Latest News
-
ముగిసిన 13 జిల్లాల ఆర్టీసీ ఉద్యోగుల సమావేశం
గుంటూరు: పదమూడు జిల్లాలఆర్టీసీ ఉద్యోగుల సమావేశం ముగిసింది. ప్రపంచం ప్రఖ్యాతి గాంచిన ఆర్టీసీని విభజిస్తామంటే సహించలేదని ఈ సమావేశంలో తీర్మానించారు. గురువారం నాలుగు జోన్లలో సమ్మె నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్రలో ఉన్న 123 డిపోలలో రేపు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఉంటుందని, 12వ తేదీన అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు. సమైక్య రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచుతామని ప్రకటించేవరకూ సమ్మెకొనసాగుతోందని ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు. కాగా. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మెకు దిగిన అనంతరం తాము నిరసన చేపడతామని టీఎంయూ ప్రకటించింది. ఇప్పటికే సీమాంధ్ర ఉద్యమంతో ఆర్టీసీ రోజుకు 45 కోట్లను కోల్పోతున్న విషయం తెలిసిందే. -
మధ్యాహ్న 'భోజనం' తో చిన్నారులకు అస్వస్థత
నలందా జిల్లాలోని చాందీ బ్లాక్‌లోని తరారీ గ్రామంలో బుధవారం ప్రాధమిక పాఠశాలలో వడ్డించిన భోజనం తిని 15 మంది చిన్నారులతోపాటు టీచర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బ్లాక్ ఎడ్యుకేషన్ (బీడీఓ) అఫీసర్ చిత్తరంజన్ ప్రసాద్ వెల్లడించారు. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వారు ఫిర్యాదు చేశారు. దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఆ వార్త తెలిసిన వెంటనే జిల్లా అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. ఆ ఆహార పదార్థాలను పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ప్రయోగశాలకు పంపినట్లు బీడీఓ తెలిపారు. మధ్యాహ్న భోజనం కింద భోజనం చేసి గతనెల్లో శరన్ జిల్లా చాప్రా డివిజన్లో గందమయి గ్రామంలో 23 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనతో నివ్వెరపడిన బీహార్లొని నితీశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించినట్టు గప్పాలు పలికింది. అయిన బీహార్ రాష్ట్రంలో ఏదో మూల మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేసిన విద్యార్థులు ఆసుపత్రులపాలైన సందర్భాలు లెక్కలుమిక్కిలిగా పోగుపడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బుధవారం తరారీ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన ఓ ఉదాహారణ మాత్రమే. -
విభజనపై కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న అభ్యంతరాల పరిశీలనకు కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని ప్రకటించింది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి వీరప్ప మెయిలీ, అహ్మద్ పటేల్ ఇందులో సభ్యులుగా ఉంటాయి. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలను ఈ కమిటీ ఆలకించనుంది. హైదరాబాద్‌పై పీఠముడి పడిన నేపథ్యంలో కమిటీ పనితీరుపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే ఇరు ప్రాంతాల నాయకులు అధిష్టాన పెద్దల ముందు పలుమార్లు తమ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. నారాయణస్వామి, దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉండవల్లి, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. -
వైఎస్ వివేకాకు సంఘీభావం తెలిపిన అవినాష్ రెడ్డి
వైఎస్సార్‌జిల్లా: కడప కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్షకు దిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర మద్దతుగా ఆమరణ దీక్షకు దిగిన వివేకానంద రెడ్డి, నిత్యానంద రెడ్డిలకు నగరంలోని ప్రముఖ వైద్యులు కూడా సంఘీభావం ప్రకటించారు. కాగా, కొందరు విద్యార్థులు రిమ్స్(రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) కళాశాల పేరును రాయలసీమ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్గా మార్చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మౌనాన్ని మంగళవారం ప్రశ్నించిన వివేకానంద రెడ్డి సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆమరణ దీక్షకు దిగారు. పదవీ కాంక్షతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని వివేకా విమర్శించిన సంగతి తెలిసిందే. -
'కేసీఆర్‌పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం'
చిత్తూరు : కెసిఆర్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందంటూ టిఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవని విశాలాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ అన్నారు. తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్న టిఆర్ఎస్ నేతలు ఆ ఆధారాల్ని పోలీసులకు సమర్పించి కేసు పెట్టడంలేదెందుకని ఆయన ప్రశ్నించారు. తెలుగువారి సమైక్యతను కోరుకుంటూ మహాసభ నిర్వహించి ఆరు నెలలు కాకముందే రాష్ట్ర విభజన చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేయడం దారుణమని పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన పరకాల చిత్తూరులో ఆగి నిరాహారదీక్ష విరమించిన ఎమ్మెల్యే సికె బాబును పరామర్శించారు. -
ఆహార భద్రత బిల్లును వ్యతిరేకించిన అన్నాడీఎంకే
ఢిల్లీ: లోక్‌సభలో ఆహారభద్రత బిల్లును ప్రవేశపెట్టడంపై అన్నా డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆహార భద్రత బిల్లును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాకే లోక్‌సభలో ప్రవేశపెట్టాలని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడుతుందన్న విషయాన్ని గుర్తు చేసింది. ఆహర భద్రతకు తాము పెద్ద పీట వేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రైతుల ప్రయోజనాలు కాపాడతామని కేంద్రం భరోసా ఇస్తే ఆహార భద్రత బిల్లుకు మద్దత్విడానికి తాము సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ గత రెండు రోజుల క్రితం పేర్కొన్న విషయం తెలిసిందే. ఆహార బిల్లు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, అవసరమని భావిస్తే పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా ఓటేస్తామని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు. బిల్లు పేరుతో ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు అమ్మేస్తారన్నారు. -
ధర్మాన, సబితాలకు సీబీఐ కోర్టులో ఊరట
హైదరాబాద్ : మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వీరిద్దర్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలన్న సీబీఐ గతంలో దాఖలు చేసిన మెమోను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ గతంలో కోర్టుకు విన్నవించింది. అలాగే వీరిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను కోర్టుకు సమర్పించింది. వ్యక్తిగత పూచికత్తులు సమర్పించినా ..జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపవచ్చంటూ సీబీఐ వాదించింది. అయితే సీబీఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన ,సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసిందని.. కోర్టుకు వ్యక్తిగత పూచికత్తును కూడా సమర్పించారని .. అప్పుడు జ్యుడీషియల్ రిమాండ్ అడగని సీబీఐ ఇప్పుడు ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని తన తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి....సాక్ష్యులను బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ కోర్టు పేర్కొంది. -
32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులు అరెస్ట్
గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారుల చేపట్టిన బంద్ బుధవారం ఐదో రోజుకు చేరింది. అయితే 32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులను గతరాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వారందరిపై గతంలోనే కేసు నమోదు అయ్యాయని, అలాగే శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దాంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఉద్యమకారుల సంఖ్య 143 మందికి చేరిందని తెలిపారు. అయితే గూర్ఖాలాండ్ జనమూక్తి మోర్చ అధ్యక్షుడు బిమల్ గురంగ్ అనిత్ ధపాను ఈ నెల మొదట్లోనే అరెస్ట్ చేసినట్లు పోలీసుల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్ర హోం సెక్రటరీ బాసుదేబ బెనర్జీ డార్జిలింగ్ హిల్స్‌లోని స్థానిక అధికారులతో కలసి శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఆయన డార్జిలింగ్‌లోని గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన ముఖ్యకార్యదర్శి రామదాస్ మీనాతో సమావేశమైనారు. స్థానిక పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు సహకరించాలని ఆయనకు బెనర్జీకి సూచించారు. కొల్కత్తా వెళ్లగానే డార్జిలింగ్‌లోని పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీకి నివేదిక సమర్పిస్తానని ఆయన తెలిపారు. అయితే డార్జిలింగ్ జిల్లా కలెక్టర్‌గా ఆర్థిక శాఖ సంయూక్త కార్యదర్శి పునీత్ యాదవ్‌ను నియమిస్తు బెంగాల్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుటివరకు ఆ పదవిలో ఉన్న సౌమిత్ర మోహన్‌ను బృద్వన్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ర్యాంపుపై అదరగొట్టిన షబానా - జావేద్ అఖ్తర్
ముంబైలో జరుగుతున్న భారత అంతర్జాతీయ జ్యూయెలరీ వీక్ వేదికపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, ఆమె భర్త, గేయ రచయిత జావేద్ అఖ్తర్ మెరుపులు మెరిపించారు. దంపతులిద్దరూ కలిసి తొలిసారిగా ర్యాంప్‌పై నడిచి ఆహూతులను అలరించారు. గోలెచా జ్యూయెల్స్ తరఫున వీరు ర్యాంపుపై నడిచి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. 61 ఏళ్ల షబానా ఎరుపు, నలుపు లెహంగా ధరించి, నెక్లెస్ పెట్టుకోగా, జావేద్ అఖ్తర్ నల్లటి షేర్వానీ ధరించి తానూ రకరకాల నగలు పెట్టుకున్నారు. 'రాయల్ ఇండియన్ బ్రైడ్స్' పేరుతో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో అద్భుతమైన కట్ వజ్రాలు, సానపట్టని ముడి వజ్రాలు, ముత్యాలు, పగడాలు, కెంపులు.. ఇలా ఎన్నింటినో ప్రదర్శించారు. ఉమ్రావో జాన్, లక్ బై ఛాన్స్, ద్రోణ లాంటి అనేక సినిమాలకు ఆభరణాలు సమకూర్చడంతో పాటు మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాలను కూడా గోలెచా జ్యూయెలరీ సంస్థ అందించింది. బుధవారం నాటి ప్రదర్శనలో షబానా జంట ధరించిన నగలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విక్రం ఫడ్నిస్ డిజైన్ చేశారు. -
‘తెలంగాణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు’
మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేత బాజిరెడి గోవర్ధన్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీ అభిమానులే పార్టీని నడిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేత షర్మిల ఇచ్ఛాపురం పాదయాత్ర ముగింపు సభలో చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెల్స్ వక్రీకరించాయన్నారు. జిల్లాలోని గద్వాలలో సర్పంచ్‌లుగా ఎన్నికైన వైఎస్సార్సీపీ మద్దతుదారులను బాజిరెడ్డి, ఎడ్మి కృష్ణారెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలు సన్మానించారు. సన్మాన సభలో వారు ప్రత్యేక తెలంగాణ అంశంకు సంబంధించి మాట్లాడారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని తెలిపారు. -
ఆర్టీసీకి ఉద్యమ సెగ, ఇరుప్రాంతాల్లో సమ్మె!
హైదరాబాద్ : ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన సెగ తగిలింది. ఇప్పటికే సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాల దెబ్బకు బస్సులు ....డిపోలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికే సీమాంధ్ర ఆర్టీసీ యూనియన్లు ఈనెల 12వ తేదీ నుంచి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ టీఎంయూ సమ్మెకు సిద్ధమైంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌తో టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించింది. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైప్పటి నుంచి తెలంగాణలోనూ సమ్మె ప్రారంభిస్తామని టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. కాగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అటువైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. సీమాంధ్రలో ఉద్యమంతో ఆర్టీసీ రోజుకు రూ. 4కోట్లు ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ....సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పోటా పోటీ సమ్మెలకు దిగితే ఆర్టీసీ కోలుకోవటం కష్టమే. -
బీసీసీఐ పిటిషన్ విచారణకు సుప్రీం ఒకే
బాంబే హైకోర్టు తీర్పుపై భారత క్రికెట్ సంఘం(బీసీసీఐ) దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. బీసీసీఐకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై దర్యాప్తుకు బీసీసీఐ నియమించిన ద్విసభ్య కమిషన్ ఏర్పాటు అనైతికం, చట్ట వ్యతిరేకమని పేర్కొన్న బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాల బెట్టింగ్ వ్యవహారంపై ఈ కమిషన్ ఏర్పాటైంది. దీన్ని వ్యతిరేకిస్తూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) కోర్టులో పిల్ దాఖలు చేయగా బీసీసీఐకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
పూంఛ్ ప్రాంతాన్ని సందర్శించిన ఆర్మీచీఫ్ బిక్రం సింగ్
పూంచ్ జిల్లాలో భారత సైనికులపై పాకిస్థాన్ మూకలు కాల్పులు జరిపి హతమార్చిన సంఘటనపై వాస్తవాలు పరిశీలించి, పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ బుధవారం అక్కడకు చేరుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిని కూడా ఆయన సమీక్షించనున్నారు. జనరల్ సింగ్ ముందుగా పూంఛ్ జిల్లాతో పాటు జమ్ము ప్రాంతంలో నియంత్రణ రేఖను పరిరక్షించే 16 కోర్ దళం ప్రధాన కార్యాలయం ఉన్న నగ్రోటాను సందర్శించారు. అనంతరం రాజౌరి వెళ్లి అక్కడ డివిజన్ ప్రధాన కార్యాలయంలో ఉన్న పలువురు సీనియర్ ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం పూంఛ్ వద్దకు వెళ్లి అక్కడ నియంత్రణ రేఖ సమీపంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు. పాకిస్థానీ సైనిక దుస్తులలో ఉన్న దాదాపు 20 మంది వచ్చి పూంఛ్ సెక్టార్‌లోని చకన్ దా బాగ్ ప్రాంతంలో భారత సైనికులపై కాల్పులు జరిపి ఐదుగురిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో భారత సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారికి అండగా ఉండేందుకు బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. -
ప్రజలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్, టీడీపీ: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీజేయూ మీట్ ద ప్రెస్‌లో బుధవారం కిషన్‌రెడ్డి మాట్లాడారు. 2009 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన ఎగసిపడిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు అనుకూలమైన పార్టీలన్నీ సీమాంధ్ర ప్రజలకు నచ్చచెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్ర జిల్లాలో ఎగసిపడుతున్న తరుణంలో కిషన్‌రెడ్డి అధికార పార్టీ, టీడీపీలపై విరుచుకుపడ్డారు. బాధ్యాయుతంగా ఉండాల్సిన పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. విభజన తర్వాత సీమాంధ్రలో కూడా అభివృద్ధి తప్పకుండా జరుగుతుందన్నారు. రాష్ర్ట విజనకు సంబంధించి బీజేపీకి అనుమానాలున్నాయని తెలిపారు. సీమాంధ్రలో ఎంపీలు, మంత్రులు కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని ఆయన సూచించారు. -
ప్రశాంతంగానే విభజన ప్రక్రియ: రాపోలు
రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రశాంతంగానే జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. ప్రక్రియ సాఫీగా సాగుతుందనే సంకేతాలు అధిష్టానం నుంచి సంకేతాలున్నాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కాగా అంతకు ముందు తెలంగాణ ఎంపీలు... కాంగ్రెస్ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేదితో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రక్రియను వేగవతం చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నేతలకు అధిష్టానం కొన్నిసలహాలు, సూచనలు ఇచ్చిందని అన్నారు. తెలంగాణ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని తాను అన్నట్టుగా తనపై దుష్ప్రచారం జరుగుతోందని మరో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరణ ఇచ్చానని తెలిపారు. -
కొమరోలులో జర్నలిస్టులు, విద్యార్థులు భారీ ర్యాలీ
ప్రకాశం: జిల్లాలోని కొమరోలులో సమైక్యాంధ్రాకు మద్దతుగా జర్నలిస్టులు, విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర నిరసన జ్వాలలు ఎనిమిదో రోజు కూడా యధాతథంగానే కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా సీమాంధ్ర జిల్లాలోని పలుచోట్ల సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి తోడుగా విద్యార్థులు పాదం కలపడంతో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. -
'కాంగ్రెస్ ఎంపీలు పిల్లుల్లా కూర్చుంటున్నారు'
న్యూఢిల్లీ: పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు పిల్లుల్లా కూర్చుంటున్నారని టీడీపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీల వైఖరిపై టీడీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం రాజ్యసభ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడుతూ ఆంటోనీ కమిటీతో ఒరిగేదేమీ లేదని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఏ ప్రాంతానికి న్యాయం జరగదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే సోనియా గాంధీ లక్ష్యమని ఆయన అన్నారు. అందరి కష్టంతోనే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్ర విభజన చేశారని సీఎం రమేష్ ఆరోపించారు. -
11న ఢిల్లీకి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్న సీమాంధ్ర ప్రాంత ప్రజానిధులు హస్తిన బాట పట్టేందుకు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తే సమస్యలు, పరిణామాలు ఢిల్లీ పెద్దలను వివరించాలని వారు భావిస్తున్నారు. ఈ నెల 11న సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు వెల్లడించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టబోతుందని అన్నారు. ఈ విషయాలన్ని ఆంటోని కమిటీకి వివరిస్తామని పద్మరాజు తెలిపారు. -
సైనికుల కాల్చివేతపై ప్రకటనను సమర్థించుకున్న ఆంటోనీ
ఐదుగురు భారత సైనికులను పాకిస్థాన్ మూకలు కాల్చి చంపిన సంఘటనపై పార్లమెంటులో తాను చేసిన ప్రకటనను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సమర్థించుకున్నారు. తనకు మరిన్ని వివరాలు అందిన వెంటనే వాటిని పార్లమెంటుకు సమర్పిస్తానన్నారు. ఈ సంఘటనపై ఆంటోనీ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్థానీ సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారనడం వాళ్లు తప్పించుకోడానికి అవకాశం ఇచ్చినట్లేనని తీవ్రంగా విమర్శించాయి. మంత్రి ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించాయి. అయితే, 'రక్షణ మంత్రిగా ఏవైనా ప్రకటనలు చేసేటప్పుడు నేను జాగ్రత్తగానే ఉంటాను. నేను నిన్న ఓ ప్రకటన చేశాను. ఈరోజు ఆర్మీ చీఫ్ బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. నాకు మరిన్ని వివరాలు తెలియగానే వాటిని మీ ముందుంచుతాను' అని ఆయన రాజ్యసభలో బుధవారం తెలిపారు. పార్లమెంటుతో పాటు భారతదేశం మొత్తం జాతి భద్రత, సమగ్రత విషయంలో ఒక్కటిగానే ఉన్నట్లు ఆంటోనీ చెప్పారు. అయితే, ఆంటోనీ ఇచ్చిన సమాధానం బుధవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు. వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్‌లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. -
'టీడీపీకి సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదు'
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలకు సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదని వారు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రెచ్చగొడితే ఉద్యమ రూపురేఖలు మారతాయని వారు హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత,శంకర్ నారాయణ చెప్పారు. రాయలసీమను విభజిస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని వారు ఆరోపించారు. -
'సీమాంధ్ర నేతల ఇళ్ళు ముట్టడించండి'
కర్నూలు: పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర నేతల ఇళ్లను ముట్టడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి....సమైక్యాంధ్ర జేఏసీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక రాజధాని అడగటం సిగ్గు చేటు అని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా అందరూ సిద్ధపడాలని భూమా నాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి ఇప్పుడు ధర్నాలు చేయటం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. ఎమ్మినూరులో చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. -
భారత్ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులకు గాయాలు
భారత్, పాక్ సరిహద్దు ప్రాంతమైన లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పరం జరిపిన కాల్పుల్లో బుధవారం ఇద్దరు పాకిస్థాన్ సైనికులు గాయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తాము ఎటువంటి చర్యలకు దిగకుండానే భారత్ సైనికులు తమపై కాల్పులు జరిపారని పాకిస్థాన్ మిలటరీ అధికారి ఆరోపించారు. అయితే ఎల్ఓసీని పాక్ దళాలు అతిక్రమించిన కారణంగానే తాము కాల్పులు జరపవలసి వచ్చిందని భారత సైనిక అధికారులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఐదుగురు భారతీయ సైనికులను హతమార్చిన పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుందని జమ్ముకాశ్మీర్‌లోని సీనియర్ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. కాగా ఇరుదేశాల సరిహద్దుల వద్ద యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్న నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య చర్చలకు విఘాతం కలిగి అవకాశం ఉంది. గతంలో భారతీయ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి చర్చలు జరపాలని పాక్ భావించింది. అయితే ఈ ఏడాది మొదట్లో కాశ్మీర్లో పాక్ విధ్వంసానికి యత్నించింది. దాంతో ఆ చర్చల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చాయి. -
మూడో రౌండ్లో అడుగుపెట్టిన పివి సింధు
భారత రైజింగ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ కవోరి ఇమబెపు (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో 21-19 19-21 21-17తో సింధు విజయం సాధించింది. గత ఏడాది జపాన్ ఓపెన్‌లో ఇమబెపుతో ఆడిన ఏకైక మ్యాచ్‌లోనూ సింధు గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సింధు రెండో రౌండ్లో మ్యాచ్‌లో సత్తా చాటింది. గంట 11 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో ఇమబెపును కంగు తినిపించింది. ఈ ఏడాది మే నెలలో మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల డబుల్స్ నుంచి భారత ఆటగాళ్లు తరుణ్ కోనా, అరుణ్ విష్ణు రెండో రౌండ్లో పరాజయం పాలయ్యారు. ఇండోనేసియాకు చెందిన అల్వెంట్ చంద్ర, మార్కిస్ కిడో జోడీ చేతిలో 15-21 21-13 17-21తో ఓడిపోయారు. -
పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై వృద్ధుడి యాసిడ్ దాడి
తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ వెంట పడటమే కాదు.. ఆమె కాదన్నందుకు ఆ యువతిపై యాసిడ్ పోశాడో 50 ఏళ్ల ప్రబుద్ధుడు. అయితే, అదృష్టవశాత్తు ఆమె ఎలాగోలా ఈ దాడి నుంచి తప్పించుకోగలిగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో జరిగింది. పేపర్ మిల్లు కాలనీకి చెందిన విష్ణు నారాయణ్ శివపురి అనే వ్యక్తి మహానగర్ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి (24) ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. అయినా అతడు వెంటపడటం మానలేదు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఆమె వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. కానీ ఆమె అంగీకరించలేదు. అంతే.. చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకుని, మూత తీసి ఆమె మీద పారబోశాడు. కానీ, అతడి దుశ్చర్యను ముందే గమనించిన ఆ యువతి తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకుంది. తన దివంగత తండ్రికి శివపురి స్నేహితుడని, ఆ పరిచయంతోనే చనువు పెంచుకుని, తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంత పెట్టాడని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు అతగాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'కేసీఆర్‌కు జడ్‌ప్లస్ రక్షణ కల్పించాలి'
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్ర విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, డీజీపీ ఎందుకు స్పందించటం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు సూటిగా ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌కు తక్షణమే జెడ్‌ప్లస్ రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాకుండా అల్లకల్లోలం సృష్టించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని కొప్పుల, విద్యాసాగర్ రావు ఆరోపించారు. కెసిఆర్ హత్యకు కుట్ర జరుగుతుందనే విషయాన్ని మూడు రోజుల కిందట పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆపార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల నిన్న విమర్శించిన విషయం తెలిసిందే.