Latest News
-
ఎన్ఎస్ఈఎల్ ఈ-కాంట్రాక్ట్లపైనా నిషేధం
న్యూఢిల్లీ: ఇప్పటికే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో నిలిచిపోయిన కొత్త కమోడిటీ కాంట్రాక్ట్‌లకు జతగా ప్రభుత్వం తాజాగా ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించింది. దీంతో ఎన్ఎస్ఈఎల్లో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ముందుగా రూ. 5,600 కోట్లమేర నిలిచిపోయిన చెల్లింపుల సెటిల్మెంట్ను పూర్తిచేయాల్సిందిగా ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించినట్లు ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి కేవీ థామస్ చెప్పారు. ఎన్ఎస్ఈఎల్లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించినట్లు తెలిపారు. ఈ అంశంపై రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా పసిడి, వెండిలతోపాటు ప్రాథమిక లోహాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లను ఎన్ఎస్ఈఎల్ నిర్వహిస్తుంది.ఈక్విటీలలో నగదు విభాగాన్ని పోలి ఈ సిరీస్ కాంట్రాక్ట్‌ల నిర్వహణ ఉంటుందని థామస్ పేర్కొన్నారు. -
యువత కోసమే...‘క్యాంపస్’ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయ రంగంలో ఉన్న సెల్కాన్.. క్యాంపస్ సిరీస్‌లో ఏ63, ఏ60 స్మార్ట్ఫోన్లను మంగళవారమిక్కడ విడుదల చేసింది. 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్, 3.2 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో ఏ63 రూపొందించారు. దీని ధర రూ.4,499. ఇంత తక్కువ ధరలో డ్యూయల్ కోర్, జెల్లీబీన్ ఓఎస్ స్మార్ట్‌ఫోన్‌ను దేశంలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నామని సంస్థ సీఎండీ వై.గురు తెలిపారు. కంపెనీ ఈడీ రేతినేని మురళితో కలసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. యువత కోసమే క్యాంపస్ సిరీస్‌ను రూపొందించామని చెప్పారు. అన్ని కళాశాలల వద్ద ప్రచారం చేస్తామని, రెండు నెలల్లో ఒక లక్ష ఏ63 ఫోన్లను విక్రయిస్తామని అన్నారు. 4.5 అంగుళాల డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ ఐస్‌క్రీం శాండ్విచ్ ఓఎస్‌తో తయారైన ఏ60 ధర రూ.5,199. రూ.17 వేల ఫోన్లు కూడా.. సెల్కాన్ ఇప్పటి వరకు రూ.13 వేలలోపు ధరలో వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. త్వరలో మోనాలిసా సిరీస్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ ప్రీమియం స్మార్ట్ఫోన్ల విభాగంలోకి అడుగు పెట్టనుంది. మోనాలిసా ఫోన్ల ధర రూ.17 వేల దాకా ఉంది. 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 12 ఎంపీ కెమెరా, వన్ గ్లాస్ సొల్యూషన్ తదితర ఫీచర్లున్నాయి. సెల్కాన్ ఈ ఏడాది ఇప్పటివరకు 50 మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. క్యాంపస్ సిరీస్‌తో సహా డిసెంబర్‌కల్లా మరో 30 దాకా మోడళ్లు రానున్నాయి. ఇటీవల సెల్కాన్ కప్ క్రికెట్ సిరీస్ చివరి వన్డే సందర్భంగా జింబాబ్వేలో క్యాంపస్ ఫోన్లను ఆవిష్కరించారు. ఎగుమతులపై ఆశాభావంతో ఉన్నామని, నెలాఖరులోగా ఆఫ్రికా దేశాల్లో ప్రవేశిస్తామని కంపెనీ తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు కూడా.. రెండు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు స్పాన్సర్ చేసిన సెల్కాన్.. దేశవాళీ క్రికెట్‌కూ తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉందని వై.గురు తెలిపారు. ‘వ్యాపారపరంగా విదేశాల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. ఇకపై దేశవాళీ సిరీస్‌లను కూడా స్పాన్సర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం’ అని అన్నారు. ఆఫ్రికాలో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఆడనప్పటికీ స్పాన్సర్ చేస్తామని వెల్లడించారు. -
సెన్సెక్స్ 450 పాయింట్లు పతనం
ఒక్క రోజు గ్యాప్ తరువాత మళ్లీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. అన్ని వైపుల నుంచి వెల్లువెత్తిన అమ్మకాలతో సెన్సెక్స్ 449 పాయింట్లు పతనమైంది. 6 వారాల తరువాత మళ్లీ 19,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. 18,733 వద్ద ముగిసింది. గత శుక్రవారం వరకూ 8 వరుస రోజుల్లో 1,138 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం నామమాత్రంగా లాభపడ్డ సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా ఇదే విధంగా స్పందిస్తూ 143 పాయింట్లు దిగజారింది. వెరసి నాలుగు నెలల కనిష్టమైన 5,542 వద్ద నిలిచింది. ఇందుకు రూపాయి పతనంతోపాటు, పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావం చూపాయి. ఫలితంగా 2009 జూన్ తరువాత మళ్లీ దేశీయ స్టాక్ మార్కెట్ల విలువ లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడింది! మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 989 బిలియన్ డాలర్ల(రూ. 60,18,504 కోట్లు) వద్ద స్థిరపడింది. కారణాలేంటి? జమ్మూ-కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్లో పాక్ నుంచి చొరబడిన సాయుధులు కొందరు ఐదుగురు భారత సైనికులను హతమార్చడంతో మంగళవారం ఉదయమే మార్కెట్లో టెన్షన్లు పెరిగాయి. ఇదికాకుండా ఇటీవల డాలరుతో మారకంలో బలహీనపడుతున్న రూపాయి ఉన్నట్టుండి 61.80కు పడిపోవడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. ఇది చరిత్రాత్మక కనిష్ట స్థాయికాగా, ఇది కరెంట్ ఖాతా లోటును మరింత పెంచనుంది. ఇక మరోవైపు వర్ధమాన మార్కెట్ల నుంచి డాలర్ల నిధులు వెనక్కు మళ్లుతాయన్న ఆందోళనలు తాజాగా చెలరేగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో ప్రస్తుతం అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలను ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే ఎత్తివేయవచ్చునన్న అంచనాలు పెరగడమే దీనికి కారణం. ఇవి చాలవన్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో ఏర్పడ్డ చె ల్లింపుల సంక్షోభం నేపథ్యంలో ‘ఈ’ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం ప్రభుత్వం నిషేధించడంతో అగ్నికి ఆజ్యం పోసి న ట్లయ్యింది. ఫలితంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అన్ని రంగాలూ డీలా బీఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-5.5% మధ్య పతనమయ్యాయి. ప్రధానంగా వినియోగ వస్తువులు, రియల్టీ, బ్యాంకింగ్, మెటల్, పవర్, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ 5.5-2% మధ్య నీర సించాయి. సెన్సెక్స్, నిఫ్టీలలో 3 షేర్లు మాత్రమే లాభపడగా, టాటా పవర్ అత్యధికంగా 15% కుప్పకూలింది. మిగిలిన దిగ్గజాలలో భెల్, హెచ్డీఎఫ్సీ, స్టెరిలైట్, టాటా స్టీల్, భారతీ, బజాజ్ ఆటో, జిందాల్ స్టీల్, ఎల్అండ్టీ 6.6-2.3% మధ్య పతనమయ్యాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ 4-2.5% మధ్య తిరోగమించగా, ఆయిల్ దిగ్గజాలు ఓఎన్జీసీ 3.3%, ఆర్ఐఎల్ 2.4% చొప్పున నష్టపోయాయి. మార్కెట్లను మించుతూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.6% నీరసించగా, స్మాల్ క్యాప్ 1.8% క్షీణించింది. ట్రేడైన షేర్లలో 1,599 నష్టపోగా, 655 మాత్రమే బలపడ్డాయి. ఎన్ఎస్ఈఎల్లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లు సైతం నిలిచిపోవడంతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 20% కుప్పకూలి రూ. 159 వద్ద ముగిసింది. ఇదే గ్రూప్ షేరు ఎంసీఎక్స్ సైతం 10% పతనమై రూ. 332 వద్ద నిలిచింది. ఎఫ్ఐఐలు రూ. 213 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. -
ఇక ఆల్టో డీజిల్ హల్చల్!
ముంబై: మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800 మోడల్లో డీజిల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. ఈ ఏడాది ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన కొత్త ఆల్టోను, వచ్చే ఏడాది ఆల్టోలో డీజిల్ వేరియంట్‌ను అందించాలని మారుతీ ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ వర్గాల సమాచారం ప్రకారం.... ఎయిర్ బ్యాగ్‌తో కూడిన కొత్త ఆల్టోలో ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియంట్లను మార్కెట్లోకి తేనున్నది. ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన ఆల్టో కార్ల ధరలు రూ.3.35 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుత ఆల్టో ధరల కంటే కొత్త ఆల్టో ధరలు సుమారుగా రూ.20,000 అధికంగా ఉండొచ్చు. వ్యాగన్ఆర్లో కూడా డీజిల్... మాతృకంపెనీ సుజుకి సహకారంతో ఆల్టో డీజిల్ ఇంజన్‌ను మారుతీ కంపెనీ భారత్‌లోనే రూపొందించిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్క ఆల్టోలోనే కాకుండా మారుతీ 800, వ్యాగన్ ఆర్, ఏ స్టార్ కార్లలో కూడా డీజిల్ ఇంజన్లు తయారు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మోడళ్లలో డీజిల్ వేరియంట్లు వస్తే, హ్యుందాయ్ ఈఆన్, ఐటెన్, షెవర్లే బీట్ తదితర కార్లకు గట్టిపోటీనిస్తాయి. అంతేకాకుండా భారత వాహన మార్కెట్లో ప్రస్తుతమున్న 40 శాతం మార్కెట్ వాటాను నిలుపుకోవడమనే లక్ష్యాన్ని కంపెనీ సులభంగా సాధించగలదని అంచనా. ఆదరణ ఉంటుంది... కొత్తగా కార్లు కొనేవారికి కొనుగోలు ధరే కాకుండా, నిర్వహణ వ్యయాలు కూడా ప్రాధాన్యత గల అంశాలే. మైలేజీని దృష్టిలో పెట్టుకుంటే డీజిల్ కార్లు ఖరీదైనవైనా సరే వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనకాడరు. పెట్రోల్ కారును కొనుక్కున్నప్పటికీ, సీఎన్జీ, ఎల్పీజీ కిట్ల కోసం అదనంగా రూ. 50 వేల వరకూ ఖర్చు చేయడానికి వినియోగదారులు ముందుకు వస్తుంటారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మారుతీ చిన్న కార్లలో డీజిల్ వేరియంట్ల అమ్మకాలకు ఢోకా ఉండదనేది నిపుణుల అభిప్రాయం. -
ఆర్బీఐ జోక్యంతో రూపాయి రికవరీ
ముంబై: రూపాయి మారకం విలువ మంగళవారం చాలా నాటకీయ పరిణామాలకు లోనైంది. ఇంట్రాడేలో మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయి 61.80కి పడిపోయి.. అంతలోనే మళ్లీ కోలుకుని, 11 పైసల లాభంతో 60.77 వద్ద ముగిసింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవడం, చివర్లో ఎగుమతిదారులు భారీగా డాలర్లను విక్రయించడం రూపాయి రికవరీకి తోడ్పడిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు.. 60.88తో పోలిస్తే బలహీనంగా 61.05 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో ఒక దశలో కొత్త రికార్డు కనిష్టమైన 61.80కి కూడా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ జూలై 8న చివరిసారిగా 61.21 కనిష్ట స్థాయిని (ఇంట్రాడే) తాకింది. తాజాగా ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి 11 పైసల లాభంతో 60.77 వద్ద క్లోజయ్యింది. అమెరికాలో రికవరీ సంకేతాలతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను ఉపసంహరించవచ్చన్న ఆందోళనలు మరోసారి తలెత్తడం సైతం ఈ పరిణామానికి దారితీశాయని ధన్లక్ష్మి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ట్రెజరీ) శ్రీనివాస రాఘవన్ చెప్పారు. అమెరికా పరిణామాలపై ఎక్కువగా ఆధారపడటమనేది దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ఫారెక్స్ మార్కెట్లలో ఆర్బీఐ జోక్యం చేసుకుని ఉండొచ్చని, తద్వారా రూపాయి కోలుకుని ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. ప్రతికూల సెంటిమెంట్ కారణంగా రూపాయి రానున్న రోజుల్లో 62 స్థాయికి క్షీణించగలదని ఆయన చెప్పారు. రూపాయి స్థిరత్వానికి చర్యలు: చిదంబరం రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు, దేశీ కరెన్సీని స్థిరపర్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం రాజ్యసభకు తెలిపారు. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) పెరుగుతుండటానికి, రూపాయి పతనానికి దారితీస్తున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తోందని వివరించారు. మరోవైపు, ముడిచమురు, బంగారం దిగుమతుల వల్లే క్యాడ్ పెరుగుతోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులు తగ్గించడం ద్వారా క్యాడ్‌ను కట్టడి చేసేందుకు పలు చర్యలు ఇప్పటికే తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూపాయి క్షీణతను అడ్డుకునే దిశగా స్వల్పకాలికమైన దిద్దుబాటు ప్రయత్నాలను కూడా చేయాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి పీఎంఈఏసీ చైర్మన్ సి. రంగరాజన్ సూచించారు. ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేషన్ కార్యకలాపాలను నియంత్రించాలని ఆయన చెప్పారు. రూపాయి స్థిరత్వానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. డాలరు బలపడుతున్న నేపథ్యంలో రూపాయే కాకుండా మిగతా దేశాల కరెన్సీలు కూడా క్షీణిస్తున్నాయని వివరించారు. -
రాజన్ చేతికి ఆర్బీఐ పగ్గాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి అత్యున్నత నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో కొత్త సారథి కొలువుదీరనున్నారు. ప్రపంచ విఖ్యాత ఆర్థిక రంగ నిపుణుడు రఘురామ్ గోవింద్ రాజన్.. ఆర్బీఐ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టనున్నారు. వచ్చే నెల 4న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత గవర్నర్ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజన్ నియామకానికి పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం 2008లో ప్రపంచదేశాలను అల్లాడించిన ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన రాజన్... ఎంతోమంది నిపుణులు, విశ్లేషకులను నివ్వెరపరిచారు. ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన ఎలాంటి విధానాలను అమలుచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రూపాయి కనీవినీఎరుగని రీతిలో పాతాళానికి పడిపోవడం, విలవిల్లాడుతున్న స్టాక్ మార్కెట్లు... ఆర్థిక మందగమనం వంటివి దేశాన్ని కుదిపేస్తున్నాయి. దీనికితోడు అధిక వడ్డీరేట్లు, ధరల మంటల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తారో వేచిచూడాల్సిందే. న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురామ్ జి. రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. 50 సంవత్సరాల రాజన్, మూడేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4వ తేదీన పదవీ విరమణ చేయనున్న దువ్వూరి సుబ్బారావు స్థానంలో రాజన్ బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రేట్ల వైఖరిపై సర్వత్రా ఆసక్తి! ద్రవ్యోల్బణంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధి రేటుకూ సైతం ఆర్బీఐ ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకు అనుగుణంగా పాలసీరేట్లను సైతం తగ్గించాలని కేంద్రం చేస్తున్న సూచనలకు ఇప్పటివరకూ రాజన్ సానుకూల రీతిలో స్పందిస్తూ వచ్చారు. డాలర్ మారకంలో రూపాయి విలువ కిందకు జారిపోవడాన్ని నిలువరించడానికి, ఒడిదుడుకులను నివారించడానికి ఆర్బీఐ ఇటీవల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరమైన కఠిన విధానాన్ని సమర్థిస్తూనే... ఆర్బీఐ రూపాయితోపాటు ఆర్థికాభివృద్ధి రేటుపైనా దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక మందగమనం, తీవ్ర ఆహార ఉత్పత్తుల ధరలు, రూపాయి క్షీణత, తీవ్ర కరెంట్ అకౌంట్ లోటు వంటి సవాళ్లతో కూడిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో- ద్రవ్యోల్బణం నియంత్రణే ప్రధాన ధ్యేయంగా దువ్వూరి సుబ్బారావు ఇప్పటివరకూ అనుసరిస్తూ వచ్చిన కఠిన విధానాన్ని రాజన్ కూడా కొనసాగిస్తారా...? లేక తనదైన శైలిలో ముందుకు వెళతారా అన్నది ప్రస్తుతం విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చ. మంత్రదండం లేదు... ఆర్బీఐ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే రాజన్ స్పందిస్తూ... ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇబ్బందులను మాయం చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే సవాళ్లను ఎదుర్కొనగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. సర్వోన్నత సమగ్రత, స్వతంత్రత, వృత్తి నిపుణత కలిగిన సంస్థగా ఆర్బీఐని ఆయన అభివర్ణించారు. పాలక, పారిశ్రామిక వర్గాల హర్షం రాజన్ నియామకం పట్ల పాలక, పారిశ్రామిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమయ్యింది. రాజన్ చక్కటి నిర్ణయాలు తీసుకుని బాగా పనిచేయగలరన్న అభిప్రాయాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సి.రంగరాజన్ వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలో అత్యంత ప్రతిభావంతుడైన రాజన్ నుంచి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధికి తగిన సంకేతాలు, మార్గదర్శకాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా వ్యక్తం చేశారు. గవర్నర్‌గా మంచి నిర్ణయాలు తీసుకోడానికి ఆర్థిక రంగంలో ఆయన అపార అనుభవం దోహదపడుతుందని సీఐఐ మాజీ ప్రెసిడెంట్ ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. రాజన్ లాంటి ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం మనకు అదృష్టమని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ అన్నారు. రాజన్ ఎంపిక ‘చాలా చక్కనిది’ అని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడిలో, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడంలో ఆయన విజయం సాధించగలరని అసోచామ్ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. చిన్న వయసులోనే.. ఆర్బీఐ గవర్నర్‌గా అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తుల్లో రాజన్ ఒకరు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5న బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాల 6 నెలలుగా ఉంటుంది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ 1982లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన తన 50వ పుట్టిన రోజుకు 10 రోజుల దూరంలో ఉన్నారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్, 1982 సెప్టెంబర్ 16న ఆర్బీఐ పగ్గాలు చేపట్టారు. ఆర్బీఐకి అతి చిన్న వయసులో గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రికార్డు ఇప్పటికీ సర్ సీడీ దేశ్‌ముఖ్‌కే దక్కుతుంది. 1943లో కేవలం 47 ఏళ్ల వయస్సులోనే ఆయన ఈ బాధ్యతల్లో నియమితులయ్యారు. 1947లో భారత్ స్వాతంత్య్రం పొందే వరకూ ఆయన కొనసాగారు. ఈ పదవిలో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు కూడా ఆయనే. గత పదేళ్ల కాలంలో నాన్-సివిల్ సర్వెంట్‌గా ఆర్బీఐ గవర్నర్ కుర్చీలోకి రాబోతున్న వ్యక్తి రాజన్. ఇంతక్రితం బిమల్ జలాన్ నాన్-ఐఏఎస్‌గా ఈ బాధ్యతలను నిర్వహించి 2003లో పదవీ విరమణ చేశారు. రచనలు... సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ది క్యాపిటలిస్ట్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ ముప్పుగా పొంచి ఉన్న పెను సవాళ్ల గురించి ఆయన రచించిన ‘ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకం అత్యధిక ప్రాచుర్యం పొందింది. భారత్‌లో ప్రణాళికా సంఘానికి సంబంధించి ఆర్థిక రంగ సంస్కరణలపై నివేదికను రూపొందించడంలో కూడా ఆయన కీలక బాధ్యతలు పోషించారు. అత్యున్నతస్థాయి బాధ్యతలు... గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ ఎకనమి స్ట్‌గా పనిచేసిన రాజన్, గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ)గా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేస్తున్న కౌశిక్ బసు స్థానంలో ఆయన ఆగస్టులో ఈ బాధ్యతలు చేపట్టారు. సీఈఏగా బాధ్యతలను చేపట్టే నాటికి ఆయన షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ప్రధాన మంత్రికి గౌరవ ఆర్థిక సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. ముందుచూపు... ఆర్థిక అంశాల విశ్లేషణలో తనకంటూ ఒక ప్రత్యేకత. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన అతి కొద్ది మంది ఆర్థికవేత్తల్లో ఒకరిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. -
గత 2 రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాం: ఎంపీ హర్షకుమార్
న్యూఢిల్లీ: రాష్ట్రవిభజనపై నిరసనగా సీమాంధ్రలో పెద్దఎత్తునా ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర మంత్రులు కూడా పార్లమెంటును విభజన సెగతో కాకపుట్టించారు. గత రెండు రోజులుగా పార్లమెంట్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర మంత్రులు సమైక్యా నినాదాలతో పార్లమెంట్లో హొరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తాము రెండు రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించామన్నారు. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై రేపు కూడా సమావేశమవుతామని హర్షకుమార్ తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా ఉన్న విషయాన్ని అధిష్టానం గుర్తించిందన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు కలిసి ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అవసరమైనప్పుడు మంత్రులు కూడా సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొంటారని హర్షకుమార్ చెప్పారు. -
మేఘాలయలోనూ ‘ప్రత్యేక’ నిరసనలు
డార్జిలింగ్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశంలోని పలుచోట్ల ఇప్పటికే ‘ప్రత్యేక’ ఉద్యమాలు ఉపందుకోగా, తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోనూ ‘ప్రత్యేక’ నిరసనలు మొదలయ్యాయి. డార్జిలింగ్, అస్సాంలలో బంద్‌లు ఉధృతమైయ్యాయి. మేఘాలయలో గారో, ఖాసీ-జయింతియా గిరిజన ప్రాంతాలను రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలంటూ ఐదు జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసనలు మొదలయ్యాయి. గారో హిల్స్ రాష్ట్ర ఉద్యమ కమిటీ, హిల్స్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ , గారో నేషనల్ కౌన్సిల్ తదితర పార్టీలు, ప్రజా సంస్థలు దాదాపు ఇరవయ్యేళ్లుగా ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తున్నాయి. భాషా ప్రాతిపదికన గారోలాండ్, ఖాసీ-జయింతియా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని జీఎన్సీ ఎమ్మెల్యే క్లిఫర్డ్ మారక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
ఘర్షణకు దారి తీసిన రోడ్డు క్రాసింగ్
ముజఫర్‌నగర్: ఢిల్లీ-హరిద్వార్ నేషనల్ హైవేపై రోడ్డు దాటే విషయంలో రెండు వర్గాలకు చెందిన శివ భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లాలోని సిసోనా గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు కావడ్ యాత్రికులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రోడ్డు దాటే విషయంలో ఈ ఘర్షణ జరిగిందని వివరించారు. ఈ గొడవను నియంత్రించేందుకు స్వల్ప లాఠీ చార్జీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. నలుగురు యాత్రికులు అంకూర్, కుల్దీప్, సందీప్, సోనూలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రతియేటా హరిద్వార్‌లోని గంగా నదిలో పవిత్ర స్నానం చేసి భక్తులు కావడీలో నీటిని తీసుకెళ్లి సొంతూర్లోని శివునికి పూజలు చేయడం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. -
వరదల పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
ఏలూరు: జిల్లా అధికారులతో వరదల పరిస్థితిని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ సమీక్షించారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలను కలెక్టర్ కోరారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను 600 మంది సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సేవల కోసం 50 పడవలను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు. పోలవరం మండలంలోని ముంపు గ్రామాలను రేపు కలెక్టర్ సందర్శించనున్నారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. -
‘కేసీఆర్ మీడియా దృష్టిని మరలిస్తున్నారు’
చిత్తూరు: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీడియా దృష్టిని మరలిస్తున్నారని పరకాల ప్రభాకర్ విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్‌పై హత్యాయత్నం ఆరోపణలు చోటు చేసుకున్న నేపథ్యంలో పరకాల మండిపడ్డారు. కేసీఆర్ మీడియా దృష్టిని మరల్చేందుకే ఈ కొత్త ఎత్తగడకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని పరకాల ప్రశ్నించారు. తెలుగు మహసభలు జరిగే ఆరు నెలలు కాకుండానే రాష్ట్ర విభజన చేయడం న్యాయమా? అని నిలదీశారు. కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ఆపార్టీ నేతలు మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కుట్రలపై పూర్తిస్థాయిలో విచారణ జరించాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. -
సీమాంధ్రుల అభిప్రాయాలను పరిశీలిస్తాం:సోనియా
న్యూఢిల్లీ: సీమాంధ్ర నేతల అభిప్రాయలను పరిశీలిస్తామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పళ్లంరాజు చెప్పారు. సీమాంధ్రకు చెందిన ఏడుగురు కేంద్ర మంత్రులు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసిన తరువాత పళ్లంరాజు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమ తీవ్రతను, సీమాంధ్రుల అభద్రతా భావాన్ని సోనియాకు వివరించినట్లు చెప్పారు. సీమాంధ్రుల మనోభావాలను గౌరవించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణపై కమిటీ పూర్తి అయ్యేంతవరకు విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన చెప్పారు. ఆంటోనీ కమిటీకి అన్ని వివరాలు చెప్పమని సోనియా కోరినట్లు తెలిపారు. శాంతియుతంగా ఉండాలని సీమాంధ్ర ప్రజలను కోరుతున్నామన్నారు. -
రేపటి నుంచి బంద్ సడలింపునకు జేఏసీ నిర్ణయం
ప.గో: రంజాన్ పండుగ దృష్ట్యా రేపటి నుంచి బంద్‌ను సడలించేందుకు సమైక్యాంధ్రా జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఏలూరు రెవెన్యూ భవన్లో మంగళవారం భేటీ అయిన సమైక్యాంధ్రా జేఏసీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాఠశాలలు, వ్యాపార సంస్థలు తెరుచుకుని సూచనలు కన్పిస్తున్నాయి. కాగా, నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 8న అన్ని సంఘాలతో మహాధర్నా చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. 9వ తేదీన ఏలూరు ఆశ్రమ్ పాఠశాల వద్ద జాతీయ రహదారిని దిగ్భందించనున్నామని, 10వ తేదీన విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఆగస్టు 11వ తేదీన సామూహిక దీక్షలకు దిగుతామని, 12న ఏలూరులో సంపూర్ణ బంద్ ప్రకటించనున్నట్లు వారు తెలిపారు. -
కాస్త శాంతించిన గోదావరి
ఖమ్మం: వరద నీటితో పొంగుతున్న గోదావరి కాస్త శాంతించింది. పరీవాహక ప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం, పాల్వంచ డివిజన్లోని ఏజెన్సీ గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. వరద ఉధృతి కాస్త శాంతించడంతో ఇప్పుడిప్పుడే అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాను గోదావరి వరదలు ముంచెత్తాయి. వందల గ్రామాలు వరద ముంపులో చిక్కుకొని అల్లాడుతున్నాయి. సాయం అందక లోతట్టు ప్రాంతాల ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గోదావరి వరద 62 అడుగులు చేరి ప్రవహించడంతో భద్రచలం, పాల్వంచ డివిజన్లు అతాలాకుతలం అయ్యాయి. గత రెండు రోజులుగా వరద ఉధృతి తగ్గుముకం పట్టింది. ప్రస్తుతానికి గోదావరి వరద ఉదృతి తగ్గి 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. -
నరేంద్ర మోడీపై దాఖలైన పిల్‌పై రేపు విచారణ
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడనే ఆరోపణలపై ప్రజా ప్రయోజన వాజ్యం హైకోర్టులో దాఖలైంది. నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి రాకుండా ఆదేశించాలని ఓ పిటిషనర్ పిల్లో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి విచారణ రేపు హైకోర్టులో కొనసాగనుంది. ఎల్బీ స్టేడియంలో జరగనున్ననవభారత్ యువభేరీ సభకు నరేంద్ర మోడీ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నవభారత్ యువభేరీ సభపై యువత అనూహ్యమైన ఉత్సుకత ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హాజరయ్యే వంద ర్యాలీల్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభ మొదటి కావడం విశేషం. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న నవభారత్ యువభేరీకి హాజరు కావడానికి ఇప్పటి వరకు లక్ష మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సభ జరగనుంది. ఈ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిలో 50 శాతం మందికి పైగా సభకు హాజరవుతారని అంటున్నారు. ఇప్పటి వరకు సభకు రావడానికి పేర్లు నమోదు చేయించుకున్నవారిలో మూడొంతుల వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉన్నారు. తర్వాత తెలంగాణ జిల్లాల నుంచి, సీమాంధ్ర ప్రాంతం నుంచి కూడా మోడీ సభకు వచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. మోడీ సభకు పేర్ల నమోదుకు హైదరాబాదులోని 20 ప్రధాన ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
నిమ్మగడ్డకు తాత్కాలిక బెయిల్ మంజూరు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్మోహనరెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి గత కొన్ని నెలలుగా జైల్లో ఉన్న నిమ్మగడ్డకు రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది. నిమ్మగడ్డ బెయిల్‌కు సంబంధించిన పిటిషన్ ను మంగళవారం విచారించిన సీబీఐ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ బెయిల్‌కు సంబంధించి కేసును ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. మోపిదేవి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మెడికల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. -
సోనియాతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన ఏడుగురు కేంద్ర మంత్రులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రం విభజిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో సీమాంధ్రలో చెలరేగిన ఉద్యమం గురించి మంత్రులు క్షేత్రస్థాయిలో సోనియాకు వివరించారు. సమైక్యాంధ్ర వాణి వినిపించారు. రాజధాని, హైదరాబాద్ అంశం, నదీజలాలు, ఉద్యోగుల భద్రతపై వారు చర్చించారు. కేంద్రం నుంచి స్పష్టత కావాలని సీమాంధ్ర మంత్రులు సోనియాను కోరారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, పురందేశ్వరీ, కిల్లి కృపారాణి, చిరంజీవి, జెడి శీలం పాల్గొన్నారు. కేంద్ర సహాయమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హాజరుకాలేదు. ఆయన ఉదయం కర్నూలు జిల్లా నేతలతో కలిసి వెళ్లి సోనియాను కలిశారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు నిన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిన విషయం తెలిసిందే. వారందరూ సమైక్యవాదాన్ని వినిపించారు. నిన్న దిగ్విజయ్ సింగ్‌ను కలిసినవారిలో ఈ ఏడుగురు మంత్రులతోపాటు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర తీర్మానాన్ని వారు దిగ్విజయ్ సింగ్‌కు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి, జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌పై తాము లేవనెత్తి అంశాలను లిఖితపూర్వకంగా తెలియజేయమని దిగ్విజయ్ సింగ్ కోరినట్లు చెప్పారు. హైలెవల్ కమిటీ ముందు త్వరలోనే తమ వాదనలను వినిపిస్తామన్నారు. -
టెస్ట్ ర్యాంకింగ్‌లో పూజారాకు 6వ స్థానం
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో భారత ఓపెనింగ్ టెస్టు ఆటగాడు పూజారాకు తిరిగి చోటు సంపాదించుకున్నాడు. 777 పాయింట్లతో ఉన్న చటేశ్వర పూజారా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లో 6వ స్థానానికి చేరుకున్నాడు. టాప్ 20లో భారత్ తరుపున పూజారాకు ఒక్కడికే స్థానం దక్కడం గమనార్హం. ఇదిలా ఉండగా, టెస్టు ర్యాంకింగ్‌లో దక్షిణాఫ్రికా అటగాడు హషీమ్ ఆమ్లా 903 పాయింట్లతో ప్రధమ స్థానం దక్కించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ర్యాంకింగ్ దిగజార్చుకున్న ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. యాషెస్ తొలి టెస్టులో 187 పరుగులతో రాణించడంతో రెండవ స్థానాన్ని సాధించాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ ఇద్దరు భారత బౌలర్లకు మాత్రమే స్థానం దక్కింది. రవిచందన్ అశ్విన్‌కు 8 స్థానంలో కొనసాగుతుండగా, ప్రజ్ఞాన్ ఓజా , 10 వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. -
కాజల్‌ను పక్కన పెట్టారా?
ప్రేక్షకుల ఆదరణను విశేషంగా చూరగొన్న ఏ హీరోయిన్నూ చిత్ర పరిశ్రమ వదులుకోదు. ఒక వేళ పక్కన పెట్టిందంటే అందుకు బలమైన కారణం ఉండే ఉంటుంది. నటి కాజల్ అగర్వాల్ విషయంలో అలాంటి కారణమేమైనా ఉందా? ఆమెను టాలీవుడ్ దూరంగా పెట్టిందా? అనే ప్రశ్నలకు అవుననే బదులొస్తోంది. వరుసగా హిట్ చిత్రాలలో నటించి అనతి కాలంలోనే తమిళం, తెలుగు భాషలలో ప్రముఖ హీరోయిన్ స్థానానికి చేరుకుంది కాజల్. ఈ అందాల రాశికి టాలీవుడ్లో ప్రస్తుతం అవకాశాలు తగ్గాయట. ఇందుకు ఆమె అత్యాశే కారణం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తన విజయూలను చూపుతూ పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట. తాను కోరినంత పారితోషికం చెల్లిస్తేనే కాల్షీట్స్ అని తెగేసి చెప్పడంతో నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారట. ఆ విధంగా ఈ బ్యూటీ తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ చిత్రాలను చేజార్చుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో మాత్రమే రెండు చిత్రాలు చేస్తోంది. ఇక్కడా అత్యాశతో ఒక ప్రముఖ హీరో చిత్రం మిస్ అయిందని టాక్. అనవసరంగా పారితోషికం పెంచేసి తొందరపడ్డానా అని పునరాలోచనలో పడిందట ఈ ఉత్తరాది జాణ. -
అసాధారణ ప్రతిభావంతుడు రాజన్
రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. అదే రోజు 23 గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. రాజన్ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంకుకు ఐఏఎస్ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్ అధికారులే. ఐఏఎస్ కాకపోయినా రాజన్‌కు గవర్నర్ పదవి దక్కడానికి ఆయన మేధస్సే ప్రధాన కారణం. అసాధారణమైన ప్రతిభావంతుడిగా రాజన్‌కు పేరుంది. ప్రస్తుతం భారత దేశం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు చేపట్టడం ఆశాజనకమైన పరిణామం. రఘురామ్ రాజన్ భోపాల్‌లో 1963 ఫిబ్రవరి 3న జన్మించారు. ఆయన తండ్రి దౌత్యవేత్త. అందువల్ల 7వ తరగతి వరకు రాజన్ విదేశాల్లోనే చదువుకున్నారు. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో చదువుకున్నారు. 1985లో ఢిల్లీ ఐఐటీ నుంచి గోల్డ్ మెడల్‌తో బీటెక్ పట్టా అందుకున్నారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. బ్యాంకింగ్ రంగంపై సమర్పించిన పత్రానికి ఎంఐటి పీహెచ్డీ మంజూరు చేసింది. రాజన్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పని చేశారు. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఫైనాన్స్ రంగంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అదే ఏడాది మన దేశానికి గౌరవ ఆర్థిక సలహాదారుగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నియమించారు. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యంత చిన్న వయసులో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దువ్వూరి సుబ్బారావు తొలుత మూడేళ్ల కోసం గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం మరో రెండేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. సుబ్బారావు హయాంలో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఆయన వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లారు. ఈ పరిణామం కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని పెద్ద కంపెనీలు కూడా వాయిదాలు కట్టలేక చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరానికి, సుబ్బారావుకు మధ్య దూరం పెరిగింది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న రాజన్ ఈ దూరాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్నిఅణచేందుకు కుట్ర
అనంతపురం: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచి వేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీమాంధ్ర ఉద్యమ సెగలు ఏడో రోజు కూడా ఎగసి పడటంతో పోలీసులు ఆ ఉద్యమాన్ని అణచి వేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ఉద్యమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత ఎర్రస్వామి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎర్రస్వామని ఏ కారణం లేకుండా అరెస్టు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాపటు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలో ఉద్యమం ఉదృతమైన సంగతి తెలిసిందే. ఏడో రోజు కూడా సమైక్యాంధ్ర కోరుతూ ఆందోళన కారులు కదం తొక్కారు. అంతకంతకూ సీమాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. దీంతో నిరసనకారులను అరెస్టు చేస్తూ.. ఉద్యమాన్ని అణచి వేసేందుకు యత్నిస్తున్నారు. ఆందోళనలో భాగంగా మంగళవారం ఉద్యమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసుల అదుపులోకి తీసుకుంటున్నారు. -
పాక్ చర్యలను బట్టే భారత్ స్పందన: ఏకే ఆంటోనీ
కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేతపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్ చర్యలను బట్టే భారతదేశం స్పందన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. పాకిస్థానీ సైన్యం యూనిఫాం ధరించిన వ్యక్తులతో కలిసి ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తమకు కచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలిపారు. అంతకుముందు పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. లోక్‌సభ సమావేశం కాగానే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్‌వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. -
ఇద్దరు వ్యక్తులు కనిపించడం లేదు!: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యమం ఎగసి పడుతుంటే ఇద్దరు వ్యక్తులు కనిపించడం లేదని.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా, ఉద్యమంలో ఎక్కడ కనిపించకపోవడం శోచనీయమన్నారు. ప్రజలకు ధైర్యం చెప్పి నమ్మకాన్ని కల్పించాల్సిన వారిద్దరూ అండర్ గ్రౌండ్లో దాకున్నారన్నారు. తన వాదననను గట్టిగా వినిపిస్తే సీఎం పదవికి ఎసరు వస్తుందనే భయంతో కిరణ్ దూరంగా ఉండగా, చంద్రబాబు తన ఆస్తులను కాపాడు కోవడానికి మౌనంగా ఉన్నారని శోభా తెలిపారు. దీంతో సీమాంధ్ర ఉద్యమానికి తీరని ద్రోహం జరుగుతుందన్నారు. ప్రతీ చిన్నవిషయానికి హడావిడి చేసే చంద్రబాబు ఎందుకు మౌనం దాల్చారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పార్లమెంట్లో బొమ్మల్లాగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి పార్లమెంట్లో రాజకీయ డ్రామా చేస్తున్నారన్నారు.రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది వారే.. ఉద్యమాల్లో పాల్గొంటున్నది వారేనని ఎద్దేవా చేశారు. ఆరు నెలల పదవి కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టారన్నారు. కోట్ల మంది తెలుగు ప్రజల సమస్యను ఆంటోని, దిగ్విజయ్ సింగ్‌లు ఎలా పరిష్కరిస్తారిని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పదిహేను ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నేత షర్మిలను విమర్శించే హక్కు టీఆర్ఎస్ నేత హరీష్‌రావుకు లేదని, కేసీఆర్ ఏ రకంగా మాట్లాడుతున్నారో గుర్తుపెట్టుకోవాలని శోభా నాగిరెడ్డి సూచించారు. -
12 అర్ధరాత్రి నుంచి ఎపిఎన్జిఓల సమ్మె
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న ఎపిఎన్జిఓ సంఘం సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ఈ నెల 12 అర్థరాత్రి నుంచి సమ్మె చేపట్టాలని ఎపిఎన్జిఓ సంఘం నేతలు తీర్మానించారు. ఈ మేరకు వారు సమ్మె నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి అందజేశారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని వారు ఆరోపించారు. దీన్ని తాము సహించమని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. జీతాలు నష్టపోయినా, ఉద్యోగాలకే ప్రమాదం వచ్చినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ డిమాండ్‌లో మార్పు ఉండదని సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలపడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఎపి ఎన్జీఓలు కూడా తమ ఆందోళనను ఉధృతం చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలన్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యాఖ్యలు అలజడిని సృష్టించాయి. దాంతో ఎపి ఎన్జీఓలు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఇళ్లను కూడా ముట్టడించారు. కొన్ని చోట్ల వారిని నిలదీశారు. ఈ రోజు సమ్మె నోటీసు ఇచ్చారు. -
‘హైదరాబాద్‌లో అందరం కలిసి ఉందాం’
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమని తేలినా, సీమాంధ్రులు అడ్డుపడుతున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో అంతా కలిసి ఉందామని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీమంధ్రాలో ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు ప్రాంతాల వారీగా విడిపోయి, అన్న దమ్ముల వలే కలిసుందామన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఎటువంటి ఉద్రేకాలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15న హైదరాబాద్ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.