Personal Finance
-
‘స్టార్ ధన్ వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇటీవల రూ. 3 కోట్లలోపు డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందులో భాగంగా అధిక రాబడిని అందించే ‘స్టార్ ధన్ వృద్ధి’అనే పేరుతో కొత్త ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది.బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. మార్పుల తర్వాత, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ రేట్లు సాధారణ ప్రజలకు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.‘స్టార్ ధన్ వృద్ధి’ గురించి..స్టార్ ధన్ వృద్ధి పథకం అనేది పరిమిత-సమయ ఎఫ్డీ స్కీమ్. ఇది 333 రోజుల స్థిర కాలవ్యవధికి 7.25 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే ఈ పథకం కింద మరింత మెరుగైన రాబడి లభిస్తుంది.ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు (వయస్సు 60-80 ఏళ్లు ) 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లు ( వయస్సు 80 ఏళ్లకు పైబడి) 7.90 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. -
పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు
భారతదేశంలో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచినట్లు అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.అధికారిక వెబ్సైట్ ప్రకారం.. హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో మూడు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉంది. ఒక సంవత్సరానికి ఎంసీఎల్ఆర్ 9.45 శాతంగా ఉంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ పెరుగుతుంది. ఇందులో ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ రెండూ ఉంటాయి. ఇది కస్టమర్ల మీద ప్రభావం చూపిస్తుంది.ఓవర్ నైట్: 9.10 శాతంఒక నెల: 9.15 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.40 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.45 శాతంఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
జీవనశైలిలో మార్పు, విభిన్న ఆహార అలవాట్లతో అనారోగ్యబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉందనే ధీమాతో ఆసుపత్రిలో చేరిన కొందరి క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే సమయంలోనే పాలసీదారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఇలా క్లెయిమ్ అందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తారు.. అలా కంపెనీలు క్లెయిమ్‌లు తిరస్కరించకూడదంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం.బీమా పాలసీ డాక్యుమెంట్లు గతంలో సామాన్యులకు అర్థంకాని కఠిన పదాలతో ఉండేవి. కానీ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీ పత్రాలు సరళమైన భాషలో ఉండాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అన్ని కంపెనీలు అందరికీ అర్థమయ్యే విధంగా పాలసీ పత్రాలను వెల్లడిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ జారీ చేస్తుంటాయి. అయితే వాటిని సరిగా అర్థం చేసుకుని బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.ఆరోగ్య సమాచారం సరిగా తెలపడంపాలసీ తీసుకునేప్పుడు ఆరోగ్య విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ గతంలో ఏదైనా సర్జరీలు, అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా కంపెనీలకు ముందుగానే చెప్పాలి. దానివల్ల స్వల్పంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ముందుగానే తెలియజేయడం ఉత్తమం.వెయిటింగ్ పీరియడ్పాలసీ తీసుకున్న వెంటనే కొన్ని రకాల జబ్బులకు కంపెనీలు వైద్య ఖర్చులు అందించవు. అలాంటి వ్యాధులకు బీమా వర్తించాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే కంపెనీలకు బట్టి ఈ వ్యాధులు మారుతుంటాయి. మీకు ఇప్పటికే కొన్ని జబ్బులుండి వాటికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవాలి.సరైన ధ్రువపత్రాలతో రీయింబర్స్మెంట్బీమా కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఆసుపత్రులు అందుబాటులో లేనివారు ఇతర హాస్పటల్లో వైద్యం చేయించుకుంటారు. తర్వాత బీమా కంపెనీకి బిల్లులు సమర్పించి తిరిగి డబ్బు పొందుతారు. అయితే అందుకు సరైన ధ్రువపత్రాలు అవసరం. వైద్యం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని నిబంధనల ప్రకారం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.ఇదీ చదవండి: అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..క్లెయిమ్‌ను తిరస్కరించకుండా ఏ జాగ్రత్తలు పాటించాలంటే..బీమా పాలసీ తీసుకునేముందే అన్ని నిబంధనలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి అవగాహన కలిగి ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలోనే అన్ని అంశాలను పరిశీలించాలి.బీమా సంస్థ నియమాలను తప్పకుండా అనుసరించాలి. పైన తెలిపిన విధంగా ఆరోగ్య విషయాల వెల్లడిలో పొరపాటు చేయకూడదు. ప్రతిపాలసీకు కొన్ని షరతులు, మినహాయింపులు, పరిమితులుంటాయి. వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే చేరాలి. అత్యవసరం అయితే తప్పా ఇతర హాస్పటల్స్లోకి వెళ్లకూడదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కోపే(కొంత బీమా కంపెనీ, ఇంకొంత పాలసీదారులు చెల్లించాలి) ఎంచుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం కొంత పాలసీదారులు చెల్లించాలి.కొన్నిసార్లు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఆ సందర్భంలో పరిహారం చెల్లించదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ వెబ్సైట్లో వాటిని అప్డేట్ చేస్తుంటారు.బీమా క్లెయిమ్ చేసుకునే విధానంలో ఎదైనా సందేహాలుంటే కంపెనీలను సంప్రదించాలి. బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తాయి. -
బ్యాంకుల్లో అప్రెంటిస్‌లుగా గ్రాడ్యుయేట్లు
ముంబై: గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగావకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా కీలక ప్రకటన చేశారు.అప్రెంటిస్‌లుగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా శుక్రవారం తెలిపారు. 12 నెలల అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. వీరికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌ను బ్యాంకులు చెల్లిస్తాయని మెహతా వెల్లడించారు.‘నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం లేని మార్కెటింగ్, రికవరీ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారికి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. 21–25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థి పన్ను చెల్లింపుదారు కాకూడదు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి డిగ్రీని కలిగి ఉండకూడదు.బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకువెళ్లే అప్రెంటిస్‌లను బిజినెస్ కరస్పాండెంట్లుగా కూడా నియమించుకోవచ్చు. శిక్షణ పూర్తి అయ్యాక వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశమూ ఉంది. అన్ని బ్యాంకులు నెలరోజుల్లోగా అప్రెంటిస్‌లను నియమించుకోనున్నాయి. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా ఉంది’ అని చెప్పారు. అయితే ఎంత మందిని అప్రెంటిస్‌లుగా చేర్చుకుంటారనేది వెల్లడి కాలేదు. ఐబీఏ ఈ స్కీమ్‌పై కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీతో గురువారం చర్చించింది. -
పీపీఎఫ్ కొత్త రూల్స్.. రెండో అకౌంట్‌పై వడ్డీ వస్తుందా?
పోస్టాఫీసుల ద్వారా తెరిచిన పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాలను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం గత నెలలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం పీపీఎఫ్ నిబంధనలలో మార్పులు అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి.పీపీఎఫ్ ఏంటంటే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తూ పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక ప్రముఖ ఆర్థిక సాధనం. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పొదుపు పథకం.1961 ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం దీంట్లో పెట్టిన అసలు, వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం అన్నిటికీ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది.మారిన నిబంధనలు ఇవే..మైనర్లకు పీపీఎఫ్ ఖాతా: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మైనర్ పేరు మీద తెరిచి ఉంటే మైనర్‌కు 18 ఏళ్లు వయస్సు వచ్చే వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) వచ్చే వడ్డీ మాత్రమే వస్తుంది. అటువంటి ఖాతాల మెచ్యూరిటీ వ్యవధిని మైనర్ పెద్దవాడైన తేదీ నుండి లెక్కిస్తారు.ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు: ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా ఏజెన్సీ బ్యాంక్‌లో ఖాతాదారు తెరిచిన ప్రాథమిక అకౌంట్‌పై స్కీమ్ రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. అదే ఒకటి ఎక్కువ ఖాతాల్లో బ్యాలెన్స్ ఉన్న సందర్భంలో వాటిని ప్రాథమిక ఖాతాతో ఏకీకృతం చేస్తారు. ఇలా చేశాక మొత్తం వార్షిక పరిమితి మొత్తం డిపాజిట్‌కు మాత్రం పథకం రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తారు. దీనికి మించి ఇతర ఖాతాల్లో మిగులు నిధులు ఉంటే ఎలాంటి వడ్డీ లభించదు. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..?
ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు అంశానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగానే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే రూ.650 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు వరకు కేంద్ర ఖజానాపై భారం పడనుంది.దేశంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు ఏటా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం మేర అధికమవుతున్నాయి. దాంతో చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రతివ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి పాలసీదారులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తాము చెల్లిస్తున్న బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలోనూ ప్రతిపక్ష నేతలు, నితిన్ గడ్కరీ వంటి పాలకపక్ష నేతలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీను తొలగించాలని ఆర్థికశాఖకు సిఫార్సు చేశారు. దాంతో త్వరలో జరగబోయే సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే బీమా కంపెనీలు మరింత ఎక్కువగా పాలసీలు జారీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆయా కంపెనీల రెవెన్యూ పెరుగుతుందని మార్కెట్ భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, జీఎస్టీని పూర్తిగా మినహాయించకుండా కొన్ని షరతులతో పన్ను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత: ఎస్బీఐ చైర్మన్
ముంబై: సైబర్ సెక్యూరిటీ నిపుణుల లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటమనేది భవిష్యత్తులో ’పెద్ద సవాలు’గా పరిణమించవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. మొత్తం వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు సైబర్‌సెక్యూరిటీపై పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయని వార్షిక బ్యాంకింగ్ సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.ప్రతి రోజు దాదాపు 1 లక్ష సైబర్ దాడులను ఎదుర్కొంటున్నామని హెచ్ఎస్బీసీ కంట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హితేంద్ర దవే ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, డిపాజిట్లు నెమ్మదించిన నేపథ్యంలో మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఎస్బీఐ ఎండీ అశ్విని తివారీ తెలిపారు. స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలకు మరింతగా తోడ్పాటు అందించడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పింఛను
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్’ (ఈపీఎస్) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్’కు కారి్మక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు. -
సుకన్య సమృద్ధి యోజన.. కొత్త రూల్స్
నిబంధనలకు అనుగుణంగా లేని పొదుపు ఖాతాలను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. బాలికల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ప్రత్యేక పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన. బాలికల తల్లిదండ్రులు, సంరక్షకులు బాలికల పేరున ఈ ఖాతాలను తెరుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు లేదా బంధువులు ఖాతాలు తెరిచారు. కానీ వీరు చట్టబద్ధంగా సంరక్షకులు కారు. కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన సంరక్షకులు లేదా సహజ తల్లిదండ్రులు తెరవని ఖాతాలను పథకం ప్రాథమిక మార్గదర్శకాలకు అనుగుణంగా సంరక్షకులకు బదిలీ చేయడమో లేదా మూసివేయడమో తప్పనిసరి. తల్లిదండ్రులు లేని బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు సంరక్షకులుగా ఉంటే ఇందుకోసం ప్రభుత్వం నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది.ఖాతా మూసివేత, బదిలీకి అవసరమైన పత్రాలు» అన్ని వివరాలున్న ప్రాథమిక ఖాతా పాస్‌బుక్» బాలిక జనన ధ్రువీకరణ పత్రం» బాలికతో సంబంధాన్ని రుజువు చేసే బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర ధ్రువ పత్రాలు» తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు.» పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్పత్రాలన్నీ తీసుకుని ఖాతాకు సంబంధించిన ప్రాథమిక వ్యక్తి ఖాతా తెరిచిన పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లాలి. కొత్త మార్గదర్శకాల ప్రకారం సంరక్షకుడికి ఖాతాను బదిలీ చేయాల్సిన అవసరాన్ని అధికారులకు తెలియజేయాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీసు వారు అందించిన బదిలీ ఫారమ్‌ను పూరించాలి. ఇప్పటికే ఉన్న ఖాతాదారు (తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ), కొత్త సంరక్షకుడు (తల్లిదండ్రులు) ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఫారమ్‌పై సంతకం చేయాలి.ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, బ్యాంక్ లేదా పోస్టాఫీసు సిబ్బంది అభ్యర్థనను సమీక్షించి ధ్రువీకరణను ప్రాసెస్ చేస్తారు. అవసరమైతే వారు అదనపు సమాచారం కోసం కూడా అడగవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఖాతా రికార్డులు కొత్త సంరక్షకుని సమాచారంతో అప్డేట్ అవుతాయి. -
టర్మ్ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భద్రత
మన పరోక్షంలో మన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు సమర్థమంతమైన మార్గాల్లో నిస్సందేహంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి. ఇది పూర్తిగా ప్రొటెక్షన్‌పై మాత్రమే ఫోకస్ చేసే సరళతరమైన బీమా పథకం. పాలసీదారు మరణించినా కుటుంబ పరిస్థితి తల్లకిందులు కాకుండా ఆర్థికంగా భరోసా అందించే టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే.. → ఆదాయ నష్టం నుంచి రక్షణ: సంపాదించే కుటుంబ పెద్ద కన్నుమూస్తే ఆదాయం నిలి్చపోయి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఏకైక సంపాదనపరుడైన పాలసీదారు ఇటు ఇంటిరుణం చెల్లిస్తూ అటు పిల్లల చదువులకూ కడుతున్నారనుకుందాం. దురదృష్టవశాత్తూ ఒకవేళ ఆయన మరణించిన పక్షంలో టర్మ్ ఇన్సూరెన్సు పిల్లల చదువు ఖర్చులు, రుణాల చెల్లింపు, జీవనం సాగించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చగలదు. → చౌకైనది: టర్మ్ ప్లాన్లతో తక్కువ ప్రీమియంలకే అత్యధిక కవరేజీ లభించగలదు. ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీసుకుంటే రిసు్కలు తక్కువ కాబట్టి కాబట్టి ప్రీమియంలు మరింత తక్కువగా ఉంటాయి. కనుక 20లలో లేదా 30లలో ఉన్నప్పుడు టర్మ్ పాలసీని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. → రుణాలకు కవరేజీ: పాలసీదారు ఏవైనా రుణాలు తీసుకున్నా వాటిని తీర్చేందుకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభించగలదు. ఎంత కవరేజీ ఉండాలి.. → ఇది మీ ఆర్థిక పరిస్థితులు, మీపై ఆధారపడిన వారి అవసరాలు, లైఫ్‌స్టయిల్, భవిష్యత్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. బండగుర్తు ఏమిటంటే వార్షిక ఆదాయానికి 10 రెట్లు అధికంగా లైఫ్ కవరేజీ ఉండాలి. అదనంగా ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాల్లాంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎంత కవరేజీ అవసరమవుతుందనేది ఒక అవగాహనకు రావచ్చు. → చివరగా చెప్పాలంటే.. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం గురించి అర్థం చేసుకునేందుకు, మీకేదైనా అయితే మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలిగే వారు ఎవరైనా ఒక అయిదుగురు ఉన్నారేమో ఆలోచించి చూడండి. నా మిత్రులను అడిగితే ఏదో ఒకటో రెండో పేర్లు చెప్పారు. కొందరైతే అదీ లేదు. కాబట్టి ఏదైనా జరిగితే మానసికంగా భరోసానిచ్చేవారు చాలా మందే ఉన్నా ఆర్థికంగా వెన్నంటి ఉండేవారు అంతగా ఉండరనేది ఇది తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక భద్రత కలి్పంచడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతగానో తోడ్పడగలదు.సమీర్ జోషి, చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్ అలయంజ్ లైఫ్ -
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే!
ఆర్థిక పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. నెలకు లక్షల రూపాయలు సంపాదించేవారు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు, కావలసినప్పుడు లోన్స్ కూడా తీసుకుంటున్నారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత లోన్స్ తీసుకోవచ్చు. కానీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లేకుంటే తీసుకున్న అసలు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్బ్యాంకు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ చూస్తుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎక్కువ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. లేకుంటే లోన్ లభించడం కొంత కష్టమనే చెప్పాలి. ఒకవేళా మీకు లోన్ లభించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.వడ్డీ రేటులోన్ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరో విషయం వడ్డీ రేటు. ఎందుకంటే ఒక్కో బ్యాంక్ ఒక్కో వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీతో లోన్ ఇచ్చే బ్యాంకుల వద్ద నుంచి లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీరు తిరిగీ చెల్లించాల్సిన ఈఎమ్ఐలను సులభతరం చేస్తుంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి లోన్ ఇస్తుందనే విషయాలను అధికారిక వెబ్సైట్లలో లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు.లోన్ వ్యవధిలోన్ తీసుకునే వ్యక్తి.. తిరిగి ఎన్ని నెలల్లో చెల్లచగలుగుతాడో, సంపాదన ఎంత వంటి వాటిని బేరీజు వేసుకుని వ్యవధిని ఎంచుకోవచ్చు. పర్సనల్ లోన్ వ్యవధి 12 నెలల నుంచి 60 నెలల మధ్య ఉంటుంది. అయితే 36 నెలలు లేదా మూడు సంవత్సరాలకు మించి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడం మీకే మంచిది. అయితే ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం లేదు.లోన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ)పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి.. బ్యాంకు నుంచి తీసుకోవాలా? లేదా ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకోవాలా? అని సొంతంగా నిర్దారించుకోవాలి. బ్యాంకు నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతారు. లోన్ తీసుకోవడానికి కొంత ఆలస్యమైనా బ్యాంకు నుంచే తీసుకోవడం మంచిది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావుండదు.ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు) నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ ఇందులో కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఎక్కువ అవసరం లేదు. ఎన్బీఎఫ్సీలో లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. -
క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. రేపటి నుంచే అమలు
సెప్టెంబర్ 1నుంచి వివిధ బ్యాంకులు కొన్ని గణనీయమైన అడ్జెస్ట్మెంట్స్ చేయనున్నాయి. ఈ ప్రభావం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్ వంటి వాటిని ప్రభావితం చేస్తాయి.రూపే క్రెడిట్ కార్డ్రేపటి నుంచి (సెప్టెంబర్ 1) రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మెరుగైన రివార్డ్ పాయింట్ సిస్టమ్ నుంచి ప్రయోజనాలను పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. రూపే క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. మొత్తం మీద రూపే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇకపై ఎక్కువ రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా సెప్టెంబర్ 1నుంచి రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులను ప్రవేశపెడుతుంది. బ్యాంక్ యుటిలిటీ, టెలికామ్ లావాదేవీల నుంచి సంపాదించిన రివార్డ్ పాయింట్లను నెలకు 2000 పాయింట్లకు పరిమితం చేస్తుంది. అయితే క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసిన లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చెల్లింపు నిబంధనలుసెప్టెంబర్ 1 నుంచి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా చెల్లింపులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయనుంది. చెల్లింపు గడువు తేదీ.. స్టేట్మెంట్ జనరేషన్ డేట్ నుంచి (18 నుంచి 15 రోజులకు) కుదించారు. అంటే కార్డు హోల్డర్లు మూడు రోజులు ముందుగానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే వడ్డీ చార్జీలు కొంత తగ్గించడం జరిగింది. -
రూ.1000 పెట్టు.. రూ.కోటి పట్టు!
