Editorial
-
చెరవీడిన అసాంజ్ !
అగ్రరాజ్యంపై యుద్ధం చేయాలంటే మారణాయుధాలు అవసరం లేదని, ఒక ల్యాప్‌టాప్‌తో దాన్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చని గుక్కతిప్పుకోనీయకుండా చేయొచ్చని నిరూపించిన వికీలీక్స్ అధిపతి జూలియన్ అసాంజ్‌కు పద్నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. తన సాహసవంతమైన కార్యకలాపాల కారణంగా అయినవాళ్లకు దూరమై కొన్నాళ్లు లండన్‌లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో తలదాచుకుని, ఆ తర్వాత బ్రిటన్ చెరలో మగ్గిన అసాంజ్ నేరాంగీకార ప్రకటనకు సిద్ధపడి అమెరికా ఇవ్వజూపిన వెసులుబాటుకు తలొగ్గక తప్పని స్థితి ఏర్పడటం స్వేచ్ఛాప్రియులకూ, పాత్రికేయలోకానికీ చివుక్కుమనిపిస్తుంది. ఒప్పందం ప్రకారం పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని 14 దీవుల సముదాయమైన ఉత్తర మెరీనా ఐలాండ్స్ (ఎన్ఎంఐ)లో ఒకటైన సైపాన్ దీవిలోని న్యాయస్థానం ఎదుట అసాంజ్ హాజరై తన తప్పు ఒప్పుకున్నాడు. అమెరికాలో అడుగుపెట్టడానికి అసాంజ్ విముఖత చూపిన కారణంగా, సాంకేతికంగా దానిలోనే భాగమైన సైపాన్‌లో ఈ తతంగం పూర్తిచేయటానికి అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. అమెరికా ఆయనపై గూఢచర్యానికి సంబంధించి 18 ఆరోపణలు చేసింది. వాటి ఆధారంగా విచారణ జరిగితే అసాంజ్‌కు 175 ఏళ్ల శిక్షపడేది. కానీ ఒప్పందం ప్రకారం అందులో ఒకే ఒక నేరారోపణ మోపి, దానికింద అయిదేళ్ల శిక్షవిధించి బ్రిటన్ జైల్లో అనుభవించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే విడుదల చేయటానికి ఒప్పందం కుదిరింది. వికీలీక్స్ ఎప్పటిలా పనిచేస్తుందా లేదా అన్నది తేలాల్సి వుంది.ఏం నేరం చేశాడు అసాంజ్? యుద్ధాలనూ, దురాక్రమణలనూ సమర్థించుకునేందుకు అగ్రరాజ్యాలు ప్రచారంలో పెట్టే అబద్ధాలను తుత్తినియలు చేశాడు. అమెరికా దురాక్రమణలో ఉన్న ఇరాక్‌లో ఒక మారుమూల పల్లెలో వీధిలో నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరు సాధారణ పౌరులనూ, రాయిటర్ జర్నలిస్టులు ఇద్దరినీ కేవలం సరదా కోసం బాంబులతో హతమార్చిన అమెరికా సైనికుల దురంతాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు. ఉగ్రవాదాన్ని అంతంచేసే పేరిట ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా కూటమి దేశాలు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాయో, ఎలా నరమేధాన్ని సాగించాయో తెలిపే లక్ష పత్రాలను బట్టబయలు చేశాడు. వర్ధమాన దేశాలే కాదు... సాటికి సరైన సంపన్న దేశాల విషయంలోనూ అమెరికాకు ఎంత చిన్న చూపున్నదో ఏకరువు పెట్టే కోట్లాది సందేశాలను బజారున పడేశాడు. అవన్నీ వేర్వేరు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన సందేశాలు. ఎక్కడి ప్రభుత్వం ఎటువంటిదో, సైనిక వ్యవస్థల తీరుతెన్నులేమిటో తెలిపే అంచనాలు వాటిల్లో ఉన్నాయి. ఆఖరికి దేశదేశాల పాలకులు తమ అక్రమార్జనను వేరే దేశాల బ్యాంకులకు తరలిస్తున్న వైనాన్ని ఆధారాలతో వెల్లడించాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2006లో జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ‘మన అనుకూలుర’ వివరాలు పంపిన సందేశం కూడా అసాంజ్ లీక్స్‌లో ఉంది. ఇవన్నీ గూఢచర్యం కిందికొస్తాయని ఇన్నేళ్లుగా అమెరికా చేసిన వాదనలో పసలేదు. ఆ దేశమైనా, పాశ్చాత్య దేశాలైనా సందర్భం ఉన్నా లేకపోయినా ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెబుతుంటాయి. తెరవెనక మాత్రం అందుకు విరుద్ధమైన పోకడలకు పోతుంటాయి. దీన్నే సాక్ష్యాధారాలతో అసాంజ్ వెల్లడించాడు. అప్రజాస్వామికమైన ఆ కార్యకలాపాలు తాము నమ్మే విలువలకూ, విధానాలకూ పూర్తి విరుద్ధమని ఆ దేశాల పౌరులు గ్రహించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చివుంటే అంతిమంగా అక్కడి సమాజాలకూ, ప్రపంచానికీ మేలు జరిగేది. కానీ వంచకులను విశ్వసించటం, అబద్ధాలకు పట్టంగట్టడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న ధోరణి. అసాంజ్ విలువను ఇలాంటి సమాజాలు ఏం గుర్తించగలవు? ఆయన ఇరాక్, అఫ్గాన్లలో అమెరికా దురంతాలను వెల్లడించినప్పుడు అమెరికా పౌరులు వెల్లువలా కదిలివుంటే ఇవాళ ఇజ్రాయెల్ గాజాను వల్లకాడు చేయసాహసించేది కాదు. మారణాయుధాలూ, మందుగుండు సరఫరా చేస్తూ ఆ నెత్తుటి క్రీడకు అమెరికా దోహదపడేది కాదు. అమెరికా ఆరోపిస్తున్నట్టు అసాంజ్ గూఢచారి కాదు. నికార్సయిన పాత్రికేయుడు. తన చర్యల ద్వారా మెరుగైన స్వేచ్ఛాయుత సమాజాన్ని ఆశించాడు తప్ప అందులో దురుద్దేశాలు లేవు. చేయని నేరానికి ఇలా గత అయిదేళ్లుగా అసాంజ్ దాదాపు 19 చదరపు అడుగుల సెల్లో రోజుకు 23 గంటలు ఏకాంతవాస ఖైదు అనుభవిస్తున్నాడు. బయటి ప్రపంచంతోగానీ, సహ ఖైదీలతోగానీ ఆయనకు సంబంధాల్లేవు. ఈ శిక్ష కారణంగా ఆరోగ్యం బాగా దెబ్బతింది. గుండెజబ్బు సోకింది. బహుశా అందుకే కావొచ్చు... ఆయన ఈ ఒప్పందానికి అంగీకరించి వుండొచ్చు.అసాంజ్ విడులను స్వాగతిస్తూనే పాత్రికేయ ప్రపంచం వ్యక్తం చేస్తున్న భయాందోళనలు సహేతుకమైనవి. తమ దేశ పౌరుడు కాకపోయినా తమ గుట్టుమట్లు వెల్లడించినందుకు అమెరికా ఆగ్రహించటం, ఇన్నేళ్లుగా ఆయన్ను వెంటాడటం... ప్రజాస్వామ్య దేశాలుగా డప్పు కొట్టుకునే స్వీడన్, బ్రిటన్లు అందుకు సహకరించటం ఏరకంగా చూసినా సిగ్గుచేటైన విషయం. అసాంజ్ కేసు చూపి భవిష్యత్తులో తమ చీకటి చర్యలను బట్టబయలు చేసే ఏ దేశ పాత్రికేయులనైనా అమెరికా తమ దేశానికి పట్టి అప్పగించమని కోరవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా అసాంజ్ వెనక దృఢంగా నిలబడి అటు అమెరికాపైనా, ఇటు బ్రిటన్‌పైనా దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చింది. ఎన్ని దేశాలు ఆ పని చేయగలుగుతాయి? అసాంజ్ విడుదల ఆయన కుటుంబానికీ, మద్దతుదార్లకూ ఊరటనిస్తుందనటంలో సందేహం లేదు. కానీ ఇందులో అంతర్లీనంగా కనిపిస్తున్న పోకడలు ప్రమాదకరమైనవి. -
లోతైన దర్యాప్తు అవసరం
తవ్వుతున్నకొద్దీ బయటపడుతున్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వాకాలు చూస్తుంటే దాని వాలకం ‘అయ్యవారిని చేయబోతే కోతి అయింద’న్న చందంగా మారిందని అందరికీ అర్థమైంది. జేఈఈ మెయిన్ మొదలుకొని నీట్, యూజీసీ నెట్ సహా తొమ్మిది ప్రవేశ పరీక్షలవరకూ నిర్వహిస్తున్న ఈ సంస్థ విడుదల చేసే ప్రశ్నపత్రాలు, వాటి జవాబులు గుజరాత్, హరియాణా, బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటిచోట్ల ‘కావలసినవారికి’ బజారులో దొరికాయని సీబీఐ రంగ ప్రవేశం చేశాక తేటతెల్లమైంది. బిహార్ పోలీసులు అరెస్టు చేసిన 20 మంది నిందితులను విచారిస్తే మే 5న నిర్వహించిన నీట్–యూజీ ప్రశ్నపత్రం ఒకరోజు ముందే పీడీఎఫ్ రూపంలో వారికి వచ్చిందని తేలింది. ఎందుకో ఈ ప్రశ్నపత్రాల మాఫియా దక్షిణాది రాష్ట్రాలవైపు దృష్టి సారించినట్టు లేదు. గత పదిరోజుల వ్యవధిలో ఎన్టీఏ నిర్వహించాల్సిన నాలుగు పరీక్షలు రద్దుకావటం అసాధారణం. రెండు లక్షలమంది విద్యార్థులు రాయాల్సిన ఆదివారంనాటి నీట్ పీజీ పరీక్షను కేవలం 12 గంటల ముందు రద్దుచేశారు. ఎన్టీఏ చీఫ్ సుబోద్ కుమార్ సింగ్ దీనంతటికీ బాధ్యుడని తేలుస్తూ ఆయన్ను తొలగించారు. అంతేనా... దీంతో పాపప్రక్షాళన పూర్తయినట్టేనా? ‘ఒకే దేశం–ఒకే పరీక్ష’ పేరిట ఏమాత్రం పారదర్శకతలేని ఈ వ్యవస్థను సృష్టించిన పాలకుల మాటేమిటి? గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బెంగాల్, పంజాబ్, హరియాణాల్లో భిన్న సంస్థలు నిర్వహించిన 70కి పైగా పరీక్ష పత్రాలు లీకయ్యాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. నిరుడు తెలంగాణలో పరీక్షపత్రాలు లీకవటంతో నిరుద్యోగులు భగ్గుమన్నారు. నిజాయితీగా అహోరాత్రాలూ చదివిన కోటిన్నరమంది విద్యార్థుల భవితవ్యం ఈ లీకుల పర్యవసానంగా దెబ్బతిన్నదని అంటున్నాయి. ఈ లీకుల బెడద లేకుండా అన్ని సంస్థలనూ తలదన్నేలా నెలకొల్పామని చెప్పిన ఎన్టీఏ తీరు సైతం సక్రమంగా లేదంటే ఇక ఏమనాలి?నిజమే... వైద్య విద్యలో దేశమంతా వర్తించే ఒకే పరీక్ష నిర్వహిస్తే వేలకు వేలు ఖర్చుపెట్టడం, వేర్వేరు పరీక్షలకు సంసిద్ధం కావటంవంటి విద్యార్థుల వెతలు తీరుతాయని సర్వోన్నత న్యాయస్థానం 2011లో భావించింది. లీకులను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందనుకున్నది. కానీ ఆచరణలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. వైద్య విద్యకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పటి భారత వైద్య మండలి(ఎంసీఐ)కి చేసిన సూచన కాస్తా అనేక మలుపులు తిరిగి చివరకు ఇలాంటి ఉమ్మడి పరీక్ష నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని 2013లో సుప్రీంకోర్టే 2–1 మెజారిటీ తీర్పునిచ్చింది. కానీ తీర్పు ఇచ్చే ముందు ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరగలేదన్న కారణంతో 2016లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మళ్లీ విచారించి నీట్‌ను అనుమతించింది. దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉన్నదని, ఉమ్మడి జాబితాలోని విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేముందు రాష్ట్రాలతో, విద్యారంగ నిపుణులతో, ఇతర వర్గాలతో చర్చించాలని ఎవరూ అనుకోలేదు. ఒకపక్క హిందీ భాషాప్రాంత విద్యార్థులకు వారి భాషలో ప్రశ్నపత్రం ఇవ్వాలని నిర్ణయించిన ఎంసీఐ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు స్థానిక భాషల్లో ఇవ్వటం కుదరదని మొరాయించింది. ఆ తర్వాత 2017లో ఎన్టీఏ ఆవిర్భవించాక 13 భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తోంది. లీకులకు ఆస్కారంలేదని పెట్టిన వ్యవస్థ అందుకు తగ్గట్టుగా ఉందా అనేది ఉన్నతస్థాయిలో గమనించేవారే లేకపోయారు. కేంద్ర సిలబస్‌లు, ముఖ్యంగా సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షల్లో రాష్ట్ర సిలబస్‌తో చదివినవారు రాణించగలరా అన్న సందేహమూ రాలేదు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న విద్యా మాఫియా జాతీయ స్థాయికి విస్తరించింది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన 2021లో నియమించిన జస్టిస్ రాజన్ కమిటీ అధ్యయనం ప్రకారం నీట్‌కు ముందు ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులకు 80.2 శాతం నుంచి 85.12 శాతంవరకూ ఎంపికయ్యేవారు. తమిళ మాధ్యమంలో చదివిన వారి శాతం 14.88 శాతం ఉండేది. కానీ నీట్ మొదలైనాక ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులు 97 శాతంవరకూ సీట్లు తెచ్చుకుంటుండగా, తమిళ మాధ్యమం విద్యార్థుల వాటా దాదాపు 3 శాతానికి పడిపోయింది. నీట్ సాధించేవారిలో అధికాదాయ కుటుంబాల పిల్లల సంఖ్య అంతక్రితంకన్నా పెరగ్గా, నిరుపేద వర్గాల పిల్లల సంఖ్య తగ్గిందని ఆ నివేదిక వివరించింది. నీట్‌వల్ల ప్రతిభావంతులకు సీట్లు వస్తున్నాయన్న వాదనను ఆ కమిటీ ఎండగట్టింది. నీట్‌కు ముందు హెచ్ఎస్సీ విద్యార్థుల సగటు స్కోరు 98.1 శాతం వుండగా, ఇప్పుడది 89.05 శాతం మాత్రమే.ఈసారి వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒకపక్క, ఎన్టీఏ ప్రశ్నపత్రాల లీకు మరోపక్క మన వ్యవస్థలకున్న విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇందులో మొదటిది దేశ ప్రజానీకం ఆకాంక్షల్నీ, రెండోది లక్షలాదిమంది విద్యార్థుల ఆశలనూ తలకిందులు చేసింది. ఇందువల్ల ప్రపంచంలో మనం నగుబాటుపాలయ్యామని ఇప్పటికీ ఎన్డీఏ సర్కారు గ్రహించకపోవటం, దొంగను తేలుకుట్టినట్టు వ్యవహరించటం ఆశ్చర్యకరం. ఈ ప్రపంచంలో విద్యాధనాన్ని మాత్రమే ఎవరూ కొల్లగొట్టలేరని చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. కళ్లు మూసుకున్న పాలకుల నిర్వాకం కారణంగా దాన్ని సైతం ఎగరేసుకుపోవచ్చని ప్రశ్నపత్రాల మాఫియా నిరూపించింది. అందుకే ఎన్టీఏ చీఫ్‌ను సాగనంపితే సరిపోదు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించి, ఇలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. -
సంపూర్ణ జీవితం
భట్టి విక్రమార్క కథలో, విక్రమార్కుడి బుద్ధి కుశలతను మెచ్చి, వెయ్యేళ్లు పరిపాలించే సింహాసనాన్ని బహూకరిస్తాడు ఇంద్రుడు. అంటే వెయ్యేళ్ల ఆయువు. మరి నా సంగతేమిటని విక్రమార్కుడిని అడుగుతాడు సోదరుడు భట్టి. అన్నింటికీ వెన్నంటి ఉండే భట్టి సంగతి మరిచేపోయాడు విక్రమార్కుడు. దాంతో భట్టి ఆవేశంతో కాళికాదేవి తపస్సు చేసి, రెండు వేల ఏళ్లు బతికే వరం పొందుతాడు. మరి నా సంగతేమిటని అడుగుతాడు విక్రమార్కుడు. ఇద్దరు కలిసి కదా బతకాలి! అప్పుడు ఆలోచన చేస్తారు. సింహాసనం మీద వెయ్యేళ్లు కూర్చుని కదా పాలించమన్నది... అంటే అది ఆయువు పరిమితి కాదు, రాజ్యపాలన పరిమితి. అందుకే ఆరు నెలలు రాజ్య పాలన, ఆరు నెలలు అరణ్యవాస పథకం వేస్తారు. అలా భట్టి విక్రమార్కులు ఇద్దరూ రెండు వేల ఏళ్లు బతుకుతారు. ఒక్క భట్టి విక్రమార్కులేనా? రామాయణంలో దశరథుడు వేల ఏళ్లు బతికాడు. ఎందరో మునులు, రుషులు వేల ఏళ్లు తపస్సులోనే గడిపి ఎన్నో శక్తులు సాధించిన కథలున్నాయి. ఎప్పటికీ చనిపోని వరాలు పొందిన రాక్షసులు ఎందరో మన పురాణాల్లో ఉన్నారు. ఎప్పటికీ బతికివుండేలా దేవతలు అమృతాన్ని సేవించారు. చనిపోయినవాళ్లను అట్టే మళ్లీ పునర్జీవింపజేసే సంజీవని కథలు, గాయాలన్నీ మానిపోయి దృఢకాయులయ్యే లేపనాల గాథలు మనకున్నాయి. వేల ఏళ్లు బతకడం అంటే దాదాపుగా చావు లేకపోవడమనే! జీవితానికి అంతం పలికే చావు అనేదాన్ని తప్పించే అన్ని ప్రయత్నాలనూ మనిషి కనీసం కథల్లోనైనా, కలల్లోనైనా చేశాడనుకోవచ్చు.ఎప్పటికైనా చచ్చిపోతామనే వాస్తవం మనిషిని కలవరపెడుతుంది. సమస్త మానవాళి గురించి కాకపోయినా, కనీసం తన అయినవారు తనకు కాకుండాపోతారన్న చింత ఉండటంతోపాటు తానూ ఒకరోజు ఈ భూమ్మీద శూన్యంగా మిగిలిపోతాడన్నది జీర్ణం చేసుకోలేని చేదుమాత్ర. అన్ని మతాలూ మరణానంతర జీవితాలను వాగ్దానం చేయడంలో అందుకే విజయం సాధించి ఉంటాయి. చచ్చాక ఏమీ లేదు అనుకోవడం కంటే, ఆ పైనెక్కడో మళ్లీ బతుకుతాం అనేది ఒక ఊరట. అదే సమయంలో చిట్టచివర చావు అనేది ఉంటుందని తెలియడం కొంతమందికి ఒక రిలీఫ్ కూడా. లేకపోతే ఎంతకాలం ఈ రోజువారీ సంకెళ్ల లాంటి వ్యవహారాలను లాక్కురావడం? అందుకే మన పెద్దలు మళ్లీ పుట్టుక లేని ముక్తిని కోరుకున్నారు కాబోలు.సృష్టిలోని ప్రతి జీవికీ ఒక ఆయుఃప్రమాణాన్ని నిర్దేశించిన ప్రకృతి, మనిషికి 120 ఏళ్లు ఇచ్చింది. శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారుగానీ, దాన్ని నూరేళ్లు అనికాక, పూర్ణాయువుతో బతకమని దీవించడంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధంతరంగా మరణించడం ఆ ప్రకృతి వరాన్ని పాడుచేసుకోవడమే. అర్ధంతర మరణం ఆధునిక మానవుడికి సంభవించడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. మృత్యువును, రోగాలను మోసం చేసి దీర్ఘకాలం బతగ్గలమా? మన ఆయుఃప్రమాణం కంటే చాలా ఏళ్ల పాటు బతకడాన్ని నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యం చేయనున్నాయా? మనిషి శాశ్వతత్వాన్ని సాధించగలడా? మన ఫిజియాలజీని మార్పు చేయడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించవచ్చా? ఇలాంటి ప్రశ్నలను నోబెల్ పురస్కారం అందుకున్న వెంకీ రామకృష్ణన్ తన ‘వై వి డై: ద న్యూ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ ద క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ’ పుస్తకంలో చర్చించారు. మనిషి శరీరం కోటానుకోట్ల కణాల నిర్మితం. ప్రతి కణంలో ఉండే డీఎన్ ఏ ప్రతిరోజూ లక్ష మార్పులకు గురవుతుంది. డీఎన్ ఏను నాలుగక్షరాల వర్ణమాలలో రాసిన సుదీర్ఘమైన కోడ్ అనుకుంటే, నెమ్మదిగా దాని కార్యకలాపంలో అంతరాయం రావడమే ముదిమి రావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 బయోటెక్ కంపెనీలు ముదిమి, జీవితకాల పొడిగింపు మీద పని చేస్తున్నాయి. ‘యవ్వనంలో ఉన్నప్పుడు ధనికులం కావాలనుకుంటాం; ధనికులం అయ్యాక యవ్వనాన్ని కోరుకుంటాం. యవ్వనాన్ని కొనలేకపోయినా, కనీసం దానిమీద పరిశోధనలనైనా (ఏజింగ్ రీసెర్చ్) ధనికులు కొంటున్నా’రంటారు వెంకీ రామకృష్ణన్ . ఒకవేళ శాస్త్ర పరిశోధనలు ముదిమిని ఆపడంలో విజయం సాధించినా ఆ ఫలితాలు సంపన్నులకు తప్ప పేదవాళ్లకు తేలిగ్గా అందుబాటులోకి రావని చెబుతారు.ఈ శాస్త్రాలు, పరిశోధనలతో నిమిత్తం లేకుండా; ధనిక, పేద అనే తేడా లేకుండా జీవితాన్నే ఒక సాధనగా మలుచుకున్న కొన్ని ప్రాంతాల్లో మనుషులు సంపూర్ణ ఆయువును అనుభవిస్తున్నారు. ఒకినావా (జపాన్ ), సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమ లిండా (కాలిఫోర్నియా, అమెరికా)... లాంటి ప్రదేశాల్లో ఎక్కువమంది వందేళ్లు బతకడమో, దీర్ఘకాలం బతకడమో కనబడుతుంది. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ‘బ్లూ జోన్స్’గా నిలుస్తున్నాయి. ‘లివ్ టు 100: సీక్రెట్స్ ఆఫ్ ద బ్లూ జోన్స్’ డాక్యుమెంటరీ ప్రయోక్త డాన్ బ్యూట్నర్... ఈ బ్లూ జోన్స్ అని నామకరణం చేయడమే కాకుండా, వాళ్ల దీర్ఘాయువు రహస్యాలను పరిశోధించారు. శారీరక కార్యకలాపాలు, తక్కువ ఒత్తిడి, స్థానికంగా దొరికే ఆహారాన్ని వినియోగించడం, బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాయని బ్యూట్నర్ చెబుతారు. రసాయనిక ఎరువులు వేయని పంటలు, 95 శాతం మొక్క ఆధారిత ఆహారం, ఎనభై శాతం మాత్రమే తిని కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవడంతోపాటు, జీవితానికి ఒక ఉద్దేశం ఉంచుకోవడం వారిని ఉత్సాహవంతులుగా ఉంచే అదనపు విషయాలు. వెంకీ రామకృష్ణన్ అయినా, బ్లూ జోన్స్ శతాధికులైనా మనిషి ఆరోగ్యానికి కీలకమని చెప్పేవి మూడు: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఇవైతే మన చేతిలోనే ఉన్నాయి. -
ఏ ఫర్ ఎటాక్... పీ ఫర్ పొక్లెయిన్?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య ఓ కొటేషన్ చెప్పారు. ‘ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం’. ఈ రెండూ తన ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముఖ్యమైనవనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ఎక్కువ ప్రచారం చేసింది మాత్రం సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోలోని ఇతర హామీల గురించే! ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ‘ఏ ఫర్ ఆల్, పీ ఫర్ పీపుల్’ అనే కొటేషన్ ఆయన నోటినుంచి రావాల్సింది. విభజిత రాష్ట్రానికి తొలిదఫా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి ప్రాధాన్యతలనే ఇప్పుడాయన పునరుద్ఘాటించారు.నిజమే, ఆర్థిక రంగానికి గ్రోత్ ఇంజన్ లాంటి ఒక మహానగరం ఏ రాష్ట్రాభివృద్ధికైనా అవసరమే. అలాగే పోలవరం కూడా! పోలవరం ఆంధ్రుల జీవనాడి అనే సెంటిమెంట్ కూడా బలపడిపోయింది. ఈ సెంటిమెంట్ వయసు డెబ్బయ్ అయిదు పైనే ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఎవరికీ పేచీ ఉండదు. కానీ, మహానగర అభివృద్ధికోసం తొలి ఐదేళ్ల కాలంలో ఆయన ఎంచుకున్న మార్గం గమ్యం చేర్చేదేనా? పోలవరం నిర్మాణంపై ఆయన అనుసరించిన పద్ధతి సమర్థనీయమేనా అన్న ప్రశ్నలు చర్చనీయాంశాలవుతున్నాయి. గడిచిన డెబ్బయ్యేళ్ల ప్రపంచ చరిత్రలో నిర్మాణమైన ఏ ఒక్క గ్రీన్ ఫీల్డ్ నగరం కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. షెన్జెన్ (చైనా), నవీ ముంబై (ఇండియా) మాత్రమే అంచనాలను సగం మేరకు అందుకోగలిగాయి. ఇక దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన గ్రీన్‌ఫీల్డ్ నగరాల కథలన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే. మయన్మార్ నిర్మించుకున్న రాజధాని నగరం నేపిడా ఒక నిర్జన కాంక్రీట్ జంగిల్‌ను తలపిస్తున్నది. పుత్రజయ (మలేషియా), కాన్బెర్రా (ఆస్ట్రేలియా), ఆస్థానా (కజికిస్థాన్), డొడోమా (టాంజానియా) నగరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ పీఠాలు, అధికార యంత్రాంగ కార్యకలాపాలు తప్ప జనజీవన స్రవంతులు కనిపించడం లేదు.అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గత ప్రభుత్వం ఎంచుకున్న రియల్ ఎస్టేట్ మోడల్ కూడా సాధారణ ప్రజలు ఇక్కడ నివసించడానికి అనువైనది కాదు. ఈ మోడల్ వల్ల పెరిగే అద్దెలను, భూముల ధరలను మధ్యశ్రేణి ఉద్యోగులు సైతం భరించలేరు. వారంతా విజయవాడ, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉద్యోగం కోసం వచ్చిపోవలసిందే. అటువంటి పరిస్థితి ఏర్పడితే మరో పుత్రజయ అనుభవమే మనకు మిగులుతుంది.అలా జరగకూడదనే మనం కోరుకుంటాము. జన సమ్మర్ధంతో అమరావతి కిటకిటలాడాలనే కోరుకుంటాము. రాయల కాలం నాటి విజయనగరంలా వీధులన్నీ రతనాల రాశులతో తులతూగాలనే ప్రార్థిస్తాము. ‘చెరువులో చేపల్ని నింపినట్టు నా నగరాన్ని మనుషులతో నింపు దేవుడా’ అని హైదరాబాద్ నిర్మాత కులీ కుతుబ్‌షా అల్లాను వేడుకున్నట్టుగానే మనమూ వేడుకోవచ్చు. కానీ అందుకు అనువైన పరిస్థితులు ఉండవనే నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ఫీల్డ్ మహానగరాలు అవాంఛనీయమని పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ మనం మనకు నచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాము. పోలవరం విషయంలోనూ చంద్రబాబు గత ప్రభుత్వం వేసింది తప్పటడుగేనని నిష్పాక్షిక పరిశీలన జరిపితే ఎవరికైనా అర్థమవుతుంది. జాతీయ హోదా లభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే వదిలేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. అలాకాకుండా, అడిగి మరీ భుజాన వేసుకొని ఆపసోపాలు పడవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. డయాఫ్రమ్ వాల్‌కు సంబంధించిన సంక్షోభంలో ఇప్పుడు రాష్ట్రం ఇరుక్కొని పోయింది. ఇది తేలితే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు.ప్రధాన డ్యామ్‌కు పునాదిగా వేసేదాన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు. ఇది దృఢంగా ఉండటమే ప్రాజెక్టుకు కీలకం. అందుకని వరద కోతకు గురికాకుండా ఉండటం కోసం ముందుగానే ఎగువభాగం నుంచి నది ప్రవాహాన్ని పక్కకు మళ్లించి కొంతదూరం ప్రధాన నదికి సమాంతరంగా పారించి దిగువన మళ్లీ నదిలో కలిపేస్తారు. ఈ ప్రవాహ నియంత్రణ కోసం చేసే ఏర్పాట్లను అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్ వేలుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌కు ఎగువన, దిగువన రెండు మట్టి కట్టలను ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. వీటినే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లుగా వ్యవహరిస్తారు.ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతనే డయాఫ్రమ్ వాల్ కడతారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్న మాట. కాఫర్ డ్యామ్‌లను పూర్తిగా కట్టాలంటే అవి ప్రవాహాన్ని అడ్డుకునేంత మేర ఎగువ జనావాస ప్రాంతాలను ఖాళీ చేసి ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఆ పని చేయలేదు కానీ, కాఫర్ డ్యామ్‌లను సగం కట్టి వదిలేశారు. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనులను పునాది స్థాయిలోనే వదిలేశారు. డయాఫ్రమ్ వాల్‌ను మాత్రం రికార్డు సమయంలో నిర్మించామని అప్పట్లో బాబు ప్రభుత్వం ఓ వేడుకను కూడా జరిపినట్టు గుర్తు. 2018 జూన్ 11 నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తయినట్టు అక్కడో పైలాన్‌ను ఆవిష్కరించారు.ఆ తర్వాత దాదాపు సంవత్సర కాలానికి అంటే 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జూన్, జూలై మాసాల్లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టుగా కొంతకాలం తర్వాత వెల్లడైంది. ‘రికార్డు’ సమయంలో డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత కూడా కాఫర్ డ్యామ్‌లు పూర్తిచేయడానికి, స్పిల్ చానల్ పునాదులు పూర్తిచేయడానికి బాబు ప్రభుత్వానికి ఏడాది సమయం మిగిలింది. కాని నెల రోజుల సమయం మాత్రమే ఉన్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేయకపోవడం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని టీడీపీ ప్రచారంలో పెట్టింది.ముందు చేయవలసిన పనులు చేయకుండా ఎకాఎకిన డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టవలసి వచ్చిందన్న ప్రశ్నకు టీడీపీ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. కమీషన్లు భారీగా ముట్టే పనులనే ముందుగా చేపట్టారు తప్ప ప్రోటోకాల్ పాటించలేదన్న వైసీపీ వారి విమర్శకు కూడా కచ్చితమైన సమాధానం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేయడంతోపాటు ప్రవాహాన్ని సమాంతరంగా మళ్లించే పనిని పూర్తి చేశారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే పనిని కూడా పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణ స్థలంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి పూర్వపు స్థితికి తీసుకొచ్చారు. ఇక మిగిలిన డయాఫ్రమ్ వాల్ విషయంలో ఏం చేయాలో చెబితే శరవేగంగా పనులు పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని 2022 డిసెంబర్ నుంచి కోరుతూ వస్తున్నది.మొన్నటి పోలవరం పర్యటనలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిపేర్లు చేయాల్సి వస్తే 400 కోట్లకు పైగా ఖర్చవుతుందనీ, కొత్తగా కట్టాలంటే 900 కోట్లు అవుతుందనీ, ఏ సంగతీ కేంద్రం తేల్చాలని చెప్పారు. కనుక పోలవరం విషయంలో జరిగిన వ్యవహారాలన్నీ గమనంలోకి తీసుకుంటే మాటల్లో చెప్పేంత ప్రాధాన్యత వారి మస్తిష్కంలో లేదనే సంగతి స్పష్టమవుతుంది. ‘ఏ ఫర్ ఆల్, పీ ఫర్ పీపుల్’ అనేది వారి విధానం కాదు. ‘ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం’ అనే మాటల వెనుక అర్థాలు వేరు. ప్రత్యర్థుల మీద ‘ఏ ఫర్ ఎటాక్, పీ ఫర్ పొక్లెయిన్’ విధానాన్ని మాత్రం కొత్త ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తున్నదని చెప్పవచ్చు.శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ పదహారో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులందరూ పదవీ ప్రమాణాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోకి ఆయన కారును అనుమతించడం ద్వారా జగన్మోహన్రెడ్డికి తాము చాలా మర్యాద ఇచ్చామని ప్రభుత్వ సభ్యులు మీడియాతో చెబుతున్నారు. ఔను, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారు. ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా తాము గుర్తించబోవడం లేదనే స్పష్టమైన సంకేతాలను వారు పంపించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే సభా నాయకుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే జగన్మోహన్రెడ్డిని పిలిచేవారు. ఇది సంప్రదాయం. కానీ, మంత్రిమండలి సభ్యులందరి ప్రమాణాలు పూర్తయ్యాకనే ఆయన్ను పిలిచారు.ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే పది శాతం సభ్యులుండాలన్న చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలకు సమయాన్ని కేటాయించడం, ఆ పార్టీ సభ్యులకు గదులను కేటాయించడం కోసం తొలి లోక్‌సభ స్పీకర్ జీ.వీ. మావలంకర్ పెట్టిన 10 శాతం నిబంధనను ప్రతిపక్ష నాయకుడి గుర్తింపుకోసం తప్పుగా అన్వయిస్తున్నారు. పది శాతం సభ్యులున్న పార్టీని పార్లమెంటరీ పార్టీగా, అంతకంటే తక్కువమంది సభ్యులున్న పార్టీలను పార్లమెంటరీ గ్రూపులుగా మావలంకర్ వర్గీకరించారు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుని ప్రస్తావనే ఆ నిబంధనలో లేదు. 1977లో చేసిన చట్టంలోనే ప్రతిపక్ష నాయకుని ప్రస్తావన వచ్చింది. ప్రతిపక్షాల్లో పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ నాయకుడిని ఈ చట్టం ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నది.ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభలో ఉన్న ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఒక్కటే. ఆ పార్టీకి లభించిన సీట్లు పదకొండే కావచ్చు. కానీ 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను దామాషా పద్ధతిలోకి అనువదిస్తే 70 సీట్లు గెలిచినట్టు లెక్క. ప్రతిపక్ష నేతను నిర్ణయించడం కోసం చట్టంలో మూడు నిబంధనలు పెట్టారు. ఒకటి – లోక్‌సభ / శాసనసభలో సభ్యుడై ఉండాలి. రెండు – ఎక్కువమంది సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడై ఉండాలి. మూడు – స్పీకర్ గుర్తించాలి. ఈ స్పీకర్ గుర్తింపును తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల్లో రెండు పార్టీలకు సమానంగా సభ్యులున్నప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో స్పీకర్ ఆ పార్టీల ఓట్ల శాతాన్ని, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అంతవరకే ఆయన విచక్షణాధికారం. ఎక్కువ సభ్యులున్న ఒకే పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించడమే చట్టం సారాంశం.ఈ స్ఫూర్తిని అధికార పార్టీ ప్రదర్శించలేదనే చెప్పాలి. శాసనసభను గౌరవ సభగా మారుస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకూ, ఆచరణకూ మధ్యన లంకె కుదరడం లేదు. శాసనసభ వ్యవహారాలను పక్కనబెడితే, రాష్ట్రంలో అలుముకుంటున్న రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య ప్రియులను కలవరానికి గురిచేస్తున్నది. ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమైన దాడులు మూడు వారాలుగా ప్రతిపక్ష కార్యకర్తలపై యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల ప్రేక్షక పాత్ర షరా మామూలే. తాజాగా వైఎస్సార్సీపీ గుంటూరు కార్యాలయాన్ని కూడా పొక్లెయిన్లతో నేలమట్టం చేశారు. ఇది అధికారిక కూల్చివేత. ఈ అధికారిక కూల్చివేతలు ఇంకా ఉంటాయట! అనుమతుల్లేవనే ఒక ముద్ర వేసి, కూల్చేస్తారట! ఒక అక్రమ భవంతిలో నివాసముండే ముఖ్యమంత్రి ప్రతిపక్ష కార్యాలయాలను అక్రమం అనే ముసుగేసి కూల్చివేయడం సమంజసమేనా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
మండుటెండల మహోపద్రవం
గత దశాబ్దిన్నరగా ఎన్నడెరుగని పరిస్థితి. మే నెలలో మండే ఎండలు తెలిసినవే అయినా, ఏప్రిల్ మొదలు జూన్ సగం దాటినా మాడు పగిలేలా దీర్ఘకాలిక ఉష్ణపవనాల దెబ్బ ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులతో ఢిల్లీ సహా ఉత్తరాది అంతా ఇప్పుడు అగ్నిగుండమైంది. మొన్న మంగళవారం 1969 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో 35.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఢిల్లీ మలమల మాడిపోయింది. ఒక్క జూన్‌లోనే ఇప్పటిదాకా ఏడు రోజులు తీవ్ర ఉష్ణపవనాలతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి కాగా, పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ గణనీయంగా పెరిగిపోవడంతో అవస్థలు హెచ్చాయి. మే 12 తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయినా 40 డిగ్రీల కన్నా తగ్గనే లేదు. నిరాశ్రయులు 192 మంది ఈ జూన్ నెల 11 నుంచి 19 మధ్య కాలంలో వడదెబ్బ తగిలి మరణించారట. మునుపెన్నడూ చూడని ఇన్ని మరణాల సంఖ్య పరిస్థితి తీవ్రతకు మచ్చుతునక. నగరంలో నీటి కొరత మరో పెద్ద కథ. అధిక జనాభాతో దేశరాజధాని చాలాకాలంగా తల్లడిల్లుతోంది. సమీప ప్రాంతాల నుంచి వందలాది మంది వలస రావడంతో గత పాతికేళ్ళలో ఢిల్లీలో డజన్లకొద్దీ శిబిరాలు చట్టవిరుద్ధంగా వెలిశాయి. అసలే శిథిలమైన నగర జలవ్యవస్థ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు, మరీ ముఖ్యంగా ఈ మురికివాడలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి. దానికి తోడు యమునా నదీజలాలు తగ్గిపోయి, నీటి కోసం అల్లాడే ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకర్లతో నీటి పంపిణీ పెద్ద వ్యాపారమైంది. ఇదే అదనుగా జలవనరుల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియా బయలుదేరింది. పెరిగిన ఎండలతో ఉత్తరాదిన రోజువారీ విద్యుత్ వినియోగం 89 గిగా వాట్ల పతాకస్థాయికి చేరి, ఢిల్లీ విమానాశ్రయం అరగంట సేపు కరెంట్ కోతలో మగ్గాల్సి వచ్చింది. మిగతా దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తరాదికి 25 నుంచి 30 శాతం విద్యుత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎండల్లో ఇన్ని సమస్యల ముప్పేటదాడితో రాజధాని ప్రజలకు కష్టాలు వర్ణనాతీతం. సందట్లో సడేమియాగా వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. పొరుగున హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, యమునలోని నీళ్ళొదలడం లేదన్నది ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపణ. మాకే తగినంత లేవన్నది హర్యానా జవాబు. నీళ్ళైనా అందించలేకపోవడం ఆప్ వైఫల్యమేనంటూ ఢిల్లీ బీజేపీ నేతలు రోడ్డు పైకొచ్చి నిరసనలకు దిగడం ఒక ఎత్తయితే... ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోవడం, ఢిల్లీ నీటి సరఫరా పైపులకు సైతం దుష్టశక్తులు చిల్లులు పెడుతున్నాయంటూ ఆప్ సర్కార్ ఆ పైపులకు పోలీసు రక్షణ కోరడం పరాకాష్ఠ. దేశ రాజధానిలో నీటి కొరతపై ప్రధాని మోదీ స్పందించకపోతే శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటూ ఢిల్లీ మంత్రి ఆతిశి ప్రకటించడంతో మహానగరం మరింత వేడెక్కింది. నిజానికి, ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకి, ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. తీరా జూన్ 12 నుంచి మధ్యభారతంలో అవి స్తంభించేసరికి, దేశమంతా ఇటు వర్షాలు లేవు. అటు ఎండలు, ఉక్కపోత. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర, పశ్చిమ భారతావనిలో మరీ దుర్భరం. ఇలాంటి దీర్ఘకాలిక వేసవిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటున్నది అందుకే!నిజానికి ఇదంతా ఎక్కడో ఢిల్లీలో వ్యవహారమనీ, అది అక్కడికే పరిమితమనీ అనుకోవడానికి వీల్లేదు. వాతావరణ మార్పులు, మన స్వయంకృతాపరాధాల కారణంగా భవిష్యత్తులో దేశంలోని నగరాలన్నిటికీ ఇదే దుఃస్థితి దాపురించడం ఖాయం. ఆ మధ్య బెంగుళూరులో ఇలాంటివే చూశాం. దేశానికి అభివృద్ధిఇంజన్లయిన బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లోనూ రేపు ఇవే పరిస్థితులు వస్తే, పరిస్థితి ఏమిటి? దేశ ఆర్థికపురోగతికి వెన్నెముక అయిన వీటిని నివాసయోగ్యం కాకుండా చేస్తే, జనం ఉద్యోగ, ఉపాధుల మాటేమిటి? పొంచివున్న నీటికొరత నివారణకు పాలకులు ఏం ప్రణాళిక వేస్తున్నారు? హైదరాబాద్ సహా అనేక నగరాల్లో వందల కొద్దీ చెరువులు, కుంటలు కబ్జాకు గురై, పర్యావరణానికీ, పెరుగుతున్న జనాభా అవసరాలకూ తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి, దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు రాకపోతే కష్టం. మానవాళికి శాపంగా మారిన ఈ అధిక ఉష్ణోగ్రతల వెనక వాయుకాలుష్యం, శరవేగంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత... ఇలా చాలా కారణాలున్నాయి. విపరీతంగా నిర్మాణాలు పెరిగి, పట్టణాలన్నీ కాంక్రీట్ జనారణ్యాలుగా మారేసరికి, పచ్చని చెట్లు, ఖాళీ ప్రదేశాలున్న ప్రాంతాలతో పోలిస్తే కొద్ది కి.మీ.ల దూరంలోనే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా, దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడడం కూడా పాతికేళ్ళ క్రితంతో పోలిస్తే బాగా నిదానించిందట. ‘పట్టణ ఉష్ణద్వీప’ ప్రభావంగా పేర్కొనే ఈ పరిస్థితిని నివారించడం అత్యవసరం. అలాగే, నిలువ నీడ లేని వారితో సహా సమాజంలోని దుర్బల వర్గాలను ఈ వేడిమి బాధ నుంచి కాపాడే చర్యలు చేపట్టాలి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోనివ్వకుండా ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి వసతి కల్పించాలి. శీతల కేంద్రాలు, ఎండబారిన పడకుండా తగినంత నీడ ఏర్పాటు చేయాలి. గత ఏడాది, ఈసారి ఎన్జీఓ ‘స్వయం ఉపాధి మహిళా సంఘం’ (సేవ) అమలు చేసిన ‘ఎండల నుంచి బీమా సౌకర్యం’ లాంటి వినూత్న ఆలోచనలు అసంఘటిత కార్మికుల జీవనోపాధిని కాపాడతాయి. ఇప్పటికే ఈ 2024 మానవచరిత్రలోనే మండుటెండల వత్సరంగా రికార్డు కెక్కింది. వచ్చే ఏడాది ఈ రికార్డును తిరగరాయక ముందే ఈ మహోపద్రవం పట్ల కళ్ళు తెరవడం మంచిది. -
చిత్తశుద్ధి కావాలి!
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల బహిరంగంగా ఇచ్చిన సలహా వల్ల అయితేనేం, స్వీయజ్ఞానంతో అయితేనేం... మొత్తానికి మణిపూర్ భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చాలాకాలం తర్వాత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఇటీవల మళ్ళీ హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో షా సారథ్యంలో సోమవారం జరిగిన ఈ భేటీ సహజంగానే ఆసక్తి రేపింది. భేటీ ముగిసిన అనంతరం కేంద్రం ఎప్పటిలానే తాము మణిపుర్ ప్రజల రక్షణ, భద్రతలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని మెయితీ, కుకీ వర్గాలు రెంటితోనూ చర్చలు జరిపి, జాతుల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు సత్వరమే కృషి చేస్తామంటూ హోమ్‌మంత్రి పాతపాటే పాడారు. విపరీతంగా జాప్యమైనా, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య గురించి మళ్ళీ కనీసం ఆలోచన చేసినందుకు సంతోషించాలి. కానీ గంటకు పైగా సాగిన భేటీలో మణిపుర్ సీఎం బీరేన్‌సింగ్ కనిపించకపోవడమే విచిత్రం.రాష్ట్రంలో అశాంతిని కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని లోక్‌సభ ఎన్నికల తర్వాత సాక్షాత్తూ బీరేన్సింగే ఒప్పుకున్నారు. ఆలస్యంగానైనా వైఫల్యాన్ని అంగీకరించారు. తప్పొప్పుల బాధ్యత తలకెత్తుకున్నారు. మణిపుర్లో మెజారిటీ వర్గమైన మెయితీలకు షెడ్యూల్డ్ తెగల హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఈ సుదీర్ఘ ఘర్షణలకు దారి తీసింది. ఆ డిమాండ్‌కు నిరసనగా రాష్ట్రంలోని పర్వతప్రాంత జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టేసరికి గడచిన 2023 మే 3న జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికీ చల్లారని ఈ చిచ్చుకు ఏడాది దాటిపోయింది. ఈ పదమూడు నెలల్లో 220 మందికి పైగా మరణించగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. మయన్మార్ నుంచి ‘అక్రమంగా’ వలసవచ్చిన బయటివారే ఘర్షణలకు బాధ్యులని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొండిగా వాదిస్తూ వచ్చాయి. మణిపుర్‌లోని పర్వతప్రాంతాల్లో నివసించే కుకీ–జోలు, ఈ మయన్మార్ వలసదారులు ఒకే తెగ వారు గనక రాష్ట్రంలో ఘర్షణలకూ, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికీ వారే కారణమనేది సర్కారు వారి మాట. సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా పక్షపాత ధోరణితో రాజకీయంగా వ్యవహరిస్తే, ఇలాగే ఉంటుంది. అసలు 1990లలో ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఘనత మణిపుర్దే. అలాంటి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయమున్న మూడో రాష్ట్రంగా మారింది. విద్య, వైద్యం మొదలు ఉపాధి, ప్రాథమిక వసతి కల్పన దాకా అన్నింటా వెనకబడింది. ఈ పరిస్థితులు రాష్ట్రంలోని వివిధ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న ధోరణి వనరుల కేటాయింపు, పరిపాలనల్లో సాగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. క్రమంగా అది వర్గాల మధ్య విభేదాలు పెంచి, ఘర్షణల దాకా తీసుకొచ్చింది. అయితే ఇటీవలి దాకా అశాంతి, అస్థిరతలకు దూరంగా, విభిన్న వర్గాల సమ్మిశ్రిత ఆవాసమైన జీరీబామ్ లాంటి జిల్లాలకూ తాజాగా ఘర్షణలు పాకిపోవడం మరింత ఆందోళన రేపుతోంది. అసోమ్‌ను ఆనుకొని ఉండే జీరీబామ్ జిల్లాలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్‌పైనే ఈ జూన్ 10న దాడులు జరగడం రాష్ట్రంలోని అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇటీవలి ఘర్షణలతో ఆ జిల్లా నుంచి వేలాది జనం అసోమ్‌కు పారిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికి ఏడాదిగా కొన్ని వేలమంది తమ ఇళ్ళకు దూరంగా నిర్వాసితుల శిబిరాల్లోనో, బంధుమిత్రుల ఇళ్ళల్లోనో తలదాచుకొని, కాలం గడుపుతున్నారు. జీవనోపాధి మాత్రమే కాదు... చివరకు సాధారణ జీవితమే ప్రజలకు దూరమైంది. రాష్ట్రం రావణకాష్ఠంగా మారినా ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. మాటలకే తప్ప చిత్తశుద్ధితో చేతలకు దిగలేదు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ అనేక పర్యాయాలు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు కానీ ఒక్కసారైనా మణిపుర్‌కు పోలేదు. మాటల్లోనైనా దాని ఊసెత్తలేదు. చివరకు ఆ మధ్య ఓ ఎన్నికల ప్రసంగంలో మణిపుర్ మాటెత్తినా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, కేంద్రం జోక్యంతో పరిస్థితి మెరుగు పడిందన్నారు. వాస్తవానికి పరిస్థితి మరింత దిగజారిందనేది జగమెరిగిన సత్యం. మణిపుర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని నిరసిస్తూ, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక, సీఎం సైతం మెయితీల వర్గానికి కొమ్ము కాస్తూ, తప్పంతా గిరిజన కుకీలదే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆది నుంచీ తీవ్ర విమర్శల పాలైంది. గతంలో గుజరాత్, హర్యానాల్లో చిన్న కారణాలకే సీఎంలను మార్చేసిన బీజేపీ అధిష్ఠానం ఇంత జరుగుతున్నా మణిపుర్లో మాత్రం బీరేన్‌ను ఏడాదిగా అలాగే కొనసాగించడం పెను వింత. కనీసం అంతకు ముందు దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపుర్లో ఇవాళ ఇలా తయారైందంటే తప్పెవరిది? సాయుధ మూకలు తుపాకులు ధరించి, చివరకు సైనిక వాహనాలను సైతం అడ్డగిస్తున్న పరిస్థితి ఉందంటే, ఏమనాలి? సోషల్ మీడియాలో దేశమంతటా తిరుగుతున్న ఈ దృశ్యాలు పాలకులకే సిగ్గు చేటు. ఏ ఒక్క వర్గాన్నో కాదు... మొత్తం రాష్ట్రాన్నే మంటల్లో పడేసిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా కార్యాచరణకు దిగాలి. జాతి, మతం, రాజకీయాలతో ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు చేపట్టాలి. మాటలు, సమీక్షల కన్నా సత్వర చర్యలు ముఖ్యం. రాజకీయ జోక్యం మాని, ఉన్మాద చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేసేలా భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొనే నిరంతర రాజకీయ కృషి సాగాలి. నిష్పాక్షికంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తేనే మణిపుర్ మళ్ళీ మామూలవుతుంది. లేదంటే, మణిపురే కాదు... మానవ చరిత్ర కూడా మనల్ని క్షమించదు. -
కలలు మాని... కళ్ళు తెరవాలి!
ఏడాది గడిచిందో లేదో... సరిగ్గా అదే రకమైన దుర్ఘటన. అవే రకమైన దృశ్యాలు. మళ్ళీ అవే అనునయ విచారాలు, నష్టపరిహారాలు, దర్యాప్తుకు ఆదేశాలు, భద్రతే తమకు ముఖ్యమంటూ సర్కారీ ప్రకటనలు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సీల్డా వెళుతూ ఆగివున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు గుద్దుకున్న సోమవారం నాటి ప్రమాద దృశ్యాలు, తదనంతర పరిణామాలు చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. నిరుడు జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, మరో రెండు రైళ్ళు ఢీ కొట్టుకోవడంతో 290 మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డ దారుణ ఘటన ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉంది. ఇంతలోనే ఇప్పుడు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్లో జనం బక్రీద్ హడావిడిలో ఉండగా ఉదయం తొమ్మిది గంటల వేళ జరిగిన తాజా రైలు ప్రమాదం పాలకులు పాఠాలు నేర్చుకోలేదని తేల్చింది. గూడ్స్ పైలట్, కో–పైలట్ సహా పది మంది ప్రాణాలను బలి తీసుకొని, 40కి పైచిలుకు మందిని గాయాలపాలు చేసిన ఈ దుర్ఘటన మన రైల్వే వ్యవస్థలో లోటుపాట్లను మరోసారి బయటపెట్టింది. ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు ఉదయం 5.50 గంటల నుంచే రెండు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ చెడిపోయిందని వార్తలు వచ్చాయి. సిగ్నల్‌ను పట్టించుకోకుండా గూడ్స్ ట్రైన్ ముందుకు పోవడం వల్లే ప్రమాదం సంభవించిందని రైల్వే బోర్డ్ ఛైర్పర్సన్ జయావర్మ సిన్హా ఉవాచ. కానీ, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయనప్పుడు రెడ్ సిగ్నళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిందిగా సర్వసాధారణంగా ఇచ్చే టీఏ 912 మెమోను స్టేషన్ మాస్టర్ ఇవ్వడం వల్లే రైళ్ళు రెండూ ఒకే లైనులో ముందుకు సాగాయట. విభిన్న కథనాలు, వాదనలు, తప్పొప్పులు ఏమైనా అమాయకుల ప్రాణాలు పోవడం విచారకరం. లెక్క తీస్తే 2018–19 నుంచి 2022–23 మధ్య అయిదేళ్ళలో తీవ్ర పర్యవసానాలున్న రైలు ప్రమాదాలు సగటున ఏటా 44 జరిగాయి. దాదాపు 470కి పైగా జరిగిన 2000–01 నాటితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గినట్టే కానీ, పెరిగిన సాంకేతికత, పాలకుల ప్రగల్భాలతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువే. ముఖ్యంగా రైళ్ళు ఢీ కొంటున్న ఘటనలు ప్రతి 3.6 నెలలకు ఒకటి జరుగుతున్నాయట. దేశంలోని మొత్తం 18 రైల్వే జోన్లలో దక్షిణ రైల్వే లాంటి ఆరింటిలో మినహా, మిగతా అన్నిటా నిరుడు ఏదో ఒక ప్రమాదం సంభవించింది.రైలు ప్రమాదాలను అరికట్టాలనీ, ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రైళ్ళు ఢీకొనే ప్రమాదం లేకుండా చూసేందుకు ప్రయోగాలూ సాగాయి. ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ‘కవచ్’ను మూడు భారతీయ సంస్థలు దేశీయంగా రూపొందించాయి. ఈ ‘కవచ్’ భద్రతా వ్యవస్థ రైళ్ళ వేగాన్ని నియంత్రించడమే కాక, ప్రమాద సూచికలు డ్రైవర్ల దృష్టిని దాటిపోకుండా తోడ్పడుతుంది. మసక మసక చీకటిలోనూ భద్రతను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘కవచ్’ను ప్రవేశపెట్టామని పాలకులు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. కానీ, భారత రైల్వే వ్యవస్థ దాదాపు లక్ష కిలోమీటర్ల పైచిలుకు పొడవైనది కాగా, దశలవారీగా 1500 కి.మీల మేర మాత్రమే ‘కవచ్’ ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నత్తనడక ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనం. అసలు ఒకప్పటిలా రైల్వేలకూ, రైల్వే శాఖకూ ప్రాధాన్యం ఉందా అంటే అనుమానమే. రైలు సేవల్లో సామాన్యుల హితం కన్నా హంగులు, ఆర్భాటాలు, ఎగువ తరగతి సౌకర్యాలకే పెద్ద పీట వేస్తున్నారు. సౌకర్యాల పేరిట అధిక ఛార్జీలు, వందే భారత్ ౖరైళ్ళు, సుందరీకరణ లాంటివాటి మీదే సర్కారు దృష్టి తప్ప, సాధారణ రైళ్ళ సంగతి పట్టించుకోవట్లేదు. సరిపడా కోచ్‌లు, బెర్తులు కరవన్న మాట అటుంచి, కనీసం కూర్చొనే జాగా కూడా లేక శౌచాలయాల వద్దే ఒకరిపై ఒకరుపడుతున్న జనంతో క్రిక్కిరిసిన రైళ్ళు మన దేశంలో నిత్య దృశ్యాలు. వీటన్నిటి మధ్య భద్రత మాట సరేసరి! గతంలో సాధారణ బడ్జెట్‌కు దీటుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. 1924 నుంచి ఉన్న ఆ రెండు వేర్వేరు బడ్జెట్ల విధానానికి 2017లో బీజేపీ సర్కార్ స్వస్తి పలికింది. ఫలితంగా ఆ తర్వాత రైల్వే శాఖకు వెలుగు తగ్గింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదికి, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే రైల్వే సౌకర్యాల విస్తరణలో సింహభాగం వడ్డిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పటి రైల్వే మంత్రి, బెంగాల్ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ మాటల్లో చెప్పాలంటే, రైల్వేస్ ఇప్పుడో అనాథ. ఇక, నిరుటి పాలనలో లాగే... కొత్త మోదీ సర్కారులోనూ అశ్వినీ వైష్ణవ్‌కే రైల్వే శాఖ అప్పగించారు. పేరుకు ఆయన రైల్వే మంత్రే కానీ, కీలకమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ, సమాచార ప్రసార శాఖ సైతం ఆయన వద్దే ఉన్నాయి. దేనికదే అత్యంత ముఖ్యమైన మూడు శాఖలను వైష్ణవ్ ఒక్కరే నిర్వహించడం భారమే. ఇవన్నీ కాక సోమవారం రైలు ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే... ఆయనను రానున్న అసెంబ్లీ ఎన్నికలకై మహారాష్ట్రలో పార్టీ ఎన్నికల కో–ఇన్‌ఛార్జ్‌గా కూడా బీజేపీ నియమించడం మరీ విడ్డూరం. పాలనా ప్రాధాన్యాల పట్ల అలసత్వానికి ఇది మచ్చుతునక. దేశంలో మునుపెన్నడూ జరగనంత ప్రమాదమైన బాలాసోర్ విషాదం తర్వాతా మనం మారలేదు. సీబీఐ దర్యాప్తు చేసి, ఛార్జ్‌షీట్ దాఖలు చేసినా ఆ కేసు ఇంకా కోర్టులోనే మూలుగుతోంది. అందుకే, ఇకనైనా సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునికీకరణ, రైల్వే ప్రయాణ భద్రతను పెంచడం ప్రాధమ్యం కావాలి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ల గురించి రంగుల కలలు చూపిస్తున్న మన పాలకులు తాజా ఘటనతోనైనా క్షేత్రస్థాయి వాస్తవాలపై కళ్ళుతెరవాలి. ఉట్టికెగరలేకున్నా, స్వర్గానికి నిచ్చెన వేస్తామంటే హాస్యాస్పదం. -
ఇక... జమ్మూ వంతు!
జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాజౌరీ, పూంచ్ , రియాసీ, కఠువా, ఉధమ్‌పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్‌కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్‌పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్‌పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్‌లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్‌సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్‌లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష. -
కరవు పాట
దేశానికి ఎదురయ్యే నానా సమస్యల్లో కరవు ఒకటి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ వరకు ఎదిగినా, కరవు కాటకాలను పూర్తిగా రూపుమాపే స్థాయికి మాత్రం ఇంకా చేరుకోలేదు. రాజ్యానికి వాటిల్లే అనేకానేక ఆపదల్లో దుర్భిక్షాన్ని కూడా ఒకటిగా మన ప్రాచీన సాహితీవేత్తలు గుర్తించారు. అయితే, ఇందులో మానవ ప్రమేయాన్ని మాత్రం పాపం వారు గుర్తించలేకపోయారు. ‘అమానుషోగ్నిః, అవర్షం, అతివర్షం, మారకః, దుర్భిక్షం, సస్యోపఘాతః, జంతుసర్గః, వ్యాధిః, భూత పిశాచ శాకినీ సర్ప వ్యాళ మూషక క్షోభాశ్చేత్యాపదః’ అన్నాడు సోమదేవుడు. ఈ శ్లోకం ఆయన రాసిన ‘నీతి వాక్యామృతం’లోనిది. అంటే, మనుషుల వల్ల కాకుండా, ఇతర కారణాల వల్ల వాటిల్లే అగ్నిప్రమాదాలు, వర్షాలు లేకపోవడం, అతి వర్షాలు, మహమ్మారి వ్యాధులు, దుర్భిక్షం, పంటలకు నష్టం కలగడం, అడవి జంతువుల సంఖ్య విపరీతంగా పెరగడం, రోగాలు, భూత పిశాచాదులు, పాములు, అదుపు తప్పిన ఏనుగులు, ఎలుకలు– ఇవీ రాజ్యంలో కలిగే ఆపదలు. పురాతన రాజ్యాల్లోనే కాదు, దుర్భిక్ష పరిస్థితులు వర్తమాన దేశాల్లోనూ ఉన్నాయి.పురాతన కాలంలో ఆనకట్టలు కట్టే పరిజ్ఞానం లేకపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా ఉండేది. ఆధునిక కాలంలో ఆనకట్టలు కట్టడం నేర్చుకున్నాం. నీటిపారుదలను మెరుగుపరచుకున్నాం. అయినా ఎక్కడో ఒకచోట కరవు తాండవిస్తూ ఉండటమే విచారకరం. ముందుచూపు లేకుండా అడవులను నరికివేయడం వల్లనే ప్రపంచంలో చాలా చోట్ల కరవు కాటకాలు తలెత్తుతున్నాయి. ఒకప్పటి పచ్చని నేలలు ఇప్పుడు బీడు భూములుగా, ఎడారులుగా మారుతున్నాయి. ‘విచారకరమైన సంగతేమిటంటే, అడవిని సృష్టించడం కంటే ఎడారిని సృష్టించడం సులువు’ అన్నాడు ఇంగ్లిష్ పర్యావరణ శాస్త్రవేత్త జేమ్స్ లవ్‌లాక్. కష్టమైన పనులు చేపట్టే బదులు సులువైన పనులు చేయడమే కదా మనుషుల సహజ లక్షణం. అందుకే సునాయాసంగా ఎక్కడికక్కడ ఎడారులను సృష్టిస్తున్నారు.కరవు సాహిత్యం మనకు కరవు కాదు. దుర్భిక్ష వర్ణన తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడితో మొదలైంది. అప్పట్లో కరవు కాటకాలకు ఆలవాలమైన పలనాటి సీమలో ఆకుకూరలతో జొన్నకూడు తినలేక శ్రీనాథుడు నానా తిప్పలు పడ్డాడు. చివరకు ఉక్రోషం అణచుకోలేక ‘ఫుల్ల సరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా/డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ/పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటిలో/ మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్’ అంటూ సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడికే సవాలు విసిరాడు. కేవలం పలనాడులోనే కాదు, రేనాటి సీమలో కూడా శ్రీనాథుడికి కారం కలిపిన జొన్నకూడు తినవలసిన దుర్గతి తటస్థించింది. అప్పుడు ‘గరళము మ్రింగితి ననుచుం/బురహర గర్వింపబోకు పో పో పో నీ/ బిరుదింక గానవచ్చెడి/ మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ’ అని పరమశివుడిని సవాలు చేశాడు. దుర్భిక్ష దుర్గతిని అనుభవించి పలవరించిన తొలి తెలుగు కవి శ్రీనాథుడు.ఆధునికులలో విద్వాన్ విశ్వం రాయలసీమలోని పెన్నా పరివాహక ప్రాంతంలోని పల్లెల కరవు కష్టాలకు చలించిపోయి, ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు’ అంట ‘పెన్నేటి పాట’ను హృదయ విదారకంగా రాశారు. కరవు మనిషిని నానా రకాలుగా దిగజారుస్తుంది. నేరాలకు పురిగొల్పుతుంది. ‘కరవు కాలంలో రొట్టెముక్కను దొంగిలించిన మనిషిని దొంగగా చూడరాదు’ అన్నాడు బ్రిటిష్ గీత రచయిత క్యాట్ స్టీవెన్స్. అయితే, కరవు కాలంలో మనుషుల్లో అంత ఔదార్యం మిగిలి ఉంటుందా అన్నది అనుమానమే! మొదటి ప్రపంచయుద్ధం దెబ్బకు 1914–23 కాలంలో భారత్ సహా నలబై ఐదు దేశాలు కరవు కాటకాలతో అల్లాడిపోయాయి. అప్పటి కరవుకాలంలో అమెరికా ఈ దేశాలను ఆదుకున్న తీరును, ఆనాటి కరవు తీవ్రతను వివరిస్తూ అమెరికన్ రచయిత, సామాజిక కార్యకర్త హెర్బర్ట్ హూవర్ ‘యాన్ అమెరికన్ ఎపిక్: ఫేమిన్ ఇన్ ఫార్టీ ఫైవ్ నేషన్స్’ అనే పుస్తకం రాశాడు. నేటి ప్రపంచంలో కరవు కరాళనృత్యం చేసే దేశాల్లో సోమాలియా ముందు వరుసలో ఉంటుంది. ప్రకృతి కారణాలే కాకుండా; యుద్ధాలు, సంక్షోభాలు అక్కడి కరవును మరింత కర్కశంగా మారుస్తున్నాయి. ‘ఆకలి నా అనుదిన ఆహారం/ కరవు నా ఊపిరి/ నిర్లక్ష్యమే నా సంరక్షణ/ దాతల జోలపాటకు నేను నిద్రపోతాను/ ఆ పాట ఎలా పాడాలో వితరణ సంస్థలకు తెలుసు’ అంటాడు ‘నేను సోమాలీ శిశువును’ అనే కవితలో సోమాలీ కవి అబ్ది నూర్ హజీ మహమ్మద్. నేడు కరవు, ఎడారీకరణలపై పోరాట దినం. ప్రస్తుత ప్రపంచంలో ఇరవై మూడు దేశాలు గడచిన ఆర్థిక సంవత్సరంలో కరవు ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. వీటిలో మూడు ఆఫ్రికన్ దేశాలైతే, వరుసగా నలభై ఏళ్ల నుంచి కరవుతోనే సతమతమవుతున్నాయి. కరవు కాటకాలు ఉన్నచోట అశాంతి, అలజడులు తప్పవు. మనుషుల్లో హింసా ప్రవృత్తి పెరుగుతుంది. ‘హింస కలుపుమొక్కలాంటిది. ఎంతటి కరవు వాటిల్లినా అది చావదు’ అన్నాడు ఆస్ట్రియన్ రచయిత సైమన్ వీసెంతాల్. నాజీల మారణకాండ నుంచి తప్పించుకుని, బతికి బట్టకట్టిన వాడాయన. కరవు కాటకాలు కనుమరుగైతే తప్ప ప్రపంచంలో శాంతి సామరస్యాలు సాధ్యంకావు. అయితే, అలాంటి రోజు ఎప్పటికైనా వస్తుందా? మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ‘నిజంగానే నిఖిలలోకం / నిండు హర్షం వహిస్తుందా?/ మానవాళికి నిజంగానే/ మంచికాలం రహిస్తుందా?’ -
రెడ్‌బుక్ రాజ్యాంగం చెల్లదు!
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్‌బుక్‌లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్‌బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్‌ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్‌ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్‌ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్‌బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్‌బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్‌రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్‌బుక్‌ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్ స్టేషన్లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్‌వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్‌బుక్‌తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్‌బుక్ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జీ–7 అసంబద్ధ నిర్ణయం
పేరుకి సంపన్న దేశాలే. ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నవే. స్వయంకృతం కావొచ్చు... అంతర్జాతీయ పరిణామాల పర్యవసానం కావొచ్చు ఆ దేశాలకూ సమస్యలుంటాయి. ఇటలీలో గురువారం ప్రారంభమైన జీ–7 దేశాల మూడురోజుల శిఖరాగ్ర సదస్సు ఈ పరిస్థితిని ప్రతిబింబించింది. చుట్టూ అనిశ్చితి, భవిష్యత్తుపై నిరాశా నిస్పృహలు వాటిని పీడిస్తున్నాయి. ఉన్న సమస్యలు చాల్లేదన్నట్టు అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ డోనాల్డ్ ట్రంప్‌కు దక్కవచ్చన్న అంచనాలు వాటిని వణికిస్తున్నాయి. మూడేళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పటికి ట్రంప్ నిష్క్రమించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడై శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. వస్తూనే అందరికీ అభయమిచ్చారు. మళ్లీ ప్రపంచ సారథ్యాన్ని అమెరికా స్వీకరించి జీ–7కు అన్నివిధాలా అండదండలందిస్తుందని పూచీపడ్డారు. అదే బైడెన్ గురువారం సదస్సుకు హాజరైనప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం ఎడతెగకుండా సాగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ సరేసరి. పాలస్తీనాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు పాశ్చాత్య దేశాలు, అమెరికా మద్దతిస్తున్నాయన్న ఆగ్రహంతో 1973లో ఒపెక్ దేశాలు చమురు సంక్షోభం సృష్టించినప్పుడు దానికి జవాబుగా జీ–7 ఆవిర్భవించింది. యాభైయ్యేళ్లు గడిచాక ఇప్పటికీ ఇజ్రాయెల్ తీరుతెన్నులు మారలేదు. అమెరికా మాత్రం ఆయుధాలందిస్తూనే గాజాలో దాడులు నిలపాలని ఇజ్రాయెల్‌ను బతిమాలుతోంది. మరోపక్క ఇటీవలే జరిగిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో యూరొప్ రాజకీయ ముఖచిత్రం మారుతున్న వైనం వెల్లడైంది. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీల్లో మితవాద పక్షాలు బలపడుతున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. అసలు జీ–7కు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీయే మితవాద పక్షానికి చెందినవారు. వీటన్నిటికీ అదనంగా ట్రంప్ సమస్య తోడైతే జీ–7 దేశాధినేతలు నిశ్చింతగా ఎలా ఉండగలరు?ఇలా పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయినా ఈ ఏడాది ఆఖరుకల్లా ఉక్రెయిన్‌కు 5,000 కోట్ల డాలర్ల (రూ. 4లక్షల కోట్లుపైగా) రుణం అందించాలని గురువారం జీ–7 అధినేతలు తీర్మానించక తప్పలేదు. ఇది సాధారణ సాయమైతే రష్యా కూడా ఎప్పటిలా ఇది సరికాదని ఖండించి ఊరుకునేది. కానీ తాజా నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే దురాక్రమణ యుద్ధం తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో రష్యాకున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన స్థిరాస్తులతోపాటు నగదు రూపంలోవున్న సంపదను స్తంభింపజేశారు. ఇప్పుడు ఉక్రెయిన్‌కు ఆ ఆస్తులపై ఆర్జించిన వడ్డీనుంచే రుణం అందజేయబోతున్నారు. నిజానికి గత రెండేళ్లుగా అమెరికా ఈ ప్రతిపాదన చేస్తున్నా ఈయూ దేశాలు తాత్సారం చేస్తున్నాయి. ఆ పని చేస్తే రష్యాను మరింత రెచ్చగొట్టినట్టు అవుతుందనీ, పొరుగునేవున్న తమపై అది నేరుగా దాడికి దిగే ప్రమాదం ఉంటుందనీ భావించాయి. కానీ అమెరికా ఎలాగైతేనేం నచ్చజెప్పి ఒప్పించింది. ఈయూలో ఎప్పుడూ భిన్న స్వరం వినిపించే ఫ్రాన్స్ బాహాటంగానే అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించింది. జీ–7 దేశాలన్నీ విరాళాలు సమకూర్చి, ప్రపంచ దేశాలనుంచి విరాళాలు సేకరించి ఈ రుణాన్ని అందిద్దామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సూచించారు. కానీ చివరకు అమెరికా ఒత్తిడితో రష్యా ఆస్తులనుంచి వచ్చిన వడ్డీనుంచే ఇవ్వాలని తీర్మానించారు. ‘ఇది నేరపూరిత చర్య. మానుంచి దుఃఖాన్ని మిగిల్చే స్పందన చవిచూడాల్సి వస్తుంది సుమా!’ అని రష్యా హెచ్చరించింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వేరే దేశం ఆస్తుల్ని స్తంభింపజేయటం పెద్ద కష్టం కాదు. కానీ వాటిని వినియోగించటానికి ఇప్పటికైతే న్యాయబద్ధమైన ప్రాతిపదికగానీ, విధానంగానీ లేవు. అమెరికా తనవరకూ చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉక్రెయిన్ పౌరుల ఆర్థిక పునర్నిర్మాణం, అవకాశాల మెరుగుదల పేరిట రెపో చట్టం తీసుకొచ్చింది. ఈయూ ఇలాంటి చట్టమేమీ లేకుండానే రష్యా ఆస్తులనుంచి వచ్చిన లాభార్జనను పక్కనబెట్టింది. ఇప్పుడు జీ–7 అమెరికా మాదిరిగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదిక లేకుండా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రమేయం లేకుండా ఏవో కొన్ని దేశాలు ఈ తరహా చర్యలకు సిద్ధపడటం అనర్థదాయకం. ఇప్పటికే అమెరికా, పాశ్చాత్య దేశాలకు రష్యా ఒక హెచ్చరిక చేసింది. అగ్రరాజ్యాలు సరఫరా చేసిన భారీ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే దాని పర్యవసానాలను ఆ దేశాలు కూడా అనుభవించాల్సి వస్తుందన్నది ప్రకటన సారాంశం. యుద్ధం మొదలైన నాటినుంచీ రష్యా ఆస్తులను చెరబట్టిన అగ్రరాజ్యాలు ఈ రెచ్చగొట్టే చర్యకు కూడా సిద్ధపడ్డాయంటే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచటమే అవుతుంది.బైడెన్‌కూ, ట్రంప్‌కూ మధ్య ఒక్క చైనా విషయంలో మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. దానిపై భారీగా సుంకాలు విధించాలన్నదే ఇద్దరి ఆలోచన. కానీ ఈయూ, నాటో, జీ–7లపై ట్రంప్ గతంలో కారాలూ మిరియాలూ నూరేవారు. 2018లో కెనడాలో జీ–7 సదస్సు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ ప్రకటించిన వెంటనే ట్రంప్ అది అబద్ధమని కొట్టిపారేశారు. సంస్థలో రష్యాను చేర్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఇటీవలే ఆయన నాటో దేశాలను తీవ్రంగా హెచ్చరించారు కూడా. తాను అధికారంలోకొచ్చాక నాటోనుంచి తప్పుకుంటామనీ, అటుపై రష్యా ఆ దేశాలను ఏంచేసినా పట్టించుకోబోమనీ తెలిపారు. ఇలాంటి స్థితిలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గటం ఎంతవరకూ సబబో జీ–7 ఆలోచించుకోవాలి. -
వలస పోయిన మందహాసం
కువైట్ దక్షిణ ప్రాంతంలోని మంగఫ్ నగరంలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా గాయాల పాలవడం విషాదం. మృతుల్లో 43 మంది స్వదేశంలోని కుటుంబాలను పోషించడం కోసం కడుపు కట్టుకొని వలస వెళ్ళిన మన భారతీయులే కావడం మరింత విషాదం. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో ఆరంతస్థుల అల్–మంగఫ్ అపార్ట్మెంట్ల భవనంలో ఒక్కసారిగా రేగిన మంటలు ఇంతటి ఘోర ప్రమాదానికి దారి తీశాయి. కేరళ, తమిళనాడు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన దాదాపు 200 మంది కార్మికులు నివసిస్తున్న ఆ భవనం మన కేరళకు చెందిన వ్యక్తిది కాగా, మృతుల్లో ఎక్కువ (24) మంది కేరళ వారే! చీకటి వేళ సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో అత్యధికులు ఆ మంటలు, పొగలో చిక్కుకొని ఊపిరి ఆడక చనిపోయారు. ఓ వంట గదిలో మంటలు మొదలయ్యాయనీ, అవి భవనమంతటికీ వ్యాపించాయనీ స్థానిక మీడియా కథనం. ఈ ఘటనపై కూలంకషంగా దర్యాప్తు జరిపి, ఎవరు బాధ్యులనేది నిర్ణయిస్తామని కువైట్ చెబుతోంది. కారణాలు ఏమైనా బాధిత కుటుంబాల కన్నీళ్ళు ఆగేవి కావు. కష్టపడి నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించి, ఊళ్ళోని కుటుంబాలను బాగా చూసుకోవాలని బయలుదేరిన పలువురి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. కువైట్‌లో అగ్ని ప్రమాదాల చరిత్ర గమనిస్తే, 2009లో రెండో పెళ్ళి చేసుకుంటున్న తన భర్తపై ప్రతీకారంతో ఓ కువైట్ మహిళ వివాహ విందులో గుడారానికి నిప్పు పెట్టినప్పుడు 57 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆ దేశంలో ఇదే అతి పెద్ద ఘోరకలి. 2022 మార్చిలోనూ కువైట్‌లో పేరున్న ముబారకియా మార్కెట్ వాణిజ్యప్రాంతంలో ఇప్పటిలానే అగ్నిప్రమాదం సంభవించింది. మళ్ళీ ఇప్పుడీ తాజా ప్రమాదం. జాగ్రత్తలు తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నా అవేవీ వాస్తవ రూపం ధరించడం లేదు. ఈ ఘటనల వెనుక స్థానికంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దురాశ లాంటివెన్నో ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఒక్క కువైట్‌లోనే కాదు, మధ్యప్రాచ్యంలోని అనేక ప్రాంతాల్లోనూ వలస కార్మికులు అవస్థలు, వారి అమానవీయ జీవన పరిస్థితులు అనేకం. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వల్లో ఆరో స్థానంలో ఉన్న కువైట్ మొత్తం 42 లక్షల పైగా జనాభాలో స్థానికుల కన్నా పని చేయడానికి వలస వచ్చినవారే ఎక్కువ. ఆ దేశంలో మన ప్రవాసీయుల సంఖ్య పది లక్షల పైనే! ఇంకా చెప్పాలంటే, కువైట్ మొత్తం జనాభాలో 21 శాతం మనవాళ్ళే! అక్కడి శ్రామిక వర్గంలో 30 శాతం మంది మనమే. 1990 – 91లో గల్ఫ్ యుద్ధ ప్రభావంతో లక్షలాది భారతీయులు కువైట్ నుంచి వెనక్కి వచ్చేసినా, అనంతరం భారీగా తరలివెళ్ళారు. ఒకప్పుడు అధికంగా ఉన్న పాలస్తీనియుల్ని మనం మించిపోయాం. వడ్రంగులు, తాపీ మేస్త్రీలు, పనివాళ్ళు, డ్రైవర్ల దగ్గర నుంచి ఫుడ్, కొరియర్ బాయ్స్ దాకా కువైట్‌లో అధికశాతం భారతీయులే. ఇంజనీర్లు, డాక్టర్ల లాంటి వృత్తి నిపుణులున్నా ఎక్కువ మంది అన్–స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులే. ఇలాంటి కార్మికులకు అక్కడ డిమాండ్ ఎక్కువ. అందుకు తగ్గట్టే మన దేశంతో పోలిస్తే, అక్కడ ఆదాయమూ అధికమే. కువైట్, యూఏఈ, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ అనే అరడజను గల్ఫ్ దేశాలకు మన వలసలకదే కారణం. తాజా ఘటనలో చనిపోయిందీ ఇలాంటి వలసజీవులే! అందరూ 20 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు వారే! కేంద్ర మంత్రి, కేరళ ఆరోగ్య మంత్రి సహా పలువురు హుటాహుటిన కువైట్‌కు పయనమయ్యారు. బాధిత కుటుంబాలకు కేంద్రం, కేరళ ప్రభుత్వాలు తోచిన నష్టపరిహారం ప్రకటించాయి. కానీ, కేవలం ఇది సరిపోతుందా అన్నది బేతాళ ప్రశ్న. కూలి కోసం, కూటి కోసం విదేశాలకు వెళ్ళి, అక్కడ సంపాదించిన సొమ్మును స్వదేశంలోని ఇంటికి పంపి, పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి అండగా నిలుస్తున్న తోటి భారతీయుల పట్ల మన అక్కర అంత మాత్రమేనా? గల్ఫ్ సహా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వలస కార్మికులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇవాళ్టికీ వీరి వెతల గురించి అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు పట్టించుకొనేది తక్కువే. వెళ్ళినవారు అనుకోకుండా ఏ చిక్కుల్లో పడినా, ఆఖరుకు ప్రాణాలే కోల్పోయినా ప్రవాస తెలుగు, తమిళ, మలయాళీ సంఘాల లాంటి ప్రైవేట్ సంస్థలే చొరవ తీసుకొని సాయపడుతున్నాయి. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క కువైట్‌లోనే 2014 నుంచి 2018 మధ్య 2932 మంది భారతీయులు మరణించారు. 2023లో 708 మంది చనిపోయారు. అనూహ్య ప్రమాదాలప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే తప్ప, అసలీ వలస కార్మికులు, ప్రవాస భారతీయుల కష్టనష్టాలను నిరంతరం గమనించేందుకు మనకంటూ ఇప్పటికీ పటిష్ఠమైన వ్యవస్థ, ప్రత్యేక మంత్రిత్వ శాఖ లాంటివి లేవు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల మేరకు గల్ఫ్ వెళ్ళే భారత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనే భరోసా, కువైట్ వలస కార్మికులకు రూ. 10 లక్షల ప్రవాసీ భారతీయ బీమా పథకం ఉన్నా, విదేశాంగ శాఖలో నమోదు చేసుకొని, అన్ని పత్రాలూ ఉన్నవారికే అవి వర్తిస్తాయి. కానీ, అవేవీ పాటించకుండా పొట్టకూటి కోసం దళారుల్ని ఆశ్రయించి వెళ్ళే బడుగు జీవులే మన దగ్గర ఎక్కువ. పశ్చిమాసియాలోని మన వలస బిడ్డల సంపూర్ణ రక్షణకై ఇప్పటికైనా మన ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. సరైన నివాస వసతి సహా కనీస సౌకర్యాలతో జీవించే ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలతో కలసి కృషి చేయాలి. ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలుపుతున్న ఈ కనిపించని శ్రామిక శక్తి పట్ల అది కనీస కర్తవ్యం. జీవితంలో వారు, దేశంగా మనమూ గెలవడం సరే... ముందు హుందాగా బతకడం ముఖ్యం. -
మందలింపు మాటలు
పెంచి, పోషించిన పెద్దవాళ్ళకు పిల్లలను మందలించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. రెక్కలొచ్చిన పిల్లలు పెద్దల మాట వింటారా, లేదా అన్నది మాత్రం వేరే విషయం. గడచిన పదేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సైద్ధాంతిక తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రభుత్వ పెద్దలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు ఆ పోలికే గుర్తుకువస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాగిన భీకర విద్వేష ప్రచారాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సోమవారం ఘాటుగా విమర్శించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా మాట్లాడడాన్ని తప్పుపడుతూ అధికార, ప్రతిపక్షాలు రెంటికీ తలంటి పోశారు. ఎన్నికలనేవి పోటీయే తప్ప యుద్ధం కాదంటూ హితవు పలికారు. అలాగే, కల్లోలిత రాష్ట్రం మణిపుర్‌లోని పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతా అంశంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. గత వారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆరెస్సెస్ ఛీఫ్ తొలిసారిగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అదే సమయంలో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ఫలితాలలో బోర్లాపడ్డందున బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరగాలని రాయడం విశేషం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. భాగవత్ నేరుగా మోదీ పేరు ప్రస్తావించకున్నా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవచ్చు. అలాగే, క్షేత్రస్థాయిలోని జనం మాట వినకుండా, గాలి బుడగలో ఆనందంగా గడిపేయడమే బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించలేని దుఃస్థితికి కారణమంటూ ‘ఆర్గనైజర్’ వ్యాసంలో ఆరెస్సెస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు. జనంలో రాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పంచుకుంటూ, సమస్తం మోదీ పేరుతో జరిగిపోతుందని భావించారన్న ఆయన చురకలు బీజేపీకి పెద్దగా రుచించని ఘాటైన మాటలే! నిజానికి, తాజా ఎన్నికల్లో విజయానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, తమ పార్టీ ఆరెస్సెస్‌ను మించి ఎదిగిందనీ, వ్యవహారాలు నడపడానికి దానిపై ఇక ఎంత మాత్రమూ ఆధారపడి లేమనీ అనడం ఆశ్చర్యకరం. బహుశా దానికి పరోక్షంగా ప్రతిస్పందనే భాగవత్ మాటలు, ‘ఆర్గనైజర్’లో వ్యాసమూ అయినా కావచ్చు. మోదీ సైతం ఒకప్పుడు ఆరెస్సెస్ ప్రచారకుడిగా ప్రజాజీవితం ప్రారంభించిన వారే. ఆ భావజాలంతో ఎదిగినవారే. ఆయన ఎదుగుదలలో, సైద్ధాంతిక అజెండాలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ పైన దేశ ప్రధానిగా ఆయన ముందుకు నడవడంలో ఆ మాతృసంస్థ పాత్రను విస్మరించలేం. రాజకీయ పార్టీ బీజేపీ అయినా, దానికి పునాది స్థాయిలో పట్టు నిలిపి, గుట్టుమట్లు తెలిపినది ఆరెస్సెస్ అనేదీ జగమెరిగిన సత్యమే. ఇప్పుడు పునాదిని మరిచి, పై మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. భాగవత్ చేసిన మణిపుర్ ప్రస్తావన కూడా సరైన సమయానికే వచ్చింది. ఎన్నికల కోసం దేశమంతటా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన ప్రధాని సందర్శించనిది మణిపురే. ఏడాది గడిచినా చల్లారని మంటలతో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత వారం జిరిబామ్‌లో జరిగిన హింసాకాండ, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాన్వాయ్‌పై తాజాగా జరిగిన దాడి అందుకు నిదర్శనాలు. పరస్పరం నమ్మకం కోల్పోయిన మెజారిటీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను దింపడం తప్ప, అసలైన రాజకీయ పరిష్కారం కోసం బీజేపీ ప్రయత్నించలేదన్నది నిష్ఠురసత్యం. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తానే సమస్యగా మారినప్పటికీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఆ పార్టీ కదపనే లేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం సాధించి పెట్టిన బీరేన్‌ను స్థానికంగా పార్టీ పట్టు నిలిపే నేతగా అది భావిస్తూ ఉండివుండవచ్చు. కానీ, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఇంఫాల్ నుంచి అనుమతి నిరాకరణ సహా రాష్ట్రంలో మారని పరిస్థితుల వల్ల మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభా స్థానాలనూ కాంగ్రెస్‌కే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే, ఇది బీజేపీ చెవి ఒగ్గి వినాల్సిన పాఠం. ఇక, ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే, భవిష్యత్తులో దేశాన్ని నడపడమెలా అన్న భాగవత్ ప్రశ్న సహేతుకమైనదే. కచ్చితంగా అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినదే. కానీ, కొంతకాలంగా అదుపులేని మాటలు అనేకం అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆరెస్సెస్ సంఘ్సేవక్లను పక్కనబెట్టి బీజేపీ సొంత కార్యకర్తలతో ఎన్నికల పోరు సాగించిన తర్వాత... అదీ పార్టీకి సొంత మెజారిటీ రానప్పుడే ఈపాటి వివేకం మేల్కొనడమే ఒకింత విడ్డూరం. బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఇది ఊతం. అయితే, గతంలో 1998, 2004ల్లో వాజ్‌పేయ్ ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడూ అనేక విధానాలపై రెంటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నమాట మర్చిపోలేం. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచిచెడులను గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలి మెట్టు. మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకున్నా, మాతృసంస్థ ఆలస్యంగానైనా మేల్కొని సుద్దులు చెప్పడమే తటస్థులకు కాస్తంత ఊరట. గత పదేళ్ళలో మోదీ మేనియాలో నోరు విప్పే వీలు లేకుండాపోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే ఉండవచ్చు. కానీ గాయం మానాలంటే... మందు చేదుగా, ఘాటుగా ఉందని అనడం సరికాదేమో! -
పిల్లల భవితకు పరీక్షా?
పరీక్షల్లో విద్యార్థులు పాసవడం, ఫెయిలవడం సహజం. కానీ వ్యవస్థే ఫెయిలవడం, తత్కారణంగా విద్యార్థులు గురి తప్పడం ఎప్పుడన్నా చూస్తామా? వైద్య విద్యాలయాల్లో ప్రవేశానికై జరిపే అఖిల భారత పరీక్ష నేషనల్ ఎలిజబిలిటీ– కమ్– ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విషయంలో అదే జరిగింది. పేపర్ లీకులు, గ్రేస్ మార్కులు, పలువురికి నూరుశాతం మార్కులు, కటాఫ్ మార్కుల్లో గణనీయంగా పెరుగుదల... ఇలా ఈ ఏటి ‘నీట్’ పరీక్షలో వివాదాలు అనేకం. ఈ అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన, ఆందోళన, నిరాశ రేపుతున్నాయి. ఈసారి పరీక్ష జరిగిన కంగాళీ వ్యవహారంపై కోచింగ్ సంస్థలు, డాక్టర్లు, ప్రతిపక్ష నేతలు గొంతెత్తేలా చేశాయి. చివరకిలాంటి దేశవ్యాప్త పరీక్షలు నిర్వహించే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పై పిల్లలకూ, తల్లితండ్రులకూ నమ్మకమే పోయే పరిస్థితి వచ్చింది. కొన్నిచోట్ల పేపర్ లీకైందన్న వార్తల్ని ఎన్టీఏ కొట్టిపారేసినా, విద్యార్థులు, కోచింగ్ సంస్థల వారు కోర్టు కెక్కారు. ఫలితాలను రద్దు చేయాలన్న వారి పిటిషన్‌పై కేంద్రానికీ, ఎన్టీఏకీ సుప్రీం కోర్ట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. పరీక్ష పవిత్రతే దెబ్బతిన్నదంటూ జవాబు కోరింది. వెరసి కొన్నేళ్ళు గా రచ్చ రేపుతున్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విశ్వసనీయతకు ఇప్పుడు అగ్నిపరీక్ష ఎదురైంది. దేశంలోని 700 పైచిలుకు విద్యాలయాల్లో లక్షా 8 వేల చిల్లర ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది ‘నీట్’కు హాజరవుతారు. 2017లో 12 లక్షల మంది హాజరుకాగా, ఏడేళ్ళలో ఆ సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ‘నీట్’కు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 5న పరీక్ష జరగగా, తర్వాత నెలరోజులకే, నిర్ణయించిన తేదీ కన్నా పది రోజుల ముందరే జూన్ 4న ఫలితాలను ప్రకటించారు. దేశమంతా ఎన్నికల ఫలితాల హడావిడిలో ఉండగా సందట్లో సడేమియాగా ఈ ఫలితాల వెల్లడి అనుమానాలు రేపింది. పైగా, ఏటా ఈ ప్రవేశపరీక్షలో ఏ ఒక్కరో నూరు శాతం మార్కులు సాధిస్తారు. ఆ మాటకొస్తే, అసలీ పరీక్షలో 650, ఆ పైన మార్కులు సంపాదించడం సైతం కష్టం. కఠోరసాధనతోనే సాధ్యం. అలాంటిది... ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. ఫలితంగా... గతంలో 650 మార్కుల స్కోరుకు సైతం విద్యార్థులకు పదివేలల్లో ర్యాంకులొస్తే, ఈసారి ఆ మార్కులకు ముప్ఫై, నలభై వేల మధ్య ర్యాంకులే దక్కడంతో విద్యార్థులు, తల్లితండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఆన్లైన్ పరీక్ష ‘క్లాట్’కూ, ఆఫ్‌లైన్‌లో జరిగే ‘నీట్’కూ విధానాల్లో తేడాలున్నాయి. కానీ, క్లాట్‌లో లాగా ఇక్కడా 1563 మంది విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు కలిపింది. అదేమంటే కొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు సమయం వృథా అయిందనీ, వారు చదివిన పాత – కొత్త పాఠ్యపుస్తకాల్లో తేడాలున్నాయనీ, అందుకే అదనపు మార్కులు కలిపామనీ చెప్పింది. కాంపిటీటివ్ పరీక్షల్లో కనీవినీ ఎరుగని గ్రేస్ మార్కులు, ఈ వివరణలు హాస్యాస్పదం. పైగా, సరైన జవాబుకు 4 మార్కులు – తప్పితే ఒక మార్కు మైనస్ గనక, ఏ లెక్కన చూసినా అసంభవమైన 717, 718 లాంటి స్కోర్లు రావడమేమిటో దేవుడికే తెలియాలి. పాట్నాలో పేపర్ లీకైందనీ, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, గుజరాత్‌లలో ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాశారనీ ఫిర్యాదులున్నాయి. హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్ రావడం, పైగా వారి దరఖాస్తులు ఆరోహణ క్రమంలో ఒకరి తర్వాత మరొకరివి కావడం విడ్డూరం. నీట్లో 715 మార్కులొచ్చిన విద్యార్థి తీరా ఇంటరే పాసవని విచిత్రం సరేసరి. అందుకే, అసలు నిజాలను ఎన్టీఏ దాచిపెడుతోందని అనుమానాలొస్తున్నాయి. లీకులు, వివాదాలు కొత్త కాకున్నా ఈసారి జరిగింది పక్కా స్కామ్ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష రద్దు చేసి, మళ్ళీ జరపాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఇప్పుడు నీట్లో మంచి మార్కులొచ్చి కూడా ఎప్పటిలా మంచి ర్యాంక్, కోరుకున్న కాలేజీలో సీటు రాని విచిత్రపరిస్థితి విద్యార్థులది. నిస్పృహతో కొందరు పిల్లలు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడడం విషాదం. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదలకూ, సామాజిక న్యాయానికీ ఈ నీట్ నిర్వహణ పూర్తిగా వ్యతిరేకమని తమిళనాడు ఎప్పటి నుంచో వాదిస్తోంది. 2021లో వచ్చిన స్టాలిన్ సర్కార్ జస్టిస్ రాజన్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేసింది. కమిటీ సిఫార్సుల మేరకు లోపభూయిష్ఠమైన నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలంటూ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. దీర్ఘకాలంగా రాష్ట్రపతి ముద్ర కోసం వేచి చూస్తోంది. ఎన్టీఏ మాత్రం తప్పులు ఒప్పుకొని, దిద్దుబాటుకు సిద్ధం కావట్లేదు. తాజా పరీక్షలో జవాబులు గుర్తుపెట్టే ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందంటూ ఎన్టీఏ ఒకరి ఫలితం ఆపేసింది. తీరా చూస్తే ఆ విద్యార్థినికి 715 మార్కులు రావడం గమనార్హం. ఇలాంటి విచిత్ర విన్యాసాలు చూశాకనైనా... మన పరీక్షా వ్యవస్థలో, ఉపయోగించే సాంకేతికతలో పారదర్శకత తీసుకురాక తప్పదు. అవసరమైతే వైద్య విద్యాలయాల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వాయిదా వేసి, కూలంకషంగా దర్యాప్తు చేయాలి. అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్న ఉన్నతస్థాయి ప్యానెల్ మరో వారంలో తన నివేదిక ఇవ్వనుంది. అది చేసే సిఫార్సుల మాట అటుంచితే, ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై ఇప్పటి దాకా నోరు విప్పకపోవడం విషాదం. చదువుల నుంచి ఉద్యోగాల దాకా మన దేశంలో సమస్త పరీక్షలకూ లీకుల జాడ్యం, అవకతవకల మకిలి అంటుకుంది. గత అయిదేళ్ళలో 15 రాష్ట్రాల్లో మొత్తం 41 పేపర్ లీకుల వల్ల 1.4 కోట్ల మంది ఉద్యోగార్థులకు కష్టం, నష్టం కలిగాయి. ఇది మన వ్యవస్థకే సిగ్గుచేటు. బాగా చదువుకోవాలనుకున్న పసివారి భవిష్యత్తుకు సైతం ఈ పీడ తప్పకపోవడమే మరీ బాధాకరం. సమూల ప్రక్షాళనతో ఇలాంటి పరీక్షలను లోపరహితంగా మార్చడమే మార్గం. -
సరికొత్త సంకీర్ణ విన్యాసం
ఆహూతులైన వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, అనేక రంగాల ప్రముఖులు, వేలాది జనం సాక్షిగా, రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. భారత ప్రధాని స్వర్గీయ నెహ్రూ తర్వాత మళ్ళీ వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన మరో వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు. ప్రధాన మంత్రి కిసాన్ నిధి నుంచి 17వ విడతగా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 20 వేల కోట్లు పంపిణీ చేసే ఫైలుపై తొలి సంతకంతో సోమవారం ఉదయమే మోదీ పనిలోకి దిగిపోయారు. మొదటి రెండు పర్యాయాలు బీజేపీ సొంత బలంతో ‘మోదీ సర్కార్’గానే పాలన చేసిన కమలనాథులు ఈ మూడోసారి మాత్రం చాలినంత సంఖ్యాబలం లేక, మిత్రపక్షాల అండతో అచ్చమైన ‘ఎన్డీఏ సర్కార్’గా పని చేయాల్సి రావడం కొత్త పాలనలోని పెద్ద మార్పు. గతంలో గుజరాత్ సీఎంగా కానీ, ఆ తరువాత గడచిన పదేళ్ళుగా ప్రధానిగా కానీ తన మాటే శాసనంగా చలామణీ అయిన మోదీ ఇప్పుడు వివిధ ప్రాంతాలు, పార్టీలు, ఆశలు, ఆకాంక్షలకు చెవి ఒగ్గి, ఏకాభిప్రాయసాధనలో ఏ మేరకు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జనరల్ (24), ఓబీసీ (27), ఎస్సీ (10), ఎస్టీ (5), మైనారిటీలు (5)... ఇలా వివిధ వర్ణ శోభితమైన హరివిల్లుగా మొత్తం 71 మంది సహచరులతో మోదీ సారథ్యంలో కొత్త మంత్రి మండలి ఏర్పాటైంది. మొత్తం 81 మంది మంత్రి పదవులకు అవకాశం ఉండగా ఏకంగా 71 మందిని తొలి విడతలోనే తీసుకున్న మోదీ 24 రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించినట్టయింది. అయితే, ప్రమాణ స్వీకారం జరిగిన అనేక గంటల తర్వాత సోమవారం రాత్రికి గాని మంత్రిత్వ శాఖల కేటాయింపు ప్రకటన వెలువడలేదు. ఏకపక్ష నిర్ణయాలు అలవాటైన ప్రభుత్వ పెద్దలు సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని పక్షాలకూ సంతృప్తి కలిగేలా వ్యవహరించడంలోని ఇబ్బందిని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్టుంది. ఆ మాటకొస్తే ప్రమాణ స్వీకారానికి ముందు, ఆ తరువాత కూడా సంకీర్ణ పక్షాలలో కొన్ని బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఒక మంత్రి పదవి... అదీ సహాయ మంత్రి పదవే ఇవ్వడం, అందులోనూ గతంలో క్యాబినెట్ హోదాలో పనిచేసిన ప్రఫుల్ పటేల్‌కు ఆ స్థాయి తక్కువ పదవి ఇవ్వడం పట్ల అజిత్ పవార్ సారథ్యంలోని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఆదివారమే అభ్యంతరం చెప్పింది. మంత్రి పదవిని తిరస్కరించింది. గెలిచిన అనురాగ్ ఠాకూర్ నుంచి, ఓడిపోయిన స్మృతీ ఇరానీ దాకా పలు పాత ముఖాలకు కొత్త సర్కారులో మోదీ మొండిచేయి చూపారు. అదే సమయంలో 33 మందిని మొదటిసారి మంత్రుల్ని చేశారు. ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికీ మంత్రులుగా బెర్తులిచ్చారు. ఆ లెక్కలెలా ఉన్నా, సోమవారం సాయంత్రం తొలిసారిగా కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగే లోగా... సంకీర్ణ సర్కారు నుంచి మరిన్ని గొంతులు పైకి లేచాయి. ఏడుగురు ఎంపీలున్న తమ కన్నా తక్కువ సంఖ్యాబలం గల పార్టీలకు క్యాబినెట్ హోదా మంత్రి పదవిచ్చి, తమకు మాత్రం స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రి పదవితోనే సరిపుచ్చారంటూ ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన అసమ్మతి వ్యక్తం చేసింది. సొంత గూటిలోనూ బీజేపీకి సణుగుళ్ళు తప్పట్లేదు. కేరళలో తొలిసారిగా ఖాతా తెరిచిన కమలం పార్టీ త్రిస్సూర్ నుంచి గెలిచిన సినీ నటుడు సురేశ్ గోపికి మంత్రిమండలిలో స్థానం కల్పించింది. అయితే, సహాయ మంత్రి హోదా ఇచ్చినందుకు కినిసి ఆయన పక్కకు తప్పుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలు రావడం, రచ్చ రేగేసరికి ఆఖరుకు ట్విట్టర్లో అలాంటిదేమీ లేదని ఖండించడం చకచకా జరిగాయి. వీటిని బట్టి సంకీర్ణ సర్కార్ నడపడంలోని సవాళ్ళు మోదీకి ఆదిలోనే అర్థమై ఉండాలి. మరోపక్క మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీ అక్కడ మళ్ళీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ క్యాబినెట్లో ప్రాతినిధ్యమూ కమలనాథుల ‘మిషన్ సౌత్’ వ్యూహంలో భాగమే. ఇక, వివిధ రాష్ట్రాలకు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆరుగురు ఇప్పుడు మోదీ క్యాబినెట్లో ఉన్నారు. స్వయంగా మోదీని సైతం కలుపుకొంటే ఆ సంఖ్య ఏడుకు చేరుతుంది. అంటే పాలనలో అనుభవానికి కొరత లేదు. కాకపోతే, వ్యక్తిగతంగా అధికారంలో శిఖరాలను చూసినవారు కలసికట్టుగా ముందడుగు వేయడంలో అహంభావాలకు తావు లేకుండా చూసుకోగలరా అని విశ్లేషకుల అనుమానం. అయితే, రక్షణ, ఆర్థిక, హోమ్, విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలను గత ప్రభుత్వంలోని మంత్రులకే కట్టబెట్టారు. ఇది కొత్త సీసాలో పాత సారాగా తోచినా, విధానాల కొనసాగింపు, సుస్థిరత్వానికి పెద్దపీట వేశారనుకోవాలి. వెరసి మోదీ ప్రజల కొత్త తీర్పుతో ఇప్పుడు కొత్త పిచ్ మీద ఆట మొదలుపెట్టారు. ఒకప్పటి వాజ్‌పేయి సంకీర్ణ సర్కార్లా సక్సెస్ కావాలంటే సహనం, సహానుభూతి పెంచుకోక తప్పదు. సంకీర్ణ సర్కారుకు తోడు బలమైన ప్రతిపక్షమూ ఉన్నందున పించ్ హిట్టింగ్‌కు అవకాశం లేదు. తిరుగులేని మెజారిటీ ఉన్న గతంలోలా ఇప్పుడు ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పెద్ద నోట్ల రద్దు, దేశవ్యాప్త లాక్డౌన్ లాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయలేరు. వివాదాస్పదమైన ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి లాంటి సొంత అజెండాను కాషాయధ్వజులు కొన్నాళ్ళు పక్కనపెట్టక తప్పదు. ఆటలో దూకుడుకు అవకాశం లేనప్పుడు అవుటవకుండా ఆత్మరక్షణ ధోరణిలో ఆడక తప్పదు. పదేళ్ళుగా ప్రాంతీయ పార్టీలను సామ దాన భేద దండోపాయాలతో ఆడిస్తున్న పెద్దలకు కచ్చితంగా ఈ సంకీర్ణపు ఆట సరికొత్తదే! అలాగే పెరిగిన బలంతో ఊపిరి పీల్చుకున్న ప్రతిపక్షం సైతం 18వ లోక్‌సభలో కూటమిగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే ప్రజలకు మేలు. -
అత్యున్నత ఐదువేలు
దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక పదకొండు వేల మంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? పోనీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల నుంచి, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల నుంచి కలిపి వేయిమంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? లెక్క తరువాత మాట్లాడుదాం.‘సినిమా రంగంలో రచయితకు అత్యంత తక్కువగా డబ్బు ఇవ్వాలని నిర్మాతకు ఎందుకనిపిస్తుందంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు కనుక’ అని రచయిత సౌదా అంటాడు. నిజమే. మేకప్ వేసేవాడు పెద్ద కిట్ తెస్తాడు. విగ్గులకు డబ్బు అడుగుతాడు. కాస్ట్యూమ్ డిజైనర్ బోలెడన్ని బట్టలు కొనాలి కనుక బిల్లు ఎక్కువ. సినిమాటోగ్రాఫర్ కెమెరాలు, లెన్సులు, క్రేన్లు, భారీ పరికరాలు... ఇన్ని వాడుతున్నాడంటే అతనికి ఎంతిచ్చినా తక్కువే. కళా దర్శకుడు వేసే సెట్ కనిపిస్తుంది.మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వాద్యాల బృందం కనిపిస్తుంది. మరి రచయిత దగ్గరో? ఒక తెల్లకాగితం, పెన్ను. ఐదు రూపాయల పెన్ను జేబులో పెట్టుకుని వచ్చేవాడికి, కాగితం మీద అప్పటికప్పుడు రాసిచ్చి వెళ్లేవాడికి డబ్బు ఇవ్వడం అవసరమా అని నిర్మాతకేం ఖర్మ, ఎవరికైనా అనిపిస్తుంది. చిత్రమేమిటంటే సినిమా ‘సీన్ పేపర్’ నుంచే మొదలవుతుంది. దానిని రచయితే రాయాలి.తన దగ్గరకు వచ్చిన ఆసామీకి టీ ఇచ్చి, అతను తాగి కప్పు దించే లోపలే పాట రాసి ఇచ్చాడట ఆత్రేయ. ‘ఐదు నిమిషాల్లో రాశారు. దీనికింత డబ్బు ఇవ్వడం అవసరమా’ అన్నాడట ఆసామీ లాల్చీ జేబులో చేయి పెట్టి నసుగుతూ. ఆత్రేయ మొహమాటపడక డబ్బు అందుకుని ‘ఈ ఐదు నిమిషాల వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది నాయనా’ అన్నాడట. రచయిత చేతికి పని చెప్పే మెదడు ఉందే, అది రాతకు తయారుగా ఉందే, ఆ మెదడు అలా తయారు కావడానికి రచయిత ఏమేమి చేసి ఉంటాడు? ఎన్ని రాత్రులను పుస్తకాలు చదువుతూ తగలెట్టి ఉంటాడు? ఎన్ని తావుల్లో తిరుగుతూ మనుషుల్లో పాత్రలను వెతుకుతూ వారి చెమట, కన్నీరు, రక్తపు చారికలు పూసుకుని ఉంటాడు? వారి సద్బుద్ధుల చందనంలో, దుర్బుద్ధుల దుర్గంధంలో వారే తానై బతికి ఉంటాడు? ఆ రాత్రి ఉదయించిన సంపూర్ణ చంద్రుడి రంగును సరైన మాటల్లో వర్ణించడానికి ఎన్ని గుప్పుల పొగను తాగి ఊపిరిని నలుపు చేసుకుని ఉంటాడు? ఒక గొప్ప వాక్యం కోసం ఎన్ని వందల కాగితాలను చించి ఉంటాడు? ఒక కావ్యజన్మ కోసం ఎన్ని ఊహా పరిష్వంగాలలో పదేపదే సొమ్మసిల్లి ఉంటాడు?లాల్చీ, పైజామా, జేబులో పెన్నుతో అతడు ఎదురు పడినప్పుడు– అవశ్యం– అతని మేధాశ్రమ ఏదీ కనిపించదు. కనుక కలం పట్టి అతను రాసే రాతకు అత్యల్ప రుసుము ఇవ్వవచ్చనే ఆనవాయితీ ఎవరైనా పాటించవచ్చు. కథకు, కవితకు 500 రూపాయల పారితోషికం ఇవ్వొచ్చు. ఇవ్వక ఎగ్గొట్ట వచ్చు. పదుగురిని అడిగో, పి.ఎఫ్ బద్దలు కొట్టో పుస్తకం వేస్తే అమ్మిన ప్రతుల సొమ్ము అమ్మకందారు ఇవ్వొచ్చు. ఇవ్వక పోవచ్చు. పబ్లిషర్లు ఎవరైనా ఉంటే వారు రాయల్టీ ఇవ్వొచ్చు. ఇవ్వకపోనూవచ్చు. ఒకసారి రచయిత పుస్తకం వేశాక వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితరాలలో ఉండే సాహితీ సూక్ష్మక్రిములు అది తమ సొంతంగా భావించి వందలాది పి.డి.ఎఫ్‌లు పంచొచ్చు... పుస్తకం కొనకనే చదువుకోవచ్చు.ఇవన్నీ ఇలాగుంటే తెలుగునాట సాహితీకారులను ప్రోత్సహించడానికి ‘ఐదు వేలు’ అనే అచ్చొచ్చిన నంబర్ ఒకటి ఉంది. పాతిక, ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘ఐదు వేల రూపాయల’ అవార్డు/బహుమతి తెలుగు సాహితీజాతికి లక్ష్మణరేఖ. నేటికీ, 2024లో కూడా, ‘చార్జీలతో కలిపి 5000 రూపాయల’ అవార్డు ప్రకటిస్తే అదే పదివేలనుకుని భార్యాపిల్లలను వెంటబెట్టుకువెళ్లే దుఃస్థితి తెలుగు రచయితది. తెలుగు నేలన ఎక్కడ పట్టినా నేటికీ ‘మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి వేయి రూపాయల’ దిక్కుమాలిన కథాపోటీలు. వాటికి రాసే సీనియర్ రచయితలు! సాహితీ అకాడెమీ పురస్కార గ్రహీతలు! వెయ్యి రూపాయల లిస్ట్‌లో వీరి పేర్లు! రూపాయి ఊసెత్తక తలపాగా, ముఖం తుడవను పనికిరాని శాలువాతో ఇచ్చే అవార్డులు కొల్ల. వీటికి తోడు 116 డాలర్లు మొహానకొట్టే ఎన్ .ఆర్.ఐ వితరణశీలత ఏమని చెప్పుట? ఇంటికి చెద పట్టిందని ఫోన్ చేస్తే ఐదు వేలకు తక్కువగా ఎవరూ రావడం లేదు. గంట కార్పెంటర్ పని చేస్తే రెండు వేలు నిలబెట్టి వసూలు చేస్తాడు. ప్లంబర్ వచ్చి వాష్‌బేసిన్ వైపు చూడాలంటే కనీస వెల వెయ్యి. కాని తెలుగు రచయిత మాత్రం తన దశాబ్దాల తపస్సుకు ‘బాబూ... ఒక్క ఐదు వేలు’ అంటున్నాడు. తెలుగు సాహితీవరణంలో నిషేధించాల్సిన ఒకే ఒక నంబర్– ఐదు వేలు!140 కోట్ల భారతీయులలో పదకొండు వేల మంది వంద రూపాయలు ఇస్తే పదకొండు లక్షలు అవుతాయి. అది మన జ్ఞానపీట్అ వార్డు నగదు బహుమతి! 9 కోట్ల తెలుగువారిలో వెయ్యి మంది వంద రూపాయలు ఇస్తే లక్ష అవుతుంది. అది సాహిత్య అకాడెమీ నగదు బహుమతి. జీవితంలో ఒకసారి పొందే వీటి నగదులే ఇలా ఉంటే ఐదు వేల అవార్డుకు వంకలేల అంటారా? ఆ అత్యున్నత అంకెతో అత్యల్పంగా బతికేద్దాం! -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విలువల జాడేది?!
వేదికలపై గంభీరోపన్యాసాలు చేయడంలో, విలువల గురించి మాట్లాడటంలో మన నాయకులకు ఎవరూ సాటిరారు. ఆ ఉపన్యాసాలకూ, ఆచరణకూ పెద్దగా పొంతనవుండదు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఈ సంగతిని మరోసారి ధ్రువీకరించాయి. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం ప్రాతిపదికనే తీసుకుంటామని మోదీ ప్రకటించారు. మంచిదే. గత అయిదేళ్ల పాలనలో ఏకాభిప్రాయం జాడ ఎక్కడా కనబడకపోగా చాలా నిర్ణయాలు విపక్షాన్ని సభనుంచి గెంటేశాక మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఆ నిర్ణయాలపై తీవ్ర విమర్శలూ వచ్చాయి. ప్రతిఘటన కూడా ఎదురైంది. బహుశా అందువల్లే కావొచ్చు... 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా వచ్చిన మెజారిటీ ఈసారి మాయమైంది. మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని స్థితి ఏర్పడింది. రామమందిర నిర్మాణం లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపి, దానిమాటున మూడున్నర దశాబ్దాలుగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ... తీరా ఆలయ నిర్మాణం కొనసాగుతున్న దశలో కనీస మెజారిటీకి దూరంకావటం, యూపీలో సగంపైగా సీట్లు కోల్పోవటం కేవలం యాదృచ్ఛికమని మోదీ చెప్పగలరా? చివరకు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ కోల్పోవలసి వచ్చిందని ఆయనకు గుర్తుందో లేదో! అయోధ్య ప్రాంతంలోని 9 స్థానాల్లో 5, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలోని 12 స్థానాల్లో తొమ్మిదింటిని ఈసారి బీజేపీ చేజార్చుకుంది. బీజేపీ హిందుత్వ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాంతాలూ ఆయువుపట్టు. అంతేకాదు... వివిధ రాష్ట్రాల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో 50 శాతంపైగా వోట్లతో 224 స్థానాలు గెల్చుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 156కి పడిపోయింది. బీజేపీ 500 కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 30... వేయి కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 100 ఉన్నాయి. ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా అందులోని సమాజ్‌వాదీ పార్టీ దాదాపు అన్నిచోట్లా గణనీయంగా కోలుకుంది. తమ గెలుపును ఓటమిగా చిత్రిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఇప్పుడూ, గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకొచ్చిన మొత్తం సీట్ల సంఖ్యతో పోల్చినా ఈసారి తమకొచ్చిన స్థానాలు చాలా ఎక్కువని ఎద్దేవా చేయటం బాగానేవుంది. అయితే జరిగిందేమిటో లోతుగా విశ్లేషిస్తే సత్యం బోధపడుతుంది. మోదీ పైకేమి మాట్లాడినా నిరుపేదలూ, మధ్యతరగతి తమకు క్రమేపీ దూరం జరుగుతున్నారని బీజేపీకి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈసారి ఆ రెండు వర్గాలకూ కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. పార్లమెంటులో ఏ అంశంపైన అయినా చర్చ జరిగినప్పుడు ఉపన్యాస పోటీలుగా భావించి మాట్లాడటంకాక ఆరోగ్యకరమైన చర్చలకు చోటీయడం ఎంతో అవసరం. ఎన్డీఏ సహజసిద్ధమైన కూటమని, ఇందులో అధికార యావలేదని మోదీ చెప్పటం కూడా వింతగానే ఉంది. ఇప్పుడు ఎన్డీఏకు మద్దతుగా నిలిచిన నితీశ్, చంద్రబాబులిద్దరూ ఊగిసలాటకు పెట్టింది పేరు. నిలకడ తక్కువ, అవకాశవాద రాజకీయం ఎక్కువ. ఏ గట్టున బాగుంటుందనుకుంటే అటు దూకే బాపతు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో హఠాత్తుగా కాడి పారేసి విడిగా ఎందుకు పోటీ చేశారో, అంతకు సంవత్సరం ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎందుకు అంటకాగారో ఎవరైనా చెప్పగలరా? తరచు యూటర్న్లు తీసుకోవటంలో నితీశ్, చంద్రబాబులకు పోటీ పెడితే ఎవరు ప్రథమ స్థానం గెల్చుకుంటారో చెప్పటం కొంత కష్టమే. ఇలాంటివారిని పక్కనబెట్టుకుని ‘ఇది సహజసిద్ధమైన కూటమి, సుపరిపాలన కోసం కలిశాం’ అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తే నమ్మడానికి దేశ ప్రజలు తెలివితక్కువవారు కాదు. మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచడంమాట అలావుంచి 2014లోనే ‘మీరు పదిహేనేళ్లు అధికారంలో వుంటారని బాబు జోస్యం చెప్పార’ని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 2019లో వీరిద్దరూ ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు... ఇప్పుడెందుకు కలిసినట్టు? ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారంలో పెట్టి, చివరకు కేంద్రమే ప్రతిపాదించిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ప్రజానీకాన్ని పక్కదోవ పట్టించి బాబు లాభపడ్డారు. విలువలన్నిటినీ గాలికొదిలి ఏం చేసైనా అధికారంలోకి వచ్చితీరాలన్న పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత హీనంగా దుర్భాషలాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ తదితరులు ఏం మాట్లాడినా మౌనంగా ఉండిపోవటమో, ఆలస్యంగా స్పందించటమో చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలను అనుకరిస్తూ ఏపీలో ఏం జరిగినా, బాబు తదితరులు అవాకులూ చవాకులూ మాట్లాడినా ప్రధాన ఎన్నికల అధికారి ఉలుకూ పలుకూ లేకుండా నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారు. ఆఖరికి పోలైన వోట్లకన్నా గెలిచిన అభ్యర్థికి అధికంగా వోట్లు వచ్చిన ఉదంతాలు అక్కడక్కడ బయటపడ్డాయి. ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనే కాళ్లావేళ్లాపడి మరీ బాబు ఎన్డీఏలోకి లంఘించారు.వేదికలెక్కి విలువల గురించి గంభీరోపన్యాసాలు చేసేముందు మొన్న ఎన్నికల్లో తమ ప్రవర్తన ఎలావుందో, ఏం మాట్లాడామో చూసుకోవటం వారికే మంచిది. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగిన చందాన వేదికలెక్కి విన్యాసాలు చేస్తే జనం నవ్విపోతారని నరేంద్ర మోదీతోపాటు ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు తెలుసుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ ఉన్నన్నాళ్లూ ఏం చేశారో, ఎలా మెలిగారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. -
మెక్సికో పీఠంపై మహిళ!
అపారమైన వనరులున్నా ఏనాడూ కంటి నిండా కునుకు లేని మెక్సికో ప్రజానీకం అధ్యక్ష ఎన్నికల్లో వరసగా రెండోసారి సైతం వామపక్ష మొరెనా పార్టీకి పట్టంగట్టారు. ఆరుపదుల వయసుగల యూదు మహిళ క్లాడియా షీన్బామ్ను అధ్యక్ష పీఠానికి ఎన్నుకున్నారు. రెండు శతాబ్దాల రిపబ్లిక్ చరిత్రలో మహిళ దేశాధినేత కావటం ఇదే ప్రథమం. జనాభాలో యూదులు అత్యల్ప సంఖ్యాకులు కావటం గమనించదగ్గది. వచ్చే అక్టోబర్‌లో ఆమె పదవీబాధ్యతలు చేపడతారు. ఆకలి,నిరుద్యోగం, డ్రగ్స్ విజృంభణ, వ్యక్తుల అదృశ్యం... ఒకటి కాదు, మెక్సికోను సవాలక్ష సమస్యలు పీడిస్తున్నాయి. అంతటా నిరాశా నిస్పృహలు అలుముకున్న తరుణంలో అంతవరకూవున్న రెండు పార్టీల వ్యవస్థను బద్దలుకొడుతూ మొరెనా పార్టీ రంగంలోకొచ్చింది. 2018లో ఆరేళ్లకాలానికి అధ్యక్షుడైన ఆండ్రస్ మ్యాన్యువల్ లొపెజ్ అబ్రడార్ (ఆమ్లో) ఆశించిన స్థాయిలో పాలించకపోయినా శాంతిభద్రతలను కాస్త అదుపు చేయగలిగారు. అదే సమయంలో సంక్షేమపథకాలు అందించటం, మౌలిక సదుపాయాలు పెంచటం మొరెనా పార్టీని రెండోసారి అందలం ఎక్కించింది. అలాగని అంతా సవ్యంగా ఉందని కాదు. ఏడాదికి సగటున 30,000 హత్యలు జరగటం, అందులో 90 శాతం మిస్టరీగా మిగిలిపోవటం మెక్సికో ప్రత్యేకత. ఈ హత్యల్లో డ్రగ్స్ మాఫియాల వాటాతోపాటు, వాటిని అదుపు చేసే సాకుతో పారా మిలిటరీ దళాలు సాగించే నరమేధమూ ఉంటుంది. మారుమూల పల్లెల్లో ఏదో ఒకచోట హఠాత్తుగా ఖననం చేసిన శవాల గుట్టలు లేదా మాదకద్రవ్యాల డంప్‌లు బయటపడతాయి. అమెరికాకు చాటుగా వలసదారుల తరలింపు మరో పెద్ద వ్యాపారం. మూడునెలలక్రితం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండ ప్రాంత ఆవాసాలపై మాదకద్రవ్య ముఠాలు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించి వందలాది పౌరులను హతమార్చటంతోపాటు ఇళ్లను దహనం చేశారు. గ్రామస్థులు తమ సమాచారం పారా మిలిటరీ దళాలకు చేరేస్తున్నారన్నది వారి అనుమానం. ఈ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా దాదాపు డజనుమంది అభ్యర్థుల్ని మాదకద్రవ్యాల ముఠా కాల్చిచంపింది. ఇన్ని సమస్యలతో సతమతమయ్యే దేశానికి అధ్యక్షురాలు కావటం నిజానికి కత్తి మీద సామే. చిత్రమేమంటే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె శాంతిభద్రతల అదుపు కోసం ఏం చేస్తానన్నది చెప్పలేదు. కానీ మెక్సికో నగర మేయర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు అక్కరకొస్తుందన్న ఆశ జనానికి ఉంది. నగరాన్ని సీసీ కెమెరాలతో నింపడం, నేరాలు తరచూ జరిగే ప్రాంతాల్లో నిరంతరం పోలీసు బలగాలను మోహరించటం వంటివి హత్యలను గణనీయంగా తగ్గించాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య వాస్తవాలను ప్రతిబింబించటం లేదన్నది విపక్షాల ఆరోపణ. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన 1968 నాటి విద్యార్థి ఉద్యమంతో సహా అనేక సామాజికోద్యమాల్లో పాల్గొన్న యూదు కుటుంబంలో జన్మించటం వల్ల అటు రాజకీయాలపైనా, ఇటు పర్యావరణంపైనా ఆమెకు ఆది నుంచీ ఆసక్తి. అందుకే ఆ రంగంలో ఆమె పీహెచ్డీ చేయటంతోపాటు క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో తన అధ్యయనాన్ని కొనసాగించి నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2007లో నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్న శాస్త్రవేత్తల బృందంలో క్లాడియా ఒకరు. 2018లో తెరపైకొచ్చిన మొరెనా పార్టీ ఆమెను సహజంగానే ఆకర్షించింది. వెంటనే మెక్సికో మేయర్ పదవి కూడా వరించింది. ఆ పదవికి మహిళ ఎన్నిక కావటం కూడా అదే ప్రథమం. 31 రాష్ట్రాలూ, 13 కోట్ల జనాభాగల దేశంలో నేరాలను అరికట్టడం మెక్సికో నగరాన్ని దారికి తెచ్చినంత సులభం కాదు. చాలా రాష్ట్రాల్లో మాదకద్రవ్య ముఠాలు వాహన సముదాయాల్లో ఏకే–47 తుపాకులతో సంచరించటం, పోలీసులు సమాచారం అందుకుని వచ్చేలోపే హత్యాకాండ ముగించి నిష్క్రమించటం తరచు కనబడే దృశ్యాలు. తల్లిదండ్రుల ఆలనా పాలనాలేని పిల్లల్ని, యువతను చేరదీస్తామని వారిలో అమాయకంగా కనబడేవారికి ప్రాధాన్యమిచ్చి ఏళ్లతరబడి ఆయుధ శిక్షణ ఇచ్చి మాదకద్రవ్యాల పంపిణీకీ హత్యలకూ వినియోగిస్తామని మాదకద్రవ్య ముఠా నాయకుడొకరు చెప్పాడు. ఆ కోణంలో దృష్టి సారించి పాఠశాల విద్య నుంచే స్కాలర్షిప్లిచ్చే పథకాన్ని ఆమ్లో అమలుచేశారు. కానీ పెద్దగా ఫలించలేదు. ఇవన్నీ అంతర్గత సమస్యలు. పొరుగునున్న అమెరికాతో అనేక పేచీలున్నాయి. ఆ దేశంలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారన్న కథనాలు మెక్సికోకు ఇబ్బందిగానే ఉన్నాయి. ఆ దేశంనుంచి వలసలను అరికట్టడానికీ, మాదకద్రవ్యాలను కట్టడి చేయటానికీ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని గతంలో ట్రంప్ ప్రకటించి పని మొదలెట్టినా బైడెన్ వచ్చాక ఆగిపోయింది. మరోపక్క లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికాతో వాణిజ్యం నెరపే దేశాల్లో మెక్సికోయే నంబర్ వన్. అందువల్ల ఆ దేశాన్ని అంత సులభంగా అమెరికా వదులుకోలేదు. పైగా మెక్సికో పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే కార్ల విడిభాగాల వల్లే అమెరికాలోని డెట్రాయిట్లో కార్ల పరిశ్రమలు సజావుగా సాగుతున్నాయి. మెక్సికో పవన విద్యుత్‌తోనే అమెరికా తయారీరంగ పరిశ్రమలు లక్షలమంది అమెరికన్లకు ఉపాధినిస్తున్నాయి. హృద్రోగులకు వాడే పేస్మేకర్లు మొదలుకొని పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల వరకూ చాలా భాగం మెక్సికో నుంచి రావాల్సిందే. అందుకే ఇరుదేశాల వాణిజ్యమూ నిరుడు 80 వేల కోట్ల డాలర్ల వరకూ సాగింది. కనుక నేరస్థముఠాలను అరికట్టి శాంతిభద్రతలు తీసుకురాగలిగితే మెక్సికో సుసంపన్న దేశాల్లో ఒకటై నిలుస్తుంది. క్లాడియా ఆ పని చేయగలరా అన్నదే పెద్ద ప్రశ్న. -
సమస్యలపై ‘సమష్టి’ దృష్టి
అక్కున చేర్చుకున్నవారిని మెచ్చుకోవటం, అయిష్టత చూపినవారికి దూరం జరగటం సర్వసాధారణం. ప్రధాని మోదీ కూడా దానికి భిన్నంగా ఉండలేకపోయారు గనుకే మంగళవారం నాటి తన విజయోత్సవ ప్రసంగ ప్రారంభంలో ఎప్పటిలా ‘జైశ్రీరాం’ అనడానికి బదులు ‘జై జగన్నాథ్’ అనివుండొచ్చు. ఆశించిన సీట్లు ఇవ్వని ఉత్తరప్రదేశ్ ప్రస్తావన కన్నా ఆదరాభిమానాలు చూపి ఏకంగా 21 ఎంపీ స్థానాల్లో 20 కట్టబెట్టడంతో పాటు రాష్ట్ర పాలనాపగ్గాలను సైతం అందించిన ఒడిశా ప్రధానికి స్ఫురించటంలో వింతేముంది? ఈ ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అందువల్ల పదేళ్లనాడే 282 స్థానాలు, అటుపై 303 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి 240తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇది సాధారణ మెజారిటీ కన్నా 32 తక్కువ. ఎన్డీఏ కూటమిగా ఇప్పటికీ 292 స్థానాలున్నా నితీశ్ కుమార్, చంద్రబాబు వంటి ఊగిసలాట మనస్తత్వం గల భాగస్వాములున్న చోట ఏదైనా జరగొచ్చన్న భయాందోళనలు బీజేపీకి ఉండటం సహజమే. అందులోనూ నితీశ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకొచ్చినా ఆశ్చర్యం లేదు. బాబు చరిత్ర గమనిస్తే ఆయన హోదా కోసం పట్టుబట్టే అవకాశం అంతంత మాత్రమే. మొత్తానికి ‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’ అన్న నినాదాన్ని సవరించుకుని ‘అబ్ కీ బార్ కూటమి సర్కార్’ అనక తప్పట్లేదు. సంప్రదాయానికి భిన్నంగా తక్కువ స్థానాలిచ్చిన ఉత్తరాదితో పోలిస్తే... సగానికిపైగా స్థానాలిచ్చిన తూర్పు జోన్, ఆశించినదానికి మించి ఇచ్చిన దక్షిణాది బీజేపీకి భుజాలు కాశాయి. పశ్చిమ జోన్‌లోని మహారాష్ట్రలో ఫిరాయింపులను ప్రోత్సహించి రెండు ప్రధాన పార్టీల్లో చీలిక తెచ్చిన పర్యవసానంగా ఎన్డీఏ దెబ్బతింది. సగం స్థానాలు కూడా సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇది బీజేపీని వణికిస్తోంది. మహారాష్ట్రలో 2019లో శివసేనతో పొత్తు పెట్టుకుని అక్కడున్న 48 స్థానాల్లో బీజేపీ సొంతంగా 23, కూటమిగా 41 గెల్చుకుంది. ఈసారి 28 చోట్ల పోటీచేస్తే అందులో సగం కూడా దక్కలేదు. బీజేపీ 9తో సరిపెట్టుకోగా... దాని మిత్రపక్షాల్లో ఒకటైన శివసేన (షిందే) వర్గం పోటీచేసిన 15లో ఆరు, ఎన్సీపీ(అజిత్) పోటీచేసిన అయిదింటిలో రెండు గెల్చుకున్నాయి. ఈసారి కనీసం 45 రాబట్టాలన్న ఆశ కొట్టుకుపోయింది. ఈ జోన్‌లోని గుజరాత్లో ఎన్డీఏకు 25 లభించినా చాన్నాళ్ల తర్వాత ఒకస్థానం విపక్షాలకు దక్కటం అది జీర్ణించుకోలేని అంశం. ఇక రాజస్తాన్లోవున్న మొత్తం 25 స్థానాలూ గతంలో ఎన్డీఏ గెల్చుకోగా ఈసారి 14తో సరిపెట్టుకుంది. ఇండియాకు 11 దక్కాయి. పశ్చిమజోన్లో మొత్తం 103 స్థానాలుంటే ఎన్డీయేకు 59, ఇండియాకి 42 వచ్చాయి. ఉత్తరాదిన ఏడు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ–కశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్, లద్దాఖ్లున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తంగా 195 స్థానాలుండగా ఎన్డీయేకు 117 దక్కాయి. అంకె ఘనంగానే కనబడుతున్నా ఇండియా కూటమి 71 స్థానాలు ఎగరేసుకుపోవటం అసాధారణం. ఇక్కడి యూపీ, పంజాబ్, హరియాణా, బిహార్, మధ్యప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ఇండియా కూటమి పక్షాలకు పెద్దగా రాకపోవచ్చని బీజేపీ అంచనా వేసుకుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో 2019లో 62 గెల్చుకున్న ఎన్డీఏకు ఈసారి కేవలం 36 వస్తే, విపక్ష కూటమి 43 గెల్చుకుంది. పైగా ఆ కూటమిలోని సమాజ్‌వాదీ 33 సాధించి బలం పుంజుకుంది. ఇక బిహార్‌లో 40 స్థానాలకూ ఎన్డీయే 30 గెల్చుకుంది. తొమ్మిది విపక్ష కూటమికి వచ్చాయి. కానీ రైతు ఉద్యమ ప్రభావంగల హరియాణాలోని 10 స్థానాల్లో అయిదు స్థానాలే లభించాయి. ఇండియా కూటమికి మరో అయిదు వచ్చాయి. పంజాబ్‌లోని 13 స్థానాల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్కటి రాలేదు. ఇండియా కూటమికి 10 లభించాయి. గతంలోని వోటింగ్ శాతం గల్లంతైనా ఢిల్లీ మాత్రం మాట దక్కించింది. అక్కడి ఏడు స్థానాలూ బీజేపీ ఖాతాలో పడ్డాయి. కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం ఏమాత్రం లేదు. మధ్యప్రదేశ్ (29), హిమాచల్ (4), ఉత్తరాఖండ్ (5) గంపగుత్తగా ఎన్డీఏ వైపే మొగ్గాయి. ఇక దక్షిణాదిలో నిరుడు ఎన్నికల్లో అసెంబ్లీని చేజార్చుకున్న కర్ణాటకలో ఎన్డీఏకు 19 సీట్లు రావటం, ‘ఇండియా’ కేవలం 9కి పరిమితం కావటం బీజేపీకి ఊరటనిచ్చింది. అలాగే ఏపీలో ఎన్డీఏకు 21, తెలంగాణలో 8, కేరళలో ఒకటి లభించటం అంచనాకు మించినవే. దక్షిణాదిన గల 131 స్థానాల్లో ‘ఇండియా’ కూటమికి లభించిన 77తో పోలిస్తే ఎన్డీయేకు వచ్చిన 49 తక్కువే కావొచ్చుగానీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఎక్కువ. 114 స్థానాలున్న తూర్పు జోన్లో ఎన్డీయేకు 67 లభించాయి. ఇందులో ఒడిశా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. 24 ఏళ్లపాటు ఆ రాష్ట్రాన్ని పాలించి సిల్వర్ జూబ్లీలోకి అడుగుపెడదామనుకున్న బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను నిరోధించి అధికారం దక్కించుకోవటంతోపాటు ఒకటి మినహా ఎంపీ స్థానాలన్నీ బీజేపీ గెల్చుకుంది. ఇదే జోన్‌లోని బెంగాల్ కేవలం 12 ఎంపీ స్థానాలకే బీజేపీని పరిమితం చేయటం గమనించదగ్గది. మొత్తానికి ఉత్తరాదిలో భావోద్వేగాల కన్నా నిరుద్యోగం, అధిక ధరలు, పడిపోయిన జీవనప్రమాణాలు వగైరా అంశాలు చర్చలోకొచ్చాయి. వోటింగ్‌లోనూ వాటి ప్రభావం కనబడింది. ఇది మెచ్చదగ్గ విషయం. వచ్చే ఏడాది రాబోయే 16 ఫైనాన్స్ కమిషన్ నివేదిక, ఆ మరుసటేడు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, ఫెడరల్ వ్యవస్థపై సాగే చర్చ కీలకమైనవి. ఈ అంశాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలకు బదులు అందరినీ సంప్రదించక తప్పని స్థితి ఏర్పడటం హర్షించదగింది. దేశ ప్రజానీకం ప్రదర్శించిన విజ్ఞతనూ, దానివెనకున్న స్ఫూర్తినీ రాజకీయ పక్షాలన్నీ గ్రహిస్తే జటిల సమస్యల పరిష్కారం కష్టం కాదు. -
దక్షిణాదిన ‘కమల’ హాసం!
కేంద్రంలో వరసగా పదేళ్లు పాలించి మూడోసారి 400 సీట్లతో ఘనమైన హ్యాట్రిక్ నమోదు చేసుకోవాలనుకున్న ఎన్డీఏను ఉత్తరాదిన నిలువరించటంలో, దాన్ని 300 లోపు మెజారిటీకి పరిమితం చేయటంలో ‘ఇండియా’ కూటమి విజయం సాధించిందని సోమవారం వెల్లడవుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. ‘జనం మా వైపే మొగ్గు చూపారు. మూడోసారి కూడా పాలించమని ఆశీర్వదించారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా జరిగిందేమిటో కనబడుతూనేవుంది. పూర్తి ఫలితాలు వెల్లడికావటానికి ఇంకా సమయంవున్నా దేశానికి ‘కొత్త రోల్ మోడల్’గా బీజేపీ చూపించదల్చుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ సగం సీట్లపైగా కోల్పోవటం ఖాయమని అర్థమవుతోంది. రామమందిరం నిర్మాణమవుతున్న అయోధ్య... ఫైజాబాద్ ఎంపీ స్థానం పరిధిలోనిదే. అక్కడా, ఇతరచోట్లా బీజేపీకి ఎదురుగాలి వీచటం చిన్నవిషయం కాదు. అయితే ఉత్తరాదిలో ఎన్డీఏకు జరిగిన ఈ నష్టాన్ని భర్తీ చేయటానికి దక్షిణాది సిద్ధపడిందని, తూర్పున ఒడిశా కూడా ముందుకొచ్చిందని ఫలితాలు సూచిస్తున్నాయి. తమిళనాడు ఇందుకు మినహాయింపు. ఆఖరికి ఎప్పుడూ బీజేపీ ఉనికి కనబడని కేరళలో ఆ పార్టీకి ఒక స్థానం రావడం సామాన్యం కాదు. బెంగాల్ మాత్రం బీజేపీని కోలుకోలేని దెబ్బతీసింది. ఉత్తరాదిన మతతత్వ రాజకీయాలపై మబ్బులు విడిపోతున్న వేళ దక్షిణాది ఆ ప్రభావానికి లోనుకావటం ఏపీలో టీడీపీకి కలిసొచ్చివుండొచ్చని కొందరు చేస్తున్న విశ్లేషణ నిజమే కావొచ్చు. ఎందుకంటే కార్గిల్ ఘర్షణల అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో మెరుగ్గా స్థానాలు వచ్చాక ఎన్డీఏకు ఈ స్థాయిలో ఆదరణ లభించటం ఇదే మొదటిసారి. కర్ణాటక బీజేపీ కొమ్ముకాయడంలో వింతేమీ లేదు. అది బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతం. గత లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీదే అక్కడ ఆధిక్యత. తెలంగాణలో సైతం ఈసారి దాదాపు సగం స్థానాలతో బీజేపీ జెండా ఎగరటం, ఆ పార్టీ అభ్యర్థులకు మంచి మెజారిటీలు నమోదుకావటం విశేషం. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘ఆరు గ్యారెంటీల’ పేరిట ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అధికారంలోవున్న కాంగ్రెస్ సతమతమవుతోంది. బీజేపీ బలం పుంజుకోవటానికి అది తోడ్పడింది.కానీ వెనకా ముందూ చూడకుండా ఈ వాగ్దానాలనే కాపీకొట్టి జనం ముందుకొచ్చిన తెలుగుదేశానికి ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణ లభించింది. అయిదేళ్లక్రితం ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం పైగా నెరవేర్చి, ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అని చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని ఎన్‌డీఏవైపు జనం మొగ్గుచూపటం వెనక బీజేపీతోపాటు రకరకాల ప్రభావాలు స్పష్టంగానే కనబడుతున్నాయి. చంద్రబాబు విశ్వసనీయత కలిగిన నాయకుడు కాదు. ఆ సంగతిని ఆయన 2014–19 మధ్య పాలించినప్పుడు సైతం నిరూపించుకున్నారు. చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేక ఏకంగా మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్నుంచి మాయం చేసిన ఘనుడాయన. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండబోదు. మేనిఫెస్టో ఆవిష్కరణ రోజున దానిపై ప్రధాని ఛాయాచిత్రం ఉండరాదని బీజేపీ పట్టుబట్టడం, అందుకు అంగీకరించినా దాన్ని చేతితో తాకేందుకు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు సిద్ధపడని వైనం తాజా వాగ్దానాలకు ఏ గతి పడుతుందో తేటతెల్లం చేశాయి. ఆ సంగతలావుంచి ఎన్నికల ప్రచారపర్వంలోగానీ, అంతకుముందుగానీ ఏమాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కనబడనిచోట అధికారపక్షం ఇంత దారుణంగా ఓడిపోవటం వెనక ఈవీఎంల పాత్ర ఉండొచ్చని కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలూ... చాలాచోట్ల వోటింగ్ శాతం అసాధారణంగా పెరగటంలో మతలబుందని పోలింగ్ రోజున మరికొందరు శంకించటం పూర్తిగా కొట్టిపారేయదగినవి కాకపోవచ్చు. సాధారణంగా ఓడిన పక్షం ఈవీఎంలపై నెపం వేయటం గతంలో చాలాసార్లు జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అకాలీదళ్‌లు భిన్న సందర్భాల్లో ఆ పనే చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఇంతవరకూ ఆ మాటనలేదు. కానీ ఆ పార్టీ నేతల స్వరంలో అది అంతర్లీనంగా కనబడుతూనేవుంది. అమెరికాతోసహా సాంకేతికంగా అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తి బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న తరుణంలో మన దేశంలో మాత్రమే ఇది ఎందుకు కొనసాగాలని చాలామంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎలాగోలా గెలవటం తప్ప నైతిక విలువల గురించి అసలు పట్టింపేలేని బాబు చడీచప్పుడూ లేకుండా వోటింగ్ శాతం పెరగటానికీ, ఈవీఎంలను తనకనుకూలంగా మలుచుకోవటానికీ లోపాయకారీగా ఏమైనా చేసివుంటారన్న సంశయాలు ఇందుకే వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే భూ యజమానులకు తొలిసారిగా హక్కులివ్వటానికి సంకల్పించిన భూహక్కు చట్టం వంటి అత్యుత్తమ చట్టంపై బురదచల్లి, తప్పుడు ప్రచారం నడిపి ప్రజలను భయభ్రాంతుల్ని చేయటంలో బాబు విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. సత్యం మాత్రమే జయిస్తుందన్నది కూడా వాస్తవమే. కానీ గెలిచేదంతా సత్యం కాదు. నిలకడపై అన్ని నిజాలూ వెల్లడవుతాయి. ఎన్నికల నిర్వహణ తీరు అందరిలోనూ అనుమానాలు రేకెత్తించింది. ఏపీ ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. పక్కనున్న తెలంగాణలో వివాదరహితంగా ఎన్నికలు జరగ్గా ఏపీలో బాబు, పవన్‌లు దుర్భాషలతో చెలరేగిపోయారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం చేసిందేమీ లేదు సరిగదా...టీడీపీ అడిగిన తడవే అన్నీ నెరవేర్చింది. పర్యవసానంగా తటస్థతకు తూట్లుపడ్డాయి. మొత్తానికి ఆరు వారాలపాటు పెళ్లివారి నడకను తలపిస్తూ సాగిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా పాలనను స్తంభింపజేసింది. -
సంబరాలు... సవాళ్ళు...
దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోని బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్న వేళ ఓట్ల లెక్కింపుతో అసలైన ఫలితాలు ఇవాళ రానున్నాయి. అయితే, ఎన్నికలు ముగింపు దశలో ఉండగానే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గత శుక్రవారం వెలువరించిన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి. జీడీపీ వృద్ధి దాదాపు 7.8 శాతం ఉండవచ్చని తొలుత అందరూ భావించినా, వాస్తవంలో అది 8.2 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది (2022–23) సాధించిన 7 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. పైగా, వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం, అంతకు మించి పెరిగిందన్న మాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని నిపుణుల మాట. ఇది విశేషమే... కాదనలేం. కానీ, ఈ ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? అలాగే, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాటేమిటి?నిజానికి, దేశ వాస్తవిక జీడీపీ ఇటు అధికారిక, అటు ప్రైవేట్ అంచనాలన్నిటినీ అధిగమించి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత, అందులోనూ ప్రపంచమంతా నత్తనడక నడుస్తున్నప్పుడు వృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే, అనేక ఆటుపోట్లను భారతీయ గృహవ్యవస్థ, వ్యాపారాలు తట్టుకొని దృఢంగా నిలబడడమే కారణం. అలాగే, ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని కూడా గడచిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ అనుకున్న దాని కన్నా మెరుగైన వృద్ధిని సాధించినట్టు విశ్లేషణ. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధుల లాంటివి కొంత సౌకర్యాన్నిచ్చే అంశాలు. అక్కడ నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలన్నది కీలకమైన అంశం. గమనిస్తే... ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఏడేళ్ళ పాటు నిదానంగా సాగింది. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్‌వర్క్స్, రక్షణ ఉత్పత్తులపై ఏటా రూ. 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో నూటికి 80 మంది ఉండే నైపుణ్య రహిత కార్మికుల సగటు రోజు వారీ కూలీ సైతం అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి. మహిళా శ్రామికుల కూలీలైతే మరీ కనాకష్టం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే... మన దేశ తలసరి ఆదాయం, మరో మాటలో నికర జాతీయ ఆదాయం 2014–15లో రూ.72,805 ఉండేది. అది కేవలం 3.83 శాతం వార్షిక చక్రవృద్ధి రేటుతో 2022–23లో రూ.98,374కు చేరింది. వాస్తవిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈ వృద్ధి రేటు అసలైతే ఇంకా తక్కువే ఉంటుంది. అది అటుంచితే – విద్య, ఆరోగ్యం, ప్రజారవాణా, కాలుష్యం వగైరా అంశాల్లో సగటు జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. సరికదా ఇంకా దిగజారాయి. అదే విషాదం. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి తగిన అంశాలు కొన్నే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే, మనం మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ, ఇప్పటికీ మనం అడుగునే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్య్రం నుంచి బయటపడేయడానికి చాలదు. నాణ్యమైన జీవన ప్రమాణాలకూ సరిపోదు. 2029 నాటికి గానీ మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూ గినియా, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి, కొత్త ప్రభుత్వానికి తన ముందున్న సవాలేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారత జనాభాలో ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వారి కష్టనష్టాలు, జీవన పరిస్థితులు స్టాక్ మార్కెట్ల విజృంభణను చూసి చప్పట్లు కొట్టే వర్గాలకు పెద్దగా తెలియవు. తాజా ఎన్నికల దయతో నిరుద్యోగం, ఆర్థిక అసమతౌల్యం, ద్రవ్యోల్బణం లాంటివి మళ్ళీ కనీసం చర్చకైనా వచ్చాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లోని దురవస్థల’ ప్రస్తావన జరిగింది. అందుకే, గడచిన నాలుగు త్రైమాసికాలను కలిపి తీసిన ఆఖరి లెక్కలు పైకి సంతోషం రేపుతున్నా, క్షేత్రస్థాయిలోని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కష్టమే. ఇప్పటి లెక్కలతో తృప్తిపడి, ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్ళను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి, వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలి. అందుకు తగ్గ సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ఏటికేడు ఈ వృద్ధి అంకెలు స్థిరపడతాయి. సామాన్యుల జీవితాలు నిలబడతాయి. లేదంటే ‘వికసిత భారత్’ మాటల్లో, లెక్కల్లోనే మిగిలిపోతుంది. -
వాన జ్ఞానం
ప్రపంచమంతటా సృష్టిగాథలు ఒక్కలానే ఉంటాయి. ఆదిలో అంతా జలమయమే. ఎందుకనీ? వర్షాలు... క్షణం తెరిపివ్వని వర్షాలు... బ్రహ్మాండమంత కుండతో ఎత్తిపోసినట్టు నిరంతర ధారాపాతాలు... ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ పుట్టాయి. భూమి పైకి తేలింది. జీవి పుట్టింది. మనిషితో సహా రకరకాల రూపాల్లోకి పరిణామం చెందింది. వర్షం పడుతూనే ఉంది కానీ, నిర్విరామం నుంచి విరామానికి మారింది. చెప్పొచ్చేదేమిటంటే, వర్షం సృష్టి అంత ప్రాచీనం; ప్రకృతి అంత పురాతనం. మనిషి పుట్టిన చోటనే ఎప్పుడూ లేడు కనుక భ్రమణజీవి; అంతకన్నా ఎక్కువగా భ్రమలజీవి. తను ప్రకృతిలో భాగమన్న సంగతి మరచి; తన జీవితానికి, తన నిర్ణయాలకు తనే కర్తనన్న భ్రమ వాటిలో ఒకటి. శీతోష్ణాలను మించి ఆ భ్రమను పటాపంచలు చేయగలిగింది వర్షాలే. మనం బయటికి వెళ్లడానికి సిద్ధమవుతాం. ఆకాశం మబ్బు పట్టి ఉన్నా వర్షం రాదులే అన్న భ్రమతో గడప దాటుతాం. చినుకుతో మొదలై చూస్తుండగానే ఆకాశానికి చిల్లిపడిందా అన్నంత ఉధృతితో వర్షం ముంచెత్తుతుంది. చెట్టు కిందికో, చూరు కిందికో, మరో కప్పు కిందికో పరుగుతీస్తాం. వర్షనిర్బంధం నుంచి బయటపడడానికి నిలువుకాళ్ళ తపస్సు చేస్తాం. మనలానే, మనపక్కకి ఎవరెవరో అపరిచితులు వచ్చి చేరతారు. మాటలు కలుస్తాయి, ముచ్చట్లుగా మారతాయి, స్నేహాలను అల్లుకుంటాయి, ప్రేమలు మొలకెత్తుతాయి, అవి పెళ్లిళ్లకూ దారితీయవచ్చు. ఒక్కోసారి ఒకే ఒక్క వర్షం ఊహించని సన్నివేశాలను కల్పించి జీవితాలను పెద్దమలుపు తిప్పచ్చు. ప్రపంచ సాహిత్యంలో వర్షానుభవాన్ని చిత్రించని కథా, కావ్యం, నవలా దాదాపు ఉండవు. మనిషి బుద్ధిని బంకలా పట్టుకున్న మృగత్వం, కులమతాల భేదాలు, ధనిక, నిర్ధనిక తారతమ్యాలు, చదువు, అధికారంతో పుట్టే దుర్గర్వాలు సహా అన్ని రకాల మురికినీ, మకిలినీ కడిగి శుభ్రం చేసి మళ్ళీ మనిషిని చేయగల మంత్రజలం వర్షం. సమాజం గురించి మనుషుల గురించి నిశ్చితాభిప్రాయాల ఇరుకులో కరకుదేరిన అడ్వొకేట్ రావునూ, అతను చీదరించుకున్న బిచ్చగత్తెనూ ఒకచోటికి చేర్చిన పాలగుమ్మి పద్మరాజు కథ ‘గాలివాన’నే చూడండి. ఆ క్షణంలో అతనికి అవసరమైన ఆ బిచ్చగత్తె ఆలింగనపు వెచ్చదనం అందించి అతనిలోని అరవయ్యేళ్ళ అజ్ఞానాహంకారాల జడలమర్రిని ఒక్క గాలివాన కూకటివేళ్ళతో కుప్పకూల్చింది. అతని బతుకు పలకను స్వచ్ఛజలాలతో పూర్తిగా ప్రక్షాళించి మానవత్వపు కొత్త ఓనమాలు దిద్దించింది. దాశరథి రంగాచార్య కథ ‘తామరపూలు’లో చిట్టిపంతులికి తామరలే లోకం. ఋతుభ్రమణం గురించిన జ్ఞానం లేని ఆ అబ్బాయి ఎండాకాలంలో అవి కనిపించకపోయేటప్పటికి కలవరపడిపోయాడు. వానలు పడి తిరిగి కనిపించేవరకూ వాటికోసం ఒక జీవితకాలపు నిరీక్షణ. అలా ప్రకృతిపాఠాల బోధనలో వాన జ్ఞానకళిక అయింది. సొగసుతోపాటు ప్రకృతిలోని లయను, సమవర్తనను, ఒక్కోసారి అవి కలిగించే విషాదం గురించిన ఎరుకను తట్టిలేపే కథ మహేంద్ర రచించిన ‘హొగినేకల్’. ఓ కుటుంబం ఆ కావేరి జలపాతాన్ని చూడడానికి చిన్న పాపను తీసుకుని వానను వెంటబెట్టుకుని వెళ్లింది. కావేరికి వరదెత్తి ఆ వరదలో పాప కొట్టుకుపోయింది. జీర్ణించుకోవడం కష్టమే కానీ; ‘ఇదే ప్రకృతి. ఇదే ప్రకృతిధర్మం. అది మంచిదీ కాదు, చెడ్డదీ కాదు; దాని దృష్టిలో అన్నీ సమానం. సృష్టిని అంగీకరించే మనిషి, లయను కూడా అంగీకరిస్తే పెనుగులాట ఉండ’దంటుందీ కథ. వాన మన వ్యక్తిత్వాలకు, ఆలోచనలకు ఒక స్పష్టతనివ్వడానికి కూడా ఎలా నేపథ్యమవుతుందో కుప్పిలి పద్మ కథ ‘గోడ’ చెబుతుంది. ‘వాన. తూర్పు సముద్రపు కెరటాల నురగల మీద వాన. యారాడ కొండల గరిక మీద వాన. రుషికొండ ఎగుడుదిగుడుల మీద వాన...’ అని మొదలయ్యే ఈ కథలో స్వతంత్రభావాలు కలిగిన ఒక అమ్మాయి తనతో చదువుకున్న ఒక అబ్బాయి గదిలో ఆ వర్షపురాత్రిని గడపాల్సివస్తుంది. అతనిలో మగాడు నిద్రలేచి హద్దుమీరబోతే ఆ అమ్మాయి వారించి గట్టిగా బుద్ధి చెబుతుంది. మహమ్మద్ ఖదీర్ బాబు అద్భుతంగా పునఃకథనం చేసి సవ్యాఖ్యానంగా సంకలనం చేసిన ‘నూరేళ్ళ తెలుగు కథ’లో ఈ నాలుగు కథలూ చేరాయి. సహస్ర బాహువులతో జలఖడ్గాలు దూసి, ఉరుముల పెనుగర్జనలతో, మెరుపుల మిరుమిట్లతో వర్షం ఊరూవాడా ఆక్రమించుకుని జనాన్ని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు ఇంకెన్ని చిత్రవిచిత్ర సన్నివేశాలు ఏర్పడగలవో తిలక్ కథ ‘ఊరి చివరి ఇల్లు’ చెబుతుంది. అలాంటి ఓ వర్షపురాత్రి ఒక ఆగంతక యువకుని రాక దుఃఖపూరితమైన ఒక యువతి జీవితంలో కొత్త ఆశా, ఉత్సాహాల జడివానగా మారి తెల్లవారేసరికి వానతోపాటే అదీ వెలసి అయ్యో అని పిస్తుంది. వర్షం కలిగించే అలజడి సరే, అంతకన్నా ఎక్కువగా వర్షాభావం సృష్టించే కన్నీటి జలపాతాల సంగతేమిటి? తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి ‘ఆమె దనంతపురం’, ‘పిచ్చి లచ్చమ్మ’, ‘కదిరమ్మ పేరంటాలు’ కథలు ఆ విషాద పార్శా్వన్ని అనితరసాధ్యంగా అక్షరబద్ధం చేస్తాయి. మరిన్నికొత్త అనుభవాలను మబ్బులతో మూటగట్టి మళ్ళీ వర్షరుతువు వస్తోంది. అవి తీపినే నింపాలని కోరుకుంటూ హర్షోల్లాసాలతో పునఃస్వాగతం చెబుదాం. -
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్‌కింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com