Women Power
-
సాంగ్లీ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్ స్టోరీ
‘పెద్ద చదువులు చదవాలి’ అనేది పేదింటి అమ్మాయి ఆక్సా కోరిక. అయితే అదంత తేలికైన విషయం కాదని ఆమెకు అర్థం అయింది. దారి పొడగునా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. అయినా సరే ఆమె ప్రయాణం ఆగలేదు. ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం అడ్డు కాదు’ అని నిరూపించి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది అక్సా పులారా. టెక్ దిగ్గజం గూగుల్‌లో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు చూస్తోంది. మహారాష్ట్రలోని సాంగ్లీలో పుట్టిన ఆక్సా పులారా ‘వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ నుండి బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ‘చదివింది చాలు’ అన్నారు ఇంటి పెద్దలు. ఉన్నత చదువులు చదవాలనేది అక్సా లక్ష్యం.‘నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను’ అంటే ససేమిరా అన్నారు.అదేపనిగా అడిగితే పెద్దల మనసు కరిగింది. ‘సరేలే. చదువుకో’ అన్నారు. ఆరోజు తనకు ఎంత సంతోషమైందో!‘యస్...నేను సాధించగలను’ అనే గట్టి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే అక్సాకు ఎంతో శక్తిని ఇచ్చింది. ఆ శక్తే తనను అమెరికా వరకు తీసుకెళ్లింది. అమెరికాలో చదువుకుంటున్న వారి గురించి వినడమే కాని తాను కూడా చదువు కోసం అక్కడికి వెళతానని కలలో కూడా అనుకోలేదు. సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో చేరింది. ఆ తరువాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో కొంతకాలం పనిచేసింది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్(యంఎల్)తో సహా అత్యాధునిక సాంకేతికతలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. (రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!)ఆ తరువాత గూగుల్‌లో చేరింది. అక్కడ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇన్నోవేషన్లకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను లీడ్ చేస్తోంది. కాలేజీ, యూనివర్శిటీ రోజుల్లో గూగుల్‌లో ఆవిష్కరణల గురించి ఆసక్తిగా తెలుసుకునేది. ఇప్పుడు ఆ ఆవిష్కరణలలో తాను కూడా భాగం అయింది. అక్సాకు మొదటి నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. ముఖ్యంగా కట్టింగ్–ఎడ్జ్ టెక్నాలజీగా చెప్పే ఏఐ, ఎంఎల్లో ప్రతి చిన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేది. నిజజీవితంలో మనం ఎదుర్కొనే ట్రాఫిక్జామ్లాంటి సమస్యలకు ఏఐ, ఎంఐ సాంకేతికత పరిష్కారం చూపుతుందని అంటుంది ఆక్సా పులారా.గూగుల్‌లో చేరిన తరువాత ఆ సంస్థ ఏఐ అండ్ ఎంఎల్ డెవలప్‌మెంట్స్‌లో ప్రధానపాత్ర పోషిస్తోంది. టీమ్ వర్క్‌స్పేసెస్, లుకర్ స్టూడియో ప్రో మొదలైన ఇన్నోవేటివ్ గూగుల్ ప్రొడక్ట్స్‌లో తన వంతు పాత్ర నిర్వహించింది. మనలో సామర్థ్యం ఉండగానే సరి΄ోదు. ఆ సామర్థ్యానికి తగిన వేదిక కూడా దొరకాలి. గూగుల్ రూపంలో ఆమెకు సరైన వేదిక దొరికింది.‘గూగుల్‌లో కనిపించే కల్చరల్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రభావంతో పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. సంక్లిష్టమై సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలనే కుతూహలం నన్ను ముందుకు నడిపించింది’ అంటుంది అక్సా పులారా. ఆమె పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఎన్నో ఆవిష్కరణలలో కీలకపాత్ర పోషించబోతుందని గట్టిగా చెప్పవచ్చు. -
Sophie Devine: డివైన్ కల తీరగా...
2010 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చిన న్యూజీలండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన సోఫీ డివైన్ జట్టును గెలిపించలేక కన్నీళ్ల పర్యంతమైంది. 2024 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. 32 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి న్యూజీలండ్ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడా సోఫీ డివైన్ కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు. కానీ ఈసారి ఆమె విజేత స్థానంలో ఉంది. ఈ రెండు సందర్భాల మధ్య ఏకంగా 14 సంవత్సరాల అంతరం ఉంది. 21 ఏళ్ల వయసులో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేసిన సోఫీ డివైన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో సారథిగా, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది.దేశం తరఫున రెండు వేర్వేరు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సోఫీ డివైన్ కూడా ఉంది. న్యూజీలండ్ జట్టు తరఫున అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడిన ఆమె ఆపై క్రికెటర్‌గా సత్తా చాటి ఇప్పుడు ఆ దేశం తరఫున అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇష్టపడేది. అందుకే ఆ దేశంలో అంతా పడిచచ్చే రగ్బీ క్రీడాకారిణి కావాలనుకుంది. అయితే 11 ఏళ్ల వయసులో స్కూల్లో క్రికెట్ జట్టులో అవకాశం దక్కడంతో అటు వైపు మళ్లింది. ఆపై మూడేళ్ల పాటు క్రికెట్‌పైనే దృష్టి పెట్టింది. తన స్కూల్, కాలేజీలకు చెందిన అబ్బాయిల జట్టు తరఫునే డివైన్ ఆడేది. మరోవైపు అదే కాలేజీ తరఫున అబ్బాయిల హాకీ టీమ్‌లోకి కూడా ఎంపిక కావడం విశేషం. దాంతో దాదాపు సమానంగా రెండు క్రీడల్లో ఆమె ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్ల వయసులో మహిళల సీనియర్ హాకీ టీమ్ తరఫున సత్తా చాటడంతో 2009 జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం వెలింగ్టన్ నుంచి క్రైస్ట్‌చర్చ్ వెళ్లిపోగా కెరీర్ పరంగా కీలక దశలో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సిన తరుణం వచ్చింది. దాంతో హాకీకి గుడ్‌బై చెప్పిన డివైన్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. పిన్న వయస్కురాలిగా..క్రికెటర్‌గా డివైన్ పడిన శ్రమ వృథా కాలేదు. పేస్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మూడేళ్లపాటు రాష్ట్ర జట్టు కాంటర్బరీ తరఫున సత్తా చాటింది. దాంతో 17 ఏళ్ల వయసులోనే న్యూజీలండ్ టీమ్‌లో స్థానం లభించింది. అతి పిన్న వయసులో ఇలాంటి అవకాశం దక్కించుకున్న ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డివైన్‌కు ఈ వార్త తెలిసే సమయంలో ఆమె కాలేజీ పరీక్షలు రాస్తోంది. ఒక్కసారి టీమ్‌లోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అటు బౌలింగ్‌తో పాటు ఇటు దూకుడైన బ్యాటింగ్‌లో కూడా తన ముద్ర చూపించడంతో 2009 టి20 వరల్డ్ కప్‌లో ఆడే కివీస్ టీమ్‌లోకి ఎంపికైంది. ఈ టోర్నమెంట్లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్లు ఆటకు దూరం అవుతుండగా.. తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో డివైన్ ప్రత్యేకతే వేరు. 15 ఏళ్ల వయసులోనే తాను టైప్ 1 డయాబెటిస్తో బాధపడినా పట్టుదల, తగిన డైటింగ్‌తో దాని ప్రభావం తన మీద పడకుండా ఆ ప్రతికూలతను అధిగమించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో..పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా తన ఆటను అద్భుతంగా మార్చుకోవడంతో డివైన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓపెనర్ స్థాయికి ఎదగడం విశేషం. ఒకసారి బ్యాటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బ్యాటింగ్‌లో తన భారీ షాట్లతో పలు సంచలనాలు సృష్టించింది. 2013 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై 131 బంతుల్లో 145 పరుగులు, అంతర్జాతీయ మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో), పాకిస్తాన్‌పై ఒక వన్డేలో బాదిన 9 సిక్సర్లు ఆమె ధాటిని తెలియజేశాయి. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో) రికార్డు డివైన్ పేరిటే ఉండగా అటు పురుషుల, మహిళల అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 6 మ్యాచ్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన రికార్డు ఆమె సొంతం. మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో డివైన్ ఖాతాలో ఏకంగా 4 శతకాలు ఉండటం మరో విశేషం. సారథిగా నడిపించి..దుబాయ్‌లో జరిగిన టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజీలండ్ జట్టు వరుసగా 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టుపై ఎలాంటి కనీస అంచనాలు కూడా లేవు. సహజంగానే టీమ్‌లో వాతావరణం గంభీరంగా ఉండేది. అలాంటి సమయంలో డివైన్ జట్టు సహచరుల్లో స్ఫూర్తి నింపింది. ‘వరల్డ్ క్రికెట్లో ఏదీ సులువుగా రాదు. 14 ఏళ్ల తర్వాత కూడా నేను ప్రపంచ కప్ కల కంటున్నానంటే ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంతోనే! ఫలితం గురించి ఆలోచించవద్దు. ఓడినా నాలాగా మీకు భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తుంది’ అని చెప్పింది. ఆ గ్రూప్ నుంచి ఆసీస్‌తో పాటు భారత్ మాత్రమే సెమీస్ చేరుతుందని అంతా భావించారు. అయితే డివైన్ మాత్రం తొలి మ్యాచ్‌లో భారత్‌తో గెలిస్తే చాలు.. అంతా మారిపోతుందని నమ్మింది. భారత్‌పై తానే అర్ధసెంచరీతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఆమె చెప్పినట్లు నిజంగానే ఆపై కివీస్ ఎదురులేకుండా దూసుకుపోయింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచే వరకు సోఫీ డివైన్ టీమ్ ఆగిపోలేదు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ బేగం అఖ్తర్!
చీకటి తరువాత వెలుగు’ అనేది ప్రకృతి సూత్రం.అయితే బేగం అఖ్తర్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. చీకటి తరువాత చీకటి...మరింత చీకటి... ఆమె జీవితం. అంత అంధకారంలోనూ వెయ్యి దీపకాంతులతో సంగీతంతో వెలిగిపోయింది. అందుకే అఖ్తర్ బేగం ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ అయింది. ‘అమ్మీ’ నాటకంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి అక్తర్ బేగం పాత్ర పోషించిన అమ్మీనాటక ప్రదర్శన వివిధ నగరాలలో ప్రారంభమైన సందర్భంగా..వన్స్ అపాన్ ఏ టైమ్... ఇన్ ఫైజాబాద్: న్యాయవాది అస్ఘర్ హుస్సేన్‌కు ముస్తారీ రెండవ భార్య. కొద్దికాలం తరువాత భార్య, కవల కుమార్తెలు జోహ్ర, బిబ్బీలను దూరం పెట్టాడు. నాలుగేళ్ల వయసులో అక్కాచెల్లెళ్లపై విష ప్రయోగం జరిగింది. మిఠాయిలు తిన్న అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో జోహ్రా చనిపోయింది. విషయం తెలియని బిబ్బీ ‘జోహ్ర ఎక్కడ?’ అని అడిగింది.‘దేవుడి ఇంటికి వెళ్లింది’ అని చెప్పింది కళ్లనీళ్లతో అమ్మ. అప్పుడు బిబ్బీకి ఏం అర్థం కాలేదు. ఆ తరువాత మెల్లగా అర్థం కావడం మొదలైంది. అక్కతో మాట్లాడడం మిస్ అయింది. అక్కతో కలిసి నవ్వులు పంచుకోవడం మిస్ అయింది. జోహ్ర వీపు మీద కూర్చొని గుర్రంలా స్వారీ చేస్తూ బిగ్గరగా అరవడం మిస్ అయింది. క్రమంగా బిబ్బీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.ఎప్పుడూ మౌనంగా ఉండే అమ్మాయి అయింది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. ఇది గమనించిన తల్లి బిబ్బీని సంగీత తరగతులకు పంపించింది. ఆ తరగతులకు ఇష్టంతో వెళ్లిందా, తల్లి బలవంతం మీద వెళ్లిందా అనేది తెలియదుగానీ ఏడేళ్ల వయసులో చంద్రబాయి అనే ఆర్టిస్ట్ సంగీతానికి ఫిదా అయిపోయింది బిబ్బీ. ఇక అప్పటి నుంచి సంగీతం వైపు ఇష్టంగా అడుగులు మొదలయ్యాయి. పట్నాకు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్దాద్ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది. తల్లితో కలిసి కోల్‌కతాకు వెళ్లి లాహోర్‌కు చెందిన మహ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ఖాన్లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాల దగ్గర సంగీతం నేర్చుకుంది. బిబ్బీ ‘బేగం అఖ్తర్’ అయిందిపదిహేనేళ్ల వయసులో తొలిసారిగా వేదిక మీద కనిపించింది. నేపాల్–బిహార్ భూకంప బాధితుల సహాయంకోసం ఏర్పాటు చేసిన కచేరిలో బేగం అఖ్తర్ గానాన్ని సరోజినీనాయుడు ప్రశంసించింది. ఆ ప్రశంస తనకు ఉత్సాహాన్ని ఇచ్చింది. గజల్స్, దాద్రాలు, టుమ్రీల గ్రామ్‌ఫోన్ రికార్డులతో బేగం అఖ్తర్ పేరు మారుమోగిపోయింది. వినేకొద్దీ వినాలనిపించే స్వరం, అందమైన రూపం ఆమెను సినిమా రంగానికి తీసుకెళ్లింది. మన దేశంలో టాకీ శకం మొదలైన తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. తాను నటించిన అన్ని సినిమాల్లోని పాటలను స్వయంగా పాడింది.లక్నోకు చెందిన ఇష్తియాక్ అహ్మద్ అబ్బాస్ అనే బారిస్టర్తో అఖ్తర్‌కు వివాహం అయింది. వివాహానంతరం భర్త ఆంక్షల కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు గానానికి దూరం అయింది. దీనికి తోడు తల్లి చనిపోవడంతో అఖ్తర్ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ‘మీరు దుఃఖం నుంచి బయటపడే మార్గం సంగీతం మాత్రమే’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అలా వారి సలహాతో సంగీతానికి మళ్లీ దగ్గరైంది.సంగీతం వైపు తిరిగిరావడం బేగం అఖ్తర్‌కు రెండో జీవితం అయింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా తన తీపి గళాన్ని దేశం నలుమూలలా వినిపించింది. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన బేగం అఖ్తర్ అభిమానుల గుండ్లెలో ‘క్వీన్ ఆఫ్ గజల్స్’గా నిచిలింది.‘ఏ మొహబ్బతే’ పుస్తకం రాసిన రీటా గంగూలి మాటల్లో... ‘బేగం అఖ్తర్ అంటే ఏళ్ల తరబడి ఒంటరితనం. నీడలా వెంటాడే బాధ. విషాదం అనేది తన జీవితంలో విడదీయని భాగం అయింది. జీవితంలో లోతైన శూన్యాన్ని అనుభవించిన బేగం అఖ్తర్ దేవుడా, తర్వాత ఏమిటి అనే భయంతోనే జీవించింది. ప్రకాశవంతమైన చిరునవ్వుతో అత్యంత విషాదకరమైన పాటను పాడే సామర్థ్యం ఆమెలో ఉంది’.‘అమ్మీ’గా రంగస్థలం పైకి...నాటకరంగాన్ని తన కాలింగ్ అండ్ కంఫర్ట్‌జోన్‌గా పిలిచే నటి పద్మిని కొల్హాపురి గత కొన్ని నెలలుగా ఉర్దూ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కారణం అమ్మీ. ఈ నాటకంలో ఆమె బేగం అక్తర్‌గా కనిపిస్తుంది. ‘బేగం అక్తర్ పాత్ర పోషించడంతో నా కల సాకారమైంది’ అంటుంది పద్మిని కొల్హాపురి.పద్మిని గతంలో కొన్ని నాటకాల్లో నటించినా ‘అమ్మీ’ నాటకం మాత్రం ఆమెకు నిజంగా సవాలే.‘బేగం అక్తర్ పాత్రను పోషించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ పాత్ర ఒకే సమయంలో ఉత్తేజపరుస్తుంది. ఆందోళనలోకి నెడుతుంది. విషాదంలోకి తీసుకువెళుతుంది’ అంటుంది పద్మిని కొల్హాపురి. -
నో బ్యూటీ పార్లర్.. నా అందం, ఆనందం రహస్యం అదే! నటి
ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నీనా గుప్తాకు బ్యూటీ పార్లర్లకు వెళ్లే అలవాటు లేదు. ‘అవునా!! గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు తరచూ పార్లర్ లకు వెళ్తుంటారు కదా! అందమే కదా అసలు ఎవరికైనా ఆనందం?’ అని మీరు అడిగి చూడండి... నీనా చెప్పే సమాధానం మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ‘నా కూతురే నా ఆనందం‘ అంటారు నీనా!ఆనందం అందాన్నిస్తుంది. ఆ ఆనందం కూతురు మసాబా రూపంలో నీనా కళ్లెదుట ఉంది. ఇక ఆమెకు ఫేషియల్స్ ఎందుకు? పార్లర్లు ఎందుకు? నీనా వయసు 65. సింగిల్ మదర్‌కి స్ట్రెస్ ఉంటుంది. కూతురు ఉన్న సింగిల్ మదర్‌కి మరింత స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్, మరింత స్ట్రెస్‌లను మించిన మూడోస్ట్రెస్ కూడా ఉండేది నీనాకు. అదేమిటో అందరికీ తెలిసిందే. ఆమె కూతురి తండ్రి ఇండియన్ కాదు. 1980ల నాటి వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. నీనా, రిచర్డ్స్కు పుట్టిన అమ్మాయే మసాబా. రిచర్డ్స్ కు అప్పటికే పెళ్లి అయి ఉండటంతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా, మసాబా పెరిగి పెద్దయ్యే వరకు – ఒంటరిగానే ఉండిపోయారు నీనా. ప్రస్తుతం మసాబా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీమసాబానే నీనా కంటి వెలుగు. మసాబానే ఆమె అందం, ఆనందం. ‘ఎదుగుతున్న వయసులో నా కూతురి కోసం నేను రెండు పనులు ఎప్పటికీ చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను. ఒకటి: ఆమె చదువు కోసం ‘ఎవరినీ డబ్బు సాయం అడగకూడదు.’ రెండు : తండ్రి (దగ్గర) లేని పిల్లగా ఆమె కోసం ‘ఎవరి ఎమోషనల్ సపోర్టూ తీసుకోకూడదు.’ ఈ రెండిటిపై గట్టిగా నిలబడ్డాను. మనం డబ్బు, సపోర్ట్ అడగం అని తెలిస్తే ఎవరైనా ధైర్యంగా మన దగ్గరకు వస్తారు. మనమూ అంతే.. ఎవరి దగ్గరకైనా ధైర్యంగా వెళ్లగలం అని ‘బ్రట్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల్‌తో చెప్పారు నీనా గుప్తాకూతురు మాత్రమే కాదు, సింగిల్ మదర్‌గా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావటం కూడా నీనా అందానికి కారణం అయి ఉంటుంది -
Syed Asifa: దీపస్తంభం
‘శక్తి’ అనే మాటకు ఎన్నో కోణాలలో ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ మాటల్లో ‘శక్తి’కి నిర్వచనం ‘లక్ష్యం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకపోవడం’. అలాంటి ‘శక్తి’ సయ్యద్ ఆసిఫాలో ఉంది. బాడీ బిల్డింగ్‌లో ‘రాణి’స్తున్న ఆసిఫా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది. ఈ నెల 5 నుంచి 11 వరకు మాల్దీవులలో జరిగే వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్–2024లో 52 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ పోటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక మహిళ సయ్యద్ ఆసిఫా...‘పెళ్లికి ముందు ప్రపంచాన్ని జయించాలని కల కంటాం. పెళ్లయిన తరువాత ఇల్లే ప్రపంచం అవుతుంది’ అనేది చాలామంది గృహిణుల నోటినుంచి నిరాశ నిండిన చమత్కారంతో వినిపించే మాట. ఆ చమత్కారం మాట ఎలా ఉన్నా... ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు పెళ్లి తరువాత కలలకు తెర వేసి, ఇంటి నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారనేది అక్షర సత్యం. అయితే కొందరు మాత్రం‘ఇలాగే జరగాలని లేదు. ఇలా కూడా జరుగుతుంది’ అని తమ విజయాలతో నిరూపిస్తారు. సయ్యద్ ఆసిఫా ఈ కోవకు చెందిన మహిళ.ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన ఆసిఫా పెళ్లయిన తరువాత ఇల్లే లోకం అనుకోలేదు. ఒక కల కన్నది. ఆ కలను నిజం చేసుకుంది. బీ ఫార్మసీ చేస్తున్నప్పుడు కంభం పట్టణానికి చెందిన మిలిటరీలో పనిచేసే మొఘల్ అన్వర్ బేగ్‌తో ఆసిఫా వివాహం జరిగింది. చదువుపై ఆమె ఇష్టం బీఫార్మసీ పూర్తి చేసేలా చేసింది. ఆ తరువాత ఎంబీఎ పూర్తి చేసింది. చదువుల విషయంలో భర్త ఏరోజూ అభ్యంతరం చెప్పలేదు. తానే చదువుతున్నంత సంతోషపడేవాడు.‘పెళ్లికిముందు తల్లిదండ్రులు ప్రోత్సహించినట్లుగా, పెళ్లయిన తరువాత భర్త ప్రోత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహంతో ఎన్నో విజయాలు సాధించవచ్చు’ అంటుంది ఆసిఫా. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ‘ఇక చాలు’ అనుకొని ఉంటే ఆసిఫా దేశదేశాలకు వెళ్లేది కాదు. విజేతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చి ఉండేది కాదు.ఒకానొక రోజు ‘బాడీ బిల్డింగ్’పై తన ఆసక్తిని భర్తకు తెలియజేసింది ఆసిఫా. ‘ఇప్పుడు ఎందుకు ... ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు బాబును చూసుకోవాలి’ అని ఆయన నిరాశపరిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘నువ్వు కచ్చితంగా సాధించగలవు’ అని ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ముందడుగు వేసింది ఆసిఫా.ప్రముఖ అమెరికన్ బాడీ బిల్డింగ్ చాంపియన్ కొరినా ఎవర్సన్ గ్రాడ్యుయేషన్ చేసింది. పెళ్లయిన తరువాత ‘బాడీ బిల్డింగ్’ వైపు వెళ్లింది. ‘ఇప్పుడు ఏమిటీ! బాడీ బిల్డింగ్ ఏమిటీ!!’ అన్నట్లుగా మాట్లాడారు చాలామంది. వీలైనంతగా వెటకారాలు కూడా చేశారు. ‘రెస్పాన్స్ ఇలా వస్తుంది ఏమిటీ’ అని ఆమె వెనకడుగు వేయలేదు. జిమ్ వైపే అడుగులు వేసింది.‘నేను కూడా వస్తాను’ అంటూ భర్త ఆమెతోపాటు మాడిసన్లోని ‘ఎర్నీ’ జిమ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. ఆమె శ్రమ వృథా పోలేదు. 1980లో ‘మిస్ మిడ్ అమెరికా’గా మొదలైన ఆమె విజయ పరంపర రిటైరయ్యే వరకు అజేయంగా కొనసాగింది. కొరినా ఎవర్సన్లాంటి ఎంతోమంది విజేతలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లిన ఆసిఫా వెటకారాలను పట్టించుకోలేదు. ఆమె సాధన వృథా పోలేదు. బాడీబిల్డింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి తిరుగులేని విజేతగా నిలిచింది.బాడీ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టకముందు ఎంబీఏ చదివే రోజుల్లో జైపూర్‌లో జరిగిన ఈత పోటీల్లో వెండి పతకం సాధించింది ఆసిఫా. ఆ సమయంలో ఎంతోమంది నోటినుంచి వినిపించిన ‘కంగ్రాచ్యులేషన్స్’ అనే మాట తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆనాటి ఆ ఉత్సాహమే శక్తిగా మారి నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా ‘బాడీ బిల్డింగ్ ఛాంపియన్’ను చేసింది. ట్రాక్ రికార్డ్→ 2019లో ఆసిఫా బాడీ బిల్డింగ్‌లో శిక్షణ మొదలు పెట్టింది → 2023లో తెలంగాణలో జరిగిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచింది → 2023లో గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో పతకాలు గెలుచుకుంది → 2024లో ‘సౌత్ ఇండియన్ చాంపియన్ షిప్’లో ప్రథమ స్థానంలో నిలిచింది. అర్జున కలఅర్జున అవార్డు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాను. అర్జున అవార్డు సాధించాలంటే మూడు సార్లు వరల్డ్ చాంపియన్ షిప్ సాధించాల్సి ఉంటుంది. అందుకోసం కష్టపడి సాధన చేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలి. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సహించాలి. నా భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. అందరూ ప్రోత్సహిస్తే ప్రతి ఇంటికి ఒక మెడల్ వచ్చే అవకాశం ఉంటుంది.– సయ్యద్ ఆసిఫా– ఖాదర్ బాష, సాక్షి, కంభం, ప్రకాశం జిల్లా -
Nita Ambani birthday: దీపాలతో వేడుక : ఉత్సాహంగా చిన్న కోడలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ వ్యాపారవేత్త ,పరోపకారి, నీతా అంబానీ 60వ పుట్టిన రోజు (నవంబరు 1). ఈ సందర్భంగా కొత్తకోడలు, నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, రాధిక మర్చంట్, కంపెనీ సిబ్బంది ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీకి స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. Paltan, join us in wishing Mrs. Nita Ambani, a very Happy Birthday! 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/MQlPXKqLGx— Mumbai Indians (@mipaltan) November 1, 2024అలాగే పలువురు సెలబ్రిటీలు నీతా అంబానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. ఐపీఎల్టీం ముంబై ఇండియన్స్ కూడా ఎక్స్ ద్వారా విషెస్ తెలిపింది. Today, on the birthday of our Founder and Chairperson, Mrs. Nita Ambani, we celebrate her passion for the arts! pic.twitter.com/Sq47Fpg55r— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2024నీతా బర్త్‌డేను కంపెనీ సిబ్బంది దీపాలతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేశారు. దీపాలను వెలిగించిన పళ్లెంతో ఆమెకు హారతి ఇచ్చారు. హ్యాపీ బర్త్‌డే పాటను ఆలపించారు. దీంతో నీతా అంబానీ ఆనందంతో మెరిసి పోయింది. ఈ వేడుకలో చిన్నకోడలు రాధిక మర్చంట్ ఉత్సాహంగా పాల్గొంది. పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గులాబీ రంగు చీరలో మెరిసారు. మెడలో మూడు పేటల ముత్యాల హారం, మ్యాచింగ్ చెవిపోగులు, రింగుల జుట్టుతో మరింత అందంగా కనపించారు. అత్తగారికి తగ్గట్టుగా చోటి బహు, రాధిక మర్చంట్ కూడా గులాబీ రంగు పూల దుస్తుల్లో మెరిసింది. -
దేవుడిచ్చిన కూతురు తల్లై ఎదురొచ్చింది!
డాక్టర్ జె. రాధాకృష్ణన్‌కు అవి ఉద్విగ్న భరితమైన క్షణాలు! కిందటి శనివారం ఆయన నాగపట్నంలోని సంరక్షణాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చేతుల్లో బిడ్డతో సౌమ్య ఆయనకు ఎదురొచ్చింది. ఆ బిడ్డను మురిపెంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఆయన. సౌమ్య తనకు దేవుడిచ్చిన కూతురైతే, ఆ కూతురి కన్నబిడ్డ ఆయన చేతుల్లోని పసికందు. సౌమ్య తల్లయిందని తెలిసి ఆమెను చూడ్డం కోసం ఆ హోమ్‌కి వచ్చారు రాధాకృష్ణన్, ఆయన భార్య కృతిక. తన బిడ్డకు వారి ఆశీర్వాదం కోసం తను పెరిగిన హోమ్‌కే తీసుకు వచ్చింది సౌమ్య. సౌమ్యను ఇరవై ఏళ్లు కంటికి రెప్పలా చూసుకున్న హోమ్ అది. ఈ ఇరవై ఏళ్లుగా హోమ్‌లో సౌమ్య బాగోగులను చూసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ రాధాకృష్ణన్. ఎందుకు ఆయనకు సౌమ్య అంటే అంత మమకారం?! ఈ ప్రశ్నకు సమాధానం వెలాంకిణి మాతకు తెలుసు. ఆ మాతే కదా.. సునామీలో సౌమ్య తల్లిదండ్రులు కొట్టుకుపోవటం చూసింది! ఆ మాతే కదా అనాథగా నాగపట్నం తీరంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న నాలుగేళ్ల సౌమ్యను నన్స్ చేత చేరదీయించి, వారు చేర్పించిన సంరక్షణాలయంలో రాధాకృష్ణన్ కంట పడేలా చేసింది! 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రం విప్పిన సునామీ పడగ ఉప్పెన తమిళనాడు తీరప్రాంతం నాగపట్నాన్ని కూడా ముంచెత్తింది. వేలాదిగా మరణాలు. కొట్టుకుపోయిన ఇళ్లు... చెల్లాచెదురైన కుటుంబాలు. వారి పునరావాసం కోసం ప్రభుత్వం తంజావూరు జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్‌ను అక్కడికి పంపింది. ఆ కొద్దిరోజులకే ఆయనకు నాగపట్నం జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది.వెలాంకిణి ఆలయ నన్స్ అనాథ పిల్లల్ని చేర్పించిన అన్నై సాథియ గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్‌ను సందర్శించినప్పుడే రాధాకృష్ణన్ మొదటిసారిగా సౌమ్యను చూశారు. ఆ చిన్నారి కళ్ళలోని విషాదం ఆయన మనసును కలచివేసింది. దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కూతుళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు సౌమ్యను చూడగానే దేవుడిచ్చిన కూతురు అనే భావన ఆయనలో కలిగింది. కుదిరినప్పుడల్లా వెళ్లి ఆ కూతుర్ని మనసు నిండుగా చూసుకుని వచ్చేవారు. కాలం గడిచింది. 2018 లో ఒకసారి ఆయన సౌమ్యను చూడానికి వెళ్ళినప్పుడు సౌమ్య, ఆమె స్నేహితురాలు మీనా కనిపించారు. ‘మిగతా పిల్లలంతా దత్తతకు వెళ్లిపోయారని, అప్పటి పిల్లల్లో వీళ్ళిద్దరే మిగిలారని‘ హోమ్ వాళ్ళు చెప్పారు. మళ్లీ వెళ్ళినప్పుడు... మణివణ్నన్ అనే సముద్ర ఉత్పత్తుల వ్యాపారి, ఆయన భార్య మలర్విళి సౌమ్యను దత్తత తీసుకున్నారని తెలిసింది. 2022లో సుబ్బయ్య అనే టెక్నీషియన్‌తో సౌమ్య పెళ్లి జరిగింది. రాధాకృష్ణన్ దంపతులే వారి పెళ్లి జరిపించారు. ఈ అక్టోబర్ 22న పాపను ప్రసవించింది సౌమ్య. ఆ పాపకు సారా అని పేరు పెట్టుకుంది. పాపను చూడాలని ఉందంటే హోమ్ వాళ్లే ఈ ‘తండ్రీ కూతుళ్లు‘ కలిసే ఏర్పాట్లు చేశారు.ఎకనామిక్స్‌లో బి.ఏ. చేసిన సౌమ్య ప్రస్తుతం నర్సింగ్ కోర్స్ చేస్తోంది. అందుకు రాధాకృష్ణన్ సహకారం ఉంది. ఆయన ఇప్పుడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ. కో ఆపరేషన్, ఫుడ్, కన్సూ్యమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కి ఇంఛార్జి. ‘సునామీని తట్టుకుని నాగపట్నం నిలబడినట్లే... సౌమ్య, మీనా, ఇంకా అటువంటి అనాథ పిల్లలు జీవితాన్ని ఎదుర్కొన్న తీరు ఆదర్శనీయం‘ అంటారు రాధాకృష్ణన్. -
యువతుల‘పడవ’ళ్లు!
దాల్ సరస్సులోని నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండి, శ్రీనగర్ పట్టణ ప్రాంత సోయగాలను, ప్రకృతి రమణీయతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక ఆ సరస్సులో సోమవారం జరిగిన బోట్ రేస్ ఏకంగా మహిళా సాధికారతనే పరవళ్లు తొక్కించింది! 150 మందికి పైగా అందరూ మహిళలే పాల్గొన్న అలాంటి ఒక రేస్ దాల్ సరస్సులో జరగటం ఇదే మొదటిసారి. మహిళా అథ్లెట్లను ప్రోత్సహించటం, జమ్మూ లోయలోని మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటం, సంప్రదాయ మూస పద్ధతులను బద్దలు కొట్టించి మహిళల్ని ఇంటి బయటికి రప్పించటం ఈ పడవ పోటీల లక్ష్యం. కశ్మీర్ మహిళలకు వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు తన జీవితాన్నే అంకితం చేసిన ప్రఖ్యాత అథ్లెట్,పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశపు మొదటి మహిళా జ్యూరీ.. బిల్కిస్ మీర్ ఈ పోటీలను నిర్వహించారు.‘‘మహిళల కోసం దాల్ సరస్సులో ఏర్పాటు చేసిన ఈ మొట్టమొదటి ట్రాక్ రేస్ చరిత్రాత్మక మైనది. పురుషులకు ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. మహిళలకు అన్ని ఉండవు. ఇటువంటి మరిన్ని రేసులను నిర్వహించి, 35మంది యువతుల్ని వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని అంతర్జాతీయ పోటీలకు శిక్షణ ఇస్తాం’’ అని బిల్కిస్ మీర్ తెలి΄ారు. పోటీలోపాల్గొన్న మాదిహా ఫరూక్ అనే యువతి, తను ఈ రేసులో భాగం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘ఆడపిల్లలకు ఆటలేంటి అనే భావజాలం సమాజం నుండి రూపుమాసిపోవాలి’’ అని అన్నారు.అందమైన జలమార్గాలకు పేర్గాంచిన కశ్మీర్లో, మహిళల్ని వాటర్ స్పోర్ట్స్‌లో ప్రోత్సహించటం ద్వారా సాధికారత వైపు పడవల్ని పరుగులెత్తించటం బాగుంది. -
మానవతకు ప్రతిరూపం
మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకా నందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గ రెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివే దిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో మరణించిన సిస్టర్ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.– సాకి ‘ 99511 72002(నేడు సిస్టర్ నివేదిత జయంతి) -
వాడిన విరులూ పరిమళిస్తాయి
అమ్ముడుపోని పూలు ఏమవుతాయి? కొనేవాళ్ల కోసం ఎదురు చూసే సహనం పూలమ్మాయికి ఉంటుంది, కానీ పూలకు ఉండదు. రెక్కలు విచ్చుకోవడం, ఆ రెక్కలు వాలిపోవడంలో అవి వాటి సమయాన్ని క్రమం తప్పనివ్వవు. మార్పుకు నాంది పూలసాగు రైతుల జీవితాలను సువాసనభరితం చేస్తోందా? మొక్కనాటి, నీరు పెట్టి, ఎరువు వేసి పెంచిన మొక్కలు మొగ్గతొడిగితే ఆనందం. ఆ మొగ్గలు విచ్చేలోపు కోసి మార్కెట్‌కు చేర్చాలి. తెల్లారేటప్పటికి నగరంలోని మార్కెట్‌కు చేరాలంటే పూలను కోసే పని అర్ధరాత్రి నుంచి మొదలవ్వాలి. ఆ సమయంలో ΄పొలంలో పనికి వచ్చే వాళ్లు ఉండరు. వచ్చినా రెండింతల కూలి ఇవ్వాలి. సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు, తన శ్రమ కలిపి ధర నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మార్కెట్లో పూలు ఎక్కువై΄ోయి డిమాండ్ తగ్గిన రోజుల్లో పూలు కోయడానికిచ్చే కూలి కూడా గిట్టదని ఆ పూలను చెట్లకే వదిలేస్తుంటారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పరిమళాలను మట్టిపాలు కాకుండా కాపాడుతున్నారు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంయుక్త. తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ ఇన్సెన్స్ మేకింగ్ మెషీన్‌కు రూపకల్పన చేశారామె. ఇంజనీర్ సమాజంలో మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్ కావాలనే ఆశయాన్ని ఆచరణలో పెట్టారామె. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పరిశోధన చేస్తున్న సంయుక్త పర్యావరణహితమైన ఆవిష్కరణ కోసం గ్రామాల బాట పట్టారు. ఈ మెషీన్ రూపకల్పనకు దారి తీసిన కారణాలను సాక్షితో పంచుకున్నారామె.మహిళలతో ముందడుగు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ‘‘2020లో స్థాపించాం. సమాజంలో అవసరమైన ఇంజనీరింగ్ ఆవిష్కరణల గురించి అధ్యయనం చేయడానికి 72 గ్రామాల్లో పర్యటించాం. మహిళలు, మగవాళ్లు, రైతులు, ఇతర వృత్తుల్లోని వారు, పిల్లలు, వృద్ధులు... ఇలా అన్ని కేటగిరీల వ్యక్తులతో మాట్లాడాం. అక్కడి సమస్యలు తెలిశాయి, అవసరాలు అర్థమయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనే స్పష్టత కూడా వచ్చింది. అన్నింటినీ మేం పరిష్కరించలేం, ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన వాటిని వదిలేసి, మా స్థాయిలో పరిష్కరించగలిగే పన్నెండు ప్రాజెక్టుల జాబితా తయారు చేసుకున్నాం. వాటిలో మొదటిది అగరువత్తి తయారీ యంత్రం. అప్పటికి మార్కెట్లో ఉన్న అగరువత్తి మేకింగ్ మెషీన్ల ధర నాలుగైదు లక్షల్లో ఉంది. మేము అరవై వేలలో తయారు చేశాం. రైతుల దగ్గర వృథా అయ్యే పూలు, ఆలయాల దగ్గర అమ్ముడు కానివి, దేవునికి పెట్టి తీసిన పూలను సేకరించి అగరువత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నాం. స్థానిక మహిళలకు శిక్షణనిచ్చాం. వారే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే శిక్షణనిచ్చి, వాళ్లకు తగినట్లు మెషీన్ తయారు చేసిస్తాం’’ అన్నారు ్ర΄పొఫెసర్ సంయుక్త.తయారీ ఇలాగ...సేకరించిన పూల నుంచి రెక్కలను వేరు చేసి ఉప్పు నీటిలో కడిగి ఓ గంటసేపు ఎండలో పెడతారు. ఆ పూలను ΄పొడి చేస్తారు. పది కేజీల పూల నుంచి కేజీ ΄పొడి వస్తుంది. ఆటోమేటిక్ మెషీన్ కాబట్టి మెటీరియల్ పెట్టి సెట్ చేసి ఆ మహిళలు మరొక పని చేసుకోవచ్చు. గంటకు అగరువత్తులు 900, సాంబ్రాణి కడ్డీలైతే మూడు వందల వరకు చేయవచ్చు. రా మెటీరియల్ లభ్యత, మార్కెట్ అవసరాలను బట్టి ఇప్పుడు ఈ మహిళలు రోజుకో గంట పని చేస్తున్నారు. వర్షాకాలంలో పూలను ఎండబెట్టడం కష్టం, కాబట్టి ఆ రోజుల్లో గోమయం కడ్డీలను చేస్తారు. గ్రామాల్లో మహిళలు గోమయాన్ని వేసవిలో సేకరించి ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లోనే రోజుకో గంటసేపు పని చేసుకుని తాము ఉంటున్న అపార్ట్మెంట్, ఇరుగు΄పొరుగు ఇళ్లు, దగ్గరున్న ఆలయాలకు సప్లయ్ చేయవచ్చు. ఇందులో భారీ లాభాలను ఇప్పుడే ఆశించలేం. కానీ పర్యావరణహితమైన పని చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాపకంతో ఎకో వారియర్‌గా గుర్తింపు ΄పొందవచ్చు. – సంయుక్త, ఇన్సెన్స్ స్టిక్స్ మెషీన్ ఆవిష్కర్త -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్‌లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్‌బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్‌గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్‌లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్‌లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
పవర్ ఆఫ్ సాదియా
బాలీవుడ్ సినిమా ‘దంగల్’లో ఒక డైలాగ్... ‘పతకాలు సాధించే విజేతలు చెట్లపై పెరగరు. కష్టపడి ప్రేమతో, అంకితభావంతో వారిని తయారు చేయాలి’ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ గురించి తెలుసుకునే క్రమంలో ‘దంగల్’ గుర్తుకు వస్తుంది. మల్లయోధుడైన తండ్రి తన కూతుళ్లు రెజ్లింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కలలు కంటాడు. ఎన్నో కష్టాలు పడతాడు. సాదియా తండ్రి సందానీ కూడా అలాంటి కలల తండ్రే.‘పవర్ లిఫ్టింగ్’లో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన సమ్దానీకి తనలోని ఛాంపియన్‌ను కూతురిలో చూసుకోవాలనుకున్నాడు. జీవిక కోసం కొబ్బరి బొండాలు అమ్ముతూ కూతురిని పవర్ లిఫ్టింగ్‌లో తీర్చిదిద్దాడు. అతడి శ్రమ వృథా పోలేదు. సాదియా అల్మాస్ అంతర్జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తోంది. సాదియాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టం. కబడ్డీ బాగా అడేది. ‘యముడు’ ‘సింగం’ సినిమాలలో హీరో సూర్య సాహసాలు చూసిన సాదియాకు పోలిస్ ఆఫీసర్’ కావాలనే కల మొదలైంది. పోలీసు అంటే బలంగా ఉండాలి, ఫిజికల్ ఫిట్‌నెట్ కావాలి... అందుకే ‘పవర్ లిఫ్టింగ్’ లోకి వచ్చింది. తండ్రి సందానీ పవర్ లిఫ్టింగ్‌లో చేయి తిరిగిన ఆటగాడు. ‘నాన్న’ అనే స్కూలులో సాధన మొదలుపెట్టింది.ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఉదయం కాలేజీకి వెళ్లే సాదియా సాయంత్రం 5.30గంటల నుంచి 9గంటల వరకు ్రపాక్టిస్ చేస్తుంటుంది.‘నువ్వు అమ్మాయివి. ఇంత బరువులు ఎత్తే ఆటను ఎందుకు ఎంచుకున్నావని చాలామంది అడుగుతుంటారు. నా దృష్టి్టలో కష్టం లేని ఆట లేదు. ప్రతి ఆటలోనూ విజయం కోసం శ్రమించాల్సిందే. మా నాన్న కష్టం ముందు నా కష్టం చాలా చిన్నది. కుటుంబ పోషణ కోసం నాన్న కొబ్బరి బోండాలు అమ్మారు. నన్ను ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టేందుకు ఎంతో కష్టపడ్డారు. మా అక్క కూడా నాన్నప్రోత్సాహంతో వరల్డ్ వర్సిటీ పవర్‌లిఫ్టర్ పోటీలకు వెళ్లింది. ఇప్పుడు హౌస్ సర్జన్‌గా చేస్తోంది’ అంటుంది సాదియా.సాదియా ట్రాక్ రికార్డు ఈ ఏడాది మల్టాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్లో మూడు విభాగాల్లో కలిపి 462.5 కిలోలు లిఫ్ట్ చేసిన సాదియా ‘57 కిలోల విభాగంలో ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన’ అని చెబుతుంది. జూనియర్ విభాగంలో రెండుసార్లు వరల్డ్ చాంపియన్ పతకాలు వచ్చాయి. 2023లో షార్జాలో జరిగిన ఏషియన్ వర్సిటీ క్లాసిక్ చాంపియన్ షిప్లో బంగారు పతకంతో పాటు ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏషియన్ వర్సిటీస్’ టైటిల్ సాధించింది. కేరళలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో విజేతగా, స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏషియాగా నిలిచింది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా, స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ కామన్వెల్త్గా, టర్కీలో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో వెండి పతకం, 2018, 2021, 2022లో ఏషియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. జాతీయస్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ చాంపియన్ షిప్లో స్వాట్‌లో 185 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 180 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 95 కిలోలు బరువులెత్తి మొత్తంగా 460 కిలోలు లిఫ్ట్ చేసి బంగారు పతకాలు సాధించింది. ‘సాదియా’ అనే పేరుకు ఉన్న అర్థాలలో విజయం, అదృష్టం అనేవి కూడా ఉన్నాయి. అయితే ఆమె విజయం కోసం అదృష్టంపై ఎప్పుడూ ఆధారపడలేదు. తండ్రిలా కష్టాన్నే నమ్ముకుంది. అందుకే తండ్రి కలను నిజం చేయగలిగింది.– వరదా ఎస్వీ కృష్ణకిరణ్, సాక్షి, అమరావతి ఫొటోలు: కందుల చక్రపాణిఆటలాడితే చదువు బాగా వస్తుంది!నా చిన్నప్పుడు స్కూల్లో సరిగా చదవని వారిని ‘స్పోర్ట్స్‌లోకి తీసుకోండి’ అనేవారు. అది నా దృష్టిలో తప్పు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది. బాగా చదివే విద్యార్థి అయినా, చదువులో వెనుకబడిన వాళ్లైనా స్పోర్ట్స్‌లో ఉంటే శారీరకంగా, మానసికంగా మంచిది. తొమ్మిదో తరగతి వరకు నాకు 60 శాతం మార్కులు వచ్చేవి. ఇప్పుడు 85 శాతంపైగా మార్కులు వస్తున్నాయి. దీనికి ఆటలే కారణం అని చెబుతాను. ఆటల్లో పడి చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారోనని భయపడి ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలను ఆటల వైపుప్రోత్సహించడం లేదు. ఇది మారాలి. ఎంబీఏ తర్వాత పీహెచ్డీ చేయాలని ఉంది. ‘అథ్లెట్స్ మైండ్ సెట్స్ ఎడ్యుకేషన్’పై పరిశోధన చేస్తాను.– సాదియా ఆల్మాస్ -
సాహసమే ఊపిరిగా..! ఏకంగా 14 పర్వతాలను ..!
అభిరుచి, అంకితభావం, పట్టుదల ఒక దగ్గర చేరితే ఏమవుతుంది? అపురూప విజయం అవుతుంది. ఆడ్రియానా బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం అవుతుంది. ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా 23 ఏళ్ల ఆడ్రియానా బ్రౌన్లీ రికార్డ్ సృష్టించింది. లండన్‌లో పుట్టి పెరిగిన బ్రౌన్లీకి చిన్నప్పటి నుంచి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వారి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. నాన్న పర్వతారోహకుడు. పర్వతారోహణకు సంబంధించి ఆయన చెప్పే ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వినడం అంటే ఇష్టం.ఎనిమిదేళ్ల వయసులో పర్వతారోహకుడైన తండ్రి నుంచి ప్రేరణ ΄పొందింది బ్రౌన్లీ. పెద్ద పర్వతాలు అధిరోహించి పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనేది. ఇరవై ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో ఆ కల సాకారం అయింది. ఆక్సిజన్ లేకుండా గాషెర్‌బ్రమ్ 1కు చేరుకున్న అతి పిన్న వయస్కురాలిగా, కే2 శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.చైనాలోని 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న పిషాపాంగ్మా పర్వతాన్ని అధిరోహించడం ద్వారా 14 శిఖరాల అధిరోహణను పూర్తి చేసింది. నిర్మలమైన ఆకాశం సాక్షిగా, సూర్యోదయం వెలుగులో పిషాపాంగ్మా పర్వతం దగ్గరకు చేరుకోగానే బ్రౌన్లీ భావోద్వేగానికి గురైంది. ‘శిఖరానికి చేరుకోకముందే నా లక్ష్యం నెరవేరబోతుంది అనే ఆనందంలో ఏడ్వడం మొదలు పెట్టాను’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం కేవలం సంఖ్యకు సంబంధించినది కాదు. అంకితభావాన్ని, నిబద్దతను ప్రతిఫలించే అపురూప విజయం అది. పర్వతారోహణ అనేది అభిరుచి మాత్రమే కాదు త్యాగాల సమాహారం. పర్వతారోహణపై దృష్టి పెట్టిన బ్రౌన్లీ టీనేజ్ సంతోషాలకు దూరమైంది. తన కలను సాకారం చేసుకోవడానికి యూనివర్శిటీకి దూరమైంది. వ్యక్తిగత విజయాలపై మాత్రమే బ్రౌన్లీ దృష్టి పెట్టలేదు. పర్వతారోహణ విషయంలో యువతను ప్రోత్సహించడానికి, వారు తమ కలలను సాకారం చేసుకునే విషయంలో సహకరించడానికి నడుం కట్టింది.‘సాహసం మంచిదేగానీ దుస్సాహాసం తగదు’ అంటున్న బ్రౌన్లీ ఎంతోమంది పర్వతారోహకులను దగ్గర నుంచి చూసింది. వారిలో ఉత్సాహమే కనిపిస్తుంది. శిక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సాహసాల పేరుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నాకు తెలుసు. పర్వతారోహణ పేరుతో సాహసాలకు దిగే కొద్దిమందికి ప్రాథమిక విషయాల్లో కూడా అవగాహన లేదని తెలుసుకున్నాను. ఉత్సాహమే కాదు శిక్షణ కూడా చాలా ముఖ్యం. అనుభవం లేని పర్వతారోహకులను ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అనుమతించరాదు. వారు తమ ప్రాణాల తోపాటు ఇతరులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించే పర్వతారోహకులు ముందుగా చిన్న పర్వతాలను అధిరోహించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటుంది బ్రౌన్లీ. ‘ఎప్పుడు పర్వతాల గోలేనా’ అని బ్రౌన్లీని స్నేహితులు వెక్కిరించేవారు. అయితే ఆమె అలాంటి వెక్కిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు.‘జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యం మీకు ప్రత్యేకమైనది కావచ్చు. ఇతరులకు వింతగా అనిపించవచ్చు’ అంటుంది బ్రౌన్లీ. ఒక పర్వతానికి మరో పర్వతానికి సంబంధం ఉండదు. ప్రతి పర్వతం తనదైన సవాళ్లు విసురుతుంటుంది. ‘ప్రతి సవాలు విలువైనదే’ అంటున్న ఆడ్రియానా బ్రౌన్లీ మరిన్ని సాహసాలకు సిద్ధం అవుతుంది.(చదవండి: తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..) -
ప్రాణం నిలిపి.. ప్రాణాలకు తెగించి
మన్షిదా బాను మంగుళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఈమధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరారు. అక్టోబర్ 23 తెల్లవారు జామున 3.40 కి ఆ స్టేషన్ కి కాల్ వచ్చింది. అక్కడికి దగ్గర్లోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో పెద్ద ఆక్సిడెంట్ అయింది. పికప్ వెహికల్, కంటైనర్ ట్రక్కు డీ కొట్టుకున్నాయి. ఇదీ ఆ కాల్. వెంటనే మన్షిదా తన స్కూటీ పై ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వెళ్ళేటప్పటికి ఆ వాహనాలు తుక్కు తుక్కు అయి ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఆ రెండు వాహనాలలో ఒకదాని క్లీనర్ అతను. మన్షిదా అతడి పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని అతి కష్టమ్మీద లేపి, తన స్కూటర్ పై నేరుగా ఆ దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి మోసుకెళ్లారు. అతడి ప్రాణాలని నిలబెట్టగలిగారు.ఆమె టైమ్ సైన్స్ ఆమె వేగం, ఆమె ధైర్యం, ఆమెలోని కారుణ్యం, ఆమె యూనిఫామ్.. అన్నీ పంచభూతాల్లా ఒకటై ఆ వ్యక్తి ్రపాణాలను కాపాడాయనే అనుకోవాలి. అదే కనుక.. పోలీస్ కాకుండా ఒక మామూలు వ్యక్తి ఎవరైనా అంతలా గాయపడిన వారిని తీసుకెళితే ప్రైవేటు హాస్పిటల్స్ చేర్చుకుని ఉండేవా?! ‘మేం అడ్మిట్ చేసుకోడానికి లేదు. ఇది పోలీస్ కేస్..‘ అని ఉండేవి.‘వాయు వేగంగా స్పందించి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన కద్రి స్టేషన్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ మన్షిదా బానుకు‘ అభినందనలు అంటూ తెల్లారగానే మంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ట్వీట్ పెట్టారు. మంగుళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మన్షిదాకు ప్రశంసలు అందాయి.డ్యూటీ మైండెడ్ మాత్రమే అయి ఉంటే ఘటనా స్థలానికి వెళ్ళగానే ఫార్మాలిటీస్ లో పడి ఉండేవారు మన్షిదా. కానీ ఆమె అలా చేయలేకపోయారు. ఆమెలోని మానవతా హృదయం.. ఉద్యోగ విధి విధానాలను దాటి మరీ స్పందించింది. అందుకు ‘తగిన శిక్ష‘ ఏదైనా ఉందంటే.. అది ప్రమోషనో, ప్రశంసాపత్రమో తప్ప మరొకటి అవుతుందా?! మన్షిదా మాత్రం.. ‘నేను చేసింది ఏముందీ..!‘ అని చిరునవ్వుతో అంటున్నారు.. తనపై కురుస్తున్న అభినందనల జల్లులలో తడిసి ముద్ద అవుతూ.సాహసాన్ని వెన్నెముకగా ధరించే వాళ్లకు అసాధ్యం ఉండదు. హై–రిస్క్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మరోసారి అక్షరాలా నిరూపించింది పైలట్ రీనా వర్గీస్. అడవిలో, అత్యంత ప్రతికూల పరిస్థితులలో ప్రాణాపాయంలో ఉన్న జవాన్‌ను ఆస్పత్రికి తరలించింది. రీనా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో... 2009లో సీనియర్ పోలీసు అధికారులను తీసుకు వెళుతున్న హెలికాప్టర్‌ను మావోయిస్ట్‌లు కూల్చివేశారు. తాను చేస్తున్న ఉద్యోగం ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన రీనాకు ఉపయోగపడింది.తాజా విషయానికి వస్తే...మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కమాండోలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎనిమిది గంటల పాటు జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఒక కమాండో తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్ట్‌ల రాకెట్ దాడులకు అవకాశం ఉన్న ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడిన కమాండోను అక్కడి నుంచి తరలించడం అంటే ్రపాణాలను పణంగా పెట్టడమే. ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న రీనా వర్గీస్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా హన్స్ హెలికాప్టర్‌తో రంగంలోకి దిగింది. కో–పైలట్‌కు కమాండ్స్ అందజేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో హెలికాప్టర్‌ను వీలైనంత వరకు దించి కిందికి దూకింది.తాడు సహాయంతో గాయపడిన కమాండోను హెలికాప్టర్లోకి తీసుకువచ్చింది. 30 నిమిషాలలో గడ్చిరోలికి అక్కడి నుండి నాగ్‌పూర్ తరలించింది. మూడు బుల్లెట్లు తగిలిన కమాండోకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ చేసిన రీనా వర్గీస్ గతంలో ఎన్నో ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను లక్షద్వీప్ నుంచి కొచ్చికి తరలించే రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని ప్రశంసలు అందుకుంది. -
'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!
బెంగళూరులో మేఘనా జైన్ కూడా ఈ దీపావళికి ఒక కళ. ఆమె నడుపుతున్న ‘డ్రీమ్ ఎ డజన్ ’ నుండి ప్రత్యేక ఆర్డర్లపై వెళ్లే గిఫ్టు హ్యాంపర్లు అక్కడి కార్పోరేట్ ఆఫీస్‌లను మతాబుల్ని మించిన తియ్యటి వెలుగులతో కాంతిపుంజాల్లా మార్చేస్తుంటాయి. 6 రకాల కప్‌కేక్‌లు, 12 రకాల కేక్ వెరైటీలు, వేర్వేరు రుచుల్లోని కేక్కప్స్, చీజ్ కేక్స్‌ను అందమైన హ్యాంపర్లో చుట్టి డెలివరీ చేస్తుంటుంది ‘డ్రీమ్ ఎ డజన్ ’. ఆ స్వీట్ స్టార్టప్ యువ అధిపతే మేఘన! ఒక్క దీపావళికి మాత్రమే కాదు, అన్ని సందర్భాలకు, అన్ని సీజన్లలో ఇక్కడి కప్కేక్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఇంత చిన్న వయసులో మేఘన ఏడాదికి కోటి రూపాయల బిజినెస్ చేస్తుందంటే ఇక చూడండి!మేఘన రాజస్థానీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వీట్లంటే ఇష్టమే కానీ, స్వీట్స్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేని 18 ఏళ్ల వయసులో ఓ రోజు తమ పొరుగున ఉన్న వాళ్లు సమ్మర్ బేకింగ్ క్లాసులు పెడితే వెళ్లింది మేఘన. కేక్‌ను బేక్ చేయటం నేర్చుకుంది. తర్వాత్తర్వాత తను బేక్ చేసిన కేక్‌లను ఇంట్లో, బయట, కాలేజ్‌లో అంతా మెచ్చుకోవటం ఆమెకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు, తిరుచ్చిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బిజినెస్ ఐడియా’ల పోటీ పెడితే మేఘన చెప్పిన కప్‌కేక్‌ల ఐడియాకు మూడో ప్రైజ్ లభించింది! వెంటనే ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ వాళ్లొచ్చి ‘‘అమ్మాయ్.. మేము ఇన్వెస్ట్ చేస్తాం. నువ్వు కేక్‌ల బిజినెస్‌కి సిద్ధమేనా? అని అడిగారు! మేఘన డైలమాలో పడిపోయింది. చదువా? బిజినెస్సా? కొంత ఆలోచన తర్వాత చదువు వైపే మొగ్గు చూపింది. డిగ్రీ అయ్యాక మేఘన బెంగళూరులోని ‘ఇన్నర్ చెఫ్’లో డెజర్ట్ విభాగంలో చేరింది. ఫుడ్ టెక్నాలజీ కంపెనీ అది. తర్వాత ‘కేక్వాలా’లో ట్రై నింగ్ తీసుకుంది. తర్వాత ‘స్టార్‌బక్స్’లో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అది రాలేదు. అప్పుడే సొంత బిజినెస్ గురించి ఆలోచించింది. అప్పటికే మేఘన కప్‌కేక్‌ల తయారీ తోపాటు, హ్యాంపర్ డిజైనింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించింది. అయితే 2018లో ‘డ్రీమ్ ఎ డజన్‌ను ప్రారంభించబోతుండగా ‘ఉద్యోగం ఇస్తాం రమ్మని’ స్టార్‌బక్స్ నుంచి పిలుపు! ఈసారి డైలమాలో పడలేదు మేఘన. స్టార్ బక్స్‌ను వద్దనుకుంది. కొద్ది పెట్టుబడితో కేక్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. కరోనా సమయంలో కాస్త ఒడిదుడుకులకు లోనైనా తన ‘డ్రీమ్’ను నిలబెట్టుకుంది.మేఘన దగ్గర ప్రస్తుతం 20 మంది ముఖ్య విభాగాలలో పని చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది మహిళలే. అలాగే హ్యాంపర్స్తోపాటు ఇచ్చే పెయింటెడ్ మాస్క్‌లు, ప్రమిదలు, కొవ్వొత్తుల తయారీని స్థానిక స్వయం సహాయక మహిళా బృందాలకు అప్పగిస్తోంది మేఘన. ఆ విధంగా వారికి కూడా ఆర్థికంగా చేదోడుగా ఉంటోంది. చేతిలో నైపుణ్యం ఉండి, బిజినెస్ చేయాలన్న తపన ఉన్న యువతరానికి మేఘన కచ్చితంగా ఒక రోల్ మోడల్. (చదవండి: -
ఇదేం నిరసన..! 'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’
యువతుల వినూత్న ర్యాలీ... కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు మారుతున్నాయి. అబ్బాయిల్లో ఇటీవల ఎక్కువమంది గడ్డం, జుట్టు పెంచి ఫ్యాషన్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఇండోర్‌లో ఉన్న కొందరు కాలేజీ యువతులు అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాకు గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలంటూ యువతులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ‘గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’ అనే నినాదంతో యువతులు ముఖాలకు గడ్డం మేకప్‌తో ర్యాలీ నిర్వహించారు. వారి చేతిలో ఉన్న ప్లకార్డులపై ’నో క్లీన్ షేవ్.. నో లవ్’, ’మాకు గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి’, ‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్’ వంటి లైన్స్ కనిపించాయి. ఈ ర్యాలీ తాలూకు వీడియోను ఓ ‘ఎక్స్’ యూజర్ నెట్టింట ΄ోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఈ యువతుల డిమాండ్ కరెక్టే. వారానికి ఒక్కసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మన్లా కనిపిస్తాం‘ అని ఒకరు కామెంట్ చేశారు. ‘మా బాడీ మా ఇష్టం’ అని ఒకరు కామెంట్ చేస్తే ‘వారి గడ్డం.. వారి ఇష్టం.. మధ్యలో మీకెందుకు‘ అని ఇంకొకరు కామెంట్ చేశారు. (చదవండి: అతుకులే అదుర్స్! ఏకంగా 180 క్లాత్ ప్యాచ్‌లు..) -
యూట్యూబ్ సాయంతో గవర్నమెంట్ జాబ్..
ఒరిస్సాలోని గిరిజన తెగ. కోచింగ్‌కు డబ్బులు లేవు. ఇంట్లో ఇంటర్నెట్ రాదు.కాని జీవితంలో ఏదైనా సాధించాలి. ఇంటికి, ఊరికి దూరంగా వెళ్లి మరీ సిగ్నల్ ఉన్న చోట కూచుని యూట్యూబ్ వీడియోల సాయంతో ‘ఒరిస్సా సివిల్ సర్వీసెస్’లో ఉద్యోగం సాధించింది బిని ముడులి. సోషల్ మీడియా వల్ల కలిగిన మేలు ఇది. ఒరిస్సాలో బోండా తెగ నుంచి స్టేట్ సివిల్స్‌లో ఉద్యోగం సాధించిన మొదటి మహిళ బిని పరిచయం...ఒక్కొక్కరూ ఒక్కొక్కరూ వస్తూ ఉంటే కాసేపటికి ఆ బోండా ఘాట్ జనాలతో నిండిపోయింది. అందరూ బిని ముడులిని చూసి అభినందించేవారే. దిష్టి తీసేవారే. కారణం ఆ అమ్మాయి తమ బోండా తెగ గౌరవాన్ని పెంచింది. తమ తెగ నుంచి ‘ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్’ (ఓపిఎస్‌సి)లో ర్యాంక్ సాధించి గవర్నమెంట్ అధికారి అవుతున్న మొదటి అమ్మాయి బిని ముడులి. ‘నాకు ఉద్యోగం వస్తే నా కంటే మావాళ్లే ఎక్కువ ఆనందిస్తున్నారు’ అంటుంది 24 ఏళ్ల బిని ముడులి. మొన్నటి శనివారం విడుదలైన ఓపిఎస్‌సి ఫలితాల్లో ఎస్.టి. కోటాలో 596వ ర్యాంకు పొంది ఉద్యోగానికి అర్హత సాధించింది బిని. ఓపిఎస్‌సి 2022–23 పరీక్షకు మొత్తం 92,194 మంది అభ్యర్థులు ΄ోటీ పడితే వారిలో 683 మంది అర్హత సాధించారు. విశేషం ఏమిటంటే టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు మంది అమ్మాయిలున్నారు. అర్హత సాధించిన వారిలో 258 మంది అమ్మాయిలే.యూట్యూబ్ పాఠాలతో2020లో ఓపిఎస్‌సి పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యింది బిని. ‘నా ప్రిపరేషన్ సరి΄ోదని నాకు అర్థమైంది. కాని కోచింగ్‌కు వెళ్లేందుకు డబ్బు లేదు. అదీగాక నేను సంపాదించి ఇంటికి సాయపడాల్సిన సమయం. అందుకే ఆయుర్వేదిక్ అసిస్టెంట్‌గా పని చేయడం మొదలెట్టాను. మా ఊరిలో ఇంటర్నెట్ ఉండదు. అందుకే దగ్గరిలోని గోవిందపల్లి టౌన్‌కు వచ్చి అక్కడ యూట్యూబ్‌లో దొరికే పాఠాలతో ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్లో దొరికే మెటీరియల్‌ను చదువుకున్నాను. అనుకున్నది సాధించాను’ అంది బిని.అమ్మాయిలను స్కూళ్లకు పంపండి‘ఆడపిల్లలను బాగా చదివించండి అనేదే నా పిలుపు. చదువులోనే వారి అభివృద్ధి ఉంది. డబ్బు లేక΄ోయినా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఉచితంగా అనేక కోర్సులు, కోచింగ్‌లు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నేను అధికారి అయ్యాక స్త్రీల స్వయంసమృద్ధి కోసం పని చేస్తాను. అంతేకాదు మా బోండా తెగ కోసం వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల కోసం పని చేస్తాను’ అంది బిని.వంటలు చేస్తూ పెంచాడుఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో ముదులిపడ అనే చిన్న బోండాల ఊరు బిని ముడులిది. తండ్రి మధుముడిలి అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటచేస్తాడు. తల్లి సునమణి ఊళ్లో అంగన్వాడి కార్యకర్తగా పని చేస్తోంది. ఒరిస్సాలో మొత్తం 13 గిరిజన తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే వాటిలో ఒకటి బోండా తెగ. ఆ తెగ నుంచి తాను బాగా చదువుకుని పైకిరావాలనుకుంది బిని ముడులి. జేపోర్లోని బిక్రమ్దేబ్ యూనివర్సిటీలో జువాలజీలో ఎంఎస్సీ చేసింది. ప్రభుత్వ అధికారి అయి ప్రజలకు సేవ చేయాలనేది బిని కల. (చదవండి: వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!) -
వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!
జీవితం అంటేనే కష్టాల మయం అనుకుంటాం. కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్లకు కూడా జీవితం కొన్ని సువర్ణావకాశాలు అందిస్తుంది. అయితే ఆ అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిందే పింకీ హర్యాన్. మురికి వాడల్లో తల్లిదండ్రులతో బిక్షాటన చేస్తూ బతికిన అమ్మాయి..నేడు డాక్టర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. వివరాల్లోకెళ్తే.. పింకీ హర్యానా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని మెక్లీడ్‌గంజ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్ ఖుద్లోని మురికివాడలో నివసించే ఆ కుటుంబం రోడ్డుపై భిక్షాటను చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెత్త కుండిల్లో ఆహారాన్ని ఏరుకుని తినే దుర్భర జీవితాన్ని సాగించేది పింకీ కుటుంబం. ప్రారంభ జీవితం అంతా కటిక దారిద్య్రం, కష్టాల మధ్య సాగింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా ధర్మశాలలోని టోంగ్ లెన్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు నేతృత్వం వహించే బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ దృష్టిలో పింకీ పడింది. అదే ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆనాడు ఊహించలేదు. ఆయన పింకీని చూసి చదివించాల్సిందిగా ఆమె తండ్రి కాశ్మీరీ లాల్‌ను కోరాడు. అందుకు మొదట కాశ్మీరీ లాల్ అంగీకరించలేదు. ఐతే జమ్యాంగ్ తన మాటలతో అతడిని ఒప్పించి పింకీని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేరిపించాడు. అలా అక్కడ నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ హాస్టల్లో నివశించిన తొలి విద్యార్థిగా పింకీ నిలిచింది. తన జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు దేవుడిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని పింకీ అస్సలు వదులుకోలేదు. ఆ పాఠశాలలో చేరినప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకోవడమే గాక మంచి మార్కులతో అన్ని తరగతులు పాసయ్యింది. చివరికీ పింకీ 12వ తరగతి పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో కూడా ఉత్తీర్ణత సాధించింది. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించుకునేలా మంచి ర్యాంకు సాధించలేకపోయింది. అందువల్ల మిగతా పిల్లలు మాదిరిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అంతంతా ఫీజులు చెల్లించి చదవుకులేని నిస్సహయ స్థితిలో పడింది పింకీ. మళ్లీ తన పరిస్థితి మొదటకొచ్చింది అనుకునేలోపే 2018లో, టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ మరోసారి ఆమెను ఆదుకుంది. చైనాలోని ప్రఖ్యాత మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందడంలో పింకీకి సహాయం చేసింది. అలా ఆమె ఆరేళ్లలో చైనీస్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొంది డాక్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ధర్మశాలకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో వైద్యం అందించేందుకు అవసరమైన మెడికల్ లైసెన్స్‌ని పొందేందుకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) కోసం సిద్ధమవుతుంది. ఇంతలా పింకీ జీవితాన్ని మార్చిన బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు. పిల్లలు మంచి మనుషులుగా మారేలా ప్రోత్సహించబడితే నిస్సందేహంగా అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తానని చెప్పారు. ఇక పింకీ తన జీవితాన్ని ఇంతలా గౌరవప్రదంగా మార్చిన జమ్యాంగ్ని తన తండ్రిగా అభివర్ణించింది. అంతేగాదు పింకీలా ఆ ధర్మశాలలో చదివిన వందలాది మంది పిల్లలు జీవితాలు మారడమే గాక వారంతా వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులుగా స్థిరపడ్డారు. ఈ పింకీ గాథ జీవితంలో లభించే అవకాశాన్ని అందిపుచ్చుకుని కష్టపడితే కష్టాల నుంచి బయటపడటమే గాక అద్భుతాలు చేసి చూపించొచ్చని తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!) -
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్‌కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్‌గా నిలిచింది. బ్యాక్‌రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్‌కు టాలిస్ మాన్‌గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్‌ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
మద్యంపై పోరులో మహిళల విజయం..!
ముంబై ప్రాంతంలోని హెచ్‌ఎస్‌జి కాంప్లెక్స్‌లోని బూజ్ షాప్ తెరవద్దంటూ మహిళలు అడ్డుపడి, విజయం సాధించారు. కొందరు మద్యం ప్రియులు షాపింగ్ కాంప్లెక్స్ పరిసరాలలో తాగి, చుట్టుపక్కల అమ్మాయిలు, మహిళల పట్ల చులకన వ్యాఖ్యల చేయడం వల్ల తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసేయాలని స్థానిక మహిళలు పట్టుబట్టారు. ఎంకే హెరిటేజ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పురుషులు, పిల్లలు కూడా ఆ మహిళలతో జత కలవడంతో అందరూ కలసి మానవ హారంగా ఏర్పడి మౌన నిరసనను తెలియజేశారు.ఈ నిరసన ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన వీరు కలెక్టర్ కార్యాలయానికి, ముఖ్యమంత్రికి ఇ–మెయిల్ ద్వారా తమ సందేశాన్ని పంపారు. ముఖ్యంగా మహిళల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసివేయకపోతే స్థానిక ప్రజలు శాంతిభద్రతల సమస్యలను ఎంతగా ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ 50 మందికి పైగా మహిళలు ఒక మెమోరాండంపై సంతకం చేసి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు పంపారు. ఫలితంగా సీఎం నుంచి కలెక్టర్, ఎక్సైజ్ శాఖ, సంబంధిత అన్ని శాఖలకు ఈ సమస్యపై దర్యాప్తు చేయమని రాయగడ్ డివిజన్‌కు ఆదేశాలు అందాయి. ప్రతిపాదిత దుకాణం ప్రసిద్ధ సాయిబాబా ఆలయ ప్రవేశ ద్వారం నుంచి 144 మీటర్ల దూరంలో ఉందని, ప్రముఖుల విగ్రహాలు, విద్యాసంస్థలు, సమీపంలోని రాష్ట్ర రహదారి వంటి ఇతర అడ్డంకులు లేవని ఎక్సైజ్ శాఖ బృందాలు నివేదించాయి. అయినప్పటికీ స్థానికంగా ఉన్న సమస్యను పరిగణనలోకి తీసుకొని, ఇక్కడ ఉన్న మద్యం షాప్‌ను మరో భవనంలోకి మార్చాలని నిర్ణయించారు. దీంతో మద్యంపై పోరులో మహిళల సాధించిన విజయంగా అందరిని దృష్టిని ఆకర్షించడమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది. (చదవండి: -
గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు
పిల్లలూ! ఇతరులకు మంచి చేయడం మనందరి బాధ్యత. సమాజానికి మన వంతు సహకారం అందించడం మన కర్తవ్యం. అయితే మేము చిన్నపిల్లలం మాకంత శక్తి లేదనో, మేము ఏమీ చేయలేమనో మీరు అనుకోవద్దు. మీరు తల్చుకుంటే ఎన్నో చేయగలరు. మీకున్న దాంట్లోనే అద్భుతాలు సాధించగలరు.మీకో విషయం చెప్తాను వినండి. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మాగాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని విరాళాలు సేకరించి, స్వాతంత్య్ర సంగ్రామ నిధికి అందించాలని అంతా అనుకున్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓపాప నేను వస్తానంటూ కదిలింది. జోలె పట్టి అందరి దగ్గరికీ వెళ్లి విరాళాలు సేకరించింది.అవన్నీ తీసుకుని వెళ్లి మహాత్మాగాంధీకి అందించింది. ‘మరి నీ విరాళం ఏదీ?‘ అని గాంధీ తాత ఆపాపను అడిగితే తన చేతులకున్న బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆపాప పెద్దయ్యాక భారత స్వాతంత్య్ర సమరంలోపాల్గొంది. ధైర్యం గల నాయకురాలిగా పేరు పొందింది. ఆమే దుర్గాబాయి దేశ్‌ముఖ్. చూశారా! చిన్న వయసులోనే ఎంత పట్టుదల, దీక్ష చూపిందో ఆమె. మీరూ అలా పట్టుదలతో, దీక్షతో ఉండాలి. ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అందరిచేతా మెప్పు పొందాలి. -
బంజరు భూమిని బంగరు భూమి చేసింది
‘కలిసి ఉంటేనే కాదు కష్టపడితే కూడా కలదు సుఖం’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది సంతోష్ దేవి.తన రెక్కల కష్టంతో బంజరు భూమిని బంగరు భూమిగా మార్చింది. ఎంతోమంది రైతులను తన మార్గంలో నడిపిస్తోంది.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా బేరి గ్రామంలో... 1.25 ఎకరాల బంజరు భూమితో సంతోష్ దేవి ఖేదార్ ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబం వీడిపోవడంతో తన భర్త వాటాగా 1.25 ఎకరం భూమి వచ్చింది. భర్త రామ్ కరణ్ హోంగార్డ్. చాలీచాలని జీతం. దీంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపింది సంతోష్‌దేవి.‘పది, ఇరవై ఎకరాలు ఉన్నవారికే దిక్కు లేదు. ఎకరంతో ఏం సాధిస్తావు? అప్పులు తప్ప ఏం మిగలవు!’ అన్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయం లాభసాటి వ్యాపారం’ అని నిరూపించడానికి రంగంలో దిగింది సంతోష్ దేవి.‘నేను చదువుకోవాలని మా నాన్న కోరుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడే నాకు చదువుల కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం’ అంటుంది సంతోష్‌దేవి. తాతగారి పొలంలో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడకున్నా మంచి దిగుబడి వచ్చేది. ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి. చాలా ఏళ్లుగా రసాయనాలు వాడడం వల్ల పొలం నిస్సారంగా మారింది. చుట్టు పక్కల నీటి వనరులు లేకపోవడంతో జొన్న, సజ్జలాంటి సంప్రదాయ పంటలే పండించేవారు.కలుపు మొక్కలతో గందరగోళంగా ఉన్న పొలాన్ని ఒక దారికి తేవడంతో మొదటి అడుగు వేసింది. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని నిర్ణయించుకుంది. దానిమ్మ పండించమని, తక్కువ భూమిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని సికార్ వ్యవసాయ అధికారి సలహా ఇచ్చాడు. ఆ సలహా వారి జీవితాన్నే మార్చేసింది.220 దానిమ్మ మొక్కలను కొనడానికి గేదెను అమ్మేయాల్సి వచ్చింది. మొక్కలు కొనగా మిగిలిన డబ్బుతో పొలంలో గొట్టపు బావిని వేయించింది. నీటి ఎద్దడి ఉన్న ఆప్రాంతంలో బిందు సేద్య పద్ధతిని నమ్ముకుంది. చుక్క నీరు కూడా వృథా చేయవద్దని నిర్ణయించుకుంది. జనరేటర్‌ను అద్దెకు తీసుకుంది. గ్రామంలోని ఎంతోమంది రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ ఎరువు తయారీ మొదలుపెట్టింది. లేయర్ కటింగ్, సేంద్రియ పురుగు మందులకు బెల్లం కలపడంలాంటి రకరకాల టెక్నిక్‌ల గురించి తెలుసుకుంది. మూడేళ్ల కఠోర శ్రమ ద్వారా దానిమ్మ పండ్ల తొలి దిగుబడితో మూడు లక్షల లాభం వచ్చింది. సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం వల్ల నేల సారవంతంగా మారింది.భర్త పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తరువాత, పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత నేరుగా పొలానికే వెళ్లేవాళ్లు. ‘ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు. కాని బాగా కష్టపడాలనుకున్నాం’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంది సంతోష్‌దేవి. పండ్లతోటను నిర్వహించే అనుభవం రావడంతో యాపిల్‌లాంటి ఇతర పండ్లను పండించడంపై దృష్టి పెట్టింది.దానిమ్మ మొక్కల మధ్య నిర్దిష్టమైన దూరం ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో కలుపు లేకుండా చూడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీల మధ్య మోసంబి మొక్కలు నాటింది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత నిమ్మ నుంచి బెల్‌లాంటి ఎన్నో మొక్కలను నాటింది. పొలంలో సోలార్ ΄్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఖర్చు తగ్గింది.‘మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలకు కారణం వారు పండిస్తున్న దానికి సరైన ధర లభించకపోవడమే. దళారులు లాభాలన్నీ అనుభవిస్తున్నారు’ అంటున్న సంతోష్‌దేవి ఒక్క పండును కూడా దళారులకు అమ్మదు. అన్ని పండ్లూ నేరుగా పొలంలోనే అమ్ముతారు.సంతోష్ సాధించిన విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా దానిమ్మ మొక్కలను పెంచడంప్రారంభించారు. అయితే చాలామంది విఫలమయ్యారు. అలాంటి వారు సంతోష్‌దేవిని సలహా అడిగేవారు. నాణ్యమైన మొక్కల కొరత వల్లే వారు విఫలమవుతున్నారు అని గ్రహించిన సంతోష్ దేవి ఆ లోటును భర్తీ చేయడానికి కొత్త మొక్కల కోసం ‘షెకావది కృషి ఫామ్ అండ్ నర్సరీ’ప్రారంభించింది.కష్టఫలంనేను, నా భర్త, పిల్లలు మాత్రమే పొలంలో పనిచేసేవాళ్లం. కూలీలతో పనిచేయించే స్థోమత మాకు లేదు. అయితే ఎప్పుడూ కష్టం అనుకోలేదు. ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటామో, పొలంలో అలాగే ఉండేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూనే కష్టపడేవాళ్లం. మా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది.– సంతోష్‌దేవి -
ఓ పచ్చని నీడ! గ్రీన్ వారియర్..పద్నాలుగేళ్లకే..!
పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఏం చేయగలం!’ అని ఎవరైనా నిట్టూరిస్తే... ‘ఎంతో చేయగలం’ అని చెప్పడానికి కెన్యాకు చెందిన ఎల్లియానే బలమైన ఉదాహరణ. పచ్చని చెట్టు నీడలో, చల్లటి వెన్నెల నీడలో ఆమె విన్న కథల్లో పర్యావరణ ఉద్యమకారిణి ప్రొఫెసర్ మాథాయ్ ఉంది. మాథాయ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా వేలాది మొక్కలు నాటింది ఎల్లియానే. ‘చిల్డ్రన్స్ విత్ నేచర్’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా మార్చింది. స్ఫూర్తి అనేది ఎంత గొప్పదో చెప్పడానికి బలమైన ఉదాహరణ ఎల్లియానే వాంజీ క్లిస్టన్. చిన్నప్పుడు తాను విన్న కథల్లో కథానాయిక వంగరి మాథాయ్. నోబెల్ బహుమతి గ్రహీత వంగరి మాథాయ్ చెట్ల రక్షణ, మొక్కల పెంపకం గురించి చేసిన కృషి, ఉద్యమం అంతా ఇంతా కాదు. ఆమె ప్రారంభించిన ‘గ్రీన్ బెల్ట్ మూమెంట్’ గురించి కథల రూపంలో విన్నది ఎల్లియానే. వంగరి మాథాయ్ స్ఫూర్తితోనే గ్రీన్ వారియర్‌గా మారింది.మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధుల గురించి వినడం ద్వారా ‘మార్పు’ గొప్పదనం ఏమిటో తెలుసుకుంది. ‘మన భూగోళాన్ని రక్షించడానికి నేను సైతం’ అంటూ ప్రయాణం ప్రారంభించింది. పర్యావరణ కార్యక్రమాలలో భాగంగా కింగ్ చార్లెస్లాంటి వారిని కలుసుకోవడం, గ్రామీ అవార్డ్ గ్రహీత మెజీ అలాబీ, మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్‌తో కలిసి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొనడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.‘నేను ప్రొఫెసర్ మాథాయ్ కావాలనుకుంటున్నాను’ అని చిన్నప్పుడు ఎల్లియానే తల్లితో అన్నప్పుడు ఆ తల్లి నుంచి తక్షణ స్పందనగా రావాల్సిన మాట... వెరీ గుడ్! అయితే కూతురు నుంచి వచ్చిన మాట విని తల్లి భయపడింది. మాథాయ్ను మానసికంగా ఎలా గాయపరిచారో, కొట్టారో, జైల్లో పెట్టారో వివరంగా చెప్పింది. ‘నువ్వు డాక్టర్ లేదా లాయర్ కావడం మంచిది’ అని కూతురికి సలహా కూడా ఇచ్చింది ఆ తల్లి. తల్లి చెప్పింది విని ఎల్లియానే భయపడి ఉండాలి. కానీ అలా జరగలేదు. పైగా ప్రొఫెసర్ మాథాయ్పై మరింత గౌరవం పెరిగింది.తొలిసారిగా ఒక విత్తనాన్ని నాటింది. అది మొలకెత్తిన అద్భుతాన్ని చూసింది. ఇక అప్పటినుంచి చెట్ల వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటూనే ఉంది. కెన్యా ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర జేన్ జుగునా ద్వారా మొక్కల పెంపకానికి సంబంధించి పనిముట్ల నుంచి సరైన మట్టి వరకు ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘చిల్డ్రన్ విత్ నేచర్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పింది. ‘మీరు తలచుకుంటే మీ ప్రాంతంలో మార్పు తీసుకు రావచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చింది.‘2020 నాటికి వేలాది మొక్కలను నాటాను. కెన్యాలోనే కాకుండా విదేశాలలో కూడా ట్రీ లవర్స్ కమ్యూనిటీలను ఏర్పాటు చేశాను’ అంటున్న ఎల్లియానే మొరాకో నుంచి జాంబియా వరకు తాను వెళ్లిన ఎన్నో దేశాలలో మొక్కలు నాటింది. అయితే వాతావరణ మార్పుల గురించి ప్రపంచ వ్యాప్తంగా వివిధ సదస్సులలో పాల్గొనడం వల్ల ‘గతంతో పోల్చితే మొక్కల పెంపకంలో వెనక పడ్డాను’ అనే బాధ ఎల్లియానేలో కనిపిస్తుంది.చెట్ల పెంపకం సంగతి సరే, మరి చదువు సంగతి ఏమిటి?చదువులో ఎప్పుడూ ముందే ఉంటుంది ఎల్లియానే. పిల్లల తోపాటు జంతువులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గురించి వివరించే ‘సేవ్ అవర్ వైల్డ్‌లైఫ్’ అనే డాక్యుమెంటరీలో కనిపించింది. ఈ డాక్యుమెంటరీలో తనకు ఇష్టమైన జంతువు ఏనుగు గురించి చెప్పింది. వేట కంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వాటికి కలుగుతున్న ముప్పు గురించి వివరంగా మాట్లాడింది. ‘ఆఫ్రికాలోని గ్రీన్‌బెల్ట్‌లో మొక్కలు నాటాలి అనేది నా కల’ అంటుంది ఎల్లియానే. ‘ఏదీ అసాధ్యం కాదు’ అనేది ఎల్లియానే నోటినుంచి ఎప్పుడూ వినిపించే మాట. (చదవండి: ‘బ్రిటిష్ హైకమిషనర్’గా 19 ఏళ్ల అమ్మాయి..!) -
గుర్తించారు... చాలు! క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
‘కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. దయచేసి గుర్తించు..’ అని అనేది ఓ సినిమాలో డైలాగ్! నిజమే.. క్షమించినా, శిక్షించినా, విమర్శించినా, ద్వేషించినా... అసలంటూ గుర్తించటమే కావలసింది. ఆటలోనైనా, బతుకు పోరాటంలోనైనా గెలుపోటములు ఎలా ఉన్నా ముందైతే గుర్తింపు ముఖ్యం. ఆ విషయాన్నే భారత మహిళా క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. ‘మీ అభిమానానికి, మీ విమర్శలకూ నిజంగా అభివందనాలు. ఈవిధంగానైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓటమి మమ్మల్ని ఒకవైపు బాధిస్తున్నా, గెలుపు కోసం మరింతగా ఆకలిని మాలో రాజేసింది.. ‘ అని రాశారు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న టి20 విమెన్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీస్‌కి క్వాలిఫై కాలేక సోయిన సంగతి అటుంచితే... ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయాంక పాటిల్ పెట్టిన ఈ పోస్ట్...ముఖ్యంగా స్పాన్సరర్లు మహిళల క్రికెట్ జట్టును గుర్తించి, మరింతగా ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. View this post on Instagram A post shared by Shreyanka Patil (@shreyanka_patil31) -
‘బ్రిటిష్ హైకమిషనర్’గా 19 ఏళ్ల అమ్మాయి..!
19 సంవత్సరాల గౌతమ్ నిధి బ్రిటిష్ హైకమిషనర్ హోదాలో గంభీరంగా ఉపన్యసించింది. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. శాస్త్రవేత్తల నుంచి నవీన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఇది సరే, 19 సంవత్సరాల అమ్మాయి ‘బ్రిటిష్ హైకమిషనర్’ ఏమిటి! అని ఆశ్చర్య΄ోతున్నారా... అవును... ఇది అక్షరాల నిజం... అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ‘హై కమిషనర్ ఫర్ ఏ డే’ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ కోసం దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన అమ్మాయిల నుంచి 140 అప్లికేషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం కర్ణాటకకు చెందిన గౌతమ్ నిధి(19) ‘భారత్‌లో ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్’గా ఎంపికైంది. గౌతమ్ నిధి ఢిల్లీలోని మిరాండ హౌజ్ కాలేజీలో హిస్టరీ, జాగ్రఫీలలో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది. స్కెచ్చింగ్, పద సంపద, సాంస్కృతిక దౌత్యం, విదేశాంగ విధానాలపై గౌతమ్‌కు ఆసక్తి. బ్రిటిష్ హైకమిషనర్‌గా గౌతమ్ నిధి ఒకరోజంతా తీరికలేనంత కార్యక్రమాలతో గడిపింది.యూకే–ఇండియా ద్వైపాక్షిక సంబంధాల వివరాల గురించి మాట్లాడడం ద్వారా ఆమె తొలి కార్యక్రమం మొదలైంది. దిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ని, సందర్శించిన గౌతమ్ దివ్యాంగులకు ఉపకరించే కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఆ తరువాత ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ’కి వెళ్లి మన దేశంలో వ్యాక్సిన్ల అభివృద్ధికి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంది. ప్రభుత్వ అధికారులు, పరిశ్రమలకు చెందిన వ్యక్తులతో రోజాంతా అనేక సమావేశాలు నిర్వహించింది.‘బ్రిటిష్ హైకమిషనర్ ఫర్ ఏ డే’గా ఉండడం మరచిపోలేని అద్భుతమైన జ్ఞాపకం. సోలార్ ఎనర్జీ నుంచి బయోటెక్నాలజీ వరకు సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన చేసుకునే అదృష్టం దక్కింది. సామాజిక ప్రయోజనాలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అంటుంది గౌతమ్ నిధి. ‘ఈరోజు నిధి నుండి నేర్చుకోవడం అద్భుతంగా ఉంది. యూకే–ఇండియాలలోని నవీన సాంకేతిక పరిజ్ఞానం నుంచి గ్లోబల్ చాలెంజ్‌లను స్వీకరించి దూసుకెళుతున్న యువతుల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం’ అంటుంది మన దేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్.(చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..)