Business
-
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.39 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,369.92 వద్ద, నిఫ్టీ 72.75 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 23,459.95 వద్ద నిలిచాయి.హిందాల్కో, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ట్రెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసిందిఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
అమెజాన్ బెంగళూరు హెడ్‌క్వార్టర్స్ తరలింపు
ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా బెంగళూరులోని తన కార్పోరేట్ ప్రధాన కార్యాలయాన్ని వేరొక చేటుకు తరలిస్తోంది. చాలా కాలంగా ఉంటున్న బెంగళూరు వాయువ్య ప్రాంతం నుండి నగరంలోని విమానాశ్రయానికి సమీపంలోకి మారుస్తోది. నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో భాగంగా హెడ్‌క్వార్టర్స్ తరలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.అమెజాన్ ఇండియా తన కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రస్తుతం మల్లేశ్వరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలోని 30-అంతస్తుల భవనంలో 18 అంతస్తులలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఖాళీ చేస్తుండటంతో అంత భారీ విస్తీర్ణాన్ని కొత్తగా అద్దెకు తీసుకునే సంస్థ దొరకడం కష్టమే.అమెజాన్ ఇండియా కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ కోసం డబ్ల్యూటీసీలో చదరపు అడుగుకు రూ.250 చొప్పున చెల్లిస్తుండగా కొత్త భవనంలో అద్దె ఇందులో మూడింట ఒక వంతు కంటే తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఆదా అవుతుందని అంచనా. తరలింపు ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై 2026 ఏప్రిల్‌లో ముగుస్తుంది.🚨 Amazon India is moving its headquarters from WTC building in Bengaluru near to the city's airport to save costs. pic.twitter.com/WItCV9suYP— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2024 -
ఎక్స్‌కు బై చెబుతున్న యూజర్లు.. మస్క్ వైఖరి మారిందా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ట్రంప్ విజయం ఖరారు అయినప్పటి నుంచి క్రమంగా ఇలాన్‌మస్క్ ఆధ్యర్యంలోని ఎక్స్ వినియోగదారులు తగ్గిపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే అందుకు మస్క్ అవలంభిస్తున్న విధానాలే కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే అదనుగా ట్విటర్(ప్రస్తుతం ఎక్స్) సహవ్యవస్థాపకులు జాక్ డోర్సే తయారు చేసిన ‘బ్లూస్కై’ వినియోగదారులు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.డొనాల్డ్ట్రంప్ విజయానికి మస్క్ తీవ్రంగా కృషి చేశారు. రిపబ్లికన్ పార్టీకి తన వంతుగా దాదాపు రూ.900 కోట్లకు పైనే విరాళం అందించారు. ఎన్నికల ప్రచారంలోనూ యాక్టివ్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ తటస్థతపై ప్రశ్నలొస్తున్నాయి. 2022లో ట్విటర్ చేజిక్కించుకున్న సమయంలో మస్క్ మాట్లాడుతూ..‘ప్రజల్లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)పై విశ్వాసం పెరగాలంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలి’ అన్నారు. కానీ, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో తన వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుకు ముందు ‘ఈసారి తన పదవీకాలం ముగిసే సమయానికి ట్రంప్‌నకు 82 ఏళ్లు వస్తాయి. దాంతో ఏ కంపెనీకు తాను సీఈఓగా ఉండేందుకు వీలుండదు. తర్వాత అమెరికాకు సారథ్యం వహించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది’ అన్నారు. మస్క్ ఎక్స్‌ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి అందులో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతోందనే వాదనలున్నాయి. ద్వేషపూరిత ప్రసంగాలు ప్రసారం జరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.వారంలో 10 లక్షల వినియోగదారులు ఇదిలాఉండగా, ట్విటర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థాపించిన బ్లూస్కై యాప్‌కు వినియోగదారులు పెరుగుతున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వీరి సంఖ్య మరింత ఎక్కువవుతోంది. ఎన్నికల తర్వాత వారం రోజుల్లోనే ఒక మిలియన్ కంటే ఎక్కువ కొత్త వినియోగదారులను సంపాదించినట్లు కంపెనీ ప్రతినిధి ఎమిలీ లియు తెలిపారు. వీరిలో అధికంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రిటన్‌కు చెందినవారని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగ ప్రకటనలో వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపుబ్లూస్కై అంటే ఏమిటి?జాక్ డోర్సే 2019లో బ్లూస్కైను ప్రారంభించారు. ఇది ఎక్స్, ఫేస్బుక్ మాదిరిగానే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. 2022లో మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దీని ప్రచారాన్ని పెంచారు. ఈ ప్లాట్ఫామ్లో తాజాగా రాపర్ ఫ్లేవర్ ఫ్లావ్, రచయిత జాన్ గ్రీన్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, చస్టెన్ బుట్టిగీగ్, మెహదీ హసన్, మోలీ జోంగ్-ఫాస్ట్ వంటి ప్రముఖులు చేరారు. ప్రస్తుతం ఈ యాప్ 14.7 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. యూఎస్ ఎన్నికల తర్వాత అమెరికా, యూకేలో యాపిల్ స్టోర్ డౌన్లోడ్ చార్ట్‌ల్లో తరచుగా ఇది అగ్రస్థానంలో నిలుస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. -
వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపు
భారత్‌లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్‌కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతిఫాక్స్కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్‌లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్‌ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు. -
మళ్లీ రేటెక్కిన బంగారం
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ రేటెక్కాయి. సోమవారం (నవంబర్ 18) పసిడి రేట్లు సుమారుగా పెరిగాయి. దీంతో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం తిరిగి రూ.70 వేల మార్కును దాటింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పుత్తడి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ఇక్కడ చూద్దాం..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.600 పెరిగి రూ.69,950 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.660 ఎగసి రూ. 76,310 వద్దకు హెచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.600 పెరిగి రూ.70,100 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.660 ఎగిసి రూ.76,460 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాSilver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.ఇన్ఫోసిస్‌ను 1981లో నారాయణ మూర్తి, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలుసేనాపతి గోపాలకృష్ణన్సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్‌ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్‌హోమ్, కాగాజ్, ఎన్కాష్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. -
సెలబ్రిటీలు కూడా కొనలేకపోతున్న ఇల్లు ఇది!
సాధారణంగా వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ముంబైలోని ఒక పెంట్‌హౌస్ వార్తల్లో నిలిచింది. రూ.120 కోట్లకు అమ్మకానికి పెట్టిన ఈ ఇంటికి ‘అర్హులైన’ కొనుగోలుదారు దొరకడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రూ.కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు.వన్ అవిఘ్నా పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల ఈ పెంట్ హౌస్ గ్లాస్-వాల్డ్ ఎలివేటర్, రూఫ్‌టాప్ పూల్, జిమ్, ఆరు బెడ్రూమ్లు, ఎనిమిది వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన ఆఫర్లు ఉన్నప్పటికీ, యజమాని కఠినమైన ఎంపిక ప్రమాణాల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు.డబ్బుకు మించి..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. “ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు. కొనుగోలుదారు సరైన వ్యక్తి అని మేము నిర్ధారించుకోవాలి" అని అగర్వాల్ వివరించారు.సేల్‌ను పర్యవేక్షించేందుకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవి కేవల్రమణితో సహా ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతోపాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందు కోసం కొనుగోలుదారుల ఆఫీస్‌లను సైతం సందర్శించాలని ఏజెంట్లకు సూచనలు ఉండటం గమనార్హం.స్క్రీనింగ్‌లో ఫెయిల్బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్దీ ప్రముఖులు పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, యజమాని నిర్ణయించిన కఠినమైన అర్హతలను ఎవరూ అందుకోలేకపోతున్నారు. పరిశ్రమలోని కొన్ని పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్ ప్రక్రియలో అర్హత సాధించలేదని కేవల్రమణి తెలిపారు. "మేము పొరుగువారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతోపాటు తమ సంపదను చాటుకోని గుణం ఉన్నవారు కావాలి" అని ఆయన చెప్పారు.ఒకవేళ తాము కోరుకుంటున్న సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు రూ.40 లక్షలకు ఈ పెంట్‌హౌస్‌ను అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. అయితే అద్దెకు వచ్చేవారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ వర్తిస్తుంది. View this post on Instagram A post shared by Ravi Kewalramani (@rk.ravikewalramani) -
యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలు
భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా ఉన్న పెగాట్రాన్‌లో 60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల ఈమేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దాంతో భారత్‌లో యాపిల్ ఉత్పత్తులు తయారీ చేసే కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్‌లో నిలిచింది.యాపిల్ సంస్థ చైనా భయట ఇతర దేశాల్లో తన ఉత్పత్తిని పెంచేలా ఇండియాలో ఉత్పాదకతను పెంచుతోంది. దానికోసం టాటా గ్రూప్, ఫాక్స్కాన్తోపాటు ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కానీ కొన్ని చిన్న కంపెనీల్లోని మేజర్‌వాటాను ఇప్పటికే ఈ సంస్థలు కొనుగోలు చేశాయి. టాటా గ్రూప్ యాపిల్ తయారీదారుగా ఉన్న విస్ట్రన్ కంపెనీను ఇప్పటికే కొనుగోలు చేసింది. తాజాగా పెగాట్రాన్ కంపెనీలో 60 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో స్థానికంగా యాపిల్ ఉత్పత్తులను తయారీని పెంచాలని నిర్ణయించింది.తయారీదారుగా ఉండడం తేలికైన విషయం కాదు..పెగాట్రాన్, టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గత ఏడాది కాలంగా ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘యాపిల్‌కు కాంట్రాక్ట్ తయారీదారుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. తయారీపై మార్జిన్లు కూడా అధికంగానే ఉంటాయి. యాపిల్ ఉత్పత్తుల అధునాతన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీలు అత్యున్నత స్థాయితో ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది. నిత్యం నాణ్యతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నందున ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు’ అని యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో భాగమైన ఒక ఉన్నత అధికారి తెలిపారు. టాటా గ్రూప్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ 16 తయారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: ‘సామాన్యుడిపై భారం తగ్గించండి’పెగాట్రాన్ ఉత్పత్తి సామర్థ్యంపెగాట్రాన్ గత సంవత్సరం దేశీయంగా వినియోగిస్తున్న ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 10 శాతం సహకారం అందించింది. ఈ కంపెనీకి తమిళనాడులో తయారీ యూనిట్ ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ యూనిట్ ఏటా ఐదు మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. -
రిస్క్ తక్కువ.. రాబడులు స్థిరం
రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో రాబడుల చరిత్ర స్థిరంగా ఉంది. గతంలో యూటీఐ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, 2017 అక్టోబర్‌లో సెబీ తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకరణ నిబంధనల అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయగలవు. మెరుగైన అవకాశాలున్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనల పరంగా వెసులుబాటు ఉంటుంది. రిస్క్–రాబడుల సమతుల్యానికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఈ పథకం 2008, 2011, 2020 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్అండ్పీ నిఫ్టీ 500 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం 24 శాతం మేర రాబడులు అందించింది. ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 16.47 శాతం రాబడులు ఇచ్చింది.ఏడేళ్ల కాలంలో ఏటా 14 శాతం, పదేళ్ల కాలంలో ఏటా 12.50 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పోటీ పథకాలతో పోల్చితే రాబడులు కొంత తక్కువగా కనిపించినప్పటికీ.. కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడంలో ఈ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడుల చరిత్ర గొప్పగా లేకున్నా, దీర్ఘకాలానికి మెరుగ్గా ఉంది. స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మెరుగైన రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.27,706 కోట్ల పెట్టుబడులు (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఉన్నాయి. దీర్ఘకాల చరిత్ర ఉండడంతో పెద్ద పథకాల్లో ఒకటి కావడం గమనార్హం. నిర్వహణ ఆస్తుల్లో 96 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.52 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. 3.45 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటులో ఆకర్షణీయ అవకాశాలకు వీలుగా నగదు నిల్వలు కలిగి ఉన్నట్టు అర్థమవుతోంది.ఈక్విటీ పెట్టుబడులు గమనించగా, 70 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్‌లో 28 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. టాప్–10 స్టాక్స్‌లోనే 42 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఇస్తూ, 22 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 22 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ రంగానికి 18 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 23,555కు చేరింది. సెన్సెక్స్ 54 పాయింట్లు ఎగబాకి 77,631 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.32 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.24 శాతం దిగజారింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ.22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘సామాన్యుడిపై భారం తగ్గించండి’
బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2025లో ప్రకటించే కేంద్ర బడ్జెట్లో మార్పులు చేయాలంటూ కొన్ని ఆర్థిక సంస్థలు, ప్రజల నుంచి కేంద్రానికి వినతులు వస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఎక్స్ పేజ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలిపారు.ఎక్స్ వేదికగా తుషార్ శర్మ అనే వ్యక్తి సామాన్యుడిపై పన్ను భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ‘@nsitharaman దేశాభివృద్ధికి మీరు చేస్తున్న సహకారం, ప్రయత్నాలను ఎంతో అభినందిస్తున్నాను. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇది నా హృదయపూర్వక అభ్యర్థన మాత్రమే’ అని తుషార్ శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ ‘మీ మాటలు, అవగాహనకు ధన్యవాదాలు. నేను మీ అభ్యర్థనను అభినందిస్తున్నాను. నరేంద్రమోదీ ప్రభుత్వం సమస్యలపై స్పందించి చర్య తీసుకునే ప్రభుత్వం. ప్రజల అభిప్రాయాలను వింటోంది. వాటికి తగినట్లు ప్రతిస్పందిస్తోంది. మీ అభ్యర్థన చాలా విలువైంది’ అని రిప్లై ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ 2025 ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జులైలో ఆర్థిక మంత్రి తెలిపారు.Thank you for your kind words and your understanding. I recognise and appreciate your concern.PM @narendramodi ‘s government is a responsive government. Listens and attends to people’s voices. Thanks once again for your understanding. Your input is valuable. https://t.co/0C2wzaQtYx— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2024ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!గతంలో మంత్రి స్పందిస్తూ ‘నేను మధ్యతరగతి వారికి విభిన్న రూపాల్లో మేలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను పన్ను రేటును తగ్గించి వారికి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచాం. అదనంగా అధిక ఆదాయ వర్గాలకు పన్ను రేటు పెంచాం. సామాన్యులపై పన్ను రేట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టాం’ అని చెప్పారు. -
అనిల్ అంబానీ భారీ ప్లాన్..
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్‌ని (ఆర్జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడనుంది.సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్‌కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్‌లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆర్‌కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ.. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్‌కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ! -
డెట్ ఫండ్స్‌లోకి రూ.1.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు అక్టోబర్‌లో డిమాండ్ ఏర్పడింది. ఏకంగా రూ.1.57 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్ నెలలో ఇదే విభాగం నుంచి రూ.1.14 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోగా, మరుసటి నెలలోనే పరిస్థితుల్లో పూర్తి మార్పు కనిపించింది.ముఖ్యంగా డెట్‌లో మొత్తం 16 కేటగిరీలకు గాను 14 విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో డెట్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) 11 శాతం వృద్ధితో అక్టోబర్ చివరికి రూ.16.64 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ చివరికి ఇవి రూ.14.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.స్వల్పకాల ఫండ్స్‌కు ఆదరణ » లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా 83,863 కోట్లను రాబట్టాయి. అక్టోబర్ నెలలో మొత్తం డెట్ పెట్టుబడుల్లో సగం లిక్విడ్ ఫండ్స్‌లోకే వచ్చాయి. » ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.25,784 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.25,303 కోట్ల చొప్పున ఆకర్షించాయి. » అల్ట్రా షార్ట్ డ్యురేషన్ (12 నెలల్లోపు) ఫండ్స్‌లోకి రూ.7,054 కోట్లు వచ్చాయి. » లో డ్యురేషన్ ఫండ్స్ రూ.5,600 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.4,644 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.1,362 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ప్రధానంగా తక్కువ కాలానికి ఉద్దేశించని డెట్ ఫండ్స్‌కు ఆదరణ లభించింది. » నాలుగు నెలల విరామం తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.936 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. » గిల్ట్ ఫండ్స్ రూ.1,375 కోట్లు, లాంగ్ డ్యురేషన్ బాండ్ ఫండ్స్ రూ.1,177 కోట్ల చొప్పున ఆకర్షించాయి. -
ట్యాక్స్ ప్లానింగ్.. సరిగమపదని..
‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోండి. ’ఎగవేత’ భూతం ’కబంధ’ హస్తాల నుంచి బైటపడ్డాం. ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ మీద దృష్టి సారించి, ప్లానింగ్ రాగాల్లో స,రి,గ,మ,ప,ద,ని తెలుసుకుందాం. గత దశాబ్దంగా మనం వింటున్న పదం.. జనాలు నలుగురు మెచ్చిన పదం ’మేనేజ్మెంట్’.. కేవలం కంపెనీలు, కార్పొరేట్లు, వ్యాపారం, వాణిజ్య రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ’మేనేజ్మెంట్’ కంపల్సరీ. సంస్థలతో బాటు వ్యక్తులకు, మనందరికీ వర్తించేది ’మేనేజ్మెంట్’. ట్యాక్స్‌ని మేనేజ్ చేయాలి. ట్యాక్స్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన ప్రాథమిక అంశం, కీలకాంశం ’ట్యాక్స్ ప్లానింగ్’. ఇది క్రియాశీలక చర్య .. చర్చ!ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాచట్టరీత్యా, రాచమార్గంలో పన్నుభారాన్ని తగ్గించే మార్గం. అవసరం అయినంత, అర్హత ఉన్నంత .. అన్ని ప్రయోజనాలు, తగ్గింపులు, మినహాయింపులు పొంది, ఆదాయాన్ని తగ్గించుకోవడం లేదా పెద్ద శ్లాబు నుంచి తక్కువ/చిన్న శ్లాబుకి తెచ్చుకోవడం, 30 శాతం నుంచి 20 శాతానికి, 20 శాతం నుంచి 10 శాతానికి, ఇంకా 10 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించుకోవడం.ట్యాక్స్ ప్లానింగ్ మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలికం.. అంటే ఆ సంవత్సరానికి పన్ను తగ్గించుకోవడం. దీర్ఘకాలికం.. అంటే భవిష్యత్‌లో పన్నుని తగ్గించుకోవడం. మూడోది, విరాళాల ద్వారా తగ్గించుకోవడం.పన్ను తగ్గించుకోవడం: స్వల్పకాలికంగా గానీ దీర్ఘకాలికంగా గానీ పన్నులను తగ్గించుకోవడం.పోస్ట్‌పోన్ చేసుకోవడం: ఈ విధంగా ఎప్పుడు చేసుకోవచ్చంటే.. బడ్జెట్‌కు ముందు.. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మార్చి 31 లోపల లేదా ఏప్రిల్ 1 తర్వాత.. స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఇలా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.పన్ను భారాన్ని విభజించుట: ఒకే మనిషి మీద ఎక్కువ ట్యాక్స్ పడే పరిస్థితుల్లో ఆదాయాన్ని చట్టప్రకారం అగ్రిమెంట్ల ద్వారా ఆదాయాన్ని విభజించడం. ఉదాహరణకు ఆలుమగలు వారి పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్లను మార్చి వడ్డీ సర్దుబాటు చేసుకోవచ్చు.తప్పించుకోవడం: సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం తప్పించుకోవడాన్ని చట్టరీత్యా కూడా చేయొచ్చు. చట్టంలోని లొసుగుల్లోని అంశాలకు లోబడి పన్ను తప్పించుకోవచ్చు. ఉదాహరణకు భార్యా, భర్త ఇద్దరికీ పన్నుభారం వర్తిస్తుంది. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ స్కూల్ ఫీజులు కడుతున్నారు. అలాంటప్పుడు ఇద్దరి స్కూల్ ఫీజును ఒకరి కేసులో, మిగతా పిల్లల ఫీజును మరొక కేసులో క్లెయిం చేయొచ్చు. ఒకరకంగా కాకుండా మరో విధంగా కట్టడాన్ని ఇంగ్లీషులో disguise taxation అని అంటారు. మారువేషం కాదు. మరో వేషంలాంటిది. అంటే, చేసే వ్యాపారం భాగస్వామ్యం లేదా కంపెనీలాగా చేస్తే 30 శాతం పన్ను పడుతుంది. అలా కాకుండా సొంత వ్యాపారంగా చేస్తే శ్లాబుల వారీగా 10 శాతం, 20 శాతం, 30 శాతం చొప్పున కట్టొచ్చు. బేసిక్ లిమిట్ కూడా వర్తిస్తుంది.సంపూర్తిగా ఆలోచించాలి: పాటల ట్యూనింగ్లాగే ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. గీత రచనను బట్టి స్వర రచన. ఏదైనా ఏడు స్వరాల్లో ఇమడాలి. పూర్తి సమాచారం ఉండాలి. చట్టాన్ని అతిక్రమించకూడదు. పన్ను భారం తగ్గాలి, చట్టప్రకారం జరగాలి.పన్నుకు సంబంధిచిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ-మెయిల్ పంపించగలరు -
విదేశీ విద్యా రుణాలు.. కీలకమైన 7 అంశాలు..
ఇటీవలి కాలంలో విదేశీ విద్యను కోరుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో విద్యా రుణాలకు కూడా డిమాండ్ నెలకొంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన విద్యా రుణాలను అందించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ ప్రక్రియలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన 7 కీలకాంశాలపై అవగాహన కల్పించేందుకే ఈ కథనం. ⇒ మొత్తం ఖర్చులపై అవగాహన ఉండాలి: విద్యార్థులు విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ట్యూషన్‌తో పాటు వసతి, జీవన వ్యయాలు, ప్రయాణ ఖర్చులు, బీమా, ఇతరత్రా అనుకోకుండా తలెత్తే ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా ఎంత రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనేది తెలుస్తుంది. అవసరానికి మించి తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఈ లెక్కలు వేసుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ కాల్క్యులేటర్, కాలేజ్ కోర్స్ ఎక్స్పెన్సెస్ కాల్క్యులేటర్ వంటి టూల్స్ ఉపయోగపడతాయి. ⇒ సమగ్ర పరిశోధన అవసరం: ఈ దశ పూర్తయ్యాక, అందుబాటులో ఉన్న వివిధ రుణాల ఆప్షన్లు, అర్హతలు, వడ్డీ రేట్లు, మంజూరు విధానాలు, తిరిగి చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు, సహ–రుణగ్రహీత అవసరాలు, హామీలు, ప్రాసెసింగ్ ఫీజులపై పరిశోధన⇒ ఖర్చులన్నింటికీ సరిపోయేలా ఉండాలి: కొత్త తరం ఎన్బీఎఫ్సీలు సమగ్ర విద్యా రుణాలను అందిస్తున్నాయి. అంటే ట్యూషన్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, లెరి్నంగ్ డివైజెస్ కొనుగోలు, జీవన వ్యయాలు మొదలైన అన్నింటికీ ఉపయోగపడే విధంగా లోన్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చదువు, కెరియర్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. ⇒ డాక్యుమెంటేషన్ ప్రధానం: విద్యార్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్ తయారు చేసుకోవాలి. వాటన్నింటినీ సరిగ్గా సమరి్పస్తే సకాలంలో రుణాన్ని మంజూరు చేసే అవకాశాలు మెరుగుపడతాయి. ⇒ వేల్యుయేషన్‌పై అవగాహన ఉండాలి: రుణ ప్రొఫైల్స్‌ను మదింపు చేసేందుకు విద్యారి్థ–కేంద్రీకృత విధానాన్ని కొత్త తరం ఎన్బీఎఫ్సీలు అమలు చేస్తున్నాయి. సహ–రుణగ్రహీత ఆర్థిక నేపథ్యంపైనే ఆధారపడకుండా విద్యార్థి అకడమిక్ పనితీరు, ప్రవేశ పరీక్ష స్కోర్లు, ఎంచుకున్న కోర్సు .. యూనివర్సిటీ, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ⇒ వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలి: ముందస్తు అప్రూవల్ ప్రక్రియను పూర్తి చేయడానికి, పత్రాలు తనిఖీ చేయడానికి, రుణాన్ని ఖరారు చేయడానికి ఆర్థిక సంస్థకు కొంత సమయం అవసరవుతుంది. సంస్థను బట్టి అప్రూవల్ ప్రక్రియ వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే నిరీ్ణత సమయానికి రుణం మంజూరయ్యేలా చూసుకోవడానికి వీలవుతుంది. ⇒ స్మార్ట్ రీపేమెంట్ వ్యూహం ప్లాన్ చేసుకోవాలి: లోన్ తీసుకున్న తర్వాత నుంచి వడ్డీని కొంత కొంతగా కట్టుకుంటూ వెళ్లడం మంచిది. ఎందుకంటే గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ ఆ వ్యవధిలో వడ్డీ పడకుండా ఉండదు. ముందు నుంచి చెల్లించడం ప్రారంభిస్తే విద్యార్థులు ఆర్థికంగా మెరుగైన అలవాట్లను పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. -
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచిగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. వివరాలు చూద్దాం.న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు దాదాపు ముగియనున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు, గణాంకాలవైపు దృష్టి సారించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం(20న) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. 288మంది సభ్యుల మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు పారీ్టలు ఎన్నికలలో పోటీ పడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్ ఎఫెక్ట్ కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. గత వారాంతాన ఒక దశలో 106.66ను తాకింది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. గురువారం(14న) రూపాయి సరికొత్త కనిష్టం 84.41 వద్ద ముగిసింది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. గత వారం చివర్లో 4.5 శాతానికి చేరాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. రియల్టీ రంగానికి వెసులుబాటు కల్పించింది. 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్టీగేజ్ రుణ వ్యయాలుసహా.. డౌన్ పేమెంట్‌ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివెళుతున్నాయి. ఈ వారం జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ నిరుద్యోగిత, తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. 10 శాతం దిద్దుబాటు.. గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 1,906 పాయింట్లు కోల్పోయి 77,580 వద్ద ముగిసింది. వెరసి రికార్డ్ గరిష్టం(86,000స్థాయి) నుంచి 8,395 పాయింట్లు(10 శాతం) పడిపోయింది. ఇక గత వారం నిఫ్టీ సైతం 616 పాయింట్లు క్షీణించి 23,533 వద్ద స్థిరపడింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టం(26,277) నుంచి 2,745 పాయింట్లు పతనమైంది.వర్ధమాన మార్కెట్లకు దెబ్బయూఎస్ బాండ్ల ఈల్డ్స్, డాలరు బలపడటంతో వర్ధమాన మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. క్యూ2 ఫలితాల సీజన్ ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల తీరు ఆధారంగా కదలవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరించే వీలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు.అమ్మకాల బాటలోనే...దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. యూఎస్ డాలర్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలిమి, చైనా ప్యాకేజీలు, దేశీ మార్కెట్ల గరిష్ట విలువల కారణంగా అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత నెల(అక్టోబర్)లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఈ స్థాయిలో రూ. 61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే ఈ ఏడాది సెపె్టంబర్లో 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
మ్యూచువల్ ఫండ్ ఎంపిక ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్‌ను దీర్ఘకాలానికి ఎంపిక చేసుకునే సమయంలో గత పనితీరుపై ఆధారపకుండా.. చూడాల్సిన ఇతర అంశాలు ఏవి? – వినుత్ రాయ్ కేవలం గత పనితీరుపైనే ఆధారపడడం తప్పుదోవలో పయనించడమే అవుతుంది. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచి్చందంటే, అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి కారణం అంతర్గతంగా అవి పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీలే. కనుక ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ చేసి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ ఉత్థాన పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గృహ రుణం, కారు రుణం, క్రెడిట్ కార్డు రుణాలున్నాయి. వీటి కోసం ప్రతి నెలా రూ.40,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రుణాలను తీర్చివేసే మార్గాన్ని చూపగలరు? – ప్రేమ్ నాయక్ రుణాలు భవిష్యత్ ఆదాయాన్ని హరించివేస్తాయి. కనుక వీలైనంత వెంటనే వాటిని వదిలించుకోవాలి. ముఖ్యంగా వీటిల్లో ఆర్థిక భారంగా మారిన రుణాన్ని మొదట తీర్చివేయాలి. ముందుగా క్రెడిట్ కార్డు రుణంతో మొదలు పెట్టండి. అధిక వడ్డీ రేటుతో ఖరీదైన రుణం ఇది. అవసరమైతే మీ పెట్టుబడుల్లో కొన్నింటిని ఉపసంహరించుకుని క్రెడిట్‌కార్డు రుణం తీర్చివేయాలి. లేదంటే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అయినా దీన్నుంచి బయటపడే మార్గాన్ని చూడండి. క్రెడిట్ కార్డ్ రుణం చెల్లించిన అనంతరం కారు రుణాన్ని తీర్చివేయడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వాహనాల విలువ స్వల్పకాలంలోనే తగ్గిపోతుంది. కనుక వీలైనంత ముందుగా ఈ రుణాన్ని కూడా తీర్చివేయాలి. గృహ రుణాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో విలువ పెరిగే ఆస్తి ఇది. పైగా గృహ రుణాలపై అన్నింటికంటే తక్కువ వడ్డీ రేటుతోపాటు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. -
పిల్లల బీమా.. ఇవ్వదు ధీమా..!
తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల్లో పిల్లల విద్య ఒకటి. విద్యా వ్యయాలు ఏటేటా 10 శాతానికి మించి పెరుగుతున్నాయి. సాధారణ ద్రవ్యోల్బణం 5.5 శాతంతో పోల్చితే రెట్టింపు స్థాయి ద్రవ్యోల్బణం విద్యారంగంలో చూడొచ్చు. దీని కారణంగా నేడు ఒక కోర్స్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుంటే.. 13 ఏళ్ల తర్వాత (ఉన్నత విద్యకు వచ్చే సరికి) రూ.1.09 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ముందస్తు ప్రణాళికతోనే ఈ వ్యయాలను అధిగమించడం సులభమవుతుంది.పాఠశాల ప్రవేశం నాటి నుంచే పిల్లల విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించాలి. భవిష్యత్‌లో ఎంత అవసరమో, ఆ మేరకు సమకూర్చుకునే విధంగా ప్రతి నెలా పొదుపు, మదుపు చేస్తూ వెళ్లాలి. ఇందుకు ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలకంగా మారతాయి. ఇక్కడ తప్పటడుగులు వేస్తే పిల్లల ఉన్నత విద్య కోసం రేపు అప్పు చేయాల్సి రావచ్చు. కేవలం చైల్ట్ ఇన్సూరెన్స్ పాలసీలతో విద్యా వ్యయాలను తట్టుకోవడం కష్టమే. ఈ దిశగా అవగాహన కల్పించే కథనమిది... తల్లిదండ్రుల్లో ఎంత మంది తమ పిల్లల భవిష్యత్ విద్యకు సన్నద్ధంగా ఉన్నారు? ఇదే తెలుసుకుందామని హెచ్ఎస్బీసీ సంస్థ ఓ సర్వే చేసింది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్ రిపోర్ట్ 2024’ పేరుతో నివేదిక విడుదల చేసింది. 53 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం పెట్టుబడులు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే తమ పిల్లలే విద్యా రుణం తీసుకుంటారని 40 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. కొందరు ఆస్తులు అమ్మి చదివిస్తామని చెప్పగా, స్కాలర్íÙప్ మార్గాలు చూస్తామని కొంతమంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ, పిల్లల పేరిట పెట్టుబడులు చేస్తున్న వారిలో ఎంత మంది మెరుగైన సాధనాలను ఎంపిక చేసుకున్నారన్నది ఈ సర్వే తేల్చలేదు. మొత్తానికి సగం మందికి ఆర్థిక ప్రణాళిక లేదని స్పష్టమవుతోంది. తల్లిదండ్రులకు ఏదైనా జరగరానిది జరిగితే... పిల్లల విద్యకు ఆరి్థక తోడ్పాటు అందించే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మార్కెట్లో క్రేజ్ ఉంది. బీమా ఏజెంట్లు వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. నిజానికి వీటిలో చార్జీలు ఎక్కువ. దాంతో రాబడులు కొంత తక్కువ. పిల్లల పేరిట మార్కెటింగ్ చేసే ఉత్పత్తుల వలలో పడకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా బీమా, పెట్టుబడులను కలపడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఈ రెండింటినీ వేర్వేరుగానే చూడాలి.చైల్డ్ ప్లాన్లలో ఏముంది?పిల్లల పేరిట రెండు రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. యూనిట్ లింక్డ్ చి్రల్డన్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్‌లు) ఇందులో ఒక రకం. చెల్లించిన ప్రీమియంలో బీమా రిస్క్, నిర్వహణ, ఇతరత్రా వ్యయాలు పోను మిగిలిన మొత్తాన్ని మార్కెట్ లింక్డ్ (ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత) సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పాలసీదారుల ఎంపిక మేరకు డెట్‌లోనూ పెట్టుబడులు పెడతాయి. వచ్చిన రాబడులను పాలసీదారులకు అందిస్తాయి. ఎండోమెంట్ చిల్డ్రన్ ఇన్సూరెన్స్ రెండో రకం. ఇందులోనూ బీమా రిస్క్, ఇతర వ్యయాలు పోను మిగిలిన ప్రీమియాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.పాలసీదారులకు హామీ మేరకు రాబడులు అందిస్తాయి. కానీ, వీటిలో రాబడులు 5–6 శాతం మించవు. ఈక్విటీ ఆధారిత యులిప్ ప్లాన్లలో రాబడులు కాస్త అధికంగా ఉంటాయి. కాకపోతే గ్యారంటీడ్ కావు. మార్కెట్ పనితీరుపైనే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ రెండు రకాల ప్లాన్లలోనూ, పాలసీ కాల వ్యవధి ముగియక ముందే పాలసీదారు (తల్లి లేదా తండ్రి) మరణించినా లేక కాల వ్యవధి ముగిసేవరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి మధ్యలో పాలసీదారు మరణించినట్టయితే, అప్పుడు బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి పెట్టుబడులను కొనసాగించి, యథాప్రకారం పాలసీ ప్రయోజనాలను అందిస్తుంది. దాంతో పిల్లల ఉన్నత విద్యకు ఆ నిధిని ఉపయోగించుకోవచ్చు. ‘‘దురదృష్టవశాత్తూ తల్లి లేదా తండ్రి మరణించినట్టయితే పరిహారం చెల్లించే ఈ పథకాలు పిల్లలకు ఉపయోగపడతాయి. ప్రీమియం వేవర్ ముఖ్యమైన సదుపాయం. పాలసీదారు మరణించినట్టయితే ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యాక్టివ్‌గా కొనసాగుతుంది. పిల్లల విద్యా లక్ష్యాలకు కావాల్సినంత మేర సమకూరుతుంది’’ అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ యాక్చువరీ ఆదిత్య మాల్ వివరించారు. పాలసీదారు మరణించినప్పటికీ గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, ఇతర ప్రయోజనాలు యథావిధిగా అందుతాయని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మధుపం కృష్ట సైతం తెలిపారు. సమ్ అష్యూర్డ్ (బీమా) వెంటనే చెల్లించి, మిగిలిన ప్రయోజనాలను పాలసీ గడువు ముగిసిన తర్వాత చెల్లించేవి ఉన్నాయి.లాకిన్ పిరియడ్... ఎండోమెంట్, యులిప్ ప్లాన్లు లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. సాధారణంగా ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే మొదటి ఐదేళ్లు ఉపసంహరణకు అనుమతి ఉండదు. ఈ కాలంలో పాలసీని సరెండర్ చేసినా వచ్చేదేమీ ఉండదు. లాకిన్ పీరియడ్ తర్వాత పాక్షికంగా ఉపసహరించుకోవచ్చు. నిర్బంధంగా పెట్టుబడిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ ప్లాన్లలో లాకిన్ ఉంటుంది. వీటిలో ఏజెంట్లకు కమీషన్ మెరుగ్గా ఉంటుంది. ఎంత అధిక ప్రీమియానికి పాలసీలో చేరి్పస్తే ఏజెంట్‌కు అంత అధికంగా కమిషన్ ముడుతుంది. ‘‘టర్మ్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్య. టర్మ్ ప్లాన్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కనుక వీటిని ఏజెంట్లు విక్రయించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు’’అని కృష్ణ వివరించారు.ఆరి్థక ప్రణాళికలో చేసే తప్పుల్లో బీమా, పెట్టుబడి కలపడం ఒకటని ఆనంద్‌రాఠి వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరాగ్ ముని తెలిపారు. ‘‘ఇన్సూరెన్స్, పెట్టుబడి పూర్తి భిన్నమైన ఆరి్థక ఉత్పత్తులు. ఇన్వెస్టర్లు వీటిని కలపకూడదు. ఊహించని నష్టం నుంచి రక్షణ కల్పించడమే బీమా ఉద్దేశం. పెట్టుబడి సాధనం ఉద్దేశం సంపద సమకూర్చుకోవడం’’ అని వివరించారు. ‘‘సంప్రదాయ ఎండోమెంట్ పాన్లలో రాబడులు 4–5 శాతం మేర ఉంటాయి. విద్యా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే సంప్రదాయ బీమా ప్లాన్లలో పెట్టుబడితో మిగిలేదేమీ ఉండదు.చైల్డ్ యులిప్ ప్లాన్లలో 9–11 శాతం మేర రాబడులు వస్తాయి. కాకపోతే ఆరి్థక సైకిల్, మార్కెట్ సైకిల్‌పైనే ఈ రాబడులు ఆధారపడి ఉంటాయి’’ అని కృష్ట తెలిపారు. కనుక సంప్రదాయ ఎండోమెంట్ ఆధారిత చైల్డ్ ప్లాన్లు పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వమని స్పష్టమవుతోంది. ఇక యులిప్ ప్లాన్ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఎంపిక అవుతుంది. వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. చార్జీలు చాలా తక్కువ. యులిప్ ప్లాన్లలో చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. ప్రీమియం అలోకేషన్ చార్జీ, అడ్మిని్రస్టేటివ్ చార్జీ, మోర్టాలిటీ చార్జీ, సరెండర్ చార్జీ, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ ఇన్నేసి చార్జీలు యులిప్‌లలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లోనూ పారదర్శకత ఎక్కువ.మెరుగైన ప్రత్యామ్నాయాలు..చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మెరుగైన ప్రయోజనాన్ని ఇవ్వనప్పుడు వీటికి ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ఊహించనది జరిగితే వారసుల విద్య ఆగిపోకూడదు. కుటుంబ జీవనం ఇబ్బందుల పాలు కాకూడదు. అందుకని జీవిత బీమాతోపాటు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకోవడం మంచి మార్గం అవుతుంది. ‘‘టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీని ఇస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చైల్డ్ ప్లాన్ల కంటే మెరుగైన రాబడులు వస్తాయి.చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ తగినంత ఉండదు. అప్పుడే కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టిన వారికి, తాజాగా రుణం తీసుకున్న వారికి మరింత కవరేజీ అవసరం ఏర్పడుతుంది’’ అని కృష్ట తెలిపారు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోలే పథకాలను ఎంపిక చేసుకోవచ్చని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ రేణు మహేశ్వరి సూచించారు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.కోటి టర్మ్ ఇన్సూరెన్స్ రూ.10–15 వేల ప్రీమియంకే వస్తుంది. కనుక చైల్డ్ ప్లాన్ల కోసం ఏటా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి బదులు.. టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసు కోవాలి.విభిన్న ఫండ్స్...టర్మ్ప్లాన్లోనూ మరణం లేదా అంగవైకల్యం పాలైనప్పుడు చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం మేర తక్షణమే చెల్లించి, మిగిలినది ప్రతి నెలా 10 ఏళ్ల పాటు చెల్లింపుల సదుపాయాలతో టర్మ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఏటా 12 శాతం, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. పదేళ్ల కాలంలో అయితే సగటు వార్షిక రాబడి 20 శాతంగా ఉంది. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్ (సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్)ను ఎంపిక చేసుకోవాలి.ఇందులో చార్జీలు చాలా తక్కువ. సూచీల మాదిరే రాబడులు వీటిల్లో వస్తాయి. మరీ ముఖ్యంగా 7 ఏళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తుంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్స్ పెట్టుబడులు పెట్టే ఫ్లెక్సీక్యాప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, రిస్క్ తక్కువ కోరుకునే వారు మల్టీ అస్సెట్ ఫండ్స్, రిస్క్ ఇంకా తక్కువగా ఉండాలని కోరుకునే వారు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణుల సూచన. పన్ను ప్రయోజనంచైల్డ్ యులిప్ ప్లాన్లలో రాబడులపై పన్ను భారం లేకపోవడాన్ని సానుకూల అంశంగా చెప్పుకోవాలి. దీనికి బదులు టర్మ్‌ప్లాన్ విడిగా తీసుకుని, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఈక్విటీ లాభాలపై స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కదపకుండా, ఒక పథకం నుంచి మరో పథకానికి మార్చకుండా.. స్థిరంగా ఒకే పథకంలో కొనసాగించడం వల్ల అనవసర పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. అయినా సరే ఈక్విటీ పెట్టుబడిని ఉపసంహరించుకున్నప్పుడు అది ఏడాది మించిన కాలం అయితే మొదటి రూ.లక్షకు మించిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఏడాదిలోపు పెట్టుబడులపై వచ్చే లాభం నుంచి 20 శాతం మేర పన్ను కింద చెల్లించాలి. నిపుణుల పెట్టుబడి ప్రణాళికను అనుసరించినట్టయితే అప్పుడు మెరుగైన జీవిత బీమా రక్షణ, ఈక్విటీలపై అద్భుత రాబడులు అందుకోవడానికి అవకాశాలుంటాయి. పన్ను చెల్లింపులు పోను నికర రాబడులు చైల్డ్ ప్లాన్లతో పోల్చితే.. అధికంగానే ఉంటాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ పన్ను ప్రయోజనం కోసమని యులిప్ పాలసీకే మొగ్గు చూపేట్టు అయితే విడిగా టర్మ్‌ప్లాన్ తీసుకోవడం మర్చిపోవద్దు. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ఇక్కడ చూడండి
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ఫోన్ల దగ్గర నుంచి రూ. 6వేలు ధర వద్ద లభించే ఫోన్ల వరకు ఉన్నాయి. ఈ కథనంలో ఆరువేల రూపాయల ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8)మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8' ధర కేవలం రూ.6,699 మాత్రమే. బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే. ఇది రూ. 6వేలకు లభిస్తుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, రెండు కెమెరాలు మొదలైనవి ఉంటాయి. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ పొందుతుంది.ఐటెల్ ఆరా 05ఐ (Itel Aura 05i)రూ.6000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఐటెల్ ఆరా 05ఐ ఒకటి. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. దీని ధర రూ. 5749 మాత్రమే. మల్టిపుల్ కెమెరా ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు.రెడ్మీ ఏ2 (Redmi A2)రూ.5669 వద్ద లభించే రెడ్మీ ఏ2 కూడా ఆరు వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో లభిస్తుంది. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు
అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్‌లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్‌లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.సమ్మె ఎఫెక్ట్సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు. -
పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?
భారతదేశంలో మొత్తం పండుగ సీజన్లో 42 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్ అన్నీ ఉన్నాయి. 2023 ఇదే పండుగ సీజన్లో అమ్ముడైన మొత్తం వాహనాలు 38.37 లక్షల యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో వాహన విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) 2024 పండుగ సీజన్లో 45 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేసింది. అయితే ఊహించిన అమ్మకాలు జరగలేదు, కానీ 2023 కంటే 2024లో సేల్స్ ఉత్తమంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.2023లో ద్విచక్ర వాహనాల సేల్స్ 29.10 లక్షల యూనిట్లు కాగా.. 2024లో 33.11 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది అమ్మకాలు 13.8 శాతం వృద్ధి చెందాయి. త్రీ వీలర్స్ సెల్స్ 2023లో 1.50 లక్షల యూనిట్లు.. 2024లో 6.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లకు చేరింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..కమర్షియల్ వాహన విక్రయాలు 2023లో 1.27 లక్షల యూనిట్లు.. కాగా 2024లో 1.29 లక్షల యూనిట్లు. ఈ విభాగంలో అమ్మకాలు 1 శాతం పెరిగింది. ప్యాసింజర్ వాహన సేల్స్ 2023లో 5.63 లక్షల యూనిట్లు, 2024లో 6.03 లక్షల యూనిట్లు. ఇలా మొత్తం మీద 2024లో మొత్తం వాహనాల సేల్స్ 42 లక్షల యూనిట్లను అధిగమించింది. -
ఢిల్లీ చేరుకున్న 1,341 టన్నుల ఉల్లి: ఎందుకంటే..
దేశ రాజధానిలో ఉల్లి ధరలకు చెక్ పెట్టే లక్ష్యంతో.. ఉల్లి గడ్డలతో నిండిన ఒక ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి చేరుకుంది. నాసిక్ నుంచి ప్రత్యేక గూడ్స్ రైలులో సుమారు 1,341 టన్నుల ఉల్లి ఢిల్లీకి చేరుకున్నట్లు.. నార్త్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.పొలాల నుంచే నేరుగా ఉల్లి కొనుగోలు చేస్తే.. రవాణా సమయం, ఖర్చులు వంటివి కూడా తగ్గుతాయి. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ప్రజలకు కూడా కొంత తక్కువ ధరకే ఉల్లిని విక్రయించవచ్చు. పలు నగరాల్లోని మార్కెట్లలో ఉల్లి ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టన్నుల ఉల్లి.. ఢిల్లీకి చేరుకోవడంతో వారందరూ అధిక ధరల నుంచి ఉపశమనం పొందవచ్చు.గతంలో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున ఉల్లి సరఫరా చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రజల మీద ధరల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతోనే సెప్టెంబర్‌లో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేదించింది. ఏప్రిల్-జూన్‌లో పండించిన ఉల్లి మరి కొన్ని రోజుల వరకు వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది.