Devotion
-
అందం అంటే..?
‘అందమె ఆనందం’ అని ఒక సినిమా కవి అందాన్ని నిర్వచించాడు, ఆనందానికి నిర్వచనం ఇవ్వ బోతూ. ఆనందాన్ని కలిగించ కలిగింది మాత్రమే అందమని కవిహృదయం. ఎవరికి దేని వల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందుకని అందం చూసే వాళ్ళ కళ్లలో ఉంటుందే కానీ వస్తువులో కాదు అనే ఆంగ్ల సామెత వచ్చింది. పైగా అందం వ్యక్తిగతం.‘‘లోకో భిన్న రుచిః’’ అన్నట్టు ఒక్కొక్కరి కళ్ళకి అందంగా కనిపించింది వేరొకరికి అందంగా కనిపించక పోవచ్చు. అందం విషయంలో చాలామంది దృష్టి చర్మం దగ్గర ఆగిపోతుంది. కానీ,‘‘నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది’’ అంటాడు ఆంగ్లకవి జాన్ కీట్స్.అందం అన్నది వస్తుగతం కాదు అనే విషయం పాశ్చాత్యులు కూడా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమయింది కదా!అందానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రమాణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చైనా దేశంలో స్త్రీల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంతటి అందగత్తెలుగా పరిగణిస్తారు. ముక్కు కొస పైకి ఉండి, ముక్కు రంధ్రాలు కనపడేట్టు ఉండటం అందంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిగణించబడుతుంది. భారతీయులు అందంగా పరిగణించే పొడవుగా, కోటేరు వేసినట్టు ముక్కు ఉంటే ఏనుగు ముక్కు అని వేళాకోళం చేస్తారట కూడా. ఆఫ్రికా దేశంలో పెదవులు ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు. అందుకోసం చిన్నతనంలో పెదవులకి చిన్న చిన్న చిడతల వంటి వాటిని తగిలిస్తారట! భారతీయుల సౌందర్య దృష్టిలో కూడా పారమార్థికత ఉంది. సౌందర్యం పరమాత్ముడి లక్షణాలు, లేక తత్వాలలో ఒకటి. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ తత్త్వం ‘‘సత్యం, శివం, సుందరం’’.సృష్టిలోని అందమంతా మూర్తీభవించిన పురుషరూపం శివుడు.ఆయనే చొక్కనాథుడు, సుందరేశ్వరుడు. అదే స్త్రీ రూపమైతే లలితా త్రిపురసుందరి. భౌతికమైన అందం శాశ్వతం కాదు. ముద్దుముద్దుగా చూడగానే ముచ్చట గొలిపే పాలబుగ్గల పసివాడు చూస్తూ ఉండగానే పెద్దవాడు అవుతాడు. అప్పుడు పాలబుగ్గలు అందానికి హేతువు కాదు అని అర్థమవుతుంది.ఈ భౌతికరూపాన్ని అధిగమించిన అందాన్ని గురించి మాత్రమే భారతీయ ఋషులు, దార్శనికులు ప్రస్తావించారు. ఆ ప్రమాణాలని అనుసరించే ్రపాచీన కవులు సౌందర్య వర్ణన చేశారు. చేతులని, పాదాలని, ముఖాన్ని, కన్నులని కూడా పద్మాలతో పోల్చుతారు. కారణం వాటి ఆకారం అట్లా ఉందని కాదు. పద్మం అందమైనది.ఆహ్లాదకరమైనది, మృదువైనది, శుభప్రదమైనది, పవిత్రమైనది. కనుక ఆ అవయవాలు అంతటి పవిత్రమైనవి అని సూచించటం.ఇతరమైన ఉపమానాలు కూడా అటువంటివే. పైకి భౌతికరూప వర్ణనలాగా అనిపించినా అంతరార్థం వేరు. బాహ్యసౌందర్యం ఆత్మసౌందర్య వ్యక్తీకరణ మాత్రమే. భారతీయులకి అందం వస్తువు లేక మనిషికి సంబంధించింది కాదు. మనస్సుకి ఆత్మకి సంబంధించింది. ఆత్మసౌందర్యం మొదలైన పదబంధాలని వింటూనే ఉన్నాము. అంటే అందం వస్తువు లేక మనిషి మూలతత్త్వానికి సంబంధించింది. ఉదాహరణకి బెల్లం చూడటానికి అందంగా కనిపించదు. దాని అందం అంతా దాని రుచిలో ఉంటుంది. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తారు. నిజానికి వారి అవయవాల్లో ఒక్కటి కూడా అందాల పోటీల వాళ్ళ కొలతలకి సరిపోవు. అవయవాల పొందిక వల్ల అందంగా ఉన్నట్టు కనిపిస్తారు. పొందికకి తోడు వారి ప్రేమపూరితమైన మనస్సు. దయ, సుహృద్భావం వంటి సద్భావనలతో మనస్సు నిండి ఉంటే ఆ సానుకూల భావతరంగాలు మనసు నుండి కనుల ద్వారా వెలువడి ముఖాన్ని కాంతిమంతంగా చేస్తాయి. అప్పుడు అందంగా కనిపించదా? దీన్ని వర్చస్సు అని కూడా చెప్పవచ్చు. – డా.ఎన్.అనంతలక్ష్మి -
మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!
శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాంసంతో పోలిస్తే.. వెజిటేరియన్ ఫుడ్ త్వరగా జీర్ణం అవుతుంది. అదీగాక మాంసం వినియోగం పెరిగేకొద్దీ వనరుల వాడకం ఎక్కువవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు వెజిటేరియన్లుగా మారిపోతున్నారు. పైగా ఈ శాకాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా. మన దేశంలో దాదాపు 40 శాతం మందికి పైగా శాఖాహారులే. అయితే మన దేశంలో కొన్ని నగరాల్లో మాంసాహారం ఇష్టమైనా సరే తినడం సాధ్యం కాదు. పైగా ఈ నగరాలను భారత దేశ పూర్తి శాకాహార నగరాలుగా పిలుస్తారు. ఆ నగరాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!రిషికేశ్, ఉత్తరాఖండ్: రిషికేశ్ గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నగరం. మనశ్శాంతి , మోక్షం కోసం చాలా మంది ప్రజలు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన ఈ నగరానికి వస్తారు. నగరం చుట్టూ ముళ్ల చెట్లు , పచ్చని కొండలు ఉన్నాయి. దీన్ని దేవతల భూమిగా పిలుస్తారు. ఇక్కడ మాంసం పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఆధ్యాత్మిక శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ శాకాహారం మాత్రమే దొరుకుతుంది.వారణాసి, ఉత్తరప్రదేశ్: పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పురాతన నగరం వారణాసి. ఈ నగరాన్ని బనారస్ లేదా కాశీ అని కూడా అంటారు. ఇది శివుని నివాసం. ఎందుకంటే ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే నిర్మించాడని నమ్ముతారు. ఇక్కడ మీరు అన్ని రకాల రుచికరమైన,స్వచ్ఛమైన శాఖాహారం తినవచ్చు.హరిద్వార్, ఉత్తరాఖండ్: పవిత్ర గంగానది ఒడ్డున హరిద్వార్ ఒక ప్రకాశవంతమైన నగరం. ఈ నగరం భారతదేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా అలరారుతుంది. ఇక్కడ వేయించిన ఆహారం నుంచి సలాడ్లు , సూప్‌ల వరకు అన్ని రకాల శాకాహారాలను ఇక్కడ ప్రయత్నించవచ్చు.మదురై, తమిళనాడు: తమిళనాడు నడిబొడ్డున ఉన్న ఈ నగరాన్ని రాష్ట్రానికి గుండెకాయ అని కూడా అంటారు. ఈ నగరం పూర్తిగా శాఖాహారం. కానీ ఈ నగరం భారతదేశపు నిజమైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. అత్యంత రుచికరమైన, పోషక విలువలు కలిగిన శాకాహార వంటకాలు ఇక్కడ లభిస్తాయి.అయోధ్య, ఉత్తరప్రదేశ్ : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కూడా మాంసం దొరకడం లేదు. అయోధ్య పురి మొత్తం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ ఒక్క మాంసాహార రెస్టారెంట్ కూడా లేదు.పలిటానా, గుజరాత్: ఈ నగరం (గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా) కూడా పూర్తిగా శాకాహామే.. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా పేరుగాంచింది. కనుక ఇది శాకాహారులకు స్వర్గధామం. ఎందుకంటే ఈ ప్రదేశంలో నివసించే చాలా మంది జైనులను కఠినమైన శాకాహారులుగా పిలుస్తారు. కాబట్టి ఈ నగరంలో శాకాహారం మాత్రమే వడ్డిస్తారు.బృందావన్, ఉత్తరప్రదేశ్: ఇది మథుర జిల్లాలోని ఒక చారిత్రక నగరం.ఇది మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశం. నగరం పవిత్రత కారణంగా, ఇక్కడ గుడ్లు , మాంసం అమ్మకాలు నిషేధం.తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగరం కొండపై ఉన్న తిరుమలలలో కూడా మాంసాహారం పూర్తిగా నిషేధం. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ మాంసాహారం పూర్తిగా నిషేధం.(చదవండి: 60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!) -
కపిలుడికి.. హనుమంతుడి అనుగ్రహం!
గంగాతీరంలోని బార్హస్పత్యపురం గ్రామంలో కపిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కపిలుడు సదాచార సంపన్నుడు. దైవచింతనాపరుడు. హనుమంతుడికి పరమభక్తుడు. అయితే, అతడు నిరుపేద. భార్యా పుత్రులను పోషించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతుండేవాడు. రోజూ ఉదయమే గంగానదిలో స్నానం చేసి, నది ఒడ్డునే హనుమన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. దాతలు ఎవరైనా దక్షిణలు ఇస్తే, సాయంత్రానికి ఏ కూరగాయలో, ఆకుకూరలో కొనుక్కుని ఇంటికి వెళ్లేవాడు. దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడి కుటుంబం పస్తులుండేది.ఒకనాడు కపిలుడు యథాప్రకారం గంగానదికి వెళ్లి స్నానం చేసి, జపానికి కూర్చున్నాడు. తదేకదీక్షలో జపంలో నిమగ్నుడై, కాలాన్ని మరచిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేదీప్యమానమైన కర్ణకుండలాలతో, చతుర్భుజాకారుడై, గదాధారిగా కనిపించాడు. హనుమంతుడితో పాటు నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు తదితర వానరయోధులందరూ ఉన్నారు.కపిలుడు గంగాజలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు. ఆ అభిషేకజలం నుంచి వాలసాగరం అనే నది పుట్టింది. కపిలుడు ఆ నదికి పూజించి, హనుమతో వచ్చిన జాంబవతాది వానర వీరులను పూజించి, హనుమంతుడిని స్తోత్రపాఠాలతో ప్రార్థించాడు. కపిలుడి భక్తి తత్పరతకు హనుమంతుడు సంతృప్తి చెందాడు. ‘వరం కోరుకో’ అన్నాడు హనుమంతుడు. భక్తిపారవశ్యుడైన కపిలుడు ఏమీ కోరుకోలేదు. హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు. అప్పటికే చీకటిపడటంతో కపిలుడు ఇంటికి చేరుకున్నాడు. ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన కపిలుడిని చూసి అతడి భార్య ‘అయ్యో! కనీసం ఆకుకూరైనా తేకపోయారు. ఈ పూట పిల్లలకు ఏం వండిపెట్టగలను. కూడు గుడ్డకు కటకటలాడుతున్నా, మీ జపతపాలు మీవే కదా!’ అని రుసరుసలాడుతూ పిల్లలకు మంచినీళ్లు తాగించి పడుకోపెట్టింది.మర్నాడు తెల్లవారింది. కపిలుడు యథాప్రకారం గంగాతీరానికి వెళ్లడానికి సంసిద్ధుడయ్యాడు. అతడి భార్య సణుగుడు ప్రారంభించింది. ‘ఎంత చెప్పినా వినరు కదా! మీ జపతపాల గోల మీదేగాని, కుటుంబం గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? రాత్రి పస్తు పడుకున్న పిల్లల తిండితిప్పల గురించి ఏమైనా ఆలోచించారా?’ అంది.‘ఊరుకో! అన్నీ ఆ హనుమంతుడే చూసుకుంటాడు. మనం నిమిత్తమాత్రులం. అన్నట్లు చెప్పడం మరచాను. నిన్న నాకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ప్రసన్నంగా ఉన్నాడో స్వామి! హనుమతో పాటు జాంబవతాది వానర వీరులందరూ కనిపించారు. నా జన్మ ధన్యమైంది. ఇంక నాకేం కావాలి’ అన్నాడు కపిలుడు.‘ఔను! హనుమంతుడూ గొప్పవాడే, మీరూ ధన్యులే! మీ కుటుంబానికి మాత్రం దారిద్య్రం తప్పదు’ కినుకగా అంది కపిలుడి భార్య. ఆమె ఇంకా తన సణుగుడు కొనసాగిస్తుంటే వినలేక కపిలుడు ఇల్లు వదిలి, గంగాతీరం వైపు బయలుదేరాడు.కుటుంబ పరిస్థితిపై కపిలుడికీ బాధగానే ఉంది. అయినా హనుమంతుడి మీదనే భారం వేసి, గంగలో స్నానం చేసి, ఒడ్డున ధ్యానానికి కూర్చున్నాడు.అతడు తదేక ధ్యానంలో ఉండగా, హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు.‘కపిలా! నువ్వు నా భక్తుడవు. నీకు, నీ కుటుంబానికి క్షేమసౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం. నీ ఇంటి పెరట్లోని రేగుచెట్టు కింద ధనరాశుల బిందె పాతరవేసి ఉంది. దానిని తవ్వితీసి, నీ కుటుంబమంతా ఆనందంగా జీవించండి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.కపిలుడు సంతోషంగా ఇంటికి వచ్చి, జరిగిన సంగతిని భార్యకు చెప్పాడు. భర్త చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించలేదు.‘ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీరు భక్తులు, హనుమంతుడు భగవంతుడు. ఆయనకే భక్తుని మీద దయ ఉంటే, ఈ రాతినేలను తవ్వి, ధనపు బిందెను తీసి ఇవ్వవచ్చు కదా! శ్రీరాముడు వారధి కట్టినప్పుడు పెద్ద పెద్ద బండలనే మోసుకువచ్చాడని మీరు పురాణం చెబుతుంటారు. ఈమాత్రం బరువును ఆయన తవ్వి తీయలేడా? మన పెరట్లోని రాతినేలను మీరు తవ్వగలరా? నేను తవ్వగలనా?’ అంది నిష్ఠూరంగా.కపిలుడికి భార్య మాటలు బాధ కలిగించాయి. ‘పరమ కరుణామూర్తి అయిన భగవంతుడు వరమిచ్చాడు. నేలలోని ధనరాశులను తవ్వితీసే భారం కూడా పాపం ఆయనదేనా? ఏది ఏమైనా ఈ మాటలన్నీ నా హనుమకు చెప్పజాలను. నా బాధ నేనే అనుభవిస్తాను’ అనుకున్నాడు. హనుమంతుని మంత్రం జపిస్తూ నిద్రపోయాడు.మర్నాడు వేకువనే కపిలుడి భార్య నిద్రలేవగానే, ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది. ఇల్లంతా బంగారుకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది. వెంటనే భర్తను నిద్రలేపింది. హనుమంతుడి దయాభిక్షకు వివశుడైన కపిలుడు స్తోత్రపాఠాలు గానం చేయసాగాడు. ఇన్నాళ్లూ హనుమ మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది. ఆనాటి నుంచి కపిలుడితో పాటు అతడి భార్య కూడా హనుమంతుడిని అర్చించడం ప్రారంభించింది. దొరికిన ధనరాశుల్లో కావలసినన్ని ఉంచుకుని, మిగిలిన ధనరాశులను కపిలుడు హనుమద్భక్తులకు పంచిపెట్టాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..! -
Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్
ఇస్లామ్ ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. రెండవది నమాజ్, మూడవది రోజా, నాల్గవది జకాత్, ఐదవది హజ్జ్. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి/ ముస్లిమ్ అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకూ ‘హజ్జ్’ ఆత్మ వంటిది. ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్థోమత కలిగినవారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ‘హజ్’ జిల్ హజ్ మాసం పదవ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్ ’ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేద భావం మచ్చుకు కూడా కనిపించదు. ‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. మక్కా నగర ఆవిర్భావంమక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ్రపాంతంలో మహనీయ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజ్రత్ హాజిరా అలైహిస్సలాంను, తనయుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, శ్రీమతి హాజిరా, ’అదేమిటీ.. నన్నూ, నాబిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటీ.?’అని ప్రశ్నించగా..,’ఇది దైవాజ్ఞ.’ అని మాత్రమే చెప్పి, అల్లాహ్‌పై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం.కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరులేని ఆఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్ ’అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఆనాడు కేవలం రెండు ్రపాణాలకోసం వెలసిన ఆ జలం ఈనాడు హజ్ యాత్ర నిమిత్తం మక్కావెళ్ళే లక్షలాదిమంది ప్రజలతోపాటు, స్థానికులకూ నిరంతరం సమృద్ధి్ధగా సరఫరా అవుతూ, యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకు వెళుతున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఆ నాటి ఆ నిర్జీవ ఎడారి ్రపాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కానగరంగా రూపుదిద్దుకొని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ ను నిర్మించారు. చతుస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంలు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవగృహంగా పేరు΄÷ందింది.అలౌకికానందంమక్కా చేరగానే ప్రతి హాజీ (యాత్రికుడు) కాబావైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు ΄÷ందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తిపారవశ్యంతో కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని’తవాఫ్’ అంటారు. ప్రతి తవాఫ్ లోనూ హాజీలు కాబాగోడలో అమరి ఉన్న ’హజ్రె అస్వద్ ’ (నల్లనిశిల) ను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీ. శ. 570 లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. కనుక భక్తులు ఆ జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటారు. ’జమ్ జమ్ ’బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా, మర్వా కొండల మధ్య ’సయీ’చేస్తారు. దీని తరువాత కొన్నిరోజులు ఎవరి నివాసాల్లో వారు దైవచింతన, నమాజులతో కాలం గడిపి, ’జిల్ హజ్ ’మాసం ఎనిమిదవ తేదీన ’మినా’ గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు. తొమ్మిదవ తేదీన ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన హాజీలంతా ‘అరఫాత్ ’మైదానంలో గుమిగూడి దైవకారుణ్యాన్ని అభిలషిస్తూ ్రపార్ధనలు చేస్తారు. ఈ సందర్భంలోనే ఆనాడు ముహమ్మద్ ప్రవక్త (స) అశేష భక్తజనాన్ని ఉద్దేశించి తమ అంతిమ సందేశం వినిపించారు. అందుకని భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించి పోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ్రపారంభించి’ముజ్దలఫా’ దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు. మదీనాసాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదె నబవిని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒకహాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్రకాబా గహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార్ల సహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశపాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలుపరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్ . ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్థం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. తఖ్వా ప్రధానందేవుని ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనా రీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనా రీతులన్నీ పరిపూర్ణతను సంతరించు కున్నాయి. యాత్ర, నిరాడంబర సాధు వస్త్రధారణ, దైవ్రపార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహ సందర్శనార్ధం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం ΄÷ందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీ పురుషులందరూ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యంకోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. – యండి. ఉస్మాన్ ఖాన్ -
ఒకప్పుడు నాన్న అంటే హడల్..కానీ ఇప్పుడు..!
తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఏటా జూన్ మూడో ఆదివారం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా వాషింగ్టన్లో ఓ యువతి ఇందుకు చొరవ చూపింది. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయి ఆరుగురు కూతుళ్లను పెంచి పెద్ద చేశాడు. అందుకే ఈయన పుట్టిన రోజును తండ్రుల దినోత్సవంగా జరిపింది. కాలక్రమంలో 1966లో అధికారికంగా గుర్తింపు లభించింది. చరిత్ర: 1910లో వాషింగ్టన్లో ప్రపంచ నాన్నల దినోత్సవం ప్రారంభం అయింది. కాకపోతే 1972 లో తండ్రుల దినోత్సవానికి గుర్తింపు వచ్చింది. పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం సంవత్సరంలో ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఫాదర్స్ డేను ప్రారంభించారు. తల్లులకు గౌరవంగా ప్రపంచ మాతృ దినోత్సవం ఉంది. అయితే.. తల్లులతో పాటు.. పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి బాధ్యతకు మారుపేరుగా నిలిచే తండ్రికి కూడా ఒక రోజు ఉండాలని యూఎస్‌కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అలా వాషింగ్టన్లో మొదటిసారి 1910లో ప్రపంచ నాన్నల దినోత్సవాన్ని జరిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆ దేశాలన్ని కలిసి జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నీ తానై.. ఒకప్పుడు నాన్నంటే పిల్లలకు ఎంతో భయం.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాన్న స్నేహితుడుగా మారిపోయాడు. త్యాగానికి ప్రతిరూపమయ్యాడు. పిల్లల భవిత కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. నాన్న మనసు మంచుకొండలా మారింది. మారాం చేసినా.. తప్పు చేసినా పాతరోజుల్లో తండ్రి మందలిస్తే నేడు ఆస్థానాన్ని అమ్మకు వదిలేసి తాను మాత్రం ఆప్యాయతనే పంచుతున్నాడు. బిడ్డ ఓటమి పాలైనా భుజాలపై చెయ్యేసి ఊరడించే అమృతమూర్తి.(చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!!) -
సాగర తీరంలో ఆకట్టుకుంటున్న మొగ దారమ్మ ఆలయ శిల్ప సౌందర్యం
భారతదేశ సంస్కృతి... ప్రకృతి సౌందర్యం...ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతూ నిర్మితమైన ఆలయంఒకవైపు పచ్చని కొండలు మరోవైపు నీలి సముద్రం... మధ్య ప్రశాంత వాతావరణంలో ఆలయం. కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాక ఆలయంలో అడుగు పెడితే మానవ జీవనశైలి... హైందవ ధర్మం... కాలచక్రం అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఎండాడ గ్రామ దేవత ఆలయం ఇప్పుడు కొత్తగా ఆకర్షణీయంగా నిర్మితమైంది. ఆలయ చరిత్ర..ఒకప్పుడు విశాఖ నగర శివారు ప్రాంతమైన గొల్లల ఎండాడ ..ముసలయ్య పేట... సాగర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు మొగ దారమ్మ తల్లి గ్రామ దేవతగా కొనసాగారు. అప్పట్లో పరిసర దాదాపు పది గ్రామాల ప్రజలు ఏ కష్టసుఖాల్లోనైనా అమ్మవారిని తొలి గా పూజించేవారు. ఆ రోజుల్లో అమ్మవారు ప్రతికగా ఓ చలువ పందిరి కింద పూజలు చేశారు. అయితే 1988 ప్రాంతంలో సత్య ప్రసాద్ అనే వ్యక్తి సాగర్ నగర్ పరిసరాల్లో రియల్ వ్యాపారం నిర్వహించారు. ఆతనకు కొంత కలిసి వచ్చింది. దీంతో స్థానికులు అతన్ని అక్కడ ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. ఆమేరకు ఆయన ఆలయ నిర్మాణం చేపట్టారు. అయితే ఆలయాన్ని మొక్కుబడిగా కాక ఆధ్యాత్మిక త ఉట్టిపడే రీతిన నిర్మాణం చేపట్టారు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన శిల్పుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో అడుగడుగునా సంస్కృతి సాంప్రదాయం కనిపిస్తుంది.వైకాశన విధానంలో ఆలయ నిర్మాణంఇక్కడ శ్రీమత్ వైకాసన విధానంలో ఆలయ నిర్మాణం జరిగింది.. ఆలయం ప్రాంగణంలో మొగ ధారమ్మ ప్రధాన దేవత ఆలయం నిర్మించారు. కుడి ఎడమల వైపు దుర్గాలమ్మ ..నూకాలమ్మ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.ఆలయంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత తో పాటు శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. మానవ జీవితంపై ప్రభావం చూపించే గ్రహాలు వాటి అధిపతుల శిల్పాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. నవ గ్రహాలు . వాటి అధిపతుల తో పాటు భారతదేశంలోని మొత్తం 12 జీవనదుల దేవతల విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. శ్రావ్యమైన సంగీతానికి అద్దం పట్టే డోలు డమరుకం..వివిధ రకాల ఫలాలను కూడా శిల్ప కలలో పొందుపరిచారు. ముఖ్యంగా 16 నాలుగు స్తంభాలపై నాలుగు రకాల వృక్షాలను చిత్రీ కరించారు.ఇక్కడ స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఒక్కో రకమైన ఆలోచన స్పూర్తింపజేస్తాయి. కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో మాదిరిగా ఆలయాలపై ఏనుగుల దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో ఇక్కడ ఆలయం వద్ద వుండే పెంపుడు ఏనుగులు.. అడవి ఏనుగులు... రాజుల కోటల వద్ద ఉండే ఏనుగుల శిల్పాలు చిత్రీకరించారు.ఏనుగు తొండం పై మానవ జీవన విధానంఆలయ ప్రధాన ద్వారానికి అటు ఇటుగా కనిపించే రెండు ఏనుగు తొండాలు పై మానవ జీవన విధానంలో మార్పులు గోచరిస్తున్నాయి. రాతి యుగంలో మానవుడు.. ఆధునిక యుగంలో మానవుడు.. గ్రామాల్లో దశలవారీగా మారిన మానవ మనుగడ పనిముట్లు తదితర అంశాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురాతన మానవ జీవితం అడవి సంపద అన్ని రకాల ప్రాణుల చిత్రాలను కూడా శిల్పాల్లో పొందుపరిచారు.ఆది దైవంగా విశ్వక్సేనుడుఆది దైవంగా గణేష్ విగ్రహానికి బదులు విశ్వక్సేనుడు విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ఆలయ ప్రకారం ప్రాకారం స్వస్తిక్.. కమలం... కలశం గోడలపై స్పష్టంగా కనిపిస్తాయి.సంతాన దేవతలు విగ్రహాలపై శ్రీకృష్ణుడు బ్రహ్మ జంటగా ఇక్కడ శిల్పాలను చిత్రీకరించారు. ధర్మార్థ కామ్య మోక్షాలకు ప్రతీక గా శేషశయన మూర్తి... దశావతారాలు వటపత్ర సాయి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన ఆలయం ఒకరకంగా కనిపిస్తే ఉప ఆలయాలు కోణార్క్ దేవాలయం తరహాలో రథచక్రాలతో కనిపిస్తున్నాయి.మహాలక్ష్మి దుర్గాదేవి సరస్వతి రూపాల్లో గ్రామదేవతలుఇక్కడ ప్రధాన దేవత మోగ ధారమ్మ ను మహాలక్ష్మి దేవిగా... దుర్గా దేవిని దుర్గి దేవిగా .. నూకాలమ్మను సరస్వతి దేవిగా పూజలు చేస్తుంటారు. ఇంత అందమైన ఆలయాన్ని సాగర తీరాన కొత్తగా నిర్మించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ శిల్ప కళా సౌందర్యం తో పాటు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది అని భక్తులు అంటున్నారు.ఆలయం చూసేందుకు వస్తున్న పాత తరం జనం..వాస్తవానికి మొగధారమ్మ పరిసర గ్రామాలకు గ్రామ దేవతగా కొనసాగారు. ఈ దశలో చిన్నతనంలో ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేని స్థితిలో ఉన్న ఆలయం సమూలంగా మారడంతో చాలామంది భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కొత్త శిల్ప సౌందర్యంతో ఆలయాన్ని చూసేందుకు పాతతరం జనం వస్తున్నారు ప్రధానంగా వృద్ధులు ఒక్కసారిగా ఆలయం మారిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.విశాఖ నుంచి ఋషికొండ వెళ్లే మార్గంలో సాగర్ నగర్ వద్ద ఉన్న ఈ ఆలయం పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది. నిత్యం ప్రసాదంతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ పురాతన గ్రామదేవత ఆలయం ఇప్పుడు ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెంచిందని ఈ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు పేర్కొన్నారు.ఆలయ దర్శన వేళలుఉదయం 5:30 నుంచి 10:30 సాయంత్రం 5:30 నుంచి 8 గంటల మధ్య అమ్మవార్ల దర్శనాలు లభిస్తున్నాయి.విశాఖ నుంచి భీమిలి వెళ్లే మార్గంలో సాగర్ నగర్ పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఈ మార్గంలో 24 గంటలు వాహనాలతో పాటు బస్సులు అందుబాటులో ఉంటాయి.-రావులవలస రామచంద్ర రావు, సాక్షి -
పెళ్ళి.. ఎందుకోసం?
గృహప్రవేశం చేయాలి. అప్పుడు యజుర్వేదం అంతా మనకు వచ్చా, రాదా అన్న దానితో సంబంధం లేదు. గృహప్రవేశ సందర్భంలో రాముడేం చేసాడో ఆ ఘట్టం చదువుకుంటే చాలు... ఓహ్, గృహప్రవేశం ఇలా చేయాలన్న మాట.. అన్నది తెలుస్తుంది. తండ్రిగారికి తద్దినం పెట్టాల్సి వస్తే రాముడేం చేశాడో చదువుకుంటే సరిపోతుంది. అది పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా పెట్టాలని అర్థమవుతుంది. అందుకే వేదం రామాయణంగా ప్రవర్తించింది. చంద్రవంశాన్ని అంతటినీ వ్యాసుడు రచించాడు. సూర్యవంశాన్ని అంతటినీ కూడా వాల్మీకి వర్ణించాడు. సూర్యుడు, చంద్రుడు పగలూ రాత్రి ప్రకాశిస్తారు. ఒక పగలు, ఒక రాత్రి కలిస్తే ఒక రోజు పూర్తవుతుంది. వాఞ్మయంలో రామాయణం, భారతం ఇతర పురాణాలను వాల్మీకి, వ్యాసుడు అందించారు. స్వార్థంతోనో, ప్రత్యుపకారం ఆశించో కాక దీనివల్ల ధర్మానుష్ఠాన పద్ధతులను అందరికీ అర్థమయ్యే పద్ధతిలో విడమరిచి చెప్పకపోతే జనసామాన్యానికి ఎలా తెలుస్తుందనే సదుద్దేశంతో వారు మనకు ఈ మహోపకారం చేసారు.వివాహం ఎంత గొప్పది! వివాహం అంటేనే విశిష్టమైనది–అని. దానిని మనకు సం్ర పాప్తింప చేయడానికి జరిపే సంస్కారమే వివాహం. అది ఏదో సరదాకోసం కాదురా నాయనా, వివాహం చేసుకుంటా నంటున్నావు కదా, ముందు దానిగురించి, దానిలోని ధర్మసూక్ష్మాలను గురించి తెలుసుకో. వివాహం అంటే విశిష్టమైనదానిని ΄పోందుట. మరి ఆ విశిష్టమైనదేది? అదే మోక్షం. దీనిని ΄÷ందడానికి యోగ్యమైనది ధర్మానుష్ఠానం. అది సక్రమంగా జరగకుండా దానికి అడ్డుపడుతున్నవి ఏవి? అర్థకామాలు రాగద్వేషాలయి ΄ాపపుణ్యాలకు, పునర్జన్మలకు కారణమవుతాయి. అలాకాకుండా దానిని ధర్మబద్ధం చేసి పాశాలు విడిపోవడానికి సంసార ప్రవేశం జరగాలి. అటువంటి గృహస్థాశ్రమంలోకి నీవు ప్రవేశిస్తున్నావు. అలా ప్రవేశించి రాముడేం చేసాడో తెలుసా? సీతారామకళ్యాణ ఘట్టం చూడు. అక్కడ సీతమ్మ ఏం చేసింది ? అసలు పెద్దవాళ్ళనే వాళ్ళు పెళ్ళికూతురిని, పెళ్లికొడుకుని కూర్చోబెట్టి ఏం మాట్లాడారో పరిశీలించు. పెద్దరికం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తే సంసారంలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి, కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతో రుషులు దేశకాలాలతో సంబంధం లేకుండా సర్వకాలాల్లో సర్వజనులకు ఉపయోగపడే విధంగా వాటిని అందించారు. అటువంటి రుషుల రుణం మనకు జన్మతః ఉంది.మీరు ఎంతో చదువుకున్నారు... సరే. మంచిదే. నేను చదువును తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ చదువుతో ΄ాటుగా నిత్యజీవితంలో మనిషి మనిషిగా ఉండడానికి కావలసిన మానవత్వాన్ని నిలబెట్టడం చాలా అవసరం. అలా అది నిలబడాలంటే... రామాయణం, భారతం తదితర గ్రంథాలను బాగా పరిశీలించాలి. అవి నిత్యపారాయణకు యోగ్యత ఉన్న గ్రంథాలు. వాటిని కనీసం రోజుకో అధ్యాయం చొప్పున అయినా చదువుకుంటూ ఉండాలి. ఇంటిపట్టున పెద్దవాళ్ళు పిల్లలతో వాటిగురించి తరచూ మాట్లాడుతూ ఉండాలి. దానివల్ల ధార్మిక జీవనం అలవడడమేగాక, మనుషుల్లో మానవత్వం మిగులుతుంది. అది లేనప్పుడు మీరు సమకూర్చుకున్న జ్ఞానం, ప్రతిభా΄ాటవాలు సమాజానికి ప్రమాదకరంగా మారవచ్చు. -
దృష్టిని బట్టి.. సృష్టి!
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
పిచ్చుక మీదనా బ్రహ్మాస్త్రం?
‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’’ అనే జాతీయం ఉంది. అతి తక్కువ బలం ఉన్నప్రాణి మీద అనవసరంగా అతి పెద్ద బలప్రయోగం చేయటం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఎంత చిన్నప్రాణి అయినా దాని అస్తిత్వం నిరుపయోగం కాదు. విశ్వంలో, ముఖ్యంగా భూగోళంలో, ప్రధానంగా అది ఉండే ప్రాంతంలో అది పోషించవలసిన పాత్ర ఒకటి ఉండనే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, తద్వారా పర్యావరణ సమతౌల్యత ఉంటాయి. దానికి భంగం కలిగిస్తే పర్యవసానం అనుభవించ వలసి ఉంటుంది. ఒక పిచ్చుక సంవత్సరంలో 6.5 కిలోల బియ్యం తింటుంది అని చైనాలో ఒకప్పుడు చేపట్టిన సర్వే తెలిపింది. మొత్తం పిచ్చుకలు లేకుండా చేయగలిగితే 60 వేల మందికి ఆహారం లభిస్తుంది అని కూడా తెలిపింది. ఇంకేముంది? అసలే అధిక జనాభా సమస్య ఉన్న చైనా, వీలైనంత మందికి ఆహారం అందించటానికి ఇదొక మార్గం అనుకుని పిచ్చుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. 30 లక్షల పిచ్చుకలని చంపారు. 1958 – 61 సంవత్సరాల మధ్య చైనాలో తీవ్రమైన కరవు వచ్చింది. సుమారుగా నాలుగు కోట్ల యాభై వేల మంది చనిపోయారు. కారణం ఏమై ఉంటుంది అని విచారణ చేస్తే పిచ్చుకలు లేక పోవటం వల్ల అని తేలింది. అదెట్లా? పిచ్చుకలు ధాన్యం తినటంతోపాటు పంటలని నాశనం చేసే పురుగులని కూడా తింటాయి. చీడ పురుగులని తినే పిచ్చుకలు లేక పోవటంతో పంటలకి చీడ పట్టి, తెగులు సోకి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. అది రాను రాను పెరిగింది. ప్రజలు తిండి లేక చనిపోయారు. దీనికి పరిష్కారం పంటలని నాశనం చేసే తెగుళ్లు కలిగించే పురుగులని రసాయన పదార్థాలు వాడ నవసరం లేకుండా తినేసే పిచ్చుకలు ఉండేట్టు చేయటమే అని నిర్ధారించారు. చేసేది ఏమీ లేక పిచ్చుకలని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. రష్యా నుండి పిచ్చుకలని దిగుమతి చేసుకున్నారు. పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఇటువంటి శాస్త్రీయమైన విషయాలని మన దేశంలో ఒక ఆనవాయితీగా, ఆచారంగా చేయటం అలవాటు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగువారు వరికంకులని కుచ్చుగా అల్లి ఇంటి ముందు వేలాడ దీసే వారు. పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క వడ్లగింజని తీసుకు వెళ్లేవి. అది రైతు పురుగులని తిని చీడ పీడల నుండి పంటని రక్షించిన పిచ్చుక పట్ల చూపించే కతజ్ఞత. ఇంటి ముందు కొన్ని గింజలు చల్లటం అలవాటు. ఆ అవకాశం ఉన్నా, లేక పోయినా ప్రతి రోజు పక్షులకి, ప్రత్యేకంగా కాకికి తినబోయే ముందు ఒక ముద్ద పెట్టటం అలవాటు. కాకి పరిసరాల్లో ఉన్న చెత్తని, చిన్న చిన్న పురుగులని తిని శుభ్రం చేస్తుంది. దేవాలయాలలో కూడా బలిహరణం అన్న పేరుతో నాలుగు దిక్కుల అన్నం ఉంచటం సంప్రదాయం. ఇంటి చూరులో పిచ్చుక గూడు పెడితే పరమానందం. ఆ గూట్లో పెట్టిన గుడ్లను పిల్లి తినకుండా కాపలా కాయటం ఒక సరదా. అవి ఉండే ప్రదేశాలని మనం ఆక్రమించి, చెట్లని నరికి వాటికి ఆహారం లేకుండా చేసినందుకు ఈ మాత్రం చేయక పోతే కృతఘ్నులం అవుతాం. అలాగని పిల్లులని పూర్తిగా తరమం. పిల్లి తిరుగుతుంటే ఆ వాసనకి ఎలుకలు విజృంభించవు. సృష్టిలో ప్రయోజనం లేని జీవి ఒక్కటి కూడా లేదు. గుర్తించక పోవటం మన లోపం. జాగ్రత్తగా గమనిస్తే ఇతర జీవులని, ప్రకృతిని స్వార్థానికి వాడుకుని ఎవరికీ ఉపయోగ పడని ప్రాణి మానవుడొక్కడే నేమో అనిపిస్తుంది. కనీసం పిచ్చుక పాటి అయినా చేయవద్దా? – డా. ఎన్. అనంత లక్ష్మి -
తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!
చారిత్రాత్మకంగా,తిరుచిరాపల్లిని సాధారణంగా ఆంగ్లంలో "ట్రిచినోపోలీ" అని పిలుస్తారు. వాడుకంలో ఎక్కువగా "ట్రిచీ" లేదా "తిరుచ్చి" అని పిలుస్తారు. అధికారికంగా మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుచురాపల్లి అని ఉంటుంది. ఇక్కడ ఐకానిక్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది శ్రీ రంగనాథ స్వామి దేవాలాయం. తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయ పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది ఈ తిరుచ్చి. ఇక్కడ ఉన్న అద్భుతమైన వాస్తు శిల్ప కళా సంపదను చూడవచ్చు. ఇది గొప్ప వారసత్వ సాంస్కృతికి నిలయం. ఆ నగరంలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలివే..శ్రీరంగనాథ స్వామి ఆలయం..తిరుచ్చి ఐకానిక్ ఆభరణంగా శ్రీరంగనాథ స్వామి ఆలయం అలరారుతుంది. ఈ ఆలయం సుమారు 156 ఎకరాల్లో ఏడు ప్రాకారాలతో నిర్మించారు. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా 45 నుంచి 75 మీటర్ల ఎత్తు వరకు ఆలయ గోపురాలు ఉంటాయి. ముఖ్యంగా మూలల్లో చెక్కబడిన సంగీత స్థంబాలు, మందిరాలు, శతబ్దాల నాటి విగ్రహాలతో కూడి ఆలయాలు మనసును దోచుకునేలా ఉన్నాయి. వెయ్యి స్తంభాల హాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ ప్రతినిత్యం ఆలయ కైంకర్యాలు నిరాటకంగా జరుగుతాయి.మరో అద్భుత ఆలయం రాక్‌ఫోర్ట్..రాక్‌ఫోర్ట్ అనేది 273 అడుగుల ఎత్తైన రాతిపై ఉన్న కోట. ఇది ఏకశిలలతో నిర్మితమైన గుహ దేవాలయాలు. వీటిని తొలుత పల్లవులచే నిర్మిచబడినప్పటికీ..తర్వాత ముధురై నాయకులు, విజయనగర పాలకులు పునర్నించారు. ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడు థాయుమానవర్గా పూజలందుకోగా, పార్వతి దేవి మట్టవర్ కుజలమ్మాయిగా కొలుచుకుంటారు భక్తులు. ముందుగా రాతి కోట పాదాల వద్ద ఉన్న మాణిక్క వినాయకర్ ఆలయం దర్శంచుకుని, శివ పార్వతులు ఆలయాలను దర్శిస్తారు భక్తులు. ఈ రాతి శిలను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా నమ్ముతారు. ఈ శిలా కోట చుట్టు ఉన్న కావేరి నదం దారంలా చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. సైకిల్‌పై చుట్టి రావచ్చు కూడా..తిరుచ్చిలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సైకిళ్లపై చుట్టి రావచ్చు కూడా. తెల్లవారుజాము నుంచి టూరిస్ట్ గైడ్ ఆధ్వర్యంలో సైకిల్ పర్యటనను ప్రారంభిస్తారు. 18వ శతాబ్దపు జెస్యూట్ క్వార్టర్స్ నుంచి దక్షిణాసియాలోని తొలి ప్రింటింగ్ ప్రెస్‌లు, బ్రిటిష్ కాలం నాటి టౌన్సైడ్ మాన్షన్లను చుట్టిరావొచ్చు. తిరుచ్చి పట్టణంలో ఐకానిక్‌గా ఉండే కావేరి వంతెన మిమ్మల్ని ఉత్సహపరిచేలా స్వాగతం పలుకుతుంది. ఆ మార్గ మధ్యంలో ఉండే వివిధ రుచులతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌లు మిమ్మల్ని ఆస్వాదించమన్నట్లుగా నోరూరిస్తాయి. ఒంటరి మహిళా ప్రయాణికులకు కూడా ఇది సురక్షితమైన నగరంగా పేరుగాంచింది. కాంస్య కళాకారులు, స్తపతులు..స్వామిమలైలోని పురాతన ఆలయ కళ గ్రామం చూస్తే..మీ కళ్ల ముందే రాతి శిల్పాలు పుట్టుకొస్తాయని రాసి ఉండటాన్ని చూడొచ్చు. ఇక్కడ మంచి నైపుణ్యం కలిగిన కాంస్య కళాకారులు, శిల్పులను చూడొచ్చు. ఇక్కడ శిల్పులు పవిత్ర క్షేత్రాల నంచి తీసిన మట్టి నమునాలను మైనపు కళాఖండాలుగా మార్చి, అగ్ని ఆచారాలతో నిండిన ఆధ్యాత్మిక లాస్ట్ వాక్స్ మెటల్ కాస్టింగ్ ప్రకియ ద్వారా మెరిసే విగ్రహాలుగా రూపొందించారు. ఇక్కడ శిల్పశాస్త్రానకి సంబధించిన అద్భుతమైన స్తపతులు దర్శనమిస్తారు. ముఖ్యంగా, మట్టి, మైనంతో చక్కటి విగ్రహాలను తయారు చేయడం వారి ప్రత్యేకత. పచ్చదనానికి మారుపేరుగా ఉండే ఉద్యానవనాలు, ఎకోపార్క్‌లు..ప్రశాంతమైన కావేరి నది చుట్టుతా పచ్చని ఉద్యానవనాలు పర్యాటకులను సేదతీరమని పిలుస్తున్నట్లుగా ఆహ్లదకరంగా ఉంటాయి. పక్షి జాతులకు సంబంధించన అభయ అరణ్యలు, ఎకో పార్క్‌లు ప్రదాన చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు. కావేరి నదిలో ఉండే చిన్న ద్వీపాల మాదిరగా ఉండే గ్రామాలను బోటింగ్‌తో చుట్టి వచ్చే సదుపాయం కూడా ఉంది. ఇక్కడి పార్కుల్లో జంతు శిల్పాలను పర్యాటకులను కట్టిపడేస్తాయి. హెర్బల్ గార్డెన్లు, పచ్చిక శిల్పాలు, పిల్లల ప్లే జోన్లు తదితర పర్యాటక ప్రదేశాలకు నెలవు ఈ తిరుచ్చి నగరం. తప్పక దర్శించి తరించాల్సిన ప్రదేశం ఇది.(చదవండి: వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?) -
చీరకొంగు
చీరలు కట్టే రోజుల్లో వాటికి కొంగు ఉండేది. దానికి ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. గుండెలని కప్పటంతో పాటు, అవసరమైతే తన చేతులు తుడుచుకోవటం, దేనినైనా గబగబా తుడిచి శుభ్రం చేయటం, కోపం లేదా పౌరుషాన్ని ప్రదర్శించటానికి కొంగుని చీరకట్టులో దోపి ముందుకు రావటం తరచుగా కనపడే ప్రయోజనాలు. అలసిపోతే మొహం తుడుచుకోవటానికి, చెమట పడితే విసురుకోవటానికి, వీలైతే పక్కనున్న భర్తకో, అత్తగారికో, పిల్లలకో కూడా ఆ భోగాన్ని కలిగించటానికి కొంగు పనికి వస్తుంది. పిల్లలు మొహం తుడుచుకోవటానికి, అన్నం తిని చేతులు కడుక్కున్నాక తుడుచుకోటానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే మగవారికో? వారు కూడా ఉత్తరీయం పైన వేసుకునే వారు. లేదంటే కనీసం తుండు గుడ్డ. ఇప్పుడు రెండూ కనపడటం అపురూపమైపోయాయి. ఇవి రెండు చేసే పనులు ఒకటే అయినా, చీర కొంగు చేసే పనులు ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి. ఇంటితాళాలు, ఇనుపపెట్టె తాళాలు ఒకప్పుడు ఇంటావిడ కొంగుచివర ఉండేవి. ముఖ్యంగా బెంగాలీ స్త్రీలకి పెద్ద తాళాల గుత్తి కొంగు చివర కట్టి ఉంటుంది. అది వారు వంగ దేశపు వారు అనటానికి గుర్తు. కొంగున కట్టారు అంటే ఎంతో ముఖ్యమైనది అని అర్థం. గుడిలో ఇచ్చిన అక్షతలు కావచ్చు, ప్రసాదం కావచ్చు, ఏదైనా విలువైన తాయెత్తో, రక్షరేకో, మరేదైనా కావచ్చు ఇల్లాలి కొంగులో ఒదిగి దాక్కుంటాయి. అంతేకాదు, పనికిరానివి, ఉన్నచోట పడేయ కూడనివి ఉంటే కొంగులో దాక్కుంటాయి. అంటే, విరిగిన గోళ్ళు, రాలి పడిన వెంట్రుకలు, చిన్న చిన్న గాజుముక్కలు, ముళ్ళు... ఇట్లాంటి వాటిని కూడా కొంగు భద్రంగా జాగ్రత్త చేస్తుంది చెత్తలో వేసేవరకు. కొంగుకి ఎంతటి ్రపాముఖ్యమో చూడండి – వివాహ సమయంలో బ్రహ్మముడి వేయటానికి ఇద్దరి కొంగులని కలుపుతారు. అంటే, ఒకరి కొంగులో మరొకరు ఉండమని. ఒకరికొకరు కొంగు బంగారం. కొంగు బంగారం అంటే అందుబాటులో ఉండే విలువైన, అవసరానికి ఆదుకొనేది అని అర్థం. ఒకరి అవసరాలు, కష్టసుఖాలు మరొకరు అడగనవసరం లేకుండానే పంచుకుంటూ, తీర్చుకుంటూ జీవితం గడపాలన్నది సూచన. అందుకే ఎవరైనా భార్యని అపురూపంగా చూస్తుంటే – ఆవిడ భర్తని కొంగున కట్టుకుంది అంటారు. లక్ష్మీదేవే దానికి పెద్ద ఉదాహరణ. గజేంద్రుడి కుయ్యాలించిన విష్ణువు ఉన్న వాడు ఉన్నట్టుగా బయలుదేరితే లక్ష్మీదేవి వెంట వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆవిడ కొంగు ఆయన చేతిలో ఉన్నది అని వర్ణించారు. ‘‘వివాద ్రపోత్థిత శ్రీ కుచోపరి చేలాంచల మైన వీడడు’’ అన్నారు పోతన గారు. అసలు విషయం అది కాదు. విష్ణువుని లక్ష్మీదేవి కొంగున కట్టుకుంది. ఆయన కదిలితే తానున్న కొంగు కూడా కదిలింది. పోనీ, ఆయనే పట్టుకున్నాడు అనుకుందాం. అప్పుడైనా విష్ణువు లక్ష్మీదేవి కొంగు విడవడు అనే కదా అర్థం. భర్తని తానే కొంగున కట్టుకున్నా, కొంగుని వదలని వారూ ఉన్నారు. వారే సంతానం. కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరైనా కొత్తవారు వచ్చినా, సిగ్గు కలిగినా అమ్మ కొంగు చాటున దాక్కుంటూ ఉంటారు. అది వారికి రక్షణ. పసితనంలో పాలు తాగుతున్నపుడు, (తల్లిపాలు అయినా, పోతపాలు అయినా) అందరి చూపు పడకుండా అడ్డుగా ఉండే అమ్మ కొంగు, ఎండ, వాన, చలి, గాలి మొదలైనవి రాగానే తమ పైన చేరి వాటి బాధ నుండి రక్షణ కలిగించే అమ్మ చీర కొంగు తమకి ఎప్పుడు భద్రతా భావన కలిగిస్తుంది అని నమ్మకం. ‘‘కొంగు చాటు బిడ్డ’’ అనే నానుడి అందుకే వచ్చి ఉంటుంది. – డా. ఎన్.అనంతలక్ష్మి -
Hanuman Jayanti: ఈ అద్భుత తెలివితేటలే.. శ్రీరామ–సుగ్రీవ మైత్రి కలిసేలా..
భారత దేశంలో అత్యధిక భక్తుల చేత నిత్యం ఆరాధించబడుతున్న దైవం ఆంజనేయ స్వామి. పురాణాల్లో ఏ దేవునికీ లేని ప్రత్యేకత హనుమంతుని సొంతం. హనుమంతుడు గొప్ప వ్యాకరణశాస్త్ర పండితుడు. బాల్యంలో కఠోర దీక్షతో, శ్రద్ధగా సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాలు తెలిసిన వ్యక్తి. ఎదుటివారిని ఆకట్టుకునేలా ప్రసంగించే వాక్చాతుర్యం ఆయన సొంతం.ఈ అద్భుత తెలివితేటలే శ్రీరామ–సుగ్రీవ మైత్రిని కలిసేలా చేసింది. శ్రీరాముణ్ణి యజమానిగా, సుగ్రీవుణ్ణి మహారాజుగా ఇద్దరికీ సమ ప్రాధాన్యత నిచ్చాడు. లంకలో రావణునికి నీతి వచనాలతో హిత బోధ చేశాడు. మనం హనుమంతుని జీవిత చరిత్ర నుండి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారిని మెప్పించే నైపుణ్యం, యజమాని (మనం పని చేసే డిపార్ట్మెంట్/కంపెనీ) పట్ల పూర్తి విధేయత, నమ్మకం, సంపూర్ణ విశ్వసనీయతతో ఎలా ఉండాలి వంటివి నేర్చుకోవచ్చు.ఇంతేనా... ఆయన నుంచి నేర్చుకోవలసిన సుగుణాలు చాలానే ఉన్నాయి. ఎదుటివారిపట్ల సముచిత గౌరవం, నమ్మిన వారి కోసం ఏమైనా చేసే త్యాగనిరతి, శత్రువుల పట్ల సమ న్యాయబద్ధంగా వ్యవహరించే మాటతీరు, గురువు పట్ల నిస్వార్థ భక్తి భావన, రాజ్యం పట్ల సైనికుడిగా విద్యుక్త ధర్మం, నిరాడంబర జీవనం, అన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస, ధర్మరక్షణ కోసం శ్రమించే వీరత్వం, ఆపద సమయంలో ప్రదర్శించే ఆత్మ విశ్వాసం లాంటివి ముఖ్యమైనవి.తాను ఎంత బలవంతుడైనప్పటికీ అతి సాధారణంగా జీవించడం హనుమంతుడు మనకు నేర్పాడు. సముద్రాన్ని దాటినా, లంకను సగం కాల్చినా, సీతమ్మను తీసుకువచ్చే బలం ఉన్నా... ఎప్పుడూ పొంగిపోలేదు. సుగ్రీవుని వేలాది సైన్యంలో తానూ ఒక సైనికుడిగా రాచకార్యంలో భాగంగానే ఈ పనులు నిర్వర్తించానని భావించాడు. ఇంత చేసి అంత చెప్పుకునే చాలామందికి హనుమాన్ కనువిప్పు. ఆధునిక భావి తరానికి చక్కని మార్గదర్శి. హనుమంతుని జీవనాన్ని అధ్యయనం చేసిన వారికే ఆ గొప్పతనం తెలుస్తుంది. – భైతి దుర్గయ్య (నేడు హనుమాన్ జయంతి) -
నీతోనే నేను.. నాతోనే నీవు
సీతమ్మ మనసు ఆమె దగ్గర లేదు. రాముడి దగ్గర ఉంది. రాముడి మనసు ఆయన దగ్గర లేదు. సీతమ్మ దగ్గర ఉంది. అందుకే ఇద్దరూ అలా కలిసి ఉండగలిగారు’ అంటాడు హనుమ రామాయణంలో. ఎలా కలిసి ఉన్నాం.. అన్నదాని కన్నా, ఎంతకాలం కలిసి ఉన్నాం.. అన్న దాని కన్నా, ఎంతగా మనసులు ఒక్కటిగా చేసుకుని బతికామన్నది దాంపత్యంలో ప్రధానం.ఒకప్పుడు కంచి మహాస్వామి తీర్థం ఇస్తున్నారు. భక్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే ఆయన సందర్భాన్ని బట్టి అనుగ్రహిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు తీర్థమిస్తూ ఒక ముసలామెను ‘ఏమమ్మా, ఏమిటి చెప్పు’ అన్నారు. ‘నాకన్నా ముందు నా భర్తగారు పోయేటట్లు ఆశీర్వదించండి’ అన్నది. ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఎందుకలా! అనడిగారు.‘‘స్వామీ! ఏమని చెప్పను. ఆయనది పసిపిల్లవాడి చాపల్యం. మూర్ఖత్వం. ఏదీ తెలియని అమాయకత్వం. నేనున్నంతకాలం ఆయనకు ఏ లోటూ లేదు. రానీయను కూడా. ఇద్దరికీ వయసయిపోయింది. ఆరోగ్యం కుదురుగ్గా ఉండడం లేదు. నేను ముందుపోతే తరువాత ఆయన పరిస్థితి ఏమిటా అన్నదే నా దిగులు. ముందు ఆయన వెళ్ళిపోతే నేనెలాగూ వదిలి ఉండలేను. వెనకే నేనూ పోతా. అందుకని ముందు ఆయన పోయేట్టు అనుగ్రహించండి’ అని వేడుకుంది.అంతటి మహాస్వామికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. అందరివంకా చూసి ఇదీ భారతీయ దాంపత్యం.. అన్నారు. ఎంత తప్పు చేసినా ఉద్ధరించుకోవడమే తప్ప చేయి వదిలిపెట్టడం అనే మాట అన్వయం కాని ధర్మం ఇది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం – అహల్య ఉ΄ాఖ్యానం. భార్య దోషమే చేసిందని తెలిసినా ఆ దోషం చేయడానికి కారణమయిన మానసిక ఉద్వేగాలను దూరంగా ఉంచుకుని..‘‘...వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ..’’ నువ్వు తపస్సు చేత పవిత్రమై, మళ్ళీ నా పక్కన స్థానాన్ని ΄పోదు. పునీతవు కా..’’ అని అహల్యను ఉద్ధరించుకున్నాడు తప్ప ఆమెను విడిచిపెట్టేస్తున్నా.. అన్న మాట మాత్రం గౌతమ మహర్షి అనలేదు. అదీ గృహస్థాశ్రమ వైశిష్ఠ్యం. ఇటువంటి ధర్మానికి రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి.వివాహం అయిపోయిన తరువాత ప్రదానం చేసేటప్పుడు భర్త భార్యతో ‘‘నువ్వు నన్ను నీ పదవ కుమారుడిగా చేసుకుంటావా?’’ అని అడుగుతాడు. భర్త పదవ కుమారుడు ఎట్లా అవుతాడు? మలి వయసులో శరీరం పట్టు తప్పుతుంటుంది. పెంకితనం ఏర్పడుతుంది. అహం పెరుగుతుంది. అప్పుడు నీ పిల్లలను చూసినట్లు నన్ను చూస్తావా... అని అడుగుతాడు.రామాయణంలో సీతమ్మ .. ‘‘ఇక్కడ రాజ్ర΄ాసాదంలో ఎన్ని సుఖాలయినా ఉండనీయవయ్యా రామా, నన్ను అరణ్యవాసానికి వద్దంటావేమిటి ! ..’’ అంటూ ‘‘నాతంత్రీ వాద్యతే వీణా, నా చక్రో వర్తతే రథః / నా పతిః సుఖమేధేత యా స్యాదపి శతాత్మజా...’’ అంటుంది. నా కొడుకులు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నా, నువ్వు లేని నాడు నాకు తృప్తిలేదు. అది అరణ్యమయినా నువ్వున్న చోటే నా చోటు..’’ అంటుంది. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం అంత గొప్పది. దానికి కారణం ప్రేమ ఒక్కటే కాదు. అంతర్లీనంగా ధర్మం ఉంటుంది. దానిలో దంపతులు తరించి పోతారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సానుకూల దృక్పథం
అంతా మన మంచికే అనే మంత్రిగారి కథ అందరికీ తెలిసినదే. ‘‘అంతా మన మంచికే’’ అనే మంత్రిగారు రాజుగారి చిటికెనవేలు తెగితే కూడా అదే మాట అని చెరసాల ΄ాలు అయ్యారు. వేటకి వెళ్ళిన రాజుని ఆటవిక జాతివారు తమ దేవతకు బలి ఇవ్వబోయారు. చిటికెనవేలు లేక΄ోవటంతో అంగవైకల్యం ఉన్న వ్యక్తి బలికి పనికి రాడు అని వదిలి పెట్టారు. రాజు తిరిగి వచ్చి మంత్రిని విడుదల చేసి, ‘‘నాకు మీ రన్నట్టు మంచే జరిగింది, మీకు ఏం మంచి జరిగింది?’’ అని అడిగాడు. అందుకు మంత్రి ‘‘అది కూడా నా మంచికే జరిగింది. చెరసాలలో లేక΄ోతే తప్పకుండా మీతో వేటకి వచ్చే వాడిని. అంగవైకల్యం ఉన్న మిమ్మల్ని వదిలేసి అప్పుడు ఏ అవయవ లోపమూ లేని నన్ను బలి ఇచ్చేవారు’’ అని చె΄్పాడు. ఇది అతి మామూలు కథ. కానీ, దేనినైనా సానుకూల దృక్పథంతో ఎట్లా చూడాలి, దాని వల్ల ప్రయోజనం ఏమిటి? అన్న విషయాలు అర్థం అవుతాయి. కొన్ని ఆ క్షణాన ఇబ్బంది కలిగించేవిగా, అయిష్టంగా అనిపించ వచ్చు. కానీ, మనకి ఏది మంచో మనకన్నా ప్రకృతికే బాగా తెలుసు. ఆ ప్రకృతినే విశ్వం అని, దైవం అని, ఎనర్జీ అని రక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎటువంటి పళ్ళు, కూరలు ఆరోగ్యానికి మంచివో వాటినే ఇస్తుంది ప్రకృతి. వర్షాకాలంలో మామిడిపళ్ళు తినాలి అనిపించినా దొరకవు. ఎందుకో తెలుసా? ఆ వాతావరణానికి మామిడిపండు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. దొరికితే మామిడిపండు తినకుండా ఉండలేం. మన మంచికోసం దొరక కుండా చేసింది ప్రకృతి. ఈ దృక్పథం అలవాటయిన వారికి జీవితం కష్టాలమయంగా కనిపించదు. దేనినైనా తేలికగా తీసుకొని ముందుకి సాగటం ఉంటుంది. అట్లా అయితే వారి జీవితాల్లో కష్టాలు ఉండవా? ఉంటాయి, కానీ కన్నీళ్ళు ఉండవు. కష్టపడకుండా ఏదీ లభించదు. అది భౌతికమైనది. దాన్ని ఏదోవిధంగా దాటవచ్చు. మనస్సుకి ఎక్కించుకుంటే వేదన మిగులుతుంది.ఆ కాస్త ఇబ్బందిని అయినా ఎందుకు భరించాలి? అనే సందేహం వస్తుంది. కానీ మనం ఆ పరిస్థితిని మార్చలేము కదా! అప్పుడు కూడా అంతా మన మంచికే అనుకుంటే అద్భుతం జరుగుతుంది. దీని వల్ల మంచే జరుగుతుంది అనే సానుకూల భావన వల్ల మన మనసు సానుకూల భావతరంగాలను ప్రసరింప చేస్తుంది. భావతరంగాలు పరిసరాలని, పరిస్థితులని, వ్యక్తులని కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల ముందుగా వాతావరణం, తరువాత మనస్సు ప్రశాంత మవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. దానికి కారణం నెమ్మదించిన మనస్సు. ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, ఎఖార్ట్ వంటి ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు కూడా ఆలోచనని అనుసరించే పరిస్థితులు ఉంటాయి అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. వేలికి దెబ్బ తగిలింది అని బాధపడటం కన్న చెయ్యి, కాలూ బాగున్నందుకు సంతోషించటం నేర్చుకోవాలి. సరైన చెప్పులు లేవని ఏడుస్తున్న కొడుకుకి కాళ్ళు లేని వాడిని చూపించాడుట తండ్రి. అప్పుడు లోటు ఉన్నా బాధ పడటం ఉండదు. సంతోషమే ఉంటుంది. సంతోషంగా ఉంటే ‘హాపీ హార్మోనులు’ విడుదల అవుతాయి. సంతోషం, ఆనందం బాహ్యమైన వస్తువులు, పరిస్థితుల పైన కాక దృక్పథం మీద ఆధార పడి ఉంటాయి. పురుటి నొప్పులు పడనిదే శిశువు లోకంలో అడుగు పెట్టటం కుదరదు. బిడ్డ చిరునవ్వు చూడగానే నొప్పుల సంగతి మరపుకి వస్తుంది. సాన పెట్టనిదే వజ్రం మెరవదు. నమలనిదే పదార్థం రుచి తెలియదు. గంధపుచెక్కని అరగదీయనిదే మంచిగంధం రాదు. చివరికి కుంకుడుకాయ రసం కావాలి అన్నా గట్టిగా పిసకాలి. ఇతర పళ్ల రసం గురించి చెప్ప నక్కర లేదు. గట్టిగా పిండనిదే రసం రాదు. ఈ కష్టం మెఱుగుదల కోసమే అని అర్థం చేసుకుంటే సమస్య లేదు. దానిని కూడా వ్యాయామం మొదలైనవి చేసినప్పుడు ΄÷ందే సుఖం లాగా ఆనందించవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
మహా వైశాఖి అంటే..? ఇది బుద్ధ పూర్ణిమగా ఎందుకు ప్రసిద్ధి..?
మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. పూర్ణిమ విశిష్టత..ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు. అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు. బుద్ధ పూర్ణిమ అని ఎందుకు పిలుస్తామంటే.. వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. బోధి వృక్షానికి పూజలు..బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు. దీనిని గమనించి బేతవన విహారదాత, అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు. వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి. అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం నుంచే వచ్చాయని పురాణ వచనం.(చదవండి: 'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?) -
ఘనంగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు !
హైదరాబాద్: ఆర్య వైశ్య సంఘం ఇసామియా బజార్ ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా శనివారం నిర్వహించారు. ఇది ఇసామియా బజార్‌లోని నరసింహాస్వామి ఆలయం దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం ఫలహారం, అభిషేకం, సహస్త్ర నామార్చనతోపాటు హోమము నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి సంఘం సభ్యులందరికీ పగడి కట్టడం జరిపారు. ఈ సమయంలోనే సామూహిక కుంకుమార్చన సంఘంలోని మహిళ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం, అమ్మవారి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సంఘం సభ్యులంతా దాండియా ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కొమిరిశెట్టి అనిల్‌కుమార్, జనరల్ సెక్రటరీ ఆలంపల్లి రవికుమార్, ట్రెజరర్ ఎర్రం లక్ష్మణ్, ఐపిపి మ్యాడమ్ అశోక్. ప్రాజెక్ట్ కన్వీనర్ హరినాతినీ శ్రీనివాస్, ప్రాజెక్ట్ చైర్మన్ కల్వకుంట్ల శ్రీనివాస్. కోకన్వీనర్స్: పారెపల్లి మల్లేష్, పల్లెర్ల హరీష్ కుమార్, చీకటిమర్ల సంగయ్య. కో చైర్మన్: ముర్కి చంద్రమౌళి, రెగొండ చంద్రశేఖర్, నూనె నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు -
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం. -
ఇవాళ హనుమాన్ జయంతినా? హనుమాన్ విజయోత్సవమా?
హనుమాన్ జయంతి ఎప్పుడనేది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. ఎందుకంటే దక్షిణాదిలో ఎక్కువగా వైశాఖ మాసంలో దశమి రోజు జరుపుకుంటే, ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇంతకీ ఏది కరెక్ట్?. అదీగాక చాలామంది ఈ రోజును హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని బట్టి చూస్తే హనుమాన్ జయంతి చైత్రమాసంలోనా? వైశాఖంలోనా ? అంటే..! పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుంచి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమినే ఎందుకు.. హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ క్రింది శ్లోకంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. విజయోత్సవంగా చెప్పడానికి రీజన్.. చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. (చదవండి: థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
ఒంటిమిట్టకు పూర్వ వైభవం!
ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం 'శ్రీరామనవమి' వేడుకలకు ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వలాంఛనాలతో ఈ దేవాలయం నేడు కళకళలాడుతోంది. ముఖ్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి శోభ, ప్రాశస్త్యం పెరుగుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది శుభ పరిణామం. 'భద్రాచలం' తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ఆరంభమైంది. ఈ తీర్థం గురించి ఇంకా తెలియల్సినవారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో గొప్ప పౌరాణిక,చారిత్రక నేపథ్యం ఉన్నా ఈ దేవాలయం చరిత్రగతిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, దోపిళ్ళు, దొంగతనాలు,దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో ఒక మహనీయుడు చేసిన అవిరళమైన కృషి, అనన్య సామాన్యమైన సేవలు నిత్యరమణీయ స్మరణీయాలు. ఆ మహనీయుడి పేరు వావిలకొలను సుబ్బారావు. వాసుదాసుగా, ఆంధ్రవాల్మీకిగా చరిత్ర ప్రసిద్ధుడు. భద్రాచలం శ్రీరామునికి రామదాసు ఎలాగో! ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు అలాగ! 'వాసుదాసు -ఒంటిమిట్ట'ను వేరుచేసి చూడలేం. ఈరోజు ఇంతటి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే? అంతా వావిలకొలనువారి చలవే అన్నది నిర్వివాదాంశం. ఒంటిమిట్టకు 'ఏకశిలా నగరం' అనే పేరు కూడా ఉంది. భాగవతకర్త పోతన్న మహాకవి ఇక్కడి వాడేనని వావిలకొలను సుబ్బారావు ఘంటాపథంగా చెబుతూ ఎందరితోనో వాదనలకు దిగారు. నాటి పండితులలో కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఆ వాదంతో అంగీకరించలేదు. పోతనామాత్యుడు తన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితం చేశారని ఆయన చెబుతారు. కవి పోతన కొంతకాలం ఒంటిమిట్టలో నివసించారని అంటారు. భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, మరోబలమైన సాక్ష్యమని వాసుదాసు వంటి కొందరు పండితులు విశ్వసించారు. పోతనామాత్యుని విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు. "పోతన్నది ఒంటిమిట్ట" అన్నది చారిత్రక వివాదం. ఆ వివాదం గురించి పక్కన పెడదాం. ఈ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. సీత,రామ,లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా మలచడం ఇక్కడి విశిష్టత. కాబట్టి ఈ క్షేత్రం 'ఏకశిలా నగరం'గా ఖ్యాతికెక్కింది. సీతారామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు కలవకముందు కాలంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ప్రసిద్ధంగా ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు. మృకండుడు,శృంగి మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ప్రసిద్ధి. విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఇలాంటి విశేషాలెన్నో స్థలపురాణంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.ఈ దేవాలయం నిర్మాణం మాటున ఎన్నో చారిత్రక విశేషాలు దాగివున్నాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని వివిధ దశల్లో నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో, ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ ఈ దేవాలయన్ని దర్శించాడు. భారతదేశంలోని పెద్దగోపురాల్లో ఈ దేవాలయం ఒకటని రాసుకున్నాడు. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే. ఈయన మనవడే 'అష్ట దిగ్గజ కవులు'లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి,వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి కవితా రూపంగా అక్షరార్చన చేశారు. ఆధునిక కాలంలో దేవాలయ పునరుద్దీపనలో ప్రధాన భూమికను పోషించిన వావిలకొలను సుబ్బారావు కవిగా కూడా పరమాద్భుతమైన పాత్రను పోషించాడు. 24వేల శ్లోకాల సంగమమైన వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్ని 108సార్లు పఠించి,మధించి, ఉపాసించి 'మందరం' పేరుతో తెలుగులోకి పద్యాల రూపంలో అనువాదం చేశాడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామునికి అంకితం చేశాడు. ఆయన చేసిన ఈ అపూర్వ కృషికి మెచ్చిన నాటి మహాకవి,పండితులు 'ఆంధ్రవాల్మీకి' బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించారు. బళ్లారి రాఘవ అధ్యక్షతలో ఈ వేడుక జరిగింది. ఒంటిమిట్ట దేవాలయానికి ఎందరో రాజులు,జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు,సంపదలు దోపిడీకి,దురాక్రమణకు ఆవిరైపోయాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు ఆ దేవాలయం చేరిపోయింది. అటువంటి సమయంలో, వావిలకొలను సుబ్బారావు దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను తలకెక్కించుకున్నారు. టెంకాయ చిప్పను చేతిలో పట్టుకొని,దేశమంతా తిరిగి, ఊరూరా బిచ్చమెత్తి, ధనాన్ని పోగుచేసి, ఆలయాన్ని పునరుద్ధరించాడు. "నీ జన్మ ధన్యము కదే ! టెంకాయ చిప్పా " అంటూ శతకం కూడా రాశాడు. టెంకాయ చిప్ప సంగతి ఎలా ఉన్నా... వాసుదాసు ధన్యుడయ్యాడు, భక్తాగ్రగణ్యుడయ్యాడు. తెలుగువారికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు 'ఒంటిమిట్ట' కోదండరామలయాన్ని నిలబెట్టి, పుణ్యచరితుడయ్యాడు. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీరామనవమి వేడుకలతో పాటు, బ్రహ్మోత్సవాలు, విశేష పూజలు,సంబరాలు నేడు జరుగుతున్నాయి. దేవాలయాలను పరిరక్షించుకోవడం, ఆ అనంతమైన సంపద పరులపరం కాకుండా చూసుకోవడం, ఆధ్యాత్మిక, చారిత్రక,సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. మనందరి కర్తవ్యం కూడా. ఒంటిమిట్ట కోదండరామాలయం అపూర్వ వైభవంతో అనంతకాలం అలరారుతుందని ఆకాంక్షిద్దాం. వాసుదాసు భక్తప్రభాసుగా తరతరాలకు వాసికెక్కుతాడని ఆశిద్దాం. మాశర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
Quiz On Lord Rama: శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
నేడు శ్రీరామ నవమి.. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు?... శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. ఈ కింద లింక్ క్లిక్ చేసి క్విజ్‌లో పాల్గొనండి.. -
థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!
థాయిలాండ్‌లో ఒక రామరాజ్యం ఉంది అనేది మనలో చాలామందికి తెలియదు. మన దేశంలో ఉన్నట్లే అక్కడ ఒక అయోధ్య ఉంది. అక్కడ అడుగడుగున రామరాజ్యమే కనిపిస్తుంది. వారి జాతీయగ్రంథం కూడా రామాయణమే. ఇవన్నీ వింటుంటే అది థాయిలాండ్ దేశమేనా..? అని ఆశ్యర్యంగా ఉంటుంది. అస్సలు మన రాముడితో వారికి సంబంధం ఎలా ఏర్పడింది?. మన రాముడి గొప్పతనం అక్కడ వరకు ఎలా వెళ్లింది..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం!. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండలోని 70, 71 & 73 సర్గలలో రాముని వివాహాన్ని, తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే. మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీ నది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా సీతారాములకు లవ కుశులు, ఊర్మిళా లక్ష్మణులకు అంగద చంద్రకేతులు, మాండవీభరతులకు పుష్కరుడు, తక్షుడనే వాళ్ళు, శృతకీర్తి శతృఘ్నులకు సుబాహువు, శతృఘాతకుడనే వాళ్ళు జన్మించారు. శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.. పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి, తక్షునకు తక్షశిల, అంగదునకు అంగదనగరం, చంద్రకేతునకు చంద్రావతిలను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగ వంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్‌లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణు భగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా! అందువలన వీళ్ళు తమ పేర్లచివర రామ్ అన్న పేరు తగిలించుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్అతుల్యతేజ్. థాయిలాండ్‌లోని మరో అయోధ్య.. థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో బ్యాంకాక్ అని అంటున్నాము కదా! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి. "క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి" థాయి భాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకో విశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. అంటే అర్థం..ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోధ్యలోనే నివసిస్తారు. థాయిలాండ్‌లో నేటికి రామరాజ్యం .. థాయిలాండ్‌లో 192 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వాళ్లనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులుగా భవించి గౌరవప్రదంగా చూస్తారు . రాజవంశం వారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూ ధర్మశాస్త్ర పరిజ్ఞానముంది. థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణ శక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మన దేశంలో లాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం. అంతేగదు రామాయణంలోని సన్నివేశాలతో నాటకాలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. ఇక ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు, హిందువులు అల్పసంఖ్యల్లో ఉన్నారు. అయితే బౌద్ధులు హిందూ దేవీ దేవితలను ఆరాధించటం విశేషం. థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి లుప్తమై పోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite ) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షి శాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణు భగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతే కాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు. థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి.. మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ, థాయిలాండ్ రారాజధానిలోని ఎయిర్ పోర్ట్‌కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణ భూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 5,63,000 స్క్వేర్ మీటర్. ఎయిర్ పోర్టు ముందు "సముద్ర మథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగర మథనాన్ని చూపిస్తుంది. మన పిల్లలకు, రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి. (చదవండి: రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?) -
రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?
శ్రీరామ నవమి అనంగానే తాటాకు పందిళ్లు రాములోరి కళ్యాణ ఘట్టం. కొన్ని గ్రామాల్లో అయితే తిరునాళ్లు కూడా చేసుకుంటారు. ఈ రోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగిన వెంటనే పానకం, వడపప్పు పంచి పెడతారు. ఈ ప్రసాదాన్ని ఎవ్వరు మిస్ చేసుకోరు. ఆ టైం కల్లా వచ్చి ప్రసాదం అందుకుంటారు. వీధివీధుల్లో ఈ తంతు, కోలాహాలం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం ఇస్తారు? వడపప్పును నైవేద్యంగా నివేదిస్తారు? అంటే.. అందుకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ దృక్కోణాలు రెండూ ఉన్నాయని పలువురు పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా, పానకం అన్నా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు . అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఆరోగ్య ప్రయోజనాలు.. ఇక శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచి పెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేగాదు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియనూ వృద్ధి చేస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిబరే రామరసం! రామనామం పాలుమీగడలు, పంచదారతేనెల కంటే కూడా కడు తీయని రసం! నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామమంత మధురంగా ఉంటుంది. ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే! ఈ రెండు నైవేద్యాలకూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?) -
నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తారు..? నవమి నాడే కళ్యాణం ఎందుకంటే.. ఆగమ శాస్త్రం ప్రకారం... శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. అందువల్ల గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే.. ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం వేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించబడింది. శ్రీరామ చంద్రుడు, జానకి దేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు. వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదమే సీతమ్మ తల్లి. చైత్రమాసం శుద్ద నవమి రోజున లోక కళ్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు. తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు. "శ్రీ సీతారామాభ్యాంనమ:" అంటూ పూజలు కూడా చేస్తారు. ఈ శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. శ్రీరామచంద్రుడిని తెలుగు వారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. అంతేకాదండోయ్ రామాలయం లేని ఊరే ఉండదు కూడా. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. మరో కథనం ప్రకారం.. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంటా.. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారట. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడాది భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ చరితార్థం అవుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. (చదవండి: Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..) -
అయోధ్యలో తొలి శ్రీరామ నవమి వేడుకలు..ప్రత్యేకతలు ఏంటంటే..!
అయోధ్యలో ప్రారంభమైన కొత్త రామాలయం తొలి శ్రీరామ నవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవే కావడంతో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. అవేంటో సవివరంగా చూద్దామా..! శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేలా రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముడిని దర్శించుకునేలా అనుమతించింది. సుమారు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. అందువల్ల ఈ రోజున వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. మళ్లీ ఈ నెల ఏప్రిల్ 20వ తేదీ నుంచి వీఐపీ పాసులు అందుబాటులోకి రానున్నాయి. దర్శన వేళలు.. ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. బాల రాముడికి సూర్యుడి తిలకం.. శ్రీరామ నమమి రోజున అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. బాలరాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి కిరణాలు నుదిట మీద పడే విధంగా ఏర్పాటు చేశారు. పురాణల ప్రకారం..చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు బాల రాముడి నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి తిలకించే విధంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అంతేగాదు అయోధ్య నగరం అంతటా దాదాపు వంద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. ట్రస్ట్ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి. ఏకంగా లక్ష కేజీల లడ్డూలు.. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?) -
ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు..
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు ఆంజనేయుడు రాముని వద్ద సెలవు తీసుకుని, తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని, నిరంతరం తపస్సు కొనసాగించేవాడు. సముద్రాన్ని లంఘించి, లంకకు వెళ్లి అక్కడ సీతమ్మవారిని చూడటమే కాకుండా, రావణుడి ఆజ్ఞపై రాక్షసులు తోకకు నిప్పంటిస్తే లంకను తగులబెట్టి మరీ తిరిగి వచ్చిన వైనం సహా రామ రావణ యుద్ధంలో హనుమంతుని సాహసాలను జనాలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. అయోధ్యవాసులకే కాదు, రామరాజ్యం అంతటా జనాలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్యాడు. గంధమాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడి ఆశ్రమం తాపసులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమంలో ప్రతిరోజూ వేదపఠనం సాగేది. తాత్త్విక చర్చలు సాగుతుండేవి. ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా, ఒకనాడు ఆంజనేయుడికి శ్రీరాముడిని దర్శించుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే తన ఒంటె వాహనం మీద అయోధ్య నగరానికి బయలుదేరాడు. జానకీ సమేతుడైన శ్రీరాముడిని దర్శించుకుని, పరిపరి విధాలుగా స్తుతిస్తూ ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ఇక్కడి నుంచి గంధమాదనానికి వెళ్లిపోయాక చాన్నాళ్లకు వచ్చావు. నీ రాక నాకే కాదు, సీతకు కూడా ఆనందదాయకమే! నువ్వు ఉంటున్న చోటు సౌకర్యంగానే ఉందా? ఆశ్రమవాసంలో అంతా కుశలమే కదా?’ అంటూ కుశలప్రశ్నలు వేశాడు. ‘రామా! నీ దయ నిరంతరం నా మీద ఉండగా నాకు చింత ఏమిటి? క్షేమంగానే ఉన్నాను స్వామీ!’ అని బదులిచ్చాడు ఆంజనేయుడు. ‘హనుమా! సీతాన్వేషణ మొదలుకొని రావణుడితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసిపెట్టాలి’ అన్నాడు రాముడు. ‘ఆజ్ఞాపించు ప్రభూ! నీ ఆజ్ఞను నెరవేర్చడమే నా కర్తవ్యం’ చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు. ‘నా అంగుళీయకాన్ని అడిగితే దానిని బ్రహ్మదేవుడికి ఇచ్చాను. లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది. ఇప్పుడు ఆ ఉంగరం కావాలి. నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి, ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు రాముడు. శ్రీరాముడి మాట పూర్తికావడమే తడవుగా ఆంజనేయుడు రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడి కొలువు నిండుగా ఉంది. అష్టదిక్పాలకులు, సనక సనందాది మహామునులు అక్కడ ఉన్నారు. ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి, అతడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు. సభలోకి బ్రహ్మదేవుడు అడుగుపెట్టాడు. సభాసదులందరూ ఆయనకు నమస్కరించారు. ఆంజనేయుడు కూడా లేచి నిలుచుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. ‘దేవా! మా శ్రీరామచంద్రుడు తన రత్నఖచిత కనక అంగుళీయకాన్ని నీకు ఇచ్చాడట. ఆ ముద్రికను తీసుకు రమ్మని నన్ను ఇక్కడకు పంపాడు. ఆ ముద్రికను వెంటనే ఇచ్చేస్తే, నేను దానిని తీసుకువెళ్లి నా ప్రభువుకు అందిస్తాను’ అన్నాడు. ‘ఇది సత్యలోకం. ఇక్కడ ఒకసారి ఇచ్చినది ఏదైనా తిరిగి ఇవ్వడానికి వీలుపడదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మాటలకు ఆంజనేయుడికి కోపం వచ్చింది. ‘బ్రహ్మదేవా! బొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలుపడదు. నువ్వు ఇవ్వకుంటే, ఈ సత్యలోకాన్నే పెళ్లగించుకుని పోయి నా ప్రభువు పాదాల ముందు ఉంచుతాను’ అంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సత్యలోకంలో ఉన్నవారంతా ఆంజనేయుని భీకర విశ్వరూపాన్ని చూసి హాహాకారాలు చేశారు. ఇంతలో సనక మహర్షి కల్పించుకుని, ‘బ్రహ్మదేవా! రామదూత ఆంజనేయుడి బలవిజృంభణను చూశావు కదా! పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను అతడికి ఇచ్చి పంపడమే మంచిది’ అని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామరలతో నిండి ఉన్న కొలనను చూపించి, ‘ఆ ముద్రిక అందులోనే ఉంది. తీసుకువెళ్లు’ అన్నాడు. హనుమంతుడు కొలనులోకి చూస్తే, నీటి అడుగున అసంఖ్యాకంగా రామ ముద్రికలు కనిపించాయి. అన్నిటినీ తీసుకువెళ్లడానికి రామాజ్ఞ లేదు. ఏం చేయాలో తోచక ఆంజనేయుడు రిక్తహస్తాలతోనే అయోధ్యకు చేరుకుని, రాముడికి జరిగిన సంగతంతా చెప్పాడు. ‘హనుమా! ఆ సరస్సున ఉన్నవి నా అంగుళీయకానికి బింబ ప్రతిబింబాలే! వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకలలోక సమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వాటిలో ఒకటి తీసుకురా’ అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే మళ్లీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముద్రికల్లో ఒకదానికి తీసుకువచ్చి, రాముడికి అందజేశాడు. రాముడు సంతోషించి, ‘హనుమా! భవిష్యత్తులో నువ్వే సత్యలోకాధిపత్యం పొంది భవిష్యద్బ్రహ్మవై వర్ధిల్లగలవు’ అని ఆశీర్వదించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు..