Sakshi Special
-
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
ఇజ్రాయెల్‌లో సార్వత్రిక సమ్మె
టెల్ అవీవ్: హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీల దారుణ హత్యపై ఇజ్రాయెలీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించడంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం ఇజ్రాయెల్ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. కారి్మక సంఘాల పిలుపు మేరకు బ్యాంకులు, ఆరోగ్య విభాగాలు, రవాణా సంస్థలు సహా చాలా వరకు మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు కొద్దిసేపు మాత్రమే పనిచేశాయి. ప్రధానమైన బెన్ గురియెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8–10 గంటల మధ్య టేకాఫ్ సేవలు నిలిచిపోయాయి. వేలాదిగా పౌరులు వీధుల్లోకి వచ్చారు. టెల్అవీవ్తోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో కనీసం 5 లక్షల మంది పాలుపంచుకున్నారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో వారంతా సురక్షితంగా వెనక్కి వచ్చి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బందీలుగా ఉన్న 100 మందిని వెనక్కి తీసుకువచ్చేందుకు వెంటనే హమాస్‌తో ఒప్పందం చేసుకోవాలన్నారు. అయితే, సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కారి్మక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సమ్మెను మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగించాలని స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని దేశంలోని అతిపెద్ద కారి్మక సంఘం హిస్ట్రాదుట్ నేత అర్నాన్ బ్రార్ డేవిడ్ తెలిపారు. తమ వారిని వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. సమ్మె కారణంగా ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడలేదని వివరించారు. ఒప్పందానికి నెతన్యాహు సానుకూలంగా లేరు: బైడెన్ ఇజ్రాయెల్‌లో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తి చూపడం లేదన్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సలహాదారులతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్నారు. -
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఆర్థిక కష్టాలు!
ఒట్టావా: కెనడాలో విద్యనభ్యసిస్తూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసే భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఇకపై ఒక వారమంతా కలిపి 24 గంటలపాటు మాత్రమే కాలేజీక్యాంపస్ బయట పనిచేసే అవకాశం కలి్పస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. కోవిడ్ సంక్షోభకాలంలో చిరు ఉద్యోగాల్లో తీవ్రమైన కొరత నెలకొనడంతో ఉద్యోగసంక్షోభాన్ని నివారించేందుకు కెనడా ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న ‘వారానికి 20 గంటల పని’పరిమితిని ఎత్తేసింది. దాంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఎక్కువ గంటలపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసేవారు. దీంతో విద్యార్థుల అద్దె, సరుకులు, ఇతరత్రా ఖర్చుల భారం కాస్తంత తగ్గింది. వారానికి 20గంటల పని పరిమితికి ఇచి్చన సడలింపు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ముగిసింది. ఈ పరిమితికి మరో నాలుగు గంటలు జత చేసి ‘వారానికి 24 గంటల నిబంధన’ను తీసుకొస్తున్నారు. ఇది ఈ వారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో కెనడాలోని భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు మళ్లీ చుట్టుముట్టనున్నాయి. 2022 ఏడాదిలో కెనడాకు 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు రాగా అందులో 2.26 లక్షల మంది భారతీయులేకావడం గమనార్హం. విద్యార్థి వీసాల మీద ప్రస్తుతం కెనడాలో 3.2 లక్షల మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు(గిగ్ వర్కర్లు)గా పనిచేస్తూ కెనడా ఆర్థికవ్యవస్థ బలోపేతానికి తమ వంతు కృషిచేస్తున్నారు. ఆఫ్–క్యాంపస్ ఉద్యోగాలతో అక్కడి విదేశీ విద్యార్థుల చేతికొచ్చే చిన్న మొత్తాలు.. విద్యార్థుల నెలవారీ కనీస అవసరాలు తీర్చేవి. పనివేళల నిబంధనల ప్రకారం ఒకేసారి డ్యూటీలో గరిష్టంగా 8 గంటలే పనిచేయొచ్చు. ఈ లెక్కన కొత్త నిబంధన ప్రకారం భారతీయ విద్యార్థులకు వారంలో కేవలం మూడ్రోజులే పని దొరికే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది మే నెల నుంచి కొత్త నిబంధనల ప్రకారం గంటకు 17.36 కెనడియన్ డాలర్ల కనీస వేతనం చెల్లిస్తున్నారు. గత ఏడాది ఈ వేతనం 16.65 కెనడియన్ డాలర్లుగా ఉండేది. దీంతో టొరంటో వంటి ఖరీదైన నగరాల్లో చదువుకుంటూ అక్కడే ఉండే మన విద్యార్థులకు ఆర్థిక ఇక్కట్లు పెరిగే ప్రమాదముంది. ‘‘ఇంత తక్కువ గంటల పనితో చేతికొచ్చేదెంత? నెలవారీ సామగ్రి కొనడం కూడా కష్టమే’’అని భారతీయ విద్యార్థి నీవా ఫతర్ఫేకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘యార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో సరి్టఫికేట్ కోర్సు చేస్తున్నా. ఇప్పుడున్న ఖర్చులతో విడిగా అద్దెకుండటం చాలా కష్టం. అందుకే స్నేహితుల గదిలోకి మారా. అక్కడే సెనేకా కాలేజీలో బ్రాండ్ మేనేజ్మెంట్ చదువుకుంటా’అని నీవా చెప్పారు. ‘‘కనీస ఆదాయం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలరు. ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం పాటించాలి’’అని బార్బరా షెలిఫర్ స్మారక క్లినిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, లాయర్ అయిన దీపా మాటో చెప్పారు. -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది
లాగోస్: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్లైన్లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. నైజీరియా తండ్రి, మొజాంబిక్ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. -
ఇజ్రాయెల్‌తో యుద్ధం... లెబనాన్ తరమా?
నాలుగైదు రోజుల నాటి ముచ్చట. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు ఇటీవల ఇజ్రాయెల్‌పై భారీ దాడికి సిద్ధపడ్డారు. కానీ దీన్ని ఇజ్రాయెల్ ముందే పసిగట్టింది. వాళ్లు కాలూచేయీ కూడదీసుకోకముందే వందలాది యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై మెరుపుదాడి చేసింది. అనంతర అందుకు ప్రతిగా హెజ్బొల్లా కూడా వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డా ఆ దాడులను సమర్థంగా కాచుకుంది. ఈ ఉదంతం పశి్చమాసియాలో ఇప్పటికే చెలరేగుతున్న యుద్ధ జ్వాలలను మరింతగా ఎగదోసింది. ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి లెబనాన్ సిద్ధపడుతోందంటూ జోరుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ వంటి అజేయ సైనిక శక్తిని ఓడించే సత్తా లెబనాన్‌కు ఉందా? దేశ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరిస్తుందా...?! లెబనాన్ చాన్నాళ్లుగా పెను రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అప్పుల కుప్ప కొండంత పెరిగిపోయింది. దేశంలో సరైన విద్యుత్ సరఫరా వ్యవస్థకే దిక్కు లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ సరేసరి. పేదరికం విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగి నెగ్గుకు రావడం లెబనాన్ సాధ్యపడే పని కాదంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఇరు దేశాలు నెల పాటు భీకరంగా తలపడ్డాయి. చివరికది అర్ధంతరంగా ముగిసినా లెబనాన్‌కు తీరని నష్టాలే మిగిల్చింది.దశాబ్దాల అవినీతి, రాజకీయ అస్థిరత లెబనాన్‌లో చాన్నాళ్లుగా రాజకీయ అస్థిరత నెలకొంది. అవినీతి పెచ్చరిల్లింది. అభివృద్ధి పూర్తిగా కుంటువడింది. ఆధునీకరణకు నోచుకోక బ్యాంకింగ్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ డీజిల్ జనరేటర్ ఆపరేటర్లు, చమురు సంస్థల చేతుల్లో చిక్కుకుపోయింది. ప్రభుత్వ సంస్థలు కూడా అంతర్జాతీయ రుణదాతల దయాదాక్షిణ్యాలపై నెట్టుకొస్తున్న పరిస్థితి! ఆర్థిక సాయానికీ, ఆహారానికీ విదేశాల మీదే ఆధారపడుతోంది. కోవిడ్ సంక్షోభం దెబ్బకు 2020 నుంచి లెబనాన్ పరిస్థితి పెనంనుంచి పొయ్యిలోకి చందంగా మారింది. బీరూట్ నౌకాశ్రయంలో రసాయన నిల్వల భారీ పేలుడు దెబ్బకు వాణిజ్య రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అంతో ఇంతో ఆదుకుంటున్న పర్యాటక రంగమూ ఇజ్రాయెల్ దాడులతో నేల చూపులు చూస్తోంది.నిల్వలు 3 నెలలకు మించవ్! 2022లో ఇజ్రాయెల్ దాడుల్లో ధాన్యాగారాలు చాలావరకు ధ్వంసం కావడంతో లెబనాన్ ఆహార నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయింది. దాంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతూ నెట్టుకొస్తోంది. ‘‘ఆహార, చమురు నిల్వలు దాదాపు నిండుకున్నాయి. రెండు మూడు నెలలకు మించి లేవు. అవీ అయిపోతే పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉంది’’ అని అంతర్జాతీయ సహాయ సంస్థ మెర్సీ కార్ప్స్ ఆందోళన వ్యక్తం చేసింది. రన్‌వేల పాక్షిక పునరుద్ధరణ తర్వాత ఎయిర్పోర్ట్ కాస్త అందుబాటులో వచి్చంది. శరణార్థుల బెడద లెబనాన్‌కు ఉన్న ఏకైక విమానాశ్రయాన్ని 2006లో ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేసింది. దాంతో సరుకు వాయు రవాణాను పూర్తిగా బ్రేకులు పడ్డాయి. నాటి దాడుల్లో మౌలిక వసతులన్నీ ధ్వంసమై లెబనాన్‌కు ఏకంగా రూ.26 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది! ఇజ్రాయెల్ గనక ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయి దాడికి దిగితే లెబనాన్ఇంకెంతటి నష్టం చవిచూడాల్సి ఉంటుం దో అనూహ్యమే. పైగా 2006 యుద్ధమప్పుడు శరణార్థుల బాధ లేదు. సిరియాలో అంతర్యుద్ధం దెబ్బకు ఇటీవల కోటి మందికి పైగా లెబనాన్‌కు పోటెత్తారు. ఈ శరణార్థులకు అందుతున్న అంతర్జాతీయ సాయం కూడా ఆగి ఆర్థిక భారం మరీ పెరిగింది.ఐరాస పెదవి విరుపు డ్రోన్ల వాడకంతో ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులు సమూలంగా మారిన నేపథ్యంలో ఈసారి ఇజ్రాయెల్‌తో యుద్ధమంటూ వస్తే మరింత భీకరంగా ఉండొచ్చు. అందుకు కావాల్సిన సన్నద్ధత లెబనాన్‌కు ఏమాత్రమూ లేదని ఐరాస, లెబనాన్ సంయుక్త ముసాయిదా పత్రమే పరోక్షంగా తేల్చేయడం విశేషం. అదేం చెప్పిందంటే... → గాయపడే సైనికులు, పౌరుల కోసం ఆస్పత్రుల్లో ఔషదాలు, అత్యవసర చికిత్స, సదుపాయాలను భారీగా సమకూర్చుకోవాలి. → 2006లో మాదిరి చిన్నపాటి యుద్దమైనా కనీసం 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. → వారికి కనీస సదుపాయాల కల్పనకు నెలకు కనీసం రూ.420 కోట్లు కావాలి. → అదే పూర్తిస్థాయి భీకర యుద్ధమైతే కోటి మందికి పైగా శాశ్వతంగా నిర్వాసితులైపోతారు. → అప్పుడు వారి బాగోగులకు ఎంత లేదన్నా నెలకు రూ.838 కోట్లు కావాలి. → కొన్ని నెలలుగా ఇజ్రాయెల్–హెజ్బొల్లా పరస్పర దాడుల దెబ్బకు సరిహద్దు ప్రాంతాల్లోని లక్ష మంది ఇప్పటికే వేరే చోట్లకు తరలారు. వారి బాగోగులకు నెలకు రూ.209 కోట్ల కోసమే లెబనాన్ నానా ఆపసోపాలు పడుతోంది.తలకు మించిన నానారకాల సమస్యలతో లెబనాన్ ఇప్పటికే తీవ్రంగా సతమతమవుతోంది. ఇంట గెలవలేని ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగి నెలా నెగ్గుకురాగలదు? చైనా, రష్యా, ఇరాన్ నుంచి సమీకరించిన ఆయుధ సంపత్తి భారీగానే ఉన్నా ఇజ్రాయెల్ దాడులను హెజ్బొల్లా మిలిటెంట్లు తట్టుకుని నిలవడం దుస్సాధ్యమే’’ – అంతర్జాతీయ పరిశీలకులు– సాక్షి, నేషనల్ డెస్క్ -
Haryana Assembly elections 2024: బీజేపీ, కాంగ్రెస్... నువ్వా నేనా
హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో అధికార బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్ని కల్లో మెరుగైన ప్రదర్శనతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పారీ్టకి ముచ్చెమటలే పట్టిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆగ్రహం వంటివి బీజేపీని కుంగదీస్తున్నాయి. వీటిని గరిష్టంగా సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు హస్తం పార్టీ పదును పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలవారీగా చూస్తే పలు కంచుకోటల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆ మేరకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు స్థానిక పార్టీ జేజేపీ పుంజుకుంటూ కమలానికి గట్టి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కీలకమైన ప్రాంతాల్లో ఈసారి ‘ఓటు షిఫ్టు’ ఎలా ఉండనుందన్నది తుది ఫలితాలను శాసించే అవకాశాలు కని్పస్తున్నాయి... బీజేపీ నేల చూపులు... 2019 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కీలక అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని బాగా కోల్పోయింది. ఉదాహరణకు ఫిరోజ్‌పూర్ జిర్కా, నూహ్ అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఏకంగా 16 శాతం చొప్పున ఓట్లు తగ్గాయి. మరోవైపు నారాయణ్‌గఢ్ వంటి చోట్ల పార్టీ ఓటు శాతం 14 శాతానికి పైగా పెరిగినా పెద్దగా లాభం లేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాలకు పదింటినీ ఒడిసిపట్టగా తాజా ఎన్నికల్లో వాటిలో సగం సీట్లకు కోత పడింది. కాంగ్రెస్ పైపైకి... కాంగ్రెస్ మాత్రం ఈ లోక్‌సభ ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుని లాభపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి అంబాలా కంటోన్మెంట్ స్థానంలో ఏకంగా 39.8 శాతం, అంబాలా సిటీలో 36.6 శాతం చొప్పున ఓట్లు పెరిగాయి! ఓట్ల శాతం తగ్గిన అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నష్టం జరగకపోవడం విశేషం. ఉదాహరణకు పంచ్కులలో 4.5 శాతం, కాల్కాలో 2 శాతం మాత్రమే ఓట్లు తగ్గాయి. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేక చతికిలపడ్డ కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ భారీగా పుంజుకుంటున్న కీలక ప్రాంతాలు: బాగ్రీ, జాట్లాండ్ వీటిలో 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగింది.బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నకంచుకోటలు: అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీ ఆధిపత్యమే సాగుతున్నా 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతంలో తగ్గుదల నమోదైంది.బీజేపీకి ఓట్లు బాగా తగ్గిన ప్రాంతం: బ్రజ్ అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ ప్రాంతాల్లో బీజేపీ పటిష్టంగానే కని్పస్తున్నా జాట్లాండ్, బాగ్రీల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. బ్రజ్ ప్రాంతంలో ఇరు పారీ్టలూ గట్టిగా తలపడుతున్నాయి. దాంతో అందరి దృష్టీ అక్టోబర్ 5న జరిగే పోలింగ్ మీదే ఉంది!ప్రస్తుత పరిస్థితి...పోలింగ్‌కు ఇంకా నెల రోజులే ఉన్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ కంచుకోటలపై పట్టు మరింత పెంచుకోవడంతో పాటు బలహీపడుతున్న ప్రాంతాల్లో నష్టాలను కట్టడి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే క్రమంగా బలపడుతున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి రెండు పారీ్టలకూ గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా జాట్లాండ్, బాగ్రీ ప్రాంతాల్లో జేజేపీ జోరు మీదుంది. ఈ నేపథ్యంలో హరియాణాలో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగడం ఖాయంగా కన్పిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టలవారీ ఓటింగ్ శాతాన్ని బట్టి చూసినా అదే తేటతెల్లమవుతోంది. అదే ట్రెండు కొనసాగితే 2019లో మాదిరిగానే ఈసారి కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాట్లాండ్, బాగ్రీ ప్రాంతాల్లో ఎవరిది పై చేయి అవుతుందనే దాన్నిబట్టి తుది ఫలితం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.అంకెల్లో...→ 90 అసెంబ్లీ స్థానాలకు గాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో 74 స్థానాల పరిధిలో బీజేపీ ఓట్ల శాతం కాస్తో కూస్తో పెరిగింది. → కానీ 16 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఓట్ల శాతం బాగా తగ్గింది. → దాంతో 2019 ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 5 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు బీజేపీ కోల్పోయింది. → మరోవైపు కాంగ్రెస్ బాగా పుంజుకుంది. పోటీ చేసిన 81 సీట్లకు గాను 68 చోట్ల ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది. → దాంతో 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతం కాస్త తగ్గినా ఏకంగా 5 లోక్‌సభ సీట్లు ఒడిసిపట్టగలిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అట్టహాసంగా యువరాణి పెళ్లి
నార్వే యువరాణి మార్తా లూయిస్ (52), అమెరికాకు చెందిన డురెక్ వెర్రెట్ (49) వివాహం అట్టహాసంగా జరిగింది. నార్వేలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, కైరుంగి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు మార్తా తండ్రి, కింగ్ హెరాల్డ్ (87), ఇతర రాజకుటుంబీకులు హాజరయ్యారు. మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, రియాలిటీ స్టార్లు, టీవీ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మార్తాకిది రెండో వివాహం. మొదటి భర్తతో ఆమెకు 21, 19, 15 ఏళ్ల వయస్సున్న కూతుళ్లున్నారు. వాళ్లు కూడా వేడుకలో పాల్గొన్నారు. తనకు దేవదూతలతో మాట్లాడే శక్తి ఉందని మార్తా; ఆత్మలతో సంభాíÙంచగలనని, వ్యాధులను నయం చేయగలనని వెర్రెట్ చెప్పుకుంటారు. తమ కుటుంబానికి ఆరు తరాలుగా అతీత శక్తులు సక్రమిస్తూ వస్తున్నాయని వెర్రెట్ ప్రకటించుకున్నారు. – ఓస్లో -
మరో పాతికేళ్లలో... బ్రిటన్ ఆలూ మాయం!
బ్రిటన్ ప్రజలు ఇష్టంగా తినే బంగాళదుంప సాగు అక్కడ కనాకష్టంగా మారిందట. మరో పాతికేళ్లలో బ్రిటన్‌లో ఆలూ సాగు అసాధ్యంగా మారినా ఆశ్చర్యం లేదని పలు నివేదికలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 20250 స్కాట్లండ్ ఆలూ సాగు పరిశ్రమ తుడిచిపెట్టుకుపోవచ్చన్నది వాటి సారాంశం. పొటాటో సిస్ట్ నెమటోడ్స్ (పీసీఎన్) అనే తెగులే ఇందుకు కారణం. ఇది సోకే పంటభూముల్లో ఆలూ సాగు అత్యంత కష్టం. నేరుగా మొక్క వేర్లను నాశనం చేసే ఈ తెగులు దెబ్బకు ఆలూ దిగుబడి దారుణంగా పడిపోతుంది. బ్రిటన్‌లో వాడే ఆలూ 80 శాతం స్కాట్లాండ్ భూముల నుంచే వస్తుంది. 450 కోట్ల యూరోల విలువైన ఆలూ పరిశ్రమను ఆదుకునేందుకు బ్రిటిష్ సైంటిస్టుల బృందం నడుం బిగించింది. పీసీఎన్ను తట్టుకునే రెండు వంగడాలను గుర్తించినట్టు మొక్కల వ్యాధుల నిపుణుడు జేమ్స్ ప్రిన్స్ చెప్పారు. వీటి సాయంతో సమస్యను అధిగమిస్తామని ధీమా వెలిబుచ్చారు. – లండన్ -
చేపపై యుద్ధం
ఎక్కడి జీవి అక్కడ ఉంటేనే ప్రకృతి సమతుల్యత సజావుగా ఉంటుంది. ఆఫ్రికా జలాశయాల్లో జీవించే చిన్నపాటి బ్లాక్చిన్ తిలాపియా చేప ఇప్పుడు థాయిలాండ్‌కు చుక్కలు చూపుతోంది. అక్కడి చిన్న చేపలు, రొయ్యలు, నత్త లార్వాలను గుటకాయ స్వాహా చేస్తోంది. అలా దేశ మత్స్య పరిశ్రమకు భారీ నష్టాలు తెచి్చపెడుతోంది. దాంతో వాటిపై థాయ్‌లాండ్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తిలాపియా చేప అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. వాటిని పట్టుకుంటే కేజీకి రూ.35 చొప్పున ఇస్తామంటూ జనాన్నీ భాగస్వాములను చేసింది. దాంతో జనం సైతమంతా తిలాపియా వేటలో పడ్డారు. గ్రామీణులు ప్టాస్టిక్ కవర్లు, వలలు చేతబట్టుకుని మోకాలి లోతు జలాశయాల్లో తిలాపియా వేటలో మునిగిపోయారు. దీనికి తోడు చెరువులు, కుంటలు, సరస్సుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసిన తిలాపియా చేపలను తినే ఆసియాన్ సీబాస్, క్యాట్ఫి‹Ùలనూ ప్రభుత్వం వదులుతోంది. ఆడ తిలాపియా చేప ఒకేసారి 500 పిల్లలను పెడుతుంది. దాంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఘనా నుంచి దిగుమతి! జంతువుల దాణా, రొయ్యలు, పౌల్ట్రీ, పంది మాంసం వ్యాపారం చేసే ఓ సంస్థ దిగుమతి చేసుకున్న తిలాపియా చేపలు చివరికిలా దేశమంతటినీ ముంచెత్తినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఏం చేసినా ఒక చేప జాతిని సమూలంగా అంతం చేయడం దాదాపు అసాధ్యమని స్థానిక జలచరాల శాస్త్రవేత్త డాక్టర్ సువిత్ వుథిసుథిమెథవే అంటున్నారు. ‘‘వేగవంతమైన పునరుత్పత్తి వ్యవస్థ ఉన్న చేపలను పూర్తిగా అంతం చేయడం మరీ కష్టం. బాగా ప్రయతి్నస్తే మహా అయితే వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అని అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్‌బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్‌కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్‌ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్‌కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్‌పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్‌నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్‌గనీ షా 1977–1990 దాకా బిజ్‌బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్‌ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్‌ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకరు ధర్మాసనంపై.. మరొకరు బోనులో... ఇద్దరు మిత్రుల కథ!
అది 2015. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఆర్థర్ నథానియల్ బూత్ దొంగతనం ఆరోపణలపై అరెస్టయ్యాడు. మియామీ–డేడ్ జడ్జి మిండీ గ్లేజర్ ముందు విచారణకు హాజరయ్యాడు. అతన్ని తేరిపార చూసిన జడ్జి, నువ్వు నౌటిలస్ మిడిల్ స్కూల్లో చదివావు కదా ప్రశ్నించారు. దాంతో ఆమెను గుర్తు పట్టిన బూత్ ఒక్కసారిగా భావోద్వేగంతో రోదించాడు. వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు మరి! స్కూలు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి ఫుట్ బాల్ ఆడేవాళ్లమని, బూత్ తమ స్కూళ్లోకెల్లా ఉత్తమ బాలుడని మిండీ గుర్తు చేసుకున్నారు. ‘బూత్, నిన్నిక్కడ చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై మంచి జీవితం గడుపుతాడని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ అలా జరగలేదు. బూత్ చోర జీవితమే కొనసాగిస్తూ వచ్చాడు. నగరమంతటా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్లంబర్ వేషంలో ఓ వృద్ధుడి ఇంట్లో దూరి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. వాటర్ ఇన్స్పెక్టర్గా నటించి ఓ ఇంట్లోంచి నగల పెట్టె దొంగిలించాడు. టైరు మారుస్తున్న మహిళ బంగారు గొలుసు లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి కోర్టులో జడ్జిగా చిన్నప్పటి నేస్తం కని్పంచలేదు గానీ అతని అరెస్టుతో నాటి ఉదంతం మరోసారి తెరపైకి వచి్చంది. 2015 నాటి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో వైరల్‌గా మారింది. – వాషింగ్టన్ -
డెలివరీ ఏజెంట్‌కు సర్ప్రైజ్
బంధువులతో కలిసి పార్టీ.. ఆత్మ బంధువుల బర్త్‌డే.. వేడుక ఏదైనా మనకు టైమ్‌కు ఫుడ్ డెలివరీ చేసి మన సంతోషంలో భాగస్వాములవుతారు డెలివరీ ఏజెంట్. వాళ్ల కష్టాన్ని చాలాసార్లు గుర్తించం. కానీ.. తమకోసం ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసి అతని సంతోషాన్ని రెట్టింపు చేశారు కొందరు యువకులు. వారం కిందట అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరానికి చెందిన యశ్ షా జొమాటోలో ఫుడ్ ఆర్డర్చేశాడు. ఆర్డర్ డీటెయిల్స్ చూస్తుండగా.. భారీ వర్షం వల్ల డెలివరీ లేట్ అవుతుందని ఉంది. దాంతో పాటు.. డెలివరీ బాయ్ అయిన షేక్ ఆకిబ్ బర్త్‌డే అని కూడా కనిపించింది. డెలివరీ ఏజెంట్ తన బర్త్‌డే రోజు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నాడని గ్రహించి, ఏజెంట్‌ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ఆర్డర్‌తో వచ్చిన అతడికి ఫ్రెండ్స్‌తో కలిసి ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ విష్ చేశారు. అంతేకాదు చిన్న కానుకను కూడా అందజేశారు. ఊహించని ఈ వేడుకకు డెలివరీ ఏజెంట్ చలించిపోయాడు. చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దృశ్యం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యశ్.. ‘మీకు చేతనైనంత వరకు ఆనందాన్ని పంచండి. మాకు అవకాశం ఇచ్చినందుకు జొమాటోకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూస్, లెక్కలేనన్ని లైక్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, డెలివరీ ఏజెంట్ షేక్ ఆకిబ్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. – అహ్మదాబాద్ -
రాజీనామాకూ కన్సల్టెన్సీ
మన దగ్గర ఉద్యోగం కలి్పంచడం కోసం బోలెడన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి. కానీ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ అందుకు భిన్నం! అక్కడ రాజీనామా చేయాలనుకునే ఉద్యోగుల కోసం కన్సల్టెన్సీలుంటాయి!! అవి ఇటీవల దేశవ్యాప్తంగా పుట్ట గొడుగుల్లా పెరుగుతున్నాయి. రాజీనామాకు కన్సల్టెన్సీలు ఎందుకా అనుకుంటున్నారా? జపాన్ పని సంస్కృతి, అందులోని సంక్లిష్టతలే అందుకు కారణం... రాజీనామా చేయాలంటే ఏం చేస్తాం? గడువు ప్రకారం రాజీనామా లేఖ ఇస్తాం. అంతటితో సరిపోతుంది. కానీ జపాన్‌లో రాజీనామా అంత ఈజీ కాదు. అక్కడి పని సంస్కృతే ఇందుకు కారణం. అక్కడ కెరీర్ మొత్తం ఒకే సంస్థలో కొనసాగించే వాళ్ల సంఖ్యే ఎక్కువట. చేస్తున్న పని ఇష్టం లేకపోయినా, బాస్ తీరు నచ్చకపోయినా వేధింపులకు భయపడో, మరో కారణంతోనో కష్టంగా అదే ఉద్యోగంలో కొనసాగుతున్న వాళ్లు చాలామంది. సరిగ్గా ఇలాంటి వాళ్లకు సాయం చేసేందుకే పుట్టుకొచ్చాయి ‘రాజీనామా కన్సల్టెన్సీలు’. ఇవి కొవిడ్‌కు ముందే ఉన్నా, ఆ మహమ్మారి తదనంతర కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 11,000 పై చిలుకు క్లయింట్ల తమ సేవల గురించి ఎంక్వైరీ చేసినట్టు ‘మోమూరి ఆపరేషన్స్’ అనే రాజీనామాల కన్సల్టెన్సీ సంస్థ చెబుతోంది. ‘మోమూరి’ అంటే జపనీస్‌లో ‘నేనీ పని ఇంకే మాత్రమూ చేయలేను (ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్)’ అని అర్థం! ఇది 2022లో పుట్టుకొచి్చంది. కర్ర విరక్రుండా, పాము చావకుండా ఎలా రాజీనామా చేసి బయట పడాలో ఇవి సలహాలిస్తాయన్నమాట. ఈ వ్యవహారంలో చట్టపరమైన వివాదాల్లాంటివి తలెత్తితే కూడా అవే చూసుకుంటాయి. అధిక పని సంస్కృతి... జపాన్‌లో చాలాకాలంగా అధిక పని సంస్కృతి ఉంది. రంగమేదైనా ఉద్యోగులకు పనివేళలు మరీ ఎక్కువ. ఏకధాటిగా 12 గంటలు పని చేయడం చాలా మామూలు విషయం. ఇల్లు చేసేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. మళ్లీ ఉదయాన్నే హడావుడిగా బయల్దేరాలి. ఇలా వెనక్కు తిరిగి చూసుకుంటే పనిలో కరగదీసిన జీవితమే తప్పితే సరదాగా గడిపిన క్షణాలంటూ పెద్దగా కన్పించడం లేదని వాపోయేవాళ్ల సంఖ్యే అధికం. వీటికి తోడు సూపర్వైజర్లు, మేనేజర్ల నుంచి ఒత్తిళ్లు. తట్టుకోలేక రాజీనామాకు ప్రయతి్నస్తే యజమానులు వేధిస్తారట. ఇలాంటి సంస్థలను ‘నల్లజాతి సంస్థలు’గా పిలుస్తుంటారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లోనే గాక పెద్ద సంస్థల్లోనూ ఈ సంస్కృతి ఉందట. బాధితుల్లో ప్రధానంగా ఆహార పరిశ్రమ కార్మికులు, ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ రంగాల వారున్నారు. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే, తీవ్రమైన పని ఒత్తిడి పెట్టే సంస్థల జాబితాను ప్రభుత్వమే నిషేధిత జాబితాలో పెట్టడం ప్రారంభించింది! అలా జపాన్వ్యాప్తంగా ఇప్పటికే 370కి పైగా కంపెనీలు లేబర్ బ్యూరో బ్లాక్ లిస్ట్‌లో చేరాయి. అధిక పని ఒత్తిడి వల్ల మెదడు, గుండె సంబంధిత జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య జపాన్‌లో పెరుగుతోందట. 31 ఏళ్ల జర్నలిస్టు ఒకామె కేవలం పని ఒత్తిడి వల్లే హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణించింది. చనిపోవడానికి ముందు ఒకే నెలలో ఆమె ఏకంగా 159 గంటలు ఓవర్ టైమ్ పని చేసిందట! అలాగే ఓ 26 ఏళ్ల వైద్యుడు కూడా ఒకే నెలలో 200 గంటలకు పైగా ఓవర్ టైమ్ పనిచేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు! మారుతున్న యూత్.. ఈ పని జపాన్‌లో ఎప్పటినుంచో సంస్కృతి ఉన్నా రాజీనామా కన్సల్టెన్సీలు ఇటీవలి కాలంలోనే ఎందుకు పుట్టుకొచ్చాయి? అంటే యువత ఆలోచనల్లో వచి్చన మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లో ఉద్యోగుల్లో వృద్ధుల సంఖ్య తగ్గుతోంది. ఎక్కడ చూసినా యువ ఉద్యోగులే. ఉద్యోగం స్వభావంతో సంబంధం లేకుండా యజమాని ఏది చెబితే అది చేయాలనే పాత తరం ఆలోచనతో వాళ్లు ఏకీభవించడం లేదు. అందుకే అవసరమైతే రాజీనామాకూ వెనకాడటం లేదు. అలాగని యాజమాన్యంతో ఘర్షణ పడి ఉద్యోగ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే నేర్పుగా పని కానిచ్చుకోవడానికి కన్సల్టెన్సీల బాట పడుతున్నారు.‘‘రాజీనామా ఏజెన్సీలు జపాన్ సమాజం నుంచి పూర్తిగా కనుమరుగవ్వాలని మేం నిజాయితీగా కోరుకుంటున్నాం. ఉద్యోగులు తమ రాజీనామా గురించి నేరుగా బాస్‌తో మాట్లాడుకునే వాతావరణం వస్తే మేలు. కానీ మా క్లయింట్ల భయానక గాథలు వింటుంటే అది ఇప్పట్లో జరుగుతుందని అనిపించడం లేదు’’ – మోమూరీ కన్సల్టెనీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ ‘రష్యన్ స్పై వేల్’ ఇక లేదు!
రష్యా గూఢచారిగా 2019 నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెల్లని బెలుగా తిమింగలం చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని రిజావికా బే వద్ద నీటిపై తేలియాడుతూ శనివారం స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై ‘ఎక్విప్మెంట్ సెయింట్ పీటర్స్బర్గ్’అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అనుమానం మొదలైంది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని, నార్వే–రష్యా భాషలను కలిపి ‘హవాల్దిమిర్’గా పిలవనారంభించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా హవాల్దిమిర్ ప్రజలకు మచ్చికయ్యింది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. – హెల్సింకీ -
మానవ సృష్టి ఉల్కాపాతం
ప్రపంచ చరిత్రలో మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం(మిటియోర్)గా డైమార్ఫోస్ ఉల్కపాతం రికార్డుకెక్కబోతోందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. భూగోళం వైపు దూసుకొస్తూ ముప్పుగా మారిన గ్రహశకలాలను దారి మళ్లించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సైంటిస్టులు డబుల్–అస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్టు(డార్ట్) నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం డైమార్ఫోస్ అనే గ్రహశకలాన్ని (అస్టరాయిడ్) ఎంచుకున్నారు. నిజానికి ఈ అస్టరాయిడ్తో భూమికి ముప్పు లేనప్పటికీ ప్రయోగానికి అనువుగా ఉండడంతో ఎంపిక చేశారు. ‘డార్ట్’లో భాగంగా 2021 నవంబర్ 24న స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఇది 2022 సెపె్టంబర్ 26న భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల మైళ్లు) దూరంలో ఉన్న డైమార్ఫోస్‌ను గంటకు 13,645 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ఢీకొట్టింది. దాంతో ఆ గ్రహశకలం దారిమళ్లింది. భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి ముప్పు తప్పించడానికి డార్ట్ ప్రయోగం దోహదపడింది. 10 లక్షల కిలోల రాళ్లు, దుమ్ము ధూళి: నాసా స్పేస్‌క్రాఫ్ట్ అత్యంత వేగంగా ఢీకొట్టడంతో డైమార్ఫోస్ నుంచి చిన్నచిన్న రాళ్లు, దుమ్ము ధూళీ వెలువడుతున్నట్లు గుర్తించారు. 2 మిలియన్ పౌండ్లకు (10 లక్షల కిలోలు) పైగా బరువైన రాళ్లు, దుమ్ము ధూళి వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటిని దాదాపు 7 రైలు పెట్టెల్లో నింపొచ్చు. వీటిలో కొన్ని ఇసుక పరిమాణంలో, మరికొన్ని సెల్‌ఫోన్ పరిమాణంలో ఉంటాయని చెబుతున్నారు. అయితే, డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి చివరకు ఎక్కడికి చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి మరో 30 సంవత్సరాల్లోగా భూమి, అంగారక గ్రహాల సమీపంలోకి చేరుకుంటా యని చెబు తున్నారు. కొన్ని రాళ్లు, ధూళి మరో ఏడేళ్లలో అరుణ గ్రహానికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరో పదేళ్లలో చిన్నపాటి రాళ్లు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నా రు. చాలా చిన్నవి కావడంతో ఇవి భూమి ని ఢీకొట్టినా ఎలాంటి ప్రమాదం ఉండదని భరో సా ఇస్తున్నారు. డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి ఉలా్కపాతాలుగా మారి భూమి, అంగారక గ్రహంపైకి చేరడం 100 సంవత్సరాలపాటు కొన సాగుతుందని ఇటలీలోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ మిలన్కు చెందిన డీప్–స్పేస్ అస్ట్రోడైనమిక్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ పోస్టు డాక్టోరల్ పరిశోధకుడు అసెన్సియో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోజూ రోటీయేనా ?
కోల్‌కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు. వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్‌చేశాక పోలీసులు సంజయ్‌ను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్రైస్లాంటి ఎగ్ చావ్మీన్ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం. అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. -
ఖర్కీవ్‌పై రష్యా క్షిపణి దాడి
మాస్కో: ఉక్రెయిన్ నగరం ఖర్కీవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి ఆటస్థలంలో పడటంతో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. సరిహద్దులకు సమీపంలోని ఖర్కీవ్పైనే జరిపిన మరో దాడిలో 12 అంతస్తుల నివాస భవనం ధ్వంసమయింది. ఘటనలో ఐదుగురు చనిపోగా మరో 59 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనలో భవనంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనం వెలుపలి గోడ తీవ్రంగా దెబ్బతింది. సమీపంలో పార్కు చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇలా ఉండగా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. కాగా, డొనెట్స్క్ రిజియన్‌లోని చాసివ్ యార్ పట్టణంపై రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. పట్టణంలోని పౌరులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రాంత గవర్నర్ కోరారు. ఉక్రెయిన్ బలగాల మౌలిక వనరుల రవాణాకు కీలకంగా ఉన్న పొక్రొవ్స్క్ నగరానికి అతి సమీపంలో రష్యా బలగాలు తిష్టవేశాయి.ఎయిర్ ఫోర్స్ చీఫ్ తొలగింపు: ముందుకు చొచ్చుకు వస్తున్న రష్యా బలగాలను నిలువరించి, ఎదురు దాడులు చేయడంలో అమెరికా మిత్ర దేశాలు అందించిన ఎఫ్–16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కీలకంగా భావిస్తోంది. అయితే, సోమవారం ఒక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని రష్యా ఆర్మీ కూల్చి వేసింది. అందులోని పైలట్ కూడా చనిపోయారు. ఘటనను అధ్యక్షుడు జెలెన్స్కీ సీరియస్‌గా తీసుకున్నారు. వైమానిక దళం చీఫ్ మికోలా ఒలెశ్చుక్ను బాధ్యతల నుంచి తొలగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సైనికుల భద్రతకు ఆయనదే పూర్తి బాధ్యతని మాత్రమే వ్యాఖ్యానించారు. -
హెలికాప్టర్‌ను కిందికి వదిలేశారు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్‌ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్‌ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్‌నాథ్‌కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్‌కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్‌కు తరలించాలని అధికారులు భావించారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్‌కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్‌ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
ప్రజలందరికీ సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం
న్యూఢిల్లీ: సమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రైల్వేలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేదాకా ఈ పరుగు ఆగదని స్పష్టంచేశారు. మూడు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇవి మీరట్–లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై–నాగర్కోయిల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ద్వారా ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇండియన్ రైల్వే ఒక గ్యారంటీగా మారాలన్నదే తమ ధ్యేయమని, అది నేరవేరేదాకా తమ కృషి ఆగదని స్పష్టంచేశారు. భారత రైల్వే శాఖ సాగిస్తున్న అభివృద్ధి ప్రయాణం తమ ప్రభుత్వ అంకితభావానికి ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దార్శనికతకు ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఒక బలమైన మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు గుర్తుచేశారు. మన రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తున్నామని, హై–టెక్ సేవలతో అనుసంధానిస్తున్నామని వివరించారు. దక్షిణాది అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన ఆశయ సాధనకు దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన ప్రగతి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాదిన నిపుణులకు, వనరులకు, అవకాశాలకు కొదవ లేదని చెప్పారు. సౌత్ ఇండియా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో రైళ్ల సంఖ్యను పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రెట్లు పెంచామని వివరించారు. రైల్వే ట్రాకులు మెరుగుపరుస్తున్నామని, విద్యుదీకరణ వేగం పుంజుకుందని, రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందని, ప్రయాణికులకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. -
బ్రెజిల్లో ‘ఎక్స్’పై నిషేధం
సావొ పౌలో: ఎలాన్ మస్క్‌కు చెందిన సామా జిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ను నిషేధించేందుకు బ్రెజిల్ యంత్రాంగం నడుం బిగించింది. శని వారం నుంచి ఇంటర్నెట్తోపాటు మొబైల్ యా ప్ ద్వారా కూడా ‘ఎక్స్’అందుబాటులో లేకుండా పోయింది. బ్రెజిల్లో ‘ఎక్స్’కు న్యాయ ప్రతి నిధిని నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అలెగ్జాండర్ డీ మొరెస్ ఇచ్చిన ఆదేశాలపై నెల రోజులుగా వివాదం నడుస్తోంది. వాక్ స్వా తంత్య్రం, దుష్ప్రచారం, అతివాదులు దుర్విని యోగం చేస్తుండటం వంటి కారణాలపై జడ్జి ‘ఎక్స్’ను తప్పుబట్టారు. నెల రోజులుగా బ్రెజిల్లో ‘ఎక్స్’కు ప్రతినిధంటూ ఎవరూ లేకపోవడమేంటని ప్రశ్నించారు. 24 గంటల్లోగా ప్రతినిధిని నియమించకుంటే దేశంలో ‘ఎక్స్’ను నిషేధిస్తామని జడ్జి బుధవారం రాత్రి అల్టిమేటం జారీ చేశారు. ‘బ్రెజిల్ సార్వభౌమాధికారం, ప్రత్యేకించి న్యాయవ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేనట్లుగా ఎలాన్ మస్క్ వ్యవహ రిస్తున్నారు. తనను తాను అత్యున్నతంగా, దేశాల చట్టాలకు అతీతుడిగా భావించుకుంటున్నారు’అని డీ మోరెస్ శుక్రవారం వెలువరించిన ఉత్తర్వుల్లో తీవ్రంగా వ్యాఖ్యానించారు. ‘నా ఉత్తర్వులను అమలు చేసేదాకా నిషేధం కొనసాగుతుంది. కాదని ఎవరైనా వీపీఎన్ల ద్వారా ‘ఎక్స్’ను వాడుకునేందుకు చూస్తే రోజుకు రూ. 7.47 లక్షల జరిమానా విధిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. ఎలాన్ మస్క్‌కే చెందిన స్టార్‌లింక్ ఆస్తులను స్తంభింపజేయాలని కూడా గత వారం జడ్జి ఆదేశాలిచ్చారు. జరిమానాలు చెల్లించేందుకు ‘ఎక్స్’ఖాతాల్లో చాలినంత డబ్బు లేనందున, ఒకే యాజమాన్యంలోని స్టార్‌లింక్‌పై ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్‌కు బ్రెజిల్లో 2.50లక్షల మంది ఖాతాదారులు న్నారు. కాగా, శనివారం అర్ధరాత్రిలోగా కోర్టు ఉత్తర్వు లను అమలు చేయాలని టెలి కమ్యూనికేషన్ల నియంత్ర ణ విభాగం అనాటెల్ దేశంలోని టెలికం సంస్థలకు స్ప ష్టం చేసింది. ‘ఎక్స్’కున్న అతిపెద్ద మార్కెట్లలో బ్రెజిల్ ఒకటి. దేశ జనాభాలో ఐదో వంతు, సుమారు 4 కోట్ల మంది దీనిని వాడుతున్నారు. నిషేధం అమలు చేయడంతో వేలాది మంది బ్రెజిల్ యూజర్లు వీపీఎన్ల ద్వారా ఎక్స్‌ను వాడుకునే పనిలో పడ్డారు. ఇటువంటి వారిని గుర్తించి, జరిమానా వసూలు చేయడమెలాగనే ప్రశ్న తాజాగా అధికారులను వేధిస్తోంది.తీవ్రంగా స్పందించిన ఎలాన్ మస్క్బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలపై ‘ఎక్స్’యజమాని ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. జడ్జి ముసుగులో కొనసాగుతున్న అత్యంత తీవ్ర నేరగాడు అంటూ డీ మొరెస్పై నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు తమ స్టార్ లింక్ బ్రెజిల్ వినియోగదారు లకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తుందన్నారు. -
లావోస్‌లో సైబర్ బానిసలు..
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే. మంచి జీతం, జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకు వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలామంది ఇలాగే లావోస్‌కు చేరుకొని, సైబర్ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్ బానిసలుగా మారుతున్నారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరిట యువతపై వల విసిరి లావోస్‌కు తీసుకెళ్తున్నాయి. అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. ఇండియాలోని జనానికి ఫోన్లు చేసి, ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టడమే ఈ సైబర్ బానిసల పని. మాట వినకపోతే వేధింపులు, దాడులు తప్పవు. లావోస్‌లో బొకియో ప్రావిన్స్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటైన సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకున్న 47 మంది భారతీయులను అక్కడి అధికారులు శనివారం రక్షించారు. వీరిని లావోస్‌లోని భారత రాయబార కార్యాలయంలో అప్పగించారు. బాధితుల్లో 30 మందిని క్షేమంగా స్వదేశానికి తరలించినట్లు రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. మిగిలినవారిని సాధ్యమైనంత త్వరగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉచ్చులోకి యువత ఉద్యోగం కోసం ఆశపడి ఉచ్చులో చిక్కుకున్న యువకులను సైబర్ నేరగాళ్లు లావోస్‌కు పంపిస్తున్నారు. అక్కడికి చేరగానే పాస్‌పోర్టు లాక్కుంటారు. బయటకు వెళ్లనివ్వరు. స్కామ్ సెంటర్లలో ఉండిపోవాల్సిందే. యువతుల మాదిరిగా గొంతు మార్చి ఫోన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నకిలీ యాప్‌లలో, ఫేక్ సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి జనాన్ని బురిడి కొట్టించాలి. రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. నిర్దేశించినంత డబ్బు కొల్లగొట్టకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. జాబ్ ఆఫర్ అంటే గుడ్డిగా అంగీకరించొద్దు ఉద్యోగాల కోసం లావోస్ వెళ్లి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న 635 మంది భారతీయులను అధికారులు గతంలో రక్షించారు. గత నెలలో ఇండియన్ ఎంబసీ 13 మందిని కాపాడింది. వారిని భారత్‌కు తిరిగి పంపించింది. లావోస్, కాంబోడియా జాబ్ ఆఫర్లు వస్తే గుడ్డిగా అంగీకరించవద్దని, చాలావరకు సైబర్ మోసాలకు సంబంధించినవే ఉంటాయని, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత నెలలో లావోస్‌లో పర్యటించారు. నేరగాళ్ల ముఠాలు భారతీయ యువతను లావోస్ రప్పించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తుండడంపై లావోస్ ప్రధానమంత్రితో చర్చించారు. సైబర్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
కాళ్లలో మొత్తం పరాన్నజీవులే
వాషింగ్టన్: కాళ్ల నుంచి నడుము దాకా నొప్పితో బాధపడు తూ ఆస్పత్రిలో చేరిన రోగికి సిటీ స్కాన్ చేసి ఆ రిపోర్ట్ చూశాక అవాక్కవడం వైద్యుల వంతయింది. అమెరికాలో ని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ జాక్సన్విల్లే వైద్యకళా శాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు అంశాలపై ప్రజలకు ఆన్లైన్లో అవగాహన కల్పించే ఒక వైద్యుడి ద్వారా ఈ విషయం వెల్లడైంది. రోగికి తీసిన సీటీ స్కాన్ రిపోర్ట్‌లను చూపిస్తూ పరాన్న జీవులతో ఇబ్బందిపడ్డ ఆ రోగి వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా డాక్టర్ శామ్ ఘలీ వెల్లడించారు. ‘‘అత్యవసర చికిత్స నిమిత్తం ఆగస్ట్ 25వ తేదీన ఆ రోగిని మా ఎమర్జెన్సీ రూమ్‌లో చేర్పించారు. వెంటనే నేను సీటీ స్కాన్ తీ యించా. ఆ సీటీ స్కాన్ రిపోర్ట్చూశాక నాకు నోట మా టరాలేదు. కాళ్లలో ఎక్కడపడితే అక్కడ పరాన్నజీవులు తిష్టవే శాయి. సరిగా ఉడకని పంది మాంసం తినడం వల్ల రోగి శరీరంలోకి పంది నులిపురుగులు ప్రవేశించి రెండు కాళ్ల కండరాలను మొత్తం ఆక్రమించేశాయి. ఈ విషమ పరిస్థితిని టేనియా సోలియం లేదా సిస్టీసెర్కోసిస్గా వ్యవహరిస్తారు. ఏమిటీ సిస్టీసెర్కోసిస్?సరిగా ఉడకని, పచ్చి పంది మాసం తినడం వల్ల ఆ మాంసంలోని నులిపురుగులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాని లార్వాలు మెదడు, కండరాల్లో కి చొరబడితే ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా తయార వుతుంది. చర్మం కింద గడ్డలు, తలనొప్పితోపాటు ఇన్ఫెక్షన్ మెదడు, వెన్నుపూస దాకా చేరితే మూర్ఛ వ్యాధి రావొచ్చు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, అశుభ్రమైన చేతులు, మనిషి మలం ద్వారా కూడా ఈ నులిపురుగులు వ్యాపి స్తాయి. ఉడికీఉడకని పంది మాంసం ద్వారా లార్వాలు మనిషి పేగుల్లోకి, అక్కడి నుంచి రక్తంలో కలుస్తాయి. రక్తంతోపాటు శరీరమంతా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ లార్వాలు తిష్టవేస్తాయి. తొలి దశలోనే సిస్టీ సెర్కోసిస్ను గుర్తిస్తే నివారణ చాలా సులభం. ఆల స్యం చేస్తే మాత్రం మరణం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడుతు న్నారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యాధి ముదిరి ఏటా 50,000 మంది చనిపో తున్నారు. ‘‘యాంటీ–పారాసైట్ థెరపీ, స్టెరాయిడ్ లు, న్యూరోసిస్టీసెర్కోసిస్ కోసం యాంటీ–ఎపిలె ప్టిక్స్, సర్జరీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేసుకోవచ్చు. తొలి దశలో సీటీ స్కాన్ చేయిస్తే స్కానింగ్‌లో తెల్ల బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. దాంతో వీటిని గుర్తించవచ్చు. ఇన్ఫెక్షన్ సోకిన 5–12 వారాల్లోగా అవి నులిపురుగులుగా మారతాయి. అప్పుడు సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి’. -
44లో మీదపడే..60లో ముదిమి
ముసలితనం. మనిషి జీవయాత్రలో అనివార్యమైన చివరి మజిలీ. అయినాసరే, దాని పేరు వింటేనే ఉలిక్కిపడతాం. తప్పదని తెలిసినా వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి అనాదికాలంగా మనిషి చేయని ప్రయత్నం లేదు. ముదిమిని కనీసం వీలైనంత కాలం వాయిదా వేసేందుకు పడరాని పాట్లు పడేవాళ్లకు కొదవ లేదు! అలాంటి వాళ్లకు ఎంతగానో పనికొచ్చే సంగతొకటి వెలుగు చూసింది. మనిíÙకి వృద్ధాప్యం క్రమక్రమంగా సంక్రమించదట. జీవనకాలంలో రెండు కీలక సందర్భాల్లో ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుందట. 44వ ఏట ఒకసారి, 60వ ఏట రెండోసారి! అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలి్చంది. ఆ రెండు సందర్భాల్లోనూ వృద్ధాప్య సంబంధిత మార్పులు ఒంట్లోని అణువణువులోనూ ఉన్నట్టుండి భారీగా చేటుచేసుకుంటాయని వెల్లడించింది. ఇలా చేశారు... 25 నుంచి 75 ఏళ్ల వయసున్న 108 మందిని సైంటిస్టులు తమ అధ్యయనం కోసం ఎంచుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలవారూ నివసించే కాలిఫోరి్నయా నుంచి వీరిని ఎంపిక చేశారు. ప్రతి మూడు నుంచి ఆర్నెల్లకోసారి వారి రక్తం, మలం, చర్మం తదితర నమూనాలు సేకరించి పరిశీలించారు. మహిళల్లో 40ల అనంతరం తలెత్తే ముట్లుడిగే దశ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందన్న వాదన ఉంది. కనుక స్త్రీ పురుషులకు వేర్వేరు డేటాబేస్‌ను నిర్వహించారు. ఒంట్లో ఆర్ఎన్ఏ, ప్రొటీన్ల వంటి జీవాణువులు తదితరాల్లో వయసు మీద పడే తీరుతెన్నులను ఏళ్ల తరబడి నిశితంగా పరిశీలించారు. ఫలితాలు వారిని ఆశ్చర్యపరిచాయి. ఈ కీలక జీవాణువులన్నీ ఆడా, మగా తేడా లేకుండా 44వ ఏట భారీ మార్పుచేర్పులకు లోనైనట్టు గమనించారు. 60వ ఏట కూడా మళ్లీ అలాంటి మార్పులే అంతటి తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఫలితంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ 55వ ఏట నుంచీ వృద్ధాప్య ఛాయలు కొట్టొచి్చనట్టు బయటికి కని్పంచడం గమనించారు. 40ల నుంచైనా మారాలి అధ్యయన ఫలితాలు తమను నిజంగా అబ్బురపరిచాయని నాన్యాంగ్ వర్సిటీ మైక్రోబయోమ్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియావో టావో షెన్ అన్నారు. ‘‘ఉదాహరణకు కెఫిన్‌ను అరిగించుకునే సామర్థ్యం 40 ఏళ్లు దాటాక ఒకసారి, 60 నిండిన మీదట మరోసారి బాగా తగ్గుతుంది. మద్యాన్ని తీసుకున్నా అంతేనని మా పరిశోధనలో తేలింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక 40 దాటాక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం బాగా పెరుగుతుందని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ జెనెటిక్స్ విభాగం చీఫ్ మైకేల్ స్నైడర్ గుర్తు చేశారు. ‘‘ఆ దశలో కండరాలకు తగిలే గాయాలు ఓ పట్టాన మానవు కూడా. ఎందుకంటే ప్రొటీన్లు ఒంట్లోని కణజాలాలను పట్టి ఉంచే తీరు 44వ ఏట, 60వ ఏట చెప్పలేనంతగా మార్పులకు లోనవుతున్నట్టు తేలింది. ఫలితంగా చర్మం, కండరాలు, హృదయనాళాల వంటివాటి పనితీరు భారీ మార్పులకు లోనవుతోంది. వీటికి తోడు 60ల్లో మనుషుల్లో సాధారణంగా కండరాల క్షీణత ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. దాంతో వారిలో హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, టైప్ 2 మధుమేహం వ్యాధుల రిస్కు ఎన్నో రెట్లు పెరుగుతోంది’’ అని వివరించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తమ అధ్యయనం కొత్త దారులు తెరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను నేచర్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురించారు. మధ్యవయసు దాటాక మెల్లిమెల్లిగా ముసలితనం గుప్పెట్లోకి వెళ్తామన్నది నిజం కాదు. 40 ఏళ్లు దాటాక రెండు కీలక దశల్లో మనం ఆదమరిచి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ముదిమి ఒక్కసారిగా వచ్చి మీదపడుతుంది’’ – జియావో టావో షెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్యాంగ్ వర్సిటీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వీలైనంతగా వాయిదా వేసుకోవచ్చన్నది మా అధ్యయన ఫలితాల సారాంశం. మధ్య వయసు దాటాకైనా మద్యం మానేయాలి. లేదంటే కనీసం బాగా తగ్గించాలి. నీళ్లు బాగా తాగాలి. ముఖ్యంగా 40ల్లోకి, 60ల్లోకి ప్రవేశిస్తున్న దశలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి’’ – మైకేల్ స్నైడర్, జెనెటిక్స్ విభాగం చీఫ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తరం కలిపింది వారిని...!
బ్రిటన్‌లో పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరిన ఓ పోస్టు కార్డు ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన రెండు కుటుంబాలను కలిపింది. 1903లో ఎవార్ట్ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్టు కార్డు ఇటీవలే స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్‌కు చేరడం, ఈ సంఘటన విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. వారి కుటుంబాలను వెదికేందుకు సొసైటీ పూనుకుంది. కార్డు గురించి పత్రికల్లో వచి్చన కథనాలతో ఎవార్ట్, లిడియాల మనవడు నిక్ డేవిస్, మనవరాళ్లు హెలెన్ రాబర్ట్, మార్గరెట్ స్పూనర్, ముని మనవరాలు ఫెయిత్ రేనాల్డ్స్ తమ బంధాన్ని గుర్తించారు. వారంతా బుధవారం స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గాన్ ఆరై్కవ్స్లో కలుసుకున్నారు. ఎవరు ఎవరికి ఏమవుతారంటే..? ఎవార్ట్, లిడియా కుటుంబం 121 ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో నివసించేది. ఆరుగురు తోబుట్టువుల్లో లిడియా పెద్దది. తమ్ముడైన ఎవార్ట్ ఆమెకు పోస్టు కార్డు రాశాడు. వీరికి స్టాన్లీ అనే సోదరుడున్నాడు. అతని మనవరాళ్లే హెలెన్ రాబర్ట్ (58), మార్గరెట్ స్పూనర్ (61). వెస్ట్ ససెక్స్‌కు చెందిన నిక్ డేవిస్ (65) ఎవార్ట్ మనవడు. డెవాన్‌కు చెందిన ఫెయిత్ రేనాల్డ్స్ (47) లిడియా ముని మనవరాలు. తామంతా కలిసినందుకు లిడియా, ఎవార్ట్, స్టాన్లీ పైనుంచి చూసి సంతోíÙస్తూ ఉంటారని వారంటున్నారు. రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కైవ్స్లోనే ఉంచాలని నిర్ణయించారు. తాత ఇంటి నుంచి లేఖ.. ‘‘పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్ట్కు 13 ఏళ్లుండి ఉంటాయి. వేసవి సెలవుల్లో ఫిష్ గార్డ్‌లోని తన తాత ఇంట్లో గడిపేవాడు. పెద్ద సోదరి లిడియాకు పోస్టు కార్డులు సేకరించే అభిరుచి ఉంది. అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడు’’ అంటూ ఎవార్ట్ మనవడు నిక్ డేవిస్ అప్పటి విషయాలను పంచుకున్నాడు. కార్డు కారణంగా ఇలా బంధువులను కలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆశ్చర్యపోయా.. ‘‘పోస్టుకార్డు మా కుటుంబానికి చెందినదని భావించిన వారెవరో మమ్మల్ని సంప్రదించారు. దాంతో ఆశ్చర్యపోయా. మా బామ్మకు సోదరులున్నారని తెలియడం, వారి పిల్లలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం గురించి ఇంకా ఏమేం తెలుస్తాయోనన్న ఎగ్జైట్మెంట్ ఉంది’’ అని లిడియా ముని మనవరాలు ఫెయిత్ రేన్లాడ్స్ చెప్పుకొచి్చంది. బంధువులను కలవడం బాగుంది... ‘‘ఆరేళ్లుగా మా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నా. ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్లూ తెలియకపోవడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. వారిని కలుసుకోవడం బాగుంది. అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్ లోంచి పడిపోయి ఉంటుంది. తరవాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీసుకు పంపి ఉంటారు’’ అని స్టాన్లీ మనవరాళ్లు హెలెన్, స్పూనర్ చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Hamas war: గాజాకు 3 రోజుల ఊరట
లండన్: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచి్చంది. గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్ ఇందుకు అంగీకారం తెలిపిందని ఐరాస ప్రకటించింది. పాతికేళ్ల తరవాత గాజాలో ఓ బాలుడిలో పోలియో వ్యాధిని గుర్తించారు. దీని నివారణకు పిల్లలకు టీకా డ్రైవ్ నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. దాంతో ఇజ్రాయెల్ ‘మానవతా విరామం’ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా యుద్ధవిరామం ఉండనుంది. ఇది విరామమే తప్ప కాల్పుల విరమణ కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మూడు దశల్లో డ్రైవ్... గాజా స్ట్రిప్ అంతటా సుమారు 6.4 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అధికారి రిక్ పీపర్కోర్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, యూఎన్ఆర్డబ్ల్యూఏ సహకారంతో పాలస్తీనా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది గాజా మధ్య, దక్షిణ, ఉత్తర భాగాల్లో మూడు దశల్లో జరుగుతుంది. గాజాలో ఇప్పటికే 12.6 లక్షల ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (ఎన్ఓపీవీ 2) డోసులున్నాయి. త్వరలో మరో 4 లక్షల డోసులు రానున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2,000 మందికి పైగా హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. గాజా లోపల వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్ట్రిప్ అంతటా 90% వ్యాక్సిన్ కవరేజీ సాధించాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకోసం అవసరమైతే మరో రోజు యుద్ధవిరామానికి ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది. గాజాలో 2022లో 99% పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. గతేడాది 89%కి తగ్గింది. యుద్ధం వల్ల వ్యాక్సిన్ వేయక అధిక సంఖ్యలో పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదముందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లోని 6.5 లక్షలకు పైగా పాలస్తీనా బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరించేందుకు సిద్ధమని హమాస్ కూడా తెలిపింది.