Latest News
-
ఇటలీ నావికుల కేసు ఎన్ఐఏకు
న్యూఢిల్లీ: ఇటలీ నావికుల కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం కేరళ పోలీసులకు లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన నేపథ్యంలో హోంశాఖ ఆ బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించింది. భారత్ సముద్ర జలాల్లో మత్య వేటకు వెళ్లిన ఇద్దరు కేరళకు చెందిన మత్యకారులను మాసిమిలియానో లాతోర్, సాల్వతోర్ గిరోన్ అనే ఇద్దరు ఇటలీ నావికులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ ఉదంతంపై వామపక్షాలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతకుముందు బీజేపీ నేతలు ఇటలీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. భారత్‌ను ఇటలీ తేలికగా తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. -
'అత్తారింటికి దారేది' విడుదల వాయిదా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి విభజన సెగ తగిలింది. అత్తారింటికి దారి(విడుదల తేది) తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రం విడుదల సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తొలుత ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత హీరో మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా చిత్రం విడువలను వాయిదావేయాలని నిర్మాతలు అనుకుంటున్నట్లు సమాచారం. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఈ సినిమాను విడుదల చేయడం అంత మంచిదికాదని వారు భావిస్తున్నారు. అవకాశం ఉంటే ఈ నెల 14న విడుదల చేయాలన్న ఆలోచనతో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తేదీ కాకపోతే ఉద్యమ పరిస్థితిని బట్టి వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అంశం చిరంజీవి కుటుంబ హీరోల చిత్రాల విడుదలకు అడ్డుతగులుతోంది. కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారి చిత్రాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమాకు ఇబ్బందిలేకుండా ఉండేదుకు గానీ లేక మరే కారణం వల్లనో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' సినిమా విడుదలను వాయిదా వేశారు. ముందు ప్రకటించిన ప్రకారం ఆ చిత్రం జులై 31న విడుదల కావాలసి ఉంది. దానిని 21కి వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆ సినిమా 21న విడుదల అవుతుందో లేదో చెప్పడం కష్టం. ‘ఎవడు' కంటే ముందు విడుదల కావలసిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల వాయిదాపడుతుండటంతో పవర్ స్టార్ పవన్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అదీగాక ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో పూర్తీగా హాస్యరస ప్రధానంగా నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. పవన్ - బ్రహ్మానందంల హాస్యం - మహేష్ బాబు అతిధి పాత్ర - పవన్ కల్యాణ్ పాట....అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ పడిన పాటను యుట్యూబ్లో పెడితే కేవలం 24 గంటల్లో 3,70,000 మంది వీక్షించారంటే అభిమానులు ఏ రేంజ్లో ఎదురు చూస్తున్నారో ఊహించుకోవచ్చు. పవన్ అభిమానులతోపాటు ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా తమ హీరో ఎటువంటి పాత్ర పోషించాడో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా, పవన్ అత్తగా నదియా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అత్తారింటికి దారి వెతుకులాటలో ఏ తేది ప్రకటిస్తారో వేచి చూడవలసిందే. అభిమానులకు ఇదో పెద్ద ఆశాభంగం! -
జమ్మూలో కాల్పులు: గాయపడ్డ భారత జవాను
జమ్మూ: కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో సోమవారం చోటు చేసుకున్నకాల్పుల్లో ఒక భారత జవాను గాయపడ్డాడు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న సాంబా జిల్లాలో అకస్మికంగా కాల్పులు జరగడంతో రామ్ నివాస్ మీనా అనే జవాను గాయపడ్డాడు. ఈ కాల్పుల్లో 200 బెటాలియన్‌కు చెందిన మీనా ఛాతిలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్ర గాయాలైయ్యాయి. తీవ్రంగా గాయపడిన జవాన్‌కు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.. నరైన్ పూర్ సరిహద్దు ప్రాంతంలో రెండు రౌండ్లు కాల్పులు అకస్మికంగా జరిగాయాని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపాడు. సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పులు పాకిస్థాన్ సరిహద్దుల నుంచే జరిగి ఉండవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన అనంతరం బీఎస్ఎఫ్ జవాన్లు ఎటువంటి ఎదురుదాడికి పాల్పడలేదన్నాడు. . . -
విభజన వివాదం రోజుకో కొత్త మలుపు
ఢిల్లీ: రాష్ట్ర విభజన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. రాయల్-తెలంగాణ అంశం వెనక్కు వెళ్లిపోయింది. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం - మరో పక్క హైదరాబాద్ అంశంపై చర్చ - ఇంకోవైపు సీమాంధ్ర కావాలన్న వాదం ... ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లా నేతలు తమ జిల్లాను తెలంగాణలో కలపమని కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఎంపి ఎస్పివై రెడ్డి, రాభూపాల్ రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, మురళీ కృష్ణ, లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు పార్టీ రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలని వారు కోరారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా వారు కోరారు. తమ జిల్లాను తెలంగాణలో కలపమని ఆమెను కూడా వారు కోరనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తమ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రేపు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఇది ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అని సమైక్యాంధ్రవాదులు విమర్శిస్తున్నారు. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చిన సమయంలో ఒక్క కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపమని కోరడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తీరును వారు తప్పుపడుతున్నారు. -
‘ఏక్తాతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది’
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్‌తో కలిసి మూడు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు దర్శకుడు మిలన్ లుథ్రియా తెలిపారు. ఆమెతో కలిసి పనిచేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ ఇద్దరి కాంబినేషనల్ వచ్చే చిత్రాలు అద్భుతమైన సృజనాత్మకతను సంతరించుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సోమవారం ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన లుథ్రియా.. ఇప్పటి వరకూ తమ ఇద్దరి కాంబినేషనల్ నిర్మితమైన చిత్రాలు విజయవంతమైనట్లు తెలిపారు గతంలో లూథారియా దర్శకత్వం వహించిన ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి’, ద థర్టీ పిక్చర్ చిత్రాలను ఏక్తాక పూర్ తన సొంత బ్యానర్ అయిన బాలాజీ టెలిఫిలింస్లోనే నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి దోబరా’ తో కలిపి మూడో ప్రాజెక్టును ఏక్తా బ్యానర్లో పూర్తి చేసినట్లు మిలన్ తెలిపారు. చిత్రీకరణ సమయంలో ఒకరి నుంచి ఒకరు చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు. కొన్ని సమయాల్లో తమ ఆలోచనలు ఒకే రకంగా ఉన్నా, విరుద్ధమెన భావాలు సంతరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏక్తాకపూర్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవిల్స్ తనకు బాగా నచ్చుతాయని లూథారియా అన్నారు. ‘ మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని’ పేర్కొన్నారు. -
తెలంగాణపై కాంగ్రెస్ డ్రామాలు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: పార్టీలో మాట్లాడుకోకుండా తెలంగాణపై కాంగ్రెస్ డ్రామాలాడుతోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఒకే రోజు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాంగ్రెసే తెలంగాణ ఇచ్చిందని సంబరాలు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ రావడానికి టీడీపీ, బీజేపీలే కారణమని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజలకు కావాల్సింది కాంగ్రెస్ కమిటీ కాదని, ప్రభుత్వం తరఫున కమిటీ వేసి సమాధానం చెప్పాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. వారి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. విభజన తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు సీమాంధ్ర ఉద్యోగులకు సంబంధించి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు దుమారంలేపాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ వైఖరిని వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. -
చంద్రబాబును కలిసిన ఏపీఎన్జీవోలు
హైదరాబాద్: టీడీ పీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఏపీఎన్జీవోలు సోమవారం సమావేశమైయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ఉద్యోగులు, యువత తీవ్రంగా నష్ట పోతారని విన్నవించినట్లు తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలంటే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో కొత్తేమి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన ముందు నుంచి చెబుతున్న మాట ఇదేనని ఏపీ ఎన్జీవోలు తెలిపారు. సమైక్యాంధ్రా కోసం తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. .ఏపీఎన్జీవోలు మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. సీమాంధ్రాలో ఉన్న ప్రజా ప్రతినిధులు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు సమర్పించాలని వారు హెచ్చరించారు. మంత్రులు రాజీనామాలను సమర్పించాలని, లేకుంటే రాష్ట్రంలో పాలన స్తంభింపజేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు రాజీనామా లేఖలను పమర్పించాలని ఏపీఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నారు. -
‘రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు’
ఢిల్లీ: మంత్రులు రాజీనామాలతో సమస్యకు పరిష్కారం లభించదని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేస్తే ఇక్కడ పనిచేసే వాళ్లు ఎవరని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలను బ్యాలెన్సుడుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని జేడీ శీలం తెలిపారు. రైతులు, హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై ప్రస్తుతం తాము దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఓ దశలో సీమాంధ్ర నేతలు రాజీనామాల బెదిరింపులపై ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. సమస్యలు వీధుల్లో పరిష్కారం కావని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నేతలు లేవనెత్తిన అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ సలహాదారు దిగ్విజయ్ సింగ్‌లను కలిసి వివరిస్తానని ఆయన తెలిపారు. -
డీజీపీకి కరుణానిధి సంఘీబావం
తమ రాష్ట్ర డీజీపీ కె రామానుజానికి జరిగిన అవమానంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందించారు. డీజీపీకి సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా డీజీపీ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఎస్పీజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'ప్రధానమంత్రి భద్రత ముఖ్యమే. అయితే డీజీపీని అవమానించడం మంచి పద్దతి కాదు' అని డీఎంకే పత్రిక 'మురసోలి'లో కరుణానిధి పేర్కొన్నారు. ఇది తమ రాష్ట్రానికి, పోలీసు విభాగానికి జరిగిన అవమానమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పుదుకోట్టై జిల్లా తిరుమయంలో భెల్ అనుబంధ పైపుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవ నిమిత్తం తమిళనాడుకు వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసేందుకు వెళ్లిన రామానుజాన్ని ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. పాస్ లేదనే కారణంతో ఆయనను అడ్డగించారు. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనకు ఆయన దూరంగా ఉండిపోయారు. డీజీపీకి అవమానం ఎదురు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రధాని రాసిన లేఖలో జయలలిత కోరారు. ఈ ఘటనపై విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. -
టీఆర్ఎస్కు పది సీట్లు మించిరావు: విజయశాంతి
వచ్చే 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)పార్టీకి పది సీట్లు మించి రావని మెదక్ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. సోమవారం 'సాక్షి'తో మాట్లాడిన విజయశాంతి పలు విషయాలను వెల్లడించారు. ఉద్యమంలో క్రెడిట్ అంతా కేసీఆర్ అంటే తాను ఒప్పుకోనని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నడవడానికి అనేక మంది తెలంగాణ వాదులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు షోకాజ్ నోటీస్ అందిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని విజయశాంతి తెలిపారు. తెలంగాణ సాధన టీఆర్ఎస్ గొప్పదనమే అని చెప్పకపోగా, తెలంగాణ అమరవీరులదే ఆ ఘనత అని విజయశాంతి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. టీఆర్ఎస్ అధినాయ కత్వంతో ఆమెకు దూరం పెరిగిందనేది స్పష్టమ వుతోంది. కాగా తెలంగాణ ఏర్పాటుకోసం టీఆర్ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానని గతంలోనే ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఘనత ఏ రాజకీయపార్టీదో కాదని, ప్రాణాలను అర్పించిన అమరవీరులదే అని వ్యాఖ్యానించారు. అధికార రాజకీయాల చుట్టూ తిరిగే పార్టీలకు తాను క్రెడిట్ ఇవ్వదలచుకోలేదని, త్యాగాలు చేసిన అమరులకే క్రెడిట్ ఇస్తానని అన్నారు. తెలంగాణ కోసం తాను 16 ఏళ్లుగా కష్టపడ్డానని, టీఆర్ఎస్ 13 ఏళ్లుగానే, పోరాడుతోందని అన్నారు. తెలంగాణకోసం టీఆర్ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానన్నారు. 2014 ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననే విషయంపై ఇప్పుడే మాట్లాడలేనన్నారు. -
పచ్ఛి అబద్దాలు మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో ఒక్క తీర్మానం కూడా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం ఇంత నీచ రాజకీయాలు చేయడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన వైఖరిపై సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అసలు రూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. కాంగ్రెస్ పది తలల రాక్షసి అని విమర్శించారు. ప్రజలందరినీ సర్వనాశనం చేసే వైఖరి కాంగ్రెస్ పార్టీదని ఆయన దుయ్యబట్టారు. విభజనపై వైఎస్ఆర్ సిపి అభిప్రాయం అనేక సార్లు స్పష్టం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ వైఖరిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం అవడం పట్ల అంబటి సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సిపి తరఫున షర్మిలకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. -
పచ్చి అబద్దాలు మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో ఒక్క తీర్మానం కూడా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం ఇంత నీచ రాజకీయాలు చేయడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన వైఖరిపై సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అసలు రూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. కాంగ్రెస్ పది తలల రాక్షసి అని విమర్శించారు. ప్రజలందరినీ సర్వనాశనం చేసే వైఖరి కాంగ్రెస్ పార్టీదని ఆయన దుయ్యబట్టారు. విభజనపై వైఎస్ఆర్ సిపి అభిప్రాయం అనేక సార్లు స్పష్టం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ వైఖరిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం అవడం పట్ల అంబటి సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సిపి తరఫున షర్మిలకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. -
18 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనానికి అడ్డుకట్ట పడింది. మార్కెట్ సూచిలు సోమవారం స్వల్ప లాభాలు నమోదు చేసింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 18 పాయింట్లు లాభపడి 19182 వద్ద స్థిరపడింది. గత 8 సెషన్స్‌లో సెన్సెక్స్ 1139 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 5685 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావరణ నెలకొనడంతో మార్కెట్ స్వల్ప లాభాలకే పరిమితమయింది. బీఎస్ఈ సూచిలో 18 షేర్లు లాభాలు ఆర్జించగా, 12 షేర్లు నష్టాలు చవిచూశాయి. ఐటీసీ, కోల్ ఇండియా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ లీవర్ వాటాలు లాభాలు ఆర్జించాయి. -
ఇప్పటికీ నేను సమైక్యవాదినే: జగ్గారెడ్డి
హైదరాబాద్: ఇప్పటికీ తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగదని చెప్పారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తమకు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని, తెలంగాణ అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే ఈ రకంగా ప్రత్యేకరాష్ట్రం వద్దనడంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన కోసం రోడ్ మ్యాప్ రూపొందించిన వారు అసలు జిల్లాకు సాగు, తాగునీటి వనరులను ఎక్కడి నుంచి తెస్తారో చూపించారా? అని ప్రశ్నించారు. సింగూర్ ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్లలో పూడిక తీయించాలని, కర్ణాటక, మహారాష్ట్రల్లో అక్రమంగా నిర్మించిన చిన్నచిన్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని తాను ఎన్నిసార్లు చెప్పినా జిల్లా మంత్రులు పెడచెవిన పెట్టారని వాపోయారు. జిల్లా అభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. తెలంగాణ అంశానికి అనుకూలంగా లేకపోతే వారెవరూ వచ్చే ఎన్నికలలో గెలవలేరని, అందుకే ఈ అంశంతో ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
కేరళలో భారీ వర్షాలు: 16 మంది మృతి
కేరళలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇడుక్కి జిల్లాలో 14 మంది వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఎర్నాకుళం జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఇడుక్కి జిల్లాపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని రెవెన్యూ మంత్రి అదూర్ ప్రకాశ్ తెలిపారు. ఆయన స్వయంగా ఆ జిల్లాకు వెళ్లి ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యకలాపాలను పరిశీలించారు. మున్నార్ సమీపంలోని చీయపర ప్రాంతంలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డుపక్కనే వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న సమయంలో ఇది పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీన్ని తీసిన తర్వాత గానీ కింద ఎన్ని వాహనాలున్నాయో చెప్పలేమన్నారు. భారత నావికా దళానికి చెందిన సిబ్బంది ఇప్పటికే సహాయ కార్యక్రమాల కోసం అక్కడకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం పరిస్థితి తీవ్రత గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటుచేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఇడుక్కి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపారు. కొచ్చిలో 40 విమాన సర్వీసులు రద్దు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ ప్రాంతంతో పాటు టాక్సీ మార్గంలోకి కూడా నీళ్లు ప్రవేశించడంతో దాదాపు 40 విమాన సర్వీసులు రద్దుచేశారు. ఈ విమానాశ్రయం 1999లో ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారని విమానాశ్రయ డైరెక్టర్ ఏసీకే నాయర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా డ్యాం షట్టర్లు తెరవాల్సి రావడంతో విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుకుందని, లోపలకు కూడా నీళ్లు రావడంతో ఉదయం పదిన్నర గంటలకు మొత్తం ఆపరేషన్లన్నింటినీ సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. సాయంత్రానికి మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని నాయర్ చెప్పారు. గడిచిన రెండు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. -
ఇంగ్లండ్ విజయలక్ష్యం 332
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా 332 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం... వికెట్లు కోల్పోయినా, వేగంగా పరుగులు సాధించి అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచాలని ఆస్ట్రేలియా భావించింది. అందుకు అనుగుణంగానే రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలోనే 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆసీస్ ఆధిక్యం 331 పరుగులకు చేరింది. దీంతో భారీ పరుగుల ఆధిక్యంతో చివరిరోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ పోరాడుతోంది. అనుకున్నట్లే ఆసీస్ సోమవారం తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి 19 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
అభ్యంతరాలు తెలుసుకోనున్న హైలెవల్ కమిటీ
ఢిల్లీ: కాంగ్రెస్ హైలెవల్ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో మంత్రులు సమావేశమైయ్యారు. రాష్ట్ర విభజన, హైదరాబాద్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంత నేతల అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. బంద్‌లు - రాస్తారోకోలు - వాహనాలు తగులబెట్టటం - దిష్టి బొమ్మల దగ్ధం - జవర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసం ........ ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేయని వారిని ప్రజలు నిలదీస్తున్నారు. వారి ఇళ్లపై దాడులు కూడా చేస్తున్నారు. రాజీనామాలు చేయని వారు తమతమ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సీమాంధ్రలో ఉద్యమ పరిస్థితి కేంద్రం దృష్టికి వెళ్లింది. దానికి తోడు ఈరోజు పార్లమెంటులో సీమాంధ్ర ఎంపిలు ఆందోళన చేశారు. దాంతో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో మంత్రుల బృందం సీమాంధ్ర ప్రాంత నేతల భయాలు, అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఇదిలా ఉండగా, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ మొదలైందని రాజ్యసభలో ఈరోజు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
పరిశ్రమను రక్షించాలంటే కఠినమైన విధానాలు అవసరం: తమ్మారెడ్డి భరద్వాజ
సినీ పరిశ్రమను రక్షించాలంటే ప్రభుత్వం కచ్చితమైన విధానాలు అవలంబించాలని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు 1990ల కాలం నుంచి హైదరాబాద్ సొంతింటిలా ఉందని, సరైన విధాన నిర్ణయాలు అమలుచేసినంత కాలం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలిస్తేనే అసలు సమస్యలన్నీ వస్తాయన్నారు. ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ చేసుకునేవాళ్లమని, అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ చేయాల్సి వస్తుందని, ఇది కొంత ఇబ్బంది కావచ్చని మాత్రం చెప్పారు. చాలావరకు తెలుగు సినిమాలను హైదరాబాద్‌లోని స్టూడియోలలోనే తీస్తున్నారని, మరికొన్నింటిని చుట్టుపక్క్లల ప్రాంతాలలో తీస్తున్నారని.. అయితే ఇదంతా తర్వాత తెలంగాణే అవుతుందని అన్నారు. ముందుగా అనుమతి తీసుకున్నాకే షూటింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుందని భరద్వాజ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత.. తెలంగాణ సినిమా ఫోర్స్ పేరుతో ప్రత్యేక సినిమా కమిటీ ఏర్పాటు చేయడానికి పరిశ్రమకు చెందిన కొంతమంది ఆసక్తి చూపించారని తెలిపారు. పరిశ్రమను తరలించడం అనేమాట ఇప్పుడే చెప్పడం చాలా తొందర అవుతుందన్నారు. ప్రభుత్వం వినోద పన్ను మినహాయిస్తామని ప్రకటిస్తే, అక్కడకు వెళ్లొచ్చని.. ఒకచోట మినహాయింపు ఉండి, మరోచోట లేకపోతే నిర్మాతలు మినహాయింపు ఉన్నచోటే షూటింగ్ చేసుకుంటారని ఆయన తెలిపారు. వినోదపన్ను మినహాయిస్తే చాలా సొమ్ము ఆదా అవుతుందని, అందువల్ల సహజంగానే నిర్మాతలు పన్ను లేని చోట్ల షూటింగ్ చేసుకోడానికి ఆసక్తి చూపుతారని భరద్వాజ చెప్పారు. హైదరాబాద్‌లో కావల్సినన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, స్టూడియోల నుంచి ల్యాబ్‌లు, సినిమా హాళ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయని, ఇలాంటి సమయంలో ఇక్కడి నుంచి వెళ్లి వేరేచోట మళ్లీ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పైపెచ్చు అంత భారీగా సదుపాయాలు ఏర్పాటుచేసుకోడానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం: చిదంబరం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో స్పష్టమైన విధివిధానాలున్నాయని ఆయన తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అనేక సమస్యలు పరిష్కరించాల్సివుంటుందని చెప్పారు. ఈ అంశాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ సమగ్ర విధాన పత్రాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తుందని చిదంబరం తెలిపారు. ఇందులో జలవనరులు, విద్యుత్ పంపిణీ, పంపిణీ, ప్రజల భద్రత, ప్రాథమిక హక్కుల రక్షణ, ఇతర అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. కేబినెట్ నిర్ణయం తర్వాత ఈ అంశాలన్నిటిపై సభలో నిర్మాణాత్మక చర్చ జరుగుతుందన్నారు. తగిన సమయంలో చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రకటన చేయాలని సీమాంధ్ర ఎంపీలు డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చిదంబరం ప్రకటన చేశారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ద్విసభ్య సంఘంతో సమావేశమయ్యారు. -
'కాటం రాయుడా'కు పవర్ 'స్టార్' క్లిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గళం విప్పాడు. తమ్ముడు, ఖుషి చిత్రాల్లో జానపద గీతాలు పాడిన అతను తన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది'లో ఓ పాట పాడాడు. అలనాటి చిత్రం 'సుమంగళి'లోని 'కాటం రాయుడా' పాటను ఆలపించాడు. ఈ పాట ప్రస్తుతం యుట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో 3,70,000 మంది ఈ వీడియోని వీక్షించారు. ఈ పాటను పవన్ ఈజీగా .... అరగంటలో పాడేశాడట. అయితే చిత్ర యూనిట్ ఆడియో విడుదల చేసేటప్పుడు మాత్రం ఈ పాట గురించి గోప్యంగా ఉంచారు. ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యంలో ముంచేందుకు ఈ పాటను ఇటీవల విడుదల చేసిన ఆడియో ఆల్బంలో పెట్టలేదు. ఇదే విషయాన్ని ఆడియో రిలీజ్ రోజు హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాలో ఇంకో పాట ఉందని.. అది బయటపెడితే తనను చంపేస్తానన్నారని చెప్పిన విషయం తెలిసిందే. 'అత్తారింటికి దారేది'లో పవన్ సరసన సమంత...ప్రణీత హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈనెల 9న 'అత్తారింటికి దారేదీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరో మహేష్ బాబు కూడా ఓ అతిథి పాత్ర పోషించారు. ఓ పక్క పవన్ పాటతో పాటు, ప్రిన్స్ గెస్ట్ రోల్ చూసేందుకు ఇద్దరు హీరోల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. -
ఎంపి మేకపాటి రాజీనామా
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ పార్మేట్లో రాజీనామా లేఖను ఫాక్స్‌లో లోక్‌సభ స్పీకర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. స్పీకర్ కార్యాలయం తనను వ్యక్తిగతంగా కలవమని పిలిస్తే ఢిల్లీ వెళ్లి కలుస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా తాను రాజీనామా చేయనున్నట్లు ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ విషయం చెప్పారు. చెప్పిన ప్రకారంమే ఈరోజు ఆయన రాజీనామా చేశారు. తెలుగు ప్రజలతో కేంద్రం ఆడుతున్న నాటకానికి నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు మేకపాటి తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ఆయన విమర్శించారు. వారి ఫైటింగ్ అంతా సినిమాలలో మాదిరి ఉత్తుత్తి ఫైటింగ్ అన్నారు. -
విభజనకు సహకరించండి: కోదండరాం
రాష్ట్ర విభజనకు సహకరించండి.. సమస్యలను పరిష్కరించుకుందామని సీమాంధ్రులకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. హైదరాబాద్ తమదని సీమాంధ్రులు అనడం భావ్యం కాదన్నారు. జోనల్ వ్యవస్థ రద్దుకు తాము కూడా వ్యతిరేకమే అని చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని అంతకుముందు కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని కోదండరాం ఆంధ్ర ప్రాంతం వారికి ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని ఆంధ్రపాంతం వారు ఆందోళన చెందవద్దన్నారు. అన్ని పక్షాల భాగస్వామ్యంతోనే రెండు రాష్ట్రాలను అభివృద్ది చేసుకుందామని కోదండరాం అన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. కొందరి డబ్బుల సంచులతో ఉద్యమం నడుస్తోందన్నారు. తెలంగాణపై కేంద్రం వెనకడుగు వేస్తే మళ్లీ ఉద్యమం చేస్తామని బీజేపీ నాయకుడు నాగం జనార్దన రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ కేంద్రం ఆధీనంలో ఉంటే సహించబోమని ఆయన తెలిపారు. మరోవైపు విభజనకు సహకరించాలని ఇరుప్రాంతాల వారికి మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
విదేశాల్లో చక్కర్లు కొడుతున్న 'భాయ్ '
నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ చిత్ర సన్నివేశాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యే కొన్ని చిత్ర సన్నివేశాలను స్లొవేనియా దేశంలో 700 సంవత్సరాల పురాతన చరిత్ర గల ఒక కోటలో నిర్మించారు. కాగా, కొన్ని పాటలను ఐస్లాండ్లో చిత్రీకరించారు. కోట సన్నివేశాల గురించి హీరో నాగార్జునతో మాట్లాడితే.. ఆ పురాతణమైన కోటలో నిర్మించిన పాట చిత్రీకరణ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. అక్కడ షూటింగ్ చేయడం ఒక మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందన్నారు. దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఇప్పటికే టాకీని ముగించాడు. ఇంకోవైపు డబ్బింగ్ జరుగుతోంది. కామ్నజఠ్మలానీ ఇందులో తెలంగాణా యాసలో మాట్లాడనుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాఫియా నేపథ్యమైనా అది ఎక్కువగా ఉండదని అంటున్నారు. రిచా, హంసానందిని, కామ్న, నథాలియాకౌర్ వంటి వారు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈనెల 16న ఆడియోను విడుదలచేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం మరియు జయప్రకాశ్ రెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జునలోని మాస్ యాంగిల్‌ని క్లాస్‌గా ప్రెజెంట్ చేస్తూ వీరభద్రం చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంభాషణలు చాలా శక్తిమంతంగా ఉంటాయనేది యూనిట్ వర్గాల సమాచారం. కామెడీ, యాక్షన్ కొత్త పుంతలు తొక్కే విధంగా ఉంటాయని చెబుతున్నారు. -
పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో తొలిరోజే తేలిపోయింది. సమైక్య నినాదాలు మిన్నంటడం, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు పదేపదే వెల్‌లోకి దూసుకెళ్లి కార్యకలాపాలకు అడ్డు తగలడంతో పార్లమెంటు ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, విభజన తగదని సీమాంధ్ర ఎంపీలు ఒకవైపు నినదించగా, మరోవైపు బోడోలాండ్ సహా పలు కొత్త రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా తమ వాణిని గట్టిగా వినిపించడంతో సభా కార్యకలాపాలకు పదే పదే ఆటంకం కలిగింది. రాష్ట్ర విభజన సెగ పార్లమెంట్లో పెను ప్రకంపనలు రేపుతోంది. వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. సభ్యులు శాంతించకపోవడంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో తేడా కనిపించలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ప్రాంతానికి న్యాయం చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెనక్కు వెళ్లాలని సోనియా వేలు చూపి మరీ ఆదేశించినా వారు పట్టించుకోలేదు. మరోవైపు బోడోల్యాండ్ ప్రాంత ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రం కొనసాగింది. ఐతే సభ్యులు ఎంతకూ వెనక్కు తగ్గకపోవడంతో స్పీకర్ సభను తర్వత మధ్యాహ్నం 2 గంటలకు, మళ్లీ 3 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇవే పరిస్థితి కనిపించింది. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు అక్కడకు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్లకార్డులను కొందరు ఎంపీలు ప్రదర్శించారు. ఓ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీల వద్దకు టీడీపీ సభ్యుడు ఎన్. శివప్రసాద్ ఆగ్రహంగా వెళ్లబోగా.. సహచరులు ఆయనను వారించారు. సభ్యులను శాంతపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ ప్రయత్నించినా, ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. రాజ్యసభలో టీడీపీ సభ్యులు వైఎస్ఆర్ చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేశ్ సభలో గందరగోళం సృష్టిస్తున్నారంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించారు. ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని టీడీపీ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేస్తుండగా.. తెలంగాణ ఇచ్చినప్పుడు బోడోలాండ్ ఎందుకు ఇవ్వరని ఆ ప్రాంత సభ్యుడు బిశ్వజిత్ దైమరి ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. ఎన్నిసార్లు సమావేశమైనప్పటికీ పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాకపోవడం, సభా కార్యకలాపాలు జరిగేలా లేకపోవడంతో పార్లమెంటు ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే, అంతకుముందు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ విధివిధానాలపై కేబినెట్ నోట్ రూపొందుతోందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఒకవైపు సీమాంధ్రలో ఆందోళనలు జోరుగా సాగుతున్నా.. కేంద్రం ఈ ప్రకటన చేయడంతో ఎంపీలతో పాటు అటు ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నవారు కూడా రగిలిపోయారు. మరోవైపు.. రక్షణమంత్రి ఏకే ఆంటోనీతో సీమాంధ్ర మంత్రులు ఈ రోజు భేటీ కానున్నారు. సీమాంధ్రలో ఆందళోనలపై ఆంటోనీ నేతృత్వంలో కమిటీ వేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
'మెజార్టీ పార్టీల అభిప్రాయం మేరకే విభజన'
హైదరాబాద్: రాష్ట్రంలోని మెజార్టీ పార్టీల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపాలిని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను కూల్చితే ఊరుకోం అని హెచ్చరించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో తమ పదవులకు రాజీనామాలు చేసే ప్రసక్తి లేదని బొత్స తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. రాజీనామాలు చేస్తే శాసనసభలో సమైక్యవాణి ఎవరు వినిపిస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిందేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో రూపొందించిన తీర్మానంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, తాను కూడా సంతకాలు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని 5 కోట్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల సమస్యలను ఎలా అధిగమిస్తామనేది ఆలోచిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోనే అన్ని అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేసినందున ఈ సమస్య ఏర్పడిందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ లబ్ధి కోసం జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్‌పై నిందలు వేసినా, విగ్రహాలను విధ్వంసం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలంతా వెంటనే ప్రతిఘటించాలని బొత్స పిలుపునిచ్చారు.