Department of Energy
-
రైతుల పొలాల్లో సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పంట పొలాల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్) పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజుల పాటు సౌరవిద్యుత్ ఉత్పాదనకు అనుకూలత ఉంది. చిన్న చిన్న ప్లాంట్లతో.. పీఎం కుసుమ్ పథకం కింద 2026 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 30,800 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంట్లను రైతుల పంట పొలాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పొలాల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నా.. రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేసింది.త్వరలో సబ్స్టేషన్ల వారీగా నోటిఫికేషన్ రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్ల వారీగా ఎంత స్థాపిత సామర్థ్యంతో కొత్త సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయో వెల్లడిస్తూ త్వరలో డిస్కంలు నోటిఫికేషన్ ఇస్తాయి. ఆయా సామర్థ్యం మేరకు సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు రైతుల నుంచి రెడ్కో దరఖాస్తులను స్వీకరించనుంది. రైతులు వ్యక్తిగతంగా, సంఘాలుగా, సహకార సంఘాలుగా ఏర్పడి వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళా గ్రూపులకు ప్రాధాన్యత స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), మండల సమాఖ్యలు కూడా రైతుల నుంచి పొలాలను లీజుకు తీసుకుని సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. ప్లాంట్ల మంజూరులో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవకాశమిచ్చి సంఘాల మహిళలను కోటీశ్వరులు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలు రైతు కుటుంబాల వారేకావడంతో.. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు రైతుల చేతుల్లోనే ఉండనుంది. ఎస్‌హెచ్‌జీలకు పావలా వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఒక మెగావాట్ ప్లాంట్ నుంచి ఏడాదికి సగటున 15 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అంటే సుమారు రూ.45 లక్షల ఆదాయం వస్తుంది. మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆరు ఎకరాల స్థలం, రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ మేరకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి. కరెంటు కొననున్న డిస్కంలు రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకునే సౌర విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తాయి. ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 ధరను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇప్పటికే ఖరారు చేసింది. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో రైతులు తమ వ్యవసాయ అవసరాలకు వాడుకోగా.. మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించవచ్చు. డిస్కంలు ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి సగటున యూనిట్‌కు రూ.2.58 ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. రైతులకు మాత్రం కాస్త ఎక్కువగా యూనిట్‌కు రూ.3.13 ధర చెల్లించనున్నాయి. -
జలకళ ఉన్నా హై‘డల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండటంతో రోజూ లక్షల క్యూసెక్కుల వరదను కిందకు విడుదల చేస్తున్నా పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకుండా ఏడాదిగా తాత్సారం చేయడంతో రోజుకు రూ. 4 కోట్ల విలువ చేసే 7.93 మిలియన్ యూనిట్ల జలవిద్యుదుత్పత్తికి గండిపడుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా సత్వర నిర్ణయాలు తీసుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) గత, ప్రస్తుత సీఎండీలు, డైరెక్టర్లు తీవ్ర తాత్సారం చేయడం, సకాలంలో టెండర్లు నిర్వహించకపోవడంతో సంస్థకు భారీ ఆదాయనష్టం కలుగుతోంది. సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తే నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకూ మరమ్మతులు పూర్తయ్యేవని జెన్కో అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు కనీసం నెల రోజులు వరద కొనసాగినా ఈ ఏడాది రూ. 120 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను జెన్కో నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా మూడు నెలలు వరద కొనసాగితే రూ. 300 కోట్ల నుంచి రూ. 420 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను నష్టపోనుంది. 330.8 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తికి గండి.. రాష్ట్రంలో మొత్తం 2,441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలుండగా మరమ్మతులకు నోచుకోక ఏడాదికిపైగా 330.8 మెగావాట్ల సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ జూరాల, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో కనీసం ఒక్కో యూనిట్ పనిచేయడం లేదు. వర్షాలు, వరదలు మొదలవడంతో ఇప్పుడు టెండర్లు పిలిచినా ఇప్పట్లో మరమ్మతులు నిర్వహించే పరిస్థితి లేదు. వర్షాకాలం ముగిశాకే పనులు చేసేందుకు వీలు కలగనుంది. రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాలు ఏటా కనీసం 3,000 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా వాటికి మరమ్మతులు జరగక లక్ష్యం నెరవేరట్లేదు. విద్యుత్ సంస్థలపై పర్యవేక్షణ లోపం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శినే జెన్కో, ట్రాన్స్‌కోకు ఇన్చార్జి సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించడంతో విద్యుత్ సంస్థలపై పూర్తి పర్యవేక్షణ లేకుండాపోయింది. ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ 15 రోజులపాటు సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆయన సచివాలయం నుంచే పనిచేస్తుండటంతో విద్యుత్‌సౌధలో రోజువారీ పాలనా వ్యవహారాల పర్యవేక్షణ గాడి తప్పిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు నోచుకోని జలవిద్యుత్ కేంద్రాల యూనిట్లు ఇవే.. – శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 900 (6150) మెగావాట్లు కాగా అందులో 150 మెగావాట్ల సామర్థ్యంగల 4వ యూనిట్ గతేడాది ఆగస్టు 17 నుంచి పనిచేయట్లేదు. స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతోపాటు రోటర్ పోల్‌లో ఫాల్ట్ రాగా ఏడాదిగా మరమ్మతులు చేయలేదు. – నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 815.6 (1110 + 7100.8) మెగావాట్లు కాగా అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యంగల రెండో యూనిట్‌కు సంబంధించిన రోటర్ స్పైడర్ ఆర్మ్‌కు పగుళ్లు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 10 నుంచి అది వినియోగంలో లేదు. జపాన్ నుంచి ఇంజనీర్లు వస్తేనే దానికి మరమ్మతులు జరుగుతాయని 9 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. – ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (639) మెగావాట్లు కాగా అందులో 39 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్లో స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతో గతేడాది ఆగస్టు 7 నుంచి వినియోగంలో లేదు. – దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (640) మెగావాట్లు కాగా అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకవుతోంది. అన్ని యూనిట్లలో నిరంతర విద్యుదుత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదు. – పులిచింతల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 120 (430) మెగావాట్లు కాగా 2022 అక్టోబర్ 1 నుంచి 30 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్ నిరుపయోగంగా మారింది. దాదాపుగా రెండేళ్లు గడుస్తున్నా చెడిపోయిన రన్నర్ బ్లేడ్‌ను మార్చలేదు. – నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం 10 (25) మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా మరమ్మతులు చేయకపోవడంతో 2022 నవంబర్ 9 నుంచి మొత్తం విద్యుత్ కేంద్రం నిరుపయోగంగా ఉంది. – పాలేరు మినీ హైడ్రో పవర్ స్టేషన్ సామర్థ్యం 2 (12) మెగావాట్లు కాగా మెగావాట్ల సామర్థ్యంగల ఒకటో యూనిట్ గత మార్చి 6 నుంచి నిరుపయోగంగా ఉంది. రన్నర్ హబ్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది. -
పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ. 10వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.ఇందులో మూసీ రివర్ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్లో కేవలం హైదరాబాద్ అభివృద్ధికే రూ. 10వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేప థ్యంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.ఇతర జిల్లాల్లోని పురపాలికలకు...హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ. 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.అటవీశాఖకు రూ.1,063 కోట్లుహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్ ఫండ్ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.ఇంధన శాఖకు రూ.16,410 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటా యించగా, 2024–25 బడ్జెట్లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.ఉదయ్ పథకం కింద రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోంది. -
ఇంధన శాఖపై ‘కూటమి’ కన్ను!
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకోవడంతో అప్పులు తీర్చుకుని ఆదాయం బాట పట్టిన ఇంధన శాఖపై టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల కన్ను పడింది. డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలో కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకొని, కోట్లాది రూపాయలు దండుకొనేందుకు కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పెద్ద కుతంత్రానికే తెరలేపారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నియమితులైనవారిని రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ శాఖలను జేబులు నింపుకొనేందుకు వాడుకున్నారో ఇప్పుడూ అదే తీరులో చెలరేగుతున్నారు. వారి ధన దాహానికి డైరెక్టర్ నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కూటమి పెద్దల బలవంతంతో వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొందరిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి చేత రాజీనామా చేయించారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోని రాజు, మరికొందరిని విధుల నుంచి తప్పించారు. డైరెక్టర్లనూ రాజీనామా చేయాలని ఇటీవల హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి మరోసారి గట్టిగా చెప్పడంతో ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, మూడు డిస్కంలలోని 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా చేశారు. వారి బాధ్యతలను తాత్కాలికంగా సీజీఎంలకు అప్పగిస్తూ డిస్కంల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన పోస్టుల్లో కొన్నింటికి రూ. కోట్లలో బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కొన్ని పోస్టుల్లో అనుయాయులను నియమించుకొని వారి ద్వారా కోట్లు దండుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల అధిపతులను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం.10 మంది డైరెక్టర్ల రాజీనామా ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీ, డిస్కంల సీఎండీలకు 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా లేఖలను అందజేశారు. వాటిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు పంపగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాజీనామా చేసిన డైరెక్టర్లు » టి.వీరభద్రరెడ్డి (ఫైనాన్స్– ఏపీ ట్రాన్స్‌కో) » డి.ఎస్.జి.ఎస్.ఎస్. బాబ్జి (థర్మల్ – ఏపీ జెన్కో) » సయ్యద్ రఫి (హెచ్ఆర్, ఐఆర్ – ఏపీ జెన్కో) » ఎంవీవీ సత్యనారాయణ (హైడల్ – ఏపీ జెన్కో) » సి.శ్రీనివాసమూర్తి (ఆపరేషన్స్ – ఏపీఈపీడీసీఎల్) » ఎ.వి.వి.సూర్యప్రతాప్ (ప్రాజెక్ట్స్ – ఏపీఈపీడీసీఎల్) » వి. బ్రహా్మనందరెడ్డి (ఫైనాన్స్ – ఏపీసీపీడీసీఎల్) » బి. జయభారతరావు (టెక్నికల్ – ఏపీసీపీడీసీఎల్) » టి. వనజ (ప్రాజెక్ట్స్ – ఏపీసీపీడీసీఎల్) » కె.శివప్రసాదరెడ్డి (ప్రాజెక్ట్స్ – ఏపీఎస్పీడీసీఎల్) -
కేసీఆర్‌కు గత ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ: జస్టిస్ నరసింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంలో పాత్రపై మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు గత ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ సహా మొత్తం 25 మంది అధికారులు, అనధికారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శులైన సురేష్ చందా, ఎస్కే జోషీ, అరవింద్కుమార్లతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలను విచారించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి మంగళవారం బీఆర్కేఆర్ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు ‘విద్యుత్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల పరిశీలనలో మీ పాత్రను గుర్తించామని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ అందరికీ నోటీసులు ఇచ్చాం. కేసీఆర్ మినహా నోటీసులు అందుకున్న మిగతా వారంతా గడువులోగా తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ అందజేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నానని, జూలై 31 వరకు గడువు పొడిగించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా, జూన్ 15 వరకు కమిషన్ గడువు పొడిగించింది. అయితే ఇప్పటికీ కేసీఆర్ నుంచి వివరణ అందలేదు. కొందరి వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో అదనపు సమాచారం కోరు తూ మళ్లీ నోటీసులు జారీ చేశాం. నిర్ణయాల్లో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఆయనకు నోటీసులు జారీ చేయలేదు..’ అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఎవరు నిర్ణయం తీసుకున్నారో పరిశీలిస్తున్నాం ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాల్లో నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై విచారణ నిర్వహిస్తున్నాం. నిర్ణయాల్లో పాత్రలేని అధికారులు ఒక్కొక్కరిని తప్పించడం (ఎలిమినేషన్) ద్వారా అసలు నిర్ణయం తీసుకున్న వారెవరో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు అంశాల్లోనూ నాటి ప్రభుత్వం నేరుగా నిర్ణయాలు తీసుకుందని జెన్కో, ఇతర విద్యుత్ సంస్థల పాత్ర లేదని ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం అంటే.. నిర్ణయం తీసుకుంది ఎవరు? అనే అంశం పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి అధికారాలు పెద్ద తప్పిదం ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచి్చనట్టుగా మా లెక్కల్లో తేలింది. ఒప్పందంపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)కి బదులుగా ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి సర్వ అధికారాలు కట్టబెట్టడం పెద్ద తప్పిదం. 12 ఏళ్లకు ఒప్పందం జరిగితే, ఛత్తీస్‌గఢ్ కేవలం మూడు నాలుగేళ్లు మాత్రమే విద్యుత్ సరఫరా చేసి మానుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి 2014లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోగా, నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ దీనిపై సంతకం చేశారు. అయితే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రమేయం లేకుండానే 2016లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగింది. జీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్ సీఎండీలు దీనిపై సంతకం పెట్టారు. అయితే అప్పటికి ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రం (మార్వా) నిర్మాణమే ప్రారంభం కాలేదని మా పరిశీలనలో తేలింది..’ అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. చర్యలు తీసుకోని ఈఆర్సీ ‘ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరవింద్‌కుమార్ వివరణ ఇచ్చారు. నామినేషన్ విధానంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, దీనికి బదులుగా విద్యుత్ కొనుగోళ్ల కోసం బహిరంగ టెండర్లను నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంటూ అరవింద్‌కుమార్ 2016 నవంబర్ చివరలో రాష్ట్ర ఈఆర్సీకి సుదీర్ఘ లేఖ రాయగా, ఈఆర్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలింది. ఈ లేఖ రాసిన వెంటనే తాను ఇంధన శాఖ నుంచి బదిలీకి గురైనట్టు అరవింద్‌కుమార్ తెలిపారు. 2000 మెగావాట్ల విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఎస్కే జోషి తొలుత జీవో 22 జారీ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు వీలు కలి్పంచేలా ఈ జీవోను సవరిస్తూ దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనుమతించారు. 1000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం 2000 మెగావాట్ల విద్యుత్ కారిడార్‌ను బుక్ చేసుకున్నారు. అందులో 1000 మెగావాట్ల లైన్లను కూడా ఎన్నడూ పూర్తిగా వాడుకోలేదు..’ అని వివరించారు. సూపర్ క్రిటికల్‌కి బదులుగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ‘భద్రాద్రి’ ‘ఉత్తర భారత దేశంలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం బీహెచ్ఈఎల్ తయారు చేసిన జనరేటర్లు, బాయిలర్లు నిరుపయోగంగా ఉండడంతో వాటిని తీసుకొచ్చి 1080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినట్టు మా పరిశీలనలో తేలింది. సూపర్ క్రిటికల్‌కి బదులుగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మించడంతో బొగ్గు వాడకం పెరిగి ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వ్యయం పెరిగింది. బొగ్గు వాడకం పెరగడంతో పర్యావరణ కాలుష్యం కూడా పెరిగింది. 25 ఏళ్ల పాటు అధిక వ్యయం, కాలుష్యాన్ని భరించాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చాక కొత్తగూడెంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రికార్డు కాలంలో నిర్మించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సైతం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోనే నిర్మిస్తున్నారు. కానీ భద్రాద్రి కేంద్రాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి నిర్మించాలని నేరుగా ప్రభుత్వం నుంచే నిర్ణయం వెలువడిందని, ఇందులో తమ పాత్ర లేదని ప్రభాకర్ రావు చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదు త్వరలో మరో మాజీ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాను విచారిస్తామని, టీజేఏసీ చైర్మన్ కె.రఘు, టీజేఎస్ అధినేత కోదండరాం, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్ రావును కూడా పిలిపించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటామని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. యాదాద్రి ఇప్పట్లో పూర్తయ్యేలా లేదుయాదాద్రి, భద్రాద్రి కేంద్రాలను రెండేళ్లలో నిర్మిస్తామని చెప్పి గడువులోగా పూర్తి చేయలేకపోయారు. యాదాద్రి కేంద్రాన్ని ఇటీవల సందర్శించగా, సమీప భవిష్యత్తులో పూర్తయ్యే పరిస్థితి కనిపించలేదు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు నిర్వహించకుండా బీహెచ్ఈఎల్కు నామినేషన్ల విధానంలో వీటి పనులు అప్పగించారు. బీహెచ్ఈఎల్ మాజీ, ప్రస్తుత సీఎండీలను పిలిపించి విచారించగా, అవకతవకలు జరిగినట్టు అనుమానాలు ఉన్న అంశాల (గ్రే ఏరియాస్)పై పరిశీలన జరుపుతామని బదులిచ్చారు. తాను స్వల్పకాలం పాటే ఇంధన శాఖలో పనిచేశానని, అప్పట్లో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని, కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని సురేష్ చందా చెప్పారు..’ అని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. -
‘విద్యుత్’ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆయా అధికారులు, మాజీ అధికారులు పోషించిన పాత్ర ఏమిటనే వివరణ, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేయనుంది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించే అవకాశమూ ఉంది. ప్రస్తుత, మాజీ అధికారులందరికీ.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో సంబంధమున్న ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్‌రావుతోపాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరితోపాటు నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నట్టు సమాచారం. త్వరలో ప్రజాప్రతినిధులకు కూడా.. విద్యుత్ ప్లాంట్లు, కొనుగోళ్లపై న్యాయ విచారణలో భాగంగా తొలిదశలో ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన కమిషన్.. ఆ నిర్ణయాల్లో తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అవసరమైతే కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని పిలిచే అవకాశం ఉందని విద్యుత్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వివరణల్లో లభించే సమాచారం ఆధారంగా.. తర్వాతి దశలో పలువురు ప్రజాప్రతినిధులకు నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో.. కమిషన్ న్యాయ విచారణ ప్రక్రియను వేగిరం చేయాలని నిర్ణయించింది. ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖనే కీలకం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని.. ఆ ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి సర్కారు.. ఆయనను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. తాజాగా ఆయనకు కూడా విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో.. నాటి లేఖ, ఆయన వివరణ కీలకంకానున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఎన్టీపీసీ విద్యుత్ ఇక చాలు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 2,400 (3్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదముందని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5–8 ఏళ్ల సమయం పట్టనుందని, దీని ద్వారా వచ్చే విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 8–9 ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. బహిరంగ మార్కెట్లో దీనికన్నా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా ఇంత భారీ ధరతో 25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై రూ. వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీతో రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సత్వరమే ఒప్పందం చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేయడంతో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. విభజన చట్టం కింద ఏర్పాటు..: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో తొలి దశ కింద 1,600 (2 ్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. తొలి దశ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 5.90 ఉండగా ఒప్పందం కారణంగా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఉంది. గత సర్కారు తప్పిదమే! రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌లో 2,400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రెండో దశ కింద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వీలుగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా పదేళ్లపాటు కాలయాపన చేయడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తై తక్కువ ధరకు విద్యుత్ రాష్ట్రానికి వచ్చేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పడు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత సర్కారు అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడంతోపాటు విచ్చలవిడి విధానాలను అనుసరించడం వల్ల గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. ఇక కొత్త థర్మల్ ప్లాంట్లకు స్వస్తి.. దామరచర్లలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే పూర్తికావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ. 6–10 కోట్లకు పెరిగింది. కాలంచెల్లిన సబ్–క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది. ప్రత్యామ్నాయంగా మార్కెట్లో రూ. 2–4కు యూనిట్ చొప్పున లభిస్తున్న పునరుద్పాదక విద్యుత్‌తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సౌర, జల, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్‌పై సర్కారు దృష్టిపెట్టనుంది. -
‘పాట్’ అమలులో ఏపీ ఉత్తమం
సాక్షి, అమరావతి: పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్హౌస్ ఉద్గారాలను కట్టడిచేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ ఏపీఎస్ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ నందకిషోర్‌రెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్‌బాబు, బీఈఈ సీనియర్ సెక్టార్ ఎక్స్పర్ట్ నవీన్‌కుమార్‌లతో కలిసి పాట్‌పై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాట్ పథకం అమలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో డీకార్బనైజేషన్ చర్యలు నిర్వహించడం వంటి పటిష్టమైన ప్లాన్‌ను రూపొందించిన ఉత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పాట్ సైకిల్–1లో 8.67 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివాలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయడం వల్ల సుమారు 31 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు. పాట్ సైకిల్–2లో 14.08 ఎంటీవోఈ ఇంధనం ఆదా చేయడంద్వారా 68 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా పాట్ సైకిల్–3 వరకు 1.16 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేశాయని చెప్పారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సిమెంట్, టెక్స్టైల్స్, పవర్ప్లాంట్లు, ఎరువులు, ఇనుము, ఉక్కు, ఎరువులు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, క్లోర్–ఆల్కల్ పరిశ్రమల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇంధన సామర్థ్య పరిశోధనల్లో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్న ఇంధన సామర్ధ్య సాంకేతికతలను ప్రోత్సహించే లక్ష్యంతో, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఈఈడీసీఓ) ముందడుగు వేసింది. ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్ (ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ఎనర్జీ ఎఫిషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్‌ను విజయవంతంగా తయారు చేసింది. దీని కోసం సబ్మెర్సిబుల్ వాటర్ పంపింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవ్ సిస్టమ్ డిజైన్ ప్రోటోకాల్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్‌లోని మోడల్ మోటార్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యుత్ సౌధలో శుక్రవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో పంపుసెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ఐపీఎంఎస్‌ఎం మోటార్ల ద్వారా ఈ రంగంలో విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిధులతో దాదాపు 20 వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ను ఈ సందర్భంగా విజయానంద్ ఆదేశించారు. ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున్ రావు, ఏపీఎస్‌ఈఈడీసీఓ టెక్నికల్ హెడ్ శ్రీనివాసులుతో కలిసి మోటార్ పనితీరును ఏపీఎస్ఈసీఎం సీఈఓ కుమార రెడ్డి వివరించారు. ఐపీఎంఎస్‌ఎం మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయమని, ఇండక్షన్ మోటార్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మోటార్లకు 80 శాతం సామర్థ్యం ఉండగా, ఐపీఎంఎస్‌ఎం అనేది 90 శాతం ఉందని వెల్లడించారు. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లుకాగా, అధిక గ్రేడ్ మెటీరియల్స్ కారణంగా ఐపీఎంఎస్‌ఎం మోటార్ సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుందని చెప్పారు. తక్కువ నిర్వహణ వ్యయం,30శాతం తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన వివరించారు. -
Telangana: ఉచిత కరెంట్‌లో మెలిక?!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రతి కుటుంబానికి కచ్చితంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా జరగదా? అర్హత గల ప్రతి కుటుంబం నిర్దిష్ట యూనిట్ల మేరకే ఉచిత విద్యుత్‌ను పొందుతుందా? గత ఏడాది విద్యుత్ వినియోగాన్ని ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నారా? పథకం అమలుకు ఇంధన శాఖ సిద్ధం చేసిన మార్గదర్శకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే లభిస్తోంది. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం (ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ (ఎంఈసీ) పేరిట ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. దీంతో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అయ్యాయి. అధికంగా వాడితే వాతలే!: ఈ మార్గదర్శకాల ప్రకారం..200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు షరతులు వర్తించనున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుందని భావించి గతానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వినియోగాన్ని పెంచేసుకుంటే, ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022–23లో నెలకు సగటున వాడిన విద్యుత్‌కు అదనంగా 10 శాతం విద్యుత్‌ను మాత్రమే గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకం అమలు కానుంది. ఉదాహరణకు 2022–23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్ వినియోగం 960 యూనిట్లు అయితే, సగటున నెలకు 80 యూనిట్లు వాడినట్టు నిర్ధారిస్తారు. అదనంగా మరో 10 శాతం అంటే 8 యూనిట్లను కలిపి నెలకు గరిష్టంగా 88 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేయనున్నారు. 88 యూనిట్లకు మించి వాడిన విద్యుత్‌కు సంబంధిత టారిఫ్ శ్లాబులోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేయనున్నారు. గతేడాది 2,400 యూనిట్లు మించితే అనర్హులే ఒక వేళ 2022–23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినట్టైతే ఈ పథకం వర్తించదు. వార్షిక విద్యుత్ వినియోగం 2,400 యూనిట్లు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక నెలకు అనుమతించిన పరిమితి (ఎంఈసీ) మేరకు ఉచిత విద్యుత్‌ను వాడిన వినియోగదారులకు ‘జీరో’ బిల్లును జారీ చేయనున్నారు. అంటే వీరు ఎలాంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం ఉండదు. 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదు ఒక వేళ వినియోగం అనుమతించిన పరిమితికి మించినా, గరిష్ట పరిమితి 200 యూనిట్లలోపే వాడకం ఉండాలి. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లును సంబంధిత టారిఫ్ శ్లాబు ప్రకారం జారీ చేస్తారు. ఒక వేళ నెల వినియోగం 200 యూనిట్లకు మించితే మాత్రం వాడిన మొత్తం కరెంట్‌కు బిల్లును యథాతథంగా జారీ చేస్తారు. ఎలాంటి ఉచితం వర్తించదు. బిల్లులు బకాయిపడినా నో విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తించదు. బకాయిలన్నీ చెల్లించిన తర్వాతే పథకాన్ని వర్తింపజేస్తారు. గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను చెల్లించకుండా బకాయి పడిన వారికి సైతం పథకాన్ని నిలుపుదల చేస్తారు. బిల్లులు చెల్లించాకే మళ్లీ పథకాన్ని పునరుద్ధరిస్తారు. తెల్లకార్డు ఉంటేనే అర్హులు ఈ పథకం కింద తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లబ్ధిదారులు దరఖాస్తులో పొందుపరిచిన గృహ విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నంబర్‌ను రేషన్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. రేషన్‌కార్డుతో విద్యుత్ కనెక్షన్‌ను అనుసంధానం చేసినా, విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీదే బిల్లింగ్ జరుగుతుంది. ఇప్పటికే నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు కూడా గృహజ్యోతి వర్తించనుంది. గృహజ్యోతి పథకం కింద ఒక నెలకు సంబంధించిన సబ్సిడీలను తదుపరి నెలలోని 20వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. తొలి విడతలో 34 లక్షల గృహాలకు.. ప్రజాపాలన కార్యక్రమం కింద గృహజ్యోతి పథకం అమలు కోసం 1,09,01,255 దరఖాస్తులు రాగా, అందులో 64,57,891 దరఖాస్తుదారులు ఆధార్‌తో అనుసంధానమై ఉన్న తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉన్నారని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ధారించింది. వీరిలో 34,59,585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండడంతో తొలి విడత కింద వీరికే గృహజ్యోతి వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్ టారిఫ్ ప్రకారం..గృహజ్యోతి పథకం అమలుకు ఏటా రూ.4,164.29 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. -
డిస్కంలకు రూ.58,981 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.17,102 కోట్ల విద్యుత్ సబ్సిడీల తోపాటు మరో రూ.40,981 కోట్ల ప్రభుత్వ విద్యుత్ బిల్లుల బకాయిలు (హెచ్టీసీసీ) కలిపి మొత్తం రూ.58,684.17 కోట్లను 2024–25 బడ్జెట్లో కేటా యించాలని ఇంధనశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదించింది. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023– 24లో డిస్కంలకు రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సి డీని మంజూరు చేయగా దాన్ని రూ.17,120 కోట్లకు పెంచాలని ఇంధన శాఖ కోరింది. అందులో టీఎస్ ఎస్పీడీసీఎల్కు రూ.3,654.51 కోట్లు, టీఎస్ఎన్పీ డీసీఎల్‌కు రూ.14,048 కోట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ఇప్ప టికే అందిస్తున్న రాయితీలను కొనసాగించడంతో పాటు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను 2024–25లో ప్రారంభించడానికి రూ. 17,120 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. ప్రతి పాదిత సబ్సిడీలో రూ. 4 వేల కోట్లు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించినవేనని అధికార వర్గాలు తెలిపాయి. రూ. 17,120 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా వచ్చే ఏడాది కొంత మొత్తంలో విద్యుత్ చార్జీలను పెంచకుంటే డిస్కంల నష్టాలు మరింతగా పెరిగి పోతాయని అధికారులు తెలిపారు. సర్కారీ బకాయిలు రూ.40 వేల కోట్లు ఇవ్వండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి వివిధ శాఖలు, విభాగాల నుంచి డిస్కంలకు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.28,842.72 కోట్లకు పెరిగాయని పేర్కొంటూ ఇటీవల విద్యుత్‌పై ప్రవేశ పెట్టిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి న ఇతర విద్యుత్ బిల్లుల బకాయిలు కలిపి మొత్తం రూ.40,981 కోట్లను డిస్కంలకు 2024–25లో చెల్లించాలని ఇంధన శాఖ ప్రభుత్వాన్ని కోరింది. రూ.17,120 కోట్ల సబ్సిడీ, రూ.40,981 కోట్ల పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ.58,684.17 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని కోరడం గమనార్హం. -
ఏపీలో విద్యుత్ కోతలు లేవు.. అవాస్తవాలు నమ్మొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చామని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కే. విజయానంద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహావసరాలకి ఎక్కడా కోతలు విధించటం లేదని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్ లో 18 శాతం డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. ఆగస్ట్ నెలలో సరాసరిన రోజుకి 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ కాగా, గత ఏడాదిలో 190 మిలియన్ యూనిట్ల మాత్రమే ఉంది. పెరిగిన డిమాండ్‌తో పాటు వర్షాభావ పరిస్ధితులు తోడయ్యాయి. ఆగస్ట్ 30, 31 తేదీల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ నెల ఈ వారంలో సరాసరిన 210 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉంది. ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఉంది. కర్ణాటక, తమిళనాడు, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కోతలు అమలవుతున్నాయి. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కి తగ్గట్లు ఏపీలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం.’’ అని విజయానంద్ తెలిపారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే ఏపీలో విద్యుత్ కొరత రాకుండా ముందు జాగ్రత్తగా 40 మిలియన్ యూనిట్ల కొనుగోలు చేశాం. యూనిట్‌ని 13 రూపాయిల వరకు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతి ఉన్నా యూనిట్ 7.50 రూపాయిలకే కొనుగోలు చేశాం. బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఏపీలో సెప్టెంబర్ నెలకి సరిపడా బొగ్గు నిల్వలు’’ ఉన్నాయని విజయానంద్ వెల్లడించారు. -
అద్భుత ఘటన: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు!
ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుందరిని అతి సమీపంలో చూసేసరికి రజనీ వంటి రోబోలో కూడా రసస్పందన కలిగింది. తట్టుకోలేని తమకంలో తలమునకలయ్యాడు. భగవంతుని ఈ సృష్టి వైచిత్రిని తలచుకుని తెగ ఆశ్చర్యపోయాడు. తనవంటి జడపదార్థంలోనూ జమకాలు పాడించిన ఆడదానికి ఓరచూపు పవరుకు పదేపదే సలాములు చేశాడు. ఇనుములో హృదయం మొలిచెనే... అనుకుంటూ డ్యుయెట్లు పాడుకుని మురిసిపోయాడు. దర్శక దిగ్గజం శంకర్ సృజన నుంచి పుట్టుకొచి్చన ఈ సూపర్‌హిట్ సినీ ఫాంటసీ నిజ జీవితంలోనూ జరిగితే? ఇనుములో నిజంగానే హృదయం మొలిస్తే? అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ చిన్న ప్లాటినం ముక్క తనలో పుట్టుకొచి్చన పగుళ్లను తనంత తానుగా నయం చేసుకుంది. అదీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కళ్లారా చూస్తుండగా! ఈ పరిణామాన్ని అతి సూక్ష్మమైన మైక్రోస్కోప్ ద్వారా వీక్షించి వాళ్లంతా అక్షరాలా అవాక్కయ్యారు. ‘‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. దీనికి కారణమేమిటన్నది మాకైతే అంతుబట్టడం లేదు. మానవ మేధకు బహుశా ఎప్పటికీ అంతుబట్టదేమో!’’అని చెప్పుకొచ్చారు. ప్రాకృతిక నియమాలనే పూర్తిగా తలకిందులు చేయగల ఈ పరిణామం ఎలా సాధ్యమైందన్న కీలకాన్ని పట్టుకోగలిగితే ఇంజనీరింగ్ రంగంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు ఖాయమని వారంతా ముక్త కంఠంతో అంటున్నారు. ఇప్పుడా కీలకాన్ని ఒడిసిపట్టే పనిలో తలమునకలుగా ఉన్నారు... నిరంతర వాడకం తదితరాల వల్ల అరుగుదల వంటివి జరిగి యంత్రాలు పగుళ్లివ్వడం, అవి క్రమంగా పెరిగిపోయి చివరికి పాడవడం సర్వసాధారణం. ఆ మాటకొస్తే ఇది ప్రతి ఇనుప వస్తువు విషయంలోనూ జరిగేదే. నిజానికి చాలా పరిశ్రమల్లో ఈ అరుగుదల తదితరాల ఖర్చే తడిసి మోపెడవుతూ ఉంటుంది కూడా. మరి కార్లు, బస్సులు, భారీ ఇంజన్లు, బ్రిడ్జిలు, విమానాల వంటి ఇనుప వస్తువులన్నీ తమలో తలెత్తే పగుళ్ల వంటి సమస్యలన్నింటినీ తమంతట తామే ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే? వాటి భద్రతపై దిగులుండదు. జీవితకాలమూ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిర్వహణ తదితర భారీ ఖర్చులన్నీ పూర్తిగా తప్పుతాయి. ఎంతగా అంటే, ఒక్క అమెరికాలోనే ఏటా వేలాది కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ఈ పరిశోధనకు పూనుకున్న శాస్త్రవేత్తల బృందమే అంచనా వేస్తోంది! పైగా రిపేర్లు తదితరాలకు పట్టే అతి విలువైన సమయమూ పూర్తిగా ఆదా అవుతుంది! ఇప్పటికిది అందమైన ఊహే అయినా మున్ముందు నిజమయ్యే ఆస్కారం పుష్కలంగా ఉందంటున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. అదే జరిగితే మౌలిక శాస్త్ర సాంకేతిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఆ అద్భుతం జరిగిందిలా... ఇనుప పరికరాల్లో అతి సూక్ష్మస్థాయిలో పగుళ్లు ఎలా మొదలవుతాయో తెలుసుకునేందుకు అమెరికాలో ఇంధన శాఖకు చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నానోటెక్నాలజీస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఓ పరిశోధన చేసింది. అందులో యాదృచ్ఛికంగా అద్భుతమొకటి జరిగింది. ఏమైందంటే... ► అమెరికాలోని శాండియా, లాస్ అలామోస్ నేషనల్ లేబోరేటరీస్, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనకు పూనుకున్నాయి. అతి సూక్ష్మ పరిమాణంలోని ప్లాటినం ముక్కలో పగుళ్లు మొదలయ్యే తీరును లోతుగా పరిశోధించడం దీని ముఖ్యోద్దేశం. ► కానీ తీరా ప్రయోగం మొదలైన 40 నిమిషాలకు వారు కలలో కూడా ఊహించనిది జరిగింది. ప్లాటినం ముక్క మొదలైన పగులు విస్తరించడం ఆగిపోయింది! ► ఇదేమిటా అని వాళ్లు తల బద్దలు కొట్టుకుంటుండగానే, ఆ పగులు తనంతట తానే చిన్నదవుతూ క్రమంగా పూర్తిగా పూడి కనుమరుగైపోయింది! ఎంతగా అంటే, అక్కడ పగులు వచి్చన ఆనవాలు కూడా కనిపించలేదు! ► ఇలా మానవ జోక్యం అసలే లేకుండా ఓ లోహం తనలోని పగుళ్లను తానే పూడ్చుకోవడం మనకు తెలిసిన చరిత్రలో బహుశా తొలిసారి జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. ► ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. అచ్చం అతను సూత్రీకరించినట్టే... ఇలాంటి దృగ్విషయాన్ని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ డెంకోవిజ్ కొన్నేళ్ల క్రితమే కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా సూత్రీకరించాడు.తాజా పరిశోధన ఫలితం గురించి తెలిసి ఆయనిప్పుడు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తన పాత ప్రయోగాన్ని మరోసారి చేసి చూపిస్తూ, ‘అప్పట్లో నేనెలా సూత్రీకరించానో ఇప్పడు అక్షరాలా అలాగే జరిగిం’దంటూ సంబరపడిపోతున్నాడు. అద్భుతమే, కాకపోతే... జరిగింది నిజంగానే మహాద్భుతమే. ఇందులో అనుమానమే లేదు. కాకపోతే లోహాల్లో అసలు ఈ ‘స్వీయ వైద్యం’ఎలా సాధ్యమన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు. దీన్ని ఇంజనీరింగ్, తయారీ రంగాలకు ఎలా అన్వయించుకోవాలన్నది అంతకంటే అవగాహనలోకి రాలేదు. ‘‘అతి సూక్ష్మ స్ఫటికాకార లోహంపై గాలి తదితరాల ఆనవాలు కూడా లేని పూర్తి నియంత్రిత, కృత్రిమ శూన్య పరిస్థితుల్లో ఇది జరిగింది. సాధారణ వాతావరణంలో సంప్రదాయ లోహాల్లో ఇది ఏ మేరకు సాధ్యమన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నే’’అని బాయ్స్ చెప్పుకొచ్చారు. కొసమెరుపు ఇదెలా సాధ్యపడిందన్న దానిపై నెలకొన్న అస్పష్టత, దీన్ని మనకు మేలు జరిగేలా మలచుకోవడం ఏ మేరకు సాధ్యమన్న సందిగ్ధత తదితరాలను పక్కన పెడితే ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ వంటి పలు రంగాల్లో ఈ పరిశోధన ఫలితం అతి పెద్ద ముందడుగన్నది మాత్రం నిస్సందేహం. లోహాల్లో పగుళ్లంటూ మొదలైతే పెరుగుతూనే పోతాయి. కానీ, అత్యంత జడమైనవిగా భావించే లోహాలకు కూడా ఇలా తమను తాము నయం చేసుకోగల స్వాభావిక సామర్థ్యం ఉందని మా పరిశోధన తేటతెల్లం చేయడం ఓ నమ్మశక్యం కాని నిజం!’’ – బ్రాడ్ బాయ్స్, మెటీరియల్స్ సైంటిస్టు, శాండియా నేషనల్ లేబోరేటరీస్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణ విద్యుత్ సంస్థలకు కొత్త బాస్‌లు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల మార్పు, కొత్తవారి నియామకంపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. కొత్త సీఎండీలు, డైరెక్టర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ సీఎండీగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎన్.శ్రీధర్.. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ సీఎండీగా ఎంపికైనా, ఇంకా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. శ్రీధర్ కాకుంటే, సీఎంకు అత్యంత విశ్వసనీయంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకు విముక్తి కల్పించాలంటున్న ప్రభాకర్‌రావు.. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా, విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల ఇన్చార్జి సీఎండీగా డి.ప్రభాకర్‌రావు గత నెలతో 9 ఏళ్లు, 2019 జనవరి 10 నాటికి విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 1969 జనవరి 10న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరారు. విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) చైర్మన్ హోదాలో ఆయన డిస్కంల నిర్వహణను సైతం పర్యవేక్షించారు. ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) హోదాను కట్టబెట్టి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ప్రభాకర్‌రావు వయోభారం, అనా రోగ్య సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పిస్తే విశ్రాంతి తీసు కుంటానని గతంలో ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన బహిరంగ సభల్లో తనకు బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తాను బాధ్యతల నుంచి తప్పు కున్నా మరో విధంగా భావించవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఆయన తాజా గా విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి సాను కూల సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆయనీ ప్రకటనలు చేశారని విద్యుత్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 80 ఏళ్లకు చేరువలో ఉత్తర డిస్కం సీఎండీ.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీ డీసీఎల్) సీఎండీగా ఎ.గోపాల్ రావు ఆరున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 2003లో చీఫ్ ఇంజనీర్‌గా రిటైరయ్యారు. ప్రస్తు తం ఆయన వయస్సు 78 ఏళ్లకు పైనే. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన వృద్ధాప్య సమ స్యల వల్ల తరుచుగా హైదరాబాద్‌కు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా జి.రఘుమా రెడ్డి సైతం ఈ నెలలో 9 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు కూడా 71 ఏళ్లకు పైనే. ఒక వేళ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నాన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తే ఈయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది. డైరెక్టర్లు కూడా దీర్ఘకాలంగా.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, టీఎస్ఎన్పీ డీసీఎల్‌లో ఆరుగురు, ట్రాన్స్‌కోలో జేఎండీ, మరో నలుగురు డైరెక్టర్లు, జెన్కోలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 9 ఏళ్లకు పైగా ఆయా పదవుల్లో కొనసాగు తున్నారు. వీరిలో చాలామంది 70 ఏళ్లకు పైబడిన వారే. కొన్ని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల సంఖ్య మంజూరైన పోస్టు ల సంఖ్య కంటే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు డైరెక్టర్లను సాగనంపి వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
బాదుడు.. బుకాయింపే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసిందంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా మరోసారి దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రకరకాల పేర్లతో అదనపు బాదుడు పెరిగిందంటూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నిజానికి విద్యుత్ బిల్లులో అన్ని వివరాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితో, మార్గదర్శకాల ప్రకారమే పొందుపరుస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది. చట్టప్రకారమే సర్దుబాటు.. విద్యుత్ రిటైల్ సరఫరా వ్యవస్థలో ఏడాదికోసారి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు ధరలు ప్రకటిస్తారు. విద్యుత్ పంపిణీ రంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, అవసరాల నివేదికను సెప్టెంబర్ నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా రూపొందిస్తాయి. కాబట్టి అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులుంటాయి. విద్యుత్ చట్టం నిబంధనల్లో నిర్దేశించిన విధంగా ఇంధన చార్జీలు / కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గులను సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు డిస్కమ్‌లకు ఉంది. ఆ ప్రకారమే సర్దుబాటు చార్జీలను విధిస్తున్నాయి. రైతులపై పైసా భారం లేదు.. 2014–15 నుంచి 2018–19 వరకు పంపిణీ వ్యవస్థకు సంబంధించి నెట్వర్క్ ట్రూఅప్ చార్జీలు దాదాపు రూ.3,977 కోట్లుగా ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ వాటా రూ.2135 కోట్లు కాగా ఏపీసీపీడీసీఎల్ వాటా రూ.1,232 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ ఖర్చు రూ.609 కోట్లుగా మండలి పేర్కొంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ నిమిత్తం ట్రూఅప్ భారం రూ.1,066.54 కోట్లు. రైతులకు అందించే విద్యుత్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది. కాబట్టి ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఇంధన వ్యయ సర్దుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మిగిలిన మొత్తం ఇతర కేటగిరీ (వ్యవసాయం కాకుండా) వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని డిస్కమ్‌లను కమిషన్ ఆదేశించింది. పెరిగినదానికన్నా తక్కువే.. విద్యుత్ కొనుగోలులో స్థిర చార్జీలు, చర చార్జీలు (బొగ్గు, ఆయిల్, రవాణా, వాటిపై పన్నులు, డ్యూటీలు) ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. దానికి తోడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు ప్రస్తుత అధిక డిమాండ్ సీజన్లో (ఫిబ్రవరి – జూన్) గరిష్టంగా యూనిట్ రూ.10 వరకు ఉంటున్నాయి. అంటే టారిఫ్ ఉత్తర్వుల్లో అంచనా విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.30 కన్నా వాస్తవ విద్యుత్ కొనుగోలు ధర అధికంగా ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత పరిస్థితుల నడుమ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అయినప్పటికీ వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దానివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు దాదాపు రూ.1.20 పెరిగింది. నిబంధనలకు లోబడి ప్రతి నెల విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు తగ్గింపు లేదా పెంపు యూనిట్‌కు రూ.0.40 వరకూ వసూలు చేసుకునేందుకు డిస్కమ్‌లకు అనుమతి ఉంది. కేంద్రమే చెప్పింది అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం వార్షిక సర్దుబాటు విధానం స్థానంలో 2021–22 నుంచి త్రైమాసిక సర్దుబాటు విధానం అమలులోకి వచ్చింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గులపై నివేదికలను సమర్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్రైమాసిక విద్యుత్ సర్దుబాటు చార్జీల విధానానికి బదులుగా నెలవారీ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని సర్దుబాటు చేసేలా ఇటీవల ఏపీఈఆర్సీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2021–22కి సంబంధించి త్రైమాసికం ప్రాతిపదికన ఇంధన విద్యుత్ కొనుగోలు సవరింపు చార్జీలు వసూలు చేస్తుండగా ఏపీఈఆర్సీ నియమావళి ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెల అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని జూన్ నెల విద్యుత్ బిల్లులతో కలిపి తీసుకుంటున్నారు. -
పుష్కలంగా కరెంటు
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేసింది. కోవిడ్ కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయించిన ఈ యూనిట్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో చైర్మన్ కె.విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు శుక్రవారం ఉదయం ‘లైట్ అప్’ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆగస్టు నాటికి దీనిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరుగుతుంది. తగ్గనున్న కొనుగోళ్లు ఏపీ జెన్కో ప్రస్తుతం 5,810 మెగావాట్ల థర్మల్, 1773.6 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. లోయర్ సీలేరులో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం రెండు అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్‌కి అందుబాటులోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్ పవర్ హౌస్ సామర్థ్యాన్ని కూడా 120 నుంచి 150 మెగావాట్లకు పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునర్నిర్మించాలని కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వేసవిలో ఎనిమిదేళ్ల తరువాత అనూహ్యంగా డిమాండు పెరిగినప్పటికీ ఏపీ జెన్కో రోజూ సగటున 105 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. రాష్ట్ర మొత్తం వినియోగంలో 40 నుంచి 45 శాతం విద్యుత్ ఏపీ జెన్కో నుంచే వస్తోంది. కొత్తగా లైట్‌అప్ చేసిన యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే రోజూ మరో 15 నుంచి 20 మిలియన్ యూనిట్లను జెన్కో అదనంగా సరఫరా చేస్తుంది. జెన్కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత మేరకు పెరిగితే అంత మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలును డిస్కంలు తగ్గించుకోవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలు విజయానంద్ గత ఏడాది కాలంలో 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యం గల రెండు యూనిట్లు అందుబాటులోకి రావడం ఏపీ జెన్కో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలని జెన్కో చైర్మన్ విజయానంద్ చెప్పారు. ఎన్టీటీపీఎస్ నూతన యూనిట్‌ను ‘లైట్‌అప్’ చేశారు. ముందుగా బాయిలర్‌లో నీటి ద్వారా స్టీమ్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో స్టీమ్ రీడింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేసి ఇంజినీర్లను అభినందించారు. ఆవిరి ప్రక్రియ పూర్తి స్థాయికి చేరగానే బొగ్గు ద్వారా స్టీమ్ రీడింగ్ పెరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల స్టేజ్–2 యూనిట్‌ను గతేడాది అక్టోబర్ 27న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్‌ను ఆగస్టు నాటికి కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)కి వీలుగా సిద్ధం చేయాలని బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు సూచించారు. ట్రయల్ రన్లో వచ్చే లోటుపాట్లను సరిదిద్దుకుని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని జెన్కో ఎండీ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖర్‌రాజు (థర్మల్), బి.వెంకటేశులురెడ్డి (ఫైనాన్స్), సయ్యద్ రఫీ (హెచ్ఆర్, ఐఆర్), సత్యనారాయణ (హైడల్), అంథోనీ రాజ్ (కోల్) తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ వార్ఫేర్ను ఎదుర్కొనేలా మన ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఈ స్వచ్ఛ ఇంధనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్రం అనుకూలంగా మారింది. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో జరిగిన దాదాపు రూ.9.47 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలే దీనికి నిదర్శనం. అయితే, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండేళ్ల క్రితం పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచే సింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమో అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఆ పరికరాలు భారతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పింది. సైబర్ దాడులు దేశ విద్యుత్ సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగించడంతో మొత్తం దేశాన్ని నిర్విర్యం చేయగలవని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పరీక్షలన్నీ తాము నిర్దేశించిన, ధ్రువీకరించిన ప్రయోగశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎస్ఐఆర్ టీమ్ ఏర్పాటు సైబర్ సెక్యూరిటీలో భాగంగా పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కింద సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్‌లన్నిటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఏపీ ఇంధన శాఖ అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. -
ఆర్డీఎస్ఎస్తో డిస్కంల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలు అందించేలా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను పునరుద్ధరణ పంపిణీరంగ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఈ మొత్తం పెట్టుబడిలో 60 శాతం కేంద్రం నుంచి గ్రాంట్‌గా పొందవచ్చని చెప్పారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ ఆధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ ద్వారా డిస్కంలు బలోపేతం కావడం వల్ల అన్నివర్గాల వినియోగదారులకు అధిక నాణ్యత గల విద్యుత్‌ను అందించవచ్చనితెలిపారు. విద్యుత్ సంస్థ (పవర్ యుటిలిటీస్)ల ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల తగ్గింపు, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్డ్ హైడ్రోస్టోరేజి ప్రాజెక్టులు మొదలైన వాటితోసహా అనేక రాష్ట్ర ప్రభుత్వం పథకాలను నవరత్నాల కింద విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా గత మూడునెలల స్వల్ప వ్యవధిలో విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో ఆరు అవార్డులు సాధించాయని చెప్పారు. 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు వ్యవసాయానికి సబ్సిడీ రూపంలో రూ.8,400 కోట్లు ఏటా కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లను అమర్చడం వల్ల డిస్కంలకు, రైతులకు ప్రయోజనమని చెప్పారు. ఏ రైతు తమ జేబులోంచి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే బిల్లు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. 16,66,282 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని నిర్ణయించగా.. 16,55,988 కనెక్షన్లకు సంబంధించిన రైతులు అంగీకారం తెలిపారని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
AP: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాలతో ప్రణాళికాబద్దంగా వేసవి డిమాండ్‌ని అధిగమిస్తామన్నారు. ‘‘గత ఏడాది కంటే ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన రోజుకి 202 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 227 మిలియన్ యూనిట్లకి పెరిగింది. గత ఏడాది మార్చి నెలలో రోజుకి 212 మిలియన్ యూనిడ్ల డిమాండ్ ఉంటే ఇపుడు 232 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో పీక్ డిమాండ్ 232 మిలియన్ యూనిట్ల కాగా.. ఈ ఏడాది మార్చి రెండవ వారంలోపే 232 మిలియన్ యూనిట్లు దాటాం. గడిచిన ఏడాది కాలంలో ఏపీలో పెరిగిన పరిశ్రమల కారణంగా వాణిజ్య అవసరాలకి 18 శాతం, పరిశ్రమలకి 20.31 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది’’ అని విజయానంద్ వివరించారు. ‘‘ఈ కారణంగానే విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా రికార్డు స్ధాయికి పెరిగింది. మార్చి నెలాఖరుకి 240 మిలియన్ యూనిట్లు.. ఏప్రిల్ నెలకి 250 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్ నెలలో ఒక్క వ్యవసాయానికే సరాసరిన 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. పెరిగిన డిమాండ్ కి తగ్గట్లుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమలకి, గృహావసరాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుంది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫారా కొనసాగిస్తాం’’ అని ఆయన తెలిపారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల కృష్ణపట్నం మూడవ యూనిట్ ద్వారా 800 మెగా వాట్ల విద్యుత్ నేటి నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. సెమ్ కాబ్ ద్వారా 500 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో యూనిట్ ధర 12 రూపాయిలుంటే వేసవి అవసరాలను దృష్డిలో పెట్టుకుని ముందుగానే మార్చి, ఏప్రిల్ నెల కోసం యూనిట్ 7.90 రూపాయలకు విద్యుత్ కొనుగోలుకి ఎంఓయు చేసుకున్నాం. అదే విధంగా ఇతర రాష్ట్రాలతో 300 మెగా వాట్ల విద్యుత్‌కి బ్యాంకింగ్ ఒప్పందాలు చేసుకున్నాం’’ అని విజయానంద్ వెల్లడించారు. -
ఆదా.. ఇదిగో
సాక్షి, అమరావతి: ‘‘శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను అమర్చడం, నెలవారీ రీడింగ్‌లు నమోదు చేయడం అభినందనీయం. వ్యవసాయ విద్యుత్ మీటరింగ్ కోసం విలువైన పాఠాలను అందించేలా ఈ ప్రయోగం చేపట్టిన డిస్కమ్‌లు, సంబంధిత విభాగాలను అభినందించాల్సిన అవసరం ఉంది’’ – తుది నివేదికలో ప్రయాస్ సంస్థ ప్రశంసలివీ.. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చడం వల్ల రైతులకు మేలేగానీ కీడు జరగదు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసినా కొన్ని పార్టీలు, వాటి అనుకూల మీడియా పని గట్టుకుని విషప్రచారం చేస్తూనే ఉన్నాయి. అన్నదాతలను అయోమయంలోకి నెట్టేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల వల్ల ఏ మీటర్లో ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోందనేది ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తెలుస్తుంది. అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, ఫీడర్ల వద్ద మీటర్లు పెట్టి రీడింగ్ తీస్తే వాటి పరిధిలోని నాలుగైదు మీటర్ల విద్యుత్ వినియోగం వస్తుంది. ఏ రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. పంటలు ఉన్నప్పుడు మీటర్ల దగ్గరికి వెళ్లడం చాలా కష్టం. అదే స్మార్ట్ మీటర్లతో ఈ సమస్యలన్నీ తీరుతాయి. రిమోట్ ద్వారా మీటర్‌ను ఆపరేట్ చేయవచ్చు. రీడింగ్ కోసం మీటర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీటర్ అమర్చడమే కాకుండా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్, మోటార్ కాలిపోకుండా, రైతుల ప్రాణ సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన ఐదు రక్షణ పరికరాలను (అలైడ్ మెటీరియల్) మీటర్లతో పాటు ఏర్పాటు చేయనుంది. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్ మీటర్‌తో పాటు మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్(ఎంసీసీబీ)తో కూడిన షీట్ మౌడ్లింగ్ కాంపొనెంట్(ఎస్ఎంసీ) బాక్స్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యూజు కారియర్లు ఇనుముతో చేసినవి ఉండగా వాటి స్థానంలో తాకినా విద్యుత్ షాక్ కొట్టని మెటీరియల్‌తో ఈ బాక్సులు తయారవుతాయి. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు కూడా ఉండవు. దానివల్ల మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే ఎర్తింగ్ పైప్ కూడా ఇస్తారు. ఓల్టేజ్ సమస్యల నుంచి కాపాడేందుకు షంట్ కెపాసిటర్లను అమర్చుతారు. ఈ ఏర్పాటు వల్ల విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులకు, జీవాలకు, వాతావరణ పరిస్థితుల నుంచి స్మార్ట్ మీటర్లకు రక్షణ లభిస్తుంది. అలైడ్ మెటీరియల్, మీటర్లకు కలిపి ప్రభుత్వం రూ.4,000 కోట్లు భరిస్తోంది. ఎవరు చెప్పారు? వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారంతో అబద్ధాలను అడ్డంగా అచ్చేసిన ఈనాడు రాతలను ఇంధన శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, వాటివల్ల విద్యుత్ ఆదా జరగకపోగా ఖర్చు వృథా అని ఏ సంస్థగానీ, రైతులుగానీ చెప్పలేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, సెంట్రల్ డిస్కమ్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డితో కలసి విజయవాడలోని విద్యుత్ సౌధలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ► మీటర్లు అమర్చడం ద్వారా డిస్కమ్‌లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్ హక్కుగా లభిస్తుంది. ‘ప్రయాస్’ సంస్థ ఏడాదిన్నర క్రితం జరిపిన శాంపుల్ అధ్యయనంలో పలు సూచనలు మాత్రమే చేసింది. సగటు విద్యుత్ కొనుగోలు ధరను ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ ఒక యూనిట్‌కి రూ.4.20 చొప్పున తీసుకుని లెక్కించడం వల్లే గణాంకాలు సరిగా లేవు. వాస్తవానికి సగటు సరఫరా ఖర్చు ఒక యూనిట్‌కి రూ.6.98 చొప్పున ఉంది. దీన్ని ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ► ఫీడర్ల వద్ద నష్టాలు నమోదవుతున్నట్లు ప్రయాస్ చెబుతున్నా స్మార్ట్ మీటర్లు అమర్చిన తరువాత ఫీడర్ రీడింగ్ తీయలేదు. ఆ నష్టం విద్యుత్ చౌర్యం వల్ల జరిగి ఉండవచ్చు. ఇలాంటివి అరికట్టేందుకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► రెండు, మూడు వారాల్లో స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రైతులను గందరగోళానికి గురిచేస్తూ పదేపదే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలు, ప్రసారం చేస్తున్న ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాటి యాజమాన్యాలకు లీగల్ నోటీసులు కూడా పంపుతున్నాం. ► మొత్తం 16,66,282 వ్యవసాయ సర్వీసుల్లో 16,55,988 మంది రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచి నిరభ్యంతర పత్రాలిచ్చారు. 10,294 మందికి మాత్రమే ఖాతాలు లేవు. వారితో కూడా తెరిపించేందుకు డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. శ్రీకాకుళంలో ఇలా.. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా 2023 ఫిబ్రవరి నాటికి 29,302 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చగా 83.16 శాతం పని చేస్తున్నాయి. ఈ మీటర్ల ద్వారా 2021–22లో 33.24 శాతం అంటే 2.81 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అయ్యింది. సగటున 6.66 శాతం మాత్రమే పాడవడం, కాలిపోవడం జరిగింది. భవిష్యత్తులో వాటి మరమ్మతుల ఖర్చు సరఫరా సంస్థ భరించేలా టెండర్లు రూపొందించారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెడితే కేవలం రెండున్నరేళ్లలోనే పెట్టుబడి వెనక్కి వస్తుంది. -
జాతీయ లక్ష్యానికి చేయూతనివ్వాలి..
సాక్షి, అమరావతి : ఇంధన పొదుపు, సామర్థ్యంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏపీ.. జాతీయ లక్ష్యానికి మరింత చేయూతనివ్వాల్సిందిగా బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే కోరారు. మార్చి 1న న్యూఢిల్లీలోని ఇండియన్ హాబిటాట్ సెంటర్లో జరగనున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) 21వ వ్యవస్థాపక దినోత్సవాలకు రాష్ట్రాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ(ఎస్డీఏ)గా ఉన్న ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం)కు సమాచారం అందించడం కోసం బాక్రే ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ఏపీలో 6.68 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన(ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయాలనే లక్ష్యాన్ని చేరుకునే కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బాక్రే కోరారు. -
విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వేసవి డిమాండ్ అంచనాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. మార్చిలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవర్ ఎక్స్చ్ంజ్ (బహిరంగ మార్కెట్)లో విద్యుత్‌ను షార్ట్ టర్మ్ టెండర్ల ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్నామని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్త వహించాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వేసవిలో విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అదే నెలలో విద్యుత్ కనెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లపైగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం.. ఇకపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో సర్వీసు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని అధికారులు చెప్పారు. సరఫరాలో నాణ్యత విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు. మార్చి ఆఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న ఇళ్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లు పూర్తవుతున్న కొద్దీ వాటికి శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ట్రాన్స్‌కో జేఎండీలు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, నెడ్‌క్యాప్ వీసీఎండీ ఎస్.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
‘స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు.. అది తప్పుడు ప్రచారం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ పంపిణీలో అత్యాధునిక విధానాలు ప్రవేశపెడుతున్నామన్నారు. స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐఆర్డీఏ మీటర్లకు, స్మార్ట్ మీటర్లకు వ్యత్యాసం ఉండదన్నారు. మారుతున్న సాంకేతికని ఇంధనశాఖ అంది పుచ్చుకుంటోందని విజయానంద్ అన్నారు. ‘‘ట్రాన్స్‌కోలో ప్రతీ జిల్లాలో 400 కేవీ సబ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం. వినియోగదారులకి త్వరితగతిన సేవలు అందించడానికే స్మార్ట్ మీటర్లు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ దేశమంతా ఒకేలా ఉంటుంది. మొదటి ఫేజులో 27 లక్షల మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇందులో 4.72 లక్షలు మాత్రమే గృహావసరాల కనెక్షన్స్ ఉన్నాయి. అమృత్ సిటీలోని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్‌కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. రాష్ట్రం మొత్తం 1.80 కోట్లు వినియోగదారులు ఉన్నారు. 1.80 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లనేది అవాస్తవం’’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘13.54 లక్షల మందికి సెకండ్ ఫేజులో స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం. ఇంకా టెండర్లు పిలవలేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్ తదితర 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయి. ఏపీ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. ఇందుకు కేంద్రం నుంచి 5,484 కోట్లు గ్రాంటుగా వస్తాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకి అదనపు భారం పడదు. రైతులకి భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోంది’’ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ మీటర్ల విషయంలో స్పష్టమైన విధానంతో ఇంధనశాఖ ముందుకు వెళ్తోంది. ఇంధన శాఖకి ఇష్టం లేదనేది అవాస్తవం. అన్ని డిస్కమ్‌లతో చర్చించిన తర్వాతే ఇంధన శాఖ ఈ నిర్ణయం. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఇంధన వ్యయ వినియోగం నేషనల్ మీటరింగ్ మోనిటరింగ్ సిస్టం పరిధిలోకి వెళ్తాయి. ఇంధన శాఖకి వ్యవసాయ, గృహావసరాల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్‌పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకి ఎక్కువ బిల్లులు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అని విజయానంద్ వివరించారు. చదవండి: టీడీపీ నేతల అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం -
స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్లవల్ల ప్రయోజనాలే తప్ప ఎలాంటి నష్టంలేదని, ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయడంపై పలు పత్రికల్లో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ కథనాల్లోని సందేహాలను నివృత్తి చేస్తూ.. స్మార్ట్మీటర్లవల్ల కలిగే ప్రయోజనాలను, ఈ ప్రాజెక్టులోని వాస్తవాలను ఆయన వివరించారు. విజయవాడ విద్యుత్ సౌథలో గవర్నమెంట్ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, సెంట్రల్ డిస్కం సీఎండీ పద్మాజనార్ధనరెడ్డిలతో కలిసి మంగళవారం విజయానంద్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ముందుగా 18.56 లక్షల వ్యవసాయ, హైవాల్యూ.. అంటే నెలకు 500 యూనిట్లు పైన విద్యుత్ వినియోగం ఉన్న 27.68 లక్షల సర్వీసులకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలని ప్రభుత్వం అదే ఏడాది నిర్ణయించింది. అలాగే. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలని 2020లో డిస్కంలకు ఆదేశాలు జారీచేసింది. టెండర్ల కోసం దేశమంతా ఒకే నిబంధనలతో ఒక డాక్యుమెంట్‌ను కేంద్రమే రూపొందించింది. దాని ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. పైగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా టెండర్ డాక్యుమెంట్‌ను న్యాయ సమీక్షకు పంపించి అక్కడ నుంచి అనుమతి వచ్చాక మాత్రమే టెండర్ల ఖరారు జరుగుతుంది. మరోవైపు.. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ఓపెన్‌గానే ఉంది. ఐఆర్డీఏ, బ్లూటూత్, స్మార్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ మీటర్లను ఆయా ప్రాంతాల్లో వెసులుబాటులను బట్టి ఏర్పాటుచేసేలా టెండర్లు రూపొందించాం. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనవచ్చు. ఏ ఒక్క సంస్థకో ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం ఎక్కడా జరగడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మీటర్ ఒక్కటే పెట్టడంతో సరిపెట్టకుండా రైతుల ప్రాణరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన పరికరాలను (అలైడ్ మెటీరియల్) ఆర్థికంగా భారమైనా మీటర్లతో పాటు ఏర్పాటుచేయనున్నాం. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్మీటర్తో పాటు (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ)తో కూడిన ఫ్యూజ్బాక్స్నూ అందిస్తున్నాం. ముట్టుకున్నా షాక్ కొట్టని బాక్స్‌ను అందిస్తున్నాం. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు ఉండవు. మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే, ఎర్తింగ్ రాడ్‌ను కూడా ఏర్పాటుచేస్తాం. గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్త పడొచ్చు ఇక ప్రస్తుతం గ్రామాల్లో పొలాల మధ్య ఉండే వ్యవసాయ మీటర్ వద్దకు వెళ్లి రీడింగ్ నమోదు చేయడం శ్రమతో కూడుకున్నది కావడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. పూర్తి ఆధునిక సాంకేతికతతో స్మార్ట్‌మీటర్లను ఇస్తున్నాం. అలాగే.. – వీటి ద్వారా మోటార్ ఆన్, ఆఫ్ చెయ్యొచ్చు. రైతు పొలానికి వెళ్లి మోటారు స్విచ్చాన్ చేయాల్సిన అవసరం ఉండదు. – భవిష్యత్‌లో గ్రిడ్‌పై పడే లోడ్‌ను మ్యానేజ్ చేయాలంటే స్మార్ట్‌మీటర్ల ద్వారానే వీలవుతుంది. – అదే విధంగా ఎప్పటికప్పుడు లోడ్‌ను మోనిటర్ చేస్తూ గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్తపడొచ్చు. – తద్వారా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా కాపాడుకోవచ్చు. – పైగా ఒక ట్రాన్స్ఫార్మర్పై రెండు, మూడు సర్వీసులుంటే అన్ని సర్వీసులకూ ఒకే విధమైన వినియోగం జరగదు. అందరిదీ కలిపి ఒకే రీడింగ్ చూపిస్తుంది. దీనివల్ల రైతులకు నష్టం కలుగుతుంది. పైలట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు మరోవైపు.. స్మార్ట్ మీటర్లపై శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలిచ్చింది. ప్రయాస్ అనే సంస్థ 20 శాతం విద్యుత్ ఆదా అయినట్లు తేల్చింది. మేం అన్ని సర్వీసులపైనా అధ్యయనం చేశాం. 33 శాతం విద్యుత్ అదా కనిపించింది. ఇక రాష్ట్రంలో 12 వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి వాడుతున్నారు. ఇందులో 20 శాతమే ఆదా అనుకుంటే రూ.1,900 కోట్లు, 33 శాతం అయితే రూ.3,600 కోట్లు మిగులుతాయి. మీటర్లు పెట్టడానికి రూ.4 వేల కోట్లు ఖర్చవుతోంది. అంటే పెట్టిన పెట్టుబడి ఒకటి, రెండేళ్లలోనే వచ్చేస్తుంది. ఈ ఫలితాల ఆధారంగానే స్మార్ట్ మీటర్లపై ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో 99 శాతం మంది రైతులు కూడా ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలిపారు.