Latest News
-
పదవుల కోసం పాకులాట ఎందుకు: వీరశివారెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. విభజన జరుగుతుందని తెలిసినా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మిన్నకుండిపోయారని ఆయన బుధవారమిక్కడ ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలు నేతలకు పట్టవా అని ప్రశ్నించిన ఆయన రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడేవారిని ప్రజలు క్షమించరని వీరశివారెడ్డి అన్నారు. నాలుగు నెలల మంత్రి పదవుల కోసం పాకులాట ఎందుకని ఆయన మండిపడ్డడారు. పనిలో పనిగా వీరశివారెడ్డి టీఆర్ఎస్ పార్టీపై శివాలెత్తారు. కేసీఆర్‌పై భౌతిక దాడి చేయాల్సిన పని రాష్ట్రంలో ఎవరికి లేదన్నారు. రాజకీయ వారసత్వం, ఆస్తుల కోసమో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో, లేక పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేకేలకే ఈ ఆలోచన ఉండొచ్చని ఆరోపించారు. విజయశాంతి ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారని, మరో ఎనిమిది మంది కాంగ్రెస్‌లో చేరుతారనే ఆందోళనలతోనే టీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని వీరశివరెడ్డి ఎద్దేవా చేశారు. -
హైదరాబాద్ సమైక్యాంధ్రులదే: అమరనాథ్ రెడ్డి
హైదరాబాద్ కేసీఆర్ తండ్రి జాగీర్ కాదని సమైక్యాంధ్రులదేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్‌కు చరిత్రలో పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులకు అమరనాథ్ రెడ్డి మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజంపేటలో మున్సిపల్ కార్మికులు ఉపాధ్యాయులు, అంగన్వాడి మహిళలు ఐక్య కళాకారుల యూనియన్ ధర్నా, ర్యాలీ నిర్వహించారు. కడపలో బైక్ ర్యాలీ చేసేందుకు యత్నించిన సమైక్యాంధ్ర జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కోటిరెడ్డి సర్కిల్లో బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాల్లో పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
సమైక్యాంధ్ర కోసం విలేకరి ఆత్మహత్యాయత్నం
సమైక్యాంధ్ర కోసం ఓ పాత్రికేయుడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన సాయి అనే పాత్రికేయుడు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న పలువురు నాయకులు చూసి, అతడిని అడ్డుకుని ఆత్మహత్యాయత్నాన్ని నిరోధించారు. గత కొన్ని రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సమైక్యాంధ్ర కోసం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కాకినాడలో బుధవారం ఉదయం మెయిన్ రోడ్డులో ధర్నా చేశారు. ఆ తర్వాత కొంతసేపు మానవ హారం నిర్వహించారు. మసీదు సెంటర్లో కూడా ధర్నా చేయాలని ఆందోళనకారులు తలపెట్టారు. అంతా కలిసి మసీదు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ధర్నా ప్రారంభమైన కొద్దిసేపటికే స్థానిక దినపత్రికకు చెందిన విలేకరి సాయి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన వాహనంలో ఉన్న పెట్రోలును తీసుకుని, ఒంటిపై పోసుకున్నాడు. నిప్పు అంటించుకోబోతుండగా అక్కడే ఉన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వేణు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గమనించి అతడిని పట్టుకుని నిప్పు అంటించుకోకుండా ఆపారు. రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటున్నారని, అది చూసి తట్టుకోలేకపోయానని ఆ తర్వాత సాయి చెప్పాడు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరులో రాష్ట్ర విభజనను తట్టుకోలేక రాజీవ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగిన కొద్ది సేపటికే పొరుగునున్న తూర్పుగోదావరి జిల్లాలో విలేకరి ఆత్మహత్యాయత్నం జరగడం గమనార్హం. -
విభజన ప్రక్రియను ఆపాలి: ఎంపీ వేణుగోపాల్ రెడ్డి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే ఆపాలని నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు నష్టపోతారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రాజీనామాలు ఆమోదించేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి, సోనియాగాంధీ ముందు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపామని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిన్న సభలో తెలుగుదేశం సభ్యులు నిమ్మల కిష్టప్ప, నారాయణరావు, వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్ పోడియం వద్దకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను స్తంభింప చేసిన విషయం తెలిసిందే. -
యూపీలో 22 మంది చిన్నారులకు అస్వస్థత
కడుపులో నులిపురుగులను అంతమెందించేందుకు వేసుకున్న మాత్రలు వికటించి 22 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న చోటు చేసుకుంది. ఝాన్సీ జిల్లాలోని బాబినా ప్రాంతంలోని దుర్గాపూర్ గ్రామంలో ఆశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్ కింద చిన్నారులకు ఆ మాత్రలను అందజేశారు. ఆ మాత్రలు వేసుకోవడంతో వారు తీవ్ర కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు మొదలైనాయి. దాంతో ఆ చిన్నారులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలకు వెంటనే వైద్యం అందించాలని వారి తల్లితండ్రులు ఆ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో వైద్యులను ఆసుపత్రిలో ఆందోళనకారులు నిర్బంధించారు. పోలీసుల జోక్యం చేసుకుని వారిని విడుదల చేశారు. అయితే ఆ విద్యార్థులు తీవ్ర ఆనారోగ్యంపాలైన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. చిన్నారులు అరోగ్యంగానే ఉన్నారని, దాంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు ఆరు కోట్ల చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అఖిలేష్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
యూపీలో 22 మంది చిన్నారులకు అస్వస్థత
కడుపులో నులిపురుగులను అంతమెందించేందుకు వేసుకున్న మాత్రలు వికటించి 22 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న చోటు చేసుకుంది. ఝాన్సీ జిల్లాలోని బాబినా ప్రాంతంలోని దుర్గాపూర్ గ్రామంలో ఆశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్ కింద చిన్నారులకు ఆ మాత్రలను అందజేశారు. ఆ మాత్రలు వేసుకోవడంతో వారు తీవ్ర కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు మొదలైనాయి. దాంతో ఆ చిన్నారులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలకు వెంటనే వైద్యం అందించాలని వారి తల్లితండ్రులు ఆ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో వైద్యులను ఆసుపత్రిలో ఆందోళనకారులు నిర్బంధించారు. పోలీసుల జోక్యం చేసుకుని వారిని విడుదల చేశారు. అయితే ఆ విద్యార్థులు తీవ్ర ఆనారోగ్యంపాలైన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. చిన్నారులు అరోగ్యంగానే ఉన్నారని, దాంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు ఆరు కోట్ల చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అఖిలేష్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
సమైక్య ఉద్యమంపై 1024 కేసులు నమోదు
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎవరిమీదా పోలీసులు కేసులు పెట్టడం లేదని, ఆ ఉద్యమానికి సర్కారు అండదండలు ఉన్నాయంటూ కొందరు తెలంగాణ వాదులు చేస్తున్న ఆరోపణలకు పోలీసులు సమాధానం ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకు 1024 కేసులు నమోదయ్యాయని అదనపు డీజీపీ కౌముది బుధవారం విలేకరులకు తెలిపారు. ఇంతవరకు 221 మందిని అరెస్ట్ చేశామని, మరో 1000 మందిని ముందస్తుగా అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. జాతీయ నాయకుల విగ్రహాల ధ్వంసంపై 39 కేసులు నమోదయ్యాయని, వీటికి సంబంధించి ఇప్పటివరకు 94మందిని అరెస్ట్ చేశామని కౌముది తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా అన్ని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యామాన్ని శాంతియుతంగా చేసుకోవాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఆయన కోరారు. -
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
వరుసగా మూడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలకు ఆటంకాలు తప్పలేదు. తొలి రెండు రోజులు సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు సభను హోరెత్తించి వాయిదా వేయిస్తే మూడోరోజు బుదవారం నాడు పాకిస్థాన్ సైనికులు జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లోకి చొచ్చుకొచ్చి మరీ భారత సైనికులను హతమార్చిన వైనంపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఉభయ సభలను అట్టుడికించింది. దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లే పాకిస్థాన్ చెలరేగిపోతోందని, పదే పదే మన దేశం మీద దాడులకు పాల్పడుతూ జవాన్ల విలువైన ప్రాణాలను హరిస్తోందని బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజీనామా చేసి తీరాల్సిందేనని బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఈ అంశంపై ప్రభుత్వాన్ని దునుమాడారు. రాజ్యసభలో రక్షణమంత్రి ఆంటోనీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని పార్లమెంట్లో బీజేపీ డిమాండ్ చేసింది. విపక్షాల గలభాతో లోక్‌సభ, రాజ్యసభ రెండూ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. -
ఏఏపీ సభ్యురాలు సంతోష్ కోలి మృతి
రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అభ్యర్థి సంతోష్ కోలి బుధవారం మరణించారు. ఆమె మృతి పట్ల ఏఏపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గతనెల 30న కోశాంబిలోని పసిఫిక్ మాల్ సమీపంలో సంతోష్ కోలి, ఏఏపీ మరో కార్యకర్త కులదీప్ ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చి ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంతోష్ తలకు తీవ్ర గాయమైంది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆ ప్రమాదంలో కులదీప్ మాత్రం స్వల్పగాయాలపాలయ్యాడు. వచ్చే ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సంతోష్ కోలి పోటీ చేయనున్నారు. ఎన్నికల బరిలో నిలబడితే ప్రాణాలకు హాని తలపెడతామని గతంలో సంతోష్ కోలికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. -
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: భూమన
తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతోంది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నీచ రాజకీయాల కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలను ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు విశ్వసిస్తున్నారని భూమన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకటించిన హైలెవల్ కమిటీపై ప్రజలకు నమ్మకం లేదని భూమన వ్యాఖ్యానించారు. అదంతా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన విమర్శించారు. మరోవైపు సమైక్యాంధ్ర ఆందోళనలతో పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఏలూరులో ఆర్టీఏ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు ఆటోమోబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. -
అమ్మా.. ఇక్కడో మమ్మీ ఉంది!!
అమ్మా.. అమ్మమ్మ ఇంట్లో అటక మీద 'మమ్మీ' ఉంది!! ఓ జర్మన్ పిల్లాడు వేసిన కేక ఇది. అవును.. అత్యంత పురాతనమైన ఈజిప్షియన్ మమ్మీ ఒకటి అతడికి తన అమ్మమ్మ ఇంట్లో అటకమీద కనపడింది. చాలా దశాబ్దాలుగా ఎవ్వరూ కదిలించకపోవడంతో అది ఒక చెక్కపెట్టెలో ఒక మూల అలా పడి ఉంది. ఆ పిల్లాడి పేరు అలెగ్జాండర్. ఉత్తర జర్మనీలోని డైఫోల్జ్ నగరంలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు ఆడుకుంటూ అటక ఎక్కాడు. అక్కడ ఏవేం ఉన్నాయోనని గాలించడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఓ పెద్ద చెక్కపెట్టె కనిపించింది. చిన్న వయసు, ఏముందో చూడాలనే ఉత్సాహం, కుతూహలం అతడిని ఆగనివ్వలేదు. వెంటనే ఎలాగోలా కష్టపడి చెక్కపెట్టె తలుపు తెరిచాడు. తీరా చూస్తే.. లోపలున్నది ఓ మమ్మీ!! కొద్దిసేపు భయపడినా, తర్వాత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. అయితే, అసలు అక్కడున్నది నిజమైన పురాతన ఈజిప్షియన్ మమ్మీయేనా, లేకపోతే దానికి నకలు లాంటిది ఏమైనా చేయించి పెట్టుకున్నారా అనే విషయాన్ని తేల్చాలని నిపుణులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలెగ్జాండర్ తండ్రి లట్జ్ వుల్ఫ్ గ్యాంగ్ కెట్లర్ ఓ దంతవైద్యుడు. తన తండ్రి ఉత్తర ఆఫ్రికాలో 1950 కాలంలో ప్రయాణించేటప్పుడు ఈ పెట్టె తీసుకుని దాన్ని జర్మనీకి తెచ్చారని ఆయన చెప్పారు. అయితే దాని గురించి ఆయన ఎప్పుడూ ఏమీ చెప్పలేదని తెలిపారు. జర్మనీలోని ఉన్నత కుటుంబాల్లో 1950ల కాలంలో 'మమ్మీ అన్రాపింగ్ పార్టీలు' చాలా ప్రముఖంగా జరిగేవని ఆయన వివరించారు. బహుశా తమ ఇంట్లో ఉన్నది అసలు మమ్మీ కాదేమోనని, దానికి నకలు అయి ఉంటుందని భావించారు. దానికి ఎక్స్-రే తీయడం తప్ప ఈ విషయం నిర్ధారించుకోడానికి మరో మార్గం ఏమీ లేదని తెలిపారు. -
ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకి జారిన భారత్
రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల బలహీన పడటంతో భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకు జారింది. స్టాక్ మార్కెట్లో నిన్న సాయంత్రానికి జరిగిన మొత్తం వాణిజ్యంలో భారత్ రూ. 989 కోట్ల అమెరికన్ డాలర్లు నమోదు అయింది. ట్రిలియన్ డాలర్లకు స్వల్పంగా కొన్ని కోట్లు తగ్గటంతో ఆ క్లబ్లో భారత్ స్థానం చేజారింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ కనిష్టస్థాయికి చేరుతుంది. అంతలోనే రూపాయి విలువ పెరుగుతుంది. ఆ ఒడిదుడుకుల నేపథ్యంలో భారత్‌కు ఆ పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి భారత్ వైదొలిగే సూచనలు కనిపించాయి. కానీ రూపాయి పతనం, మరల పుంజుకొవడంతో భారత్ ఆ క్లబ్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. కానీ మంగళవారం జరిగిన వాణిజ్యంలో రూపాయి పతనం అయ్యే సరికి ఆ క్లబ్ నుంచి భారత్ వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2007లో మొట్టమొదటగా భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం పొందింది. 2008, సెప్టెంబర్‌లో ఆ క్లబ్ నుంచి వైదొలిగింది. 2009లో భారత్ మళ్లీ ట్రిలియన్ క్లబ్లో సభ్యత్వం పొందింది. భారత్ వైదొలగడంతో యూఎస్, యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతం, బ్రెజిల్ దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాగా బ్రెజిల్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతంలోని స్టాక్ మార్కెట్లు మాత్రం స్వల్ప తేడాతో ఆ క్లబ్లో కొనసాగుతున్నాయి. అయితే గతంలో రష్యా, స్పెయిన్, దక్షిణాఫ్రికాలు ఆ క్లబ్లో స్థానం పొంది మరల కొల్పోయాయి. -
విభజన ముందుకే సాగనట్లే: లగడపాటి
న్యూఢిల్లీ : విభజన ప్రక్రియ ముందుగు సాగదని కేంద్రం నుంచి హామీ వచ్చిందని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావల్సి ఉందని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. సీమాంధ్ర ఎంపీల భేటీ అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ కమిటీపై మరింత సమాచారం సేకరిస్తామని ఆయన తెలిపారు. తమ భేటీలో పార్లమెంట్లో నిరసన తెలిపే అంశంపై చర్చించినట్లు లగడపాటి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని లగడపాటి అన్నారు. గత నాలుగు నెలలుగా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు పోరాడుతున్నామని ఆయన తెలిపారు. సీమాంధ్ర ఉద్యమం రగిలిన నేపథ్యంలో హైకమాండ్ ఎ.కె.ఆంటోని నేతృత్వంలోని హైలెవల్ కమిటీ నివేదిక వచ్చేదాకా విభజన ప్రక్రియను కొనసాగించేది లేదనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి పళ్ళం రాజు నిన్న సోనియాగాంధీతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధుల ముందు వెల్లడించడం విశేషం. -
పార్లమెంటు సమావేశాలను వీడని గ్రహణం
పార్లమెంటు సమావేశాలంటే చిన్న పిల్లల ఆటలా తయారైపోతోంది. అటు అధికార పక్షం గానీ, ఇటు ప్రతిపక్షం గానీ సమావేశాలు ఎలా జరగాలన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఏ అంశం దొరుకుతుందా, వాటిని స్తంభింపజేద్దామనే చూస్తున్నాయి. గత సంవత్సరం జరిగిన వర్షాకాల సమావేశాలు బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం పుణ్యమాని ఒక్కరోజు కూడా సరిగ్గా జరగలేదు. అంతకుముందు శీతాకాల సమావేశాలదీ అదే దారి. అప్పట్లో 2జీ కుంభకోణం పార్లమెంటు సమావేశాలను మింగేసింది. ఇప్పుడు తెలంగాణ అంశం మొదలైంది. ప్రతిసారీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఏదో ఒక వివాదం తెరపైకి రావడం, అది కాస్తా పార్లమెంటు పనిచేయాల్సిన కాలం మొత్తాన్ని హరించడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది. కేంద్రానికి బొగ్గు మసి గడిచిన వర్షాకాల సమావేశాలనే తీసుకుంటే.. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని, ఇద్దరు కళంకిత మంత్రులను తప్పించాలని బీజేపీ పట్టుబట్టగా, అధికారపక్షం తన మంకుపట్టును ఏమాత్రం వీడలేదు. పార్లమెంటు సమావేశాలు వర్షార్పణం అయిపోయిన తర్వాత తీరిగ్గా అప్పుడు మంత్రుల శాఖల్లో మార్పు లాంటి చర్యలు తీసుకుంది. అప్పట్లో 19 రోజుల పాటు పార్లమెంటు సమావేశం కావాలని ముందుగా నిర్ణయిస్తే.. కేవలం ఆరంటే ఆరే రోజులు నడిచింది. అందులోనూ ఎలాంటి చర్చలు సవ్యంగా సాగలేదు. జేపీసీ కావాలంటే.. పట్టించుకోని అధికార పెద్దలు ఇక 2010 శీతాకాల సమావేశాలదీ అదే పరిస్థితి. అప్పట్లో 2జీ స్పెక్ట్రం కేటాయింపు కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ విపక్షం పట్టుబట్టగా, అధికార పక్షం మాత్రం అందుకు ససేమిరా అంటూ తన మొండివైఖరి కొనసాగించింది. తీరా సమావేశాలు మొత్తం ఆ చర్చలతోనే సరిపోయిన తర్వాత.. అప్పుడు తీరిగ్గా జేపీసీని ఏర్పాటు చేసింది. ప్రతిసారీ ఇలాగే చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారిపోయింది. అప్పట్లో 23 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరగాలని తొలుత నిర్ణయించగా, గట్టిగా కొన్ని గంటలు కూడా పనిచేయలేదు. విపక్షాలన్నీ ఏకతాటిమీద నిలవడంతో.. ప్రతిరోజూ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అవి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ఉభయ సభల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. సభలో తెలంగాణ లొల్లి ఇక ఈసారి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజులు ఉందనగా తెలంగాణకు తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇది కాస్తా సీమాంధ్ర ప్రాంతంలో చిచ్చురేపింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇటు లోక్‌సభతో పాటు అటు రాజ్యసభలో కూడా ఎంపీలు తీవ్రస్థాయిలో తమ ఆందోళన వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా సమావేశాలను సాగనివ్వలేదు. దీనికి తోడు కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేత అంశం ఒకటి సభను మంగళవారం కుదిపేసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు సభలో సమైక్య నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి కార్యకలాపాలను రెండు రోజులుగా అడ్డుకుంటున్నారు. ఈ ఆందోళన ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈసారి సమావేశాల్లో ఆహార భద్రత సహా కీలకమైన బిల్లులను ఆమోదించాల్సి ఉంది. అదంతా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తే.. అటు తెలంగాణ ఎంపీలు మండిపడతారు. ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీనంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ పెద్దలు హడావుడిగా నిర్ణయం ప్రకటించడం తప్ప మరొకటి కానే కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. -
రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి వాసులు మృతి
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందినవారు దుర్మరణం చెందారు. భాగల్ కోట్ కొల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటనలో అయిదుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇండికా కారు (AP 13 S 5405) అదుపు తప్పి గ్రానైట్ రాళ్ల లోడ్‌తో వెళుతున్న లారీని ఢీకొంది. దాంతో వారు అక్కడకక్కడే చనిపోయారు. మృతులు మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శశి భూషణ్, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాబిన్, శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా గోవా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలకు బీజాపూర్‌లోని అల్ అమీల్ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి మృతదేహాలను బంధువులు సంగారెడ్డికి తీసుకురానున్నారు. -
లగడపాటి నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ
న్యూఢిల్లీ : గత రెండు రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై సమావేశమైన ఎంపీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. తమ తమ ప్రాంత ప్రయోజనాల మేరకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. తాజాగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఈరోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణ, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. విభజనతో రాయలసీమకు తలెత్తే సమస్యలను వీరు ఈ సందర్భంగా ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ నేతలు నిన్న సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీ అధినేత్రితో సమావేశమై విభజన తప్పదంటే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరారు. -
పుట్లూరులో డయేరియాతో ముగ్గురు మృతి
అనంతపురం : అనంపురం జిల్లా పుట్లూరు మండలం పుట్లూరులో డయేరియా విజృంభించింది. కలుషితమైన తాగునీరు సేవించటంతో ఇప్పటికే ఇద్దరు మహిళులు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. దాంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలతో నిన్న నారాయణమ్మ (75), లక్ష్మమ్మ (55) మరణించిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పైమంది డయేరియా బారిన పడ్డారు. బాధితుల్లో 18మంది తాడిపత్రిలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మిగిలినవారు అనంతపురంలోని పలు ఆస్పత్రుల్లో చేరారు. -
మారిషస్‌లో యూఎస్ ఎంబసీ మూసివేత
మారిషస్‌లోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు ఆ కార్యాలయ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ప్రపంచంలోని పలుదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలను అల్ ఖైదా తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల్లోని యూఎస్ వాసులు, రాయబార కార్యాలయ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికాతోపాటు వివిధ దేశాల రాయబార కార్యాలయాలను మూసివేయాలని అమెరికా ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది. పలుదేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడి చేయాలని తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా వివిధ దేశాల్లోని తమ శాఖలను ఆదేశించినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈజిప్టు, యెమెన్, సౌదీ అరేబియా, కువైట్, మెడగాస్కర్, బురుండి దేశాలతోపాటు మరో 19 దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలను ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే. -
వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు
కడప : విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లావ్యాప్తంగా ఎనిమిదో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు సమైక్యాంధ్ర జేఏసీ వారం రోజుల పాటు ప్రయివేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపు నిచ్చింది. పులివెందులలోనూ బుధవారం ఉదయం బంద్ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రొద్దుటూరులో బంద్ కొనసాగుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఎన్జీవోలు 12వ తేదీ నుంచి విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలోనో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. -
కరాచీలో బాంబు పేలుడు: 11 మంది చిన్నారులు మృతి
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించి 11 మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం ఇస్లామాబాద్‌లో వెల్లడించారు. ఈ ఘటనలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారిని నగరంలోని ఆసుపత్రికి తరలించామని, అయితే వారి పరిస్థితి ఆందోళనగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. నగరంలోని లయరి ప్రాంతంలో మార్కెట్ సమీపంలో పేలుడు పదార్థంతో ఉంచి మోటర్ బైక్ పేలి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఆ సమీపంలోనే చిన్నారులు పూట్‌బాల్ ఆట ముగించుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుందని లయరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రోవెన్షియల్ అసెంబ్లీ సభ్యుడు సానియా నాజ్ చెప్పారు. కాగా గాయపడిన చిన్నారులంతా 12 నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులే అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఫూట్‌బాల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన సింధ్ ప్రోవెన్సియల్ అసెంబ్లీ సభ్యుడు జావెద్ నగొరి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. -
నేడు తేలనున్న ధర్మాన, సబిత భవితవ్యం
హైదరాబాద్ : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌ల భవితవ్యం నేడు తేలనుంది. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలన్న సీబీఐ మెమోపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును బుధవారం వెలువరించనుంది. సబితా , ధర్మాన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. వీరిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వ్యక్తిగత పూచికత్తులు సమర్పించినా ..జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపవచ్చంటూ సీబీఐ వాదించింది. అయితే సీబీఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన ,సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసిందని.. కోర్టుకు వ్యక్తిగత పూచికత్తును కూడా సమర్పించారని .. అప్పుడు జ్యుడీషియల్ రిమాండ్ అడగని సీబీఐ ఇప్పుడు ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 7కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో 3,71,000.... కాగా అవుట్ ఫ్లో 3,08,000 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలతో పాటు, ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి నీటి ప్రవాహం వస్తుండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావటంతో ఆరు గేట్లు ఎత్తివేసి 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకూ లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని, వరద ఉధృతి కొనసాగితే సాయంత్రానికి 18 గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ సీఈ ఎల్లారెడ్డి తెలిపారు. -
గోదారి శాంతించినా.. వీడని కష్టాలు
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఉగ్ర గోదావరి శాంతించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం మంగళవారం రాత్రి 7గంటలకు 45.5 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే కొనసాగుతోంది. 62 అడుగుల నీటిమట్టంతో ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తిన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టడటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతి తగ్గటంతో ముంపు నుంచి గ్రామాలు బయట పడ్డాయి. భద్రాచలం నుంచి వాజేడు వరకూ.., అదే విధంగా చింతూరుకు రాకపోకలు సాగాయి. ఆర్టీసీ బస్సులను కూడా ఈ రహదారుల్లో నడిపారు. నాలుగు రోజులుగా నిలిపి వేసిన విద్యుత్ సరఫరాను ఆ శాఖాధికారులు ఒక్కో ఫీడర్లో పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లేక మూగపోయిన సెల్ఫోన్లు మంగళవారం సాయంత్రం నుంచి పనిచేయటంతో సమాచారం అందుబాటులోకి వచ్చింది. వరద తగ్గినప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక ఉన్నందున భద్రాచలం డివిజన్లో 59 పునరావాస కేంద్రాలను కొనసాగిస్తూ 3,109 కుటుంబాలకు చెందిన 11,483 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. ఇంకా జల దిగ్బంధమే... వరద తగ్గుముఖం పట్టినప్పటికీ భద్రాచలం డివిజన్లోని చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వాజేడు మండలంలో దూలాపురం, ఏడ్చర్లపల్లి, నాగారం వద్ద రోడ్లపై నీరు తగ్గలేదు. దీంతో చీకుపల్లికి అవతల ఉన్న 32 గ్రామాలకు రాకపోకలు లేవు. అత్యవసర పనుల నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు పడవల ద్వారానే ప్రయాణం సాగించారు. భద్రాచలం నుంచి కూనవరం రహ దారిలో మురుమూరు, పోచారం వంటి చోట్ల రహదారులపై నుంచి వరద నీరు విడవ లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణానికి తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. భద్రాచలం పట్టణంలోని రామాలయం వీధులు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విస్తా కాంప్లెక్స్‌ను వరద నీరు విడవలేదు. అదే విధంగా రామాలయం పడమర మెట్లకు ఎదురుగా ఉన్న ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. అన్నదానం సత్రం కూడా వరద నీటిలోనే మునిగి ఉంది. రామాలయం నుంచి పంచాయతీ కార్యాలయానికి వచ్చే రహదారిపై నీరు తగ్గినప్పటికీ ఒండ్రు మట్టి చేరటంతో బురదమయంగా తయారైంది. ముంపు తగ్గక పోవటంతో చప్టా దిగువకు చెందిన ఇళ్ల వారు తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే ఉన్నారు. సుభాష్ నగర్లో నీరు తగ్గినప్పటికీ బురదగా ఉండటంతో సాయంత్రం తరువాత పునరావాస శిబిరాలను నుంచి ఇళ్లకు పయనమయ్యారు. విజృంభిస్తున్న వ్యాధులు వరద ఉధృతి తగ్గినప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. నాలుగు రోజుల పాటు వరద నీరు నిల్వ ఉండటంతో చెత్త, పంటలు ఇతర వ్యర్థ పదార్థాలు కుళ్లిపోయి దుర్గంధం వ స్తోంది. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంచాయతీ అధికారులు బ్లీచింగ్ చల్లకపోవటంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. దుమ్ముగూడెం, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఇక్కట్లు పునరావాస కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేక వరదబాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల, తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వెలుతురు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పట్టణంలో ఉన్న పునరావాస శిబిరాల్లో స్వచ్ఛంద సంస్థల వారు అందిస్తున్న భోజనం తప్ప ప్రభుత్వపరంగా తగిన సహాయం అందించడం లేదని బాధితులు వాపోతున్నారు. దీంతో భోజనాల కోసం బాధితులు గిన్నెలు పట్టుకొని నెట్టుకుంటున్నారు. తానీషా కల్యాణ మండ పంలో అయితే గర్భిణులు, ముసలి వాళ్లు భోజనం కోసం లైన్లలో నిలబడ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వరద బాధితులు గోడును పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. -
12 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: బీఎన్పీ పరిబాసహా 12 పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక బో ర్డు(ఎఫ్ఐపీబీ) సిఫారసు మేరకు ప్రభుత్వం మొత్తం రూ. 343 కోట్ల విలువైన 12 ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. కాగా, యూఎస్ కంపెనీ మైలాన్ చేసిన ప్రతిపాదనపై నిర్ణయాన్ని పక్కనబెట్టింది. జనరిక్ ఔషధాల దేశీయ కంపెనీ ఏగిలా స్పెషాలిటీస్‌ను కొనుగోలు చేసేందుకు స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్తో మైలాన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 5,168 కోట్లను వెచ్చించనుంది. ఏగిలా స్పెషాలిటీస్... స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్కు అనుబంధ సంస్థ. -
భారతీ వాల్‌మార్ట్ ఉచిత శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించిన భారతీ వాల్‌మార్ట్ యువతకి ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా రిటైల్, బ్యాంకింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. రాష్ట్రంలో ఈ ఉచిత శిక్షణను తొమ్మిది నెలల క్రితం ప్రారంభించగా, ఇప్పటి వరకు 1,000 మంది వరకు శిక్షణ తీసుకున్నట్లు భారతీ వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఎఫైర్స్) ఆర్తి సింగ్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్న వారిలో 293 మందికి వివిధ రిటైల్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించామని, మిగిలినవారికి కూడా త్వరలోనే అవకాశాలను కల్పించనున్నట్లు సింగ్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వెయ్యి మందిలో 33 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆరు శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా 25,000 మంది శిక్షణ తీసుకోగా అందులో 9,000 మందికి భారతీ వాల్‌మార్ట్ గ్రూపులో అవకాశాలను కల్పించినట్లు తెలిపారు.