Editorial
-
దక్షిణాదిన ‘కమల’ హాసం!
కేంద్రంలో వరసగా పదేళ్లు పాలించి మూడోసారి 400 సీట్లతో ఘనమైన హ్యాట్రిక్ నమోదు చేసుకోవాలనుకున్న ఎన్డీఏను ఉత్తరాదిన నిలువరించటంలో, దాన్ని 300 లోపు మెజారిటీకి పరిమితం చేయటంలో ‘ఇండియా’ కూటమి విజయం సాధించిందని సోమవారం వెల్లడవుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. ‘జనం మా వైపే మొగ్గు చూపారు. మూడోసారి కూడా పాలించమని ఆశీర్వదించారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా జరిగిందేమిటో కనబడుతూనేవుంది. పూర్తి ఫలితాలు వెల్లడికావటానికి ఇంకా సమయంవున్నా దేశానికి ‘కొత్త రోల్ మోడల్’గా బీజేపీ చూపించదల్చుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ సగం సీట్లపైగా కోల్పోవటం ఖాయమని అర్థమవుతోంది. రామమందిరం నిర్మాణమవుతున్న అయోధ్య... ఫైజాబాద్ ఎంపీ స్థానం పరిధిలోనిదే. అక్కడా, ఇతరచోట్లా బీజేపీకి ఎదురుగాలి వీచటం చిన్నవిషయం కాదు. అయితే ఉత్తరాదిలో ఎన్డీఏకు జరిగిన ఈ నష్టాన్ని భర్తీ చేయటానికి దక్షిణాది సిద్ధపడిందని, తూర్పున ఒడిశా కూడా ముందుకొచ్చిందని ఫలితాలు సూచిస్తున్నాయి. తమిళనాడు ఇందుకు మినహాయింపు. ఆఖరికి ఎప్పుడూ బీజేపీ ఉనికి కనబడని కేరళలో ఆ పార్టీకి ఒక స్థానం రావడం సామాన్యం కాదు. బెంగాల్ మాత్రం బీజేపీని కోలుకోలేని దెబ్బతీసింది. ఉత్తరాదిన మతతత్వ రాజకీయాలపై మబ్బులు విడిపోతున్న వేళ దక్షిణాది ఆ ప్రభావానికి లోనుకావటం ఏపీలో టీడీపీకి కలిసొచ్చివుండొచ్చని కొందరు చేస్తున్న విశ్లేషణ నిజమే కావొచ్చు. ఎందుకంటే కార్గిల్ ఘర్షణల అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో మెరుగ్గా స్థానాలు వచ్చాక ఎన్డీఏకు ఈ స్థాయిలో ఆదరణ లభించటం ఇదే మొదటిసారి. కర్ణాటక బీజేపీ కొమ్ముకాయడంలో వింతేమీ లేదు. అది బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతం. గత లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీదే అక్కడ ఆధిక్యత. తెలంగాణలో సైతం ఈసారి దాదాపు సగం స్థానాలతో బీజేపీ జెండా ఎగరటం, ఆ పార్టీ అభ్యర్థులకు మంచి మెజారిటీలు నమోదుకావటం విశేషం. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘ఆరు గ్యారెంటీల’ పేరిట ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అధికారంలోవున్న కాంగ్రెస్ సతమతమవుతోంది. బీజేపీ బలం పుంజుకోవటానికి అది తోడ్పడింది.కానీ వెనకా ముందూ చూడకుండా ఈ వాగ్దానాలనే కాపీకొట్టి జనం ముందుకొచ్చిన తెలుగుదేశానికి ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణ లభించింది. అయిదేళ్లక్రితం ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం పైగా నెరవేర్చి, ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అని చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని ఎన్‌డీఏవైపు జనం మొగ్గుచూపటం వెనక బీజేపీతోపాటు రకరకాల ప్రభావాలు స్పష్టంగానే కనబడుతున్నాయి. చంద్రబాబు విశ్వసనీయత కలిగిన నాయకుడు కాదు. ఆ సంగతిని ఆయన 2014–19 మధ్య పాలించినప్పుడు సైతం నిరూపించుకున్నారు. చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేక ఏకంగా మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్నుంచి మాయం చేసిన ఘనుడాయన. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండబోదు. మేనిఫెస్టో ఆవిష్కరణ రోజున దానిపై ప్రధాని ఛాయాచిత్రం ఉండరాదని బీజేపీ పట్టుబట్టడం, అందుకు అంగీకరించినా దాన్ని చేతితో తాకేందుకు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు సిద్ధపడని వైనం తాజా వాగ్దానాలకు ఏ గతి పడుతుందో తేటతెల్లం చేశాయి. ఆ సంగతలావుంచి ఎన్నికల ప్రచారపర్వంలోగానీ, అంతకుముందుగానీ ఏమాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కనబడనిచోట అధికారపక్షం ఇంత దారుణంగా ఓడిపోవటం వెనక ఈవీఎంల పాత్ర ఉండొచ్చని కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలూ... చాలాచోట్ల వోటింగ్ శాతం అసాధారణంగా పెరగటంలో మతలబుందని పోలింగ్ రోజున మరికొందరు శంకించటం పూర్తిగా కొట్టిపారేయదగినవి కాకపోవచ్చు. సాధారణంగా ఓడిన పక్షం ఈవీఎంలపై నెపం వేయటం గతంలో చాలాసార్లు జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అకాలీదళ్‌లు భిన్న సందర్భాల్లో ఆ పనే చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఇంతవరకూ ఆ మాటనలేదు. కానీ ఆ పార్టీ నేతల స్వరంలో అది అంతర్లీనంగా కనబడుతూనేవుంది. అమెరికాతోసహా సాంకేతికంగా అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తి బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న తరుణంలో మన దేశంలో మాత్రమే ఇది ఎందుకు కొనసాగాలని చాలామంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎలాగోలా గెలవటం తప్ప నైతిక విలువల గురించి అసలు పట్టింపేలేని బాబు చడీచప్పుడూ లేకుండా వోటింగ్ శాతం పెరగటానికీ, ఈవీఎంలను తనకనుకూలంగా మలుచుకోవటానికీ లోపాయకారీగా ఏమైనా చేసివుంటారన్న సంశయాలు ఇందుకే వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే భూ యజమానులకు తొలిసారిగా హక్కులివ్వటానికి సంకల్పించిన భూహక్కు చట్టం వంటి అత్యుత్తమ చట్టంపై బురదచల్లి, తప్పుడు ప్రచారం నడిపి ప్రజలను భయభ్రాంతుల్ని చేయటంలో బాబు విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. సత్యం మాత్రమే జయిస్తుందన్నది కూడా వాస్తవమే. కానీ గెలిచేదంతా సత్యం కాదు. నిలకడపై అన్ని నిజాలూ వెల్లడవుతాయి. ఎన్నికల నిర్వహణ తీరు అందరిలోనూ అనుమానాలు రేకెత్తించింది. ఏపీ ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. పక్కనున్న తెలంగాణలో వివాదరహితంగా ఎన్నికలు జరగ్గా ఏపీలో బాబు, పవన్‌లు దుర్భాషలతో చెలరేగిపోయారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం చేసిందేమీ లేదు సరిగదా...టీడీపీ అడిగిన తడవే అన్నీ నెరవేర్చింది. పర్యవసానంగా తటస్థతకు తూట్లుపడ్డాయి. మొత్తానికి ఆరు వారాలపాటు పెళ్లివారి నడకను తలపిస్తూ సాగిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా పాలనను స్తంభింపజేసింది. -
సంబరాలు... సవాళ్ళు...
దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోని బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్న వేళ ఓట్ల లెక్కింపుతో అసలైన ఫలితాలు ఇవాళ రానున్నాయి. అయితే, ఎన్నికలు ముగింపు దశలో ఉండగానే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గత శుక్రవారం వెలువరించిన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి. జీడీపీ వృద్ధి దాదాపు 7.8 శాతం ఉండవచ్చని తొలుత అందరూ భావించినా, వాస్తవంలో అది 8.2 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది (2022–23) సాధించిన 7 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. పైగా, వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం, అంతకు మించి పెరిగిందన్న మాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని నిపుణుల మాట. ఇది విశేషమే... కాదనలేం. కానీ, ఈ ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? అలాగే, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాటేమిటి?నిజానికి, దేశ వాస్తవిక జీడీపీ ఇటు అధికారిక, అటు ప్రైవేట్ అంచనాలన్నిటినీ అధిగమించి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత, అందులోనూ ప్రపంచమంతా నత్తనడక నడుస్తున్నప్పుడు వృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే, అనేక ఆటుపోట్లను భారతీయ గృహవ్యవస్థ, వ్యాపారాలు తట్టుకొని దృఢంగా నిలబడడమే కారణం. అలాగే, ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని కూడా గడచిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ అనుకున్న దాని కన్నా మెరుగైన వృద్ధిని సాధించినట్టు విశ్లేషణ. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధుల లాంటివి కొంత సౌకర్యాన్నిచ్చే అంశాలు. అక్కడ నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలన్నది కీలకమైన అంశం. గమనిస్తే... ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఏడేళ్ళ పాటు నిదానంగా సాగింది. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్‌వర్క్స్, రక్షణ ఉత్పత్తులపై ఏటా రూ. 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో నూటికి 80 మంది ఉండే నైపుణ్య రహిత కార్మికుల సగటు రోజు వారీ కూలీ సైతం అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి. మహిళా శ్రామికుల కూలీలైతే మరీ కనాకష్టం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే... మన దేశ తలసరి ఆదాయం, మరో మాటలో నికర జాతీయ ఆదాయం 2014–15లో రూ.72,805 ఉండేది. అది కేవలం 3.83 శాతం వార్షిక చక్రవృద్ధి రేటుతో 2022–23లో రూ.98,374కు చేరింది. వాస్తవిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈ వృద్ధి రేటు అసలైతే ఇంకా తక్కువే ఉంటుంది. అది అటుంచితే – విద్య, ఆరోగ్యం, ప్రజారవాణా, కాలుష్యం వగైరా అంశాల్లో సగటు జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. సరికదా ఇంకా దిగజారాయి. అదే విషాదం. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి తగిన అంశాలు కొన్నే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే, మనం మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ, ఇప్పటికీ మనం అడుగునే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్య్రం నుంచి బయటపడేయడానికి చాలదు. నాణ్యమైన జీవన ప్రమాణాలకూ సరిపోదు. 2029 నాటికి గానీ మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూ గినియా, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి, కొత్త ప్రభుత్వానికి తన ముందున్న సవాలేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారత జనాభాలో ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వారి కష్టనష్టాలు, జీవన పరిస్థితులు స్టాక్ మార్కెట్ల విజృంభణను చూసి చప్పట్లు కొట్టే వర్గాలకు పెద్దగా తెలియవు. తాజా ఎన్నికల దయతో నిరుద్యోగం, ఆర్థిక అసమతౌల్యం, ద్రవ్యోల్బణం లాంటివి మళ్ళీ కనీసం చర్చకైనా వచ్చాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లోని దురవస్థల’ ప్రస్తావన జరిగింది. అందుకే, గడచిన నాలుగు త్రైమాసికాలను కలిపి తీసిన ఆఖరి లెక్కలు పైకి సంతోషం రేపుతున్నా, క్షేత్రస్థాయిలోని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కష్టమే. ఇప్పటి లెక్కలతో తృప్తిపడి, ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్ళను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి, వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలి. అందుకు తగ్గ సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ఏటికేడు ఈ వృద్ధి అంకెలు స్థిరపడతాయి. సామాన్యుల జీవితాలు నిలబడతాయి. లేదంటే ‘వికసిత భారత్’ మాటల్లో, లెక్కల్లోనే మిగిలిపోతుంది. -
వాన జ్ఞానం
ప్రపంచమంతటా సృష్టిగాథలు ఒక్కలానే ఉంటాయి. ఆదిలో అంతా జలమయమే. ఎందుకనీ? వర్షాలు... క్షణం తెరిపివ్వని వర్షాలు... బ్రహ్మాండమంత కుండతో ఎత్తిపోసినట్టు నిరంతర ధారాపాతాలు... ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ పుట్టాయి. భూమి పైకి తేలింది. జీవి పుట్టింది. మనిషితో సహా రకరకాల రూపాల్లోకి పరిణామం చెందింది. వర్షం పడుతూనే ఉంది కానీ, నిర్విరామం నుంచి విరామానికి మారింది. చెప్పొచ్చేదేమిటంటే, వర్షం సృష్టి అంత ప్రాచీనం; ప్రకృతి అంత పురాతనం. మనిషి పుట్టిన చోటనే ఎప్పుడూ లేడు కనుక భ్రమణజీవి; అంతకన్నా ఎక్కువగా భ్రమలజీవి. తను ప్రకృతిలో భాగమన్న సంగతి మరచి; తన జీవితానికి, తన నిర్ణయాలకు తనే కర్తనన్న భ్రమ వాటిలో ఒకటి. శీతోష్ణాలను మించి ఆ భ్రమను పటాపంచలు చేయగలిగింది వర్షాలే. మనం బయటికి వెళ్లడానికి సిద్ధమవుతాం. ఆకాశం మబ్బు పట్టి ఉన్నా వర్షం రాదులే అన్న భ్రమతో గడప దాటుతాం. చినుకుతో మొదలై చూస్తుండగానే ఆకాశానికి చిల్లిపడిందా అన్నంత ఉధృతితో వర్షం ముంచెత్తుతుంది. చెట్టు కిందికో, చూరు కిందికో, మరో కప్పు కిందికో పరుగుతీస్తాం. వర్షనిర్బంధం నుంచి బయటపడడానికి నిలువుకాళ్ళ తపస్సు చేస్తాం. మనలానే, మనపక్కకి ఎవరెవరో అపరిచితులు వచ్చి చేరతారు. మాటలు కలుస్తాయి, ముచ్చట్లుగా మారతాయి, స్నేహాలను అల్లుకుంటాయి, ప్రేమలు మొలకెత్తుతాయి, అవి పెళ్లిళ్లకూ దారితీయవచ్చు. ఒక్కోసారి ఒకే ఒక్క వర్షం ఊహించని సన్నివేశాలను కల్పించి జీవితాలను పెద్దమలుపు తిప్పచ్చు. ప్రపంచ సాహిత్యంలో వర్షానుభవాన్ని చిత్రించని కథా, కావ్యం, నవలా దాదాపు ఉండవు. మనిషి బుద్ధిని బంకలా పట్టుకున్న మృగత్వం, కులమతాల భేదాలు, ధనిక, నిర్ధనిక తారతమ్యాలు, చదువు, అధికారంతో పుట్టే దుర్గర్వాలు సహా అన్ని రకాల మురికినీ, మకిలినీ కడిగి శుభ్రం చేసి మళ్ళీ మనిషిని చేయగల మంత్రజలం వర్షం. సమాజం గురించి మనుషుల గురించి నిశ్చితాభిప్రాయాల ఇరుకులో కరకుదేరిన అడ్వొకేట్ రావునూ, అతను చీదరించుకున్న బిచ్చగత్తెనూ ఒకచోటికి చేర్చిన పాలగుమ్మి పద్మరాజు కథ ‘గాలివాన’నే చూడండి. ఆ క్షణంలో అతనికి అవసరమైన ఆ బిచ్చగత్తె ఆలింగనపు వెచ్చదనం అందించి అతనిలోని అరవయ్యేళ్ళ అజ్ఞానాహంకారాల జడలమర్రిని ఒక్క గాలివాన కూకటివేళ్ళతో కుప్పకూల్చింది. అతని బతుకు పలకను స్వచ్ఛజలాలతో పూర్తిగా ప్రక్షాళించి మానవత్వపు కొత్త ఓనమాలు దిద్దించింది. దాశరథి రంగాచార్య కథ ‘తామరపూలు’లో చిట్టిపంతులికి తామరలే లోకం. ఋతుభ్రమణం గురించిన జ్ఞానం లేని ఆ అబ్బాయి ఎండాకాలంలో అవి కనిపించకపోయేటప్పటికి కలవరపడిపోయాడు. వానలు పడి తిరిగి కనిపించేవరకూ వాటికోసం ఒక జీవితకాలపు నిరీక్షణ. అలా ప్రకృతిపాఠాల బోధనలో వాన జ్ఞానకళిక అయింది. సొగసుతోపాటు ప్రకృతిలోని లయను, సమవర్తనను, ఒక్కోసారి అవి కలిగించే విషాదం గురించిన ఎరుకను తట్టిలేపే కథ మహేంద్ర రచించిన ‘హొగినేకల్’. ఓ కుటుంబం ఆ కావేరి జలపాతాన్ని చూడడానికి చిన్న పాపను తీసుకుని వానను వెంటబెట్టుకుని వెళ్లింది. కావేరికి వరదెత్తి ఆ వరదలో పాప కొట్టుకుపోయింది. జీర్ణించుకోవడం కష్టమే కానీ; ‘ఇదే ప్రకృతి. ఇదే ప్రకృతిధర్మం. అది మంచిదీ కాదు, చెడ్డదీ కాదు; దాని దృష్టిలో అన్నీ సమానం. సృష్టిని అంగీకరించే మనిషి, లయను కూడా అంగీకరిస్తే పెనుగులాట ఉండ’దంటుందీ కథ. వాన మన వ్యక్తిత్వాలకు, ఆలోచనలకు ఒక స్పష్టతనివ్వడానికి కూడా ఎలా నేపథ్యమవుతుందో కుప్పిలి పద్మ కథ ‘గోడ’ చెబుతుంది. ‘వాన. తూర్పు సముద్రపు కెరటాల నురగల మీద వాన. యారాడ కొండల గరిక మీద వాన. రుషికొండ ఎగుడుదిగుడుల మీద వాన...’ అని మొదలయ్యే ఈ కథలో స్వతంత్రభావాలు కలిగిన ఒక అమ్మాయి తనతో చదువుకున్న ఒక అబ్బాయి గదిలో ఆ వర్షపురాత్రిని గడపాల్సివస్తుంది. అతనిలో మగాడు నిద్రలేచి హద్దుమీరబోతే ఆ అమ్మాయి వారించి గట్టిగా బుద్ధి చెబుతుంది. మహమ్మద్ ఖదీర్ బాబు అద్భుతంగా పునఃకథనం చేసి సవ్యాఖ్యానంగా సంకలనం చేసిన ‘నూరేళ్ళ తెలుగు కథ’లో ఈ నాలుగు కథలూ చేరాయి. సహస్ర బాహువులతో జలఖడ్గాలు దూసి, ఉరుముల పెనుగర్జనలతో, మెరుపుల మిరుమిట్లతో వర్షం ఊరూవాడా ఆక్రమించుకుని జనాన్ని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు ఇంకెన్ని చిత్రవిచిత్ర సన్నివేశాలు ఏర్పడగలవో తిలక్ కథ ‘ఊరి చివరి ఇల్లు’ చెబుతుంది. అలాంటి ఓ వర్షపురాత్రి ఒక ఆగంతక యువకుని రాక దుఃఖపూరితమైన ఒక యువతి జీవితంలో కొత్త ఆశా, ఉత్సాహాల జడివానగా మారి తెల్లవారేసరికి వానతోపాటే అదీ వెలసి అయ్యో అని పిస్తుంది. వర్షం కలిగించే అలజడి సరే, అంతకన్నా ఎక్కువగా వర్షాభావం సృష్టించే కన్నీటి జలపాతాల సంగతేమిటి? తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి ‘ఆమె దనంతపురం’, ‘పిచ్చి లచ్చమ్మ’, ‘కదిరమ్మ పేరంటాలు’ కథలు ఆ విషాద పార్శా్వన్ని అనితరసాధ్యంగా అక్షరబద్ధం చేస్తాయి. మరిన్నికొత్త అనుభవాలను మబ్బులతో మూటగట్టి మళ్ళీ వర్షరుతువు వస్తోంది. అవి తీపినే నింపాలని కోరుకుంటూ హర్షోల్లాసాలతో పునఃస్వాగతం చెబుదాం. -
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్‌కింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మహాపరాధి ట్రంప్!
అధికారంలోకొచ్చింది మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నేరస్తుడిగా నిరూపించాలని తపిస్తున్న డెమాక్రాటిక్ పార్టీ వాంఛ చివరి అంకంలో నెరవేరింది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావటంతో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయన్ను మహాపరాధిగా తేల్చింది. భిన్న రంగాలకు చెందిన అయిదుగురు మహిళలతో సహా 12 మందితో కూడిన జ్యూరీ... ఈ వ్యవహారంలో ట్రంప్‌కు విధించబోయే శిక్ష ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల 11న వెల్లడించే ఆ శిక్ష తప్పనిసరిగా కారాగారవాసమే కానవసరం లేదని, అది జరిమానా మొదలుకొని ప్రొబేషన్‌లో ఉంచటం వరకూ ఏదైనా కావొచ్చన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇది క్రిమినల్ కేసే అయినా వ్యక్తిని హతమార్చటం వంటిది కాదు గనుక జైలు శిక్ష ఉండకపోవచ్చంటున్నారు. జైలుకు పోయినా పోకపోయినా దేశాధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడటానికి అదేమీ అవరోధం కాదు. తీర్పు వెలువరించే ముందు జ్యూరీకి నాయకత్వం వహించిన న్యాయమూర్తి జువాన్ మెర్కన్ తన సహచరులను లాంఛనంగా ‘తీర్పుతో మీరు ఏకభవిస్తున్నట్టేనా...’ అని అడగటం, వారు అంగీకారాన్ని తెలపటం పూర్తయ్యాక ట్రంప్ అక్కడినుంచి నిష్క్రమించారు. వెళ్లేముందు ‘ఇది మోసపూరితమైన, సిగ్గుమాలిన తీర్పు. అసలు తీర్పును నవంబర్ 5న అమెరికా ప్రజలివ్వబోతున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. వచ్చే అయిదారు నెలల్లో ఆ దేశ రాజకీయ పోకడలెలా ఉండబోతున్నాయో ట్రంప్ వ్యాఖ్య చెబుతోంది. ట్రంప్ నేరం రుజువై అపరాధిగా తేలిన తొలి కేసు ఇదే.దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. 2006 నాటి తన రాసలీలల సంగతి బయటపెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన 1,30,000 డాలర్ల డబ్బే ఇప్పుడు ట్రంప్‌ను నిండా ముంచింది. ఈ కేసులో వచ్చిన మొత్తం 34 అభియోగాలూ రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. ట్రంప్ గద్దెనెక్కకుండా నిరోధించేది ప్రజా తీర్పేనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా ఆ విషయంలో డెమాక్రాటిక్ పార్టీకి పెద్దగా ఆశలున్నట్టు కనబడదు. తటస్థులైన ఓటర్లలో ఒకటి రెండు శాతంమంది తాజా తీర్పు వెలువడ్డాక ట్రంప్‌కు వోటేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పినా అదేమంత ఉపయోగపడేలా కనబడటం లేదు. తొక్కేయాలని చూస్తున్నకొద్దీ ఆయన మరింత బలశాలిగా మారుతున్నాడంటూ రిపబ్లికన్ వ్యూహకర్త స్కాట్ రీడ్ చేసిన వ్యాఖ్య అవాస్తవం కాదు. గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరగటం, ఆయనకొచ్చే విరాళాల వెల్లువ ఇందుకు తార్కాణం. అయిదారేళ్లుగా రిపబ్లికన్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా, ఫాక్స్ న్యూస్ వంటి పార్టీ అనుకూల మీడియా ద్వారా సాగిస్తున్న ప్రచారం దీనికి కారణం. పార్టీ మొత్తం ట్రంప్ వెనక దృఢంగా నిలబడి ఆయన మాటలనూ, చేష్టలనూ సమర్థిస్తూ వచ్చింది. తమ నాయకుడిది తప్పంటున్న డెమాక్రాటిక్ నేతలే నేరగాళ్లంటూ ఊదరగొట్టింది. వీటి మాటెలావున్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తోంది. నాలుగు వందల ఏళ్లనాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి వందేళ్ల క్రితం జైలునుంచి పోటీచేసిన చరిత్రవున్నా మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీవినీ ఎరుగనిది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేదీ లేదు. ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించటానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్‌కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు. తిరిగి నెగ్గితే ఆయన చేయబోయే పనుల్లో వలసలను కట్టడి చేయటం మొదలుకొని అంతర్జాతీయ సాయానికి కత్తెరేయటం వరకూ చాలావున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రతను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. గెలిచి అందలమెక్కితే ట్రంప్‌పై కేసులు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే కాదు... అమెరికాకు సైతం సమస్యగా మారడం ఖాయం. -
ప్రకృతి వికృతి
రికార్డులు బద్దలవుతున్నాయి. వారం రోజుల్లోనే అటు రాజస్థాన్‌లో, ఇటు దేశ రాజధానిలో తాపమానం తారాజువ్వలా పైకి ఎగసింది. ఒక్క బుధవారమే రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటేశాయి. వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో దేశచరిత్రలోనే అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్టు స్థానిక వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డ వార్త సంచలనమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లెక్కల్లో ఏమన్నా తప్పు దొర్లిందేమో అని అమాత్యులు అత్యుత్సాహమూ చూపారు. సరిచూసుకోవడంలో తప్పు లేదు కానీ, అన్నిటికీ ప్రామాణికమని ప్రభుత్వమే చెప్పే ఐఎండీని పక్కనబెట్టినప్పటికీ ఈ వేసవిలో దేశంలో ఉష్ణోగ్రతలు ఎన్నడెరుగని స్థాయికి చేరిన మాట చెమటలు పట్టిస్తున్న నిజం. క్రమంగా ఈ ప్రచండ ఉష్ణపవనాలు తగ్గుతాయని చెబుతూనే, ఉత్తర భారతావనికి ఐఎండీ ‘రెడ్ ఎలర్ట్’ జారీ చేయడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం 16.5 వేల మందికి పైగా వడదెబ్బకు గురైతే, పదుల మరణాలు సంభవించాయి. ఒకపక్క ఈశాన్యంలో రెమాల్ తుపాను బీభత్సం, మరోపక్క పశ్చిమ, ఉత్తర భారతావనుల్లో ఉష్ణోగ్రతల నిప్పులగుండం ఒకేసారి సంభవించడం ప్రకృతి వికృతికి చిహ్నం. ఒక్క మనదేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2013 నుంచి 2023 మధ్య పదేళ్ళ కాలంలో అంటార్కిటికాతో సహా ప్రపంచంలో దాదాపు 40 శాతం ప్రాంతంలో అత్యధిక రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్ళలో వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2021లో యూరప్‌లోకెల్లా అత్యధికంగా ఇటలీలోని సిసిలీలో తాపమానం 48.8 డిగ్రీలు చేరింది. 2022 జూలైలో అమెరికాలో ఉష్ణోగ్రత తొలిసారిగా 40 డిగ్రీలు దాటింది. నిరుడు చైనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ పట్టణంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు పెరగడం ఆందోళనకరం. ఇది మన స్వయంకృతం. పచ్చని చెట్లు, నీటి వసతులు లేకుండా కాంక్రీట్ జనారణ్యాలుగా మారుతున్న నగరాలతో మీద పడ్డ శాపం.గత 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వత్సరమైతే, ఈ 2024 కూడా అదే బాటలో నడుస్తోంది. నిజానికి, ప్రకృతి విపత్తుల స్వరూప స్వభావాలు గత 20 ఏళ్ళలో గణనీయంగా మారాయి. దేశంలో నిరుడు శీతకాలమైన ఫిబ్రవరిలోనే వడగాడ్పులు చూశాం. అనూహ్య వాతావరణ పరిస్థితులు, అందులోనూ తీవ్రమైనవి ఇవాళ దేశంలో తరచూ ఎదురవుతున్నాయి. భరించలేని ఎండలు, భారీ వరదలకు దారి తీసేటంత వానలు, బయట తిరగలేనంత చలి... ఒకదాని వెంట మరొకటిగా బాధిస్తున్నాయి. గతంలో భరించగలిగే స్థాయిలో ఉండే ప్రకృతి సిద్ధమైన వేసవి ఎండ, వడగాడ్పులు ప్రకోపించి... సరికొత్త విపత్తులుగా పరిణమించాయి. ఒకప్పుడు అసాధారణమైన 45 డిగ్రీలు సర్వసాధారణమై, ఇక 50 డిగ్రీల హద్దు తాకుతున్నాం. దేశవ్యాప్త ప్రచండ గ్రీష్మం అందులో భాగమే. పైగా, అధిక వర్షపాతంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, లోతట్టున ఆకస్మిక వరదలు రావడం... భరించలేని గ్రీష్మతాపంతో కార్చిచ్చులు రేగడం... ఇలా గొలుసుకట్టు చర్యలా ఒక వైపరీత్యం మరొకదానికి దారి తీయడమూ పెరుగుతోంది. మరో వారం పదిరోజుల్లో ఋతుపవనాల ప్రభావంతో ఎండలు తగ్గాక అనూహ్యమైన తుపానుల బెడద ఉండనే ఉంది. ఇప్పటికే ఆదివారం బెంగాల్ తీరం తాకిన రెమల్ తుపానుతో నాలుగైదు ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న భూతాపం, దరిమిలా వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత తీవ్రస్థాయిలో సంభవించే ప్రమాదం ఉంది. అందులోనూ ఇప్పటి తుపానులకు రెండింతల విధ్వంసం సృష్టించగలిగినవి వస్తాయని పలు అధ్యయనాల అంచనా. ఈ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు అస్సామ్, మిజోరమ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సహా రాష్ట్రాలన్నీ సన్నద్ధం కావాలి. తుపాను వస్తుందంటే ఒడిశా లాంటివి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నమూనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించుకుంటున్న తీరు నుంచి అందరూ పాఠాలు నేర్వాలి. అసలు మన దేశంలో జాతీయ విపత్కాల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. 1999లో ఒరిస్సాలో భారీ తుపాను, 2004లో సునామీ అనంతరం 2005లో దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి జాతీయ విపత్తుల అంచనా, నివారణ, విపత్కాల పరిస్థితుల నిర్వహణ, బాధితుల సహాయ పునరావాసాలకు అది కృషి చేస్తోంది. ఎక్కడ ఏ మేరకు పనిచేస్తున్నాయన్నది పక్కనపెడితే, ప్రస్తుతం దాదాపు ప్రతి రాష్ట్రమూ దేనికది విపత్కాల నిర్వహణ సంస్థ పెట్టుకుంది. అయితే, ఇది చాలదు. అంతకంతకూ పెరుగుతున్న విపత్తుల రీత్యా కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలి. వేడిమిని తట్టుకొనేందుకు శీతల కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా చెట్ల పెంపకం, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్ళడం లాంటివి ఇక తప్పనిసరి. థానే లాంటి చోట్ల ఇప్పటికే అమలు చేస్తున్న పర్యావరణహిత ప్రణాళికల లాంటివి ఆదర్శం కావాలి. ఎండ, వాన, చలి... ఏది పెచ్చరిల్లినా తట్టుకొనేలా ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన సాగించాలి. వేసవి ఉక్కపోత పోయిందని సంబరపడే లోగా భారీ వర్షాలు విపత్తుగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రకృతి ప్రమాదఘంటిక వినకుంటే కష్టమే! -
వీర ఐపీఎల్ విజయగాథ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమాంతరంగా రెండు నెలల పైగా సాగిన క్రికెట్ వేడి ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్‌కు ఆదివారం నాటి ఫైనల్‌తో శుభం కార్డు పడింది. కలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ల మధ్య చెన్నైలో జరిగిన తుది సమరం అనూహ్యంగా ఏకపక్షంగా సాగింది. తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే, 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించి, కప్ చేజిక్కించుకుంది. 2014 తర్వాత సరిగ్గా దశాబ్ద కాలపు నిరీక్షణకు తెర దించి, మూడోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ చప్పగా ముగిసిందన్న మాటే కానీ, గత రెండునెలలుగా ఐపీఎల్ పట్ల జనంలో వ్యక్తమైన ఉత్సాహం, ఉద్వేగాలను తక్కువ చేయలేం. 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏయేటికాయేడు ప్రాచుర్యం పెంచుకుంటూ, ప్రస్తుతం ప్రపంచస్థాయి సంబరంగా మారింది. నరాలు తెగే ఉత్కంఠ, వినోదం అందించే ఈ పొట్టి ఫార్మట్ క్రికెట్ ఆట వీరాభిమానుల నుంచి అదాటుగా చూసేవారి దాకా అందరినీ ఆకర్షించగలుగుతోంది. అంతర్జాతీయ ఆటగాళ్ళతో కలసి ఆడడమే కాక, శిక్షణ, వ్యూహరచనల్లో భాగస్వాములు కావడంతో మన కొత్త తరం ఆటగాళ్ళు రాటుదేలడానికి కావాల్సినంత వీలు చిక్కుతోంది. ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల ఐపీఎల్ అనేక ఆశ్చర్యాలను ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (1260), అత్యధిక సెంచరీలు, 9 అత్యధిక స్కోర్లలో 8 ఈ సీజన్లోనే వచ్చాయి. వాటిలోనూ 5 అత్యధిక స్కోర్లు ఫైనల్లో తలపడిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు సాధించినవే! విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 741 పరుగులు చేసి తన ఐపీఎల్ కెరీర్లోనే రెండో అత్యధిక పరుగుల వరద పారించాడు. అదీ కనివిని ఎరుగని 154.70 రేటుతో! ఏడు మ్యాచ్‌లలో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడి, రెండే రెండు పాయింట్లు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆపైన వరుసగా 6 మ్యాచ్‌లు భారీ తేడాతో గెలిచి, ప్లేఆఫ్ దశకు చేరడం మరో అబ్బురం. ఆశలు వదులుకోకుండా నిలబడి, కలబడితే ఏదైనా సాధ్యమనే పాఠానికి నిదర్శనం. అలాగే, అంకితభావం ఉంటే వయసనేది అడ్డంకి కాదని, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 42 ఏళ్ళ ధోనీ గాలిలోకి 3 మీటర్లు గెంతి మరీ ఒంటిచేతితో పట్టిన విజయ్‌శంకర్ క్యాచ్ నిరూపించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కప్ గెలిచిన కేకేఆర్ ఈసారి సాధించిన విజయంలో గమనించాల్సిన ఒక ప్రత్యేకత ఉంది. కేకేఆర్‌లో భారత క్రికెట్ జట్టు మెగాస్టార్స్ ఎవరూ లేరు. అయినా సరే టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆ జట్టు పక్షాన అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ నిజానికి మొత్తం పట్టికలో 9వ స్థానంలో ఉంటాడు. కానీ, టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి స్కోర్‌బోర్డ్‌ను పరుగులెత్తించిన తీరు, చూపిన ప్రభావం అసామాన్యం. కేకేఆర్ జట్టు కప్పు గెలిచిన గడచిన రెండుసార్లు (2012, 2014) కూడా ఆ యా సీజన్లలో అత్యధిక వికెట్లు (24, 21) తీసింది ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కమ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నరే! ఈ సీజన్లోనూ 15 వికెట్లు, 488 పరుగులు సాధించి, ముచ్చటగా మూడోసారి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు అందుకున్నాడు. సునీల్ కాక మరొక్క టాప్ 20 ఆటగాడు మాత్రమే కేకేఆర్ జట్టులో కనిపిస్తాడు. అయితేనేం, ఆ జట్టు మైదానంలో జోరు కొనసాగించి, విజయతీరాలు చేరింది.పరుగుల వరద ఎప్పటి కన్నా మరో మెట్టు పైకెక్కి బ్యాట్స్మన్ల రాజ్యంగా సాగిన టోర్నీ ఇది. ఈ పరిస్థితుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్ లేకున్నా టాప్5 బౌలర్లలో ముగ్గురున్న కేకేఆర్ గెలుపు నమోదు చేసింది. అలాగే, కొన్నేళ్ళుగా విజయాలు రాకున్నా... ఇష్టారీతిన జట్టును మార్చేయకుండా, ఆటగాళ్ళను నమ్మి వారిని కొనసాగిస్తే అద్భుతాలు సాధ్యమేనని నిరూపించింది. పస అయిపోందని పలువురు విమర్శించినా... సునీల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను దీర్ఘకాలంగా జట్టులోనే అట్టిపెట్టుకుంది. ఆసిస్ పేసర్ మిషెల్ స్టార్క్ తాజా టోర్నీలో మొదట రాణించకున్నా అతణ్ణి కొనసాగించింది. అవన్నీ కీలక సమయంలో ఫలించాయి. వెరసి, పేరున్న ఆటగాళ్ళపై అతిగా ఆధారపడ్డ ఇతర ఫ్రాంఛైజీలకు కేకేఆర్ కథలో ఓ పాఠముంది. భారతజట్టులో ఆడకపోతేనేం, ప్రతిభావంతులైన యువతరంతో అద్భుతాలు చేయవచ్చని కేకేఆర్ ప్రస్థానం చాటింది.ఆదాయంలో, ఆకర్షణలో భారత జాతీయక్రీడ హాకీ సహా అన్నింటినీ క్రికెట్ ఎన్నడో మించిపోయింది. ఐపీఎల్ దెబ్బతో స్థానిక, రాష్ట్ర స్థాయుల్లోనూ టీ20 క్రికెట్ పోటీలొచ్చాయి. మన ఐపీఎల్ మూసలో ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్, సౌతాఫ్రికాలో ఎస్ఏ 20 లీగ్, వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ – బంగ్లాదేశ్ – శ్రీలంకల్లోనూ ఆ యా దేశాల ప్రీమియర్ లీగ్‌లు వచ్చేశాయి. ప్రతిభావంతులైన యువ భారతీయ క్రికెటర్ల ప్రత్యామ్నాయ కెరీర్‌కు ఇది ద్వారాలు తెరిచింది. అదే సమయంలో ఈ వెర్రి పెచ్చుమీరిన బెట్టింగ్ బెడద తెచ్చింది. బ్యాట్‌కూ బంతికీ మధ్య పోటీలో సమతూకాన్ని చెడగొట్టింది. గత 16 విడతల ఐపీఎల్ టోర్నీల్లో మొత్తం 1032 మ్యాచ్‌లు ఆడితే, వాటిలో 250 పైచిలుకు స్కోర్లు వచ్చింది రెండు, మూడు మ్యాచ్‌లలోనే. కానీ, ఈ తడవ ఏకంగా 8సార్లు అది జరిగింది. బ్యాట్స్మన్లదే పైచేయిగా మారుతున్న ఈ లోపాన్ని సరిదిద్దేందుకు బీసీసీఐ కొత్త రూల్‌ను ఆలోచించకపోతే కష్టమే. ఏమైనా, ఈ ఏటి ఐపీఎల్ సీజన్ ముగిసింది. రెండేళ్ళకు ఒకసారి జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆదివారం మొదలవుతోంది. రోహిత్‌శర్మ జట్టులో సభ్యులైనæ కోహ్లీ, పంత్ తదితరులు గనక ప్రస్తుత ఐపీఎల్ ప్రతిభాప్రదర్శననే ఆ వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది! చాలాకాలంగా ఊరిస్తున్న కప్పు మళ్ళీ మన ఇంటికొస్తుంది!! -
ఈ పాపం ఎవరిది?
గత వారం జరిగిన అగ్ని ప్రమాదాలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇరవై నాలుగు గంటల్లో వేర్వేరు చోట్ల సంభవించిన ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని పలువురు చిన్నారులతో సహా 40 మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదం. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ గేమింగ్ జోన్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 33 మంది, అదే రాత్రి తూర్పు ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలోని ఘోర ప్రమాదంలో నవజాత శిశువులు ఏడుగురు దుర్మరణం పాలైన ఘటనలు సున్నిత మనస్కుల్ని చాలాకాలం వెంటాడనున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు సంభవించిన ఆ ఆసుప్రతి లైసెన్స్ గడువు రెండు నెలల క్రితమే తీరిపోతే, రాజ్‌కోట్ గేమింగ్ జోన్ నిరభ్యంతర పత్రమే (ఎన్ఓసీ) లేకుండానే యథేచ్ఛగా నడుస్తుండడం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నిబంధనల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. అగ్నిప్రమాద నివారణ నిబంధనలు, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది. తాజా ఘటనల నేపథ్యంలో – పాతికేళ్ళ పైచిలుకు క్రితం 1997లో ఢిల్లీలో జరిగిన ఉపహార్ సినిమా హాలు ప్రమాదం మొదలు 2004లో 90 మంది పాఠశాల విద్యార్థులను బలి తీసుకున్న కుంభకోణం అగ్నిప్రమాదం దాకా పాత పీడకలలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. గతం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నామని నిలదీస్తున్నాయి. వాణిజ్య సంస్థల నుంచి నివాస ప్రాంగణాల దాకా అన్నిచోట్లా ఇవాళ ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు మృగ్యమైపోతున్నాయి. అనుకోనిది ఏం జరిగినా పదుల కొద్దీ ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నాయి. మే 26 నాటి ప్రమాదంలో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కానీ, ప్రమాద భద్రతా సర్టిఫికెట్ కానీ, చివరకు అగ్ని ప్రమాద నివారణ సామగ్రి కానీ, సరైన నిష్క్రమణ మార్గాలు కానీ లేకుండానే ఢిల్లీ లాంటి చోట ఒక ఆసుపత్రి నడుస్తోందంటే ఏమనాలి? రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో ఎలాంటి కనీస అగ్నిప్రమాద భద్రతా లేకుండా దాదాపు రెండంతస్తుల భవనం ఎత్తున రేకులతో పెద్ద నిర్మాణం చేపడితే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఆ ప్రాంగణంలో 2 వేల లీటర్ల పెట్రోల్, లెక్కకు మిక్కిలి టైర్లు నిల్వ చేస్తుంటే అడ్డుచెప్పే నాథుడు లేడా?ఒక్క ఢిల్లీలోనే గత రెండేళ్ళ పైచిలుకు కాలంలో 66 ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి, అగ్నిప్రమాద నివారణ నిబంధనలు ఎంతగా ఉల్లంఘనకు గురవుతున్నాయో స్పష్టమవుతోంది. సాక్షాత్తూ మన దేశ రాజధానిలోనే ఇలా ఉంటే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని ఇట్టే ఊహించుకోవచ్చు. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఇప్పటికీ అంతంత మాత్రమే. మూడేళ్ళ క్రితం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించి, డెల్టా వేరియంట్ విలయ తాండవం చేసినప్పుడు ఆ నిష్ఠురసత్యం మన కళ్ళ ముందు కనిపించింది. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య రంగం అలా కునారిల్లుతుండడం వల్లే, ఆ లోటును పూడ్చడానికి ప్రైవేట్ రంగం అవసరం ఉంటోంది. జనం ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, తదితరాలపై ఆధారపడడం ఎక్కువవుతోంది. సరిగ్గా ఈ కారణాల రీత్యానే ప్రైవేట్ ఆరోగ్యరక్షణ రంగంలో భవనాల మొదలు నాణ్యమైన మందులు, సేవల వరకు అన్నింటిలో కనీసపాటి భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. కానీ, చాలాచోట్ల అవి హుళక్కి. తాజా ఘటనలే అందుకు తార్కాణం.నిజానికి, మన దేశంలో అగ్నిప్రమాదాల నుంచి భద్రతకు కీలకమైన ప్రమాణంగా జాతీయ నిర్మాణ నిబంధనావళి (ఎన్బీసీ) ఉంది. 1970లోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దీన్ని ప్రచురించింది. 2016లో సైతం దాన్ని నవీకరించారు. అగ్నిప్రమాద నివారణ అనేది రాష్ట్ర జాబితాలోని అంశమైనా, అన్ని రాష్ట్రాలూ దీన్ని పాటించడం తప్పనిసరి. ఇవి కాక స్థానిక భవననిర్మాణ చట్టాల్లోనూ కావాల్సినన్ని కఠిన నియమ నిబంధనలున్నాయి. అయితే, అవి తరచూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. తాజా ప్రమాదాల్లోనూ అదే జరిగింది. ఆ మాటకొస్తే, గడచిన 2022లోనే మన దేశంలో 7500 పైగా అగ్నిప్రమాదాలు జరిగాయని తాజా నివేదిక. వాటిలో కనీసం 7435 మంది మరణించినట్టు ప్రమాద మరణాలు, ఆత్మహత్యలపై తాజా నివేదిక మాట. నిన్నటి ఢిల్లీ ప్రమాదంలో సైతం అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి, పక్కనున్న భవనం నుంచి నిచ్చెన ఎక్కి, ఆసుపత్రి వెనకవైపు నుంచి వెళ్ళబట్టి కనీసం అయిదుగురు శిశువుల్ని ఆఖరు క్షణంలో కాపాడగలిగారు. లేదంటే ఏమిటి పరిస్థితి? అందుకే, ఇది ప్రభుత్వ యంత్రాంగం అంతటికీ మరోసారి మేలుకొలుపు. గుజరాత్ లాంటి చోట్ల నిబంధనల్లోని లోపాలను అడ్డం పెట్టుకొని, అహ్మదాబాద్, గాంధీనగర్ సహా అనేకచోట్ల చట్టవిరుద్ధంగా వినోద కార్యకలాపాల వసతులు పుట్టగొడుగుల్లా మొలుస్తున్నాయి. తాత్కాలిక నిర్మాణాలతో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి, ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. దీన్ని అరికట్టాలి. తప్పులు జరిగినప్పుడు సంబంధిత శాఖల అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం పరిష్కారం కాదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా తీసుకొని కొందరు సాగిస్తున్న దుర్మార్గ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలి. ఎవరినీ ఉపేక్షించేది లేదనే సంకేతాలు మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపాలి. ప్రమాదాల నివారణకు సమర్థ, ప్రామాణిక చర్యల ప్రణాళికను అమలుచేయాలి. దీనికి ముందు రాజకీయ నేతల చిత్తశుద్ధి అవసరం. ఆపైన అలాంటి వసతులనే ఎంచుకోవడంలో సామాన్యుల అప్రమత్తత కీలకం. దేశవ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగి, చర్యలు చేపట్టేందుకు ప్రమాద భద్రతపై సత్వరమే జాతీయ స్థాయి ఆడిట్ జరిపితే మేలు. నేతల సంతాపాలు, నష్టపరిహారాలు మనుషుల ప్రాణాల్ని వెనక్కి తీసుకురాలేవు. -
ఈసీ నోరుమెదపదేం?!
కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్‌నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది. మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్ కోసం డిమాండ్ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్ కోరనేలేదు. వెబ్‌కాస్టింగ్ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి. -
ఆంగ్ల ఆధ్యాత్మికవాది
ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె. చెస్టర్టన్. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్‌లో జన్మించిన గిల్బర్ట్ కీత్ చెస్టర్టన్ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ద మ్యాన్ హూ వజ్ థర్స్డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్ రాశారు. మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.‘ఆయన ప్రతిదాని గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్టన్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్ చెస్టర్టన్ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్ అహ్లిక్విస్ట్. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్టన్ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్ రచయిత సి.ఎస్.లూయిస్‌ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా చెస్టర్టన్ రచనలే ప్రభావం చూపాయి. సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్టన్ బీటిఫికేషన్కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథలిక్ రచయిత జోసెఫ్ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, బెర్ట్రాండ్ రసెల్ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్టన్ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్ డిటెక్టివ్ ‘ఫాదర్ బ్రౌన్’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్ హోమ్స్‌లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్ బ్రౌన్. చెస్టర్టన్ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్ ప్రజలు ఇంగ్లిష్‌వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్‌గా పరిగణించడానికి ఒక కారణం– ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు! చెస్టర్టన్ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్ బెల్లోక్ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్ చనిపోయాక చెస్టర్టన్ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జీకేస్ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు – ఆవు’ అనేది వీరి స్లోగన్.సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్టన్ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’లో చెస్టర్టన్ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్ ఒపీనియన్’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్ కావాలి. భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్‌వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్టన్. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్‌లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్ కాదు, ఇంగ్లిషిస్థాన్ అవుతుంది’ అని రాశారు.విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్‌టన్‌కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినా చెస్టర్టన్ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. ‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్టన్ను ఎడ్గార్ అలెన్ పోతో పోల్చారు బోర్హెస్. ‘చెస్టర్‌టన్‌కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా. అయితే జాన్ పైపర్ వ్యాఖ్యానం చెస్టర్‌టన్‌కు తగిన నివాళి: ‘చెస్టర్టన్ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన. -
Belli Lalitha: ముక్కలైన దేహానికి పాతికేళ్లు
పాటనే జీవితంగా మలుచుకొని చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. 1972 ఏప్రిల్ 29న భువనగిరిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చదువులేని ఆమె పొట్టకూటి కోసం స్థానిక కాటన్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఈ క్రమంలోనే సీఐటీయూలో సభ్యత్వం తీసుకొని కార్మిక హక్కుల సాధన కోసం పోరాడింది. అనంతరం ‘భువనగిరి సాహిత్య మిత్ర మండలి’లో చేరి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటను తన అస్త్రంగా మార్చుకుంది. ‘తాగబోతే నీళ్లు లేవూ తుమ్మెదాలో... తడి గొంతూలారిపాయే తుమ్మెదాలో!’ అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యలపై గళమెత్తింది. 1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ ‘తెలంగాణ ఐక్య వేదిక’ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న భువనగిరిలో జరిగిన ‘దగాపడ్డ తెలంగాణ’ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 1997 ఆగస్టు 11న బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మహాసభ’తో పాటు 1997 డిసెంబర్ 28న వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో లలిత తన గానంతో గర్జన చేసింది. పీపుల్స్‌వార్ సానుభూతిపరుల ‘తెలంగాణ జనసభ’ అనుబంధ విభాగమైన ‘తెలంగాణ కళా సమితి’ కన్వీనర్‌గా ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత వివరించింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్ధృతం అవుతుండటం ఆనాటి సమైక్య పాలకులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిపి, బహుజన నేత మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నారు. ఈ తరుణంలో1999 మే 26న ఇంటి నుండి వెళ్ళిన లలిత తిరిగిరాలేదు. 1999 మే 29న దర్గాబావిలో శరీర భాగాలు ఉన్నాయన్న వార్తతో భువనగిరి ఉలిక్కి పడింది. పదమూడు రోజులు గాలించగా పలు బావులు, చెరువుల్లో 17 ముక్కలైన లలిత శరీర భాగాలు లభ్యమయ్యాయి. 1999 జూన్ 11న జరిగిన అంత్యక్రియలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. నాటి పాలకులే... మాజీ నక్సలైట్‌ను ఆయుధంగా మార్చుకొని లలితను పాశవికంగా హత్య చేయించారని ప్రజా సంఘాలు నిరసించాయి. ఆరు దశాబ్దాల ఆకాంక్షకై 17 ముక్కలైన లలిత అమరత్వానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ కనీస గౌరవం దక్కలేదు. – పి. నరేష్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి(నేడు బెల్లి లలిత 25వ వర్ధంతి) -
బొటాబొటిగా జాతీయం!
చండీగఢ్ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్‌కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.చండీగఢ్ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా బీహార్‌లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్లలో ఎనిమిదిమంది ఇతర పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్ (25), గుజరాత్ (26), హిమాచల్ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్ (29)లో 28, ఛత్తీస్‌గఢ్ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్ రేట్‌తో విజృంభిస్తేనే కౌబెల్ట్‌లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్‌పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న జాట్ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్‌సింగ్ పరివారానికి చెందిన ఆర్‌ఎల్‌డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్‌పుత్‌ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్‌పుత్ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్‌పుత్ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.యూపీ, బీహార్లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్‌లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వాజ్‌పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్ చేసుకున్న ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్ చేస్తున్న ‘వికసిత భారత్’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్ లేబర్ శాంపుల్ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్ డౌన్ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.శరద్ పవార్, బాల్‌ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్‌కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్‌గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కిర్గిజిస్తాన్ భద్రమేనా!
ఉపాధి కోసమో, విద్యార్జన కోసమో మనదికాని చోటుకు పిల్లలను పంపినప్పుడు కన్నవాళ్ల హృదయం వారి కోసం నిత్యం ఆరాటపడుతుంది. సక్రమంగా ఉన్నారా, తిన్నారా అన్న ఆలోచనలే అనుక్షణమూ వారిని వేధిస్తుంటాయి. ప్రపంచం మునపట్లా లేదు గనుక ఇటువంటి భయాందోళనలు ఇప్పుడు మరింత పెరిగాయి. దేశంలో ఉన్నత విద్యారంగం, మరీ ముఖ్యంగా వైద్య విద్య బాగా విస్తరిస్తే అందరికీ అందుబాటులోకొస్తే మన విద్యార్థులు దూరతీరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలా లేకపోబట్టే విద్యార్థులు అనుకోకుండా జరిగే పరిణామాల్లో చిక్కుకుని అవస్థలు పడాల్సివస్తోంది. రెండున్నరేళ్లక్రితం ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి తెగబడినప్పుడు అక్కడి మన వైద్య విద్యార్థులు ప్రాణాపాయంలో చిక్కుకోవటం, ఇబ్బందులు పడటం చూశాం. మన దేశంతోపాటు అన్ని దేశాలూ తమ తమ విద్యార్థులను సురక్షితంగా వెనక్కు తీసుకెళ్లగలిగాయి. సరిగ్గా వారం క్రితం కిర్గిజిస్తాన్లోనూ విద్యార్థులకు సమస్య ఎదురైంది. ఈనెల 13న పాకిస్తాన్, ఈజిప్టు విద్యార్థులతో ఏర్పడిన తగవు ఆసరా చేసుకుని వందలాదిమంది స్థానికులు విద్యార్థుల హాస్టళ్లపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. అనేకమంది విద్యార్థులను గాయపరిచారు. విద్యార్థినులను సైతం వేధించటం, దౌర్జన్యం చేయటంతో ఎప్పుడేమవుతుందో తెలియక విద్యార్థులంతా ఏడెనిమిది గంటలపాటు చీకటి గదుల్లో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులు రంగంలోకి దిగినా దుండగులను అదుపు చేయలేకపోయారు. ఆ తర్వాత అరెస్టులు జరిగాయి. అది వేరే సంగతి. హాస్టళ్లకూ, విదేశీ విద్యార్థులుండే అపార్ట్మెంట్లకూ రక్షణ కల్పిస్తున్నారు. కానీ ఘటన జరిగివారం కావస్తున్నా ఎక్కడా భయాందోళనలు చల్లారలేదు. దాంతో స్వస్థలాలకు పోవటమే ఉత్తమమని శుక్రవారం కూడా వందలాదిమంది పాకిస్తానీ విద్యార్థులు ఇంటి బాట పట్టారు. వారి ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. మన విదేశాంగశాఖ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బిషెక్‌లోని మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడి భాష, సంస్కృతీ సంప్రదాయాలు, పద్ధతులపై అవగాహన పెంచుకుని వాటిని గౌరవించటం అలవాటు చేసుకోవాలి. తమ దేశానికి చెందినవారితోనే సన్నిహితంగా మెలగటం, స్థానికులను చిన్నచూపు చూసే స్వభావం అనవసరమైన అపార్థాలకు దారితీస్తుంది. తమ సంస్కృతే ఘనమైనదని, ఇతరులు అల్పులన్న భావన స్వదేశంలో ఎంతోకొంత చెల్లుబాటవుతుంది. వేరేచోట మాత్రం సమస్యలు తెస్తుంది. దీన్ని గుర్తించబట్టే విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానికులతో కలిసిమెలిసివుండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. కిర్గిజిస్తాన్‌లో మూడేళ్లక్రితం కూడా గొడవలు జరిగాయి. అప్పుడూ ఇప్పుడూ కూడా పాకిస్తాన్ విద్యార్థులే గొడవలకు కారకులయ్యారు. రౌడీయిజం, స్థానిక సంప్రదాయాలను కించపరచటం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనటం వంటివి సమస్యలు తెచ్చిపెడుతున్నాయన్నది స్థానికుల ఆరోపణ. సాధారణంగా ఒకరిద్దరి ప్రవర్తన వల్ల గొడవ జరిగితే అది వారికే పరిమిత మవుతుంది. ఎవరో ఒకరి జోక్యంతో అంతా సద్దుమణుగుతుంది. కానీ సామాజిక మాధ్యమాల హవా పెరగటం, ఆ గొడవ తాలూకు వీడియో క్షణాల్లో అందరికీ చేరటం భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఉద్రిక్తతలు రేపుతోంది. దీనికితోడు విదేశీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తమకు లేకపోవటం, వారి జీవన ప్రమాణాలు మెరుగ్గా కనబడటం ఆర్థికంగా అంతంతమాత్రంగా బతుకీడ్చే స్థానికులకు సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తూ విదేశీ విద్యార్థులను అందలం ఎక్కించటం అసంతృప్తికి దారితీస్తుంది. పుండు మీద కారం జల్లినట్టు వారిని కించపరచటం లాంటి చేష్టలకు పాల్పడితే ఇక చెప్పేదేముంది? ఇలాంటి సమయాల్లో కారకులెవరన్న విచక్షణ ఉండదు. విదేశీయులందరినీ ఒకే గాటనకడతారు. కనుక ఎవరికి వారు పద్ధతిగా ఉంటే సరిపోదు. తోటి విద్యార్థులపై ఓ కన్నేసివుంచాలి. సమస్య తలెత్తవచ్చన్న సందేహం కలిగితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిజానికి మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్ వేరే దేశాలతో పోలిస్తే ఎంతో ప్రశాంతమైనది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానికులు ప్రధానంగా సంచార జీవనానికి అలవాటుపడినవారు. విదేశీ అతిథులను ఆదరించటం, గౌరవించటంలో వారు ఎవరికీ తీసిపోరు. కిర్గిజిస్తాన్ విద్యాలయాల్లో మన విద్యార్థులు 15,000 మంది ఉంటారని అంచనా. పాకిస్తాన్ నుంచి వచ్చినవారి సంఖ్య 11,000. వీరుగాక ఇంకా బంగ్లాదేశ్, కొన్ని అరబ్, ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా చదువుకోవటానికి వస్తారు. తమ దేశాల్లో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారడమే ఇందుకు కారణం. పూర్వపు సోవియెట్ యూనియన్‌లో భాగం కావటం వల్ల పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కిర్గిజిస్తాన్ వైద్య విద్య ఎంతో ప్రామాణికమైనది. అంతర్జాతీయంగా అనేక దేశాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కూడా దానికివుంది. వేరే దేశాల్లో చదవాలని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని తహతహలాడే పిల్లలు దూరాభారాలు లెక్కచేయక విదేశాలకు వెళ్తారు. కానీ ఇక్కడ చదువుకోవాలనుకునేవారికి మన వైద్యవిద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవటం ప్రభుత్వాల బాధ్యత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాయి. వేరే రాష్ట్రాలు కూడా ఆ పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం అందుకు సహాయసహకారాలు అందించాలి. -
రిషి సాహసం!
వచ్చే జులై 4న బ్రిటన్ దిగువసభ ఎన్నికలు నిర్వహిస్తామంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బుధవారం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్సర్వేటివ్ పార్టీ నిరంతరాయంగా పద్నాలుగేళ్లనుంచి అధికార పీఠాన్ని అంటిపెట్టుకుంది. అయిదేళ్ల గడువుకు అయిదు నెలల ముందే జరుగుతున్న ఈ ఎన్నికలు వారి పాలనకు చరమగీతం పాడతాయా, మరోసారి అందలమెక్కిస్తాయా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ కన్సర్వేటివ్‌లకు ఆ విషయంలో అనుమానం లేదు. ఓటమి ఖాయమన్న దిగులు ఆ పార్టీని ఆవరించింది. విశ్వవిఖ్యాత కవి, రచయిత విలియం షేక్స్పియర్ విరచిత ‘హామ్లెట్’ నాటకంలోని పాత్ర పలికిన ఆత్మగత సంభాషణలో ‘టు బీ ఆర్ నాట్ టు బీ...’ అందరికీ గుర్తుండిపోయే పదబంధం. బతకటమా, చావటమా అనే సందిగ్ధ స్థితిని అది చెబుతుంది. కన్సర్వేటివ్ పార్టీ ప్రస్తుతం ఆ సంకటస్థితిలోనే ఉంది. నిరుడు జులైలో దిగువ సభకు జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒకటే గెల్చుకుంది. ఈ నెల మొదట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ దాని పరిస్థితి ఏమంత బాగులేదు. నిజానికి నిరుడూ, అంతకు ముందు సంవత్సరమూ దేశం అధిక ద్రవ్యోల్బణంతో కుంగిపోయింది. కానీ నెలరోజుల్లో ఉప ఎన్నికలుంటాయనగా అది చెప్పుకోదగ్గ మేర తగ్గింది. అయినా వోటర్లు కరుణించలేదు. మొన్న స్థానిక ఎన్నికల సమయానికి కూడా ఆర్థిక స్థితి మెరుగుపడిన సూచనలు కనబడ్డాయి. వృద్ధి రేటు బాగుందని జీడీపీ గణాంకాలు చాటాయి. ఆర్థిక మాంద్య ప్రమాదం తప్పిందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ స్థానిక ఎన్నికల్లో జనం లేబర్ పార్టీవైపే మొగ్గారు. కన్సర్వేటివ్ పార్టీ రేటింగ్ కనీవినీ ఎరుగని రీతిలో 20 శాతానికి పడిపోయిందని, లేబర్ పార్టీ 44 శాతంతో ముందంజలో ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. బహుశా అందుకే కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలూ, రిషి మంత్రివర్గ సహచరులూ గడువుకు ముందే పార్లమెంటు రద్దు చేయటం ప్రమాదకరమంటూ వాదించారు. అయితే రిషి సునాక్ లెక్కలు వేరు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు వెల్లడైన ఆర్థిక గణాంకాలు ఆయనకు ధైర్యాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని గణాంకాలు తేల్చాయి. 2022 అక్టోబర్‌లో 11.1 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.3 శాతానికి దిగొచ్చింది. కన్సర్వేటివ్‌లు పెట్టుకున్న 2 శాతం లక్ష్యం కన్నా ఇది కాస్తా ఎక్కువే అయినా ఇంతకు మించి ఆశించకూడదన్న అభిప్రాయం అధికారపక్షంలో ఉంది. మరోపక్క అక్రమ వలసదారులను రువాండాకు సాగనంపే చట్టం ఆమోదం పొందాక ఆ తరహా వలసలు కొద్దో గొప్పో తగ్గాయి. ఈ నేపథ్యంలోనే రిషి అత్యుత్సాహంగా ఎన్నికల ప్రకటన చేశారు. అయితే ఈ పరిస్థితి నిలకడగా కొనసాగుతుందా... మళ్లీ దిగజారుతుందా అన్న సంశయం కన్సర్వేటివ్ శ్రేణులను పట్టి కుదుపుతోంది.అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా తప్పుడు సమాచారాన్ని జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం రివాజుగా మారింది. బ్రిటన్ కూడా అందుకు మినహాయింపు కాదు. దేశం ఎదుర్కొంటున్న సకల అరిష్టాలకూ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగటమే కారణమన్న తప్పుడు ప్రచారాన్ని తలకెత్తుకున్నది కన్సర్వేటివ్ పార్టీయే. చివరకు వారి ఏలుబడిలోనే తప్పనిసరై ఆ తంతు ముగించారు. బ్రిటన్ స్వేచ్ఛాజీవి అయింది. అయినా ఆర్థిక ఒడుదొడుకులు దాన్ని పీడించాయి. అధిక ధరలు, నిరుద్యోగం పాలకపక్షాన్ని నిద్రపోనీయకుండా చేశాయి. వోటర్లలో కనబడిన అనాసక్తత వల్ల 2019 డిసెంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా కన్సర్వేటివ్ పార్టీ నికరమైన మెజారిటీతో బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దలేక ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన లిజ్ ట్రస్ సైతం ప్రజల్ని నిరాశపరిచారు. కనుకనే ప్రధానిగా రిషి సునాక్‌ను కన్సర్వేటివ్ పార్టీ ఎంచుకుంది. కానీ పదవిలోకొచ్చింది మొదలు రిషికి సమస్యలు తప్పలేదు. జాన్సన్, ట్రస్‌ల మాదిరే ఆయనపై కూడా సాధారణ వోటర్లలో ఏవగింపు మొదలైంది. వ్యక్తిగతంగా రిషి రేటింగ్ కూడా తీసికట్టే! సర్వేలన్నీ వరసబెట్టి దీన్నే చాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధపడటమంటే ఏ ప్రధానికైనా ఆత్మహత్యాసదృశమే. కానీ రిషి తెగింపు వెనక కారణం ఉంది. ప్రత్యర్థి లేబర్ పార్టీకి వోటర్ల ఆదరణ బాగానేవున్నా వ్యక్తిగతంగా ఆ పార్టీ నాయకుడు కియర్ స్టార్మర్ పై ప్రజలకంత విశ్వాసం లేదు. అందుకే ఎన్నికలకు ఇంతకన్నా మంచి ముహూర్తం ఉండబోదన్న నిర్ణయానికి రిషి వచ్చివుండొచ్చు. దానికితోడు స్టార్మర్ ప్రధాన నినాదం ‘ఆర్థిక సుస్థిరత’. అది ఇప్పటికే సాధించినట్టు గణాంకాలు చెబుతుండగా ఆ నినాదానికి విలువుండదని రిషి నమ్మకం.రష్యా దురాక్రమణ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ, ఇరాన్ దూకుడు... మరో ప్రపంచయుద్ధానికి దారితీస్తాయన్న భయాందోళనలు అన్నిచోట్లా ఉన్నట్టే బ్రిటన్‌లోనూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మితవాద పార్టీ కన్సర్వేటివ్‌లు అధికారంలో ఉండటమే ఉత్తమమన్న వాదనను ఆ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది. సైనిక వ్యయాన్ని అదుపు చేస్తామన్న లేబర్ పార్టీ వాగ్దానం ప్రమాదకరమని కూడా ఆ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. కనుక రాబోయే ఎన్నికలు రక్షణ, భద్రత చుట్టూ తిరిగే అవకాశం లేకపోలేదు. తనకొచ్చిన అవకాశాన్ని లేబర్ పార్టీ సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వస్తుందా లేక వోటర్లను ఒప్పించలేక చతికిలపడుతుందా అన్నది మరికొన్నాళ్లలో తేలిపోతుంది. -
నోటిదురుసుకు ఇదా శిక్ష!
నోరు పారేసుకునే అలవాటున్న నేతలకు ఎన్నికలు ఎప్పుడూ పండగే. ఊరూరా తిరుగుతూ ప్రత్యర్థులను ఇష్టానుసారం దూషించటం ఒక్కటే ఆ బాపతు నేతలకు తెలిసిన విద్య. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ రిటైర్మెంట్కు కొన్ని నెలల ముందు పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ అలాంటి నేతలను తలదన్నారు. ఆలస్యంగా వచ్చినా ‘అన్నీ నేర్చుకునే’ వచ్చారని నిరూపించుకున్నారు. న్యాయమూర్తులుగా పనిచేసినవారు వెనువెంటనే రాజకీయాల్లోకి రావొచ్చా లేదా అన్నది వేరే చర్చ. అసలు జస్టిస్ అభిజిత్ వంటివారిని రానీయొచ్చా అనే సదసత్సంశయం అందరిలోనూ కలిగేలా చేసిన ఘనుడాయన. ఆయన దూషణలు ఎంత హీనాతిహీనంగా ఉన్నాయంటే...అవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరువు తీస్తాయని, దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తాయని ఎన్నికల సంఘం(ఈసీ) వ్యాఖ్యానించింది. ఉన్నత విద్యావంతుడై, దీర్ఘకాలం వృత్తిలో కొనసాగిన ఒక బాధ్యతగల వ్యక్తి నుంచి ఇలాంటి చవకబారు మాటలు రావటం బాధాకరమన్నది. అయితే ఆయన దూషణలపై ఇంత తీవ్రంగా స్పందించిన ఈసీ, తీరా ఆయన్ను 24 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ నిషేధం విధించి ఊరుకోవటం విడ్డూరంగానే అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి గత గురువారం ఆయన దూషణలకు దిగారు. ‘మీ రేటెంత మమతాజీ...ఎంతకు అమ్ముడుపోయారు? మేకప్ వేసుకుంటున్నారు గనుక పది లక్షలా! అసలామె మహిళేనా అని సందేహం కలుగుతుంది’ అని ఆయన మాట్లాడారు. ఆ వెంటనే ఈసీకి తృణమూల్ ఫిర్యాదు చేసింది. గతంలో సమాచారం తెలుసుకోవటం, నిర్ధారించుకోవటం కష్టమయ్యేది. సామాజిక మాధ్యమాలొచ్చాక మరుక్షణంలోనే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఎన్నికల సంఘం దీన్నంత సీరియస్‌గా తీసుకుంటే 24 గంటల్లో నివేదిక తెప్పించుకుని చర్య తీసుకోవటం కష్టం కాదు. కానీ ఈసీకి దాదాపు అయిదు రోజులు పట్టింది. ఈలోగా ఆయన ప్రచారమూ యథావిధిగా సాగింది. స్వీయసమర్థన సరేసరి.మన సమాజం స్త్రీలను గౌరవిస్తుందని, పూజిస్తుందని ఘనంగా చెప్పుకుంటాం. కానీ మహిళలపై సాగుతున్న నేరాలు గమనిస్తే ఆ విషయంలో సందేహం కలుగుతుంది. బయటికెళ్తే ఎదురయ్యే సమస్యల గురించి ఏ బాలికను అడిగినా, మహిళను అడిగినా చెప్తారు. వీటిని రూపుమాపే ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కఠిన నిబంధనలతో చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలేవి? చట్టాలు ఒక్కటే సమాజాన్ని మార్చలేవు. బాధ్యతాయుత స్థానాల్లో ఉంటున్నవారు సక్రమంగావుంటే ఇతరులకు అదొక సందేశమవుతుంది. కానీ వారే విచ్చలవిడి చేష్టలతో, మాటలతో చెలరేగుతుంటే వీధుల్లో తిరిగే పోకిరీలు ఇక నేర్చుకునేదేముంటుంది? మహిళలను కించపర్చటంలో జస్టిస్ అభిజిత్ మొదటివారు కాదు... బహుశా చివరివారు కూడా కాకపోవచ్చు. సాధారణ సందర్భాల మాటెలావున్నా కనీసం ఎన్నికలప్పుడైనా ఈసీ తీవ్రంగా స్పందిస్తే కొద్దో గొప్పో ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు పెద్దగా పట్టనివారు సైతం ఎన్నికలప్పుడు ఆసక్తి చూపుతారు. అందువల్లే ఈసీ కఠినంగా ఉండాలి. ఎన్నికల ప్రచారంలో పాటించే మార్గదర్శకాలేమిటో తమ అభ్యర్థులకూ, పార్టీ ప్రచారంలో పాల్గొనే ఇతరులకూ తెలియజేయాలని బీజేపీ అధినేత జేపీ నడ్డాకు ఈసీ సూచించింది. ఆ పార్టీ దాన్నెంతవరకూ పాటించిందో తెలియదు. అయినా ఇది ఈసీ చెబితేగానీ తెలియనంత విషయమేం కాదు. పార్టీలకు మందీమార్బలం ఉంటుంది. వివిధ హోదాల్లో ఉండేవారంతా బాధ్యతలు పంచుకుని తీరికలేకుండా ప్రచారంలో తలమునకలైన అధినేతలకు అవసరమైన విషయాలను చేరేస్తుంటారు. కానీ వారెవరికీ జస్టిస్ అభిజిత్ సంస్కారహీనమైన మాటలు తప్పనిపించినట్టు లేదు. సరిగదా...‘ప్రధానిని విపక్షాలు అంటున్న మాటలు మీకు వినిపించటంలేదా...కళ్లూ, చెవులూ మూతబడ్డాయా?’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య ఈసీని ప్రశ్నించారు. ‘కంటి వైద్య నిపుణులతో చూపు సరిచేయించుకోండి’ అని కూడా ఉచిత సలహా ఇచ్చారు. తమది విభిన్నమైన పార్టీ అని తొలినాళ్లలో చెప్పుకున్న రాజకీయ పక్షం నుంచి ఇలాంటి సమర్థనలు ఆశించగలమా? జస్టిస్ అభిజిత్ ఇప్పుడే కాదు... న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. మమత ప్రభుత్వంపై వెలువరించే తీర్పుల్లో ఆయన వ్యాఖ్యలు మితిమీరుతున్నాయన్న అభిప్రాయం ఉండేది. ఆయన్ను సమర్థించే మీడియా మాత్రం ‘ప్రజా న్యాయమూర్తి’ అనే భుజకీర్తులు తగిలించింది. అది వేరే సంగతి. చిత్రమేమంటే ఆయన తీర్పులను గట్టిగా సమర్థించి, ఎవరు ఎప్పుడు పునః సమీక్షించినా అవి ప్రామాణికమైనవని నిర్ధారణవుతుందన్నవారు సైతం బీజేపీలో చేరటం ద్వారా వ్యవస్థ విశ్వసనీయతను జస్టిస్ అభిజిత్ తీవ్రంగా దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారినీ, మహిళల వ్యక్తిత్వహననానికి పాల్పడేవారినీ ఉపేక్షించటం, నామమాత్రపు నిషేధాలతో సరిపెట్టడం న్యాయం కాదు. అవసరమైతే పోటీకి అనర్హులను చేయటంవంటి కఠిన చర్యలకు సిద్ధపడితే తప్ప ఇటువంటి నేతలు దారికి రారు. చట్టసభల్లో ఎలాగూ ఆరోగ్యవంతమైన చర్చలకు తావుండటం లేదు. కీలకమైన నిర్ణయాలు సైతం మూజువాణి ఓటుతో గట్టెక్కి చట్టాలుగా మారి సామాన్యులపై సవారీ చేస్తున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏ పార్టీ చరిత్రేమిటో, ఎవరివల్ల తమకు మేలు కలుగుతుందో నిర్ధారించుకునే అవకాశం ప్రజలకివ్వటం అవసరం. అందుకు నోటిదురుసు నేతలను కట్టడి చేయటం ఒక్కటే మార్గం. -
ఏం జరగనుంది?
ప్రపంచమంతటినీ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ప్రమాదం... విన్న వెంటనే రకరకాల ఆలోచనలు, అనుమానాలు తలెత్తిన అనూహ్య ఘటన... ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ, విదేశాంగమంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్‌లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాయవ్య ఇరాన్లో ఆదివారం కుప్పకూలిందన్న వార్త పలు పాత, కొత్త విషయాలను ఏకకాలంలో స్ఫురణకు తెచ్చిన సంచలనం. అంతర్జాతీయ ఆంక్షలు, విమానాల నిర్వహణలో కష్టాల వల్ల ఇరాన్లో విమానయాన భద్రత దీర్ఘకాలంగా పెనుసవాలైంది. తాజా ఘటనతో ఆ సంగతి మళ్ళీ రుజువైంది. గగనయానంలో గతంలో పలువురు ప్రముఖుల దుర్మరణాల మొదలు రైసీ హయాంలో ఇరాన్ ప్రస్థానం, రానున్న కాలంలో వచ్చే మార్పుల వరకు అనేకం చర్చనీయాంశాలయ్యాయి.ఇరాన్ – ఇరాక్ యుద్ధం నాటి నుంచి తన విపరీత వర్తనతో వార్తల్లో ఉన్న సంప్రదాయవాద మతబోధకుడు రైసీ దేశాధ్యక్షపదవిని చేపట్టింది 2021లోనే! ఆయన కన్నా ముందు మితవాది అయిన హసన్ రోహానీ ఎనిమిదేళ్ళు ఆ పదవిలో ఉన్నారు. చర్చల ద్వారా మార్పు తేవాలనీ, దేశాన్ని సుసంపన్నం చేయాలనీ భావించిన రోహానీకి పూర్తి భిన్నమైన వ్యక్తి రైసీ. కరడుగట్టిన ఛాందసం, హిజాబ్ «ధారణ సహా సమాజంలో కఠిన నిబంధనల అమలు, వందలాది ఉరిశిక్షలతో అంతులేని అపకీర్తి సంపాదించుకున్నారు. నిజానికి, అమెరికా సహా ప్రపంచ దేశాలతో అణు ఒప్పందంపై 2015లో రోహానీ సంతకం చేశారు. కానీ, ఆనక అమెరికా అధ్యక్షపీఠమెక్కిన ట్రంప్ మాటతప్పి, 2018లో ఇరాన్‌పై మళ్ళీ ఆంక్షలు విధించేసరికి దేశంలో చెల్లని కాసయ్యారు.ఫలితంగా మితవాదుల్ని తోసిపుచ్చి, ఛాందసులు పట్టు బిగించారు. మానవ హక్కుల సంఘాలు సహా అందరూ వ్యతిరేకించడంతో అంతకు ముందు ఒకటికి రెండు సార్లు ఎన్నికల్లో నెగ్గలేకపోయినప్పటికీ, ఎట్టకేలకు 2021లో రైసీ పీఠమెక్కారు. దేశాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించింది కొద్ది కాలమే! ఆయన హయాంలో పొరుగున ఉన్న అరబ్ దేశాలతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌తో, పాశ్చాత్య ప్రపంచంతో ఘర్షణలు మరింత పెరిగాయి. ప్రాణాలు తీసిన హెలికాప్టర్ చాలా పాతదంటున్నారు. పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షల కారణంగా కొత్త ఛాపర్లు, విమానాలను ఇరాన్ సమకూర్చుకోలేకపోయిందట. అమెరికా మాటెలా ఉన్నా... చైనా, రష్యాలతో సాయిలా ఫాయిలాగా ఉంటున్న దేశానికి, అందులోనూ అసంఖ్యాకంగా డ్రోన్లు సహా అపమిత ఆయుధ సంపత్తి గల దేశానికి పాత ప్రయాణ సాధనాలే గతి అయ్యాయంటే ఆశ్చ ర్యమే. ఏమైనా, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు హమాస్, హెజ్బుల్లా లాంటి వాటికి కొండంత అండగా నిలిచి రైసీ అక్షరాలా అమెరికాకు కంటిలో నలుసయ్యారు. అందుకే, హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర కోణం ఉండవచ్చనే అనుమానాలు వినవచ్చాయి. ఇటీవలి పశ్చిమాసియా పరిణామాలు... ఆ అను మానాలకు బలమిచ్చాయి. తమపై దాడి చేసిన హమాస్‌కు పెద్ద అండ ఇరాన్ గనక తెగబడి ఇజ్రా యెల్ గుట్టుగా హత్య చేయించి ఉండవచ్చనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పైగా, గాజా చర్యల్లో ఇజ్రాయెల్‌ను బాహాటంగా సమర్థిస్తూ, దానితో వ్యూహాత్మక సహకారమున్న అజర్‌బైజాన్‌కు రైసీ వెళ్ళి వస్తున్నప్పుడే ఘటన జరగడం గమనార్హం. అయితే అనుమానాలకు తగిన ఆధారాలు కానీ, కనీసం ఇరాన్ నుంచి ఆరోపణలు కానీ... ఏవీ ఇప్పటి దాకా బయటకు రాలేదు. ఫలితంగా, దురదృష్టకర ప్రమాదంలోనే ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారని ప్రస్తుతానికి భావించాలి.ప్రమాదంపై లోతుగా దర్యాప్తు జరిపి, నిజానిజాలను సమగ్రంగా బయటపెట్టాల్సిన బాధ్యత ఇరాన్‌దే! ఏమైనా, అమెరికా ఆంక్షలు, ఆర్థికరంగంలో ఇక్కట్లు, సమాజంలో అసంతృప్తి, నెత్తిన పశ్చిమాసియా కుంపటితో అస్తుబిస్తు అవుతున్న వేళ ఈ దుర్ఘటన ఆ దేశానికి అశనిపాతం. ఇక, ప్రస్తుతానికి దేశ ఉపాధ్యక్షుడికి తాత్కాలిక అధ్యక్ష హోదా ఇచ్చారు. యాభై రోజుల సంతాప దినాల తర్వాత ఇరాన్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఆ దేశంలో అధినాయకుడి (అలీ ఖమేనీ)దే ఆఖరు మాట. అయినా అధ్యక్ష పదవి సైతం కీలకమే! దేశీయ, ప్రాంతీయ అనిశ్చితులు ఎన్నో ఉన్నా, రైసీ దుర్మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ రాజకీయాల్లో, విధానాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయనీ అనుకోలేం. హెలికాప్టర్ ప్రమాదఘటన ఇరాన్‌కు తీరని విషాదమే తప్ప, రాజకీయ సంక్షోభం కాదని విశ్లేషకులూ తేల్చేస్తున్నారు. అధినాయకుడైన ఖమేనీకి ఆశ్రితుడిగా, ఆయన మాటను ధిక్కరించే ఆలోచనైనా లేని అధ్యక్షుడిగా, ఎనభై అయిదేళ్ళ వయసు మీద పడ్డ ఆయనకు అరవయ్యో పడిలోని వారసుడిగా అందరూ భావించిన రైసీ హఠాన్మరణంతో ఒక అధ్యాయమైతే ముగిసింది. ఇరాన్ చరిత్రలో కొత్త అధ్యాయం ఏమిటి, వారసుడెవరన్నది చర్చ. ఈ వారసత్వ రాజకీయాల కొత్త కూర్పులో ఖమేనీ కుమారుడు సయ్యిద్ మొజ్తబా హుసేనీ పైకి వస్తారని ఓ అంచనా. ఇస్లామిక్ ధర్మశాస్త్ర పాలన (వెలాయత్ ఎ ఫకీ) పేరిట మతాచార్యులకు పెద్ద అయిన షియా ధర్మశాస్త్రవేత్త అధినాయకుడిగా కొనసాగే పద్ధతి 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్లో వచ్చింది. అధినాయకుడు, ఆ తర్వాతే దేశాధ్యక్షుడు వగైరా అన్న విధానంపై విమర్శలు, చట్ట బద్ధతపై ప్రశ్నలు, అధికారానికి అనేక సవాళ్ళు వచ్చినా ఇన్నేళ్ళుగా అది కొనసాగింది. 1989 నుంచి ఖమేనీ కనుసన్నల్లోనే ఇరాన్ నడిచింది. కానీ, మారుతున్న భౌగోళిక రాజకీయాలు, దీర్ఘకాలంగా అణిచిపెడుతున్నప్పటికీ పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి లాంటివి ఈ ఇస్లామిక్ దేశం ముందున్న పెనుసవాళ్ళు. వాటిని అధినాయకత్వం ఎలా దీటుగా ఎదుర్కొంటుందో కచ్చితంగా ఆసక్తికరం. -
నిజాయతీ నిరూపించుకోండి!
సాక్షాత్తూ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఓ మహిళపై దాడి జరుగుతుందని ఊహించగలమా? అదీ స్వయంగా సీఎంకు కుడిభుజం లాంటి సహాయకుడే ఆ దురాగతానికి పాల్పడ్డాడంటే నమ్మగలమా? అందులోనూ తనపై అలా దాడి జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అధికార పార్టీకే చెందిన పార్లమెంట్ సభ్యురాలు కూడా అయితే, అవాక్కవకుండా ఉండగలమా? ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్)కి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ సొంత పార్టీ వారిపైనే గత వారంగా చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నది అందుకే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళితే ఆయన పీఏ విభవ్ కుమార్ అమానవీయంగా దాడి చేసి, కొట్టరాని చోటల్లా కొట్టి బయటకు గెంటించారన్న ఆరోపణలు ఏ రకంగా చూసినా అసాధారణమైనవే. అందులోనూ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అరెస్టయిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన వెసులుబాటు ఆసరాగా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చీ రాగానే ఈ పరిణామం సంభవించడం ఆయననూ, ఆయన పార్టీనీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విభవ్ అరెస్ట్, స్వాతి కథను బీజేపీ రాజకీయం చేస్తోందంటూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఆప్ యత్నాలతో వ్యవహారం మరింత ముదిరింది. కేజ్రీవాల్‌కు విభవ్ నమ్మినబంటు. పార్టీ విస్తరణ సహా అనేక బాధ్యతలను అతనికి అప్పగించారు. కేజ్రీవాల్ ఇంటిలోని క్యాంప్ ఆఫీస్ మొదలు ఢిల్లీ సెక్రటేరియట్‌లోని సీఎం ఆఫీస్ వ్యవహారాల దాకా రోజువారీ కార్యకలాపాలన్నీ అతని చేతుల మీదే నడుస్తుంటాయి. ఈ క్రమంలో స్వాతికీ, అతనికీ మధ్య గతంలో ఏం జరిగింది, దాడి ఘటన రోజున అసలేమైంది లాంటి అనేక ప్రశ్నలకింకా స్పష్టమైన సమాధానాలు దొరకాల్సి ఉంది. ఆరోపణలు వచ్చిన మొదట్లో పెదవి విప్పకుండా ‘ఆప్’ ఆలసించింది. ఆనక స్వాతిపై దాడి జరిగిందని గతవారం అంగీకరించింది. తీరా ఇప్పుడేమో ఇదంతా రాజకీయ కుట్రంటోంది. అదీ విడ్డూరం. అలాగని స్వాతి గత చరిత్ర సైతం గొప్పదేమీ కాదు. గతంలో ఢిల్లీ మహిళా కమిషన్‌కు సారథ్యం వహించిన ఆమె ఆ పదవిలో ఉండగా నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు నిందలొచ్చాయి. ఆ వ్యవహారంలో అరెస్టు తప్పదంటూ కాషాయపార్టీ బ్లాక్మెయిల్ చేసిందంటున్నారు. ఆ భయంతోనే ఆమె ఈ దాడి కథ వినిపిస్తోందనేది ‘ఆప్’ వాదన. నిజానికి, స్వాతి కూడా కేజ్రీవాల్‌కు సన్నిహితురాలే. ఆమె రాజకీయంగా ఎదిగి, రాజ్యసభ సభ్యురాలు కావడమే అందుకు ఉదాహరణ. మరి ఎక్కడ కథ అడ్డం తిరిగిందన్నది ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది. దాడి జరిగిందని చెప్పిన స్వాతి పోలీసు ఫిర్యాదుకు ఆలస్యం చేయడం, తీరా దర్యాప్తు మొదలయ్యాక రోజుకో రకం వీడియోలు, కథనాలు బయటకు రావడం చూస్తుంటే, విషయం పైకి కనిపిస్తున్నంత పారదర్శకంగా లేదన్న అనుమానమూ వస్తోంది. పోలీసులు నిష్పాక్షికంగా, లోతైన దర్యాప్తు చేసి, నిజాలు నిగ్గుతేల్చాలి. అనుమానాలు ఏమైనా, కారణాలు ఎలాంటివైనా ఒక మహిళపై భౌతిక దాడికి దిగి గాయపరచడం, దుర్భాషలాడడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. అలాగే, ఈ కేసులో సాక్షాత్తూ సీఎం ఇంటిలోని సీసీటీవీ దృశ్యాలు సహా సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నం జరిగిందంటూ వస్తున్న వార్తలు సైతం పాలక వ్యవస్థపై సామాన్య ప్రజల నమ్మకానికి గొడ్డలిపెట్టు. మరోపక్క విదేశాల నుంచి విరాళాలపై నిషేధం ఉన్నప్పటికీ ‘ఆప్’కు విదేశీ నిధులు వచ్చాయనీ, దాతల పేర్లను ఆ పార్టీ మరుగున పెట్టిందనీ, విదేశీమారకద్రవ్య నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నిబంధనల్ని ఉల్లంఘించిందనీ తాజా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమాచారం అందించినట్లు సోమవారం బయటకొచ్చిన వార్తలు కేజ్రీవాల్‌నూ, ఆయన పార్టీనీ మరింత ఇరుకునపెట్టేవే. పైగా, దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలా ఒకదాని వెంట మరొకటిగా వివాదాలు రేగి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిలోకి నెట్టడం ఏ రాజకీయ పార్టీ విశ్వసనీయతకైనా ఇబ్బంది తెస్తాయి. తాజా పరిణామాలు ‘ఆప్’నే కాక, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని సైతం ఇరుకున పెట్టాయి. మద్యం పాలసీ మొదలు స్వాతి ఆరోపణలు, తాజా ఈడీ వెల్లడింపు వార్తల దాకా వేటి మీదా కాంగ్రెస్ సహా కూటమి పార్టీలేవీ గొంతు విప్పట్లేదు. తమ వైఖరి చెప్పట్లేదు. దేశంలో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసి, మోదీని గద్దె దించడానికి తగిన సమయమని భావిస్తున్న వేళ ఇది ఆ పార్టీలేవీ ఊహించని దుఃస్థితి. ‘ఆప్’, బీజేపీల మాటల యుద్ధం మాత్రం రాజకీయ వాతావరణాన్ని రోజురోజుకూ వేడెక్కిస్తోంది. అయితే, ఈ నెల 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ... ఈ వరుస వివాదాలు ఆకస్మికమనీ, పూర్తి యాదృచ్ఛికమనీ అనుకోవడం అమాయకత్వమే. నిజాయతీకి తాము నిలువుటద్దమని ‘ఆప్’, అలాగే అవినీతి చీడను తాము ఏరేస్తున్నామని బీజేపీ... దేనికది డప్పు కొట్టుకుంటున్నా, వాస్తవాలు అందుకు దూరంగా ఉన్నాయని ప్రజలకు అర్థమవుతూనే ఉంది. బీజేపీ రాజకీయ ప్రతీకారాన్ని బయటపెడతామంటూ కేజ్రీవాల్ గర్జిస్తున్నా, అది ప్రతిధ్వనిస్తున్న దాఖలాలు పెద్దగా కనబడట్లేదు. పదమూడేళ్ళ క్రితం 2011లో అవినీతిపై అన్నాహజారే ఉద్యమం నుంచి ఊపిరిపోసుకున్న ‘ఆప్’ ఇవాళ లక్ష్యం మరిచి, దారి తప్పిన బాటసారిగా మారిపోవడం సమకాలీన చారిత్రక విషాదం. హజారే ఉద్యమంలో బాసటగా నిలిచిన స్పూర్తిదాయకమైన స్వతంత్ర వ్యక్తులు ఇవాళ ‘ఆప్’లో లేకపోవడం, కేజ్రీవాల్ భజనపరులదే పార్టీలో రాజ్యం కావడం లాంటివే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. స్వాతి ఆరోపణల పర్వంలో లోతుపాతులు ఏమైనా, ‘ఆప్’ ప్రస్థానంలో లోటుపాట్లు అనేకం. తప్పులు దిద్దుకొని, నిజాయతీ నిరూపించుకోవడమే ప్రజాక్షేత్రంలో శ్రీరామరక్ష. -
మన బంగారం
బంగారం విలువైన లోహం మాత్రమే కాదు, సంపదకు మారుపేరు. బంగారం అంటే భవిష్యత్తుకు భరోసా. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు బంగారం మీద ఎంత అనురాగం ఉన్నా, మన భారతీయులకు బంగారం మీద ఉండే మోజు అంతకు మించినది. ఎప్పటికైనా మంచిరోజులు వస్తాయనే ఆలోచనలతో బంగారు కలలు కనడం మనలో చాలామందికి అలవాటే! బంగారు ఆభరణాలు ఒంటికి అలంకరణలైతే, మన నుడికారంలో భాగమైన బంగారు సామెతలు, పదబంధాలు మన భాషకు అలంకరణలు. విపణిలో బంగారు ధగధగలు సరే, సాహితీ వీథుల్లోనూ కనకకాంతులు మిరుమిట్లు గొలుపుతాయి. ఒకానొక కాలంలో మన దేశంలో కవులకు కనకాభిషేకాలు చేసే రోజులు ఉండేవి. వేద పురాణాల నుంచి ప్రాచీన సాహిత్యంలో బంగారాన్ని గురించిన వర్ణనలు, బంగారంతో ముడిపడిన పోలికలు విరివిగా కనిపిస్తాయి. రామాయణ కాలం నాటికే బంగారం వినియోగం బాగా ఉండేది. సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లిన హనుమంతుడు రావణుడి అంతఃపురంలో ధగధగలాడే బంగారు సోపానాలతో నిర్మించిన విశాలమైన వేదికలను చూశాడట! వాటినే వాల్మీకి ‘జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణా/ హేమ సోపాన సంయుక్తం చారుప్రవర వేదికమ్’ అని వర్ణించాడు.ఆదిశంకర విరచితమైన కనకధారా స్తవం తెలిసిందే! ఆదిశంకరులు భిక్షకు వెళ్లినప్పుడు ఒక నిరుపేదరాలు తన ఇంట ఏమీ లేకపోవడంతో ఒక ఉసిరికాయ దానం చేసింది. ఆమె దుఃస్థితికి చలించిన శంకరాచార్యులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారా స్తవం ఆశువుగా పలికినప్పుడు ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయట! తెలుగు కవులలో కనకాభిషేక వైభోగాన్ని పొందిన తొలికవి బహుశా శ్రీనాథుడే కాబోలు. ‘దీనార టంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల’ అని తానే స్వయంగా చెప్పుకున్నాడు. తర్వాతికాలంలో అంతటి వైభోగాన్ని పొందిన మరో కవి అడిదం సూరకవి. ‘రాజు కళంకమూర్తి రతిరాజు శరీర విహీను డంబికా/ రాజు దిగంబరుడు మృగరాజు గృహాంతర సీమవర్తి వి/భ్రాజిత పూసపా డ్విజయ నృపాలుడు రాజు కాక ఈ/ రాజులు రాజులా పెను తరాజులు గాక ధరాతలమునన్’ అని ఆశువుగా చెప్పిన పద్యానికి మెచ్చిన విజయరామరాజు అడిదం సూరకవికి కనకాభిషేకం జరిపించాడు. ఇప్పుడు బంగారు నాణేలే చలామణీలో లేవు. ఇక కనకాభిషేకాలెక్కడ? ఒకవైపు కవులకు కనకాభిషేకాలు జరుగుతున్న కాలంలోనే మరోవైపు ‘తోటకూరకైన దొగ్గలికైన/ తవుటి కుడుముకైన దవుటికైన/ గావ్యములను జెప్పు గాండ్యాలు ఘనమైరి’ అని వేమన నిరసించినట్లుగా నామమాత్ర ప్రతిఫలానికి కక్కుర్తి పడే చిల్లర కవులు కూడా ఎక్కువగానే ఉండేవాళ్లు.‘పట్టిందల్లా బంగారమే’ అని అంటారు. ఇది మన పలుకుబడిలో భాగం. అక్షరాలా పట్టిందల్లా బంగారమే అయిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో గ్రీకు పురాణాల్లోని ‘మిడాస్ టచ్’ కథ చెబుతుంది. మిడాస్ అనే రాజుకు ముట్టుకున్నదల్లా బంగారమైపోతుందని అదృష్టదేవత వరం ఇచ్చింది. అప్పటి నుంచి అతడు తాకినదల్లా బంగారంగా మారిపోయేది. ఒకనాడు తన ముద్దుల కూతురును దగ్గరకు తీసుకుని ఎత్తుకోబోయాడు. ఆమె జీవంలేని బంగారుబొమ్మగా మారిపోయింది. బంగారం మీద అత్యాశ తెచ్చిపెట్టే అనర్థాలకు ఇదొక ఉదాహరణ.రాచరికాలు సాగిన కాలంలో రాజులు రత్నఖచిత కనకసింహాసనాల మీద కూర్చుని పరిపాలన సాగించేవాళ్లు. యోగ్యత కలిగిన వాళ్లు కనకసింహాసనాల మీద కూర్చుంటే జనాలు ఆమోదిస్తారేమో గాని, బొత్తిగా అప్రయోజకులు కనకసింహాసనాల మీదకెక్కి పెత్తనం చలాయిస్తే జనాలు ఊరుకోరు. ‘కనకపు సింహాసనమున/ శునకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునన్/ దొనరగ పట్టము గట్టిన/ వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!’ అన్నాడు బద్దెన. కనక సింహాసనాసీనులైన శునకసమానులను ఎవరిని చూశాడో, ఎందరిని చూశాడో మరి! అంత తీవ్రంగా నిరసించాడు. బద్దెన పద్యంలోని కనకపు సింహాసనం ఒక ప్రతీక. అచ్చంగా బంగారంతో చేసినదే కానక్కర్లేదు. అధికార పీఠం ఏదైనా కావచ్చు. అప్రయోజకులు, అసమర్థులు అధిరోహించినప్పుడు ఒకవేళ అవి అచ్చంగా బంగారుపీఠాలే అయినా, వాటికి గౌరవభంగం తప్పదు.ఎవరెన్ని రకాలుగా పొగిడినా, ఇంకెవరెన్ని రకాలుగా తెగిడినా బంగారం బంగారమే! బంగారం డబ్బుకు పర్యాయపదం. ‘బంగారమే డబ్బు. మిగిలినదంతా అప్పు’ అన్నాడు అమెరికన్ ఆర్థిక వ్యాపారవేత్త జె.పి.మోర్గాన్. డబ్బుకు లోకం దాసోహం అనేమాట నిరాకరించలేని సత్యం. ‘కులము గలుగు వారు/ గోత్రంబు గలవారు/ విద్యచేత విర్రవీగు వారు/ పసిడి గల్గువాని బానిస కొడుకులు’ అని వేమన ఈ సత్యాన్నే కొంత నిష్ఠురంగా పలికాడు.బంగారానికి మెరుపు సహజలక్షణం. అలాగని ‘మెరిసేదంతా బంగారం కాదు’ అని అనుభవజ్ఞులైన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ సంగతినే ఇంగ్లిషువాళ్లు ‘ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్’ అన్నారు. బంగారానికి కుల మత ప్రాంత భాషా భేదాలేవీ లేవు. ఎవరి దగ్గర ఉంటే వారికి విలువ పెంచుతుంది. బంగారానికి ఎంత విలువైనా ఉండవచ్చు. ఎంత ధర అయినా ఉండవచ్చు. అదేదీ మనిషిలోని సుగుణానికి సాటిరాదు. ‘భూమి అట్టడుగున ఉన్న బంగారాన్ని, భూమిపై చలామణీలో ఉన్న బంగారాన్ని తెచ్చిపోసినా అదంతా ఒక్క సుగుణానికి ఖరీదు కట్టలేదు’ అన్నాడు ప్లాటో. అయినా మన బంగారం మంచిదైతే ఇంతమంది ఇన్ని సుద్దులు చెప్పాల్సిన పని ఉండేది కాదు. -
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్డీఎస్ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్ పోల్ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్డీఎస్ తెలిపింది. ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్డీఎస్ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్ ఛేంజర్స్.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ బిహేవియర్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్ ఛాయిస్‌పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్ పోల్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్‌ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్‌శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్ ప్రారంభమైంది. పోలింగ్ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్‌లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్‌లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చైనా–రష్యా కరచాలనం!
తాము చైనాను పీపుల్స్ రిపబ్లిక్‌గా గుర్తించి 75 యేళ్లు అవుతుండగా... ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పట్టు సాధించిన ఛాయలు కనబడుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్‌లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో ఇరు దేశాలమధ్యా వివిధ ఒప్పందాలు కుదరటంతోపాటు సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి మనస్తత్వాన్ని విడనాడాలని రెండు దేశాలూ అమెరికాకు హితవు పలికాయి. ప్రాంతీయ భద్రత, రక్షణ బేఖాతరు చేస్తూ కొన్ని బృందాలకు మద్దతుగా నిలిచే వినాశకర విధానాలకు స్వస్తి పలకాలని సూచించాయి. పుతిన్ వరసగా ఆరోసారి ఎన్నికై దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది రోజులవుతోంది. 2030 వరకూ ఆయనదే రాజ్యం. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మునపట్లా లేదు. ఆంక్షల చక్రబంధంలో బిగించి రష్యాను పాదాక్రాంతం చేసుకోవాలని అమెరికా, దానికి మద్దతుగా నిలిచిన యూరొప్ దేశాలూ పట్టుదలగా వున్నాయి. పర్యవసానంగా రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడి వణుకుతోంది. ఆ దేశంతో ఎవరు లావాదేవీలు సాగించినా చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది. రెండేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తటానికి కొన్ని రోజులముందు రష్యా–చైనాల మధ్య ‘హద్దుల్లేని వ్యూహాత్మక ఒప్పందం’ కుదిరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాలూ ఇప్పటికీ ‘హద్దులెరగని’ బంధాన్ని కొనసాగిస్తాయా... రష్యాపై అమలవుతున్న ఆంక్షలకూ, అమెరికా హెచ్చరికలకూ చైనా తలొగ్గుతుందా అనే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా పాశ్చాత్య ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. పుతిన్‌కు బీజింగ్‌లో దక్కిన ఘనస్వాగతమూ, ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనా, ఉభయ దేశాధినేతల ప్రసంగాలూ గమనించాక అమెరికా, యూరొప్ దేశాలకు అసంతృప్తే మిగిలివుంటుందన్నది వాస్తవం. అయితే 75 ఏళ్లక్రితం కొత్తగా ఆవిర్భవించిన చైనాను గుర్తించిననాటి సోవియెట్ యూనియన్‌కూ, ఇప్పటి రష్యాకూ పోలికే లేదు. అప్పట్లో అది అమెరికాతో ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడే తిరుగులేని శక్తి. అనంతర కాలంలో ఆ దేశం కుప్పకూలింది. చీలికలు పేలికలైంది. ఈ మూడు దశాబ్దాల్లో గత వైభవాన్ని సంతరించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలిస్తున్న వైనం కనబడుతుండగానే క్రిమియా ఆక్రమణ, ఆ తర్వాత ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం రష్యాను సంక్షోభంలోకి నెట్టాయి. చైనా మాదిరే భద్రతామండలిలో రష్యా శాశ్వతసభ్య దేశమే కావొచ్చు. కానీ ఇప్పుడది దాదాపు ఒంటరి. చెప్పాలంటే చైనాకు జూనియర్ భాగస్వామి.తమది కూటమి కాదని, తమ స్నేహం వెనకున్న ఉద్దేశం దశాబ్దాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమేనని ఉభయ దేశాలూ చెబుతున్నాయి. కానీ ఆ రెండు దేశాల ఉమ్మడి ప్రత్యర్థి అమెరికాయేనని ప్రపంచానికంతకూ తెలుసు. డ్రోన్లు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహ నిఘా నివేదికలు, ఫైటర్ జెట్లకు పనికొచ్చే విడిభాగాలు, మైక్రోచిప్‌లు సరఫరా చేస్తూ దురాక్రమణ యుద్ధానికి చైనా ఆజ్యం పోస్తున్నదని అమెరికా అనుమానం. ఈ చైనా సంస్థలను నిషేధ జాబితాలో పెడతామని హెచ్చరిస్తోంది. ఇది ఎంతోకొంత పనిచేసింది. చైనా బ్యాంకులు రష్యా సంస్థలతో మొన్న మార్చినుంచి లావాదేవీలు బాగా తగ్గించాయి. పర్యవసానంగా ఇటీవల వాణిజ్యం మందగించింది. దీన్ని మళ్లీ యధాస్థితికి తీసుకెళ్లటం పుతిన్ ప్రాధాన్యాంశాల్లో ఒకటి. అందుకే ఆయన వెంట భారీ ప్రతినిధి బృందం బీజింగ్ వెళ్లింది. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలు గమనిస్తే చైనాతో రష్యా వాణిజ్యం రికార్డు స్థాయిలో 24,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికున్న వాణిజ్యంతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. రష్యా ఎగుమతుల్లో చైనా వాటా 30శాతం కాగా,దాని దిగుమతుల్లో చైనా వాటా 40శాతం. ఆంక్షల బారిన పడకుండా వ్యాపార, వాణిజ్యాలను ఎలా కొనసాగించాలన్నదే ప్రస్తుతం రష్యా, చైనాల ముందున్న ప్రశ్న. ఇంధనం, పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో తమకు సహకరించాలని పుతిన్ అర్థించారు. అలాగే ఆంక్షల తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి కార్ల వరకూ అన్ని మార్కెట్లనుంచీ పాశ్చాత్య దేశాలు తప్పుకున్నాయి. ఆ లోటును చైనా తీరుస్తోంది. దాన్ని మరింత పెంచాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. డాలర్లలో కాక తమ తమ కరెన్సీల్లోనే లావాదేవీలు జరుపుకుంటున్నాయి. జార్ చక్రవర్తుల కాలం నుంచీ పాశ్చాత్య దేశాలతో రష్యాకున్న వాణిజ్యబంధం ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్నాళ్లూ యూరొప్ దేశాలకు వెళ్లిన సహజవాయు ఎగుమతుల్ని చైనాకు మళ్లించేందుకు పుతిన్ సిద్ధపడినా ప్రస్తుతానికైతే ఒప్పందం ఖరారు కాలేదు. వ్లాదిమిర్ సోరోకిన్ అనే రచయిత 2028 నాటికి రష్యా పోకడలెలా వుంటాయో చిత్రిస్తూ 2006లో ‘డే ఆఫ్ ఆప్రిష్నిక్’ అనే నవల రాశాడు. అప్పటికల్లా చైనా సాంకేతికతే అన్ని రంగాల్లోనూ వర్ధిల్లుతుందనీ, కానీ జార్ సామ్రాజ్యానికి ఆద్యుడిగా భావించే మధ్యయుగాలనాటి మాస్కో ప్రిన్స్ ఇవాన్‌ను తలపించే అత్యంత క్రూరమైన పాలన సాగుతుందనీ ఆ కాల్పనిక ఇతివృత్తం చెబుతుంది. పుతిన్ ఎలా పరిణమిస్తారన్న సంగతలావుంచి చైనా సాంకేతికతలు ఇప్పటికే రష్యాకు వచ్చాయి. చైనా కార్లు రష్యా రోడ్లపై పరుగులెడుతున్నాయి. ప్రపంచం గతంలో మాదిరి లేదని, ఎవరినీ ఎవరూ శాసించలేరని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఉద్రిక్తతలు ఉపశమింపజేసేందుకూ, శాంతి సాధనకూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటం, రాజీకి సిద్ధపడటం అవసరమని ఇరు పక్షాలూ తెలుసుకోవాలి. అందుకు భిన్నమైన వినాశకర మార్గంలో పోతామంటే ప్రపంచ ప్రజానీకం క్షమించదు. -
ఉత్తరాఖండ్ నిర్లక్ష్యం
నిర్లక్ష్యం మంటల్లో నిత్యం దహించుకుపోతున్న ఉత్తరాఖండ్ అడవులపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టిసారించటం, సంజాయిషీ కోరడం హర్షించదగిన పరిణామం. ఈ మంటల్లో చిక్కుకుని ఇంతవరకూ అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర జీవరాశులకు కలిగిన నష్టమెంతో తెలియదు. హిమాలయ సానువుల్లో కొలువుదీరి పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ అడవులపై అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణపరంగా ఉత్తరాఖండ్‌లో, పొరుగునున్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ రెండుచోట్లా శీతాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన గాలులు వీస్తాయి. అంతకుముందు విపరీతంగా మంచుకురుస్తుంది. దేవదారు వృక్షాలనుంచి రాలిపడిన ఆకులతో కొండ ప్రాంతాలన్నీ నిండిపోతాయి. ఈ ఆకులు మామూలుగా అయితే చిన్న నిప్పురవ్వ తగిలినా భగ్గునమండుతాయి. కానీ ఆ సమయంలో పడే వర్షాలతో అటవీప్రాంతమంతా చిత్తడిగా మారిపోతుంది. వేసవిలో కూడా ఇదే స్థితి కొనసాగుతుంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇదంతా తారుమారైంది. నవంబర్ నుంచే అడవుల్లో అగ్నికీలలు కనబడ్డాయి. ఈ పరిణామాన్ని అంచనా వేయటం పెద్ద కష్టం కాదు. కొండ ప్రాంతమంతా రాలిన ఆకులతో నిండినప్పుడు, ఎండలు మండుతున్నప్పుడు ఏం జరుగుతుందో గత అనుభవాలే చెబుతున్నాయి. దీనికితోడు పొగరాయుళ్లు నిర్లక్ష్యంగా పడేసే చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి కూడా ప్రమాదాలు తెస్తున్నాయి. మాఫియాల బెడద సరేసరి. అటవీ భూములు అందుబాటులోకొస్తే కోట్లు గడించవచ్చని ఉద్దేశపూర్వకంగా అడవుల్ని తగలబెడుతుంటారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉంటాయి. ఇక కొండప్రాంతాలకు సమీపంలో పంట వ్యర్థాలను కళ్లాల్లోనే తగలబెట్టే అలవాటు అధికం. ఇది కూడా అడవులు అంటుకోవటానికి కారణమవుతోంది. ఇలాంటివారినుంచి అడవుల్ని కాపాడటానికీ, నిప్పు జాడ కనుక్కుని వెనువెంటనే ఆర్పడానికీ కొండలపై గార్డులు గస్తీ కాస్తుంటారు. కానీ వారంతా ఎన్నికల విధులు నిర్వర్తించటానికి తరలిపోయారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దాఖలా లేదు. అందువల్లే ఈ దఫా ఇంతవరకూ 1,400 హెక్టార్ల అడవి తగలబడిందని ఒక అంచనా. గత నెలనుంచి చూసుకున్నా అడవులు అంటుకున్న ఉదంతాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లతో పోలిస్తే ఉత్తరాఖండ్‌లోనే అధికమని ఈమధ్య ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) డేటా తెలిపింది. ఉత్తరాఖండ్‌లో దాదాపు 24,305 చదరపు కిలోమీటర్లమేర అడవులున్నాయి. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇది 44.5 శాతం. ఇంత విస్తారంగా అడవులున్న రాష్ట్రం వాటిని ప్రాణప్రదంగా చూసుకోవద్దా? కొండలపై రాలిపడే ఆకుల్ని ఏరేందుకూ, తామరతంపరగా పెరిగే గడ్డి మొక్కల్ని తొలగించటానికీ, అగ్ని ప్రమాదాల నివారణకూ మనుషుల్ని నియమించాలి. ఇందుకోసం ఏటా దాదాపు రూ. 9 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ చిత్రమేమంటే ప్రభుత్వం కేవలం రూ. 3.15 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. మంటల జాడ లేకుండా చూడాలే తప్ప, ఒకసారి అంటుకుంటే అదుపు చేయటం అంత సులభం కాదు. ఈ నెల మొదట్లో అడవులు తగలబడుతున్నప్పుడు వైమానిక దళ హెలికాప్టర్లు రంగంలోకి దిగి వేలాది లీటర్ల నీటిని వెదజల్లాయి.ఈ చర్య కొంతమేర ఉపయోగపడినా అనుకోకుండా కురిసిన భారీ వర్షంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే అంతా తలకిందులవుతుంది. తమకున్న అడవుల్లో కేవలం 0.1 శాతం ప్రాంతంలో మాత్రమే మంటల బెడద ఉన్నదని ఉత్తరాఖండ్ దాఖలుచేసిన అఫిడవిట్ తెలిపింది. ఎంత శాతమని కాక, ఏమేరకు ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నామో, వాటి లోటుపాట్లేమిటో అధ్యయనం చేస్తున్న దాఖలా లేదు. ఎంత ప్రాంతంలో వృక్షాలు దెబ్బతిన్నాయో లెక్కలు చెబుతున్నారు. కానీ పర్యావరణానికి కలిగే నష్టం ఎవరూ గమనించటం లేదు. అగ్ని ప్రమాదాలవల్ల వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. నేలల్లో తేమ తగ్గిపోతుంది. పోషకాలు కూడా కనుమరుగవుతాయి. వీటికి సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందో లేదో తెలియదు. నిజానికి ఇలాంటి డేటాతో స్థానిక ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే, అడవులు తగలబడటంవల్ల భవిష్యత్తులో ఎన్ని చిక్కులు ఏర్పడే అవకాశమున్నదో చెబితే వారే స్వచ్ఛంద సైనికుల్లా ముందుకొస్తారు. అడవులను కాపాడతారు. మాఫియాలను కట్టడి చేసేందుకు సైతం సంసిద్ధులవుతారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైన చొరవేది?ఉత్తరాఖండ్ అడవులు విశిష్ఠమైనవి. అక్కడ రెండు టైగర్ రిజర్వ్‌లున్నాయి. పక్షుల సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇక్కడి గాలులు మోసుకెళ్లే ఆక్సిజన్ కారణంగానే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరం ఆ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఇక్కడి వృక్షాలవల్ల హిమాలయాల్లోని మంచుపర్వతాలు ఒక క్రమపద్ధతిలో కరిగి జీవనదులు పారుతున్నాయి. ఇంతటి అపురూపమైన అడవులు మానవ నిర్లక్ష్యం కారణంగా నాశనం కావటం అత్యంత విషాదకరం.ఎంత ప్రాంతమని కాదు...అడవిలోని ఒక్క వృక్షమైనా మన నిర్లక్ష్యంవల్ల, తప్పిదాలవల్ల నేలకొరగరాదన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తే, దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటే అడవులు కళకళలాడతాయి. మనుషులు మాత్రమే కాదు...సకల జీవరాశులూ సురక్షితంగా ఉంటాయి. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంవల్ల ఇదంతా నెరవేరితే అంతకన్నా కావాల్సిందేముంది? -
అమెరికా బెదిరింపు ధోరణి
అహంకారం తలకెక్కితే బుద్ధి మందగిస్తుంది. పెత్తనం చలాయించాలన్న యావ పరిధుల్ని మరిచిపోతుంది. భారత్–ఇరాన్‌ల మధ్య సోమవారం కుదిరిన ఒప్పందంపై అమెరికా స్పందించిన తీరు దాని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధపడేవారు ఆంక్షలు ఎదుర్కొనక తప్పదంటూ అమెరికా విదేశాంగ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్య బెదిరింపు ధోరణిలోవుంది. 2003లో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇరాన్‌తో చాబహార్ ఓడరేవు నిర్మాణంపై ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా అడుగడుగునా అడ్డుపడుతోంది. అందువల్లే అయిదేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు కాస్తా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2018లో పూర్తయిందనిపించి లాంఛనంగా ప్రారంభించారు. కానీ దానికి సంబంధించి రోడ్లు, రైల్వేలైన్లు మొదలుకొని వివిధ మౌలిక సదుపాయాల కల్పన, యంత్ర సామగ్రి వగైరాల విషయం అనిశ్చితిలో పడింది. మొత్తంమీద ఇప్పటికి 21 ఏళ్లయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్), ఇరాన్ పోర్టులు, నౌకా సంబంధ సంస్థల మధ్య ఓడరేవు టెర్మినల్ ప్రారంభంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఐపీజీఎల్ 12 కోట్ల డాలర్ల (రూ. వెయ్యికోట్లుపైగా) పెట్టుబడి పెడుతుంది. మన దేశం మరో 25 కోట్ల డాలర్ల రుణం సమకూరుస్తుంది. చాబహార్ సమీపంలో నిర్మించిన ఈ షహీద్ బెహెస్తీ పోర్టు మన దేశానికి లాభదాయకమైన ప్రాజెక్టు. అంతేకాదు... మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు అది ‘బంగారువాకిలి’. ఈ ప్రాజెక్టు కింద నిర్మాణమయ్యే రోడ్లు, రైల్వేలైన్లు వివిధ ఓడరేవులతో అనుసంధానమవుతాయి. సరుకు రవాణా చకచకా సాగుతూ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.పెట్రో కెమికల్స్, ఉక్కు, ఎరువుల రంగాల్లో ఇరాన్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది. మధ్య ఆసియా మార్కెట్లలో ఇప్పటికే తిష్ఠ వేసి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టుతో బంగారు భవిష్యత్తును కలగంటూ అందరినీ మించి ఎదగాలని దూకుడుగా వెళ్తున్న చైనాకు చాబహార్ ఓడరేవు కంట్లో నలుసు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తే బీఆర్ఐ ప్రాజెక్టుకు పెద్ద విలువుండదు. ఇంతలోనే అమెరికా కొరడా ఝళిపించటం ప్రారంభించింది. ‘మేం ఇరాన్‌పై ఆంక్షలు విధించాం కనుక దానితో ఎవరూ వాణిజ్యబంధం నెలకొల్పుకోరాద’ంటూ ఫర్మానాలు జారీచేస్తోంది. రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ఎందుకీ కడుపుమంట? ఏమిటీ బెదిరింపులు? ఇరాన్లో తనకు అనుకూలమైన మహమ్మద్ రెజా పహ్లావి (ఇరాన్ షా) పాలన సాగినంతకాలమూ అమెరికా ఆ దేశంతో సఖ్యంగా వుంది. ఇస్లామిక్ విప్లవం విజయవంతం కావటంతో ఆ పాలకుడు కాస్తా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖొమేనీ కనుసన్నల్లోకి ఇరాన్ వచ్చిననాటి నుంచీ ఆ దేశాన్ని అమెరికా అష్టదిగ్బంధం చేస్తోంది. ఏదో ఒక కారణంతో కయ్యానికి దిగుతోంది. తన సమస్యను ప్రపంచ సమస్య చేసి ఎవరూ ఆ దేశంతో వ్యాపార, వాణిజ్యాలను నడపరాదంటూ బెదిరిస్తోంది. పోనీ ఈ విషయంలోనైనా నిలకడగా వున్న చరిత్ర లేదు. 2003లో ఒప్పందం కుదిరినప్పుడు మౌనంగావున్న అమెరికా, ఆ తర్వాత కాలంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. పర్యవసానంగా ఆ ప్రాజెక్టు మూలనపడింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనాటికి అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడ్డాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకుని ఆంక్షలు సడలించాయి. మరుసటి ఏడాదికల్లా చాబహార్‌పై భారత్–ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఆంక్షల పర్వం మళ్లీ మొదలైంది. కానీ మన దేశానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అప్పటికి అఫ్గాన్ ఆర్థికాభివృద్ధిని, దానికి అందాల్సిన మానవతా సాయాన్ని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇచ్చామని అమెరికా ప్రకటించింది. సారాంశంలో క్షణక్షణమూ మారే తన చిత్తానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ మసులుకోవాలని అమెరికా వాంఛిస్తోంది. ఇలాంటి పోకడలను మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేసివుంటే వేరుగా వుండేది. అది లేకపోవటం వల్లనే తాజాగా మరోసారి హూంకరిస్తోంది. దేశాలకు తమవైన విధానాలుంటాయి. ధూర్త దేశంగా మారి ఇరుగు పొరుగుకే కాక ప్రపంచ శాంతికే భంగంగా పరిణమించినప్పుడు ఎవరూ అలాంటి దేశంతో కలవాలనుకోరు. గతంలో ఇరాన్ విషయంలో భారత్‌కు ఇచ్చిన మినహాయింపులకు షరతులున్నాయి. ఇరాన్నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును వెంటనే తగ్గించుకోవాలని, మున్ముందు ఆపేయాలని అప్పట్లో అమెరికా కోరింది. అప్పటికి రోజుకు ఏడు లక్షల చమురు బ్యారెళ్లు దిగుమతి చేసుకునే భారత్... చివరకు ఆ దిగుమతిని ఆపేసింది కూడా! ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయాలని అమెరికా కోరినా లెక్కచేయని భారత్... మొదటినుంచీ అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తున్న తమ విషయంలో భిన్నంగా ఉంటున్నదని ఇరాన్ ఇప్పటికే విమర్శించింది. ఇరాన్ వైఖరేమిటన్న సంగతలావుంచి మన ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి మనవైన విధానాలు రూపొందించుకోవటం తప్పనిసరి. విదేశాంగమంత్రి జైశంకర్ అన్నట్టు అంతర్జాతీయంగా ఎన్నో దేశాల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడే చాబహార్ పోర్టును అమెరికా సంకుచిత దృష్టితో చూడటం, మోకాలడ్డాలని ప్రయత్నించటం తగదు. మన దేశం ఇతర దేశాలతో కూడా ఈ విషయంలో చర్చించాలి. కాస్త వెనకా ముందూ కావొచ్చుగానీ ఇలాంటి అనారోగ్య ధోరణులు అందరికీ ముప్పు తెచ్చేవే! -
నేపాల్ కొత్త లడాయి
తీరి కూర్చుని సమస్యలు సృష్టించుకోవటంలో నేపాల్ ప్రధాని ప్రచండను మించినవారెవరూ ఉండరు. కనుకనే భారత్‌లోని ప్రాంతాలతో కూడిన వివాదాస్పద మ్యాప్‌తో కొత్త వంద రూపాయల నోటు విడుదల చేసి మరో గొడవకు తెరతీశారు. మన ఉత్తరాఖండ్‌లో భాగంగా... 372 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించివున్న లింపియాథుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ లడాయికి దిగడం నేపాల్‌కు కొత్త కాదు. నాలుగేళ్లక్రితం ఆ ప్రాంతాలతో కూడిన భౌగోళిక చిత్రపటాన్నీ, దానికి సంబంధించిన బిల్లునూ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం కూడా పొందింది. నిజానికి అంతకుముందే 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటించి సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఉభయ దేశాల ప్రతినిధులతో ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. అందుకు నేపాల్ కూడా ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవటంలో ఇరు దేశాలూ చొరవ తీసుకోలేదన్నది వాస్తవం. ఆ పని తక్షణం మొదలుకావాలని భారత్‌ను డిమాండ్ చేయటంలో తప్పులేదు. అందుకు దౌత్యమార్గంలో నిరంతర చర్చలు జరపటం కూడా అవసరం. కానీ దీన్ని వదిలి 2020లో ఏకపక్షంగా మ్యాప్‌ను విడుదల చేసి సమస్యను మరింత జటిలం చేయటానికే నేపాల్ మొగ్గుచూపింది. పాలక కూటమిలో అంతర్గత విభేదాలు వచ్చిన ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్‌తో వున్న సరిహద్దు సమస్యను ఎజెండాలోకి తీసుకురావటం తప్ప ఆ వివాదాన్ని చిత్తశుద్ధితో పరిష్కరించుకుందామన్న ఆలోచన పాలకులకు లేదనే విమర్శలు తరచు రావటానికి ఇదే కారణం. వంద రూపాయల నోటుపై వివాదాస్పద మ్యాప్ ఉండాలనుకోవటం వెనక కూడా ఇలాంటి ఉద్దేశమే ఉందన్నది విపక్షాల విమర్శ. తన ఏలుబడిలోని కూటమిలో భాగస్వామిగా వున్న జనతా సమాజ్‌వాదీ పార్టీ–నేపాల్ (జేఎస్పీ–ఎన్)లో కుమ్ములాట మొదలైన మరుక్షణమే ప్రచండ వివాదాస్పద మ్యాప్‌ను బయటకు తీశారు.భారత్ మద్దతున్న మాధేసి తెగల సమూహానికి ప్రాతినిధ్యంవహించే ఆ పార్టీలో అంతర్గత తగాదాలు బయల్దేరితే నేపాల్ రాజకీయాలపై వాటి ప్రభావం ఎక్కువేవుంటుంది. 2020లో సరిహద్దు సమస్యపై నేపాల్ పార్లమెంటులో బిల్లుపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించేలా చేయటంలో కీలకపాత్రపోషించిన అప్పటి ప్రధాని, సీపీఎన్ (యూఎంఎల్) నాయకుడు కేపీ శర్మ ఓలి రెండు నెలలక్రితం పాలక కూటమిలో చేరటం కూడా కొత్త కరెన్సీనోటు ముద్రణకు కారణమంటున్నారు. ‘దురాక్రమణలోవున్న నేపాల్ భూభాగాలను తిరిగి తీసుకురావటమే తమ కర్తవ్యమని సీపీఎన్(యూఎంఎల్) తన మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించివుంది. అయితే నేపాల్ పార్లమెంటు కొత్త మ్యాప్‌ను ఆమోదించినప్పుడు ప్రజల్లో కనిపించిన ఉత్సాహం, ఉద్వేగం ఇప్పుడు లేవు సరికదా...ప్రచండపై విమర్శలే అధికంగా వినిపిస్తున్నాయి. ఇలా అత్యుత్సాహంతో సొంత మ్యాప్‌లు రూపొందించుకోవటం ఒక్క నేపాల్‌కే కాదు...చైనా, పాకిస్తాన్లకు కూడా అలవాటే. మన అరుణాచల్ ప్రదేశ్‌లోని భౌగోళిక ప్రాంతాలకు తనవైన పేర్లు పెట్టుకుని, మ్యాప్‌లలో చూపుకోవటం చైనాకు అలవాటు. పాకిస్తాన్దీ అదే సంస్కృతి. అది జమ్మూ, కశ్మీర్లో కొంత ప్రాంతాన్ని ఏనాటినుంచో తన మ్యాప్‌లలో చూపుతోంది. దేశాలమధ్య సరిహద్దులకు సంబంధించి తలెత్తే వివాదాలు ప్రజలను రెచ్చగొడితే పరిష్కారం కావు. వాటిని దౌత్య స్థాయిలో అవతలి దేశంతో ఓపిగ్గా చర్చించి, చారిత్రక, సాంస్కృతిక ఆధారాల పరిశీలనకు నిపుణులతో ఉమ్మడి కమిటీలు ఏర్పాటుచేసుకోవాలి. ఆ మార్గాన్ని వదిలి ఇష్టానుసారం జనం భావోద్వేగాలను రెచ్చగొట్టాలనుకుంటే పరిష్కారానికి అందనంత జటిలంగా వివాదాలు మారతాయి. నిజానికి సరిహద్దు తగాదాలన్నీ మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలసపాలకులు వదిలిపెట్టిపోయినవే. 1814–16 మధ్య సాగిన ఆంగ్లో–నేపాలీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి నేపాల్ ధారాదత్తం చేసిన ప్రాంతమే ప్రస్తుత వివాదానికి మూలం. వలసపాలకులు పోయిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆ భూభాగంపై ఇరు దేశాల మధ్యా అవగాహన కుదరకపోవటం విచారించదగ్గదే. నిజానికి నేపాల్‌తో సరిహద్దు వివాదాలు అసలు పరిష్కారం కాలేదని చెప్పలేం. గత మూడు దశాబ్దాల్లో ఇరు దేశాలూ పరస్పరం చర్చించుకుని దాదాపు 98 శాతం సమస్యలను పరిష్కరించుకోగలిగాయి. మిగిలిన సమస్యల్ని సైతం ఈ దోవలోనే పరిష్కరించుకోవచ్చన్న ఇంగితజ్ఞానం నేపాల్ నేతలకు లేదు. దేశాధ్యక్షుడు రామచంద్ర పోద్వాల్కు ఆర్థిక సలహాదారుగా వున్న చిరంజీవి నేపాల్ సైతం కొత్త నోటు విడుదల తెలివితక్కువ నిర్ణయమని, రెచ్చగొట్టే చర్యని బాహాటంగా విమర్శించటం గమనించదగింది. అందువల్ల ఆయన తన పదవి పోగొట్టుకోవాల్సివచ్చినా ప్రభుత్వ నిర్ణయంపై జనంలో వున్న అసంతృప్తికి ఆ వ్యాఖ్యలు అద్దంపట్టాయి. ఇరుగు పొరుగు దేశాలతో వున్న సరిహద్దు తగాదాలను పరిష్కరించుకోవటంలో అలసత్వం చూపితే వాటిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటుందని గుర్తించటంలో మన పాలకులు విఫలమవుతున్నారు. ఎప్పుడో 2014లో ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఇరుదేశాల మధ్యా ఒప్పందం కుదిరినా ఇంతవరకూ సాకారం కాకపోవటంలో నేపాల్‌తోపాటు మన బాధ్యత కూడా వుంది. ఈ విషయంలో నేపాల్ పాలకులకు ఎలాంటి స్వప్రయోజనాలున్నాయన్న అంశంతో మనకు నిమిత్తం లేదు. మన వంతుగా ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. అటు నేపాల్ కూడా ఏకపక్ష చర్యలతో సాధించేదేమీ ఉండదని గ్రహించాలి. వివాదాలకు భావోద్వేగాలు జోడించటం ఎప్పటికీ పరిష్కారమార్గం కాదని గుర్తించాలి. -
పోటెత్తిన వోటర్లు!
సార్వత్రిక ఎన్నికల తొలి మూడు దశల తీరు వేరు... సోమవారంనాటి నాలుగో దశ పోలింగ్ తీరు వేరు. దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో జనం పెద్దయెత్తున వోటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నాలుగో దశలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకోసమే కాక ఈ రాష్ట్రంవైపు దేశమంతా ఆసక్తిగా చూడటానికి ప్రత్యేక కారణం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల పాలన తర్వాత ప్రజల ఆశీస్సులు కోరుతూ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకూ, బస్సు యాత్రకూ పోటెత్తిన జనవాహినిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అంటూ ప్రజానీకానికి పిలుపునీయటం, అందుకు వచ్చిన సానుకూల స్పందన అసాధారణమైనవి. విపక్షం పూనకం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు దిగినా, కులాల పేరిట ప్రాంతాల పేరిట చిచ్చురేపాలని చూసినా జగన్, ఆయన పార్టీ హుందాగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు ‘పేదలకూ, పెత్తందార్లకూ జరిగే యుద్ధం...ఇందులో మీరు ఎటువైపో తేల్చుకోండ’ని ఇచ్చిన ఆయన పిలుపును పల్లెసీమల నుంచి నగరాలు, పట్టణాల వరకూ అన్నిచోట్లా అందరూ అందుకున్నారు. కొత్తగా వోటు హక్కు వచ్చిన యువత మొదలుకొని వృద్ధుల వరకూ...వికలాంగులు మొదలుకొని అనారోగ్యంతోవున్న పెద్దల వరకూ... వేసవి తీవ్రతను కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలిరావటంలోని ఆంతర్యం అదే. కనుకనే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. వోటేయటానికి బారులు తీరిన మహిళలు, వృద్ధుల్ని చూసి టీడీపీ కూటమి వణికింది. దానికి తోడు గతంలో ఎవరూ సాహసించని, యోచించని ఒక వినూత్న ప్రయోగం చేశారు జగన్. అన్ని సామాజిక వర్గాలకూ పాలనలో సమ భాగస్వామ్యం కల్పించాలన్న పట్టుదలతో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగభాగం అట్టడుగు వర్గాలకు కేటాయించారు. అందువల్లే జనం వైఎస్సార్ కాంగ్రెస్‌ను గుండెల నిండా హత్తుకున్నారు. సాధారణంగా అయిదేళ్ల పాలన ఏ ప్రభుత్వం పైన అయినా ఎంతో కొంత అసంతృప్తి తీసుకొస్తుంది. అత్యంత జనాకర్షణగల సినీ దిగ్గజం ఎన్టీరామారావు కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు రోడ్లపైకి భారీయెత్తున వచ్చిన జనమే... ఆయన పాలన చూశాక మొహం చాటేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దాన్నుంచి కోలుకుని ప్రజాభిమానాన్ని చూరగొనడానికి ఆయనకు మరో అయిదేళ్లు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెల్లడయ్యాక దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. జనరంజక పాలన అంటే ఏమిటో... ఏం చేస్తే ప్రజల ఆదరాభిమానాలు సాధించుకోవచ్చునో అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులూ గ్రహిస్తారు. సంక్షేమం అంటే కేవలం తాయిలాలు పంచటం కాదని, వారి భవిష్యత్తును వారే నిర్మించుకునే విధంగా ఆసరాగా నిలబడటమని నిరూపించిన జగన్‌ను ఇకపై వారంతా రోల్ మోడల్‌గా తీసుకుంటారు. పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తేనే కుటుంబాలు బాగుపడతాయని గుర్తించి ఆ రంగాన్ని ప్రక్షాళన చేయటం, ప్రామాణికమైన విద్యనందించటం, ‘నాడు–నేడు’ పేరిట బడులన్నిటినీ తీర్చిదిద్దటం కనీవినీ ఎరుగనిది. వైద్యరంగంపైనా ఆయన అంతే శ్రద్ధ పెట్టారు. భారీయెత్తున సిబ్బందిని నియమించి ఆస్పత్రులను తీర్చిదిద్దటం, ఆధునాతన వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చటం, పల్లెలకు సైతం వైద్య సేవలు చేరేయటం మామూలు విషయం కాదు. అలాగే రైతు కోసం ఏర్పాటైన వ్యవస్థలైతేనేమి... వలంటరీ వ్యవస్థద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లటమైతేనేమి జగన్ విజయాల్లో మచ్చుకు కొన్ని. దేశంలో ప్రజాభిమానాన్ని చూరగొనాలనుకునే నాయకులెవరైనా వీటిని అనుసరించక తప్పదు.అయితే జనం మనస్సుల్లోంచి దీన్నంతటినీ తుడిచేయాలని చూసిన జిత్తులమారి టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి గురించీ, వారి చేష్టలకు వంతపాడిన ఎన్నికల సంఘం గురించీ ప్రస్తావించుకోవాలి. వారి నుంచి ఫిర్యాదు రావటమే తడవుగా ఉన్నతాధికారులను బదిలీ చేయటం, అయిదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలకు మోకాలడ్డటం,వారు కోరిన విధంగా అడ్డగోలుగా అధికారుల్ని నియమించటం... టీడీపీ పోకడలపై ఫిర్యాదు చేసినా బేఖాతరు చేయటం లేదా ఆలస్యంగా స్పందించటం తటస్థంగా వుండాల్సిన వ్యవస్థకు తగదు. సాక్షాత్తూ బాబే ఎన్నికల సభల్లో సీఎంనుద్దేశించి దూషించినా... ఆయన్ను రాళ్లతో కొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా బాబును ఆపే ప్రయత్నం చేయలేదు. వేరే రాష్ట్రాల్లో ప్రధానినుద్దేశించి చిన్న వ్యాఖ్య చేసినా నొచ్చుకున్న ఆ వ్యవస్థ ఏపీలో వీటన్నిటినీ ఎలా కొనసాగనిచ్చింది? అన్నీ ఒక ఎత్తయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై బాబు అండ్ కో సాగించిన దుష్ప్రచారం, ప్రజలను భయపెట్టడం మరో ఎత్తు. బాబు, లోకేష్‌లపై కేసులు పెట్టాలని ఆదేశించారు సరే... కానీ ఆ తర్వాత అదే అంశంపై నిబంధనలకు విరుద్ధంగా మీడియాలో పూర్తి పేజీ ప్రకటనలిస్తే ఎందుకు సంజాయిషీ కోరలేదు? నిజానికి పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందంటే అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సంయమనమే కారణం. అయినదానికీ, కానిదానికీ రాయలసీమపై అభాండాలేయటం బాబు దురలవాటు. కానీ చిత్రంగా అక్కడ అత్యంత ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇతరచోట్లే టీడీపీ బరితెగింపుతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈవీఎంల ధ్వంసం, పెట్రోల్ బాంబులతో దాడి, పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలను బెదిరించటం, బౌన్సర్లతో హడలెత్తించటం, పోలీస్ స్టేషన్‌పై దండయాత్ర చేయటం దేనికి సంకేతం? ఎన్ని అవరోధాలెదురైనా నిర్భయంగా పోటెత్తి వోటేసిన ప్రజానీకం అభీష్టానిదే అంతిమ విజయం. -
జనస్వామ్యమా! జయీభవ!!
ఏటా వచ్చే వేసవికి అదనంగా ఈసారి ఎన్నికల వేసవిని చవిచూస్తున్నాం. కాకపోతే రెంటి మధ్యా ఒక తేడా ఉంది. సూర్యతాపం ద్విగుణీకృతమవుతున్నకొద్దీ, వోటర్లలోనూ ఎన్నికల సమరోత్సాహం త్రిగుణీకృతమవుతుంది. అదే ప్రజాస్వామ్యంలోని అందమూ, చందమూ, ఆకర్షణా. ప్రజా స్వామ్యం అత్యుత్తమం కాకపోవచ్చుకానీ, ఇప్పటివరకూ అనుభవంలోకి వచ్చిన అన్ని వ్యవస్థల్లో అదే ఉత్తమమని పండితులెందరో తేల్చారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే వెన్నెముక. తమ కలలు, కాంక్షలతో ముడిపడినవి కనుకే ఎన్నికలు జనానికి మండు వేసవిలోనూ మంచు లేపనమవుతాయి. రాచరికం, సైనిక నియంతృత్వం లాంటి చేదు అనుభవాల దరిమిలా ప్రజాస్వామ్యాన్ని తెచ్చు కున్నామని పొరబడేవారున్నారు. రాజ్యమూ, సామ్రాజ్యమూ ఉనికిలోకి రాకముందే, మనుషులు గుంపు కట్టడం నేర్చిన తొలి దశలోనే అంకురించిన తాత్వికత– ప్రజాస్వామ్యం. కాలికమైన అంతరాలను, అడ్డంకులను దాటుకుని నేటికీ పురివిప్పుతున్న రాజకీయ తాత్వికత అదే. వేట– ఆహార సేకరణ దశలో మనిషి ప్రకృతి శక్తులతో పోరాడుతున్నప్పుడే తోటి మనుషుల తోడు, తోడ్పాటుల విలువ గుర్తించాడు; అభిప్రాయాల కలబోతనూ, ఐక్య కార్యాచరణనూ అలవరచుకున్నాడు. అంద రినీ కలుపుకొనిపోయే నాయకత్వాన్నీ ఆనాడే ప్రతిష్ఠించుకున్నాడు. గణతంత్రం పేరిట సాముదా యికంగా అభివృద్ధి చేసుకున్న సమాజాలతోనే రాజకీయ చరిత్ర ప్రారంభమైందని విజ్ఞులంటారు. గణతంత్రంలో నాయకుడు సమానులలో మొదటివాడే తప్ప అసామాన్యుడూ కాదు, అడ్డు అదుపుల్లేని అధికార శ్రీమంతుడూ కాదు. నేడు ప్రతి వోటుకూ ఒకే విలువ ఉన్నట్టే, నాడు ప్రతి ఒకరికీ ఒకే విలువ. పురాణేతిహాసాల్లో ఇందుకు సాక్ష్యాలు కనిపిస్తాయి. రామాయణంలో దశరథుడు తన పెద్దకొడుకు రాముడికి పట్టాభిషేకం చేయడానికైనా; మహాభారతంలో యయాతి తన చిన్న కొడుకు పూరునికి రాజ్యం కట్టబెట్టడానికైనా పౌర, జానపదుల ఆమోదం తప్పనిసరి. సమష్టి స్థానంలో వ్యక్తి ప్రాధాన్యం పుంజుకున్న దశలోనూ మంత్రి పరిషత్తులో చర్చించే నిర్ణయాలు తీసుకు నేవారు. విభీషణ శరణాగతి ఘట్టంలో రాముడు వానరవీరుల అభిప్రాయాన్ని అడుగుతాడు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో మలుపులూ, మరకలతోపాటు మెరుపులూ మన చూపుల్ని జిగేలుమనిపిస్తాయి. గణాలు వ్రాతాలుగా, వ్రాతాలు జనాలుగా, జనాలు మహాజనాలుగా మారే క్రమంలోనే సామ్రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి. మనదేశంలో మగధ సామ్రాజ్యావతరణకు ముందున్నది గణతంత్రమే. ఆనాడు దేశం పదహారు జనపదాలుగా ఉండేది. గ్రీస్, మెసపోటేమియాలలో గణతంత్ర రాజ్యాలు ఉండేవి. నాటి గ్రీస్‌లోని ఎథెన్స్ అధినేత పెరిక్లీస్ ప్రజాస్వామిక అనుభవాన్ని కొత్త పుంతలు తొక్కించి జనతంత్రానికే ఘన చిహ్నమయ్యాడు; సంపన్నుల ప్రతిఘటనకు ఎదురొడ్డుతూ పేదలవైపు నిలబడి కలబడడంలోనూ ప్రజానాయకులకు తొలిమూసై మణిపూస అయ్యాడు. బలవత్తరులైన పర్షియన్ల దాడిని దీటుగా తిప్పికొట్టినా, సాటి గ్రీసు రాజ్యమైన స్పార్టాతో యుద్ధమొచ్చిన దశలో ప్లేగు వాతబడి అతను కన్నుమూయడం ఎథెన్స్ స్వాతంత్య్రానికీ; ప్రజాస్వామ్యానికీ చితిపేర్చింది. ఆ తర్వాత, స్పార్టా సహా గ్రీస్ అలెగ్జాండర్ సామ్రాజ్యంలో, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యంలో చిన్న వలసగా మసకబారిపోయింది. అలా కొడిగట్టిన ప్రజా స్వామ్యం తిరిగి కాంతినీ, క్రాంతినీ తెచ్చుకోవడానికి రెండువేల సంవత్సరాలు పట్టింది. ఎథెన్స్ ప్రభవించిన తాత్విక శిఖరాలే సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్! సోక్రటిస్ ప్రజాస్వా మ్యాన్ని వ్యతిరేకించినా; ప్లేటో అన్ని అధికారాలనూ రాజ్యం చేతుల్లో పెట్టి, ఉదారవాద నియంతృత్వమనే ఊహాస్వర్గానికి నిచ్చెన వేసినా; అరిస్టాటిల్ మధ్యేమార్గంగా రాజ్యాంగబద్ధ ఆదర్శ రాజ్యాన్ని నొక్కి చెప్పినా– ముగ్గురూ పశ్చిమ దేశాల రాజకీయ తాత్విక చింతనను ఉద్దీపింపజేసిన వారే. ప్రత్యేకించి అరిస్టాటిల్ ఆధునిక కాలంలో జాన్ లాక్, మాంటెస్క్యూ వంటి ప్రజాస్వామ్య దిశానిర్దేశకులకు ఒరవడి అయ్యాడు. గ్రీకుల బహుళ దేవతారాధనను వ్యతిరేకించినందుకు సోక్ర టిస్‌ను ఉరితీయడం ఎథెన్స్ ప్రజాస్వామ్య పరిమితిని, అపరిణతిని నొక్కిచెప్పి; భావప్రకటనా స్వేచ్ఛలేనిది ప్రజాస్వామ్యమే కాదన్న నీతినీ బోధించింది. పౌర ప్రాతినిధ్యం నుంచి రాచరిక నియంతృత్వంలోకి జారిపోయిన రోమ్ అనుభవమూ ఇలాంటిదే. వ్యక్తులు ఉత్తములూ, ఉన్నత సంకల్పవంతులూ అయితే చాలదు; వ్యవస్థలను బలోపేతం చేస్తేనే ప్రజాస్వామ్యానికి ఉనికీ, మనికీ అన్నది రోమ్ నేర్పిన గుణపాఠం. యూరప్ అంతటా ప్రజాస్వామ్య వ్యవస్థల సంపూర్ణ పతనం; ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ఇంగ్లండ్ వేగుచుక్క కావడం; ఫ్రెంచి విప్లవం తిప్పిన మలుపులు; ప్రజాస్వామ్య మార్గంలో అమెరికా వేసిన ముందడుగు– ఇదంతా మరో చరిత్ర. వోటుహక్కు చరిత్రనే తిరగేస్తే, ఎథెన్స్ ప్రజాస్వామ్యంలోనూ బానిసలకు వోటు హక్కు లేదు. ఆ తర్వాతా శ్రామికులకు, స్త్రీలకు వోటు హక్కు లభించడానికి పెద్ద పోరాటాలే జరిగాయి. యూరప్ దేశాలు అనేకం ప్రజాస్వామ్యంలోకి రావడానికి ఇరవయ్యో శతాబ్ది చివరి వరకూ ఎదురుచూశాయి. ఇలాంటి చీకటి వెలుగుల చిత్రపటంలో భారత్ ఉనికే ఉజ్వలమూ, ఉత్తేజవంతమూ! వోటు హక్కును సార్వత్రికం చేసిన తొలి ఘనత మనదే. భారత్ ఒక దేశంగా మారడాన్నే అనుమానించి అవహేళన చేసిన నాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ సహా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజాస్వామిక ప్రస్థానంలో ముందడుగు వేస్తూనే ఉన్నాం. బహుళ మతాలూ, భాషల వైవిధ్యం వైరుద్ధ్యం కాదనీ, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువనీ ప్రపంచానికి చాటి చెప్పాం. భారత ప్రజాస్వామ్యమా! జయతు జయతు!