Sanju
-
దుపట్టా డ్యాన్స్... దుమ్ము రేపింది
సంజూ రాథోడ్ పాడిన మరాఠీ సాంగ్ ‘గులాబి శాదీ’ సూపర్ హిట్ కావడమే కాదు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని డ్యాన్సింగ్ నుంచి లిప్–సింకింగ్ వరకు సోషల్ మీడియా యూజర్లు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో వైరల్ అయింది.‘గ్రూమ్స్ ఫ్రెండ్స్ ఆన్ ఫైర్’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. గులాబీ రంగు దుపట్టా వేసుకొని వరుడి ఫ్రెండ్స్ చేసిన డ్యాన్స్ ‘వారేవా’ అనేలా ఉంది. -
రాజ్ కుమార్ హిరానీ బర్త్‌డే స్పెషల్.. 5 బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే..
Director Raj Kumar Hirani Birthday Special And His 5 Block Busters: బాలీవుడ్లో విజయవంతమైన డైరెక్టర్లలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. నూతన దర్శకులు ఆరాధించేవాళ్లలో రాజ్ కుమార్ హిరానీ తప్పకుండా ఉంటారు. 100 శాతం సక్సెస్ రేట్‌తో హిందీ సినిమా చిత్ర దర్శకుడిగా ఘనత పొందారు. ఈ విజయపథంలో ఆయన ఇప్పటివరకు కేవలం 5 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో కథన శైలి, తెరకెక్కించిన విధానం, దృష్టికోణం భారతదేశ చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయి. పైగా ప్రేక్షకులు, విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఇవాళ (నవంబర్ 20)న రాజ్ కుమార్ హిరానీ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన 5 బ్లాక్బస్టర్లపై ఓ లుక్కేద్దామా..! 1. మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003) సంజయ్ దత్, అర్షద్ వార్సి, విద్యాబాలన్ నటించిన రాజ్ కుమార్ హిరానీ తొలి చిత్రం. ఈ సినిమా ఆయనకు మాస్టర్ స్టోరీ టెల్లర్ అనే ట్యాగ్‌ని సంపాదించిపెట్టింది. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అతిపెద్ద వసూళ్లలో ఒకటిగా నిలవడమే కాకుండా మున్నా, సర్క్యూట్ పాత్రలు బాలీవుడ్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అవి వారికి ఇంటి పేర్లుగా కూడా మారాయి. మహాత్మా గాంధీ ధర్మ బద్ధమైన సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకు హాస్యంతో తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఈ సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ కూడా చేశారు. 2. లగేరహో మున్నాభాయ్ (2006) మున్నాభాయ్ ఎంబీబీఎస్‌కు సీక్వెల్‌గా వచ్చిందే లగేరహో మున్నాభాయ్. మొదటి భాగంలో ఉన్న నటీనటులే రెండో భాగంలో కూడా ఉంటారు. సామాజిక సందేశాన్ని ఇచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను కూడా తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ పేరుతో తెరకెక్కించారు. 3. 3 ఇడియట్స్ (2009) బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 10, అత్యంత పాత్ బ్రేకింగ్ చిత్రాలలో ఒకటిగా పేరొచ్చిన చిత్రం 3 ఇడియట్స్. ఒకరకంగా ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థికైనా ఒక సిలబస్ లాంటిదీ సినిమా. నిజ జీవితంలో, చదువులో ముఖాముఖి పోటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు రాజ్ కుమార్ హిరానీ. 3 ఇడియట్స్ పూర్తిస్థాయి వినోదభరితంగా ఉంటూనే మంచి సామాజిక సందేశాన్ని ఇస్తుంది. 4. పీకే (2014) ‘3 ఇడియట్స్’ ఘనవిజయం తర్వాత రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్‌తో కలిసి మళ్లీ ఒక కొత్త తరహా కథను తెరకెక్కించారు. ఒక గ్రహాంతర వాసి, మతం, దేవుడి పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాల గురించి భూమిపై ఉన్న ప్రజలను భయపెట్టే విభిన్న కోణం నుంచి ఈ ఆసక్తికరమైన కథనాన్ని అందించారు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నటించారు. 5. సంజు (2018) సంజు చిత్రం 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటి. మొదటిసారిగా తెరపై సంజయ్ దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కించి హిట్ కొట్టారు రాజ్ కుమార్ హిరానీ. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ కథనంలో విక్కీ కౌశల్, అనుష్క శర్మ కూడా నటించారు. ఈ చిత్రం అనేక అవార్డులను కూడా దక్కించుకుంది. అలాగే రణ్‌బీర్ కపూర్‌కు అపారమైన గుర్తింపు తీసుకొచ్చింది. -
పసిడి ‘పట్టు’ చిక్కలేదు కానీ...
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట పండింది కానీ... పసిడి పట్టు ఎవరికీ చిక్కలేదు. అటు పురుషుల ఈవెంట్లో, ఇటు మహిళల విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. శుక్రవారం స్వర్ణం కోసం తలపడిన మహిళా రెజ్లర్లు సంజూ దేవి, భటేరిలు రజతాలతో సంతృప్తి చెందారు. 62 కేజీల కేటగిరీలో సెమీస్ దాకా ప్రత్యర్థులందరిపై ఆధిపత్యం చలాయించిన సంజూ దేవి తీరా ఫైనల్‌కొచ్చేసరికి పట్టు సడలించింది. రష్యా రెజ్లర్ ఎలీనా కసబియెవా 10–0 పాయింట్ల తేడాతో సంజూ ‘పసిడి’కలను కలగానే మిగిల్చింది. బౌట్లో సంజూకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఎలీనా తేలిగ్గా పడేసింది. 65 కేజీల ఫైనల్లో భటేరికి మాల్డొవా రెజ్లర్ ఇరినా రింగాసి చెక్ పెట్టింది. 12–2 తేడాతో భటేరిని ఓడించింది. కాంస్య పతక పోరులో నిలిచిన సనేహ్ (72 కేజీలు) గాయంతో విలవిలాడుతూ బౌట్ మధ్యలోనే వైదొలగింది. మరియమ్ గుసెనొవా (రష్యా) 3–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మోకాలి గాయాన్ని భరించలేక సనేహ్ ఆటను కొనసాగించలేకపోయింది. ఈ టోర్నమెంట్లో మహిళా రెజ్లర్లు పురుషుల కంటే మెరుగైన ప్రదర్శనే ఇచ్చారు. 3 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించారు. పురుషుల కేటగిరీలో భారత్ 6 పతకాలు సాధించినప్పటికీ ఒక్కటి (రజతం) మినహా అన్నీ కాంస్యాలే ఉన్నాయి. గ్రీకో రోమన్ రెజ్లర్లు అంతా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు రెజ్లర్లలో ఏ ఒక్కరు సెమీస్ అయినా చేరలేకపోయారు. -
ఇంకా లభించని బాలుడు సంజు ఆచూకీ
-
రణ్‌బీర్ మా ఇంటికొచ్చి ఆఫర్ ఇచ్చాడు
బాలీవుడ్లో సంచనాలకు మారుపేరు కంగనా రనౌత్. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరిణతి సాధిస్తూ... స్టార్ హీరోయిన్గా ఎదిగిన తీరులో ఆమెకు ఆమే సాటి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెబుతూ.. ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. క్వీన్ సినిమాతో ఉత్తమ నటిగా అవార్డు పొందిన కంగనా.. సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక పాత్ర నచ్చకపోతే బడా బాబుల ఆఫర్లను సైతం తిరస్కరిస్తానని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. తాజాగా స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, బడా నిర్మాత ఆదిత్య చోప్రాకు తాను గతంలో నో చెప్పిన విషయాన్ని పింక్‌విల్లాతో పంచుకున్నారు. సంజు, సుల్తాన్ సినిమాల్లో నటించే అవకాశం తనకు లభించిందని అయితే తానే వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు.(చిన్నప్పుడే డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా) ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ... ‘‘సంజు సినిమాలో నటించమని రణ్‌బీర్ కపూర్ మా ఇంటికి వచ్చి మరీ నాకు ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో పాత్ర నాకు అంతగా నచ్చలేదు. అందులో నటనకు ఆస్కారం ఉన్నట్లు అనిపించలేదు. కాబట్టి కుదరదని చెప్పాను. అసలు రణ్‌బీర్‌కు నో చెప్పే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా?ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం.. సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా కోసం ఆదిత్య చోప్రా తొలుత నన్ను సంప్రదించారు. నేను కుదరదన్నాను. దాంతో ఆయన నాకు ఫోన్ చేసి... ఇంకెప్పుడూ నాతో కలిసి పనిచేయనని చెప్పారు. అదే జరిగింది. అయినా నచ్చని పని చేయనందుకు పశ్చాత్తాపం లేదు’’ అని కంగనా చెప్పుకొచ్చారు ఇక... నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే తనను ఇండస్ట్రీలో నిలబెట్టాయని.. సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయకపోవడం కాస్త వేదనకు గురిచేసిందని కంగనా పేర్కొన్నారు. పద్మావత్ తర్వాత సినిమా చేద్దామన్నారని.. కానీ కుదరలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా సంజయ్ దత్ బయోపిక్‌గా తెరకెక్కిన సంజు భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా సుల్తాన్ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. -
టాప్ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్!
‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం సంపాదించడం కష్టం అవుతుందని సైలెంట్‌గా ఉండిపోయాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశారామె. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. టాప్ డైరెక్టర్‌పై ఇలాంటి ఆరోపణ రావడం బాలీవుడ్‌కి పెద్ద షాకే. -
‘రాజ్‌కుమార్ హిరాణీ నాపై లైంగిక దాడి చేశాడు’
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం బాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై లైంగిక దాడి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపణలు చేశారు. సంజు సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఆమెపై సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో 2018 మార్చి-సెప్టెంబర్ మధ్యకాలంలో హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ మేరకు ఈ ఘటన గురించి సంజు సినిమా నిర్మాత విధూవినోద్ చోప్రాకు ఆమె ఈమెయిల్ పంపినట్లు తెలిసింది. ‘హిరాణీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం ఆయన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ను. నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. నా పట్ల జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం. తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సిం వచ్చింది’’ అని ఆమె మెయిల్ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు. తనపై వస్తున్న ఆరోపణలను హిరాణీ తీవ్రంగా ఖండించారు. ఆయన తరఫు న్యాయవాది ఆనంద్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆయపై కావాలనే ఎవరో తప్పడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన పేరు చెడగొట్టడానికి ఎవరో ఇలా చేయిస్తున్నారని అన్నారు. రాజ్‌కుమార్ హిరాణీ వంటి పెద్ద దర్శకుడిపై ఓ సహాయ దర్శకురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ మీటూ ఉద్యమం తీవ్రతరమైంది. -
మంచి చాన్స్ మిస్
మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం చేజారినప్పుడు ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌సింగ్, సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. కానీ సునీల్ దత్ పాత్రలో నటించే అవకాశం తొలుత అక్షయ్ ఖన్నాకు వచ్చింది. ‘‘సంజు సినిమాలో సునీల్ దత్ పాత్రకోసం లుక్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నేను మిస్ ఫిట్ అని హిరానీ ఫీల్ అయ్యారు. ఇలా మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం నాకు దక్కలేదు’’ అని పేర్కొన్నారు అక్షయ్ ఖన్నా. -
ఆమిర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టిన ‘‘సంజు’’
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ సినిమా అగ్రకథానాయకుల రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘‘టైగర్ జిందా హై’’ రికార్డును తుడిచిపెట్టిన ‘సంజు’ మూడవ స్థానంలో ఉన్న ఆమిర్ ఖాన్ ‘‘పీకే’’ రికార్డును సైతం బద్దలుకొట్టింది. విడుదలైన 5 వారాల్లో 341కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా సంజు నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా మొదటి రెండు స్థానాల్లో బాహుబలి-2(510కోట్లు), దంగల్(387కోట్లు) ఉన్నాయి. కొత్తగా విడుదలవుతున్న సినిమాలకు సంజు గట్టిపోటీ ఇస్తోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన సంజు సినిమాలో రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. -
‘నా గర్ల్‌ఫ్రెండ్‌ను మోసం చేశాను’
బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంజు మూవీ హిట్‌తో ఇటు ప్రొపెషనల్ లైఫ్‌లో, కో స్టార్ అలియా భట్‌తో ఏర్పడిన సరికొత్త ప్రేమ బంధంతో అటు పర్సనల్ లైఫ్‌లోనూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే సినిమాల కన్నా... హీరోయిన్లతో కొనసాగించిన ప్రేమాయణాలతోనే ఈ చాక్లెట్ బాయ్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు. సంజు ట్రైలర్ లాంచ్ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘సంజుకు 308 మంది ఉన్నారు. కానీ, తన ప్రియురాళ్ల సంఖ్య ఇంకా పదికి కూడా చేరలేదని’ రణ్‌బీర్ నిజాయితీగా ఒప్పేసుకున్నాడు కూడా. అలియాతో రిలేషన్ షిప్ గురించి చెబుతూ... ‘ప్రేమలో పడటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కొత్త మనిషి.. కొత్త ఆలోచనలు.. పాత విషయాలనే మరోసారి కొత్తగా చేస్తుంటామని.. అయితే ప్రస్తుతం తాను చాలా మారానని, బంధాలకు చాలా విలువ ఇస్తానని’ అన్నారు. దీపికాతో బ్రేకప్ అనంతరం కూడా రణ్‌బీర్ ఇలాగే ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘అవును. నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను మోసం చేశాను. అపరిపక్వత, అనుబంధాలను పటిష్ట చేసుకునే నేర్పు లేకపోవడం.. అడ్వాంటేజ్ తీసుకోపోవడం.. ఇవన్నీ నా తప్పులే. కానీ ప్రస్తుతం నేను రియలైజ్ అయ్యాను. అందుకే ఓ కొత్త వ్యక్తితో.. ఓ ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను. మా ఇద్దరికీ పరస్పరం నమ్మకం, ప్రేమ ఉన్నాయి. గతంలో నాకు ఇలాంటి వ్యక్తి తారసపడలేదు. అందుకే బ్రేకప్ అయ్యిందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కత్రినా గురించి గొప్పగా చెప్పారు. అయితే ప్రస్తుతం కత్రినాతో బ్రేకప్ చేసుకున్న తర్వాత అలియా గురించి కూడా ఇలాగే మాట్లాడటంతో.. రణ్‌బీర్ మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కావడం లేదంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. -
చెత్త సినిమాగా తేల్చేశారు
బాలీవుడ్లో గత శుక్రవారం రిలీజ్ అయిన చిత్రాల్లో ఒకటి సంజయ్ దత్ నటించిన సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ -3. ఉన్నంతలో కాస్త పెద్ద చిత్రంగా భావించిన ఈ చిత్రం ఏ దశలోనూ బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపం చూపించలేకపోయింది. టిగ్మాన్షూ ధూల్హియా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో జిమ్మీ షెయిర్గిల్, మహి గిల్, సంజయ్ దత్, చిత్రాంగద సింగ్ కీలకపాత్రలు పోషించారు. లీడ్ పాత్రల ఫెర్ఫార్మెన్స్ మాట పక్కన పెడితే కథలో పెద్దగా పసలేకపోవటంతో పూర్ రివ్యూలు దక్కాయి. క్రిటిక్స్ పరమ చెత్త మూవీగా తేల్చేశారు. రెండు రోజులకే డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్లలోనూ ఢీలా పడిపోయింది. కేవలం రూ. 5 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి.. మేకర్లకు భారీ నష్టాన్ని అందించింది. లాంగ్ రన్లో ఈ చిత్రం కలెక్షన్లు సింగిల్ డిజిట్ దాటడమే కష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సంజయ్ దత్ బయోపిక్ సంజు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై కలెక్షన్లను దాటేసి వసూళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో పీకే రికార్డును కూడా క్రాస్ చేసే మూడో స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా హయ్యెస్ట్ గ్రాసర్ దంగల్, బాహుబలి-2 లు టాప్ 2 స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే. -
ఆల్‌టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ లిస్ట్‌లో ‘సంజు’!
రణ్‌బీర్ కపూర్ లుక్‌ను రిలీజ్ చేసినప్పటినుంచీ సంజు సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక సినీ అభిమానులు సంజు కోసం ఎదురుచూశారు. మొత్తానికి సినిమా విడుదలై రికార్డుల వేటను మొదలుపెట్టింది. సినిమా రిలీజ్ రోజు నుంచీ కలెక్షన్ల మోతమోగిస్తోంది. సంజు మూవీ కంటెంట్ పట్ల కొందరు వ్యతిరేకతను ప్రదర్శిస్నున్నా.. అవేమీ సినిమా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న వివాదాస్పద దర్శకుడు వర్మ ఈ సినిమాపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. నిజాల్ని దాచి సంజయ్‌దత్‌ను మంచిగా చూపించాడనే విమర్శలు వినిపిస్తోన్నా.. ఈ మూవీ మాత్రం బాలీవుడ్లో ఆల్‌టైమ్ హిట్‌గా నిలుస్తోంది. విడుదలైన ఐదో వారాంతం కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని ప్రముఖ ట్రేడ్ అనలిష్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. టైగర్ హై జిందాను దాటి.. పీకేను చేజ్ చేస్తూ.. ఇప్పటికి నాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా 339కోట్లతో వసూళ్లతో దూసుకెళ్తోందంటూ ట్వీట్ చేశారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ నటన ఈ మూవీకి హైలెట్‌గా నిలిచింది. #Sanju crosses *lifetime biz* of #TigerZindaHai... Now FOURTH HIGHEST GROSSING *Hindi* film... Chasing #PK *lifetime biz* now... [Week 5] Fri 45 lakhs, Sat 87 lakhs, Sun 1.15 cr. Total: ₹ 339.75 cr. India biz. ALL TIME BLOCKBUSTER. — taran adarsh (@taran_adarsh) July 30, 2018 -
‘సంజు’ టీంకు షాకిచ్చిన గ్యాంగ్‌స్టర్
సాక్షి, ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన సినిమా ‘సంజు’ . పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు మాత్రమే దర్శకుడు తాపత్రయ పడ్డారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం కూడా సంజు మేకర్స్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న సీన్ 15 రోజుల్లోగా తొలగించాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవంటూ’ తన లాయర్ ప్రశాంత్ పాండే ద్వారా అబూ సలేం ‘సంజు’ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించాడు. సంజయ్ దత్‌ను కలవనేలేదు.. ‘1993 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి తనకు అబూ సలేం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడని రణ్‌బీర్ కపూర్ చేత చెప్పించారు. అసలు నా క్లైంట్(అబూ సలేం) సంజయ్ దత్‌ను ఒక్కసారి కూడా కలవలేదు, ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయలేదు. కాబట్టి ఆయన పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించిన ఈ సీన్‌ను 15 రోజుల్లోగా తొలగించాలి. అదే విధంగా అబూ సలేంకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలి. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’ ప్రశాంత్ పాండే నోటీసులో పేర్కొన్నారు. కాగా ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను దోషిగా నిర్ధారించిన టాడా ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. -
క్రిస్మస్ కానుకగా ‘మొఘల్’..!!
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఆటగాళ్లు, నటులు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితం ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి మంచి వసూళ్లు సాధించాయి. తాజాగా సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ‘సంజు’ సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో మరికొన్ని బయోపిక్‌లు తెరక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. కాగా ప్రస్తుతం బీ- టౌన్లో మరో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. ప్రఖ్యాత మ్యూజిక్ కంపెనీ టీ- సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, టీ- సిరీస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సుభాష్ కపూర్(జాలి ఎల్ఎల్బీ ఫేం) దర్శకత్వం వహించనున్నారు. ‘మొఘల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో గుల్షన్ కుమార్‌గా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను ఈ క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తోందట. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. BIG NEWS... Aamir Khan Productions and TSeries to release Gulshan Kumar biopic in Christmas 2019... Written and directed by Subhash Kapoor... Filming to begin early next year. — taran adarsh (@taran_adarsh) July 26, 2018 -
ఒక్క యాడ్ కోసం 6 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా వారికి వర్తించినంత బాగా వేరే ఎవరికి వర్తించదమో. ఎందుకంటే విజయాలు ఉంటేనే వారికి గుర్తింపు, ఆదాయం. అందుకే ఫామ్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు హీరో హీరోయిన్లు. ప్రస్తుతం ఇదే బాటలో ఉన్నారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. ఇన్నాళ్లు వరుస వైఫల్యాలు చూసిన రణ్‌బీర్ కెరీర్‌ను ‘సంజు’ ఒక్కసారిగా మలుపుతిప్పింది. దాంతో ఆయన తన పారితోషికాన్ని రెండింతలు పెంచేశారంట. అయితే పారితోషికం పెంచింది సినిమాలకు కాదు, ప్రకటనల కోసం. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్‌తో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ‘సంజు’ విజయం తర్వాత ఈ హీరో ప్రకటనల కోసం తీసుకునే పారితోషకాన్ని రెండు రెట్లు పెంచినట్లు సమాచారం. గతంలో రణ్‌బీర్ కమర్షియల్ వర్క్ కోసం రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల రూపాయలు తీసుకునేవారంట. కానీ ఇప్పుడు రోజుకు రూ.6 కోట్లు అడుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రణ్‌బీర్ దాదాపు 10 బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. ‘సంజు’ తర్వాత రణ్‌బీర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టులో తొలి పార్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
తెరపైకి ఆర్జీవీ ‘సంజు’
ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంజుగా నటించిన రణ్‌బీర్‌కు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం సంజు సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అదే పేరుతో (సంజు : ది రియల్ స్టోరీ) సంజయ్ దత్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. హిరాణీ ‘సంజు’ సినిమాలో సంజయ్ దత్ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు మాత్రమే తాపత్రయ పడ్డారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆర్జీవీ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... సంజయ్ దత్ నిజమైన బయోపిక్‌ను తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. ‘హిరాణీ సంజు నచ్చింది. కానీ నా సినిమాలో రెండు దశాబ్దాలుగా సంజయ్‌ను వెంటాడుతున్న ఓ సమస్య గురించి ప్రధానంగా చర్చించబోతున్నానంటూ’ పరోక్షంగా ముంబై పేలుళ్ల కేసు గురించి వ్యాఖ్యానించారు. సంజయ్ వద్దకు ఏకే- 56 రైఫిల్ ఎలా వచ్చింది.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి నా సినిమాలో చూస్తారంటూ ఆర్జీవీ హింట్ ఇచ్చారు. ఇందుకోసం సంజయ్ కుటుంబ సభ్యులతో పాటు అతడి సన్నిహితులను, కొంత మంది పోలీసు, విచారణ అధికారులను సంప్రదిస్తున్నానని పేర్కొన్నారు. -
‘మహానటి’కి మరో గౌరవం..!
సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్లో జరుగునున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో మూడు ప్రధాన విభాగాల్లో మహానటి పోటి పడనుంది. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటి కేటగిరిలో కీర్తీ సురేష్ బాలీవుడ్ స్టార్స్ రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్, విద్యాబాలన్‌లతో.. సహాయ నటి కేటగిరిలో సమంత.. రిచా చడ్డా, ఫ్రిదా పింటో, మెహర్ విజ్‌లతో పోటి పడుతున్నారు. ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో తెలుగు సినిమా రంగస్థలంతో పాటు ప్యాడ్‌మ్యాన్, హిచ్కీ, సంజు, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి భారీ చిత్రాలతో మహానటి పోడిపడనుంది. -
‘ఆమె గొంతు వినగానే ఏడుపు ఆపుకోలేకపోయాను’
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సంజయ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉందనే విషయం అందరికి తెలిసిందే. స్వయంగా సంజయ్ దత్తే ఈ విషయం గురించి చెప్పారు. మా అమ్మ చనిపోయిందని చెప్పి అమ్మాయిల దగ్గర సానుభూతి పొంది వారికి దగ్గరయ్యేవాడినని సంజయే స్వయంగా ఒప్పుకున్నారు. అయితే నిజ జీవితంలో మాత్రం తన తల్లి నర్గీస్ దత్ చనిపోయినప్పుడు సంజయ్‌కు కన్నీళ్లు రాలేదంట. అసలు ఆ సమయంలో అతనికి ఎటువంటి ఫీలింగ్ కలగలేదంట. కానీ ఆమె చివరి రోజుల్లో ఆస్పత్రిలో ఉండగా తన కోసం పంపించిన మెసేజ్‌ను విన్నప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు సంజయ్. ఈ విషయం గురించి సంజయ్ మా అమ్మ నర్గీస్ ఎన్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా కోసం ఒక సందేశాన్ని రికార్డు చేసి పంపించారు. దానిలో నా గురించి మా అమ్మ ‘సంజు అన్నింటి కంటే ముఖ్యమైనది వినయం. నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకో, దాన్ని కోల్పోకు. పెద్దలను గౌరవిస్తూ, ఒదిగి ఉండూ. అదే నిన్ను కాపాడుతుంది, అదే నీకు బలం’ అని తెలిపారు. ఆ సందేశం వినగానే నన్ను నేను నియంత్రించుకోలేక పోయాను. మా అమ్మ మరణించినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కానీ మా అమ్మ మరణించిన తర్వాత ఆమె గొంతు విన్న నాకు ఏడుపు ఆగలేదు. అలా 4,5 గంటల పాటు ఏడుస్తునే ఉన్నాను అని తెలిపారు. నర్గీస్ మరణించిన తర్వాత సంజయ్ డ్రగ్స్‌కు బానిసయ్యారు. ఆ వ్యసనం నుంచి బబయటపడేందుకు అమెరికాలోని రిహబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. ఆ సమయంలో సునీల్ దత్ ఈ టేప్‌లను సంజయ్ దగ్గరకు తీసుకువచ్చారు. ఆ టేప్‌లలో ఏముందో సునీల్ దత్‌కు కూడా తెలియదంటా. ఆయన వాటిని ప్రెస్ చేయగానే ఆ గదిలో ఒక్కసారిగా నర్గీస్ గొంతు ప్రతిధ్వనించిందంట. తల్లి గొంతు విన్న సంజయ్ తనను తాను నియంత్రించుకోలేక పోయారంటా. అన్నాళ్లు మనసులో గూడు కట్టుకుపోయిన బాధ ఒక్కసారిగా బయటకు వచ్చి అలా ఏడుస్తూనే ఉన్నారంటా. ఇదంతా నర్గీస్ చనిపోయిన మూడేళ్ల తర్వాత జరిగింది. సంజయ్ ఈ విషయం గురించి చెప్తుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నర్గీస్ 1981లో క్యాన్సర్‌తో బాధపడుతూ చనిపోయారు. ఆమె మరణం తర్వాతే సంజయ్ డ్రగ్స్‌కు బానిసయ్యారు. -
రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో సంబురాలు
దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. సంజు చిత్రం రూ. 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ దత్ బయోపిక్‌గా తెరకెక్కిన సంజులో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్ పోషించగా, రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్టర్. సంజు బాబా లైఫ్‌లోని ప్రధాన కోణాలతో ఈ చిత్రాన్ని భావోద్వేగంగా హిరాణీ తెరకెక్కించాడు. తొలిరోజు రూ.34 కోట్లు రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన సంజు.. వరుస డిజాస్టర్లతో అయోమయంలో ఉన్న రణ్‌బీర్ కెరీర్‌కు భారీ సక్సెస్ ఇచ్చింది. అమీర్‌ఖాన్ దంగల్(2016 డిసెంబర్) తర్వాత రిలీజ్ అయిన (బాహుబలి-2ని మినహాయిస్తే...) చిత్రాలేవీ పట్టుమని మూడు వందల కోట్ల క్లబ్లో చేరలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ట్యూబ్‌లైట్.. షారూఖ్ నటించిన జబ్ హ్యారీ మెట్ సెజల్లు చతికిలపడగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన టైగర్ జిందా హై, రేస్-3.. పద్మావత్ లాంటి చిత్రాలు ఆ ఫీట్‌ను సాధించలేకపోయాయి. ఈ తరుణంలో బిగ్గెస్ట్ హిట్ కోసం బాలీవుడ్ దాహాన్ని సంజు తీర్చేసింది. ఇండియాలో రెండువారాల్లో 378 కోట్ల (గ్రాస్), రూ.295 కోట్ల(నెట్) వసూళ్లు(తొలివారంలోనే రూ.202 కోట్లు) రాబట్టింది. ఓవర్సీస్లో రూ.122 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో 7 మిలియన్ క్లబ్ దాటేసి ఇంకా దూసుకుపోతోంది. విమర్శలు... అయితే సంజు జీవితంలోని చీకటి కోణాలు పేరిట రాజ్‌కుమార్ హిరాణీ తప్పులను కప్పిపుచ్చాడని పలువురు విమర్శలకు దిగారు. ఈ క్రమంలో మిశ్రమ రివ్యూలు ఇవ్వటంతోపాటు, పలు కోణాల్లో క్రిటిక్స్ సంజును తప్పుబట్టారు. అయితే తన జీవితం తెరిచిన పుస్తకమని, దాచేందుకు ఏం లేదంటూ విమర్శలపై సంజయ్ దత్ అంతే ఘాటుగా స్పందించారు. -
‘మా తల్లిదండ్రుల పాత్రలో ఎవరిని ఊహించలేను’
సంజయ్‌దత్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘సంజు’ సినిమా సూపర్‌హిట్టయిన సంగతి తెలిసింది. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ ప్రస్తుతం 300 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకుపోతుంది. ఒకప్పటి బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్ జీవతంలో ఉన్న ఎత్తుపల్లాలన్నింటిని దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించాడు. మున్నాబాయ్ జీవితంలో మత్తు పదార్ధాల దశ, పలువురు హీరోయిన్లతో అతనికి ఉన్న సంబంధాలు, అక్రమాయుధాలు కలిగి ఉన్న కేసులో జైలుకెళ్లడం వంటి పలు అంశాలను వాస్తవికంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే ‘సంజు’ చిత్రంలో కేవలం సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు, తల్లి నర్గీస్ పాత్రలకే ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారని, సంజయ్ సోదరిమణులు నమ్రతా దత్, ప్రియా దత్‌లను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం గురించి సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ ‘‘సంజు’ సినిమా నాకు నచ్చింది. కానీ సంజయ్ దత్ కుటుంబ సభ్యురాలిగా, సంజయ్‌కు అత్యంత ఆప్తురాలిగా సినిమాను విశ్లేషించాలంటే కాస్తా కష్టమే. ఎందుకంటే సంజయ్ జీవితంలో ప్రతి క్షణం నేను అతనితో పాటే ఉన్నాను. అతన్ని దగ్గరి నుంచి చూశాను’ అన్నారు. అలానే సునీల్ దత్ పాత్రలో నటించిన పరేష్ రావల్ గురించి మాట్లాడుతూ ‘మా నాన్న చాలా ప్రత్యేకం, ఆయన పాత్రలో నేను ఎవరిని ఊహించుకోలేను. నేను ప్రేక్షకురాలిని కాదు కదా. అందుకే మా నాన్న పాత్రలో నటించిన పరేష్ రావల్‌కు నేను అంతగా కనెక్ట్ కాలేకపోయాను. అయితే పరేష్ రావల్ పాత్ర నాకు నచ్చలేదని కాదు. కానీ నేను ఆయన పాత్రకు అంతగా కనేక్ట్ కాలేకపోయాను అంతే. ఎందుకంటే నేను సునీల్ దత్ కూతుర్ని’. అన్నారు. అలానే తమ తల్లి పాత్రలో నటించిన మనిషా కోయిరాల గురించి మాట్లాడుతూ ‘మా అమ్మ పాత్రకు మనీషా కోయిరాల బాగానే సరిపోయింది. కానీ సునీల్ దత్, నర్గీస్‌ల కూతురిగా వారి పాత్రలో మరొకరిని ఊహించలేను. అలానే సంజయ్ కుటుంబ సభ్యురాలిగా సినిమా గురించి ఎటువంటి కామెంట్ చేయలేను. కానీ ప్రేక్షకులు వారి వారి పాత్రలకు బాగానే కనేక్ట్ అయ్యారు. అది చాలా గొప్ప విషయం’ అన్నారు. సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఒదిగిపోయాడని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో తనను బాగా కదిలించిన సన్నివేశాలు సంజయ్ మత్తుపదార్ధాలకు బానిసవ్వడం, ఆ తర్వాత వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అని తెలిపారు. ఈ విషయం గురించి ‘అది నిజంగానే చాలా కష్ట సమయం, ముఖ్యంగా మా నాన్న గారికి. కానీ సంజయ్‌కి వీటన్నింటి నుంచి బయటపడేందుకు కావాల్సిన ధైర్యం ఉంది. అందుకే మత్తు పదార్ధాల వ్యసనాన్ని జయించగలిగాడు. మళ్లీ దాన్ని పురావృతం కాకుండా చూసుకోగలిగాడు. అలానే సంజు జైలు జీవితం గడపడం కూడా చాలా కష్టమైన దశే. కానీ వీటన్నింటిని కూడా అతను ఎంతో ధైర్యంగా ఎదుర్కొగలిగాడు’ అని తెలిపింది. -
సంజయ్ దత్ గొప్పా.. ఎలా? : పాంచజన్య
న్యూఢిల్లీ : సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’ చిత్రాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధికారిక వార పత్రిక పాంచజన్య సమాజానికి బాలీవుడ్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందో చెప్పాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎడిటోరియల్ కాలమ్‌లో సంజూ సినిమాను ఉద్దేశించి ఓ కథనాన్ని ప్రచురించింది. హాలీవుడ్ ‘ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ పేరుతో గణిత శాస్త్రంలో మేధావి అయిన రామనుజం జీవిత చరిత్రను తెరకెక్కిస్తే, బాలీవుడ్ మాత్రం అండర్వరల్డ్కు సంబంధించిన వారిపై చిత్రాలను తీస్తోందంటూ మండిపడింది. అండర్‌వరల్డ్‌ను, సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ సంజూ సినిమాను తీశారని వ్యాఖ్యానించింది. ముంబై పేలుళ్లలో సంజయ్ దత్ దోషిగా తేలడాన్ని, అతని అరెస్ట్‌ను, కూతురితో అతనికున్న సంబంధాలను కూడా ఈ సందర్భంగా పాంచజన్య ప్రస్తావించింది. సంజయ్ దత్‌కు లేని అవలక్షణం లేదు. అతడు 1993 బాంబు పేలుళ్లు, మత హింసలో పాలుపంచుకున్నాడు. మారణాయుధాలను తన దగ్గర దాచుకున్నాడు. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. తన కూతురిని కొన్నేళ్లుగా కనీసం కలవనేలేదు. సినిమాలో చూపించినట్లుగా అతనికి 308 మంది అమ్మాయిలతో శారీరక సంబంధం ఉంది. ఇదీ సంజయ్ దత్. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించి పొగడ్తలతో ముంచెత్తడంపై తీవ్ర స్థాయిలో ఆ పత్రిక ధ్వజమెత్తింది. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై కూడా పాంచజన్య విరుచుకుపడింది. గతంతో పీకే వంటి సినిమాను హిందువులకు వ్యతిరేకంగా హిరాణీ తీశారని, ఇప్పుడు అవలక్షణాలు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిని సమాజానికి ఏదో చేసేసినట్లు హీరోను చేసి చూపించడం సరియైన పద్దతేనా? అని ప్రశ్నించింది. ఇలాంటి చిత్రాల నిర్మాణానికి గల్ఫ్ నుంచి నుంచి పెట్టుబడులు వస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. -
‘ఆయన లేఖ చూసి ఆశ్చర్యానికి లోనయ్యా’
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజు’. ఇందులో సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్, తండ్రి సునీల్ దత్‌గా పరేష్ రావెల్ నటించారు. సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పరేష్ రావెల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు సునీల్ దత్ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. సునీల్ దత్ చనిపోయే కొద్ది రోజుల ముందు పరేష్‌కు ఓ లేఖ రాశారు. అతను చనిపోయిన రోజు తనకు ఆ లేఖ గురించి తెలిసిందని పరేష్ సునీల్ దత్తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ‘మే 25, 2005న.. నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో సునీల్ దత్ స్వర్గస్తులయ్యారని తెలిసింది. సునీల్ నివాసానికి వెళుతున్నా, రాత్రి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. సునీల్ దత్ నుంచి మీకో ఉత్తరం వచ్చిందని నా భార్య నాకు చెప్పింది. అందులో ఏం రాసుందని అడిగాను. ‘ డియర్ పరేష్ జీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు, మీ కుటుంబ సంభ్యులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అని రాసి ఉందని నా భార్య సమాధానమిచ్చింది. నా పుట్టిన రోజు మే 30న కానీ ఐదు రోజు ముందుగానే సునీల్ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. సునీల్ జీ, నేను పండగల సమయంలో కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకోం. ఆయన చనిపోవడానికి ముందు ఈ లేఖ నాకు రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది’ అని పరేష్ రావెల్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.265 కోట్లు వసూళ్లను రాబట్టి, రూ.300కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. -
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’
ముంబై: సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాకుండా అత్యంత తక్కువ సమయంలో రూ.200 కోట్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. పదో రోజు (ఆదివారం) రూ. 28.05 కోట్లు వసూలు చేసింది. దీంతో సంజు సినిమా ఇప్పటి వరుకూ రూ.265.48 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. విడుదలైన తొలి మూడు రోజులకే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రణ్‌బీర్‌కపూర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ జీవించేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి. -
‘సంజు’ సిన్మాకు సంజయ్ ఎంత తీసుకున్నారు?
బయోపిక్‌లు వాస్తవానికి దూరంగా తెరకెక్కుతున్నాయన్న విమర్శలు వస్తోన్నా.. సినిమాలు మాత్రం విజయవంతమవుతున్నాయి. బాలీవుడ్లో అందరూ ఎదురుచూసిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమా గత వారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటనకు బాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోతోంది. రాజ్‌కుమార్ హిరాణీ గత సినిమాల మాదిరిగానే ‘సంజు’ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తోంది. విడుదలైన వారంలోనే దాదాపు 200కోట్లు కలెక్ట్ చేసి ప్రస్తుతం 250కోట్లకు పరుగెడుతోంది. అయితే ఈ సినిమాకు గాను సంజయ్‌దత్‌కు ఎంత ముట్టజెప్పారన్న వార్తలు వైరల్‌గా మారాయి. సంజయ్‌దత్‌కు మొదటగా ఓ పదికోట్లు ఇచ్చారని, సినిమా లాభాల్లో షేర్ కూడా ఉందనీ.. మొత్తంగా సంజయ్ దత్‌కు దాదాపు 20కోట్ల వరకు ముట్టవచ్చని బీటౌన్ టాక్. విదూ వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరాణీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనమ్‌కపూర్, మనీషా కొయిరాల, పరేష్ రావెల్, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ ముఖ్యపాత్రల్లో నటించారు. -
సంజు సినిమాలో ఆ విషయాలు చూపలేదు!
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలన్నింటినీ తెరపై చూపించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నా.. చాలా ముఖ్యమైన విషయాలను విస్మరించారని విమర్శకులు అంటున్నారు. సంజయ్ జీవితంలో కీలక పాత్రలు పోషించిన వారిని తెరపై అసలు చూపలేదని వారి వాదన. వారిలో సంజయ్ దత్ ఆప్త మిత్రుడైన సల్మాన్ ఖాన్, ప్రియురాలు మాధురీ దీక్షిత్ వంటి వారిని చూపలేదని, సంజయ్ కథానాయకునిగా తెరకెక్కిన రాఖీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ టీనా మునిమ్‌తో సంజుకు ఉన్న అఫైర్ గురించి ప్రస్తావన లేదని వారు అంటున్నారు. రిషీ కపూర్ రాసిన ‘ఖుల్లంఖుల్లా’ అనే పుస్తకంలో టీనా మునిమ్ ప్రస్తావన తెచ్చారాయన. సంజయ్ అతని మిత్రుడు గుల్సన్ గ్రోవర్.. టీనా మునిమ్‌తో తనకు అఫైర్ ఉందన్న అనుమానంతో తనను కొట్టడానికి ఇంటికి వచ్చారని, అయితే తనకు కాబోయే భార్య నీతూ సింగ్ వారికి నచ్చచెప్పటంతో గొడవ సద్దుమణిగిందని ఆ పుస్తకంలో రిషీ కపూర్ రాసుకున్నారు. సంజయ్ జీవితంలోని ఎన్నో విషయాలను నిర్భయంగా చూపించిన చిత్రయూనిట్.. ఇలాంటి విషయాలను దాచిపెట్టడం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.