Latest News
-
జగపతి బాబు...మరో పునర్జన్మ!
చాలాకాలంగా విజయానికి దూరంగా ఉన్న ఫ్యామిలీ హీరో జగపతిబాబు చాలా రోజుల aతర్వాత మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. తాను ప్రస్తుతం చేస్తున్న పాత్ర పునర్జన్మ లాంటిదని అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో జగపతి బాబు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను కొన్ని చిత్రాలు చేశానని, అయితే అవి ఎప్పుడు విడుదలై వెళ్లిపోయాయో కూడా తనకు తెలియదని అన్నారు. అందుకే ఇక నుంచి తాను పోషించే పాత్రల గురించి కేర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మార్పు తనకు పునర్జన్మ వంటిదని ఆయన అన్నారు. బాలయ్యతో కలిసి నటించటం తనకు సంతోషంగా ఉందని, తామిద్దరంమంచి స్నేహితులం కూడా అని జగపతి బాబు అన్నారు. దీంతో పాటు ఓ మంచి దర్శకుడితో పని చేయటం ఆనందంగా ఉందన్నారు. తాను ఈ చిత్రంలో మూడు తరాలకు సంబంధించి మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తానని, అందుకోసం తన బాడీ లాంగ్వేజ్‌లో చాలా మార్పు చూపించాల్సి వచ్చిందన్నారు. ఇప్పటి వరకూ తనకు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ఉందని, అయితే విలన్ పాత్రను పోషించే ఈ నిర్ణయం కొంతమందికి బాధకరమైనా తప్పదన్నారు. ఇంతకు ముందులానే తనను ఆదరించాలని జగపతి బాబు కోరారు. ప్రేక్షకులు కూడా తన పాత్రని అంగీకరించి, ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాని సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. మరి కొత్త పాత్రలో జగపతి బాబును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. -
సంగీత దర్శకుడు చక్రిపై నిర్భయ కేసు
సినీ సంగీత దర్శకుడు చక్రి వివాదంలో చిక్కుకున్నారు. చక్రి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బేగంపేటకు చెందిన మాధవి అనే యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చక్రి ఇంట్లో ఆదివారం రాత్రి జరిగిన ఫ్రెండ్ షిప్ డే వేడుకల సందర్భంగా తన పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. చక్రితో పాటు నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇడియట్ సినిమాతో పాపులరయిన చక్రి పెద్ద సంగీత దర్శకుడిగా ఎదిగారు. పలు హిట్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, శివమణి, దేవదాసు, చక్రం, సింహా తదితర సినిమాలకు చక్రి అందించిన పాటలను శ్రోతలను ఆకట్టుకున్నాయి. సినిమా వాళ్ల ఆకతాయి చేష్టలు ఇటీవల కాలంలో పెరిగాయి. మొన్నటి మొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అటు చిరంజీవి కుమారుడు హీరో రామ్‌చరణ్ నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై చేయిచేసుకోవడంతో వివాదం చెలరేగిన సంగతి విదితమే. -
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జీవోలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం ఆందోళన చేశారు. సచివాలయంలోని రెండు గేట్ల ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, హైదరాబాద్‌పై తామందరికీ హక్కు ఉందని ఉద్యోగులు తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ కావాలనే తమను రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. ఉద్యోగులుగా హైదరాబాద్ నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని, కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఉద్యమంలో పాల్గొంటారని వారు తెలిపారు. రాష్ట్ర విభజన ఇప్పటికే నిర్ణయమైపోయిందని, అందువల్ల సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులంతా ఆయాప్రాంతాకు వెళ్లిపోవాల్సిందేనని ఇటీవల టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించడం, హరీశ్ రావు లాంటి నాయకులు కూడా ఆయనను సమర్థించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జీవోలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. కార్యాలయాలకు తాళాలు వేయించడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయడంలేదు. బ్యాంకులతో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ తాళాలు వేయిస్తున్నారు. దీంతో సీమాంధ్ర ప్రాంతంలో దాదాపుగా పాలన స్తంభించింది. వివిధ కోర్సులలో చేరేందుకు విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉండగా, అవి పొందడం కూడా గగనం అవుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు, రేపు ప్రభుత్వ కార్యాలయాల బంద్ పాటిస్తున్నట్లు అక్కడి జేఏసీ ప్రకటించింది. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే బాబు నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
నోరు మూసుకున్న కేంద్ర మంత్రులు: వీరశివారెడ్డి ధ్వజం
హైదరాబాద్: పార్లమెంట్లో ఎంపీలు ధర్నా చేస్తుంటే కేంద్ర మంత్రులు నోరుమూసుకుని కూర్చున్నారని వైఎస్ఆర్ జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. వీరశివా రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన కోసమే చిరంజీవి, కావూరి సాంబశివరావు, జెడి శీలంలకు మంత్రి పదవులిచ్చిందన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులంతా కాంగ్రెస్ అధిష్టానంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే వారు అధికారం కోసం రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక పక్క సీమాంధ్ర ఎంపిలు ఆందోళన చేస్తుంటే మంత్రులు మిన్నకుండటం దారణం న్నారు. వారికి పదవులు తప్ప రాష్ట్ర సంక్షేమం పట్టదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వీరశివా రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించ వద్దని ఆయన కాంగ్రెస్ ఆధిష్టానంకు విజ్ఞప్తి చేశారు. తెలుగు భాష మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. -
విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ జేఏసీ ఆందోళన
హైదరాబాద్: విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల ఉద్యమానికి నిరసనగా జేఏసీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం ఊపందుకోవడంతో తెలంగాణవాదులు ఇక్కడ తమ ఆందోళనను ఉధృతం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జెఎసి చైర్మన్ కోదండరాం, టిఆర్ఎస్ నేత హరీష్‌రావు, బిజెపి నేత నాగం జనార్ధన రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో సమైక్యవాద నినాదాలు మిన్నంటాయి. వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ శవయాత్రలు నిర్వహిస్తే, మరి కొన్నిచోట్ల పిండప్రధానాలు, తలనీలాలను సమర్పించడం చేశారు. కొందరు రాష్ట్ర విభజనకు కారకులైన వారి చిత్రపటాలను గాడిదలపై ఊరేగించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.రోజురోజుకు సీమాంధ్రలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్న నేపధ్యంలో తెలంగాణలో కూడా జెఎసి ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తున్నారు. -
షర్మిలకు ఘన స్వాగతం
పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘన స్వాగతం పలికారు. షర్మిలకు పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డకు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు షర్మిల చేతులు ఊపుతూ అభివాదం చేశారు -
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేశారు. సచివాలయంలోని రెండు గేట్ల ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, హైదరాబాద్‌పై తామందరికీ హక్కు ఉందని ఉద్యోగులు తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ కావాలనే తమను రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. ఉద్యోగులుగా హైదరాబాద్ నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని, కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఉద్యమంలో పాల్గొంటారని వారు తెలిపారు. -
మహిళా హాకీ జట్టుకు మోడీ అభినందనలు
జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టును బీజేపీ నాయకుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. 'అభినందనలు... ఇదో చారిత్రక ఘట్టం' అంటూ ట్విటర్లో మోడీ పోస్ట్ చేశారు. జూనియర్ మహిళల హాకీ జట్టుకు లోక్‌సభ కూడా అభినందలు తెలిపింది. జర్మనీలోని మొన్చెన్గ్లాడ్బాచ్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3-2తో ఇంగ్లండ్‌ను ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. నిర్ణీత సమయానికి ఇరుజట్ల స్కోరు 1-1తో సమం కావడంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. కాంస్య పతకం గెలిచిన భారత జూనియర్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు పురస్కారాన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. కోచ్ నీల్ హావ్గుడ్కు రూ.లక్ష, సహాయ సిబ్బందికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు హెచ్ఐ కార్యదర్శి బాత్రా తెలిపారు. -
అబూసలేం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : మాఫీయా డాన్ అబూసలేం పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కోవల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోర్చుగల్ కోర్టు ఆదేశాలు ఇక్కడ వర్తించవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత దేశంలో తనపై వివిధ కేసుల్లో జరుగుతున్న విచారణలను కొట్టివేయాలంటూ అబూ సలేం సుప్రీంకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల న్యాయ పోరాటం తర్వాత సలేం, సినీ నటి మోనికా బేడీని 2005, నవంబర్ 11న పోర్చుగల్ నుంచి భారత్‌కు తరలించారు. సలేం ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు. ఒక వేళ నేరం రుజువయిన పక్షంలో సలేంకు మరణ శిక్ష విధించడం కానీ, 25 ఏళ్లకన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడం కానీ చేయబోమని అతడి అప్పగింత సమయంలో పోర్చుగల్ ప్రభుత్వానికి భారత్ హామీ ఇచ్చింది. పోర్చుగల్ కోర్టుకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటార్నీ జనరల్ జిఇ వాహనవతి చెప్తూ,ట్రయల్ కోర్టు సలేంపై మోపిన అదనపు అభియోగాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిని కూడా కోరారు. -
సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల... ఆ వివరాలన్నింటినీ చంచల్‌గూడ జైల్లో తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి వివరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా జైలు వద్దకు చేరుకున్న ఆమె, ములాఖత్ ద్వారా ఆయనను కలుసుకున్నారు. అశేష ప్రజాభిమానం ఎలా ఉందో వివరించారు. కొద్దిసేపటి తర్వాత ఆమె చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. పాదయాత్ర సాగిన తీరు పట్ల జగన్ మోహన రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, తామందరినీ ఆయన అభినందించారని జైలు బయట విలేకరులకు చెప్పారు. తమను ఆశీర్వదించి, సహకరించి, తమ సహకారం అందించిన ప్రజలకు, పాదయాత్రను ఆశీర్వదించిన దేవుడికి షర్మిల కృతజ్ఞతలు తెరలిపారు. అంతకుముందు పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖపట్నం నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో షర్మిలకు పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డకు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. షర్మిల.. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగింది. సుదీర్ఘ పాదయత్ర చేసిన మహిళగా వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో షర్మిల మోకాలుకు గాయం కావడంతో కొంతకాలం పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజులలో ఆమె పూర్తి చేశారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజక వర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు. -
రాజ్యసభలో అందరి కళ్లూ సచిన్ మీదే
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో తమ వాణి గట్టిగా వినిపించడంతో పదే పదే వాయిదా పడ్డాయి. అయితే, ఇన్ని సంఘటనల మధ్య కూడా రాజ్యసభలో అందరి కళ్లు ఒక వ్యక్తి మీదే ఉన్నాయి. ఆయనెవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తెలుపు, నీలం చారల చొక్కా, నల్ల ప్యాంటు వేసుకుని.. కుడిచేతికి కడియం, రెండు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ఎడమచేతికి వాచీ పెట్టుకున్న టెండూల్కర్.. సోమవారం నాటి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యాడు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లాతో కలిసి సభ ప్రారంభం కావడానికి చాలా ముందుగానే వచ్చేశాడు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బాలీవుడ్ నటి రేఖ, వ్యాపారవేత్త అను ఆగాలతో కలిసి రాజ్యసభకు నామినేట్ అయిన టెండూల్కర్.. తన సీటులో కూర్చునే ముందు పలువురు ఎంపీలతో కరచాలనం చేశాడు. తర్వాత తన పక్కనే కూర్చున్న ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్‌తో మాటల్లోకి దిగాడు. సచిన్ భార్య అంజలి కూడా పార్లమెంటుకు వచ్చి, సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభినందనలు తెలియజేయగా, సచిన్ బల్లమీద చరిచి తన హర్షం వ్యక్తం చేశాడు. సీమాంధ్ర ఎంపీల ఆందోళనతో సభ పది నిమిషాలు వాయిదా పడగా, చాలామంది ఎంపీలు సచిన్ వద్దకు వచ్చి, చేతులు కలిపారు. తర్వాత టెండూల్కర్ లేచి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. -
విభజనపై వెనుకడుగు లేదు: జానారెడ్డి
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వెనుకడుగు వేయదన్న నమ్మకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి వ్యక్తం చేశారు. తెలంగాణకు అనులకూలంగా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన అసాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజలను చైతన్య వంతులను చేసిన పాత్రికేయులను ఆయన అభినందించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆకాంక్షించారు. నదీ జలాలు, ఆస్తులు, ఉద్యోగాల పంపకం న్యాయబద్దంగా జరగాలన్నారు. సీమాంధ్ర సోదరులు ఆవేశంతో ఆందోళన చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణేతరులు నిశ్చితంగా ఉండొచ్చని, వారికి అన్యాయం జరిగే పరిస్థితులు వస్తే అండగా నిలబడతానని హామీయిచ్చారు. ప్రజల కోసం అవసరమయితే పార్టీయే కాదు రాజకీయాలను వీడేందుకు వెనుకాడబోనని చెప్పారు. సీమాంధ్ర విద్యార్థి, ఉద్యోగులకు నష్టం జరుగుతున్న అంశాలపై చర్చకు సిద్ధమన్నారు. ఉద్యమించకుండా సీమాంధ్ర ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. అవాంఛనీయ పరిణామాలు జరిగితే తెలుగు ప్రజలు మధ్య సామర్యస్యత శాశ్వతంగా దెబ్బతింటుందని గ్రహించాలన్నారు. శాంతి భద్రత పరిరక్షణలో పార్టీలు, ప్రజలు సహకరించాలన్నారు. 4 ఏళ్లుగా రెండు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు రెండు రాష్ట్రాలు దేశం గర్వించేలా అభివృద్ధి చెందాల్సివుందన్నారు. రెండు ప్రాంతాల ఉద్యోగులు, మేధావులు, నాయకులు, విద్యార్థులు అభివృద్ధిపైనే దృష్టిసారించాలని జానారెడ్డి సూచించారు. -
మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ
కడప : మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో సమైక్య శిబిరాన్ని సందర్శించిన ఆయనకు సోమవారం అవమానం ఎదురైంది. పదవులు పట్టుకుని వేళ్లాడే నేతలు ఎందుకు వచ్చారంటూ నినాదాలు చేశారు. నిరసనకారులు మంత్రికి చెప్పు చూపి నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆయన నిరసనకారులకు సర్ధి చెప్పారు. రాజీనామా చేయటానికి తాను సిద్ధమేనని తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు సోమవారం ముట్టడించారు. తక్షణమే మంత్రి పదవికి రఘువీరా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురం మున్సిపల్ ప్రాజెక్టు ఆఫీసర్ విజయ్ కుమార్ రాజీనామా చేశారు. కేబుల్ ఆపరేటర్లు హిందూపురంలో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. బెలుగుప్పలో సమైక్యాంధ్రకు మద్దతుగా 4 వేల మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాగా కర్నూలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట మంత్రి టీజీ వెంకటేష్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. అవుకులో సమైక్యవాదుల భారీ ర్యాలీ చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం బాధాకరమని, శాశ్వత ప్రాతిపదికన హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో మూడువేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఆళ్లగడ్డలో రవి అనే వికలాంగుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్యాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆళ్లగడ్డ నాలుగురోడ్ల సెంటర్లో ఉపాధ్యాయులు.... విద్యార్థులకు పాఠాలు చెప్పి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం రాజమండ్రిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాష్ట్రాన్ని విభజించొద్దని నినదిస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో మరో 72 గంటల పాటు మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద వారు మానవ హారం నిర్వహించారు. కాగా విజయవాడ సబ్ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు వాహనాలను తుడిచి నిరసన తెలిపారు. -
రెడ్‌లైట్ నుంచి న్యూయార్క్.. ఓ శ్వేత పయనం
కష్టాలు, కన్నీళ్లు ఆమెను నిరంతరం వెన్నంటి ఉండే నేస్తాలు. ఉండేది ప్రతినిత్యం రక్తమాంసాలతో వ్యాపారం సాగే నీచాతి నీచమైన ప్రాంతం. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలోని రెడ్‌లైట్ ప్రాంతంలో పెరిగి, పలుమార్లు లైంగిక అఘాయిత్యాలకు గురైన ఆ యువతి.. న్యూయార్క్ నగరంలో చదువుకోడానికి అమెరికా వెళ్లిపోయింది. పేదరికాన్ని, కష్టాలను అధిగమించి మరీ ఆమె ఈ విజయం సాధించింది. ఆమె పేరు శ్వేతా కత్తి (18). ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఉండే అనేక మంది అభాగినులలో ఆమె పేరు ఉన్నా.. పెద్దగా ఎవరికీ తెలియదు. న్యూయార్క్ లోని బార్డ్ కాలేజిలో సైకాలజీ డిగ్రీ చదివేందుకు ఆమెకు స్కాలర్షిప్ లభించింది. ఆ చదువు పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగొచ్చి, తనలాంటి అభాగినులకు సాయం చేయాలని శ్వేత భావిస్తోంది. చిన్నప్పటి నుంచే తాను అలా కలలు కన్నానని, కానీ ఆ కల సాకారం అవుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. శ్వేత పట్టుదల కారణంగా ఆమె ప్రపంచ ప్రఖ్యాత పత్రిక న్యూస్ వీక్ 'యంగ్ వుమెన్ టు వాచ్' పేరిట ఎంపిక చేసిన 25 మంది బాలికల్లో ఒకరిగా నిలిచింది. తాలిబన్ల దాడిలో గాయపడి, కోలుకున్న పాకిస్థానీ బాలిక మలాలా పేరు కూడా ఈ జాబితాలోనే ఉంది. చిన్ననాటి నుంచి ఆమె అనేక కష్టనష్టాలకు గురైంది. ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఆమె చూసిన నరకం అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు వచ్చి, ఎవరో ఒక మహిళను కొడుతుండేవాళ్లని, పోలీసులు ఎపు్పడు పడితే అప్పుడు వస్తుండేవారని, ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. సంతోషంగా లేకపోయినా కూడా తప్పనిసరిగా అక్కడున్నవాళ్లంతా వ్యభిచారం చేయాల్సి వచ్చేదని శ్వేత వివరించింది. తమ పక్కన పడుకొమ్మని మగవాళ్లు వచ్చి అడిగినప్పుడు చాలా బాధగా అనిపించేదని, కానీ తప్పేది కాదని తెలిపింది. తండ్రితో పాటు చాలామంది తనను తిట్టి, కొట్టేవారు గానీ, తన తల్లి మాత్రం.. నువ్వు ఏమైనా చేయగలవంటూ ప్రోత్సహించేదని చెప్పింది. తాను చాలా మొండిదాన్నని, పాఠశాలలో తన పేదరికం, తక్కువ జాతి కారణంగా అన్నివైపుల నుంచి వివక్ష ఎదుర్కొన్నానని వివరించింది. ఫ్యాక్టరీ కార్మికురాలిగా పనిచేసే తన తల్లి తనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చినట్లు చెప్పింది. శ్వేత కన్న కలలు సాకారం కావడంలో 'క్రాంతి' అనే స్వచ్ఛంద సంస్థ తన వంతు పాత్ర పోషించింది. ముంబై రెడ్‌లైట్ ప్రాంతంలోని అమ్మాయిలు సామాజిక మార్పు తీసుకురావడానికి సాధకులుగా ముందుకు రావాలన్నదే ఈ సంస్థ ధ్యేయం. క్రాంతి సంస్థ రెండేళ్ల క్రితం శ్వేతను రెడ్‌లైట్ ప్రాంతం నుంచి తీసుకెళ్లి తమ సంరక్షణలో ఉంచుకుంది. అక్కడే ఆమె తన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని విస్తరించుకుని, క్రమంగా సైకాలజీ అంశంలో కూడా ఆసక్తి పెంచుకుంది. చివరకు అమెరికాలో చదువుకునే అవకాశం లభించడంతో అమితానందానికి గురైంది. ఇతరుల జీవితాలను కూడా ఇది మారుస్తుందని, తన నేపథ్యాన్ని కూడా తాను గౌరవిస్తానని ఆమె తెలిపింది. ఇటీవలే ముంబైలో విమానం ఎక్కి.. అమెరికాకు వెళ్లిపోయింది. -
కాంగ్రెస్, టీడీపీలది ద్వంద్వవైఖరి: కిషన్‌రెడ్డి
ప్రధాని మన్మోహన్ సింగ్ అసమర్ధత వల్లే సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి విమర్శించారు. తన మంత్రులను ఒక తాటిపై నిలపడంలో ప్రధాని విఫలమని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే ఇరుప్రాంతాల్లో ఆందోళన చేయిస్తుందన్న అనుమానాన్ని కిషన్‌రెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ ప్రమాణాల వల్లే రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు. టీఆర్ఎస్తో పొత్తు సమయంలో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఉద్యమకారుల ముసుగులో తమ పార్టీపై మజ్లీస్ దాడులకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో సుస్థిరపాలన అందించే సత్తా ఒక్క నరేంద్ర మోడీకే ఉందని, ఆయనకు భయపడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని అంతకుముందు ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి సోనియా గాంధీ పావులు కదుపుతున్నారని, దీనికి టీడీపీ, టీఆర్ఎస్లు పునాదులు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు. -
దుర్గాశక్తి.. యూపీ సర్కారు - ఓ దుమారం
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ ప్రాంతంలో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పోయించి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురై చివరకు సస్పెండైన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ ఉదంతంపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఈ విషయంలో కలగజేసుకుని, ఆమెకు సరైన న్యాయం జరిగేలా చూడాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాయడంతో ప్రధాని రంగంలోకి దిగారు. ఈ విషయమై తాము ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని తాము నిరంతరం సంప్రదిస్తున్నామని, వాళ్లు కూడా నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారని తెలిపారు. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులకు చెప్పారు. ఐఏఎస్ అధికారుల విషయంలో కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలున్నాయని, వాటిని అక్కడ కూడా పాటిస్తారని ఆయన చెప్పారు. దుర్గాశక్తి వ్యవహారంపై వెనువెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. జూలై 27వ తేదీన దుర్గాశక్తి సస్పెండ్ కాగా, అప్పటినుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లేఖలు రాసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామి తెలిపారు. అయితే యూపీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన దారిలో తాను పోతోంది. దుర్గాశక్తికి పది పేజీల చార్జిషీటు కూడా పంపింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన యువ ఐఏఎస్ అధికారిణి, ఓ మసీదు గోడను తగిన పద్ధతి పాటించకుండా కూల్చేశారంటూ ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చార్జిషీటుకు స్పందించేందుకు ఆమెకు 15 రోజుల గడువు ఇచ్చినట్లు సమాచారం. -
కాంగ్రెస్ నేతల డ్రామా: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్ర విభజనపై స్వార్ధం కోసమే కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, గొల్ల బాబూరావు విమర్శించారు. పదవులు కాపాడుకోవడానికి సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారని వారు ఆరోపించారు. సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ సంతకాలు పెట్టామని డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. చిరంజీవి తన ఆస్తులు, పదవుల కోసమే ఉమ్మడి రాజధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన అంగీకరించేది లేదన్న కావూరి సాంబశివరావు.. కేంద్రమంత్రి కాగానే నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ అప్పుడే సీఎం అయినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అప్పులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించకుండా విభజన ఎలా చేస్తారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆగిపోయి యువత అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చేందుకు, ముందస్తు ఎన్నికల కోసమే విభజన చిచ్చు పెట్టారని ఆరోపించారు. ప్రజల డిమాండ్ మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందాకే విభజన గురించి మాట్లాడాలన్నారు. రాష్ట్రం అట్టుడికి పోతుంటే చంద్రబాబు ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. -
ఉమ్మడి రాజధానికి బీజేపీ వ్యతిరేకం: దత్తాత్రేయ
హైదరాబాద్ : హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి బీజేపీ వ్యతిరేకమని ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ సమర్థించింది కాబట్టే యూపీఏ నిర్ణయం తీసుకుందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చి లిఖితపూర్వకంగా నిర్ణయం ఉంటేనే చట్టబద్ధత లభిస్తుందని దత్తాత్రేయ అన్నారు. ప్రస్తుత సీమాంధ్రలో పరిస్థితులకు కారణం ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులే కారణమని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ల కాలంలో హైదరాబాదు నగరం పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న విధంగా హైదరాబాద్‌లోనూ శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థ బాధ్యతలను కేంద్ర హోం శాఖ నిర్వహించేలా చర్యలు తీసుకునే విషయం పరిశీలనలో ఉన్నదని ఆయన నిన్న ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దాంతో ఉమ్మడి రాజధాని కాబోతున్న హైదరాబాదులోని సీమాంధ్రులకు భద్రత కల్పించేందుకు ఢిల్లీ తరహా రక్షణ విధానం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. -
పార్లమెంటును తాకిన సమైక్య సెగ
అనుకున్నంతా అయ్యింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళం విప్పారు. ఉభయ సభల్లోనూ వారు నిరసన తెలియజేయడంతో రాజ్యసభ, లోక్ సభ రెండూ వాయిదా పడ్డాయి. రాజ్యసభ అయితే రెండుసార్లు వాయిదా పడింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా నినదించారు. విభజనను వారు గట్టిగా వ్యతిరేకించారు. సమైక్య సెగ పార్లమెంట్‌ను పూర్తిస్థాయిలో తాకింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత సభలో ఒకవైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. రాజ్యసభలో కూడా ఇవే పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు... ఇటీవల రాజ్యసభ, లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అదేవిధంగా ఇటీవలే కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులను ప్రధాని మన్మోహన్ సభకు పరిచయం చేశారు. ఇటీవల నక్సల్స్ దాడిలో మృతిచెందిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నేత మహేంద్రకర్మ తదితర నాయకులకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. -
రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ప్రమాణం
న్యూఢిల్లీ : డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి సోమవారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నకైన వారితో రాజ్యసభ సభ్యుడు హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ప్రమాణ స్వీకారాలు చేయించారు. అదేవిధంగా ఇటీవలే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిని సభకు పరిచయం చేశారు. అలాగే ఇటీవలే మావోయిస్టుల దాడిలో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ తదితర నాయకులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి. -
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి.ముందుగా ఉప ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ సందర్భంలో తన ప్రమాణ స్వీకార పత్రం హిందీలో రాసి ఉందంటూ ఓ సభ్యుడు ప్రస్తావించడం సభలో నవ్వులు పూయించింది. ఇక ఆహారభద్రత లాంటి కీలక బిల్లులు ఆమోదం కోసం వేచి చూస్తుండగా.. తెలంగాణ చిచ్చు రేపిన కేంద్ర ప్రభుత్వానికి అసోం, నాగాలాండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి కూడా విభజన వాదాలు చెలరేగి షాక్ తినిపిస్తున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు సజావుగా నడిచేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ఉదయం విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. గడిచిన రెండు మూడు సమావేశాల్లో చాలా సమయం వృథా అయ్యిందని, ఈసారి అలా జరగకుండా చూడాలని ఆయన కోరారు. సీమాంధ్ర ఎంపీల ఆందోళన? సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. ఈ ఆందోళనలు ఉభయసభలపైనా ప్రభావం చూపనుంది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా చేసినా, లోక్ సభ స్పీకర్ గానీ, రాజ్యసభ చైర్మన్ గానీ వీరి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించాలని పట్టుపట్టటం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పట్టు.. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తీరుపై సమగ్ర చర్చతో పాటు.. ఇకపై దేశంలో మరే రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమనే విస్పష్ట ప్రకటన కోసం పశ్చిమబెంగాల్లో గూర్ఖాలాండ్ ఉద్యమ సెగను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పట్టుపట్టే అవకాశాలున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రతిపక్షానికి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైనా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినా బొగ్గు కుంభకోణం, రైల్ గేట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అన్ని రంగాల్లో ద్వారాలు తెరవడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాల నుంచి సర్కారుపై ముప్పేట దాడి తప్పకపోవచ్చు. రూపాయి విలువ పడిపోవడం, డాలర్‌కు ఏకంగా 61 రూపాయల వరకు వెళ్లడంతో ఆ విషంయపైనా ఇటు ప్రధానిని, అటు ఆర్థిక మంత్రిని ప్రతిపక్షాలు దులిపేయడానికి సిద్ధపడ్డాయి. బిల్లులకు సహకరించండి బీమా, పెన్షన్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన సంస్కరణల బిల్లులపై సహకరించాలని ప్రతిపక్ష బీజేపీకి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్న ఆర్థిక బిల్లులపై బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌సిన్హాలతో చిదంబరం చర్చలు జరిపారు. సాధారణ, ఆర్థిక కార్యక్రమాలపై తమ పార్టీ మద్దతు ఇస్తుందని.. అయితే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని బీజేపీ సంకేతాలిచ్చింది. పెన్షన్ రంగంలోనూ ఎఫ్‌డీఐని పెంచే ప్రతిపాదనను కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆహార భద్రత బిల్లుకు సూత్రప్రాయంగా అనుకూలమే అయినా తాము ప్రతిపాదించిన అనేక సవరణలను ఆమోదిస్తేనే సహకరిస్తామని బీజేపీ వ్యూహకర్తల బృందం స్పష్టం చేసింది. మొత్తం మీద ఈసారి పార్లమెంట్ సమావేశాలు గతంతో పోల్చితే వాడివేడిగా సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
రాజకీయ కోణంలోనే విభజన: పయ్యావుల
అనంతపురం : కాంగ్రెస్ పార్టీపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారం జరగలేదని, రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. సీమాంధ్రుల కష్టాలను పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ ను స్తంభింప చేయాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ఎంపీల వైఫల్యం వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిందని పయ్యావులు విమర్శించారు. ఎంపీలు హైకమాండ్ తొత్తులుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్రుల్లో చీలిక తెచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారని పయ్యావుల వ్యాఖ్యానించారు. కావూరి సాంబశివరావు, చిరంజీవి, లగడపాటి రాజగోపాల్‌లకు వ్యాపారాలే ముఖ్యమని పయ్యావుల విమర్శలు చేశారు. లగడపాటి టీవీలకే పరిమితం కాకుండా సీమాంధ్రులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాలన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. ఉండవల్లివి ఊసరవెల్లి ప్రసంగాలని ఆయన మండిపడ్డారు. -
సీమాంధ్ర జిల్లాల్లో మిన్నంటుతున్న సమైక్య ఉద్యమాలు
సీమాంధ్రలో సమైక్యవాద నినాదాలు మిన్నంటుతున్నాయి. వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు శవయాత్రలు నిర్వహిస్తే... ఇంకొకరు తలనీలాలు సమర్పిస్తున్నారు. మరొకరు రాష్ట్ర విభజనకు కారకులైన వారి చిత్రపటాలను గాడిదలపై ఊరేగిస్తున్నారు. ఒంటి నిండా సమైక్య నినాదాలు పెయింటు చేయించుకుంటున్నారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన వద్దంటూ వేలాది గొంతులు ఏక్కటయ్యాయి. ఊరు -వాడా ఏకమై సమైక్యవాదాన్ని బలంగా వినిపించింది. అనంతపురం జిల్లా హిందూపురంలో నిరసనకారులు కేసీఆర్ దిష్టిబొమ్మకు కర్మకాండలు నిర్వహించారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప రాజీనామా చేయాలని నిలదీశారు. ఎన్ఎంయూ నాయకులు అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజాకోర్టు నిర్వహించారు. కేసీఆర్, చంద్రబాబు, సోనియా, కిరణ్ ,చిరంజీవిలను దోషులగా పేర్కొంటూ మాక్ కోర్టు నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. సీఎం కిరణ్ కనపడటం లేదని, జాడ తెలిపిన వారికి యాభై వేల రూపాయల నజరానా అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. రాయచోటి జాతీయ రహదారిపై కొంతమంది భైఠాయించారు. దీంతో నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. భారతమాత విగ్రహంతో అర్చకులు ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. నేతలకు పిండ ప్రదానం చేశారు. గాడిదలపై నేతల చిత్రపటాలు రాష్ట్ర విభజనకు కారకులంటూ కర్నూలులో నిరసనకారులు నేతల చిత్రపటాలను గాడిదలపై ఊరేగించారు. రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఆదోనిలో జర్నలిస్టులు కూడా కదం తొక్కారు. రాస్తారోకో తో పాటు రైల్ రోకోలో పాల్గొన్నారు. దీంతో ముంబై వెళ్లే జయంతి ఎక్స్‌ప్రెస్ గంట సేపు నిలిచిపోయింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జర్నలిస్టులు ధర్నాకు దిగారు. వీరిపై జిల్లా ఎస్పీ శ్యాం సుందర్ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. శ్రీకృష్ణదేవరాయలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వారిని లక్ష్మీపార్వతి పరామర్శించారు. చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్దాంతం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో సమైక్యవాదులు టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడిని అడ్డుకున్నారు. రాష్ట్రం ముక్కలవుతున్నా టీడీపీ నోరుమెదపడం లేదని ఎమ్మెల్యేతో వాదించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ట్యాక్సీ డ్రైవర్లు, ఆటోవాలాలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్, సోనియా దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు నిరసగా ఓ వ్యక్తి తలనీలాలు సమర్పించి దీక్షకు మద్ధతు పలికాడు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ గుంటూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. సీమాంధ్ర పూర్తిగా చీకట్లో మునిగి పోయే ప్రమాదం ఏర్పడినా సీఎం స్పందించడం లేదని ఆయనకు వెలుగు చూపించేందుకే కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నామని అన్నారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముస్లింలు విజయవాడలో ప్రత్యేక ప్రార్థన చేశారు. సమాజు అనంతరం తోటి నిరసనకారులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. మరికొంత మంది జేఏసీ అధ్వర్యంలో తెలుగుతల్లికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగ్గయ్యపేటలో జేఏసీ అధ్యర్యంలో సమైక్యవాదులు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. రోడ్డుపైనే కబాడీ ఆడారు. కేబుల్ ప్రసారాల నిలిపివేత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు 24 గంటలపాటు ఎంటర్టైన్మెంట్ చానళ్ల ప్రసారాలను నిలిపేశారు. సమైక్యవాదాన్ని అందరూ బలపరచాలని పిలుపునిచ్చారు. మరికొంత మంది ఆందోళనకారులు సోనియా దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. విజయనగరం జిల్లా సమైక్యవాదులు కేశఖండనం చేసుకొని, ఒళ్లంతా సమైక్యవాద నినాదాలు రాసుకొని నిరసన తెలిపారు. విభజనకు కారకులంటూ కొంత్ మంది నేతల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుసరించిన విధానానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన పార్లమెంట్ సభ్యత్వానికి నేడు రాజీనామా చేయనున్నారు. జగన్మోహన్రెడ్డిని ఎదిరించే దమ్ము లేని కాంగ్రెస్ తెలుగు ప్రజలను చీల్చాలని కుట్ర పన్నిందని ఆయన ఆరో పించారు. -
చైనాలో బిడ్డను అమ్మేసిన వైద్యుడు.. రక్షించిన పోలీసులు
వాయవ్య చైనాలోని షాంక్సి రాష్ట్రంలో ఓ వైద్యుడు అప్పుడే పుట్టిన శిశువును అమ్మేయగా, పోలీసులు ఆ శిశువును రక్షించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. సెంట్రల్ హెనన్ రాష్ట్రంలోని ఆంయాంగ్ నగరంలో శిశువును స్వాధీనం చేసుకున్నారు. అయితే, గుర్తింపును నిర్ధారించుకోడానికి ఇంకా డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ మగ శిశువును ఫుపింగ్ కౌంటీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆస్పత్రిలోని ఓ వైద్యుడు జూలై 17వ తేదీన దాదాపు రెండు లక్షల రూపాయలకు అమ్మేసినట్లు అధికారులు తెలిపారు. ఝాంగ్ అనే ఈ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డకు పుట్టుకతోనే ఏదో వ్యాధి వచ్చిందని, అందువల్ల చికిత్స చేయడానికి తమవద్దే ఉంచుకుంటామంటూ వైద్యుడు చెప్పి, బిడ్డను ఎత్తుకుపోయాడు. ఆ విషయం తల్లికి తర్వాత తెలిసి, పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, బిడ్డను కాపాడారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆస్పత్రి అధినేతతో పాటు మరో ఇద్దరిని కూడా విధుల నుంచి తొలగించారు. ఇదే ఆస్పత్రిలో మరో ఐదు సంఘటనలు కూడా ఇలాంటివి జరిగాయని, వాటిపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
విమానాశ్రయంలో షర్మిలకు ఘన స్వాగతం
హైదరాబాద్ : పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం వైఎస్ విజయమ్మంతో కలిసి ఆమె విశాఖ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రమంలో షర్మిలకు పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డకు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. షర్మిల .... పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగింది. సుదీర్ఘ పాదయత్ర చేసిన మహిళగా వైఎస్. రాజశేఖర రెడ్డి తనయ షర్మిల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో షర్మిల మోకాలుకు గాయం కావడంతో కొంతకాలం పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజులలో ఆమె పూర్తి చేశారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజక వర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు.