ghats
-
కాశీలో గంగానది ఉగ్రరూపం.. 84 ఘాట్లు నీట మునక
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. వరదల కారణంగా గంగానది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఘాట్లకు సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాశీలోని మొత్తం 84 ఘాట్లు నీట మునిగాయి. ప్రస్తుతం హరిశ్చంద్ర ఘాట్ వీధుల్లో దహన సంస్కారాలు జరుగుతున్నాయి.గత 10 రోజులుగా వారణాసిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీధుల్లో దహన సంస్కారాలు చేయడం వల్ల కర్మకాండలు చేసేవారు సరైన సంప్రదాయాలను పాటించలేకపోతున్నారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. సాయంత్రం పూట దహన సంస్కారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మణికర్ణిక ఘాట్‌లో దహన సంస్కారాల కోసం జనం చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. -
అయోధ్యలో అత్యద్భుతమైన ఐదు ఘాట్ లు
-
హిందూయేతరులు ఘాట్‌కు రావద్దు
వారణాసి: హిందువులు కాని వారు గంగా నది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే గుడులకు దూరంగా ఉండాలని హెచ్చరించే పోస్టర్లు కాశీ పుర వీధుల్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని తొలగించిన పోలీసులు ఇవి ఎలా వచ్చాయన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. జాతీయవాద సంస్థలు వీటి వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘గంగా ఘాట్లు, కాశీ దేవాలయాలు సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి, విశ్వాసానికి, నమ్మకానికి చిహ్నాలు, వీటిపై నమ్మకమున్నవారికి స్వాగతం, లేదన్న వారు ఇది పిక్నిక్ స్పాట్ కాదని గుర్తుపెట్టుకోండి’ అని ఈ పోస్టర్లలో రాశారు. వీటిపై హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం అనే శీర్షికనుంచారు. ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక అనే బెదిరింపులు కూడా వీటిపై ఉన్నాయి. ఈ పోస్టర్ల ఫొటోలు, వీడియోలను వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దర్శనమిచ్చాయి. భేల్‌పూర్ పోలీసులు వీటిపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియోల్లో, ఫొటోల్లోని కొందరిని గుర్తించామన్నారు. హిందూయేతరులు ఘాట్ల పవిత్రతను దెబ్బతీస్తారని, అందుకే వీరికి ఈ వార్నింగ్ ఇచ్చారని బజరంగ్దళ్ నేత నిఖిల్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు. వీరంతా ఘాట్లలో మద్యం తాగడం, మాంసం తినటం చేస్తారని ఆరోపించారు. ఇటీవలే కొందరు బాలికలు ఘాట్లలో బీర్లు తాగుతున్న ఫొటోలు బయటపడ్డాయని, ఇలాంటి వారు తమకు పట్టుబడితే పోలీసులకు అప్పజెబుతామని హెచ్చరించారు. -
కాలుతున్న శవాల మధ్య వేశ్యల నృత్యం
వారణాసి : తమ వారిని కోల్పోయిన సమయంలో దహన సంస్కారాల వద్ద ఆత్మీయుల రోదనలను చూస్తుంటాం. కానీ, వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద ఇందుకు భిన్నంగా జరుగుతుంది. నిరంతరం దహన సంస్కారాలు జరిగే ఈ ప్రదేశంలో ఓ వింత ఆచారం అమలు అవుతోంది. చైత్ర నవరాత్రి సప్తమి రోజున రాత్రి నుంచి తెల్లవారే వరకూ వేశ్యలు అవిరామంగా మణికర్ణిక ఘాట్‌లో నృత్యాలు చేస్తారు. అయితే ఈ నృత్యాలు వేడుక కోసం కాదు. జీవితంలో తాము చేసిన తప్పులను మన్నించమని మహా శంషాన్ బాబాను కోరుతూ వారందరూ ఈ నృత్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల మిగిలిన జీవితంలో ఆ వేశ్యలకు ఆనందం, గౌరవం దక్కుతాయని నమ్మకం. ఈ మణికర్ణిక ఘాట్ వద్దే పార్వతి దూరమైన తర్వాత ఆ ఎడబాటును భరించలేని మహాశివుడు తాండవ నృత్యం చేశాడని ప్రతీతి. మణికర్ణిక ఘాట్ వద్ద వేశ్యలు చేసే ఈ నృత్యాన్ని ‘తపస్యా’ అని పిలుస్తారు. ప్రతి ఏడాది చైత్ర నవరాత్రి సందర్భంగా సప్తమి రోజున వేశ్యలు ఇక్కడికి వచ్చి బాబా ముందు నృత్యం చేస్తారు. ఎప్పుడు మొదలైందీ సాంప్రదాయం...? 16వ శతాబ్దంలో అక్బర్ నవరత్నాల్లో ఒక్కరైన రాజా మన్ సింగ్ ఈ ఘాట్‌లో ఓ ఆలయాన్ని మహాశివుడికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఓ మ్యూజికల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. కానీ కాలుతున్న శవాల మధ్యకు వచ్చి నృత్యం చేసేందుకు ఏ కళాకారుడు ముందుకు రాలేదు. దాంతో వేశ్యలకు కబురు పంపడంతో వారు అక్కడకు వచ్చి నాట్యం చేశారు. ఆనాటి నుంచి చైత్ర నవరాత్రి సప్తమి రోజున వేశ్యలు మణికర్ణిక ఘాట్‌లో నృత్యం చేస్తున్నారు. -
నిర్మించినా.. నిరుపయోగమే!
– రూ.13కోట్లతో 7ఘాట్లు – రూ.17కోట్లతో రహదారులు – 2చోట్ల మాత్రమే ఉపయోగం కృష్ణా పుష్కరాల్లో భాగంగా పెబ్బేరు మండలంలో మొత్తం ఏడు ఘాట్లు నిర్మించారు. ఇందులో కేవలం రెండు చోట్ల మాత్రమే యాత్రికులు అధిక సంఖ్యలో రాగలిగారు.. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆయా చోట్ల మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలు కల్పించారు.. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. పెబ్బేరు : మండలంలోని రంగాపూర్ వీఐపీ ఘాట్ రూ.6.15కోట్లతో, మునగమాన్‌దిన్నె రూ.మూడు కోట్లు, తిప్పాయిపల్లి రూ.1.2కోట్లు, యాపర్ల రూ.96లక్షలు, బూడిదపాడు రూ.60లక్షలు, గుమ్మడం రూ.21 లక్షలు, రాంపూర్ ఘాట్ రూ.87లక్షలు ఇలా మొత్తం రూ.13కోట్లతో పుష్కరఘాట్లు నిర్మించారు. రూ.17కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలను అధికారులు కల్పించారు. అయితే పుష్కరాల ప్రారంభం నాటికి జూరాల వరదనీరు భారీగా రావడంతో కేవలం రంగాపూర్, రాంపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్ల వద్ద మాత్రమే భక్తులకు స్నానాలు చేసేందుకు వీలయింది. రెండు రోజుల తర్వాత నుంచి రాంపూర్ ఘాట్‌కు నీళ్లు లేకపోవడంతో చివరి వరకు లక్షలాది మంది భక్తులు రంగాపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్లకు వెళ్లి పుష్కరస్నానాలు ఆచరించారు. దీంతో బూడిదపాడు, యాపర్ల, తిప్పాయిపల్లి, గుమ్మడం, రాంపూర్ ఘాట్లు నిరుపయోగంగా మారాయి. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. హైవే నుంచి రాంపూర్ ఘాట్‌కు వెళ్లే రోడ్డును పంచాయతీరాజ్ అధికారులు ఏకంగా అలైన్‌మెంట్‌నే మార్చేసి బీటీ స్థానంలో సీసీ మాత్రమే నిర్మించారు. అసంపూర్తిగా.. వీఐపీలకు వసతి కల్పించేందుకుగాను పెబ్బేరు పీజేపి అతిథి గహం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1.5కోట్లు విడుదల చేసింది. అందులోని గదులు, ఏసీలు, రంగులు, బెడ్లు తదితర పనులను మాత్రమే కాంట్రాక్టర్లు హడావుడిగా చేశారు. దీని ముందు టైల్స్, గార్డెన్, మరో నాలుగు ఏసీలు, ఎస్ఈ, ఈఈ క్వార్టర్ల మరమ్మతు, అంతర్గత బీటీరోడ్లు తదితర పనులను చేపట్టలేదు. ఇక చేసిన పనులను అసంపూర్తిగా, మిగిలినవి పుష్కరాల నాటికీ ప్రారంభించకపోవడం అధికారుల పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతోంది. -
జన జాతర
-
జల పర్వం.. జనసంద్రం
జిల్లాలోని 11 రోజుల్లో 13,24,743 మంది భక్తులు – రోజుకు సగటున 1,20,431 పుణ్య స్నానాలు – ఐదు ఘాట్లలోనూ భక్తిపారవశ్యం – సీఎం పర్యటన నేపథ్యంలో స్తంభించిన ట్రాఫిక్ – రెండున్నర గంటల పాటు భక్తులు అవస్థలు – సీఐ ఘటనతో అప్రమత్తమైన పోలీసు శాఖ – ఆది పుష్కర ముగింపునకు భారీ ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. జిల్లాలో ఐదు ఘాట్లు ఉండగా.. మొత్తం 11 రోజుల్లో 13,24,743 మందికి పైగా పుష్కరస్నానం ఆచరించారు. ఈ లెక్కన సగటున రోజుకు 1,20,431 మంది భక్తులు కృష్ణమ్మ దీవెనలందుకున్నారు. భక్తులకు తగిన సంఖ్యలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు లేకుండానే పుష్కర సందడి కొనసాగింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం లింగాలగట్టులోని దిగువఘాటుకు రావడంతో అటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం వస్తున్న సందర్భంగా గంటన్నర పాటు.. వెళ్లే సమయంలో ఒక గంట పాటు మొత్తం రెండున్నర గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఫలితంగా పుష్కరభక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కార్డ్అండ్ సెర్చ్‌లో ఒక మహిళతో సీఐ పట్టుబడిన ఘటన నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమయింది. ఐజీ శ్రీధర్‌రావు.. జాగ్రత్తగా ఉండాలని పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. ఈ ఒక్క ఘటన మినహా పుష్కర సందడి ఇప్పటి వరకు సాఫీగానే సాగింది. ఇకపోతే చివరిరోజు పుష్కరాలకు ఘనంగా ముగింపు పలికేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమయింది.. చివర్లో తెలుగు తమ్ముళ్ల సందడి పుష్కర సందడి మొదలై 10 రోజులు గడిచినప్పటికీ అటువైపు కొద్ది మంది మినహా తెలుగు తమ్ముళ్లు పెద్దగా ఎవ్వరూ సహాయ కార్యక్రమాలు చేపట్టలేదు. అయితే, సోమవారం సీఎం వస్తున్న సందర్భంగా ఎవరికి వారు భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను పంచిపెట్టగా.. మరో నేత కుంకుమ, పసుపు, రవికెలను పంపిణీ చేశారు. అప్పటికప్పుడు ఫ్లెక్సీలను పెట్టి హంగామా చేసే ప్రయత్నం కనిపించింది. కష్టపడ్డ జిల్లా యంత్రాంగం పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసింది. ప్రధానంగా పోలీసు యంత్రాంగం సేవా కార్యక్రమాల్లో ముందుండగా.. రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు భారీగా చేసింది. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడా చెత్త కనపడకుండా రేయింబవళ్లు కష్టపడ్డారు. ఏకంగా రాత్రి సమయాల్లోనూ కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఘాట్ల వద్దకు వెళ్లి శుభ్రపరిచే ఏర్పాట్లను చేశారు. గత నాలుగు రోజులుగా కలెక్టర్, ఎస్పీ కలియతిరుగుతూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మొత్తం మీద జిల్లా యంత్రాంగం కష్టానికి తగిన గుర్తింపు లభించింది. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వరించింది. -
ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలి : ఎస్పీ
నల్లగొండ క్రైం : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాకు వచ్చే భక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి సూచించారు. ఘాట్లకు దూరంగా వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని పేర్కొన్నారు. ఆదివారం కాచరాజుపల్లి ఘాట్ సమీపంలో ఘాట్ లేని చోట స్నానానికి వెళ్లి హైదరాబాద్‌కు చెందిన హార్దిక్ (12) మృత్యువాత పడిన ఘటనపై ఆయన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఐదో రోజు పలుచన!
-
ఆకట్టుకుంటున్న బసవన్నలు
పూర్ణానందంపేట : పుష్కర యాత్రికులను భవానీ ఘాట్ వద్ద డూడూ... బసవన్నలు ఆకట్టుకుంటున్నాయి. స్నానాలు ఆచరించి వచ్చే భక్తులు బసవన్నల వద్ద తమ పిత్రుదేవతలను పొగిడించుకుని వాటికి కానుకలు సమర్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంత యాత్రికులకు పెద్దగా ఆకట్టుకోకపోయినా నగరాల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పిండప్రధానాలు చేసిన తరువాత బసవన్నలతో పొగిడిస్తే తమ తాతముత్తతాలు సంతోషిస్తారని భక్తులు విశ్వసిస్తారు. బసవన్నలను వాటి యజమానులు అందంగా ముస్తాబుచేసి ఘాట్ల వద్ద భక్తులను ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. -
పోటెత్తిన జనవాహిని
-
పుష్కర నీరాజనం
కృష్ణా తీరం.. దీప హారతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ భక్తి పారవశ్యం పరవళ్లు తొక్కుతోంది. పుణ్య స్నానాలతో భక్తజనం పునీతమవుతున్నారు. వందలాది కిలోమీటర్ల దూరం.. జిల్లాలు, రాష్ట్రాలు దాటి వస్తున్న వేలాది ప్రజలు కష్ణమ్మ ఒడిలో తమను తాము మైమరిచిపోతున్నారు. సాక్షి, కర్నూలు: కృష్ణా పుష్కరాలు నాలుగో రోజున స్నానఘాట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. సోమవారం స్వాతంత్య్ర దినోత్సం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాల హడావుడి మొదలైంది. పాతాళాగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం ఘాట్లకు పోటెత్తారు. కర్నూలు జిల్లాతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి బస్సులు, వాహనాల్లో వచ్చిన భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీసులు, రవాణశాఖ సమన్వయంతో ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారిని ఉచిత బస్సుల్లో ఘాట్ల చెంతకు తరలించడంతో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించారు. వలంటీర్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఘాట్ల వద్ద వద్ధులు, పిల్లలు, వికలాంగులకు సేవలు అందించారు. లక్షమందికి పైగా భక్తులు తరలివచ్చినా ఎక్కడా ఎలాంటి సంఘటనలు నమోదుకాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. లక్ష మంది స్నానం ముక్కంటికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీశైలానికి సోమవారం భక్తుల తాకిడి పెరిగింది. శ్రీశైలంలోని పాతాళాగంగలో రెండు ఘాట్లలోనూ భక్తులు పోటెత్తారు. లింగాలగట్టు లోలెవల్ ఘాట్లోనూ, సంగమేశ్వరంలోని ఘాట్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. జిల్లాలోని ఆరు ఘాట్లలోనూ దాదాపు లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శ్రీశైలానికి ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధికంగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళాగంగ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి.. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి క్యూలైన్లలో నిలబడ్డారు. గంటగంటకు భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సతీసమేతంగా పాతాళాగంగ ఘాట్‌లో పుణ్యసాన్నాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు. పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరాములు, డీఐజీ రమణకుమార్ ఘాట్లను పరిశీలించి యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. లింగాలగట్టులో భక్తులకు ఇబ్బందులు లింగాలగట్టులోని లోలెవల్ ఘాట్‌లో నీటిమట్టం తగ్గడంతో వివిధ ప్రాంతాల నుంచి వేకువజామునే అక్కడికి తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటల వరకు పరిస్థితిలో మార్పులు రాలేదు. దీంతో భక్తులు తమ వెంట తెచ్చుకున్న చెంబులతోనే పుణ్యస్నానమాచరించడం కనిపించింది. కొందరు వద్ధులు నీట మునిగితేనే పుణ్యస్నానమాచరించినట్లని భావించి మోకాటిలోతున్న నీళ్లలో ఇబ్బందిగా మునకలు వేయడం గమనార్హం. దీంతో ఇరిగేషన్ అధికారులు స్పందించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జలవిద్యుత్తు కేంద్రాల నుంచి నాలుగు జనరేటర్ల ద్వారా దిగువకు 18,242 క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో నెమ్మదిగా నీటిమట్టం పెరిగింది. ఆ తర్వాత భక్తులు అక్కడ కేరింతలు కొట్టుతూ పుణ్యస్నానాలు ఆచరించారు. -
రెచ్చిపోతున్న జేబుదొంగలు
ఘాట్ల వద్ద అధికారులకు దొంగల బెడద సాక్షి, అమరావతి : పుష్కరాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పన్నెండేళ్లకు వచ్చే పవిత్ర కృష్ణా పుష్కరాల్లో దొంగలు మాటు వేశారు. ఘాట్ల వద్ద యాత్రికులు స్నానాల హడావుడిలో ఉండగా ఏమార్చి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రధాన స్నానపు ఘాట్లతో పుష్కర నగర్లను అడ్డాగా మార్చుకున్నారు. ఓవైపు పోలీసు వర్గాలు దొంగల కదలికలపై నిఘా ఉంచినా వారి దూకుడుకి కళ్లెం వేయలేకపోతున్నారు. జేబుదొంగలతో పాటు దోపిడీ ముఠాలు మాటు వేసి చోరీలకు పాల్పడుతున్నారు. 14 ఏళ్ల బాలురే అధికం.. ప్రస్తుతం చోరీలకు పాల్పడతున్న ముఠాల్లో ఎక్కువగా 14 సంవత్సరాలోపు బాలురే అధికంగా ఉన్నారు. ర ద్దీ ఉన్న స్నానఘాట్లలో సామాన్య భక్తుల్లా కలిసిపోయి తమ చేతికి పని కల్పిస్తున్నారు. వేషాలు మార్చి పిండప్రదానం చేసే అర్చకుల్లానూ వస్తున్నారు. నిరంతరం పోలీసు నిఘా ఉన్న చోరీలు మాత్రం ఆగటం లేదు. బెజవాడలో తిష్టవేసిన దొంగలు.. నగరానికి వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి దొంగల ముఠా వచ్చి చేరినట్లు సమాచారం. వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరి కాలనీ, కేథరేశ్వర పేట ఏరియాల్లో దొంగల ముఠా మాటు వేసినట్లు తెలుస్తోంది. 20కి పైగా గ్యాంగ్‌లు తిష్టవేసినట్లు వినికిడి. ప్రధాన ఘాట్లలో ర ద్దీ ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వీరు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఇప్పటికే వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు తప్పని దొంగల బెడద ప్రధాన ఘాట్‌లో విధి నిర్వహణలో ఉన్న అధికారులకు దొంగల బెడద తప్పటం లేదు. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న సబ్ కలెక్టర్ సుజన సెల్‌ఫోన్ కూడా దొంగలు అపహరించారు. పుష్కరాల్లో అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని పోలీస్ అధికారులు ముందు నుంచి చెబుతున్నారు. వేలమంది పోలీసులను రంగంలోకి దింపారు. ఎక్కడ లేని ఆంక్షలు పెట్టి భక్తులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. నిఘానీడ ఉన్నా దొంగతనాలను అరికట్టలేకపోతున్నారు. ప్రతి ఘాటులో జేబు దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డులు పెట్టారు. కానీ వారి దూకుడుకు మాత్రం కళ్లెం వేయలేక వైఫల్యం చెందారనే ఆరోపణలున్నాయి. నిత్యం పోలీస్ కంట్రోలు రూం నుంచి 1300 వందల సీసీ కెమెరాలతో ప్రతి ఘాటును పర్యవేక్షణ చేస్తున్నారు. దొంగల పని పట్టడంతో ఎందుకు వైఫల్యం చెందారో పోలీసులకే తెలియాలి. -
పుష్కర స్నానం.. పుణ్య ఫలం !
రెండో రోజు లక్ష మంది భక్తుల పుణ్యస్నానాలు – ఇంకా నడుస్తున్న పుష్కరనగర్ పనులు – ఘాట్ల వద్ద నిలువనీడ లేక అల్లాడుతున్న పిల్లలు, వద్ధులు – ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ – బోటులో పర్యవేక్షించిన ప్రత్యేకాధికారి, కలెక్టర్, ఎస్పీ – సమస్యలపై ఆరా తీసిన కలెక్టర్ – భద్రత విషయంలో రాజీవద్దని ఎస్పీ ఆదేశాలు అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్.. చుట్టూ ఎత్తయిన కొండలు. చల్లని గాలి.. కృష్ణమ్మ పరవళ్లతో పుష్కర సంబరం భక్తుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటోంది. ప్రాంతాలు.. కులమతాలకు అతీతంగా భక్తులకు నదీమ తల్లి ఆహ్వానం పలుకుతోంది. అడుగడుగునా భద్రత.. అధికారుల అప్రమత్తత నడుమ పుష్కర ఘాట్ల వద్ద భక్తిపారవశ్యం పొంగిపొర్లుతోంది. శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి: వరుస సెలవుల నేపథ్యంలో జిల్లాలో పుష్కర సందడి రెట్టింపవుతోంది. మొదటి రోజుతో పోలిస్తే.. రెండవ రోజు శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. సుమారు లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. ప్రధానంగా మహారాష్ట్ర.. కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటం విశేషం. ఇకపోతే ప్రభుత్వం యంత్రాంగం కూడా భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరాములు, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌లు ఘాట్ల వద్దకు వచ్చి భక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆ మేరకు సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా సంగమేశ్వరంలో భద్రతా చర్యలను ఐజీ శ్రీధర్‌రావు పర్యవేక్షిస్తుండగా.. శ్రీశైలంలో ఎస్పీ ఆకె రవికష్ణ మాస్టర్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాతాళగంగ, లింగాలగట్టు వద్ద ముగ్గురు అధికారులు బోటులో ప్రయాణించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీశైలంలోని వివిధ సంత్రాల వద్ద నుంచే లింగాలగట్టు వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అయితే పిల్లలు, వద్ధులకు నిలువ నీడ లేకపోవడం ఇబ్బందులకు తావిస్తోంది. ఘాట్ల వద్ద పిల్లలకు బిస్కెట్లు కూడా లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్ భక్తులు సేదతీరేందుకు తాత్కాలిక షెడ్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలాఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులను రవాణా శాఖ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తాము సైతం అంటూ హిజ్రాలు పాతాళగంగలో పుణ్యస్నానం ఆచరించారు. భక్తుల చెంతకే బస్సులు ఘాట్ల వద్దకు భక్తులను చెరవేసేందుకు అధికార యంత్రాంగం మరిన్ని చర్యలు చేపట్టింది. మొదటిరోజు లింగాలగట్టులోని ఎగువఘాటు వరకే శ్రీశైలం నుంచి ఉచిత బస్సులను నడిపారు. అయితే, దిగువఘాటు వద్దకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో.. శుక్రవారం ఉచిత బస్సుల సర్వీసులను ఘాటు కింద వరకూ పొడిగించారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో దిగువఘాటుకు వెళ్లి స్నానాలు ఆచరించారు. అదేవిధంగా శ్రీశైలంలోని వివిధ సత్రాల్లో ఉంటున్న భక్తులు నడిచివెళ్లి ఊరు వెలుపల ఏర్పాటు చేసిన బస్టాండు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఉన్న వివిధ సత్రాల మార్గంలో ఉచిత బస్సు సర్వీసులను నడిపారు. ఫలితంగా తాము బస చేసిన సత్రం నుంచే ఘాటు వద్దకు వెళ్లేందుకు అవకాశం ఉండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మఫ్టీలో నిఘా రేయింబవళ్లు కాపలా కాస్తూ బైనాక్యులర్లతో పాటు వాకీటాకీలు, విజిల్స్ ద్వారా పోలీసు సిబ్బంది నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆలయం చుట్టూ భారీస్థాయిలో పర్యవేక్షణ చేపడుతోంది. జిల్లాలోని అన్ని ఘాట్ల వద్ద సామాన్య భక్తుల తరహాలో కలిసిపోయి రక్షణకు ఉపక్రమించారు. ఇక లింగాలగట్టు ఘాటు వద్ద ఎతై ్తన ప్రదేశంలో బైనాక్యులర్‌తో నిఘా ఉంచారు. ఇవీ ఇబ్బందులు.. ఘాటు వరకు బస్సు సర్వీసుతో పాటు వద్ధులు, వికలాంగులకు వీల్చైర్లను ఏర్పాటు చేసినా.. ఘాటు వద్ద కూర్చునేందుకు నీడ కల్పించలేకపోయారు. – స్నానం చేసిన తర్వాత ఘాట్ల వద్ద కాసేపు సేద తీరేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చిన్న పిల్లలతో వచ్చిన భక్తులతో పాటు వద్ధులు ఇబ్బందులు పడ్డారు. – లింగాలగట్టులోని కిందిఘాటు వద్ద పార్కింగ్ ప్రాంతంలో భారీ సంఖ్యలో కార్లు, మినీ బస్సులు వస్తున్నాయి. అయితే, ఈ వాహనాలను పరిశీలించేందుకు లో మిర్రర్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయలేదు. – ఘాట్ల వద్ద తినుభండారాలు లభించడం లేదు. టీ, బిస్కెట్ వంటివి కూడా దొరకట్లేదు. – లింగాలగట్టులోని కింది ఘాటు వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది. అయితే, స్త్రీలు దుస్తులు మార్చుకునేందుకు కేవలం రెండే షెడ్లు ఉన్నాయి. దీంతో కొద్ది మంది బయటే దుస్తులు మార్చుకోవాల్సి వస్తోంది. రవాణా.. వేధింపులు! ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు రవాణా శాఖ సిబ్బందితో కొత్త సమస్య వచ్చి పడుతోంది. సున్నిపెంటకు సమీపంలో ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టు వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి వాహనాన్ని ఆర్టీఓ అధికారులు నిలిపి పరిశీలిస్తున్నారు. సొంత వాహనాల్లో(తెల్ల నెంబరు ప్లేటు) ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రవాణా శాఖ అధికారుల చర్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లో నెంబరు ప్లేటు ఉన్న వాహనాలను నిలిపి.. నిబంధనల మేరకు పన్ను వసూలు చేస్తే ఇబ్బంది లేదని.. తెల్ల నెంబరు ప్లేటు ఉన్నప్పటికీ వేధించడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు వాపోతున్నారు. భక్తులే ప్రచారకర్తలు: కలెక్టర్ కష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. పాతాళగంగ, లింగాలగట్టు పుష్కర ఘాట్లను పరిశీలించిన అనంతరం ఏర్పాట్ల వివరాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. జిల్లాలో మొదటిరోజు పుష్కర స్నానాలు కూల్‌గా ప్రారంభమయ్యాయని.. శనివారం రోజు టేకాఫ్ అయ్యాయన్నారు. వరుసగా సెలవు దినాలు కావడంతో రోజుకు 3లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అటువైపు తెలంగాణ ఘాట్‌తో పోలిస్తే ఇక్కడే భక్తులు అధికంగా ఉన్నారన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులే తమకు ప్రచారకర్తలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న భక్తులు కూడా ఇక్కడే స్నానం చేయడం చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఏ ఒక్కరూ అసంతప్తిగా వెళ్లకుండా చూసుకుంటున్నామన్నారు. అందుకే సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ స్నానమాచరించిన ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వారికి పుష్కరస్నానానికి వెళ్లండి... ఎటువంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారని అందుకే రద్దీ క్రమంగా పెరుగుతోందన్నారు. -
పుష్కర స్నానం కరిష్యే..!
-
పుష్కర ఘాట్లకు అదనపు నీరు
సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి.. 22,500 క్యూసెక్కుల నీరు విడుదల మాచర్ల: కృష్ణా పుష్కరాల సందర్భంగా డెల్టా పరివాహక ప్రాంతంలోని అన్ని పుష్కరఘాట్లలో నీరు ఉంచేందుకుగానూ ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి డెల్టాకు మరింత నీటిని విడుదల చేయాలని కోరింది. పుష్కరాలు పూర్తయ్యే వరకు మొత్తం 10 టీఎంసీల నీటిని డెల్టాకు విడుదల చేయాలని కోరగా స్పందించిన కృష్ణాబోర్డు డెల్టాకు నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం వరకు 7500 క్యూసెక్కుల నీటిని సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి విడుదల చేస్తుండగా గురువారం సాయంత్రం 4 గంటలకు 22504 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్‌ఎల్‌బీసీకు 800, కుడికాలువకు మంచినీటి అవసరాల నిమిత్తం 7069 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు జూరాల నుంచి 1,39,291 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా శ్రీశైలం నీటి మట్టం 870 అడుగులకు చేరుకుంది. అయితే పుష్కర సమయంలో సాగర్ రిజ ర్వాయర్ నుంచి, ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం విడుదల అవుతున్న నీరు ఘాట్లకు పూర్తిగా లేవని గుర్తించిన ప్రభుత్వం అదనంగా నీటిని డెల్టాకు జల విద్యుత్ కేంద్రం ద్వారా విడుదల చేయాలని కోరడంతో 22504 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఏ ఒక్క పుష్కర ఘాట్‌కు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం సాగర్ రిజ ర్వాయర్కు శ్రీశైలం నుంచి 73850 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ప్రధాన జల విద్యుత్కేంద్రం, కుడికాలువ, ఎస్ఎల్బీసీలకు 30,373 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 507.70 అడుగులు ఉండగా ఇది సుమారు 128 టీఎంసీలకు సమానం. -
ఇంకా అసంపూర్తిగా!
ప్రధాన ఘాట్లూ పూర్తికాలేదు పుష్కర నగర్‌లదీ అదే స్థితి పెండింగ్‌లోనే విద్యుద్దీకరణ, సుందరీకరణ పనులు సాక్షి, అమరావతి : పుష్కరాల గడువు రోజుల నుంచి గంటలకు వచ్చేస్తోంది. అయినా జిల్లాలో పుష్కర పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రధాన ఘాట్ల పనులూ ఇంకా పూర్తికాలేదు. పుష్కర నగర్‌లదీ అదే పరిస్థితి. భక్తులకు సౌకర్యాలు, వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు. దీంతో బ్యూటిఫికేషన్, విద్యుదీకరణ పనులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ప్రధాన ఘాట్లయిన అమరావతి, సీతానగరం, పెనుమూడి సహా దాదాపు అనేక ఘాట్ల పరిస్థితి ఇలాగే ఉంది. విజయపురి సౌత్ నుంచి అమరావతి వరకు సాక్షి యంత్రాంగం క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుపు ఘాట్ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ తాత్కాలికంగా వేసిన విద్యుత్తు స్తంభాలు.. నీళ్లు వస్తే ఏక్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉంది. పెనుమూడిలో అధికారులు జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఘాట్ వద్దకు నీళ్లు అవకాశం లేకపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. అమరావతిలో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంకా కొన్ని ఘాట్ల పనులు నిర్వహిస్తున్నారు. కాంక్రీట్, విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నాయి. సీతానగరంలో టైల్స్ పనులు కొనసాగుతున్నాయి. పుష్కర నగర్లలో పూర్తికాని ఏర్పాట్లు.. అమరావతిలో మూడు పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గుంటూరు గోరంట్లలో 10 వేల మంది భక్తులు ఉండేం దుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న పుష్కర నగర్ పనులు ఇంకా పూర్తికాలేదు. సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమరావతి ఆలయంలో సైతం దేవదాయ శాఖ పనులు సాగుతూనే ఉన్నాయి. ఘాట్లు, పుష్కరనగర్లకు నియమించిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు పదో తేదీ నాటికి చేరుకుని విధుల్లో పాలుపంచుకోనున్నారు. పులిచింతల నుంచి నీరు విడుదల చేసిన నేపథ్యంలో ప్రత్యేకాధికారులు విధుల్లో చేరాక ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఘాట్ల పనులు పూర్తి కాకుండానే ట్రయల్‌రన్ నిర్వహించాలంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
కృష్ణాతీర పుష్కరఘాట్లు
కృష్ణాజిల్లాలో... జిల్లాలో మొత్తం 74 స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో 6 ఘాట్లు, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 68 ఘాట్లు ఉన్నాయి. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఒక లక్ష పైబడిన సంఖ్యలో పుష్కర యాత్రికులు పవిత్రస్నానం ఆచరించే స్నానఘట్టాలను ఏ- ప్లస్ కేటగిరీలో ఉంచారు. భవాని, పున్నమి, దుర్గ్గ, కృష్ణవేణి, పద్మావతి, ఇబ్రహీంపట్నం మండలంలో పవిత్రసంగమం, ఫెర్రీ ఘాట్లు ఏ-ప్లస్ కేటగిరీలోకి వస్తాయి. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల, పవిత్రసంగమం ఫెర్రీ ఘాట్లు, ఏ కేటగిరీలోకి వస్తాయి. వీటిలో 50 వేల నుంచి లక్షమంది లోపు స్నానం ఆచరిస్తారు. జగ్గయ్యపేట మండలంలో గుడిమెట్ల ఘాట్ - 1, గుడిమెట్ల ఘాట్ - 2, మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లి ఘాట్, కోడూరు మండలం హంసలదీవి ఘాట్లను బి-కేటగిరీ ఘాట్లుగా నిర్ధారించారు. వీటిలో 10 వేల నుంచి 50 వేల మంది స్నానం ఆచరిస్తారు. మిగిలిన 39 ఘాట్లు సి- కేటగిరీ. వీటిలో 10వేల కంటే తక్కువ మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. 21 ఘాట్లను, వెయ్యి మంది లోపు స్నానాలు ఆచరించేవిగా, స్థానిక ఘాట్లుగా గుర్తించారు. నగరంలో ఇలా... విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజీ ఎగువన 3 ఘాట్లు, దిగువన 2 ఘాట్లుగా విభజించారు. పద్మావతి ఘాట్: పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ముందు నుంచి రైల్వే బ్రిడ్జి వరకు 11 కి.మీ. మేర విస్తరించి ఉంది. కృష్ణవేణి ఘాట్: రైల్వే బ్రిడ్జి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు 750 మీటర్ల మేర విస్తరించింది. ఈ రెండు ఘాట్లకు ప్రకాశం బ్యారేజ్ నుంచి, స్లూయిస్ నుంచి 10 మీటర్ల వెడల్పున తవ్విన ప్రత్యేక కాలువ ద్వారా బ్యారేజీ నుంచి నిరంతరం నాలుగు అడుగుల లోతున పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఇక్కడ జల్లు స్నానం (షవర్‌బాత్) ఏర్పాట్లు కూడా చేశారు. ప్రకాశం బ్యారేజి ఎగువన... దుర్గాఘాట్: ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ అమ్మవారి గాలిగోపురం వరకు 160 మీటర్ల మేర విస్తరించి ఉన్న ఘాటును 325 మీటర్ల పొడవుకు విస్తరించారు. ఘాట్ వద్ద ప్రత్యేకంగా అభివృద్ధి పరచిన మోడల్ గెస్ట్‌హౌస్‌లో కమాండెంట్, కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు. 16 వందల సీసీ కెమెరాల సహాయంతో అన్ని జిల్లాలలోని పుష్కర ఘాట్లలో ప్రతిక్షణం జరుగుతున్న దృశ్యాల్ని కంట్రోల్‌రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. పున్నమి ఘాట్: ‘విజయ డైరీ ఇన్‌టేక్‌వెల్’ నుంచి ‘పున్నమి రెస్టారెంట్’ గోడ వరకు 400 మీటర్ల మేర విస్తరించి ఉంది ఈ ఘాటు. భవానీ ఘాట్: పున్నమి రెస్టారెంట్ గోడ నుంచి గొల్లపూడి వరకు భవానీఘాట్ వద్ద 1.1 కి.మీ. మేర నదికి అభిముఖంగా తీరప్రాంతాన్ని రూపుదిద్దుతున్నారు. రెండు కొత్త ఘాట్లు పవిత్రసంగమం ఘాట్: పోలవరం కుడి ప్రధాన కాల్వ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర కొత్తగా 250 మీటర్ల పొడవైన ఘాట్ నిర్మిస్తున్నారు. ఫెర్రీ ఘాట్: హారతి పెవిలియన్ దాటిన తర్వాత 750 మీటర్ల పొడవైన ఫెర్రీఘాట్ నిర్మాణం జరుగుతోంది. - నండూరి శారంగపాణి, విజయవాడ నల్లగొండ జిల్లాలో... జిల్లాలో ముఖ్యమైన పుష్కర ఘాట్లు ఇవి... 1. కాచరాజుపల్లి (చందంపేట మండలం) 2. పెదమునిగల్ (చందంపేట) 3. అజ్మాపూర్ (పీయేపల్లి మండలం) 4. శివాలయం (పెదవూర) 5. ఆంజనేయస్వామి (నాగార్జునసాగర్) 6. పొట్టిచెలమ (నాగార్జునసాగర్) 7. ఊట్లపల్లి (పెదవూర) 8. కిష్టాపురం (మేళ్లచెరువు) 9. వజినేపల్లి (మేళ్లచెరువు) 10. బుగ్గమాదారం (మేళ్లచెరువు) 11. మహంకాళిగూడెం (నేరేడుచర్ల) 12. ప్రహ్లాద (మఠంపల్లి) 13. మార్కండేయ (మఠంపల్లి) 14. బాలాజీఘాట్ (మఠంపల్లి) 15. శివాలయం, వాడపల్లి (దామరచర్ల) 16. లక్ష్మీనర్సింహ (వాడపల్లి) 17. లక్ష్మీపురం (వాడపల్లి) 18. మెట్లరేవు (వాడపల్లి) 19. ఓల్డ్ పీఎస్ (వాడపల్లి) 20. ముదిరాజ్ (వాడపల్లి) 21. ఓల్డ్ సిమెంట్ (వాడపల్లి) 22. అయ్యప్ప(వాడపల్లి) 23. ముదిమాణిక్యం (వాడపల్లి) 24. అడవిదేవులపల్లి (వాడపల్లి) 25. ఇర్కిగూడెం (వాడపల్లి) 26. దర్వేశిపురం (కనగల్) 27. కనగల్ వాగు (కనగల్) 28. ఛాయాసోమేశ్వర ఆలయం (నల్లగొండ) మహబూబ్‌నగర్ జిల్లాలో... 1. తంగెడి 2. కృష్ణ 3. గుడబెల్లూర్ 4. మూడుమళ్ల 5. పసుపుల 6. పంచదేవుపాడు 7. పారేవుల 8. ముసలపల్లి 9. అనుకొండ 10. గడ్డెంపల్లి 11. నెట్టెంపాడు 12. ఉప్పేరు 13. నందిమల్ల 14. మూలమల్ల 15. రేవులపల్లి 16. పెద్దచింతరేవుల 17. రేకులపల్లి 18. జూరాల 19. నదీ అగ్రహారం 20. ఆరేపల్లి 21. కత్తేపల్లి 22. తెలుగోనిపల్లి 23. జమ్మిచేడు 24. బీరెల్లి 25. రాంపురం 26. బీచుపల్లి 27. రంగాపురం 28. మునగమూన్ దిన్నె 29. బూడిదపాడు 30. తిప్పాయిపల్లి 31. గుమ్మడం 32. యాపర్ల 33. మారుమునగల 34. బెక్కెం 35. గూడెం 36. పెద్దమారూరు 37. క్యాతూర్ 38. వెల్టూరు 39. గొందిమళ్ల 40. కాలూరు 41. చర్లపాడు 42. అయ్యవారిపల్లి 43. కొప్పునూరు 44. జటప్రోలు 45. మంచాలకట్ట 46. మల్లేశ్వరం 47. సోమశిల (వీఐపీ) 48. సోమశిల (జనరల్) 49. అమరగిరి 50. బక్కలింగాయపల్లి 51. పాతాళగంగ బ్రహ్మాండ పురాణం, శివపురాణం, స్కాందపురాణం, మత్స్య, కూర్మ, బ్రహ్మ, వామన, వాయు, నారద, వరాహ పురాణాలలో కృష్ణానది ప్రస్తావన కనిపిస్తుంది. -
పుష్కరఘాట్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంగమేశ్వరం(కొత్తపల్లి): సంగమేశ్వరంలో పుష్కరఘాట్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కపిలేశ్వరంలో అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో దిగువప్రాంతాల్లోని పుష్కరఘాట్లు మునిగి అవకాశం ఉందన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకొని ఎగువప్రాంతాల్లోని పుష్కరఘాట్లను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద మరుగుదొడ్లు, దుస్తువుల మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల కోసం పార్కింVŠ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆయన సంగమేశ్వరంలో జరుగుతున్న పుష్కర పనులను పరిశీలించారు. ఎగువప్రాంతం నుంచి వరద ఉద్ధతి తగ్గకపోతే∙రెండు రోజుల్లో సంగమేశ్వరం గుడి మునిగిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, ప్రత్యేక కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘుబాబు, అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, తహసీల్దారు నరసింహులు, సీఐ దివాకర్‌రెడ్డి, ఎసై ్స శివశంకర్‌నాయక్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
పుష్కరోత్సాహం
-
భక్తి పరవళ్లు
ఐదో రోజూ 37,096 మంది పుణ్యస్నానాలు భక్తి శ్రద్ధలతో భక్తుల పూజలు పెరుగుతున్న వరద పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఐదో రోజు గురువారం భక్తుల స్నానాలతో నదీతీరం పరవశించింది. జిల్లా వ్యాప్తంగా 37,096 మంది పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. రాజమహేద్రవరం నగరంలోని ఘాట్లలో స్నానమాచరించేందుకు 22,521 మంది భక్తులు రాగా ఇందులో ఒక్క పుష్కరఘాట్‌లోనే 15,395 మంది స్నానమాచరించారు. జిల్లాలోని అంతర్వేది, అప్పన పల్లి, అయినవిల్లి, కోటిపల్లి తదితర ఘాట్లలో స్థానిక ప్రజలు స్నానాలు చేసి సమీపంలోని ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాజమహేంద్రవరంలోని పద్మావతి, శ్రద్ధానంద, టీటీడీ ఘాట్లలో స్నానాలు చేసిన భక్తుల సంఖ్య స్వల్పంగా ఉంది. రాజమహేంద్రవరంలోని ఘాట్లకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి యాత్రికులు తరలివచ్చారు. ఘాట్లలో స్వచ్ఛంద సంస్థలు, కాలేజీ విద్యార్థుల సేవలు కొనసాగుతున్నాయి. వరద నేపథ్యంలో ఘాట్ల వద్ద పరిస్థితిని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షించారు. వరదతో అప్రమత్తం... గోదావరి ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదికి వరద వస్తోంది. రాజమహేంద్రవరంలోని కోటిలింగాల, పుష్కర ఘాట్లలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు మునిగిపోయాయి. ఘాట్ల వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ముందుగా నిర్ణయించిన మేరకు నీటి స్థాయి ఉండేలా ఇరిగేషన్ అధికారులు కాటన్ బ్యారేజీ నుంచి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. మత్స్య, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. నీటి పరిమాణం పెరగడంతో సరస్వతీఘాట్‌లో రక్షణగా కట్టిన తాడును అధికారులు ముందుకు జరిపారు. వరద వల్ల ఘాట్లపై నిలిచిన వ్యర్థాలను అగ్నిమాపక, నగరపాలక సంస్థ సిబ్బంది శుభ్రం చేశారు. భక్తుల ర ద్దీ సాధారణంగా ఉండడంతో గోదావరి గట్టుపై ట్రాఫిక్ ఆంక్షలు తొగించారు. హారతి సమయంలో ఆంక్షలను తిరిగి యథావిధిగా కొనసాగాయి. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆనం కళాకేంద్రంలో గోదావరి సింగర్స్ క్లబ్ సభ్యులు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. కోటిలింగాలఘాట్ వద్ద తెరపై నగరపాలక సంస్థ డాక్టర్ చక్రవర్తి చిత్రాన్ని ప్రదర్శించింది. పుష్కరఘాట్ ఎదురుగా ఉన్న మండపం వద్ద నగరపాలక సంస్థ సౌజన్యంతో టీటీడీ పరిధిలోని హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ మౌనిక బుర్రకథ బృందం నిర్వíß ంచిన ‘సీతా కల్యాణం’ బుర్రకథలో హాస్యం పేరుతో ద్వందార్థాలతో సాగడంతో విమర్శలు వినిపించాయి. ––––––––––––––––––––––––––––––––––– జిల్లాలో ఘాట్ల వారీగా స్నానమాచరించిన భక్తుల సంఖ్య ఘాట్ భక్తులు 1.కోటిలింగాలఘాట్, 4,060 2.పుష్కరఘాట్ 15,395 3.మార్కండేయఘాట్ 168 æ 4.టీటీడీఘాట్ 238 5.శ్రద్ధానంద ఘాట్ 78æ 6.పద్మావతిఘాట్ 315 7.గౌతమిఘాట్ 997 8.సరస్వతిఘాట్ 1,270 9.రామపాదలరేవు 860 10.మునికూడలి 739 11.కోటిపల్లి 1,949 12.అప్పనపల్లి 4,940 13.అంతర్వేది 1,880 14.వాడపల్లి 1,697 15.జొన్నాడ 2,700 -
నిఘా నీడలో
భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు స్నానఘాట్లలో నిరంతర పర్యవేక్షణ అంత్య పుష్కరాల విధుల్లో పోలీసు యంత్రాంగం గత ఏడాది గోదావరి పుష్కరాల అంతటి స్థాయిలో కాకపోయినా.. అంత్య పుష్కరాలకూ భారీగా భక్తులు తరలివస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా, వారికి భద్రత కల్పిస్తూ పోలీసులు నిరంతర సేవలు అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 2,800 మంది పోలీసు సిబ్బంది నిఘా నీడలో అంత్యపుష్కరాలు సాఫీగా సాగుతున్నాయి. – రాజమహేంద్రవరం క్రైం అంత్య పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ ఆర్.గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఘాట్లలో భక్తులు లేకపోయినప్పటికీ, ఒక్కొక్కసారి పోలీసులు ఘాట్లకే పరిమితమై, నిరంతర పహారా కాస్తున్నారు. అంత్య పుష్కరాల్లో భద్రత కోసం ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 2,800 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. వీరు 13 ఘాట్లతో పాటు నగరంలోకి వచ్చే రోడ్ల కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా, గోదావరి నదిలో ఆపదలో పడకుండా సూచనలు చేస్తున్నారు. ఘాట్లలో చోరీలు జరగకుండా నిత్యం నిఘా పెడుతున్నారు. ‘పశ్చిమ’ పోలీసుల అవస్థలు అంత్య పుష్కరాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 500 మంది పోలీసులు విధులు నిర్వహించేందుకు రాజమహేంద్రవరానికి వచ్చారు. వీరికి డ్యూటీలు 2 కి.మీ. దూరంలో వేయడంతో, వీరు చేసిన బస నుంచి వెళ్లాలంటే కనీనం రెండు గంటల పడుతుంది. ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్న షెల్టర్‌లోనే పోలీసులు సర్దుకుపోతున్నారు. ఘాట్లలో భక్తులు అంతగా ఉండకపోయినప్పటికీ, ఎండలో పోలీసు గస్తీ మాత్రం తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు అంతగా ఉండనందునSపోలీసులను కొంత తగ్గించాలని కోరుతున్నారు. గంటల తరబడి డ్యూటీలు నిర్వహిస్తున్నా, కనీసం టీఏ, డీఏలు కూడా ఇవ్వకుండా విధులు నిర్వహించమనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పుష్కరాల్లాగే రూ.225 టీఏ, డీఏ మంజూరు చేయాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు. అవసరం లేని పోలీసు సిబ్బందిని తిరిగి వారి ఊళ్లకు పంపించేయాలని చెబుతున్నారు. ట్రాఫిక్ సడలింపునకు విన్నపాలు అంత్య పుష్కరాల్లో రాజమహేంద్రవరంలోని ఘాట్లకు రోజు 1.5 లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఆ మేరకు గోదావరి గట్టు వెంబడి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రద్దీలేని సమయంలో కూడా ఇవి కొనసాగుతున్నాయి. తమ సౌకర్యార్థం రద్దీలేని రోజు అందుకు అనుగుణంగా ఆంక్షలు సడలించాలని భక్తులు కోరుతున్నారు. రాత్రి హారతి కార్యక్రమం వీక్షించేందుకు నగరంలోని ప్రజలు కుటుంబ సభ్యులతో రావడానికి, స్థానికంగా ఉండే ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
పుష్కర పనులు ఎక్కడివక్కడే!
కృష్ణా పుష్కరాలకు ఇంకా పది రోజులే సమయం పూర్తికాని ఘాట్లు, రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే పుష్కరనగర్లు కృష్ణా పుష్కరాలు తరుముకొస్తున్నాయి.. ఇంకా పదిరోజులే గడువున్నా క్షేత్రస్థాయిలో పనులు పూర్తికాలేదు. ఘాట్ల పనులే అసంపూర్తిగా ఉంటే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, అమరావతి : జిల్లాలో పుష్కర పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత నెల 31 నాటికే పనులన్నీ పూర్తిచేస్తామని మంత్రులు, అధికారులు ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. పుష్కరాలకు వచ్చే భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లదీ అదే పరిస్థితి. పుష్కరాల విధుల్లో పాల్గొనే సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు పూర్తికాలేదు. ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అసంపూర్తిగా పనులు.. జిల్లాలో ప్రధాన ఘాట్ల పనులు ఇంకా పూర్తికాలేదు. అమరావతిలో ఇంకా టైల్స్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అవి పూర్తయ్యాక టూరిజం శాఖ ఆధ్వర్యంలో విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. పుష్కర నగర్ల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. పిండ ప్రదానం షెడ్ల పనులూ మందకొడిగా సాగుతున్నాయి. సీతానగరం, పెనుమూడి ఘాట్ల పనులు కొలిక్కిరాలేదు. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 15 ఘాట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ముఖ్యమైన ఘాట్ల పనులు పూర్తికాకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఆర్అండ్బీ శాఖ చేపట్టే పనులూ ఇంకా పూర్తికాలేదు. ఈ నెల ఐదో తేదీ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు నగరంలో రోడ్డు పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ఇంకా కార్పొరేషన్ అధికారులే డ్రెయిన్ల పనులు పూర్తి చేయని పరిస్థితి నెలకొంది. రోడ్లు భవనాల శాఖ పనులు కూడా పూర్తిస్థాయిలో పూర్తవలేదు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా రోడ్డు పనులు చేసి సరిపెట్టే యత్నాల్లో ఆ శాఖ అధికారులు ఉన్నారు. అధికారుల్లో సమన్వయలోపం.. పుష్కర పనుల్లో వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఘాట్ల వద్ద బారికేడింగ్ ఏర్పాట్లు ఎవరు చేయాలనే అంశం ప్రత్యేకాధికారి రాజశేఖర్ సమీక్ష చేసేవరకు పట్టించుకోకపోవడం గమనార్హం. దేవాదాయ, నీటిపారుదల, రహదారులు, భవనాల శాఖల మధ్య సమన్వయం కొరవడటమే దీనికి కారణం. వైద్యశాఖ తరఫున శిబిరాల ఏర్పాటు, మందుల కొనుగోలు కోసం అధికారులను నియమించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎవ్వరూ దృష్టిసారించలేదు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆలయాల ఆధునికీకరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా పనులు మాత్రం పూర్తికాలేదు. ఘాట్లలో పూజలు చేసేందుకు వీలుగా పూజారులను గుర్తించామని చెబుతున్నా, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులు, ఏర్పాట్లపై ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ పలు శాఖల అధికారులపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులు, ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం జిల్లాలో పుష్కర పనులకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో సమాచారాన్ని అప్డేట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మల్లికార్జున.. ఏ–ప్లస్
– జిల్లాలో ఏ కేటగిరి చెందినవి 4 – రెండు ఘాట్లు బీ కేటగిరి కర్నూలు (అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన ఘాట్లకు అధికారులు గ్రేడ్లు ఇచ్చారు. శ్రీశైలంలోని మల్లికార్జున ఘాట్ ఏ ప్లస్ గ్రేడును సాధించింది. మిగతా ఘాట్లు వివిధ కేటగిరీల్లో చేరాయి. జిల్లాలో మొత్తం 7 ఘాట్లు ఉండగా...శ్రీశైలంలో నాలుగు, సంగమేశ్వరంలో మూడు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యను జిల్లా యంత్రాంగం అంచనావేసి వాటికి గ్రేడ్లు ఇచ్చింది. రోజుకు లక్ష మంది ఆపైన వచ్చే శ్రీశైలంలోని మల్లికార్జున పుష్కర ఘాట్‌ను ఏప్లస్ కేటగిరిగా ప్రకటించారు. శ్రీశైలంలోని భ్రమరాంబిక ఘాట్, లింగాలగట్టు –1 కొత్తఘాట్, లింగాలగట్టు –2 పాతఘాట్‌లను ఏ కేటగిరిగా గుర్తించారు. ఏ కేటగిరి ఘాట్లకు రోజుకు 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. అలాగే సంగమేశ్వర ఘాట్‌ను ఏ–కేటగిరిలో చేర్చారు. సంగమేశ్వరంలోని లలితాదేవీ ఘాట్, లో లెవెల్ టెంపుల్ ఘాట్లను బీ కేటగిరిగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. బీ కేటగిరి ఘాట్లకు రోజుకు 10 వేల నుంచి 50 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ఏడు ఘాట్లు ఏర్పాటు చేస్తుండగా ఒకటి ఏ ప్లస్, ఏ కేటగిరి ఘాట్లు 4, బీ కేటగిరి ఘాట్లు రెండింటిని గుర్తించారు. ఘాట్ కేటగిరిని బట్టి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అంత్యోదయం