044 91236 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య సి.బెళగల్: మండంలోని చింతమానుపల్లె గ్రామానికి చెందిన తెలుగు వెంకటేష్ (56) పు రుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు.. వెంకటేష్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి పురుగు మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య గిడ్డమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వివాహితపై అసభ్యకర ప్రవర్తన ● తండ్రీకుమారులపై కేసు నమోదు మహానంది: ఓ వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన తండ్రి, మారణాయుధాలతో దాడికి యత్నించిన కుమారుడిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ మహిళను వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం పిలిచేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పనికి పిలిచే క్రమంలో ఆమైపె అసభ్యకరంగా ప్రవర్తించడంతో మహిళ కేకలు వేసింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో తండ్రికి మద్దతుగా కుమారుడు మారణాయుధాలతో వివాహిత కుటుంబంపై దాడికి యత్నించాడు. ఇదే ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఆదోని అర్బన్: పట్టణంలోని బార్పేట్ పెద్ద కాలువలో అనుమాన స్పద స్థితిలో కౌడల్పేటకు చెందిన సయ్యద్‌మహ్మద్ గౌస్(28) బుధవారం మృతిచెందాడు. త్రీటౌన్ సీఐ రామలింగయ్య తెలిపిన వివరాలు.. సయ్యద్మహ్మద్గౌస్ మద్యానికి బానిస అయ్యాడు. ఈక్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు టీ తాగి వస్తానని వెళ్లిన గౌస్ కాలువలో శవమై తేలాడు. మృతదేహం పక్కనే కూరగాయలు తరిమే కత్తి ఉంది. మృతుడి గొంతు వద్ద గాయం ఉంది. విషయం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కాలువలో నుంచి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజుల నుంచి మానసిక స్థితి సరిగా లేదని, తన కుమారుడు ఎలా మృతిచెందాడో తెలియడం లేదని తల్లి సాహెర్భాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
గురుకులం మురిసి!
ఆణిముత్యాలు మెరిసి.. ● కార్పొరేట్‌కు దీటుగా గురుకుల అకాడమీ శిక్షణ ● ఈ ఏడాది 41 మందికి ఐఐటీ, 20 మందికి నీట్ ర్యాంకులు ● అధ్యాపకుల కృషితో మంచి ఫలితాలు అధ్యాపకుల కృషి.. విద్యార్థుల పట్టుదలతో చిన్నటేకూరు గురుకుల కళాశాల అద్భుత ఫలితాలు సాధిస్తోంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అక్కర్లేకుండానే అత్యున్నత ఐఐటీ, మెడికల్ సీట్లు కై వసం చేసుకుంటోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అధ్యాపకులు అందిస్తున్న బోధనను ఒడిసి పట్టుకుని విద్యార్థులు ర్యాంక్‌లతో మెరుస్తూ.. గురుకులాన్ని మురిపిస్తున్నారు. కల్లూరు: రాష్ట్ర విభజనానంతరం పేద విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజినీర్లుగా తీర్చదిద్దాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రాంగణంలో ఐఐటీ, మెడికల్ అంబేడ్కర్ గురుకుల అకాడమీని 2016లో ఏర్పాటు చేశారు. 2016–2017 నుంచి 2023–24 అకాడమిక్ ఇయర్స్‌లో ఇప్పటి వరకు ఎనిమిది బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు ఐఐటీ, నీట్లో శిక్షణ ఇచ్చారు. వారిలో ఇంజినీరింగ్ విభాగంలో దేశంలోని వివిధ ఐఐటీ/ఎన్ఐటీలకు 202 మంది ఎంపికయ్యారు. అందులో కొందరు కోర్సులను పూర్తి చేసుకొని పలు కంపెనీలలో ఉద్యోగం చేస్తూ ఏడాదికి రూ.10 లక్షల వరకు ప్యాకేజీ పొందుతున్నారు. బైపీసీ విభాగంలో నీట్లో మంచి ర్యాంకులు సాధించి మెడిసిన్, బీడీఎస్, ఏజీ బీఎస్సీ/బీవీఎస్ కోర్సులకు 119 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. సంవత్సరం ఐఐటీ/ ఎంబీబీఎస్/బీడీఎస్ / మొత్తం ఎన్ఐటీ/ఐఐటీ ఏజీబీఎస్సీ 2016–2017 5 3 08 2017–2018 10 12 22 2018–2019 16 26 42 2019–2020 31 20 51 2020–2021 34 16 50 2021–2022 34 13 47 2022–2023 31 20 51 2023–2024 41 24 65 మొత్తం 202 119 321అధ్యాపకుల కృషి అకాడమీలో డైరెక్టర్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరగతులు నిర్వహిస్తుండడంతో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. సబ్జెక్టు లెక్చరర్లు విద్యా ర్థులను సొంత పిల్లల్లా భావించి బోధన చేస్తున్నారు. మూసధోరణిలో కాకుండా ప్రతి పదాన్ని అర్థవంతంగా బోధిస్తుండటంతోపాటు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌లో అనుమానలు నివృత్తి చేస్తున్నారు. చాప్టర్ వైజ్‌గా పరీక్షలు పెడుతూ పరీక్షలంటే భయం పోగొడుతున్నారు. ప్రశ్నపత్రాలపై నా ప్రత్యేక తరగతులు నిర్వహించి జవాబు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. యోగా, క్రీడల్లోనూ శిక్ష ణ ఇస్తూ ప్రోత్సహిస్తుండటంతో పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. -
No Headline
వేరుశెనగ రూ. 3610 రూ. 6189 పొద్దుతిరుగుడు రూ. 2509 రూ. 2509 ఆముదం రూ. 5190 రూ. 5706 వాము రూ. 12269 రూ. 20960 ఉల్లి రూ. 515 రూ. 4412 ఎండుమిర్చీ రూ. 1699 రూ. 15513 శనగలు రూ. 6031 రూ. 6031 కందులు రూ. 7309 రూ. 7309 మొక్కజొన్న రూ. 2127 రూ. 2246 మినుములు రూ. 8321 రూ. 8321 కొర్రలు రూ. 2449 రూ. 3309 సోయాచిక్కుడు రూ. 2096 రూ. 4111 సజ్జలు రూ. 2095 రూ. 2169 -
వేధింపులు తాళలేక..
దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామంలో ఒకే ఒక గ్రామైక్య సంఘం ఉంది. ఈ సంఘానికి కొన్నేళ్లుగా ఈ.రంగస్వామి గౌడు వీఓఏగా పనిచేస్తున్నారు. ఈయనపై ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత టీడీపీ నేతలు తమ వర్గానికి చెందిన వ్యక్తికి వీఓఏగా నియమించాలనుకున్నారు. దీంతో రాజీనామా చేయాలని రంగస్వామి గౌడుపై ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేయకపోతే ఇబ్బందులు పడుతావంటూ బెదిరించారు. మనస్తాపంతో ఆగస్టు 23వ తేదీన పురుగు మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన వెలుగు వీఓఏ నరసింహులు నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
‘సాక్షి’ కథనంపై కలెక్టర్ ఆరా
కర్నూలు (అర్బన్): పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి సంబంధించిన పనులకు పాలనా అనుమతులు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యంపై బుధవారం ‘సాక్షి’లో ‘హామీ ఇచ్చారు... అనుమతులు మరిచారు’ అనే శీర్షికన వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆరా తీశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పుచ్చకాయలమాడ గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై ఇరిగేషన్, ఆర్అండ్బీ తదితర శాఖలతో పాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుచ్చకాయలమాడ నుంచి పెరవలి, రామచంద్రాపురం, హోసూరు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి పాలనా అనుమతుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలను పీఆర్ అండ్ ఆర్డీ కమిషనరేట్, ఈఎన్సీ ఆఫీస్‌కు పంపామని సంబంధిత ఇంజినీర్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ పనులకు సంబంధించి పాలనా అనుమతుల కోసం మరోసారి డీఓ లెటర్ రాయాలని ఆయన పీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. పాలనా అనుమతుల కోసం డీఓ లెటర్ రాయండి -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
కౌతాళం: మండల పరిధిలోని మరళి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ముతకప్పపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాలు.. ముతకప్ప బంధువులతో రోడ్డుపై మాట్లాడుతుండగా కొంత మంది టీడీపీ కార్యకర్తలు తమ గురించే మాట్లాడుతున్నావంటూ ఘర్షణకు దిగి విచక్షణా రహితంగా దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బోయ నాగరాజు, రామాంజి, వెంకటేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రమణరెడ్డి తెలిపారు. కాగా ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముతకప్పను పార్టీ మండల కన్వీనర్ ప్రహ్లాదచారి, కోఆప్షన్ మెంబర్ మాబుసాబ్ పరామర్శించారు. -
నల్లమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో బుధవారం లారీ–కారు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాల నుంచి గిద్దలూరు వైపు నుంచి వెళ్తున్న కారు, కాకినాడ నుంచి గిద్దలూరు మీదుగా వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో లారీ డ్రైవర్‌కు, కారులో ఉన్న మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. నంద్యాలకు చెందిన కారు యజమాని పఠాం అస్లాం ఖాన్ ఫిర్యాదు మేరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాయవరం మండలం చెల్లూరి గ్రామానికి చెందిన డ్రైవర్ కోట సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): గ్రామైక్య సంఘాల్లో పని చేసే వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు. బుధవారం వెలుగు వీఓఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలో యూనిమేటర్లను మార్చేసంస్కృతికి రాజకీయ నాయకులు స్వస్తి పలకాలన్నారు. పనిచేస్తున్న వారిని వేధించి విధుల నుంచి తొలగించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. ఏళ్లుగా పనిచేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించడం ద్వారా అనర్హులకు బాధ్యతలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో వందలాది మందిని తొలగించారని, వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుంటెప్ప, సుంకన్న, వెంకటస్వామి, జయమ్మ, మద్దిలేటి పాల్గొన్నారు. -
హంద్రీ నీవా నీటితో చెరువులు నింపండి
కర్నూలు(సెంట్రల్): హంద్రీనీవా నీటితో చెరువులను నింపే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చర్చించిన అంశాలు, వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై బుధవారం కలెక్టర్ తన చాంబరులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 42 చెరువులకు నీళ్లు నింపాల్సి ఉండగా ఇప్పటి వరకు 10 చెరువులకు మాత్రమే నీరు ఇచ్చారని, మరో 13 చెరువులకు నీటిని నింపే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మిగిలిన చెరువులు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నా రు. కాగా, నిండిన చెరువుల నుంచి నీటిని ఎందుకు వదలడం లేదని కలెక్టర్ ఆరా తీయగా, నిర్వహణ సిబ్బంది లేక, ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో ఫోన్లో మాట్లాడారు. అందుకు ఆయిన స్పందించి నీటి విడుదల కోసం నిధులు వచ్చే వరకు సంబంధిత చెరువుల పంచాయతీ, వీఆర్వోల పర్యవేక్షణలో పనులు చేయించుకోవాలని సూచినట్లు కలెక్టర్ అధికారులకు తెలిపారు. పదోతరగతి విద్యార్థులక కోసం వర్చువల్ తరగతులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. తొలిదశలోఅన్ని ప్రీమెట్రిక్ హాస్టల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందు కు చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖాధికారులను ఆదేశించారు. ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్‌కు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న పైపులైన్ పనులే త్వరితగతిన పూర్తి చేయాల ని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, 31 శాఖల అధికారులు పాల్గొన్నారు. రబీ పంటలకు బీమా చేయించుకోవాలి రైతులు రబీలో వేసిన జొన్న, వేరుశనగ, టమాట, శనగ, ఉల్లి పంటలకు డిసెంబర్ 15వ తేదీలోపు, వరి పంటకు డిసెంబర్ 31 లోపు బీమా చేయించుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పంట బీమాకు సంబంధించి స్వచ్ఛంద నమోదు కార్యాచరణ ప్రణాళిక అమలుపై జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. రైతులు శనగకు రూ.420, జొన్నకు రూ.297, వేరుశెనగకు రూ.480, ఉల్లిగడ్డకు రూ.1350, టమాటాకు రూ.1500, వరికి రూ.630 ప్రీమియం చెల్లించాలన్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు ఆ సమయంలోనే బీమాను చెల్లించవచ్చన్నారు. కలెక్టర్ రంజిత్‌బాషా -
ప్యాపిలి మండలంలో యురేనియం పరీక్షలకు టెండర్లు
ప్యాపిలి: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాల విషయం పూర్తిగా సద్దుమణగక ముందే నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో యురేనియం నిక్షేపాల పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. మండలంలోని మూడు గ్రామాల్లో బోర్ డ్రిల్లింగ్కు ఏఎండీ (అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్) టెండర్లు ఆహ్వానించినట్లు సమాచారం. మండల పరిధిలోని మామిళ్లపల్లి, రాంపురం, జక్కసానికుంట్ల తదితర గ్రామాల్లో 5 కి.మీ పరిధిలో డ్రిల్లింగ్కు టెండర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఒక్కో బోర్ 450 అడుగుల నుంచి 1,350 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ వేయాలని నిర్ణయం తీసుకుంది. గత నెల 10న టెండర్ ఆహ్వానించి ఈనెల 18 వరకు ఏఎండీ గడువు ఇచ్చింది. ఈ విషయంపై స్థానిక అధికారులను వివరణ కోరగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. కాగా ఇటీవలే కపట్రాళ్లతో పాటు మరో 15 గ్రామాల్లో యురేనియం తవ్వకాల కోసం 60 బోర్లు వేసే ప్రయత్నాలను స్థానికులు అడ్డుకోగా ప్రభుత్వం కొంత వెనకడుగు వేసిన విషయం విధితమే. -
నేటి నుంచి అందుబాటులోకి మరళీ రీచ్
కర్నూలు న్యూసిటీ: కౌతాళం మండలం పరిధిలోని మరళీ– 1 ఇసుక రీచ్ గురువారం నుంచి అందుబాటులోకి వస్తుందని మైనింగ్ డీడీ రవిచంద్ బుధవారం తెలిపారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ రీచ్‌లో ఇసుకను వెలికి తీసి వినియోగదారులకు సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అవసరమైన వారు ఆన్లైన్ ఇసుక పోర్టల్ ద్వారా బుక్ చేసుకుని చలానా చూపితే ఇసుకను ట్రాక్టర్లలో లోడ్ చేస్తారని సూచించారు. ఓపీలో మెరుగైన సేవలు అందించాలి ● వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు కర్నూలు (హాస్పిటల్): బోధనాసుపత్రుల్లోని ఓపీల్లో రెండేసి యూనిట్ల వైద్యులు ఉండి రోగులకు సత్వర వైద్యసేవలు అందే విధంగా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. బుధవారం ఆయన అమరావతి నుంచి బోధనాసుపత్రి, మెడికల్ కళాశాల అధికారులతో జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్, బయోమెట్రిక్ ద్వారా హాజరు తప్పనిసరి చేయాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ అమలు, సమస్యలు గురించి ఆరా తీశారు. ఆరోగ్య శాఖ మంత్రి సూచించిన 20 పాయింట్ల మూలంగా ఓపీలో ఏమైనా మెరుగుదల కనిపించిందా అని ప్రశ్నించారు. ఓపీలో రెండు యూనిట్ల వైద్యులు ఉంటే రద్దీగా ఉండే రోజుల్లో రోగులకు వైద్యపరీక్షలు త్వరగా చేసి సాయంత్రం లోగా సమగ్ర వైద్యం అందుకుని వారు ఇళ్లకు చేరే విధంగా చూడాలన్నారు. బయో మెడికల్ పరికరాలు ఎన్ని ఉన్నాయి, ఎలా పని చేస్తున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఎంఎన్ఓలు, ఎఫ్‌ఎన్‌ఓల ఖాళీలను నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాళ్లు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. పాఠశాలల పనివేళలు పెంచడం సరికాదు కర్నూలు సిటీ: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్న పని వేళలను 5 గంటల వరకు పెంచుతూ పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని ప్రతి మండలంలో రెండు స్కూళ్లలో అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బుధవారం సలాంఖాన్ భవనంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 15 కి.మీ వరకు విద్యార్థులు ప్రయాణం చేయవలసి ఉంటుందన్నారు. అయితే, సమయానికి రవాణా సౌకర్యం లేక విద్యార్థులు ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు శేఖర్, దేవదాసు, గోవింద నాయక్, నారాయణ, హుస్సేన్ మియ్య, తదితరులు పాల్గొన్నారు. పనుల్లో నాణ్యత తప్పనిసరి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన సిబ్బందికి సున్నిపెంటలో నిర్మిస్తున్న వసతి గృహనిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పరిపాలనాంశాల్లో భాగంగా పలు ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు. ముందుగా సున్నిపెంటలో నిర్మిస్తున్న వసతి గృహాలను పరిశీలించారు. జంగిల్ క్లియరెన్స్, సంప్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పిల్లలు అడుకునేందుకు వీలుగా వసతిగృహాల వద్ద అటస్థలం కూడా ఉండాలన్నారు. హఠకేశ్వరం వద్ద భక్తులు సేదతీరేందుకు యాత్రిక షెడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనంతరం గణేశసదనంను పరిశీలించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఎం.నరసింహారెడ్డి, డీఈఈ చంద్రశేఖరశాస్త్రి, సుబ్బారెడ్డి, ఏఈలు పాల్గొన్నారు. శ్రీశైలంలో 160 టీఎంసీలు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయంలో బుధవారం సాయంత్రం సమయానికి 159.7646 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ సుంకేసుల నుంచి 4,032 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు జలాశయానికి ఎగువ నుంచి 1,984 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా దిగువ ప్రాజెక్ట్‌లకు 19,660 క్యూసెక్కుల నీరు విడుదలైంది. -
32,799 స్వయం సహాయక సంఘాలు3,42,105 సంఘాల మహిళా సభ్యులు 961గ్రామైక్య సంఘాలు 600తొలగించిన వీవోఏల సంఖ్య
● వెలుగు వీఓఏలను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్న టీడీపీ నేతలు ● తమ్ముళ్లకు వత్తాసు పలుకుతున్న డీఆర్డీఏ ఏపీఎం, సీసీలు ● ఇప్పటికే 600 మందికిపైగా తొలగింపు ● దిగిపోకపోతే ఎస్సీ, ఎస్టీ కేసులంటూ బెదిరింపులు ● మనస్తాపంతో కొందరు బలవన్మరణాలు ● ఉద్యోగ భద్రత కల్పించాలని పోరుబాట కర్నూలు(అగ్రికల్చర్): వారిది చిరుద్యోగం. ప్రభుత్వం ఇచ్చే గౌరవవేతనం వారికి ఆధారం. కొన్నేళ్లుగా గ్రామ సహాయక సంఘాల సభ్యులకు సేవలందిస్తూ జీవనం పొందుతున్నారు. అయితే కూటమి నేతలు వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు. ‘ఇప్పుడు ప్రభుత్వం మాది.. దిగిపోవాల్సిందే’ అంటూ బెదిరిస్తున్నారు. మాట వినకపోతే సభ్యులతో చేత బలవంతంగా తీర్మానం చేయించి మరీ తొలగిస్తున్నారు. అదీ కాకపోతే అక్రమ కేసులు పెడతామంటూ వేధిస్తున్నారు. వీరి బాధ తాళలేక కొందరు ఆత్మహత్య సైతం చేసుకున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 32,799 స్వయం సహాయక సంఘాలు ఉండగా... ఇందులో 3,42,105 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్వయం సహాయక సంఘాలతో గ్రామైక్య సంఘాలు ఏర్పాటవుతాయి. ఒక్కో గ్రామైక్య సంఘం పరిధిలో 10 నుంచి 40 స్వయం సహాయక సంఘాలు ఉంటాయి. ఈ విధంగా జిల్లాలో 961 గ్రామైక్య సంఘాలు ఉన్నయి. ప్రతి సంఘానికి అకౌంటెంటు తరహాలో ఒక బుక్ కీపర్ ఉంటారు. బుక్ కీపర్‌ను విలేజ్ ఆర్గనైజేషన్ సహాయకులు (వీఓఏ)గా వ్యవహరిస్తారు. గ్రామైక్య సంఘం వ్యవహారాలన్నింటిని వారు రికార్డుల్లో పొందుపరుస్తారు. సమావేశాల్లో చేసే తీర్మానాలను రికార్డు చేస్తారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవసరమైన రికార్డును కూడా తయారు చేస్తారు. సంఘానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ బాధ్యత బుక్ కీపర్దే. వారు ఏవైనా తప్పులు చేసినా... నిధుల దుర్వినియోగానికి పాల్పడినా తొలగించవచ్చు. దీనికి ఎవ్వరూ అడ్డుచెప్పరు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి టీడీపీ నేతల కన్ను ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామైక్య సంఘాల బుక్ కీపర్లపై పడింది. వీరిని తొలగించి తమ వారిని నియమించుకునేందుకు టీడీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతా మా వాళ్లు ఉండాల్సిందే.. ‘2024 జూన్ నాటికి ఉన్న వీఓఏలందరినీ తొలగించాల్సిందే. వారి స్థానాల్లో అందరూ మా వాళ్లు ఉండాల్సిందే’ అంటూ ఏపీఎం, సీసీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో డీఆర్డీఏలో పనిచేస్తున్న కొందరు ఏపీఎంలు, సీసీలు టీడీపీ నేతలతో కుమ్మకై ్క బుక్ కీపర్ల తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారు. వారిని మార్చడంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 961 గ్రామైక్య సంఘాలు ఉండగా... ఇప్పటికే 600కుపైగా సంఘాల్లో బుక్ కీపర్లను తొలగించారు. మరో రెండు నెలల్లో బుక్ కీపర్లందరూ తమ వాళ్లే ఉండాలని టీడీపీ నేతల లక్ష్యం మేరకు తొలగించే ప్రక్రియను వారు మరింత వేగవంతం చేశారు. డీఆర్డీఏ అధికారులు కూడా తమ్ముళ్లకు పూర్తిగా సహకరిస్తున్నారు. మాట వినకపోతే వేధింపులు.. అక్రమ కేసులు 2014–19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం వీఓఏలకు రూ.3 వేలు మాత్రమే గౌరవ వేతనం చెల్లించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5 వేలు పెంచి రూ.8 వేలు చేసింది. గౌరవ వేతనంతో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పని చేస్తున్నా.. టీడీపీ నేతలు ఏకపక్ష తొలగిస్తుండటంతో మనస్తాపంతో కొందరు ఆత్మహత్యకు సైతం పాల్పడుతున్నారు. ఎప్పుడైనా వీఓఏను తొలగించాలంటే ఆ సంఘాలే తీర్మానం చేయాలి. ఈ ప్రక్రియ టీడీపీ నేతలకు అనుకూలంగా లేకపోతే తీవ్రంగా వేధిస్తున్నారు. కల్లూరు మండలంలో ఒక గ్రామైక్య సంఘం వీఓఏను బలవంతంగా తొలగించారు. అయితే తొలగించిన మహిళకు గ్రామంలోని పొదుపు మహిళల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో మళ్లీ వీఓఏగా తీసుకున్నారు. అయితే టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదిరించిన ఆమె భర్తతో పాటు మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినట్లు సమాచారం. ఇలా టీడీపీ నేతల మాట వినకపోతే ఇలాగే అక్రమ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ‘తమను తొలగిస్తే కుటుంబం రోడ్డున పడుతుంది. మాకు అత్మహత్యే శరణ్యం’ అంటూ వీఓఏలు ఆందోళన బాట పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. పత్తికొండ పట్టణంలోని భవానీ, భారతి, వెంకట సాయి గ్రామైక్య సంఘాల్లో 500 మంది పొదుపు గ్రూపు మహిళలు ఉన్నారు. ఈ సంఘాల్లో వీఓఏగా పనిచేసిన ముగ్గురు కొన్నేళ్లుగా సభ్యులకు సహకరిస్తూ వస్తున్నారు. అయితే మూడు నెలల క్రితం ఏపీఎం మధుబాబు, సీసీ శ్రీనివాసులు.. సంఘం లీడర్లకు తెలియకుండానే వారిని తొలగించి, ఆ సంఘం సభ్యులు కాని వారిని వీవోఏలుగా ఏకపక్షంగా నియమించారు. దీనిని సంఘంలోని పొదుపు మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీఎం, సీసీలపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 18న కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
దాడిలో గాయపడిన వృద్ధుడి మృతి?
కోసిగి: దాడిలో గాయపడి వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు కోలుకోలేక మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడదొడ్డి గ్రామానికి చెందిన మజ్జిగ కృష్ణయ్య(69) కుమారుడు గత నెల ఓ బాలికపై జరిగిన అత్యాయత్నంలో సహకరించాడని పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈక్రమంలో వారం క్రింతం పరారీలో ఉన్న కుమారుడి ఆచూకీ తెలపాలంలూ కృష్ణయ్యపై బాలిక బంధువులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యం అందించిన డాక్టర్లు.. పరిస్థితి సీరియస్‌గా ఉందని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. చేసేదేమీ లేక కృష్ణయ్యను కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో దాడిలో గాయపడటంతోనే తన భర్త మృతిచెందాడని బసమ్మ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ చంద్రమోహన్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్నామని, రిపోర్టు ఆధారంగా తదుపరి విచారణ ఉంటుందని ఎస్ఐ తెలిపారు. మృతినికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ నుంచి మంగళవారం కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నదిలో నీటి ప్రవాహం రోజు రోజుకు తగ్గిపోతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీకి ఎగువ నుంచి 6,940 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రస్తుతం బ్యారేజీలో 1.2 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మేరకు నీరు ఉంది. బ్యారేజీ నుంచి 4,479 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. -
రూ.14 కోట్లతో గాల్వోనియం షెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
● జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా ఆదోని అర్బన్: వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ దిగుబడులు వర్షానికి తడవకుండా రూ.14 కోట్ల తో గాల్వోనియం షెడ్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా తెలిపారు. మంగళవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డును ఆయన తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడా రు. ఎకరాని పెట్టుబడి, దిగుబడి, లాభం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పత్తి దిగు బడులు పరిశీలించారు. పత్తి దిగుబడులను సీసీఐకు విక్రయించుకుంటే మరింత లాభం వస్తుందని రైతులకు కలెక్టర్ సూచించారు. సీసీఐకి ఎలా విక్రయించుకోవాలో రైతులకు అవగాహన కల్పించాలని యార్డు అధికారులకు సూచించారు. మార్కెట్లో షెడ్ ఏర్పాటుకు కమిషనర్‌తో మాట్లాడతానని, డ్రైనేజీ ఏర్పాటు కు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇ చ్చారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ బి.నవ్య, ఆదోని సబ్కలెక్టర మౌర్య భరద్వాజ్, వ్యవసాయ మార్కెట్‌యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి, డీఈ సుబ్బారెడ్డి ఉన్నారు. గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా వైద్యాధికారులను ఆదేశించారు. ఆదోని ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిని ఆయన తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఓపీ వార్డును, పీపీటీసీ గది, యాంటినేటల్ వార్డు, రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రం, నవజాత శిశువు సంరక్షణ విభాగం, పోస్టు ఆపరేటివ్ వార్డు–1, మెడికల్ రికార్డు రూమ్, గైనకాలజీ వార్డులను తనిఖీ చేశారు. అందుతున్న సేవలపై గర్భిణుల ను అడిగి తెలుసుకున్నారు. ఆదోని మాతాశిశు ఆస్ప త్రిలో ఇప్పటికే 12 మంది సిబ్బంది ఉన్నారని, గర్భిణు లకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గానూ అదనంగా 8 మంది స్టాఫ్ నర్సులను డిప్యుటేషన్ వేశామని కలెక్టర్ తెలిపారు. వీరి ద్వారా షిఫ్ట్ పద్ధతిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పెచ్చులూడుతున్న గోడలకు మరమ్మతులు చేయించేందుకు ప్రతిపాదనలు పంపాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ మాధవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవిలత ఉన్నారు. -
ఆటో బోల్తా పడి మహిళ మృతి
ఆదోని అర్బన్: మండలంలోని పెద్దతుంబళం గ్రామ సమీపంలో ఆవును తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడి మహిళ దుర్మరణం చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కోసిగి మండలం దళవాయి గ్రామానికి చెందిన ఉలిగమ్మ(40), పార్వతి ఆటోలో ఆదోనికి బయలుదేరారు. పెద్దతుంబళం గ్రామ సమీపంలో ఆవును తప్పించబోయి ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న ఉలిగమ్మ, పార్వతికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉలిగమ్మ కోలుకోలేక మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త వెంకటేష్, 9 మంది కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్లో అగ్ని ప్రమాదం ఆత్మకూరు: పట్టణంలోని నంద్యాల టర్నింగ్లో ఉన్న అబ్దుల్లా హోటల్లో మంగళవారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కిరాణా సరుకులు, గ్రైండర్, కుర్చీలు, టేబుళ్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే దాదాపు రూ.1.50 లక్ష విలువ చేసే సామగ్రి కాలిపోయిందని బాధితుడు అబ్దుల్లా వాపోయాడు. -
చెల్లి పేరుతో పేస్ బుక్ ఖాతా.. యువకుడి నుంచి కోట్లు వసూలు
పత్తికొండ (తుగ్గలి): ఫేస్ బుక్ చాటింగ్ పరిచయంతో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి పెద్ద మొత్తంలో డబ్బు కాజేసింది ఓ మహిళ. ఈ ఘటన పత్తికొండ మండలంలో చోటు చేసుకుంది. చక్రాళ్లకు చెందిన లావణ్య ఎమ్మిగనూరులో ఉన్న తన చెల్లెలు ఫొటో పెట్టి ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన సాయిలుతో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా నమ్మిస్తూ వచ్చింది. తర్వాత తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో సాయిలు విడతల వారీగా రూ.1.20 కోట్లు సమర్పించుకున్నాడు. చివరకు తన భార్యను కూడా నమ్మించి డబ్బు కాజేసిందని బాధితుడు చెబుతున్నాడు. అనుమానం వచ్చిన సాయిలు పత్తికొండకు వచ్చి ఆరా తీసి మోసపోయానని తెలుసుకున్నాడు. డబ్బుల విషయమై పలుమార్లు పంచాయితీ జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరులో ఉన్న ఆస్తులు అమ్మి ఇస్తానని చెబుతూ కాలం వెళ్లదీసింది. ఎంతకీ డబ్బులు ఇవ్వక పోవడంతో నాలుగు రోజుల క్రితం పత్తికొండకు వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మహిళ తండ్రి, మధ్యవర్తులు పంచాయితీ చేసి సమస్య పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పారు. అయితే వ్యవహారం అంతటా దావణంలా వ్యాపించడంతో మనస్తాపానికి గురైన లావణ్య మంగళవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ విషయమై పట్టణ సీఐ జయన్నను సంప్రదించగా ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. -
క్రీడలతో మానసికోల్లాసం
● క్లస్టర్ యువతరంగ్ పోటీలు కర్నూలు సిటీ: క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ తెలిపారు. క్లస్టర్ యువతరంగ్–2024 పేరుతో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ప్రారంభించారు. క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ, సిల్వర్‌జూబ్లీ, కేవీఆర్ మహిళా డిగ్రీ కా లేజీల విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు సమయం కేటాయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరాశాంతి, వ్యాయామ అధ్యాపకులు వై.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. విజేతలు వీరే.. చదరంగం: పురుషుల విభాగంలో ప్రభుత్వం పురుషుల డిగ్రీ కాలేజీ ప్రథమ, సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ద్వితీయ స్థానంలో నిలిచాయి. ● మహిళలు విభాగంలో కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ ప్రథమ, సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ద్వితీయ, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ● మహిళా అధ్యాపకుల విభాగంలో ప్రథమ స్థానం ఎం.పద్మావతి, ద్వితీయ స్థానం పి.స్రవంతి(కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ) దక్కించుకున్నారు. క్రికెట్: పురుషుల విభాగంలో సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ విజేతగా నిలిచింది. ● అధ్యాపకుల విభాగంలో సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రథమ, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ ద్వితీయ స్థానంలో నిలిచాయి.