Latest News
-
గీత దాటలేదు.. భారత సైనికులను చంపలేదు: పాకిస్థాన్
చేయాల్సిందంతా చేయడం, తర్వాత తమ తప్పేమీ లేదని చెప్పడం.. ఇలాంటివన్నీ పాకిస్థాన్‌కు అలవాటే. అలాగే ఈసారి కూడా ఇదే మాట చెప్పింది. తమ దళాలు అసలు నియంత్రణ రేఖను దాటనే లేదని, భారత సైనికులను హతమార్చలేదని తెలిపింది. అసలు నియంత్రణ రేఖ వద్ద అలాంటి సంఘటన ఏదీ జరగనే లేదని, తమ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని పాక్ సైనికాధికారి ఒకరు తెలిపారు. సుమారు 20 మంది పాకిస్థానీ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి, సర్లా పోస్టు వద్ద భారత సైనికులపై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపినట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మృతులలో 21 బీహార్ యూనిట్‌కు చెందిన ఒక సుబేదార్, నలుగురు జవాన్లు ఉన్నారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నియంత్రణ రేఖకు 450 మీటర్ల దూరంలో సంభవించింది. కాగా, పూంచ్ సెక్టార్లో ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ దళాలు హతమార్చడం దురదృష్టకరమని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోడానికి ఇది మార్గం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ సంఘటనపై ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు నిలిపివేసేది లేదని కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. మరోవైపు, సైనికులను హతమార్చిన సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియ ఆపేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ పేలినా చర్చలు జరపకూడదని, ఒకవైపు మన సైనికులను చంపేస్తూ మరోవైపు చర్చించడం సరికాదని బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఇక ఈ సంఘటన పార్లమెంటును కూడా కుదిపేసింది. లోక్‌సభ సమావేశం కాగానే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్‌వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. -
తగలబెట్టినా వెనక్కి తగ్గం: నారాయణ
తమ దిష్టిబొమ్మలు కాదు.. తమను తగలబెట్టినా రాష్ట్ర విభజనపై తమ విధానం మారదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోరుకునే వారు 23జిల్లాల్లోనూ ఆందోళనలు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఇరుప్రాంతాల ప్రజల అనుమానాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు పెచ్చరిల్లాయి. జాతీయ నాయకులను విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. విభజనకు మద్దతు పలికిన నాయకుల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. రాష్ట్ర విభజనపై నోరెత్తని నాయకుల దిష్టిబొమ్మలకు శవయాత్రలు, పిండ ప్రదానాలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర విభజన అనివార్యమయితే సీమాంధ్రుల్ని ఎలా సముదాయించాలనే సీపీఐ కసరత్తు మొదలుపెట్టింది. చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటవుతోందని చెబుతూనే.. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సమన్యాయం దక్కేలా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతోంది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆదివారం హైదరాబాద్‌లో వివిధ రంగాల నిపుణులు, మేధావులతో చర్చలు జరిపారు. -
ఆగస్టు 15న రాంగోపాల్ వర్మ కుమార్తె పెళ్లి
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుమార్తె రేవతి పెళ్లి దేశ స్వాతంత్ర్య దినోత్సవం.. అంటే ఈనెల 15వ తేదీన జరగనుంది. ప్రణవ్ అనే వైద్యునితో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. బాగా సన్నిహిత మిత్రులు, కొత్త దంపతుల బంధువులను మాత్రమే పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రాంగోపాల్ వర్మ కుమార్తె రేవతి కూడా మెడిసిన్ చదువుతున్నారు. ప్రణవ్‌తో ఆమె ప్రేమలో పడగా, ఇద్దరి పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ఈ సంవత్సరం జనవరిలో వాళ్ల వివాహ నిశ్చితార్థం జరిగింది. ప్రముఖుల ఇళ్లలో పెళ్లిలా ఇది భారీగా ఉండబోదని, బాగా సన్నిహితులను, కుటుంబ సభ్యులను మాత్రమే పిలిచి నిరాడంబరంగా పెళ్లి చేయాలనుకుంటున్నారని రాంగోపాల్ వర్మ కుటుంబానికి సన్నిహత వర్గాలు తెలిపాయి. తెలుగు సినీ పరిశ్రమలో వర్మకు బాగా సన్నిహితులను కూడా పిలవనున్నారు. ఇక ఇతర సెలబ్రిటీలెవరూ ఈ పెళ్లిలో కనపడకపోవచ్చని సమాచారం. పెళ్లికి ముందు రేవతి - ప్రణవ్ తమ స్నేహితుల కోసం ఓ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నారని, అందులో దంపతుల సన్నిహిత మిత్రులు మాత్రమే ఉంటారు తప్ప సినీ పరిశ్రమకు చెందిన వారెవ్వరూ ఉండబోరని వర్మ కుటుంబ సన్నిహితులు తెలిపారు. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు సంతోషంగా అంగీకరించారని తెలిసింది. ప్రణవ్ తల్లిదండ్రులు కూడా వైద్యులేనని, వారు దుబాయ్‌లో స్థిరపడ్డారని సమాచారం. -
పాక్ దాడి 'దుర్మార్గపు చర్య': మోడీ
సరిహద్దులో భారత సైనికులను పాకిస్థానీ బలగాలు కాల్చి చంపడాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాక్ దురాగతాన్ని 'దుర్మార్గపు చర్య'గా మోడీ పేర్కొన్నారు. పాకిస్థాన్ చర్య ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదముందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ బలగాలు ఐదుగురు భారత జవాన్లను హత్య చేయడాన్ని ఖండిస్తూ మోడీ, ఒమర్ అబ్దుల్లా తమ వ్యాఖ్యలను ట్విటర్లో పోస్ట్ చేశారు. భారత సైనికులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మోడీ స్పష్టం చేశారు. చైనా చొరబాట్లు, పాకిస్థాన్ దుశ్చర్యల నుంచి సరిహద్దులను రక్షించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమయిందని ఆయన విమర్శించారు. యూపీఏ పాలకులు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమయిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జమ్ము కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటి వచ్చిన పాకిస్థానీ దళాలు భారత సైనికులపై కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్ల ప్రాణాలు బలిగొన్నాయి. పూంచ్ జిల్లా చకన్ దా బాగ్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఎల్ఓసీలోని కర్మాడ్ గ్రామంలో గల తమ సైనిక పోస్టుపై వాళ్లు దాడి చేసి, తమ సైనికుల్లో ఐదుగురిని కాల్చి చంపారని, తర్వాత మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి పారిపోయారని సైన్యానికి చెందిన ఓ అధికారి తెలిపారు. -
ఢిల్లీ వెళ్లనున్న సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్ : సీమాంధ్రలో విభజన సెగ ఉధృతం అవుతుండటంతో సీమాంధ్ర నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు హస్తినకు పయనం అవుతున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి వారు అధిష్టానం పెద్దలను కలవనున్నారు. ఇప్పటికే సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. మరోవైపు రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సమావేశమవుతున్నారు. కాసేపట్లో సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, లేదంటే మూడుముక్కలు చేయాలని, విభజన అనివార్యమైతే కర్నూలుజిల్లాను తెలంగాణలో కలపాలని వీరు అధిష్టానాన్ని కోరనున్నారు. కాగా విభజన.. సమైక్య నినాదాలతో ఒకవైపు రాష్ట్రం అట్టుడుకుతుండగా కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో పంపకాలకు అవసరమైన వివరాలు పంపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర అధికారులను ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న నీటి పథకాలతోపాటు, పూర్తిగా సీమాంధ్రలో, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులతోపాటు, రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ప్రాజెక్టుల వివరాలు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, వాటికి కావాల్సిన నిధులు, పూర్తి చేస్తే రెండు రాష్ట్రాలకు ఒనగూరే ప్రయోజనాలు వంటి అంశాలపై కూడా నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. -
పార్లమెంటులో ఆగని గందరగోళం.. వాయిదాల పర్వం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లాయి. లోక్‌సభను ఎలాగోలా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు జై సమైక్యాంధ్ర నినాదాలు మొదలుపెట్టారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినదించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు ససేమిరా వీల్లేదంటూ గట్టిగా పట్టుబట్టారు. ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎలాగోలా నిర్వహించేందుకు స్పీకర్ ప్రయత్నించినా మిన్నంటిన నినాదాల మధ్య అది కుదరలేదు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. తిరిగి 12 గంటల ప్రాంతంలో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అప్పటికీ నినాదాలు ఆగలేదు. రాజ్యసభలో 'మాకు న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలలోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. ఒకపక్క దేశ భద్రత ప్రమాదంలో పడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటోందని ఆయన మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ ఎంపీలు కూడా తమ స్థానాల్లోంచి లేచి నిల్చున్నారు. లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్ పదే పదే వారించినా, వెల్ లోంచి సభ్యులు వెళ్లలేదు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. భారత భూభాగంలోకి ప్రవేశించి భారత సైనికులను హతమార్చిన పాకిస్థాన్ సైనికుల దుశ్చర్యను పలువురు సభ్యులు తీవ్రంగా ఎండగట్టారు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, ప్రధాని సభకు రావాలని బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. అక్కడి గందరగోళం నడుమ సభ వాయిదా పడింది. -
నైజీరియాలో తీవ్రవాదుల దాడి: 35 మంది మృతి
నైజీరియాలోఈశాన్య రాష్ట్రమైన బోర్నోలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 35 మంది మరణించారని మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సాగిర్ ముస వెల్లడించారని స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. బామా పట్టణంలోని మొబైల్ బేస్ క్యాంప్‌పై ఆదివారం బొకొ హరం సంస్థకు చెందిన తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారని పేర్కొంది. దాంతో పోలీసులు వెంటనే ఎదురుదాడికి దిగారు. దీంతో 17 మంది బొకొ హరం తీవ్రవాదులతోపాట ఓ పోలీసు మరణించారని చెప్పారు. ఆ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అలాగే మౌలమ్ ఫటొరి ప్రాంతంలో నైజీరియా, చద్ద్ నుంచి వచ్చిన సైనికులతో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్‌పై అదే సంస్థకు చెందిన తీవ్రవాదులు మెరుపుదాడికి దిగారని చెప్పారు. ఆ ఘటనలో ఓ సైనికుడితోపాటు 15 మంది బొకొ హరం తీవ్రవాదులు మరణించారని ముస తెలిపారు. -
భారతీయ జాలర్ల పట్ల శ్రీలంకది అమానుష చర్య
భారతీయ జాలర్ల పట్ల శ్రీలంక నావికా దళం అమానుషంగా వ్యవహారిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితా ఆరోపించారు. ఆ దేశ నావిక దళ చర్యలను కట్టడి చేసేందుకు శ్రీలంకపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ జయలలిత మంగళవారం భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. చాలా కాలంగా సముద్ర జలాల్లోకి చేపల వేటకు వెళ్లే భారతీయ జాలర్లపై శ్రీలంక నావికదళం దాడులకు పాల్పడటంతోపాటు వారిని అపహరిస్తు శత్రుదేశం మాదిరిగా వ్యవహారిస్తుందని ఆమె రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని ఆ దేశ ఉన్నతాధికారులను ఆదేశించాలని జయలలిత కోరారు. ఇప్పటికైన ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుంటే ఆ దేశ నావిక దళం హద్దు మీరే అవకాశాలు ఉన్నాయని జయలలిత అభిప్రాయపడ్డారు. ఓ వేళ ఇలాంటి చర్యలు మరో సారి జరిగితే ఉపేక్షించేది లేదని శ్రీలంకకు గట్టిగా చెప్పాలని ఆమె సూచించారు. తమిళనాడుకు చెందిన ఎంతో మంది జాలర్లు తరుచుగా ఆ దేశ నావికాదళ సిబ్బంది చేతుల్లో పలు ఇక్కట్లకు గురవుతున్న సంఘటనలపై తరుచుగా లేఖల ద్వారా మీ దృష్టికి తెస్తున్న సంగతిని ప్రధానికి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆగస్టు 3న తమిళనాడుకు చెందిన 20 భారతీయ జాలర్లను లంక నావికాదళం అరెస్ట్ చేసిన సంఘటనను జయలలిత ఆ లేఖలో ప్రస్తావించారు. భారతీయ జాలర్ల అరెస్ట్‌తో రాష్ట్రంలోని ఆ సామాజిక వర్గం ఆందోళనలకు దిగుతున్నాయని, దాంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అలాగే శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 90 మంది భారతీయ జాలర్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని జయలలిత ప్రధాని మన్మోహన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
గీత దాటిన పాకిస్థాన్: ఐదుగురు భారత జవాన్ల హతం
పాకిస్థాన్ మరోసారి పాపిస్థాన్ అనిపించుకుంది. జమ్ము కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటి వచ్చిన పాకిస్థానీ దళాలు భారత సైనికులపై కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్ల ప్రాణాలు బలిగొన్నాయి. పూంచ్ జిల్లా చకన్ దా బాగ్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఎల్ఓసీలోని కర్మాడ్ గ్రామంలో గల తమ సైనిక పోస్టుపై వాళ్లు దాడి చేసి, తమ సైనికుల్లో ఐదుగురిని కాల్చి చంపారని, తర్వాత మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి పారిపోయారని సైన్యానికి చెందిన ఓ అధికారి తెలిపారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య 2003 సంవత్సరంలో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో కూడా ఇద్దరు భారతీయ సైనికులను ఎల్ఓసీ వద్ద గల మేంధర్ సెక్టార్లో హతమార్చింది. ఈ సంఘటనలో పాకిస్థాన్ సైన్యం ప్రత్యక్ష ప్రమేయం ఉందని భారత వర్గాలు ఆరోపించాయి. ఇంతకుముందు ఒకసారి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి, భారత సైనికుడి తల తెగనరికిన సంఘటన అప్పట్లో తీవ్ర వివాదానికి కారణమైంది. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా మన విదేశాంగ శాఖ వైపు నుంచి తగిన స్థాయిలో ప్రతిస్పందన ఉండట్లేదని సైన్యం ఆరోపిస్తోంది. -
హస్తినలో వేడెక్కుతున్న రాష్ట్ర రాజకీయం
ఒకవైపు వర్షాలతో అంతా చల్లగా ఉంటే, హస్తినలో మాత్రం రాష్ట్ర రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు కలిసి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో సమావేశమయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, సభలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చించినట్లు సమాచారం. సోమవారం సభలో సీమాంధ్ర ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళన చేయడం వల్లే సభ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే మంగళవారానికి వాయిదాపడిన విషయం తెలిసిందే. ఉభయ సభల్లోనూ కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఒత్తిడి వ్యూహాన్ని పటిష్ఠంగా అమలుచేయడంతో ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ కూడా వాయిదా పడ్డాయి. అందువల్ల, మంగళవారం కూడా సభలో గట్టిగా ఒత్తిడి తేవాలని, అవసరమైతే అసలు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కూడా వీల్లేకుండా అడ్డుకోవాలని వారు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఎంపీల వ్యూహాలకు దన్నుగా తమవంతు పాత్ర పోషించేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సాకే శైలజానాథ్, కోండ్రు మురళీమోహన్ హస్తిన పయనమయ్యారు. హస్తినలో అధిష్ఠానం పెద్దల వద్ద మరోసారి తమ వాదన గట్టిగా వినిపించాలని వీరు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా సాగుతున్న నిరసనల వివరాలను వారికి వివరించాలని అనుకుంటున్నారు. కనీసం సెల్ఫోన్లు రీచార్జి చేయించుకోడానికి కూడా దుకాణాలు తెరవట్లేదంటే ఆగ్రహం ఎంత తీవ్రస్థాయిలో ఉందో చూడాలని సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రులకు ముందే చెప్పి పంపించినట్లు సమాచారం. జైపాల్ ఇంట్లో టీ-ఎంపీలు ఇలా ఉంటే, మరోవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కూడా హస్తినలో వ్యూహరచన సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిందని, ఆ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఒక ప్రకటన కూడా చేయడంతో కాస్త సంతోషంగానే ఉన్నా, సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకుంటున్న తీరు చూసి కాస్త ఆందోళన చెందారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని వారంతా నిర్ణయించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నేతృత్వంలో ఈ మేరకు తగిన వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. సభలో తమ సొంత పార్టీకే చెందిన సీమాంధ్ర ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు తాము ఎలా వ్యవహరించాలన్న విషయంపై కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఇరు ప్రాంతాలకు చెందిన పార్లమెంటు సభ్యులు వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటూ ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. -
మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి
ఇడుపులపాయ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం ఇడుపులపాయ చేరుకున్నారు. వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి అక్కడ ప్రార్ధనలు జరిపారు. ఈ కార్యక్రమంలో షర్మిలతో పాటు బ్రదర్ అనిల్, వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి వైఎస్ భారతి, వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, బాధలు పంచుకుంటూ షర్మిల 3112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు . ఈ నెల 4న శ్రీకాకుళంజిల్లా ఇచ్ఛాపురంలో మరోప్రజాప్రస్థానం ముగిసింది. అనంతరం హైదరాబాద్ వచ్చిన షర్మిల నేరుగా చంచల్‌గూడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిశారు. -
సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర
తిరుపతి : సీమాంధ్రలో విభజన సెగలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ నేతలు చేపట్టని దీక్ష నాలుగో రోజుకు చేరింది. మరోవైపు పట్టణంలో ఆటో కార్మికులు బంద్ నిర్వహిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కేబుల్ ఆపరేటర్లు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. వరదాయపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అలాగే విద్యార్థులు సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దగ్ధం చేశారు. కాగా సత్యవీడు మండలం మదనంబేడు వద్ద ఆందోళనకారులు ఓ ఆర్టీసీ బస్సును దగ్ధం చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. నేడు జిల్లావ్యాప్తంగా కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే సీకే బాబు చేపట్టిన ఆమరణ దీక్ష నేటికి ఏడోరోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. మరోవైపు పుంగనూరులో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. చెన్నై-ముంబై జాతీయ రహదారిపై గోడ కట్టారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దుతుగా ఎస్వీయూలో విద్యార్థులు చేపట్టిన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేపట్టిన వారిని పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. కాణిపాకంలో అర్చకులు ర్యాలీ నిర్వహించారు. -
యూఎస్‌లో వ్యక్తి కాల్పులు: ఇద్దరు మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియా పట్టణంలో రాస్ టౌన్షిప్లో జరుగుతున్న సమావేశంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. వారిలో ఇద్దరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ప్రత్యేక విమానంలో లీహై వ్యాలీలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుందని చెప్పింది. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియా తెలిపింది. -
తీవ్రవాదుల జాబితాను విడుదల చేసిన యెమెన్
ప్రముఖ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా యెమెన్ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు సమాయత్తమైంది. అందుకు దేశంలోని విదేశీ కార్యాలయాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుందని ఆ దేశ హోంమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన 25 మంది తీవ్రవాదుల పేర్ల జాబితాను సోమవారం సాయంత్రం యెమెన్ రాజధాని సనాలో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఆ తీవ్రవాదుల సమాచారం అందజేసిన లేదా ఆచూకీ తెలిపిన వారికి భద్రతా దళాలు రూ.23 వేల అమెరికన్ డాలర్లు పారితోషకంగా అందజేయనున్నాయని తెలిపింది. అయితే యెమెన్ ఆ ప్రకటన విడుదల చేయడంతో ముస్లిం దేశాల్లోని తమ దేశానికి చెందిన 20 దౌత్యకార్యాలయాలను అమెరికా వారం రోజులపాటు మూసివేసింది. యెమెన్‌లోని అల్‌ఖైదా శాఖ అత్యంత ప్రమాదకరమైనదని ఇటీవలే వాషింగ్టన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సమైకాంధ్రాకు మద్దతుగా గాజువాకలోబంద్
విశాఖ : రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోనివ్వమంటూ సీమాంధ్రలో రగిలిన ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ జిల్లా గాజువాకలో బంద్‌కు వర్తక, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆమరణ దీక్షలకు సిద్ధం అయ్యారు. కాగా విశాఖలో అన్ని ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల బంద్ కొనసాగుతోంది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాఠశాల, ఇంటర్ విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటే జువైనల్ చట్టాన్ని అమలు చేస్తామని డీఈవో, ఆర్ఐఓలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. కాకినాడ పోర్ట్ కార్యకలాపాలను వైఎస్ఆర్ సీపీ స్తంభింప చేసింది. అలాగే జర్నలిస్ట్ సంఘాల జేఏసీ నిరసనలకు దిగారు. కాగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. -
సమన్యాయం కావాలి: విజయమ్మ
ఇడుపులపాయ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. హైదరాబాద్‌ను తెలంగాణలో కలపటం ఏ విధంగా సబబో కేంద్రం చెప్పాలని ఆమె మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని కేసీఆర్ ఎలా అంటారని విజయమ్మ ప్రశ్నించారు. సమన్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీ విభజన బాధ్యత ఎలా తీసుకుందని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల వారికి సమన్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విభజనపై కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని విజయమ్మ విమర్శించారు. విభజన విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కేంద్రం ఓ తండ్రిలాగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని విజయమ్మ అన్నారు. విభజనపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కోమాట మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారని విజయమ్మ అన్నారు. ఒకవేళ విడిపోవాల్సి వస్తే సంతోషంగా విడిపోవాలనుకున్నారని ఆమె పేర్కొన్నారు. విభజన చేసినా.... చేయకపోయినా అన్ని ప్రాంతాల్లో వైఎస్ అభిమానులు ఉన్నారన్నారు. అన్నిచోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని విజయమ్మ తెలిపారు. -
హిల్లరీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయొద్దు
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయవద్దని దేశంలో ప్రముఖ న్యూస్ చానల్స్‌కు ద రిపబ్లికన్ పార్టీ మంగళవారం హెచ్చరించింది. యూఎస్‌లోని ప్రముఖ న్యూస్ చానల్స్ సీఎన్ఎన్, ఎన్బీసీలకు ఈ మేరకు ద రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రినిస్ ప్రిబస్ మంగళవారం లేఖ రాశారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఆ దేశాధ్యక్ష పదవికి డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. వ్యతిరేక కథనాల వల్ల హిల్లరీ తీవ్రంగా కలత చెందే అవకాశాలున్నాయన్నారు. అలాగే ఆమెపై రూపొందించి ప్రసారం చేసే కథనాలపై అమెరికన్లు ఆ న్యూస్ చానల్స్ ప్రశ్నించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దానితోపాటు ఆ న్యూస్ చానల్స్ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగే ప్రాధమిక చర్చల కథనాలను మాత్రం ప్రసారం చేయాలని ఆయా న్యూస్ చానల్స్‌కు సూచించారు. అయితే హిల్లరీపై చిన్న చిన్న కథనాలను రూపొందించి ప్రసారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎన్బీసీ తెలిపింది. అలాగే ఆమెపై డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రినిస్ ప్రిబస్ ఆ న్యూస్ చానల్స్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. -
పాక్, ఆఫ్ఘన్ వరదల్లో 120మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన ఆకస్మిక వరదలతో మృతి చెందినవారి సంఖ్య 120కి చేరింది. అనేకమంది గల్లంతు అయ్యారు. భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలకు ఆఫ్గనిస్తాన్‌లో 58 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గల్లంతయ్యారు. దేశ తూర్పు ప్రాంతంలోని దుర్గమప్రాంతాలైన నంగర్హార్, నూరిస్తాన్లలోని లోతట్టుప్రాంతాలు వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. మట్టితో కట్టిన ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోగా, పక్కాఇళ్ళు కూలిపోయాయి. బాధితులను ఆదుకోడానికి హమీద్కర్జాయ్ ప్రభుత్వం రాజధాని కాబూల్ నుంచి ఆహారం మందులు, ఇతర అత్యవసర సామాగ్రిని పంపింది. తాలిబన్ తీవ్రవాద ముఠాలకు నిలయయమైన తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని కొండ ప్రాంత రాష్ట్రాల్లో అనూహ్య వరదలు సంభవించడం మామూలే. మరోవైపు పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ భారీ వర్షాలకు జలదిగ్బంధనమైంది. ఆకస్మికంగా విరుచుకుపడిన వరదలకు మూడురోజుల్లో 53 మంది చనిపోయారు. వీధులన్నీ పెద్ద పెద్ద కాలువలుగా మారిపోవడంతో.. నిన్న కూడా కరాచీ వాసులు ఇళ్ళు వదిలి బైటకు రావడానికి నానా తంటాలూ పడ్డారు. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మురుగునీటితో కలిసిన వర్షం నీరు నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. లోపభూయిష్టంగా ఉన్న కరాచీ డ్రయినేజీ వ్యవస్థ వరద పరిస్థితిని మరింత గంభీరంగా మారుస్తోంది. మరోవైపు.. మూడురోజులుగా వర్షం పట్టిపీడిస్తుండడంతో నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయడం కూడా నగర ప్రజానీకానికి గగనమైపోతోంది. రంజాన్ పండుగ సమయంలో నెలకొన్న వరద పరిస్థితి జనాన్ని ఇక్కట్లకు గురిచేస్తోంది. కాగా పాక్, ఆఫ్ఘనిస్తాన్లు వరదలకు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇరు దేశాలకు వరద సహాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆదేశ ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్‌లో వర్షాలు, వరదలకు సుమారు 80మంది మరణించారని, వేలమంది గాయపడినట్లు తమకు నివేదికలు అందాయన్నారు. అయితే సాయం కావాలని పాక్ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదన్నారు. సాయం కోరితే ఆహారం, మందులుతో పాటు గృహాలు నిర్మాణానికి సాయం అందిస్తామని వారు పేర్కొన్నారు. -
ఇడుపులపాయ చేరుకున్న షర్మిల
వైఎస్ఆర్ జిల్లా: మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకుని తొలిసారి షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆమె వైఎస్ఆర్ ఘాట్ చేరుకుని మహానేతకు నివాళులు అర్పించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకుని షర్మిల సోమవారం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించటంతో పాటు ప్రార్థన కార్యాక్రమాలలో ఆమె పాల్గొంటారు. అనంతరం ఆమెను పలువురు సర్పంచ్‌లతో పాటు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలవనున్నారు. 3,112 కిలోమీటర్ల పాదయాద్రను పూర్తి చేసిన షర్మిల నిన్న చంచల్‌గూడలో ఉన్న జగన్‌ను కలిశారు. పాదయాత్ర విజయవంతమైనందుకు జగన్ ఆనందం వ్యక్తం చేశారని ఆమె భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. -
మోసాల నివారణ శైశవ దశలోనే...
న్యూఢిల్లీ: భారత కంపెనీల్లో మోసాలను అరికట్టే యంత్రాంగం ఆశించిన మేరకు పనిచేయడం లేదని ఎర్నస్ట్ అండ్ యంగ్ తో కలిసి ఆసోచామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలను వేరే మార్గాల ద్వారా ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. మరిన్ని వివరాలు..., కంపెనీకి ఆర్థికంగా నష్టాలు కలుగజేయడం, లేదా కంపెనీ పేరుప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేయడం వంటివి -ఇలాంటి మోసాలే కంపెనీల్లో అధికంగా జరుగుతున్నాయి. ‘‘విజిల్ బ్లోయింగ్’’(అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం) విధానం భారత్‌లో ఇంకా శైశవదశలోనే ఉంది. ఈ విధానాన్ని భారత కంపెనీలు ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. అమెరికా తదితర దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ విధానాన్ని కంపెనీల బిల్లులో నిర్దేశించారు. గత డిసెంబర్లో లోక్‌సభ ఆమోదం పొందిన ఈ కంపెనీల బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లోనే రాజ్యసభ ఆమోదం పొందే అవకాశాలున్నాయి. వ్యయాలను అధికం చేసి చూపడం, కొనుగోలు ఆర్డర్లలో గోల్మాల్ చేయడం, ఇతర అవకతవకలను టెక్నాలజీ సాయంతో సులభంగా గుర్తించవచ్చు. ఈ దిశగా భారత కంపెనీల ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. -
174మంది అమెరికన్లకు టీసీఎస్ ఉద్యోగాలు
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీ ఈ ఏడాది అమెరికాలో 174 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. తమ అంతర్జాతీయ క్లయింట్ల డిమాండ్లను తీర్చడానికి ఉద్దేశించిన స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్)ఉద్యోగాల్లో భాగంగా ఈ నియామకాలు జరిపామని టీసీఎస్ సోమవారం తెలిపింది. వీరందరికీ సిన్సినాటిలో ఉన్న తమ సెంటర్లో టీసీఎస్ ఇనీషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద 6-12 వారాలు శిక్షణనిస్తామని పేర్కొంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరిలో వందమంది ఇదే సెంటర్లో ఉద్యోగాలు నిర్వహిస్తారని వివరించింది. మిగిలిన వారిని అమెరికావ్యాప్తంగా ఉన్న తమ సెంటర్లలో నియమిస్తామని పేర్కొంది. గత నాలుగేళ్లలో అమెరికాలో 500కు పైగా అత్యున్నత నైపుణ్యం గల కాలేజీ పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చామని వివరించింది. అమెరికాలోని 71 విభిన్న యూనివర్శిటీల నుంచి వీరిని ఎంపిక చేశామని తెలిపింది. -
సహకార సంఘాల్లో స్పాట్ ఎక్స్ఛేంజ్
ఇటిక్యాల,(మహబూబ్‌నగర్ జిల్లా) న్యూస్‌లైన్: రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా గిట్టుబాటు ధర లభించిన చోట విక్రయించుకునే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో(పీఏసీఎస్) స్పాట్ ఎక్స్ఛేంజ్ను ప్రారంభిస్తున్నట్లు నాబార్డ్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ బక్షి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం పుటాన్‌దొడ్డి పీఏసీఎస్‌లో స్పాట్ ఎక్స్ఛేంజ్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లోనే అయినకాడికి అమ్ముకోవడం వల్ల సరైన రేటు రాక అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్(ఎన్సీడీఈఎక్స్)లో ధాన్యాన్ని విక్రయించుకునే విధంగా ఆన్లైన్ మార్కెటింగ్ లింకేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో స్పాట్ ఎక్స్చేంజ్ పథకాన్ని పుటాన్‌దొడ్డి పీఏసీఎస్ ద్వారా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను రిజిస్ట్రేషన్ చేసిన గిడ్డంగుల్లో నిల్వ ఉంచితే రసీదులు ఇస్తారని, వీటి ఆధారంగా దేశంలో ఏ బ్యాంక్‌లోనైనా రుణం కూడా పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం రామ్‌చందర్‌నాయక్, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ కె.వీరారెడ్డి, జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బీహెచ్ఈఎల్ డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా!
న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ ఉపకరణాల దిగ్గజం బీహెచ్ఈఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు షేరు ధర పతనంకావడంతోపాటు, ఆర్డర్‌బుక్ బలహీనపడటం కారణంగా నిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం 2011లోనే 5% వాటాను డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. అయితే విద్యుత్ రంగం పలు సమస్యలను ఎదుర్కొంటూరావడంతో ఈ కాలంలో కంపెనీ షేరు ధర కూడా 60% పతనమైంది. తాజాగా ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో బీఎస్ఈలో షేరు దాదాపు 20% పతనమై రూ. 120 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి(ఏప్రిల్-జూన్) క్వార్టర్‌కు కంపెనీ నికర లాభం దాదాపు సగానికి పడిపోయి రూ. 465 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు కూడా 24% తగ్గి రూ. 6,353 కోట్లకు చేరాయి. ఇక ఆర్డర్‌బుక్ విలువ రూ. 1.15 లక్షల కోట్ల నుంచి రూ. 1.08 లక్షల కోట్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో కంపెనీలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను భారీ పరిశ్రమల శాఖ వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో చౌక ధరల్లో కంపెనీ వాటాను విక్రయించడం సమర్థనీయంకాదని వాదిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది. -
డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలి: ఎన్ఎస్ఈఎల్
ముంబై: చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్ నిలిపివేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) లావాదేవీల పరిష్కారానికి(సెటిల్మెంట్స్) స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల విలువైన లావాదేవీలను సెటిల్ చేయాల్సి ఉంది. ఇందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీను నియమించినట్లు ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. కంపెనీ లాబోర్డ్ మాజీ చైర్మన్ శరద్ ఉపాసని అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జగ్నేష్ షా పేర్కొన్నారు. మిగిలిన సభ్యులలో ముంబై హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి ఆర్జే కొచర్, సెబీ, ఎల్ఐసీలకు గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన జీఎన్ బాజ్‌పాయ్, మహారాష్ర్ట మాజీ డీజీపీ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 14కల్లా చెల్లింపుల ప్రణాళికను వెల్లడించగలమని షా చెప్పారు. కాగా, చెల్లింపుల ప్రణాళికకు సహకరించని బ్రోకర్లు, సభ్యులపై తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ఎన్ఎస్ఈఎల్ ప్రభుత్వాన్ని కోరింది. కమోడిటీ మార్కెట్లను నియంత్రించే ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్ ఎన్ఎస్ఈఎల్ సెటిల్మెంట్ అంశాన్ని పరిష్కరిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ టెక్ షేరు హైజంప్ ఈ వార్తల నేపథ్యంలో ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు ధర బీఎస్ఈలో 31%(రూ. 47) ఎగసి రూ. 198 వద్ద ముగిసింది. అయితే గ్రూప్‌లోని మరో కంపెనీ ఎంసీఎక్స్ షేరు మాత్రం 10%(రూ. 41) పతనమై(లోయర్ సర్క్యూట్) రూ. 361 వద్ద నిలిచింది. -
సెన్సెక్స్ 18 పాయింట్లు ప్లస్
ఎట్టకేలకు 8 రోజుల నష్టాలకు అడ్డుకట్ట పడింది. సెన్సెక్స్ 18 పాయింట్లు కూడగట్టుకుని 19,182 వద్ద ముగిసింది. అయితే రోజు మొత్తం హెచ్చుతగ్గులకు లోనైంది. గరిష్టంగా 19,306, కనిష్టంగా 19,141 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. గత 8 రోజుల్లో 1,138 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా స్వల్పంగా 7 పాయింట్లు బలపడి 5,685 వద్ద నిలిచింది. కాగా, బీఎస్ఈలో క్యాపిటల్ గూడ్స్ అత్యధికంగా 3.6% పతనంకాగా, మెటల్ ఇండెక్స్ 2.7% పుంజుకుంది. ఎఫ్ఐఐలు కేవలం రూ. 33 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 303 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో కాంట్రాక్ట్‌ల సమస్య పరిష్కారానికి స్వతంత్ర కమిటీని వేయనున్న వార్తలతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 31% దూసుకెళ్లింది. రూ. 198 వద్ద ముగిసింది. కొత్త కాంట్రాక్ట్‌లను నిలిపివేసిన వార్తలతో గత రెండు రోజుల్లో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లలో లేని విధంగా జూలై నెలలో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు మందగించినట్లు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే పేర్కొనడంతో కొంతమేర సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడాది కనిష్టానికి భెల్ శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో విద్యుత్‌రంగ దిగ్గజం భెల్ ఏకంగా 19% పతనమైంది. ఏడాది కనిష్టమైన రూ. 121 వద్ద ముగిసింది. నికర లాభం సగానికి పడిపోగా, ఆర్డర్‌బుక్ సైతం బలహీనపడటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి కంపెనీ మార్కెట్ విలువలో రూ. 6,976 కోట్లు ఆవిరైంది. మార్కెట్ క్యాప్ రూ. 29,591 కోట్లకు పరిమితమైంది. ఇక మిగిలిన దిగ్గజాలలో భారతీ, టాటా మోటార్స్, ఎల్అండ్టీ 2% స్థాయిలో క్షీణించగా, జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.7% జంప్ చేసింది. ఈ బాటలో స్టెరిలైట్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, హీరో మోటో, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ 4-2% మధ్య లాభపడ్డాయి.