Law and order
-
శాంతిభద్రతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే నేడు జీవన్‌రెడ్డి అంటున్నారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో...రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెబుతున్నారని పేర్కొన్నారు.ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని కేటీఆర్ కోరారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని సూచించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని.. వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడగలుగుతారని అన్నారు.A senior congress leader & a Former Minister, MLC Jeevan Reddy Garu today is echoing what the rest of Telangana has been saying since the last few months Law & Order in Telangana has been a major concern. Without a full time Home Minister and more importantly with police being…— KTR (@KTRBRS) October 22, 2024 -
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: హరీశ్‌రావు
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. అందుకు వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనమని మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. .. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నది. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షంచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. .. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నాం అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. భట్టి కౌంటర్హరీష్రావు చేసిన ట్వీట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘‘గత పదేళ్ళ పాలనను హరీష్ రావు మర్చిపోయారా?. బీఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది’’ అని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి భట్టి.. అవాంఛనీయ సంఘటనలకు పాల్డడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. -
UP: మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లో బుధవారం(ఏప్రిల్ 10) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఎవరి పేరు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేదో వాళ్ల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి’అని యోగి అన్నారు. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్!
హైదరాబాద్: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్‌లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజగుట్ట, బోరబండ, ఎస్ఆర్నగర్, మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు ఎనిమిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో డైమండ్ హౌజ్, ఫిలింనగర్ విజేత సూపర్‌మార్కెట్ వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 24 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎస్ఆర్నగర్ ఐసీఐసీఐ వద్ద రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్, గ్రీన్ బావర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌ల్యాండ్స్ వద్ద, బంజారాహిల్స్ పార్క్ హయత్ వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. -
ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్!
సాక్షి, కరీంనగర్: 'ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్లో ఎన్నికల చట్టాలు– నిబంధనల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం.' సెక్షన్ 123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోను చేస్తే.. ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా రెండింటినీ విధించే అవకాశం ఉంటుంది. 126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు. 127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా. 128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా. 129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 130: పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది. 131: పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా, రెండూ అమలుచేయొచ్చు. 132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించనివారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా. 134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానా విధిస్తారు. 134(అ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు. 135: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ.500 జరిమానా. 135(ఇ): పోలింగ్, కౌంటింగ్ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశచూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా. 133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా. 135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష, అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 49వీ: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే పోలింగ్ ఆఫీసర్‌కు సదరు ఓటరు 49–వీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అధికారం కల్పిస్తారు. 134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. ఇవి కూడా చదవండి: కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’ -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ... రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
యాదాద్రి : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఉప్పల్‌లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన భునవగిరి జోన్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసి ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తీసుకెళ్లే రూట్‌ను చెక్ చేసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమస్యలు సృష్టించేవారిపై నిఘా ఉంచాలి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ అంబర్ కిషోర్, డీసీపీ రాజేష్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డీసీసీ–1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, ఎస్ఓటీ డీసీపీ–1 గిరిధర్, మహేశ్వరం డీసీపీ శ్రీని వాస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి, సెబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ఎల్పీనగర్ డీసీపీ సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ–2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్, క్రైమ్ డీసీపీ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు. -
మణిపూర్ పరిణామాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల పునరావాసంతోపాటు శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాలపై తాజా నివేదికను సమరి్పంచాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, కర్ఫ్యూ సమయాన్ని ఐదు గంటలకు కుదించామని మణిపూర్ ప్రభుత్వం తెలియజేసింది. మణిపూర్‌లో మైనారీ్టలైన కుకీ తెగ గిరిజనులకు రక్షణ కలి్పంచాలని కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. మరోవైపు, వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం పునఃప్రారంభమైంది. మణిపూర్ పరిణామాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణను మొదలుపెట్టింది. -
ప్రశాంత విశాఖ..
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత విశాఖే లక్ష్యంగా అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు సిద్ధమైంది. విశాఖను టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి విస్తరించింది. విశాఖ పోలీస్ కమిషనరేట్నంతా టాస్క్ ఫోర్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులు మే 24 నుంచి అమల్లోకొచ్చినట్టుగా పరిగణిస్తున్నట్టు కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఇటీవల ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, వైఎస్సార్సీపీ నేత, బిల్డర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. మరో బిల్డర్ కిడ్నాప్ కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. మరోవైపు అరకు జిల్లా పరిధిలో గంజాయి సాగును ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసినా.. ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని భావించింది. అసాంఘిక శక్తులపై కేసులు నమోదుచేయనున్న టాస్క్‌ఫోర్స్ ఇప్పటివరకు ఏ ప్రాంతంలోని కేసులను అక్కడి పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కేసుల దర్యాప్తు, విచారణ, శిక్షలు పడేలా చేయడం మొదలైన ప్రక్రియలో కొంత సమన్వయలోపం కనిపిస్తోంది. ఇక నుంచి విశాఖలో ఏ ప్రాంతంలో అసాంఘిక శక్తులపైన అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడి బాధ్యత టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపడతారు. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులు, గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, ఈవ్ టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడేవారు... ఇలా అన్ని తరహా కేసులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపడతారు. అందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు అదనపు అధికారులు, సిబ్బదిని కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. -
ఈ మంటలు ఆర్పండి!
నెలన్నర దాటిపోయింది. ఇప్పటికి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగి చాలాకాలమైంది. సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి వచ్చి పర్యటించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇవాళ్టికీ అగ్నిగుండమై మండుతోంది. శాంతిభద్రతలు క్షీణించి, మూకస్వామ్యం రాజ్యమే లుతోంది. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా ఇవ్వాలంటూ మైతై తెగ ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా మే మొదటివారంలో జరిగిన గిరిజనుల ప్రదర్శన హింసాత్మకంగా మారినప్పుడు మొదలైన ఈ జ్వాల మణిపూర్‌లోని తెగల మధ్య చీలికలను ఎత్తిచూపింది. మరి, ఈ మంటల్ని చల్లార్చి, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత తల మీద ఉన్న సర్కారు ఇప్పటి దాకా ఏం చేసినట్టు? సమస్యను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక వర్గం వైపు నిలబడి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. కుకీలు ఎక్కువుండే కొండ ప్రాంత జిల్లాల నుంచి మైతైలు వలసపోతుంటే, మరోపక్క మైతైలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు తరలిపోతున్నారు. కేంద్ర మంత్రి నివాసం సహా రెండు వర్గాలకు చెందిన 4 వేల గృహాలు ఇప్పటికే అల్లర్లలో అగ్నికి ఆహుతి అయ్యాయి. శరణార్థి శిబిరాలు కిక్కిరిశాయి. అమాత్యుడి ప్రైవేట్ నివాసంపై దాడి గత మూడు వారాల్లో ఇది రెండోసారి. జాతుల మధ్య విద్వేషం ఇంతగా పెచ్చరిల్లుతుంటే, కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా అధికారంలో ఉన్న పాలకపక్షం ఏం చేస్తోందన్నది ప్రశ్న. నిజానికి, కేంద్ర హోమ్ మంత్రి ఇటీవలే సంక్షుభిత మణిపూర్‌ను సందర్శించినప్పుడు, సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నా ఆ ఆశ నెరవేరలేదు. భౌగోళికంగా బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ల మధ్య చిక్కిన ఈశాన్య రాష్ట్రాల్లో తెగల మధ్య తరచూ ఘర్షణలు కొత్త కావు. 1949లో భారత యూనియన్‌లో చేరినప్పటి నుంచి మణిపూర్‌లోనూ అవి ఉన్నవే. కానీ, మధ్యవర్తులుగా ఉండాల్సినవారే తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమా నంతో ఇరువర్గాల మధ్య విశ్వాసం సన్నగిల్లడం విషాదం. అపనమ్మకం నిండినచోట భద్రతా దళాలైనా తగిన చర్యలు చేపట్టడం కష్టం. మణిపూర్ రైఫిల్స్ సహా రాష్ట్ర పోలీసు బలగాలు మైతైలకే మద్దతుగా నిలుస్తున్నాయని కుకీల భావన. మైతైలేమో కుకీ ప్రాబల్య పర్వత ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా గంజాయి సాగు చేస్తున్నా అస్సామ్ రైఫిల్స్ చూసీ చూడనట్టున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు భద్రతాదళాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. పారా మిలటరీ దళాలు తమ పనిలో జోక్యం చేసుకుంటున్నాయని పోలీసుల ఆరోపణ. వెరసి, పాలన మృగ్యమైన మణి పూర్లో నేటికీ రహదారులు సాయుధ మూకల నియంత్రణలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్తతల్ని చల్లబరచడానికి పాలకుల వైపు నుంచి ఏ మాత్రం ప్రయత్నాలు జరుగుతు న్నాయంటే అనుమానమే. ఎంతసేపటికీ దీన్ని శాంతి భద్రతల సమస్యగానే వారు చూస్తున్నారు. అది పెద్ద చిక్కు. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పదే పదే విఫలమైనా, కేంద్రం ఉపేక్షించింది. విద్వేషాగ్నిలో ఈశాన్యం కాలిపోతున్నా, మూడు వారాల పైచిలుకు తర్వాత కానీ హోమ్ మంత్రి అక్కడకు రాకపోవడం ఏ రకంగా సమర్థనీయం? కొన్ని వారాలుగా ఇలా ఉన్నా ప్రధాని తన రాజకీయ సభల్లో కానీ, ఇతరత్రా కానీ ఎక్కడా మణిపూర్ ఊసే ఎత్తలేదు. మాటల ద్వారా మనుషుల మధ్య మత్సరం తగ్గించాల్సిన వేళ పాలకులు మౌనముద్ర దాల్చడం విడ్డూరమే! గౌహతి హైకోర్ట్ రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేయడం బాగానే ఉంది. కానీ, రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో శాంతి సంఘం ఏర్పాటుకు మాత్రం ఆదిలోనే హంసపాదు పడింది. పక్షపాత సీఎం సభ్యుడిగా ఉన్న కమిటీలో తాము ఉండబోమనేది కుకీ ప్రతినిధులు తేల్చేశారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో బీరేన్ ఆలోచించుకోవాలి. 2017లో తొలి విడత సీఎంగా ఎన్నికైనప్పుడు గిరిజనవాసులతో సన్నిహితంగా మెలిగిన ఆయన 2022లో రెండో విడత అధికారం చేపట్టాక వైఖరి మార్చారు. ప్రభుత్వస్థలంలో ఆక్రమణల పేరిట ఇంఫాల్‌లో చర్చిలతో సహా అనేకం కూల్చివేతకు ఆదేశించి, కుకీలకు కోపకారణమయ్యారు. సంఖ్యాపరంగా మైతైలున్నందున మెజారిటీ వాదాన్ని స్థానిక గిరిజన తెగలపై రుద్దుతున్నారనే భావన కలగడమూ సమస్యకు కారణమైంది. మైతైలకు ఎస్టీ హోదానిచ్చే అంశం పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్ట్ చెప్పింది సరే, ఆ వివాదా స్పద నిర్ణయంతో తెగల మధ్య అశాంతి నెలకొంటుందని ఊహించకపోవడం ప్రభుత్వ తప్పిదమే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పర్యవసానాలు ఊహించి సంబంధిత వర్గాల మధ్య అపోహల్ని ముందే తొలగించడం కీలకం. పాలకులు అక్కడే విఫలమయ్యారు. అనుమానాలు పెను భూతాలై, పరిస్థితిని ఇంతదాకా తెచ్చారు. ఇంటర్నెట్పై నిర్బంధాల నేపథ్యంలో క్షేత్రస్థాయి వార్తలు సరిగ్గా తెలియకపోగా, అసలు కథ వదిలేసి దీన్ని రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రించే ఘోర తప్పి దాలూ సాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలగజేసుకోవాలి. అన్ని తెగలకూ రాజ్యాంగ రక్షణ ఉందన్న భరోసా కల్పించాలి. మూలన విసిరేసినట్టుగా ఉన్న ఆ ప్రాంతాలనూ, ప్రజలనూ పరాయి వారుగా చూసే ధోరణి మారాలి. అక్కడి విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను గౌర విస్తూ, దేశంలో తామూ భాగమనే అభిప్రాయం ఆ ప్రజల్లో కల్పించాలి. మరి, ఆ దిశగా శాంతి స్థాపనకు ఇకనైనా పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అన్నది మాటలకే పరిమితం కాదన్న నమ్మకం వివిధ తెగల మధ్య కల్పిస్తారా? -
బాబు హయాంలో నేరాలు-ఘోరాలు కంటపడలేదేమో?
ఈనాడు మీడియా మరో అడ్డగోలు వార్తకు ఇది నిదర్శనం. ఏపీ ప్రజలపై ఆ మీడియా అక్కసు ప్రదర్శిస్తోందని, ప్రత్యేకించి విశాఖ పట్నంపై విషం కక్కుతోందనడానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదు. అరాచక శక్తులకు విశాఖ అడ్డానే అంటూ ఈనాడు పత్రిక రెండు రోజుల క్రితం బ్యానర్ హెడింగ్ పెట్టడం ద్వారా తమ కక్షను ప్రదర్శించారు. పైగా దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏదో అన్నారట. అవి నూటికి నూరుపాళ్లు నిజమని తేలిపోయిందట. మాఫియా రెచ్చిపోతోందని, ఇంకేదేదో చెత్త రాస్తూ తమ మాఫియా బుద్దిని ఈనాడు చూపెట్టడానికి ఏ మాత్రం సిగ్గు పడడం లేదు. ✍️ విశాఖ లోక్ సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీరావులను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేయడం సంచలన వార్తే. ఆ విషయం బయటపడిన కొద్ది గంటలలోనే పోలీసులు వారిని పట్టుకుని బాధితులను విడిపించారు. ఇందుకు విశాఖ పోలీసులను అభినందించవలసిందే. అలా చేయకపోగా అరాచక శక్తుల అడ్డా అంటూ ఈనాడు చెలరేగిపోయింది. దాదాపు అన్ని మీడియా ఛానెల్స్ ఈ వార్తను ప్రముఖంగానే ఇచ్చాయి. అందులో తప్పు లేదు. చాలా వరకు ఫ్రొఫెషనల్ గా కవర్ చేశాయి. కానీ, ఈనాడు మాత్రం తన విద్వేషాగ్నిని బహిర్గతం చేసుకోవడానికి ఈ ఘటనను ఉపయోగించింది. ఈ ఒక్క నేరంతో మొత్తం విశాఖ అంతా పాడైపోయినట్లా? ఎవడైనా బుద్ది ఉన్నవాడు ఇలాంటి చెత్త లాజిక్ తీసుకు వస్తారా?. ✍️ అదే నిజమని అనుకుంటే.. విశాఖ ప్రాంతంలో గత చంద్రబాబు పాలన సమయంలో ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని కొందరు హత్య చేశారే. అది ప్రశాంతతకు చిహ్నమని ఈనాడు ఆనాడు భావించిందా?. ఆ హత్యలతో విశాఖ జిల్లా అంతా హత్యల అడ్డాగా మారిపోయిందని ఈనాడు ఎందుకు రాయలేదు!. ► గత టరమ్ లోనే విశాఖ పట్నం నడిబొడ్డులోనే ఒక మహిళను వివస్త్రను చేసి హత్య చేశారే. ఇందులో టీడీపీ నేతలపైనే ఆరోపణ వచ్చిందే! అప్పుడు మహిళలపై ఘాతుకాలకు విశాఖ కేంద్రం అయిందని రాయలేదే!. ► టీడీపీ హయాంలోనే విశాఖ భూ కబ్జాలపై సిట్ వేశారు. ఆ సందర్భంగా ఒక మంత్రి మరో మంత్రి పై కబ్జా ఆరోపణలు చేసినప్పుడు.. ఇది కబ్జాల మయం అయిందని రాయలేదే. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ కబ్జాలను కొన్నింటిని విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కక్ష అని రాశారే. ► విజయవాడలో ఒక టీడీపీ నేత లైంగిక వేధింపులకు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆ నేతకు జీవిత ఖైదు కూడా పడింది. దాంతో టీడీపీ నేతలంగా లైంగిక నేరస్తులని ఈనాడు రాయాలి కదా!. ‘ఒహో.. టీడీపీ వాళ్లు ఏమీ చేసినా వారికి కమ్మగా ఉంటుంది’’ అని ఎవరైనా విమర్శిస్తే మరి ఏమి చెబుతారు?. ► అదే విజయవాడలో చంద్రబాబు టైమ్ లో కాల్ మనీ సెక్స్ రాకెట్లకు ఎంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఇదేమి దరిద్రపు పాలన అనో, టీడీపీ నేతల నీచ బుద్దులు అనో ఈనాడు రాసిందా?.. లేదే! ఇప్పుడు జరిగిన ఒక కిడ్నాప్ నేరానికి రాజకీయ రంగు పులిమి తమ పైత్యం అంతా ప్రదర్శిస్తోంది. మార్గదర్శి కేసులో ఏపీసీఐడీ చెరుకూరి రామోజీరావును విచారించిన సందర్భంలో.. ✍️ టీడీపీ పాలనలో ఇవేకాదు.. ఇంకా ఎన్నో ఘోరాలు జరిగాయి. విజయవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను నడిరోడ్డు మీద దీక్ష చేస్తున్న సమయంలో టీడీపీ వాళ్లు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని మాజీ మంత్రి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు. ఇందుకు ఈనాడు ఒప్పుకుని విజయవాడ హత్యల నగరం అయిపోయిందని కానీ, టీడీపీ హత్యాకాండలలో పాల్గొంటోందని కాని రాసిందా?. ► పులివెందుల వద్ద ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాత వైఎస్ రాజరెడ్డిని టిడిపి నేతలు హత్య చేస్తే, ఆ టిడిపివారికి హైదరాబాద్ లోని టిడిపి ఆఫీస్ లో రక్షణ కల్పించారన్న అబియోగం అప్పట్లో వచ్చిందే. ► పోనీ కిడ్నాప్ ఘటనలు ఏవీ టిడిపి హయాంలో జరగలేదా! ఆనాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుర్తేడు అనేచోట పది మంది ఐఎఎస్ అదికారులను నక్సల్స్ కిడ్పాన్ చేశారు. వారిని విడిపించడానికి జైలులో ఉన్న తీవ్రవాదులను వదలిపెట్టిన చరిత్ర టిడిపిదే కదా!. ► మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కూడా నక్సల్స్ కిడ్నాప్ చేస్తే, ఆయన సతీమణి దీక్ష చేసి విడిపించుకోవలసి వచ్చిందే! ► గతంలో హుజూరాబాద్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దుగ్గిరాల వెంకటరావును కాల్చి చంపారు. మండలాధ్యక్షుడుగా ఉన్న టీడీపీ నేత మలహర్ రావును హత్య చేసిన ఘటన ఉమ్మడి ఏపీలో పెను సంచలనం అయింది. ► ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాలలో స్నానం చేయడం కోసం సామాన్యులను నిలిపివేసిన సందర్భంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. అయినా అది చంద్రబాబు తప్పు కాదని, భక్తుల తప్పని ప్రచారం చేశారే! ✍️ ఇక తెలంగాణలో ఏవైనా నేరాలు జరిగితే ఇలాగే దిక్కుమాలిన వార్తలు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే వణికే ఈనాడు మీడియా ఎపిలో మాత్రమే ఇలా నీచంగా రాస్తోంది. హైదరాబాద్ రింగ్ రోడ్డు వద్ద ఒక వెటర్నరీ మహిళా డాక్టర్ సామూహిక మానభంగానికి గురవడం, తదుపరి ఆమెను హత్య చేయడం ఎంత దారుణమైన ఘటనన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ దుర్ఘటన జరిగింది కనుక హైదరాబాద్ రేప్ ల అడ్డా అని ఈనాడు ఎందుకు రాయలేదు! ఆ తర్వాత కూడా పలు రేప్ కేసులు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి ఒక మహిళను ఎంత ఘాతుకంగా హతమార్చింది చూశాం. కొన్ని కిడ్పాప్ ఘటనలు, తుపాకి కాల్పులు ,రియల్ ఎస్టేట్ తగాదాలు, హత్యలు కూడా జరిగాయి. అయినా హైదరాబాద్ లో వచ్చే పరిశ్రమలు ఆగిపోతున్నాయా? లేదే! ✍️ దీని అర్ధం ఏమిటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సమాజంలో కొన్ని నేరాలు రకరకాల కారణాలతో జరుగుతుంటాయి. వాటిని అవకాశం ఉన్న మేరకు అదుపు చేయడం పోలీసుల బాధ్యత. నేరం జరిగిపోతే నిందితులను పట్టుకుని శిక్షించడం పోలీసుల కర్తవ్యం. అది జరుగుతోందా?లేదా? అన్నది చూడాలి కాని ప్రతి ఘటనకు ప్రభుత్వానికి , అదికారంలో ఉన్న పార్టీకి పులిమి వార్తలు ఇచ్చి ప్రజలలో వ్యతిరేకత పెంచాలని చూడడం జర్నలిజం అవుతుందా!. మీడియా ఈ రకంగా నైతికంగా పతనం అవడం శోచనీయం. ✍️ అమిత్ షా ఆధ్వర్యంలోనే పోలీసు శాఖ డిల్లీలో పనిచేస్తుంటుంది. కానీ అక్కడ ఎన్ని నేరాలు జరిగాయి.మహిళల రేప్ లు జరిగాయి. దాంతో డిల్లీ అరాచక శక్తుల అడ్డాగా మారిందని ఈనాడు రాయలేదే! యూపీలో ఒక మాజీ ఎంపీని ,ఆయన సోదరుడిని పోలీసుల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ మధ్య కోర్టులోనే కాల్పులు జరిగాయి. అయినా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ శాంతి భద్రతలను బాగా కాపాడుతున్నారని ఎందుకు ప్రచారం జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పవచ్చు. ఈనాడు మీడియా ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా దానిని వైఎస్సార్సీపీకి అంటకట్టి.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్దం కాకుండా ఉంటాయా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయికి పోలీసు వ్యవస్థ.. స్నేహపూర్వక పోలీసు విధానం.. దశాబ్దాలుగా బ్రహ్మపదార్థంగా అంతుచిక్కకుండా ఉన్న ఈ రెండు లక్ష్యాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించి చూపించింది. అందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రజలు భయ పడకుండా, శాంతి భద్రతలతో జీవించేలా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అక్రమ వ్యాపారాల నిరోధానికి కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని నెలకొల్పింది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించివేసింది. నాటు సారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు, అల్లర్లు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. వ్యవస్థాగతంగా బలోపేతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లా పోలీసు కార్యాలయాలు 26కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 16 సబ్ డివిజన్లు, 19 పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2019కు ముందు 98 సబ్ డివిజన్లు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. 2019కు ముందు 197 పోలీస్ సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 216కు చేరాయి. ఇక ఏడాదికి 6,500 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశంలోనే విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త వ్యవస్థను సృష్టించింది. రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి గస్తీ విధులు కేటాయిస్తోంది. అసాంఘిక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడం, రౌడీషీట్లు తెరవడం మొదలైన చర్యలతో నేరాలకు ఆస్కారం లేకుండా చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన భద్రత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు, వేధింపుల కేసుల్లో తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. దర్యాప్తు వేగంగా చేస్తూ త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేస్తోంది. దాంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపుల కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో 2,382 కేసులు నమోదు కాగా 2022లో 2,229 కేసులకు తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో 15 శాతం కేసులు తగ్గాయి. గంజాయి, నాటు సారాపై ఉక్కుపాదం గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొత్తగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసి మరీ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గంజాయి దందాను కూకటివేళ్లతోసహా పెకలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. ముందుగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసి ప్రత్యేక బృందాలను నియమించి మరీ కట్టడి చేసింది. మొత్తం 384 గ్రామాల్లో మూడు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించింది. మొత్తం 9,093 ఎకరాల్లో ఏకంగా రూ.11,659 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేసింది. స్మగ్లింగ్‌ను అడ్డుకుని భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసింది. 2022లో 2 లక్షల కేజీలు, 2023లో ఇప్పటివరకు 3.32 లక్షల కేజీల గంజాయి నిల్వలను కాల్చి బూడిద చేసింది. ♦ దశాబ్దాలుగా గంజాయి సాగే జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచి్చంది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. గతంలో గంజాయి సాగు చేసిన 7,328 ఎకరాల్లో కాఫీ, నిమ్మ, జీడి, కొబ్బరి, రాజ్మా, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుండటం ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పునకు నిదర్శనం. ♦ అదే రీతిలో నాటుసారా దందాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన మొత్తం 2,202 గ్రామాల్లో ఏకంగా 2,184 గ్రామాల్లో సారా బట్టీలన్నవే లేకుండా చేసింది. నాటు సారా కాచే వారిని ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తోంది. మిగతా కొద్ది గ్రామాల్లోనూ త్వరలోనే నాటు సారా రూపుమాపడానికి చర్యలు చేపట్టింది. ఈ నాలుగేళ్లలో నాటు సారా, అక్రమ మద్యం దందాపై విస్తృతంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. 2019లో 527 కేసులు, 2020లో 922 కేసులు, 2021లో 1,691 కేసులు, 2022లో 1,379 కేసులు నమోదు చేయడం విశేషం. దాంతో రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం దందా గణనీయంగా తగ్గింది. 2023లో ఇప్పటివరకు 497 కేసులే నమోదు కావడమే దీనికి నిదర్శనం. పదే పదే అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద ఇప్పటివరకు 705 కేసులు నమోదు చేయడం గమనార్హం. రహదారి భద్రతకు ప్రాధాన్యం ఎక్కువమందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్య – ఆరోగ్య శాఖలతో సంయుక్త కార్యాచరణ చేపట్టింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను జియో ట్యాగింగ్ చేసి ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేకంగా అంబులెన్స్‌ల ఏర్పాటు మొదలైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2019లో 20,575 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2022నాటికి 19వేలకు తగ్గాయి. హత్యలు, ఘర్షణలు కట్టడి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా హత్యలు, ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2022కి రాష్ట్రంలో హత్యలు 6 శాతం తగ్గగా, అల్లర్లు 36 శాతం తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో 2023 మొదటి త్రైమాసికాన్ని పోలిస్తే హత్యలు 15 శాతం తగ్గాయి. సైబర్ నేరాల కట్టడి యావత్ ప్రపంచానికే సవాల్‌గా మారిన సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు శాఖ ముందుంది. సైబర్ నేరాల కట్టడికి పోలిసు శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సైబర్ మిత్ర యాప్, 1930 రిపోర్టింగ్ సెల్ సెంటర్లను నెలకొల్పింది. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. లోన్ యాప్‌ల వేధింపుల కట్టడికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. సైబర్ నేరాల బాధితులు గతంలో ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. శాంత్రిభద్రతల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఘర్షణలు, అల్లర్లు, హత్యలను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. గంజాయి, నాటు సారా కట్టడికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. – డీజీపీ కేవీ రాజేంద్రానాథ్ రెడ్డి ప్రజల భద్రతకు భరోసానిస్తున్నారు రాష్ట్రంలో నాలుగేళ్లుగా శాంతి భద్రతలు గణనీయంగా మెరుగయ్యాయి. ఘర్షణలు, అల్లర్లకు అవకాశం లేకుండా పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేస్తోంది. బాధితుల ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మేమున్నాం అనే నమ్మకాన్ని పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది. – డా.ర్యాలీ శ్రీనివాస్, గోదావరి కవి, తెలుగు అధ్యాపకుడు, రామచంద్రాపురం, కోనసీమ జిల్లా ప్రశాంత పరిస్థితులు నెలకొల్పారు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే సానుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకురావడం గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం ఆచరణలోకి వచ్చింది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. –సి. స్వరాజ్యలక్ష్మి, రిటైర్డ్ ప్రిన్సిపల్, శ్రీ పద్మావతి డిగ్రీ–పీజీ కళాశాల, తిరుపతి -
అతీక్ అహ్మద్ హత్య ఘటనపై ఒవైసీ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతీక్ అహ్మద్, అతని సోరుడు అష్రఫ్ హత్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై సుప్రీకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక్క అధికారి కూడా ఉండొద్దన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'హత్య సమయంలో అక్కడున్న పోలీసులు అధికారులను విధుల నుంచి తొలగించాలి. పోలీస్ కస్టడీలోనే అతీక్ అతని సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులకు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి? హత్య అనంతరం వారు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. చంపిన తర్వాత మతపరమైన నినాదాలు ఎందుకు చేస్తున్నారు?. టెర్రరిస్టులు అని కాకపోతే వాళ్లను ఏమని పిలవాలి? దేశభక్తులు అనాలా? ఈ ఘటన అనంతరం సంబరాలు చేసుకుంటున్నవారు రాబందులు. ఈ హత్యలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పాత్ర ఉంది. ఈ ఘటన యూపీలో శాంతి భద్రతలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలా పబ్లిక్‌గా హత్యలు జరిగితే ప్రజలకు రాజ్యాంగం, శాంతి భద్రతలపై విశ్వాసం ఉంటుందా? యూపీలో బీజేపీ పరిపాలన చట్ట ప్రకారం జరగడం లేదు, తుపాకీ రాజ్యమేలుతోంది.' అని ఒవైసీ ఫైర్ అయ్యారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వాతావరణం సమీపిస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పోలీస్ ఉన్నతాధికారి వారి పరిధిలోని గ్రామాల సందర్శన కొనసాగించాలని సూచించారు. నగరంలో ఏర్పా టు చేసిన డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా హాట్స్పాట్ల గుర్తింపు, పోలీసుల ప్రవర్తన తదితర అంశాలపై డీజీపీ చర్చించారు. శాంతిభద్రతల అడిషల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు సూచనలు చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి పదిమంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటానికి డీజీపీ నివాళులర్పిం చారు. -
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్: సీఎం యోగి
లక్నో: యోగి అదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీషీట్లరు, గ్యాంగ్స్టర్లు హడలిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఆయన నేరస్థులపై ఉక్కుపాదం మోపడమే ఇందుకు కారణం. గ్యాంగ్‌స్టర్ కం పొలిటీషియన్ అయిన అతిక్ అహ్మద్ కూడా ఇటీవలే ఓ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు యోగి. ఒకప్పుడు యూపీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన మాఫియా, గ్యాంగ్స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు చేసిన నేరాలకు కోర్టుల్లో దోషులుగా తేలుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో శాంతిభద్రతలంటే గౌరవం లేకుండా చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారని యోగి వ్యాఖ్యానించారు. శనివారం ఓ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈమేరకు మాట్లాడారు. 'ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడికి ఇవాళ యూపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరూ ధిక్కరించలేరు. ప్రజలను భయపెట్టిన మాఫియానే ఇప్పుడు భయంతో వణికిపోతుంది. కోర్టులో శిక్షలు పడటం చూసి వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.' అని యోగి అన్నారు. ఆరేళ్ల క్రితం యూపీ అంటే అరాచకాలు, అల్లర్లకు గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని యోగి చెప్పుకొచ్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ నవమి రోజు అల్లర్లు చెలరేగినా.. యూపీలో మాత్రం ప్రాశాంతంగా వేడుకలు జరిగాయని గుర్తుచేశారు. చదవండి: దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ.. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేర పరిశోధన, ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు, పీడీ చట్టం కింద కేసుల నమోదు, రైతు ఆత్మహత్యలు, కోర్టు కేసులు తదితర అంశాలపై డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయం నుంచి సమీక్షించారు. సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ షికాగోయల్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జోనల్ ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిటింగ్ వీసాలపై రాష్ట్రానికి వచ్చే విదేశీయుల కదలికలపైనా నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. విదేశీయులు రాష్ట్రంలో ఏ అనధికారిక సమావేశాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, పీడీయాక్ట్ కేసుల నమోదులో నిబంధనలను అనుసరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో పీడీ చట్టం కేసుల నమోదు ఏకరీతిన ఉండాలని సూచించారు. పీడీ చట్టం ప్రయోగంపై కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నమోదులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వచ్చే వారంలో జరిగే శివరాత్రి పర్వదినం సందర్బంగా ఏ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో భారీ సంఖ్యలో పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవనున్న నేపథ్యంలో శిక్షణపై దృష్టి పెట్టాలన్నారు. పీడీ చట్టాల నమోదులో తీసుకోవలసిన జాగ్రత్తలపై హైకోర్టులో పోలీస్ శాఖ జీపీ ముజీబ్ వివరించారు. -
చేష్టలుడిగిన భద్రతా మండలి: కొరోసీ
ఐరాస: అత్యంత శక్తిమంతమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా చేష్టలుడిగిందని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు సబా కొరోసీ వాపోయారు. వర్తమాన కాలపు వాస్తవాలను అది ఎంతమాత్రమూ ప్రతిబింబించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధాలను నివారించి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మండలి ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోంది. దానికి కారణమూ సుస్పష్టం. దాని శాశ్వత సభ్య దేశాల్లోనే ఒకటి పొరుగు దేశంపై దురాక్రమణకు పాల్పడి ప్రపంచాన్ని తీవ్ర ప్రమాదంలోకి, సంక్షోభంలోకి నెట్టింది. ఈ దుందుడుకుతనానికి గాను రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల వీటో పవర్ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. అందుకే మండలిని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మండలి కూర్పు రెండో ప్రపంచ యుద్ధానంతరపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. దాన్నిప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థల పనితీరు ఎలా ఉండాలనే విషయంలో రష్యా దురాక్రమణ పెద్ద గుణపాఠంగా నిలిచిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన కొరోసీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. -
ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. గుంటూరులో గురువారం రోజున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంరతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. చదవండి: (బెంచ్ మార్క్‌గా సీఎం జగన్ నిర్ణయం: సజ్జల రామకృష్ణారెడ్డి) -
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 2022 ఏడాదిలో పోలీస్ శాఖ సఫలీకృతమైనట్టు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు సహా కొన్ని రకాల నేరాలు కొంత పెరిగినా...నేరస్తులకు శిక్షలు పడే శాతం గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి 56 శాతానికి చేరడం సంతృప్తినిచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఏడాది మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించగలిగామన్నారు. మతఘర్షణలు ఇతర నేరాల కట్టడిలో పోలీస్‌శాఖలోని అధికారులు, సిబ్బంది అంతా ఒక బృందంగా కలిసికట్టుగా పనిచేశారని డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో సైబర్‌నేరాల ముప్పు మరింత పెరగనుందని, ఆ దిశగా పోలీస్‌శాఖ సమాయత్తమయ్యేలా ఎన్నో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం లక్డీకాపూల్‌లోని తెలంగాణ పోలీస్ కేంద్ర కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ 2022 వార్షిక నివేదిక, తెలంగాణ పోలీస్ ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీ నివేదికలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచిన ఉప్పల్, కోదాడ టొన్, ఆదిలాబాద్ వన్‌టౌన్, లక్ష్మీదేవిపల్లి, సిరోల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల)కు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలు, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సరళి తదితర అంశాలను వివరించారు. నాలుగు మూల సూత్రాలతో ముందుకెళ్లాం.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు మారుతున్న నేరసరళికి అనుగుణంగా మార్పు చెందేలా పోలీస్‌శాఖ బలోపేతానికి ప్రాసెస్, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ అనే నాలుగు మూల సూత్రాలను అనుసరించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో, అదే సమయంలో తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్తుల్లో తేగలిగామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో పోలీస్‌తోపాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పర్చేలా తీసుకువచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్‌శాఖకు చేరిన అదనపు వనరుగా డీజీపీ పేర్కొన్నారు. రానున్న ఐదారేళ్లలో దేశంలోనే ఉత్తమ సంక్షేమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ స్ట్రీట్ వెండార్స్‌తో సీసీటీవీల బిగింపు మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రాలుగా మారిన సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో తొలుత ఎన్నో అనుమానాలు ఉండేవని డీజీపీ గుర్తు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా తొలిసారి సీసీటీవీలను ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్‌లో తోపుడు బండ్ల వాళ్లు ముందుకు వచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రజలు, పలు సంస్థలు, ఎన్జీఓల సహకారంతో ప్రస్తుతం 10,25,849 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పోలీస్‌శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. కాగా, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక హైకోర్టుకు సమర్పించిందని, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుందని, ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. అన్ని రోడ్లపై స్పీడ్ లిమిట్‌కు సంబంధించిన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేలా ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, అడిషనల్ డీజీలు నాగిరెడ్డి, సందీప్‌శాండిల్య, సంజయ్‌జైన్, ఐజీ కమలాసన్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ ఈనెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుందని, గత 36 ఏళ్లుగా తన వృత్తిగత జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చిన అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, సీఎస్‌లు, ఇతర సిబ్బందికి అందరికీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వృత్తిగత జీవితంలో మీడియా ఎంతో సహకరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం... తదితర అంశాలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు.. ‘దిశ’ చట్టం ప్రగతిపైనా సీఎం సమీక్ష.. – రాష్ట్రంలో ‘దిశ’ అమలుపై సీఎం జగన్ సమీక్షించారు. – ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్స్ చేశారని వెల్లడించిన పోలీసు అధికారులు. – దిశ యాప్ ద్వారా 5,238 మందికి సహాయం. – దిశ యాప్ ద్వారా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లు 2021లో 684. – నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేశామన్న పోలీసులు. – వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్నదానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామన్న పోలీసులు. – దిశ పోలీస్స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చిందన్న పోలీసు అధికారులు. – మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామన్న పోలీసులు. – జీరో ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేస్తున్నామన్న పోలీసులు. – ఫోరెన్సిక్ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందన్న పోలీసులు. – గతంలో డీఎన్ఏ రిపోర్టుకోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందన్న పోలీసులు. - సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయగలుగుతున్నామన్న పోలీసులు. ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్ డౌన్లోడ్ కావాలి. వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి. ‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ‘దిశ’యాప్ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలి’’ అని సూచించారు. ‘దిశ’ బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో అధికారులు సీఎం జగన్‌కి వివరాలు అందించారు. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదని సీఎం జగన్ అభిపప్రాయపడ్డారు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సీఎం సమీక్ష సమీక్ష నిర్వహించారు. పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని.. డిసెంబర్ నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. (చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’) మహిళలపై నేరాలకు సంబంధించిన 12 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని.. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందని పోలీసులు తెలిపారు. ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు.ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలన్న సీఎం, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం, వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ‘దిశ’ ఒన్‌స్టాప్ సెంటర్ల పనితీరుపైనా, సచివాలయాలల్లో మహిళా పోలీసుల వ్యవస్థపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకూ 2,652 కేసులను దిశ ఒన్‌స్టాప్ సెంటర్ల ద్వారా హేండిల్ చేశామని అధికారులు తెలిపారు. దేవాలయాల్లో భద్రతకోసం 51,053 సీసీ కెమెరాలు పెట్టించామన్నారు అధికారులు. బాధితులకు సత్వర న్యాయంపై దృష్టిపెట్టండి’: సీఎం జగన్ ‘‘అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. శరవేంగా బాధితులను ఆదుకోవాలి. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలి. ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలి. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి’’ అని సీఎం జగన్ సూచించారు. (చదవండి: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’ ) సైబర్ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు సీఎం ఆదేశం ‘‘సైబర్ క్రైం నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. సమర్థత ఉన్న అధికారులను, సమర్థవంతమైన న్యాయవాదులను ఇందులో నియమించండి. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి’’ అన్నారు సీఎం జగన్. కేసుల సంఖ్యను పట్టించుకోవద్దు.. ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితుల కల్పనే ముఖ్యం అన్నారు సీఎం జగన్. బాధితులు స్వేచ్ఛగా ముందుకురావాలి, వారు ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. బాధితుడికి భరోసాగా పరిస్థితులు ఉండడం అన్నది ముఖ్యం అన్నారు సీఎం జగన్. (చదవండి: మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు) కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్ ఫ్రీగా ఉండాలి కాలేజీలు, యూనివర్శిటీలు ‘మాదక ద్రవ్య రహితంగా తయారు కావాలి. ఇందుకుగాను తక్షణ చర్యలకు సీఎం జగన్ ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలి. మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా.. లేవా.. సమీక్షించాలి. ఉంటే డ్రగ్స్‌ని ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి’’ అని సూచించారు. ‘మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. – రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, అక్రమ రవాణాలపై ఎస్ఈబీ సహా... పోలీసులు ఉక్కుపాదం మోపాలి. – అధికారంలోకి రాగానే 43వేల బెల్టుషాపులు తీసేశాం.. మద్యం అమ్మే దుకాణాలను మూడోవంతు తగ్గించాం. – ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి, మద్యం రేట్లు పెంచడం వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది – మద్యం అక్రమ రవాణా, తయారీకి ఆస్కారం ఇవ్వకూడదు. – దీన్ని నిరోధించడానికి అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. – ఎస్‌ఈబీతోపాటు, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి. – ఇసుక అక్రమ రవాణాపైన కూడా చర్యలు తీసుకోవాలి. – గుట్కా నిరోధంపైనా కూడా దృష్టిపెట్టాలి. – ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించాం. – ఈ మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వాలి.. డిసెంబరు నాటికి పూర్తిచేయాలి. – వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలి. – దీనికి సంబంధించి సంబంధిత శాఖలు సిద్ధం కావాలన్న సీఎం జగన్ సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇంటలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: దిశ యాప్ ఉంటే.. ఓ అన్న మీ వెంట ఉన్నట్టు..! -
లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది: ఉత్తమ్
మఠంపల్లి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని, పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఈనెల 13న స్థానిక సేవాలాల్ జాతరలో టీఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిలో ఇళ్లు ధ్వంసమై, తీవ్రంగా గాయపడిన బాధిత కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఎంపీ సంతోష్ ద్వారా డీజీపీకి ఆదేశాలిప్పిస్తూ, పోలీసు అధికారులను అనుకూలమైన చోటుకు బదిలీ చేయించుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు. -
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు.. ఇద్దరిపై కేసు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేసిన ఇద్దరిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరి పోస్టింగ్‌లపై పోలీసులు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలు సింగ్ హిందీలో, మహ్మద్ కలీం ఉర్దులో పోస్టింగ్‌లు పెట్టడంతో ఇద్దరూ విద్వేశాలు రెచ్చగొట్టడంతోపాటు లా అండ్ ఆడర్ సమస్య తలెత్తే విధంగా ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారం ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తుందని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, వై.నాగిరెడ్డి, నిజామాబాద్, వరంగల్ ఐజీలు శివశంకర్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు. మాకు పక్కా సమాచారం ఉంది.. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపులకు దిగుతున్నారు. సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు ఈ అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలూ హైదరాబాద్‌లో నడవవని అరాచకశక్తులకు తెలిసింది. దీంతో మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్లోనో, వరంగల్‌లోనో, ఖమ్మంలోనో, మరోచోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్‌లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఏదోచోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థన మందిరాల దగ్గర ఏదో ఒక వికృతచేష్ట చేయాలని చూస్తున్నారు. అలాచేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్దఎత్తున గొడవలతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది’అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించొద్దు.. ‘హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కడుపు, నోరు కట్టుకుని నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరిక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట క్లబ్బులు, గుడుంబాలాంటి మహమ్మారులను దూరం చేశాం. సంఘ విద్రోహశక్తులు, మాఫియా, విచ్చిన్నకర శక్తులపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. శాంతిభద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహశక్తుల అణచివేతలో ప్రభుత్వం మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది. కాబట్టే నేడు హైదరాబాద్ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నాయి. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరి పని వారు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అనే మంచి పేరొచ్చింది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. యువకులకు ఉపాధి దొరుకుతున్నది. హైదరాబాద్ మహా నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు కోటీ 60 లక్షల జనాభా ఉంది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండటం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటం, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించటం ముఖ్యం. తెలంగాణకు గుండెకాయలాంటి ప్రశాంత హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఘర్షణలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రశాంతతను ఫణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు. ఘర్షణలు సృష్టించే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, వారు అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలి’అని సీఎం పోలీసులకు స్పష్టం చేశారు. ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి.. ప్రశాంత హైదరాబాద్‌లో మతచిచ్చు పెట్టడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘ విద్రోహశక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీనిచ్చారు. హైదరాబాద్‌లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనా జరగకుండా చూస్తామని తెలిపారు. -
ఎన్నికల పేరుతో కుట్రలు చేస్తున్నారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. చదవండి: గ్రేటర్ వార్ : ఉచితంగా తాగునీరు అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉందన్న కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను అడ్డు పెట్టుకొని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. చదవండి: సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు: విజయశాంతి -
బిహార్‌లో నేరాలు తగ్గాయా, పెరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీకి మూడ విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర శాంతి భద్రతల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ‘తిరిగి లాలూ ప్రసాద్ యాదవ్ గూండా రాజ్యం కావాలా? లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎంతో మెరగుపర్చిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం కావాలా?’ అంటూ నితీష్ కుమార్ పార్టీ అయినా జేడీయూతోపాటు దాని మిత్రపక్షమైన బీజేపీ తెగ ప్రచారం కొనసాగిస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్, తన భార్య రాబ్డీదేవీతో కలసి 1990 నుంచి 2005 సంవత్సరం వరకు బీహార్ రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత 2005 నుంచి 2014లో కొన్ని నెలలు మినహా ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్లపాటు నితీష్ కుమార్ పాలించారు. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో, ఆదివారమే ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారంలో, నవంబర్ ఏడవ తేదీన జరుగనున్నన మూడవ విడత ఎన్నికల ప్రచారానికి కూడా రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితే ప్రధానాంశం అయినందున నాటి లాలూ ప్రసాద్ హయాంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది ? నితీష్ కుమార్ హయాంలో పరిస్థితిలో మార్పు వచ్చిందా ? నిజంగా శాంతి భద్రతలు మెరగుపడిందా ? ‘నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో’ డేటాను పరిశీలించడం ద్వారా ఏది వాస్తవమో, ఏదవాస్తవమో, ఏ మేరకు వాస్తవమో సులభంగానే గ్రహించవచ్చు. 2018 సంవత్సరం దేశవ్యాప్తంగా నేరాల సరాసరి సగటు రేటు లక్ష జనాభాకు 300లకు పైగా ఉండగా, బీహార్‌లో నేరాల రేటు సగటు రేటు లక్ష జనాభాకు 222.1 శాతం మాత్రమే ఉందని నితీష్ కుమార్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలనే ప్రస్థావించింది. 2018 సంవత్సరానికి బీహార్‌లో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ కింద మొత్తం 2,62,815 కేసులు నమోదయ్యాయి. ఇది లక్ష జనాభాకు 222.1 శాతం సగటని చెప్పడం కూడా సబబే. అదే 2016లో 1,89,696 కేసులు, 2017లో 2,36,055 కేసులు నమోదయ్యాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉందనే అంశంతో సంబంధం లేకుండా 2001 సంవత్సరం నుంచి బీహార్‌లో ఏటేటా నమోదవుతున్న నేరాల సంఖ్య పెరగుతూనే వస్తోంది. నేరాల సంఖ్యలో బీహార్ దేశంలోనే 23వ స్థానంలో ఉందని నితీష్ ప్రభుత్వం చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుందని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. దేశం మొత్తంగా జరిగిన నేరాల్లో 5.2 శాతం నేరాలు ఒక్క బీహార్‌లో జరిగినవేనని, నేరాల సంఖ్య విషయంలో దేశంలో బీహార్ ఏడవ స్థానంలో ఉంది. లక్ష జనాభాతో పోల్చినప్పుడే అది 23వ స్థానంలో కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైన నేరాలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ నమోదుకానీ కేసులను పరిగణలోకి తీసుకోలేదని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సబ్ ఇనిస్పెక్టర్ ఉమేశ్ కుమార్ తెలిపారు. రేప్‌లు, కులులు, మతాల మధ్య జరిగే కలహాలు, భూముల వివాదాలపై ఎక్కువగా ఎఫ్ఐఆర్లు దాఖలు కావు. బీహార్‌లో 60 శాతం నేరాలు భూ తగాదాల కారణంగానే జరగుతాయి. ఈ తగాదాల కారణంగా బీహార్‌లో 2018 సంవత్సరంలో 1,016 మంది హత్యకు గురయ్యారు. వీటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే రాష్ట్రంలో జరిగిన హత్యలు 34.6 శాతం. ఇంకా దేశంలో ఎక్కడా లేనివిధంగా జల వివాదాల కారణంగా బీహార్‌లో 44 మంది హత్యకు గురయ్యారు. ఇక మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో కూడా దేశంలోనే బీహార్ 29వ స్థానంలో ఉందని చెప్పడం కూడా ఒక విధంగా వక్రీకరించడమేనని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఇందులో 33 రేప్‌లు, 23 కిడ్నాప్‌లు, 11 హత్యలు మాత్రమే పరిగణలోకి వచ్చాయి. వాస్తవానికి వీటి విషయంలో బీహార్ ఎనిమిదవ స్థానంలో ఉంది. వాస్తవానికి రేప్‌ల విషయంలో బీహార్ రెండో స్థానంలో, కిడ్నాప్‌ల విషయంలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. 2016 నాటి గణాంకాలతో పోలిస్తే గతేడాదికి 42 శాతం పెరిగాయి. అవే హత్యలు 20 శాతం పెరిగాయి. 2016లో 2,581 హత్యలు జరగ్గా, గతేడాది 3,138 హత్యలు జరిగాయి. అలాగే 2016తో పోలిస్తే గతేడిదాకి రేప్‌లు 44 శాతం పెరిగాయి. నితీష్ కుమార్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2005 నుంచి 2010 మధ్యనే బీహార్‌లో నేరాలు తగ్గాయని, ఆ తర్వాత పెరగుతూనే వచ్చాయని పట్నాలో సెక్యూరిటీ సంస్థ నడుపుతున్న ఆర్కే కాంత్ పేర్కొన్నారు. -
బాబోయ్ ఆ డ్యూటీలా.. వద్దే వద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ పోలీసు కమిషరేట్‌లో పోస్టు అంటే ఏ పోలీసు అధికారి అయినా ఎగిరి గంతేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేయలేమని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే లూప్లైన్లో పనిచేయడానికైనా సిద్ధమంటున్నట్లు తెలుస్తోంది. తీరిక లేని విధులే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుత పని విధానం.. ప్రతిరోజు డ్యూటీలో చేరిన వెంటనే టెలీ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి. తరువాత స్టేషన్ పరిధిలో అప్పటి వరకు ఉన్న కేసులు పరిశీలించడంతో పాటు వీఐపీల రాక వంటి బాధ్యతలు చూసుకోవాలి. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్, మళ్లీ రాత్రికి వాహనాల తనిఖీ, వీటితో పాటు నిత్యం స్టేషన్లకు వచ్చే కేసుల దర్యాప్తు ఉండనే ఉంటుంది. వీటితో వీక్లీ ఆఫ్‌లు సరిగా వినియోగించుకోలేని పరిస్థితి. కొత్తగా స్టేషన్లలో విధుల్లో ఉన్న యువ ఎస్‌ఐలూ మా వల్ల కాదంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ విభాగం పరిధిలోని స్టేషన్లలో కొందరు ఉన్నతాధికారులు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా కొంత కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. నగర కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న ఘటనలపైనా మినిట్ టూ మినిట్ వాకబు ఉంటోంది. అధికారులు ఫోన్లలోనే పరిస్థితిని సమీక్షిస్తారు. చిన్న పొరపాట్లకు చార్జీ మెమోలు జారీ. దీంతో మానసిక వేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పోలీసు బాస్‌లు మారిన ప్రతిసారి ఆయా పోలీసు అధికారుల తీరు నచ్చకపోతే వారి స్థానంలో కొత్త వారు రావడం సహజంగా జరిగే పనే. అయితే ప్రస్తుతం పనితీరు బాగున్నా కొందరు అధికారులను తప్పించేందుకు కొందరు పావులు కదుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ నగరంలో కీలకమైన ఓ జోన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తాను శాంతిభద్రతల విభాగంలో పనిచేయలేనని ఓ ఉన్నతాధికారికి తేల్చిచెప్పగా.. మరో అధికారి ఆ జోన్లో ఫోకస్ పోస్ట్ వద్దు బాబోయ్.. లూప్లైన్లో పనిచేస్తానని ఉన్నతాధికారి వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. ఇలా నగర కమిషనరేట్ పరిధిలో పలువురు అధికారులు లూప్లైన్లో పనిచేయడానికి ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ విభాగాలకు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నట్లు తెలిసింది. పోలీసులపై ఒత్తిడి లేదు.. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదు. అందరూ సమన్వయంతో పనిచేయాలంటున్నాం. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ప్రస్తుతం పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వలనే పెండింగ్‌లో ఉన్న 10 వేల కేసులను నాలుగు వేలకు తీసుకురాగలిగాం. పోలీసుల పనితీరు వల్లే ఇది సాధ్యమైంది. పనితీరు బాగాలేకపోతే వారి స్థానంలో కొత్త వారు వస్తారు. –బత్తిన శ్రీనివాసులు, నగర పోలీసు కమిషనర్, విజయవాడ