CM fadnavis
-
మహారాష్ట్ర సీఎంకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఫడణవీస్ తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించలేదంటూ సతీశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపి ఫడణవీస్‌కు నోటీసులు ఇచ్చింది. ఫడణవీస్ ఎన్నికను రద్దు చేయాలంటూ తొలుత హైకోర్టులో సతీశ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ çసుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఫడణవీస్‌పై 1996, 1998లో చీటింగ్, ఫోర్జరీకి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. -
దీక్ష విరమించిన హజారే
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే(80) ఇక్కడి రామ్‌లీలా మైదానంలో గత ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను వెంటనే ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంలో దీక్ష విరమణకు ఆయన అంగీకరించారు. కేంద్రం దూతగా ఇక్కడికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. హజారేకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీంతో హజారేతో పాటు దాదాపు 300 మంది ఆందోళనకారులు కూడా దీక్ష విరమించారు. ఈ హామీల అమలుకు కేంద్రానికి ఆగస్టు వరకూ సమయమిస్తున్నాననీ, అప్పటిలోగా హామీల్ని నెరవేర్చకుంటే సెప్టెంబర్‌లో మరోసారి ఆందోళనకు దిగుతానని హజారే హెచ్చరించారు. హజారే దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడుతున్న సీఎం ఫడ్నవిస్‌పై రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. అది ఫడ్నవిస్‌కు కొద్దిదూరంలో పడిపోయింది. దీంతో పోలీసులు రాజ్‌కుమార్‌ను బయటకు తీసుకెళ్లారు. -
రైతు ‘మహా’ విజయం
సాక్షి, ముంబై: మండుటెండలో బొబ్బలెక్కిన పాదాలతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచి తమ సమస్యల పరిష్కారం కోసం ముంబైకి చేరుకున్న వేలాది మంది రైతుల ఆందోళనకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవిస్ అసెంబ్లీ బయట మాట్లాడుతూ ‘రైతులు, ఆదివాసీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఆదివాసీలు సాగుచేస్తున్న అటవీ భూములను వారికే బదిలీ చేయాలని నిర్ణయించాం. అయితే 2005కు ముందు నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు గిరిజనులు ఆధారాలు చూపించాలి. వారికి భూములను బదిలీ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. డిమాండ్లలోని దాదాపు అన్నింటినీ నిర్ణీత సమయంలోపు మేం నెరవేరుస్తాం’ అని చెప్పారు. సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సభ రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది. తమ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో అలసి సొలసిన రైతన్నలు ఆందోళన విరమించి ఇక తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. రైతులను ముంబై నుంచి ఇళ్లకు తిరిగి పంపేందుకు ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పించనుంది. ముంబై నుంచి నాసిక్ మీదుగా భుసావల్ వరకు రైతుల కోసం 2 రైళ్లను నడపటంతోపాటు ఆ మార్గంలో వెళ్లే రైళ్లకు అదనపు జనరల్ బోగీలను కూడా తగిలిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు. అదనంగా రైతు రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్‌ను మాత్రం తాము నెరవేర్చలేమని సీఎం చెప్పారు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ రుణాలు తీసుకున్నప్పుడు వారిలో ఎవరి పేరున అప్పు తక్కువగా ఉంటే ఆ రుణం మాత్రమే మాఫీ అయిందనీ, దీన్ని సరిదిద్దడానికి ఇంకా ఎంత ఎక్కువ వ్యయం అవుతుందో అంచనా వేయడానికి ప్రభుత్వం మరో కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సోమవారం ముంబైలోని ఆజాద్ మైదానంలో సమావేశమైన రైతులు ఒకటే గమ్యం.. ఒకటే గమనం నడిచి నడిచి పాదాలకు పుండ్లు పడి రక్తాలు కారాయి. తినడానికి సరైన తిండి లేదు. నిద్రపోవడానికి అనువైన జాగా దొరికేది కాదు. మార్చిలోనే మాడుపగిలే ఎండలతో నిస్సత్తువ ఆవహించేది. అయినా మహారాష్ట్ర రైతన్నల అడుగు తడబడలేదు. నడక ఆగలేదు. వారి సంకల్ప బలం చెక్కు చెదరలేదు. అందరి కడుపులు నింపే అన్నదాతలు తమ ఆకలి తీరే మార్గం కోసం, బతుకుదెరువు కోసం చేసిన పాదయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. నాసిక్ నుంచి ముంబై వరకు మొత్తం 180 కిలో మీటర్లు సాగిన ఈ రైతు పాదయాత్రలో అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టనష్టాలు.. మహిళా రైతులు కూడా అన్నింటినీ పంటి బిగువున భరించారు. అలుపూసొలుపూ లేకుండా దాదాపు 35 డిగ్రీల మండుటెండలో రోజుకి 30 కిలో మీటర్లు నడిచారు. మహారాష్ట్ర సర్కార్ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో తమకెదురైన ఇబ్బందులేమీ పట్టించుకోలేదు. ఒక్కో ఊరు దాటుతుంటే ప్రవాహంలా మరికొందరు రైతులు వారి అడుగుకి అడుగు కలిపారు. మరాఠ్వాడా, రాయగఢ్, విదర్భ ఇలా ఒక్కో ప్రాంతం నుంచి రైతులు కదం తొక్కారు. తొలి రోజు 30 వేల మందితో మొదలైన మార్చ్‌లో రోజు గడిచేకొద్దీ రైతుల సంఖ్య పెరిగి ముంబైకొచ్చేసరికి 50 వేలు దాటేసింది. కనీస సదుపాయాలు లేకున్నా.. డెబ్బయి ఏళ్ల వయసు దాటిన వారు, మహిళా రైతులు కూడా ఈ పాదయాత్రలో ఎక్కువగా కనిపించారు. ఆరురోజుల పాటు సాగిన నడకలో కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలు ఉంటాయి. కనీస సదుపాయాలు లేకపోయినా వారు పట్టించుకోలేదు. కొందరు రైతులు బియ్యం, గోధుమలు, పప్పుదినుసుల మూటలను మోస్తూనే నడక సాగించారు. రోడ్డుపక్కనే వండుకొని తినడం, మళ్లీ నడవడం.. రాత్రయ్యేసరికి హైవేపక్కనో, ఏ మైదానాల్లోనో కాసేపు కునుకు తీయడం.. మళ్లీ లేచి నడక నడక.. అలా అదే పనిగా దుమ్ము, ధూళిలో 140 గంటల సేపు నడిచారు. మండిపోతున్న ఎండలో నడవడం వల్ల డయేరియా, లో బీపీ వంటి అనారోగ్య సమస్యలూ తలెత్తాయి. ‘మేము ఎదుర్కొంటున్న కష్టాలతో పోల్చి చూస్తే ఇదేమంత కష్టం కాదు. మా జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి.పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే ఎలా బతకాలి? అందుకే ఎంతటి బాధనైనా తట్టుకున్నాం’ అని 74 ఏళ్ల వయసున్న శంకర్ గావిట్ అనే రైతు చెప్పారు. రైతుల దుస్థితిని చూసి చాలా ఊళ్లల్లో స్థానికులే వారిని ఆదుకున్నారు. అంతటి కష్టంలోనూ రైతులు ముంబై విద్యార్థుల కష్టాన్ని గుర్తించారు. ఆదివారం సాయంత్రానికల్లా ముంబై శివార్లకు చేరుకున్న వారు.. తమ పాదయాత్రతో సోమవారం టెన్త్, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదనే సదుద్దేశంతో ఆదివారం రాత్రి కూడా నడక సాగించి సూర్యుడు ఉదయించేలోపే ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. డబ్బావాలాల ఆహారం.. స్థానికుల ఔదార్యం ఎన్నో బాధలను భరించి అన్ని కిలోమీటర్లు నడిచొచ్చిన రైతులకు ముంబై వాసులు ఘనంగా స్వాగతం పలికారు. దేశమంతటికీ అన్నం పెట్టే రైతన్నల ఆకలిదప్పులు తీర్చారు. స్వచ్ఛందంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి రైతుల అవసరాలను అడిగి మరీ నెరవేర్చారు. నగరంలో పాదయాత్ర సాగుతుండగా అర్ధరాత్రే అనేక మంది ప్రజలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, డబ్బావాలాలు ట్రక్కులతో మంచినీళ్లు, తిండిపదార్థాలు తీసుకువచ్చి రైతులకు అందించారు. చెప్పులు లేని వారికి కొత్తవి ఇచ్చారు. పాదాల గాయాలకు వైద్య విద్యార్థులు చికిత్స చేశారు. రైతులకు అనూహ్యంగా అన్ని వైపుల నుంచి మద్దతు లభించడంతో మహారాష్ట్ర సర్కార్ దిగి రావల్సి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున ఆజాద్ మైదానానికి చేరుకుంటున్న రైతులు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రూ.34 వేల కోట్ల రుణమాఫీ
- మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రకటన - 89 లక్షల మంది రైతులకు లబ్ధి సాక్షి, ముంబై: కరువు, పంటలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న మహారాష్ట్ర రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 34,020 కోట్ల భారీ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ. 1.5 లక్షల వరకు ఉన్న రుణాలు రద్దు కానున్నాయి. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ కృషి సమ్మాన్ యోజన’గా నామకరణం చేసిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శనివారమిక్కడ ప్రకటించారు. పథకంతో 40 లక్షల మంది రైతులకు అప్పుల నుంచి పూర్తి విముక్తి, మరో 49 లక్షల మందికి కొంత ఉపశమనం కలగనుంది. దేశంలో ఒక రాష్ట్రం ఇంత పెద్ద రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని ఫడ్నవిస్ తెలిపారు. దీని కోసం రాష్ట్రంలోని అధికార బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని అందిస్తారని వెల్లడించారు. ‘2012 నుంచి కరువుతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న రైతుల రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్ మేరకు కేబినెట్ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత వర్గాలు, పార్టీల నేతలు, రైతు బృందాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు. ‘రూ. 1.5 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాం. 2012–16 మధ్య రుణాల్ని రీషెడ్యూల్ చేసుకుని.. 2016, జూన్ 30 నాటికి వాటిని చెల్లించని రైతులకు రూ. 25 వేలు లేదా రుణంలో 25 శాతం.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తం మేరకు రాయితీ ఉంటుంది’ అని తెలిపారు. కొత్తగా తీసుకునే రుణాల చెల్లింపు గడువును నిర్ణయించడానికి ఏపీ, తెలంగాణలో మాదిరి బ్యాంకులతో కలసి పనిచేస్తామన్నారు. రుణమాఫీపై రైతుల ఆందోళనతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పంతం నెగ్గడానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ సొమ్ముతో మహారాష్ట్రకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లాను ఎందుకు తప్పించారని, రంగారె డ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు గోదావరి జలాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణం ఖర్చును తెలంగాణ భరిస్తే, 20 శాతం నీళ్లను మహారాష్ట్రకు ఎందుకు ఇస్తున్నారన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పాత్ర ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంలో లొసుగులను గురువారం బహిర్గతం చేస్తామని తెలిపారు. -
నీటి కరువుకు పరిష్కారం: కె.లక్ష్మణ్
సాక్షి,హైదరాబాద్: గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పం దంతో తెలంగాణలో నీటి కరువుకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో కేంద్రం, ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించలేదన్నారు. కానీ తమ నేతల కృషి వల్లే తాజా ఒప్పందం సాకారమైందన్నారు. ఈ ఒప్పం దంలో కేంద్ర మంత్రులు హన్స్‌రాజ్ అహిర్, బండారు దత్తాత్రేయ కీలకపాత్ర పోషించారన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి నదుల అనుసంధానం కలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేనందున ఈ ప్రాజెక్టులు జల రవాణాకు ఉపయోగపడేలా చూడాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ను కోరినట్లు చెప్పారు. ఫడ్నవీస్‌ను కలసిన 13 మంది నేతల్లో ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, పార్టీ జాతీయ నేత వెదిరె శ్రీరాం, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎం.ఎస్.ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ తదితరులున్నారు. -
బ్యారేజీలపై ‘మహా’ ఒప్పందాలు
ఛనాఖా-కొరట, తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులకు మహారాష్ట్ర ఓకే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీరిచ్చేందుకు తోడ్పడే ఐదు ప్రధాన బ్యారేజీల నిర్మాణాలపై మహారాష్ట్రతో కీలక ఒప్పందాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన ఈ అంతర్రాష్ట్ర ఒప్పందాలపై తెలంగాణ, మహారాష్ట్రల సీఎంలు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవిస్ సంతకాలు చేయనున్నారు. గోదావరి ఉపనది అయిన పెన్‌గంగ డ్యామ్ దిగువన నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట, రాజాపేట, పిన్పహాడ్లతో పాటు ప్రాణహితపై ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించే తుమ్మిడిహెట్టి, గోదావరిపై మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీల నిర్మాణాలపై ఒప్పందాలు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. ఇరు రాష్ట్రాల రైతులకు మేలు చే కూర్చేలా ప్రాజెక్టులు కట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫడ్నవిస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆహ్వానం మేరకు ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ముంబై వెళ్లనున్నారు. 8వ తేదీన ఒప్పందాలు జరుగనున్నాయి. ఏడాది చర్చల అనంతరం కొలిక్కి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తుమ్మిడిహెట్టి, ఈ ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజీలతో పాటు పెన్‌గంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరట బ్యారేజీలపై గతేడాది ఫిబ్రవరి 17న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తొలిసారిగా చర్చలు జరిగాయి. ముందుగా ఛనాఖా-కొరట మధ్య 1.5టీఎంసీల సామర్థ్యంగల బ్యారేజీకి మహారాష్ట్ర సమ్మతించింది. దాంతో ఈ బ్యారేజీకి ప్రభుత్వం ఇప్పటికే రూ.368 కోట్లు విడుదలతో పాటు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. ఇదే నదిపై రాజాపేట, పిన్‌పహాడ్ బ్యారేజీలను మహారాష్ట్ర నిర్మిస్తుండగా... వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక తుమ్మిడిహెట్టి వద్ద ముంపు లేని బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీక రించింది. 148 మీటర్ల ఎత్తులో ముంపు లేనందున ఆ ఎత్తు తమకు సమ్మతమేనని స్పష్టం చేసింది. మరోవైపు ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌లో భాగంగా గోదావరి నదిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 103మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఎత్తులో 3వేల ఎకరాల వరకు ముంపు ఉంటుందని అధికారులు తేల్చారు. అయితే మహారాష్ట్రలోని గ్రామాల పరిధిలో ఎలాంటి ముంపు ఉండదని, నదీగర్భంలో మాత్రమే ఉంటుందని తెలంగాణచెప్పింది. దీనిపై సర్వే చేసిన మహారాష్ట్ర కూడా ముం పును నిర్ధారించుకుంది. అయితే తెలంగాణ చెప్పినట్లుగా 103మీటర్ల ఎత్తుకు ఒప్పుకొంటారా.. లేక 102 మీటర్లకో, 101 మీటర్లకో తగ్గించాలని కోరుతారా అనేదానిపై ఒప్పం దాల సమయంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకట్రెండు మీటర్లు తగ్గినా తెలంగాణకు పెద్దగా ఇబ్బంది ఉండదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఈ ఒప్పందాలతో రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు దక్కనున్నాయి. ఛనాఖా-కొరట ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 40వేల ఎకరాలు, తుమ్మిడిహెట్టితో ఇదే జిల్లాలో మరో 1.50 లక్షల ఎకరాలు, కాళేశ్వరంతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టులకు ఇప్పుడు మోక్షం లభించడం చారిత్రాత్మకమేనని నిపుణులు అంటున్నారు. -
విహారంలో విషాదం
♦ 14 మంది విద్యార్థుల జల సమాధి ♦ వీరిలో 10 మంది విద్యార్థినులు మహారాష్ట్రలోని మురూడ్-జంజీరా బీచ్‌లో ఘటన సాక్షి, ముంబై: ఆడుతూ పాడుతూ సాగాల్సిన విహారయాత్ర పెను విషాదాన్ని మిగిల్చింది. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మురూద్-జంజీరా తీరంలో సోమవారం 14 మంది కాలేజీ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతిచెందారు. మరొ విద్యార్థి సైఫ్ అహ్మద్ ఆచూకీ ఇంకా తెలియలేదు. మృతుల్లో 10 మంది విద్యార్థినులు ఉన్నారు. ఐదుగురు విద్యార్థినులకు కాపాడి, చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. పుణేలోని ఇనాందార్ కాలేజీలో బీఎస్సీ, బీసీఏ చదువుతున్న 116 మంది విద్యార్థులు మురూడ్-జంజీరాకు మూడు బస్సుల్లో వచ్చారు. వీరిలో కొందరు.. ఉపాధ్యాయులకు తెలియకుండా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈత కోసం సముద్రంలోకి దిగారు. అదే సమయంలో భారీ అలలు రావడంతో నీట మునిగి కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన మరికొందరు విద్యార్థులూ మునిగిపోయారు. వీరి కేకలను విని జాలర్లు, స్థానికులు అక్కడికి పరుగున వెళ్లారు. ఐదుగురిని రక్షించి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. గల్లంతైనవారి కోసం గాలించి, 14 మృతదేహాలను బయటికి తీశారు. కోస్ట్‌గార్డ్, నేవీ హెలికాప్టర్లు, పడవలతో రాత్రి ఎనిమిది గంటల వరకు గాలింపు జరిపారు. మృతులను శిఫా కాజీ, సుమయా అన్సారీ, యూసుఫ్ అన్సారీ, సుప్రియా పాల్, ఫర్హిన్ సయ్యద్, ఇఫ్తిఖార్ శేఖ్, సాజిద్ చౌదరీ, రాజ్ తన్జినీ, స్వప్నాలి సంగత్, సమ్రిన్ శేఖ్, షఫియా అన్సారీ, రఫియా, సానా మునీర్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతివార్తతో ఇనాందార్ కాలేజీ క్యాంపస్ శోకసంద్రంలో మునిగిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
శని గుడిలోకి రానివ్వం
మహిళా సంఘం తీరును ఖండించిన గ్రామసభ ♦ నిరసనకారులకు పెరుగుతున్న మద్దతు అహ్మద్‌నగర్: శని గుడిలోకి మహిళలకు ప్రవేశం కల్పించేది లేదని శని సింగణాపూర్ గ్రామసభ తీర్మానం చేసింది. వివాదం చేసేందుకు ‘భూమాత’ మహిళా సంఘం ప్రయత్నించిందంటూ.. సంఘం సభ్యుల తీరును తీవ్రంగా ఖండించింది. రిపబ్లిక్‌డే నాడు.. శని సింగణాపూర్ గుడిలోకి ప్రవేశించేందుకు వెళ్లిన 400 మంది మహిళలను మహారాష్ట్ర పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. వివాదంపై తృప్తి దేశాయ్ నేతృత్వంలోని మహిళా సంఘం నేతలు బుధవారం పుణేలో సీఎం ఫడ్నవిస్‌ను కలిశారు. సీఎం సానుకూలంగా స్పందించారని దేశాయ్ తెలిపారు. తన భార్యతో కలసి గుడిని సందర్శించి.. మహిళల మనోభావాలు కాపాడాలని సీఎంను కోరామన్నారు. కాగా, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ మహిళా సంఘాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ వీరి చర్యను సమర్థించగా.. ఎన్డీఏ మిత్రపక్షం ఎల్జేపీ కూడా లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రకటన చేసింది. సమాన హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకు పార్టీ మద్దతుంటుందని.. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ తెలిపారు. ఇలాంటి గొప్ప మార్పునకు సమాజమంతా ఏకమవ్వాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ త్రివేది ఢిల్లీలో తెలిపారు. ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ కూడా శని సింగణాపూర్ దేవాలయ కమిటీ తీరును వ్యతిరేకించింది. బహిరంగ ప్రదేశాల్లో కుల, మత, లింగ వివక్ష ఉండకూడదని.. కేంద్ర మంత్రి పాశ్వాన్ అన్నారు. -
'అవమానించారు! సారీ.. మాకు ఆ ఉద్దేశం లేదు'
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రతి పక్షాలు విరుచుపడ్డాయి. తమను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత రాజ్యాంగ పిత బాబా సాహెబ్ అంబేద్కర్ స్మారక భవనాన్ని లండన్ లో ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు ఓ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో సహా మరికొందరు వెళుతున్నారు. ఇందులో ఒక్కరు కూడా ప్రతిపక్షానికిచెందిన వారు లేరు. దీంతో అసలు తమకు ఆహ్వానాలే పంపించలేదని, ఇలా చేసి తమను అవమాన పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, దీనిపై వివరణ ఇచ్చిన ఫడ్నవీస్ ఆకార్యక్రమం తాము నిర్వహించేది కాదన్నారు. లండన్ అధికారులు దానిని నిర్వహిస్తున్నారని ఆహ్వానాలు కూడా చాలా తక్కువమందికే అవకాశం ఉందని వివరించారు. ఇందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని బదులిచ్చారు. ఇందులో ప్రతిపక్షాలు లేనిపోని మాటలు అనాల్సిన అవసరం లేదని చెప్పారు. అది ఒక చిన్న కార్యక్రమం మాత్రమేనని చెప్పారు. అంబేద్కర్ స్కాలర్ గా ఉన్నప్పుడు కొన్ని రచనలు చేశారని, వాటిని అంబేద్కర్ భవనంలోని రెండు, మూడో ఫ్లోర్ లో భద్ర పరుస్తున్నారని, ఆ కార్యక్రమానికి తాము హాజరవుతున్నామని చెప్పారు. -
ఛోటా తరలింపు వాయిదా
-
ఛోటా తరలింపు వాయిదా
బాలిలో అగ్నిపర్వతం విస్ఫోటనంతో విమానాశ్రయం మూసివేత బాలి: ఇండోనేసియాలోని బాలిలో పట్టుబడ్డ ముంబై మాఫియా డాన్ ఛోటా రాజన్‌ను భారత్‌కు తరలించే కార్యక్రమం మరో రోజు వాయిదా పడింది. బాలి సమీపంలోని రింజని అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా బూడిద మేఘాలు ఆవరించటంతో విమాన రాకపోకలకు అవకాశం లేనందున మంగళవారం రాత్రి బాలి విమానాశ్రయాన్ని మూసేయడం తెలిసిందే. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మూసివేతను బుధవారమూ పొడిగించారు. గురువారం ఉదయం వరకూ ఇక్కడి నుంచి విమానాలు బయలుదేరే అవకాశం లేదని అధికారులు చెప్పినట్లు భారత పోలీసు బృందానికి చెందిన అధికారులు తెలిపారు. ఫలితంగా గురువారం ఉదయం వరకూ ఛోటా రాజన్ తరలింపు వాయిదా పడినట్లేననన్నారు. నేరుగా ఢిల్లీకి తరలింపు.. రాజన్‌ను బాలి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకువచ్చి.. తొలుత సీబీఐ కస్టడీలో ఉంచాలని భద్రతా సంస్థలు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అతడిని ఇండోనేసియా నుంచి నేరుగా ముంబై తీసుకువెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. రాజన్ ప్రాణాలకు ముప్పుండంతో అతడిని వెంటనే ముంబై పోలీసులకు అప్పగించటానికి కేంద్రం విముఖత చూపినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రాజన్‌ను బాలి నుంచి ముంబైకి తీసుకువస్తామని చెప్పిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. అతడిని ముంబై పోలీసుల కస్టడీకి అప్పగించే విషయమై కేంద్రంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
చోటా రాజన్ భయపడుతున్నాడు
-
రాజన్‌ను తీసుకురావటంలో సమస్య లేదు: కేంద్రం
ఇండోనేసియాతో చర్చిస్తున్నాం ♦ రెండ్రోజుల్లో బాలీకి సీబీఐ అధికారులు ♦ రెండు, మూడు ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు న్యూఢిల్లీ/జకార్తా: ఇండోనేసియాలో అరెస్ట్ అయిన అండర్‌వరల్డ్ డాన్ ఛోటా రాజన్(55)ను భారత్‌కు తీసుకురావటంలో చట్టపరమైన సమస్యలేమీ ఉండబోవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ దిశగా ఇండోనేసియా అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రెండుదేశాల్లో చట్టాలు వేర్వేరుగా ఉన్నందున.. సీబీఐ అధికారులు వీటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. కాగా, ఛోటా రాజన్ అప్పగింతపై ఇబ్బందులు ఉండకపోవచ్చని ఇండోనేసియాలోని భారత రాయబారి గుర్జిత్ సింగ్ చెప్పారు. భారత అధికారులు జారీచేసిన నోటీసుపైనే చోటా రాజన్‌ను అరెస్ట్చేసినందున అతడి అప్పగింత విషయంలో ఇబ్బందులు తలెత్తవన్నారు. ‘‘ఇండోనేసియాతో నేరస్తుల అప్పగింత ఒప్పందంతోపాటు పరస్పర న్యాయ సహకార ఒడంబడిక ఉంది. ఈ కేసుతోపాటు ఇతర కేసుల్లోనూ ఇవి వర్తిస్తాయని భావిస్తున్నాం. రాజన్ అప్పగింత విషయంలో ఏ ఇతర లీగల్ డాక్యుమెంట్ అవసరమవుతుందని నేను అనుకోను’ అని గుర్జిత్ సింగ్ అన్నారు. అయితే.. దావూద్ ఇబ్రహీం నుంచి రాజన్‌కు ప్రాణహాని ఉన్నందున.. అతణ్ణి క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు మూడు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజన్‌పై ఎక్కువ కేసులు మహారాష్ట్రలో ఉన్నందున తమ పోలీసులకు అప్పగించేలా సీబీఐని కోరతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు. రాజన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు రెండ్రోజుల్లో సీబీఐ అధికారులు బాలీ వెళ్లే అవకాశం ఉంది. -
మూడేళ్లలో ‘లోయర్ వార్దా’ పూర్తి
♦ వెల్లడించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ♦ {పాజెక్టు వల్ల 66,000 హెక్టార్లకు నీరందుతుందని స్పష్టం ముంబై : లోయర్ వార్దా ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల వెనుకబడిన ప్రాంతమైన విదర్భలోని వార్దా జిల్లాలో సుమారు 66,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందుతుందని ఆయన చెప్పారు. ఆదివారం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం పర్యటించారు. జిల్లాలోని అర్వి తెహసీల్ ధనోడి (బమదర్పూర్) వద్ద పనులను పర్యవేక్షించారు. లోయర్ వార్ధా ప్రాజెక్టు పరిధిలోని గిరోలి కెనాల్, డియోరీ బ్రాంచ్ కెనాల్, పుల్గావ్ బ్యారేజ్, ఖర్దా బ్యారేజ్, ఆన్జి-అందోరీ బ్యారేజ్, అర్వి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వల్ల అనేక ప్రాంతాలు ప్రభావితమవుతుండటంతో ప్రాజెక్టు వల్ల వ్యవసాయ భూములు నాశనమవకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు చెప్పారు. పునరావాసంపై సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టువల్ల నిరాశ్రయులవుతున్న ప్రజలకు ఇచ్చే మౌళిక వసతులను పెంచుతామని వెల్లడించారు. పునరావాసం కల్పించిన గ్రామాల్లో కనీస సౌకర్యాల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ గ్రామాల్లో వసతుల ఏర్పాటు, నిర్వహణ ఖర్చును ఐదు నుంచి ఇరవైఐదు శాతానికి పెంచుతున్నట్లు సీఎం చెప్పారు. కార్యక్రమంలో సీఎంతో పాటు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పోటే, వార్దా ఎంపీ రాందాస్ తదాస్, శాసన సభ్యులు అమర్ కలే, పంకజ్ భోయర్, సమీర్ కునవర్, వీరేంద్ర జగ్తాప్, మాజీ ఎంసీ విజయ్ ముడే పాల్గొన్నారు. కరువు పరిస్థితిపై సమీక్ష సమావేశం మరాఠ్వాడాలోని కరవు పరిస్థితిపై సోమవారం ఔరంగాబాద్‌లో సీఎం ఫడ్నవీస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రజలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాజా లెక్కల ప్రకారం మరాఠ్వాడాలోని డ్యాంలలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే నీరుందని, హైడ్రోపోనిక్ పద్ధతి ద్వారా పశుగ్రాసం, రైలు బోగీల ద్వరా నీరు సరఫరా చేసేందుకు నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. డ్యాంలలో కనీస పరిమాణం నీరుండేలా ఎగువ రిజర్వాయర్ల నుంచి నీటిని కిందికి వదులుతామన్నారు. కరవు పరిస్థితుల్ని తట్టుకునేందుకు ప్రభుత్వం మొదలు పెట్టిన 27 రకాల చర్యలను గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తామని, వ్యవసాయ చెరువులు, బావుల్లో నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ మొదటి వారం నుంచి ఇప్పటివరకు 500 ఎంఎం వర్షపాతం నమోదైందని, సాధారణ వర్షపాతంలో ఇది 59.3 శాతమని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,229 రిజర్వాయర్లలో 18,018 టీఎంసీల నీరుందని, రిజర్వాయర్ల సామర్థ్యంలో ఇది 48 శాతమని కార్యాలయం పేర్కొంది. 2013లో రిజర్వాయర్లలో నీటి పరిమాణం 76 శాతం, గతేడాది 61 శాతముందని ప్రకటించింది. సమీక్ష సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు ఏక్నాథ్ ఖడ్సే, పంకజ ముండే, దివాకర్ రావుతే, దీపక్ సావంత్, బాబన్‌రావ్ లోనికర్, దిలిప్ కామ్లే ఇతర మంత్రులు పాల్గొన్నారు. -
అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు
♦ తెలుగు ప్రజలను మహారాష్ట్ర అక్కున చేర్చుకుందన్న తెలుగు జాగృతి అధ్యక్షురాలు కవిత ♦ స్వాతంత్య్రానికి ముందే ఇరు రాష్ట్రాల మధ్య సోదరభావం ♦ తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి నిర్వహిస్తాం ♦‘జాగృతి’ రాష్ట్ర శాఖ ఆవిర్భావ సభలో నిజామాబాద్ ఎంపీ సాక్షి, ముంబై : ‘స్వాతంత్య్రానికి ముందు నుంచే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సోదరభావం నెలకొని ఉంది. భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడ్డ సమయంలో ఇరు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు విడిపోయాయి. ఇరు రాష్ట్రాలు కవలల వంటివి. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనల్లో 369 మందిని తుపాకులతో కాల్చేశారు. ఆ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన వివేకవర్ధిని పత్రిక.. ఉద్యమానికి, ఉద్యమకారులకు బాసటగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ కేంద్రంగా వివేకవర్ధిని మారిందంటే ఆ సమయంలో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సోదరభావం ఎలాంటిదన్నది స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో తెలంగాణ ప్రజలు మమేకమై పోయారు. తమ సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తున్నారు. తెలంగాణ బిడ్డలను అక్కున చేర్చుకున్న మహారాష్ట్రకు కృతజ్ఞతలు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ముంబైలో ‘తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ’ ఆవిర్భావ సభ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతకు కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తాం ముంబైలో తెలంగాణ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని కవిత పేర్కొన్నారు. గత ఫిబ్రవరి నెలలో ‘ఓం పద్మ శాలి సేవా సంఘం’ పసుపు కుంకుమ సమయంలో ఇక్కడి సంఘాలు, ప్రజలు తమ సమస్యలను తెలిపారని చెప్పారు. మహారాష్ట్రలోని తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కరానికి, అభివృద్ధికి జాగృతి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సీఎం ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తెలంగాణ భవనం ఏర్పాటు గురించి చర్చించారన్నారు. వందల ఏళ్లుగా తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటున్నారని, ఇక్కడి ప్రజల కోసం తెలుగు భాషకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని కవిత చెప్పారు. పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా చేయాలన్న ప్రతిపాదన ఉందని, అది అమలయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించే విషయంపై తొందర్లోనే ప్రకటన విడుదల చేస్తామని కవిత చెప్పారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగను ఇక్కడి ఆడబిడ్డల కోసం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. తొక్కుడ బండలా ఓపిక ఉండాలి తెలంగాణ జాగృతి సంస్థ ఐక్యంగా ముందుకు సాగుతుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ కూడా ఇదే పద్దతిలో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం, ఇతర సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘తొక్కుడు బండ’లా ఓపిక ఉండాలని సూచించారు. సంస్థ సిద్ధాంతాలు, నియమనిబంధనలను అందరు పాటించాలని అన్నారు. పుస్తకాలు తీసుకొస్తాం మహారాష్ట్రలోని తెలంగాణ వారి చరిత్ర, వారు చేసిన సేవల గురించి తెలంగాణ జాగృతి తరఫున పుస్తకాలు తీసుకొస్తామని కవిత తెలిపారు. ‘మహారాష్ట్ర తొలి స్పీకర్ తెలుగు వ్యక్తేనన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇలాంటి చాలా విషయాలను సేకరిం చి జాగృతి పుస్తకాలు తెస్తాం’ అని చెప్పారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు జాగృతి అవిర్భావ సభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. వందేమాతరం శ్రీనివాస్ పాడినపాటలు, రసమయి బృందానికి చెందిన సాయిచంద్, మల్లేశ్ ఆలపించిన పాటలు తెలంగాణ ప్రాంత అనుభూతిని కలిగించాయి. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...’ వంటి పాటలు మనసులను తాకాయి. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై మహారాష్ట్ర అనే నినాదాలతో సభ దద్దరిల్లింది. గాజుల నర్సారెడ్డి ఆధ్వర్యంలో బోరివలికి చెందిన మహిళలు డప్పులతో బోనాలు, బతుకమ్మలతో కవితకు స్వాగతం పలికారు. 1969లో తెలంగాణ కోసం ముంబైలో కృషి చేసిన ముంబైకి చెందిన 85 ఏళ్ల రామదాస్‌ను కవిత సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, గాయకులు, కవి దేశపతి శ్రీనివాస్, సంగీత దర్శకులు, గాయకులు వందేమాతరం శ్రీనివాస్, మహారాష్ట్ర జాగృతి ప్రధాన కార్యదర్శి అశోక్ రాజ్గిరి, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, తుత్తురు వెంకటేశ్వర్, ఎస్ వేణుగోపాల్, ఎ మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. చెమట సూర్యుళ్లు మహారాష్ట్రలోని తెలంగాణ ప్రజలు చెమట సూర్యుళ్లు. మరాఠీ, తెలుగు భాషలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటే. రాష్ర్టంతో తెలంగాణ ప్రజల బంధం ఈ నాటిది కాదు. ఈ బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తాం -దేశపతి శ్రీనివాస్ సమష్టి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల సమష్టి ప్రయోజనాల కోసం కృషి చేస్తాం. ఇక్కడి తెలంగాణ యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తాం. -సుల్గే శ్రీనివాస్ సోదరుడున్నాడని మరవద్దు తెలుగు ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటా. వర్లీలో పద్మశాలి బాంధవుల కోసం పద్మశాలి భవనం కట్టిస్తాను. స్థలం చూపిస్తే చాలు. తెలుగు ప్రజలందరికీ ఒక సోదరుడున్నాడనే విషయం మాత్రం మరవొద్దు. -ఎంపీ అరవింద్ సావంత్ మరాఠీ తల్లి, తెలుగు పినతల్లి మాకు మరాఠీ భాష తల్లి అయితే తెలుగు భాష పినతల్లి వంటిది. వర్లీలో తెలుగు ప్రజలతో నిత్యం భేటీ అవుతుంటా. ఈ సారి కలిసినప్పుడు మాత్రం తప్పనిసరిగా తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నిస్తా’ - వర్లీ ఎమ్మెల్యే సునీల్ షిండే -
ఉస్మానాబాద్ నీటిని దారి మళ్లించిందెవరు?
పవార్‌పై సీఎం ఫడ్నవీస్ ఫైర్ సాక్షి, ముంబై : ఉస్మానాబాద్ పర్యటనలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఉస్మానాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ డబ్బును ఎవరు తిన్నారని, జిల్లా టెక్స్టైల్స్ మిల్లు ఎవరి వల్ల మూతపడిందని, జిల్లాకు రావాల్సిన నీటిని ఎవరు దారి మళ్లించారని ప్రశ్నించారు. వీటన్నిటికీ ఎన్సీపీ సమాధాన మిచ్చిన తర్వాతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరాఠ్వాడాలో ధర్నా చేపట్టాలన్నారు. మరాఠ్వాడలో కరవు పరిస్థితులు తలెత్తడానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎన్సీపీ కారణమని ఆరోపించారు. పార్లమెంట్లో కాంగ్రెస్ కావాలనే గందగోళం ృసష్టించి కార్యకలాపాలు సాగకుండా చేయడం వల్ల అనేక బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయని విమర్శించారు. కరవు పీడిత ప్రాంతాల్లో బీజేపీ మంత్రులు పర్యటిస్తున్నారని, వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటున్నారని స్పష్టం చేశారు. -
రూ.12,000 కోట్లు ఇవ్వండి
♦ మరాఠ్వాడాకు నిధులు విడుదల చేయాలని ప్రతిపక్షం డిమాండ్ ♦ సమర్థించిన మిత్రపక్షం శివసేన ♦ అధికారంలో ఉన్నప్పుడు మరాఠ్వాడాకు ఏం చేశారు? ♦ కాంగ్రెస్-ఎన్సీపీని ప్రశ్నించిన మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ♦ చేయాల్సిందల్లా చేశాం: ఎన్సీపీ నేత అజిత్ పవార్ సాక్షి, ముంబై : కరవుతో అల్లాడుతున్న మరాఠ్వాడాలో రైతులను ఆదుకోడానికి రూ. 12,000 కోట్లు ఇవ్వాలన్న కాంగ్రెస్, ఎన్సీపీ డిమాండ్‌కు బీజేపీ మిత్రపక్షం శివసేన మద్దతు తెలిపింది. మరాఠ్వాడాను ఆదుకోడానికి ప్రభుత్వం ఏవిధమైన సాయం ప్రకటించలేదని జల్నా నియోజకవర్గం శివసేన నేత అర్జున్ ఖోట్కర్ మండిపడ్డారు. పుండుపై కారం చల్లినట్లు ప్రభుత్వం రూ. 900 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుందని ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ నిప్పులు చెరిగారు. కరవు పరిస్థితులను తట్టుకోడానికి రూ. 12,000 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరవు సమస్యపై అసెంబ్లీలో మంత్రి మహాజన్ సమాధానమిస్తూ.. ఔరంగాబాద్‌కు చెందిన శాసనసభ్యులతో వచ్చే వారంలో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. 70-75 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని, వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మరాఠ్వాడా అభివృద్ధికి ఏమీ చేయలేదన్న మంత్రి ఆరోపణపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేయాల్సిందల్లా చేసిందన్నారు. కొన్ని తప్పిదాలు జరిగాయని అందుకే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారన్నారు. జల్నాలో మానసిక ఆరోగ్య ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ పేర్కొన్నారు. నగరాల వివరాలు పంపాం ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు కోసం రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు వివరాలు కేంద్రానికి పంపినట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ముంబై, ఠాణే, పుణే, నవీముంబై, కళ్యాణ్, అమరావతి, షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్, పింప్రి చించ్వడ్ నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు చేశామని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరాల ఎంపికకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటి రూపొందించిన ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ (డీపీఆర్)ను కేంద్రానికి పంపించినట్టు ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న 100 నగరాలను స్మార్ట్ సిటీ తీర్చి దిద్దనున్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మిగిలిన నగరాలను అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) పథకంలో భాగంగా కేంద్రం అభివృద్ధి చేయనుంది. స్మార్ట్‌సిటీలకు రూ. 48,000 కోట్లు, ‘అమృత్’ కోసం రూ. 50,000 కోట్లు కలిపి మొత్తం ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. గడువు పెంపునకు కంపెనీలు ససేమీరా పంటల బీమాపై ప్రీమియం గడువును పెంచాలన్న విజ్ఞప్తిని బీమా కంపెనీలు ఒప్పుకోలేదని ప్రభుత్వం తెలిపింది. అసెంబ్లీలో ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే లేవనెత్తిన ప్రశ్నకు వ్యవసాయ మంత్రి ఖడ్సే సమాధానమిస్తూ.. రాత్రి వరకు బీమా కంపెనీలతో చర్చించినా ఫలితం లేద న్నారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి, సెక్రెటరీకి తెలిపామన్నారు. ‘జల్నా’ బాధ్యులను వదలం: సీఎం జాల్నా రేప్ ఘటనపై విచారణకు అడిషనల్ డెరైక్టర్ జనరల్ ర్యాంకు అధికారిని నియమిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఘటనపై శుక్రవారం అసెంబ్లీలో సీఎం సమాధానమిస్తూ.. బాధితురాలికి పునరావాసం కల్పిస్తామన్నారు. నిందితులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. జల్నాకు చెందిన 17 ఏళ్ల యువతిని జూలై 6 న ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి సెల్‌ఫోన్‌తో అత్యాచార ఘటనను చిత్రీకరించారు. సెల్‌ఫోన్ తిరిగివ్వడానికి రూ. 2,000 డిమాండ్ చేశారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు బాధితురాలి సాయం తీసుకున్నారు. అయితే నిందితులను పట్టుకునే సమయంలో జూలై 9న బాధితురాలు మరోసారి అత్యాచారానికి గురైంది. అయితే బాధ్యులను పట్టుకునేందుకే బాధితురాలి సాయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు ముంబై నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీనిపై సీఎం స్పందిస్తూ.. నగరంలో 40 లోతట్టు ప్రాంతాలను గుర్తించి పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రైనేజీ శుభ్రపరిచేందుకు విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టడంపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 7 నుంచి శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఏడు నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. శీతాకాల సమావేశాలు నాగ్‌పూర్ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని విధానసభ, మండలిలో ప్రిసీడింగ్ అధికారులు వెల్లడించారు. జూలై 13న మొదలైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. -
‘ధన్‌గార్’ సిద్ధమవుతోంది..
♦ ధన్‌గార్ రిజర్వేషన్ ప్రతిపాదన సిద్ధమవుతోందన్న సీఎం ఫడ్నవీస్ ♦ మరాఠా రిజర్వేషన్ల ప్రతిపాదన త్వరలోనే కేంద్రానికి పంపుతాం ♦ మొసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలు 15 ఏళ్లు ఏం చేశాయని సూటి ప్రశ్న ♦ ఎన్నికల హామీ నిలబెట్టుకుంటామని స్పష్టీకరణ ♦ అంగన్వాడీల వేతనాలు పెంచుతూ నిర్ణయం ముంబై : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధనగార్లను షెడ్యూల్డ్ కూలాల (ఎస్టీ)లోకి చేర్చే ప్రతిపాదన సిద్ధమవుతోందని రాష్ట్రముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ‘ఇచ్చిన హామీ మేరకు ధన్గార్లను షెడ్యూల్ట్ కులాల జాబితాలోకి చేరుస్తాం. ఈ ప్రక్రియలో గిరిజినుల కోటాలో ఎలాంటి కోతలు ఉండవు. ఈ ప్రతిపాదనను త్వరలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతాం’ అని స్పష్టంచేశారు. బుధవారం విధానమండలిలో ధనగార్ రిజర్వేషన్ అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశాన్ని పట్టించుకోలేదంటూ ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు పరస్పరం విమర్శించుకున్నాయి. ముఖ్యమంత్రి ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై ఘాటుగా స్పందించిన ఫడ్నవీస్, విపక్షాలు ధన్గార్ల అంశంపై మసలి కన్నీళ్లు కారుస్తున్నాయని ఎద్దేవా చేశారు. దీంతో ఇరుపక్షాల ఆందోళన తీవ్రతరం చేశాయి. ఎంతసేపటికీ సర్దుమనగడంతో సభను ఐదు నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా కాంగ్రెస్ సభ్యుడు సరద్ రాన్పైసే అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన సీఎం, ‘ధనగార్ ప్రతిపాదన సిద్ధం అవుతోంది. ప్రతిపాదన మరింత ప్రభావవంతగా ఉండేందుకు అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకుంటున్నాం. అలాగే ‘ఆదివాసీ సన్శోధన్, ప్రశిక్షణ్ కేంద్రా (గిరిజన పరిశోధన, శిక్షణ సంస్థ)ను ప్రతిపాదన సిద్ధం చేయాల్సిందిగా కోరాం. అది సిద్ధం అయిన వెంటనే కేంద్రానికి పంపిస్తాం’ అని వివరించారు. మరాఠాల రిజర్వేషన్‌పై స్పందించిన సీఎం, ‘మరాఠాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలని చెప్పేలా గట్టి ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందుంచుతాం. ఇందుకోసం తమిళనాడు నమూనాను అధ్యయనం చేస్తున్నాం’ అని చెప్పారు. గత ప్రభుత్వం (కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం బలమైన ప్రతిపాదనను పంపలేకపోయిందని, అందుకే కోర్టు దాన్ని తిరస్కరించిందని ఫడ్నవీస్ ఆరోపించారు. అంగన్వాడీల వేతనాలు పెంపు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల వేతనాలు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంగన్వాడీ కార్యకర్తలకు రూ.950, సహాయకులకు రూ.500 పెంచుతున్నట్లు పేర్కొంది. చిన్న అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు రూ.550 పెంచినట్లు వివరించింది. ‘రాష్ట్రప్రభుత్వం నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు రూ.1,500 అందుతుండగా కేంద్రం నుంచి రూ.3 వేలు వస్తోంది. అలాగే సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.500, కేంద్ర నుంచి రూ.1,500 వేత నం అందుతోంది. కాగా, చిన్న అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్ర వాటాగా రూ. 2,250 అందుతోంది. మొత్తం రూ.892.4 కోట్లు ఏడాదికి అంగన్వాడీలకు చెల్లిస్తున్నాం’ అని ఆర్థికమంత్రి సుధీర్ తెలిపారు. ఏప్రిల్ నుంచే అమలులోకి.. ‘మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే మాట్లాడుతూ, ఇప్పటికే రూ. 228 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెరిగిన వేతనాలు 2015 ఏప్రిల్ నుంచే అందుబాటులోకి వస్తాయని వివరించారు. గత కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌లో అంగన్వాడీ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిందని, అయితే బడ్జెట్లో మాత్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. గతేడాది పెంచిన వేతనాలను కూడా ఇస్తున్నామని చెప్పారు. దాదాపు 97,475 అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలు గుర్తింపు పొందినవి ఉన్నాయని, అందులో 95,341 మంది ప్రస్తుతం సర్వీసులో ఉన్నారని తెలిపారు. అలాగే 97,475 గుర్తింపు పొందిన అంగన్వాడీ సహా యకుల ఉద్యోగాలుండగా, 92,023 మంది స ర్వీసులో ఉన్నారని వివరించారు. 11,175 మినీఅంగన్వాడీ పోస్టులుండగా, 9,898 మం ది ప్రస్తుతం సర్వీసులో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి ఆస్తులు జప్తు చేయాల్సిందే.. ఇతర రాష్ట్రాల నుంచి స్ఫూర్తి పొందిన ప్రభుత్వం, అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేసేందుకు వీలుగా చట్ట సవరణ చేసే యోచనలో ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సీఎం ఫడ్నవీస్ మండలిలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయలో మాట్లాడిన సీఎం, ‘అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేసేందుకు అధికారం వచ్చేలా చట్ట సవరణ చేస్తాం. ఇందుకోసం ముసాయిదా బిల్లును హోం శాఖ కు పంపించాం. దాన్ని శీతాకాల సమావేశాల్లో సభ ముందుంచుతాం’ అని చెప్పారు. గత కొన్ని నెలలుగా అవినీతి ఆరోపణల కేసులో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారుల ఆస్తులను జప్తు విషయంపై తీసుకున్న చర్యల గురించి తెలియజేయాలని ఎన్సీపీ ఎమ్మెల్సీ ప్రకాశ్ బిన్సాలే ప్రభుత్వాన్ని కోరారు. ‘కొత్తగా చేసే చట్టం బిహార్‌లో మాదిరిగానే ఉంటుంది. అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న, విచారణ ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఒకవేళ సదరు అధికారి నిర్దోషిగా తేలితే ఆస్తులు తిరిగి అందజేస్తాం’ అని సీఎం వివరణ ఇచ్చారు. -
‘టోల్ రద్దు’పై జాప్యం
♦ రూ. వందల కోట్ల అంశం కావడంతో సందిగ్ధంలో ప్రభుత్వం ♦ క్షుణ్నంగా సమీక్షించిన మీదటే నిర్ణయం ♦ దాదాపు రూ.2 వేల కోట్లు భారం పడే అవకాశం ముంబై : ముంబై నగరంలో ఐదు టోల్‌ప్లాజాల్లో టోల్ రద్దు విషయంపై ప్రభుత్వం గత మూడు నెలలుగా జాప్యం చేస్తోంది. రూ.వందల కోట్ల అంశం కావడంతో దీనిపై క్షుణ్నంగా సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టోల్ మినహాయింపుపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. మూడు నెలల్లో పూర్తి నివేదికతో రావాలని కమిటీకి సూచించారు. కమిటీ సోమవారం నివేదిక సమర్పించినప్పటికీ టోల్ మినహాయింపుపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. నివేదిక పరిశీలించిన సీఎం.. వాషి, దహిసర్, ములుండ్, ఐరోలీ, ఎల్బీఎస్ మార్గ్ ప్రాంతాల్లోని టోల్ మార్గాల్లో మూడు నెలల్లో సరైన గణాంకాలతో మరో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారని పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల్లో ఎమ్మెస్ఆర్డీసీ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు టోల్ వసూలు చేస్తారు. చిన్న వాహనాలను టోల్ నుంచి మినహాయించి పెద్ద వాహనాలకు టోల్ వసూలు చేయాలని కమిటీ సీఎంకు సూచించింది. టోల్ మినహాయిస్తే కాం ట్రాక్టర్లకు రూ. 2000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని మంత్రి తెలి పారు. సంబంధిత మంత్రి ఏక్నాథ్ షిండే కార్పొరేషన్ అధికారులతో చర్చించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టోల్ భారం నుంచి ముంబైకర్లకు విముక్తి కలిగించాలని ప్రయత్నిస్తున్నామని, అయితే ఆ భారం కాంట్రాక్టర్లపై పడకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పాటిల్ చెప్పారు. కొల్హాపూర్‌లోని తొమ్మిది టోల్‌ప్లాజాల్లో టోల్ మినహాయింపుపై ప్రశ్నించగా.. ప్లాజాలను మూసేయడం వల్ల పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం, స్థానిక సంస్థలు కలసి భరిస్తాయని అన్నారు. ఇటీవల మూసేసిన 63 టోల్‌ప్లాజాలపై కాంట్రాక్టర్లకు రూ.800 కోట్లు నష్టపరిహారంగా అందజేసింది -
‘కల్తీ’పై కొరడా..
♦ కల్తీ చేస్తే కఠిన శిక్షలేనన్న సీఎం ♦ ఉరిశిక్ష పడేలా చట్ట సవరణ చేసేందుకు సిద్ధమని వెల్లడి ముంబై : ఆహారం, పాలు, మందులు వంటి వాటిని కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కల్తీ కేసుల్లో దోషులుగా తేలితే ఉరిశిక్ష పడేలా చట్ట సవరణ చేసేందుకు తాము సిద్ధమని విధానమండలిలో ప్రభుత్వం గురువారం పేర్కొంది. ‘రాష్ట్రంలో ఇకపై కల్తీ వ్యాపారాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ సందేశం ఇచ్చేందుకే ‘మాల్వణీ కల్తీ సారా’ నిందితులపై సెక్షన్ 302 (హత్య) నేరం మోపాం. దోషులకు ఉరిశిక్ష పడేలా చూస్తాం. అవసరమైతే చట్ట సవరణ చేసేందుకు కేంద్రాన్ని సంప్రదిస్తాం’ అని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. కాలింగ్ అటెన్షన్ మోషన్లో భాగంగా మాట్లాడిన ఆర్పీఐ ఎమ్మెల్సీ జోగేంద్ర కవాడే, 100 మందికి పైగా మృతికి కారణమైన ‘మాల్వణీ కల్తీసారా’ నిందితులకు ఉరిశిక్ష విధించేలా ప్రభుత్వం చొరవ చూపించాలని డిమాండు చేశారు. గడ్చిరోలీ, వార్ధా, చంద్రాపూర్ జిల్లాల్లో మద్యపాన నిషేధం విధించిన ప్రభుత్వం, దాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలని కోరారు. కవాడాకు జవాబిచ్చిన ఫడ్నవీస్, నాటుసారా పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతోందని వివరణ ఇచ్చారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం విధించిన జిల్లాల్లో ఒక్క ఫోన్ చేస్తే ఇంటికే మద్యం సరఫరా అవుతోందని, యావత్మల్ జిల్లాలో ఒక వేళ ప్రభుత్వం నిషేధం విధించినా ఇదే పునరావృతం అవుతుందని ఎన్సీపీ ఎమ్మెల్సీ ప్రకాశ్ గజ్భియే అన్నారు. మద్యపాన నిషేధం విధించాలంటే తొలుత ఈ విషయంపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. -
ముస్లిం కోటాపై కౌన్సిల్లో రగడ
♦ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపక్షాలు ♦ కోటాపై సుప్రీంలో అఫిడపిట్ దాఖలు చేశామన్న ప్రభుత్వం ♦ 65 ఏళ్లుగా రిజర్వేషన్లు {పకటించలేదు: ఖడ్సే ♦ కేవలం తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం ♦ మండలిలో రభస..అరగంటసేపు సభ వాయిదా ముంబై : ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ గురువారం శాసన మండలి సమావేశాలను అడ్డుకున్నాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో చైర్మన్ అరగంటసేపు సభను వాయిదా వేశారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకొని ముస్లి రిజర్వేషన్లపై ఓ నిర్ణయానికొస్తామని గత డిసెంబర్లో సీఎం ఫడ్నవీస్ చెప్పారని ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్సీపీ ఎమ్మెల్సీ అబ్దుల్ ఖాన్ దుర్రని గుర్తుచేశారు. ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నాయని ఖాన్ వివరించారు. అనేక రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించాయని, దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్లపై నిర్ణయాన్ని తెలుపుతూ సుప్రీం కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. రాష్ట్రంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై వివిధ కమిటీల నివేదికలు కూడా అఫిడవిట్లో పొందుపరిచామన్నారు. ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని కూడా అఫిడవిట్లో పేర్కొన్నామని చెప్పారు. దీనిపై కోర్టు నిర్ణయానికి కట్టుబడిఉంటామని వెల్లడించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. మరో ఎమ్మెల్సీ కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. ముస్లింలకు విద్యలో ఐదు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు తగ్గించిందని ప్రశ్నించారు. ఖడ్సే స్పందిస్తూ.. ఆర్డినెన్స్ కాలం ముగిసేలోపు అడ్మిషన్లు తీసుకున్న వారికి విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు అనుమతిచ్చామన్నారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఎన్సీపీ నేత సునీల్ తట్కరే విమర్శించారు. ఖస్సే స్పందిస్తూ.. 65 ఏళ్లుగా ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించలేదని, కాని ప్రస్తుతం కేవలం తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ రాంరాజ్ నింబాల్కర్ సభను అరగంటసేపు వాయిదా వేశారు. జోక్యం చేసుకోలేం: సుప్రీం గతేడాది జూన్ 25న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ముస్లింలకు ఉద్యోగాల, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం సర్వీసుల్లో ఐదు శాతం రిజర్వేషన్లకు అనుమతినిస్తూ.. ప్రభుత్వం పాఠశాలల్లో రిజర్వేషన్లపై 2014, నవంబర్ 14 లో బాంబే హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పింది. హైకోర్టు నిర్ణయాన్ని పాటించాలని ప్రభుత్వానికి తెలిపిం ది. ఈ ఏడాది జనవరి 5న ముస్లిం కోటాపై తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి 3వారాల సమయమిచ్చింది. ముస్లిం కోటా పై ఆర్డినెన్స్ సమయం గ తేడాది డిసెంబర్ 23తో ముగిసిపోయింది. ముంబైలో పెరిగిన అడవుల విస్తీర్ణం ముంబైలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. డెహ్రాడూన్‌కు చెందిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2014లో ముంబై నగరంలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో, ముంబై శివారు ప్రాంతాల్లో 4,300 హెక్టార్లలో అడవులు విస్తరించాయని, 2000 సంవత్సరంలో నగరంలో 3,200 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయని అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ మునుగంటివార్ చెప్పారు. దీన్ని బట్టి 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని తెలుస్తోందన్నారు. బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం ప్రభుత్వ స్థలంలోని అడవులు నియంత్రిత అడవులని పేర్కొన్నారు. ముంబై, శివారు ప్రాంతాల్లో 4,000 హెక్టార్లు.. ముంబై, శివారు ప్రాంతాల్లో ప్రైవేటు స్థలంలోని 1,774 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులను పరిమిత అడవులుగా ప్రభుత్వం ప్రకటించిందని సుధీర్ చెప్పారు. అభివృద్ధి ప్రణాళిక స్థలంలోని అడవుల ప్రదేశాన్ని బహిరంగ ప్రదేశంగా ప్రకటిస్తారా అని బీజేపీ సభ్యుడు అశిష్ షేలర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. హైకోర్టు సూచనమేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘తెల్గీ’పై అట్టుడికిన సభ నకిలీ స్టాంపుల కుంభకోణం విషయమై అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీజేపీ, ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కుంభకోణంపై పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఎన్సీపీ నేత జితేంద్ర అవ్హాడ్ విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటేకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. అయితే దీనిపై గోటే స్పందిస్తూ.. కేసు విచారణకుగానూ ముంబై పోలీస్ కమిషనర్‌గా ఓ అధికారిని నియమించేందుకు ఎన్సీపీ నేత, అప్పటి హోం శాఖ మంత్రి భుజబల్‌కు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పారంటూ తెల్గీ నార్కో పరీక్షలో వెల్లడైందన్నారు. అసెంబ్లీ బయట విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. దీని కోసం ఓ కార్పొరేట్ వ్యక్తి డబ్బు చెల్లించాడన్నారు. కుంభకోణం విషయమై ఇద్దరు నేతలు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. తెల్గీ కుంభకోణం విషయమై అసెంబ్లీలో తీవ్ర రభస జరగడంతో సభ పదినిమిషాలపాటు వాయిదా పడింది. కుంభకోణం విషయంలోని ఆరోపణలను పరిశీలించి అనంతరం రికార్డుల నుంచి వాటిని తొలగిస్తామని స్పీకర్ నింబాల్కర్ వెల్లడించారు. -
అవ్హాడ్ భద్రత ప్రభుత్వానిదే..
♦ స్పష్టం చేసిన రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ♦ అవ్హాడ్‌పై దాడి సిగ్గుచేటన్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ♦ ‘చిక్కీ’ కుంభకోణం విషయంలో జాతీయ పత్రికకు నోటీసు ♦ ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు ♦ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన విద్యార్థులు ముంబై : ఎన్సీపీకి చెందిన శాసన సభ్యుడు జితేంద్ర అవ్హాడ్ భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అసెంబ్లీలో స్పష్టం చేశారు. అవ్హాడ్‌పై జరగుతున్న దాడి గురించి బుధవారం సభలో ఎన్సీపీ సభ్యుడు దిలీప్ వల్సే పాటిల్ లేవనెత్తారు. సాంగ్లీలో అవ్హాడ్‌పై దాడి జరిగిందని, ఫోన్, సోషల్ మీడియా ద్వారా ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. అవ్హాడ్‌పై దాడిపై ఆందోళన చెందుతూ సీఎం ఫడ్నవీస్‌కు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ లేఖ కూడా రాశారని తెలిపారు. ‘కార్యసాధక, ప్రగతిశీల భావాలున్న వ్యక్తులపైనే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారిపై దాడులు జరగడం సిగ్గుచేటు. అవ్హాడ్‌పై జరుగుతున్న దాడిపై సీఎం చర్యలు తీసుకోవాలి. ఆయనకు భద్రత ఏర్పాటు చేయాలి. ఒక సీఎంగా, హోంశాఖ మంత్రిగా అవ్హాడ్‌కు భద్రత కల్పించడం మీ కర్తవ్యం. మీరు మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తారనే అనుకుంటున్నాను’ అని పవార్ లేఖలో పేర్కొన్నారు. దాడి చేస్తున్న వారిని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని దిలీప్ వల్సే పాటిల్ డిమాండు చేశారు. స్పందించిన స్పీకర్ హరిబావ్ బగ్డే, మొత్తం వ్యవహారంపై ఓ ప్రకటన చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యేలను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు రక్షణ ఏర్పాటు చేయడం మా బాధ్యత. అవ్హాడ్‌కు భ ద్రత కల్పిస్తాం. బెదిరింపుల విషయంపై విచారణకు ఆదేశిస్తాం’ అని ఖడ్సే సభలో చెప్పారు. ఆ పత్రికపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ‘చిక్కీ’ కుంభకోణానికి సంబంధించిన నివేదికను విధానసభలో చర్చించక ముందే ప్రచురించిన ఓ జాతీయ పత్రికపై బీజేపీ శాసనసభ్యుడు ప్రశాంత్ బాంబ్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. ‘చిక్కీ’ కొనుగోలు విషయంలో రూ.206 కోట్ల కుంభకోణం జరిగిందంటూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘అసెంబ్లీలో వార్తా నివేదిక గురించి ఇంకా చర్చ జరగలేదు. సంబంధిత శాఖ నుంచి నిజానిజాలు బేరీజు వేసుకున్న తర్వాత వార్తను ప్రచురించాల్సి ఉంటుంది. కానీ ఆ పత్రిక అవేమీ చేయలేదు. మంత్రి వివరణను ప్రచురించినప్పటికీ పాత విషయాలపై మాత్రమే కేంద్రీక ృతమై ఉంది. ఇది ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడమే’ అని ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ బాంబ్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం మీద ప్రశ్నోత్తరాల సమయంలో రాతపూర్వకంగా మంత్రి సమాధానమిచ్చిందని, రేట్ కాంట్రాక్ట్ బేసిస్ మీదే చిక్కీ, కిచిడీ కొనుగోళ్లు జరిపామని, అయితే ఆ పద్దతిలో రూ. కోటి ఆపైన కొనుగోళ్లపై రాష్ట్రంలో నిషేధం ఉందని ఒప్పుకున్నట్లు ఆ పత్రిక ప్రచురించింది. దీనికి వివరణ ఇచ్చిన పంకజ ముండే, ‘రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం నిజమే. ఈ పద్దతి ప్రకారం వస్తువు ధర, కాంట్రాక్టర్ వంటి విషయాలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. టెండర్ల ప్రక్రియను పరిశ్రమలు లేదా ఆర్థిక శాఖలు చూసుకుంటాయి. ఇక్కడ రేట్ కాంట్రాక్ట్ లిస్ట్ పైనే వస్తువులు అమ్మకం జరుగుతుందనే విషయం తెలుస్తోంది. మళ్లీ టెండర్లు పిలవాల్సిన పనిలేదు’ అని వివరించారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ క్లాసులపై నియంత్రణ విధించేందుకు కొత్త చట్ట తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి వినోద్ తావడే విధాన సభలో తెలిపారు. కొత్త చట్టానికి న్యాయ శాఖ ఇప్పటికే పచ్చజెండా ఊపిందని, అడ్వొకేట్ జనరల్ నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లు 100 శాతం ఫలితాలు తీసుకొస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయని, దీనిపై ప్రభుత ్వం తీసుకుంటున్న చర్యలేంటో తెలపాలని కాలింగ్ అటెన్షన్ మోషన్ ద్వారా బీజేపీ సభ్యుడు సర్దార్ తారా సింగ్ మంత్రిని ప్రశ్నించారు. దీనికి వివరణ ఇచ్చిన తావడే, ‘ప్రైవేటు కోచింగ్ క్లాసులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ప్రైవేటు కోచింగ్ క్లాసులపై నియంత్రణ అనే ప్రతిపాదన గతంలో సభ ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే చట్టం రూపుదిద్దుకోలేదు’ అని చెప్పారు. ‘శౌర్య’కు కాల్బాదేవీ మృతుల పేర్లు కాల్బాదేవీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన నలుగురు అగ్నిమాపక శాఖ అధికారుల పేర్లను శౌర్య పతకాలకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన మండలిలో ఎన్సీపీ ఎమ్మెల్సీ సునీల్ తట్కరే ఇచ్చిన కాలింగ్ అటెన్షన్ మోషన్లో మాట్లాడుతూ మంత్రి రంజత్ పాటిల్ తెలిపారు. ఆ అధికారులకు అమరవీరులుగా గుర్తింపు ఇస్తారా అని ప్రశ్నించిన కపిల్ పాటిల్‌కు సమాధానమిస్తూ, సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వారికే ఆ గుర్తింపు ఇస్తారని రంజిత్ వివరించారు. అయితే వారందరి పేర్లను శౌర్య పథకాలకు రాష్ట్రపతికి సిఫారసు చేశామని చెప్పారు. సీఎంవోకు ధన్యవాదాలు: సీఎం ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు సీఎంవోకు ధన్యవాదాలు. అంతకంటే ముందుగా జల్యుక్త్ శివార్ పథకానికి ఒక రోజు జీతాన్ని విరాళమిచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు’ అని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా జలసంరక్షణ పథకానికి సీఎం కార్యాలయ ఉద్యోగులు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని ట్వీట్ చేవారు. జల్ యుక్త్ శివార్‌కు రూ.25 వేలు చొప్పున విరాళమిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆశిశ్ శేలర్, అమిత్ సతామ్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నాపుట్టిన రోజును జరుపుకోవద్దు. ప్రకటనలు, బానర్లు కట్టొద్దు. ఆ డబ్బును జలయుక్త్ శివార్‌కు విరాళమివ్వండి’ అని సందేశమిచ్చారు. -
పుష్కరాలకు సర్వం సిద్ధం
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు - 108 రోజుల పాటు వెలిగే మహాకాయ దీపం తయారు - గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం - 14న దీపం వెలిగించి పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం ఫడ్నవీస్ - 12 ప్రత్యేక రైళ్లు నడ పనున్న సెంట్రల్ రైల్వే సాక్షి, ముంబై: గోదావరి పుష్కరాలకు సర్వం సిద్ధమయ్యాయి. నాసిక్, త్రయంబకేశ్వర్లలో గత కొన్ని రోజులుగా పుష్కర పనుల్లో నిమగ్నమైన అధికారులు, అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు, సాధువులు వస్తున్న నేపథ్యంలో గంగాఘాట్ వద్ద ఉన్న మార్కెట్‌ను తాత్కాలికంగా తొలగించి సమీపంలోని మరో ప్రాంతానికి మార్చారు. నాసిక్‌లో మహాకాయ దీపాన్ని వెలిగించేందుకు రికార్డు స్థాయిలో సేకరించిన పత్తితో భారీ వత్తి తయారు చేశారు. కొల్హాపూర్ జిల్లా శిరోల్ తాలూకా తామదలగే గ్రామంలో ‘దేశభక్తుడు రంతప్పణ్నా కుంబార్ శిరోల్ బ్యాక్వర్డ్ క్లాస్ కో ఆపరేటీవ్ కాటన్ మిల్లు’లో ఈ దీపపు వత్తిని తయారు చేశారు. 108 రోజులపాటు వెలిగే దీపం కోసం 750 అడుగుల పొడవైన వత్తిని తయారుచేశారు. గిన్నిస్ బుక్‌లో మహాదీపానికి చోటు సంపాదించడం కోసమే ఇలా చేస్తున్నట్లు కాటన్ మిల్లు అధ్యక్షుడు డాక్టర్ అశోక్‌రావ్ మానే తెలిపారు. వత్తి తయారు చేసేందుకు రెండు నెలలు పట్టిందని, ఈ నెల 14న నాసిక్‌లో పుష్కర ప్రారంభోత్సవం సందర్భంగా దీపాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా వెలిగించనున్నారని చెప్పారు. కాలుష్య రహిత పుష్కరాలు పుష్కరాలు కాలుష్క రహితంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే సుమారు 63 ప్రాంతాల్లో సుమారు పలు సంస్థలకు చెందిన 40 వేలమంది స్వచ్చత అభియాన్ నిర్వహించారు. గతంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నదీ స్వచ్చత అభియాన్‌లో కూడా సుమారు 20 వేల మంది పాలుపంచుకున్నారు. అది విజయవంతం అవడంతో పుష్కరాలను కాలుష్య రహితంగా చేసేందుకు మరోసారి స్వచ్చత అభియాన్ నిర్వహించారు. భారీగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జీ గిరీశ్ మహాజన్ సమక్షంలో దాదాపు 8.50 లక్షల మొక్కలను జిల్లావ్యాప్తంగా నాటించారు. ఆఖాడాల కీలకపాత్ర పుష్కరాల్లో సాధువుల ఆఖాడా(సమూహం)లు కీలక పాత్ర వహిస్తాయి. పుష్కరాల సందర్భంగా జరిగే ప్రధాన కార్యక్రమాలన్నీ వారే నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి శైవ , వైష్ణవ ఆఖాడాల్లోని సాధువులు వస్తారు. శ్రీ శంభు పంచ్ దశనామ్ జునా ఆఖాడా, శ్రీ శంభు పంచ్ దశనామ్ ఆవ్హాన్ ఆఖాడా, శ్రీ పంచాగ్నీ ఆఖాడా, శ్రీ తపోనిధి నిరంజనీ ఆఖాడా, శ్రీ తపోనిధి ఆనంద్ ఆఖాడా, శ్రీ పంచాయతీ ఆఖాడా మహానిర్వాణీ, శ్రీ పంచాయతీ అఠల్ ఆఖాడా, శ్రీ బడా ఉదాసిన్ ఆఖాడా నిర్వాణ్, శ్రీ నయా ఉదాసీన్ ఆఖాడా నిర్వాణ్, శ్రీ పంచాయతీ నిర్మల్ ఆఖాడా అనే పది శైవుల ఆఖాడాలు త్రయంబకేశ్వర్‌కి వచ్చాయి. శ్రీ నిర్మోహి అనీ ఆఖాడా, శ్రీ నిర్వాణీ అనీ ఆఖాడా, శ్రీ దిగంబర్ అనీ ఆఖాడా అనే మూడు ైవె ష్ణవుల ఆఖాడాలు నాసిక్‌లో పుష్కర ఘట్టాలు నిర్వహించనున్నాయి. తొలిరోజు ధ్వజారోహణ, ఊరేగింపు, షాహి స్నానాల ప్రారంభం తదితర ప్రత్యేక ఘట్టాలన్ని ఆఖాడాలు ప్రారంభించనున్నారు. వీరి రాకతో నాసిక్, త్రయంబకేశ్వర్ పరిసరాల్లో ఒకరకమైన ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంటుంది. కుంభమేళా అంటేనే సాధువుల పండుగ అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సారి వ్యాఖ్యానించారు. ‘ఇది సాధువుల కుంభమేళా. కుంభమేళాకు వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడమే మా బాధ్యత’ అని అన్నారు. మహిళా భద్రత కట్టుదిట్టం పుష్కరాల్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భారీ సంఖ్యలో మహిళా పోలీసులను మోహరిస్తామని, 24 గంటలూ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ‘మహిళల రక్షణ మా ప్రధాన బాధ్యత. మొత్తం 15 వేల మంది పోలీసులతో పాటు మహిళా పోలీసులను కూడా మోహరిస్తాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో అదనంగా ఐదుగురు మహిళలను ఏర్పాటు చేస్తాం. నిర్భయ మొబైల్ వ్యాన్‌ను నడుపుతున్నాం. ఏదైనా సమస్య ఎదురైతే కంట్రోల్ రూం నంబర్ 100 లేదా 97622 00200 లేదా 97621 00100కు సంప్రదించవచ్చు’ అని నాసిక్ కమిషనర్ ఎస్ జగన్నాథన్ తెలిపారు. పుష్కరాలకు 12 సూపర్ ఫాస్ట్ రైళ్లు గోదావరి పుష్కరాల సందర్భంగా నాసిక్- హౌరా మధ్య 12 సూపర్‌ఫాస్ట్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 02859 నం సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలు నాసిక్ నుంచి జూలై 14, ఆగస్టు 19, 29, సెప్టెంబర్ 13, 18, 25 తేదీల్లో సాయంత్రం 4.30కు నడపన్నుట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. 02860 నం రైలు హౌరా నుంచి జూలై 12న, ఆగస్టు 17, 27, సెప్టెంబర్11, 16,23 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరనున్నట్లు తెలిపింది. భుసావల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, బిలాస్పూర్, రౌర్కేలా, టాటానగర్ స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్ ఉన్నట్లు వివరించింది. -
డిజిటల్ గ్రామాలకు మైక్రోసాఫ్ట్ చేయూత
- వెల్లడించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ - మైక్రోసాఫ్ట్ సీఈవోసత్య నాదే ళ్లతో భేటీ - రాష్ట్రంలో స్మార్ట్ సిటీ, గ్రామాల్లో ఆరోగ్య సేవలకు చేయూత - పుణేలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఏర్పాటు ముంబై: రాష్ట్రంలో డిజిటల్ గ్రామాలు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి మైక్రోసాఫ్ట్ సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. వారం రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన సీఎం గురువారం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆరోగ్య సౌకర్యాలు, డిజిటల్ గ్రామాలకు సాంకేతిక సహాయం చేయడానికి మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందని భేటీ అనంతరం సీఎం ట్వీట్ చేశారు. అమరావతి జిల్లాలోని మెల్ఘాట్ గ్రామంలో పెలైట్ ప్రాజెక్టుగా దీన్ని మొదలు పెడతామని చెప్పారు. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) మదిరిగా స్మార్ట్‌సిటీ నిర్మాణానికి సహకరిస్తానని ఐటీ దిగ్గజం హామీ ఇచ్చిందని అన్నారు. అలాగే పుణేలో సైబర్ సెక్యూరిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పుకుందని చెప్పారు. అనంతరం బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ సీఈఓ రేమండ్ కార్నర్‌తో సీఎం సమావేశ మయ్యారు. నాగ్‌పూర్‌లోని మిహాన్‌లో విమానాల నిర్వహణ, మరమ్మతుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని, శిక్షణ తరగతులు కూడా ప్రారంభిస్తామని బోయింగ్ హామీ ఇచ్చిందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) జాయ్ మినారిక్తో సమావేశమైన సీఎం రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీకి సహకరించాలని కోరారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏడబ్ల్యూఎస్ సిద్ధంగా ఆసక్తి చూపుతోందని ఆయన పేర్కొన్నారు. కీలక కంపెనీలతో భేటీ వారంరోజుల పర్యటనలో భాగంగా అమెరికా వచ్చిన సీఎం న్యూయార్క్, న్యూజెర్సి, డెట్రాయిట్లలో పర్యటించారు. జనరల్ మోటార్స్, క్రిస్లర్ హెడ్‌క్వార్టర్స్ కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం శాన్ఫ్రాన్సిస్కో బయలు దేరిన సీఎం తర్వాత లాస్ఏంజిల్స్ వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్, రాష్ట్ర కేబినెట్ మంత్రులతో అమెరికా బయలుదేరిన సీఎం గూగుల్, సిస్కో, ఆపిల్ సంస్థలతో భేటీ అయ్యారు. బ్లాక్‌స్టోన్, పంచ్సిల్లతో వివిధ జాయింట్ వెంచర్ల ప్రాజెక్టులకుగానూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈఓఎన్ ఫ్రీ ఓన్ సెజ్‌లో రూ. 750 కోట్లు, హింజెర్వాడీలో రూ. 1,200 కోట్లు, సెంట్రల్ ముంబైలోని ఐటీ పార్క్‌లో రూ. 1,500 కోట్లు, ముంబైలోని మరో ఐటీ పార్క్‌లో రూ. 1050 కోట్లు పెట్టుబడి పెట్టడానికి బ్లాక్‌స్టోన్ అంగీకరించిందని సీఎం ట్వీట్ చేశారు. చిప్లున్ ఎంఐడీసీలో రూ. 500 కోట్లు కోకకోలా కంపెనీ పెట్టుబడి పెట్టనుంది. సీఎం కారణం కాదు: ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా బయలుదేరడానికి కారణం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కాదని ఆయనతోపాటు విమానంలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు అన్నారు. ఇమిగ్రేషన్ సమస్య వల్ల ప్రయాణం ఆలస్యమైందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కారణంగా జూన్ 30న అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గంట ఆలస్యంగా బయలు దేరిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సీఎంతో పాటు అమెరికా పర్యటనకు బయలుదేరిన ఓ అధికారి సరైన డాక్యుమెంట్లు తీసుకురాకపోవడం వల్ల విమానం నిలిపివేయాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని శుక్రవారం ట్వీట్ చేశారు. ఆయనతోపాటు ప్రయాణించిన మరో ఇద్దరు ప్రయాణికులు ఆయన మద్దతు పలికారు. విమాన ప్రయాణం ఆలస్యానికి కారణం సీఎం ఫడ్నవీస్ కాదని ట్వీట్ చేశారు. ఇమిగ్రేషన్ సమస్య వల్ల విమానం ఆలస్యంగా బయలు దేరిందని ఉదయ్‌పూర్‌కు చెందిన రచయిత, జర్నలిస్ట్ దుశ్యంత్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశారు. విమానాన్ని ఆపమని సీఎం చెప్పలేదని, ఆ సమయంలో ఆయన ఏవో ఫైళ్లు చూస్తున్నారని మరో ప్రయాణికుడు అరవింద్ షా ట్వీట్ చేశారు. అయితే తప్పదోవ పట్టించడానికే ఆరోపణలు చేస్తున్నారని సీఎం అన్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ పర్దేశీతో కలసి సీఎం ఫడ్నవీస్ జూన్ 30న అమెరికా బయలుదేరిన సమయంలో ఘటన జరిగింది. పర్దేశీ సరైన యూఎస్ వీసా తీసుకురాకపోవడంతో ఆయన వీసా తీసుకువచ్చాక విమాన బయలుదేరిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఘటనపై కాంగ్రెస్ సీఎం ఫడ్నవీస్‌ను తీవ్రంగా దుయ్యబట్టింది. ప్రజలను సీఎం క్షమాపణ కోరాలని డిమాండ్ చేసింది.