JAGADEVPUR
-
జగదేవ్‌పూర్‌లో మహిళ దారుణ హత్య
జగ్దేవ్పూర్: సిద్ధిపేట జిల్లా జగ్‌దేవ్‌పూర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు మహిళను కర్రలతో కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతురాలు ములుగు మండల అడవిమసీదు గ్రామానికి చెందిన పిట్టల బాలామణి(40)గా గుర్తించారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కొమురవెల్లిలో విలీనం చేయొద్దు
జగదేవ్‌పూర్: మండలంలోని కొండపోచమ్మ దేవాలయన్ని నూతనంగా ఏర్పాటు చేస్తున్న కోమురవెల్లి మండలంలో కలుపవద్దని పీఆర్టీయు మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ప్రధాన కారద్యర్శి శశిధర్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు అన్నారు. రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నందునే జగదేవ్‌పూర్ మండలానికి గుర్తింపు వచ్చందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడుతున్న మర్కూక్ మండలంలోకి జగదేవ్పూర్నకు చెందిన ఐదు గ్రామాలు విలీనమవుతున్నాయని తెలిపారు. విలీనమయ్యేవాటిలో రెండో కంచిగా పేరున్న వరదరాజ్‌పూర్ గ్రామం కూడా ఉందన్నారు. మరోపుణ్యక్షేత్రం కొండపోచమ్మను కూడా కొమురవెల్లిలో కలిపేందుకు యత్నాలు జరుగుతున్నాయని, అటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. -
పంట మార్పిడి.. అధిక దిగుబడి
నీటి పొదుపు ముఖ్యం.. రైతులకు అవగాహన అవసరం మండల వ్యవసాయ అధికారి నాగరాజు జగదేవ్‌పూర్: నీరు వ్యవసాయానికి ప్రాణాధారం. పంటలకు ఎంతో అవసరమైన నీటిని విచక్షణా రహితంగా వాడడం వల్ల జలవనరులు రోజు రోజుకు తరిగి నీటి ఎద్దడి ఏర్పడుతోంది. దీంతో నీటి కొరత ఏర్పడి సాగు చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటల్లోకి భారీగానీరు చేరింది. ఈ దశలో రబీలో వరితోపాటు, ఆరుతడి పంటలను చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి నాగరాజు తెలిపారు. ముఖ్యంగా పంట మార్పిడి వల్ల భూసారం పెరిగి నాణ్యమైన పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయన అందించిన సలహాలు.. సూచనలు.. ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల ఎక్కువ దిగుబడి, ఆదాయాన్ని పొందవచ్చు. ఆరుతడి పంటలు సాగు చేయటం వలన తక్కువ నీరు, తక్కువ విద్యుత్, తక్కువ పెట్టుబడులతో అధిక ఆదాయాన్ని పొందడం వీలవుతుంది. ఒక ఎకరం వరిసాగుకు కావాలసిన నీటితో కనీసం 2 నుంచి 3 ఎకరాలు ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. వరుసగా వరి పండించడం కన్నా, పంట మార్పిడితో భూమి సారవంతమై, ఎరువుల ఖర్చు తగ్గి దిగుబడులు పెరుగుతాయి. పురుగులు, తెగుళ్లు కూడా తక్కువగా అశిస్తాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల మనకు నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజలు, కూరగాయల కొరత కూడా తగ్గుతుంది. వరి మాగాణిలో కూడా వరికి ప్రత్యామ్నాయంగా రబీలో మొక్కజొన్న, జోన్న, గోధుమ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కుసుమలు, ఆముదం, సోయాచిక్కుడు, శనగ, మినుము, పెసర, ధనియాలు, మొదలైన పంటలను సాగు చేసుకోవాలి. వాతావరణ నేలలు నీటి లభ్యతలను బట్టి ఆరుతడి పంటలుగా పండించవచ్చు. అలాగే డ్రిప్పు సౌకర్యంతో ఆరుతడి పంటలను పండించుకోవాలి. మొక్కజొన్న రబీలో ఆరుతడి పంటగా మొక్కజొన్న పంటను ఆక్టోబర్, నవంబర్ మాసాలలో విత్తాలి. చలి బాగా ఉండే ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో విత్తితే మొలక రాదు. తేమను ఉంచే నేలలు మొక్కజోన్న పంటలకు బాగా అనుకూలం. చౌడు, నీటి ముంపు నేలలు మొక్కజోన్న పంట సాగుకు పనికి రావు. పొద్దుతిరుగుడు ఈ పంటను నీటి పారుదల కింద రబీ, వేసవి పంటగా విత్తి అధిక దిగుబడి , అధిక ఆదాయం పొందవచ్చు. పొద్దుతిరుగుడు పంటను రబీలో నవంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఈ పంటను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. కాకపోతే నీటి ముంపును తట్టుకోదు. ధనియాలు రబీలో నల్ల భూముల్లో ధనియాలు పండించడానికి చాలా అనుకూలం. చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణంలో మంచు ఈ పంటకు అనుకూలం. నీటి సౌకర్యం ఉన్నచోట ఆరుతడి పంటగా తేలికపాటి నీటి తడులలో తక్కువ కాలంలో ఈపంటను పండించవచ్చు. గోధుమ పంట గోధుమ పంట ప్రధానంగా రబీ కాలపు పంట. ఈ పంట పెరుగుదలకు చల్లని వాతావరణంతో పాటు గాలిలో 50 శాతం కంటే తక్కువ తేమ, అల్ప ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఈ పంట జిల్లాలో సాగుకు అనుకూలమే. నల్లరేగడి భూములలో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ముఖ్యంగా తేమ నిలుపుకునే భూములు (బరువైన నేలలు) బాగా అనుకూలం. నీటి సౌకర్యం ఉన్న చోట ఆరుతడి పంటగా తేలిక తడులు పారించి అన్ని రకాల భూములలో గోధుమ పండించవచ్చు. శనగ శనగ పంట ఎక్కువ శాతం నల్లరేగడి భూముల్లో పండే పంట. మొక్కజొన్న పంట పూర్తి కాగానే చాలా మంది రైతులు శనగ పంట వేసేందుకు మొగ్గు చూపుతారు. ముందుగా రెండు మూడు సార్లు దుక్కిని దున్ని నాగలి లేదా ట్రాక్టరుతో విత్తనం వేయాలి. నీరు అధికంగా ఉంటే ఈ పంట పండడం సాధ్యం కాదు. మంచు ఎక్కువ శాతం ఉండే ప్రాంతాల్లో శనగ పంట బాగా పండుతుంది. ఆరుతడి పంటలకు నేల తయారీ ఆరుతడి పంటల సాగుకు నేల యాజమాన్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం, శనగ పంటలను వరి కోసిన తరువాతే దుక్కిచేయకుండా విత్తే విధానం ఆచరణలోకి వచ్చింది. దీనిని జీరో టిల్లేజి విధానం అంటాం. వరి కోసిన తరువాత దుబ్బులు చిగురించకుండా ఉండేందుకు, అప్పటికే మొలచివున్న కలుపును నివారించేందుకు పారాక్వాట్ అనే కలుపును మందును పిచికారి చేయాలి. లీటరు నీటికి 8మి.లీ.కలుపు మందును కలుపు మొక్కలు, వరి దుబ్బులు బాగా తడిసేలా పిచికారి చేయాలి. తరువాత వెంటనే విత్తనాలు విత్తుకొవచ్చు. భూమిలో సరైన తేమ లేనప్పడే తేలికపాటి నీటితడి ఇచ్చి విత్తనాన్ని విత్తకోవాలి. లేదా విత్తే యంత్రాలు సహాయంతో వేసుకోవాలి. వేరుశనగ, ఆవాలు తదితర పంటలను సాగు చేయటానికి వరి తరువాత నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు నాగలితోగాని, ట్రాక్టరుతో దున్నటానికి వీలుపడదు. భూమి ఆరితే దున్నినప్పుడు పెద్ద పెద్ద పెడ్డలు ఏర్పడుతాయి. అందుకని తగినంత తేమ నేలలో ఉన్నప్పుడు రెండులేదా మూడు సార్లు దున్ని నేలను బాగా చదును చేసుకొని విత్తనం వేసుకోవాలి. -
సీతాఫలం ఉపాధి మార్గం
జగదేవ్‌పూర్: తెల్లవారంగానే చంకన తట్టబుట్ట, సంచి పట్టుకుని అడవికి ప్రయాణం..చెట్టు పుట్ట తిరుగుతూ సీతాఫలాల కోసం ఆరాటం..సేకరించిన కాయలను తట్టలో పెట్టుకుని అమ్మేందుకు పోటీ..ఇదంతా కూలీల బతుకు పోరాటం..వాన కాలం చివరి దశలో ఏ పల్లెలో చూసినా సీతాఫలాల కోసం కూలీలు ఊరు విడిచి వెళుతూ కనిపిస్తారు. మండలంలోని సీతాఫలాల అమ్మకాలు జోరందుకున్నాయి. వందలాది మంది కూలీలు సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నారు. జగదేవ్‌పూర్ మండలం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ప్రతి ఏటా సీతాఫలాలతో ఎంతో మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. మండలంలోని ధర్మారం, కొండాపూర్, పీర్లపల్లి, దౌలాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాలు అటవీ ప్రాంతం ఉంది. జిల్లా సరిహద్దు మండలం కావడంతో నల్గొండ, వరంగల్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో అటవీప్రాంతం ఉంది. గంధమల్ల, నర్సాపూర్, సాల్వపూర్, సింగారం తదితర గ్రామాల్లో కూలీలు సీతాఫలాలను సేకరిస్తారు. సేకరించిన కాయలను తట్ట చొప్పున విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒక్క తట్ట వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అమ్ముతున్నారు. సేకరించిన సీతాఫలాలను ప్రధాన రోడ్ల వెంట విక్రయిస్తున్నారు. జగదేవ్‌పూర్, పీర్లపల్లి ప్రధాన రోడ్ల వెంట ఎంతో మంది కూలీలు సీతాఫలాలతో కనిపిస్తారు. ముఖ్యంగా ముదిరాజ్ కులస్తులు ఎక్కువగా సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నారు. ప్రతి రోజు ఒక్కో కూలీ సుమారు రెండు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నారు. సేకరించిన సీతాఫలాలను హైదరాబాద్ నుంచి వచ్చి కూలీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మండలం నుండి ప్రతిరోజు ఐదు నుంచి ఎనిమిది ఆటో వరకు తరలిపోతున్నాయి. భలే గీరాకి సీతాఫలాలలో ఔషధ గుణాలు ఎక్కువ ఉండడంతో సీజన్లో సీతాఫలాలకు గిరాకీ పెరిగింది. గత ఏడాది కంటే ఈ సారి వ్యాపారం జోరందుకుంది. కాలం కలిసిరావడమే కాకుండా చెట్లకు ఎక్కువ శాతం కాయలు కాయడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా ఒక్క చెట్టుకు వందకు పైగా కాయలు కాశాయి. గ్రామాల్లో ఉదయమే అటవీప్రాంతానికి వెళ్లి సాయంత్రం అమ్ముకుని ఇంటి దారి పడుతున్నాయి. సీతాఫలాలలో ఔషధ గుణాలు ఉండడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పిల్లలను సెలవు ఉండడంతో తల్లిదండ్రులతో కలిసి సీతాఫలాల సేకరణకు వెళుతున్నారు. రోజుకు వంద పైగా సంపాదిస్తున్నా : కూలీ, మల్లమ్మ సీతాఫల కాయలతో రోజుకు వందకు పైగానే సంపాదిస్తున్నా. మా ఊరి నుంచి చట్టు ముట్టు గ్రామాల్లో ఉన్న అడవులోకి వెళ్లి రోజుకు రెండుమూడు తట్టల కాయలను తెంపుకుని వస్తున్నా. ఓ రోజు ధర బాగానే ఉంటుంది. ఓ రోజు తక్కువ ధర వస్తుంది. అయినా గత పది రోజలు నుంచి అమ్ముతున్నా. మంచి డిమాండ్ ఉంది. ఎంతో మంది వచ్చి తట్టలకొద్ది కొంటున్నారు. సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నా..కూలీ, లక్ష్మి కూలీ పనులు దొరకడం చాలా కష్టంగా మారింది. దీంతో సీతాఫలాలతో ఉపాధి పొందుతున్నా. ప్రతిరోజు రెండు వందల వరకు లాభం వస్తుంది. తిరిగితే కానీ కాయలు దొరకడం లేదు. గతంలో కంటే ఈ సారి చాలా మంది కూలీలు సీతాఫలాల కోసం అడవులు తిరుగుతున్నారు. ఒక్క తట్టకు వంద నుండి రెండు వందల వరకు అమ్ముతున్నా. -
రహదారి చెట్లకు సంరక్షణ
జగదేవ్‌పూర్: మండలంలోని వివిధ ప్రాంతాల మీదుగా ఆర్‌ఆండ్‌బీ రోడ్ల కిరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధికారులు సమయాత్తమయ్యారు. నెల రోజుల క్రితం నాటిన మొక్కలకు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు రోజులుగా మండల కేంద్రమైన జగదేవ్‌పూర్ నుంచి కొడకండ్ల వరకు ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులు చేస్తున్న కూలీలకు రోజుకు రూ.350 చెల్లిస్తున్నారు. ప్రస్తుతం జగదేవ్‌పూర్ నుంచి మునిగడప వరకు పూర్తి చేశారు. పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
వేశ్య, పూసలి జీవనశైలిపై ఆధ్యయనం
జగదేవ్‌పూర్:జగదేవ్‌పూర్‌లో వేశ్య, కూలాల బతుకలు, పూసలి కూలాల జీవనశైలిపై శనివారం తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కో అపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు ఆధ్యయనం చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు జగదేవ్‌పూర్ వచ్చి ముందుగా వేశ్య గృహాలవద్దకు వెళ్లారు. అక్కడి వారి జీవన పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం పూసలి కూలాల వద్దకు వెళ్లి వారితో గంటపాటు బతుకు స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వెనుకబడిన కులాలపై ఆధ్యయనం చేసి వారి జీవన పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకొవడం జరుగుతుందన్నారు. అలాగే వారికి అవగాహన కల్పించి ఉపాధి మార్గాలను కల్పిస్తామన్నారు. సోమవారం సచివాలయం నుంచి జగదేవ్‌పూర్‌కు ప్రభుత్వ అధికారులు రానున్న సందర్భంగా ముందుగా వారి జీవనశైలిని అధ్యయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈడీ రాంరెడ్డి, గజ్వేల్ బీసీ వసతి గృహల బాధ్యులు పుష్పలత పాల్గొన్నారు. -
చెరువులను పరీశీలించిన జేసీ
జగదేవ్‌పూర్: మండలంలోని చేబర్తి పెద్ద చెరువును గురువారం మధ్యాహ్నం జేసీ వెంక్రటాంరెడ్డి, గడ అధికారి హన్మంతరావుతో కలిసి చెరువును పరిశీలించారు. అలాగే సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో కూడవెల్లి ఆధునీకరణ, కుంటలను పరిశీలించారు. చేబర్తి పెద్ద చెరువు నిండటంతో హర్షం వ్యక్తం చేశారు. చెరువు నీటి నిల్వ సామర్థ్య విషయాలను ఇరిగేషన్ అధికారులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల వల్ల చెరువు, కుంటలోకి ఎక్కువ శాతం వచ్చి చేరిందన్నారు. చేబర్తి చెరువు నిండడం వల్ల ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు మేలు జరుగుతుందన్నారు. చేబర్తి గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో వాగు పుట్టింది మా ఊరి పేరే పెట్టాలని, కూడవెల్లి కాదని జేసీ దృష్టికి తీసుకపోయారు. దీనిపై జేసీ స్పందిస్తూ పేరు మార్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాంచంద్రం, సర్పంచ్ బాల్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక అధికారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మా బడి.. మా పిల్లలు
ప్రభుత్వ బడిని బతికించుకున్న స్థానికులు ఇక్కడి పిల్లలు ఇక్కడి పాఠశాలకే సర్పంచ్ పిల్లలు కూడా సర్కార్ బడికే 20 నుంచి 55కు చేరిన విద్యార్థుల సంఖ్య హెచ్ఎం కృషి.. స్థానికుల ఐక్యత ఆదర్శంగా నిలుస్తోన్న తీగుల్ నర్సాపూర్ బడి జగదేవ్‌పూర్: ‘మా బడి.. మా పిల్లలు’ నినాదంతో సర్కార్ బడిని బతికించుకున్నారు తీగుల్ నర్సాపూర్ వాసులు. విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో బడిని మూసేస్తారేమోనన్న భయం వారిని వెంటాడింది. ప్రధానోపాధ్యాయురాలి చొరవ.. స్థానికుల ఐక్యత వల్ల బడిని బతికించుకున్నారు. ఐదోతరగతి లోపు వారందరిని స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపుతుండడంతో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. సర్పంచ్ సైతం తన ఇద్దరు పిల్లలనూ సర్కార్ బడికే పంపుతున్నారు. స్థానికుల్లో వచ్చిన మార్పు సర్కార్ బడికి ప్రాణం పోసింది. మండలంలోనే చిన్న గ్రామం తీగుల్ నర్సాపూర్. గ్రామ జనాభా 680. ఓటర్లు 412మంది. కుటుంబాలు 220. గ్రామంలో ఎక్కువగా వ్యవసాయమే జీవనధారం. గ్రామంలో చదువుకునే విద్యార్థుల సంఖ్య సుమారు 120 మంది వరకు ఉంటారు. గ్రామంలో గత కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. కొంత కాలంగా పల్లె పల్లెకు ప్రైవేట్ విద్యా సంస్థలు రావడంతో ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మొదట్లో 50 మంది ఉండగా క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక్కడి విద్యార్థులు జగదేవ్‌పూర్, గజ్వేల్, కుకునూర్‌పల్లిలోని ప్రైవేట్ పాఠశాలకు వెళ్తేవారు. గత రెండు మూడేళ్ల నుంచి ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గింది. గత ఏడాది 20కి చేరుకుంది. దీంతో ఒక్కరే టీచర్ విద్యార్థులకు చదువు చెప్పేవారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలలను మూసివేస్తామని ఈసారి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. పాఠశాల హెచ్ఎం సమత స్థానికులతో చర్చించారు. బడిని బతికించుకోవాలన్న సంకల్పం వారిలో కల్పించారు. వెంటనే సర్పంచ్ రజిత రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సభను ఏర్పాటు చేసి ఐదోతరగతిలోపు పిల్లలను మన బడికే పంపిస్తామని తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాన్ని ఎంఈఓ ఉదయ్‌భాస్కర్, గఢా అధికారి హన్మంతరావులకు అందించారు. గ్రామస్తుల ఐక్యతను అధికారులు మెచ్చుకున్నారు. నాడు 20.. నేడు 55 మంది విద్యార్థులు గత ఏడాది స్థానిక పాఠశాలలో కేవలం 20 మందే ఉండగా ఈ సారి వారి సంఖ్య భారీగా పెరిగింది. గ్రామంలోని ఐదోతరగతి పిల్లలంతా స్థానిక ప్రభుత్వ బడికే రావడంతో విద్యార్థుల సంఖ్య 55కు చేరుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలితోపాటు మరో ముగ్గురు విద్య వలంటీర్లు విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధి.. పిల్లల భవిష్యత్తు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు తలాకొంత నిధి ఏర్పాటు చేసుకుని ముగ్గురు వీవీలను నియమించుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తున్నారు. ఇటీవల గ్రామస్తుల కోరిక మేరకు ఎంఈఓ ఉదయ్‌భాస్కర్ డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయురాలిని నియమించారు. దీంతో మొత్తం ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్నారు. ముందుకు వచ్చిన దాతలు పాఠశాల అభివృద్ధి కోసం దాతలు ముందుకు వచ్చి ఇంగ్లిష్ మీడియం పుస్తకాలను అందించారు. సీసీఎం(ఎన్జీఓ) ఫౌండేషన్ వారు పాఠశాల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు అన్ని తరగతుల వారికి అందించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఇంగ్లిష్ విద్యను కూడా అందిస్తున్నారు. మరో సామాజిక సేవకుడు కళోబ్ విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, షూస్ అందించారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఇలా పాఠశాలలో ఒకటో తరగతిలో 37, రెండోతరగతిలో 12, మూడో తరగతిలో 3, నాలుగో తరగతిలో లేరు, ఐదోతరగతిలో 3 విద్యార్థులతో బడి కళకళలాడుతుంది. విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు కల్పించారు. రెండు గదులు, మరుగుదొడ్డి, మంచినీటి వసతి ఉంది. వారి ఐక్యత మరిచిపోలేనిది గ్రామస్తుల ఐక్యతతోనే నేడు బడి నిలబడింది. గ్రామం నుంచి సర్కార్ బడి పోతే మళ్లీ రాదనే విషయాన్ని వారికి వివరించాం. వెంటనే సర్పంచ్‌తోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఐదోతరగతి వరకు స్థానిక పిల్లలను స్థానిక బడికే పంపిస్తామని తీర్మానం చేశారు. విద్యార్థులకు గుణత్మాక విద్యను అందించడమే మా లక్ష్యం. - సమత, పాఠశాల హెచ్ఎం ఆనందంగా ఉంది మా గ్రామంలోని ప్రభుత్వ బడిలో విద్యా వలంటీర్‌గా పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నేను డిగ్రీ పూర్తి చేశా. గతంలో ప్రైవేట్ పాఠశాలలో పని చేశా. అంతంగా సంతృప్తి కలుగలేదు. మా ఊరి పిల్లలకు నేనే పాఠాలు చెప్పడం కన్నా సంతోషం మరోటి లేదు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తా. - శిరీష, విద్యా వలంటీర్ ఆదర్శ బడిగా తీర్చిదిద్దుకుంటాం మా పిల్లలు.. మా ఊరి బడికే అనే నినాదాన్ని తీసుకున్నాం. ఐదోతరగతి లోపు పిల్లలను స్థానికంగా గల ప్రభుత్వ బడికే పంపిస్తున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బడిపై అవగాహన కల్పించారు. గ్రామస్తులమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. వెంటనే తీర్మానం చేసి తలాకొంత నిధి ఏర్పాటు చేసుకుని 35 మంది విద్యార్థులను కొత్తగా బడిలో చేర్పించాం. ముగ్గురు విద్యా వలంటీర్లను నియమించుకున్నాం. మా ఇద్దరి పిల్లలను కూడా చేర్పించాం. ఆదర్శ బడిగా తీర్చిదిద్దుకుంటాం. - రజిత, సర్పంచ్ ప్రైవేట్ కన్నా నయం నాకు ఇద్దరు పిల్లలు. జగదేవ్‌పూర్‌లోని ప్రైవేట్ బడికి గత రెండుమూడేళ్ల నుంచి పంపిస్తున్నా. పిల్లలకు అక్షర ముక్క రాలేదు. ఏడాదికి ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టినం. ఇప్పుడు మా ఊరి బడిలోనే చేర్పించా. మంచిగా చదువుతుండ్రు. మంచిగా చెప్పాలని టీచర్లకు చెప్పినం.- విజయ, విద్యార్థి తల్లి -
తలరాత మార్చేది చేతిరాతే
చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ జగదేవ్‌పూర్: చేతిరాత విద్యార్థుల తలరాత మారుస్తుందని చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ అన్నారు. సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు చేతిరాతపై గురువారం అవగాహన కల్పించారు. సిద్దిపేటకు చెందిన ఫయాజ్ ఆహ్మద్ విద్యార్థులకు 210 చేతిరాత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎజాజ్ ఆహ్మద్ విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ చేతిరాతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల చేతిరాత బాగుంటే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగడం ఖాయమన్నారు. చదువు ఎంత ముఖ్యమో, రాత కూడా అంతే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్య, ఎస్ఎంసీ చైర్మన్ తుమ్మ కృష్ణ, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, సభ్యులు వెంకటయ్య, భిక్షపతి, శ్రీశైలం, ఉపాధ్యాయులు కుమార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
గట్టుపై చెట్టు.. చేనుకు చేదోడు
పొలం గట్లపై పెంపకం.. పర్యావరణానికి మేలు రైతులకు అదనపు ఆదాయం మొక్కల పెంపకంతో బహుళ ప్రయోజనాలు జగదేవ్‌పూర్: అడవులు అంతరించిపోవడంతో సరైన వర్షాలు లేవు. వర్షాలు సరిగా కురవక వాతావరణం నానాటికీ వేడెక్కిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు జలాశయాలు, చెరువులు, కుంటలు నీరులేక ఎండిపోతున్నాయి. దీంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోం ది. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు పొలం గట్లపై విధిగా చెట్లు పెంచితే రాబోయే రోజుల్లో వర్షపాతం పెరగడంతో పాటు రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. హరితహారంలో మొక్కలు పంపిణీ చాలా వరకు ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకుని ఆకాశం వైపు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడా సాధారణ వర్షపాతాలు సైతం నమోదు కాని పరిస్థితి ఉంది. సరిపడా అడవులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొక్క లు నాటే కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం టేకు, తెల్లదుద్ది, వేప, నేరేడు, జామ, దానిమ్మ, నిమ్మ, ఉసిరి, మొక్కలతో పాటు గడ్డిజాతి మొక్కలను పంపిణీ చేస్తుంది. రైతులు పొలం గట్లపై పెంచుకోవడానికి ఈ మొక్కలన్నీ కూడా అనుకూలమైనవే. వీటి వల్ల పంటకు రక్షణ లభిస్తుంది. అటు కొన్ని సంవత్సరాల తర్వాత వాటిపై ఆదాయం కూడా పొందవచ్చు. రైతులు ఖాళీ భూముల్లో మొక్కలు నాటుకోవడం వల్ల పెద్దగా శ్రమ లేకుండానే ఆదాయం అభిస్తుంది. వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల్లో ఎర్ర చందనం, టేకు, సుబాబుల్ లాంటి మొక్కలను ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు. పర్యావరణ లాభాలు రైతులు మొక్కల పెంపకం ద్వారా తనకు తాను ఆదాయం పొందడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఒక చెట్టు తన జీవిత కాలంలో రూ. 2.50 నుండి రూ.5 లక్షల విలువ చేసే ఆక్సిజ¯ŒS అందిస్తుంది. విషవాయువులను పీల్చి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. నీటినిల్వ చేయడం, నీటి ఆవిరి ఉత్పాదకత, మేఘాల ఏర్పాటుకు చెట్లు ఎంతో దోహదం చేస్తాయి. పంటకు కంచె అడవులు అంతరించిపోవడం మూలంగా అడవి జంతువులు పంట చేలల్లోకి వచ్చి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పంటలను రక్షించుకోవడానికి చేను చుట్టూ కొన్ని రకాల మొక్కలు పెంచితే ఈ బెడద నుంచి కొంత వరకు ప్రయోజనం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పంట చుట్టూ స్తంభాలు, కడీలు పాతి ముళ్లకంచె వేస్తుంటారు. దీనికి బదులు ఏక వృక్ష చెట్లు నాటి, వాటికి మూడేళ్ల వయసు వచ్చిన అనంతరం ముళ్ల కంచె వేసుకుంటే చేనుకు పటిష్ట రక్షణ లభిస్తుంది. 25 సంవత్సరాల అవే చెట్ల ద్వారా ఆదాయం పొందవచ్చు. స్థానికంగానే మొక్కలు లభ్యం రైతులు స్థానిక నర్సరీల నుండి మొక్కలను పొందవచ్చు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై చెట్ల పెంపకం చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామంలో ఈజీఎస్ ఎఫ్ఏ వద్ద మొక్కల కోసం ముందస్తుగానే పేర్లను నమోదు చేసుకోవాలి. మొక్కల పంపిణీతో పాటు ఈజీఎస్ కూలీలు రైతుల పొలం గట్లపై మొక్కలను నాటుతారు. మొక్కలు నాటడం ఇలా... ప్రతి మూడు మీటర్లకు ఒకటి చొప్పున గుంతలు తవ్వాలి. ఇవి ఒకటిన్నర లేదా రెండు అడుగుల లోతు–వెడల్పు ఉండేలా తీయాలి. మొక్కలు నాటే ముందు పశువుల ఎరువును కొంచెం వేసుకోవాలి. మొక్కను ప్లాస్టిక్ కవరు నుండి తీసేటప్పుడు మొక్కల వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా బయటకు తీయాలి. గుంతలో ముందే కొంత మట్టి పోసి తర్వాత మొక్కను పెట్టి చుట్టూ మట్టిని నింపాలి. ఆ తర్వాత గుంత చుట్టూ గట్టిగా రెండు కాళ్లతో తొక్కాలి. అనంతరం నీళ్లు పోయాలి. ఇలా అయితే మొక్క బాగా పెరుగుతుంది. గట్లపై చెట్లతో ప్రయోజనం పండ్ల జాతికి చెందిన జామ, నిమ్మ, బొప్పాయి, నేరేడుతో పాటు టేకు, వేప, తెల్లదుద్ది తదితర మొక్కలను ప్రభుత్వం అందిస్తోంది. పొలంలో పంటతో పాటు గట్లపై మొక్కలు పెంచుకుని కొన్ని ఏళ్ల తర్వాత రెండు రకాలుగా ఆదాయం పొందవచ్చు. పండ్ల మొక్కలైన జామ, ఉసిరి, నేరేడు, నిమ్మ ఎత్తు తక్కువగా పెరగడంతో పాటు కాయలు కూడా రెండేళ్లలోనే చేతికి అందుతాయి. టేకు, వేప, తెల్లదుద్ది చెట్లు పదేళ్లలో పెరుగుతాయి. వీటి ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. గట్లపై చెట్టు రైతు భూమి సరిహద్దును గుర్తించడానికి కూడా ఉపయోగపడుతాయి. వర్షాలు తక్కువగా కురిసినప్పుడు పొలంలో నీటి పదును తగ్గకుండా కూడా దోహదం చేస్తాయి. నేలకోతలను నివారిస్తాయి పంట సాగు చేసే నేల గట్టు దెబ్బతినకుండా ఆ గట్లపై ఉండే చెట్లు కాపాడతాయి. అలాగే, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు చెట్ల కారణంగా చల్లని వాతావరణం ఏర్పడి పంటకు మేలు కలుగుతుంది. నీటి నిల్వలు తొందరగా వాడిపోవు. పెసర, మినుము, వేరుశనగ, శనగ వంటి పంటలను ఎక్కువగా ఆశించే లద్దెపురుగు, అంక్షిత పురుగులు వంటి వాటికి గట్లపై ఉండే చెట్ల వల్ల అడ్డుకట్ట పడుతుంది. గట్లపై చెట్లను పెంచడం వల్ల పక్షులు చెట్టు కొమ్మలపై గూళ్లు కట్టుకుని ఉండి, చేనును ఆశించే వివిధ పురుగులను తిని మేలు చేస్తాయి. -
సెలైన్‌తో మొక్కలకు ప్రాణం
వినూత్న ఆలోచనకు కలెక్టర్ ప్రశంస సోషల్ మీడియాలో పెట్టండి అధికారులకు రోనాల్డ్ రోస్ సూచన జూనియర్ కళాశాలలో హరితహారం జగదేవ్‌పూర్: సెలైన్‌తో మొక్కలను కాపాడుతున్న తీరును కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రశంసించారు. శనివారం ఆయన జగదేవ్‌పూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. సెలైన్ ఆలోచనను మెచ్చుకున్నారు. ఈ ఆలోచన ఎవరిది? అని కలెక్టర్ ఆరా తీయగా తానేనంటూ కళాశాల లెక్చరర్ మోహన్‌దాస్ ముందుకు రావడంతో అభినందించారు. ఆలోచన బాగుంది, వెంటనే సోషల్ మీడియాలో పెట్టండి అంటూ పక్కనే ఉన్న అధికారులకు ఆదేశించారు. మొక్కలను సెలైన్ డ్రిప్పు పద్ధతి బాగుంది.. మొక్కలకు ఎవరు పేరు పెట్టారు? అంటూ విద్యార్థులను ఆరా తీశారు. ఎవరు నాటిన మొక్కకు వారి పేరే పెట్టుకున్నామని విద్యార్థులు చెప్పడంతో కలెక్టర్ శభాష్ అంటూ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల ఐడియా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రయోగాలు చేసి మొక్కలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అంతకుముందు హరితహారంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గఢా అధికారి హన్మంతరావు, ఎంపీపీ రేణుక, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీడీఓ రామారావు, తహసీల్దార్ పరమేశం, సర్పంచ్ కరుణకర్, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వానమ్మా.... చిన్నబోయె నేలమ్మ
బోసిపోయిన కూడవెల్లి ఆందోళనలో రైతాంగం మరో ఇరవై రోజుల గడువుందంటున్న అధికారులు ఆ తరువాతే ప్రత్యామ్నాయం ‘వాగులెండి పాయెరో... పెద్ద వాగు తడి పేగు ఎండి పాయెరా...’ అంటూ ప్రజాకవి గోరెటి వెంకన్న కలం నుంచిlజాలువారిన వాగు గుండె చప్పుడు.. అక్షరాల కూడవెల్లి వాగు పేగు తడిని గుర్తుచేస్తోంది. వర్షాలు లేక కూడవెల్లి వెలవెలబోతోంది. నిండుకుండలా పారే వాగులో నీటి సవ్వడులు లేవు... దప్పిక తీర్చుకోవడానికి నీటి చెలమలు అంతకన్నా కానరావు. వాగు నీటితో తడిచే పచ్చని పైరులు కనిపించడం లేదు. ఇసుక పొరల్లో దాగి ఉన్న నీటి ఊటలూ లేవు. ఇసుకను అక్రమార్కులు తరలించుకు పోవడంతో చెలిమెల జాడ లేదు. వర్షాలు లేక అటు వ్యవసాయం చేయలేక.. ఇటు పశువులను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది. మిరుదొడ్డి:జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం చేబర్తిలో ప్రారంభమయ్యే కూడవెల్లి వాగు గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల మీదుగా సుమారు 58 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే వాగుపై 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా అక్కడక్కడా 25 చెక్‌డ్యాంలు నిర్మించారు. పొంగిపొర్లే కూడవెల్లి వాగులోని నీరు కరీంనగర్ జిల్లా మానేరు డ్యాంలో కలిసిపోతుంది. ఎగువ కురిసిన వర్షాలతోనే కాకుండా తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లోని గొలుసుకట్టు చెరువులు నిండి పొంగి ప్రవహించిన నీటితో చిన్న చిన్న వాగుల ద్వారా కూడవెల్లి వాగులో కలిసి పోతాయి. అలా ఎప్పుడూ నిండుకుండలా కూడవెల్లి వాగు కళకళలాడేది. పరిసర ప్రాంతాల్లోని రైతులు ఈ వాగు నీటితో మోటార్ల ద్వారా లక్షలాది హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పప్పు ధాన్యపు పంటలు, రకరకాల కూరగాయల పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. దీంతో రైతులు సిరుల పంటలతో తులతూగే వారు. వర్షా కాలంలో కురిసిన నీటితో చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించి కరీంనగర్ జిల్లా మానేరు డ్యాంలోకి నీరు చేరేది. చెక్‌డ్యాంలో నిలిచిన నీటి నిలువతో రైతులు నేరుగా వాగులోకి మోటార్లను దింపి పంటల సాగుకు శ్రీకారం చుట్టేవారు. వాగు పరిసరాల్లో భూ గర్భజలాలు పెరగడంతో బోర్లపై ఆధారపడ్డ రైతులు మోటార్ల సహాయంతో పంటలు పండించుకునే వారు. చుక్క నీరు లేక.. గత రెండేళ్లు సరైన వర్షాలు లేకపోగా ఈ సారీ వర్షాలు అంతంత మాత్రమే. దీంతో చుక్క నీరు లేక కూడవెల్లి వాగు వట్టిపోయింది. అక్రమార్కులు ఇసుకను తోడి తరలించుకుపోవడంతో వాగులోని భూ గర్భజలాలు అడుగంటిపోవడంతో జీవం కోల్పోయింది. వాగు పరిసరాల్లో సాగయ్యే భూములు బీడు వారడంతో తుమ్మలు మొలిచాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు కుటుంబాలను పోషించుకునే స్థోమత లేక ఆత్మసై్థర్యాన్ని కోల్పోతున్నారు. క్షణికావేశంలో రైతులు ఉసురు తీసుకుంటున్నారు. కరువుతో అలమటిస్తున్న నేపథ్యంలో పశుగ్రాసం లేక మూగజీవాలను అమ్మేస్తున్నారు. వాగు ఎండిపోయింది... గత రెండేళ్ల నుంచి సరైన వర్షాలు లేక కూడవెల్లి వాగులో చుక్క నీరు లేదు. వాగు పరిసర ప్రాంతాల భూములన్నీ బీళ్లుగా మారాయి. నీరు లేక చెరువు కూడా వెలవెలబోతోంది. ఈ సారైనా వర్షాలు పడి చెరువులు, కంటలు, వాగు నిండితే పంటలు సాగు చేద్దామంటే వానలే పడుతలేవాయె. – ఎల్లయ్య, రైతు, అక్బర్పేట భూ గర్భజలాలు అడుగంటినయ్ వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటినయ్. కనీసం వర్షాధారం మీద పంటలు సాగు చేద్దామంటే చిరుజల్లులు తప్ప పెద్దగా వానలు కురిసిన దాఖలాలు లేవు. వర్షాలు కురిసి కూడవెల్లి నిండు కుండలా పొంగి పొర్లితే ఏడాదికి రెండు పంటలు తీసెటోళ్లం. కానీ వర్షాలు లేక కూడవెల్లి వాగు బోసిపోతోంది. – రవీందర్‌రెడ్డి, రైతు, చెప్యాల ఆశించిన వర్షాలు లేక... ఆశించిన వర్షాలు లేక చెరువులు, కుంటలు, వాగు వంకల్లో నీరు చేరలేదు. గత ఏడాది జూలై నెలలో 238 మి.మీ. వర్షపాతానికి కేవలం 58.08 మి. మీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఈ ఏడాది జూలై మొదటి వారం వరకు 45.06 మి.మీ. నమోదైంది. జూలై చివరి వారం వరకు 238 మి.మీ. వర్ష పాతం నమోదైతేనే రైతాంగానికి మేలు చేకూరుతుంది. సరైన వర్షాలు పడి భూమి మొత్తం తడిస్తేనే విత్తనాలు చల్లుకోవాలి. ఖరీఫ్ సీజన్ మరో 20 రోజులు ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒక వేళ సరైన వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలతో రైతులు ఖరీప్ సీజన్ నుండి గట్టెక్కవచ్చు. – ఎస్.నాగరాజు, ఏఓ, మిరుదొడ్డి -
వానమ్మా .. వేల వందనాలమ్మా..
* వానలతో అన్నదాతల్లో ఆనందం.. * పంటపొలాల్లో సందడి.. జగదేవ్‌పూర్: చినుకు చిందేయడంతో అన్నదాతల్లో అనందం అంబరాన్నంటుతోంది. పంటపొలాల్లో సందడి ప్రారంభమైంది. వ్యవసాయ పనుల్లో ఇంటల్లిపాది తలమునకలయ్యారు..వానమ్మ వానమ్మా..నీకు వేల వేల వందనాలమ్మా అంటూ పల్లె జనం పదం కలుపుతూ వడివడిగా నాట్లు వేస్తున్నారు.. చినుకు చిందేసింది. నెలతల్లి పూర్తిగా తడిపేసింది. అన్నదాతను అనందంలో ముంచేసింది. పుడమి వాకిట కొత్త బంగారులోకాన్ని సృష్టిస్తూ ఏరువాకకు సాగమని అప్పగించింది. నాలుగు రోజులుగా పడుతున్న ఖరీఫ్ వర్షాలతో రైతన్న ఉత్సాహంతో ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కి దున్నడం నాట్లు వేయడం, గట్లు సిద్దం చేసుకొవడం ఇలా ఎవుసం పనులతో ఉత్సాహపూరితంగా సాగుతున్నారు. ముసురు పడుతునే పంట చేలలో కూలీలు మునుము కొనసాగిస్తున్నారు. ఓ వైపు కలుపు, మరో వైపు నాట్లు పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే చిన్నారులు సైతం కన్నవాళ్లకు అసరాగా ఎవుసం పనుల్లో మేం సైతం అంటూ పాల్గొంటున్నారు. -
సోమవారం వరకు ఫామ్‌హౌస్‌లోనే సీఎం!
జగదేవ్‌పూర్ (మెదక్): సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ఖరీఫ్ సాగు పనులను పరిశీలించారు. మధ్యాహ్నం తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో పర్యటించారు. అనంతరం ఫాంహౌస్ చేరుకున్నారు. అంతకు ముందు కాన్వాయ్‌లో తిరుగుతూ వ్యవసాయ పనులను పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. సోమవారం వరకు ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. సీఎం ఎర్రవల్లిలో పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
యాగం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్ (మెదక్) : చండీయాగం పనుల వేగం పెంచాలని నిర్వాహకులకు సీఎం కేసీఆర్ సూచించారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి ఆయన చేరుకున్నారు. మొదట చండీయాగం స్థలానికి చేరుకుని పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సీఎం అరగంటపాటు అక్కడే ఉండి పనుల గురించి తెలుసుకున్నారు. ఎస్పీ సుమతి ముందస్తుగానే ఫాంహౌస్‌కు చేరుకుని పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. రాత్రి వ్యవసాయ క్షేత్రంలోనే సీఎం బస చేస్తారు. ఆదివారం ఉదయం చండీయాగం పనులను మళ్లీ పరిశీలించనున్నట్లు సమాచారం. అలాగే ఎర్రవల్లిలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది. -
చండీయాగానికి చకాచకా పనులు
-ఐదు రోజులపాటు ఆధ్యాత్మికంగా యాగం -15 మంది ఋత్విక్కులు హాజరు -వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు -10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు -సిసి కెమెరాలు, టీవీల ఏర్పాటు -ప్రతిరోజు 10 వేల నుండి 60 వేల మందికి భోజన ఏర్పాట్లు జగదేవ్‌పూర్ (మెదక్ జిల్లా) : లోక కల్యాణం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఆయుత చండీయాగం అద్వితీయంగా జరపడానికి సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం తన వ్యవసాయక్షేత్రంలో మహాక్రతువు న భూతో న భవిష్యతిగా జరిపేలా స్వయంగా అన్ని ఏర్పాట్లును పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఈ యాగం డిసెంబర్ 23 నుండి 27 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా జరగనుంది. ఈ నెల 27న సీఎం దంపతులు నవ చండీయాగంతో ఆయుత చండీయాగానికి భూమిపూజ చేశారు. నిర్వహణ బాధ్యతలను బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేటికి 10 గ్యాలరీలు పూర్తి చేశారు. ఇంకా కొనసాగుతున్నాయి. పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతిరోజు బందోబస్తును నిర్వహిస్తున్నారు. వ్యవసాయక్షేత్రంలో చండీయాగం పనులపై ప్రత్యేక కథనం... శృంగేరి శారదాపీఠం శిష్యులు, పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వరశర్మ, బ్రహ్మశ్రీ ఫణిశశాంక్శర్మ, ఆచార్య బ్రహ్మలుగా వ్యవహరిస్తున్న చండీయాగంలో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి 15 వందల మంది బ్రహ్మణోత్తములు ఋత్విక్కులుగా పాల్గొంటారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారి ష్టష్యభ్ధి పూర్తి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆయుత చండీయాగం సంప్రదాయానికి అనుగుణంగానే ఈ యాగం కూడా ఏకోత్తరవృద్ధి విధానంలో జరగబోతుంది. ఆయుత చండీయాగంతో పాటు రుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్రహోమాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు జరగనున్నాయి. -శంగేరి పీఠం వేద పండితులు పురాణం మహేశ్వశర్మ, శశాంక్‌శర్మ, గోపికృష్ణలు అయుత చండీయాగం పూజలు నిర్వహిస్తారు. -ఆయుత చండీయాగానికి మొత్తం 15 వందల మంది ఋత్వికులు హాజరుకానున్నారు. -చండీయాగం స్థలంలో 108 హొమం గుండాలు ఏర్పాటు చేస్తారు. -ఒక్క హోమం గుండా వద్ద 11 మంది బ్రహ్మణులు పారాయణలు, జపాలు చేస్తారు. -ఐదు రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీయాగనవాక్షరీ చేస్తారు. -22న ఉదయమే బ్రహ్మణులు చండీయాగం స్థలానికి చేరుకుంటారు. -మొదటి రోజు 11 వందల మంది బ్రహ్మణులు ఒకేసారి సప్తశతి చేసి, 4 వేల పారాయణలు చేస్తారు. -రెండోరోజు 11 మంది బ్రహ్మణులు 2 పారాయణలు చేసి, 3 వేల జపం చేస్తారు. -మూడో రోజు 11 మంది బ్రహ్మణులు మూడు పారాయణలు, 2 వేల జపం చేస్తారు. -నాలుగవ రోజు 11 మంది బ్రహ్మణులు 4 పారాయణలు, వేయ్యి జపం చేస్తారు. -చివరి రోజు ఒక్క హోమ గుండం వద్ద 11మంది ఋత్విక్కులు పాలతో 10 వేల పారాయణలు, దశాంశం వేయిసార్లు తర్పణలిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. -మిగతా 4 వందల మంది బ్రాహ్మణులు 11 మంది బ్రాహ్మణులకు సేవలు అందిస్తారు. -బ్రాహ్మణులకు ఉండేందుకు 4 యాగశాలలు వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఐదు రోజులు ఉండేందుకు వసతులు కల్పించనున్నారు. -చండీయాగంలోకి ఋత్విక్కులు తప్ప మిగతా వారికి అవకాశం లేదు. -విఐపిలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. -మంత్రులకు, ఎమ్మెల్యేలకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. -భక్తులు, ప్రజల కోసం ప్రధాన గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. -ప్రతి రోజు 10 వేల నుండి 60 వేల భక్తులకు భోజన ఏర్పాట్లు అందించే విధంగా పెద్ద ఎత్తున్న భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు. -బ్రహ్మణులకు తమ గ్యాలరీలల్లోనే భోజన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -అలాగే ప్రతి గ్యాలరీ వద్ద చండీయాగం చూసేందుకు టివిలను ఏర్పాటు చేస్తున్నారు. -మీడియాకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు. -ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హరికథలు నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రముఖ 40 మంది హరినాథులను హాజరు కానున్నారు. -ప్రతి గ్యాలరీ వద్ద సిసి కెమెరాలను బిగిస్తున్నారు. అలాగే వ్యవసాయక్షేత్రం చుట్టూ కూడా పెట్టే అలోచనలో ఉన్నారు. పోలీసులు ఆధీనంలో ఉండేవి... -శుక్రవారం నుండే చండీయాగ స్థలాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. -వ్యవసాయక్షేత్రం చుట్టూ ఐదు దిక్కుల చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. -ఎర్రవల్లి, శివారువెంకటాపూర్, గంగాపూర్, వర్ధరాజ్‌పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో 10 పార్కింగ్ స్థలాలను గుర్తించారు. -ప్రతి ఒక్కరి వాహనాలు పార్కింగ్‌లలో పెట్టి చండీయాగం స్థలానికి నడుచుకుంటూ వెళ్లాలి. - జిల్లా పోలీస్యంత్రాగంతోపాటు ఇతర జిల్లాల నుంచి భారీగా పోలీస్ బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -ప్రతిరోజు జిల్లా ఎస్పీ సుమతి యాగం స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు. -వ్యవసాయక్షేత్రం వైపు ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. -ఎర్రవల్లి మీదుగా భక్తులకు, ప్రజలకు, నాయకులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -విఐపి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అతిధులకు శివారువెంకటాపూర్ నుండి అనుమతి కల్పించనున్నారు. -33 ఎకరాల్లో చండీయాగం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. -యాగశాలలపై ఎండు గడ్డిని కప్పి అందంగా తయారు చేస్తున్నారు. ప్రతిరోజు నాలుగైదు డిసిఎంల గడ్డి వస్తుంది. -రూటు మ్యాప్ ప్రకారం సౌకర్యాలు కల్పించనున్నారు. -
తహశీల్దార్ కార్యాలయం ఎక్కి నిరసన
జగదేవ్‌పూర్ (మెదక్ జిల్లా) : ఆశావర్కర్ల నిరవధిక సమ్మె గురువారం నాటికి 37 రోజులకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆశా వర్కర్లు తహశీల్దార్ కార్యాలయం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 37 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యలు తీర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు లత, మాధవి, జ్యోతి, అనూరాధ, ప్రియాంక, సంతోష, బీబీ, కవిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనలో పాము కలకలం
జగదేవ్‌పూర్ (మెదక్): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పర్యటనకు అనుకోని అతిథి ఒకటి వచ్చి అందరినీ కలవరానికి గురిచేసింది. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్.. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో గురువారం పర్యటించారు. అయితే, ఎర్రవెల్లి గ్రామానికి ఆయన వెళ్లిన సమయంలో అక్కడ ఓ పాము కనిపించి కలకలం రేపింది. పాము కనిపించగానే అందరూ కొంతసేపు కంగారు పడ్డారు. అయితే కాసేపటికల్లా దానంతట అదే అక్కడే ఉన్న గుంతలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రవెల్లి గ్రామంలో కేసీఆర్ అందరినీ పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటికో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. అనంతరం గ్రామజ్యోతి సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా చాలా మంది స్థానికులు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రావట్లేదని మొరపెట్టుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టివ్వాలని కోరారు. -
నర్సన్నపేటకు నడిచొచ్చిన అదృష్టం
జగదేవ్‌పూర్: అడగకముందే వరాలివ్వడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటు. ఆయన ఏ గ్రామం నుంచి వెళ్లినా ఠక్కున ఆగుతారు. చొరవ తీసుకొని స్థానికులతో మాట్లాడతారు. గ్రామ స్థితిగతులు తెలుసుకొని అప్పటికప్పుడు వారికి వరాలు కురిపిస్తుంటారు. మొన్న మార్కుక్.. నిన్న పాములపర్తికి వరా లు కురిపించినట్టుగానే తాజాగా నర్సన్నపేటనూ అక్కున చేర్చుకున్నారు. బుధవారం సాయంత్రం 4.50 గంటలకు కాన్వాయ్‌లో ముఖ్యమంత్రి తన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉండి మళ్లీ కరీంనగర్ పర్యటనకు బయలుదేరారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం కాన్వాయ్ ఎర్రవల్లి మీదుగా నర్సన్నపేటకు చేరుకుంది. సీఎం గ్రామం మీదుగా వెళ్తున్నట్టు సమాచారం ఉండడంతో గ్రామస్తులు, మహిళలు రోడ్డుపై వేచి ఉన్నారు. గ్రామానికి చేరుకోగానే సీఎం స్థానికులను చూసి కాన్వాయ్ ఆపారు. ఆ వెంటనే ఆయన కారు దిగి గ్రామస్తులతో ముచ్చటించారు. ‘మీ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి?’ అంటూ ఆరా తీశారు. వెంటనే గ్రామస్తులు స్థానికంగా నెలకొన్న సమస్యలను సీఎంకు విన్నవించారు. సీఎం కేసీఆర్‌కు, గ్రామస్తులకు మధ్య జరిగిన సంభాషణ ఇలా... గ్రామస్తులు: చేబర్తి గ్రామ పంచాయితీ పరిధిలో మా గ్రామం ఉంది. మా గ్రామాన్నే ప్రత్యేక పంచాయతీని చేయాలి. సీసీ రోడ్లు, తాగునీటి సమస్య ఉంది. గతంలో వేసిన సీసీ రోడ్లు మాత్రమే ఉన్నాయి. సీఎం: బస్‌షెల్టర్ లేదా?, పింఛన్లు అందరికి వస్తున్నాయా?, సీసీ రోడ్లకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నా.. గ్రామస్తులు: బస్ షెల్టర్ లేదు.. పింఛన్లు 90 శాతం వస్తున్నాయి సారూ. సీఎం: గ్రామంలో రేపే బస్ షెల్టర్‌కు ముహూర్తం పెట్టు అని పక్కనే ఉన్న గడా అధికారి హన్మంతరావును ఆదేశించారు. గ్రామస్తులు: పిల్లలకు బస్సు సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. కుషాయిగూడ బస్సు మా గ్రామానికి రావాలి. సీఎం: రేపటి నుంచే బస్సు మీ ఊరికే కాదు గణేశ్‌పల్లి వరకు వస్తుంది. గ్రామస్తులు: సారూ గ్రామంలో చాలామందికి ఇండ్లు లేవు. సీఎం: ఎందరికి లేవు. లేనోళ్లందరికి ఇండ్లు కట్టిస్తాం. జాగ లేకున్నా జాగను కొనిచ్చి ఇండ్లు కట్టిస్తాం సరేనా. అలాగే నర్సన్నపేట, గణేశ్‌పల్లి గ్రామాలకు సోలార్ లైట్లను అందించాలి అని గడా అధికారిని ఆదేశించారు. ‘మీ గ్రామ సమస్యలు తీర్చుస్తాం.. కానీ మీ గ్రామంలో మురుగు గుంతలు, చెత్త చెదారం లేకుండా చేసుకోవాలి. ఎటూ చూసిన మంచిగా రోడ్లు కనిపించాలి’ అంటూ హామీలిచ్చారు. దీంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అనుకోకుండా ఆపి వరాలు ఇచ్చిన సీఎంను ఇప్పుడే చూస్తున్నామని, ఇక తమ గ్రామానికి అదృష్టం పట్టినట్టేనని స్థానికులు సంబరపడ్డారు. ఆ తరువాత సీఎం కాన్వాయ్‌లో ఎక్కి గణేశ్‌పల్లి మీదుగా కరీంనగర్ వెళ్లారు. గణేశ్‌పల్లి వద్ద ఆగిన జనాలకు నమస్కారం చేస్తూ ముందుకు కదిలారు. కుటుంబ సమేతంగా ఫాంహౌస్‌కు.. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ఫాంహౌస్‌కు వచ్చారు. కేసీఆర్ సతీమణితోపాటు కూతురు ఎంపీ కవిత కూడా ఉన్నట్లు సమాచారం. సీఎం ఫాంహౌస్‌కు వస్తున్నారని సమచారం ఉండడంతో ఎస్పీ సుమతి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గురువారం మళ్లీ ఫాంహౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
ఎవుసం పనులు ఎంత వరకు వచ్చినయ్
* ఫామ్‌హౌస్‌లో వ్యవసాయ పనులపై ముఖ్యమంత్రి ఆరా * ఏఏ పంటలు వేయాలో సూచన జగదేవ్‌పూర్: ‘ఇక్కడ వర్షాలు బాగానే పడినట్లు ఉంది.. ఎవుసం పనులు ఎంత వరకు వచ్చినాయి.. డ్రిప్పు పనులు పూర్తి అయినాయా.. ఎరువులు చల్లడం ఇంకా పూర్తి కాలేదా.. తొందరగా ఎవుసం పనులు మొదలు పెట్టాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం రాత్రి మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఆయన.. రాత్రి ఇక్కడే బస చేశారు. బుధవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో తన కారులో ఫామ్‌హౌస్‌లో తిరుగుతూ వ్యవసాయ పనులను పర్యవేక్షించారు. గంటన్నరకు పైగా అంతటా తిరిగారు. ఎక్కడెక్కడ ఏఏ పంటలు వేయాలో ఫామ్‌హౌస్ సూపర్వైజర్కు సూచించినట్లు తెలిసింది. ఎక్కువ శాతం అల్లం పంట పండించడానికి భూమిని చదును చేయాలని సూచించినట్లు సమాచారం. కాన్వాయ్ ద్వారా రోడ్డుకు అవతలి భాగంలో ఉన్న వ్యవసాయ భూమిని పరిశీలించారు. అందులో జరుగుతున్న డ్రిప్పు పనులను పర్యవేక్షించారు. వ్యవసాయ బావి పనులను పరిశీలించారు. కొద్దిసేపు ఇక్కడే ఉండి భోజనం ముగించుకొని మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి తన కాన్వాయ్ ద్వారా హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. గోపాలమిత్రల ఎదురుచూపులు సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి వచ్చారన్న విషయం తెలిసి బుధవారం ఉదయం వివిధ మండలాలకు చెందిన 30 మందికి పైగా గోపాలమిత్రలు ఇక్కడకు చేరుకున్నారు. గత నెల 24న కూడా గోపాలమిత్రలు ఫామ్‌హౌస్‌కు వచ్చి కేసీఆర్‌కు తమ సమస్యలు తీర్చాలని వినతి పత్రం అందించారు. అయితే ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో మళ్లీ వచ్చామని గోపాలమిత్రల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. రెండు గంటల పాటు వేచి ఉన్నా సీఎంను కలవడానికి వీలులేదని పోలీసులు చెప్పడంతో వెనుదిరిగారు. -
కృష్ణవేణికి కన్నీటి పరీక్ష
జగదేవ్‌పూర్ (మెదక్) : కన్నతండ్రి శవం ఇంట్లో ఉండగానే ఓ విద్యార్థిని తన దుఃఖాన్ని దిగమింగి పదోతరగతి పరీక్ష రాసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం అంతాయిగూడలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని అంతాయిగూడ గ్రామానికి చెందిన తిగుల్ల నర్సయ్యది వ్యవసాయం కుటుంబం. మంగళవారం ఇంట్లో చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నర్సయ్య అదే రోజు రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. నర్సయ్య కూతురు కృష్ణవేణి చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. బుధవారం నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం తండ్రి శవం ఇంట్లోనే ఉంది. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ కృష్ణవేణి కొండపాక మండలం కుకునూర్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పరీక్ష రాసింది. మధ్యాహ్నం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది. కృష్ణవేణికి వచ్చిన కష్టాన్ని చూసి పలువురు జాలిపడ్డారు. -
పల్లె ప్రగతికి పట్టుగొమ్మ తిమ్మాపూర్
జగదేవ్‌పూర్: రాష్ర్టంలో పల్లె ప్రగతి పథకం ద్వారా పల్లెలో సకల సమస్యలు తీరనున్నట్లు, పల్లె ప్రగతికి మూడు జిల్లాలు ఎంపిక చేయడం జరిగిందని తెలంగాణ సెర్ఫ్ మానవాభివృద్ధి విభాగం డెరైక్టర్ మృదుల పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మెదక్ జిల్లాలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం ఎంపిక కావడంతో శనివారం ఆమె గ్రామాన్ని సందర్శించారు. ముందుగా ఆమె గ్రామంలోని మహిళ సంఘాల సభ్యులతో, అంగన్వాడి, పౌష్టిక ఆహార కేంద్రాల నిర్వాహకులు, గ్రామ సర్పం చ్తో సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ముఖ్య ఉద్దేశం పల్లెలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఒక గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి వంద శాతం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే జిల్లా తిమ్మాపూర్ గ్రామాన్ని ఎంపిక చేశారని చెప్పారు. గ్రామంలో సకల సమస్యలను తెలుసుకొని వాటిని ప రిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించడం, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందన్నారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురికి కాల్వలు నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, కలుషితం లేని తాగునీరు అందించడం, అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడం లాంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే పల్లె ప్రగతి లక్ష్యమన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాడకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే టాటా కంపెనీ ఆధ్వర్యంలో త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 45 రోజుల్లో తిమ్మాపూర్ గ్రామంలో మార్పు వస్తుందన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామంలో 3 సీఆర్పీలను నియమించి మరుగుదొడ్ల వాడకంపై రోజువారి సర్వేను చేపడతామని తెలిపారు. జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ కలపతో కట్టుకున్న పాతకాలం ఇళ్లు, చెట్ల పెంపకం స్థలాన్ని అక్కడ నీటి వసతిని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమా, యంగ్ ప్రొఫెషనల్ శివా, హెచ్.డి ప్రేరణ, మండల ఎపిఎం యాదగిరి, క్లస్టర్ ఎపిఎం దుర్గయ్య, సిసి స్వామి, గ్రామ మహిళ సంఘం అధ్యక్షులు లక్ష్మి, విఓఎ నందిని, హెచ్ఎ పూజరాణి, టీఆర్ఎస్ నాయకులు సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండిన పంటలు.. పగిలిన గుండెలు
జగదేవ్‌పూర్/రేగోడ్ : వ్యవసాయమే సర్వస్వమని నమ్మిన రైతులకు వరుణుడు సహకరించలేదు. దీనికి తోడు పంట పెట్టుబడులు, ఇతర అవసరాలకు చేసిన అప్పులు ఏ ఏటికాయేడు పెరిగి పోతూనే ఉన్నాయి.. ఈ సారైనా పంట చేతికి వస్తుందని ఎదురు చూడడం తప్ప పంటలు మాత్రం పూర్తి స్థాయిలో అందడం లేదు. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. దీంతో వాటిని చూస్తూ దిగులు చెందు తూ పలువురు ైరె తుల గుండెలు ఆగుతున్నాయి. సోమవారం కూడా జిల్లాలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జగదేవ్ పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బాలపోచయ్య (52) తనకున్న మూడెకరాల పొలంలో వరి, పత్తి పంటలను సాగు చేశాడు. అయితే వర్షాభావం, కరెంట్ కోతల కారణంగా వరి పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో పాటు పత్తి పంట కూడా ఎర్ర బడి పూర్తిగా ఎండిపోయింది. వీటికి తోడు కుమారుడు జహంగీర్ అనారోగ్యం పా ల్పడ్డాడు. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుమారుడి ఆరోగ్యం కోసం సుమారు రూ. 3 లక్షల మేర అప్పు చేశా డు. ఈ క్రమంలో అప్పు తీర్చాలని రుణదాతల నుంచి ఒత్తిళ్లు కూడా పెరిగాయి. దీంతో వారం రోజులుగా తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రామవ్వ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రేగోడ్‌లో.. ఎండుతున్న పంటలను చూసి అప్పులు ఎలా తీర్చాలో దిగులు చెందుతూ ఓ కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఖాదిరాబాద్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు సోమవారం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పల్లె రఫీయొద్దీన్ (30)కు తన రెండెకరాలతో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఇందులో పత్తి, వరి పంటలను సాగు చేశాడు. అయితే ఆదివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అయితే నీరు లేక వరి పంట ఎండిపోవడం, పత్తి కూడా దిగుబడి వచ్చే సూచనలు కనిపించక కలత చెందాడు. ఈ సారి పంటలు సరిగా చేతికి వచ్చే పరిస్థితి కనపడడం లేదని, చేసి రూ. 3 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులతో చెప్పుకుని బాధపడ్డాడు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆటోలో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రఫీయొద్దీన్ మృతి చెందాడు. మృతుడికి భార్య నస్రీన్ బేగం, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సర్పంచ్ రమేష్ జోషి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రేగోడ్ మండల ఆర్ఐ మర్రి ప్రదీప్ ఖాదిరాబాద్ గ్రామానికి వెళ్లి రఫీయొద్దీన్ మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుడికి రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నాయని కుటుంబీకు లు, గ్రామస్తులు తెలిపారన్నారు. -
ఎవుసం ఎట్లుందో సూద్దామని
జగదేవ్‌పూర్: ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలోని పంటలను సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఎవుసం ఎట్లుందని నౌకర్లను అడిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనను కలిసేందుకు వచ్చిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ నాయకులతో ఉప ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించారు. శనివారం ఫాంహౌస్‌కు వచ్చిన ముఖ్యమంత్రి ఇక్కడే బస చేశారు. దీంతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, గజ్వేల్ సీఐ అమృతారెడ్డి, ఎస్ఐ వీరన్న వ్యవసాయ క్షేత్రం వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. సీఎం వెళ్లేవరకు వీరంతా ఇక్కడే ఉన్నారు. ఆదివారం సాయంత్రం 6.20 నిమిషాల ప్రాంతంలో కేసీఆర్ ఫాంహౌస్ నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లారు. విద్యార్థిని రాజేశ్వరి కుటుంబాన్ని ఆదుకుంటా.. అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థిని రాజేశ్వరి కుటుం బాన్ని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సీ ఎం తిరిగివెళ్తున్న క్రమంలో ఫాంహౌస్ పక్కనే ఉన్న శివారువెంకటాపూర్ గ్రామ ప్రజలు ఆయన కాన్వాయ్‌ను ఆపి అనారోగ్యంతో మృతి చెందిన రాజేశ్వరి కుటుంబ పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన ఎవుసం ఎట్లుందో సూద్దామని వచ్చానని.. మళ్లొచ్చిన్నాడు తప్పకుండా సాయం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. రెండుమూడు రోజుల్లో నేనే వస్తా... ములుగు: ఎర్రవల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న సీఎం కేసీఆర్ మర్కుక్ గ్రామంలో కొద్దిసేపు ఆగారు. సీఎం వెళుతున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న సర్పంచ్ నర్సింలు స్థానికులతో కలిసి రోడ్డుపై వేచి ఉన్నారు. ఇది చూసిన సీఎం తన కాన్వాయ్‌ని ఆపి వారితో మాట్లాడారు. తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మర్కుక్వాసులు వినతిపత్రం అందజేశారు. రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా అధికారులతో వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎంపీటీసీ గీతారాంరెడ్డి, ఉప సర్పంచ్ నవనీతమాధవరెడ్డి, వార్డు సభ్యుడు మల్లేష్, నాయకులు ఉన్నారు. -
పోలింగ్ సరళిపై ఆరాతీసిన సీఎం
ఫాంహౌస్‌కు చేరుకున్న కేసీఆర్ జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో శనివారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ప్రజ్ఞాపూర్ నుంచి వ్యవసాయక్షేత్రం వరకు అడుగుడునా పోలీసు బలగాలను మొహరించారు. మెటల్ డిటెక్టర్, డాగ్‌స్క్వాడ్‌తో కల్వర్టుల వద్ద తనఖీలు నిర్వహించారు. మధ్యాహ్నాం 2.35 నిమిషాలకు సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఆయన అక్కడి పంటలను పరిశీలించారు. అక్కడి నుంచే ఓటింగ్ సరళిని ఫోన్ ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. శనివారం రాత్రి ఆయన ఫాంహౌస్‌లో బసచేసి ఆది వారం హైదరాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం. బాల్‌రాజు, కిష్టన్న పోలింగ్ ఎట్లుంది.. వ్యవసాయక్షేత్రానికి వెళ్తూ శనివారం కొద్దిసేపు ఎర్రవల్లి గ్రామంలో ఆగిన సీఎం కేసీఆర్ పోలింగ్ శాతం ఎట్లుంది, బాగా నడుస్తోందా.. ఓటర్లు ఏమనుకుంటున్నరు..అంటూ స్థానిక సర్పంచ్ భర్త బాల్‌రాజు, నాయకులు కిష్టారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 80 శాతం పోలింగ్ నమోదైందని వారు సీఎంకు వివరించారు. కేసీఆర్ కాన్వాయ్ ఎర్రవల్లిలో ఆగడంతో గ్రామానికి చెందిన యువకులు, స్థానికులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు.