Education
-
Hetvi Khimsuriya: బంగారంలాంటి బిడ్డ
గుజరాత్‌లోని వడోదరకు చెందిన హెత్వి ఖిమ్సూరియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పీఎం నేషనల్ చైల్డ్ అవార్డ్ (ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–పీఎంఆర్బీపి) అందుకుంది. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారం ఇది. పదమూడు సంవత్సరాల హెత్వి సెరిబ్రల్ పాల్సీని అధిగమించి పెయింటింగ్, పజిల్ సాల్వింగ్‌లో అసా«ధారణ ప్రతిభ చూపుతోంది. తనకు వచ్చే పెన్షన్‌ను దివ్యాంగుల సంక్షేమ నిధికి ఇస్తోంది. తన ఆర్ట్‌పై యూట్యూబ్ చానల్ నడుపుతోంది.... వడోదరలోని 8–గ్రేడ్ స్టూడెంట్ హెత్వి ఖిమ్సూరియాకు పురస్కారాలు కొత్త కాదు. ప్రశంసలు కొత్తకాదు. గత సంవత్సరం ఫ్రీహ్యాండ్ పెయింటింగ్, క్రాఫ్ట్, పజిల్ సాల్వింగ్‌లో చూపుతున్న ప్రతిభకు ‘గుజరాత్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. ‘వరల్డ్స్ ఫస్ట్ సీపీ గర్ల్ విత్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్’ టైటిల్ సాధించింది. వంద ఎడ్యుకేషనల్ పజిల్స్ సాల్వ్ చేసిన ఫస్ట్ సీపీ గర్ల్‌గా ఆమెను ‘ది లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు సాధించిన హెత్వి గీసిన చిత్రాలు యాభై ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి. చిత్రకళలపై పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి ‘స్పెషల్ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ–హెత్వి ఖిమ్సూరియా’ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. హెత్వి విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ‘అయ్యో! మీ అమ్మాయి’ అంటూ ఎంతోమంది సానుభూతి చూపే సమయాల్లో ‘బాధ పడాల్సిన అవసరం ఏముంది. మా అమ్మాయి బంగారం. భవిష్యత్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడండి’ అనేవారు. ఆ మాట అక్షరాలా నిజమైంది. చిన్నప్పటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. హెత్విని చూసుకోవడానికి ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. రంగులు, పజిల్స్‌తో బేసిక్స్ ప్రారంభించారు. రంగులు, పజిల్స్ అంటే హెత్విలో ఇష్టం ఏర్పడేలా చేశారు. బొమ్మలు వేస్తున్నప్పుడు, పజిల్స్ పరిష్కరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్లలో శక్తి కనిపిస్తుంది. ఆ శక్తితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులలో నింపింది. హెత్వి మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే ఈ చిన్నారి బలం. హెత్వి ఖిమ్సూరియా మర్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్‌ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో చేరి, నా కెరీర్‌ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్‌ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్‌గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్‌ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్‌లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్‌లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్‌దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్‌దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్‌దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్‌దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్‌దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్‌దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్‌దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్‌దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్‌దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్‌దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
AP: విదేశాల్లో చదువుతున్నారా? ఉచిత బీమా పథకాన్ని సద్వినియోగించుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తీగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం 15 జనవరి 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోగలరు. (ఇంతకుముందు సంవత్సరానికి రూ.180 ల ప్రీమియంగా ఉండేది). లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపుతున్నారు. అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా. ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము... విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలకు గురవ్వడం అత్యంత బాధాకరం. ఈ బీమా లో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. విద్యార్థులు, లేదంటే వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమా లో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. ఈ పథకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ బీమా వలన ముఖ్య ప్రయోజనాలు ► బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ► ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లింపు ► ప్రమాదం/అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే, స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు ... ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు కొరకు APNRTS 24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించండి మరియు వెబ్ సైట్-బీమా పేజి https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వండి. లేదా insurance@apnrts.com; helpline@apnrts.com కు ఇమెయిల్ చేయండి. ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ ని సందర్శించండి. -
MPhil కోర్సులపై UGC కీలక హెచ్చరిక
ఢిల్లీ: మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ(MPhil) కోర్సులపై యూనివర్సిటీ గ్రాండ్స్ కమీషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసీంది. ఎంఫీల్(MPhil)కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ ఆర్. జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు యూనివర్సిటీలు ఇచ్చే ఎంఫీల్ (MPhil) ప్రోగ్రామ్‌కు ఎటువంటి గుర్తింపు లేదని (UGC)యూజీసీ వెల్లడించింది. ఎంఫీల్(MPhil)ను రద్దు చేసినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నందున విద్యార్థులు ఎవరూ చేరవద్దని పేర్కొంది. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి 2023-2024 విద్యా సంవత్సరంలో ఎంఫీల్(MPhil) అడ్మిషన్లు నిలిపిలి వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 2022 నాటి యూజీసీ నిబంధనలను గుర్తు చేస్తూ.. ఎంఫీల్(MPhil)కు గుర్తింపు లేదని యూజీసీ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ విమర్శలు -
ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బాంబే)కి పూర్వ విద్యార్థులు భారీగా విరాళం అందించారు. 1998 బ్యాచ్‌కి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రూ. 57 కోట్లు ప్రకటించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 1971 బ్యాచ్ విద్యార్థులు ఇచ్చిన రూ. 41 కోట్లకన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ ఫిఫ్టీన్ ఎండీ శైలేంద్ర సింగ్, గ్రేట్ లెరి్నంగ్ సీఈవో మోహన్ లక్కంరాజు, వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ తదితరుల 1998 బ్యాచ్‌లో ఉన్నారు. ఈ నిధులు సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడగలవని ఐఐటీ బాంబే డైరెక్టర్ శుభాశీస్ చౌదరి తెలిపారు. అలాగే 2030 నాటికల్లా ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్న లక్ష్య సాకారానికి కూడా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
25 ఏళ్లు..23 అటెంప్ట్‌లు..చివరికి సాధించాడు
భోపాల్: అతడొక సెక్యూరిటీ గార్డు.. అతడి నెల సంపాదన రూ.5 వేలు. కానీ అతడిప్పుడు పట్టుదలకు, ధృడ నిశ్చయానికి, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో నివిసించే 56 ఏళ్ల ఆసెక్యూరిటీ గార్డు పేరు రాజ్‌కరణ్ బారువా. ఇంతకీ అతడి గొప్పేంటంటే ఎమ్మెస్సీ మ్యాథ్స్ పీజీ డిగ్రీలో పాసవ్వాలనే కల కోసం 25 ఏళ్లు వేచి చూశాడు. 25 ఏళ్లలో 23 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. 24వసారి విజయం సాధించాడు. మ్యాథ్స్‌లో పీజీ సాధించి కల నెరవేర్చుకున్నాడు. నిజానికి 1996లోనే అతనికి ఆర్కియాలజీలో మొదటి పీజీ వచ్చింది. అప్పుడే అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ మ్యాథ్స్‌లో రెండో పీజీ సాధించడం అతడి కల. కల కోసం పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ 25 ఏళ్లలో అతడు రాత్రి సెక్యూరటీగార్డుగా, పగలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ చదివాడు. ‘నాకు ఇంఘ్లీష్ పెద్దగా రాదు. ఇదే నాకు మ్యాథ్స్ పీజీ పాసవడానికి అడ్డంకిగా మారింది. ప్రతిసారి ఒక్క సబ్జెక్టు తప్ప అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ చివరికి ఇండియన్ ఆథర్ రాసిన పుస్తకాలు చదవి పాసయ్యాను. నేను పరీక్షలు రాస్తున్నట్టు పనిచేసే చోట ఎవరికీ చెప్పే వాడిని కాదు. ఎవరికి తెలియకుండా రాత్రి వేళల్లో చదువుకునేవాడిని. అప్పుడు కూడా ఎవరైనా పని ఉందని పిలిస్తే వెళ్లి పనిచేసేవాడిని. నేను పెళ్లి చేసుకోలేదు. కానీ నా కలలతోనే నాకు పెళ్లి జరిగింది’అని బారువా చెప్పుకొచ్చాడు. ఇదీచదవండి..ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్ -
Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?
యూ ట్యూబ్ తెరుస్తున్న కొత్త ద్వారాలు చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఒక బర్రెలక్క ఉన్నట్టుగానే ఉత్తర ప్రదేశ్‌లో ఒక టీచరక్క ఉంది. ఇంటర్ మాత్రమే చదివిన వ్యవసాయ కూలీ యశోదా లోధి ఇంగ్లిష్ మీద ఆసక్తితో నేర్చుకుంది. ‘నాలాగే పల్లెటూరి ఆడవాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాలి’ అనుకుని ఒకరోజు పొలం పని చేస్తూ, ఇంగ్లిష్ పాఠం వీడియో విడుదల చేసింది. ఇవాళ దాదాపు మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఆమె ఇంగ్లిష్ పాఠాలను నేర్చుకుంటున్నారు. యశోదా లోధి సక్సెస్ స్టోరీ. ‘కట్ టు ద చేజ్’ అంటే ఏమిటి? ‘బై ఆల్ మీన్స్’ అని ఎప్పుడు ఉపయోగించాలి? ‘అకేషనల్లీకి సమ్టైమ్స్కి తేడా ఏమిటి?’... ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మంచినీళ్లు తాగినంత సులభంగా ఇంగ్లిష్ మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది ఒక పల్లెటూరి పంతులమ్మ. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు నేర్పుతూ. చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. అది కూడా హిందీ మీడియమ్‌లో. కాని యశోదా లోధి వీడియోలు చూస్తే ఆమె అంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు మాట్లాడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించేలా చేయడమే ఆమె సక్సెస్. ఆమె యూట్యూబ్ చానల్ సక్సెస్. ఇంగ్లిష్ విత్ దేహాతీ మేడమ్ ‘దెహాత్’ అంటే పల్లెటూరు అని అర్థం. యశోదా లోధి ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సిరాతు నగర్ అనే చిన్న పల్లెటూళ్లో ఉంటోంది. అందుకే తన యూట్యూబ్ చానల్‌కు ‘ఇంగ్లిష్ విత్ దెహాతి మేడమ్’ అనే పేరు పెట్టుకుంది. ఆమె ఇంగ్లిష్ పాఠాలకు ఇప్పటికి రెండున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు... ఆమెను చూసిన ధైర్యంతో చాలామంది గృహిణులు ఇంగ్లిష్ ఎంతో కొంత నేర్చుకుని ఆమెతో లైవ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఇంగ్లిష్ మన భాష కాదు, మనం మాట్లాడలేము అనుకునే పల్లెటూరి స్త్రీలకు, గృహిణులకు యశోద గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంది. 300 రూపాయల రోజు కూలి యశోద కుటుంబం నిరుపేదది. చిన్నప్పటి నుంచి యశోదకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని డబ్బులేక అతి కష్టమ్మీద ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్త ఎనిమిది వరకు చదివారు. ఆడపడుచులు స్కూలు ముఖం చూడలేదు. అలాంటి ఇంటికి కోడలైంది యశోద. పల్లెలో భర్తతో పాటు బంగాళదుంప చేలలో కూలి పనికి వెళితే రోజుకు రూ. 300 కూలి ఇచ్చేవారు. మరోవైపు భర్తకు ప్రమాదం జరిగి కూలి పని చేయలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలా... కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా... అని తీవ్రంగా ఆలోచించేది యశోద. ఒంటి గంట నుంచి మూడు వరకు పల్లెలో ఇంటి పని, పొలం పని చేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు దొరికే ఖాళీలో మాత్రమే యశోద వీడియోలు చేస్తుంది. ‘మా ప్రాంతంలో నెలంతా సంపాదిస్తే 9 వేలు వస్తాయి. చాలామంది పిల్లలకు మంచి చదువు లేదు. నేను యూట్యూబ్‌లో బాగా సంపాదించి అందరికీ సాయం చేయాలని, మంచి స్కూల్ నడపాలని కోరిక’ అంటుంది యశోద. పల్లెటూరి వనితగా ఎప్పుడూ తల మీద చీర కొంగును కప్పుకుని వీడియోలు చేసే యశోదకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం కూడా చాలా బాగా ఉంది. ఇది నేటి పల్లెటూరి విజయగాథ. గతి మార్చిన స్మార్ట్‌ఫోన్ ‘2021లో స్మార్ట్‌ఫోన్ కొనడంతో నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకూ నాకు ఈమెయిల్ క్రియేట్ చేయడం తెలియదు, యూట్యూబ్ చూడటం తెలియదు. కాని ఫోన్ నుంచి అన్నీ తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు వినేదాన్ని. నాకు అలా మోటివేషనల్ స్పీకర్ కావాలని ఉండేది. కాని నా మాతృభాషలో చెప్తే ఎవరు వింటారు? అదీగాక నా మాతృభాష కొద్దిమందికే. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరినైనా చేరవచ్చు అనుకున్నాను. అలా ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఇంగ్లిష్ నేర్పించే చానల్స్ చూడసాగాను. నేర్చుకుంటూ వెళ్లాను. అలా నేర్చుకుంటున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నాలాగా ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే పేద మహిళలు, పెద్దగా చదువుకోని మహిళలు ఉంటారు... వారి కోసం ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలి అని. నేను ఆశించేదీ, అందరు మహిళలు చేయాలని కోరుకునేదీ ఒక్కటే... భయం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడటం. అది కష్టం కాదు. నేను నేర్చుకున్నాను అంటే అందరికీ వస్తుందనే అర్థం’ అంటుంది యశోద. -
ప్రణాళికతోనే కెరీర్ బంగారం
మనీష్ అరోరా (46) ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ‘ఆద్య’ ఉంది. ఆమెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలన్నది అరోరా కల. కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఆద్య రెండు నెలల క్రితమే యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్(చికాగో)లో సైకాలజీలో అండర్‌గ్రాడ్యుయేషన్ సీటు సంపాదించింది. అందుకు కావాల్సిన వ్యయాలను అరోరా ముందు చూపుతో సమకూర్చుకున్నారు. ఆద్య చదివే కోర్స్ వ్యయం భారీగా ఉన్న ప్పటికీ, ముందస్తు స్పష్టత అరోరాకు మార్గాన్ని చూపించింది. తమ పిల్లలకు వీలైనంతలో అత్యుత్తమ విద్యను అందించాలని అధిక శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఆచరణలో అంత సులభం కాదు. ప్రణాళికతోనే ఇది సాధ్యం. కెరీర్ ఆప్షన్లు, చేయాల్సిన కోర్స్‌లు, అయ్యే వ్యయం, కాల వ్యవధి ఇలా పలు అంశాలపై స్పష్టత, ప్రణాళికతోనే విజయం సాధించగలరు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కథనమే ఇది. బోలెడు ఆప్షన్లు గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులు చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భిన్నమైన కోర్సులు ఎంపిక చేసుకుంటుంటే, విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నూతన తరం కోర్సులకు సంబంధించి కెరీర్ ఆప్షన్లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫైనాన్స్, డేటా అనలైటిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, కాగ్నిటివ్ సైన్స్, మెరైన్, సైకాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ ఇవన్నీ ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్లుగా మారుతున్నాయి. ‘‘గేమ్ డిజైనింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)కు ఆదరణ పెరుగుతోంది. ఎక్కువ శాతం కెరీర్ ఆప్షన్లు సోషల్ మీడియా నుంచి ఉంటున్నాయి. వీడియో ఎడిటింగ్‌కు సైతం డిమాండ్ పెరుగుతోంది’’అని మ్నెమోనిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ అడ్మిషన్స్ సంస్థ అధినేత శిరీష్ గుప్తా తెలిపారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, కంటెంట్ తయారీ వంటివన్నీ బంగారం వంటి అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి. ‘‘వచ్చే పదేళ్ల కాలానికి సంబంధించి 85 శాతం ఉద్యోగాలు ఇంకా ఆవిష్కృతం కావాల్సి ఉంది. సంప్రదాయ ఉద్యోగాల నుంచి నిరంతరం మారాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగం దాదాపు ఉండకపోవచ్చు. అది రిటైల్ అయినా లేక ఈ కామర్స్ అయినా కృత్రిమ మేథ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుంది’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ సహ వ్యవస్థాపకురాలు నీతి శర్మ తెలిపారు. అంటే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగై పోతాయని అనుకోవద్దు. అస్థిరతలు వద్దనుకునే వారు ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు వెళుతుండడాన్ని గమనించొచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, చరిత్రకారుల అవసరం భవిష్యత్తులోనూ ఉంటుంది. కానీ, ఆటోమేషన్, ఏఐ కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పుగా మారడం ఖాయం. లోగో, గ్రాఫిక్ డిజైనింగ్ పనులు ఆటోమేషన్‌కు మారుతున్నాయి. ట్రాన్స్‌లేటర్లు, టెలీ మార్కెటర్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. యంత్రాలు అంత సులభంగా చేయలేని నైపుణ్యాలు, కోర్సులను చేసే దిశగా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గుప్తా సూచించారు. విద్య, ఉపాధిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సాయంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే మెరుగైన విద్యా అవకాశాల కోసం విదేశాలకు పంపించడాన్ని కూడా పరిశీలించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొదటి పుట్టిన రోజు నుంచే.. పిల్లల ఉన్నత విద్యకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు ఉన్న సులభ మార్గం వారి మొదటి పుట్టిన రోజు నుంచి ఆరంభించడమే. దీనివల్ల పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం మిగిలి ఉంటుంది. నెలవారీ పరిమిత మొత్తంతో పెద్ద నిధిని సమకూర్చుకోగలరు. ఇందుకు గాను ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌ను ముందే సంప్రదించి తమకు అనుకూలమైన (తగిన) ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కేవలం ఉన్నత విద్య అనే కాకుండా వారి వివాహాలకు సంబంధించి కూడా విడిగా ప్రణాళిక అవసరం. భారీ ఖర్చులకు సంబంధించి ముందు నుంచే ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలవారీ బడ్జెట్‌పై పెద్ద భారం పడదు. పెట్టుబడుల్లో అధిక శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. 10–15 ఏళ్ల కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కొంత మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలకు) వంటి సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. పిల్లల ఉన్నత విద్యకు మిగిలి ఉన్న కాల వ్యవధి, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రాబడులు అనే అంశాల ఆధారంగా నిపుణులు వివిధ సాధనాలను సూచిస్తుంటారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్య ఆగిపోకూడదు. అందుకని మెరుగైన కవరేజీతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో పిల్లలను కూడా భాగం చేయడం, లేదంటే వారి పేరిట ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఎంతో అవసరం. స్కాలర్ షిప్/విద్యారుణం దేశ, విదేశీ యూనివర్సిటీలు చాలా వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తున్నాయి. యూనివర్సిటీ వెబ్సైట్లను సందర్శించి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. విదేశాల్లోనూ చాలా యూనివర్సిటీలు స్కాలర్షిప్లు, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. పేరొందిన ట్రస్ట్‌లు కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు తమ వంతు ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఉన్న మార్గాలను తెలుసుకుని ఉండడం మంచిది. కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెషనల్ డిగ్రీలకు అనుబంధంగా అప్రెంటిషిప్ అవకాశం కలి్పస్తున్నాయి. దీనివల్ల ప్రత్యక్ష అనుభవంతోపాటు కొంత ఆర్థిక మద్దతు లభించినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు యూనివర్సిటీ కోర్సులకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్‌లు అనుబంధంగా ఉన్నాయి. ఉన్నత విద్యా కోర్సులకు సరిపడా సమకూర్చుకోలేని వారు విద్యా రుణాన్ని కూడా పరిశీలించొచ్చు. చిన్న మొత్తం అయితే ఎలాంటి ష్యూరిటీ అవసరం పడదు. పెద్ద మొత్తంలో రుణం తీసుకునేట్టు అయితే ఆస్తుల తనఖా, గ్యారంటీలను బ్యాంకులు కోరొచ్చు. ఇందుకు కూడా ముందుగానే సిద్ధమవ్వాలి. విద్యా రుణాలపై వడ్డీ రేటు 9–15 శాతం మధ్య ఉంది. పిల్లల విద్య పూర్తయి, ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు కోర్సు ఫీజులో 80–90 శాతం వరకు రుణంగా ఇస్తున్నాయి. పిల్లలు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ అవకాశాలను వినియోగించుకోవడం మరొక మార్గం. పెరిగిపోతున్న వ్యయాలు అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకమైన కోర్సులకు డిమాండ్, ఇందుకు మెరుగైన వసతుల కల్పన కారణంగా దేశ, విదేశాల్లో కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.50వేలకే పూర్తయ్యే ఎంబీఏ కోర్స్ నేడు రూ.5 లక్షలకు చేరడం ఇందుకు ఓ నిదర్శనం. ఐఐఎంలలో ఫీజులు రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉన్నాయి. గతంలో ఇవి రూ.6 లక్షల స్థాయిలోనే ఉండేవి. ఐఐటీలోనూ కోర్సు ఫీజు రూ.6–10 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో ఫీజుల పెరుగుదల 100 శాతానికి పైనే ఉంటోంది. విదేశాల్లోనూ ఫీజుల పెరుగుదల ఇదే మాదిరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా డాలర్ మారకం రేటు అధికంగా ఉండడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ‘‘దశాబ్దం క్రితం విదేశాల్లో ఏడాది విద్యా వ్యయాలు రూ.25–30 లక్షల మధ్య ఉండేవి. ఇప్పుడు రూ.50 లక్షలకు చేరాయి’’అని గుప్తా తెలిపారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫీజు దశాబ్దం క్రితం రూ.కోటి స్థాయిలో ఉంటే, ఇప్పుడు అది రెట్టింపైంది. కేవలం ట్యూషన్ ఫీజుల వల్లే కాకుండా, జీవన వ్యయాలు కూడా పెరిగిపోవడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. కాకపోతే విదేశీ విద్యకు సంబంధించి నూరు శాతం స్కాలర్షిప్ పొందే అవకాశం కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం సొంతం చేసుకోవాలంటే విదేశీ విద్యా ప్రవేశానికి మూడేళ్ల ముందు నుంచే తమ ప్రొఫైల్‌పై పని చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘నూతనతరం కోర్సులు అయితే సాధారణంగా ఏటా రూ.5–10 లక్షల మధ్య ఫీజు ఉంటుంది. ఢిల్లీలోని పెర్ల్ అకాడమీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూఐ/యూఎక్స్ (యూజర్ ఇంటర్ఫేజ్/యూజర్ ఎక్స్‌పీరియెన్స్) కు ఏటా రూ.7 లక్షల ఫీజు ఉంది’’అని గుప్తా వెల్లడించారు. కోర్సుకు సంబంధించి ట్యూషన్ ఫీజు కేవలం ఒక భాగమే. పిల్లల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు కోసం తల్లిదండ్రులు అదనంగా ఖర్చు చేయక తప్పదు. కాలం చెల్లిన కరిక్యులమ్ నేపథ్యంలో, పిల్లలకు సమాంతరంగా నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని గుప్తా అంటున్నారు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశానికి దూరంగా, ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తే అప్పుడు వారి జీవనం కోసం మరింత వ్యయం చేయాల్సి వస్తుంది. ఇక విదేశాలకు పంపించే వారిపై ఈ భారం మరింత పెరుగుతుంది. వసతి, ఆహారం, లాండ్రీ, ఇంటర్నెట్, మొబైల్, వస్త్రాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జీవనం, రవాణా వ్యయాలు, యుటిలిటీలు (విద్యుత్, టెలిఫోన్), ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అరిజిత్ సేన్ పేర్కొన్నారు. భయపెట్టే అంచనాలు చారిత్రకంగా చూస్తే గడిచిన దశాబ్ద కాలంలో కోర్సుల ఫీజులు నూరు శాతానికి పైగా పెరిగాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహా పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘కోర్సుల ఫీజుల పెరుగుదల వచ్చే దశాబ్దం పాటు ఇదే మాదిరిగా ఉంటుంది. జీడీపీ 6 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వెళితే, దీనికి అనుగుణంగా సగటున పెరిగే కుటుంబాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, విద్యా వ్యయం 10 శాతం చొప్పున పెరుగుతూ వెళ్లినా.. ఫీజులు, విద్యా రుణాలు భారంగా మారతాయి’’అని నీతి శర్మ పేర్కొన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి ప్రత్యామ్నాయాల రూపంలో రవాణా, జీవన వ్యయాల వంటివి ఆదా చేసుకునే అవకాశం ఉందని శర్మ వివరించారు. ‘‘ప్రతిష్టాత్మక కాలేజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ చేసేందుకు ఇప్పుడు ఏటా రూ.12–15 లక్షల వరకు ఖర్చవుతోంది. విద్యా ద్రవ్యోల్బణం 10–12 శాతం ఉంటుందన్న అంచనా ఆధారంగా వచ్చే పదేళ్లలో ఇది రూ.40 లక్షలకు చేరొచ్చు. ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీకి నేడు రూ.కోటి అవుతుంటే పదేళ్ల తర్వాత రూ.3 కోట్లు వ్యయం చేయాల్సి రావచ్చు’’అని అరిజిత్ సేన్ తెలిపారు. అనుసరణీయ మార్గాలు.. ఖరీదుగా మారుతున్న ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. కాలేజీ ప్రవేశానికి రెండేళ్ల ముందు నుంచే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. విదేశాలకు పంపించేట్టు అయితే అక్కడి జీవన పరిస్థితులు, సంస్కృతి, దరఖాస్తు ప్రక్రియ, ఎదురయ్యే సవాళ్లపై అవగాహన తెచ్చుకోవాలి. కనుక ఈ విషయంలో నిపుణుల సాయం తప్పనిసరి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ చదువులకు సంబంధించి ప్రస్తుత వ్యయాలు. తమ పిల్లల ఉన్నత విద్యకు ఇంకా ఎన్నేళ్ల కాల వ్యవధి మిగిలి ఉంది? ఎలాంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవాలి, అక్కడి ప్రస్తుత ఫీజులు, తమ పిల్లలు కాలేజీ ప్రవేశం పొందే నాటికి ఎంత మేర పెరగొచ్చనే విషయాలపై స్పష్టత అవసరం. దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కోర్స్ వ్యయం, ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు, రవాణా వ్యయాలు, స్కాలర్షిప్ ఉన్న అవకాశాలు, మెరుగైన విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలను వారి నుంచి తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు కాలేజీకి వచ్చే నాటికి వారి ఆసక్తులు ఎలా ఉంటాయన్నది ముందే గుర్తించడం అసాధ్యం. కనుక భవిష్యత్‌లో వారు ఏ కోర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తారన్నది ముందుగా తెలియదు. అందుకని ఖరీదైన కోర్స్‌కు సంబంధించి సన్నద్ధం కావడం మంచిది. -
Kudumbashree Mission: బడి రెక్కలతో మళ్లీ బాల్యంలోకి...
ఆ క్లాసురూమ్‌లో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దం. స్కూల్ యూనిఫామ్‌లో మెరిసిపోతున్న విద్యార్థులు టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. పాఠం పూర్తయిన తరువాత ‘ఏమైనా డౌట్స్ ఉన్నాయా?’ అని టీచర్ అడిగితే ఒక్కొక్కరు తమ డౌట్స్‌ను అడగడం మొదలు పెట్టారు...‘ఈ దృశ్యంలో విశేషం ఏముంది... అన్ని స్కూళ్లలో కనిపించేదే కదా’ అనే డౌటు రావచ్చు. అయితే ఈ క్లాస్‌రూమ్‌లో కూర్చున్న విద్యార్థులు పిల్లలు కాదు. ముప్ఫై నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు. ఏవో కారణాల వల్ల చదువును మధ్యలోనే మానేసిన వీరు ‘బ్యాక్–టు–స్కూల్’ ప్రోగ్రామ్‌తో మళ్లీ బడిపిల్లలయ్యారు.... దేశంలోనే పెద్దదైన స్వయం సహాయక బృందం ‘కుదుంబశ్రీ మిషన్’ చదువును మధ్యలోనే మానేసిన మహిళలను తిరిగి స్కూల్‌కు తీసుకువచ్చే విధంగా రెండు నెలల పాటు విస్తృత ప్రచారం చేసింది. మెసేజ్‌లు, పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించింది. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. కేరళలోని 14 జిల్లాలలోని రెండువేలకు పైగా స్కూల్స్‌లో తిరిగే స్కూల్లిల్ (బ్యాక్ టు స్కూల్) కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు వీకెండ్ క్లాస్‌లకు హాజరవుతున్నారు. ‘నా వయసు యాభై సంవత్సరాలు దాటింది. పెళ్లివల్ల పదవతరగతి పూర్తి కాకుండానే చదువు మానేయవలసి వచ్చింది. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా వీకెండ్ క్లాస్‌కు హాజరయ్యే ముందు అందరూ నవ్వుతారేమో అనిపించింది. నవ్వడానికి నేను చేస్తున్న తప్పేమిటి? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ క్లాసులకు హాజరవడానికి ముందు మామూలు సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎలాగో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం డిజిటల్‌కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాంకు వ్యవహారాల్లో నేర్పు సంపాదించాను. ఒకప్పుడు ఇతరులు ఎవరైనా నాతో వస్తేనే బ్యాంకుకు వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం సొంతంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాను. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. స్కూల్ ద్వారా ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నాను’ అంటుంది కొట్టాయం జిల్లాకు చెందిన నీల. ‘బ్యాక్ టు స్కూల్’ వీకెండ్ క్లాస్‌లు అకడమిక్ పాఠాలకే పరిమితం కావడం లేదు. సుపరిపాలన, స్త్రీ సాధికారత, కష్టాల్లో ఉన్న వారికి కలిసికట్టుగా సహాయం చేయడం... ఇలా ఎన్నో సామాజిక, సేవా సంబంధిత చర్చలు క్లాస్‌రూమ్‌లో జరుగుతుంటాయి. ఈ చర్చలేవీ వృథా పోలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్లాసులకు హాజరవుతున్న ఒక మహిళ భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మహిళలు అందరూ కలిసి ఇందుకు అవసరమైన డబ్బును సేకరించారు. ‘తరగతులకు హాజరు కావడం ద్వారా ఆర్థిక స్వతంత్రత, డిజిటల్ అక్షరాస్యత, వ్యాపారదక్షత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఎంతోమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు’ అంటుంది శ్రీష్మ అనే ట్రైనర్. ‘యాభై దాటిన వారు స్కూల్‌కు రారేమో అనుకున్నాం. అయితే యాభై నుంచి అరవైఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటుంది హసీనా అనే టీచర్. స్కూల్‌కు హాజరవుతున్న వాళ్లలో భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు, భిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహిళలు ఉన్నారు. పాలక్కాడ్ జిల్లా పుదుక్కోడ్ గ్రామానికి చెందిన రాధ రెండున్నర సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతోంది. వీకెండ్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. ‘ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను అనేది ఒక సంతోషం అయితే, నేర్చుకున్న వాటి ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం మరో సంతోషం’ అంటుంది రాధ. ‘ఫైనాన్సియల్ ప్లానింగ్, మహిళకు కొత్త జీవనోపాధి అవకాశాలు పరిచయం చేయడం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక ఐక్యత మొదలైన అంశాలకు సంబంధించి మాడ్యుల్ తయారు చేశాం’ అంటున్నాడు కుదుంబ శ్రీ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నిషాద్. ‘డిజైనింగ్‌కు సంబంధించి ఎన్నో క్లాసులు తీసుకున్నాను. క్లాసుకు హాజరవుతున్న మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు భవిష్యత్‌లో తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది’ అంటుంది మనప్పదం గ్రామానికి చెందిన పుష్పలత. ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్‌ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది పుష్పలత. -
ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన మన ‘నాడు-నేడు’.. శభాష్ ఏపీ..!
ప్రపంచ గుర్తింపు సాధించిన మన విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధకు అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల పర్యటనను తమ వెబ్సైట్లో ఐక్యరాజ్య సమితి పబ్లిష్ చేసింది. తద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధలో తీసుకువచ్చిన సంస్కరణలు, నూతన విద్యావిధానాలకు విశ్వవ్యాప్త గుర్తింపును ఐక్యరాజ్యసమితి ఇచ్చినట్టయింది. మన రాష్ట్ర విధాన్ని తన సైట్లో ప్రచురించిన యుఎన్ ప్రపంచశాంతి, సమాజంలో మార్పు కోసం పాటుపడే ఐక్యరాజ్యసమితి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధ, ఏపీలో అమలవుతున్న బాలికా విద్యా, జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ (అందరికి సమానవిద్య) నచ్చి తమ వెబ్ సైట్ లో ప్రమోట్ చేసేందుకు ఒక ఆర్టికల్ ను (సంచికను) ప్రచురించింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన గుర్తింపు మన ఏపీ రాష్ట్రానికి దక్కడం ఎంతో గొప్ప విషయం. దేశచరిత్రలో తోలి సారిగా.. సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకను ప్రపంచ వేదిక, యూఎన్ లో వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున పంపించిన పదిమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ఐక్యరాజ్య సమితి వెబ్ సైట్ ఇంపాక్ట్ స్టోరీస్ లిస్ట్ లో దీన్ని లిస్ట్ చేశారు యుఎన్ అధికారులు. సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను అమెరికాలోని పలు అంతర్జాతీయ మీటింగ్ ల కోసం పంపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పదిరోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అమెరికా న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ లో జరిగిన SDG సమ్మిట్, యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు నాడు-నేడు స్లాల్‌ను సందర్శించిన లచ్చెజర స్టోవ్ జులైలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు – నాడు - నేడు నవరత్నాల స్టాల్ ను ఏర్పాటు చేశారు యుఎన్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్. ఈ స్టాల్ ను ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చెజర స్టోవ్ సందర్శించి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలను కొనియాడారు. ఏదేమైనా ఏపీ విద్యార్ధుల ప్రతిభను ఐక్యరాజ్య సమితి గుర్తించి తమ వెబ్ సైట్ లో ప్రచురించడం చాలా గొప్ప విషయం. ఇది చదవండి: ‘మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి’ -
గ్రూప్-2 గెట్ రెడీ.. ఏపీలో పది రోజుల్లో నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: విజయ దశమి వేళ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్–2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమేరకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వతేదీన 508 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తద్వారా గ్రూప్–2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. మరో పది రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని సర్వీస్ కమిషన్ యోచిస్తోంది. యువత వినతిపై స్పందించిన సీఎం గ్రూప్స్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పలు సందర్భాల్లో అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో అనుమతినిచ్చిన పోస్టులతో పాటు వీలైనంత ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలని స్పష్టం చేయడంతో తాజాగా గ్రూప్ 2 విభాగంలో 212 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆయా శాఖల నుంచి పోస్టుల ఖాళీలను నిర్దారించుకున్న వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సర్వీస్ కమిషన్‌కు ఉత్తర్వుల్లో సూచించారు. రోస్టర్ పాయింట్లతో పాటు విద్యార్హతల ఆధారంగా నిబంధనల మేరకు ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖ కోరింది. గ్రూప్స్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. నోటిఫికేషన్ నాటికి ఆయా శాఖల్లో ఉన్న మరిన్ని ఖాళీలను సైతం కలపనున్నారు. దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. -
తెలంగాణ: గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లి నిర్వహించాలన్న పిటిషన్‌పై విచారణ చేప్పట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. జూన్ 11వ తేదీన జరిగిన ఈ పరీక్ష రద్దు చేసి మళ్లి నిర్వహించాలని TSPSCని కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైన విషయం తెల్సిందే. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను లీకేజీ కారణాల వలన ఒకసారి రద్దు చేసి మళ్ళీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు ఇది రెండవ సారి రద్దు అవ్వడం. ఇదీ చదవండి: బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్పీఎస్సీపై హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్ షీట్లపై హాల్‌టికెట్ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేసిన విషయం తెల్సిందే. జూన్ 11న టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. వాదనలు ఇలా జరిగాయి టీఎస్పీఎస్సీ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ ఎం.రాంగోపాల్ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్‌టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ. కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పా రు. అభ్యర్థి చూపించిన ఆధార్, పాన్, ఓటర్ కార్టు లాంటి గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ ధ్రువీకరించాకే పరీక్షకు అనుమతించారని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల మంది అభ్యర్థు లు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మా త్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని, నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది -
Triple ITDM : నేడే ‘పట్టా’భిషేకం
కర్నూలు సిటీ: కల సాకారమైంది.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసుకున్న యువ ఇంజినీర్లు బీటెక్ పట్టాలు అందుకోనున్నారు. ఇందుకు కర్నూలు సమీపంలోని ట్రిపుల్ ఐటీడీఎం(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్)లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్యాంపస్‌లోని నూతన కృష్ణ సెమినార్ హాలులో ఐదో స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్, రూర్కీ పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ బీవీ ఆర్ మోహన్ రెడ్డి, భారతీయ సమాచార రూపకల్పన, తయారీ సంస్థ చైర్మన్ ఆచార్య హెచ్ఏ రంగనాథ్ హాజరుకానున్నారు. ఐదో స్నాతకోత్సవంలో 2019–23 బ్యాచ్‌కి చెందిన బీటెక్ విద్యార్థులు 113 మంది, ఎంటెక్ విద్యార్థి ఒకరు పట్టాలు అందుకోనున్నారు. అదే విధంగా వివిధ బ్రాంచ్‌ల్లో ప్రతిభ చూపిన ఐదుగురు విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించనున్నారు. ప్రతిష్టాత్మక సంస్థగా.. ఏపీ పునర్విభజన చట్టం–2014 ప్రకారం ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ఐటీ డీఎంను కర్నూలుకు మంజూరు చేశా రు. మొదటగా కాంచీపురం(తమిళనాడు)లో మెంటర్ ఇనిస్టిట్యూట్‌గా 2015 ఆగస్టు నెలలో మూడు బీటెక్ కోర్సులతో తరగతులు మొదలయ్యాయి. కాంచీపురం నుంచి 2018లో కర్నూలు తరలించి శాశ్వత క్యాంపస్ ను ప్రారంభించారు. మొదటగా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సై న్సు కోర్సులు మాత్రమే ఉండేవి. 2019–20 అకడమిక్ ఇయర్ నుంచి ఆర్టిఫీషియుల్ ఇంటలిజెన్స్ అండ్ డా టా సైన్స్ అనే మరో బీటెక్ కోర్సు, మూడు పీహెచ్డీ కోర్సులు ప్రారంభించారు. మొదట క్యాంపస్‌లో 75 బీటెక్ సీట్లు ఉండగా.. నేడు 271కి పెరిగాయి. వసతుల్లో మేటి దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుగుణమైన వాతావరణం ఉండేలా క్యాంపస్‌ను అన్ని వసతులతో తీర్చిదిద్దారు. 152 ఎకరాల విస్తీరణంలోని 60 ఎకరాల్లో భవనాలు నిర్మించారు. క్రీడల కోసం ఇండోర్ స్టేడియం, యోగా, జిమ్‌లు ఏర్పాటు చేశారు. బాస్కెట్‌బాల్ కోర్టు, మినీ క్రికెట్ స్టేడియం సైతం నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా పోస్టల్ కార్యాలయం ఏర్పాటు చేశారు. 24 గంటల వైఫై సేవలు అందుతున్నాయి. మొదట రూ.218 కోట్లు, తరువాత రూ.256 కోట్లతో పనులు పూర్తి చేశారు. తాజాగా మరో రూ.50 కోట్లు మంజూరయ్యాయి. క్యాంపస్‌లో మొత్తం 11 భవనా లు, ఐదు సెమినార్ హాల్స్ ఉన్నాయి. ఒక మల్టీపర్పస్ హాల్ సేవలు అందిస్తోంది. విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ, 5 వేలకుపైగా పుస్తకాలు, వందలాది పరిశోధన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. దేశంలో ఉన్నటువంటి 25 ట్రిపుల్ ఐటీల్లో కర్నూలు ట్రిపుల్‌డీఎం మేటిగా నిలుస్తోంది. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం ట్రిపుల్ ఐటీడీఎంలో కోర్సు పూర్తి అయిన వారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీపక్ రాథోర్ అనే విద్యార్థి అత్యధికంగా ఏడాదికి రూ.1.36 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్‌లో ఉద్యోగం పొందారు. సరాసరి రూ.9.52 లక్షల వార్షిక వేతనం పొందే ఉద్యోగాలు చాలా మందికి వచ్చాయి. ఎంటెక్ చదివిన వారిలో 100 శాతం మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఆటోమేషన్ విభాగాలలో 2023–24 విద్యా సంవత్సరానికిగాను ఎంటెక్ కోర్సులు ప్రారంభించనున్నారు. ఎంటెక్ రెండు సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరం నార్వేలో చదివేందుకు నార్వే ఆగ్ధర్ యూనివర్సిటీతో ట్రిపుల్ ఐటీడీఎం ఒప్పందం చేసుకుంది. పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యం సంస్థలో పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. నాలుగేళ్లలో 30 రీసెర్చ్ ప్రాజెక్టులు సాధించాం. దీంతో పాటు కర్నూలులోని పలు ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులకు రోబోల తయారీపై శిక్షణను ఇస్తున్నాం. వచ్చే నెల చివరి నాటికి క్యాంపస్‌లో 100 శాతం పనులు పూర్తవుతాయి. – ఎల్ఎన్వీ సోమయాజులు, ట్రిపుల్ ఐటీ డీఎం, డైరెక్టర్ -
శాస్త్రీయంగా.. సమర్థంగా..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక విధానాన్ని శాస్త్రీయంగా, మరింత సమర్థంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ తెలిపారు. అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి పూర్తి సమర్థులైన వారిని ఎంపిక చేసేలా కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానాల మార్పునకు సంబంధించి జరుగుతున్న కసరత్తు గురించి వివరించారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవసరమైన మార్పులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులతో ఒక కమిటీ నియమించిందని తెలిపారు. దానికి అనుబంధంగా ఏపీపీఎస్సీలో అంతర్గతంగా తాము రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియామక విధానాలపై ఏపీపీఎస్సీ సభ్యుడు సలాం బాబు నేతృత్వంలో అపార నైపుణ్యం ఉన్న ఐదుగురితో ఒక కమిటీ, వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లతో మరో కమిటీ నియమించినట్లు వివరించారు. దీంతోపాటు వివిధ రంగాలకు చెందిన మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత విధానాలపై అభ్యర్థులు, తల్లిదండ్రులు, సమాజంలోని పలువురి నుంచి రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయని, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వీటన్నింటికి పరిష్కారం చూపేలా సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాము నియమించిన కమిటీలు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నియామక విధానాలు, ఉత్తమ ప్రాక్టీసులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తాయని చెప్పారు. ఐఐఎం వంటి అత్యుత్తమ సంస్థల ప్రొఫెసర్ల నుంచి సైతం అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నపత్రాలు ఎలా ఉండాలి? ఎలా రూపొందించాలి? మూల్యాంకనం ఎలా ఉండాలి? ఎలా చేయాలి? ఇతర రాష్ట్రాలు, యూపీఎస్సీ వంటి సంస్థలు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయి? అనే అంశాలను వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సవాంగ్ వివరించారు. కమిటీలు ఇచ్చిన సిఫారసులు, ప్రజలు, మేధావుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించి మార్పులు చేపడతామని చెప్పారు. మార్పులు ఇలా...! ప్రస్తుతం గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉన్నాయని, దాన్ని ఒక పేపర్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు గౌతం సవాంగ్ తెలిపారు. స్క్రీనింగ్ దశ పరీక్ష కాబట్టి ఒక పేపర్ సరిపోతుందనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. గతం కన్నా సులభంగా ప్రిలిమ్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెయిన్స్‌లో కూడా ఇప్పుడు ఉన్న ఐదు పేపర్లను నాలుగు పేపర్లకు తగ్గించి, అందులో రెండు పేపర్లు వ్యాసరూప ప్రశ్నలు (డిస్క్రిప్టివ్), రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రూపొందించాలనే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, సిలబస్ మారదని, ఉన్నదాన్నే కొంత రీఫ్రేమ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. సిలబస్ గురించి అభ్యర్థులకు ఎలాంటి అపోహలు, ఆందోళన అవసరం లేదన్నారు. మూల్యాంకన విధానాన్ని మార్చేందుకు అధ్యయనం జరుగుతోందన్నారు. మొత్తంగా నియామక విధానాన్ని సులభంగా, సౌలభ్యంగా మార్చే దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారిలో వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీసేలా కొత్త విధానం ఉంటుందన్నారు. గ్రూప్–1 నోటిఫికేషన్ నెల రోజల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. గ్రూప్–2 పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. -
నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు!
Google Winter Internship 2024: ప్రస్తుతం ఎక్కువ శాలరీలు ఇస్తున్న కంపెనీలలో ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్' ఒకటని అందరికి తెలుసు. ఈ సంస్థలో ఉద్యోగం కోసం చాలామంది విశ్వప్రయత్నం చేస్తారు. అందులో అందరికి జాబ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సంస్థ 'వింటర్ ఇంటర్న్‌షిప్-2024' పేరుతో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? స్టైఫండ్ ఎంత ఇస్తారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులై ఉండాలి. టెక్ దిగ్గజంతో మీ కెరీర్‌ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఫ్రెషర్లకు ఈ ఇంటర్న్‌షిప్ సువర్ణావకాశం అనే చెప్పాలి. అప్లై చేయడం ఎలా? అప్లై చేయడానికి ముందు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి. https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ను అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2023 అక్టోబర్ 01. ఇందులో ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది! కనీస అర్హతలు.. ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అనుభవం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python). ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, నెట్వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే మీ పని. స్టైఫండ్ ఎలా? ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి ప్రారంభమవుతుంది. -
ఒక్కొక్కరికి రూ. 2లక్షలు.. 5వేల విద్యార్థులకు అవకాశం - రిలయన్స్ ఫౌండేషన్
రిలయన్స్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి 5,000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. దీని కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు 2023 అక్టోబర్ 15లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ అన్ని బ్రాంచ్‌లలోని మొదటి సంవత్సరం రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్షిప్ మెరిట్ ఆధారంగా చేసుకుని అందివ్వడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన ఒక్కో విద్యార్థికి రూ. 2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఇందులో మహిళా విద్యార్థులకు, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా చదువుకోవాలనే సదుద్దేశ్యంతో రిలయన్స్ సంస్థ ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది. 2022 - 23 విద్యాసంవత్సరంలో కూడా సంస్థ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దీని కోసం అప్పుడు లక్ష మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంపికైన వారిలో 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం! రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి www.scholarships.reliancefoundation.org వెబ్సైట్ సందర్శించవచ్చు. ఇందులో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. -
సీఎం సార్... ఆశీర్వదించండి
ఆంధ్రప్రదేశ్ గురుకులం విద్యార్థులు అరుదైన అవకాశం చేజిక్కించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడ 10 నెలలు ఉండి పాఠాలు చదువుకోబోతున్నారు. ఈ గొప్ప అవకాశం వారి జీవితాలను మార్చనుంది. ఇందుకు కారణమైన ఏ.పి. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం అంటున్నారు. ‘ఏ.పి గురుకులాలను సి.ఎం గారు ఆధునికంగా తీర్చిదిద్దడం వల్లే మాకు ఈ అవకాశం దక్కింది’ అంటున్నారు. ‘కెనడీ లుగర్–యూత్ ఎక్స్ఛేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్’ కింద అమెరికా వెళ్లిన విద్యార్థుల మనోగతాలు... మా దేశానికి అధ్యయానికి రండి అంటూ అగ్రదేశం అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానం ఏ.పి. గురుకుల పాఠశాలల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదన లేని కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు అమెరికాను చూడటమే కాదు అక్కడ పది నెలలు ఉండి చదువుకునే అవకాశం పొందడం వారి జీవితాలను మార్చనుంది. ఇలా పేదపిల్లలకు పెద్ద అవకాశం దక్కడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన చదువుల మహాయజ్ఞం కీలకపాత్ర పోషించిందన్నది జగమెరిగిన సత్యం. ‘నాడు–నేడు’తో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు అధునాతంగా మారిపోవడంతోపాటు అన్ని వసతులూ సమకూరాయి. ఇంగ్లిష్ విద్య, నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆన్లైన్ క్లాసులు, ట్యాబ్‌లు వంటి ఎన్నో సౌకర్యాలతో పేదపిల్లల పెద్ద చదువుకు కొత్త బాటలు పరుస్తున్నారు. తొమ్మిది దశల వడపోత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో అంతర్జాతీయ అవగాహనలో భాగంగా యూనైటెడ్ స్టేట్స్ (యూఎస్) గత కొన్నేళ్లుగా ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ (కేఎల్ – వైఈఎస్) ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి యేటా ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. దీనికి ఎంపిక కావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. మొదట బయోడేటా నుంచి చివరి ఇంటర్వ్యూల వరకు తొమ్మిది దశల్లో కఠినతరమైన వడపోత కొనసాగు తుంది. దాదాపు తొమ్మిది నెలలపాటు కొనసాగే అన్ని అర్హత పరీక్షల ప్రక్రియను విజయవంతంగా దాటుకుని రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు డి.నవీన, ఎస్. జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్. ఆకాంక్షలు అవకాశాన్ని దక్కించుకున్నారు. వారంతా ఇటీవలే అమెరికాకు పయనమై వెళ్లారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలోచేర్పిస్తారు. ఆ విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు అతిథ్యం ఇస్తాయి. విద్యార్థులు ఒక్కొక్కరికీ దాదాపు 200 డాలర్లు (సుమారు రూ. 16,500) నెలవారీ ఆర్థిక తోడ్పాటు (స్టైపెండ్)ను అందిస్తారు. సీఎంకు కృతజ్ఞతలు 2023–24 విద్యా సంవత్సరానికి ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ’ కోసం ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియాలోని 38 దేశాల విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో మన దేశానికి చెందిన 30 మంది ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం గర్వకారణం. వీరికి కావలసిన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ఫోన్ల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థికసాయం అందిస్తోంది. కేఎల్–వైఈఎస్ ప్రోగ్రామ్‌లో అమెరికా చదువులకు వెళ్తున్న ఐదుగురు విద్యార్థులు డి. నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్ ఆకాంక్ష సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆగస్టు 31న కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తిచేసుకుని వచ్చిన విద్యార్థులు కె.అక్ష, సి.తేజ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ నేప«థ్యం తదితర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. యూఎస్ఏ లో చదువులు పూరై్త వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ట్యాబ్‌లను అందజేశారు. థాంక్యూ సీఎం సార్ అమెరికా చదువులకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్లే నాకు ఈ అవకాశం దక్కింది. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ మా ఊరు. మా నాన్న ప్రవీణ్ రాజ్ నెలకు రూ.7 వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగి. తల్లి సుకాంతి గృహిణి. ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితిలో గురుకులం ద్వారా ప్రభుత్వం నాకు మంచి విద్యావకాశాలు కల్పించింది. – రోడా ఇవాంజిలి, మధురవాడ గురుకులం, విశాఖ జిల్లా. విద్యాలయాల్లో మెరుగైన సదుపాయాలు మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో బాగా తీర్చిదిద్దారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి మా గ్రామం. మా నాన్న దార కేశయ్య పదవ తరగతి చదివి వ్యవసాయ పనులతో నెలకు రూ.10 వేలు సంపాదిస్తాడు. ఐదవ తరగతి చదివిన అమ్మ ఆదిలక్ష్మమ్మ గృహిణి. పేదరికం కారణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం గురుకులంలో 5 వ తరగతిలో చేరిన నేను ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నా. – డి.నవీన, మార్కాపురం గురుకులం ఆనందంగా ఉంది ప్రభుత్వ గురుకులంలో చదివే నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. విజయవాడ గుణదల ప్రాంతం మాది. మా నాన్న చొక్కా సురేష్ అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అమ్మ వనజ గృహిణి. – సీహెచ్ ఆకాంక్ష, ఈడ్పుగల్లు ఐఐటీ– ఎన్ఐటీ అకాడమి, కృష్ణా జిల్లా పేద పిల్లల చదువులకు సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు పేద పిల్లల ఉన్నత చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ శ్రద్ధ చూపిస్తున్నారు. పేదవర్గానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపిక అయ్యానంటే మా చదువులకు సీఎం సార్ అందించిన ప్రోత్సాహమే కారణం. చాలా సరదాగా మాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం గారు మాకు రూ.లక్ష సాయం, ట్యాబ్‌లు అందించారు. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, మల్లెనిపల్లి మా గ్రామం. మా నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. –హాసిని బలిగా, ఈడ్పుగల్లు ఐఐటీ– నీట్ అకాడమి, ఎస్సీ గురుకుల కలలో కూడా ఊహించలేదు నేను అమెరికా చదువుకు ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే ఈ అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జి.కొత్తూరు మా ఊరు. మా నాన్న ఎస్.కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము రోజువారీ కూలీగా నెలకు ఆరు వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 2017లో గురుకులంలో 6వ తరగతిలో చేరి ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. – ఎస్. జ్ఞానేశ్వరరావు, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా. – యిర్రింకి ఉమమాహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి, అమరావతి -
థ్యాంక్యూ టీచర్
‘మా టీచర్ ఇలా చెప్పలేదు’ ‘మా టీచర్ ఇలాగే చెప్పింది’ ‘మా టీచర్ కోప్పడుతుంది’ ‘మా టీచర్ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్ టీచర్ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు. పిల్లలు స్కూల్‌కు రాగానే తమ ఫేవరెట్ టీచర్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్ టీచర్‌ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్‌టేబుల్‌లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్‌కు ఒక్కో ఫేవరెట్ టీచర్. ఆ టీచర్ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్ బాగా వస్తోంది సైంటిస్ట్ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్ అయినవారున్నారు. ఫేవరెట్ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్‌స్పయిర్ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు. ► సబ్జెక్ట్ బాగా వచ్చినవారు ఫేవరెట్ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్ టీచర్ అవుతారు. సబ్జెక్ట్ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్‌ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్ ఎవరికైనా సరే ఫేవరెట్ టీచర్. ► మనలాంటి వారు పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్‌లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్’ అని ఒక స్టూడెంట్‌తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్ టీచరే. ► అందరూ సమానమే ఒక టీచర్‌ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్ ఉండాలి. కొంతమంది స్టూడెంట్లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్ మెచ్చుకోలు, టీచర్‌తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్ ఫేవరెట్ టీచర్. ► క్రమశిక్షణ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్‌కు సిలబస్ పూర్తి చేయడం, టైమ్‌కి స్కూల్‌కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు సీరియస్‌గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు. టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్‌కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు. ► మంచి ఫ్రెండ్ కొందరు టీచర్లు క్లాస్‌లో ఫ్రెండ్‌లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్‌లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్‌ను అభిమానిస్తారు. -
సీయూఈటీలో ఖమ్మం విద్యార్థిని ప్రతిభ
ఖమ్మం, సహకారనగర్: కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూఈటీ)లో ఖమ్మానికి చెందిన విద్యార్థిని ప్రతిభ కనబర్చింది. జిల్లా కేంద్రంలోని బుర్హాన్‌పురానికి చెందిన వున్నవ రిషిక కేంద్రియ విద్యాలయంలో పదో తరగతి వరకు చదవగా, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. ఈ క్రమంలో సీయూఈటీ రాసిన ఆమె 541 మార్కులు సాధించగా.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (షిల్లాంగ్ క్యాంపస్)లోని అన్ని విభాగాల్లో సీటు సాధించింది. తెలంగాణ నుంచి అన్ని విభాగాల్లో సీటు సాధించిన ఏకై క విద్యార్థినిగా రిషిక గుర్తింపు సాధించింది. ఆమె ఈ విద్యా సంవ త్సరం(2023–24) బీఏ హానర్స్ రీసెర్చ్ ఇంగ్లిష్ కోర్సు అభ్యసించాలని నిర్ణయించుకుంది. కాగా, రిషిక తండ్రి ఇంగ్లిష్ ఉపాధ్యాయుడైన కిరణ్‌కుమార్ కరోనా సమయంలో కన్నుమూశాడు. ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యంగా రిషిక చెబుతోంది. -
11 నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాలకు ఆప్షన్ల ఎంపిక
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి బుధవారం విడుదల చేశారు. విధానపరమైన కారణాలతో వాయిదా పడిన పాలిసెట్ ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల్లోగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 16వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చన్నారు. 18వ తేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 19వ తేదీ నుంచి 23లోగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో నేరుగా రిపోర్టు చేయాలన్నారు. 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. మొత్తం 88 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 18,141 సీట్లు, 182 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 64,933 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. చదవండి: మచిలీపట్నం కలెక్టరేట్లో.. కాబోయే కలెక్టర్-ఎస్పీలు.. సింపుల్‌గా దండలు మార్చేసుకున్నారు -
సాక్షి రిపోర్టింగ్ ఫ్రం ఐక్యరాజ్యసమితి
అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాలను సాక్షి మీడియా గ్రూప్ తరపున కవర్ చేశారు మంగ వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి. మన దేశం నుంచి ఈ అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో వెంకన్న ఒకరు. తెలుగు మీడియాలో వెంకన్న మాత్రమే ఈ అవకాశం అందుకోగలిగారు. నల్గొండ జిల్లా నుంచి చిన్న విలేకరిగా ప్రస్థానం ప్రారంభించి.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఏకంగా ఐక్యరాజ్యసమితి ఈవెంట్‌ను కవర్ చేయడం జర్నలిస్టుగా వెంకన్న సాధించిన విజయం. కవరేజ్ గురించి వెంకన్న మాటల్లోనే.. "హై-లెవల్ పొలిటికల్ ఫోరమ్ 2023 సమావేశాల్లో సుస్థిర అభివృద్ధి ఎజెండాగా ఉన్నత స్థాయి రాజకీయ వేదిక (HLPF) ఆర్థిక, సామాజిక మండలి ఆధ్వర్యంలో జూలై 10, సోమవారం నుండి 19 జూలై 2023 వరకు జరిగిన సమావేశాలను కవర్ చేయడం నా జర్నలిజం కెరియర్లో దక్కిన అతి పెద్ద అదృష్టం" ప్రపంచ మేధావుల విలువైన పాఠాలు UN కౌన్సిల్ యొక్క ఉన్నత-స్థాయి విభాగంలో భాగంగా సస్టైనబిలిటీ ప్రధాన అజెండా ఫోరమ్ యొక్క మూడు రోజుల మంత్రివర్గ ECOSOC యొక్క ఉన్నత-స్థాయి సెగ్మెంట్ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేశాను. "కరోనా వైరస్ వ్యాధి (COVID-19) నుండి ప్రపంచ రికవరీని వేగవంతం చేయడం, అన్ని స్థాయిలలో సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను పూర్తిగా అమలు చేయడం ఎజెండాగా ఈ సమావేశాలు జరిగాయి. ముఖ్య అజెండా లో పేర్కొన్న అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాను. ఒక్కో భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో ఒక్కొక్కరు వినూత్నమైన, విలువైన విషయాలు ఎన్నో చెప్పారు. (వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చే జర స్టవ్ తో UN స్పెషల్ కన్సల్టేటివ్ మెంబర్ షకీన్ కుమార్) ఎడ్యుకేషన్ లో ఏపీ.. ది బెస్ట్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు స్టాల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ, బాలికల విద్య కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనాల వివరాలను స్టాల్ రూపంలో ఏర్పాటు చేశారు. హయ్యర్ ఎడ్యుకేషనల్ సస్టైనబులిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రాం హై లెవెల్ పొలిటికల్ ఫోరం కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థికి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానాన్ని అందిస్తున్నారని ఏపీ ప్రతినిధులు ప్రజెంట్ చేశారు. ఈ స్టాల్ ను సందర్శించిన వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సభ్యులు విద్యావేత్తలను నేను జర్నలిస్టుగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆయా దేశాల్లో అనుసరిస్తున్న తీరు, విద్యావిధానాలను తెలుగు ప్రజలకు చెప్పే అవకాశం వచ్చింది. నాడు-నేడు స్టాల్ గురించి తెలుసుకున్న పలువురు విదేశీ విద్యావేత్తలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావిధానాన్ని ప్రశంసించినప్పుడు తెలుగోడిగా గర్వపడ్డాను. ఐక్యరాజ్యసమితి ఆశయాలు భుజాల మీద వేసుకొని పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు, నవరత్నాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతను ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు140 దేశాల నుండి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో వివరించడం సంతోషం కలిగింది. (కొలంబియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధికా అయ్యంగార్ ) అమెరికాకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెప్టెంబర్‌లో జరిగే అమెరికా పర్యటన సందర్భంగా కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాధిక అయ్యంగార్ను కలిశాను. ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్‌తో కలిసి రాధిక అయ్యంగార్తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుగు పాఠకులకు అందించగలిగాం. ప్రపంచ ఐక్యత కోసం, దేశాల మధ్య సమస్యల పరిష్కారం, ప్రపంచ శాంతి కోసం, పౌర హక్కుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఒక రకంగా ప్రతీ ఒక్కరికి ఎన్నో పాఠాలు చెబుతుంది. అనుభవాలు గొప్పగా అనిపించాయి. మంగా వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి -
Andhra Pradesh Education : ఇది కదా బోధనలో మార్పు అంటే..
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ హంగులు సమకూర్చి అంతర్జాతీయ ప్రమాణాలను కల్పిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ విద్యారంగంలో పూర్తిస్థాయి సంస్కరణలకు నాంది పలికిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తోంది. ఇందులో భాగంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్‌పీ)లు, స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సరికొత్త విద్యా బోధనలు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పుత్తూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకొనేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం డిజిటల్ హంగులు సమకూరుస్తోంది. బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్‌తో రాస్తూ పాఠ్యాంశాలు బోధించే పద్ధతి కనుమరుగు కానుంది. రానున్న రోజుల్లో పూర్తిగా డిజిటల్ పద్ధతుల్లో బోధన కొనసాగనుంది. ఇందుకు అనుగుణంగా హైస్కూల్స్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ద్వారా, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల ద్వారా బోధన చేస్తారు. వాటికి ఇంటర్నెట్ను అనుసంధానం చేయనున్నారు. అలాగే బైజూస్ కంటెంట్‌తో పాఠాలు బోధిస్తారు. తద్వారా పాఠ్యాంశాలు అనేక ఉదాహరణలతో విస్తృతమైన రూపకల్పనలతో విద్యార్థులకు సులభంగా అర్థమైయ్యేలా బోధనలు ఉంటాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం పోటీపడే అవకాశం ఏర్పడుతుంది. యుద్ధప్రాతిపదికన పరికరాల ఏర్పాట్లు చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఎంపికై న పాఠశాలలకు ఐఎఫ్‌పీ, స్మార్ టీవీలు, ఇతర సాంకేతిక ఉపకరణాలు చేరాయి. ఇకపై తరగతి గదుల్లో ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధనలు ప్రారంభం కా నున్నాయి. జిల్లాలో తొలి విడతగా 418 పాఠశాలను ఎంపిక చేయగా, ఇందులో 160 హైస్కూల్స్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ)లు, 258 ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉపకరణాలు ఆయా పాఠశాలలకు చేరాయి. వాటికి అవసరమైన ఇతర పరికరాలను సైతం యుద్ధ ప్రాతిపదికన పాఠశాలలకు చేర్చేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ డిజిటల్ పరికరాల వినియోగంపై తొలి విడత శిక్షణకు జిల్లాలో 5,971 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కళాశాలల్లో, పాఠశాలల్లో 40 మందిని ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో 4,993 మంది తరగతులకు హాజరై శిక్షణ పొందారు. ఇక అర్థవంతంగా బోధన విద్యార్థులకు సులభతరంగా పాఠాలు అర్థమైయ్యేందుకు డిజిటల్ బోధనలు ఎంతగానో దోహదపడుతాయి. పాఠశాలల్లో వీటి వినియోగం గొప్ప మార్పుకు సంకేతం. తొలి విడతలో ఎంపికై న పాఠశాలలకు డిజిటల్ ఉపకరణాలు చేరాయి. ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో తీసుకొస్తున్న ఈ మార్పుతో మంచి ఫలితాలు వస్తాయని ఘంటాపథంగా చెప్పగలం. – సి.విజయేంద్రరావు,డీఈఓ, చిత్తూరు -
మరి.. మా పరిస్థితి ఏమిటి?
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా కీలకమైన సబ్జెక్టులు బోధించే గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కష్టపడి చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం రాకున్నా నిరాశ చెందకుండా గెస్ట్ లెక్చరర్లుగా ఏళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇప్పుడు వీరిని కొనసాగించకుండా, రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యాన మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇన్నాళ్లుగా పనిచేస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 61మంది జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 7వేల మంది చదువుకుంటున్నారు. ఇక వివిధ సబ్జెక్టులను 61మంది గెస్ట్ లెక్చరర్లు బోధిస్తుండగా, నెలకు రూ.28,060 వేతనం అందుతోంది. ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలోనే వీరిని రెన్యూవల్ చేస్తారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవిస్తున్నారు. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో గెస్ట్ లెక్చరర్లలో ఆందోళన మొదలైంది. కాగా, జిల్లాలో 42మంది నియామకానికే అనుమతించడం.. ప్రస్తుతం 61మంది విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యాన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పీజీ మార్కులే ప్రామాణికం 2023–24వ విద్యాసంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లను తీసుకునేందుకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా పీజీ కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలని సూచించారు. కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఎంపిక కమిటీలో అదనపు కలెక్టర్(రెవెన్యూ), సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉంటటారు. ఈ ఉత్తర్వులతో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ పరిస్థితి ఏమిటని గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి 26న పరిశీలన అనంతరం 27వ తేదీన సబ్జెక్టుల వారిగా మెరిటీ జాబితా ప్రకటిస్తారు. అనంతరం 28వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనుండగా, ఆగస్టు 1వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది. 42మందికి అనుమతి జిల్లాలోని వివిధ కళాశాలల్లో 42మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్(రెవెన్యూ), కళాశాల ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉండే కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఖాళీల వివరాల ఆధారంగా గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపడుతారు. – రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి