Hockey World League
-
భారత్‌దే కాంస్య పతకం
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా కాంస్య పతకం సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆకట్టుకుంది. ఆదివారం ఒలింపిక్ విజేత, ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మూడు-నాలుగు స్థానాల కోసం జరిగిన పోరులో భారత్ 2-1 తేడాతో జర్మనీని బోల్తా కొట్టించి కాంస్యాన్ని దక్కించుకుంది. ఆట ప్రారంభమైన 21 నిమిషాలకే ఎస్వీ సునీల్ గోల్ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఆపై జర్మనీ 36 నిమిషంలో గోల్ సాధించడంతో స్కోరు సమం అయ్యింది. మార్క్ ఆప్పెల్ గోల్ చేశాడు. కాగా, 54వ నిమిషంలో భారత్ ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆపై జర్మనీ గోల్ కోసం శత విధాలా ప్రయత్నించినా భారత్ రక్షణశ్రేణిని అధిగమించలేకపోయింది. -
జర్మనీతో భారత్ కాంస్య పోరు
భువనేశ్వర్: సొంతగడ్డపై ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో కాంస్య పతకం నెగ్గాలంటే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మూడో స్థానం కోసం ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఒలింపిక్, ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీతో భారత్ తలపడుతుంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 3–0తో జర్మనీని ఓడించి నేడు జరిగే టైటిల్ పోరులో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆస్ట్రేలియా తరఫున వూదెర్‌స్పూన్ (42వ ని.లో), జెరెమీ హేవార్డ్ (48వ ని.లో), టామ్ వికామ్ ఒక్కో గోల్ చేశారు. నలుగురు ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతుండటంతో సెమీఫైనల్లో జర్మనీకి 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉండటం గమనార్హం. లీగ్ దశలో జర్మనీ చేతిలో 0–2తో ఓడిపోయిన భారత్ ఈ కీలకపోరులో గెలిస్తే ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుంది. ►భారత్(vs) జర్మనీ సా.గం. 5.15 నుంచి ►అర్జెంటీనా(vs)ఆస్ట్రేలియారా.గం. 7.30 నుంచి -
ఆధిపత్యం మనది గెలుపు అర్జెంటీనాది
భువనేశ్వర్: ముఖాముఖి రికార్డులో స్పష్టమైన ఆధిక్యం ఉన్నా... మైదానంలో ఆటపరంగా ఆధిపత్యం చలాయించినా... తుది ఫలితం మాత్రం భారత్‌కు నిరాశ కలిగించింది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా ప్రపంచ నంబర్‌వన్, రియో ఒలింపిక్స్ విజేత అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 0–1 తేడాతో ఓడిపోయింది. భారీ వర్షంలోనే జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు గోల్‌పోస్ట్‌పై ఐదు సార్లు షాట్ కొట్టినా... ‘డి’ ఏరియాలో 11 సార్లు చొచ్చుకెళ్లినా... చివరి క్వార్టర్లో ఎక్కువ సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా గోల్ మాత్రం చేయలేకపోయారు. మరోవైపు అర్జెంటీనాకు ఆట 17వ నిమిషంలో లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను గొంజాలా పిలాట్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత భారత్ పలుమార్లు అర్జెంటీనా గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినా బంతిని మాత్రం లక్ష్యానికి చేర్చలేకపోయింది. టర్ఫ్‌పై ఎక్కువగా నీళ్లు ఉండటంతో భారత ఆటగాళ్లు తమ సహజశైలిలో వేగంగా కదల్లేకపోయారు. ఫీల్డ్ గోల్స్ చేయడం కష్టమైన తరుణంలో పెనాల్టీ కార్నర్లపైనే రెండు జట్లు ఆధారపడ్డాయి. అర్జెంటీనా తమకు దక్కిన ఏకైక అవకాశాన్ని అనుకూలంగా మల్చుకోగా... భారత్ తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. చివరి ఐదు నిమిషాల్లో భారత్ గోల్‌కీపర్ లేకుండానే ఆడింది. గోల్ కీపర్ ఆకాశ్ చిక్టేను వెనక్కి రప్పించి అతని స్థానంలో అదనంగా మరో ప్లేయర్‌ను ఆడించింది. అయితే ఈ వ్యూహం కూడా కలసిరాలేదు. జర్మనీ, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో ఆదివారం భారత్ కాంస్య పతకం కోసం ఆడుతుంది. ఈ మెగా ఈవెంట్ టోర్నీలో భారత్ సెమీస్‌లో ఓడిపోవడం వరుసగా రెండోసారి. 2015లో రాయ్‌పూర్‌లో జరిగిన టోర్నమెంట్లోనూ భారత్ సెమీఫైనల్లో ఓడి చివరకు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
బెల్జియంను బోల్తా కొట్టించి...
భువనేశ్వర్: లీగ్ మ్యాచ్‌ల్లో నిలకడలేమి ఆటతో నిరాశపరిచిన భారత జట్టు నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం అద్భుతం చేసింది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బెల్జియంతో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో గెలిచింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 3–3తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్లో భారత గోల్‌కీపర్ ఆకాశ్ చిక్టే బెల్జియం ఆటగాళ్లకు అడ్డుగోడలా నిలబడి జట్టును గెలిపించాడు. షూటౌట్లో భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్, రూపిందర్, హర్మన్‌ప్రీత్ గోల్స్ చేయగా... బెల్జియం జట్టు తరఫున ఫ్లోరెంట్, ఆర్థర్ సఫలమయ్యారు. నిర్ణీత సమయంలో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (31వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (35వ ని.లో), రూపిందర్ పాల్ (46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బెల్జియం జట్టుకు లుపేర్ట్ (39వ, 46వ .లో) రెండు గోల్స్, కెయుస్టర్స్ (53వ ని.లో) ఒక గోల్ అందించారు. -
మూడు నిమిషాలు నిలువరించలేక...
భువనేశ్వర్: తొలి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను నిలువరించిన భారత్ రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీ పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (47వ నిమిషంలో), రూపిందర్ పాల్ సింగ్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్ జట్టుకు స్యామ్ వార్డ్ (43వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... డేవిడ్ గుడ్‌ఫీల్డ్ (25వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. సోమవారం జరిగే తమ గ్రూప్‌లోని చివరి మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన మరుసటి నిమిషంలోనే గోల్ సమర్పించుకొని ‘డ్రా’తో సరిపెట్టుకున్న భారత్... ఇంగ్లండ్ జట్టును మాత్రం చివరి మూడు నిమిషాలు నిలువరించలేక ఓటమిని ఆహ్వానించింది. ఒకదశలో 0–2తో వెనుకబడిన భారత్ మూడు నిమిషాల వ్యవధిలో రెండు పెనాల్టీ కార్నర్లను సంపాదించి వాటిని గోల్స్‌గా మలిచి స్కోరును 2–2తో సమం చేసింది. ఇక మ్యాచ్ మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా భారత రక్షణపంక్తిలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ బంతిని నిలువరించడంలో తడబడ్డాడు. బంతిని అందుకున్న ఇంగ్లండ్ ప్లేయర్ స్యామ్ వార్డ్ ముందుకు దూసుకెళ్లి గోల్‌గా మలిచి భారత్ శిబిరంలో నిరాశను నింపాడు. -
‘చాంపియన్’తో సమంగా...
భువనేశ్వర్: ప్రపంచ చాంపియన్ చేతిలో ఓటమి ఎదురు కాకుండా నిలువరించిన ఆనందం ఒకవైపు... లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విజయానికి దూరమైన అసంతృప్తి మరోవైపు... హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత జట్టు పరిస్థితి ఇది. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ 20వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించగా... వెంటనే 21వ నిమిషంలో ఆసీస్ తరఫున జెరెమీ హేవార్డ్ గోల్ సాధించి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ నమోదు చేయలేకపోయాయి. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌తో తలపడుతుంది. సొంత ప్రేక్షకుల మద్దతుతో ఈ మ్యాచ్‌లో భారత్ చాలా వరకు ఆధిపత్యం ప్రదర్శించింది. దూకుడుగా ప్రారంభించడంతో పాటు ఆసాంతం తమ స్థాయికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొదట్లోనే గుర్జంత్ సింగ్ గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా ఆసీస్ కీపర్ లావెల్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే మరో రెండు సార్లు ఆకాశ్‌దీప్, గుర్జంత్ చేసి ప్రయత్నాలను లావెల్ నిరోధించాడు. ఆరో నిమిషంలో లభించిన తొలి పెనాల్టీని భారత్ వృథా చేసుకోగా, 12వ నిమిషంలో ఆసీస్ పెనాల్టీని ఆకాశ్ చిక్టే ఆపగలిగాడు. ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్ మన్‌ప్రీత్ తన కెరీర్లో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. అతని సారథ్యంలో ఇటీవలే భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. మరో మ్యాచ్‌లో జర్మనీ 2–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. జర్మనీ తరఫున గ్రమ్‌బుష్, క్రిస్టోఫర్ గోల్స్ సాధించారు. -
ఈసారీ పాక్‌ను చితక్కొట్టారు
♦ భారత్ 6–1తో ఘనవిజయం ♦ హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ లండన్: పాకిస్తాన్ హాకీ జట్టుకు భారత్ మరోసారి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. హాకీ వరల్డ్ లీగ్ (డబ్ల్యూహెచ్ఎల్)లో భాగంగా శనివారం 5 నుంచి 8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపిన భారత్ 6–1 గోల్స్ తేడాతో దాయాది పాక్‌ను చిత్తు చేసింది. రమణ్‌దీప్ సింగ్ (8వ, 28వ నిమిషాల్లో) సూపర్ షో ప్రదర్శించగా తల్వీందర్ సింగ్ (25వ ని.లో), మన్దీప్ సింగ్ (27వ, 59వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (36వ ని.లో) మిగతా గోల్స్‌తో భారీ విజయానికి సహకరించారు. పాక్ నుంచి ఎజాజ్ అహ్మద్ (41) ఏకైక గోల్ చేశాడు. ఈ ఓటమితో భారత్‌లో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో పాక్ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ఇక భారత్ 5–6 స్థానాల కోసం ఆదివారం కెనడాతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలోనూ భారత్ 7–1తో పాక్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. భారత్ vs కెనడా నేడు సా.గం. 4.15 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్!
లండన్: హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో మరోసారి పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 6-1 గోల్స్ భారీ తేడాతో దాయాదిపై ఘనవిజయం సాధించింది. వరల్డ్ హాకీ లీగ్‌లో 5-8 క్లాసిఫికేషన్ గేమ్‌లో గెలిచిన భారత్ తదుపరి మ్యాచ్‌లో కెనడాను ఎదుర్కోనుంది. ఐదు లేదా ఆరో స్థానాల కోసం ఈ మ్యాచ్ జరగనుంది. గడిచిన వారం రోజుల్లో దాయాది పాక్‌పై భారత్‌కు ఇది రెండో విజయం కావడం గమనార్హం. వరల్డ్ హాకీ లీగ్‌లో భాగంగా ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ 7-1 గోల్స్ తేడాతో పాక్‌ను భారత్ చిత్తుచేసింది. -
భారత్ VS పాక్
సాయంత్రం గం.4.15 నుంచి స్టార్‌స్పోర్ట్స్–2లో ప్రత్యక్షప్రసారం లండన్: వరుసగా మూడు విజయాలతో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌ను భారత్ ఘనంగానే ఆరంభించినా... ఆ తర్వాత గతి తప్పిన ఆటతో టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. 5 నుంచి 8 స్థానాల కోసం జరిగే ఈ వర్గీకరణ మ్యాచ్‌పై అభిమానుల్లో భావోద్వేగాలు మరోసారి తారస్థాయిలో ఉండటం ఖాయం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత జట్టు క్వార్టర్స్‌లో 14వ ర్యాంకులో ఉన్న మలేసియా చేతిలో 2–3తో కంగుతిన్న విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన మన్‌ప్రీత్ సింగ్ సేన దాయాది పాక్‌తో ఎలా చెలరేగుతుందనేది ఆసక్తికరం. -
కథ క్వార్టర్స్‌లోనే...
మలేసియా చేతిలో భారత్‌కు పరాభవం లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత్ కథ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం మలేసియాతో జరిగిన కీలక క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన భారత్ ఈ మ్యాచ్‌లో తడబడింది. రెండో క్వార్టర్లో మలేసియా తరఫున రహీమ్ రజి (19వ నిమిషం) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు 1–0తో ఆధిక్యాన్నిచ్చాడు. తర్వాత నిమిషంలో తాజుద్దీన్ (20వ ని.) కూడా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (24వ ని., 26వ ని.) రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేశాడు. ఈ నాలుగు గోల్స్ రెండో క్వార్టర్‌లోనే నమోదయ్యాయి. మూడో క్వార్టర్లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయారు. అయితే చివరి క్వార్టర్ మొదలైన మూడు నిమిషాలకే రహీమ్ రజీ (48వ ని.) రెండో గోల్ చేసి మలేసియాకు విజయాన్ని ఖాయం చేశాడు. ఆట చివరి నిమిషంలో రమణ్‌దీప్ గోల్ కోసం చేసిన ప్రయత్నం తృటిలో తప్పింది. దీంతో భారత్ ఓటమిపాలైంది. వర్గీకరణ మ్యాచ్‌లో రేపు (శనివారం) భారత్, పాకిస్తాన్‌తో తలపడనుంది. -
భారత్ x మలేసియా
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో గురువారం భారత జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. మలేసియా జట్టుతో జరిగే క్వార్టర్ ఫైనల్లో టీమిండియా బరిలోకి దిగనుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 1–3తో ఓడిన భారత్ ఈ నాకౌట్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పోరాడనుంది. ఫామ్‌లో ఉన్న ఆకాశ్‌దీప్ సింగ్, సునీల్, రమణ్‌దీప్ సింగ్ మళ్లీ రాణిస్తే భారత్‌కు సెమీఫైనల్ బెర్త్ కష్టమేమీ కాదు. -
హెచ్‌డబ్ల్యూఎల్ టోర్నీకి రజని
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే మహిళల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. రాణి రాంపాల్ కెప్టెన్‌గా, సుశీలా చాను వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రధాన గోల్‌కీపర్‌గా హరియాణా అమ్మాయి సవిత పూనియా ఎంపికైంది. జూలై 8 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. టాప్–6లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది లండన్‌లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. -
సర్దార్ సింగ్‌పై పోలీసుల విచారణ
♦ భారత హాకీ జట్టుకు ముందస్తు సమాచారం ఇవ్వని ఇంగ్లండ్ పోలీసులు లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించిన ఆనందంలో ఉన్న భారత జట్టుకు ఇంగ్లండ్ పోలీసులు షాక్ ఇచ్చారు. మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌పై గతేడాది నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా యార్క్‌షైర్ పోలీసులు అతడిని విచారణకు రావాలని ఆదేశించారు. అయితే టోర్నీ జరుగుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు ఇలాంటి చర్యకు దిగడం టీమ్ మేనేజ్మెంట్ను ఇబ్బందికి గురి చేసింది. ఇంగ్లండ్‌లో నివసించే భారత సంతతి హాకీ క్రీడాకారిణి, అతడి మాజీ ప్రియురాలు ఆశ్పాల్ భోగల్.. సర్దార్ సింగ్‌పై కేసు వేసింది. తనపై భారత్, ఇంగ్లండ్‌లో సర్దార్ సింగ్ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె ఆరోపించింది. ‘జట్టంతా లండన్‌లో ఉన్న సమయంలో సర్దార్‌ను విచారణ కోసం లీడ్స్‌కు రమ్మన్నారు. ఇది కొత్త కేసా? పాతదేనా? అనే విషయం కూడా మాకు తెలీదు. సర్దార్ దొంగచాటుగా ఇక్కడ ఉండటం లేదు. మంగళవారం నెదర్లాండ్స్‌తో కీలక మ్యాచ్ ఉన్న తరుణంలో దాదాపు 12 గంటల ప్రయాణం దూరంలో ఉన్న నగరానికి పిలిపించడం ఏమిటి?’ అని జట్టు అధికారి ఒకరు ప్రశ్నించారు. అక్రమార్కులకు నిలయం... మరోవైపు భారత్‌లో అక్రమాలు చేసిన వారంతా తెలివిగా ఇంగ్లండ్‌కు వెళ్లి నివసిస్తుంటారని, ఆ దేశం అలాంటి వారిని చక్కగా ఆదరిస్తుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడు నరీందర్ బాత్రా విమర్శించారు. ‘ఒకవేళ ఇంగ్లండ్ ఆటగాడిని భారత్‌లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఇంగ్లండ్‌తో పాటు ప్రపంచ మీడియా స్పందన ఏమిటో చూడాలనుంది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంగ్లండ్‌లోని భారత హైకమిషన్ జోక్యం చేసుకునేలా భారత మీడియా ప్రయత్నించాలి’ అని హాకీ ఇండియా మాజీ అధ్యక్షుడైన బాత్రా విజ్ఞప్తి చేశారు. నేడు నెదర్లాండ్స్‌తో పోరు... వరుసగా మూడు విజయాలతో ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరిన భారత హాకీ జట్టు నేడు (మంగళవారం) నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. స్కాట్లాండ్, కెనడా, పాక్ జట్లను చిత్తుగా ఓడిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు తమకన్నా మెరుగైన ప్రపంచ నాలుగో ర్యాంకర్ జట్టుపై ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. నెదర్లాండ్స్ కూడా పాక్, స్కాట్లాండ్పై నెగ్గింది. -
భారత్‌కు రెండో విజయం
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. కెనడాతో శనివారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో టీమిండియా 3–0తో గెలిచింది. భారత్ తరఫున ఎస్వీ సునీల్ (5వ నిమిషంలో), ఆకాశ్‌దీప్ సింగ్ (10వ నిమిషంలో), సర్దార్ సింగ్ (18వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.చస్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–1తో నెగ్గిన సంగతి విదితమే. వరుసగా రెండు విజయాలతో భారత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. నేడు పాక్‌తో పోరు... ఒకవైపు లండన్‌లో చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం భారత్, పాక్ క్రికెట్ జట్లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుండగా... అదే నగరంలో భారత్, పాకిస్తాన్ హాకీ జట్లు నేడు లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటివరకు భారత్, పాక్ హాకీ జట్లు 167 మ్యాచ్‌ల్లో తలపడగా... భారత్ 55 మ్యాచ్‌ల్లో, పాక్ 82 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 30 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్ 324 గోల్స్, పాక్ 388 గోల్స్ సాధించాయి. నేటి సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్ శుభారంభం
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. స్కాట్లాండ్తో గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట ఆరో నిమిషంలో కెప్టెన్ క్రిస్ గ్రాసిక్ గోల్‌తో స్కాట్లాండ్ ఖాతా తెరిచింది. ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్న భారత్ ఆ తర్వాత జాగ్రత్తగా ఆడింది. 31వ, 34వ నిమిషాల్లో రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్‌కు ఆకాశ్‌దీప్ సింగ్ (40వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో కెనడాతో భారత్ తలపడుతుంది. -
మహిళల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో భారత్
వెస్ట్ వాంకోవర్ (కెనడా): హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) రౌండ్–2లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత్ 4–0 గోల్స్‌తో బెలారస్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (13వ, ని. 58వ ని.), కెప్టెన్ రాణి రాంపాల్ (20వ ని. 40వ ని.) రెండేసి గోల్స్ చేశారు. మరో సెమీస్‌లో ఉరుగ్వేపై 2–1తో గెలిచిన చిలీతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. తాజా సెమీస్ విజయంతో భారత జట్టు హెచ్‌డబ్ల్యూఎల్ సెమీఫైనల్ ఈవెంట్‌కు అర్హత సంపాదించింది. ఎఫ్ఐహెచ్ మహిళల ప్రపంచకప్ (2018)కు క్వాలిఫయింగ్ టోర్నీ అయిన ఆ ఈవెంట్ ఈ ఏడాది జూన్ 21 నుంచి బెల్జియంలో జరుగనుంది. -
ఒకే పూల్ లో భారత్, పాక్
హాకీ వరల్డ్ లీగ్ లండన్: వచ్చే ఏడాది జరిగే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్ ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే పూల్‌లో తలపడనున్నారుు. లండన్‌లో పురుషుల విభాగంలో జరిగే ఈ టోర్నీలో దాయాది జట్లతోపాటు నెదర్లాండ్స పూల్ ‘బి’లో చోటు దక్కించుకుంది. జూన్ 15 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ జూన్ 18న జరుగుతుంది. హెచ్‌డబ్ల్యూఎల్ టోర్నీని భారత్ ఆతిథ్యమివ్వనున్న 2018 ప్రపంచకప్‌కు క్వాలిఫరుుంగ్ ఈవెంట్‌గా పరిగణిస్తున్నారు. ఆతిథ్య ఇంగ్లండ్, ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా సహా నెదర్లాండ్స, కొరియా, భారత్, పాక్ జట్లు నేరుగా ప్రధాన ఈవెంట్లో తలపడతారుు. మరో నాలుగు జట్లు మాత్రం హెచ్‌డబ్ల్యూఎల్ రెండో రౌండ్ క్వాలిఫరుుంగ్ పోటీల ద్వారా అర్హత సాధిస్తారుు. ఈ ఏడాది పాక్‌ను ఓడించి ఆసియా చాంపియన్సగా నిలిచిన భారత్ ఇదే జోరును నిలకడగా కొనసాగిస్తే హెచ్‌డబ్ల్యూఎల్‌లోనూ చిరకాల ప్రత్యర్థిని కంగుతినిపించేదుకు అవకాశముంటుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్‌పై అంచనాలు పెరుగుతారుు. -
భారత్ సంచలనం
- కాంస్య పతకం నెగ్గిన సర్దార్ సేన - నెదర్లాండ్స్‌పై ‘షూటౌట్’లో విజయం - హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ రాయ్‌పూర్: ఆద్యంతం పట్టుదలతో పోరాడిన భారత హాకీ జట్టు ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో కాంస్య పతకం నెగ్గి సంచలనం సృష్టించింది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా ‘షూటౌట్’లో 3-2తో అద్భుత విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 5-5 గోల్స్‌తో సమంగా ఉండటం విశేషం. రెగ్యులర్ టైమ్‌లో భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (39వ, 51వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (47వ, 55వ ని.లో) రెండేసి గోల్స్ చేయగా... ఆకాశ్‌దీప్ సింగ్ (56వని.లో) ఒక గోల్ సాధించాడు. నెదర్లాండ్స్ జట్టులో మిర్కో ప్రుసెర్ (9వ ని.లో), వాన్‌డెర్ షూట్ నీక్ (25వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... వాన్‌డెర్ వీర్డెన్ మింక్ (54వ, 58వ, 60వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఇక ‘షూటౌట్’లో నెదర్లాండ్స్ తరఫున బిల్లీ బాకెర్, వాన్ సెవ్ సఫలమవ్వగా... హెర్ట్‌బెర్గర్, మిర్కో ప్రుసెర్, వాలెంటిన్ షాట్లను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుకున్నాడు. భారత్ నుంచి డానిష్ ముజ్తబా, అమీర్ ఖాన్ విఫలమవ్వగా... బీరేంద్ర లాక్రా, సర్దార్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ బంతిని లక్ష్యానికి చేర్చి భారత విజయాన్ని ఖాయం చేశారు. మరోవైపు ఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 2-1 గోల్స్ తేడాతోబెల్జియంను ఓడించి విజేతగా నిలిచింది. 33 ఏళ్ల తర్వాత భారత జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో కాంస్య పతకం నెగ్గడం విశేషం. చివరిసారి భారత్ 1982 చాంపియన్స్ ట్రోఫీలో 5-4తో పాకిస్తాన్‌ను ఓడించి కాంస్య పతకం సాధించింది. -
హాకీ వరల్డ్ లీగ్‌లో భారత్‌కు కాంస్యం
రాయ్‌పూర్: హాకీ వరల్డ్ లీగ్ లో భారత జట్టు కాంస్య పతకం చేజిక్కించుకుంది. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో విజయం సాధించింది. భారత్ సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓడిపోయి మూడో స్థానం కోసం నెదర్లాండ్ తో పోటి పడి గెలుపొందింది. -
పోరాడి ఓడిన భారత్
ఫైనల్లో బెల్జియం 1-0తో టీమిండియాపై గెలుపు రాయ్‌పూర్: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించాలని భావించిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 0-1 గోల్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. ఆట ఐదో నిమిషంలో సెడ్రిక్ చార్లియర్ చేసిన గోల్‌తో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు భారత ఆటగాళ్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో బెల్జియం; కాంస్య పతక పోరులో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడతాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తొలి రెండు భాగాల్లో అనుకున్నంత దూకుడుగా ఆడలేకపోయారు. మరోవైపు బెల్జియం అవకాశం వచ్చిన ప్రతీసారి భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. అయితే మ్యాచ్ మొత్తంలో రెండు జట్లకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా రాకపోవడం గమనార్హం. సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 59 శాతం ఉంచుకున్నా... బెల్జియం గోల్‌పోస్ట్ ‘డి’ ఏరియాలోకి 24 సార్లు చొచ్చుకెళ్లినా గోల్‌ను మాత్రం చేయలేకపోయారు. -
భారత్‌ను ఆదుకున్న ఆకాశ్‌దీప్
జర్మనీని నిలువరించిన టీమిండియా హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ రాయ్‌పూర్: తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన భారత హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 1-1తో ‘డ్రా’గా ముగించింది. ఆట ఆరో నిమిషంలో నిక్లాస్ వెలెన్ గోల్‌తో జర్మనీ ఖాతా తెరువగా... భారత్ తరఫున 47వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఆట మొదలైన తొలి నిమిషం నుంచే సమన్వయంతో ఆడుతూ జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. మూడో నిమిషంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా చింగ్లెన్సనా సింగ్ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత సర్దార్ సింగ్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో తల్వీందర్ సింగ్ అందుకోలేకపోయాడు. అయితే జర్మనీ జట్టు కూడా దూకుడుగా ఆడేందుకే ప్రయత్నించింది. ఆరో నిమిషంలో మథియాస్ ముల్లర్ ముగ్గురు భారత ఆటగాళ్లను తప్పిస్తూ కుడి వైపు నుంచి దూసుకెళ్లి ‘డి’ ఏరియాలో సహచరుడు నిక్లాస్ వెలెన్కు పాస్ ఇచ్చాడు. నిక్లాస్ మిగతా కార్యాన్ని పూర్తి చేసి జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. గోల్ సమర్పించుకున్నప్పటికీ భారత ఆటగాళ్లు డీలా పడకుండా ఉత్సాహంతో ఆడారు. ఫినిషింగ్ లోపం వెంటాడినా చివరకు ఆకాశ్‌దీప్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేయగలిగింది. మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. -
భారత్ తొలి పోరు అర్జెంటీనాతో
హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ షెడ్యూల్ విడుదల లుసానే (స్విట్జర్లాండ్): స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలపడనుంది. ఈ ఏడాది నవంబరు 27 నుంచి డిసెంబరు 6 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు చత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) బుధవారం విడుదల చేసింది. పూల్ ‘బి’లో భారత్, అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ... పూల్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రిటన్, కెనడా జట్లు ఉన్నాయి. తొలి రోజు నవంబరు 27న అర్జెంటీనాతో భారత్; డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో ఒలింపిక్ చాంపియన్ జర్మనీ తలపడతాయి. అనంతరం భారత్ 28న జర్మనీతో; 30న నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. డిసెంబరు 4, 5న సెమీఫైనల్స్, డిసెంబరు 6న ఫైనల్ జరుగుతుంది. -
చేజారిన కాంస్యం
బ్రిటన్ చేతిలో భారత్ ఓటమి హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్‌వర్ప్ (బెల్జియం): రక్షణపంక్తి పేలవ ప్రదర్శన కారణంగా భారత పురుషుల హాకీ జట్టు మరో భారీ పరాజయం మూటగట్టుకుంది. ఆదివారం ముగిసిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో సర్దార్ సింగ్ బృందం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 1-5 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. కాంస్య పతకం నెగ్గిన బ్రిటన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో ఆతిథ్య బెల్జియం చేతిలో 0-4తో ఓడిన భారత్... ఈ మ్యాచ్‌లోనూ నిరాశాజనక ఆటతీరును కనబరిచింది. భారత రక్షణపంక్తిలోని లోపాలను సద్వినియోగం చేసుకున్న బ్రిటన్ ఆటగాళ్లు బ్రాగ్‌డన్ (11వ ని.లో), గ్రిఫిత్ (27వ ని.లో), యాష్లే జాక్సన్ (37వ ని.లో), డిక్సన్ (42వ ని.లో), మిడిల్టన్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు రూపిందర్ పాల్ సింగ్ (59వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. -
బ్రిటన్ను నిలువరిస్తుందా?
కాంస్య పతక పోరు కోసం భారత్ సిద్ధం వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్వార్ప్: చిన్నచిన్న లోపాలను అధిగమించడంలో విఫలమవుతున్న భారత జట్టు... హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నీలో కాంస్య పతక పోరు కోసం సిద్ధమైంది. నేడు జరగనున్న ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ప్రత్యర్థి, ప్రపంచ ఐదో ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్, క్వార్టర్ఫైనల్లో స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగిన ఇరుజట్లు సెమీస్‌కు వచ్చేసరికి బలహీనతలను అధిగమించలేకపోయాయి. బెల్జియం స్ట్రయికర్ల దాడులకు భారత డిఫెన్స్ కకావికలమైతే... ప్రపంచ చాంపియన్ ఆసీస్ దూకుడు ముందు బ్రిటన్ తలవంచింది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లలో మెరుగైన టీమ్ ఏదో ప్లే ఆఫ్ మ్యాచ్‌తో తేలిపోతుంది. కీలక సమయంలో ఫార్వర్డ్స్, డిఫెండర్ల మధ్య సమన్వయం కొరవడుతుండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. మరోవైపు భారత్‌తో పోలిస్తే బ్రిటన్ మెరుగ్గా ఆడుతోంది. సెమీస్‌లో ఆసీస్‌ను తక్కువ స్కోరుకు నిలువరించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. ఫైనల్లో ఆసీస్: శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా 3-1తో బ్రిటన్‌పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. గోవర్స్ బ్లేక్ (28వ ని.లో), బాలె డేనియల్ (38వ ని.లో), వెటన్ జాకబ్ (51వ ని.లో)లు ఆసీస్‌కు గోల్స్ అందించారు. బ్రిటన్ తరఫున కాట్లిన్ నిక్ (36వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. -
భళా... భారత్
సెమీస్‌లో సర్దార్‌సేన క్వార్టర్స్‌లో మలేసియాపై గెలుపు హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ యాంట్వార్ప్ (బెల్జియం): ఓవైపు తీవ్రమైన ఎండ... మరోవైపు ప్రత్యర్థుల ఎదురుదాడులు... అయినా ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో చెలరేగిన భారత జట్టు... హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో దుమ్మురేపింది. బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత్ 3-2 తేడాతో మలేసియాపై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున సత్బీర్ సింగ్ (3వ ని.లో), జస్జీత్ సింగ్ (50వ, 56వ ని.లో) గోల్స్ చేయగా, రహీమ్ రజీ (15వ ని.లో), సబ్బా షహ్రీల్ (23వ ని.లో) మలేసియాకు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరుజట్లు అటాకింగ్‌కు దిగాయి. తొలి క్వార్టర్లో బంతిపై ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడాయి. బ్యాక్‌లైన్ నుంచి ఆకాశ్‌దీప్ బంతిని డి-సర్కిల్లో అదుపు చేయగా పక్కనే ఉన్న సత్బీర్ నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో భారత్‌కు తొలి గోల్ లభించింది. 4వ నిమిషంలో మలేసియాకు పెనాల్టీ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తర్వాత రమణ్‌దీప్, మన్‌ప్రీత్, సర్దార్లు అటాకింగ్ చేసినా మలేసియా సమర్థంగా అడ్డుకుంది. మరికొన్ని సెకన్లలో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా మలేసియా ప్లేయర్ రజీ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. రెండో క్వార్టర్లో భారత్ ఎదురుదాడులు కాస్త గాడి తప్పగా, మలేసియా అద్భుతంగా డిఫెన్స్ చేసింది. మిడ్‌ఫీల్డ్‌లో బంతిని బాగా కంట్రోల్ చేయడంతో 23వ నిమిషంలో నాలుగో పెనాల్టీ లభించింది. దీన్ని షహ్రీల్ గోల్‌గా మల్చడంతో మలేసియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి నిమిషంలోనే భారత్ కౌంటర్ అటాక్‌కు దిగి పీసీని రాబట్టింది. అయితే దీన్ని రూపిందర్ పాల్ వృథా చేశాడు. 28వ నిమిషంలో వాల్మీకి రెండో పెనాల్టీని సాధించినా... రిఫరల్‌లో ఇది వీగిపోయింది. మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు చేసిన దాడులు ఫలించకపోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే 48వ నిమిషంలో పెనాల్టీ రిఫరల్‌లో వీగిపోగా, తర్వాతి నిమిషంలో మరో పీసీ భారత్‌కు లభించింది. దీన్ని జస్జీత్ హై ఫ్లిక్‌తో సూపర్బ్‌గా నెట్లోకి పంపి భారత్ శిబిరంలో ఆనందం నింపాడు. మరో ఏడు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీని జస్జీత్ మళ్లీ గోల్‌గా మలిచి భారత్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆట 30 సెకన్లలో ముగుస్తుందనగా మలేసియాకు పెనాల్టీ లభించినా గోల్‌కీపర్ శ్రీజేష్ బంతిని అద్భుతంగా నిలువరించడంతో విజయం భారత్ సొంతమైంది. ఇదే టోర్నీ మహిళల విభాగంలో గురువారం ఇటలీతో భారత జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే భారత్‌కు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉంటాయి.