anantapur sp
-
దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతా: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం కలిశారు. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని ఆయన కోరారు. అనంతరం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటికి వెళ్లేందుకు టీడీపీ నేతల అనుమతి అవసరమా? అంటూ ప్రశ్నించారు. అవసరమని ఎస్పీ చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ కోరేందుకు సిద్ధమని.. దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతానన్నారు.ఓ మాజీ ఎమ్మెల్యేని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియా ప్రతినిధులను బెదిరించినా పోలీసులు మౌనంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా ఎస్పీ జగదీష్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తా’’ అని పెద్దారెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే ‘లెక్క’లేదా? -
అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాష్ పెట్టిన అట్రాసిటీ కేసు ఫాల్స్‌గా నిర్థారణ అయ్యింది. ఎస్పీపై నమోదైన ఎఫ్ఐఆర్పై అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ సమగ్ర విచారణ చేశారు. చదవండి: 15 మంది బాయ్‌ఫ్రెండ్స్.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. పోలీసు నియమావళిని ఉల్లంఘించినందునే కానిస్టేబుల్ ప్రకాష్‌ను ఎస్పీ డిస్మిస్ చేశారని ఆయన వెల్లడించారు. 11 క్రిమినల్ కేసులు నమోదైనందునే ప్రకాష్‌ను ఎస్పీ డిస్మిస్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. దురుద్దేశంతో ఎస్పీ ఫకీరప్ఫపై డిస్మిస్ కానిస్టేబుల్ కేసు పెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో అనంతపురం టూటౌన్లో నమోదైన ఈ కేసును కొట్టివేశారు. -
పోలీసులపై తప్పుడు కథనాలు.. ఈనాడుకు ఎస్పీ ఫకీరప్ప నోటీసులు
సాక్షి, అనంతపురం: పోలీసులపై తప్పుడు కథనాలు రాస్తున్న ఈనాడుపై ఎస్పీ ఫకీరప్ప సీరియస్ అయ్యారు. తప్పుడు కథనాలపై వివరణ కోరేందుకు ఫకీరప్ప.. బుధవారం ఈనాడు కార్యాలయానికి వెళ్లి సిబ్బందికి నోటీసులు అందజేశారు. అయితే, ఇటీవల ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాశ్‌పై ఇది వరకే పలుమార్లు సస్పెన్షన్ వేటు పడింది. అయినప్పటికీ ప్రకాశ్‌ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కానిస్టేబుల్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోగ్రామ్ సందర్భంగా ప్రకాశ్ నిరసన వ్యక్తం చేసినందుకే కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేశారని ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. అంతేకాకుండా పోలీసు అధికారులను టార్గెట్ చేస్తూ వార్తలు రావడంతో వివరణ కోరేందుకు ఈనాడు కార్యాలయానికి వెళ్లిన ఫకీరప్ప సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. -
విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగలేదు: ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, అనంతపురం: సాయిబాబా కాలేజీలో విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగలేదని ఎస్పీ ఫక్కీరప్ప సృష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల ముసుగులో కొందరు రాళ్ల దాడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. రాళ్ల దాడి వల్లే గాయపడ్డానని విద్యార్థిని జయలక్ష్మి నిజాయితీగా చెప్పారు. ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అబద్ధాలు సృష్టించి ధర్నాలు చేయడం మానుకోవాలని ఎస్పీ ఫక్కీరప్ప హితవు పలికారు. -
బిడ్డ కోసం ఎస్పీ ఎదుట స్టాఫ్‌వేర్ ఇంజినీర్ ఆవేదన
సాక్షి, అనంతపురం : ‘అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాబును తన భర్త వెంకటరెడ్డి, అతని బంధువులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇదే విషయమై ధర్మవరం డీఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పాలు తాగే పసికందు సార్ అంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపలేదు. కేసు తీసుకునేది లేదంటూ డీఎస్పీ రమాకాంత్ సార్‌తో పాటు ఇతర పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారు. నా బాబుకు రెండేళ్లు సార్.. ఇప్పుడు వాడెలా ఉన్నాడో సార్.. దయచేసి నా బాబు (శశాంక్‌రెడ్డి)ని నాకు ఇప్పించండి’ అంటూ ఎస్పీ బి.సత్యయేసుబాబు ఎదుట బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వినయ బోరున విలపించారు. కొత్త చెరువు సీఐపై ఎస్పీ ఆగ్రహం ఎస్పీ సత్యయేసుబాబు ఆధ్వర్యంలో స్థానిక డీపీఓ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన పోలీస్ స్పందన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరెడ్డితో పెళ్లై మూడేళ్లయిందని, బాబు పుట్టినప్పటి నుంచి తనను డబ్బు కోసం వేధిస్తున్నాడని ఈ సందర్భంగా బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే ధర్మవరం డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం కొత్త చెరువు సీఐకు ఫోన్ చేసి వినయ ఘటనపై ఆరా తీశారు. సీఐ చెప్పిన సమాధానంతో ఎస్పీ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ‘ఐదేళ్ల వరకూ బిడ్డ తల్లి వద్ద ఉండాలన్న విషయం నీకు తెలియదా? డూ వాట్ ఐ సే... మొదట బిడ్డను తల్లికి అప్పగించే ఏర్పాటు చేయ్’ అంటూ సీఐను ఆదేశించారు. కాగా, ఎస్పీ స్పందన కార్యక్రమానికి మొత్తం 89 ఫిర్యాదులు అందాయి. చదవండి : ‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’ అత్యాచారం చేసి.. రూ. 5 చేతిలో పెట్టాడు -
డెంటల్ డాక్టర్ కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో కిడ్నాపైన డెంటల్ డాక్టర్ హుస్సేన్ కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ హుస్సేన్ అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉందని అతడి బంధువు ముస్తఫా తెలుసుకున్నాడు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముస్తఫా డాక్టర్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ అమలులో భాగంగా కిడ్నాప్ చేసేందుకు కొంతమందిని మాట్లాడుకొని హుస్సేన్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం కిడ్నాపర్లు డబ్బుల కోసం హుస్సేన్ కుటుంబ సభ్యులకు వాట్సాప్ కాల్ చేశారు. ఆ డబ్బులు కూడా బిట్‌కాయిన్ రూపంలో కావాలని డిమాండ్ చేశారు. మొబైల్ నంబర్ ఆధారంగా వెహికల్ని ట్రేస్ చేసిన సైబరాబాద్ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ నిర్వహించగా.. అనంతపురం జిల్లా తపోవనం దగ్గర ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు దానిని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల వద్ద పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్ చేసి డాక్టర్ హుస్సేన్‌ను రక్షించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (డెంటల్ డాక్టర్ కిడ్నాప్) కిడ్నాప్ ఉదంతాన్ని పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం డాక్టర్ హుస్సేన్ కిడ్నాపయ్యారు. రాత్రయినా హుస్సేన్ ఇంటికి తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్లు అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబుకు కిడ్నాపర్ల కదలికలపై సమాచారమిచ్చారు. దీంతో అనంతపురం ఎస్పీ జిల్లాలోని చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేశారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తపోవనం దగ్గర ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు దానిని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల వద్ద పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్ చేసి డాక్టర్ హుస్సేన్‌ను రక్షించారు. కిడ్నాపర్ల వద్ద నుంచి రివాల్వర్, కత్తి, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రాప్తాడు సీఐ మాట్లాడుతూ.. రూ.10 కోట్ల కోసం డాక్టర్ హుస్సేన్‌ను కిడ్నాప్ చేశారు. డబ్బు ఇవ్వాలని లేదంటే చంపుతామని కిడ్నాపర్లు బెదిరించారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసిన అనంతరం బెంగళూరుకు తరలిస్తుండగా కిడ్నాపర్లను పట్టుకున్నారు. -
బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం : క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ యువత పెడదోవ పడుతోందన్నారు. బెట్టింగులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్ధుల కదలికలపై జాగ్రత్త వహించాలని కోరారు. క్రికెట్ బెట్టింగ్ వెనుక అంతర్జాతీయ రాకెట్ ప్రమేయం ఉందని ఇప్పటివరకు 151 మంది అరెస్ట్ చేసి 8,34,320 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక మరోవైపు ద్విచక్ర వాహనాలు చోరీ ముఠా గుట్టును రట్టుచేశారు. ఈ కేసులో ఇద్దరు దుండగులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
అనంతపై 'సత్య' బాణం
ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం... నకిలీ దందాలకు చెక్ ... మిస్టరీ కేసుల ఛేదింపు... ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది బదిలీ.. సవాళ్లు ఎదురైనా చట్టాల అమలు... ఖాకీల సంక్షే మానికి పెద్దపీట.. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు జిల్లా ఎస్పీ బీ సత్యయేసుబాబు. జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – అనంతపురం క్రైం: 9 మందిపై పీడీ యాక్ట్.. ‘అనంత’ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమనేది ఒకప్పటి మాట. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్షన్‌ను అణగదొక్కడానికి చట్టాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వ ఆదేశాలను ఎస్పీ సత్యయేసుబాబు తూచా తప్పకుండా అమలు చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఫ్యాక్షన్, దందాలకు పాల్పడిన 9 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 539 మట్కా కేసులు నమోదు చేసి రూ.45,56,327 స్వాధీనం చేసుకున్నారు. 9485 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి రూ.1,63,53,130 స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో 11 కేసులు నమోదు చేసి 51 మందిని అరెస్టు చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో 1439 మందిని అరెస్టు చేశారు.అలాగే జిల్లాలో 1887 కార్డెన్, సెర్చ్ ఆపరేషన్లు, 5999 పల్లె నిద్రలు, 67,939 సార్లు గ్రామ పర్యటనలు, 12,379 గ్రామ సభలు, 23,327 వాహనల తనిఖీలు చేపట్టారు. 18,474 మందిని బైండోవర్ చేశారు. 20,257 విజుబుల్ పోలీసింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టారు. గ్లెన్ అక్రమాలకు చెక్.. గత ముప్పై ఏళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడంతో పాటు ఫ్యాక్షనిస్టులను అందులో భాగస్వామ్యులను చేసుకుని అక్రమాలకు పాల్పడ్డాడు గుంతకల్లుకు చెందిన గ్లెన్బ్రిక్స్. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలోని ఇతనిపై 15కు పైగా కేసులున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతున్న గ్లెన్ను ఓ హత్య కేసులో అరెస్టు చేసి లోతుగా విచారణ చేయగా నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూసింది. ఈ ఏడాది జనవరి 2న గ్లెన్‌తో పాటు మరో ఐదుగురుని అరెస్టు చేశారు. చివరికి గ్లెన్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి కటకటాల వెనక్కు పంపారు. చదవండి: భరత్ అనే నేను.. మిస్టరీల చేధింపు.. జిల్లాలో సంచలనం రేపిన మిస్టరీ హత్యల చేధింపునకు ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కదిరి కొర్తికోట ట్రిపుల్ మర్డర్ కేసు చేధింపు ఓ మైలురాయి అని చెప్పాలి. గతేడాది తనకల్లు మండలం కొర్తికోట శివాలయంలో గుప్తనిధుల కోసం ముగ్గురిని కిరాతకంగా చంపిన కేసు, అలాగే తాడిపత్రిలో భారీ మొత్తంలో జరిగిన బంగారం దోపిడీ కేసునూ చేధించారు. సంక్షేమానికి పెద్దపీట.. పోలీసు సంక్షేమానికి ఎస్పీ పెద్దపీట వేశారు. 55 ఏళ్లు పైబడిన వారిని కోవిడ్ విధుల నుంచి తొలగించారు. దాదాపుగా 450 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించడంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది మాస్క్‌లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందించారు. మృతి చెందిన 11 మంది హోంగార్డుల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 7551 పిటిషన్లు స్వీకరించి 6,909 కేసులను పరిష్కరించి 593 మందిపై కేసులు నమోదు చేశారు. అవినీతికి పాల్పడితే వేటే.. లాక్డౌన్ సమయంలో ఎస్పీ దాదాపుగా ఐదుగురిపై వేటు వేశారు. హిందూపురం, గుంతకల్లులో ఏఆర్ కానిస్టేబుళ్లు, గుత్తిలో ఓ హెడ్‌కానిస్టేబుల్, సోమందేపల్లిలో కానిస్టేబుల్, శెట్టురులో మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఓ కానిస్టేబుల్‌పై ఎస్పీ వేటు వేశారు. ఈ నెల 7న గుత్తిలో లంచం తీసుకున్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను జైలుకు పంపారు. డీజీపీ మన్ననలు.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసి కోవిడ్ నియంత్రణకు కృషి చేశారని, అందులో ఎస్పీ బీ సత్యయేసు బాబు ముఖ్య పాత్ర పోషించారని డీజీపీ గౌతం సవాంగ్ ఎస్పీ సత్యయేసు బాబును విలేకరుల సమావేశంలో అభినందించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఎస్పీ వందల సంఖ్యలో పర్యటనలు చేశారు. దాదాపుగా 15 వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేయడంతో ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 800 మంది బదిలీ.. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా మట్కా జరిగేది. దీని ద్వారా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం కేంద్రాల్లోని మట్కా కంపెనీ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా కొందరు పోలీసుల సహకారం ఉందని తేలడంతో ఏళ్లుగా పాతుకు పోయిన 800 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేశారు. అదే విధంగా గుట్కా విక్రయాలు జరగకుండా అధిక సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించం ‘శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టిసారించాం. ప్రజలు ప్రశాంత జీవనం సాగించడానికి నేరాలు అదుపులోకి రావడానికి చట్టాలను కఠినంగా అమలు చేశాం. కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అవినీతి తావు లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ఫ్యాక్షన్, దందాలు, అక్రమాలు, మట్కా , గుట్కా నియంత్రణకు కృషి చేశాం. తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కోవిడ్ నేపథ్యంలో పోలీసులు తమవంతు బాధ్యతను నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నాం. – బీ సత్యయేసుబాబు, జిల్లా ఎస్పీ -
నాకు నాన్న అవసరం లేదు...
సాక్షి, హిందూపురం: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రిని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్దయగా వదిలేసిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బలిజ శివశంకరయ్య (80) హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కాలుకు పుండు కావడంతో ఆ ప్రదేశం కుళ్లిపోయింది. వార్డులోని మిగిలిన రోగులు ఆయన స్థితిని చూసి అక్కడ ఉండలేకపోవడంతో ముస్లిం నగారా ట్రస్టు వ్యవస్థాపకుడు ఉమర్‌ఫరూఖ్, సభ్యులు.. రోజూ స్నానం చేయించి దుస్తులు మార్చి సపర్యలు చేస్తున్నారు. అతని ద్వారా వివరాలు సేకరించి వన్‌టౌన్ ఎస్ఐ బాలమద్దిలేటికి సమాచారమిచ్చారు. అతని వద్ద ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా వైఎస్సార్ జిల్లాలోని చెనిక్కాయలపల్లి రామాపురం చిట్లూరు వాసిగా గుర్తించారు. కుమారుడు నాగేంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఉమర్‌ఫరూక్ ట్రస్ట్ సభ్యులు, సీఐ అతన్ని ఫోన్లో సంప్రదించగా ‘నాకు నాన్న అవసరం లేదు. నన్ను ఆయన సాకలేదు. నేనేమీ ఆయన ఆస్తులు తీసుకొని బయటకు గెంటేయలేదు. ఆయన ఎక్కడకు పోయాడో కూడా తెలియదు. ఇప్పుడు నాకు ఆయన్ను చూడటం కష్టం. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి’ అని సమాధానం ఇచ్చాడు. కుమారుని ప్రవర్తనతో కలత చెందిన శివశంకరయ్య కేసు పెట్టేందుకు సిద్ధమని సీఐతో చెప్పడం గమనార్హం. జీవిత చరమాంకంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వృద్ధుడిని చూసి స్థానికుల మనసు ద్రవిస్తోంది. -
జేసీ అనుచరుడి జిల్లా బహిష్కరణ..!
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో అసాంఘిక శక్తిగా చలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న ఎస్వీ రవీంద్రారెడ్డి పాతికేళ్లుగా తాడిపత్రిని శాసించాడు. తాడిపత్రి మండలం, దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి వీరారెడ్డి కుమారుడైన సంగటి రవీంద్రారెడ్డి 2003లో జేసీ సోదరుల పంచన చేరాడు. మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి నమ్మిన బంటుగా మారడంతో వారు పూర్తి అండదండలు అందించారు. దీంతో రవి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. హత్యాయత్నం, దొమ్మి, మారణాయుధాలు కలిగి ఉండటం తదితర 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ అప్పటి జిల్లా ఎస్పీలు ఆయన జోలికి వెళ్లడానికి సాహసించలేదు. 2003లో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన, 2004లో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడంపై కేసులు నమోదు అయ్యాయి. 2015లో అల్ట్రాటెక్ట్ సిమెంట్ పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసు, 2017లో తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామం సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన వాటర్ ట్యాంక్ దగ్ధం కేసులో రవీంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నాడు. 2018లో వినాయక చవితి నిమజ్జన సందర్భంగా చేలరేగిన ఘర్షణలో కేసులు నమోదు అయ్యాయి. 2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఇవే కాకుండా పొట్టిరవి చేసిన దాడులు దౌర్జన్యాలు, దందాలకు ఎన్నో ఉన్నాయి. అయితే తాడిపత్రిలో పాతిక సంవత్సరాలు జేసీ బ్రదర్స్‌దే సామ్రాజం కావడంతో ఇతనిపై ఫిర్యాదు చేయడానికి బాధితులు సాహసించ లేదు. కొంత మంది పోలీస్స్టేషన్ల వరకు వెళ్లినా అక్కడి పోలీసులు పంచాయతీ చేసి పంపించిన సందర్భాలున్నాయి. ఎస్పీ సత్య యేసుబాబు కొరడా జిల్లా ఎస్పీగా బూసారపు సత్య యేసుబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసాంఘిక శక్తులను అణచివేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ముఖ్యంగా తాడిపత్రిలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, సెటిల్మెంట్లకు పాల్పడిన వారిని ఏరివేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా వీరాపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డిని హత్య చేయాలని పొట్టి రవి కుట్ర పన్నగా...పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. దీంతో పొట్టి రవి అరాచాకాలు ఎస్పీ దృష్టి వెళ్లాయి. దీంతో ఆయన రవిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. తాజాగా జిల్లా బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ
నేరాల నియంత్రణ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో అఫెండర్ సర్వేలెన్స్ సిస్టం అమలు చేస్తుండటంతో స్థానిక నేరస్తులు మాత్రమే పట్టుబడుతున్నారు. బయటి నేరస్తులు తిరుగుతున్నా గుర్తించలేని పరిస్థితి ఉంది. అందువల్ల త్వరలో ఫింగర్ ప్రింట్స్ ఇన్వెస్టిగేషన్ సిస్టం టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8లక్షల మంది నేరస్తుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించి రాత్రి సమయాల్లో అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తే కొత్త నేరస్తులు పట్టుబడే అవకాశం ఉంది. అదేవిధంగా రాత్రి సమయాల్లో గస్తీ పెంచుతున్నాం. సాక్షి, అనంతపురం సెంట్రల్: ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నాం. ప్రజలు న్యాయం కోసం పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగకూడదు. ఒక్కసారి అర్జీ ఇస్తే.. ఆ సమస్య పరిష్కారం అయిందో లేదో నేనే చూస్తా.. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. అని జిల్లా ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు తెలిపారు. పోలీసుశాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలను శనివారం సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి: జిల్లాలో ‘స్పందన’ తీరు ఎలా ఉంది? ఎస్పీ: ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. పోలీసుశాఖలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నాం. ప్రతి సోమవారం అన్ని పోలీసుస్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు(ఎస్హెచ్ఓ) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అందుబాటులో ఉండాల్సిందే. సమాచారం లేకుండా అందుబాటులో లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఎక్కువశాతం రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఎలా పరిష్కారం చేస్తున్నారు.? ఎస్పీ: జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమంలో వస్తున్న అర్జీలలో ఎక్కువ శాతం భూ సమస్యలే ఉంటున్నాయి. తమ భూమి, స్థలాన్ని ఆక్రమించారని, తమ పొలంలోకి పోనియకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని, తమకు తెలియకుండా వేరే వ్యక్తులు రిజిస్ట్రేషన్(డబుల్ రిజిస్ట్రేషన్) చేసుకుంటున్నారని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. వీటిలో పోలీసుశాఖ నుంచి ఎంత వరకు న్యాయం చేయగలమో అంత వరకు చేస్తున్నాం. అయితే రెవెన్యూ సంబంధిత సమస్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఆస్కారం ఉండడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. భవిష్యత్‌లో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలు పరిష్కారించాలని భావిస్తున్నాం. సాక్షి : ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: ఫిర్యాదుల స్వీకరణలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా పోలీసుశాఖ నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అలాగే ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో కూడా అగ్రస్థానంలో ఉన్నాం. జూలై 1 నుంచి స్పందన కార్యక్రమం అమలైంది. ఇప్పటి వరకు మొత్తం 937 ఫిర్యాదులు రాగా.. 888 సమస్యలను పరిష్కరించాం. స్పందన కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు కూడా నమోదు చేస్తున్నాం. దీనివల్ల ఎఫ్ఐఆర్ నమోదు సంఖ్య పెరుగుతోంది. అలాగే స్పందన కార్యక్రమంలో అర్జీలు తీసుకున్న వెంటనే వారికి సీసీటీఎన్ఎస్ ద్వారా రిసిప్టులు అందజేస్తున్నాం. ఎప్పటిలోగా సమస్య పరిష్కారిస్తాం. తర్వాత ఎవర్ని సంప్రదించాలనే అంశం అందులో ఉంటుంది. ఫిర్యాదుదారుల సెల్‌ఫోన్ నెంబర్లు కూడా స్వీకరించి కంట్రోల్ రూం, డయల్ 100 సిబ్బంది ద్వారా సంబంధిత అర్జీదారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం అయిందా.. లేదా అనే అంశంపై ఆరా తీస్తున్నాం. దీనివల్ల తప్పుడు లెక్కలకు ఆస్కారం ఉండదు. సాక్షి: నగరంలో ట్రాఫిక్ సమస్యల చాలా తావ్రంగా ఉంది? మీరేమంటారు? ఎస్పీ: ట్రాఫిక్ ఇబ్బందులపై ఫోకస్ పెట్టాం. ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌ను బలోపేతం చేస్తున్నాం. వీలైనంత ఎక్కువ మంది సీఐలు, ఎస్ఐలను కేటాయిస్తున్నాం. కిందిస్థాయి సిబ్బందిని కూడా పంపిస్తున్నాం. అయితే కార్పొరేషన్ అధికారులు సహకరిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సెల్లార్లలో ప్రస్తుతమున్న షాపులను ఖాళీ చేయించి పార్కింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల రోడ్లపై పార్కింగ్ వాహనాల సంఖ్య తగ్గుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు గాడిలో పడుతాయి. సాక్షి: జిల్లాలో దొంగతనాలు అధికమయ్యాయి. ఎలా అడ్డుకుంటారు? ఎస్పీ: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో అఫెండర్ సర్వేలెన్స్ సిష్టం అమలు చేస్తున్నారు. దీనివల్ల జిల్లాకు సంబంధించిన నేరస్తులు మాత్రమే పట్టుబడుతారు. బయట నేరస్తులు తిరుగుతున్నా గుర్తించలేని పరిస్థితి ఉంది. కావున త్వరలో ఫింగర్ ప్రింట్స్ ఇన్వెస్టిగేషన్ సిష్టం టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది నేరస్తుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించి రాత్రి సమయాల్లో అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తే కొత్త నేరస్తులు పట్టుబడే అవకా>శముంది. దీనికి తోడు రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. సాక్షి: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: స్పందన కార్యక్రమంలో బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. దీన్ని ఆసరగా చేసుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఇలాంటి విషయంలో నమ్మి మోసపోవద్దు. ఉద్యోగాలనేవి పూర్తిగా ప్రభుత్వ స్థాయిలో జరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
టీడీపీ నేతలపై గంగుల భానుమతి ఫిర్యాదు
-
గంగుల భానుమతి ఫిర్యాదు
సాక్షి, అనంతపురం: తన భర్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ పెట్టిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబును కలిసి గురువారం ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పరిటాల రవి చాలా మంచివాడని తన భర్త అన్నట్టుగా ఫేస్బుక్లో పోస్ట్ చేశారని తెలిపారు. తెలుగు దేశం పార్టీ అంటే తనకు ప్రాణం అని మద్దెలచెరువు సూరి పేర్కొన్నట్టుగా తప్పుడు రాతలు రాశారని వాపోయారు. తన భర్తను దుర్మార్గంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల కుటుంబం కారణంగా ఎంతో మందిని కోల్పోయామన్నారు. తన కుటుంబంపై సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతపై ఎస్సై దౌర్జన్యం పరిటాల సునీత వర్గీయులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకుడిపై రామగిరి ఎస్సై హేమంత్ దురుసుగా ప్రవర్తించారు. రామగిరిలో పెట్టిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఫ్లెక్సీలను మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు చించివేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతకురుబ ముత్యాలుపై ఎస్సై హేమంత్ దౌర్జన్యం చేశారు. ఎస్సై వైఖరికి నిరసనగా పోలీస్‌స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తల ధర్నాకు దిగారు. పరిటాల వర్గీయుల కనుసన్నల్లో ఎస్సై హేమంత్ పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సత్య’మేవ జయతే!
సాక్షి, అనంతపురం సెంట్రల్: ‘రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపులు కనిపించకూడదు. ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్టపడాలి. శాంతిభద్రతలు అదుపులో ఉండాలి.’ ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ప్రస్తుతం పోలీసు శాఖల పనితీరును చూస్తుంటే ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరేలా కనిపిస్తోంది. ప్రధానంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బూసారపు సత్య యేసుబాబు పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా నిర్వహణపై ఉక్కుపాదం మోపుతున్నారు. బెల్టుషాపులపై దాడులు, ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండా ముందుకు సాగుతుండటంతో ఫ్యాక్షనిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రేపటితో ఎస్పీగా బూసారపు సత్య యేసుబాబు బాధ్యతలు స్వీకరించి నెలరోజులు గడుస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం... ఎస్పీగా సత్యయేసుబాబు బాధ్యతలు స్వీకరించి నెలరోజులు మాత్రమే అవుతున్నా పోలీసుశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్లబ్‌లపై దాడులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ నిర్ణయాలతో జిల్లాలో మట్కా, బెట్టింగ్, పేకాటరాయుళ్లకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారోననే ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటి వరకూ మట్కాపై 27 కేసులు నమోదు చేసి రూ. 1.87 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పేకాటకు సంబందించి 553 కేసులు నమోదు చేసి రూ. 9.97 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. గుట్కా విక్రయిస్తున్న 27 మందిని అరెస్ట్ చేసి రూ. 3.96 లక్షలు విలువజేసే గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. అలాగే బెల్టు దుకాణాలపై మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 128 కేసులు నమోదు చేసి 3,714 మద్యం బాటిళ్లు, 149 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్ ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఇసుక అక్రమ తరలింపు విషయంలో ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏకంగా ఇసుక అక్రమంగా తరలిస్తున్న ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ తీసుకున్న నిర్ణయాలతో ఇసుక అక్రమ తరలింపు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 154 ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లు, లారీలను పట్టుకున్నారు. మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 150 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. మొత్తం మీద ఎస్పీ నెలరోజుల పాలన పోలీసుశాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి జిల్లాలో శాంతిభద్రతల విషయంలో ఎస్పీ రాజీపడడం లేదు. కొన్నేళ్లుగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి హవా నడిచింది. అనేక ఘటనల్లో ఇతడి పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది. అయితే గతంలో ఎవరూ ఇతడి జోలికి పోలేదు. ఇటీవల తాడిపత్రిలో ఓ బ్యాంకు ఉద్యోగి హత్యాయత్నంలో ఎస్వీ రవీంద్రారెడ్డి పాత్ర ఉండడంతో ఎస్పీ తనదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. కేవలం ఈ ఘటనలోనే కాకుండా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా ఎస్పీనే పర్యటిస్తున్నారు. కొంతమందిని తన కార్యాలయానికి పిలిపించుకొని తనదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. -
నీ దూకుడు.. తాడిపత్రి చూడు!
సాక్షి, అనంతపురం: జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సత్య యేసుబాబు విధినిర్వహణలో తనదైన దూకుడు కనబరుస్తున్నారు. ఈనెల 9న విధుల్లో చేరిన ఆయన ఇప్పటి వరకు ఒక్క తాడిపత్రి నియోజకవర్గంలోనే వంద మందికి పైగా అసాంఘిక శక్తులను అరెస్టు చేయించారు. వీళ్లందరిపైనా గతంలో కేసులు నమోదైనా అక్కడి ‘బ్రదర్స్’ కొమ్ముకాశారు. అయితే సత్య యేసుబాబు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో అరెస్టుల పర్వం మొదలైంది. రాప్తాడు, ధర్మవరం తదితర సమస్యాత్మక ప్రాంతాలపైనా ఆయన గట్టి నిఘా సారించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాడిపత్రిలో వేళ్లూనుకున్న ‘మట్కా.. పేకాట.. బెట్టింగ్’ ఎస్పీకి ఓ సవాల్ అనే చెప్పాలి. జేసీ బ్రదర్స్ కనుసన్నల్లో తాడిపత్రి నాలుగు దశాబ్దాలకు పైగా నలిగిపోయింది. ఆ ప్రాంతంలో వాళ్లు చెప్పిందే వేదం.. చెసిందే శాసనం. అలా మొదలైన కథ.. ఏ అధికారి వచ్చినా ఆ కనుసన్నల్లో మెలగాల్సిందే. పోలీసులదీ అదే దారి. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి జూద గృహంగా మారిపోయింది. డీఎస్పీలు.. సీఐలు.. ఎస్ఐలు.. ఎవరు మారినా ఆ మహమ్మారికి ముకుతాడు వేయలేకపోయారు. పైగా ఆ ఊబిలో కూరుకుపోయారు. అక్కడి నేతలు ప్రజలకు కనీస అవసరాలైన మంచినీటిని అందించలేకపోయినా.. వాళ్ల అనుచరులు పేకాట, మట్కా, బెట్టింగ్‌ను మాత్రం వీధివీధికీ విస్తరించారు. ఏ స్థాయిలో అంటే.. అడ్డొస్తే పోలీసులైనా దాడులకు తెగబడేంతగా. గత ఏడాది ఓ సీఐపై మట్కా డాన్ రషీద్ దాడులకు పాల్పడినా అక్కడి ప్రజాప్రతినిధులు బాధ్యతను విస్మరించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా పోలీసులకు వ్యతిరేకంగా, మట్కారాయుళ్లకు అండగా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇలాంటి పాలనలో పోలీసులు కూడా మౌనం దాల్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసినా.. బదిలీకి సిద్ధపడాల్సిందే. ఈ కారణంగా అసాంఘిక శక్తులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోలీసు శాఖలోని కీలక అధికారుల కొత్త వాహనాలకు నెలవారీ కంతులు, ఇతర ఖర్చులకు ఈ ముఠాలే సర్దుబాటు చేస్తుండటంతో ప్రతినెలా జూదం ‘కోట్లు’ దాటింది. జూద కేంద్రంగా తాడిపత్రి తాడిపత్రిలో పేకాట ఆడేందుకు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ రూ.లక్ష, రూ.2లక్షల బ్యాంకు ఆట కూడా జరుగుతుంది. మునిసిపాలిటీలోని పాలకవర్గం సభ్యుడు ఒకరు ఇక్కడ పేకాటక్లబ్‌లకు ఇన్చార్జి. ఇతను జేసీ బ్రదర్స్‌కు నమ్మిన బంటు. గతంలో ఇతని ఇల్లే పేకాట క్లబ్బు. తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు అధికం. అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్స్‌తో పాటు గెర్డావ్ స్టీల్‌ప్లాంట్ ఉంది. వీటిలో పనిచేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎక్కువగా సిబ్బంది వస్తుంటారు. ఆర్థికలావాదేవీలు కూడా ఎక్కువే. దీన్ని ఆసరగా చేసుకుని అక్కడి కొంతమంది నేతలు తమ అనుచరులతో పేకాట నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా స్థానిక నేతలు ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. ఇక పక్కనే ప్రొద్దుటూరు ఉండటంతో క్రికెట్ బెట్టింగ్ కూడా అధికంగా నడుస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగే బెట్టింగ్ తాడిపత్రి కేంద్రంగానే సాగుతోంది. అదేవిధంగా మట్కా సంగతి చెప్పక్కర్లేదు. గతంలో అశోక్‌కుమార్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 72మంది మట్కారాయుళ్లను తాడిపత్రి నుంచి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత నేతల ఒత్తిడి పెరగడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. పోలీసుల నిస్సహాయత ఇక్కడ పేకాట, మట్కా ఎవరు నిర్వహిస్తున్నారు? బెట్టింగ్ బుకీలు ఎవరు? అనే సంగతి అక్కడి పోలీసులకు తెలియనిది కాదు. అయినా ఎలాంటి చర్యలు ఉండవు. ఏమాత్రం జోక్యం చేసుకున్నా అక్కడి ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆయన పీఏ నుంచి ఫోన్లు రావడం సర్వసాధారణం. పోలీసులతో రాయ‘బేరాలు’ నడిపి నెలమామూళ్లు కట్టిపడేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే బదిలీ కంటే బహుమానాలే ఉత్తమమనే భావన ఉన్నట్లు కనిపిస్తుంది. పోలీసులే మౌనం దాలిస్తే వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తాడిపత్రిలో అధిక భాగం వ్యసనాలకు బానిసైంది. అప్పుల ఊబిలో ఎన్నో కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి కాగా.. హత్యలు, ఆత్మహత్యలు కోకొల్లలు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అసాంఘిక శక్తుల నుంచి తాడిపత్రికి విముక్తి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పటికే తనదైన ముద్ర కనపరుస్తున్న నూతన ఎస్పీ చేతుల్లో తాడిపత్రి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. డిసెంబర్ 30, 2018 మట్కా డాన్ రషీద్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన సీఐ హమీద్‌ఖాన్‌పై ఆయనతో పాటు అనుచరులు దాడి చేశారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. సీఐతో పాటు పోలీసులు గాయపడ్డారు. -
రక్తమోడుతున్న రహదారులు
సాక్షి, అనంతపురం సెంట్రల్: ఈ నెల 10న ఎస్కేయూ సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో పూలకుంటకు చెందిన తండ్రీకొడుకు మృతి చెందారు. పాఠశాలలో అడ్మిషన్ కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నార్పల మండలం మద్దలపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. తాడిపత్రి నుంచి అనంతపురానికి బొగ్గు పొడితో వెళ్తున్న లారీ మద్దలపల్లి వద్దకు రాగానే టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో పక్కనే వస్తున్న ద్విచక్రవాహనంపైకి లారీ పడింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు, లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రతి ఏటా సగటున జిల్లాలో 600 మందికిపైగా మృతి చెందుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నా ఆచరణలో నిలువరించలేకపోతున్నారు. అతివేగం, అధికలోడు, రోడ్డు నిబంధనలపై అవగాహనలేమి ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బూసారపు సత్య యేసుబాబు రోడ్డు ప్రమాదాల నివారణ తన ప్రాధాన్యత అంశంగా ప్రకటించారు. కొరవడుతున్నఅవగాహన రోడ్డు ప్రమాదాల నిలువరించడంలో పోలీసులు, రోడ్డు రవాణాశాఖ అధికారులు కొన్నేళ్లుగా విఫలమవుతూనే ఉన్నారు. రోడ్డు భవనాలశాఖ, నేషనల్హైవే ఇంజినీర్ల లోపాలు కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. సుదీర్ఘ వైశాల్యమున్న జిల్లాలో మూడు జాతీయ రహదారులు, మూడు రాష్ట్రీయ రహదారులు, పలు గ్రామీణ రోడ్లు ఉన్నాయి. వందల కిలోమీటర్ల పొడువున అనేక పట్టణాలు, గ్రామాలను కలుపుకొని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ముఖ్యంగా అత్యంత పొడవైన జాతీయ రహదారి 44 జిల్లాలో గుత్తి నుంచి పెనుకొండ వరకు వెళ్తోంది. ఈ రహదారుల గుండా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే రోడ్డు నిర్మాణాల్లో లోపాలు, రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన లేకపోవడం తదితర కారణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రముఖులను సైతం రోడ్డు ప్రమాదాలు పొట్టన పెట్టుకున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారుల్లో వేగ నియంత్రణ చేయడం పోలీసులకు సాధ్యం కాకపోవడం వలనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం 100 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఆ మేరకు రోడ్డు నిబంధనలపై అవగాహన ప్రజల్లో కొరవడింది. రోడ్డు ప్రమాదాల రూపంలో సగటున 600 మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 1500 మంది పైచిలుకు మంది వికలాంగులుగా తయారవుతున్నారు. ఈ లెక్కలు పోలీసుశాఖ అధికారులు అధికారికంగా చెబుతున్నవే. గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చాలా మటుకు పరిగణలోకి రావడం లేదు. దీన్ని బట్టి చూస్తే బాధిత కుటుంబాలు ఎంత క్షోభను అనుభవిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. నాయనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం టైర్లు పేలడం వలన జరిగింది. కానీ అధిక లోడు కూడా కారణంగా తెలుస్తోంది. తాడిపత్రి నుంచి ఎక్కడికి వెళ్తోంది.. ఎన్ని లారీలు వెళ్తున్నాయి.. తదితర అంశాలను అరా తీస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అతివేగం, అధికలోడు, సీటుబెల్టు, హెల్మెట్, తాగి వాహనాలు నడపడం తదితర అంశాలపై పోలీసుల ఫోకస్ ఉంటుంది. – సత్య యేసుబాబు, ఎస్పీ -
కౌంటింగ్ రోజున ఫ్యాక్షన్ గ్రామాలపై నిఘా
సాక్షి, అనంతపురం సెంట్రల్: ఓట్ల లెక్కింపు రోజున, ఆ తర్వాత జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత, సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనిసిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ఇటీవల తీసుకున్న చర్యలను శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. పక్షం రోజుల్లో 399 పల్లె నిద్రలు, 84 కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, 2263 గ్రామ సందర్శనలు, 909ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, 1043 విజుబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. తనిఖీల్లో రికార్డులు లేని స్కార్పియో, మూడు కార్లతో పాటు, 54 ద్విచక్ర వాహనాలు, 29 ఆటోలు, 45 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ వేళ ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి సున్నితమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. గొడవల జోలికెళితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. మహిళల ద్వారా ఆయా కుటుంబాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. -
సర్కారు హత్యే
సాక్షి, అనంతపురం: హత్యలతో ఊరూవాడా ఉలిక్కిపడుతోంది. దౌర్జన్యాలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ‘ఎన్నికలయ్యాక మీ ఇష్టం. చంపుకుంటారో, నరుక్కుంటారో.. నేను చూసుకుంటా’ అని ధర్మవరం ఎమ్మెల్యే సూరి స్వయంగా కత్తులు చేతికిచ్చి మారణహోమానికి ఉసిగొల్పుతున్న తీరు, రాప్తాడులో ‘టీడీపీలో చేరకపోతే ఎన్నికలయ్యాక పరిస్థితులు మరోలా ఉంటాయి’ అని పరిటాల వర్గీయుడు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే హెచ్చరికలు చేయడం చూస్తే.. ఈ ప్రభుత్వం ఎంతలా బరితెగించిందో అర్థమవుతోంది. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం రాష్ట్రంలో రక్తం మరిగిన ప్రభుత్వ తీరుకు అద్దం పట్టింది. ప్రశ్నార్థకంగా మారిన శాంతిభద్రతలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనాగరికులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారు నాయకులు కాదు అనాగరికులు. రాజకీయాల్లో హత్యలనేవి చాలా అనాగరికమైనవి. నాగరికత నేర్చుకుని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ఇప్పటికీ ఇలాంటి దరిద్రం ఉండడం బాధాకరం. రక్తం శరీరంలో, నేలపై నీళ్లు పోరాలి. మన దౌర్భాగ్యమేమంటే రాయలసీమలో నేటికీ చాలా ప్రాంతాల్లో శరీరంలో పారాల్సిన రక్తం భూమిపై పారుతోంది. తక్కిన ప్రాంతాల్లో నాయకులు నీళ్లు పారించుకోవడంతోనే వారి ప్రాంతాలు అభివృద్ధి చేసుకున్నారు. మన ప్రాంత నాయకులకు నీళ్లపైన శ్రద్ధ లేదుకా>ని రక్తం పారించడంలో శ్రద్ధ చూపుతున్నారు. ఇలాంటి నాయకులను రాజకీయ సమాధి కట్టాలి. – తలారి పీడీ రంగయ్య, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త అధికార పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటన హత్యారాజకీయాలకు, టీడీపీ దుర్మార్గానికి పరాకాష్ట. అత్యంత మృదు స్వభావి, కనీసం చిన్నపిల్లలకు హానీ చేయని వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. ఆయన మృతి వార్త బాధకలిగించింది. అయితే అది హత్య అని తెలియడం నన్ను కలిసివేసింది. ఈ హత్యతో రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దివాళాకోరు ఆలోచన చేస్తున్నారు. మా ప్రాణాలను సైతం అడ్డువేసి అధికార పార్టీ దౌర్జాన్యాలు, ఆగడాలను ఎండగడతాం. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త హత్యా రాజకీయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం హత్యా రాజకీయాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఎన్నికల తరుణంలో మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రతిపక్ష నాయకుని పినతండ్రికే ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేక పోయింది. ఇక సామాన్య ప్రజలకు ఏ మేరకు రక్షణ కల్పిస్తుంది. ప్రతిపక్షపార్టీ వారిని చంపుతామంటూ ఇటీవల అధికారపార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యనించడం చూస్తే ఎన్నికల్లో హింసాత్మకంగా గెలవాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ మద్దతుతోనే హత్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. – వి.రాంభూపాల్, సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి ఐదేళ్ల టీడీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులకే రక్షణ లేకుండా పోయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చాలా దుర్మార్గమైన చర్య. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ హత్యకు టీడీపీ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. హత్యారాజకీయాలను బీజేపీ ఖండిస్తుంది. – విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అభివృద్ధి సంకల్పం
అనంతపురం అర్బన్: ‘‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుదాం. సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ అందేలా మెరుగైన సేవలు అందించాలనే మా సంకల్పానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి.’’ అని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శనివారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు తన సందేశాన్ని వినిపించారు. వేడుకలో జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, వి.ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి, మేయర్ ఎం.స్వరూప, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, ఎస్సీ జి.వి.జి.అశోక్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఏఎస్పీ చౌడేశ్వరి, ఓఎస్డీ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రెండంకెల వృద్ధికి కృషి జరుగుతోంది. వ్యవసాయం, పండ్లతోటల విస్తీర్ణం 8.91 లక్షల హెక్టార్లు కాగా.. రూ.14,731 కోట్ల ఆదాయానికి పెరిగి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచి జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. 2024 నాటికి 8 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు పెంచడం ద్వారా 64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో రూ.20 వేల కోట్ల ఆదాయం తీసుకోవాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాను వందశాతం డ్రిప్ వినియోగించే ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. పశు సంవర్ధక, సెరికల్చర్, మత్స్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.’’ జల వనరులపై ప్రత్యేక దృష్టి జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో జలవనరులపై ప్రత్యేక దృష్టి సారించాం. 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు రెండు దశల పనులు పూర్తయ్యాయి. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు చివరి దశలో ఉన్నాయి. జిడిపల్లి, గొల్లపల్లితో పాటు ఈ ఏడాది మారాల, చెర్లోపల్లి జలాశయాలకు కృష్ణా జలాలను ఇచ్చాం. హెచ్ఎన్ఎస్ఎస్, హెచ్ఎల్సీ, మైనర్ ఇరిగేషన్ ద్వారా జిల్లాకు 170.817 టీఎంసీల నీరు చేరింది. మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాలకు కృష్ణా నీటిని అందించాం. ఈ ఏడాది జిల్లాకు 92.073 టీఎంసీల నీరు విడుదల చేయగా, 82 చెరువులకు నీటిని ఇవ్వడం వల్ల 7.20 టీఎంసీల మేర భూగర్భజలం వృద్ధి చెందింది. పేదలను ఆదుకునేలా ఉపాధి ఉపాధి హామీ పథకం ద్వారా పేదలను ఆదుకునేలా పనులు కల్పిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.302 కోట్లు వేతనంగా కూలీలకు చెల్లించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల వరకు రూ.385 కోట్ల వేతనం చెల్లించడం ద్వారా జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. భూగర్భ జలాలు పెంచే లక్ష్యంతో పంట సంజీవని కింద లక్ష పంట కుంటలు లక్ష్యం కాగా రూ.568.38 కోట్ల ఖర్చుతో 1,05,205 పంట కుంటలు పూర్తి చేయడం ద్వారా దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 59,109 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించాం. ఇందుకు రూ.155 కోట్లు వెచ్చించాం. 108, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్, ఈ–ఔషిధి, చంద్రన్న సంచార చికిత్స, మహిళా హెల్త్ చెకప్, తదితర పథకాల ద్వారా పేదలకు మెరుగైన సేవలు అందిస్తాం. విద్యాభివృద్ధికి ప్రత్యేక స్థానం విద్యాభివృద్ధికి ప్రత్యేక స్థానం కల్పించాం. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.83.03 కోట్లు విడుదల కాగా, రూ.55.65 కోట్లు ఖర్చు చేశాం. కస్తూరిబా పాఠశాలల్లో వసతుల కల్పన, పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆవాసరహిత ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ, మదరసాలతో వాలంటీర్ల నియామకం, 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న బాల, బాలికలకు యూనిఫాం తదితర కార్యక్రమాలకు ఈ ఖర్చు చేశాం. 125 పాఠశాలల్లో డిజిటల్ బోధన, పర్చువల్ క్లాస్ రూర్ స్టూడియో నిర్మించాం. అర్హులకు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నాం. పేదలకు ఎన్టీఆర్ ఇళ్లు, రేషన్ కార్డులు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు, తదితరాలను అందిస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు చర్యలు తీసుకున్నాం. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పరిచేలా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. -
అనంత ఎస్పీకి వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, అనంతపురం : జిల్లాలో శాంతిభద్రతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం అనంతపురం ఎస్పీని కలిశారు. ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ నేత చెన్నారెడ్డి హత్యకు ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులే కారణమని వైఎస్ఆర్ సీపీ నేతలు ఈ సందర్భంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వారు కోరారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, నాయకులు శంకర్ నారాయణ, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించే పద్ధతిని పోలీసులు మానుకోవాలన్నారు. టీడీపీ నేతలు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అప్పేచర్లలో జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. జిల్లాలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా లేవా అని వారు ప్రశ్నించారు. -
విజయవాడకు వెళ్లిన ఎస్పీ
అనంతపురం సెంట్రల్: జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ బుధవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. గురువారం రాజధానిలో అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్షాసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం జిల్లాకు రానున్నట్లు పోలీసు కార్యాలయవర్గాలు వెల్లడించాయి. -
ఒక్క క్షణం ఆలోచించు
ప్రాణాలను బలిగొంటున్న క్షణికావేశం ఒత్తిళ్లను అధిగమించడంలో వైఫల్యం చిన్నపాటి సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్న వైనం ఈ ఏడాది జూన్ వరకూ ఆత్మహత్యలు రైతులు – 23 చేనేత కార్మికులు – 4 విద్యార్థులు – 37 ఇతరులు – 352 మొత్తం – 416 ఈ నెల 4న తాడిపత్రి ఉలిక్కిపడింది. సులోచనమ్మ, ఆమె కూతుళ్లు ప్రత్యూష, సాయిప్రతిభలను కన్నతండ్రి రామసుబ్బారెడ్డి కిరాతకంగా హతమార్చాడు. ఆ మరుసటి రోజే సమాజానికి భయపడిన అతనూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యసనాలకు బానిసైన రామసుబ్బారెడ్డి... క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి శాపమైంది. అందరినీ కోల్పోయి వారి మరో కుమార్తె ప్రసన్న అనాథగా మారింది. ఈ ఏడాది మే 2న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) కనసింహన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వేధింపులు తాళలేని ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు ఉన్నత విద్యావంతుడు. డివిజన్ స్థాయి అధికారి స్థాయికి ఎదిగిన వ్యక్తి. సుదీర్ఘకాలం ప్రభుత్వశాఖలో పనిచేసిన అనుభవం. అయినా వేధింపులను తట్టుకోలేని ఆయన ఉరివేసుకున్నారు. అనంతపురం సెంట్రల్: చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి.. కుటుంబ పోషణ భారంగా మారిందని యజమాని.. భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఇల్లాలు.. కన్న కొడుకులు పట్టించుకోవడం లేదంటూ వృద్ధులు.. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు... ఇలా కారణాలు ఏమైనా కావచ్చు.. సమస్యకు పరిష్కారం ఆత్మహత్యనే సమాధానంగా పలువురు భావిస్తున్నారు. ఇందులో నిరక్షరాస్యులు, ఉన్నత విద్యావంతులు అన్న తేడా లేదు. ప్రతి ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటోంది. అయితే సమస్యకు ఆత్మహత్య కానేకాదు అనేది చాలా మంది గుర్తించకపోవడం వల్లనే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయనేది నగ్నసత్యం. బతికున్న వారికి క్షోభ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారు మన ఎదుట లేకపోయినా.. వారి జ్ఞాపకాలతో బతికున్న వారికి నిత్యమూ క్షోభ మిగులుతోంది. క్లిష్ట సమయంలో కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం చిన్నాభిన్నమై పోతుంది. ప్రధానంగా ఇంటి పెద్ద, వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడుకున్న బిడ్డలు అర్ధాంతరంగా తనువు చాలిస్తే.. బతికున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుంది. సంసారమనే సముద్రంలో సాఫీగా సాగిపోతున్న జీవిత నౌక ఒక్కసారిగా తుఫానులో చిక్కుకున్న ఛిద్రమై పోతే అందులోని వారి పరిస్థితి ఎంతటి దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్క క్షణం ఆలోచిస్తే.. కొన్ని పనులను కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. దీనికి ప్రత్యామ్నాయం ఉండదు. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ఒక్క క్షణం తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని మరెవ్వరూ పూర్తి చేయలేరనే విషయాన్ని గుర్తించాలి. తనకు ప్రత్యామ్నాయం మరొకరు ఉండరనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. తనపై ఆధారపడిన భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులకు తాను లేని లోటు మరో వ్యక్తి తీర్చలేడనే నగ్నసత్యాన్ని మరవరాదు. ప్రతి కుటుంబంలోనూ చిన్నపాటి సమస్యలు, సవాళ్లు ఉంటాయి. సమస్య ఏదైనా ధైర్యంగా ఎదుర్కొవాలే కాని, చావే పరిష్కారం కాదనే విషయాన్ని మరవరాదు. తాను చనిపోయిన తర్వాత కుటుంబంలో చోటు చేసుకునే పరిణామాలపై కూడా ఒక్కసారి ఆలోచిస్తే.. తాను ఎంత తప్పు చేస్తున్నది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలతోనే ఎక్కువ జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యలను పరిశీలిస్తే ఎక్కువ శాతం కుటుంబ కలహాలతో జరుగుతున్నవే కావడం గమనార్హం. చిన్నపాటి సమస్యలకే మనస్పర్థలు చోటు చేసుకుని హత్యలకు తెగబడడం, లేదంటే ఆత్మహత్యలకు పాల్పడం జరుగుతోంది. వరకట్న వేధింపులు, భార్య,భర్తల మధ్య పెరుగుతున్న అంతరం, వివాహేతర సంబంధాలు, రుణ బాధలు... ఇలా కారణమేదైనా.. ఇటీవల ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోయాయి. ఈ విషయంలో పామరులే కాదు మేధావి వర్గాలు సైతం తప్పుటడుగులు వేయడం ఆందోళనకరం. ఇటీవల అనంతపురంలోనే ప్రభుత్వ అధికారుల భార్యలు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అదనపు కట్నం కోసం వేధింపులు తాళలేక ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తగ్గిపోతున్న పెద్దరికం ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ కనుమరుగైన తర్వాత మానవసంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. సమస్యలు ఎదురైనప్పుడు ఉమ్మడి కుటుంబాల సభ్యులందరూ రెండు, మూడు గంటల పాటు కలిసి మెలసి సాదకబాధకాలను పంచుకోవడం ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లేవారు. దీంతో ఆత్మహత్యలకు తావులేకుండా పోయేది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకూ ఏదో ఒక సమస్యతో అందరూ ఒత్తిళ్లతోనే గడపాల్సి వస్తోంది. ఫలితంగా ఆవేశపూరితమైన నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తున్నారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. ఆత్మహత్యల వివరాలు ఇలా : సంవత్సరం రైతులు చేనేత కార్మికులు విద్యార్థులు ఇతరులు మొత్తం 2013 60 19 44 679 802 2014 57 9 65 647 778 2015 119 13 48 680 860 2016 62 9 46 702 819 2017(జూన్) 23 4 37 352 416 మొత్తం 321 54 240 3060 3675 తప్పకుండా సాయం జిల్లాలో వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ మంది వారి సమస్య బయటకు చెప్పుకోకుండానే తనువు చాలిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం. మరీ సమస్య తీవ్రత ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాను. ఆత్మహత్యలు నివారించడానికి గుజరాత్లో విజయవంతంగా ఓ హెల్ప్‌లైన్ పనిచేస్తోంది. అదే తరహాలో ఇక్కడ అమలు చేయడానికి కృషి చేస్తా. ప్రస్తుతానికి అత్యవసరం, ఆపదలో ఉన్న వ్యక్తులు 100ను సంప్రదిస్తే వెంటనే స్పందిస్తాం. - జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
జీవీజీ అశోక్ 9989819191
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం - సమాచారం ఇస్తే చర్యలకు శ్రీకారం - ఫోన్.. మెసేజ్.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ - బెల్టు దుకాణాలు, మట్కా, పేకాట నిర్మూలనే ధ్యేయం అనంతపురం సెంట్రల్: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని.. బెల్టు షాపుల నిర్వహణ, మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఈవ్‌టీజింగ్‌పై తన సెల్‌ఫోన్ 9989819191 నెంబర్‌కు సమాచారం అందించాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. నేరుగా కాల్ చేసినా.. ఎస్ఎంఎస్ పంపినా.. వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసినా ఫిర్యాదును స్వీకరిస్తామన్నారు. డయల్ 100 కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అసాంఘిక కార్యకలాపాలతో పాటు రోడ్డు ప్రమాదాలు, అల్లర్లు, ఇతర ఆపద సమయాల్లోనూ ఈ నెంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఈ నెంబర్లు పూర్తిగా తన స్వీయ పర్యవేక్షణలో ఉంటాయని.. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
ప్రశాంత వాతావరణం అవసరం
పోలీసుశాఖ ప్రతిష్ట దిగజారిస్తే ఉపేక్షించను – ప్రజా సమస్యల పరిష్కారానికి ‘క్విక్ రెస్పాన్స్ టీం’ – నేర సమీక్షలో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అనంతపురం సెంట్రల్ : పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జిల్లాలో ప్రశాంత వాతావరణం, భద్రత కల్పించాల్ని బాధ్యత పోలీసుశాఖపై ఉందని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ కరువు జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు ప్రజల తరుఫున భరోసా ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎట్టి పరిస్థితులలో శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిందేనన్నారు. జిల్లాకు చెడ్డపేరు తెస్తున్న ఫ్యాక్షన్, గ్రూపు తగాదాల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలను పక్కాగా నియంత్రించాలన్నారు. బాధితుల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు త్వరలోనే ‘క్విక్ రెస్పాన్స్ టీమ్’లను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని నిర్ణయించారు. కదిరి, హిందూపురం లాంటి పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా అన్ని వర్గాల ప్రజలతో సఖ్యతగా వ్యవహరించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ చాలా ముఖ్యమని హితవు పలికారు. సామాజిక సేవా కార్యక్రమాల సందర్భంగా యువత భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించి పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్ట పెంచే విధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలన్నారు. అంతేగానీ దిగజార్చే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రోడ్డు ప్రమాదాల నివారించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. -
పోలీసు ప్రతిష్ట పెంచుతాం
అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తాం – పేకాట, మట్కా నియంత్రణకు ప్రత్యేక కూంబింగ్ – తాడిపత్రి, పేరూరుపై నిరంతర నిఘా.. మట్కా బీటర్ల సంగతి తేలుస్తాం – ఎక్కడ జరిగితే అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి.. ఎవ్వరినీ ఉపేక్షించం – సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసులకు ప్రత్యేక శిక్షణ బృందాలు – ప్రజలు, వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాల సంఖ్య పెంపు – పోలీసుల సంక్షేమానికి పెద్దపీట – ‘సాక్షి’తో జిల్లా పోలీస్ బాస్ జీవీజీ అశోక్‌కుమార్ సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘పోలీసులు గట్టిగా ఉంటే 60 శాతం నేరాలు నియంత్రించినట్లే. ఆపై ఉన్న 40శాతాన్ని అదుపు చేయడం తేలిక. పేకాట, మట్కా, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏ ప్రాంతం వారు వచ్చి ఆడినా ఎక్కడ ఆడుతున్నారో అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి. వీటి కోసం ప్రత్యేకంగా బృందాలను సిద్ధం చేసి కూంబింగ్ నిర్వహిస్తాం. బాధ్యులుగా తేలితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. జిల్లాలో అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తేనే పోలీసుశాఖ ప్రతిష్టను పెంచినవారమవుతాం. దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటాం.’ అని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ‘అనంత’ పోలీస్‌బాస్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సాక్షి : ఇది వరకు అనంతలో పనిచేసిన అనుభవం ఉంది? అప్పటికీ, ఇప్పటికీ బాధ్యతల్లో తేడా ఉంది? రాష్ట్రంలో ఇది ప్రత్యేకమైన జిల్లా? కొత్త బాధ్యతపై ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? అశోక్ : అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. అప్పట్లో నేరాల సంఖ ఎక్కువగా ఉండేది. ఫ్యాక్షన్ తీవ్రత, సూడోనక్సల్స్తో జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. నేరాల తీవ్రత తగ్గింది. అయితే పేకాట, మట్కా, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జిల్లాను కుదిపేస్తున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. సాక్షి : తాడిపత్రి, పీఏబీఆర్డ్యాం, కౌకుంట్ల ప్రాంతాల్లో పేకాట అధికంగా నడుస్తోంది? ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. అయినా నియంత్రణ లేదు? అశోక్ : నిజమే. పేకాట అధికంగా జరుగుతోంది. ప్రత్యేక బృందాలను సిద్ధం చేసి కూంబింగ్ నిర్వహిస్తాం. పీఏబీఆర్‌లో తరచూ కూంబింగ్ నిర్వహించి దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవే కాదు, జిల్లాలో పేకాట, మట్కా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సాక్షి : తాడిపత్రి సంగతేంటి? పేకాట, మట్కా, బెట్టింగ్‌కు అడ్డాగా మారిపోయింది? అశోక్ : పోలీసులకు గట్టి ఆదేశాలు జారీ చేశాం. నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ చెబుతున్నారు. ప్రస్తుతం ఆట ఆగింది. అంతా ఊరు వదిలి వెళ్లిపోయారు. పోలీసులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీకూడా చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో గట్టినే ఉంటాం. ఈ ఘటనలు ఏ జ్యుడిషియరీలో జరిగితే అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి. ఇతర జిల్లాలు, కర్ణాటక పోలీసులతో కూడా చర్చించి అడ్డుకట్ట వేస్తాం. సాక్షి : ఇవన్నీ పోలీసులకు తెలిసే జరుగుతున్నాయి. అందుకే నియంత్రణ కష్టసాధ్యమనే భావన ప్రజల్లో ఉంది. అశోక్: పోలీసులకు తెలిసే జరుగుతోందనే అపవాదు మొదట పోవాలి. దీనికి పోలీసులు కూడా చొరవ చూపాలి. దీనివల్ల 60శాతం నియంత్రణ వస్తుంది. ఆపై తక్కిన 40శాతాన్ని అదుపు చేయడం పెద్ద సమస్య కాదు. నియంత్రణలో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు తెలితే వారిపై కూడా చర్యలు తప్పవు. సాక్షి : క్రికెట్ బెట్టింగ్, మట్కా కూడా ఇటీవల అనంతపురంలో తీవ్రమైంది? అశోక్ : ‘అనంతే’ కాదు...ఐపీఎల్ వచ్చాక అన్నిచోట్ల బెట్టింగ్ జోరు పెరిగింది. ప్రొద్దుటూరు దగ్గరగా ఉండటం కూడా కారణం కావొచ్చు. బుకీలు, సబ్‌బుకీలు ఎవరు అనేది లిస్ట్ తయారు చేస్తున్నాం. కచ్చితంగా వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి నిఘా ఉంచుతాం. సాక్షి : ఎస్ఐ నుంచి ఎస్పీ వరకూ వచ్చే ఫిర్యాదుల్లో సివిల్ కేసులు అధికంగా ఉన్నాయి? వీటి నియంత్రణకు ముగ్గురు డీఎస్పీలతో ఓ కమిటీ కూడా ఉంది? అయినా తీరు మారలేదు? అశోక్ : కచ్చితంగా! నేను బాధ్యత తీసుకున్నాక వచ్చిన పది ఫిర్యాదుల్లో 7 సివిల్ కేసులు ఉన్నాయి? పొలాల సమస్యలు, వడ్డీవ్యాపారులతో ఇబ్బందులు.. అంతా ఇవే చెబుతున్నారు. డీఎస్పీలతో ఉన్న కమిటీ పనితీరుపై సమీక్షించి, ఏది ‘బెస్ట్’ అయితే దాన్ని అమలు చేస్తాం. సివిల్ కేసుల్లో 145 సీఆర్పీసీ మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. దీనిపై కఠినంగానే ఉంటాం. సాక్షి : ప్రజల గ్రీవెన్స్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? అశోక్ : సోమవారం పూర్తిగా గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తాం. నేను అందుబాటులో ఉంటే రోజుతో పనిలే లేకుండా ఎవ్వరు, ఎప్పుడైనా సరే వచ్చి సమస్యను విన్నవించుకోవచ్చు. ప్రజల సంరక్షణ కోసమే పోలీసులు ఉన్నారు. వారి సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత. సాక్షి : కాల్‌మనీ ఉదంతాలు కూడా అధికంగా ఉన్నాయి? వీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అశోక్ : విజయవాడలో కాల్‌మనీ సెల్పెట్టాం. పోలీసులు, బార్అసోసియేషన్, వ్యాపారులతో పాటు పలువురు ప్రతినిధులతో ఓ కమిటీ వేశాం. బాధితులు, వ్యాపారులను పిలిపించి వారితో కౌన్సెలింగ్ ఇచ్చి పంపేవాళ్లం. మంచి ఫలితాలు వచ్చాయి? ఇక్కడి పరిస్థితులను బట్టి అమలు చేస్తాం. ఇందులో పోలీసులకు చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకుని ముందుకెళ్తాం. సాక్షి : పట్టణాల్లో సీసీ కెమెరాలను మరింతగా పెంచడంతో పాటు ప్రజలు నివసించే కాలనీల్లో కూడా ఉంటే నేరాల తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉంది కదా? అశోక్ : పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మరిన్ని పెంచుతాం. కానీ ప్రతీ సర్కిల్, కాలనీ అంటే కష్టమే! కాలనీల్లో పెడితే బాగుంటుంది. దీనికి ప్రజల సహకారం అవసరం. కాలనీ అసోసియేషన్ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పోలీసుశాఖ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం. ఇది ఖరీదైన వ్యవహారం కాదు. తక్కువ ధరకే నాణ్యమైన కెమెరాలు లభిస్తున్నాయి. వ్యాపారులు, ప్రజలు ముందుకొచ్చి కెమెరాలు అమర్చుకుంటే నేరాల నియంత్రణ సులువవుతుంది. మాల్స్‌తో పాటు రద్దీ ఉంటే వ్యాపారులు, ఆస్పత్రులు యాజమాన్యాలు పబ్లిక్ సెక్యూరిటీ యాక్టు ప్రకారం కచ్చితంగా కెమెరాలు అమర్చాలి. దీనిపై అవగాహన కల్పిస్తాం. సాక్షి : సైబర్ క్రైం కేసులు కూడా ఎక్కువయ్యాయి? అశోక్ : ఎస్. ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సబ్‌డివిజన్‌లో ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సులు చేసిన ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి సైబర్టూల్స్పై శిక్షణకు ఇప్పిస్తాం. దీనిపై ప్రణాళిక ఉంది. సాక్షి : డ్రంకెన్ డ్రైవ్ పరిస్థితి ఏంటి? అశోక్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ఉంచాలి. రోజూ తనిఖీలు నిర్వహించేలా ట్రాఫిక్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తాం. సాక్షి : మాజీ ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీకి చెందిన ముఖ్యనేతలకు గన్మెన్లను తొలగించారు? వీరి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి కదా? అశోక్ : దీన్ని ఎస్ఆర్సీ(స్టేట్ రివ్యూ కమిటీ) సమీక్షిస్తుంది. ఎవరికి గన్మెన్లు అవసరం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని కమిటీ సమీక్షించి గన్మెన్లు అవసరమా? ఉచితంగా ఇవ్వాలా? పేమెంట్ కింద ఇవ్వాలా? అని నిర్ణయం తీసుకుంటుంది. సాక్షి : మిస్సింగ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి? అశోక్ : నిజమే. వీటిని ప్రాధాన్యతగా తీసుకుంటాం. మైనర్ బాలికలతో పాటు బాలుర మిస్సింగ్ కేసులు అధికంగా ఉన్నాయి. దీనికి సబ్‌డివిజన్‌కు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. సీరియస్‌గా తీసుకుంటాం. మహిళలపై జరిగే నేరాల నియంత్రణకు షీటీమ్స్ తరహాలో ప్రత్యేక వ్యవస్థను కూడా తయారు చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్ ఎక్కువగా ఉంది. కొందరు ట్రాప్ చేసి మోసం చేస్తున్నా. ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తాం. కాలేజీల్లో కూడా పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. సాక్షి : పోలీసు సంక్షేమానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? అశోక్ : అమలవుతున్న వాటిని మరింత బలోపేతం చేస్తాం. పెద్ద జిల్లా. వందల కిలోమీటర్ల దూరంలో సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటా. వీరి సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటా. అసోసియేషన్ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిని తప్పకుండా పరిష్కరిస్తాం. సాక్షి : పోలీసు క్వార్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి? సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు? అశోక్ : క్వార్టర్ల మరమ్మతులకు రూ.కోటి మంజూరైంది. మరమ్మతులు చేయిస్తాం. క్వార్టర్లలో లేని వారికి హెచ్ఆర్ఏ కట్ అవుతోంది. ఈ సమస్య కాస్త జటిలంగా ఉంది. పరిష్కరించే ప్రయత్నం చేస్తా.