Women Power
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్‌గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
ప్రతిష్ఠాత్మక ఐబీఆర్‌వో అధ్యక్షురాలిగా శుభా టోలే రికార్డ్ : ఆసక్తికర సంగతులు
బ్రెయిన్ అనేది రహస్యాల గని. భావోద్వేగాల ఫ్యాక్టరీ.‘ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తోంది ‘ఐబీఆర్‌వో’ అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్త అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐబీఆర్‌వో) అధ్యక్షురాలిగా ప్రముఖ శాస్త్రవేత్త శుభ టోలే నియమితురాలైంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యున్నత స్థానానికి ఎంపికైన తొలి శాస్త్రవేత్తగా ప్రత్యేకత సాధించింది...ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలు, ఫెడరేషన్లకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఐబీఆరోవో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన ‘ఐబీఆర్‌వో’ నినాదం: ప్రొవైడింగ్ ఈక్వల్ యాక్సెస్ టు గ్లోబల్ న్యూరోసైన్స్ గతంలో ‘ఐబీఆర్‌వో’ అధ్యక్షులుగా యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్‌వో’కు సంబంధించి అతిపెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభ టోలేకు వచ్చింది.‘అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్మెంట్లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటుంది శుభ.శుభ ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ–టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్‌గా పనిచేస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘ఉమెన్ ఇన్ సైన్స్’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసింది. విద్యావంతుల కుటుంబంలో ముంబైలో జన్మించింది శుభ. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ చేసింది. చికాగో యూనివర్శిటీలో పోస్ట్–డాక్టోరల్ రీసెర్చి చేసింది.వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి స్వర్ణజయంతి ఫెలోషిప్ తీసుకొంది. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి జాతీయ మహిళా బయోసైంటిస్ట్ అవార్డ్, సొసైటీ ఫర్ న్యూరోసైన్స్, యూఎస్ నుంచి రీసెర్చ్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూరోసైన్సెస్ అవార్డ్ అందుకుంది.కథక్ డ్యాన్సర్ కూడాశుభ టోలే శాస్త్రవేత్తే కాదు కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్ ఏంజిల్స్‌లో పీహెచ్డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్ దగ్గర కథక్ నేర్చుకుంది. ‘కథక్ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేను, నా పెద్ద కొడుకు కథక్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలాప్రాక్టీస్ చేస్తుంటారు’ అంటుంది శుభ.శుభ భర్త సందీప్ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్‌కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారనేది అపోహ మాత్రమే. పెయింటింగ్ నుంచి మ్యూజిక్ వరకు ఎన్నో కళల గురించి మాట్లాడుకుంటారు. ‘సైన్స్ అనేది ఒక సృజనాత్మక వృత్తి’ అంటుంది శుభ. -
ఒక్క రోజు అమ్మాయిలకు అధికారం ఇస్తే..సూపర్ సక్సెస్!
దసరా నవరాత్రుల సందర్భంగాఉత్తర ప్రదేశ్‌లో హఠాత్తుగా పది జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.అందరూ హైస్కూల్ గర్ల్ స్టూడెంట్లే. ‘జనతా దర్శన్’ పేరుతో సాగే ప్రజా దర్బార్లలో పాల్గొని సమస్యలు విని పరిష్కారాలకోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఉత్తుత్తికి కాదు.స్త్రీ శక్తి నిరూపణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచాలా సీరియస్‌గా నిర్వహించిన ‘ఆడపిల్లలకు ఒక రోజు అధికారం’ కార్యక్రమంలోజిల్లా యంత్రాంగం చేతులు కట్టుకుని వారి మాట వింది.ఈ అమ్మాయిలు ఈ అనుభవంతో ఐ.ఏ.ఎస్ కావాలనే తలంపునకు వచ్చారు. ప్రతి రాష్ట్రం ఇలాంటి ప్రయత్నం చేయాలి. అమ్మాయిలు చదువుకోవడం, విదేశాలకు వెళ్లి పై చదువులు చదవడం, మగవారికి మాత్రమే సాధ్యమయ్యే ఉద్యోగాలు తామూ చేయడం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో మొదటిసారి అమెరికాలో అధ్యక్షపదవికి ఒక మహిళ పోటీ పడటం వరకూ ఈ మహిళా చైతన్యం సాగింది. అయినప్పటికీ మహిళల పట్ల వివక్ష, కుటుంబాలలో మగ పిల్లాడికి దక్క ప్రాధాన్యం, చదివించే విషయంలో అబ్బాయిలకు మంచి కోర్సు అమ్మాయిలకు అప్రధానమైన కోర్సు దేశంలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి మైండ్‌సెట్‌ని మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘శక్తి మిషన్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. మహిళల స్వావలంబనే కాదు... అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో మరో ముఖ్యమైన కార్యక్రమం ‘అమ్మాయిలకు ఒకరోజు అధికారం’. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొన్నటి అక్టోబర్ 12న దాదాపు పది జిల్లాలలో ఈ కార్యక్రమం కింద ఇంటర్ లోపు చదువుతున్న అమ్మాయిలకు జిల్లా కలెక్టర్‌గా, ఎస్.పి.గా, సి.డి.ఓ. (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా) పూర్తి అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత ఉద్యోగాల్లో ఉంటే పేదవారికి, బలహీనులకు ఎలా న్యాయం చేయవచ్చో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు తెలియచేయడమే కాదు... వారు అధికారంలో ఉంటే మిగిలిన సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో నిజంగా చేసి చూపించారు. ఆ విధంగా ఇదో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం.కూరగాయల రేట్లు ఇవా?లక్ష్మీపూర్ ఖేరి జిల్లాకు ఎనిమిదవ తరగతి చదువుతున్న అగరిమ ధావన్ ఒకరోజు కలెక్టర్ అయ్యింది. ఆమె ఆ రోజు తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలు వింది. అందులో భాగంగా కూరగాయల రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్న ఫిర్యాదు వింది. వెంటనే కింది స్థాయి అధికారులను పిలిచి ‘కూరగాయల రేట్లు ఇలా ఉంటే ఎలా? వీటిని క్రమబద్ధీకరించరా?’ అని ప్రశ్నించి వాటి అదుపునకు చర్యలు తీసుకోమంది. వెంటనే అందుకు తగిన చర్యలు మొదలయ్యాయి. జౌన్పూర్ జిల్లాకు ఇంటర్ చదువుతున్న సాజల్ గుప్తా కలెక్టర్ అయ్యింది. ప్రజాదర్బార్ లో 87 ఫిర్యాదులు ఆమె వద్దకు వచ్చాయి. వాటిలో 14 ఫిర్యాదులను అక్కడిక్కడే ఆమె పరిష్కరించింది తన అధికారాలతో. ఇక మహరాజ్ గంజ్‌కు కలెక్టర్ అయిన నిధి యాదవ్ అనే అమ్మాయి ఆ ప్రాంత వాసులకు రావాల్సిన (హైవే నిర్మాణం వల్ల) నష్టపరిహారాన్ని అప్పటికప్పుడు మంజూరయ్యేలా చేసింది. అదే జిల్లాకు ఎస్.పి.గా అధికారాలు స్వీకరించిన గోల్టీ అనే అమ్మాయి తన పరిధిలోని స్టేషన్లలో ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్న కేసులను మొదటగా ఇన్వెస్టిగేట్ చేసి పరిష్కరించాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. మిర్జాపూర్, ఘాజీపూర్, షామ్లీ, శ్రావస్థి, బాందా తదితర జిల్లాలలో కూడా ఆ జిల్లాల్లో చురుగ్గా చదువుతున్న అమ్మాయిలను ఎంపిక చేసి కలెక్టర్, ఎస్.పి. బాధ్యతలు అప్పజెప్తే వారు ఒక రోజంతా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించడమే కాదు... విజిట్లకు కూడా వెళ్లారు.ఒక రోజు ఆఫీసర్ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ ఒక్క రోజు కోసం సి.ఎం. అయినా అతని నిర్ణయాలన్నీ అమలవుతాయి. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయి. అమలు అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో తాసిల్దార్లుగా కూడా అమ్మాయిలను నియమించారు ఒకరోజు కోసం. కలెక్టర్‌గా నియమితమైన అమ్మాయి, తాసిల్దార్లుగా నియమితమైన అమ్మాయిలు కలిసి మాట్లాడుకుని ఆ రోజున తమ టేబుళ్ల మీద ఉన్న సమస్యలను చకచకా పరిష్కరించడం అందరినీ ఆకర్షించింది. ఎస్.పి.గా చేసిన అమ్మాయిలు కొందరు ఎఫ్ఐఆర్ల మీద కూడా సంతకాలు చేశారు.కలెక్టర్లమవుతాంఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలందరూ ప్రజల సమస్యలు విన్నారు. తాము బాగా చదువుకున్న ఆ సమస్యలను పరిష్కరించే అధికార స్థానంలో వెళ్లవచ్చని గ్రహించారు. ‘మేము బాగా చదువుకుంటాం’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ సందర్భంగా వీరందరూ కాన్వాయ్‌లలో ఆఫీసులకు చేరుకున్నారు. వీరందరూ భవిష్యత్తులో ఇంతకుమించిన బాధ్యతాయుత స్థానాల్లోకి వెళ్లాలని కోరుకుందాం. -
తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..
తండ్రిని చంపిన వాడిని హతమార్చేందుకు పోలీసుగా మారి పట్టుకోవడం వంటి ఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం. ప్రతికారం తీర్చుకోవడానికి ఎలాంటి పాట్లు పడి హీరో పైకి వచ్చి విలన్ని చంపుతాడో చూసి హ్యాపీగా ఫీలవ్వుతాం. అంతే కానీ ఇదే ఘటన రియల్ లైఫ్‌లో జరిగితే..ఔను మీరు వింటుంది నిజమే. ఓ మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం పోలీసుగా మారింది. మరీ ఆ హంతకుడిని పట్టుకుని హీరోలా శిక్షించిందా అంటే..ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. బ్రెజిల్లో రోరైమాలోని గిస్లేనే సిల్వా డి డ్యూస్ అనే 35 ఏళ్ల మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసుగా మారింది. దారుణ హత్యకు గురైన తండ్రికి ఎట్టకేలకు న్యాయం జరిగేలా చేసింంది. అందుకోసం ఆమె 25 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి నిందితుడిని పట్టుకుని తన కుటుంబం పడ్డ బాధకు తెరపడేలా చేసింది. అసలేం జరిగిందంటే..సదరు మహిళా పోలీసు అధికారి తండ్రి జోస్ విసెంటే ఫిబ్రవరి 1999లో జస్ట్ 20 పౌండ్ల అప్పు కోసం కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన స్థానిక బార్లో చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోస్ సూపర్ మార్కెట్ యజమాని. ఆయన స్థానిక బార్లో తన స్నేహితుడితో కలిసి పూల్ ఆడుతున్న సమయంలో ఈ దిగ్బాంతికర ఘటన జరిగింది. తన తండ్రి మార్కెట్‌కి సంబంధించిన సరఫరదారుడు రైముండో అల్వెస్ గోమ్స్ చేతిలోనే హత్యకు గురయ్యాడు. నిజానికి గోమ్స్ తన అప్పు చెల్లించాలని డిమాండ్ చేయగా ఫ్రీజర్‌తో సరిపెట్టుకోమని సూచించాడట జోస్. అయితే అందుకు గోమ్స్ నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో గోమ్స్ క్షణికావేశంలో తుపాకీతో జోస్ తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో అక్కడికక్కేడే చనిపోయాడు జోస్. అయితే 2013లో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి గోమ్స్‌ని పట్టుకుని 12 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ తీర్పుపై అప్పీలు చేస్తూ జైలు శిక్షను తప్పించుకున్నాడు. 2016లో అతని చివరి అప్పీల్‌ను తిరస్కరణకు గురై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే గోమ్స్ పట్టుబడకుండా తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇదంతా జరిగినప్పుడూ జోస్ కూతురు డ్యూస్‌కు తొమ్మిదేళ్లు. అప్పుడే ఆమె నిశ్చయించుకుంది ఎలాగైన తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించాలని తీవ్రంగా నిశ్చయించుకుంది.అందుకోసం బోయా 18 ఏళ్ల వయసుకే న్యాయశాస్త్రం అభ్యసించింది. తర్వాత పోలీసు దళంలో చేరింది. తన తండ్రిని హతమార్చిన వాడిని ఎలాగైన న్యాయస్థానానికి తీసుకురావలన్న సంకల్పంతో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించింది. నిందితుడి ఆచూకీకై అలుపెరగని పోరాటం చేసింది డ్యూస్. చివరికి నిందితుడు బోయా విస్టాకు సమీపంలో ఉన్న నోవా సిడేడ్ ప్రాంతంలోని ఒక పొలంలో దాక్కున్నట్లు గుర్తించి సెప్టెంబర్ 25న అరెస్టు చేసింది. 60 ఏళ్ల వయసులో గోమ్స్‌ని జైలుకి పంపిచాను. అంతేగాదు అతడితో నా కారణంగానే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అతడి చెంప పగిలేట్టు చెప్పగలిగాను అని ఉద్వేగంగా చెప్పింది డ్యూస్.తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని సంకెళ్లు వేసిన క్షణంలో డ్యూస్కి కన్నీళ్లు తన్నుకుంటూ వచ్చేశాయి. నిజాయితీపరుడైన తండ్రిని కోల్పోవడంతో తన కుటుంబం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో మర్చిపోలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన అమ్మ ఎట్టిపరిస్థితుల్లోనూ సరైన మార్గంలోనే పయనించండి అదే మీకు మంచి చేస్తుంది అనేది. అదే ఇవాళ నిజమయ్యింది అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది డ్యూస్. సెప్టెంబర్ 26, 2024న అల్వెస్ గోమ్స్ నేరారోపణకుగాను 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిజం నిప్పులాంటిది అంటే ఇదే కదూ..!. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ నీతా అంబానీ దసరా వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు, మనవడు పృథ్వీ, చదువుకుంటున్ నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ (NMAJS)లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతని క్లాస్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిలో బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా , సైఫ్ కుమారుడు జెహ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. దాదీ, మనవళ్ళ డ్యాన్స్ నెట్టింట సందడి చేస్తోంది.అంబానీ కుటుంబం ప్రతీ పండుగను వైభవంగా జరుపుకుంటుంది. తాజాగా నవరాత్రి సంబరాల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, కొత్త కోడలు రాధికా మర్చంట్‌తో ఉత్సాహంగా పాల్గొన్నారు. నీతా కుమార్తె ఇషా అంబానీ కుమారుడు పృథ్వీ స్కూల్లో నిర్వహించిన వేడుకలో చిన్న పిల్లలతో దాండియా స్టెప్పులు వేశారు. మనవడు పృథ్వీరాజ్ అంబానీ కరీనా కపూర్ కొడుకు జెహ్, ఇతర పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. పింక్ టోన్ స్ట్రాపీ హీల్స్,అద్భుతమైన పింక్ కలర్ సల్వార్ సెట్‌ను ధరించి నీతా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే తల్లి పూనమ్ దలాల్‌తో కలిసి గర్భా ఆచారం, అమ్మవారికి హారతి ఇచ్చి దసరా వేడుకను జరుపుకున్నారు. నీతా అంబానీ తన మనవడు, పృథ్వీ ,అతని క్లాస్మేట్లను స్టోరీ సెషన్‌తో ఆశ్చర్యపరిచారు. పెప్పా పిగ్ పుస్తకంనుంచి ఒక కథను వివరించి పిల్లలతో ఉత్సాహంగా కనిపించడం పిల్లలు శ్రద్ధగా వినడం, లంచ్‌లో వారితో ముచ్చటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలను స్కూలు యాజమాన్యం తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. -
‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!
కుటుంబంలో ఒకరు డాక్టర్ అవడం సాధారణంగా చూస్తుంటాం. ఇద్దరు డాక్టర్లు ఉండటమూ మనకు తెలుసు. ఆ ఇంట్లో మాత్రం నలుగురు కుమార్తెలూ డాక్టర్లే! టైలరింగ్ చేస్తూ కూతుళ్లను డాక్టర్లు చేయడానికి తపించారు రామచంద్రం – శారద దంపతులు. వారి కలలు నిజమై ఇప్పుడు ఆ ఇల్లే వైద్యుల నిలయంగా మారి΄ోయింది. సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. రామచంద్రం – శారద టైలరింగ్ చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. ఇదంతా సాధారణమే! కానీ వీరి నలుగురు కుమార్తెలు డాక్టర్లే కావడమే విశేషం. ఒకరు వైద్యవిద్య పూర్తిచేయగా, మరొకరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. ఇంకో ఇద్దరు కుమార్తెలు ఈ ఏడాది మెడిసిన్‌లో సీట్లు సాధించారు. ‘నలుగురు కూతుళ్లేనా..’ అని హేళనలు ఎదుర్కొన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల ఎదుగుదలను చూసి గర్వపడుతున్నారు.ఒక్కరైనా డాక్టర్ కావాలని..రామచంద్రం, శారద ఇద్దరూ కలిసి రోజంతా కష్టపడితే రూ.800 వస్తుంది. దీంతో వారి కుటుంబం గడవడమే కష్టమైనా నలుగురు పిల్లలను చక్కగా చదివించాలని తపించారు. రామచంద్రం సోదరుడు రాజు 1992లో ఫిట్స్‌తో మృతిచెందగా, రామచంద్రం 14 ఏళ్ల వయసులో ఆయన తల్లి మల్లవ్వ గొంతు కేన్సర్‌తో మరణించింది. సరైన సమయంలో తాము గుర్తించక΄ోవడంతోనే సోదరుడు, తల్లిని కోల్పోవాల్సి వచ్చిందని... కుటుంబంలో ఒక్కరికైనా డాక్టర్ అయి ఉంటే వాళ్లు బతికేవారని అనుకునేవాడు. నలుగురు కూతుళ్ల లో పెద్ద కూతురు మమత ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆ తర్వాత ఆమె చెల్లెళ్లూ అదే బాట పట్టారు.చదువులోనూ కవలలే..రోహిణి, రోషిణి ఇద్దరు కవలలు... 2023 నీట్ రాసిన రోహిణి 443(పెద్ద కూతురు), రోషిణి 425(చిన్న కూతురు) మార్కులు సాధించారు. రోహిణికి ఓ ప్రై వేట్ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినా చెల్లి రోషిణికి సీటు రాక΄ోవడంతో ఒత్తిడికి గురవుతుందని అక్క సీటు వదులుకుంది. ఆపై ఇద్దరు లాంగ్‌టర్మ్ శిక్షణతో ప్రిపేర్ అయ్యారు. దీంతో 2024 నీట్లో రోహిణి 536 మార్కులు, రోషిణి 587 మార్కులు సాధించారు. ఇప్పుడు రోషిణికి(చెల్లి) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకేదగ్గర చదువుకోవాలని అక్క కోసం జగిత్యాల మెడికల్ కళాశాలలో సీట్లు తీసుకున్నారు. నాన్న కల నాకు లక్ష్యమైందిడాక్టర్ చదవాలన్నది మా నాన్న కల. ఆ కల నాకు లక్ష్యం అయ్యింది. 2018–2024లో ఎంబీబీఎస్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పూర్తిచేశా. గైనిక్ లేదా జనరల్ మెడిసిన్ పీజీ చేయాలని అనుకుంటున్నా. మా అమ్మనాన్నలు ఎన్ని ఇబ్బందులు పడినా మాకు ఏనాడూ లోటు రాకుండా చూసుకున్నారు. – డాక్టర్ మమత, ఎంబీబీఎస్(7009)అక్క చూపిన దారిఇంటర్మీడియెట్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎంబీబీఎస్ చదవలేనేమో అని, డిప్రెషన్‌కు లోనయ్యాను. హైదరాబాద్‌లో చదువుతున్నప్పటికీ ఇంటి నుంచే వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. ఇప్పుడు కరీంనగర్‌లోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. అక్క నా ముందున్న దారిని క్లియర్ చేయడంతో మేం సాఫీగా నడుస్తున్నాం. జనరల్ మెడిసిన్ పూర్తి చేసి పేదలకు సేవలు అందిస్తాను.– మాధురి, ఎంబీబీఎస్, ఫైనల్ ఇయర్(7012)మేం ఇద్దరం ఒకే కళాశాల లో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం సంతోషంగా ఉంది. మా అక్కలే మాకు రోల్ మోడల్. అమ్మానాన్న ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువుపై మాకు ఉన్న ఇష్టాన్ని గుర్తించి కాదనలేదు. అక్కలిద్దరూ మాకు సరైన గైడెన్స్ ఇచ్చారు. – రోహిణి, రోషిణి, ఎంబీబీఎస్, మొదటి సంవత్సరం(7011)నలుగురు ఆడపిల్లలని, వారిని హైదరాబాద్‌లో చదివిస్తున్నామని చాలామంది సూటి;yటీ మాటలు అనేవారు. అయినా కుంగిపోకుండా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలకున్నాం. టైలరింగ్ చేస్తూ వచ్చే కొద్ది డబ్బుతోనే పిల్లలను లోటు లేకుండా పెంచాం. అప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు మా నలుగురు కూతుర్లు మెడిసిన్ చేస్తుంటే సరస్వతీ పుత్రికలు అని మెచ్చుకోవడంతో మా బాద, కష్టమంతా మర్చి΄ోతున్నాం. మాది పేద కుటుంబం. పిల్లల చదువు నిమిత్తం ఎవరైనా దాతలు సాయం చేస్తే వారు ఉన్నత చదువులకు మార్గం ఏర్పడుతుంది.– రామచంద్రం, శారద – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేటఫోటోలు: కె సతీష్,ఈ సరస్వతీ పుత్రికలకు అండగా నిలవాలనుకునే వారు 98499 54604 ను సంప్రదించవచ్చు. (చదవండి: సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!) -
'స్పైడర్ విమెన్': జస్ట్ ఒట్టి చేతులతో అవలీలగా వంద మీటర్లు..!
మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణించి చూపిస్తున్నారు. సాధ్యం కానీ ప్రతి పనిని నారీ శక్తితో సాధించగలమని చాటి చెబుతున్నారు. సరిగ్గా అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ.చైనాలో 43 ఏళ్ల షాన్డాంగ్ మహిళ ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా అవలీలగా 100 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్నే అధిరోహించింది. దాదాపు 30 అంతస్తులకు సమానమైన 108 మీటర్ల ఎతైన కొండను అధిరోహించి రికార్డు సృష్టించింది.. ఆమె నిలువు రాతి మీదుగా చాలా సునాయాసంగా ఎక్కేయగలదు. అక్కడ ఆమె మగ స్పైడర్ పీపుల్లోని ఏకైక మహిళ. జస్ట్ ఒట్టి చేతులతో శిఖరాలను ఎక్కేస్తుంది . ఆమె తన తండ్రి మార్గదర్శకత్వంలో సుమారు 15 ఏళ్ల వయసులో ఈ ఎతైన కొండను అధిరోహించడం ప్రారంభించింది. అంతేగాదు చిన్నతనంలో తాను అబ్బాయిలతో పోటీ పడి మరీ ఔషధ మూలికలు తెచ్చేందుకు కొండలపైకి ఎక్కడం నేర్చుకున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందక మునుపే తాను పక్షుల వ్యర్థాలు వంటివి సేకరించడం కోసం ప్రతి రోజు పర్వతాలను ఎక్కేదాన్ని అని చెప్పింది షాన్డాంగ్. నిజానికి మియావో ప్రజలు సాంప్రదాయకంగా మారుమూల పర్వత ప్రాంతాలలో నివసిస్తారు. అందువల్లే వారు ఒట్టి చేతులతో ఈజీగా ఎక్కేయగలరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒకరకంగా ఒట్టి చేతులతో పర్వతాన్ని అధిరోహించడంలో వారికి సాటి లేరు. అక్కడ ప్రజలకు ఇది తరతరాలుగా వచ్చిన సంప్రదాయం. అయితే తనను అందరూ స్పైడర్ మహిళగా పిలుస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెబుతోంది. ఈ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో ..నెటిజన్ల సదరు మహిళని హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. పోస్టులుపెట్టారు. (చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు) -
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్‌చేస్తే నేడు ఆమె..!
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? ‘సాధ్యం కాదు’ అనుకున్నదాన్ని ‘సాధ్యం’ చేయవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పే పేరు....రుక్మిణి రియర్. ఆరో తరగతి ఫెయిలైన రుక్మిణి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కమిషనర్‌గా ‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా పనిచేస్తోంది... స్కూల్ రోజుల్లో రుక్మిణి బ్రైట్ స్టూడెంట్ కాదు. రుక్మిణి ఆరో తరగతి ఫెయిల్ కావడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఆ ఫెయిల్యూరే తనను సక్సెస్‌కు దగ్గర చేసింది. ‘ఫెయిల్యూర్ అంటే మొదలైన భయం ఎలాగైనా సక్సెస్ కావాలనే పట్టుదలను పెంచింది’ అంటుంది రుక్మిణి. అమృత్‌సర్‌లోని ‘గురునానక్ యూనివర్శిటీ’లో సోషల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన రుక్మిణి ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్’లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.ఆ తరువాత ముంబై, మైసూర్‌లలో కొన్ని స్వచ్ఛందసంస్థలలో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న క్రమంలో అంకితభావం, వృత్తి నిబద్ధత ఉన్న ఎంతోమంది ఐఏఎస్ అధికారుల గురించి విన్నది. వారి గురించి విన్నప్పుడల్లా ‘ఐఏఎస్’ వైపు మనసు మళ్లేది. చివరికది అది తన కలగా మారింది.‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అని రంగంలోకి దిగింది.కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించింది. ‘ఆరోతరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్ సాధించింది’... రుక్మిణి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది విద్యార్థులు ఆమెను కలుసుకొని మాట్లాడి సలహాలు తీసుకునేవారు.కట్ చేస్తే...ఇప్పుడు రుక్మిణి రియర్ రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కమిషనర్. యూపీఎస్సీలో సెకండ్ ర్యాంక్‌తో ఎలా వార్తల్లో నిలిచిందో మున్సిపల్ కమిషనర్‌గా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం అక్రమార్కుల పాలిట ఆమె సింహస్వప్నం కావడమే. డిసెంబర్లో జరగబోయే ‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విమానాశ్రయం నుంచి 22 గోదాముల వరకు ప్రధాన రోడ్లను పరిశీలిస్తూ వెళ్లింది.నగర పరిశుభ్రత, సుందరీకరణ గురించి స్థానికులతో మాట్లాడింది. సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చెయ్యాలని, పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫ్లైవోవర్లు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి పెయింటింగ్, లైటింగ్‌ల కోసం సూచనలు ఇచ్చింది. గోడలకు పెయింటింగ్ వేయడం నుంచి పబ్లిక్ టాయిలెట్లు, చెత్త కుండీలు శుభ్రం చేయడం వరకు ప్రతి పని దగ్గర ఉండి చేయిస్తుంది. నగర సుందరీకరణతో పాటు ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ ద్వారా జైపూర్‌ను గ్లోబల్ సిటీగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం జైపూర్ అద్భుతంగా కనిపించకపోయినా... పరిశుభ్రంగా, ఆక్రమణలు లేకుండా కనిపించాలి. ఇది అనుకున్నంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే సమ్మిట్‌కు ఎన్నో నెలలు లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా కష్టపడుతూ ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటోంది రుక్మిణి. ‘పని చెయ్యకపోయినా ఫరవాలేదు. చేస్తే మాత్రం శ్రద్ధగా, భక్తిగా చేయాలి’ అని అమ్మ అంటుండేది. ఆ మాటలే రుక్మిణి రియర్కు వేదవాక్కు.(చదవండి: దసరాలో ట్రెడిషనల్‌గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!) -
ఎన్ని అవమానాలు, ఎన్నెన్ని అవహేళనలు : ఆమె ఒక ఫీనిక్స్ పక్షి
ఆమె విజయం ప్రతి అమ్మాయి విజయం. అవును 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంఎల్ఏ వినేశ్ ఫోగట్ విజయోత్సాహంతో అన్న మాటలు అక్షరాలా నిజం. దసరా నవరాత్రుల్లో ఆమెను విజయదుర్గగా జులనా నియోజకవర్గం ప్రజలు నిలిపారు. రెజ్లింగ్ రింగ్లోతగిలిన ప్రతీ దెబ్బను తట్టుకొని పైకి లేచినట్టుగా, సంచలన లైంగిక వేధింపుల వ్యతిరేక పోరాటంలో అలుపెరుగని పోరులో అరకొర చర్యలే మిగిలినా, అందినట్టే అందిన పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్ విజయంపై అనర్హత వేటు పడినా, ఫీనిక్స్ పక్షిలా ఆ గాయాల నుంచే తనను తాను పునఃప్రతిష్ట చేసుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అద్వితీయమైన మహిళా శక్తిని చాటింది.మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం ప్రతీ పోరు మహిళకు గర్వకారణం. 5761 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌ను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. ఇది ప్రతీ ఆడబిడ్డ పోరాడే మార్గాన్ని ఎంచుకునే ప్రతీ మహిళ విజయంగా ఆమె అభివర్ణించింది. ఈ దేశం తనకిచ్చిన ప్రేమను, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ వినేశ్ ఫోగట్ భావోద్వేగానికి లో నైంది. వినేశ్ విజయంపై కాంగ్రెస్ దిగ్గజ నేతలు, మరో రెజ్లర్, కాంగ్రెస్ నేత బజరంగ్ పునియా సహా, పలువురు సోషల్ మీడియా ద్వారా అభినందించారు. ముఖ్యంగా ఇది పార్టీల మధ్య పోరు మాత్రమే కాదు. ఈ పోరాటం బలమైన అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరు. ఈ గెలుపుతో దేశంలోని పోరాట శక్తులు విజయం సాధించాయని పునియా ఎక్స్‌లో రాసుకొచ్చారు.లైంగిక వేధింపుల ఆరోపణలతో మహిళా రెజర్ల పోరుఅప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు దుమారాన్ని రేపాయి. వినేశ్ ఫోగాట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లు దీనిపై పెద్ద యుద్ధమే చేశారు. బ్రిజ్ భూషణ్‌ను అధికారిక పదవులనుంచి తొలగించి అరెస్టు చేయాలి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని, తమకు న్యాయం దక్కాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలపాటుధర్నా చేశారు. ఈ పోరాటంలో మహిళా రెజర్లకు మద్దతుగా నిలిచి, న్యాయ పోరాటం చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. సరికదా ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళన చేస్తున్న వీరిపై పోలీసుల దమనకాండచూసి యావత్ క్రీడాప్రపంచం, క్రీడాభిమానులు నివ్వెరపోయారు.వినేశ్ ఫోగట్1994 ఆగస్ట్ 25 న జన్మించిన ఆమె తన రెజ్లింగ్ కెరీర్లో అపారమైన విజయాలను అందుకుంది. కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతగా అవతరించింది, 2014, 2018 2022లో స్వర్ణాలు గెలుచుకుంది. కామన్వెల్త్, ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ కూడా.అవార్డులు , రివార్డులు- 2016లో అర్జున అవార్డు- 2018లో పద్మశ్రీకి నామినేట్ అయ్యారు- 2019లో లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ నామినేషన్- 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం,- 2022 లో బీబీసి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినేషన్రెజ్లింగ్ కెరీర్ హైలైట్స్- 2018 ఆసియా క్రీడల్లో 50 కేజీల విభాగంలో స్వర్ణం - 2014 ఆసియా క్రీడల్లో 48 కేజీల విభాగంలో కాంస్యం - 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో స్వర్ణం - 2019 , 2022 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో 53 కిలోల విభాగంలో కాంస్యంఇంత అద్భుతమైన రెజ్లింగ్ కెరీర్ తర్వాత, వినేష్ ఫోగట్ అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే కాదు తొలి ప్రయత్నంలోనే గెలుపు సాధించడం విశేషం. -
అతని ఫౌజీ సాజిదా
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భర్త, మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుతో కలిసి మన దేశంలో అడుగుపెట్టిన సాజిదాకు ‘బెంగళూరు డేస్’ గుర్తుకొచ్చి ఉంటాయి. ఆశ్చర్యంగా ఉందా! అవును. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా బెంగళూరులో డిగ్రీ చేసింది. ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ముయిజ్జుతో వివాహం అయింది. ‘ఆమె అతడి అదృష్టం’ అనే మాట ఎలా ఉన్నా ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అని మరోసారి గట్టిగా చెప్పడానికి బలమైన ఉదాహరణ సాజిదా మొహమ్మద్....మాల్దీవుల రాజధాని మాలేలో పుట్టింది సాజిదా. తండ్రి షేక్ మహ్మద్ ఇబ్రహీం ప్రఖ్యాత పండితుడు. రాజకీయ, సామాజిక విషయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉన్న సాజిదా రకరకాల స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేసింది. సాజిదా స్వేచ్ఛకు తల్లిదండ్రులు ఎప్పుడూ ఆడ్డు పడలేదు.బెంగళూరులో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సాజిదా యూకేలోని లీడ్స్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మాల్దీవుల సివిల్ సర్వీస్ కమిషన్‌లో సివిల్ సర్వెంట్‌గా పనిచేసింది. యూనిసెఫ్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పిల్లల ఆరోగ్యం నుంచి సృజనాత్మక ప్రతిభను పెం΄÷ందించడం వరకు ఎన్నో కార్యక్రమాలలో భాగం అవుతోంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపే క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిధుల సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ‘5 మిలియన్ ట్రీ ప్రాజెక్ట్’ ను లాంచ్ చేసింది. తలసీమియా పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే తలసీమియా చికిత్సపై దృష్టి పెట్టింది.సాజిదా ప్రసంగాలలోని వాడి, వేడి ఏమిటో 2023 అధ్యక్ష ఎన్నిక సమయంలో లోకానికి తెలిసింది. తన అద్భుతమైన ప్రసంగాలతో శ్రోతలను ఆకట్టుకునేది. భర్త విజయానికి ఆమె ప్రసంగాలు ఒక కారణంగా చెప్పవచ్చు.మాల్దీవులలో సైన్స్ రంగంలో మహిళలను, బాలికలను ్ర΄ోత్సహించడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటలైజేషన్ రంగాలలో మహిళల సంఖ్యను పెంచడానికి దేశ ప్రథమ మహిళగా ఎంతో కృషి చేస్తోంది సాజిదా.‘లింగ వివక్ష లేకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలి’ అనే విషయాన్ని గట్టిగా చెబుతుంది.‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనేది ఆంగ్ల సామెత.తాను మాట్లాడబోయే అంశాలను ఇంట్లో భార్యతో పంచుకోవడం మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుకు అలవాటు. తన ఆలోచనలను సాజిదాతో పంచుకోవడమే కాదు ఆమె సలహాలు తీసుకుంటాడు. ఆ ఇంట్లో తమ ముగ్గురు పిల్లలు యాస్మిన్, ఉమైర్, జాయెద్‌ల గురించి కుటుంబ విషయాలను ఎంత సహజంగా మాట్లాడుకుంటారో జెండర్ ఈక్వాలిటీ నుంచి జీరో వేస్ట్ప్రాజెక్ట్ల వరకు ఎన్నో సామాజిక విషయాలను అంతే సహజంగా మాట్లాడుకుంటారు.‘మా ఆలోచనలు ఎప్పుడు ఒకేరకంగా ఉంటాయి’ అని భార్య గురించి మురిసి΄ోతుంటాడు డా. మొహమ్మద్ ముయిజ్జు. -
వైట్‌హౌజ్‌కు బ్రైట్ స్టార్స్
అత్యుత్తమ ప్రతిభావంతుల గురించి పద్మిని పిళ్లై, నళినీ టాటాలు కాలేజి నుంచి యూనివర్శిటీ రోజుల వరకు ఎన్నోసార్లు విని ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చేరారు. ఇది అదృష్టం కాదు. జ్ఞానదాహం, లోతైన విశ్లేషణ సామర్థ్యం తాలూకు అత్యుత్తమ ఫలితం. భారతీయ అమెరికన్లు పద్మిని పిళ్లై, నళిని టాటా ప్రతిష్ఠాత్మకమైన వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోంగ్రామ్ (2024–2025)కు ఎంపిక అయ్యారు....‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’ కోసం ఈ ఏడాది అమెరికా నలుమూలల నుంచి 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పద్మిని పిళ్లై, నళిని టాటాలు ఉన్నారు.బోస్టన్‌కు చెందిన ఇమ్యూనో ఇంజనీర్ పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తుండగా, న్యూయార్క్‌కు చెందిన నళిని టాటా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ క్యాబినెట్ అఫైర్స్‌లో పనిచేస్తుంది. ‘వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోగ్రాం’ను 1964లో మొదలుపెట్టారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రోంగ్రాములలో ఇదొకటి. తమ రంగంలో సాధించి విజయాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ... మొదలైనవి ఎంపిక ప్రక్రియలోని ప్రధాన అంశాలు.ఎంపికైన వ్యక్తులు క్యాబినెట్ కార్యదర్శులు, ఇతర ఉన్నత స్థాయి పరిపాలన అధికారులతో సహా వైట్‌హౌజ్ సీనియర్ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ చర్చలలో వీరు కూడా పాల్గొంటారు. తగిన ప్రతిభ చూపితే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంది. అయినప్పటికీ తమ అద్భుత ప్రతిభతో వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాంకు ఎంపికయ్యారు. అందుకే వీరిని ‘స్కిల్డ్ బంచ్’గా పిలుస్తున్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఇమ్యునో ఇంజినీర్ గా పద్మిని పిళ్లైని వైట్‌హౌజ్ వెబ్సైట్ ప్రశంసించింది. పద్మిని గతంలో ఎంఐటీలో ట్యూమర్–సెలెక్టివ్ నానోథెరపీపై పనిచేసిన టీమ్‌కు నాయకత్వం వహించింది.2013లో అనారోగ్యానికి గురైన పద్మిని దాదాపు మరణపు అంచుల వరకు వెళ్లింది. ఆసుపత్రులలో రోజుల తరబడి గడిపింది. ‘ఆసుపత్రి నుంచి బయటపడిన తరువాత చిన్న పని చేసినా అలిసి పోయేదాన్ని. ఇలా అవుతోందేమిటా అని ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. ఫుల్ ఎనర్జీ రావడానికి నెలల సమయం పట్టింది. నిరాశలో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేవాళ్లు కుటుంబం, స్నేహితులలో ఉండడం అవసరం’ అంటుంది పద్మిని.రెగిస్ కాలేజీ నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ, యేల్ యూనివర్శిటీలో ఇమ్యునో బయాలజీలో పీహెచ్డీ చేసిన పద్మిని పిళ్లై కోవిడ్ మహమ్మారి విధ్వంసంపై లోతైన విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ, వైరస్ ప్రభావంపై ఆమె ఆలోచనలను సీఎన్‌బీసీ, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్‌లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కవర్ చేశాయి.ఇక నళిని టాటా విషయానికి వస్తే.. బ్రౌన్ యూనివర్శిటీలో న్యూరోబయోలాజీలో బీఎస్సీ, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ఎంఫిల్, నార్త్ వెస్ట్రన్ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేసింది. ‘హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్‌లో పట్టా పోందింది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్‌లో పరిశోధనాత్మక రచనలు చేసింది. వైద్య విషయాలనైనే కాదు రాజకీయ, ఆర్థిక విషయాలపై కూడా నళినీ టాటాకు ఆసక్తి ఉంది. -
అపుడు భిక్షాటన...ఇపుడు డాక్టరమ్మగా! ఇంట్రస్టింగ్ జర్నీ
అదృష్టం కలిసి వస్తే.. ఏ స్థితిలో ఉన్నా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుంటే ఆకాశమంత ఎత్తు ఎదగవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మురికి వాడలో పుట్టిన పింకీ ప్రేరణాత్మక కథ చదివితే ఈ మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది.స్టోరీ ఏంటీ అంటే: పండుగ సీజన్లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలోని మెక్లియోడ్గంజ్లోని బుద్ధ దేవాలయం దగ్గర తన తల్లి కృష్ణతో కలిసి పింకీ హర్యాన్ అనే బాలిక భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేది. అయితే 2004లో ఆమె అదృష్టవశాత్తూ టిబెటన్ బౌద్ధ సన్యాసి జమ్యాంగ్ కంటపడింది. జమ్యాంగ్ ఆమెను ఆదరించి సాయం చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించాడు. చివరికి చైనీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ధర్మశాలకు తిరిగి వచ్చింది.#WATCH | Dharamshala: "I was 4.5 years old when I came to the hostel and before that, my mother and I used to beg...In 2004 Guru ji selected me and I am grateful for that...I am also grateful to my parents that they gave me a chance to get my education...," says Pinki Haryan,… https://t.co/czbhOFjfHB pic.twitter.com/HTQEg7HsoE— ANI (@ANI) October 4, 2024అయితే ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. బిచ్చమెత్తుకుంటూ కనిపించిన బాలిక కోసం వెదికి, చరణ్ ఖుద్ వద్ద ఉన్న మురికివాడను సందర్శించి బాలికను గుర్తించాడు. ఆమెను చదివిస్తానని చెప్పాడు. కానీ ఇందుకు ఆమె తండ్రి మొదట్లో ఇష్టపడలేదు. ధర్మశాలలోని దయానంద పబ్లిక్ స్కూల్‌కు పంపమని పింకీ హర్యాన్ తల్లిదండ్రులను ఒప్పించాడు. చివరికి పింకీ తండ్రి కాశ్మీరీ లాల్ అంగీకరించి, కొత్తగా ప్రారంభించిన టోంగ్లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ హాస్టల్‌కు పంపడంతో అసాధారణ ప్రయాణం మొదలైంది. పింకీ హర్యాన్ చదువులో బాగా రాణించింది. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి తర్వాత నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువ కాబట్టి 2018లో చైనాలోని ప్రతిష్టాత్మకమైన వైద్య విశ్వవిద్యాలయంలో చేరింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ధర్మశాలకు తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా "నా తండ్రి చెప్పులు కుట్టేవాడు , బూట్లకు పాలిష్ చేయడం ద్వారా జీవనం సాగించేవాడు అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తన విజయానికి తాను టిబెటన్ సన్యాసి జమ్యాంగ్కు రుణపడి ఉన్నానని, ఇప్పుడు పేదరికం కారణంగా చదువుకునే స్థితిలో లేని ఇతర పేద పిల్లలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పింకీ చెప్పింది. చిన్నప్పుడు, మురికివాడలో నివసించాను కాబట్టి నా నేపథ్యమే అతిపెద్ద ప్రేరణ అని తెలిపింది. అంతేకాదు పింకీ ప్రేరణతో ఆమె సోదరుడు, సోదరి అదే ఎన్జీవో పాఠశాలలో చేరడం విశేషం. కాగా డబ్బు సంపాదించే యంత్రాలుగా మారడానికి బదులుగా మంచి మానవులుగా మారడానికి పిల్లలను మార్చడమే సన్యాసి జమ్యాంగ్ లక్ష్యమని, గత 19 సంవత్సరాలుగా ఎన్జీవో టోంగ్లెన్ ట్రస్ట్‌తో అనుబంధం కలిగి ఉన్న సిమ్లాలోని ఉమంగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆయన తన జీవితమంతా ధర్మశాల, మురికివాడల పిల్లలకు అంకితం చేశాడన్నారు. జమ్యాంగ్ దత్తత తీసుకున్న పిల్లలంతా ఒకప్పుడు అడుక్కునేవారు లేదా చెత్తను ఏరేవారే. కానీ ఇప్పుడు వాళ్లంతా డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, హోటల్ మేనేజర్లుగా మారారని చెప్పారు. జమ్యాంగ్ 1992లో టిబెట్ నుండి తప్పించుకుని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేదరికం ఆయనను కదిలించింది. పేదలకు సాయం చేయడం, ముఖ్యంగా మురికివాడల్లో పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు -
దేశంలోనే తొలి ట్రాన్స్ఉమెన్ డైరెక్టర్ సంయుక్త విజయన్ సక్సెస్ స్టోరీ
పొల్లాచ్చిలో పుట్టి శాన్ఫ్రాన్సిస్కోలో స్థిరపడిన ఈ ట్రాన్స్ ఉమన్ మన దేశ తొలి ట్రాన్స్ ఉమన్ డైరెక్టర్‌గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీల నిర సూర్యన్’ పేరుతో సినిమా తీయడమే కాదు ముఖ్యపాత్ర పోషించింది. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా సంయుక్త పరిచయం. 2016.తమిళనాడు–తిరుచ్చిలోని సొంత ఇంటికి దీపావళి పండక్కు వచ్చిన సంతోష్ అమెరికాకు తిరిగి వెళుతూ ‘అమ్మా... వచ్చే దీపావళికి నేను అమ్మాయిగా వస్తాను’ అని చెప్పాడు. తల్లి ఉలిక్కి పడలేదు. కన్నీరు కార్చలేదు. ‘నీ ఇష్టంరా. నీకెలా సంతోషంగా ఉంటే అలా చెయ్’ అంది. అమెరికాకు వెళ్లాక సంతోష్ ట్రాన్స్ ఉమన్‌గా మారడానికి అవసరమైన వైద్యం, చికిత్సలు చేయించుకున్నాడు. శనివారం వరకూ అబ్బాయి రూపంలోనే వెళ్లిన సంతోష్ సోమవారం నుంచి ‘సంయుక్త’ గా ఆఫీస్‌లో అడుగు‘పెట్టింది’. అయితే స్నేహితులు ఎటువంటి తేడా చూపించలేదు. అబ్బాయి సంతోష్‌తో ఎంత స్నేహంగా ఉన్నారో అమ్మాయి సంయుక్తతో అంత స్నేహంగా ఉన్నారు. ‘అందరి కథ ఇంత సులువుగా ఉండదు. అందుకే సినిమా తీశాను’ అంటుంది సంయుక్త.బీటెక్ గ్రాడ్యుయేట్సంయుక్త తండ్రి టైలర్. తల్లి గృహిణి. ముగ్గురు కుమారుల్లో ఒకడుగా పుట్టాడు సంతోష్. ‘అయితే నా భౌతిక రూపానికి నా మానసిక స్వభావానికి పొంతన కుదరలేదు. నాలోని స్త్రీనే నేను స్వీకరించాను. నా తల్లిదండ్రులు ఇందుకు నన్ను ఇబ్బంది పెట్టకపోయినా బయట నేను సంప్రదాయవాదుల గేలిని, అల్లరిని, అవమానాన్ని భరించాను. ట్రాన్స్పర్సన్ల జీవితం వెండి తెర మీద రావడం తక్కువ. మగవాళ్లు కొందరు ఆ పాత్రలు ధరించారు. ఇటీవల ‘తాలి’ సినిమాలో సుస్మితా సేన్ బాగా చేసింది. కాని నేను ట్రాన్స్ఉమన్గా ఉంటూ సినిమా తీయడం వల్ల మేమూ ఇండస్ట్రీలో మా కథలు చెప్పగలం అని నిరూపించదలుచు కున్నాను’ అంటుంది సంయుక్త.సినిమా అంటే తెలియకపోయినా...‘మా పొల్లాచ్చిలో రోజూ షూటింగ్‌లే. కాని ఏవీ నేను చూడలేదు. షార్ట్‌ఫిల్మ్‌లు తీయలేదు. అసిస్టెంట్‌గా పని చేయలేదు. 2020లో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలన్న సంగతిని యూట్యూబ్ పాఠాల ద్వారా తెలుసుకున్నాను. వందల వీడియోలు చూసి రెండేళ్ల పాటు స్క్రిప్ట్ రాశాను. నా జీవితాన్ని, నావంటి వారి జీవితంలోని ఘటనలను కలిపి ‘నీల నిర సూర్యన్’ సినిమా తీశాను. అంటే నీలి రంగు సూర్యుడు అని అర్థం. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది బ్లూ సన్‌షైన్’ పేరుతో ప్రదర్శితమవుతుంది. తమిళ విడుదల కోసం తమిళ పేరు పెట్టాను’ అని తెలిపింది సంయుక్త.సొంత డబ్బు పెట్టి...సంయుక్త అమెరికాలో అమేజాన్‌లో ఉన్నత ఉద్యోగంలో ఉంది. తన సంపాదనలోని కొంత భాగాన్ని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది. ‘సినిమాల్లో థర్డ్ జెండర్‌ని హాస్యానికే వాడి అపచారం చేశారు. ఇక మీదైనా ట్రాన్స్పర్సన్లను మర్యాదకరమైన రీతిలో ఇన్క్లూజివ్గా చూపి చేసిన పాపాన్ని కడుక్కోవాలి సినిమావారు. పరిస్థితి ఇంకా చిన్న ఊళ్లలో మారలేదు. ఉదాహరణకు ఒక స్కూల్లో టీచర్ని పిల్లలు గౌరవిస్తారు. కాని ఆ టీచర్ ట్రాన్స్ ఉమన్ అయితే తేడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ΄ోవాలి. నేను తీసిన సినిమా కథ మాలాంటి వాళ్ల అస్తిత్వాన్ని గౌరవించవలసిందిగా అర్థం చేసుకోమని కోరుతుంది’ అందామె.స్త్రీగా మాత్రమేసంయుక్త తనను తాను స్త్రీగా తప్ప ట్రాన్స్‌జెండర్‌గా చెప్పడానికి అంగీకరించదు. ‘నేను స్త్రీగా మారదల్చుకున్నాను. మారాను. కనుక నా ఆధార్ కార్డులో స్త్రీ అనే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం ట్రాన్స్‌జెండర్ అనే అస్తిత్వం అవసరమైతే దానిని కొందరు స్వీకరించవచ్చు. కాని నేను పూర్తిగా స్త్రీ అస్తిత్వంతో ఉండాలని కోరుకుంటాను’ అంటుంది సంయుక్త. ఆమె మంచి భరతనాట్య కళాకారిణి. చెన్నయ్‌లో ఆరంగేట్రం చేస్తే చాలామంది మెచ్చుకున్నారు. విస్మరణకు గురైన జీవితాలకు సంబంధించి ఇవాళ అనేక సినిమాలు వస్తున్నాయి. సంయుక్త విజయన్ తీసిన ‘నీల నిర సూర్యన్’ మరో ముఖ్యమైన కథను చెబుతోంది. మరిన్ని కథలు సంయుక్త నుంచి మనం చూడొచ్చు.‘మా కథలు మేము చెప్పుకోవడం ఈ దేశంలో అంత సులువు కాదు’ అంటుంది సంయుక్త విజయన్. -
ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!
భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు. వారు మొత్తం 21,600 నాటికల్ మైళ్లు (23,335 కిలోమీటర్లు) ప్రయాణిస్తారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపా ఈ యాత్రకు పూనుకున్నారు. వారి ప్రయాణాన్ని చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. ఇద్దరు మహిళా అధికారులు వచ్చే ఏడాది మే నెలలో గోవాకు తిరిగివస్తారు. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వీరిద్దరూ ప్రయాణం ఆరంభించారు. సముద్రాల పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా వీరు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కేరళలోని కాలికట్లో జన్మించిన దిల్నా 2014లో, పుదుచ్చేరికి చెందిన రూపా 2017లో ఇండియన్ నేవీలో చేరారు. (చదవండి: భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..) -
మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!
‘జెండర్‌ని కాదు పితృస్వామ్య వ్యవస్థను సవాల్ చేసేలా సినిమా తీయాలనుకున్నాను’ అన్నారు చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్, దర్శకురాలు కిరణ్‌రావు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో బుధవారం జరిగిన ‘మంథన్ సమ్వాద్’ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు ఆమె. ఇటీవల ఆమె దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ భారతదేశం నుంచి ఆస్కార్‌కి అధికారికంగా నామినేట్ అయిన సందర్భంగా జెండర్ దృష్టి కోణం నుంచి ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మహిళలు తమలో అంతర్గతంగా ఉండే ఖాళీలను కనుక్కోవాలనే ఆలోచనను ‘లాపతా లేడీస్’ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నా రెండవ చిత్రం. జెండర్ తేడా లేకుండా అందరి నుంచి మంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉంది.మెరుగైన కృషిమహిళల కోసం వారి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే విషయంలో రచనల పరంగా కొంత లోటు ఉంది. ఈ లోటు ను భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. నా మొదటి సినిమా ‘ధోబీ ఘాట్’ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ వర్క్ నెక్ట్స్ సినిమాను మరింత మెరుగ్గా మార్చింది.ఆడ–మగ .. వేరుగా చూడనుఆడవాళ్ల మానసిక వేదనలు, వారికి సంబంధించిన సమస్యలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అయితే, మగవారికి సంబంధించి నవి కూడా అంతకన్నా సెన్సిటివ్ గా ఉండటం చూస్తుంటాం. నేను ఆడ–మగ అని జెండర్ ప్రకారంగా వీళ్లు తక్కువ, వాళ్లు ఎక్కువ అని చెప్పలేను. మగవాళ్లు కూడా మహిళల కోణం నుంచి సెన్సిటివ్ విషయాలను రాయగలరు, చిత్రాలు తీయగలరు. మొన్నామధ్య వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ను స్త్రీ కోణం నుంచి పురుష దర్శకుడే మనకు పరిచయం చేశారు. నేను ఒంటరితల్లిగా మా అబ్బాయి మనోభావాలను కూడా గమనిస్తుంటాను కాబట్టి ఆడ–మగ అనే ఆలోచనతో కాకుండా మానవత్వం అనే కోణం నుంచే చూస్తాను.పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తూ! మహిళల కోణం నుంచి చూస్తే ముఖ్యంగా అమ్మాయిలకు వారి కలలను సాధించుకునే విషయంలో మన దగ్గర కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రధానమైనది పితృస్వామ్య వ్యవస్థ. ఆడపిల్ల సొంతంగా ఎదగడం కన్నా, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు. ఆ కోణం నుంచి ఈ ‘లాపతా లేడీస్’ కథను చూపించాం. ఇద్దరు నవ వధువులు, భర్తలతో అత్తవారింటికి రైలులో బయల్దేరుతారు. మేలి ముసుగులు నిండా కప్పుకున్న వధువులు ఒక స్టేషన్లో దిగాల్సినది మరోచోట దిగుతారు. వాళ్లిద్దరిని ఇళ్లలోని వారు వెతుకుతుంటారు. ఎవరి కంటా పడకుండా ఒక వధువు తనకై తానుగా ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచు కుంటుంది. మరొక వధువు చుట్టూ ఉన్న పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తుంది. బరువైన సామాజిక సమస్యలను ప్రస్తావించిన్పటికీ, హాస్యాన్ని కూడా జత చేయడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాం. వివాహం చేసుకోబోయే యువతులైనా, చదువుకోవడానికి చేసే ప్రయత్నమైనా వాళ్లు ఎదుర్కొనే అనేక రకాల పరిస్థితులు, కొత్త మార్గాన్ని అన్వేషించడానికి, సమస్యలను పరిష్కరించుకునే తీరు ఆలోచింపజేస్తుంది. మహిళలు వయసు పైబడినవారయినా సరే...మగవారిపైన ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాలి. అందుకు తగిన నైపుణ్యాలను పెంచుకోవాలి’’ అని అన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ ఫెమినిజం మెరుపు‘లాపతా లేడీస్’ అని టైటిల్ చూసి ఫెమినిజం ఫైర్ ఉంటుంది కాబోలు అనుకోలేరు. కానీ, దాని తాలూకు ఒక మెరుపు కనిపిస్తుంది. అందువల్ల మగవారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కథనం పితృస్వామానికి విరుద్ధమే కానీ ఒక జెండర్‌కు మాత్రమే సంబంధించింది కాదు. నేను వివాహ వ్యవస్థకు అస్సలు వ్యతిరేకం కాదు. నిజానికి పెళ్లయినా, కుటుంబంలో అయినా సరే స్త్రీలు తమలోని ఖాళీలను కనుక్కొనేలా ్ర΄ోత్సహించే విధంగా ఈ కథను చెప్పాలనుకున్నాను. అంతేకానీ ఏదో భారీ విప్లవాన్ని తీసుకొచ్చి సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనుకోలేదు.’’ -
భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..
ఆమె ఆగ్రా ఏసిపి అర్ధరాత్రి 12 తర్వాత రైల్వేస్టేషన్ దగ్గర నిలబడి హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది ‘ఒంటరి ప్రయాణికురాలిని.. హెల్ప్ చేస్తారా?’ అని పోలీసులు ఎలా స్పందించారు? మహిళల రక్షణ విషయంలో పోలీసు అధికారుల ఇలాంటి ప్రయత్నాలు ఎలాంటి హెచ్చరికలు పంపుతాయి? రెండు మూడు రోజుల క్రితం. ఆగ్రాలోని రైల్వేస్టేషన్ దగ్గర ఒక మహిళ నిలుచుని ఉంది. తెల్ల షర్టు, బ్లాక్ జీన్స్ ధరించి ఉంది. చేతిలో చిన్న బ్యాగ్ ఉంది. అప్పటికి రాత్రి ఒంటి గంట. ఉత్తర ప్రదేశ్ హెల్ప్‌లైన్ 112కు కాల్ చేసింది. ‘నేను ఒంటరి ప్రయాణికురాలిని. ట్రైన్ మిస్ అయ్యాను. నాకు సాయం చేయగలరా?’ అని అడిగింది. అవతలి వైపు పోలీసుల స్పందన ఎలా ఉంటుందో చూసింది. ఆ పోలీసులు వెంటనే స్పందించారు. ‘మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి లేదా ఏదైనా జనం ఉండే చోట ఉండండి. మా వాళ్లు మీ కాంటాక్ట్‌లోకి వస్తారు’ అని చెప్పారు. మరికొన్ని క్షణాల్లోనే మరో ఫోన్. ‘మేం బయలుదేరాం. మీ లైవ్ లొకేషన్ పెట్టండి’ అని. ‘భేష్. మీరు రానక్కర్లేదు. నేను ఆగ్రా ఏసీపీ సుకన్య శర్మను’ అని ఫోన్ పెట్టేసింది.ఆ తర్వాత ఆటోను పిలిచింది. ఎక్కడకు వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కింది. ‘డ్రైవర్ భయ్యా... ఒంటరి మహిళలు ఈ టైమ్‌లో ఆటో ఎక్కడం సేఫేనా’ అని అడిగింది. ఆటోడ్రైవర్ ‘ఏం పర్లేదమ్మా. పోలీసులు ఆటోడ్రైవర్ల అన్ని వివరాలు తీసుకుంటున్నారు. ఖాకీ షర్ట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దంటున్నారు. మీకేం ఇబ్బంది లేదు’ అని ఆమె కోరిన చోట దించాడు. అప్పుడు ఆమె తనెవరో చెప్పి ‘స్త్రీలు మెచ్చే విధంగా ఉన్నావు. ఇలాగే అందరూ వ్యవహరించాలి’ అని అభినందించింది. పూర్వం ఎలా పాలన జరిగేదో చూడటానికి రాజులు మారు వేషాలు వేసేవారు. ఇలా అధికారులు కూడా సామాన్యుల్లా వ్యవహరించి తిరిగితే లోపాలు తెలిసి సమస్యలు దృష్టికి వచ్చి స్త్రీలకు మరింత రక్షణ ఏర్పాట్లు చేయవచ్చు. భేష్ సుకన్య మేడమ్.(చదవండి: పెప్పికో మాజీ సీఈవో ఇంద్రా నూయి పేరెంటింగ్ టిప్స్) -
మహిళకు నెట్టిల్లు మేలు!
మహిళకు నెట్టిల్లు మేలు ‘ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే ఏమవుతుంది?’ అనే ప్రశ్న ఒకప్పుడైతే అంత తీవ్రంగా ఆలోచించాల్సినంత ప్రశ్న కాకపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈ ప్రశ్నకు అధ్యయనకర్తలు అనేక కోణాలలో జవాబులు అన్వేషిస్తున్నారు...ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా కీలక దశలో ఉంది. మధ్యతరగతి అభివృద్ధిపథంలో ఉంది. అయితే ఈ పురోగతికి ఒక ఆటంకం ఉంది. అదే... డిజిటల్ జెండర్ డివైడ్. ఇంటర్నెట్ను ఉపయోగించడంలో స్త్రీ, పురుషుల మధ్య భారీ అంతరం ఉండడమే డిజిటల్ జెండర్ డివైడ్.ఇంటర్నెట్ అందుబాటులో లేని 260 కోట్ల మందిలో ఎక్కువగా మహిళలు, బాలికలే ఉన్నారు. దీనివల్ల మహిళలు ఉద్యోగ శిక్షణకు దూరం అవుతున్నారు. ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకోలేకపోతున్నారు. ఆరోగ్య, ఆర్థిక సేవలకు దూరం అవుతున్నారు.గత 25 ఏళ్లలో దక్షిణాసియా అంతటా డిజిటల్ యాక్సెస్ విపరీతంగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే గత దశాబ్దకాలంలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లు పెరిగింది. అయితే స్త్రీ, పురుషుల విషయంలో ఈ పురోగతి ఒకేరకంగా లేదు. కట్టుబాట్లు మొదలుకొని వ్యవస్థాగత కారణాలు, పేదరికం వరకు రకరకాల కారణాల వల్ల మహిళలు, బాలికలు ఇంటర్నెట్కు దూరం అవుతున్నారు.ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాలలో మహిళలు విద్య, ఉద్యోగాలలో వెనకబడిపోతున్నారు. ఇంటర్నెట్కు దూరం కావడం అనేది మహిళల కెరీర్ అవకాశాలను పరిమితం చేస్తుంది. మన దేశంలో 20–25 శాతం వ్యాపారాలు మహిళలు నిర్వహిస్తున్నప్పటికీ 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మూలధనాన్ని సమీకరించుకోగలుగుతున్నారు.ఇక ‘స్టెమ్’ విషయానికి వస్తే దక్షిణాసియా అంతటా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మహిళలు 25 శాతం మాత్రమే ఉన్నారు. ‘స్టెమ్’ ఫీల్డ్‌కు సంబంధించిన ఉద్యోగాలలో కూడా మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. ‘డిజిటల్ జెండర్ డివైడ్ అనేది కేవలం సామాజిక సమస్య కాదు ఆర్థిక సమస్య కూడా’ అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది బాలికలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే కేవలం మూడేళ్లలో ఆయా దేశాల జీడిపీలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.‘మహిళలు ఇంటర్నెట్కు దగ్గరైతే ఉద్యోగ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాల వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది మహిళలకు వారి కుటుంబాల మెరుగైన జీవన నాణ్యత(క్వాలిటీ ఆఫ్ లైఫ్)కు దారి తీస్తుంది. మహిళలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. తరతరాలకు ఉపయోగపడే ఫలాలు ఇస్తుంది’ అంటున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డిజిటల్ ఇన్‌క్లూజన్ హెడ్ కెల్లీ ఓముడ్సెన్.2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఉద్యోగాల సంఖ్య 9.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆ ఉద్యోగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే వారు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది అనివార్యం.(చదవండి: శారీ రన్! చీర కట్టులో కూడా పరుగు పెట్టొచ్చు..!) -
ఏరియల్ ఆర్ట్ : ఆకాశమే హద్దుకళ
అథ్లెటిసిజం కలగలసి వైమానిక విన్యాసాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. చూడటానికి జిమ్నాస్ట్‌గా అనిపిస్తూనే ఆకాశంలో హరివిల్లులా మారే నృత్యప్రదర్శన ఓ అద్భుత ప్రకియగా అందరి మనసులను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడా అవార్డును గెలుచుకున్న తర్వాత, అదితి దేశ్‌పాండే ప్రజలకు వైమానిక విన్యాసాలలో శిక్షణ ఇస్తోంది. ముంబైలోని తన అకాడమీ ఫ్లై హై ఏరియల్ ఆర్ట్ గురించి దేశ్‌పాండే మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లినట్లుగానే, చాలామంది ఏరియల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని.. ఆఫీసులు, స్కూళ్ల టైమ్ తర్వాత శిక్షణ కోసం క్లాసులకు రావాలని కోరుకుంటున్నారని’ చెబుతోంది. శరీర బరువులో సమతుల్యతసిల్క్ ఫ్యాబ్రిక్, హూప్స్, తాళ్లు లేదా ట్రాపెజెస్ని ఉపయోగించి గాలిలో నృత్యం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఈ డ్యాన్స్ సంగీతంతో సెట్ చేసి ఉంటుంది. ప్రదర్శనలు చేయడానికి వ్యక్తుల బలం, సౌలభ్యాన్ని మిళితం చేసి దృశ్యంగా మార్చే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఒక సాధారణ వ్యక్తి ఈ విన్యాసాలను చాలావరకు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చేయడానికి తన పూర్తి బలాన్ని ఉపయోగిస్తాడు. వైమానిక స్కిల్స్ ప్రదర్శించే సమయంలో వెనుక కండరాలను ఉపయోగిస్తాడు. దీనికి శరీర బరువులో ఒక సమతుల్యతను తీసుకురావాల్సి ఉంటుంది’అని వివరిస్తుంది దేశ్‌పాండే ఎలా చేస్తారంటే...ఈ వైమానిక ప్రదర్శనలో డ్రాప్స్, రోజులు, స్పిన్‌లను అమలు చేయడానికి ముందు వ్యక్తులు తమను తాము ఫాబ్రిక్లో చుట్టుకుంటారు. ఏరియల్ రోప్ అనేది లైక్రాతో తయారు చేయబడిన వృత్తాకార ఉపకరణం. దీనిని కళాకారులు విన్యాసాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ట్రాపెజ్ అనేది తాళ్లు, తీగలతో చేసేది. ఇక్కడ ప్రదర్శనకారులు గాలిలో ఊగుతూ విన్యాసాలు చేస్తారు. స్ట్రాప్స్లో కళాకారులు సీలింగ్‌కు జోడించిన పట్టీలపై ప్రదర్శనలు చేస్తారు. అక్టోబర్‌లో ఢిల్లీలోని స్విస్ దగ్గర ప్రదర్శనస్విస్ కళాకారుడు జాసన్ బ్రూగర్, భారతీయ హులా హూప్ ప్రాక్టీషనర్ ఎష్నా కుట్టి అక్టోబర్ 2024లో న్యూ ఢిల్లీలోని స్విస్ రాయబార కార్యాలయంలో రెండు దేశాలు 75 సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. వైమానిక కళలకు ‘ఉన్నత స్థాయి సాంకేతికత అవసరం కాబట్టి ఇది కచ్చితంగా జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలతో పోల్చవచ్చు. కానీ కదలిక, సంగీతం, కోర్సు సాంకేతికత ద్వారా కళ సృష్టించడం‘ అని బ్రూగర్ చెప్పారు. ‘వేదికపై ఉన్నప్పుడు నా వ్యక్తిగత లక్ష్యం నా శరీరం ఏమి చేయగలదో చూపించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం‘ అంటారు. వైమానిక కళ అందరికీ అందుబాటులో ఉందా?అహ్మదాబాద్‌లోని ఏరియల్ ఆర్ట్స్ ఇండియా అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ ట్రైనర్ అయిన జీల్ సోనీ– ‘మా దగ్గర 55 ఏళ్ల వ్యక్తి నుండి 12 ఏళ్ల అమ్మాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఏరియల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్రజలు కొంచెం సాహసం చేయాలని చూస్తున్నందున జిమ్‌కి వెళ్లకుండా ఏరియల్ ఆర్ట్‌లను ఎంచుకుంటారు. పరికరాలు, మౌలిక సదు΄ాయాల విషయానికొస్తే క్రాష్ మ్యాట్లు, ప్రథమ చికిత్స, సేఫ్టీ గ్రిప్ ఎయిడ్ నుండి అన్నింటినీ అందిస్తాం’ అని చెబుతోంది.ఖర్చు ఎంతంటే..! సోని ఎనిమిది వైమానిక కళల శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది. ఒకటి నుండి నాలుగు స్థాయిలు వైమానిక కళలను పరిచయం చేస్తాయి. ఐదు నుండి ఎనిమిది ఋత్తిపరమైన స్థాయి లు. ప్రతి పరిచయ స్థాయి శిక్షణకు ఒకటిన్నర నెలలకు సుమారు రూ. 6,500, ప్రతి ఉన్నత స్థాయికి మూడు నెలలకు రూ. 13,500 ఖర్చు అవుతుంది. సృజనాత్మకత, శిక్షణ, కఠినమైన మనస్తత్వం కూడా ఈ కళకు చాలా ముఖ్యమైనవి. మంచి కోచ్‌తో పని చేస్తే సరైన శిక్షణ లభిస్తుంది. సర్కస్‌లు, డ్యాన్స్ షోలు లేదా థియేటర్లలో ప్రదర్శించే ఏరియల్ ఆర్టిస్టులకు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణేలోని స్టూడియోలు సెషన్ల సంఖ్య ఆధారంగా తరచుగా ప్యాకేజీలుగా ఉండే తరగతులను అందిస్తాయి. ప్లేస్, శిక్షణ రకం, కోచ్, కోర్సు వ్యవధి ఆధారంగా ట్రెయినింగ్ ఫీజు ఉంటుంది. -
మునుపటి కాలం కాదు ఇది, కానీ..
మునుపటి కాలం కాదు ఇది. సెలవులు, తీరిక దొరకగానే ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావాలనుకోవడం లేదు మహిళలు. సోలో ట్రావెలర్స్‌గా అవుట్డోర్ థ్రిల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కోణంలో చూస్తే....‘ఆహా... ఎంత మార్పు’ అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే అవుట్డోర్ అడ్వెంచర్లలో మహిళలకు సౌకర్యాలు, భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి..గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మహిళా సాహస బృందాలు, సోలో ఉమెన్ ట్రావెలర్లు పెరిగారు. చాలామంది మహిళలు సెలవుల్లో ఇంటికి పరిమితం కావడానికి బదులు అవుట్డోర్ థ్రిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలో పర్వతారోహణ, స్కీయింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్... మొదలైన సాహస విభాగాల్లో శిక్షణను అందించే సంస్థల నుండి ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. అయినప్పటికీ..మహిళల నేతృత్వంలోని అడ్వెంచర్ టూరిజం కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. టూరిజం ఇండస్ట్రీ ఉమెన్ ట్రావెలర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదు. మహిళా గైడ్లు, సహాయ సిబ్బంది కొరత గణనీయంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే మహిళా గైడ్లను నియమించుకుంటున్నాయి. ‘గైడ్ అంటే పురుషులు మాత్రమే’ అనే భావనను పునర్నిర్వచించడమే కాకుండా మహిళా ప్రయాణికులకు భరోసాగా నిలుస్తున్నారు ఫిమేల్ గైడ్లు. మారుమూల ప్రాంతాలలో సౌకర్యవంతమైన వాతావరణానికి కృషి చేస్తున్నారు.మహిళా భద్రతా కోణంలో జెండర్ సెన్సివిటీ ట్రైనింగ్ అనేది కీలకంగా మారింది. ఈ శిక్షణ మేల్ గైడ్స్ ‘జెండర్ డైనిమిక్స్’ను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు లైంగిక వేధింపులను నివారించడానికి సహాయపడుతుంది. భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్స్‌కు అవసరమయ్యే ఎక్విప్మెంట్ను రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రొడక్ట్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ కోసం పెయిన్ రిలీఫ్ మందులు, ఆరోగ్యం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మెడికల్ కిట్లు అందుబాటులోకి తేవాలి. ‘సోలో ట్రావెలర్, అవుట్ డోర్ ప్రొఫెషనల్‌గా ఎన్నోసార్లు అసౌకర్యానికి గురయ్యాను. మహిళల సాహస ప్రయాణాలలో మౌలిక సదుపాయాల తక్షణ అవసరం ఉంది’ అంటుంది మౌంటెనీర్, ఎంటర్ప్రెన్యూర్ అనూష సుబ్రమణ్యియన్.ఇలా అంటున్నారు.. ఇటీవల ఒక సంస్థ సోలో ఉమెన్ ట్రావెలర్స్ గురించి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది భద్రత గురించి ఆందోళన చెందారు. మరో 29 శాతం మంది శారీరక సౌకర్యం (ఫిజికల్ కంఫర్ట్), 23 శాతం మంది వెహికిల్ బ్రేక్‌డౌన్స్, 13 శాతం మంది లైంగిక వేధింపుల గురించి ఆందోళన చెందారు. ఎవరి అభిప్రాయం మాట ఎలా ఉన్నా అడ్వెంచర్ టూరిజం ఇండస్ట్రీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది అందరి నోటి నుంచి వినిపించిన మాట.ఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్‌కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్‌బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్‌గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరింది. యాక్టివిస్ట్‌గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
ఇంట్లో రెస్ట్ లేదు... ఆ‘పీస్’ లేదు
పూర్వం పురుషుడి సంపాదనకు స్త్రీ సంపాదన తోడైతే ‘ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు’ అనేవారు. రాను రాను స్త్రీ సంపాదన ప్రధానం అయ్యింది. స్త్రీలు ఇంటి పని, ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కాని పని గంటలు వారి జీవితాలను కబళిస్తున్నాయా? ప్రయివేటు ఉద్యోగాలు పది గంటలు డిమాండ్ చేస్తుంటే సేల్స్ విమెన్ గానో, చిన్న ఉద్యోగాల్లోనో ఉండే మహిళలు ఏకంగా 12 గంటలు చేయాల్సి వస్తోంది. కుటుంబ, సాంఘిక, సామాజిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పని గంటలపైకార్మిక చట్టాలు ఏమీ చేయడం లేదు. స్త్రీలు ప్రాణాలు ΄ోయేంతగా వొత్తిడి అనుభవించాలా?ఇటీవల పూణెలో అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ తను పని చేసే సంస్థలో ఒత్తిడి తట్టుకోలేక మరణించింది. మంగళవారం (సెప్టెంబర్ 24) లక్నోలోని ఒక ప్రయివేట్ బ్యాంకులో పని చేస్తున్న ఫాతిమా అనే ఉద్యోగిని కుర్చీలోనే కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి వల్లే అని సహోద్యోగుల ఆరోపణ. ఇవి తెలిసి. తెలియనివి ఇంకెన్నో.స్త్రీలకు రెండు ఉద్యోగాలుఉదయం ఎనిమిదన్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకూ పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్ స్టాఫ్, హోటల్ రంగం, కాల్ సెంటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ వర్కర్లు... 12 గంటలు చేయలేం అంటే 10 గంటలు అడుగుతున్నారు. అదీ కాదంటే 9 గంటలకు ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా పని చేయాలన్నది వాస్తవం. ఈ 9 గంటలతో పాటు రాక΄ోకల సమయం కూడా కలుపుకుంటే స్త్రీలకు ఇంటి పనికీ, పిల్లల పెంపకానికి, విశ్రాంతికీ మిగిలే సమయం ఎంత?జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువుకు, వైద్యానికి, రవాణాకు ఖర్చు చేయకతప్పని పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాడిగా భర్తకు ఉద్యోగ వొత్తిడి తప్పదు. కాని స్త్రీలకు ఇంటి బాధ్యత కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు... ఇవన్నీ భారమే. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా వొత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం తెచ్చుకుంటూ ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే స్థితికి చేరువ చేస్తోంది మహిళా ఉపాధి.ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని ప్రస్తుతం వారి పని ఒత్తిడి కూడా తక్కువగా లేదు. సుఖమైన బ్యాంకు ఉద్యోగం ఇప్పుడు పచ్చి అబద్ధం. చాలా చాకిరి అందులో ఉంటోంది. పెద్ద జీతాల సాఫ్ట్వేర్ రంగం విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ‘మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా గాడిదలతో సమానంగా చూస్తున్నాయి’...‘లాగిన్ చేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తామో మాకే తెలియదు’ అనే మాటలు ఆ రంగంలో సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.వారానికి 60 గంటలుఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎవర్ని పలకరించినా చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్‌కు భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయనడానికి పూణెలో అన్నా సెబాస్టియన్ అనే మహిళ పని ఒత్తిడితో మరణించడం ఒక ఉదాహరణ మాత్రమే. 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే దారుణమైన వర్క్ కండిషన్స్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. భారత్‌లో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు పాత మాటగా మారగా 55 నుంచి 60 గంటలు మహిళలతో కార్పోరేట్ కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారి΄ోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతోపాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.హక్కులు ఏవి? చట్టాలు ఎక్కడ?చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియా ఊసు కూడా లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్ ను రూ΄÷ందించడంలో భారత్ కూడా కీలక పాత్ర ΄ోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో గొడ్డుచాకిరీ చేయించుకునే సంస్థలు పెరిగి΄ోయాయి.స్మార్ట్‌వర్క్‌ను ప్రోత్సహించాలిఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్ కు ఏమాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్ కండిషన్స్ ఏమాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ‘నో’ చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చె΄్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలను పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.ఫ్యాక్టరీస్ చట్టం 1948, మైన్స్ చట్టం, బీడీ– సిగార్ కార్మికుల చట్టం మొదలగు చట్టాల కింద ప్రత్యేక సందర్భాలలో తప్ప ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే స్త్రీలు పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు దాటి రాత్రి 10 వరకు పనిచేయాలి అంటే సదరు యాజమాన్యం ప్రత్యేకమైన వసతులు; రక్షణ, రవాణా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పని వేళలు సాఫ్ట్వేర్ రంగానికి కూడా వర్తించినప్పటికీ, కొన్ని వెసులుబాటులను ప్రభుత్వం ఐటీ రంగానికి కల్పించింది. అయినప్పటికీ స్త్రీలను రాత్రి వేళలో పనిచేయాలి అని ఏ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే రవాణా, చిన్నపిల్లల సౌకర్యార్థం (క్రెచ్) సదుపాయాలు కల్పించాల్సి వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిస్త్రీలకు పిల్లల పెంపకం, ఇంటి పని భారం, ఉద్యోగ భారం... ట్రిపుల్ బర్డన్ కలిగిస్తున్నాయి. ఇంటిని చూసుకోవాలి... సంపాదించాలి... అంటే రెండు చోట్లా ఆమె ఉత్పాదనను పరీక్షకు పెడుతున్నట్టే లెక్క. ఈ రెండు పనులు ఆమెకు సౌకర్యంగా లేక΄ోతే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా యాంగ్జయిటీ, డిప్రెషన్ చూస్తున్నాం. ఇక ఎముకల బలం క్షీణించడం, బహిష్టు సమస్యలు... కనపడుతున్నాయి. కొందరిలో ఇన్ఫెర్టిలిటీ పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయమే ఈ పరిస్థితి నుంచి స్త్రీలను బయటపడేయగలదు.– డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్– ఫణికుమార్ అనంతోజు, సాక్షి -
స్టార్టప్ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం, కట్ చేస్తే అద్దె ఇంట్లోనే నివాసం
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్‌లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్‌కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్‌ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్‌లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్‌ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్లను, 2018లో ప్రొటీన్ బార్‌ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ. సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు. కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట. -
పని ఒత్తిడి పనిపడదాం..!
కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ అనే మహిళ పనిభారం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. బాధితురాలి తల్లే స్వయంగా తన కూతురు మరణానికి పని ఒత్తిడి అంటూ ఆమె పనిచేసే ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీకి లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యింది. ఆ ఘటన మరువక ముందే లక్నోలో జరిగిన మరో ఘటన అందర్ని ఉలక్కిపడేలే చేసింది. ప్రైవేట్ బ్యాంకులో మంచి పొజిషన్లో పనిచేస్తున్న సదాఫ్ ఫాతిమా విధుల నిర్వర్తిస్తూనే కుర్చీలోనే కూలబడింది. ఇటీవలే ఆమెకు ప్రమోషన్ రావడంతో పని ఒత్తిడి ఎక్కువయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో మంచి పని వాతావరణం ఉద్యోగులకు కల్పించే దిశగా కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అలాగే పనిచేసే మహిళలు కూడా పనిచేసే చోట ఎదురయ్యే ఒత్తిడిని, ఇంటి బాధ్యతలను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో అన్నింటిలో తానే బెస్ట్‌గా ఉండాలనే తాపత్రయం పని ఒత్తడికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ పని ఒత్తిడి ఎలా హ్యాండిల్ చేసి ఆహ్లాదభరితమైన హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చకోవచ్చు అనే దాని గురించి నిపుణుల మాటల్లో సవివరంగా తెలుసుకుందాం. హ్యాపీ వర్క్‌ప్లేస్.. ఇలా!పని ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. మీరు ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో ముందుగా గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది మీకు భారంగా, మీ ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదు.పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకుండా.. ప్రాధాన్యమున్న పనుల్ని ముందు పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు.. దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట/రెండు గంటలకోసారి ఓ ఐదుపది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్తపడచ్చు.ఎంత పనున్నా నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయి.పని ప్రదేశంలో అటు కొలీగ్స్‌తో, ఇటు పైఅధికారులతో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడచ్చు. దీనివల్లా చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది.యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే! కాబట్టి వీటిని రోజూ సాధన చేయడం మంచిది.ఇలా ఉద్యోగులే కాదు.. సంస్థలూ తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతో పాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక సెషన్స్ నిర్వహించడం, అప్పుడప్పుడూ వినోద కార్యక్రమాల్ని ఏర్పాటుచేయడం.. వంటివీ వారికి మేలు చేస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!) -
అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి ఎటువైపుకి తీసుకువెళ్తాయో కూడా చెప్పలేం. అలాంటి సమయాల్లో సరైన నిర్ణయాలతో అడుగులు వేసినవాళ్లే అసామాన్య వ్యక్తులుగా నిలిచిపోతారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి అసామాన్యురాలే ఈ అంబికా పిళ్లై. ఒకదాని వెంట ఒకటిలా కష్టాలు తరుముతున్న ఎక్కడ తన గమనం ఆపలేదు. తన అసామాన్య ప్రతిభతో దూసుకుపోయింది. చివరికి ప్రపంచమే మెచ్చే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుని ప్రశంసలందుకుంది.భారతదేశంలోని ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరు అంబికా పిళ్లై. జీవితంలో కష్టాలనేవి సహజమే. కానీ ఎలాంటి కష్టానికైనా.. తలవంచకుండా ధైర్యంగా సాగిపోయేవాడికే ఈ ధూనియా సలాం కొడుతుంది. అదే మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్లై విషయంలో జరిగింది. కేరళకు చెందిన పిళ్లై నలుగురు సోదరిమణులలో రెండోవది. ఆమె 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. 22 ఏళ్లకు కవిత అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత 24 ఏళ్లకే వైవాహి జీవితంలో మనస్పర్థలు తలెత్తి విడాకులకు దారితీసింది. ఆ బాధను పట్టిదిగువున బిగపెట్టి కూతురే జీవితంగా కెరీర్‌పై దృష్టి పెట్టింది. అలా ఆమె తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిగ్గే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. అదే ఆమె జీవితాన్ని ఉన్నతమైన స్థితికి వెళ్లేలా చేసింది. చిన్న మేకప్ ఆర్టిస్ట్ కాస్త 1999-2000లో FDCI ఇండియన్ ఫ్యాషన్ వీక్కి పనిచేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రోహిత్ బాల్, సుస్మితా సేన్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజ నటులకు పనిచేసే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో భయంకరమైన కేన్సర్ వ్యాధి బారినపడింది. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ పరంగా స్నేహితురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. రెండు కోలుకోలేని దెబ్బలతో తిరిగి కోలుకోలేనంతగా చతికిలపడింది అంబికా జీవితం. అంతా అంబికా అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమె కష్టాలను చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కేన్సర్‌ని జయించి మళ్లీ నెమ్మదిగా యథావిధిగా తన గమనం సాగించింది. ఇక స్నేహితురాలి మోసంతో తన సొంత పేరుతోనే స్వయంగా వ్యాపారం చేయడం ప్రారంభించింది. అలా ఆమె త్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా IIFA అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2019లో తన సొంత హెర్బల్ బ్యూటీ బ్రాండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు 70 ఏళ్లు. ఈ వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంటి నుంచే బిజినెస్ పనులన్ని నిర్వహిస్తోంది. ఆమెకు చిన్న చిన కథలు రాసే అలవాటు ఉందంట. అందుకని ఖాళీ సమయంలో ఎలాగైనా ఒక పుస్తకం రాయాలను భావిస్తోందట అంబికా పిళ్లై. ఇంత భయానక కష్టాలను అవలీలగా జయించుకుని రావమే గాక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుని ప్రపంచం తనవైపు చూసేలా చేసింది. జీవించడమంటే ఇది కథా.! అనేలా జీవించి చూపించి స్ఫూర్తిగా నిలిచింది అంబికా పిళ్లై.(చదవండి: సాల్మన్ చేపలతో సౌందర్యం..!) -
చెస్ ఒలింపియాడ్–2024.. చెస్ ‘క్వీన్స్’
‘చెస్ అనేది ఆర్ట్. ఆట, సైన్స్‌ల సమాహారం’ అంటారు. ఆ విషయం ఎలా ఉన్నా... చెస్ అనేది ఆత్మవిశ్వాస సంకేతం. ఆ ఆత్మవిశ్వాస శక్తితోనే చెస్ ఒలింపియాడ్–2024(బుడాపెస్ట్, హంగెరి)లో మన మహిళా మణులు సత్తా చాటారు. చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో తొలి స్వర్ణం సాధించారు. మన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి రమేష్‌బాబు, వంతిక ఆగర్వాల్, తానియా సచ్దేవ్లు సత్తా చాటారు. స్వర్ణకాంతులతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు..ఆమె విజయ రహస్యంమహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పుట్టింది దివ్యా దేశ్‌ముఖ్. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు. తండ్రి తరచు చెస్‌బోర్డ్ ముందు కూర్చొని కనిపించేవాడు. ఆ దృశ్యాలను పదే పదే చూసిన దివ్యకు చెస్‌పై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి కాస్తా నైపుణ్యంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్, ‘వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్’ టైటిల్ గెలుచుకుంది.తన ఆట తీరుతో ఎన్నోసార్లు ‘అమేజింగ్ పర్ఫార్మెన్స్’ అనిపించుకున్న దివ్యా దేశ్‌ముఖ్ ‘గంటల కొద్దీ ్రపాక్టీస్, తల్లిదండ్రుల నిరంతర ్రపోత్సాహమే నా విజయ రహస్యం’ అంటోంది.ఆ క్షణం నుంచి...ఏడున్నర సంవత్సరాల వయసులో తొలిసారిగా చెస్ బోర్డ్‌ను టచ్ చేసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వంతిక అగర్వాల్. ఆ టచ్ చేసిన ముహూర్తం ఎలాంటిదోగాని ఆ క్షణం నుంచే చెస్ ఆటే తన రూట్ అయింది. స్కూల్లో ఫ్రెండ్స్‌తో, ఇంట్లో సోదరుడు విశేష్‌తో చెస్ ఆడేది. చెస్ కెరీర్ ్రపారంభంలోనే ఎన్నో ట్రోఫీలు గెలుచుకొని ‘ఔరా’ అనిపించింది. రోజుకు ఎనిమిది గంటలు చెస్ ్రపాక్టీస్ చేస్తుంది. పోద్దున యోగా చేయడం, సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడడం తప్పనిసరి. మొదట్లో గేమ్‌లో ఓటమిని తట్టుకోలేకపోయేది. ఏడ్చేది కూడా. ఏడుస్తూ నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తనలో గెలుపు, ఓటములను సమంగా చూసే పరిణతి వచ్చింది. ‘నేను ఏమాత్రం నిరాశగా కనిపించినా అమ్మ నాలో ధైర్యం నింపుతుంది. యస్...నువ్వు సాధించగలవు అంటుంది. ఆమె నాకు కొండంత అండ’ అంటుంది వంతిక అగర్వాల్.హార్డ్ వర్క్ ఈజ్ ది బిగ్గెస్ట్ టాలెంట్2005లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించిన తానియా సచ్దేవ్ దిల్లీలో పుట్టి పెరిగింది. తానియా సచ్‌దేవ్‌కు ఆరేళ్ల వయసులో తల్లి అంజు ద్వారా చెస్ పరిచయం అయింది. తానియా తల్లి బ్యాడ్మింటన్, తండ్రి ఫుట్‌బాల్ ఆడేవారు. ఈ రెండు ఆటలు కాకుండా తానియాకు చెస్ పరిచయం చేయడం యాదృచ్ఛికమే అయినా ఆ చెస్ తనని ఎక్కడికో తీసుకెళ్లింది. 2007లో మహిళల ఆసియా చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది తానియ.‘చెస్‌లో స్టార్‌గా రాణించడం ఏ ఒక్కరికో పరిమితమైన ప్రతిభ కాదు. కష్టపడితే అందరికి సాధ్యమే’ అంటున్న తానియా సచ్దేవ్ గ్యారీ కాస్పరోవ్ మాట ‘హార్డ్ వర్క్ ఈజ్ ది బిగ్గెస్ట్ టాలెంట్’ను పదే పదే గుర్తు తెస్తుంటుంది.ఆరోజు నుంచి వైశాలి జీవితమే మారిపోయింది!చెన్నైలో పుట్టింది వైశాలి రమేష్‌బాబు. తల్లి గృహిణి. తండ్రి టీఎన్ఎస్సీ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్. ఆమె సోదరుడు ఆర్. ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్. చిన్నప్పుడు వైశాలి టీవీకి అతుక్కుపోయేది. చివరికి అదొక వ్యసనంగా మారింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వైశాలిని చెస్ క్లాసులకు పంపించారు.‘నేను వెళ్లను’ అని వైశాలి మారాం చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘అలాగే’ అంటూ వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చేసింది. 2012లో గర్ల్స్ వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్ (అండర్–12), 2016లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐయం) టైటిల్ గెలుచుకుంది. చెస్‌లో తొలి పాఠం నుంచి ‘గ్రాండ్ మాస్టర్’ టైటిల్ సొంతం చేసుకోవడం వరకు ఎన్నో విషయాలను నేర్చుకుంది. ఆటకు సంబంధించిన ఇన్‌స్పిరేషన్‌ను ది గ్రేట్ విశ్వనాథన్ ఆనంద్ నుంచి మాత్రమే కాదు తన సోదరుడు ప్రజ్ఞానంద నుంచి కూడా తీసుకుంటుంది. ‘అతడికి ఓపిక ఎక్కువ. గెలుపు, ఓటములను ఒకేరకంగా తీసుకుంటాడు. ఓర్పు నుంచి స్థితప్రజ్ఞత వరకు ప్రజ్ఞ నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి’ అంటుంది వైశాలి.కుటుంబ బలం పరిచయం అక్కర్లేని పేరు హారిక ద్రోణవల్లి. ఎంతోమంది ఔత్సాహికులకు ఈ గ్రాండ్ మాస్టర్ స్ఫూర్తిగా మారింది. చెన్నైలో ‘చెస్ ఒలింపియాడ్’ జరుగుతున్న టైమ్‌లో హారిక తొమ్మిది నెలల గర్భిణి. అయినప్పటికీ పోటీలో పాల్గొని జట్టుకు కాంస్యం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని టఫెస్ట్ టీమ్‌లు ఏమిటో, ఇండియా టీమ్‌లోని స్ట్రాంగ్ పాయింట్స్ ఏమిటో హారికకు బాగా తెలుసు. బలాబలాలు బేరీజు వేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు.‘మనం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నంత కాలం చెస్‌ను కొనసాగించవచ్చు. వయసు ముఖ్యం కాదు. నేను బాగా ఆడగలుగుతున్నాను అనిపించినంత కాలం ఆడతాను. కుటుంబ బలం నా అదృష్టం’ అంటోంది హారిక.