దేశీయ స్టాక్‌మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికమవుతోంది. కేవలం నెలకు రూ.వెయ్యి పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.కోటి ఎలా రాబట్టాలో ఈ కథనంలో తెలుసుకుందాం.భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ల వయసు తక్కువగా ఉంటే రిస్క్ తీసుకునే స్వభావం పెరుగుతుంది. ఉద్యోగంలో చేరిన 20 ఏళ్ల వయసులోని యువత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ పదవీ విరమణ సమయానికి రూ.కోటి కార్పస్‌ను సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు.మార్కెట్లో జెరోధా, అప్‌స్టాక్స్, ఫైయర్స్, గ్రో, ఏంజిల్ బ్రేకింగ్.. వంటి చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు ఆన్లైన్ సేవలందిస్తున్నాయి. వీటితోపాటు ప్రముఖ బ్యాంకులు సైతం ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో మంచి ప్లాట్‌ఫ్లామ్‌ను ఎంచుకుని నెలకు రూ.1000 క్రమానుగత పెట్టుబడి(సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. 20-30 ఏళ్ల వయసు యువత ఈ విధానాన్ని సుమారు 40 ఏళ్లు పాటిస్తే ఏటా 12 శాతం వృద్ధితో ఆ డబ్బు ఏకంగా రూ.1,14,02,420 అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం..పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా 40 ఏళ్ల తర్వాత సమకూరే ఈ డబ్బు విలువ తగ్గిపోవచ్చు. అందుకు అనుగుణంగా ఏటా 10 శాతం పెట్టుబడి పెంచుకుంటూపోతే రిటైర్మెంట్ సమయానికి ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చని సలహా ఇస్తున్నారు. అంటే మొదటి ఏడాది నెలకు రూ.1000 సిప్ చేస్తే తర్వాత ఏడాదిలో నెలకు రూ.1,100 ఇన్వెస్ట్ చేయాలి. అయితే రూ.కోటి మార్కును చేరాలంటే మాత్రం క్రమశిక్షణతో 40 ఏళ్లపాటు పొదుపు పాటించడం చాలా ముఖ్యం. -
ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం..
తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వైద్య ఖర్చులకోసం ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటారు. అయితే పాలసీ తీసుకోవడం ముఖ్యం కాదు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే క్లెయిమ్ అయ్యేలా ఉండే బీమాను ఎంచుకోవడం అవసరం. పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆర్థిక భారం తప్పుతుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఎంత మొత్తం అవసరం..?ఏటా మెడికల్ బిల్లులు పెరుగుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 30-40 శాతం మేర మెడికల్ బిల్లులు అధికమవుతున్నాయి. అందుకు తగినట్లుగా మీ వయసు, మీపై ఆధారపడిన వారి పరిస్థితులకు అనుగుణంగా ఎంత మొత్తం పాలసీ కవర్ ఉండాలో నిర్ణయించుకోవాలి.క్లెయిమ్ సెటిల్మెంట్మార్కెట్లో ఆరోగ్య బీమా కంపెనీలు చాలానే ఉన్నాయి. తీవ్ర వ్యాధుల వైద్యానికి అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు రూ.లక్షల్లో ఉన్న క్లెయిమ్‌లు సెటిల్ చేయకుండా కొర్రీలు పెడుతున్నాయి. తక్కువ కవర్ ఉన్న పాలసీను క్లెయిమ్‌లు చేస్తూ సెటిల్మెంట్ రేషియోను పెంచుకుంటున్నాయి. అయితే ఈ వివరాలు ఐఆర్డీఏఐ అధికారిక వెబ్సైట్లో ఉంటాయి. వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. 90 శాతం కంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉండే కంపెనీలను ఎంచుకుంటే ఉత్తమం.రూమ్ లిమిట్మెడికల్ బిల్లులు, డాక్టర్ ఛార్జీలు, ఇతర సదుపాయాలకు అయ్యే ఖర్చులు మొత్తంగా ఆసుపత్రి రూమ్ రెంట్‌పై ఆధారపడుతాయి. ఉదాహరణకు పాలసీలో సింగల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అని సెలక్ట్ చేసుకుంటే దాని రెంట్‌కు అనుగుణంగానే ఇతర బిల్లులు చెల్లిస్తారు. అంతకుమించి ఖర్చు అయితే మాత్రం పాలసీదారులు భరించాల్సి రావొచ్చు. కాబట్టి రూమ్ రెంట్‌కు సంబంధించిన పరిమితులు ఉండకుండా చూసుకోవాలి.క్యాష్‌లెస్ ఆసుపత్రులుఉద్యోగ రీత్యా చాలామంది హైదరాబాద్, బెంగళూరు, ముంబయి.. వంటి నగరాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగం శాశ్వతం కాదు కదా. భవిష్యత్తులో సొంత ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినపుడు కూడా ఆసుపత్రులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటు ప్రస్తుతం మీరు ఉంటున్న ప్రాంతాల్లో దగ్గర్లో ఎలాంటి నెట్వర్క్ ఆసుపత్రులున్నాయో తెలుసుకోండి. పాలసీ నెట్వర్క్ హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుంటే కవరేజీ పరిమితి వరకు బీమా కంపెనీలే భరిస్తాయి. ఒకవేళ ప్రమాదం జరిగిన చోట నెట్వర్క్ ఆసుపత్రి లేకపోయినా కంగారు పడకూడదు. వైద్యం తర్వాత సదరు ధ్రువపత్రాలతో ఆ డబ్బును తిరిగి పొందవచ్చు.కో-పే మంచిదేనా..?కో-పే అందిస్తున్న బీమా పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. అయితే వైద్యం తీసుకున్నాక కో-పే ప్రకారం బీమా కంపెనీ కొంత, పాలసీదారులు ఇంకొంత చెల్లించాలి. ఎలాంటి కో-పే లేకుండా కొంత ప్రీమియం ఎక్కువైనా మొత్తం డబ్బు బీమా కంపెనీలే చెల్లించే సదుపాయాన్ని ఎంచుకోవాలి.రిస్టోరేషన్ సౌకర్యంపాలసీదారులు తమతోపాటు కుటుంబం సభ్యులకు కలిపి ఫ్యామిలీ ఫ్లోటింగ్ పాలసీ తీసుకుంటారు. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగి పాలసీ లిమిట్ మొత్తాన్ని వాడుకున్నారనుకోండి. మళ్లీ ఇంట్లో ఇంకొకరికి ఆరోగ్య సమస్యలు వస్తే పరిస్థితి ఏంటీ? అందుకే ఏడాదిలో ఎన్నిసార్లైనా బీమా మొత్తం తిరిగి రిస్టోర్ అయ్యే పాలసీని తీసుకుంటే మేలు.ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!ఇవీ గమనించండి..డేకేర్ ట్రీట్మెంట్ అందించే పాలసీలు ఎంచుకోవాలి.ఏదైనా అత్యవసర సమయాల్లో ఇంటివద్దే వైద్యం అందిచేలా ఉండాలి.అంబులెన్స్ ఛార్జీలు కవర్ అవ్వాలి.ఫ్రిహెల్త్ చెకప్ సౌలభ్యం ఉండాలి.డాక్టర్‌కు సంబంధించిన ఆన్లైన్ కన్సల్టేషన్ ఛార్జీలు అందించాలి.ఇప్పటికే ఉన్న జబ్బులకు తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండే పాలసీ బెటర్.పిల్లలు కావాలనుకునే వారు మెటర్నిటీ వైద్య ఖర్చులు కవర్ అయ్యే పాలసీ ఎంచుకుంటే మేలు. -
డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా
డెబిట్ కార్డు పోయిందా..ఏటీఎంకు కార్డు తెసుకెళ్లడం మర్చిపోయారా..డెబిట్ కార్డు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లారా.. మరేం పర్వాలేదు. మీరు ఉన్న ప్రాంతంలో ఏటీఎం ఉంటే ఎలాంటి డెబిట్ కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బు విత్‌డ్రా చేయాలో తెలుసుకుందాం.బ్యాంకింగ్ రంగ సేవల్లో టెక్నాలజీ విస్తరిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ చిన్న లావాదేవీలు చేయాలన్నా స్మార్ట్పోన్లోని యూపీఐని వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి.విత్‌డ్రా చేసుకోండిలా..ముందుగా మీ వద్ద యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ప్రస్తుతం చాలామంది గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి యూపీఐ ధర్డ్‌పార్టీ యాప్‌లను వాడుతున్నారు.మీ బ్యాంకు ఐసీసీడబ్ల్యూ సేవలందిస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి.ఒకవేళ ఈ సర్వీసు అందుబాటులో ఉంటే ఏటీఎం వద్దకు వెళ్లి స్క్రీన్‌పై ‘యూపీఐ నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోవాలి.ఏటీఎం ప్రొవైడర్‌ను బట్టి ఈ ఎంపిక విభిన్నంగా ఉండవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సులువుగానే దాన్ని గుర్తించవచ్చు.యూపీఐ విత్‌డ్రా సెలక్ట్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది.మీ ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలో ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ప్రెస్ చేయాలి. (యూపీఐ ద్వారా ఏటీఎం రోజువారీ విత్‌డ్రా పరిమితి సాధారణంగా రూ.10,000గా ఉంటుంది)కొంత సమయం తర్వాత బ్యాంకు సిస్టమ్ సర్వర్‌తో కనెక్ట్ అయి డబ్బు విత్‌డ్రా అవుతుంది.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానంలోని కీలకాంశాలు..ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. క్యూఆర్ కోడ్ మీ సమాచారాన్ని రక్షించడానికి ఎన్క్రిప్షన్ని ఉపయోగిస్తుంది. మీకు మాత్రమే తెలిసిన యూపీఐ పిన్‌తో లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు. -
కొత్త పెన్షన్ విధానానికి కేంద్రం ఆమోదం.. కీలకాంశాలు..
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్)ను అమలు చేసేలా విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఎస్ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. దాంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) స్థానంలో కొత్త యూపీఎస్‌ను అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.యూపీఎస్ విధానంలోని కీలకాంశాలు..ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం జమచేసి పెట్టుబడి పెట్టేది. ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారు. అయితే యూపీఎస్‌లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కనీస సర్వీసు 25 సంవత్సరాలు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హులు. ఒకవేళ 25 ఏళ్లు పూర్తి అవ్వకపోతే దామాషా ప్రకారం 10-25 ఏళ్లలోపు పెన్షన్ లెక్కించి ఇస్తారు.కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటేనే యూపీఎస్ కిందకు వస్తారు. అలా కేవలం పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కనిష్ఠంగా రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆపై 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. 25 ఏళ్ల సర్వీసు దాటితే పూర్తి పెన్షన్ వస్తుంది.ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కాబట్టి యూపీఎస్ కింద ఇచ్చే పెన్షన్‌లోనూ ఏటా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఇస్తారు. దాంతో కిందటి ఏడాది కంటే ప్రస్తుత ఏడాదికి ఎక్కువ పెన్షన్ అందుతుంది.యూపీఎస్ విధానంలో చేరిన పెన్షనర్లు మరణిస్తే అప్పటివరకు తాము తీసుకుంటున్న పెన్షన్‌లో 60 శాతం వారి భాగస్వామికి ఇస్తారు.యూపీఎస్ నిబంధనల ప్రకారం 1/10వ వంతు సుపర్ అన్యూయేషన్(మొత్తం సర్వీసును లెక్కించి చెల్లించే నగదు) చెల్లిస్తారు. బేసిక్ వేతనంలో 1/10వ వంతును పరిగణనలోకి తీసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సర్వీసు పూర్తయిన వెంటనే ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ చెల్లింపునకు, పెన్షన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.కొత్త యూపీఎస్ విధానానికి మారాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాలను అనుసరించి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు సిద్ధంగా ఉండాలి.నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే యూపీఎస్ కొంత మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను భర్తీ చేయదని కొందరు చెబుతున్నారు. ఇదిలాఉండగా, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతుండగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తిరాష్ట్రాల వాటాపై పర్యవేక్షణయూపీఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం కోరుతోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో కొన్ని రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటాను జమ చేయకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కేవలం గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బుమీదే ఆధారపడే ఉద్యోగులకు కొత్త విధానం కొంత ఊరట చేకూరుస్తుందనే వాదనలున్నాయి. కానీ ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలు తప్పకుండా వాటి వాటాను సైతం జమచేసేలా పర్యవేక్షణ ఉండాలని విశ్లేషకులు కోరుతున్నారు. -
పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..
పదవీ విరమణ అంటే కొందరికి సంతోషం, ఇంకొందరికీ భయం కలుగుతుంది. ఆర్థిక అవసరాలకు సరిపడే డబ్బును సమకూర్చుకున్నవారికి అది ఆనందం అయితే..ఎలాంటి పెట్టుబడులు, మిగులు లేనివారికి రిటైర్మెంట్ నరకమే. ఇటీవల ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వే ప్రకారం నలుగురిలో ముగ్గురు భారతీయులు తమ పదవీ విరమణ కోసం పొదుపు చేయడంలో విఫలమవుతున్నారని తేలింది. అయితే ముందు నుంచి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని మదుపు చేస్తే పదవీ విరమణ తర్వాత సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మానవ విలువలు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలంలో చాలామందికి తమ తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు పనిచేస్తున్నంత కాలం ఏదో కొంత డబ్బు సంపాదిస్తున్నారు కదా అని భరిస్తున్నారు. కానీ పదవీ విరమణ తర్వాత మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో పెరిగే అనారోగ్యంతో ఆర్థిక, మానసిక స్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా సురక్షితమైన, సంతృప్తికరమైన జీవితం గడపాలంటే కొన్ని నియమాలు పాటించాలి.పక్కా ప్రణాళికపదవీ విరమణ తర్వాత ఆదాయం నిలిచిపోతుంది. ఏటా ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్నాయి. మనుషులు ఆయుర్ధాయం అధికమవుతుంది. పనిచేస్తున్నపుడే పొదుపు పాటించాలి. అందుకోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దాంతో రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్య సంరక్షణ, ప్రయాణాలు..వంటి ఖర్చులను భరించడానికి పొదుపు చాలా అవసరం. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేపుడు మీ జీవనశైలి, అభిరుచులు, ఆసక్తులు, భవిష్యత్తు అవసరాలు, మీపై ఆధారపడినవారు, కుటుంబానికి చేయాల్సిన ప్రధాన బాధ్యతలు..వంటివి పరిగణనలోకి తీసుకుని పొదుపు చేయాలి.పెరుగుతున్న ఆయుర్ధాయంమారుతున్న ఆహార అలవాట్లు దృష్ట్యా చాలామందికి చిన్న వయసులోని బీపీ, షుగర్, కిడ్నీ..సమస్యలు మొదలవుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన తర్వాత ఈ సమస్యలు తీవ్రరూపం దాలుస్తాయి. దాంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ప్రస్తుతం మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనుషులు మరింత ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. కానీ అందుకు డబ్బు కావాల్సి ఉంటుంది. దాన్ని ముందుగానే అంచనా వేసి తగిన కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.పెట్టుబడి ఎక్కడ చేయాలంటే..పదవీ విరమణ ప్రణాళిక కోసం వివిధ పెట్టుబడి మార్గాలున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) వంటి స్థిరంగా రాబడినిచ్చే పథకాలున్నాయి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్)లో ఎక్కువ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా అధిక రాబడి ఉంటుంది. ఈక్వీటీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, స్థిరాస్తిలో మదుపు చేయవచ్చు.ఇదీ చదవండి: విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణితొందరపడండిపదవీ విరమణ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుగానే మదుపు చేయడం ప్రారంభించాలి. రిటైర్మెంట్ తర్వాత ఎంత డబ్బు అవసరమో లెక్కించడం, దీనికి అనువైన పొదుపును ఎంచుకుని పాటించడం ముఖ్యం. క్రమశిక్షణతో ముందుగానే మదుపు చేస్తే అధిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు. క్రమంగా కాలం గడుస్తున్న కొద్దీ అధిక పదవీ విరమణ నిధిని సమకూర్చుకోవచ్చు. -
భారత్‌తో సహా 34 దేశాలు.. శ్రీలంక సంచలన నిర్ణయం
సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసాతో అవసరం లేకుండా తమ దేశాలను సందర్శించవచ్చని గతంలో కొన్ని దేశాలు ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి శ్రీలంక కూడా చేరింది.శ్రీలంక ప్రభుత్వం 2024 అక్టోబర్ 1 నుంచి ఇండియా, యూకే, అమెరికా వంటి 35 దేశాల పౌరులకు వీసా అవసరం లేదని ప్రకటించింది. అంటే ఈ దేశ పౌరులు శ్రీలంకకు వీసా లేకుండానే వెళ్ళవచ్చు. ఈ విషయాన్ని శ్రీలంక టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో వెల్లడించారు.భారతదేశం, యుకె, చైనా, యుఎస్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, కజకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, బెలారస్, ఇరాన్, స్వీడన్, దక్షిణ కొరియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, న్యూజిలాండ్ దేశాల ప్రజలు వీసాతో పనిలేకుండానే శ్రీలంకను సందర్శించవచ్చు.శ్రీలంక ప్రభుత్వం వీసా రహిత సందర్శన అవకాశాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే అందిస్తుంది. దీనికి శ్రీలంక క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. శ్రీలంక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగానే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!
ఇష్టపడి కారు కొంటున్నారా.. భవిష్యత్తు ప్రమాదాల దృష్ట్యా వాహనబీమా కూడా చేయిస్తుంటారు కదా. ప్రమాదశాత్తు మీ కారు కీ పోయిందనుకోండి. ఏం చేస్తారు.. ‘ఏముంది నకిలీ కీ తయారు చేయిస్తాం’ అంటారా.. అయితే మీకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ వర్తించదనే సంగతి తెలుసా? నకిలీ కీ ఉంటే బీమా ఎందుకు రాదో.. కీ పోయినా బీమా వర్తించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.ముప్పే ఏళ్ల కిందట సైకిల్ వినియోగిస్తే మహాగొప్ప. బైక్ ఉందంటే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉండేది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం సైకిల్, బైక్‌ను ఎవరూ పట్టించుకోవడంలేదు. దాదాపు చాలామంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. కారు కొనే సమయంలో కంపెనీలు వాహనబీమా ఇస్తుంటాయి. అయితే అనుకోకుండా కారు కీ పోయిందనుకోండి. వెంటనే దాని నకిలీ తయారు చేయించి వాడుతుంటారు. కారు ఏదైనా ప్రమాదంబారిన పడినప్పుడు బీమా క్లెయిమ్ చేయడానికి వెళ్తారు. కానీ బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను రెజెక్ట్ చేస్తుంది. మీరు నకిలీ కీ వాడుతున్నట్లు రుజువవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటుంది.ఇదీ చదవండి: పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయంవాహన బీమా తీసుకునేప్పుడే ‘కారు కీ రీప్లేస్మెంట్’ యాడ్ఆన్ సర్వీసును తీసుకోవాలి. అందుకోసం కంపెనీను బట్టి రూ.250-రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును ఎంచుకుని ఉంటే ఒకవేళ భవిష్యత్తులో కారు కీ పోయినా దాన్ని కంపెనీ రీప్లేస్ చేస్తుంది. అలా రీప్లేస్ చేసిన కీ వాడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా కంపెనీ బీమాను క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కీ రీప్లేస్మెంట్ యాడ్ఆన్ సర్వీసును ఎంచుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. -
చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపు
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ఏదైనా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే లోన్లు మరింత సులభంగా లభించే వీలుంటుంది. అప్పు ఇచ్చే ముందు ప్రతి ఆర్థిక సంస్థ సిబిల్‌ను చెక్ చేస్తుంది. సిబిల్ 750 కంటే ఎక్కువ ఉంటే లోన్లు జారీ చేయడం సులభం. మరి ఈ సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలుసా.. ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. కార్డు బకాయిలు చెల్లించే సమయంలో చిన్న కిటుకు ఉపయోగిస్తే సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’క్రెడిట్‌కార్డు బిల్లు జనరేట్ అయ్యాక చెల్లింపు కోసం కొన్నిరోజులు గడువు ఇస్తారు కదా. అయితే కార్డు బిల్లును గడువులోపు ఒకేసారి పూర్తిగా చెల్లించకుండా, రెండు లేదా మూడు సార్లు చెల్లిస్తే సిబిల్ పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ నెల 15వ తేదీన రూ.10,000 కార్డు బిల్లు వచ్చిందనుకుందాం. చెల్లింపు గడువు తేదీ 30 అనుకుందాం. అయితే ఈ 15 రోజుల్లో రెండుసార్లు అంటే ఒకసారి రూ.6000, మరో 5-6 రోజులకు మిగతా రూ.4000 చెల్లించాలి. దీనివల్ల పేమెంట్ రికార్డు పెరుగుతుంది. దాంతో సిబిల్ అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకోవాలి. గడువులోపు కచ్చితంగా పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. -
అధికంగా వడ్డీ ఇస్తున్న చిన్న బ్యాంకులు
Best FD Rates: దేశంలో చాలా మంది అధిక రాబడుల కోసం ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. సాంప్రదాయ పెట్టుబడి మార్గాలను వదిలి కొత్త ఎంపికల కోసం చూస్తున్నారు. అయితే, మొత్తం పెట్టుబడిని మార్కెట్లో పెట్టే బదులు కొంత భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటిలో మదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.మరి ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ తక్కువ వస్తుంది కదా అని అపోహ పడవద్దు. ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక మాత్రమే కాకుండా వడ్డీ కూడా బాగానే వస్తుంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎఫ్డీపై ఎక్కువ వడ్డీ ఇస్తాయి.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న బ్యాంకులు కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఎఫ్డీపై ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం.నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్డీపై దేశంలోనే అత్యధిక వడ్డీని ఇస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ బ్యాంకులో 3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ ఖాతాను తెరిస్తే సంవత్సరానికి 9.5 శాతం వడ్డీని ఇస్తుంది.సూర్య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీపై అత్యధిక వడ్డీ ఇచ్చే విషయంలో రెండవ స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9.1 శాతం వడ్డీని ఇస్తోంది.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 3 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 9.1 శాతం వడ్డీని అందిస్తోంది.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 3 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75 శాతం వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీని అందించే బ్యాంకుల జాబితాలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు మూడేళ్ల ఎఫ్డీలపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఆఫర్ 3 సంవత్సరాల వ్యవధిలో చేసిన బ్యాంక్ ఎఫ్డీలకు కూడా వర్తిస్తుంది. -
ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!
సొంతిల్లు సామాన్యుడి కల.. కొందరికి అది పరువు మర్యాద.. ఇంకొందరికి తలకు మించిన భారం. కొత్తగా ఉద్యోగం వచ్చిన వారు బంధువుల ఇంటికి వెళితే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావని అడుగుతారు. పిల్లల పెళ్లిల్లు చేసినవారు వెళితే ‘అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా ఇల్లు తీసుకోండి’ అంటారు. సరపడా డబ్బు ఉండి సమాజంలో మరింత గౌరవం కోసం ఇల్లు తీసుకునే వారు కొందరైతే.. సమాజానికి భయపడి పక్కవారికి ఎక్కడ లోకువవుతామోనని ఇల్లు కొనేవారు కొందరు. ఇలాంటి వారు తమ ఆర్థిక స్తోమతకు మించి అప్పుచేసి ఇల్లు కొంటారు. అయితే చాలీచాలని జీతాలతో కాలం నెట్టుకొస్తున్నవారు ఇల్లు తీసుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.సాధారణంగా ఇల్లు కొనాలనుకునేవారు లోన్ తీసుకుంటారు. వచ్చే జీతంలో సగానికిపైగా ఈఎంఐలకు పోతుంది. కాబట్టి, ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ముందుగా ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఉండాలి.ప్రతినెల వచ్చే ఆదాయం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అప్పటికే ఏదైనా లోన్లు, ఇతర అవసరాలకు చెల్లించాల్సినవి ఉంటే అందుకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. తీరా ఇల్లు తీసుకుని ఈఎంఐలు చెల్లించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలవారీగా రుణాల మొత్తం ఎంతో లెక్క తీయండి. క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఇతర అప్పులు ఎంతనే వివరాలను తెలుసుకోవాలి.మారుతున్న జీవన శైలిలో భాగంగా భవిష్యత్తులో అవసరాలకు కొంత డబ్బును సమకూర్చుకోవాలి.పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం నగదు పోగు చేసుకోవాలి.ఉద్యోగం చేస్తూంటే ఏదైనా అనివార్య కారణాలతో జాబ్ పోయినా ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం డబ్బు కూడబెట్టాలి. అందుకోసం క్రమానుగత పెట్టుబడులను ఎంచుకుంటే మేలు.ఏదైనా అనారోగ్య పరిస్థితి తలెత్తితే కుటుంబ ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్య బీమా తీసుకోవాలి.ఇదీ చదవండి: కంటెంట్ తొలగించకపోతే అరెస్టు తప్పదు!కుటుంబం అంతా మనపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగి మనం చనిపోతే ఈఎంఐలు, అప్పులని ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తారు. కాబట్టి మంచి టర్మ్ పాలసీ తీసుకోవాలి. మనకు ఏదైనా జరిగితే మొత్తం డబ్బును చెల్లించేలా ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. -
ప్రాణాంతక వ్యాధులున్నా.. బీమా సొమ్ము!
తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. అందులోనూ క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటూంటారు. ఏదైన జబ్బుపడి ఆసుపత్రిలో చేరితేనే ఆ బీమా పరిహారం వస్తుంది. కానీ ట్రీట్మెంట్కు ముందు, తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడినపుడు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.క్రిటికల్ ఇల్నెస్ పాలసీలుక్యాన్సర్..లివర్..గుండెజబ్బు వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమికంగా గుర్తించినపుడే పరిహారం అందించే పాలసీలు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కేటగిరీలోకి వస్తాయి. ప్రమాదవశాత్తు ఏదైనా వ్యాధి బారిన పడినా పాలసీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. ఈ పాలసీలో భాగంగా బీమా సంస్థలు కనీసం రూ.5 లక్షల నుంచి బీమా అందిస్తున్నాయి. గరిష్ఠంగా ఎంత పాలసీ తీసుకోవాలనేది పాలసీదారుల ప్రత్యేక అవసరాలపై ఆధారపడుతుంది. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే బీమా కంపెనీలు డబ్బు చెల్లిస్తాయి. కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చాక కూడా వైద్య ఖర్చులు భరించే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: క్రూడ్ దిగుమతులు 40 శాతం పెంపు.. అయినా భారత్‌కు మేలే!ఒక్కో ప్రాణాంతక వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలున్నాయి. కుటుంబంలో తీవ్ర వ్యాధులున్నవారికి ఎలాంటి పాలసీ నప్పుతుందో దాన్నే తీసుకోవచ్చు. ఈ రోగాలకు నిత్యం వైద్యం అవసరమవుతూనే ఉంటుంది. కాబట్టి చాలిచాలని జీతాలు, ఆదాయాల వల్ల కుటుంబం చితికిపోకుండా ఉండాలంటే ఈ పాలసీలు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పాలసీ తీసుకునేముందు కచ్చితంగా అన్ని నిబంధనలు తెలుసుకోవాలంటున్నారు. -
క్రెడిట్ కార్డ్ క్లోజింగ్.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
ఈరోజుల్లో చాలా మందికి ఒకటి మించి క్రెడిట్ కార్డులు ఉండటం సాధారణమైపోయింది. బ్యాంకులు, ప్రవేటు సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో అవసరం లేకున్నా కొన్ని సార్లు క్రెడిట్ కార్డులు తీసుకుంటుంటారు. వీటికి వార్షిక రుసుములు లేకపోతే సమస్య లేదు కానీ, ఒక వేళ రుసుము చెల్లించాల్సి ఉంటే అవసరం లేనివాటిని క్లోజ్ చేసుకోవడం మంచిది. అయితే వీటిని ఎలా క్లోజ్ చేసుకోవాలి.. ఆర్బీఐ నిబంధనలు ఏమిటీ అన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..ఆర్బీఐ నిబంధనలురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాలి. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయలేకపోతే, 7 రోజుల వ్యవధి తర్వాత, దానిపై రోజుకు రూ. 500 జరిమానాను కస్టమర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి బకాయిలు ఉండకూడదు.క్రెడిట్ కార్డును క్లోజ్ చేయండిలా..» ఏదైనా క్రెడిట్ కార్డ్‌ని మూసివేసే ముందు దాని బకాయిలన్నింటినీ చెల్లించాలి. బకాయిలు ఎంత చిన్న మొత్తం అయినప్పటికీ, బకాయి మొత్తాన్ని చెల్లించే వరకు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేందుకు వీలుండదు.» క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలనే తొందరలో చాలా మంది తమ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయడం మర్చిపోతుంటారు. కార్డ్‌ను మూసివేసేటప్పుడు రివార్డ్ పాయింట్లను తప్పనిసరిగా రీడీమ్ చేసుకోండి» కొంతమంది బీమా ప్రీమియం, ఓటీటీ నెలవారీ ఛార్జ్ వంటి పునరావృత చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌పై స్టాండింగ్ సూచనలను పెట్టుకుంటుంటారు. కార్డ్‌ను మూసివేయడానికి ముందు, దానిపై అలాంటి సూచనలేవీ లేవని నిర్ధారించుకోండి.» అన్నీ సరిచూసుకున్నాక క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌ను సంప్రదించాలి. క్రెడిట్ కార్డ్ మూసివేయడానికి గల కారణాన్ని అడిగితే తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం క్రెడిట్ కార్డ్ క్లోజింగ్ అభ్యర్థన తీసుకుంటారు. ఒకవేళ బ్యాంక్ ఈమెయిల్ పంపమని అడగవచ్చు. కత్తిరించిన కార్డ్ ఫోటోను కూడా ఈమెయిల్ చేయమని అడగవచ్చు.» క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే దానిని ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రాస్‌గా కత్తిరించడం. అలా కాకుండా కార్డును ఎక్కడపడితే అక్కడ పడేయకండి. మీ కార్డు తప్పుడు చేతుల్లోకి వెళితే, దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. -
కోరికలు తీర్చే ‘ఫిష్’!
ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. కొనండి. కారు తీసుకోవాలనుకుంటున్నారా.. తీసుకోండి. విదేశాలు చుట్టేయాలనుకుంటున్నారా.. వెళ్లిరండి. పిల్లలను మంచి స్కూల్లో చేర్పించాలంటే.. చేర్పించండి.. అంతా బాగానే ఉంది కానీ, అన్నింటికీ డబ్బుకావాలని ఆలోచిస్తున్నారా. మరేం ఫర్వాలేదు. ఉద్యోగం చేస్తూనే అన్ని కోరికలు తీర్చుకోవచ్చు. ఎలా అంటారా? అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మదుపు ప్రారంభించాలి. ప్రధానంగా అందరికీ ‘ఫిష్’ గురించి తెలియాలి. అదేంటి చేప గురించి తెలిస్తే డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారేమో..కాదండి. ‘ఫిష్’ను పాటిస్తే దాదాపు మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అసలు ఈ ‘ఫిష్’ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.‘ఫిష్’ థియరీఎఫ్ఐ.ఎస్.హెచ్: ఫిష్..ఆర్థిక ప్రణాళిలో ఈ ఫిష్ థియరీని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫిష్ థియరీను మూడు భాగాలుగా విభజించారు.ఎఫ్ఐ: ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ఎస్: సేవింగ్స్హెచ్: హ్యాపీ టు స్పెండ్ఎఫ్ఐ: ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్బ్యాంకు అకౌంట్లో జీతం పడగానే నెలవారీ స్థిర ఖర్చుల కోసం(ఎఫ్ఐ) డబ్బు వెచ్చించాలి. అందులో ప్రధానంగా ఇంటి అద్దె, ఇంటర్నెట్ బిల్లు, సరుకులు, ఫోన్ బిల్లు..వంటి ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా. ఒకవేళ నెల మధ్యలో అమాంతం వాటి విలువ పెరిగినా ఓ పదిశాతం అధికంగా ఖర్చు చేసే వీలుంటుంది. అందుకు అనువుగా బడ్జెట్ కేటాయించుకోవాలి. అయితే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి జీతంలో యాభైశాతానికి మించకుండా జాగ్రత్త వహించాలి.ఎస్: సేవింగ్స్భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు(ఎస్) చేయాలి. వేతనంలో 50 శాతం ‘ఎఫ్ఐ’కు కేటాయించాక మిగిన దాని నుంచి 30 శాతం ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్ ప్లాన్, హెల్త్‌పాలసీ, టర్మ్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ కోసం కేటాయించాలి. ఎలాంటి మార్గాల్లో మదుపు చేయాలనే అంశంపై నిపుణులతో చర్చించాలి.ఇదీ చదవండి: మారుతున్న ప్రచార పంథాహెచ్: హ్యాపీ టు స్పెండ్ఇక మిగిలిన 20 శాతం జీతాన్ని ఆనందాలకు, అభిరుచులకు ఖర్చు పెట్టుకోవచ్చు. విందూ వినోదాలకు వెచ్చించవచ్చు. సినిమాలు, షికార్లు, షాపింగ్..వంటి వాటికి ఏంచక్కా ఖర్చు చేసుకోవచ్చు. కానీ పైన తెలిపిన విధంగా ఇతర వాటికి డబ్బు కేటాయించిన తర్వాతే మిగతా సొమ్మును ఖర్చు పెట్టాలి. ఒక్కసారి ఈ ‘ఫిష్’ థియరీను ఆకలింపు చేసుకుని ప్రయోగాత్మకంగా కొన్ని నెలలు పాటిస్తే ఆర్థిక జీవితంలో మార్పు గుర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు.