Latest News
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని వాయవ్య ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తాజాగా ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కావడంవల్ల కోస్తాంధ్రపై ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా రానున్న 24గంటల్లో ప్రధానంగా కోస్తాంధ్రలో ఉత్తర దిశగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో కోస్తాలో దక్షిణ దిశగా, కొన్నిచోట్ల వాయవ్య దిశగా గంటకు 45నుంచి 50కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాలని హెచ్చరించారు. -
బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల కార్ల ధరలనూ పెంచనుంది. మినీ మోడల్‌తో సహా అన్ని మోడళ్ల కార్ల ధరలనూ 5 శాతం వరకూ పెంచనున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సోమవారం తెలిపింది. ఈ పెరుగుదల ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ధరలను పెంచాలని నిర్ణయించామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సహర్ చెప్పారు. ధరల పెరుగుదలకు కారణాలను వెల్లడించలేదు. అయితే రూపాయి పతనం కారణంగా దిగుమతి వ్యయాలు పెరిగిపోతుండటంతో కంపెనీ ధరలను పెంచుతోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కంపెనీ భారత్‌లో బీఎండబ్ల్యూ 3, 5, 6, 7 సిరీస్, ఎస్యూవీ ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, స్పోర్ట్స్ కార్ ఎ సిరీస్ వంటి కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.28.6 లక్షల నుంచి రూ.1.73 కోట్ల రేంజ్లో ఉన్నాయి. కాగా రూపాయి పతనం కారణంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా కార్ల ధరలు పెంచే అవకాశాలున్నాయి. మరో లగ్జరీ కార్ల కంపెనీ ఆడి గత నెల 15 నుంచే ధరలను 4 శాతం పెంచింది. -
ఐటీ హైరింగ్ 17 శాతం తగ్గొచ్చు: నాస్కామ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీరంగ హైరింగ్ 17 శాతం తగ్గుతుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. ఆటోమేషన్ పెరగడం, ఆట్రిషన్ (ఉద్యోగుల వలస)తగ్గడం వంటి కారణాల వల్ల ఐటీ రంగంలో 1,50,000 -1,80,000 వరకూ కొత్త ఉద్యోగాలే వస్తాయని నాస్కామ్ ప్రెసిడెంట్ శోమ్ మిట్టల్ చెప్పారు. గత ఏడాది నికరంగా 1,80,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ప్రస్తుతం 10,800 కోట్ల డాలర్ల భారత ఐటీ-ఐటీఈఎస్ రంగంలో 30 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ రంగంలో కిందిస్థాయి ఉద్యోగాల్లో ఆటోమేషన్ పెరగడంతో డొమైన్ నిపుణుల అవసరం పెరిగిపోతోందని మిట్టల్ వివరించారు. పరిశ్రమ సగటు అట్రిషన్ రేటు 20 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఐటీ రంగంలో ఈ రేటు 14-15 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. హైరింగ్ విధివిధానాలు మారడంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా తగ్గుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఉద్యోగ నియామకాల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు 60 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతికపరిజ్ఞాన నైపుణ్యాలపైకాక సాఫ్ట్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో భారత అగ్రశ్రేణి నాలుగు ఐటీ కంపెనీలు 10,900 కొత్త ఉద్యోగాలిచ్చాయని, ఈ ఏడాది ఇదే కాలానికి ఇది 4,100కు తగ్గిందని మిట్టల్ పేర్కొన్నారు. -
కష్టాల్లో ‘స్టెయిన్లెస్ స్టీల్’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమకు ‘గట్టి’ కష్టాలే వచ్చిపడ్డాయి. దేశీయంగా ఈ లోహానికి భారీ డిమాండ్ ఉన్నా ఇక్కడి కంపెనీలు వ్యాపార అవకాశాలను అందుకోలేకపోతున్నాయి. దీనికి కారణం ముడిసరుకు ధరలు అంతకంతకూ పెరుగుతుండడం, నిపుణులైన కార్మికుల కొరత, విద్యుత్ సరఫరాలో సమస్యలు. దీనికితోడు స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులకు సరైన ధర రాకపోవడం, చైనా చవక ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలడం సమస్యను జటిలం చేస్తోంది. గత 10 ఏళ్లలో భారత్‌లో 3,000 పైగా చిన్నతరహా తయారీ యూనిట్లు మూతపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తడిసి మోపెడు.. పదేళ్ల క్రితం ముడి స్టెయిన్లెస్ స్టీల్ ధర కిలోకు రూ.60 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.125-150 పలుకుతోంది. ఇంతకు చేరినా స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తుల ధర ఆశించిన స్థాయిలో పెరగడం లేదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తుల ధర కిలోకు సగటున రూ.250 పలుకుతోంది. వడ్డీ, విద్యుత్, వేతనాలు, మార్కెటింగ్ ఖర్చులు, అద్దెలు పోను మిగిలేది అంతంత మాత్రమేనని కంపెనీలు వాపోతున్నాయి. రాష్ట్ర కంపెనీలకైతే కరెంటు కష్టాలు వీడడం లేదు. ఇక దేశవ్యాప్తంగా ఈ రంగంలో సుమారు 50 వేల కంపెనీలున్నాయి. ఇందులో రాష్ట్రం నుంచి 100 దాకా ఉంటాయి. ముడి స్టెయిన్లెస్ స్టీల్ సరఫరా చేసే సెయిల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్‌లకు నగదు పూర్తిగా చెల్లిస్తేనే సరుకు పంపిస్తాయి. స్టీల్ ఉత్పత్తుల విషయంలో దుకాణదారుకు అరువు ఇవ్వాల్సి రావడంతో తయారీ కంపెనీలను కుంగదీస్తోంది. దేశీ కంపెనీలు రూ.20 వేల కోట్ల దాకా రుణాలు తీసుకున్నాయని ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్(ఐఎస్‌ఎస్‌డీఏ) వెల్లడించింది. తయారీ అంతంతే..: హోటళ్లు, రెస్టారెంట్లు, గృహ విభాగంలో స్టెయిన్లెస్ స్టీలు ఉత్పత్తులకు గిరాకీ ఏమాత్రం తగ్గడం లేదు. శస్త్ర చికిత్స పరికరాలు(సర్జికల్స్) సైతం ఈ లోహంతో తయారవుతున్నవే. ఇంత డిమాండ్ ఉన్నా ప్లాంట్ల సామర్థ్యంలో 60-70%కి మించి ఉత్పత్తి జరగడం లేదని అగ్రోమెక్ ఇండస్ట్రీస్ పార్టనర్ దినేష్ సి జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మొత్తం డిమాండ్‌లో దేశీ కంపెనీలు 80 శాతమే సమకూరుస్తున్నాయన్నారు. ఒక్కో కంపెనీ రోజుకు సగటున టన్ను స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, మలేషియా, కొరియా తదితర దేశాల్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. కొన్ని కంపెనీలే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. చౌక ఉత్పత్తులు.. చెన్నై వ్యాపారులు చౌక ధరలో ఫ్లాస్క్, కుకర్ల వంటి ఉత్పత్తులను పూర్తిగా చైనా నుంచి తెప్పిస్తున్నాయి. పన్ను భారం తక్కువగా ఉండడంతో కొన్ని కంపెనీలు పూర్తిగా తయారు కాని (అన్-ఫినిష్డ్) ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వాటికి తుది మెరుగులు దిద్ది విక్రయిస్తున్నాయి. మరోవైపు తుక్కు స్టెయిన్లెస్ స్టీలు దిగుమతిపై ప్రభుత్వం 2.5 శాతం సుంకం విధించడాన్ని పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. కస్టమర్లు ధరే కాదు నాణ్యతను కూడా పరిగణించాలని ఇక్కడి కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. దేశంలో ఉత్పత్తుల వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 40%. ఇక తయారీలో యూపీలోని మురాదాబాద్, మహారాష్ట్రలోని వసై, భయందర్తోపాటు గుజరాత్, చెన్నైలు ప్రసిద్ధి. చైనా, తైవాన్, కొరియాల చౌక ఉత్పత్తులతో దేశీ పరిశ్రమ కుదేలవుతోందని ఐఎస్‌ఎస్‌డీఏ ప్రెసిడెంట్ ఎన్.సి.మాథుర్ ఇటీవల చెప్పారు. అగ్రోమెక్ విస్తరణ..: స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తుల తయారీ కంపెనీ అగ్రోమెక్ త్వరలో ఖతార్‌లో ఔట్‌లెట్‌ను ప్రారంభించనుంది. అలాగే గుజరాత్లో జాయింట్ వెంచర్ ద్వారా భారీ ప్లాంటును నెలకొల్పాలని యోచిస్తోంది. రాష్ట్రంలో మరో 3 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ పార్టనర్ దినేష్ సి జైన్ తెలిపారు. ఫ్రాంచైజీకి తాము సిద్ధమని వెల్లడించారు. కంపెనీ హైదరాబాద్‌లో రెండు ఔట్లెట్లను 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. -
కొత్త బ్యాంక్ లెసైన్సులకు మరికొంత సమయం: ఆర్బీఐ
ముంబై: కొత్త బ్యాంకులకు లెసైన్సుల విషయంలో నిబంధనలను సరళీకరించే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా (బ్యాంకింగ్ పర్యవేక్షణా విభాగం ఇన్చార్జ్) సోమవారం స్పష్టం చేశారు. లెసైన్సుల కోసం వచ్చిన 26 దరఖాస్తులపై ఆర్బీఐ అంతర్గత పరిశీలన మొదలైందని కూడా వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తికి మరికొంత కాలం పడుతుందని తెలిపారు. అనంతరం ఈ దరఖాస్తుల పరిశీలనకు మరొక కమిటీ (ఎక్స్టర్నల్)ని నియమించడం జరుగుతుందని కూడా పేర్కొన్నారు. మొత్తంమీద కొత్త లెసైన్సుల జారీకి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. -
భారత్ లో బీమాకు అవీవా గుడ్‌బై?
న్యూఢిల్లీ: బ్రిటన్ ఆర్థిక సేవల దిగ్గజం అవీవా భారత బీమా మార్కెట్ నుంచి వైదొలగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ డాబర్‌తో జాయింట్ వెంచర్ద్వారా పదేళ్లుగా అవీవా జీవిత బీమా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జేవీలో అవీవా ఇండియా వాటా 26 శాతం. వాటాల అమ్మకానికి కొనుగోలుదారుని వెతికే ప్రక్రియలో భాగంగా కార్పొరేట్ సలహాదారులను నియమించుకునే పనిలో అవీవా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నో కామెంట్: ఈ వార్తలపై వ్యాఖ్య కోసం ఈ మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు, అవీవా ఇండియా ప్రతినిధి సమాధానమిస్తూ, ‘‘మార్కెట్ ఊహాగానాలు లేదా వదంతులపై మా విధానం ప్రకారం వ్యాఖ్యానించలేం’’ అని పేర్కొన్నారు. 2002లో ప్రారంభమైన జాయింట్ వెంచర్ పెయిడప్ క్యాపిటల్ రూ.2,004 కోట్లు. ఇందులో అవీవా వాటా 26 శాతం. 2011-12తో పోల్చితే, 2012-13లో అవీవా జీవిత బీమా కంపెనీల మొత్తం ప్రీమియం వసూళ్లు 11% క్షీణించి రూ. 2,140.6 కోట్లకు దిగింది. ఈ ఏడాది మొదట్లో నెదర్లాండ్స్‌కు చెందిన ఐఎన్జీ... ఇంగ్ వైశ్యా లైఫ్ కంపెనీలో తన 26% వాటాను యక్సైడ్కు విక్రయించాలని నిర్ణయించింది. గతేడాది అమెరికాకు చెందిన న్యూయార్క్ లైఫ్ కూడా భారత్ జాయింట్ వెంచర్ కంపెనీలో తన 26% వాటాను జపాన్‌కు చెందిన మిత్సూయీ సుమిటోమో బీమా కంపెనీకి విక్రయించింది. ఈ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు కంపెనీల బాటన అవీవా నడుస్తుందన్న వార్తలు వస్తుండడం గమనార్హం. -
4 నెలల్లో కోటికిపైగా ఐటీ ఈ-ఫైలింగ్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చెల్లింపుదారులు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. గడచిన సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఈ-ఫైలింగ్ చేసిన వారి సంఖ్యలో 48% వృద్ధి నమోదు కావడమే కాకుండా వీరి సంఖ్య కోటి దాటిందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) ప్రకటించింది. జూలై 31 వరకు ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 1.03 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి 69,63,056 మంది దాఖలు చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా దాఖలు చేసే వారి సంఖ్య పెరగడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని, నిమిషానికి 2,303 మంది రిటర్నులు దాఖలు చేసినట్లు సీబీడీటీ అధికారులు తెలిపారు. దీంతో చివరకు రిటర్నుల గడువు తేదీని మరో 5 రోజులు పొడిగించడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2012-13లో మొత్తంమీద ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2.14 కోట్లుగా ఉంది. -
సేవా పన్ను ఎగవేతలపై కేంద్రం కొర డా
న్యూఢిల్లీ/కోల్‌కతా: సేవా పన్ను ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన ఒక కొరియర్ కంపెనీ యజమానిని దాదాపు రూ.70 లక్షల పన్ను ఎగవేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇటువంటి కేసుల్లో కఠిన చర్యలకు అధికారాలు ఇస్తూ చట్టాల్లో సవరణ తీసుకొచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి అరెస్ట్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం పలు రకాల సేవలపై 12.36 శాతం సేవా పన్ను అమలవుతోంది. కేసు పూర్వాపరాలివీ...: బ్లూబర్డ్ పేరుతో కోల్‌కతాలో కొరియర్ ఏజెన్సీని నిర్వహిస్తున్న సుదీప్ దాస్.. పలు కంపెనీల నుంచి రూ.67 లక్షల మేరకు పన్ను వసూలు చేశారు. అయితే, దీన్ని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో గతవారంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ మేరకు కోల్‌కతాలోని సేవా పన్నుల కమిషనర్ కేకే జైస్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దాస్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. సేవా పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లో నిబంధనల మార్పులకు ఆర్థిక మంత్రి పి. చిదంబరం చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఫైనాన్స్బిల్లులో ఈ మేరకు సెక్షన్ 91లో కొత్త నిబంధనను చేర్చి ఆమోదింపజేశారు. దీనిప్రకారం సెంట్రల్ ఎక్సైజ్ పన్నుల విభాగానికి చెందిన అధికారులకు(సూపరింటెండెంట్ స్థాయికి తక్కువ కాకూడదు) సేవా పన్ను ఎగవేతదారుడిని అరెస్ట్ చేసే అధికారం లభించింది. కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల ఎగవేతలకు ఇప్పటికే సీఆర్పీసీ ప్రకారం ఈ కఠిన చర్యలు అమలవుతున్నాయి. ఇప్పుడు సేవా పన్నులకూ ఇది వర్తిస్తుంది. రూ.50 లక్షలు అంతకుమించి సేవాపన్నును ఎగవేస్తే అది శిక్షార్హమైన నేరం కిందికి వస్తుంది. ఈ కేసుల్లో ఎగవేతదారుడికి ఏడేళ్లదాకా జైలు శిక్ష పడొచ్చు. -
రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం ముక్కలు చేయబూనడాన్ని ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ తీర్మానించింది. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం రాత్రి కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన ముఖ్యనేతలు భేటీ అయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. దీనికి పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల కన్వీనర్లు హాజరు కావాలని చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. జేఏసీ చేపట్టే కార్యక్రమాలు, పార్టీ చేసే కార్యక్రమాలను సమన్వయం చేసుకుని ముందుకు పోయేందుకు ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, అనుబంధ విభాగాల కన్వీనర్లు శెట్టిబత్తుల రాజబాబు, కర్రి పాపారాయుడు, గుత్తుల రమణ, రావూరి వెంకటేశ్వరరావు, కో ఆర్డినేటర్లు మిండగుదిటి మోహన్, చింతా కృష్ణమూర్తి, కొండేటి చిట్టిబాబు, తోట సుబ్బారావునాయుడు, పార్టీ అధికార ప్రతినిధి పి.కె.రావు, సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి పెద్ద ఊసరవెల్లి : రత్నాకర్ కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : ఉండవల్లి అరుణ్‌కుమార్ పెద్ద ఊసరవెల్లి అని మాలమహానాడు అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాజమండ్రిలో ఉండవల్లి నిర్వహించిన సభ పెద్ద వీధినాటకమన్నారు. మొన్నటివరకూ రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపిన ఆయన ఇప్పుడు సమైక్య డ్రామాపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎవరికీ ఉపయోగపడని ఉండవల్లి ప్రతిసారీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో చేస్తున్న సమావేశాల హంగామా వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చేతనైతే పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకుని ఆమరణ దీక్ష చేపట్టాలన్నారు. -
మన షేర్లు ముంచేశాయ్
ఒకప్పుడు భారీ లాభాలందించిన రాష్ట్ర కంపెనీలిపుడు ఇన్వెస్టర్లను నిండా ముంచుతున్నాయి. గడిచిన రెండేళ్లలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు లాభపడినా... రాష్ట్ర కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు మాత్రం ఆవిరైపోయాయి. అతితక్కువ కంపెనీలు తప్ప రాష్ట్రానికి చెందిన దిగ్గజాలు కూడా మదుపరులను ముంచేశాయి. స్టాక్ మార్కెట్లో రాష్ట్ర కంపెనీలు గతంలో ఓ వెలుగు వెలిగాయి. ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ముందంజ వేస్తే... సాఫ్ట్వేర్ రంగంలో సత్యం కంప్యూటర్స్, విజువల్ సాఫ్ట్ వంటివి ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు సృష్టించాయి. ఇక ఇన్ఫ్రా రంగంలోనైతే జీఎంఆర్, జీవీకే, ఐవీఆర్సీఎల్, ల్యాంకో, ఎన్సీసీ వంటివి పోటీపడి కాంట్రాక్ట్‌లను దక్కించుకుంటూ దూసుకెళ్లాయి. సిమెంట్ రంగంలో కూడా రాశి, సాగర్ సిమెంట్స్, ప్రియా సిమెంట్స్ వంటివి మంచి పనితీరు కనబరిచాయి. దీంతో ఇన్వెస్టర్లు రాష్ర్ట కంపెనీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. కానీ నాలుగేళ్లుగా ఈ పరిస్థితులు తారుమారయ్యాయి. గడిచిన రెండేళ్లలో అయితే పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన ఆర్థిక సంక్షోభం ఒక కారణమైతే... ఆ ప్రభావంతో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, యాజమాన్య వైఫల్యాలు, షేర్ల తనఖాలు వంటివి కూడా తోడయ్యాయి. దీంతో షేర్లు కుప్పకూలుతున్నాయి. ఒకో కంపెనీది ఒకో సమస్య యాజమాన్య వైఫల్యాలతో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు చరిత్రలో కలిసిపోయాయి. సత్యం... టెక్ మహీంద్రాలో విలీనంకాగా, విజువల్ సాఫ్ట్... మెగా సాఫ్ట్‌లో కలసిపోయింది. దేశ ముఖచిత్రాన్ని మార్చగల ఇన్ఫ్రా కంపెనీలు జీఎంఆర్, జీవీకే, ల్యాంకో, ఐవీఆర్సీఎల్, ఎన్సీసీ భారీ రుణాలతో కుదేలయ్యాయి. ఇక యానిమేషన్ వండర్ డీక్యూ ఎంటర్టైన్మెంట్, రైళ్లు ఢీకొనకుండా చూసే పరికరాలను అభివృద్ధి చేసిన కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, ఎల్ఈడీ ఉత్పత్తులు మిక్ ఎల క్ట్రానిక్స్, ఖనిజాల జాడకనిపెట్టే సీస్మిక్ సర్వేల్ని విశ్లేషించే అల్ఫాజియో వంటి ప్రత్యేక తరహా కంపెనీలు కూడా సమస్యల్లో పడ్డాయి. రుణ భారంలో ఇరుక్కుపోయిన ఇన్ఫ్రా కంపెనీలు... పోటీపడి దక్కించుకున్న కాంట్రాక్ట్‌లను సైతం వదులుకునే స్థితికి చేరాయి. బ్యాంకింగ్ రంగంలో పెరిగిన మొండిబకాయిల వల్ల ఆంధ్రాబ్యాంక్, ఆతిథ్య రంగ మందగమనం వల్ల తాజ్ జీవీకే హోటల్స్ వంటి సంస్థలు కూడా వెనకబడ్డాయి. ఈ ప్రభావమంతా షేర్లను తాకటంతో ఇన్వెస్టర్ల నెత్తిన పిడుగులు పడుతున్నాయి. నిలదొక్కుకున్న కంపెనీలూ ఉన్నాయ్... ఆటుపోట్లను తట్టుకుంటూ కచ్చితమైన భవిష్యత్ వ్యూహాలతో విస్తరిస్తున్న రాష్ట్ర కంపెనీలు కూడా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్నే తీసుకుంటే... పరిశోధన రంగంలోనూ భారీ పెట్టుబడులు పెడుతూ ముందుకెళుతోంది. దీంతో షేరు ధర కూడా గత రెండేళ్లలో దాదాపు 38% లాభాలను అందించటమే కాక సెన్సెక్స్‌లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తూ బిజినెస్‌ను పెంచుకుంటున్న అపోలో హాస్పిటల్స్ షేరు ఈ రెండేళ్లలో 79 శాతం దూసుకెళ్లింది. అంకాలజీ (కేన్సర్ చికిత్స) ఔషధాలలో తన ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు చౌక ధరల్లో జనరిక్స్‌ను అందిస్తూ నాట్కో ఫార్మా కూడా నిలదొక్కుకుంది. దీంతో ఈ షేరు ధర రెట్టింపై ఇన్వెస్టర్ల పంట పండించింది. టెలికం రంగానికి అవసరమయ్యే యూపీఎస్ బ్యాటరీలతో మొదలుపెట్టిన అమరరాజా బ్యాటరీస్, తీవ్రమైన పోటీలో కూడా అమరాన్ బ్రాండ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది. నిజానికి పతనమైన రాష్ట్ర కంపెనీలతో పోలిస్తే ఇన్వెస్టర్లకు లాభాలిచ్చినవి అతితక్కువే కావచ్చు. కానీ ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు ఏ పరిస్థితిలోనైనా దూసుకెళతాయని మాత్రం ఇవి చెబుతున్నాయి. - సాక్షి, బిజినెస్ డెస్క్ -
సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలి- టీచర్స్ జేఏసీ డిమాండ్
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడి సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడి నుంచి సీకే.బాబు నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. అనంతరం గాంధీ విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడి సమైక్యాం ధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ర్యాలీగా డీఈవో కార్యాలయానికి వెళ్లారు. విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని విద్యాశాఖ సిబ్బం దిని కోరారు. జేఏసీ, విద్యాశాఖ సిబ్బంది డీఈవో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ సమైక్యాంధ్రపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమం ఆపమన్నారు. రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడి సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ కార్యక్రమాలకు ఎంఈవోల సంఘం జిల్లా అధ్యక్షులు బి.సుధాకర్ మద్దతు ప్రకటించి, మంగళవారం నుంచి జరిగే కార్యక్రమాల్లో ఎంఈవోలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు కృష్ణారెడ్డి, చెంగల్రాయమందడి, రెడ్డిశేఖర్‌రెడ్డి, గంటామోహన్, గిరిప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, నరేంద్రకుమార్, శేఖర్, వెంకటేశ్వర్లు, నరోత్తమరెడ్డి, రవీంద్రరెడ్డి, విద్యాశాఖ సిబ్బంది మురళి, ప్రభాకర్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య
పెద్దతిప్పసముద్రం, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ ప్రకటించి, పార్లమెంటులో బిల్లు కూడా ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని తెలిసి మండలానికి చెందిన ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం సోమవారం వెలుగులోకొచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని కాట్నగల్లుకు చెందిన వెంకట్రమణ (35) ఐరన్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గతంలో కొద్ది రోజులు హైదరాబాదులో ఉంటూ ఇదే వృత్తి చేసేవాడు. రెండేళ్ల క్రితం బెంగళూరులోని బైర్సంద్రానికి కాపురం మార్చాడు. అక్కడ కష్టానికి తగిన ఫలితం లేకపోవడం, ఖర్చులు పెరిగిపోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లాలని అనుకున్నాడు. రాష్ట్ర విభజన సందర్భంగా జరుగుతున్న పరిణామాలను చూసి చలించిపోయాడు. హైదరాబాదుకు వెళితే బతకనీయరేమోనని మనస్తాపానికి గురయ్యాడు. బెంగళూరులో ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. బైర్సంద్రం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. సోమవారం సాయంత్రం మండలంలోని కాట్నగల్లులో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రెడ్డెమ్మ, పిల్లలు శరత్, గణేష్ ఉన్నారు. ఇదే మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన అల్లాపల్లి రవికుమార్, తలారి కిట్టన్న సమైక్యాంధ్ర కోసం మృతి చెందిన విషయం తెలిసిందే. -
స్తంభించిన ఆర్థిక లావాదేవీలు
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆరు రోజు లుగా జిల్లాలో బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక సంస్థలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాయి. జూలై 31వ తేదీ నుంచి నేటి వరకూ జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు పనిచేస్తున్న ప్రధాన జాతీయ బ్యాంకు లు, ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, బంగారుపాళెం, పీలేరు, వాయల్పాడు వంటి పట్టణాల్లోనూ బ్యాంకులు పని చేయ టం లేదు. ప్రతి రోజూ సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా హోటళ్లు, దుకాణాలతో సహా, బ్యాంకులను బంద్ చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా బ్యాంకుల వినియోగదారులు కార్యకలాపాలు సాగక బ్యాంకులకు వచ్చి వెనుతిరిగి వెళ్తున్నారు. వెయ్యికోట్లకు పైగా స్తంభన జిల్లా వ్యాప్తంగా 35కు పైగా ఉన్న జాతీయ, వాణిజ్య, కార్పొరేట్ బ్యాంకుల్లో వాణిజ్య కార్యకలాపాల స్తంభన వెయ్యికోట్ల రూపాయలకు పైగా ఉంటుందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ఆర్థిక సంస్థలు మొత్తం 800 వరకు ఉన్నాయి. వీటిల్లో ఐదురోజులుగా ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. దీంతో నగదు మార్పిడి జరగక, జిల్లాలోని వాణిజ్య రంగంపై ప్రభావం చూపుతోంది. ఆగస్టు 5వ తేదీకి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఖాతాల్లో జమ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఖజానా శాఖ కార్యకలాపాలు కూడా స్తంభించాయి. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వ పింఛన్ల చెల్లింపులు, ఇతర ప్రభుత్వ శాఖల చెల్లింపులు నిలిచిపోయాయి. కేవలం సోమవారం మాత్రం ట్రెజరీ(ఖజనా శాఖ)లో ఒక రోజు పని జరి గింది. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకు సంబంధించిన కోట్ల రూపాయల జీతాలు నిలిచిపోవటంతో ఉద్యోగులు డబ్బుల కోసం వెతుక్కునే పరిస్థితి తలెత్తింది. ఏటీఎంలు ఖాళీ జూలై 31వ తేదీ నుంచి వరుసగా బ్యాంకులు పనిచేయకపోవడంతో ఏటీఎంలన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తం 500కు పైగా ఉన్న వివిధ బ్యాంకుల ఏటీఎంల్లో డబ్బులు నిల్వ ఉంచలేకపోయారు. ఉన్న అరకొర నిధులు ఒక్క రోజులోనే వినియోగదారులు డ్రా చేయటంతో మూతపడ్డాయి. ఎస్బీఐ ఏటీఎంలు పూర్తిగా ఖాళీ కావటంతో ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలు, యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏటీంలకు వినియోగదారులు పరుగులు దీస్తున్నారు. ఏటీఎంల ముందు రాత్రుల్లో కూడా బారులు తీరారు. నాలుగురోజుల తరువాత ఆదివారం కొన్ని ఏటీఎంలలో డబ్బులు నింపటంతో ఏటీఎం కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఆ ఏటీఎంల్లో కూడా సోమవారం ఉదయం కల్లా డబ్బులు అయిపోయాయి. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ అవుట్ సర్వీ సు బోర్డులతో ఏటీఎంలు దర్శనమిచ్చాయి. వరుసగా బంద్ కొనసాగనుండటంతో డబ్బు లు డ్రా చేసేందుకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. -
రాష్ట్రాన్ని విభజిస్తే శాశ్వత నీటి కొరత
సాక్షి, తిరుపతి: రాష్ట్రాన్ని విభజించడం వల్ల సీమాంధ్రకు శాశ్వత నీటి సమస్య ఏర్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతి లోని తెలుగు తల్లి విగ్రహం నుంచి, గాంధీ విగ్రహం వరకు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ వైఖరి వల్లే రాష్ర్టం ముక్కలవుతోందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల భద్రత గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రానికి నిజమైన సీమాంధ్ర ద్రోహులు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలేనని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో జగన్ ప్రభావం తగ్గించే ప్రయత్నంలో రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ విధానాన్ని ప్రజలు క్షమించరని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రె స్ నాయకులు పైశాచికానందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రాజీ నామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ నాయకులకు రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ విభాగం కన్వీనర్ రాజేంద్ర, నాయకులు ఎస్కే.బాబు, ముద్రనారాయణ, దుద్దేలబాబు, తాళ్లూరి ప్రసాద్, బొమ్మగుంట రవి, చెంచయ్య యాదవ్, తొండమనాటి వెంకటేష్, పునీత, పుష్పా చౌదరి, గీత, రమణమ్మ, యువ నాయకుడు ఇమామ్ పాల్గొన్నారు. -
ఎస్వీయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎస్వీయూలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ శని వారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది. ఈ దీక్ష సోమవారంతో మూడో రోజుకు చేరింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి పెరగడంతో దీక్షభగ్నం చేసేందుకు పోలీ సులు రెండు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆదివారం రాత్రి బలవంతంగా ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మిగిలిన ఐదుగురు సోమవారం దీక్షను కొనసాగించారు. అయితే వీరిని కూడా సోమవారం రాత్రి 7 గంటల సమయంలో బలవంతంగా అరెస్ట్ చేసి దీక్ష శిబిరం నుంచి తరలించేశారు. ఈ దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన మబ్బుచెంగారెడ్డి, పసుపులే టి హరిప్రసాద్, నరసింహయాదవ్,శ్రీధర్ వర్మ, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పోలీసులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వెస్ట్ డీఎస్పీ ఎస్కే బాబు వాహనం కింద పడిపోయారు. విద్యార్థులే ఆయనను పైకి లేపారు. విద్యార్థులు, నాయకులు ప్రతిఘటిస్తున్నప్పటికీ పోలీసులు లెక్కచేయకుండా రుయాకు తరలించారు. అనంతరం శిబిరాన్ని తొలగించారు. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నాయకులు సోనియాగాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉద్యమకారులు మాట్లాడుతూ తాము చేస్తున్న దీక్షలను అడ్డుకోవడానికి సీఎం పన్నాగం పన్నారని ఆరోపించారు. తమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని, సమైక్యాంధ్ర కోసం ప్రాణాలున్నంత వరకు పోరాడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విద్యార్థి నాయకులు పత్తిపాటి వివేక్, రమణ, సాధు రంగనాథం పాల్గొన్నారు. అరెస్టయిన వారిలో హరికృష్ణ యాదవ్, శేషాద్రి నాయుడు, ఆనంద్‌గౌడ్, రామ్మోహన్, శివకుమార్ ఉన్నారు. -
తెలుగు భాషను మరవొద్దు ఎస్పీ రమేష్
నరసాపురం రూరల్, న్యూస్‌లైన్: పరభాషల్లో ప్రావిణ్యం సంపాధించడం ముఖ్యమేనని, అయినా మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని ఎస్పీ ఎం.రమేష్ విద్యార్థులకు సూచించారు. నరసాపురం మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాతనవరసపురంలో చిన్నారులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఏమి చదువుతున్నావ్ అని ఒక విద్యార్థిని ఎస్పీ ప్రశ్నించగా ఫోర్త్ క్లాస్ చదువుతున్నానని సమాధానమిచ్చాడు. దీనిపై స్పందించిన ఆయన నాల్గో తరగతి చదువుతున్నానని తెలుగులో చెప్పాలని సూచించారు. ప్రతిజ్ఞ వచ్చా అని బాలుడ్ని ప్రశ్నించారు. ఇండియా ఈజ్ మై కంట్రీ అంటూ బాలుడు ప్రారంభించగా మధ్యలో ఆపి తెలుగులో చెప్పమని కోరారు. సమీపంలోని విద్యార్థులెవ్వరూ తెలుగులో ప్రతిజ్ఞ చె ప్పేందుకు ప్రయత్నించలేదు. అడ్డాల ఏసురాజు అనే బాలుడు తెలుగులో ప్రతిజ్ఞ చెప్పాడు. సంతోషించిన ఎస్పీ ఏసురాజుకు చిరు బహుమతి ఇచ్చారు. -
హైదరాబాద్ కేసీఆర్ అబ్బ సొత్తు కాదు
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : హైదరాబాద్ కేసీఆర్ అబ్బసొత్తు కాదని, ఆంధ్ర ఉద్యోగులని పంపిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హెచ్చరించారు. సమైక్యాం ధ్ర నాయకులు ఇచ్చిన బంధు పిలుపు మేరకు బుట్టాయగూడెంలో జరిగిన కార్యక్రమంలో బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ అసలు నైజం బయటపడిందన్నారు. కేసీఆర్ ఓ నియంతలా మాట్లాడుతున్నారని, ఏ అధికారంతో మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదన్నారు. విభజన కాక ముందే హైదరాబాద్‌లోని ఆంధ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, విభజన పూర్తయితే ఇంక ఏ విధంగా ఉంటారో కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ,యూపిఏ భాగస్వామ్య పక్షాలు తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని సమైక్య రాష్ట్ర ప్రజలు ఎంతో అభివృద్ధి చేశారని, ఏకపక్షంగా తెలంగాణాకు ఎలా ఇచ్చేస్తారని ఆయన ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా ఉంటున్నవారిని విడదీసి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న సోనియా, కేసీఆర్‌లు చరిత్ర ీహ నులుగా మిగిలి పోతారన్నారు. ప్రజల అభిప్రాయాలను తీసుకున్న శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రనే సూచిం చిందని, అయినా సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పీఠం ఎక్కించేందుకు రాష్ట్ర విభజనకు పూనుకోవడం దారుణమన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాడినాడ హరిబాబు, షేక్ బాజీ, సర్పంచ్ కంగాల పోసిరత్నం, కరాటం కృష్ణ స్వరూప్, ఆరేటి సత్యనారాయణ, రేపాకుల చంద్రం, కుక్కల సోమరాజు తదితరులు పాల్గొన్నారు -
ముంపులోనే లంక గ్రామాలు
యలమంచిలి, న్యూస్‌లైన్ : గోదావరి వరద ఉధృతి తగ్గినప్పటికీ లంక గ్రామాలు వరుసగా మూడోరోజు కూడా ముంపులోనే ఉన్నాయి. ఆదివారంతో పోల్చుకుంటే ఒకడుగు నీరు తగ్గింది. అమావాస్య రోజులు కావడంతో వరదనీరు త్వరగా లాగుతోందని భావిస్తున్నారు. కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, బాడవ గ్రామాలు పూర్తిగాను, యలమంచిలిలంక, కంచుస్తంభంపాలెం, బూరుగుపల్లి, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాలలో పాక్షికంగా నీరు చేరింది. దొడ్డిపట్ల హైస్కూల్, కనకాయలంక తుఫాన్ షెల్టర్, లక్ష్మీపాలెం యూపీ స్కూల్, బాడవ యూపీ స్కూల్, పెదలంక ప్రాథమిక పాఠశాల, వాకలగరువు ప్రాథమిక పాఠశాల, గంగడపాలెం ప్రాథమిక పాఠశాల, అబ్బిరాజుపాలెం ప్రాథమిక పాఠశాలల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వరద బాధితులు 6,273 మందికి సోమవారం అల్పాహారంతోపాటు, భోజనాలు పెట్టారు. గోదావరి పైభాగం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో పైనుంచి వచ్చే నీటి వలన మంగళవారం గ్రామాల్లో మరింత వరదనీరు పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రత్యేక అధికారి ఎన్ రామచంద్రారెడ్డి, తహసిల్దార్ చాగలకొండు గురుప్రసాదరావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేదారీఘాట్‌లో తగ్గని నీరు సిద్ధాంతం(పెనుగొండ రూరల్) : ఆదివారం నాటి పరిస్థితే సిద్ధాంతంలో కొనసాగింది. వెంకటేశ్వరస్వామి, కేదారేశ్వర స్వామి ఆలయాలు నీటి ముంపులోనే ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరుగాం చిన కేదారీ ఘాట్ శ్మశాన వాటిక ము నిగి పోవడంతో దహన సంస్కారాలు ఏటిగట్టుపైనే చేస్తున్నారు. ఎవరూ లో ని కి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూరగాయల పా దు లన్నీ నీట మునిగాయి. కోక్ తో టలు, అరటి తోటలు పూర్తిగా దెబ్బతి న్నాయి. భద్రాచలంలో నీటి మట్టం త గ్గుతుండడంతో మంగళవారం నుంచి ఈ ప్రాంతంలో తీ వ్ర త తగ్గవచ్చునని భావిస్తున్నారు. మ ద్యస్థలంకలోకి రాకపోకలపై నియంత్ర ణ విధించారు. పడవలపై ఎవరూ గో దావరిలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టా రు. ఏటిగట్టు పొడవునా ప్రత్యేక కాపలా పెట్టా రు. పెనుగొండ త హసిల్దార్ జీజేఎస్ కుమార్ పర్యవేకిస్తున్నారు. -
‘స్వర్ణమయ’కు శ్రీకారం
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసే బృహత్తర కార్యానికి సోమవారం శ్రీకారం చుట్టారు. శ్రీవారి శేషాచలకొండపై దేవస్థానం ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు స్వర్ణమయ పథకాన్ని ప్రారంభించి తొలి విరాళాన్ని దేవస్థానం ఈవో త్రినాథరావుకు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం విరాళాలు, సేవల రుసుములు,ఫిర్యాదులు, సలహాల స్వీకరణ, ఆలయంలో జరిగే ఉత్సవాల వీక్షణకు ఏర్పాటు చేసిన ఏపీ ఆన్లైన్ సేవలను కూడా ఆయన ప్రారంభించారు. సుధాకరరావు మాట్లాడుతూ.. విమాన గోపురానికి బంగారు తాడపం చేయించాలని ట్రస్టుబోర్డు నిర్ణయం తీసుకుందని, ఇందుకు రూ. 6 కోట్లు అవసరమని అంచనా వేశామని చెప్పారు. ఈ పథకంలో భక్తులను భాగస్వాములను చేసేందుకు వారి నుంచి బంగారం లేదా రూ. 1,116 ఆపైన విరాళాలు స్వీకరించనున్నట్లు వివరించారు. విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయటం రెండేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. భక్తులకు ఇచ్చే దేవస్థానం గదుల రిజర్వేషన్లు, దేవస్థానం, ఆలయ ఇతర సేవలు పొందేందుకు విదేశాలు, దూర ప్రాంతాల వారికి వెసులుబాటు కోసం ఎస్బీఐతో ఒప్పందం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ సేవలు దేవస్థానం అధీనంలో ఉండేలా ప్రత్యేక గేట్‌వే కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ తరహా సేవలు విజయవాడ, భద్రాచలం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలోని దేవస్థానాల్లో ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రగతి పథంలో ఉందన్నారు. గో సంరక్షణ, కాటేజీల నిర్మాణం, వైఖానస ఆగమ పాఠశాల నిర్వహణలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. స్వర్ణమయ పథకానికి శ్రీవారి ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడు వేగేశ్న ఆనందరాజు తనతోపాటు ఆయన బంధువులు 18 మంది పేరున విరాళం అందించారు. మిగిలిన ట్రస్టుబోర్డు సభ్యులు, గ్రామస్తుడు తరగళ్ల శ్రీనివాస్ తదితరులు విరాళాలు ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ భాస్కర్, ట్రస్టుబోర్డు సభ్యులు వెంపరాల నారాయణమూర్తి, కూరాకుల వీరవెంకట సత్యనారాయణ, వుద్దాల నాగవెంకట కనకదుర్గవల్లి, కటకం కృష్ణవుూర్తి, వీవీఎస్ఎన్ వుూర్తి, పర్వతనేని శ్రీని వాసరావు, వేగేశ్న ఆనందరాజు, మెరజోతు రాములునాయుక్ తదితరులు పాల్గొన్నారు -
నిరసన జ్వాల
సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఆరో రోజైన సోమవారం సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలను మరింత విసృ్తతం చేశారు. మారుమూల పల్లెలనూ ఉద్యమ సెగలు తాకాయి. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన గుల్లా రవి కుమార్ (35) అనే వ్యవసాయ కూలీ విభజనపై మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమైక్య ఉద్యమంలో పాల్గొం టున్న భవన నిర్మాణ కార్మికుడు కొవ్వూరి రాంబాబు(50) రాష్ట్ర విభజన ప్రకటనతో కలత చెంది చింతలపూడిలో సోమవారం గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్‌లపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన విరమించుకోకపోతే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మునిసిపల్ ఉద్యోగులు 72 గంటల పెన్‌డౌన్ ప్రారంభించారు. బుట్టాయగూడెంలో నెహ్రూ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అయితే సమైక్య ఉద్యమకారులు ఆ విగ్రహానికి రంగులు వేయించి, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పూలమాలలు వేయించారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బ్యాంకింగ్సేవలు పూర్తిగా స్తంభించాయి. ఆర్టీసీ కొన్ని సర్వీసులను మధాహ్నం నుంచి నడిపింది. భీమవరంలో కేసీఆర్, దిగ్విజయ్, సోనియాలకు పిండప్రదానం చేశారు. కేసిఆర్ సీమాంధ్ర ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ న్యాయవాదులు నరసాపురం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తిలిలో సమైక్యవాదులు రైల్‌రోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి కావూరి ఇంటిని ముట్టడించిన మహిళలు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో చిరంజీవి, కావూరు, బొత్స డబ్బుకు అమ్ముడుపోయారని హిజ్రాలు దుమ్మెత్తిపోశారు. ఎంపీగా ఉన్న సమయంలో సమైక్యాంధ్ర అంటూ హడావుడి చేసిన కావూరి సాంబశివరావు మంత్రి పదవి అనే కుక్క బిస్కెట్కు ఆశపడి తన కళ్ళముందు విభజన జరుగుతున్నా కనీసం అభ్యంతరం తెలపకపోవడం దారుణమని కావూరి ఇంటిని ముట్టడించిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి ఫైర్‌స్టేషన్ సెంటర్లో దహనం చేశారు. సాయంత్రం ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మానవహారం ఏర్పాటు చేశారు. కామన్‌మెన్ రివల్యూషన్ ఫోర్స్ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ హాలు ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు ట్రాక్టర్లతో, టాక్సీ, ఆటోల డ్రైవర్లు, ఓనర్లు కార్లతో, ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద మూడోరోజైన సోమవారం తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు వేషధారణలో చిన్నారులు అలరించారు. కొత్తబస్టాండ్‌లో క్రికెట్ ఆడి యువకులు నిరసన తెలిపారు. రోడ్లపై ఆటలు పెనుగొండలో వైద్యసిబ్బంది రాస్తారోకో చేశారు. ఉపాధ్యాయులు రోడ్లపై కబడ్డీ ఆడారు. ఈశ్వర వినాయక సంఘం ఆధ్వర్యంలో రోడ్లపై కర్రసాధన చేశారు. జంగారెడ్డిగూడెంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కామవరపుకోటలో వైఎస్సార్ సీపీ అనుబంధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. కొవ్వూరులో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈజీకే రోడ్డుపై కబడ్డీ, వాలీబాల్ తదితర ఆటలు ఆడుతూ నిరసనలు తెలిపారు. రిక్షాలు తొక్కారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మల శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బోర్డుపై రాసి పిల్లలకు పాఠాలు చెప్పారు. నందిగంపాడులో పాఠశాల విద్యార్థుల ర్యాలీలో తెలుగుతల్లి వేషధారణ ఆకట్టుకుంది. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తణుకులో భవననిర్మాణ కార్మికుల సంఘం, వంటెద్దు సోమసుందరరావు మోటార్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉండ్రాజవరం నుంచి తణుకు వరకు రైతుసంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, ఇందిరాగాంధీ సెంటర్లో మానవహారం జరిగింది. బుట్టాయగూడెంలో భారీ ర్యాలీ బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి నుంచి బుట్టాయగూడెం అంబేద్కర్ కాలనీ వరకూ సుమారు 4 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో కేసిఆర్ దిష్టిబొమ్మలు ఐందింటిని దహనం చేశారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో, భీమవరం రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు వద్ద వంటావార్పు చేపట్టి భోజనాలు పెట్టారు. ఇక్కడి రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్ సంద ర్శించి ప్రసంగించారు. టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో చిన్నకార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. యలమంచిలి మండలం ఏనుగువానిలంక నుంచి చించి నాడ బ్రిడ్జి వరకు సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. పెనుమర్రు, లంకల కోడేరు, పూలపల్లిలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నరసాపురంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పార్టీ కార్యకర్తలతో కలసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేపట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అగ్నికుల క్షత్రియ సంఘం అంబేద్కర్ సెంటర్లో వంటావార్పు చేశారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రెస్ట్‌హౌస్ రోడ్డు యూత్, చినవెంకన్నపాలెం యూత్ వేర్వేరుగా వందలాదిమందితో సోనియాగాంధీ దిష్టిబొమ్మ శవయాత్రను డప్పులు, నృత్యాలతో బాణ సంచా కాలుస్తూ నిర్వహిం చారు. నాచువారి సెంటర్లో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌లకు పిండప్రదానం చేసి తద్దినం పెట్టారు. ఈ సందర్భంగా ఓ కార్మికుడు గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన వంటా వార్పును మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ప్రారంభించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి మాజీ ఎమ్మెల్యే సర్రాజు ఉద్యమంలో పాల్గొన్నారు. కోలమూరులో సోనియాగాంధి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. -
సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ
విశాఖపట్నం: తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన వెలువడగానే సీమాంధ్రలో విభజన సెగ రగులుకుంది. పెద్దఎత్తున ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలతో అట్టడుకిపోతోంది. రాష్ట్ర విభజనపై సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా తమ కార్యాచరణను రూపొందిస్తోంది. రేపటి నుంచి ఈనెల 11 వరకు జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ కేంద్రాల్లో ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా డివిజన్ సర్కిల్ స్థాయిలో భారీ ర్యాలీలు చేయనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. ఈ నెల 9న జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు ఉద్యోగుల జేఏసీ పేర్కొంది. తెలంగాణ ఏర్పాటుపై అనుకులంగా కేంద్రం జూలై 30న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. -
తెలంగాణ అంశంపై కాంగ్రెస్ చర్చలు జరుపుతుంది: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. బిల్లుతయారీకి సమయానికి రాజీ సూత్రం తీసుకొస్తామని ఆయన అన్నారు. రాజ్యాంగపరంగా అన్ని విధివిధానాలను అనుసరిస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుకుంటామని ఉద్యోగులకు హామీ ఇస్తున్నామంటూ దిగ్విజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సెటిలయిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ ఓ కమిటీ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై తొలుత క్యాబినెట్ భేటీ అవుతుంది అని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై తీర్మానం చేయాలని కేంద్రం అసెంబ్లీకి సూచిస్తుంది. తీర్మానం తర్వాత కేంద్రం ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పారు. ఓ వైపు విభజన ప్రక్రియ అధికారికంగా కొనసాగుతూనే ఉంటుందని, మరోవైపు పార్టీ అందరి అభిప్రాయాలు తెలుసుకుంటుందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. -
డ్రా ముగిసిన యాషెస్ మూడో టెస్టు
మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 332 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆటను కొనసాగిస్తున్న సమయంలో వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఆట నిలిచి పోయే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 32 పరుగుల చేసింది. చకచకా వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కంగుతినిపించాలనుకున్న ఆసీస్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. ఆట నిలిచే సమయానికి బెల్(1), రూట్(13) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా 332 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచుంది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం... వికెట్లు కోల్పోయినా, వేగంగా పరుగులు సాధించి అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచాలని ఆస్ట్రేలియా భావించింది. అందుకు అనుగుణంగానే రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలోనే 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆసీస్ ఆధిక్యం 331 పరుగులకు చేరింది. -
‘సమైక్యాంధ్రాను పరిరక్షించుకుందాం’
కాకినాడ: సమైక్యాంధ్రాను సాధించుకోవడం కాదు.. పరి రక్షించుకుందామని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో అంధ్రప్రదేశ్ ముందడుగులో ఉందని, విభజన జరిగితే ఆంధ్రా ప్రాంతం నీటి కరువుతో అల్లాడుతుందన్నారు. రాజకీయ దురుద్దేశంతో విభజన చేయడం దారుణమని నెహ్రూ విమర్శించారు. సోమవారం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు . హైలెవల్ కమిటీలో అన్ని పార్టీల నేతలను పిలవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శాస్త్రీయంగా అన్ని అంశాలపై చర్చలు జరగాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ విభజన కార్యక్రమం చేపట్టిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌కు ఇవ్వకుండా, సీఎం, పీసీసీ చీఫ్‌లకు ఇవ్వడంలో అర్థమేమిటని సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుది రెండు నాల్కల ధోరణి అని ఆయన విమర్శించారు. -
దిగ్విజయ్‌ని కలిసిన కేంద్ర మంత్రులు
ఢిల్లీ: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. తమ వాదన వినిపించారు. సమైక్యాంధ్ర తీర్మానాన్ని వారు దిగ్విజయ్ సింగ్‌కు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి, జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్‌కు తమ వాదన వినిపించినట్లు తెలిపారు. ఎవరికి అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌పై తాము లేవనెత్తి అంశాలను లిఖితపూర్వకంగా తెలియజేయమని ఆయన కోరినట్లు చెప్పారు. హైలెవల్ కమిటీ ముందు త్వరలోనే తమ వాదనలను వినిపిస్తామన్నారు. సమావేశాలకు అడ్డుపడకుండా సీమాంధ్ర ఎంపిలను ఒప్పిస్తామని చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌ను కలిసినవారిలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, పురందేశ్వరీ, కిల్లి కృపారాణి ఉన్నారు. సమైక్యాంధ్రకే తమ మొదటి మద్దతని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. అలా కాకపోతే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల అపాయింట్లు కోరినట్లు చెప్పారు. కమిటీ ముందు వాదనలు వినిపించమని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు కోట్ల తెలిపారు. ఎటువంటి పరిస్థితులలో తాము హైదరాబాద్ వదలుకోం అని, హైదరాబాద్‌తో కలిసే ఉంటామని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి చెప్పారు. శ్రీశైలం జలాశయానికి నీరు ఎలా వస్తాయనేది తమ ప్రధాన సమస్య అన్నారు. పైనుంచి నీరు రాకుంటే తమ ప్రాంతం ఎడారి అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, సీమాంధ్ర ఎంపీలు రేపు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుస్తారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరతారు.