Comprehensive survey
-
83,64,331 నివాసాల్లో సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 83,64,331 నివాసాల్లో సర్వే పూర్తయ్యింది. సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,16,14,349 నివాసాలకుగాను ఇప్పటి వరకు 72 శాతం సర్వే పూర్తయినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. జాప్యం లేకుండా సకాలంలో సర్వే పూర్తి చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును కూడా వదలకుండా ప్రతీ ఇంటిలో సమగ్రంగా సర్వే నిర్వహించాలని సీఎస్ స్పష్టం చేశారు.మంగళవారం నాటికి రాష్ట్రంలో ములుగు జిల్లా 98.9శాతం పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలవగా, నల్లగొండ జిల్లా 95 శాతంతో ద్వితీయ స్థానంలో, జనగాం జిల్లా 93.3 శాతంతో తృతీయ స్థానంలో నిలిచాయి. గ్రేటర్ హైదరాబాద్ 50.3 శాతం సర్వేతో చివరిస్థానంలో నిలిచింది. ఈ సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాల వారీ గా పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారు లను నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే తీరును సమీక్షిస్తున్నారు. -
గడువులోగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని, నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.మొదటి దశలో చేసిన నివాసాల లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా 1,16,14,349 ఇళ్లకు స్టిక్కరింగ్, మార్కింగ్ చేశామని తెలిపారు. వాటిలో ఏ ఒక్క ఇంటినీ వదిలేయకుండా.. ప్రతి ఇంటిలో సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌరుల అభ్యున్నతి కోసమే వివరాల సేకరణ జరుగుతోందని చెప్పారు. సర్వేను రాష్ట్ర గవర్నర్ వివరాల సేకరణతో ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దు..సమగ్ర సర్వేలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని సీఎం పేర్కొన్నారు. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.44.1 శాతం పూర్తయింది..శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం సర్వే పూర్తయిందని.. సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 మంది పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రజల నుంచి స్పందన బాగుందని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర సర్వే: మా అప్పులు తీరుస్తారా? మీకెందుకు చెప్పాలి?
‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్ నంబర్ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి ఎందుకు? వీటితో మాకొచ్చే ప్రయోజనం ఏంటి? రైతుబంధు రానప్పుడు భూముల వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు?.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో, ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోతపెడతారో, రేషన్‌కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వివరాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి వివరాలు చెప్పడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలివీ..సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల సేకరణ గందరగోళంగా మారింది. పేర్లు, కులం, వృత్తి వంటి కొన్ని సాధారణ వివరాలను వెల్లడిస్తున్న జనం.. ఆర్థికపర అంశాలను వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, కొన్ని అంశాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తుండటం, వారికి సర్దిచెప్పాల్సి రావడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.మరోవైపు పేద వర్గాల నుంచి మాత్రం సర్వేకు మంచి స్పందన కనిపిస్తోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా... ఈ నెల 6వ తేదీ నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఎన్యూమరేటర్లు ఆ ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరించి, సర్వే ఫారాల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కాలమ్ నంబర్ 19 నుంచి తిప్పలు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు (56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు) ఉన్నాయి. సర్వే బుక్లెట్ రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలను వెల్లడించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. కాలమ్ నంబర్ 19 నుంచి వస్తున్న పలు ప్రశ్నలు ఆందోళన రేపుతున్నాయి.ప్రధానంగా వ్యాపారం వార్షిక టర్నోవర్, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతా సమాచారం, భూములు, ధరణి పాసు పుస్తకం వివరాలు, భూమి కొనుగోలు కోసం వనరులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను అడిగినప్పుడు.. ఆ వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నలు ఎన్యూమరేటర్లకు ఎదురవుతున్నాయి. ‘ఆర్థిక స్థితిగతుల’పై ఆందోళన సర్వే ప్రశ్నావళి రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. వాటికి సరైన సమాధానం రావడం లేదని ఎన్యూమరేటర్లు చెప్తు న్నారు. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, వాహనాలు, రేషన్‌కార్డు, నివాస గృహానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన ప్ర శ్నలు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయని వివరిస్తున్నారు. ‘మేం రుణాలు చెల్లించకుంటే ప్రభు త్వం చెల్లిస్తుందా? ఆస్తుల వివరాలు మేమెందుకు చెప్పాలి? మా కున్న అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆదాయం వి వరాలు చెబితే పథకాలు వస్తాయా? ఉన్నవాటికి కోతపెడతారా?’ అని ప్రజలు నిలదీస్తున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. శనివారమూ కొనసాగిన స్టిక్కరింగ్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీనే ప్రారంభమైంది. 6, 7, 8వ తేదీల్లో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లను పరిశీలించి యజమానులు, అద్దెదారుల వివరాలను తెలుసుకుని, స్టిక్కర్లు అంటించాలని, 9వ తేదీ నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు చేపట్టాలని నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా స్టిక్కరింగ్ ప్రక్రియే కొనసాగింది. ఇళ్లకు తాళం ఉండటం, యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇళ్ల విజిటింగ్, స్టిక్కరింగ్ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిందని.. ఆదివారం నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు కొనసాగుతుందని ప్రణాళిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల సేకరణలో తిప్పలు సర్వేలో ఒక్కో ఇంటికి సంబంధించి 75 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, 43 ప్రశ్నలకు బుక్లెట్ చూసుకుని కోడింగ్ వేయడం వేయడం ఎన్యూమరేటర్లకు తలకు మించిన భారమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 150 నుంచి 175 వరకు ఇళ్లను ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు అప్పగించారు. రోజుకు 10 ఇళ్లలో సర్వే చేయాలని ఆదేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో తొలిరోజు ఐదు, ఆరు ఇళ్ల సర్వేనే పూర్తయింది. కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో అయితే గంటకుపైనే సమయం పడుతోందని.. మధ్యాహ్నం నుంచి కాకుండా రోజంతా చేస్తేనే సర్వే పూర్తవుతుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఫామ్ నింపడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులను సహాయకులుగా తీసుకెళుతున్నట్టు చెప్తున్నారు. ఇళ్లకు తాళాలతో ఇబ్బంది పంటల కోతల సమయం కావడంతో ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక రైతులు, కూలీలు పనులకు వెళ్తున్నారు. దీనితో సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటుండటంతో సర్వే ముందుకుసాగుతోంది. తాళాలు వేసిన ఇళ్లను గుర్తుంచుకుని మళ్లీ రావడం ఇబ్బందేనని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు.జిల్లాల వారీగా ‘సర్వే’ తీరును పరిశీలిస్తే.. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,53,950 ఇళ్లు ఉండగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో శనివారం రాత్రి వరకు స్టిక్కరింగ్ పూర్తి కాలేదు. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడంతో చాలా ఇళ్లకు తాళం వేసి ఉంది. కొందరు ఇళ్ల యజమానులు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. భద్రాద్రి జిల్లాలో సర్వే ఫామ్‌లు ఆలస్యంగా చేరాయి. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదు. గొత్తికోయలకు ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు ఉన్నా కులం సర్టిఫికెట్లు లేక సర్వేలో ఏం రాయాలో స్పష్టత లేకుండా పోయింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పలేదు. ధరణి సమాచారం అడిగిన ఎన్యుమరేటర్లకు ‘మీకెందుకు?’అనే ప్రశ్న ఎదురైంది. రోజువారీ కూలీలు మొదటిరోజు పనులు వదులుకుని ఇంటి వద్దే ఉన్నా ఎన్యుమరేటర్లు రాక విసుగుపడటం కనిపించింది. ఇంటి నిర్మాణం, విస్తీర్ణంపై సమాధానాలు రాలేదు. ఐటీ రిటర్నులు, వడ్డీ వ్యాపారులు, కులాంతర వివాహాల సమాచారం రాబట్టలేకపోతున్నారు. ⇒ కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో శనివారం కూడా స్టిక్కరింగే కొనసాగింది. పలుచోట్ల కొందరు ఇంటికి స్టిక్కర్లు వేయవద్దంటూ నిరాకరించారు. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్రాల కొరతతో సర్వే ఆలస్యంగా మొదలైంది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు పది గృహాలను అప్పగించగా.. సమయం సరిపోక 5, 6 ఇళ్లే సర్వే చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు కూడా స్టిక్కరింగ్ కొనసాగింది. రెండో శనివారం కావడంతో ఆరీ్పలు, ఉపాధ్యాయులు సర్వేకు హాజరుకాలేదు. బోధన్ నియోజకవర్గంలో సర్వే స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెప్పారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,17,467 ఇళ్లు ఉండగా.. 8,231 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల వివరాలను చెప్పడం లేదు. ఆధార్ నంబర్, పాస్‌బుక్ వివరాలు ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. పట్టణాల్లో దాదాపు అన్ని వివరాలు చెబుతున్నా ఉద్యోగం, ఆస్తి వివరాలు దాటవేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆస్తులు, భూములు, ఓపెన్ ప్లాట్ల వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఉద్యోగం చేసే వారి వివరాలు చెప్పడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లోని వారు వేర్వేరుగా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ధరణి పాస్ బుక్ నంబర్, ఆధార్ కార్డులు వెతకడం, పట్టాపాస్ బుక్‌లు బ్యాంకుల్లో ఉండటంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లిలో చాలాచోట్ల వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరినీ ఒకేచోటకు పిలిపించి.. వివరాలు నమోదు చేయించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 9,67,871 కుటుంబాలు ఉన్నాయి. రుణాలు, భూములు, ఆస్తి వివరాలు చెప్పడానికి చాలామంది ముందుకురాలేదు. బీసీ–ఈ, సీ సరి్టఫికెట్లు తీసుకున్న వారు చెప్పడానికి వెనుకంజ వేశారు. కొందరు మహిళా టీచర్లు తమ భర్త, పిల్లలను సహాయకులుగా తెచ్చుకున్నారు.రైతు భరోసా లేదు.. నేనెందుకు చెప్పాలి?వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిరి్నబావి ప్రాంతంలో నరిగె ఐలయ్య ఇంటికి సర్వే కోసం ఎన్యూమరేటర్ వెళ్లారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన ఐలయ్య.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో సరిగా స్పందించలేదు. రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. పింఛన్ ఎప్పుడు ఇస్తారని ఆరా తీశారు. ఎన్యూమరేటర్ సర్దిచెప్పడంతో చివరకు భూమి వివరాలు చెప్పినా.. ఈ కుటుంబం వద్దే రెండు గంటలు గడిచిపోయింది.అరగంట నుంచి గంట వరకు పడుతోంది.. మాకు రోజుకు 20 కుటుంబాల చొప్పున సర్వే చేయాలంటూ బుక్లెట్లు ఇచ్చారు. ప్రశ్నలు అడగడం, వాటి కోడ్ కోసం బుక్లెట్ చూడటం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్‌గా ఫామ్‌లోనే నమోదు చేసేలా ఉంటే బాగుండేది. సర్వేపై ప్రజలకు అవగాహన లేక సమాధానాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది. – ఎన్.పారిజాత, ఎన్యుమరేటర్, నకిరేకల్, నల్లగొండ జిల్లావివరాలు చెప్పేందుకు వెనకాడుతున్నారు ఇంటి యజమానిని ప్రశ్నలన్నీ అడిగి పూర్తి చేయడానికి చా లా సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అవగాహన లేకపోవడంతో ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కొన్ని ఇళ్ల వద్ద గంట దాకా సమయం పడుతోంది. సర్వే కోసం మరికొంత సమయం ఇవ్వాలి. – వేలిశెట్టి నరసింహారావు, ఎన్యుమరేటర్, వైరా, ఖమ్మం జిల్లా -
సమగ్ర కులగణనకు సై!
సాక్షి, హైదరాబాద్: సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయాల్లో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల స్థితిగతులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్ర కులగణనకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం సమగ్ర కులగణనకు సంబంధించిన జీఓ ఎంఎస్ 26ను జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించనున్నారు. నిర్వహణకు రూ.150 కోట్లు...: ఈ సర్వే చేపట్టేందుకు కనీసంగా రూ.150కోట్లు బడ్జెట్ అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సర్వే ఖర్చు కోసం నిధులను 2024–25 వార్షిక బడ్జెట్లో కేటాయించింది. ఈమేరకు తాజా ఉత్తర్వుల్లో బడ్జెట్ అంశాన్ని పొందుపర్చింది. సర్వే నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వం ఉత్తర్వుల్లో వెల్లడించారు. సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తారు. జీఓ విడుదల హర్షణీయం: జాజుల శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమగ్ర కులగణన జీఓ విడుదల చేయడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల జనాభా లెక్కలను సేకరింంచేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. -
పట్టణ సర్వే సిబ్బందికి మరో దఫా శిక్షణ
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ఆస్తుల సమగ్ర సర్వే కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చిన మునిసిపల్ అధికారులు నవంబర్ 1 నుంచి సర్వే చేపట్టాలని భావించారు. సర్వే విధానంపై సిబ్బందికి గల అనుమానాలను నివృత్తి చేసేందుకు మంగళవారం 400 మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి యూఎల్బీ నుంచి ముగ్గురు చొప్పున రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి సిబ్బంది హాజరు కానున్నారు. సర్వే పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేయడంతోపాటు, ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సైతం పీఎంయూలను ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలనాధికారిని కూడా నియమించారు. మంగళవారం జరిగే శిక్షణలో పీఎంయూ అధికారితో పాటు వార్డు పరిపాలనా కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరా లతో కూడిన హక్కుపత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. మొత్తం 123 యూఎల్బీల్లోను 38 లక్షల ఆస్తులు ఉన్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన సర్వేలో ప్రతి వార్డు నుంచి ఆరుగురు సిబ్బంది చొప్పున మొత్తం 20 వేలమంది పాలుపంచుకునేలా చర్యలు తీసుకున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్న అధికారులు మ్యాపింగ్, రికార్డుల పరిశీలనలో తలెత్తే సమస్యలపై వివరించనున్నారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా వివిధ స్థాయిల్లో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మునిసిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. ఈసారి వారికి రికార్డుల ప్రకారం ఆస్తుల గుర్తింపు, మునిసిపాలిటీ పరిధి మ్యాపింగ్‌తో పాటు, ప్రతి వార్డు మ్యాప్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఆర్ఎస్ఆర్, టీఎస్ఆర్, కేఎంఎల్ ఫైల్స్ పరిశీలనపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన వాటిలో 648 రెవెన్యూ గ్రామాలున్నాయి. పకడ్బందీగా సర్వే చేపట్టాలని నిర్ణయించామని పట్టణ ఆస్తుల సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. -
సర్వేతోనే సర్వం సెటిల్!
భూ సర్వేతో ఏంటి ప్రయోజనం ప్రతి గ్రామానికి ఒక పటం, ప్రతి భూ విభాగానికి కొలతలు, హద్దురాళ్ల వివరాలతో టిప్పన్ తయారు చేస్తారు. ఆ తర్వాత భూమి రకం ఏంటి?.. అంటే ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? తదితర వివరాలతో సేత్వారు తయారు చేస్తారు. కొనుగోలు, వారసత్వం, భాగ పంపకాలు, దానం, వీలునామాతో భూమి సంక్రమిస్తే హక్కుల రికార్డులో మార్పులు చేసి పకడ్బందీగా పట్టా జారీ చేస్తారు. భూ కమతంలో విభజన జరిగితే సర్వే చేసి టిప్పన్ తయారు చేస్తారు. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: భూమి ఇక్కడ ప్రాణం కంటే విలువైనది. అందుకే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిరంతరం భూమి చుట్టే పరిభ్రమిస్తుంటాయి. స్వాతంత్య్రానికి ముందు భుక్తినిచ్చే భూమి కోసం నిజాం –దేశ్‌ముఖ్‌ల చేతుల్లో నాలుగువేల మంది నిరుపేదల అమరత్వం పది లక్షల ఎకరాలకు రైతు కూలీలను యజమానులుగా చేసిన చారిత్రిక ఘట్టం ఒకవైపు.. స్వాతంత్య్రాంతరం ఇదే నేల భూదాన ఉద్యమంలో పేద రైతాంగాన్ని నాలుగు లక్షల ఎకరాలకు భూయజమానులుగా చేసిన మహోజ్వల ఘట్టం మరోవైపు.. ఇలా దేశంలో పేదలకు పంచిన ప్రభుత్వ భూము ల్లో 14 శాతం తెలంగాణాలోనే ఉండటం మరో విశేషం. అయితే రాష్ట్రం ఏర్పడే రోజుకు రాష్ట్రంలోని 56 శాతం కుటుంబాలకు గుంట భూమి కూడా లేకపోగా, భూమి ఉన్న 40 శాతం కమతాల్లో గుంటకో సమస్య అన్నట్టుగా ఉండటం విచిత్రం. భూమి ఉంటే పట్టా లేకపోవడం, పట్టా ఉంటే భూమి అధీనంలో లేకపోవడం వంటి సమస్యలతో ధరణి సేవా కేంద్రాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా, సమగ్ర భూసర్వేతోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడో నిజాం కాలంలో సర్వే.. హైదరాబాద్ రాష్ట్రం చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1911లో మొదలైన సమగ్ర భూ సర్వే 1940లో పూర్తి అయ్యింది. ప్రతి గ్రామానికి ఒక పటం (మ్యాప్), ప్రతి భూ విభాగానికి కొలతలు, హద్దుల కూడిన వివరాలతో టిప్పను తయారు చేశారు. దీంతో పాటు ఆ భూమికి పట్టాదారు ఎవరు? ఆ భూమి ప్రభుత్వ భూమా?, ప్రైవేటు భూమా? అన్న వివరాలతో సెటిల్మెంట్ రికార్డు (సేత్వారు) రూపొందించారు. ఎనభై ఏళ్ల క్రితం రూపొందించిన టిప్పన్లలో అధిక భాగం చెదలు పట్టడం, గ్రామ పటాలు చిరిగిపోవటంతో తదనంతర కాలంలో ఎలాంటి సర్వే లేకుండానే భూ కమతాల క్రయవిక్రయాల సమయంలో కాగితాలపైనే సబ్ డివిజన్ చేసి కొత్త నంబర్ ఇచ్చేశారు. సివిల్ కోర్టుల్లో నానుతున్న కేసుల్లో మూడింట రెండొంతులు భూ హద్దులు, రికార్డులకు సంబంధించినవే కావటం సమగ్ర భూ సర్వే, సెటిల్మెంట్ ఆవశ్యకతను స్పష్టం చేస్తోంది. భూ సర్వే ఇంకెంత దూరం తెలంగాణలో సమగ్ర భూ సర్వే ఏడేళ్లుగా వాయిదా పడుతోంది. డిజిటల్ ఇండియా ప్యాకేజీలో భాగంగా కేంద్రం రూ.83.85 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం రూ.వెయ్యి కోట్లు కేటాయించాయి. తొలుత 33 జిల్లాల్లోనూ జిల్లాకో గ్రామం చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా భూసర్వే చేయాలని నిర్ణయించినా, ఆ తర్వాత దాన్ని అటకెక్కించారు. భూ పరిపాలనలో బిహార్, గుజరాత్ ,త్రిపుర, కర్ణాటక, ఏపీ తీరు భేషుగ్గా ఉండగా, తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చాక సమస్యల సంఖ్య మరింత పెరిగిందని భూచట్టాల నిపుణులు పేర్కొనడం గమనార్హం. కర్ణాటకలో దిశాంక్, ఏపీలో సమగ్ర సర్వే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోనే భాగమైన కర్ణాటకలో దిశాంక్ యాప్ విస్తృత సేవలందిస్తోంది. ఏదైనా భూమిలో నిలబడి ఆ యాప్ ఓపెన్ చేస్తే భూమి వివరాలన్నీ ప్రతక్ష్యమవుతుండటం విశేషం. ఆ రాష్ట్రంలో కమతం వారీగా కేటాయించిన ప్రత్యేక నంబర్‌ను జీపీఎస్‌కు సైతం అనుసంధానం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నల్సార్ (నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ ఆండ్ రీసెర్చ్), సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో చేపట్టిన సమగ్ర భూ సర్వే త్వరలోనే పూర్తి కానుంది. రికార్డులు, హద్దుల సమస్యల్లేవ్..! పుట్టలభూపతి.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో 104 కుటుంబాలున్న ఓ ఆదివాసీ గ్రామం. అక్కడ అందరికీ వారసత్వంగా వచ్చినా రెవెన్యూ భూమి ఉంది. కానీ రికార్డులు, సరైన హద్దురాళ్లు లేవు. దీంతో వారికి ప్రభుత్వపరంగా ఏ సహాయం అందలేదు. తమ ఊరికి వచ్చిన నాయకులందరినీ అడిగీ అడిగీ అలసిపోయారు. అయితే నల్సార్ మరో సంస్థ ‘లీఫ్’తో కలిసి కొత్త చరిత్రను లిఖించింది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు భూ రికార్డులు, సర్వే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారితోనే రికార్డులను సరి చేయటం, ఊరి మొత్తంలో ఉన్న ఆరు సర్వే నంబర్లలోని రెవెన్యూ భూమిని సబ్ డివిజన్లుగా విభజించి హద్దురాళ్లు ఏర్పాటు చేసి ఎవరి భూమి ఎక్కడో తేల్చిచెప్పారు. అనంతరం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ అదాలత్ ద్వారా వాటికి ఆమోదముద్ర వేసి ‘పట్టాల పండుగ’పేరుతో ఉత్సవమే నిర్వహించారు. తద్వారా హద్దుల వివాదం, రెవెన్యూ రికార్డు సంబంధిత పేచీల్లేనీ క్లీన్ విలేజ్‌గా పుట్టలభూపతి ఘనత సాధించింది. ఆ గ్రామంలో ప్రస్తుతం 73 కుటుంబాల భూ రికార్డులు, హద్దులు నిర్ధారించిన తీరుపై 17 రాష్ట్రాల ప్రతినిధులు ఓ కేస్ స్టడీగా తీసుకోవడం గమనార్హం. దిశాంక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు.. మా రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన దిశాంక్ యాప్ బాగుంది. నా భూమిలోకి వెళ్లి యాప్ ఓపెన్ చేస్తే గ్రామం, సర్వే నంబర్, భూమి వివరాలు, యజమాని పేరు, భూమి మ్యాప్, హద్దురాళ్లతో సహా వివరాలన్నీ వచ్చేస్తాయి. పట్టాదారు వారీగా రైతులకు కేటాయించిన నంబర్ ఆధారంగా జీపీఎస్ ద్వారా భూమి హద్దుల్లోకి తీసుకెళ్తుంది. ఈ యాప్ వచ్చాక భూమి సంబంధిత ఇబ్బందులు తొలిగిపోయాయి. – పి.ప్రభాకర్, తడ్పల్లి, బీదర్ జిల్లా, కర్ణాటక రెండేళ్లలో సర్వే పూర్తి చేయొచ్చు భూహద్దులు, రికార్డులు పక్కాగా ఉంటేనే శాంతి, ఆర్థికవృద్ధి సాధ్యం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో భూసర్వే, రికార్డుల నిర్వహణ సులువుగా మారిపోయింది. అమెరికా, యూరప్ దేశాల ప్రగతిలో భూహద్దులు, రికార్డులే కీలకం. దేశంలో తెలంగాణ కోరితే నా సేవలు అందించేందుకు సిద్ధం. రెండేళ్లల్లో భూ సర్వే పూర్తి చేయొచ్చు. ఒక సర్వే వందేళ్ల ప్రగతికి బాట. – స్వర్ణ సుబ్బారావు, రిటైర్డ్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా భూనక్షలు చెదపట్టాయి.. హద్దులు చెదిరిపోయాయి తెలంగాణ ఆవిర్భావ సమయంలోనే మేము అన్ని జిల్లాల్లో 2,500 కి.మీ పర్యటించి పదివేల మందిని కలిసి భూ పరిపాలన ఎలా ఉండాలన్న అంశంపై మేనిఫెస్టో రెడీ చేశాం. అందులో అత్యంత ప్రధానంగా భూముల సర్వే, భూ రికార్డుల సవరణలున్నాయి. తెలంగాణలో ఇంకా 80 ఏళ్ల క్రితం నాటి సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 30 శాతానికి పైగా అప్పటి భూనక్షలు చెద పట్టిపోయాయి. హద్దురాళ్లు చెదిరిపోయాయి. తొలుత భూ సర్వే, సెటిల్మెంట్ ఆపై చేతిరాత పహాణీలు రెడీ చేశాక..ధరణి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే బాగుండేది. కానీ ఆ పని జరగలేదు. దీంతో సమస్యలు అలాగే ఉండిపోయాయి. భూసర్వే, సెటిల్మెంట్ మాత్రమే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. – భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు ప్రభుత్వ స్పందన కోసం చూస్తున్నాం.. రాష్ట్రంలో అమల్లో ఉన్న వందకు పైగా భూచట్టాలను సమీక్షించి, ప్రస్తుత పరిస్థితుల మేరకు చేయాల్సిన మార్పులపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. సమగ్ర భూ సర్వే కోసం తగు న్యాయ సహకారం అందించేందుకు మేం సిద్ధమని కూడా చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ప్రారంభించిన భూ సర్వే, సెటిల్మెంట్ ప్రాజెక్ట్‌లో నల్సార్ ఇప్పటికే భాగస్వామిగా చేరింది. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, వీసీ, నల్సార్ -
సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారం
సాక్షి, అమరావతి: సమగ్ర సర్వేతో అన్ని భూ వివాదాలు పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సమగ్ర సర్వే లక్ష్యాల్లో భూ వివాదాల పరిష్కారం ఒకటని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలు తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించుకున్న గడువులోగా సమగ్ర సర్వేను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని, సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పారు. డ్రోన్లు, ఓఆర్ఐ పరికరాలు, రోవర్లుతో పాటు సర్వే రాళ్లు సమకూర్చుకోవడం వంటి ప్రతి అంశంలోనూ వేగంగా పనిచేయాలని స్పష్టంచేశారు. సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, దీన్ని పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు. సమగ్ర సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటివరకూ సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
యూజీ.. పీజీ విద్యపై సమగ్ర సర్వే
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యపై సమగ్ర సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) స్థాయిల్లో ప్రస్తుత పరిస్థితి, విద్యాసంస్థల్లో వనరులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు, మారుతున్న సమాజ అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలోనే వసతులు కల్పించి విద్యార్థులను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతోంది. అనుభవం గల ప్రముఖ సంస్థలతో సర్వే చేయిస్తారు. ఇందుకోసం ఉన్నత విద్యామండలి టెండర్లు్ల పిలవడం, ఇతర కార్యాచరణకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఈ సర్వే జరుగుతుంది. ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల్లో ప్రస్తుత పరిస్థితిని సశాస్త్రీయంగా విశ్లేషిస్తారు. ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారు! యూజీ, పీజీ కోర్సులు చేసేందుకు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయాన్ని సర్వేలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. దీనిని గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా, మిశ్రమ విధానంలో చేపడతారు. ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక, లింగ తదితర విభాగాల వారీగా సర్వే కొనసాగిస్తారు. ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, కేస్ స్టడీలు సర్వేలో ఉంటాయి. విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, సంరక్షకులు, ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ అధికారులు, జిల్లా, రాష్టస్థాయి నియామక అధికారులు, పూర్వ విద్యార్థులు తదితరులందరి అభిప్రాయాలు తీసుకుంటారు. సర్వే పూర్తిగా హైబ్రిడ్ మోడ్‌లో జరుగుతుంది. సర్వేను 3 నెలల్లో పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సర్వే పరిధిలోకి వచ్చే సంస్థలివీ.. రాష్ట్రంలోని యూనివర్సిటీలు (ఆర్జీయూకేటీ, ఐఐఐటీలు సహా), యూనివర్సిటీల పీజీ సెంటర్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అటానమస్ కాలేజీలు, మైనార్టీ కాలేజీలు, అఫిలియేటెడ్ కాలేజీలు, బీఈడీ–ఎంఈడీ కాలేజీలు, మహిళా కాలేజీలు, లా కాలేజీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు శాంపిల్ సైజ్ 12 శాతానికి తగ్గకూడదు సర్వేలో జనరల్, టెక్నికల్, లా, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ తదితర విభాగాల విద్యార్థుల సంఖ్యలో 12 శాతానికి తగ్గకుండా శాంపిళ్లను తీసుకుంటారు. ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులందరి భాగస్వామ్యం ఇందులో ఉండాలి. ఇందులోనూ 8 శాతం ఆన్లైన్ ద్వారా, 4 శాతం ఆఫ్‌లైన్ ద్వారా చేపట్టాలి. సర్వే శాంపిల్స్‌లో ఎస్సీలు 15, ఎస్టీలు 7.5, బీసీలు 25 శాతం ఉండాలి. మహిళలు, పురుçషుల శాతం సగం చొప్పున ఉండాలి. జిల్లా యూనిట్‌గా ఈ సర్వే సాగాలి. ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా మూడేసి బృంద చర్చలు చేపట్టాలి. ఇవి విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల వారీగా ఉండాలి. ప్రవేశాలు.. విద్యార్థుల పరిస్థితిపైనా అధ్యయనం ► గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలు, విద్యార్థుల ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విద్యార్థులలో పరిశ్రమలపై అవగాహన ఎలా ఉంది, రాష్ట్రస్థాయిలోనే వారికి పారిశ్రామిక ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశాలేమిటనేది కూడా అంచనా వేయాలి. విద్యార్థుల్లో నైపుణ్యాలు ఏ మేరకు ఉన్నాయి, ప్రస్తుత అవసరాలకు తగ్గ నైపుణ్యాలు లేకపోతే ఆ గ్యాప్ ఎంత? అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి భవిష్యత్ కార్యాచరణపై సూచనలు ఇవ్వాలి. ►విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంపై కారణాలు. వారికి ఇక్కడే ఉన్నత విద్యావకాశాలకు వీలైన ఏర్పాట్లపై సూచనలు. ఇలా వివిధ అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించి.. రానున్న ఐదేళ్లలో ఉన్నత విద్యారంగంలో చేపట్టాల్సిన విధాన కార్యక్రమాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. -
నేరస్తుల సర్వే పేరుతో పోలీసుల వేధింపులు
సాక్షి, హైదరాబాద్: నేరస్తుల సమగ్ర సర్వే పేరుతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. నేరస్తుల సమగ్ర సర్వే పేరుతో నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ అధికారి వేధిస్తున్నారని అబ్దుల్ హఫీజ్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్‌ను పోలీసులు బెదిరించలేదని హోం శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఫోన్ కాల్స్ సాక్ష్యాలున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా.. ఆ వివరాలతో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఆదేశించారు. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేశారు. ఇదే పిటిషనర్ గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశిం చారు. ఇప్పుడు అత్యవసర అంశంగా మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. -
మేల్కొంటే సిరులపంటే..
విశాఖసిటీ: విదేశీ మోడళ్లతో నిర్మాణమన్నారు.. కోట్ల రూపాయలు పెట్టి ఇళ్లు కట్టేశారు. కానీ.. స్థానికుల్ని ఆకర్షించడంలో మాత్రం విఫలమయ్యారు. ఫలితం.. దశాబ్దకాలంగా సగానికిపైగా గృహాలు నిరుపయోగమైపోయాయి. హాట్ కేకుల్లా అమ్ముడై పోతాయని భావించిన వుడాకు పరాభవం ఎదురైంది. సగమైనా చెల్లకపోవడంతో దశాబ్దం గడిచినా.. ఆ ప్రాజెక్టు వుడాకు పీడకలలా వెంటాడుతూనే ఉంది. అసలే ఆదాయ వనరులు సమకూర్చుకోలేక ఆపసోపాలు పడుతున్న వుడాకు రోహౌస్‌లు కుంపటిలా మారాయి. తాజాగా శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టేందుకు వుడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 900 ఎకరాల్లో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో కూడిన టౌన్షిప్ నిర్మించాలని యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ల నేతృత్వంలో ఎంజాయ్మెంట్ సర్వే రెండు నెలల క్రితమే నిర్వహించారు. ఏఏ ప్రాంతంలో ఎంత భూమి ఉంది. ఇందులో కొండ పోరంబోకు ఎంత, ఎంత మేర కాంటూరుని వినియోగించుకోవచ్చు, ఆక్రమిత భూమలు, పట్టాలిచ్చిన స్థలాలు ఎంతమేర ఉన్నాయి, ఏఏ మండలాలకు చెందిన భూములున్నాయనే అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదికను అందించారు. మూడు మండలాల్లో భూములు శాటిలైట్ టౌన్షిప్ కోసం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూముల్ని బదలాయింపు కింద వుడా కోరుతోంది. గతంలో వుడాకు చెందిన భూముల్ని చాలా వరకూ రెవెన్యూ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నేపథ్యంలో వాటి బదులుగా ఈ ట్రై జంక్షన్ పరిధిలో ఉన్న భూములు తమకు ఇస్తే అభివృద్ధి చేస్తామని వుడా కోరింది. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. సబ్బవరం మండలం గంగవరం, నంగినారపాడు గ్రామాల పరిధిలోనూ, పరవాడ మండలం పెదముషిడివాడ, ఈమర్రిపాలెం గ్రామాల్లోనూ, గాజువాక మండలం అగనంపూడిలో కలిపి 1570.04 ఎకరాలుండగా ఇందులో అభివృద్ధికి పనికిరాని కొండల ప్రాంతాలు 669.15 ఎకరాలున్నాయి. మిగిలిన 899.27 ఎకరాల స్థలాల్ని శాటిలైట్ టౌన్షిప్ కోసం గుర్తించారు. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం భూముల వివరాలిలా ఉన్నాయి. సామాన్యుల్ని విస్మరిస్తారా..? హైదరాబాద్‌లో నిర్మించిన శాటిలైట్ టౌన్‌షిప్‌లు విజయవంతమయ్యాయి. దీనికి కారణం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా టౌన్షిప్ నిర్మాణం జరగడమే. ముందుగా చిన్న వర్గాల వారికి అంటే పనులు చేసుకునేవారి కోసం అందుబాటులో ఉండేలా గృహ నిర్మాణాలు చేపట్టారు. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి నగరానికి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. ఆ తర్వాత మధ్యతరగతి, ధనిక వర్గాల వారికి ఆకట్టుకునే ధరలతో ఇళ్లు నిర్మించారు. క్రమంగా అది విస్తరించి అన్ని మౌలిక సదుపాయాలతో మరో ఊరిలా మారింది. విశాఖలోనూ అదే తరహాలో నిర్మిస్తే తప్ప వుడా ప్రయత్నాలు సఫలీకృతమవ్వవు. కానీ.. వుడా ఆలోచనలెప్పుడూ ధనికవర్గాలను దృష్టిలో పెట్టుకొనే జరుగుతున్నాయి. ఫలితంగా నష్టాల్ని మూటకట్టుకుంటోంది. లంకెలపాలెం వద్ద నిర్మించాలనుకుంటున్న టౌన్‌షిప్‌ను అన్ని వర్గాల వారికి అనుగుణంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందులో 150 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్ గా అభివృద్ధి చేయనున్నారు. మిగిలిన వాటినిల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినప్పుడు నిర్వాసితులకు కొంత స్థలం కేటాయించి.. మిగిలిన భూముల్లో టౌన్షిప్ అభివృద్ధి చెయ్యాలని ప్రణాళికలు రూపొందించినట్లు వుడా అధికారులు చెబుతున్నారు. సరైన ప్రణాళికతో రూపొందిస్తే ఈ శాటిలైట్ టౌన్షిప్ వుడాకు కాసుల వర్షం కురిపిస్తుంది. లేదంటే రో హౌసింగ్ ప్రాజెక్టులా నష్టాల ఊబిలోకి నెట్టేస్తుంది. -
11,143 జిల్లాలో ఉన్న సకల నేరస్తుల సంఖ్య
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పలు రకాల నేర ప్రవృత్తి ఉన్న వారి వివరాలు.. ఇంటికి వెళ్లి పోలీస్‌శాఖ సేకరిస్తోంది. సదరు నేరస్తులు వివరాలతోపాటు వేలి ముద్రలను తీసుకుంటోంది. జిల్లావ్యాప్తంగా పదేళ్లలో 11,143 మంది నేరస్తులున్నట్లు ఇప్పటికే గుర్తించారు. వీరి వివరాలు సేకరించేందుకు ప్రతి పోలీస్ అధికారి నుంచి ఎస్పీ వరకు మొత్తం 300 టీములు ఏర్పడ్డాయి. నేరస్తుల వివరాలు జియో ట్యాగింగ్, వేలి ముద్రలు తీసుకొని ఈ వివరాలను టీఎస్ కాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఒక నేరస్తుడి పేరును టీఎస్ కాప్‌లో క్లిక్ చేస్తే అతను ఎన్ని నేరాలు చేశాడో మొత్తం వివరాలు రాష్ట్రంలో ఎక్కడున్నా ఆ శాఖ సిబ్బందికి తెలిసిపోతుంది. ఈ విధానంలో ప్రధానంగా పేర్లతోపాటు వేలిముద్రలు కీలకం కా నున్నాయి. గతంలో నేరస్తుల వేలి ముద్రలు సేకరించినా అవి ప్రస్తుతం సరి పోలకపోవడంతో ఒక కేసును చేధించడానికి పోలీసులకు చాలాకా లం పడుతోంది. జియోట్యాగింగ్‌కు అనుసంధా నం చేస్తూ టీఎస్‌కాప్‌తో అధునాత న టెక్నాలజీతో ఈ సర్వేలో నేరస్తుల వేలి ముద్రలు సేకరిస్తున్నారు. దీనికి సం బంధించి 120 ట్యాబ్స్ జిల్లాకు మం జూరయ్యాయి. నేరస్తుల సమాచారం కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో బీట్ కానిస్టేబుల్‌కి, ఐడీ పార్టీ టీం, ఇన్వెస్టిగేషన్ అధికారికి ట్యాబ్స్ ఇస్తారు. పోలీస్‌శాఖ నిధుల ద్వారా జిల్లాలో 823 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సకల నేరస్తుల సమగ్ర సర్వేతో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు 250 కెమెరాలను పలు కేంద్రాల్లో ఏర్పాటు చేయిస్తున్నారు. నేరాలను తగ్గించాలని .. గతంలో నేరం చేసిన వారి వివరాలను ఈ సర్వేలో భాగంగా సేకరించి వాటిని తగ్గించాలని పోలీస్‌శాఖ ప్రయత్నిస్తోం ది. పదేళ్ల నేరస్తుల చిట్టా అంతా తీసి పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చే స్తుండడంతో.. పాత నేరస్తులకు గుండె గుబేల్మంటోంది. పోలీస్ సిబ్బంది తమ ఇంటికి వచ్చి వివరాలు అడుగుతుండడంతో మళ్లీ ఏమైందోన ని పాత నేరస్తుల్లో ఆందోళన నెలకొంది. అయి తే వివరాలు సేకరించేందుకే వస్తున్నామని, ఎలాంటి భయాందోళనలు చెందవద్దని పోలీస్ సిబ్బంది వారికి చెబుతున్నారు. తొలుత ఆందో ళన చెందినా తర్వాత ఊపిరి పీల్చుకొ ని వివరాలన్నీ నమోదు చేయించుకుం టున్నారు. తొలిరోజే జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 4 వేల మంది నేరస్తుల వివరాలను పోలీస్ సిబ్బంది సేకరించారు. మరో మూడు రోజుల్లో మొత్తం వివరాల సేకరణ పూర్తి చేయనున్నారు. సమగ్ర సర్వేను ఎస్పీ డీవీ.శ్రీనివాసరావుతోపాటు డీఎ స్పీలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిఘా నేత్రం .. టీఎస్ కాప్ పోలీస్‌లకు కీలక నిఘా నేత్రంగా మారుతోంది. మిస్టరీగా మా రే కేసులకు సంబంధించి అనుమానుతులను తీసుకొచ్చి వేలిముద్రలు సేకరించి, అవి సరిపోలాయో లేదో చూ స్తారు. అలాగే జియో ట్యాగింగ్‌తో నేరస్తుడు ఇంటినుంచి ఏ సమయంలో బయటకు వెళ్లాడో కూడా తెలిసిపోనుండడంతో.. దాని అధారంగా ఇ లాంటి కేసులను పోలీస్ శాఖ సునా యసంగా చేధించనుంది. పాత నేరస్తుల ఇంటిని కూడా జియో ట్యాగింగ్ చేస్తుండడంతో ఎక్కడ ఏమైనా నేరం జరిగినా, లేక పరిసర ప్రాంతాల్లో ఏమైనా నేరం జరిగినా ముందుకు వీరి కదలికలను తీస్తారు. దీని ఆధారంగా పోలీస్ కాప్ వివరాలతో నేరస్తులను తక్కువ సమయంలో గుర్తిస్తారు. వివరాల సేకరణ సమయంలోనే పోలీసులు పాత నేరస్తులకు సంబంధించి ప్రతి అంశాన్నీ వదలిపెట్టడం లేదు. ప్రతిదీ సర్వేలో నమోదు చేస్తున్నారు. -
చిట్టా విప్పుతాం..
సాక్షి, మెదక్: జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం జిల్లా వ్యాప్తంగా సకల నేరస్తుల సర్వే ప్రారంభించింది. రాష్ట్ర పోలీసు శాఖ నేరాల అదుపు చేయటం, పాత నేరస్తులను వెనువెంటనే గుర్తించేందుకు వీలుగా ‘టీ పోలీస్ యాప్’కు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా పాత నేరస్తుల వివరాలను సేకరించేందుకు పోలీసు శాఖ నేరస్తుల సర్వే ప్రారంభించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు గురువారం జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలో నేరస్తుల గురించి ఆరా తీశారు. జిల్లాలోని 21 పోలీస్టేషన్ల పరిధిలో 48 పోలీసు అధికారుల బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలో నిర్వహించిన సర్వేలో డీఐజీ శివశంకర్‌రెడ్డి, మెదక్ పట్టణంలోని గొల్కొండ వీధిలో చేపట్టిన సర్వేలో ఎస్పీ చందన దీప్తి పాలుపంచుకున్నారు. సర్వేలో భాగంగా పోలీసు అధికారులు జిల్లా అంతటా 1062 మంది నేరస్తులను గుర్తించారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. 2008 నుంచి పదేళ్లలో అన్ని రకాల కేసుల్లో ప్రమేయం ఉన్న నేరస్తుల వివరాలను పోలీసు అధికారులకు సేకరించటం జరిగింది. వీటితో పాటు నేరస్తుల ఫొటోలను, వేలిముద్రలను, ఇంటివివరాలను సేకరిస్తున్నారు. గుర్తించిన నేరస్తులు ప్రస్తుతం సొంత ఇంటిలో ఉంటే వాటి ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేయనున్నారు. రాబోయే వారం రోజుల పాటు పోలీసు శాఖ అధికారులు పోలీస్టేషన్ల వారిగా నేరస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగించనున్నారు. జైలు బయట, జైలులో ఉన్న నేరస్తుల వివరాలన్నింటిని సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. సకల నేరస్తుల సర్వే ద్వారా నేరస్తులకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించి వారి కదలికలపై నిఘా పెట్టడం జరుగుతుందన్నారు. ఈ సర్వే ద్వారా నేరస్తులు ఎక్కడైనా ఎలాంటి నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించినా అడ్డుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. మెదక్ మున్సిపాలిటీ: నేరస్తుల సమగ్ర సర్వే జిల్లాలో ప్రారంభమైంది. నేరస్తులు తప్పుదోవ పట్టకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవడం కోసం ఈ సర్వే జరుగుతుందని ఎస్పీ చందనాదీప్తి అన్నారు. గురువారం మెదక్ పట్టణంలో గోల్కొండ ప్రాంతంలోని పాత నేరస్తుల వివరాలను ఆమె సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సకల నేరస్తుల సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1500 మంది పాత నేరస్తులను గుర్తించామన్నారు. పదేళ్లుగా నేరాలకు పాల్పడిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేరుగా వారి ఇళ్లకు వెళ్లి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. నేరస్తుల గృహలకు జియో ట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారు తప్పుదోవ పట్టకుండా నిరంతరం నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. పాత నేరస్తుల నుంచి వారికి సంబంధించిన ధ్రువ పత్రాలు ఆధార్, ఓటర్ ఐటీ లాంటి పత్రాలను సేకరించడం జరుగుతుందన్నారు. నేరస్తులు వ్యక్తిగత వివరాలు, భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, ప్రస్తుత చిరునామ, వివరాలను సేకరించారు. నేరస్తుల భార్యలతో మాట్లాడి వారు ఏలా చూసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ భాస్కర్, ఎస్ఐ, సీఐ రాజశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
సర్వే షురూ
మహబూబ్‌నగర్ క్రైం: దొంగతనాలు, దోపిడీలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా 53 రకాల పాల్పడేవారికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలోగతంలో గుర్తించిన నేరస్తులపై ఇప్పటివరకు నామమాత్రపు నిఘాతో సరిపెడుతుండగా.. వారు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని పలు సందర్భాల్లో వెల్లడైంది. ఇలాంటి వారిపై నిఘాను పటిష్టం చేయడానికి జిల్లావ్యాప్తంగా సకల నేరస్తుల సర్వే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చూట్టారు. సర్వేను ఎస్పీ బి.అనురాధ జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా కొంద రు నేరస్తుల వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఏను గొండ, పాత పాలమూరు, వన్‌టౌన్ సమీపంలో పలువురి వివరాలు సేకరణలో ఎస్పీ పాల్గొన్నారు. 199 బృందాలు పోలీసు అధికారులు, సిబ్బందిని సర్వే కోసం 199 బృందాలుగా ఏర్పాటుచేశారు. మహబూబ్‌నగర్ డివిజన్లో 135 బృందాలు, నారాయణపేట డివిజన్లో 64 బృందాలను ఏర్పాటుచేయగా, ఆరుగురు అధికారులు నేతృత్వం వహించారు. మొత్తం 205 మంది అధికారులు, సిబ్బంది పాల్గొని గురువారం 2,486 మంది నేరస్తుల వివరాలు సేకరించారు. సర్వే మరో వారం కొనసాగుతుందని.. ఆలోగా మొత్తం 5,495 మంది పాత నేరస్తుల వివరాలు సేకరిస్తామని ఎస్పీ అనురాధ జడ్చర్లలో మాట్లాడుతూ వెల్లడించారు. ముమ్మరంగా సర్వే పాత నేరస్తుల గుర్తింపులో భాగంగా సాగిన సకల నేరస్తుల సర్వే జిల్లా కేంద్రంలో ముమ్మరంగా సాగింది. ఏఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు స్థానిక వేపూరి గేరిలో నివాసముంటున్న పాత నేరస్తుల వివరాలు స్వయం గా సేకరించారు. అలాగే, టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ భాస్కర్, సీఐ డీవీపీ.రాజు ఆధ్వర్యాన సంజయ్‌నగర్, న్యూగంజ్, ప్రేమ్‌నగర్, మోనప్పగుట్ట, షాషాబ్‌గుట్ట తదితర ప్రాంతాల్లో 172 మంది వివరాలు సేకరించారు. అదేవిధంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐలు రామకృష్ణ, సీతయ్య ఆధ్వర్యాన పాతపాలమూరు, వేపూరిగేరి, వీరన్నపేట తదితర కాలనీల్లో 286 మంది, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ పార్థసారథి ఆధ్వర్యాన తిమ్మసానిపల్లి, కోయనగర్, ఏనుగొండ, అప్పన్నపల్లి, ఎదిర, బండమీదిపల్లి, శ్రీనివాసకాలనీ, భగిరథకాలనీ, బీకెరెడ్డి కాలనీ, మండల పరిధిలో 19 గ్రామాల్లో 246 మంది పాత నేరస్తులల వివరాలను సేకరించారు. ఇంకా జిల్లాలోని జడ్చర్లలో 400 మంది, మక్తల్‌లో 141 మంది, భూత్పూర్లో 147 మంది వివరాలను తొలి రోజు సేకరించారు. ప్రత్యేక దృష్టి పాత నేరస్తులు, అసాంఘిక శక్తులపై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పదేళ్ల నుంచి ఎలాంటి నేరాలకు పాల్పడి పోలీస్ హిస్టరీ షీట్లో ఉన్నవారిని కలిసి నేరచరిత్రతో పాటు వ్యక్తి గత సమగ్ర వివరాలు సేకరించారు. తాజా ఫొటోల తో పాటు వారిపై నమోదైన నేరాలు, శిక్షలు, ప్రస్తుత జీవన విధానం, ప్రవర్తన కుటుంబ వివరాలు సేకరించి ఈ–అప్లికేషన్ వైబ్సైట్లో పొందుపరుస్తారు. వ్యక్తిగత ఇబ్బంది ఉండదు గతంలో నేరాలు చేసి ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తులకు ఈ సర్వే వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలంలో పాత వారిలో ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడకుండా సమాచారం తీసుకుంటున్నాం. వారం రోజుల్లో జిల్లాలో సర్వే పూర్తి చేసి అందరి ఇళ్లకు జియోట్యాగింగ్ చేసి ఈ–అప్లికేషన్లో వివరాలు పొందుపరుస్తాం. తద్వారా బ్లూకోర్ట్స్, రాత్రి పూట గస్తీలు చేసే, పెట్రోలింగ్ చేసే సిబ్బందికి ఎక్కడైనా నేరం జరిగినట్లు తెలియగానే ఆ నేర స్వభావాన్ని బట్టి అలాంటి నేరాలు గతంలో చేసిన పాత నేరస్తులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం సులువవుతుంది. – బి.అనురాధ, ఎస్పీ -
ఆన్లైన్లో..మత్స్యకార్మికుల వివరాలు
కులవృత్తుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా..అర్హులకే అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మత్స్యకారుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించి సమగ్ర సర్వే చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 3 బృందాలు మత్స్యకారుల పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. అనంతరం ఈ వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. పరకాల రూరల్ : జిల్లా వ్యాప్తంగా 182 సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో 15,570 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 35 మహిళా సంఘాల్లో 1600 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సభ్యుల పూర్తి వివరాలతోపాటు గ్రామాల్లోని సంఘాలు, చెరువుల వివరాలను మత్స్య శాఖ నమోదు చేస్తోంది. మత్స్యకారుల సర్వే కోసం అధికారులు ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించారు. ఇందులో 21 కాలమ్స్‌తో మత్స్యకారుల పలు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మత్స్యకారుడి పూర్తి పేరు, తండ్రి పేరు, లింగం, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, నామినీ తదితర పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా మత్స్యకార సంఘాలకు సంబంధించి 18 కాలమ్స్‌తో రూపొందించిన ఫార్మాట్, చెరువుకు సంబంధించి 17 కాలమ్స్ ఫార్మాట్ రూపొందించి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 10 మండలాల్లో సర్వే పూర్తయ్యింది. సర్వేలో సేకరించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పథకాల పారదర్శకత కోసమే.. ప్రభుత్వం మత్స్యకారులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు పక్కదారి పట్టకుండా, ఒక్కరే పలుమార్లు లబ్ధి పొందకుండా, అర్హతలను బట్టి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈ సర్వేను చేపట్టింది. ఆన్లైన్ ప్రక్రియతో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పథకాల అమలు పారదర్శకంగా ఉంటుంది. మత్స్య శాఖ అమలుచేసే పథకాలు.. ♦ 100 శాతం సబ్సిడీతో చేపల మార్కెట్ల అభివృద్ధి ♦ 90 శాతం సబ్సిడీతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ♦ 80 శాతం సబ్సిడీతో టూరిజమ్ డెవలప్మెంట్ ♦ 75 శాతం సబ్సిడీతో చేపల తరలింపునకు వాహనాలు ♦ 75 శాతం సబ్సిడీతో వలలు, తెప్పెలు, ట్రేలు ♦ రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే కమ్యూనిటీహాల్ భవనాలకు రూ.9 లక్షల చొప్పున కేటాయింపు ♦ సభ్యత్వం ఉన్న ప్రతి మత్స్యకారుడికి రూ. 6 లక్షల ప్రమాద బీమా సౌకర్యం సర్వేతో మత్స్యకారులకు ఉపయోగం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేతో మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మత్స్యకారుడి పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో అతడి స్థితిగతులను అనుసరించి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుంది. ఈ విధానంతో శాఖ పూర్తి పారదర్శకంగా ఉండే అవకాశం ఉంది. – నరేష్కుమార్నాయుడు, ఏడీ, మత్స్యశాఖ -
ఇక నేరగాళ్లకూ సమగ్ర సర్వే
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేసే పోలీసు అధికారులకు సర్వే ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం 2014 ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే మాదిరిగా మరోసారి పోలీసు శాఖ ఆధ్వర్యంలో నేరస్తుల సమగ్ర సర్వేను ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి కమిషనరేట్ పరిధిలో పోలీసు స్టేషన్లలో ఫైళ్లకు పట్టిన దుమ్మును దులుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు చేపట్టనున్న సర్వే.. భవిష్యత్‌లో నేరాల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి 2017 డిసెంబర్ 31న జిల్లాలో పర్యటించిన సందర్భంగా పోలీసులకు దిశానిర్దేశనం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అడిషనల్ సీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివరాల సేకరణ.. గతంలో హత్యలు, కిడ్నాప్‌లు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడిన నేరస్తుల పూర్తి వివరాలను సేకరించడానికి ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ సకల నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్హెచ్ఓలు నేరస్తుల ఇళ్లకు వెళ్లి ఆధార్‌కార్డు, ఓటర్, రేషన్‌కార్డుల నంబర్లు, పాన్‌కార్డు, ఫేస్బుక్, ట్వీటర్ అకౌంట్ల వివరాలు, వేలిముద్రలు, ఇంటి నంబర్ సేకరించనున్నారు. నేరస్తుల కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలను కూడా తీసుకోనున్నారు. గతంలో పోలీస్ స్టేషన్లకు ఇచ్చిన ట్యాబుల ద్వారా ఫొటోలు తీస్తారు. ఇలా సేకరించిన వివరాలను పోలీసు శాఖకు ఉన్న డాటా బేస్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా.. దొంగతనానికి పాల్పడింది పాతవాళ్లు అయితే వెంటనే పట్టుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా.. నేరస్తుల సర్వే నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో 2008 జనవరి1 తరువాత నమోదైన వివిధ రకాల నేరాలకు సంబంధించి ఫైళ్లకు పట్టిన దుమ్మును దులిపే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అన్ని రకాల కేసుల వివరాలను ఈ నెల పదో తేదీలోపు కమిషనరేట్‌లో సమర్పించాల్సి ఉంది. దీంతో పాత ఫైళ్లను సైతం పోలీసులు మరోసారి తిరగేస్తున్నారు. ఆ తర్వాత నివేదికలను కమిషనరేట్‌కు పంపనున్నారు. నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా డీజీపీ ఆలోచనల మేరకు ప్రతి కేసుకూ సంబంధించిన వివరాలు ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
వక్ఫ్ ఆదాయం పెంపు కోసం సర్వే
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ ఆస్తుల అద్దెలు, లీజులపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సీఈవోను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వక్ఫ్ బోర్డుపై సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెలు, లీజులు చాలా తక్కువగా వసూలవుతున్నాయని, మరో మారు సర్వే నిర్వహించి మార్కెట్ ధరల ప్రకారం నిర్ణయించాలని సూచించారు. రెవెన్యూ సర్వే కొనసాగుతున్న దృష్ట్యా వక్ఫ్ భూముల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వక్ఫ్ సర్వే కమిషన్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో వక్ఫ్ సర్వే కమిషన్ సమర్పించిన నివేదికను మరోమారు పరిశీలించాలన్నారు. అలాగే ప్రభుత్వం కేటాయించే గ్రాంట్ ఇన్ ఎయిడ్పై సమీక్షించారు. ఈ సమావేశంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మైనారిటీ సంక్షేమ వ్యవహారాల సలహాదారుడు ఏకే ఖాన్, వక్ఫ్‌బోర్డు సీఈవో ఫారుఖీ తదితరులు పాల్గొన్నారు. -
ఇక రబీయే దిక్కు!
► రాష్ట్రంలో దారుణంగా ఖరీఫ్ పంటల పరిస్థితి ► ముసురుకుంటున్న తీవ్ర కరువు పరిస్థితులు ► ఇప్పటికే నెల రోజులుగా జాడలేని వర్షాలు ► ముందస్తు రబీకి వెళ్లక తప్పదంటున్న వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ► రైతులను, ఖరీఫ్ పంటలను వదిలేసి సమగ్ర సర్వేపైనే అధికారుల దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాలు సరిగా కురవక పంటలు ఎండిపోతున్నాయి. ఇలా కళ్లముందే పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పం టల పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా వ్యవసా యాధికారులు ఏమీ పట్టనట్టు ఉండిపోతు న్నారు. కేవలం సమగ్ర రైతు సర్వేపైనే దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. ఖరీఫ్ పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ముందస్తు రబీకి వెళ్లాలని.. ఇప్పటికే పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురిసే పరిస్థితి లేకపోవడంతో వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దుర్భరంగా పరిస్థితి జూలైలో 40% లోటు వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల దాదాపు నెల రోజులుగా వర్షాల జాడలేదు. దీంతో డ్రైస్పెల్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 జిల్లాల్లో లోటు నమోదైంది. మరో 18 జిల్లాల్లో సాధారణంగా, మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 214 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. దీంతో ప్రస్తుతం సాగులో ఉన్న 82.8 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 44 లక్షల ఎకరాల్లో పత్తి పంట ఎండిపోయే దశలో ఉందని వ్యవ సాయ శాఖ అధికారులే చెబుతున్నారు. డ్రైస్పెల్ కారణంగా అనేక జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టింది. 43 రోజులకు మించియ వర్షాలు పడకపోతే∙తీవ్ర కరువు ప్రాంతాలుగా నిర్ధారి స్తారు. ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాగే మరో 10 రోజులు కొనసాగితే తీవ్ర కరువు ముంచెత్తనుంది. పట్టించుకోని అధికారులు: అయితే, వ్యవసాయ శాఖలో ఏమాత్రం కదలిక కనిపించడం లేదు. ఖరీఫ్ పంటల వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లాలకు వెళ్లాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ దాటి కాలు బయటపెట్టడం లేదు. పైగా రైతు సమగ్ర సర్వే అంటూ గడిపేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా సమావేశాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. చివరికి మండల వ్యవసాయాధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండటం లేదని.. రైతు సమగ్ర సర్వే వివరాల నమోదు పనిలోనే ఉంటున్నారని పేర్కొంటున్నారు. ముందస్తు తప్పదా? ఖరీఫ్ సాగు కష్టంలో పడడంతో వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యా మ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎండిపోయే దశలో ఉన్న పంటలపై 2 శాతం యూరియా స్ప్రే చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. పత్తి, వరి విషయంలో కొద్దిరోజులు వేచి చూడాలని.. నెలాఖరు వరకు కూడా వర్షాలు కురవక, పంటల పరిస్థితి కుదుటపడకుంటే ముందస్తు రబీకి వెళ్లడమే దిక్కు అని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా రబీ సాగు అక్టోబర్ నుంచి మొదలవుతుంది. -
లెక్క తేలింది..
► ముగిసిన రైతు సమగ్ర సర్వే ► జిల్లాలో 81.5 శాతం నమోదు ► పూర్తి కాని లక్ష్యం.. ► సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు ► నమోదు చేసుకోనివారికి నష్టమే జిల్లాలో రైతుల సంఖ్య 1,32,268 నమోదు చేసుకున్న రైతులు 1,07,888 నమోదు శాతం 81.57 మండలాలు 18 గ్రామాలు 510 సర్వేలో పాల్గొన్న సిబ్బంది 109 ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే గురువారం ముగిసింది. జిల్లాలో కొంతమంది రైతులు ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతీ అన్నదాతకు ఎకరానికి రూ.4 వేలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి ఈ నెల 15 వరకు రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు వ్యవసాయ అధికారులు ఇంటింటా తిరుగుతూ సర్వే చేపట్టారు. ఈ నెల 10 వరకు గడువు ముగిసినప్పటికీ సర్వే పూర్తి స్థాయిలో కాకపోవడంతో ఐదు రోజులపాటు గడువు పెంచింది. అయినా ఒక శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. జిల్లాలో 1,32,268 మంది రైతులు ఉండగా, ఇందులో 1,07,888 మంది సర్వేలో నమోదు చేసుకున్నారు. ఇంకా జిల్లాలో 24,380 మంది రైతులు సర్వే చేయించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 81.57 శాతం నమోదు కాగా, 18.43 శాతం సర్వే చేసుకోలేదు. కొంతమంది రైతులు ఉపాధి రీత్యా వారి సొంత గ్రామాలను వదిలి పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నందున వారి వివరాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. లెక్క పక్కా.. రైతుల సమగ్ర సర్వేతో భూములు సాగు విస్తీర్ణం పక్కాగా తెలుస్తోంది. గతంలో రైతులు ఎక్కడ, ఏ పంటలు, ఎంత మేరకు వేశారనేది రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పూర్తి స్థాయిలో సమాచారం ఉండేది కాదు. క్షేత్రస్థాయిలో వేసిన పంటలకు అధికారుల లెక్కలకు ఎలాంటి పొంతన ఉండేది కాదు. ప్రభుత్వం ప్రతి ఎకరం సాగుకు రూ.4 వేలు ఇస్తున్నట్లు ప్రకటించడంతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. మండలాల్లో ఏవోతోపాటు ఏఈవో అందుబాటులో ఉండడంతో రైతుల వివరాలు సమగ్రంగా సేకరించారు. సర్వేలో 79 మంది ఏఈవోలు, 18 మంది ఏవోలు, ఆరుగురు హెచ్‌ఈవోలు, ఆరుగురు ఆత్మ సిబ్బంది పాల్గొన్నారు. 24 అంశాలతో వివరాలు.. ప్రభుత్వ ఆదేశాలతో రైతుల సమగ్ర సర్వేను అధికారులు పకడ్బందీగా చేపట్టారు. వ్యవసాయ శాఖ రూపొందించిన నమూనా పత్రంలో రైతులకు సంబంధించిన 24 అంశాలు ఉన్నాయి. నమూనా ఆధారంగా రైతుల వివరాలను నమోదు చేశారు. ఇందులో రైతు పేరు, తండ్రి పేరు, సామాజిక వర్గం, ఆధార్ కార్డు, వరుస సంఖ్య, బ్యాంక్ ఖాతా, భూముల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, నీటి సౌకర్యం ద్వారా భూమి, వర్షాధారం కింద సాగయ్యే భూమి సాగు చేసే పంటల రకాల వివరాలు, ఫోన్ నంబరుతో సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలను ఏఈవోలు తమ గ్రామాల పరిధిలో కంప్యూటర్లో నమోదు చేశారు. ప్రస్తుతం సేకరించిన వివరాలతోనే ప్రభుత్వం అందించే రాయితీలు వర్తించే వీలుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సర్వేలో నమోదు చేసుకోనివారికి ప్రభుత్వం నుంచి రైతులకు అందజేసే సంక్షేమ పథకాలు, రాయితీ రుణాలు వర్తించబోవని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. గురువారంతో గడువు ముగిసింది. 10వ తేదీ వరకు 80 శాతం సర్వే పూర్తి కాగా, ఐదు రోజులు గడువు పెంచినప్పటికీ ఒక శాతం కంటే ఎక్కువ రైతులకు సంబంధించిన వివరాలు లభ్య కాలేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో ఉండే భూ యాజమానులు వివరాలు నమోదు చేసుకోలేదు. గడువు దాటితే తామేమీ చేయలేమని వ్యవసాయ శాఖ అధికారులు గతంలో చెప్పినప్పటికీ ఇంకా కొంతమంది సమగ్ర భూ సర్వేలో వివరాలు నమోదు చేసుకోలేదు. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి రూ.4 వేలు సాగు ఖర్చుకు ఇస్తుంది. ఖరీఫ్, రబీ పంటలు రెండింటికీ ఏడాదికి రూ.8 వేలు రైతు ఖాతాల్లో జమ కానున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో.. జిల్లాలో గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు పట్టాలు లేవు. దీంతో సమగ్ర సర్వేలో నమోదు చేసుకోలేదు. సర్వే ఆధారంగా ప్రభుత్వం అందజేసే రూ.4వేలు అందవని గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఎళ్లుగా గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న చాలా మంది గిరిజనుల భూములకు కూడా పట్టాలు లేవు. దీంతో వారి పేర్లు కూడా నమోదు చేసుకోలేదు. జిల్లాలో దాదాపు 10 వేల మందికిపైగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. సమగ్ర సర్వే ముగిసింది జిల్లాలో 94 క్లస్టర్లో 510 రెవెన్యూ గ్రామాల్లో లక్షా 7,888 మంది రైతులు సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నారు. 81.57 శాతం నమోదైంది. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు జారీ చేస్తాం. సర్వే చేయించుకోని రైతులకు ప్రభుత్వం నుంచి అందజేసే రాయితీ, తదితర పథకాలు వర్తించవు. జిల్లాలో అత్య«ధికంగా బోథ్ మండలంలో 89 శాతం సర్వే చేసుకోగా, ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 63 శాతం నమోదు అయ్యింది. – రమేష్, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి -
వలస వెళ్లినవారికి సమాచారం అందించాలి
మెదక్‌రూరల్: రైతుల సంక్షేమం కోసం చేస్తున్న సమగ్ర సర్వేకు రైతులతో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి రెబెల్‌సన్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్ మండలం రాజ్‌పల్లి, బోల్లారం, మగ్దూంపూర్‌లో రైతు సమగ్రసర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర సర్వేకు గడువు ముగుస్తోందని, సమచారం తెలియని రైతులకు సర్వే సమాచారం తెలియజేయాలని సూచించారు. అలాగే ఖరీఫ్‌లో వరితోపాటు పప్పుదినుసులు, కూరగాయల పంటలను రైతులు సాగుచేయాలన్నారు. పంట మార్పిడి ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు శేఖర్, సందీప్, కీర్తన, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పలువురు రైతులు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో రైతు సమగ్ర సర్వే కొనసాగుతోంది. మంగళవారం మండల పరి«ధిలోని బద్దారంలో అధికారులు రైతుల వివరాలు సేకరించారు. మండల రైతుల ఆధార్, పాస్‌బుక్, బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నామని ఏఓ రత్న తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓలు సావిత్రి, స్వాతి, వీఆర్వోలు, వీసీఓలు తదితరులున్నారు. టేక్మాల్(మెదక్): రైతు సమగ్ర సర్వేకు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని జిల్లా వ్యవసాయాధికారి నాగమణి విజ్ఞప్తిచేశారు.మంగళవారం మండలంలోని దాదాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను పర్యవేక్షించారు. సర్వేలో సర్పంచ్ లక్ష్మీ, ఏఈఓ సునీల్, వీఆర్ఏ శంకర్, నాయకులు విక్రం తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఏఈఓ శోభరాణి ఆధ్వర్యంలో రైతు సమగ్ర సర్వే జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 10వ తేదీ వరకు సర్వే జరుగుతుందని తెలిపారు. కాగా వలస వెళ్లిన రైతులు తమ కుటుంబంలో ఒకరు స్వగ్రామానికి వచ్చి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. -
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై సమగ్ర సర్వే
జి.సిగడాం: జిల్లాలోని ఉద్దాన తీర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులపై పూర్తి స్థాయిలో సర్వే చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు వెల్లడించారు. స్థానిక 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఉద్దానం తీరప్రాంతాల్లో 7 మండలాల్లో 114 గ్రామాల్లో సుమారుగా 1.30లక్షల మందికి కిడ్నీ వ్యాధులపై సమగ్ర సర్వే జరుపుతామన్నారు. ఇంతవరకు 15 బృందాలతో 77 గ్రామాల్లో 47 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. జిల్లాలోని రిమ్స్ కేంద్రంలో ఉచితంగా డెంగీ తనిఖీ, రక్తఫలకికల (ప్లేట్లెట్స్) నమూనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలో రోగులకు ఉచితంగా డెంగీ పరీక్ష చేస్తామని, అవసరమైన వారికి ప్లేట్లెట్స్ అందిస్తామని తిరుపతిరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా రాకుండా గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చామని వివరించారు. కొన్ని పంచాయతీల్లో తాగునీటిలో ఫ్లోరిన్ ఉండడంతో.. వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ రాకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం రిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. జ్వరాల కోసం జిల్లాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. రాజాం, పాలకొండ, టెక్కలి, పలాస, శ్రీకాకుళం రిమ్స్ ఆరోగ్యకేంద్రాల్లో 24 గంటలు ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేశామని తిరుపతిరావు తెలిపారు. వేసవిలో ఎండలు అధికంగా ఉన్నాయని, వీటి అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయనతోపాటు వైద్యఅధికారులు ముంజేటి కోటేశ్వరరావు, శివప్రసాద్, గౌతమి ప్రియాంకలతోపాటు సిబ్బంది ఉన్నారు. -
అటవీ అభివృద్ధి కోసం సమగ్ర సర్వే
* శాటిలైట్ ద్వారా గుర్తించిన * అటవీ ప్రాంతాల్లో వివరాల సేకరణ * పశ్చిమ డివిజన్లో 224 పాయింట్లలో సిబ్బంది సర్వే బి.కొత్తకోట: పదేళ్ల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కోసం చిత్తూరు పశ్చిమ అటవీ డివిజన్ పరిధిలో సోమవారం నుంచి సర్వే ప్రారంభమైంది. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అడవుల స్థితిగతులపై సర్వే నిర్వహించి నివేదికలు పంపుతారు. ఇందులో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలతో అడవులు అభివృద్ధి చెందాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. శాటిలైట్ చెప్పిన చోటనే సర్వే అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేను అధికారులు మార్గనిర్దేశం చేయడంలేదు. హైదరాబాద్ నుంచి శాటిలైట్ పంపిన చిత్రాల ఆధారంగా సర్వే ప్రాంతం నిర్ణయించారు. సర్వే కోసం గుర్తించిన పాయింట్ల వద్దకు చేరుకొన్న అటవీ సిబ్బంది వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 30 చదరపు మీటర్ల వైశాల్యంలో అటవీప్రాంతం ఎంత, ఏ రకాల వృక్షాలు ఉన్నాయి, ఔషధ మొక్క లు ఉన్నాయా, బండ, రాయి ఉందా, నీటి ప్రవాహాలు ఉన్నాయా అన్న వివరాలను నమోదు చేస్తారు. ఈ సర్వే కోసం అడవుల్లో 224 పాయింట్లను శాటిలైట్ గుర్తించింది. దీని వివరాలు అటవీ శాఖ అధికారులకు అందించడంతో క్షేత్రస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు రేంజ్‌ల పరిధిలోని బీట్లలో ఈ సర్వే చేస్తున్నారు. పశ్చిమ డీఎఫ్‌వో టి.చక్రపాణి మంగళవారం ఐరాల మండలంలోని నాంపల్లె బీటులో సాగుతున్న సర్వేను పరిశీలించారు. -
పాత నేరస్తుల మీద సర్వే
పాత నేరస్తులపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సర్వేలో 2011 నుంచి ఇప్పటి వరకూ అరెస్టైన పాత నేరస్తుల పూర్తి వివరాలు సేకరించ నున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 11,500 మంది పాత నేరస్తుల వివరాలు ఉన్నాయని.. తెలిపారు. సర్వే కోసం హైదరాబాద్ లో ఇంటింటి సర్వే చేయనున్నట్లు వివరించారు. స్థానిక పోలీసులకు నేరస్తుల కదలికలపై అవగాహన కల్పించేందుకే సర్వే చేస్తున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సర్వే వల్ల హైదరాబాద్ లో నేరాలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని అన్నారు. -
రాష్ట్రం మారినా రాత మారలే..
ఇదీ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల పరిస్థితి * వలస వాదులపై కనీస దృష్టి కేంద్రీకరించని ప్రభుత్వం * అ‘సమగ్ర సర్వే’తోనూ దక్కని ప్రయోజనం సాక్షి, ముంబై: దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముంబైలోని అనేక మంది తెలంగాణ ప్రజలు సైతం తమవంతు పాత్ర పోషించారు. కాని ఎవ్వరికీ పైసా ప్రయోజనం ఒరగలేదు. రాష్ట్రం వచ్చిందన్న సంతోషం తప్పిస్తే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. రాష్ట్ర అవతరణ అనంతరం అధికారాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తెలంగాణ భవన్ ఏర్పాటు, వలసవాదుల కోసం పథకాలు, రైలు, బస్సు సేవలువంటి వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కార్మిక సమస్యలు అలానే ఉండిపోయాయి. రేషన్‌కార్డులు, పెన్షన్లు వంటి విషయాల్లో తెలంగాణకు చెందిన ముంబైలోని కూలీలకు దక్కిందంటూ ఏమీలేదు. అసమగ్ర సర్వే.. మరోవైపు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి ముంబై వాసులను నిరాశపరిచింది. పొట్టచేతపట్టుకుని ముంబైకి వచ్చిన అనేక మంది తెలంగాణ వలసబిడ్డలు ఉన్న ఫలంగా అప్పులు చేసి స్వగ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. తాము తెలంగాణ వారిమేనని పేర్లు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్లారు. కాని చాలా మంది పేర్లు ఇప్పటికీ నమోదు కాలేదంటే అతిశయోక్తికాదు. నాలుగు నెలలు ఇక్కడ నాలుగు నెలలు అక్కడ ఉండే కూలీలు ప్రధానంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లోనూ మహారాష్ట్రలోని వారు ఓటు వినియోగించుకుని ప్రభుత్వ ఏర్పాటులో భాగమయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం... ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలోని వారిలానే ముంబైలోని వలస ప్రజలు కూడా తమవంతు కృషి చేశారు. అనేక కార్యక్రమాలతో తెలంగాణవాదులను చైతన్యపరిచారు. గోరేగావ్‌లో 2007 జనవరిలో జరిగిన తెలంగాణ ధూమ్‌ధామ్ కార్యక్రమంతో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. 2008లో దాన్ని మరింత ఉధృతం చేశారు. ఇదే ఏడాది తెలంగాణ వాదులు అనేక సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు. ముంబై టీఆర్ఎస్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ముంబై తెలంగాణ బహుజన ఫోరం క్రియాశీల పోషించింది. ఉద్యమాన్ని కలసి చేయాలనే ఉద్దేశంతో తెలుగు సంఘాలన్నీ ఏకమై ‘తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక’, ‘ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ’గా ఏర్పాటయ్యాయి. ఆజాద్ మైదానంలో నిరాహారదీక్షలు చేపట్టారు. గోరేగావ్‌లో 2013 నవంబరులో జరిగిన తెలంగాణ సాధన సభ ఓ కొత్త ఊపునిచ్చింది. మా కష్టాలు మాత్రం తీరలేదు ‘తెలంగాణ ఏర్పడి ఏడాది అవుతోందన్న సంతోషం ఉంది. కాని మా కష్టాలు మాత్రం తీరడం లేదు. మేం తూర్పు భాండూప్‌లోని శ్యాంనగర్ మురికివాడలో నివసిస్తున్నాం. మాతోపాటు ఇక్కడ సుమారు 100 పైగా తెలుగువారి ఇళ్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన చాలామంది పొట్టచేతపట్టుకుని ముంబైకి వచ్చినవారే. గత మూడు దశాబ్దాలకుపైగా భాండూప్ శ్యాంనగర్‌లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాం. చాలా సార్లు మా గుడిసెలను కూల్చివేశారు. అన్ని ఆధారాలున్నా మాకు అన్యాయం జరుగుతోంది. ముంబైలోని తెలుగు సంఘాలు, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు మా గోడును వినిపించుకోవాలి. - ముస్తఫా, మహబూబ్‌నగర్ సంతలో సరుకుల లిస్టులా... ‘తెలంగాణ ఏర్పడితే ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ఇక వలస వెళ్లే వారే ఉండరని, వలసలు వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చి స్వస్థలాల్లో ఉపాధి పొందుతూ బతకొచ్చని ఎంతగానో ఊదరగొట్టారు. తర్వాత అవి జరగాలంటే సమగ్ర సర్వేలో కుటుంబ సభ్యులంతా పాల్గొనాలన్నారు. అందరం అన్ని సర్దుకొని ఊరికి పోయాం. సంతలో కొనుగోలు చేసే సరుకుల లిస్ట్ మాదిరిగా అధికారులు రాసుకున్నారు. అంతకు మినహా ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూర లేదు. పూర్వ ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదు. ప్రజల పాట్లు ఎప్పటి లానే ఉన్నాయి.’ - దాసరి లక్ష్మి నారాయణ, కరీంనగర్ -
సమగ్ర సర్వేతో భూవివాదాలకు చెక్
ఆలమూరు : భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా సమగ్ర భూ సర్వేను చేపట్టేందుకు రాష్ట్రం ప్రభుత్వం నేషనల్ లాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) ప్రవేశపెడుతున్నట్టు రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ ఆఫ్ సర్వే (ఆర్డీడీ) కె.వెంకటేశ్వరరావు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే జరగక రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రాథమిక సర్వే నెల రోజుల్లో పూర్తవుతుందన్నారు. అనంతరం సేకరించిన వివరాలతో జిల్లా నుంచి డివిజన్ స్థాయి వరకూ సమగ్ర వివరాలతో కూడిన సర్వే జరిపేందుకు సుమారు ఐదేళ్లు పడుతుందన్నారు. ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ పూర్తయితే భూక్రయవిక్రయాల్లో పటిష్ట విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఏవిధమైన పొరపాట్లకు తావు లేకుండా సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ పక్రియ సంయుక్తంగా అమలు జరుగుతుందన్నారు. తమ శాఖ కాకినాడ డివిజన్లోని ఆరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న 92 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామన్నారు. రాజధాని భూసేకరణకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 500 మంది లెసైన్స్డ్ సర్వేయర్లను వినియోగించే ఆలోచన ఉందన్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ సేకరించిన ‘వెబ్ ల్యాండ్ ప్రోగ్రామ్’ వివరాల స్కానింగ్ జరిగిందని, త్వరలోనే వాటిని డిజిటలైజేషన్ చేయన్నామని చెప్పారు. భూసర్వేకు మార్గదర్శకాలు రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు మార్గదర్శకాలు నిర్దేశించినట్టు ఆర్డీడీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక్కొక్క మండల సర్వేయర్ రోజుకు ఏడుసబ్ డివిజన్ల చొప్పున నెలకు నాలుగు గ్రామాల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, పోరంబోకు స్థలాల వివరాల నమోదు, భూసేకరణ, పోరంబోకు భూముల బదలాయింపు, పట్టాల సబ్ డివిజన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర భూసర్వే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. -
నత్తనడకన ‘ఆహార భద్రత’!
దరఖాస్తుల్లో పది శాతమే పూర్తయిన పరిశీలన పింఛన్ దరఖాస్తుల పరిస్థితీ అంతే భారీగా దరఖాస్తులు రావడం వల్లే ఆలస్యమవుతోందంటున్న అధికారులు హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు, పింఛన్ల మంజూరు కోసం స్వీకరించిన దర ఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించగా... ఇప్పటివరకు ఆహార భద్రత కు సంబంధించి పది శాతం, పింఛన్‌కు సం బంధించి 20 శాతం దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. అయితే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పరిశీలన ఆలస్యమవుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో... అర్హులతో పాటు అనర్హులు కూడా భారీ సంఖ్యలో వీటికోసం దరఖాస్తులు చేసుకున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముందని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సంతృప్త స్థాయిలోనే 31.67 లక్షల పెన్షన్లు ఉండగా... తాజాగా వచ్చిన దరఖాస్తులు 37.94 లక్షలను మించిపోయాయని అధికారవర్గాలు తెలిపాయి. అదే విధంగా ప్రస్తుతమున్న రేషన్‌కార్డుల్లో లక్షల సంఖ్యలో బోగస్ అని ప్రభుత్వం భావిస్తుండగా... తాజా గా ఆహార భద్రత కార్డుల కోసం 92.73 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయని పేర్కొన్నాయి. ఇందులోనూ శనివారం నాటికి 8.33 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నవంబర్ 8వ తేదీన కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. అది సాధ్యమయ్యే అవకాశం కనిపించకపోవడంతో నవంబర్ 20వ తేదీకి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహా ర భద్రత దరఖాస్తుల్లో 30 లక్షలకుపైగా.. పింఛన్ దరఖాస్తుల్లోనూ సగం వరకూ తిరస్కరణకు గురయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ‘సమగ్ర సర్వే’ ఆధారంగా చూస్తే.. తెలంగాణలో పింఛన్లు ఇరవై లక్షలకు మించరాదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా వచ్చేనెల మాత్రమే పెన్షన్‌దారులకు నేరుగా నగదు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లను పూర్తిగా పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర పోస్టుమాస్టర్ జనరల్ సంధ్యారాణి, ఇతర అధికారులతో సంప్రదింపులు జరిపింది.