Latest News
-
విద్యార్థుల కోసం ఆఫీస్ 365 యూనివర్సిటీ
ఇంటర్నెట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం 'ఆఫీస్ 365 యూనివర్సిటీ'ని విడుదల చేసింది. ఇందులో మొత్తం ఆఫీస్ అప్లికేషన్లుంటాయి. వీటిని రెండు పీసీలు లేదా మ్యాక్‌లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో ఆఫీస్ ఆన్ డిమాండ్, 20 జీబీ ప్రీమియం స్కైడ్రైవ్ స్టోరేజి కూడా ఉంటాయి. నాలుగేళ్ల పాటు వ్యాలిడిటీలో ఉండే ఈ ప్యాకేజి ధర 4,199 మాత్రమే. దేశంలోని విశ్వవిద్యాలయాలు, గుర్తింపు ఉన్న కాలేజీలలో చదివేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. విద్యార్థులకు ఈ ప్రత్యేక ధర పెట్టడం వల్ల వారు భవిష్యత్తులో అవకాశాలను అందిపుచ్చుకోడానికి వీలుగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం ఆర్ పిచాయ్ తెలిపారు. దీనివల్ల పని చాలా సులభం అవుతుందని, ఒకేసారి డాక్యుమెంట్లు లేదా నోట్స్‌ను ఎడిట్ చేసి, షేర్ చేసుకుని, క్లౌడ్‌లో స్టోరేజి కూడా చేసుకోవచ్చని చెప్పారు. దీన్ని కొనాలంటే విద్యార్థులు ఆఫీస్ వెబ్సైట్లోకి వెళ్లి తమ అర్హతను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం వారు తమ యూనివర్సిటీ వివరాలను పేర్కొని, దాన్ని పరిశీలించుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చని వివరించారు. విద్యార్థులతో పాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో లెక్చరర్లు, అధ్యాపకులు, సిబ్బంది కూడా ఆఫీస్ 365 యూనివర్సిటీని కొనుగోలు చేసుకోవచ్చన్నారు. -
విభజనపై చంద్రబాబు మౌనం ఎందుకు?
అనంతపురం: ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మౌనంగా ఎందుకు ఉన్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల వారు అభివృద్ధి చేసిన తర్వాతే విభజనపై ఆలోచించాలని వివేకా తెలిపారు. విభజన అంశంపై మంగళవారే విలేకర్లతో మాట్లాడిన వివేకానంద రెడ్డి..చంద్రబాబు మౌనాన్ని ప్రశ్నించారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో ఆయన మౌనంగా ఉండటం తగదన్నారు. పదవీకాంక్షతోనే కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు నోరు మెదపడం లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. జిల్లాలో అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం.. హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని మడకశిర, కదిరి, పెనుకొండ, హిందూపురం శాసనసభ స్థానాల పరిశీలకుడిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతలను వైఎస్ వివేకానందరెడ్డికి అప్పగించారు. -
రాజకీయ స్వార్థానికి పరాకాష్ట:ఎపి ఎన్జీఓలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన రాజకీయ స్వార్ధానికి పరాకాష్ట అని ఏపీ ఎన్జీవో నేతలు అన్నారు. పార్టీలకతీతంగా ఎంపీలంతా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలని కోరారు. రాజీనామాలతోనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వారు చెప్పారు. సీట్లు, ఓట్ల వేటలో యూపీఏ-2 ప్రభుత్వం ఉందని వారు విమర్శించారు. ఉద్యోగులమైన తమకు సామాజిక బాధ్యత కూడా ఉందని వారు చెప్పారు. అందుకే సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలపడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఎపి ఎన్జీఓలు కూడా తమ ఆందోళనను ఉధృతం చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అనడంతో వారు సమ్మె హెచ్చరిక చేశారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఇళ్లను కూడా ముట్టడించారు. కొన్ని చోట్ల వారిని నిలదీశారు. -
త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
హైదరాబాద్: త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని మంత్రి జానారెడ్డి తెలిపారు. ఏకగ్రీవమైన చిన్న పంచాయతీలకు రూ. ఏడు లక్షల ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే మేజర్ పంచాయతీలకు రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన జానారెడ్డి .. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గురించి గళం విప్పారు. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని పంచాయతీలు వినియోగించుకోవాలని జానా అన్నారు. కేసీఆర్‌పై హత్యాయత్నం చేస్తున్నారనే సమాచారం ఏదీ తనకు అందలేదని తెలిపారు. రాష్ర్ట విభజనకు సంబంధించి గతంలోనే ఆయన స్పందించిన విషయం తెలిసిందే. అభివృద్ధి కుంటుపడకముందే, పరిస్థితి చేయిజారకముందే, అవాంఛనీయ పరిణామాలు తలెత్తకముందే అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు ఆయన తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కారించుకుందామని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. రెండు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. -
'తెలంగాణ' ఏర్పాటు సరైన చర్య కాదు: ప్రమోద్ బోరా
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు సరైన చర్య కాదని అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్యు) అధ్యక్షుడు ప్రమోద్ బోరా మంగళవారం రాటలో జరిగిన విలేకర్ల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఓ విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలు కలసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఏబీఎస్యు ఇచ్చిన 15 వందల గంటల బంద్ నిరాటంకంగా సాగుతోంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలం అంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దాంతో దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వివిధ సంస్థలకు ఊపిరిలూదినట్లు అయింది. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులకుపైగా నిత్య నిరసనలు, తీవ్ర ఆందోళనలతో అసోం రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజ జీవనం అస్తవ్యస్తమైంది. కార్బి అంగ్లాంగ్ జిల్లాను ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలని రెండు సంఘాలు 64 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలోని అన్నిపార్టీల నేతలు యూపీఏ చైర్మన్ సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసేందుకు న్యూఢిల్లీ పయనమైయ్యారు. అయితే జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా అంత సవ్యంగానే ఉందని కార్బి అంగలాంగ్ జిల్లా అధికారులు తెలిపారు. దాంతో ఆరుగంటలపాటు కర్ఫ్యూ ను సడలించినట్లు చెప్పారు. జిల్లాలోని మంజలో పారెస్ట్ కార్యాలయన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను భద్రత దళాలు అరెస్ చేసినట్లు చెప్పారు. బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూడీపీఎఫ్ సోమవారం పిలుపు నిచ్చింది. దాంతో దిగువ అసోంలోని అయిదు జిల్లాలు పూర్తిగా ప్రజాసేవలు నిలిచిపోయాయి. దాంతో జనాలు ఇళ్లకే పరిమితమైనారు. అయితే ఈద్ పండగ నేపథ్యంలో బంద్ పాక్షికంగా నిర్వహించాలిన 60 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీఎస్‌యూ నిర్ణయించింది. అలాగే 11 రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే వెల్లడించింది. అలాగే రాజధాని, సరయిగాట్,కామరుప్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు బ్రహ్మపుత్ర మెయిల్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్
రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌గా రఘురామ్ జి రాజన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. దువ్వూరి ఐదేళ్ల పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది. ఆర్బీఐ గవర్నర్ పదవిలో రఘురామ్ జి రాజన్ మూడేళ్ల పాటు కొనసాగుతారని అధికార ప్రకటనలో తెలిపారు. రాజన్ ప్రస్తుతం ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయనను గతేడాది ఆగస్టులో ఈ పదవిలో నియమించింది. గతంలో ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ప్రధానికి గౌరవ ఆర్థిక సలహాదారుగానూ కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పలు సవాళ్లు ఎదుర్కొనున్నారు. రూపాయి పతనం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఐటీ-అహ్మదాబాద్, ఐఐటీ-ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాజన్ 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా ఊహించారు. -
స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణ అంటున్నారు: సంతోష్ హెగ్డే
దేశంలో రాష్ట్రాలు ఎక్కువైతే దేశ సమైక్యతకు భంగం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్నా హజారే బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న హెగ్డే తెలంగాణ అంశంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇస్తామని ప్రకటించడం వల్ల దేశంలో మరిన్ని రాష్ట్రాల కోసం డిమాండ్లు తెరపైకి వస్తాయని, ఇప్పటికే మహారాష్ట్రలో విదర్భ, అసోంలో బోడోల్యాండ్, ఉత్తరప్రదేశ్ నుంచి నాలుగు రాష్ట్రాలు వేరు చేయాలని మాయావతి డిమాండ్ చేయడం లాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. అసలు 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించడమే మనం చేసిన అతిపెద్ద తప్పని, ఇప్పుడు దాని ఫలితాన్ని మనందరం అనుభవిస్తున్నామని సంతోష్ హెగ్డే చెప్పారు. ఇప్పుడు ఇంకా విభజించుకుంటూ పోతే అది మన దేశ ఐక్యతను దెబ్బ తీస్తుందన్నారు. స్వార్థ ప్రయోజనాలు ఉన్న కొంతమంది మాత్రమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారని జస్టిస్ హెగ్డే తెలిపారు. గడిచిన 20 ఏళ్లుగా ఈ సమస్య రగులుతున్నా, కేవలం 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ ప్రకటన చేశారని ఆయన గుర్తుచేశారు. దీనివల్ల కలిగే ప్రభావాలేంటో ముందుగా ఊహించలేకపోయారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే అధికార యంత్రాంగం, హైకోర్టు, సచివాలయం, ఇంకా అనేక మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, దానంతటికీ బోల్డంత డబ్బు వెచ్చించాలని అన్నారు. అలా కొత్త రాష్ట్రాలు ఇర్చుకుంటూ పోతపే.. జిల్లాకో రాష్ట్రం చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. దూరప్రాంతాల నుంచి హైకోర్టు, సచివాలయం కోసం హైదరాబాద్ రావడం కష్టం అవుతున్నందునే రెండు రాష్ట్రాలు చేయాలనడం సరి కాదని, ఎక్కడికక్కడ కార్యాలయాలు, అధికారులు ఉండటం వల్ల ఎక్కడి పనులు అక్కడే అయిపోతాయని చెప్పారు. వాళ్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలుచేస్తే సరిపోతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే, కర్ణాటకలో కూడా విభజన వాదం వచ్చే అవకాశం లేకపోలేదని హెగ్డే చెప్పారు. ఇప్పటికే అక్కడ బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక అనే వాదాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక మీదట మనం రాష్ట్రాల విభజన గురించి ఆలోచించకపోవడమే మంచిదని చెప్పారు. అది మన దేశ ఐక్యతకు ఏమాత్రం మంచిది కాదని సూచించారు. -
బోల్ట్ దోషిగా తేలితే ‘జమైకా’ చరిత్ర ముగిసినట్లే!
జమైకా: ఆరుసార్లు స్పింట్ చాంపియన్‌గా నిలిచిన ఉసయిన్ బోల్ట్ దోషిగా తేలితే జమైకా మరణించినట్లేనని డోపింగ్ నిరోధక కమిషన్‌కు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించాడు. బోల్ట్ పై వచ్చిన నిషిద్ధ ఉత్ప్రేరకాల ఆరోపణలు నిజమైతే ఆ దేశ క్రీడా చరిత్ర ముగిసినట్లేనని తెలిపాడు. ఇదిలా ఉండగా బోల్ట్‌కు డ్రగ్స్ నిపుణుడు పాల్ రైట్ మద్దతుగా నిలిచాడు. బోల్ట్ నిషిద్ద ఉత్పేరకాలు వాడినట్లు ఆరోపణలు రావడంతో పలుమార్లు టెస్టులకు హాజరైయ్యాడని, వాటి నుంచి బోల్ట్ బయట పడతాడని తెలిపాడు. గతంలో జమైకా దేశంలో పలువురు డ్రగ్స్ వాడి పట్టుబడిన ఉదంత సంచలనం రేపింది. జమైకా పరుగుల రాణిగా గుర్తింపు పొందిన క్యాంబెల్ బ్రౌన్, మాజీ 100 మీ. పరుగుల వీరుడు పావెల్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సింప్సన్లు ఈ డ్రగ్ ఉచ్చులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశానికే చెందిన బోల్ట్‌పై కూడా పలు ఆరోపణలు రావడంతో.. అతడు కూడా డ్రగ్స్ టెస్టులకు పలుమార్లు హాజరైయ్యాడు. బోల్ట్ నిజాయితీగా ఆ ఉచ్చు నుంచి బయట పడతాడని ఆశాభావాన్ని పాల్ వ్యక్తం చేశాడు. -
అంతర్జాతీయ చిత్రం 'కోచడయాన్'
తన తదుపరి చిత్రం దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసిన నటించిన 'కోచడయాన్' విడుదలకు సిద్దంగా ఉన్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే చెప్పారు. ఈరోజు ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఇది తమిళ చిత్రం కాదని అంతర్జాతీయ చిత్రం అని తెలిపారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, రష్యా, జపాన్, చైనా భాషలలో విడుదలవుతుందని చెప్పారు. రజినీకాంత్ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న నటుడని తెలిపారు. ఈ చిత్రాన్ని 3డిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు ఏ భారతీయ చిత్రంలో లేనటువంటి యానిమేషన్ దృశ్యాలు ఇందులో ఉంటాయని దీపిక వివరించారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం నటించిన 'కోచడయాన్' తొలికాపీ సిద్ధమైంది. అంతర్జాతీయంగా వివిధ భాషల్లో ఒకే రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో ఆధ్యాత్మికతను మేళవించి కూతురు సౌందర్య దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో సూపర్‌స్టార్ నటవిశ్వరూపం చూపించారని వినికిడి. రజనీకాంత్, దీపికా పదుకొనే జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో సౌందర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడు పాత్రలో జాకీ ష్రాఫ్, ప్రత్యేక పాత్రలో శోభన, ఇంకా శరత్ కుమార్, ఆది పినిశెట్టి, నాసర్, రుక్మిణి, విజయకుమార్ నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ గ్లోబర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి నిర్మాత మురళీ మనోహర్. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. తెలుగులో దీనిని‘విక్రమ సింహా' పేరుతో విడుదల చేస్తారని తెలుస్తోంది. రజనీకాంత్ విభిన్న తరహాలలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులో ఆసక్తి పెంచాయి. రజనీకాంత్ నటించిన చివరి చిత్రం ‘రోబో' 2010లో విడుదలైంది. ఆ తరువాత ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆశగా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏడాది క్రితమే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. చెన్నై, లండన్లలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగాయి. తొలి కాపీని తమిళ దర్శకుడు రవికుమార్‌తో కలిసి రజనీకాంత్ చూశారు. ఊహించినదానికంటే సినిమా చాలా రిచ్‌గా వచ్చిందని రజనీకాంత్ రవికుమార్‌ను ప్రశంసించారు. ‘‘నా జీవితంలో మరచిపోలేని రోజు ఇది. నాన్నగారు, రవికుమార్ అంకుల్, ఇతర టీమ్ సభ్యులు ఈ సినిమా మొదటి కాపీ చూసి, చాలా థ్రిల్ అయ్యారు’’ అని సౌందర్య ట్విట్టర్లో పెట్టారు. ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు లండన్ లోని పీనివుడ్స్ స్టూడియోలో జరిగినట్లు తెలిపారు. ఈ చిత్రం నవంబర్‌లో విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకతలు 'కోచడయాన్'కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ‘మోషన్ కాప్చరింగ్’ టెక్నాలజీతో 3డీలో రూపుదిద్దుకుంటున్న తొలి భారతీయ సినిమా. ఆసియాలోనే తొలి మోషన్ క్యాప్చర్ సినిమా ఇది. కోట్ల రూపాయలు ఖర్చుచేసి అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకు అవతార్, అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్... రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. మొత్తం 48 కెమెరాలతో ఈ సినిమా షూటింగ్ జరిపారు. అంటే ఒక్కో దృశ్యాన్ని 48 కోణాల్లో చిత్రీకరించారు. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో నటించేందుకు చెన్నై ప్రభుత్వ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 42 మంది విద్యార్థులను, కుంభకోణం ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులను సౌందర్య ఎంపిక చేశారు. ఈ సినిమాకు మరో విశేషం ఏంటంటే జీవితసారాన్ని తెలియజెప్పే ఓ అద్భుతమైన పాటను రజినీకాంత్ ఇందులో పాడారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో రూపొందించిన ఈ పాటను వైరముత్తు రాశారు. 1992లో తమిళ సినిమా మన్నన్ కోసం రజినీ మొదటిసారి పాటపాడారు. ఆయన పాడిన రెండో పాట ఇది. హిందీ వెర్షన్లోనూ ఆయనే పాడారు. రజనీ జపాన్ అభిమానుల ముచ్చట తీర్చేవిధంగా కొన్ని ప్రత్యేక దృశ్యాలను కూడా చిత్రీకరించారు. రజనీ కాంత్ స్థాయికి తగిన రీతిలో ఈ సినిమా అంతర్జాతీయంగా మార్కెట్ అవుతోంది. -
కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్రలు:టీఆర్ఎస్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ఆపార్టీ నేతలు ఆరోపించారు. ఈ కుట్రలపై పూర్తిస్థాయిలో విచారణ జరించాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు వెంటనే జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని వారు కోరారు. కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటనతో టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. మెదక్ టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావటం.... ఆ తర్వాత రోజు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పది సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. మరోవైపు టీఆర్ఎస్ ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలతో ఆపార్టీ నేతల్లో గుబులు మొదలైంది. అధినేత తీసుకునే నిర్ణయంపై వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఉనికి పోకుండా ఉండేందుకే కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం చేసుకుంటున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. -
రాయల తెలంగాణ అనలేదు: కోట్ల
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరామని కాంగ్రెస్ నాయకుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. తమ ప్రాంత నేతలతో పాటు సోనియాను కలిసిన తర్వాత ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేకుంటే మూడు రాష్ట్రాలు చేయాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల తమ ప్రాంతంలో తాగునీటి సమస్య వస్తుందని తెలిపామన్నారు. హైకమాండ్ ముందు రాయల తెలంగాణ ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామాలతో సమస్యలు పరిష్కారమైతే తాను రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించారు. హైపవర్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించనున్నట్టు తెలిపారు. త్రిసభ్య కమిటీ తమ సమస్యలు పరిష్కరిస్తుందని నమ్మకాన్ని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సోమవారం వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలిపేందుకు వారు మొగ్గు చూపుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే తాము సమైక్యాంధ్రకు కట్టుబడ్డామని, కలిసుండేందుకు వీలుకాకపోతే తమకు ప్రత్యేకంగా గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలకు అడ్డుకట్ట పడింది. -
రాజ్యసభలో శీలం - పాల్వాయి వాగ్వాదం; లోక్‌సభ రేపటికి వాయిదా
లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ సైన్యం హతమార్చిన ఘటనపై ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుందంటూ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్షాలన్నీ ఒంటికాలిపై లేవడం, సభ కార్యకలాపాలు సజావుగా సాగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ మీరాకుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లాయి. లోక్‌సభను ఎలాగోలా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు జై సమైక్యాంధ్ర నినాదాలు మొదలుపెట్టారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినదించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు ససేమిరా వీల్లేదంటూ గట్టిగా పట్టుబట్టారు. తెలంగాణ ఎంపీలు కూడా తమ స్థానాల్లోంచి లేచి నిల్చున్నారు. లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్ పదే పదే వారించినా, వెల్ లోంచి సభ్యులు వెళ్లలేదు. తిరిగి 12 గంటల ప్రాంతంలో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అప్పటికీ నినాదాలు ఆగలేదు. రాజ్యసభలో 'మాకు న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలలోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ రాజ్యసభలో టీడీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సీమాంధ్రులంతా తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని పాల్వాయి వ్యాఖ్యానించడంతో సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కేంద్రమంత్రి జేడీ శీలం స్పందించారు. ఆయనకు రేణుకా చౌదరి కూడా మద్దతు పలికారు. అధికార పక్షానికి చెందిన పలువురు సభ్యులు వారిద్దరికీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. గొడవ పడొద్దని సీనియర్ సభ్యురాలు అంబికా సోనీ కూడా జేడీ శీలానికి సూచించారు. ఇంతలో టీడీపీ సభ్యులు రాష్ట్రాన్ని రక్షించాలంటూ నినాదాలు చేయడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వారిని హెచ్చరించారు. సభా కార్యకాలపాలకు అడ్డు తగలడం మానకపోతే చర్య తీసుకుంటామన్నారు. దీని గురించి చర్చ వచ్చినప్పుడు ముందుగా మాట్లాడే అవకాశం వారికే ఇస్తానని చెప్పారు. ఇలాగే గొడవ చేస్తే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని, అలా చేసేలా తనను బలవంత పెట్టొద్దని చెప్పారు. అయినా ఎంపీలు మాత్రం తమ పట్టు వీడలేదు. నినాదాలు కొనసాగించారు. ఈ పరిస్థితి అంతటికీ ప్రభుత్వమే కారణమని రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. రాష్ట్రంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. దీనిపై చివరకు అధికార పార్టీయే ఒక్క మాటమీద లేదని, మంత్రికి - ఎంపీ పాల్వాయికి మధ్య జరిగిన వివాదమే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. -
'చెన్నై ఎక్స్‌ప్రెస్' తో 'మై హు షాహిద్ ఆఫ్రిద్ లేట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కానుంది. ఆ నేపథ్యంలో మై హు షాహిద్ ఆఫ్రిద్ (ఎంహెచ్ఎస్హెచ్) చిత్రం రంజాన్ పండగ తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆ చిత్ర నిర్మాతలు మంగళవారం పాకిస్థాన్‌లో వెల్లడించారు. అయితే ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారమే ఆ చిత్రాన్నివిడుదల చేయాలనుకున్నామని, కానీ ఆఖరి నిముషంలో అవాంతరాలు ఎదురైయ్యాయని ఆ చిత్ర రచయిత వ్యాస చౌదరి ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే దేశ చలన చిత్ర రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందిన ఫిల్మ్ ఎడిటర్ అజాంఖాన్ మరణం కూడా ఆ చిత్ర విడుదలకు ఏర్పడిన అవాంతరాల్లో ఒకటన్నారు. చిత్ర పూర్తి కావచ్చున చివరి నిముషంలో ఆయన మరణించారన్నారు. అలాగే చిత్రంనికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ అంతా విదేశాల్లో జరగడం కూడా ఇంకో కారణమన్నారు. అయితే ఇద్ పండగ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఏ చిత్రాన్ని పాక్‌లో విడుదల చేయమని అంతకుమందు డిస్టిబ్యూటర్లు, సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆఖరి నిముషంలో ఆ ఒప్పందాన్ని అతిక్రమంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను విడుదల చేస్తున్నారని వ్యాస చౌదరి పేర్కొన్నరు. -
నా వ్యాఖ్యలు వక్రీకరించారు: ద్రవిడ్
భారత్ క్రికెట్ సంఘం(బీసీసీఐ) విశ్వసనీయతపై తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. తన వ్యాఖ్యలు వక్రీకరణకు గురవడం పట్ల 'మిస్టర్ డిపెండబుల్' అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను మాటాడిన మాటలను సందర్భ రహితంగా చేసి మీడియాలో ఒక వర్గం వక్రీకరించిందని పేర్కొన్నాడు. ఈఎస్పీఎన్ 'క్రిక్ఇన్ఫో'కు ఇచ్చిన ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో అతడు స్పందించినట్టు తెలిపాయి. క్రికెట్‌పై విశ్వసనీయత పెరిగేలా ఆటగాళ్ల, పరిపాలకుల ప్రవర్తన ఉండాలని, ప్రజా జీవితంలో ఉన్న వారికి ఇది మరీ ముఖ్యమని అతడు వ్యాఖ్యానించాడని కథనాలు వచ్చాయి. అయితే ద్రవిడ్ ఇంటర్వ్యూ ను రేపు పాఠకులకు అందుబాటులో ఉంచనున్నట్టు ఈఎస్పీఎన్ 'క్రిక్ఇన్ఫో' తెలిపింది. ద్రవిడ్ వ్యాఖ్యలతో మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఏకీభవించాడు. అబిమానులు ఆటను తప్ప మరేమీ పట్టించుకోరన్న భావనతోనే క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ స్పిన్నర్ ద్రవిడ్ వ్యాఖ్యలను ఎర్రాపల్లి ప్రసన్న కూడా సమర్థించారు. -
కేంద్రం నిర్ణయంలో మార్పు ఉండదు:ఏఐసిసి
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఏఐసీసీ పరిశీలకుడు తిరునావక్కరసు స్పష్టం చేశారు. విభజన అనంతరం సీమాంధ్రులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితులను పరిశీలించేందుకే ఏఐసీసీ తరఫున తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి తిరునావక్కరసు పరిశీలకుడుగా ఇక్కడకు వచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయన పరిశీలిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతిని గమనిస్తున్నారు. సీమాంధ్ర నేతలు కూడా పలువురు ఆయనను కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దని అధిష్టానంపై ఒత్తిడి తేవాలని కోరారు. తిరునావక్కరసు నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. -
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : సమైక్య సెగ ఇప్పుడు రాష్ట్ర రాజధానికి కూడా తాకింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధ నీటి పారుదల కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు.. తెలంగాణ ఉద్యోగులు మధ్య మంగళవారం తోపులాట జరిగింది. దాంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భోజన విరామ సమయంలో ఏపీ ఎన్జీవో ఉద్యోగులు విభజనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రామాన్ని చేపట్టారు. సమైక్య నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో టీ ఎన్జీవో ఉద్యోగులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఇటు సీమాంధ్ర ఉద్యోగులు.. అటు తెలంగాణ ఉద్యోగులు హోరా హోరిగా నినాదాలు చేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏపీ ఎన్జీవోలు నిరసన ప్రారంభించగా టీఎన్జీవోలు వారితో ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరికి వారే అన్నట్లు గట్టిగా పట్టుబట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట మొదలైంది. ఈ విషయం తెలిసిన ఇతర విభాగాల ఉద్యోగులు భారీ ఎత్తున జలసౌధకు చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు ప్రాంతాల ఉద్యోగులను శాంతింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల ఆందోళనలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్ చెందదని... ఉన్నపళంగా హైదరాబాద్ వదలివెళ్లాలనడనం దుర్మార్గమని రాజమోహన్ రెడ్డి అన్నారు. -
సమైక్య ఉద్యమ కార్యాచరణను వెల్లడించిన సమైక్యాంధ్ర జేఏసీ
సమైక్య ఉద్యమం రగులుతోంది. రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. ఇప్పటికే తీవ్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. విద్యార్థి జేఏసీ మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యి, వివిధ విషయాలపై చర్చించింది. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. రేపటి నుంచి సమైక్య నినాదంతో గడప గడపకు పాదయాత్రలు చేస్తామని, 12న లక్షలాది మందితో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో సింహగర్జన నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే ఈనెల 18వ తేదీన బీచ్‌రోడ్‌లోని వైఎస్ విగ్రహం నుంచి ఆర్కే బీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు మిలియన్ మార్చ్ నిర్వహించాలని తలపెట్టింది. అలాగే, రాష్ట్ర విభజన విషయంపై ఏమీ స్పందించకుండా ఊరుకున్నందుకు నిరసనగా కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులకు చెందని సినిమా ప్రదర్శనలన్నింటినీ నిషేధిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి ఏదైనా థియేటర్లో వాళ్ల సినిమాలు ప్రదర్శిస్తే.. వాటిపై దాడులు తప్పవని హెచ్చరించింది. నేటినుంచి విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్షలు అంతకుముందు సమైకాంధ్రకు మద్దతుగా గాజువాకలోబంద్ పాటించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నేటి నుంచి విద్యుత్తు ఉద్యోగులు అమరణ దీక్షలు చేయాలని తలపెట్టారు. విశాఖలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బంద్ అయ్యాయి. మరోవైపు ఉధ్యామాన్ని అణచివేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్కూల్, ఇంటర్ విద్యార్థులు ఉద్యమంలో పాల్గోంటే వారిపై జువనైల్ చట్టాన్ని అమలు చేస్తామని డీఈవో, ఆర్ఐవోలను హెచ్చరించారు. గుంటూరులోనూ ఉధృతంగా కార్యాచరణ మరోవైపు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో కూడా సమైక్యాంధ్ర జేఏసీ సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించి, కార్యాచరణ ప్రటించారు. 6, 7 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, 9, 10 తేదీల్లో సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో రైల్‌రోకోలు చేయాలని, 11, 12 తేదీల్లో మండలస్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని తెలిపింది. అలాగే.. 13, 14 తేదీల్లో ఉద్యోగులతో కలిసి రాజీనామా చేయని నేతల ఇళ్లను ముట్టడించాలని కూడా తెలిపింది. -
'అన్యాయం జరిగిందన్న భావన సీమాంధ్రల్లో ఉంది'
న్యూఢిల్లీ : సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు మంగళవారం ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు పళ్లంరాజు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలను చిదంబరం దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని కోరినట్లు సమాచారం. భేటీ అనంతరం కేంద్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల అన్యాయం జరిగిందన్న భావన సీమాంధ్ర ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు. విభజన వల్ల విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతామనే భయం వారిలో ఉందని.... ఇదే విషయాన్ని చిదంబరం, షిండే దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని, ద్విసభ్య కమిటీ కాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. అన్ని ప్రాంతాల వారి ఆందోళనలు తెలుసుకునేంత వరకూ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆపివేయాలని కోరామన్నారు. -
హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా తెలంగాణవారే:డిఎస్
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా తెలంగాణ వారేనని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల భయాందోళనలను తొలగించే ప్రయత్నం ఆయన చేశారు. ఇక్కడ ఉన్నవారు ఎటువంటి ఆందోళనలు చెందవలసిన అవసరంలేదన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, దేశానికి రెండో రాజధాని గానో చేసే ఆలోచన యుపిఏకు లేదని చెప్పారు. రాష్ట్ర విభజనపై సంప్రదించలేదని సీమాంధ్ర నేతలు, ప్రజలు అనడం సరికాదన్నారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సంప్రదించిందని డిఎస్ చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్న సమస్యలను ఆంటోనీ కమిటీ పరిష్కరిస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. 4, 5 నెలల్లో తెలంగాణ ఏర్పాటుపై రాజ్యాంగ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపమని అక్కడి ప్రజలు కోరుతున్నారని, ఆ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయదని చెప్పారు. కానీ తెలంగాణకు అభ్యంతరం లేదంటూ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసినట్లు తెలిపారు. పరస్పరం సహకరించుకుంటూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. శాంతిభద్రతలపై సీఎం కూడా దృష్టి సారించాలని ఆయన కోరారు. -
జయశంకర్‌కు తెలంగాణ వాదుల నివాళి
హైదరాబాద్ : టిఆర్ఎస్ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్ 79 వ జయంతి సందర్భంగా తెలంగాణ వాదులు ఆయనకు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణవాదులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శాంతి కపోతాన్ని ఎగురవేశారు. తెలంగాణ పొలిటికల్ జెఏసి నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాసగౌడ్, దేవిప్రసాద్‌తో పాటు వివిధ తెలంగాణ సఃఘాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నవ తెంగాన రాష్ట్రం ఏర్పాటయ్యే వరకూ పోరాటం కొనసాగిస్తామని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపాదించినట్టు 10 ఏళ్లు మైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అవసరంలేదని తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించాలని మల్లేపట్టి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీమాంధ్రులకు ఎటువంటి భయాందోళన అవసరంల లేదని, కొందరు పెట్టుబడి దారులు సీమాంధ్ర ప్రజలు ఉద్యోగులతో కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని వారి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని శ్రీనివాసగౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో సమైక్యవాదులు ఆందోళనలు చేస్తే సహించమని భవిష్యత్ లో తెలంగాన ఏర్పాడ్డాక అలాంటి వారు ఇబ్బందులు పడక తప్పదని ఆయన హెచ్చరించారు. -
ఎమ్మెల్యే సీకే బాబు ఆమరణ దీక్ష భగ్నం
రాష్ట్రాన్ని విభజిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ, సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు గత ఆరు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీకే బాబు దీక్షను భగ్నం చేయడానికి భారీ సంఖ్యలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చేరుకున్న పోలీసులు ఆయన వైపు కదులుతుండగా ఆయన అభిమానులు దాన్ని అడ్డుకున్నారు. డీఎస్పీ రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సీఐలు, సుమారు 150 మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీకే బాబు యువసేనతో పాటు అక్కడ ఉన్న పలువురు వాళ్లను తీవ్రంగా ప్రతిఘటించారు. దాదాపు 25 నిమిషాల వరకు అసలు పోలీసులు బాబును అక్కడినుంచి తీసుకెళ్లలేకపోయారు. ఆ తర్వాత ఆయనను అంబులెన్సులోకి ఎక్కించగా, కార్యకర్తలు అంబులెన్సు చక్రాల వద్ద పడుకుని దాన్ని కదలనివ్వలేదు. అయితే పోలీసులు ఎలాగోలా వారిని అక్కడినుంచి తప్పించి బాబును చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను అక్క్డడి క్యాజువాలిటీలో ఉంచి చికిత్స చేస్తున్నారు. సాయంత్రం ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా 48 గంటల దీక్షగా ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత కూడా కేంద్రం రాష్ట్ర సమైక్యతపై ఏ మాత్రం స్పందించకపోవడంతో దాన్ని ఆమరణ దీక్షగా మార్చారు. సమైక్య రాష్ట్రం కోసం మంత్రులు రాజీనామా చేసి ఉద్యమించాలని సీకే బాబు డిమాండ్ చేశారు. సీమాంధ్ర మంత్రులకు రోషం లేదా అని ప్రశ్నించారు. కేవలం ఒక్క కేసీఆర్ కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం సిగ్గుచేటని, దీనిపై కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీకే బాబు హెచ్చరించారు. -
రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేకుంటే మూడు ముక్కలు చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను వదులుకునేది లేదని కరాకండిగా చెప్పినట్టు తెలిసింది. మీ వాదనలు ఉన్నతస్థాయి కమిటీ ముందు వినిపించాలని వారికి సోనియా గాంధీ సూచించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యపై ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మెయిలీలతో త్రిసభ్య సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. అటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు.. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో చర్చలు జరిపారు. రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం జరుగుతుందన్న భావన సీమాంధ్ర ప్రజల్లో కనిపిస్తోందని చిదంబరంకు మంత్రులు వివరించారు. విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతామనే భయం తమ ప్రాంతం వారిలో ఉందని తెలిపారు. ఇదే విషయాన్నిహోం మంత్రి సుశీల్ కుమార్ షిండే దృష్టి కూడా తీసుకెళ్లామని మంత్రులు తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు వ్యక్తం చేశారు. -
పాకిస్థాన్‌లో తీవ్రవాదుల ఘాతుకం
పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌లో కిడ్నాప్‌నకు గురైన 23 మంది ప్రయాణికుల్లో 13 మందిని తీవ్రవాదులు హతమార్చారని మీడియా వెల్లడించింది. మంగళవారం ఉదయం వారి మృతదేహాలను పోలీసులు కనుగోన్నారని తెలిపింది. కాగా మరో 10 మంది ప్రయాణికుల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని పేర్కొంది. ఆ ప్రయాణికుల ఆచూకీ వెంటనే కనిపెట్టాలని బెలుచిస్థాన్ ప్రావెన్స్ సీఎం అబ్దుల్ మాలిక్ బెలుచి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పింది. అలాగే ఆ ఘాతుకానికి ఒడిగట్టిన తీవ్రవాదులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని ఆయన జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారని తెలిపింది. అయితే భద్రతా సిబ్బంది లేకపోవడంతో తీవ్రవాదులు ఆ రెండు బస్సుల్లోని ప్రయాణికులను ఆపి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అధికారులు అభిప్రాయపడతున్నారని పేర్కొంది. సోమవారం అర్థరాత్రి క్విట్టా నుంచి పంజాబ్ ప్రావెన్స్‌కు వెళ్లున్న రెండు బస్సులను భద్రత దళానికి చెందిన దుస్తులు ధరించిన సాయుధ బృందం బలవంతంగా నిలిపివేసింది. అనంతరం ఆ బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులు తమ గుర్తింపుకార్డులు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రయాణికులందరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా మంచ్ ప్రాంతంలో ఆ రెండు బస్సులను తీవ్రవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆ బస్సుల వెంట ఉన్న భద్రత సిబ్బంది తీవ్రవాదుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో భద్రత సిబ్బంది, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ భద్రత సిబ్బంది మరణించగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని భద్రత సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. -
ఉధృతంగా విభజన వ్యతిరేక ఉద్యమం
రాష్ట విభజనకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళనలు, నిరసనలతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, ఘోరావ్లతో ఆందళనలు మిన్నంటుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవులోంది. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామీణప్రాంతాల నుంచి ఉద్యమం మూరుమూల పల్లెలకు సైతం విస్తరించింది. రాష్ట్రం సమైక్యంగా లేకుంటే తమకు భవితవ్యమే లేదనే ఆందోళనతో అన్ని కులాలు, వృత్తుల వారు స్వచ్ఛందంగా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు, రాజకీయపార్టీల నేతలు, మేధావులు, వివిధవర్గాల ప్రజలే కాదు.. సామాన్యజనం కూడా రోడ్లపైకి వస్తున్నారు. పిల్లా, పెద్దా, ముసలి, ముతక బేధం లేకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు సైతం నిరసనదీక్షలకు దిగుతున్నాయి. తమకు ఇబ్బంది కలుగుతున్నా సీమాంధ్ర ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. దుకాణాలు మూతపడడంతో నిత్యావసరాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. రవాణా స్తంభించడంతో ప్రయాణానికి ఆటంకాలు కలుగుతున్నాయి. కనీసం సెల్‌ఫోన్ అయినా మాట్లాడుకుందామంటే రీ చార్జ్ కార్డులు కూడా దొరకడం లేదు. బ్యాంకులు మూతపడడంతో పాటు ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో జనం కష్టాలు పడుతున్నారు. పాఠశాలలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు చదువు సాగడం లేదు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజలు సమైక్య ఉద్యమానికి మద్దతు తెల్పుతున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. -
జంజీర్లో పోలీస్ డ్రస్‌తో ప్రియాంక చోప్రా, రామ్ చరణ్
ముంబై: ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లగా నటించిన చిత్రం జంజిర్. ఆ చిత్రంలో ఓ పాటలో ప్రియాంక చోప్రా పోలీస్ దుస్తులు ధరించి ఛార్మింగ్‌గా ఉందని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ పాటలో పోలీసు దుస్తులు ధరించి ఆమె ఒలికించిన ఒంపు వయ్యారాలు ప్రేక్షకులను మంత్రముగ్థులను చేస్తుందని తెలిపింది. అయితే ఇంతకు ముందు ఆమె నటించిన చిత్రాల కంటే ఈ చిత్రంలోని వైవిధ్యమైన పాటతో ప్రియాంక ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం గుర్తుండి పోతారని చెప్పింది. ఆమె పోలీసు దుస్తులు వేసుకుంటే తాము చూపు మరల్చుకోలేకపోయామని ఆ చిత్ర ప్రొడక్షన్ యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది. జంజీర్ చిత్రంలో ప్రకాశ్ రాజ్, మహీ గిల్, అతుల్ కులకర్ణి, సంజయ్ దత్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఆ చిత్రానికి అపూర్వ లక్కియా దర్శకత్వం వహించారు.