the Election Commission
-
నిబంధనల మేరకే..
► అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక ► సర్వసభ్య సమావేశంలో ఎంపిక ► ఫిర్యాదు చేసిన వారే ప్రతిపాదించారు ► సీఈసీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: నిబంధనల మేరకే తన నియామకం జరిగిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి తెలిపారు. పార్టీ సంప్రదాయం ప్రకారం సర్వసభ్య సమావేశం ద్వారా ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకున్నారని సీఈసీకి సమర్పించిన వివరణలో ఆమె పేర్కొన్నారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆమె స్థానంలో ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఆ తరువాత నెలకొన్న విభేదాల వల్ల మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ తదితరులపై ఆమె బహిష్కరణ వేటు వేశారు. నిరంతరాయంగా ఐదేళ్లపాటు సభ్యత్వంలేని శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన 12 మంది పార్లమెంటు సభ్యులు సీఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలి్సందిగా వారు కోరారు. ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై బదులివ్వాల్సిందిగా శశికళను సీఈసీ కోరింది. శశికళ తరఫున పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇటీవలే సీఈసీకి వివరణ ఇచ్చారు. అయితే శశికళ ఇచ్చిన నోటీసుపై దినకరన్ బదులివ్వడం ఏమిటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసును అందుకున్న శశికళనే ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాలని ఇటీవల ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు 70 పేజీలతో కూడిన ఉత్తరం ద్వారా శుక్రవారం బెంగళూరు జైలు నుంచే సీఈసీకి శశికళ బదులిచ్చారు. గతంలో దినకరన్ ఇచ్చిన వివరాలనే శశికళ తరఫు న్యాయవాది సీఈసీకి సమర్పించారు. ప్రధాన కార్యదర్శిని పార్టీ సర్వసభ్య సమావేశం ద్వారానే ఎన్నుకుంటారని, తన నియామకం కూడా అదే రీతిన జరిగింది. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తులే పార్టీ సర్వ సభ్యసమావేశంలో తన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా కలిసి ఎకగ్రీవంగా తనను ఎన్నుకున్నారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడే ఎన్నిక జరిగిందని శశికళ వివరణ ఇచ్చారు. -
నేటితో నామినేషన్లకు తెర
► ఓటర్ల బ్యాంకు అకౌంట్లపై డేగకన్ను ► నగదు బట్వాడాకు అడ్డుకట్ట సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల సమయాల్లో అక్రమాలకు పాల్పడకుండా అభ్యర్థులపై నిఘా పెట్టడం మామూలే. అయితే తమిళనాడులో తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏకంగా ఓటరుపైనే నిఘాపెట్టేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఓటుకు నోటు ప్రలోభాన్ని అడ్డుకునేందుకు ఓటర్లపైనా, వారి బ్యాంకు ఖాతాలపైనా నిఘాపెట్టి కొత్త సంప్రదాయానికి తెరదీసింది. మధురై జిల్లా అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో నగదు బట్వాడా సాగినట్లు కోర్టు భావించడం వల్ల గతంలో రద్దయ్యాయి. ఎమ్మెల్యే శీనివేల్ మృతి వల్ల తిరుప్పరగున్రం నియోజవర్గంతోపాటు తంజావూరు, అరవకురిచ్చిలో ఈనెల 19వ తేదీన పోలింగ్ జరుగనుంది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే పార్టీలు తమ అభ్యర్దులను రంగంలోకి దింపాయి. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే మినహా అన్ని పార్టీలూ అన్నాడీఎంకే చేతిలో డిపాజిట్టు కోల్పోయి భారీ ఓటమితో మట్టికరిచాయి. ఈసారి ఉప ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కకున్నా కనీసం మెరుగైన ఓట్లు రాబట్టుకునేందుకు కొన్ని పార్టీలు పాటుపడుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నగదు బట్వాడా ఆరోపణలు ఎదుర్కొన్నందున ఉప ఎన్నికల్లో ఈ అపప్రధ నుండి తప్పించుకునేందుకు ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ఉప ఎన్నికల్లో నిఘా చర్యలపై ఒక అధికారి మాట్లాడుతూ, ఓటర్లకు నగదు బట్వాడా జరుగకుండా మూడు నియోజకవర్గాల్లో ఐదు కంపెనీల కేంద్ర భద్రతాదళాలు, ఫ్లయింగ్ స్వ్క్డాడ్లు రంగంలో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మరే రాష్ట్రంలోనూ ఎన్నికలు లేనందున ఈ మూడు నియోజకవర్గాలపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అదనపు బలగాలు వస్తున్నాయని తెలిపారు. మూడు నియోజకవర్గాల్లోని అభ్యర్దులు ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కినట్లుగాా వ్యవహరిస్తే మరోసారి ఎన్నికలను వాయిదావేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. తంజావూరు, అరవకురిచ్చీల్లో వాహనాల తనిఖీల్లో రూ.7.12 కోట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఓటర్లకు నగదు పంచేందుకు వీలులేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ పరిస్థితిల్లో అధికారుల కళ్లుగప్పి ఓటర్ల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని ఆయన అన్నారు. అందుకే ఓటర్ల బ్యాంకు ఖాతాలపై కూడా నిఘాపెట్టామని తెలిపారు. ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున సొమ్ము జమ చేయడం, డ్రా చేయడం జరుగుతోందాని ప్రతిరోజూ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అనుమానం వస్తే నియోజకవర్గాల్లోని ఓటర్ల ఇళ్లను కూడా తనిఖీ చేస్తామని అన్నారు.ఎన్నికల అధికారులతోపాటూ ఆదాయపు పన్నుశాఖ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు. అన్నాడీఎంకే అభ్యర్థికి చుక్కెదురు తిరుప్పరగున్రం అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోస్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉదయకుమార్తోపాటూ కల్లంబల్ అనే గ్రామానికి వెళ్లారు. 2006 నుంచి 2011 వరకు ఏకే బోస్ ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పిస్తామని గడిచిన రెండు ఎన్నికల్లోనూ హామీ ఇచ్చి ప్రజలను వంచించారని దుయ్యబడుతూ ప్రచారానికి వచ్చిన బోస్‌ను, మంత్రిని గ్రామస్తులు ముట్టడించారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో మంత్రి ఉదయకుమార్, అభ్యర్థి బోస్ వెనుదిరిగారు. పుదుచ్చేరీ నెల్లితోప్పు కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి నారాయణస్వామికి మద్దతుగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఈనెల 13వ తేదీన పుదుచ్చేరీలో ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు, పుదుచ్చేరీల్లో ఉప ఎన్నికలు జరగుతున్న నాలుగు కేంద్రాల్లో నామినేషన్లకు బుధవారం తెరపడనుంది. -
అమ్మ వేలిముద్ర !
► బీ ఫాంలో అన్నాడీఎంకే ► అధినేత్రి జయ వేలిముద్ర ► వివాదాన్ని లేవనెత్తిన విపక్షాలు ► ఓకే అంటూ ఈసీ అంగీకారం ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ముగ్గురు అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫాంలలో పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సంతకం చేయకుండా వేలిముద్ర వేయడం వివాదాలకు తెరతీసింది. ఆమె అరోగ్యంగా ఉన్నపుడు అమ్మ వేలిముద్రా అంటూ విపక్షాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్య కారణాలతో జయలలిత సెప్టెంబరు 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు చేసిన చికిత్స ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది, దాదాపుగా కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి పడకపై కూర్చుని వైద్యులతో మాట్లాడుతున్నారని, తన చేతులతోనే ఆహారాన్ని తీసుకుంటున్నారని ఇటీవల వరకు చెబుతూ వచ్చారు. అమ్మ ఆసుపత్రి చికిత్స పొందుతున్న తరుణంలోనే తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ముగ్గురు అభ్యర్థులకు జయలలిత పార్టీ అధినేత్రి హోదాలో బీ ఫాంలను జారీ చేయడం తప్పనిసరి. జయ అంగీకారంతో కూడిన బీఫాంలను ఎన్నికల కమిషన్‌కు అప్పగించినపుడే అభ్యర్థులకు రెండాకుల గుర్తును కేటాయిస్తారు. అన్నాడీఎంకే తరఫున పోటీచేసే అభ్యర్థులకు 1989 నుంచి జయలలిత సంతకంతో కూడిన బీఫాంలనే అందజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన అన్నాడీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా, బీ ఫాంలో అమ్మ సంతకం ఉండాల్సిన స్థానంలో ఎడమచేతి వేలిముద్ర ఉంది. అమ్మ కోలుకున్న పరిస్థితుల్లో వేలిముద్ర వేయాల్సిన ఆవశ్యకత ఏమిటని విపక్షాలు విమర్శలు లేవనెత్తాయి. వేలిముద్ర వేసింది జయలలితేనా, బీఫాంలో వేలి ముద్ర చెల్లుతుందా అంటూ మరికొందరు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వేలిముద్రపై వైద్యుని వివరణ వేలి ముద్రకు సాక్షి సంతకం చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ బాలాజీ విపక్షాలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సీఎం కుడిచేతి గుండా మందులు ఎక్కిస్తున్న కారణంగా ఎడమ చేతి బొటనవేలి ముద్రను వేయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వేలిముద్ర వేసేపుడు ఆమె సృ్పహలోనే ఉన్నారు, వేలిముద్ర తీసుకోవడం సీఎంకు తెలుసని ప్రకటించాల్సి వచ్చింది. ఈసీ వివరణ ఈ నేపథ్యంలో వేలిముద్ర వ్యవహారంపై చీఫ్ ఎలక్షన్ కార్యాలయం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఒక ఉత్తరం రాసింది. అన్నాడీఎంకే తరఫున పోటీచేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు అందజేసే ఏ, బీ ఫారంలలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత చేతి ముద్రలు వినియోగిస్తున్నట్లు 26వ తేదీన పార్టీ కార్యాలయం నుంచి తమకు ఉత్తరం అందిందని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుని సమక్షంలో వేసిన వేలిముద్ర ఉప ఎన్నికల్లో చెల్లుబాటు అవుతుందని సీఈసీ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం వేలిముద్రతో కూడిన బీఫాంలపై ఆమోద ముద్ర వేశారు. వేలిముద్రపై ఏమా వేగం? బీఫాంలలో జయ వేలిముద్రను ఆమోదించడంలో ఎన్నికల కమిషన్ చూపిన వేగం అశ్చర్యాన్ని కలిగిస్తోందని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ వ్యాఖ్యానించారు. వేలిముద్రను అంగీకరించడం అన్నాడీఎంకేపై ఎన్నికల కమిషన్ చూపుతున్న హద్దుమీరిన ఆదరణ అని దుయ్యబట్టారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
జిల్లాపరిషత్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 19 న విడుదల చేసిన పంచాయతీ ఉప పోరుకు శుక్రవారం నుంచి నామినేషన్లుు స్వీకరిస్తున్నట్లు జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో మోహన్‌లాల్ తెలిపారు. జిల్లాలో ఖాళీ ఏర్పడిన ఒక ఎంపీటీసీ, మూడు సర్పంచ్, 38 వార్డుసభ్యుల స్థానాలకు వచ్చే నెల 8న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారని మోహన్‌లాల్ పేర్కొన్నారు. అంతకుముందు అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారన్నారు. ఎన్నికలు జరిగే మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంటుందని తెలిపారు. సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ ఎంపీటీసీ స్థానం ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వికలాంగులశాఖ సహాయ సంచాలకులు చిన్నయ్య, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ శ్రీనివాస్‌రావును నియమించగా, మిగిలిన సర్పంచి, వార్డుసభ్యుల ఎన్నికకు రిటర్నింగ్ అధికారులుగా స్టేజ్–1 ఈవోపీఆర్డీలను నియమించామని పేర్కొన్నారు. -
పోలింగ్ ప్రశాంతం
నాలుగు శాసన మండలి స్థానాలకు ముగిసిన ఎన్నికలు బెంగళూరు: నాలుగు శాసనమండలి స్థానాల కోసం గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో అటు రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఇటు ఎన్నికల కమిషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 13న వెల్లడి కానున్నాయి. దక్షిణ గ్రాడ్యుయేట్ నియోజక వర్గం, పశ్చిమ ఉపాధ్యాయ నియోజక వర్గం, వాయువ్య గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో 3,48,907 ఓటర్లు ఉండగా 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రతి నియోజక వర్గంలో అధికార కాంగ్రెస్‌తోపాటు విపక్ష భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌లు తమ అభ్యర్థులను బరిలో దించగా వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మాత్రం జేడీఎస్ సహకారంతో స్వతంత్ర అభ్యర్థి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొదటి మూడు గంటలు కొంత నెమ్మదిగా ప్రారంభమైన పోలింగ్ అటు పై నెమ్మదిగా పుంజుకుంది. మొత్తం ఓటర్లలో.53.14 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కూతురి పెళ్లి బాధ్యతను అప్పుగా చూపిన అభ్యర్థి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో తన అవివాహిత కుమార్తె పెళ్లి బాధ్యతను అప్పుల జాబితాలో చూపారు! గాందెర్‌బాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహమ్మద్ యూసఫ్ భట్ ఈ నిర్వాకం వెలగబెట్టాడు. దీనిపై విమర్శలు రావడంతో స్పందించారు. ‘నా కుమారులు సంపాదిస్తున్నారు కానీ, ఆమె సంపాదించడం లేదు. కుమార్తె పెళ్లి తండ్రి బాధ్యత. నా కూతురి పెళ్లికి బ్యాంకులో జమచేసిన డబ్బు గురించి అఫిడవిట్లో తెలిపాను’ అ చెప్పారు. తనకు సరిగ్గా చదువు రాకపోవడంతో బాధ్యతకు, అప్పుకు మధ్య తేడాను అర్థం చేసుకోలేకపోయానన్నారు. తనకు రూ.11 లక్షల చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్సీ సీటు కోసం దివంగత నేషనల్ కాన్ఫరెన్స్ నేత హాజీ యూసఫ్‌కు రూ. 84 లక్షలు ఇచ్చానని తెలిపారు. -
ఈసీ ఉత్తర్వులు సరికాదు
నిధుల సేకరణపై పార్టీల డిమాండ్ న్యూఢిల్లీ: ఎన్నికల వ్యయం, నిధుల సమీకరణలో పారదర్శకత పాటించాలంటూ ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. అసందిగ్ధంగా ఉన్న వీటిని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. రూ.20,000 దాటిన విరాళాలను నగదుగా స్వీకరించరాదని, చెక్కుల ద్వారానే సేకరించాలని ఈసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయంది. దీనిపై పార్టీలు అభ్యంతరం తెలిపాయి. న్యాయపరంగా ఇవి చెల్లుబాటు కావని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని పార్టీలతో చర్చించటంతోపాటు న్యాయశాఖ సలహా తీసుకోవాలని కాంగ్రెస్ నేత వోరా సూచించారు. ఈమేరకు ఆయన ఈసీకి లేఖ రాశారు. సమావేశాలు, వీధుల్లో చందాల సేకరణ ద్వారా విరాళాలు సమకూర్చుకుంటున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. హుండీలో చందాలు వేసే దాతలకు రసీదులు ఇవ్వాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. ఈసీ ఉత్తర్వులో పలు అంశాలు చెల్లవని, వీటికి తప్పుడు భాష్యాలు చెప్పే అవకాశం ఉందని సీపీఎం పేర్కొంది. -
13న జిల్లాలో యథావిధిగా ముఖ్యమంత్రి పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా ఖరారు చేసినట్లుగానే ఈనెల 13న జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక జరగనున్న ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని మినహాయించి జన్మభూమి కార్యక్రమాల నిర్వహణకు అనుమతివ్వడంతో సీఎం పర్యటనకు మార్గం సుగమమైంది. ఈ మేరకు శుక్రవారం జిల్లా యంత్రాంగానికి అధికారిక సమాచారం అందింది. ఓర్వకల్లు మండలం కాల్వ, హుసేనాపురం.. బనగానపల్లె మండలం పసుపుల గ్రామాల్లో నిర్వహించనున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, ఇతర అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు. 13న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న దృష్ట్యా శుక్రవారం రాత్రి ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ముందుగా బనగానపల్లె, ఆ తర్వాత ఓర్వకల్లు మండలంలో ఆయన పర్యటించే అవకాశం ఉందన్నారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించారు. సమావేశంలో జేసీ కన్నబాబు, సీపీఓ ఆనంద్‌నాయక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మండల నోడల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ జన్మభూమి కార్యక్రమాలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టండి వివిధ కారణాలతో నిలుపుదల చేసిన పింఛన్లపై మరోసారి వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లతో నిలుపుదల చేసిన పింఛన్లను పునఃపరిశీలన చేపట్టాలన్నారు. అర్హులని తేలిన వారికి తిరిగి పింఛన్లు మంజూరవుతాయని వివరించారు. కర్నూలు నుంచి కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడం వల్ల రెండు రోజుల పాటు వెరిఫికేషన్ నిలిచిపోయిందన్నారు. అందువల్ల పునఃపరిశీలనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. -
మోసకారి బాబును అనర్హుడిగా ప్రకటించాలి
అనంతపురం టవర్‌క్లాక్ : తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వామపక్షపార్టీల నేతలు ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగదీష్‌తోపాటు సీపీఐ సీనియర్ నాయకుడు ఎంవీ రమణ, సీపీఎం నగర కార్యదర్శి రాంభూపాల్, నల్లప్ప, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకరరెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకుడు చంద్రశేఖర్, ఎస్‌యూసీఐ నాయకులు రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు నె రవేర్చలేదని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చె ప్పి ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారని, రైతుకు అండగా నిలవాల్సిన బాబు వ్యవసాయాన్ని బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను మొండి బకాయిదారులుగా మార్చి ఆయా వర్గాలను నీరు గార్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ. 8లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇంత భారీ బడ్జెట్‌ను ఎక్కడ నుంచి తెస్తారని నిలదీశారు. అక్టోబర్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈనెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపటుతున్నట్లు ప్రకటించారు. 13న అన్ని మండల కార్యాలయాల ఎదుట ఆందోళన చేపడతామని, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
బూత్‌లవారీ కౌంటింగ్ రద్దుపై మీరేమంటారు?: సుప్రీం
కేంద్రానికి నోటీసులు నాలుగు వారాల్లో సమాధానం చెప్పండి న్యూఢిల్లీ: ఎన్నికల్లో బూత్‌లవారీగా ఓట్ల లెక్కింపును రద్దు చేయాలన్న ఎన్నికల కమిషన్ (ఈసీ)విజ్ఞప్తిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై 4 వారాల్లోగా తమ నిర్ణయమేంటో తేల్చి చెప్పాలని కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. ప్రస్తుత నిబంధనలను సవరించకుండా ఈ చర్య చేపట్టవచ్చో లేదో చెప్పాలంటూ ఈసీకి సూచించింది. ఎన్నికల్లో గెలిచినవారు.. తమకు తక్కువ ఓట్లువచ్చిన ప్రాంతంపై కక్షసాధింపునకు దిగడానికి ఈ బూత్‌ల వారీ లెక్కింపు ఆస్కారమిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. కేంద్రం ఈ అంశంపై ఐదేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, దీన్ని న్యాయ కమిషన్‌కు ఎందుకు రిఫర్ చేసిందని ప్రశ్నించింది. ‘ఈ విషయంలో ఎన్నికల సంఘం తన విధిని సక్రమంగా నిర్వర్తించగలదు. కానీ ఈ అంశంలో లా కమిషన్ ఏం చేస్తుందని.. వారి అభిప్రాయం అడిగారు. ఐదేళ్లుగా ఈ అంశాన్ని ఇలా నాన్చడంలో మీ ఉద్దేశం ఏమిటి’ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంజాబ్‌కు చెందిన అడ్వొకేట్ వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
నియోజకవర్గాలు.. మరో రెండు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 12 నియోజకవర్గాలతో తాజాగా రెండు కలిస్తే..మొత్తం 14 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నట్లు అధికార వర్గాల సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. పునర్విభజన ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గణాంకాల సేకరణపై దృష్టి సారించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రానికి 119, ఆంధ్రరాష్ట్రానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు. అయితే పునర్విభజన అనంతరం తెలంగాణలో అసెంబ్లీల సంఖ్య 175, ఆంధ్రలో నియోజకవర్గాల సంఖ్య 225కు పెరగనున్నట్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేల్చింది. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. జనాభా ప్రాతిపదికన.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూడు లేదా నాలుగు మండలాల కంటే ఎక్కువగా ఉండకుండా ..కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశమున్నట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం ఒంగోలు లోక్‌సభ పరిధిలో జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు మార్కాపురం, గిద్దలూరు, కొండపి, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలున్నాయి. బాపట్ల లోక్‌సభ కింద జిల్లాలో అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో అద్దంకి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రాంతాల్ని విభజించి ఒక కొత్త నియోజకవర్గం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. కందుకూరు అసెంబ్లీ మాత్రం నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఉంది. సంతనూతలపాడు, కొండపి, యర్రగొండపాలెం రిజర్వుడు నియోజకవర్గాలుగా ఉండగా, పునర్విభజనలో జిల్లాకు మరో రిజర్వుడు నియోజకవర్గం రావచ్చని ప్రస్తుత ఓటర్లు, సామాజికవర్గ గణాంకాల ఆధారంగా అధికారులు అంచనా వేస్తున్నారు. 2008-09 డీలిమిటేషన్ జరిగినప్పుడు మార్టూరు, కంభం నియోజకవర్గాలు చీలిపోయిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది ఓటర్లున్నారు. తాజాగా చేపట్టనున్న కొత్త ఓటర్ల చేర్పులతో కలిపి ఒక్కో నియోజకవర్గానికి రెండు లక్షల ఓటర్లకు మించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. జిల్లా మొత్తం జనాభాలో బీసీల తర్వాత అత్యధిక జనాభా, ఓటర్లు ఎస్సీలున్న ప్రాంతం రిజర్వుడుగా మారే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
మండల పరిషత్ సారథుల ఎంపిక విధి విధానాలు..
మంచిర్యాల రూరల్ : ఈ నెల 4వ తేదీన మండల ప్రజా పరిషత్ సారథుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీటీసీలు మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్ సభ్యుడి ఎంపిక కోసం ఎన్నికల సంఘం సూచించిన నియమాలు పాటించాలి. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులపై పోటీ చేసి గెలుపొందిన ఎంపీటీసీలు ఆయా పార్టీలు జారీ చేసిన విప్‌కు అనుగుణంగా నడుచుకోవాలి. విప్‌ను దిక్కరించే వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎంపికైన ఎంపీటీసీలు చాలా మంది రిజర్వేషన్లు అనుకూలించి కొత్తగా ఎంపికైన వారే ఉండడంతో వారిలో పలు రకాల అనుమానాలను నివృత్తి చేసేందుకు విధి విధానాలు అందిస్తున్నాం. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల రోజునే కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఒక్కో మండలానికి ఒక్కో కో-ఆప్షన్ సభ్యుడు ఉంటాడు. కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వారు మైనార్టీకి చెందిన వారై ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిస్టు, జొరాస్ట్రియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, మన రాష్ట్ర భాషలు కాకుండా ఇతర రాష్ట్రాల భాషలు మాట్లాడే వయోజనులు కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసేందుకు అర్హులు. వీరు ఆయా మండలానికి చెందిన వారై ఉండాలి. జూలై 4వ తేదీన ఉదయం 10 గంటలలోపు మండల పరిషత్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యులుగా పోటీ చేసేవారు నామినేషన్లు దాఖలు చేయాలి. 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం పోటీలో ఉన్నవారి పేర్ల ప్రచురణ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. అనంతరం వెంటనే కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం తక్షణ సమావేశం ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు పోటీలో ఉంటే, తెలుగు అక్షరమాల ప్రకారం జాబితాను సిద్ధం చేసి క్రమసంఖ్యలో నంబర్లను కేటాయించి, ఎన్నిక చేస్తారు. వీరిని ఎంపిక చేసేందుకు ఎంపీటీసీలు చేతులెత్తి ఓటు వేస్తారు. సమావేశంలో కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునేందుకు ఎంపీటీసీలకు విప్ నియమాలు వర్తించవు. కోరం ఉంటేనే అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం జూలై 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు తక్షణ సమావేశాన్ని ప్రిసైడింగ్ అధికారి ఏర్పాటు చేస్తారు. ఎంపిక నిర్వహణకు అరగంటలోగా ఎంపీటీసీల్లో సగం మంది తప్పనిసరిగా హాజరు కావాలి. ఆయా మండలంలోని ఎంపీటీసీల్లో సగంగానీ, అంత కంటే ఎక్కువ మందిహాజరైతే కోరం ఉన్నట్లు, సగం కంటే తక్కువ మంది సమావేశానికి హాజరైతే కోరం లేనట్లు, ఇలా కోరం లేకున్నా, కోరం ఉండి ఎన్నిక జరగని పక్షంలో ప్రిసైడింగ్ అధికారి మరుసటి రోజున అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పనిదినమైనా, సెలవు రోజైన సమావేశం ఉం టుంది. ఒకవేళ ఎన్నికకు కోరం లేక, ఇతరత్రా కారణాలతో మరోసారి ఎన్నిక జరగకపోతే, విషయాన్ని ఎన్నికల కమీషన్‌కు తదుపరి ఆదేశాల కోసం నివేదిస్తారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేవారి పేరును ఒక సభ్యుడు సూచించాలి. మరో సభ్యుడు సమర్ధించాలి. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చేతులెత్తే పద్ధతి ద్వారా తమ ఓటు వేయాలి. ఈ తతంగాన్ని అంతా ప్రిసైడింగ్ అధికారి వీడియో ద్వారా రికార్డు చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారిని అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడినప్పుడు, వారికి సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ప్రిసైడింగ్ అధికారి ‘డ్రా’ పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. విప్ ధిక్కరిస్తే అనర్హతే.. మండల పరిషత్తు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినందున, ఆయా పార్టీల గుర్తులపై గెలిచిన వారు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సూచించిన నిర్ణయాలకు కట్టుబడాలి. దీన్నే విప్ అంటారు. పార్టీ ఆదేశాలను ఏమాత్రం ధిక్కరించినా, ఆయా పార్టీలు వారి అభ్యర్థులపై కొరఢా ఝుళిపించే అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అమలయ్యేలా చూసేందుకు పార్టీ పక్షాన ఒక విప్‌ను నియమించుకోవచ్చు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాలి. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడిని గానీ, పార్టీ ఇతర నాయకుడిని గానీ విప్‌గా నియమించవచ్చు. స్థానిక సభ్యుడికి సమావేశం మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఇతర సభ్యుడైతే లోనికి ప్రవేశించేందుకు అనుమతించరు. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటు వేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం గంట ముందు ఎన్నికల అధికారికి అందించాలి. అయితే విప్ జారీ అయినా, ఒకవేళ ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకాలు చేయకపోతే విప్ వర్తించదు. ఏ పార్టీ సభ్యుడైనా విప్‌ను అందుకుని, ఎన్నిక సందర్భంగా దిక్కరించి, ఇతరులకు ఓటు వేస్తే ఆ ఓటు చెల్లుతుంది. విప్ ఉల్లంఘనపై పార్టీ విప్ మూడు రోజుల్లోపు ఎన్నికల అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఆయన సదరు సభ్యుడిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో వివరించాలని నోటీసు జారీ చేస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో, ఆ సభ్యుడు అర్హత కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. -
జంప్‌జిలానీల్లో ‘విప్’ భయం
మోర్తాడ్: ఎన్నికల సంఘం ప్రకటనతో జంప్‌జిలానీల్లో ‘విప్’ భయం పట్టుకుంది. స్థానిక సంస్థల సభ్యులు పార్టీల గుర్తులపై ఎన్నిక కావడంతో వారు పరోక్ష ఎన్నికల్లో పార్టీల నాయకత్వం నిర్ణయం ప్రకారమే ఓటు వేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సభ్యత్వం ర ద్దు అవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిం చిం ది. దీంతో జంప్జిలానీలను ‘విప్’ కలవరపెడుతోం ది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడిన 50 రోజుల తర్వాత మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరుగనున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వనుంది. ఇప్పటికే క్యాంపుల్లో జిల్లా పరిషత్, మున్సిపల్‌ల కంటే మండల పరిషత్‌లలోనే జంప్‌జిలానీలు ఎక్కువగా ఉన్నారు. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఏ పార్టీకి వస్తే ఇతర పార్టీల ఎంపీటీసీ సభ్యులు మెజార్టీ ఎంపీటీసీల క్యాంపులకు వెళ్లారు. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. అనేక చోట్ల టీఆర్ఎస్ శిబిరాల్లో కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కొన్ని శిబిరాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆ పార్టీ తరపున నెగ్గిన చాలామంది ఎంపీటీసీలు కాంగ్రెస్ క్యాంపుల నుంచి తిరిగి వచ్చారు. కొందరు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు కూడా టీఆర్ఎస్ క్యాంపుల్లో ఉన్నారు. సభ్యత్వమే రద్దు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే విప్ జారీ చేస్తామని ఆయా పార్టీల నాయకత్వం హెచ్చరించినా వీరు పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విప్‌లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సారి మాత్రం పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యులు ఆయా పార్టీల విప్‌కు అనుగుణంగానే ఓటు వేయాలని స్పష్టంచేసింది. లేకుంటే సభ్యత్వం రద్దు అవుతుందని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి నోటిఫికేషన్లోనే స్పష్టం చేశారు. దీంతో పార్టీ విప్‌కు ప్రాధాన్యత పెరిగింది. పార్టీ ఆదేశాలను పాటించని నాయకులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎంతో శ్రమించి గెలుపొందిన తాము పార్టీ విప్‌ను ధిక్కరిస్తే వేటు పడుతుందని ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి దాదాపు ఇన్నిరోజుల పాటు క్యాంపులను నిర్వహించినా ‘విప్’ దెబ్బకు వృథా అయిపోయిందని వాపోతున్నారు. ఈసారి విప్ జారీ వల్ల చాలా మండలాల్లో చైర్మన్, వైఎస్‌చైర్మన్ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వచ్చేసారికి 15
పెరగనున్న మూడు అసెంబ్లీ స్థానాలు 2019 ఎన్నికల్లోపు కొత్తవి ఏర్పాటు ఆశల్లో ద్వితీయ శ్రేణి నేతలు మారనున్న రాజకీయ ముఖచిత్రం లోక్‌సభ నియోజకవర్గాల పరిధి కాకుండా... జిల్లాను యూనిట్‌గా తీసుకుని పునర్విభజన ప్రక్రియ చేపడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే జరిగితే గతంలో నియోజకవర్గాలు ఉన్న చేర్యాల మళ్లీ అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఏర్పడే అవకాశం ఉండనుంది. తొర్రూరు, హసన్‌పర్తి, కేసముద్రం, నెక్కొండ వంటి జనాభా ఎక్కువగా ఉండే మండల కేంద్రాలను కొత్త నియోజకవర్గాల కేంద్రాలుగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులోనే ‘కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి’ అని పేర్కొనబడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సాధారణ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెట్టనుంది. వచ్చే ఎన్నికల్లోగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. గతంలో పలుమార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. పార్లమెంట్ నిర్ణయం ప్రకారం సాధారణంగా ప్రతి 20 లేదా 30 ఏళ్లకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 1978, 2009 ఎన్నికలకు ముందు పునర్విభజన చేశారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 153కు పెరగనుంది. 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పునర్విభజన ప్రక్రియలో భాగం గా ప్రతి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కొత్తగా రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి తగ్గించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. మన జిల్లాలో కొత్తగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పడే ఆస్కారముంది. జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఈ సెగ్మెంట్ పరిధిలో అదనంగా రెండు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటు కానున్నాయి. వరంగల్ నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు అదనంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ పేరుతో ఈ సెగ్మెంట్ ఏర్పడే అవకాశం ఉంది. మరో నియోజకవర్గం ఏ మండలం కేంద్రంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో నియోజకవర్గాలుగా ఉన్న హసన్‌పర్తి, ధర్మసాగర్, శాయంపేట పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో మన జిల్లాలోని నాలుగు, ఖమ్మం జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మన జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రస్తుత పరిధిని తగ్గించి మిగిలిన భాగంతో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పాటు కానుంది. దీన్ని ఏ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొత్త స్థానాలపై కోటి ఆశలు మొత్తంగా జిల్లాలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు ఏ మండల కేంద్రంగా ఉంటాయి... అక్కడి రిజర్వేషన్ పరిస్థితులు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు ముందుగా జరిగితే... నియోజకవర్గాల పునర్విభజన అనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జరగనుంది. ఇన్నాళ్లు మండల స్థాయిలో ఇప్పటికే పదవులు అనుభవించిన వారి దృష్టి ఇప్పుడు నియోజకవర్గాలపై పడింది. కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలపై ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నాయకులు సైతం... కొత్తగా ఏర్పడే నియోజకవర్గం అనుకూలంగా ఉంటుందా అనే విషయంపై ఆలోచిస్తున్నారు. -
నంబర్ గేమ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల సారథుల ఎంపికకు ముహూర్తం ఖరారుకావడమే తరువాయి.. రాజకీయపక్షాలు ‘కుర్చీలాట’లో పైచేయి సాధించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నంబర్‌గేమ్‌లో ముందు వరుసలో ఉండేం దుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. మున్సిపాలిటీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం ప్రధాన పార్టీలు అంతర్గత సమావేశాల్లో బిజీగా గడిపాయి. సొంత పార్టీ సభ్యులను క్యాంపులకు తరలించడం మొదలు ఇతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టే అంశంపై చర్చోపచర్చలు సాగించాయి. మండలాల్లో పాగా వేసే దిశగా వ్యూహారచన చేస్తున్న ఆశావహులు.. ఎంపీటీసీలను మరోసారి యాత్రలకు పంపారు. స్థానిక సంస్థల పీఠాలను కైవసం చేసుకునే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్న అధిష్టానాలు.. సొంత పార్టీ సభ్యులను కాపాడుకునే బాధ్యత కూడా వారికే కట్టబెట్టారు. నగర పంచాయతీ/మున్సిపాలిటీల చైర్మన్ల ఎంపికపై టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నాయి. పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో స్పష్టమైన అధిక్యత లభించడంతో ఈ రెండింటి చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. బడంగ్‌పేటలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ లభించింది. అలాగే తాండూరులో టీఆర్ఎస్, మజ్లిస్‌లు పోటాపోటీగా కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్నికల అనంతరం ఈ ఇరుపార్టీల మధ్య బంధం బలపడిన నేపథ్యంలో ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించే వాతావరణం కనిపిస్తోంది. ఇక వికారాబాద్‌లో మాత్రం ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అత్యధిక సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలను అనుకూలంగా మలుచుకునే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఆ పార్టీ.. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగియున్న ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వికారాబాద్ మున్సిపాలిటీనే ఆఫ్షన్‌గా ఇచ్చారు. దీంతో సంఖ్యాబలం అటు ఇటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. జోరుగా మంతనాలు! సుదీర్ఘ విరామం తర్వాత అత్యధిక జెడ్పీటీసీలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా జిల్లా పరిషత్ పీఠాన్ని అధిరోహించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఆ పార్టీ అగ్రనేతలు విభేదాలు పక్కనపెట్టి శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాద్‌కుమార్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో సమావేశమైన సీఎల్పీ నేత జానారెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీ చేజార్చుకోవద్దని తేల్చిచెప్పారు. సొంత పార్టీ సభ్యులను సమన్వయపరిచే బాధ్యతను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్‌లకు అప్పగించిన జానా.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశాన్ని కేఎల్లార్‌కు కట్టబెట్టారు. మరోవైపు శంషాబాద్‌లో ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు సమావేశమై.. తాజా పరిణామాలను చర్చించుకున్నారు. యాదవరెడ్డి తప్పుకుంటే బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఎనుగు జంగారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో హైకమాండ్‌తో ఈ అంశంపై శనివారం చర్చించాలని నిర్ణయించారు. కాగా, మంచిరెడ్డితో భేటీ అయిన కేఎల్లార్, ప్రసాద్‌లకు స్పష్టమైన హామీ లభించలేదు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ముందు మీ పార్టీలో ఏకాభిప్రాయం సాధించండి.. అప్పుడు మా నిర్ణయాన్ని వెల్లడిస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇదిలావుండగా.. జిల్లా పరిషత్ కుర్చీ దక్కించుకునేందుకు దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్.. కాంగ్రెస్, టీడీపీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్‌లో అనైక్యతతో మేజిక్ ఫిగర్‌ను సాధిస్తామని భావిస్తున్న ఆపార్టీ.. టీడీపీలో ఒక వర్గం తమకు అనుకూలంగా ఉంటుందని అంఛనా వేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో మంత్రి పి.మహేందర్‌రెడ్డి చర్చించినట్లు తెలిసింది. సాధ్యమైనంతవరకు అధిక సంఖ్యలో మండల పరిషత్‌లను కైవసం చేసుకునే దిశగా వ్యూహరచన చేయాలని ఆదేశించినట్లు సమాచారం. -
విప్ ధిక్కరించారో...
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: జిల్లా, మండల పరిషత్ పాలకవర్గ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-అప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నిబంధనలు ఇప్పటికే జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాలకు ఎన్నికల కమిషన్ నుంచి అందాయి. మరో వారం రోజుల్లో పాలక వర్గాలను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడం, ఫలితాలు వెలువడడం, పాలకవర్గం ఎంపిక వంటి ప్రక్రియలు ఆలస్యంగానే జరుగుతున్నాయి. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత మరో మూడు నాలుగు రోజుల్లో జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలు కూడా పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇలా... * సెక్షన్ 17 (3) (వీ)ప్రకారం మండల పరిషత్‌కు ఇద్దరు మైనార్టీ సభ్యులను కో-అప్షన్ సభ్యులుగా ఎన్నుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు అర్హులు. *సెక్షన్(171) (1) ప్రకారం జెడ్పీ చైర్మన్‌ను జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) సభ్యులు చేతులు ఎత్తి ఎన్నుకోవాలి. ఇక్కడ కూడా గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకే నడుచుకోవాలి. విప్ దిక్కరిస్తే జెడ్పీటీసీ సభ్యత్వం రద్దుచేసే అవకాశం ఆయా పార్టీలకు ఉంది. * జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్, అధ్యక్షులను ఎన్నుకునేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతోపాటు కో-ఆప్షన్ సభ్యులే అర్హులు. * ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. వారు ఆయా సమావేశాలకు హాజరైతే కూర్చోనేందుకు ప్రత్యేక స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. * సమావేశ భవనం ఎలాంటి ప్రచారాలకు ఇవ్వకూడదు. సభ్యులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకూడదు. *ఏవేని కారణాలతో కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. *ఈఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశంలో ఎన్నికైన సభ్యుల్లో రెండింట మూడోవంతు కోరం తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం గంట సమయాన్ని కేటాయిస్తారు. అప్పటికీ కోరం లేకపోతే మరుసటి రోజుకు సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఆరోజు కూడా పరిస్థితిలో మార్పురాకపోతే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహిస్తారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ఇలా... *పంచాయతీ రాజ్ చట్టం 1994, సెక్షన్ 149 (1) (వీ)ప్రకారం ప్రతి మండలానికి ఒక మైనార్టీని కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకోవాలి. కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకునే వ్యక్తికి 21 ఏళ్లు నిండి ఆదే మండలంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. *సెక్షన్ 153 (1)ప్రకారం మండలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని సభ్యులు చేతులెత్తే పద్దతిలో ఎన్నుకోవాలి. గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. విప్‌ను దిక్కరించిన వారి సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం ఆయా పార్టీలకు ఉంటుంది. -
రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెనువెంటనే జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో సమూల ప్రక్షాళన జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి మొదలు రెండు డివిజన్ల ఆర్డీవోలు, పలువురు తహసీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన శివారు మండలాల్లోని డిప్యూటీ కలెక్టర్ స్థాయి తహసీల్దార్లందరినీ బదిలీ చేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పొరుగు జిల్లాలకు వెళ్లి తిరిగొచ్చిన తహసీల్దార్ల పోస్టింగ్‌లపై జిల్లా యంత్రాంగం మంగళవారం రాత్రి దాకా కసరత్తు చేసింది. సమర్థత, పనితీరును ప్రామాణికంగా తీసుకొని జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ బదిలీల జాబితా రూపొందించగా.. సచివాలయ స్థాయిలో లాబీయింగ్, రాజకీయ ఒత్తిళ్లతో జాబితా పూర్తిగా మారిపోయింది. తమ కనుసన్నల్లో మెలిగే అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ‘మంత్రాంగం’ నెరపడంతో బదిలీలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వ స్థాయిలో జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు రావడంతో బదిలీలు బుధవారానికి వాయిదాపడ్డాయి. డీఆర్వో, ఇద్దరు ఆర్డీవోల బదిలీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కారు.. తొలి రోజే జిల్లా రెవెన్యూ అధికారిపై బదిలీ వేటు వేసింది. రాయలసీమకు చెందిన ఎస్. వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సుందర్ అబ్నార్‌ను నియమించింది. అలాగే ఎన్నికల ముందు జిల్లాకు వచ్చిన చేవెళ్ల, రాజేంద్రనగర్ ఆర్డీవోలకు కూడా స్థానభ్రంశం కలిగించింది. రాజేంద్రనగర్ ఆర్డీవోగా గతంలో జిల్లాలో పనిచేసిన సురేశ్ పొద్దార్‌ను నియమించింది. మరోవైపు శివార్లలోని కీలక మండలాల తహసీల్దార్లందరినీ సాగనంపింది. భూముల విలువలు ఆకాశాన్నంటడంతో హాట్ సీట్లుగా మారిన ఈ మండలాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు అత్యున్నతస్థాయిలో పైరవీలు సాగుతాయి. ఈ క్రమంలోనే ఈ మండలాలపై కన్నేసిన పలువురు తమ పలుకుబడిని ఉపయోగించి పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. జిల్లా న్యాయాధికారిగా పనిచేస్తున్న హరీశ్‌ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీకి చెందిన ఇతని స్థానంలో విక్టర్‌ను నియమించింది. అంతర్జాతీయ విమానాశ్రయం భూ సేకరణాధికారిగా పనిచేస్తున్న ఎంవీ భూపాల్‌రెడ్డికి హైదరాబాద్ జిల్లా న్యాయాధికారిగా పోస్టింగ్ ఇచ్చింది. 31 మంది తహసీల్దార్లకు స్థానచలనం ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కి వచ్చిన తహసీల్దార్ల పోస్టింగ్‌లపై జిల్లా యంత్రాంగం రోజంతా కుస్తీ పట్టి జాబితా తయారు చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో కొత్త తహసీల్దార్ల నియామకానికి ఉత్తర్వులు కూడా సిద్ధం చేసింది. దీంట్లో శివారు మండలాల్లోని ఆరుగురు డిప్యూటీ కలెక్టర్ స్థాయి తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గ్రామీణ మండల తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి జిల్లా యంత్రాంగం జాబితాను తయారు చేసింది. అయితే, ఈ పోస్టింగ్‌లపై తీవ్ర రాద్ధాంతం నెలకొంది. ఉద్యోగసంఘాల ఒత్తిళ్లు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల తాకిడి పెరిగిపోవడంతో జాబితా ఆసాంతం మారిపోయింది. పొరుగు జిల్లాల నుంచి మరికొందరు.. అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో తహసీల్దార్ల బదిలీలపై అయోమయం నెలకొంది. మరోవైపు పొరుగు జిల్లాలకు చెందిన కొందరు తహసీల్దార్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోస్టింగ్‌లను నిలిపివేయాలని జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా, నగరానికి ఆనుకొని ఉన్న మండలాల్లో పోస్టింగ్‌ల కోసం తీవ్ర స్థాయిలో పైరవీలు సాగాయి. కలెక్టరేట్లోనే తిష్టవేసిన తహసీల్దార్లు కోరుకున్న మండలాలను దక్కించుకునేందుకు తమదైన శైలిలో పలుకుబడిని ఉపయోగించారు. -
ఈ నాయకులు.. మాకొద్దు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈ నాయకులు మాకొద్దంటూ పలువురు ఓటర్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబో) మీట నొక్కారు. నిజామాబాద్ అర్బన్‌లో అతి తక్కువగా ఈ మీటను ఉపయోగించుకోగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా నోటాకు ఓటేశారు. ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. నచ్చిన అభ్యర్థులు ఎవరూ లేనందున తాము ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని సాకులు చెప్పేవారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బ్యాలెట్లో నోటాను చేర్చారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో దీనిని చాలామంది వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 7,766 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 8,264 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 695 మంది, నిజామాబాద్ రూరల్ స్థానంలో 2 వేల మంది, కామారెడ్డిలో 1,479, బాన్సువాడలో 1,313, జుక్కల్‌లో 1,430, బోధన్‌లో 1,397, ఆర్మూర్‌లో 1,435, బాల్కొండలో 1,525, ఎల్లారెడ్డిలో 2,212 మంది నోటాను వినియోగించుకున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 16 వేలపైచిలుకు మంది ఓటర్లు నోటాకు ఓటేసి అభ్యర్థులెవరూ నచ్చలేదని చెప్పడం గమనార్హం. మహిళ మెడలోంచి చైన్ చోరీ నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ మెడలోంచి దొంగలు బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యారు. ఒకటో టౌన్ ఎస్హెచ్ఓ నర్సింగ్ యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన సరిత తన తోటి కోడలుతో కలిసి శనివారం నిజామాబాద్‌లోని ద్వారకానగర్‌లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చూపించుకుని నడుచుకుంటూ వెళ్తుండగా వీరి వద్దకు బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. సరిత మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని పారిపోయారు. ఆమె తేరుకుని అరిచేలోపే దొంగలు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. -
రెండు ఎంపీటీసీలకు నేడు ఎన్నిక
ఇందూరు/ ధర్పల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో రద్దయిన రెండు ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. పిట్లం మండలంలోని బండపల్లి, ధర్పల్లి మండలంలోని మైలారం ఎంపీటీసీ స్థానాలు నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనే ఆరోపణలతో గత నెల 12న ఆ రెండు స్థానాల ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి నామినేషన్ లు స్వీకరించారు. మైలారం స్థానానికి స్వతంత్ర అభ్యర్థి సీహెచ్ ప్రకాష్, కాం గ్రెస్ అభ్యర్థి లలితా నాయక్‌లు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ పరిధిలో మై లా రం, కేశారం గ్రామాలు ఉన్నాయి. మొత్తం 1823 మంది ఓటర్లు ఉన్నారు. కేశారం గ్రామంలోని ఒకటో నంబర్ పోలింగ్ కేంద్రంలో 565 మంది, మై లారంలో రెండో నంబర్ పోలింగ్ బూత్‌లో 615 మంది, మూడో బూత్‌లో 643 మంది ఓటర్లు ఉన్నారు. బండపల్లి స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి రజినీ కాంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నడ్పి గంగారాం పోటీలో నిలిచారు. ఇక్కడ మొ త్తం 2235 మంది ఓటర్లు ఉండగా, మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందిని నియమించారు. బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ ఉ.7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఫలితాలను సోమవారం వెల్లడిస్తారు. వేతనంతో కూడిన సెలవు మైలారం, బండపల్లి ఎంపీటీసీ స్థానాల పరిధిలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఆదివారం వేతనంతో కూడిన సెల వును జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రకటించారు.యజమానులు కార్మికులకు సెలవునిస్తూ ఓటు వేసే విధంగా సహకరించాలని ఒక ప్రకటనలో కోరా రు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
భూపాలపల్లి 21.. ‘తూర్పు’ 16 రౌండ్లు
లెక్కింపునకు 14 టేబుళ్ల ఏర్పాటు వేర్వేరుగా పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు చివరగా భూపాలపల్లి ఫలితం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో స్థల సమస్య ఉన్నట్లయితే మరో గదిలో లెక్కించుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది. అయితే ఒకే హాల్లో వేర్వేరు టేబుళ్లను ఏర్పాటు చేసి లెక్కింపు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఈవీఎంలు (కంట్రోల్ యూనిట్) టేబుల్‌కు ఒకటి చొప్పున లెక్కిస్తారు. అలా నియోజకవర్గం లెక్కింపు పూర్తయ్యేసరికి ఒక టేబుల్‌పై ఎన్ని ఈవీఎంలు లెక్కిస్తారో అన్ని రౌండ్ల లెక్కింపు జరిపినట్లు లెక్క. ఉదాహరణకు.. జనగామ అసెంబ్లీ పరిధిలో మొత్తం 267 ఈవీఎంలు ఉన్నాయి. 14 టేబుల్స్‌కు ఒక్కో టేబుల్‌కు 20 ఈవీఎంల చొప్పున లెక్కకు వస్తాయి. చివరి రౌండ్ వరకు మొదటి టేబుల్‌పై ఒక ఈవీఎంను మాత్రమే లెక్కిస్తారు. అంటే జనగామ లెక్కింపు మొత్తం 20 రౌండ్లలో పూర్తవుతుందన్న మాట. కాగా, జిల్లాలోనే అత్యధిక ఈవీఎంలను భూపాలపల్లిలో వాడారు. ఇక్కడ మొత్తం 289 ఈవీఎంలలో ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ 21 రౌండ్ల లెక్కింపు చేయాల్సి ఉంటుంది. అతి తక్కువ ఈవీఎంలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాడారు. ఇక్కడ కేవలం 213 మాత్రమే ఉన్నాయి. దీంతో ఫలితం 16 రౌండ్లకే తెలుస్తుందన్న మాట. అంటే.. వరంగల్ తూర్పు లెక్కింపు ప్రారంభమైన మూడు గంటల్లోపు వచ్చే అవకాశం ఉంది. అధికారులు అంతా అనుకున్నట్లు పనిచేస్తే ఎక్కువ రౌండ్లున్న భూపాలపల్లి ఫలితం చివరగా వెలువడొచ్చు. లేదంటే లెక్కింపు సందర్భంగా ఈవీఎంలు మొరాయిస్తే మరింత ఆలస్యం కావచ్చు. అయితే నియోజకవర్గాల వారీగా లెక్కింపు రౌండ్లను ఓసారి పరిశీలిస్తే.. -
‘పుర’ ఫలితాలు నేడే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టిక్.. టిక్.. టిక్.. గడియారం చప్పుడు రాజకీయ పార్టీల నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మరికొద్ది సేపట్లో పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం, పోలింగ్ పనుల్లో బిజీగా గడిపిన నేతల భవితవ్యం కొన్ని గంటల్లో తేలనుంది. సోమవారం ఉదయం 8గంటలకు పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గత మార్చి 30న జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఫలితాల తాలూకు ప్రభావం ఉంటుందని భావించిన పలువురు నేతలు కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు అన్ని ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో ఫలితాలను తేల్చేందుకు ఎన్నికల సంఘం ఉపక్రమించింది. ఇందులో భాగంగా సోమవారం పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు ప్రకటించనుండగా.. మంగళవారం ప్రాదేశిక స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తేలనున్న 663 మంది భవిష్యత్తు ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 119 కౌన్సిలర్ స్థానాలకుగాను వివిధ పార్టీలకు చెందిన 663 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శక్తియుక్తులన్నీ కూడగట్టి జోరుగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు ఫీట్లు చేశారు. ఓటింగ్ సమయం వరకు గెలుపు కోసం కృషి చేసిన వీరంతా నెలకుపైబడి ఫలితాల కోసం అంచనాలు వేసి తమ బలమెలా ఉందనే కోణంలో రకరకాల సర్వేలు నిర్వహించారు. మొత్తంగా సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశం మధ్యాహ్నం వరకు స్పష్టం కానుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ఇక్కడే.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 30న పోలింగ్ జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పురపాలక ఎన్నికల ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీలకు సంబంధించి నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదేవిధంగా వికారాబాద్ మున్నిపల్ ఎన్నికల కౌంటింగ్ వికారాబాద్‌లోని ఎస్ఏపీ కాలేజీలో, తాండూరు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు తాండూరు టీఆర్సీలో నిర్వహిస్తున్నారు. -
వెన్నంపల్లిలో రీ పోలింగ్
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం వెన్నంపల్లిలోని 170 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంలో 204 ఓట్లు నమోదైన తరువాత ఈవీఎం మొరాయించింది. దీంతో అధికారులు మరో ఈవీఎంను అక్కడ ఏర్పాటు చేయగా అందులో 210 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్ కేంద్రంలో 471 ఓటర్లు ఉండగా, 414 ఓట్లు పోలయ్యాయి. ముందుగా ఏర్పాటు చేసిన ఈవీఎంలోని 204 ఓట్లు ఎవరికి పడ్డాయనే విషయం ఈవీఎంలో ఫలితాలు చూపించకపోవచ్చనే భావనకు అధికారులు వచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సం ఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఈ నెల 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధి కారి ఎన్.మధసూదన్ తెలిపారు. రీ పోలింగ్‌ను ఎంపీకి మాత్రమే జరుగుతుందని చెప్పారు. -
ఒకచోట రీపోలింగ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఈవీఎం పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. అలాంటి సంఘటనలుంటే వెంటనే తనకు నివేదించాలని సూచించారు. దీంతో జిల్లాలోని కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 371ఎ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడంతో అక్కడ పోలింగ్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ ఒక్క కేంద్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి నివేదించగా అందుకు ఈసీ స్పందిస్తూ ఆమోదముద్ర వేసింది. ఈ కేంద్రంలో ఈ నెల 13న రీపొలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. -
కోరుట్లలో రీ ఎలక్షన్ నిర్వహించాలి
హైకోర్టును ఆశ్రయించనున్న శివసేన అభ్యర్థి కోరుట్ల, న్యూస్‌లైన్ : కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌పై హైకోర్టులకు వెళ్లనున్నట్లు శివసేన నియోజకవర్గ అభ్యర్థి కరిజెంగుల నరేశ్ తెలిపారు. పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తమకు కేటాయించిన బాణం-విల్లు గుర్తు తారుమారైందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందన్నారు. దీంతో మంగళవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. చిన్నపాటి పొరపాట్లకే కోడ్ ఉల్లంఘన కేసులు పెట్టే ఎన్నికల కమిషన్.. గుర్తు కేటాయింపులో వారే తప్పు చేశారన్నారు. సమావేశంలో శివసేన నాయకులు గట్ల విజయ్‌కుమార్, జిల్లా కన్వీనర్‌రామాగౌడ్, ఇందూరి వేణుగోపాల్ పాల్గొన్నారు. -
పెయిడ్ న్యూస్ కేసులో అశోక్‌చవాన్‌కు చుక్కెదురు
సాక్షి, ముంబై: పెయిడ్ న్యూస్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్‌కు చుక్కెదురైంది. తనపై ఎన్నికల కమిషన్ ప్రారంభించిన దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా కోరుతూ చవాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చవాన్‌కు అనుకూలంగా అనేక వార్తలు వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. దీంతో చవాన్ ఎన్నికల ఖర్చు పరిమితి దాటిందని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థి మాధవ్ కిన్వల్కర్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఎన్నికల కమిషన్ దర్యాప్తు అధికారులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్యాప్తును నిలిపివేయాలని అశోక్ చవాన్ ముందుగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కూడా అదే తీర్పు పునరావృతం కావడం, ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వార్తపత్రికల్లో ఇచ్చే ప్రకటనల ఖర్చులు చూపించనట్టయితే ఎన్నికల కమిషన్‌కు దర్యాప్తు చేసేందుకు పూర్తి అధికారాలున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో చవాన్ దర్యాప్తును ఎదుర్కొనక తప్పని పరిస్థితి నెలకొంది.