China Open
-
సింధు శుభారంభం
షెన్జెన్: చైనా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత షట్లర్లు మెరిశారు. బరిలోకి దిగిన వారందరూ విజయాన్ని అందుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం కూడా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మళ్లీ సింధుదే పైచేయి... ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో 21వసారి ఆడిన సింధు ఈసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న సింధు 21–17, 21–19తో బుసానన్ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 20వ విజయం కావడం విశేషం. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీ లభించినా కీలకదశలో ఆమె పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. గతవారం జపాన్ మాస్టర్స్ టోర్నీలోనూ తొలి రౌండ్లో బుసానన్పైనే సింధు గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్తో సింధు ఆడుతుంది. మరోవైపు ప్రపంచ 36వ ర్యాంకర్, భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సంచలన విజయంతో శుభారంభం చేసింది. ప్రపంచ 21వ ర్యాంకర్ లైన్ హొమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక 20–22, 23–21, 21–16తో విజయాన్ని అందుకుంది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మాళవిక తొలి గేమ్‌ను కోల్పోయినా ఆందోళన చెందకుడా ఆడి ఆ తర్వాతి రెండు గేముల్లో నెగ్గి ముందంజ వేసింది. ఈ గెలుపుతో ఈ ఏడాది కొరియా ఓపెన్‌లో జార్స్‌ఫెల్డ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుపనిద (థాయ్‌లాండ్)తో మాళవిక తలపడుతుంది. ఏడో ర్యాంకర్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ సంచలన విజయంతో బోణీ చేశాడు. ప్రపంచ 7వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 13–21, 21–13తో గెలిచాడు. లీ జి జియాపై లక్ష్య సేన్‌కిది ఐదో విజయం కావడం విశేషం. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ ఆటలో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో అతడు గాడిలో పడటంతో విజయం దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 15–11 వద్ద లక్ష్య సేన్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–11తో విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత అతను రెండు పాయింట్లు కోల్పోయాక మరో పాయింట్ నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గాయత్రి జోడీ ముందుకు.... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–15, 21–14తో హు లింగ్ ఫాంగ్–జెంగ్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. ఈ గెలుపుతో భారత జంట సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 12–21, 21–19, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సాతి్వక్–చిరాగ్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం. -
కోకో గాఫ్‌దే చైనా ఓపెన్
బీజింగ్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్ కోకో గాఫ్ చాంపియన్‌గా అవతరించింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కోకో గాఫ్ 6–1, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. 76 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోకో ఆరు ఏస్‌లు సంధించింది. ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ముకోవాకు 5,85,000 డాలర్ల (రూ. 4 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో గత 14 ఏళ్లలో ఈ టోర్నీ టైటిల్ సాధించిన పిన్న వయసు్కరాలిగా 20 ఏళ్ల కోకో గాఫ్ గుర్తింపు పొందింది. సెరెనా విలియమ్స్ (2004, 2013) తర్వాత చైనా ఓపెన్ సాధించిన రెండో అమెరికన్ ప్లేయర్‌గానూ కోకో గాఫ్ ఘనత వహించింది. ఓవరాల్‌గా కోకో కెరీర్లో ఇది ఎనిమిదో సింగిల్స్ టైటిల్. తాజా టైటిల్‌తో సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు కోకో గాఫ్ చేరువైంది. -
అల్కరాజ్దే పైచేయి
బీజింగ్: ఈ ఏడాది పురుషుల టెన్నిస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న యానిక్ సినెర్, అల్కరాజ్ మరోసారి ముఖాముఖి పోరులో కొదమ సింహాల్లా పోరాడారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కీలకదశలో పాయింట్లు రాబట్టిన స్పెయిన్ స్టార్ అల్కరాజ్ పైచేయి సాధించాడు. తద్వారా ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)పై అల్కరాజ్ వరుసగా మూడోసారి గెలుపొంది ఈ సీజన్లో నాలుగో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. బుధవారం ముగిసిన చైనా ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అల్కరాజ్ 6–7 (6/8), 6–4, 7–6 (7/3)తో డిఫెండింగ్ చాంపియన్ సినెర్‌ను ఓడించాడు. చైనా ఓపెన్కంటే ముందు ఈ సీజన్లో అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ టైటిల్స్‌ను సాధించాడు. సినెర్‌తో జరిగిన తుది పోరులో తొలి సెట్లో అల్కరాజ్ 5–2తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే సినెర్ పుంజుకొని స్కోరును సమం చేశాడు. చివరకు టైబ్రేక్‌లో తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో అల్కరాజ్ కోలుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ ఇద్దరూ హోరాహోరాగా పోరాడారు. తుదకు టైబ్రేక్‌లో అల్కరాజ్ పైచేయి సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్కు 6,95,750 డాలర్ల (రూ. 5 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సినెర్‌కు 3,74,340 డాలర్ల (రూ. 3 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 330 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అల్కరాజ్ X సినెర్
బీజింగ్: ఈ సీజన్లో ఏడో టైటిల్ సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)... నాలుగో టైటిల్‌ను దక్కించుకునేందుకు ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్) విజయం దూరంలో నిలిచారు. చైనా ఓపెన్ ఏటీపీ –500 టెన్నిస్ టోరీ్నలో వీరిద్దరు ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో సినెర్ 6–3, 7–6 (7/3)తో యుంచాకెటె బు (చైనా)పై, అల్కరాజ్ 7–5, 6–3తో మెద్వెదెవ్ (రష్యా)పై నెగ్గారు. ఈ ఏడాది సినెర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 59 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంతోపాటు మరో నాలుగు టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకోవడంతోపాటు ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. సినెర్, అల్కరాజ్ ముఖాముఖిగా ఇప్పటి వరకు 9 సార్లు తలపడ్డారు. 4 సార్లు సినెర్, 5 సార్లు అల్కరాజ్ గెలిచారు. -
బోపన్న జోడీకి చుక్కెదురు
చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. బీజింగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో రెండో సీడ్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–డోడిగ్ జంట 5–7, 6–7 (4/7)తో సెరున్‌డొలో (అర్జెంటీనా)–నికోలస్ జారీ (చిలీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. బోపన్న–డోడిగ్‌లకు 15,960 డాలర్ల (రూ. 13 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే సుమిత్ ఓటమి
చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ ఓడిపోయాడు. ప్రపంచ 63వ ర్యాంకర్ పావెల్ కొటోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 6–7 (5/7)తో ఓటమి పాలయ్యాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 37 అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 8,340 డాలర్ల (రూ. 6 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక పరాజయం
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల విభాగంలో ముందంజ వేసిన ఏకైక భారత ఆశాకిరణం మాళవిక బన్సోద్‌కు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. జపాన్ స్టార్, నాలుగో సీడ్ అకానె యామగుచి ధాటికి మాళవిక నిలువలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక 10–21, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ యామగుచి జోరుకు వరుస గేమ్‌లలో ఓడిపోయింది. బన్సోద్‌పై యామగుచికి వరుసగా ఇది మూడో విజయం కావడం గమనార్హం.ఈ టో ర్నీలో మిగతా భారత షట్లర్లు ఇదివరకే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, ప్రియాన్షు రజావత్, మహిళల ఈవెంట్లో ఆకర్శి కశ్యప్, సామియా ఇమాద్లు తొలి రౌండ్ పోటీల్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ జోడీలు కూడా తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాయి. -
క్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సోద్
చాంగ్జౌ: భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టో ర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో తనకన్నా ఎక్కువ ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్‌ను ఓడించి సత్తా చాటింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ మాళవిక 21–17, 19–21, 21–16తో రెండుసార్లు కామన్వెల్త్ క్రీడల చాంపియన్ క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)ను కంగు తినిపించింది. ప్రపంచ 25వ ర్యాంకర్‌తో జరిగిన ఈ పోరులో ప్రతి గేమ్‌లోనూ ఒక్కో పాయింట్ గెలించేందుకు 22 ఏళ్ల మాళవిక చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో గేమ్‌లో ఆఖరిదాకా పోరాడినా... గేమ్‌ను 2 పాయింట్ల తేడాతో కోల్పోయిన భారత షట్లర్ నిర్ణాయక మూడో గేమ్‌లో పుంజుకొని ఆడింది. ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని పెంచుకుంటూ 21–16తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత ప్లేయర్‌కు మరింత క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవుతోంది. శుక్రవారం జపాన్‌కు చెందిన నాలుగో సీడ్ అకానె యామగుచితో మాళవిక తలపడుతుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మాళవిక మాట్లాడుతూ ‘బీడబ్ల్యూఎఫ్ సూపర్–1000 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఓ పెద్దస్థాయి టో ర్నీలో ముందంజ వేయాలన్న నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. టోర్నీకి ముందే క్వార్టర్స్ చేరితే బాగుండేదనిపించింది. ఇప్పుడు టాప్–8కు అర్హత సంపాదించడం గొప్ప అనుభూతినిస్తోంది’ అని తెలిపింది. -
చైనా ఓపెన్‌లో భారత షట్లర్లకు నిరాశ
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మాళవిక బన్సోద్ మినహా మిగతా భారత క్రీడాకారులంతా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి... మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.మహిళల డబుల్స్లోఇక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రుతూపర్ణ–శ్వేతాపర్ణ జోడీలు... మిక్స్డ్ డబుల్స్లోసిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి, సతీశ్ కుమార్–ఆద్యా జంటలకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 40వ ర్యాంకర్ కిరణ్ జార్జి సంచలన విజయాన్ని సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–4, 10–21, 21–23తో ఓడిపోయాడు.నిర్ణాయక మూడో గేమ్‌లో కిరణ్ రెండు మ్యాచ్ పాయింట్లను వృథా చేసుకోవడం గమనార్హం. సామియా 9–21, 7–21తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) చేతిలో... ఆకర్షి 15–21, 19–21తో చియు పిన్ చెయిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు.మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 15–21, 17–21తో సెయి పె షాన్–హంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) చేతిలో... రుతూపర్ణ–శ్వేతాపర్ణ 11–21, 21–16, 11–21తో టెంగ్ చున్ సున్–యాంగ్ చున్ యున్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డికీ ఓటమేమిక్స్డ్ డబుల్స్‌లో భారత నంబర్‌వన్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి 10–21, 16–21తో టాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో... సతీశ్–ఆద్యా ద్వయం 14–21, 11–21తో చెన్ టాంగ్ జె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
మాళవిక సంచలనం
చాంగ్జౌ (చైనా): భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని నమోదు చేసింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 43వ ర్యాంకర్ మాళవిక 26–24, 21–19తో ప్రపంచ ఏడో ర్యాంకర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై గెలిచింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మాళవిక తొలి గేమ్‌లో మూడు గేమ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్కాట్లాండ్ ప్లేయర్ క్రిస్టీ గిల్మోర్తో మాళవిక తలపడుతుంది. మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల మాళవిక ప్రస్తుతం థానే బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్ శ్రీకాంత్ వాడ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి.. ముగిసిన పోరాటం
చాంగ్జౌ: చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 17–21, 21–11, 17–21తో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జంట 15–21, 16–21తో చెన్ టాంగ్ జియె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. Asia TT Championship 2023: Indian Mens Team Won Bronze Medal: భారత జట్టుకు కాంస్యం ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు మరోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ , హర్మీత్ దేశాయ్ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో అర్జున్ టాటా స్టీల్ ఇండియా చెస్ ఓపెన్ ర్యాపిడ్ టోర్నీలో ఆరు రౌండ్లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2.5 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. కోల్‌కతాలో 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం 3 రౌండ్లు జరిగాయి. నాలుగో గేమ్‌లో గ్రిష్చుక్ (రష్యా) చేతిలో 55 ఎత్తుల్లో ఓడిన అర్జున్... ఐదో గేమ్‌లో 67 ఎత్తుల్లో విదిత్ (భారత్)పై గెలిచాడు. గుకేశ్ (భారత్)తో జరిగిన ఆరో గేమ్‌ను అర్జున్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. విదిత్, ప్రజ్ఞానంద, గుకేశ్ 3 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
మరో నాలుగు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
టోక్యో: కరోనా ఖాతాలో మరో నాలుగు టోర్నీలు చేరాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం తాజాగా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తైపీ ఓపెన్ (సెప్టెంబర్ 1–6), కొరియా ఓపెన్ (8–13), చైనా ఓపెన్ (15–20), జపాన్ ఓపెన్ (22–27)లను నిర్వహించబోమని సమాఖ్య వెల్లడించింది. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అందరి ఆరోగ్యభద్రత దృష్ట్యా టోర్నీల రద్దుకే మొగ్గుచూపామని బీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి థామస్ లుండ్ పేర్కొన్నారు. ఈ మహమ్మారి కారణంగానే ఇటీవల చైనాలో జరగాల్సిన 11 టెన్నిస్ టోర్నీలు రద్దు కాగా... మంగళవారం ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీఏ పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ తొలిసారిగా రద్దయింది. -
మొమోటా @10
ఫుజౌ (చైనా): జపాన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటా ఈ ఏడాది పదో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్న ఫైనల్లో మొమోటా 21–15, 17–21, 21–18తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్ టైటిల్స్ గెలిచిన షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. లీ చోంగ్ వీ (మలేసియా–2010లో 9 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును మొమోటా బద్దలు కొట్టాడు. ఈ ఏడాది మరో టైటిల్ సాధిస్తే మొమోటా ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం జియోలి వాంగ్–యు యాంగ్ (చైనా–మహిళల డబుల్స్‌లో 10 టైటిల్స్; 2011లో) ద్వయం పేరిట ఉన్న రికార్డును మొమోటా సమం చేశాడు. -
నిన్న మహిళల సింగిల్స్.. నేడు పురుషుల సింగిల్స్
ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మంటన్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ 20-22, 22-20, 16-21 తేడాతో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్.. రెండో గేమ్‌లో గెలిచి రేసులోకి వచ్చాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆండెర్స్ ర్యాలీలు, స్మాష్‌లతో ప్రణీత్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ప్రణీత్ తాను చేసి తప్పిదాల నుంచి తేరుకునే లోపే ఆండెర్స్ గేమ్‌తో మ్యాచ్‌ను కూడా గెలిచి మూడో రౌండ్‌కు చేరాడు. తొలి గేమ్‌లో పోరాట స్పూర్తిని ప్రదర్శించిన ప్రణీత్.. రెండో గేమ్‌లో జోరును కొనసాగించాడు. ఆండెర్స్‌కు అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను గెలిచాడు. కాగా, మూడో గేమ్‌లో ఆండెర్స్ తిరిగి పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ ప్రణీత్‌ను ఒత్తిడిలోకి నెట్టి పైచేయి సాధించాడు. చివర్లో ప్రణీత్ పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రణీత్ ఓటమితో భారత్ సింగిల్స్‌లో పోరాటాన్ని ముగించింది. నిన్న మహిళల సింగిల్స్ పోరాటం ముగిస్తే, ఈరోజు పురుషుల సింగిల్స్ పోరాటం సైతం ముగిసింది. -
చైనా ఓపెన్ నుంచి రిక్త హస్తాలతో..
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్‌టూర్ సూపర్-1000 టోర్నీలో భారత షట్లర్ సాయి ప్రణీత్ ఇంటి దారి పట్టాడు. . శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ కార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-16, 6-21, 16-21 తేడాతో ఆంటోని సినిసుకా గింటిక్(ఇండోనేసియా) చేతలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సాయి ప్రణీత్.. మిగతా రెండు గేమ్‌ల్లో తేలిపోయాడు. రెండో గేమ్‌ను దారుణంగా కోల్పోయిన ప్రణీత్.. మూడో గేమ్‌లో పుంజు కోవడానిక యత్నించినా ఆంటోని ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధిస్తూ ప్రణీత్‌పై ఒత్తిడి పెంచాడు. ప్రధానంగా రెండో గేమ్‌లో ఆంటోని వరుస ఆరు పాయింట్లు సాధించడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలోనే గేమ్‌ను కోల్పోయాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆంటోని ఆరంభంలోనే పైచేయి సాధించాడు. ప్రణీత్‌ను 2-6తో వెనక్కి నెట్టిన ఆంటోని.. అదే జోరును కడవరకూ కొనసాగించాడు. దాంతో ప్రణీత్‌కు పరాజయం తప్పలేదు. దాంతో చైనా ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. కనీసం ఒక్క పతకం కూడా సాధించకుండానే భారత ఆటగాళ్ల రిక్త హస్తాలతో వెనుదిరిగారు. -
చాంపియన్‌కు ‘చైనా’లో చుక్కెదురు
చాంగ్జౌ (చైనా): ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్లో సింధు 21-12, 13-21, 19-21 తేడాతో పోర్న్‌పావే చూచూవోంగ్(థాయిలాండ్) చేతిలో పరాజయం చెందారు. దాంతో మరో టైటిల్‌ను సాధించాలనుకున్న సింధు ఆశలు నెరవేరలేదు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్‌ల్లో విఫలమయ్యారు. రెండో గేమ్‌లో పుంజుకున్న చూచూవోంగ్ ఆ గేమ్‌ను గెలిచి రేసులో నిలిచారు. అదే ఊపును మూడో గేమ్‌లో కొనసాగించారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు పోరాడినా గేమ్‌ను కోల్పోయారు. దాంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 21–18, 21–12తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. 50 నిమిషాలకు పైగా సాగిన రెండో రౌండ్ ఆరంభంలో సింధు ఆకట్టుకున్నప్పటికీ తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. రెండో గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయిన సింధు.. మూడో గేమ్‌లో మాత్రం కడవరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. -
ప్రిక్వార్టర్స్‌కు సింధు.. సైనా ఇంటిబాట
చాంగ్జౌ(చైనా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచి జోరుమీదున్న తెలుగు తేజాలు పీవీ సింధు, సాయిప్రణీత్ చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్‌తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పసిడి పతక విజేత సింధు 21–18, 21–12తో మాజీ ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్(చైనా)పై గెలిచింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ ఆఖర్లో సింధు ధాటికి జురుయ్ తలవంచింది. ఇక రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేయడంతో మ్యాచ్ సింధు వశమైంది. కాగా, మరో భారత క్రీడాకారిణి, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ 10–21 17–21తో బుసానన్ అంగ్బమ్రంగ్పన్(థాయ్‌లాండ్) చేతిలో అనూహ్య పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 44 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి సెట్‌ను చేజార్చుకున్నాక రెండో సెట్లో పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించాక అనంతరం ఏ టోర్నీలోనూ సైనా కనీసం సెమీస్‌కు కూడా చేరలేదు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 21–19, 21–23, 21–14తో సుపన్యు అవిహింగ్సనన్ (థాయ్‌లాండ్)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జోడీ సైతం తదుపరి రౌండ్‌కు చేరింది. ఈ ద్వయం 21–13తో తొలి సెట్‌ను దక్కించుకొని రెండో సెట్లో 11–8తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి జంట చిన్ చెన్ లీ– చి యా చెంగ్ తప్పుకొంది. కాగా, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా–సిక్కిరెడ్డి ద్వయం 12–21, 21–23తో మార్క్ లామ్స్‌ఫస్–ఇసాబెల్ హెర్ట్రిచ్(జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. -
చైనా ఓపెన్: సింధు ఔట్
పుజౌ(చైనా): చైనా ఓపెన్ బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 17-21, 21-17, 15-21 తేడాతో హిబింజియో(చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో ఓటమి పాలైన సింధు.. రెండో గేమ్‌లో తేరుకుని స్కోరును సమం చేశారు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు మరోసారి తడబడటంతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. 69 నిమిషాల పాటు జరిగిన పోరులో చైనా క్రీడాకారిణి ఆద్యంతం దూకుడుగా ఆడారు. ఇది బింజియో చేతిలో వరుసగా మూడో ఓటమి. అంతకుముందు వీరిద్దరి జరిగిన రెండు మ్యాచ్‌లు రెండు గేమ్‌ల్లోనే ముగిస్తే.. ఈ మ్యాచ్ మూడో గేమ్ వరకూ వెళ్లడం గమనార్హం. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: లిజౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–1, 3–6, 10–8తో కెచ్‌మానోవిచ్ (సెర్బియా)–జె లీ (చైనా) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రెండో రౌండ్‌కు చేరగా... సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లో ఓడిపోయారు. ప్రజ్నేశ్ 6–4, 7–5తో జొహాన్ టాట్లోట్ (ఫ్రాన్స్)పై నెగ్గగా... సుమీత్ 2–6, 3–6తో తత్సుమైతో (జపాన్) చేతిలో... రామ్‌కుమార్ 6–7 (3/7), 3–6తో డేవిడోవిచ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
సౌజన్యకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలోని యానింగ్ నగరంలో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య (భారత్)–డాన్ ని వాంగ్ (చైనా) ద్వయం 7–6 (7/4), 7–5తో మూడో సీడ్ ఐసువాన్ చో–యి సెన్ చో (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. 24 ఏళ్ల సౌజన్యకిది కెరీర్లో ఎనిమిదో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2015లో రిషిక సుంకరతో కలిసి నాసిక్ ఐటీఎఫ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తర్వాత సౌజన్య నెగ్గిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. -
సింధు ముందుకు... సైనా ఇంటికి
చాంగ్జౌ: ఆసియా క్రీడల తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురుకాగా... పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సైనా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 22–20, 8–21, 14–21తో ఓడిపోయింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా.... ఆ తర్వాత తడబడింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో ప్రపంచ 39వ ర్యాంకర్ సెనా కవకామి (జపాన్)ను ఓడించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన సింధు కేవలం 26 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి ఆట కట్టించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో బుసానన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి జోడీ... డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన రెండు భారత జంటలకు శుభారంభం లభించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–19, 21–17తో మార్విన్ ఎమిల్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ) జోడీపై గెలుపొందింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 13–21, 21–13, 21–12తో ప్రపంచ 13వ ర్యాంక్ ద్వయం లియావో మిన్ చున్–సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రాస్ముస్ జెమ్కే (డెన్మార్క్)తో శ్రీకాంత్; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో ప్రణయ్ తలపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఇలిస్–లారెన్ (ఇంగ్లండ్)లతో సాత్విక్ సాయిరాజ్–అశ్విని; గో వీ షెమ్–తాన్ వీ కియోంగ్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ శెట్టి; కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో సిక్కి–అశ్విని ఆడతారు. -
తొలి రౌండ్లోనే సైనా ఓటమి
చాంగ్జౌ: చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లోనే సైనా నెహ్వాల్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సైనా 22-20, 8-21, 14-21 తేడాతో సుంగ్ జీ హున్(దక్షిణకొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్‌ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సైనా.. ఆపై వరుసగా రెండు గేమ్‌లను చేజార్చుకున్నారు. ఇరువురు క్రీడాకారిణుల మధ్య తొలి గేమ్ హోరీ హోరీగా సాగగా, మిగతా రెండు గేమ్‌లను సుంగ్ జీ హున్ సునాయాసంగా గెలిచారు. దాంతో సైనా భారంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరొకవైపు పీవీ సింధు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో జపాన్‌కు చెందిన కవకమిపై 21-15, 21-13తో విజయం సాధించారు. దాంతో సింధు ప్రిక్వార్టర్స్‌కు చేరారు. ఇక పురుషుల డబుల్స్‌లో మను అత్రి - సుమీత్ రెడ్డీ జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన మిన్ చున్- చింగ్ హెంగ్పై మను అత్రి - సుమీత్ జోడీ 13-21, 21-13, 21-12తో విజయం సాధించింది. -
సింధు అవుట్
ఫిజౌ (చైనా): భారత స్టార్ షట్లర్ పివి సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో సింధు 11-21, 10-21 తేడాతో గావో ఫాంగ్‌జి(చైనా) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ ను భారీ తేడాతో కోల్పోయిన సింధు.. రెండో గేమ్ లో కూడా అదే ఆట తీరును పునరావృతం చేసి మ్యాచ్ ను చేజార్చుకుంది. దాంతో వరుసగా రెండోసారి టైటిల్ పై సింధు పెట్టుకున్న ఆశలకు క్వార్టర్స్ లోనే గండిపడింది. 2016లో సింధు తొలిసారి చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించిన సంగతి తెలిసిందే. -
చైనా ఓపెన్‌కు శ్రీకాంత్ దూరం
న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. గత వారం నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ సందర్భంగా శ్రీకాంత్ కాలి కండరాలు పట్టేశాయి. దాంతో ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు అతనికి వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ‘ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే చైనా ఓపెన్ నుంచి నేను వైదొలుగుతున్నాను. కాలి కండరాలు పట్టేయడంతో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలన్నారు. దాదాపు నెల రోజుల నుంచి నేను విరామం లేకుండా ఆడుతున్నాను. ఇలాగే ఆడితే గాయం తీవ్రత పెరిగే అవకాశముంది. వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాక ఈ నెల మూడో వారంలో జరిగే హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో బరిలోకి దిగుతాను’ అని శ్రీకాంత్ తెలిపాడు. మరోవైపు జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడినందుకే శ్రీకాంత్‌కు గాయమైందనడం సహేతుకంగా లేదని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సెక్రటరీ జనరల్ అనూప్ నారంగ్ వివరించారు. ‘అగ్రశ్రేణి క్రీడాకారులందరినీ సంప్రదించాకే జాతీయ చాంపియన్‌షిప్ తేదీలను ఖరారు చేశాం. ఒకవేళ ఈ తేదీల్లో జాతీయ చాంపియన్‌షిప్ జరగకపోయుంటే మనోళ్లందరూ మకావు ఓపెన్‌లో ఆడేవారు. శ్రీకాంత్‌ది పెద్ద గాయం కాదు. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే అతను కోలుకుంటాడు’ అని అనూప్ నారంగ్ అన్నారు. మరోవైపు చైనా ఓపెన్ నుంచి శ్రీకాంత్ తప్పుకోవడంతో అతనికి ప్రపంచ నంబర్‌వన్ అయ్యే అవకాశం క్లిష్టంగా మారనుంది. ప్రస్తుత టాప్ ర్యాంకర్ అక్సెల్సన్ (డెన్మార్క్–77,930 పాయింట్లు), శ్రీకాంత్ (73,403 పాయింట్లు) మధ్య 4,527 పాయింట్ల తేడా ఉంది. ఒకవేళ చైనా ఓపెన్‌లో అక్సెల్సన్ విజేతగా నిలిస్తే వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం మరింతగా పెరుగుతుంది. -
చైనా ఓపెన్ కు శ్రీకాంత్ దూరం
న్యూఢిల్లీ:చైనా ఓపెన్ సూపర్ సిరీస్ కు భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ దూరమయ్యాడు. ఈనెల 14వ తేదీ నుంచి ఆరంభమయ్యే చైనా ఓపెన్ నుంచి గాయం కారణంగా శ్రీకాంత్ వైదొలుగుతున్నాడు. ఇటీవల నాగ్ పూర్ లో ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ షిప్ లో శ్రీకాంత్ కు కాలికి గాయమైంది. హెచ్ఎస్ ప్రణయ్ తో జరిగిన తుది పోరులో శ్రీకాంత్ గాయపడ్డాడు. దాంతో అతనికి కొన్ని రోజుల విశ్రాంతి అవసరమని వైద్యుల సలహా సూచించారు. ఈ క్రమంలోనే చైనా ఓపెన్ కు దూరం కావాల్సి వస్తుందని శ్రీకాంత్ తెలిపాడు. హాంకాంగ్ సూపర్ సిరీస్ కు సిద్ధమవుతానని శ్రీకాంత్ ప్రకటించాడు.ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న స్టార్ షట్లర్ శ్రీకాంత్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తూ నాలుగు టైటిళ్లను నెగ్గిన విషయం తెలిసిందే. ఫలితంగా ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ కెరీర్ బెస్ట్ ర్యాంకు '2'లో నిలిచాడు.