Monsoons
-
వృద్ధికి వర్షపాతం, ప్రపంచ సానుకూలతల దన్ను
న్యూఢిల్లీ: సాధారణ రుతుపవనాల అంచనాలు, ఇప్పటివరకు ఎటువంటి ప్రపంచ ప్రతికూలతలు లేకపోవడం వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందడానికి దోహదపడే అవకాశం ఉందని ఎకనామిక్ థింక్ ట్యాంక్– ఎన్సీఏఈఆర్ తన నెలవారీ సమీక్షలో తెలిపింది.దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని హై–ఫ్రీక్వెన్సీ సూచికలు వెల్లడిస్తున్నాయని, 2024–25 వృద్ధి అంచనాలను దాదాపు అన్ని ఏజెన్సీలు కూడా ఎగువముఖంగా సవరిస్తున్నాయని పేర్కొంది. భారత్ వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 7.2 శాతం శ్రేణిలో ఉంటుందని పలు సంస్థలు అంచనావేస్తున్న విషయాన్ని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా పేర్కొంటూ.. ఎకానమీ వృద్ధి 2024–25లో 7 శాతం ఖాయమని, 7.5 శాతం వరకూ కూడా ఈ రేటు పురోగమించే వీలుందని అన్నారు. పూనమ్ గుప్తా పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...మార్చి త్రైమాసికంలో కనిపించిన ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలకు తోడు సాధారణ రుతుపవనాల అంచనాలు ఎకానమీకి ఊతం ఇస్తాయి.ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉన్నందున, కీలక రెపో రేటు మరింత కఠినమయ్యే పరిస్థితులు లేవు.అయితే ఆహార ధరలు ఇప్పుడు ప్రధానంగా సవాలు విసురుతున్న సమస్య. దీనిని పరిష్కరించడానికి విస్తృత విధాన ఫ్రేమ్‌వర్క్ అవసరం కావచ్చు. వాతావరణ సవాళ్లను తట్టుకునే ఆహార సరఫరాల చైన్‌ను వ్యవస్థీకరించడంతోపాలు, ప్యాక్ అయిన సురక్షిత ఆహార సరఫరాలవైపు క్రమంగా మారాలి. సరఫరా–డిమాండ్ అంతరాన్ని తగ్గించడానికి తగిన కృషి జరగాలి.ప్రధాన పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ)లో వృద్ధి ఏప్రిల్ 2024లో వేగంగా ఉంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏడాది పొడవునా పటిష్టంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణ వృద్ధిలో కొంత క్షీణత ఉన్నప్పటికీ, బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్‌లో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ’సాధారణం కంటే ఎక్కువ’ రుతుపవనాల అంచనాలు వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తున్నాయి. భారత్ ఎకానమీ పురోగతిలో ఇవన్నీ కీలకాంశాలు. -
కదలని ‘నైరుతి’
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రుతుపవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి విస్తరించాయి. వసూ్తనే మంచి వర్షాలను కురిపించాయి. వారం రోజులు చురుగ్గానే ఉన్నాయి. తర్వాత ఉత్తర కోస్తా వైపు కదిలి కొద్ది రోజల క్రితం విజయనగరం వరకు చేరగానే, ముందుకు విస్తరించకుండా అక్కడే తిష్టవేశాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పైగా, వర్షాకాలంలో వేసవిని తలపించే ఎండలు కాస్తున్నాయి. సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ వడగాడ్పులూ వీస్తున్నాయి. ప్రధానంగా తీర ప్రాంత జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు విజయనగరం నుంచి మిగిలిన ప్రాంతాలకు విస్తరించకపోవడానికి కొన్నాళ్లుగా కొనసాగుతున్న అధిక పీడన ద్రోణి (రిట్జ్) కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అల్పపీడన ద్రోణి ఏర్పడితే వర్షాలు కురుస్తాయి. కానీ, అధిక పీడన ద్రోణి ఉంటే అందుకు విరుద్ధంగా వర్షాభావ పరిస్థితులేర్పడతాయని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం పూర్వ అధిపతి ఓఎస్ఆర్యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో రుతు పవనాల్లో కదలిక వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు ఉత్తర కోస్తాంధ్రలో ఉష్ణ తీవ్రత ఉంటుందని ఆయన తెలిపారు.కొనసాగుతున్న ఆవర్తనాలు..ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒకటి, రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరొకటి ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే గురు, శుక్రవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. మరోవైపు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. -
ఏపీలో విస్తారంగా వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు మరింత విస్తారంగా కురవనున్నాయి. ప్రస్తుతం రాయలసీ మ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్ర వ్యాప్తంగా మరింతగా విస్తరించనున్నాయి. వీటి ఫలితంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లా గాజువాకలో 10.5 సెంటీమీటర్లు, పి.లింగవలస (విజయనగరం)లో 7.8, శంఖవరం (కాకినాడ)లో 5.1, చోడవరం (అనకాపల్లి)లో 3.7, గూడవల్లి (బాపట్ల)లో 2.4, రామచంద్రాపురం (కోనసీమ)లో 2.3, పట్టిసీమ (ఏలూరు)లో 2.1, పైడి భీమవరం (శ్రీకాకుళం)లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. -
కొనసాగుతున్న ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ద్రోణి ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఊపందుకోనున్న రుతుపవనాలు..కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు చురుకుదనం సంతరించు కోనున్నాయి. ఫలితంగా ఈనెల 17, 18 తేదీల్లో కోస్తాంధ్రలోను, 18న రాయలసీమలోను భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. శుక్రవారం రాత్రి వరకు డోలపేట (విజయనగరం జిల్లా)లో 7.8 సెంటీమీటర్లు, కోట ఉరట్ల (అనకాపల్లి)లో 5.7, అనపర్తి (తూర్పు గోదావరి)లో 4.3, ఎచ్చెర్ల (శ్రీకాకుళం)లో 3.2, సాలూరు (పార్వతీపురం మన్యం)లో 2.9, పర్లపాడు (వైఎస్సార్)లో 2.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
విస్తరిస్తున్న రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వానలు కొనసాగనున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన భాగాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఆదివారం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. -
మూడు రోజులు వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాలు దీనికి దోహదపడుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు కోస్తాంధ్రలో నెమ్మదిగా కదులుతున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒకటి, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నాయి. వీటి ఫలితంగా గురువారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగా గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల పిడుగులు పడే వీలుందని పేర్కొంది. -
నేడో, రేపో సీమలోకి ‘నైరుతి’!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయి. నేడో రేపో రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.ఆదివారం అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వివరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున వడగాడ్పుల ప్రభావం చాలా వరకు తగ్గింది.రాజంపేటలో 32.5 మిల్లీమీటర్ల వర్షం ఇదిలావుండగా శనివారం సాయంత్రానికి అన్నమయ్య జిల్లా రాజంపేటలో 32.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో 30.5, చిత్తూరు జిల్లా గుడుపల్లెలో 24.2, చిత్తూరులో 21, తవణంపల్లెలో 18.7, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 18.2, అల్లూరి జిల్లా కొయ్యూరులో 17.7, కాకినాడ జిల్లా తొండంగిలో 15.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోకి రుతుపవనాలు!
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోత, భానుడి భగభగలతో విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే చల్లటి కబురిది. గురువారం కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 2, 3 తేదీలనాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, నేడు, రేపు కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. -
అండమాన్‌కు చేరిన నైరుతి
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలకు ఆధారమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆశావహమైన రీతిలో ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ప్రస్తుతం ఇవి చురుకుగా ముందుకు సాగుతున్నాయని.. పరిస్థితి అనుకూలంగా ఉంటే వారం రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మరో వారం, పది రోజుల్లో తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. లానినా పరిస్థితుల నేపథ్యంలో.. గత 150 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే రుతుపవనాల రాకడ ఒకే విధంగా లేదు. 1918లో చాలా ముందుగానే అంటే మే 11వ తేదీనే నైరుతి కేరళను తాకింది. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18వ తేదీన ప్రవేశించాయి. గత ఏడాది జూన్ 8న కేరళను తాకాయి. అంతకుముందు 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ ఒకటో తేదీన నైరుతి ప్రవేశించింది. ఈసారి లానినా పరిస్థితులు ఉండటంతో సాధారణంగా కంటే ఎక్కువే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్టు ఐఎండీ గత నెలలోనే ప్రకటించింది. మన దేశంలో సాగయ్యే పంటల్లో 52 శాతానికిపైగా నైరుతి రుతుపవనాలే ఆధారం. మరో రెండు రోజులు వానలు ప్రస్తుతం రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం తగ్గిందని.. వచ్చే రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఆశాజనకంగా ఖరీఫ్ సాగు
సాక్షి, అమరావతి: మూడు వారాలుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు కాస్త ఊపందుకుంది. జూన్‌లో రుతుపవనాలు మొహం చాటేయడం.. ఆగస్టులో వర్షాల జాడే లేక కలవరపాటుకు గురైన రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పుణ్యమాని ఊపిరి పీల్చుకుంటున్నారు. లోటు వర్షపాతం భర్తీ కావడంతో వేసిన పంటలను కాపాడుకోవడంతోపాటు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై ఇస్తున్న విత్తనాలతో అవకాశం ఉన్నంత మేర పంటలను సాగు చేస్తున్నారు. ఫలితంగా 58 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు పూర్తయింది. సీజన్ ముగిసే నాటికి కనీసం 65 లక్షల నుంచి 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మాత్రం స్వల్పంగా లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ జిల్లాల్లో కూడా నెలాఖరు నాటికి లోటు వర్షపాతం భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 31 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు వరి సాధారణ విస్తీర్ణం 38.80 ఎకరాలు కాగా.. ఇప్పటికే 30.75 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అపరాలు సాధారణ విస్తీర్ణం 7.87 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 4.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో ప్రధానంగా 3.60 లక్షల ఎకరాల్లో కందులు, 40 వేల ఎకరాల్లో మినుములు సాగవుతున్నాయి. నూనెగింజల సాగు విస్తీర్ణం 17.40 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 8.80 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వీటిలో ప్రధానంగా 7.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 97వేల ఎకరాల్లో ఆముదం పంటలు సాగయ్యాయి. ఇతర పంటల విషయానికి వస్తే 10 లక్షల ఎకరాల్లో పత్తి, 2.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 95 వేల ఎకరాల్లో చెరకు ఇతర పంటలు సాగవుతున్నాయి. గతేడాది సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే ఈసారి వేరుశనగ, పత్తి తగ్గాయి. వరి సహా ఇతర పంటలు సాధారణ విస్తీర్ణంలోనే సాగవుతుండగా.. ఆముదం, సోయాబీన్, చిరుధాన్యాల సాగు కాస్త పెరిగింది. పరిస్థితిని ముందుగా అంచనా వేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేసింది. తొలుత 5.15 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై మరో 77,880 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు 7,521 క్వింటాళ్ల విత్తనాన్ని ఇప్పటికే రైతులు తీసుకున్నారు. లక్ష్యం దిశగా సాగు సెప్టెంబర్‌లో కురుస్తున్న వర్షాలతో లోటు వర్షపాతం భర్తీ అయి సాధారణ స్థాయికి చేరుకుంది. 3 వారాల్లో 15 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చాయి. సీజన్ ముగిసే నాటికి కనీసం మరో 5 నుంచి 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఆర్బీకేల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి. 8 లక్షల టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
62 ఏళ్ల తర్వాత..!
న్యూఢిల్లీ/ముంబై: దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలను 62 ఏళ్ల తర్వాత రుతుపవనాలు ఒకేసారి ఆదివారం తాకాయి. రెండు నగరాలపైకి ఇలా ఒకేసారి వ్యాపించడం 1961 జూన్ 21వ తేదీ తర్వాత ఇదే మొదటిసారని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీకి ముందుగా ఊహించిన దాని కంటే రెండు రోజులు ముందు రాగా, ముంబైకి మాత్రం రెండు వారాలు ఆలస్యంగా చేరుకున్నాయని వివరించింది. హరియాణా, చండీగఢ్, ఢిల్లీలపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. రుతుపవనాలు మహారాష్ట్రలోని మిగతాప్రాంతాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌వైపు కదులుతున్నాయని వివరించింది. రానున్న రెండు రోజుల్లో మిగతా ప్రాంతాలకూ విస్తరించేందుకు అనువైన పరిస్థితులున్నాయని తెలిపింది. సాధారణంగా రుతు పవనాలు కేరళను జూన్ 1న, ముంబైని జూన్ 11న, ఢిల్లీని జూన్ 27న తాకుతాయి. -
అదను దాట లేదు... ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ అదను దాటలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు భరోసా ఇచ్చింది. పంటలను విత్తుకోవడానికి సమయం దాటిపోలేదని విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.రఘురామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేశారు. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఈ నెల ఒకటిన కేరళను తాకవలసిన రుతుపవనాలు 8వ తేదీకి వచ్చాయని, ఈ సమయంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన తుపాను వల్ల మన రాష్ట్రానికి రుతుపవనాల రాక ఆలస్యమైందని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడతాయన్న ఆయన.. పంటలవారీగా రైతులకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఏ పంట? ఎప్పటివరకు ? వరి: ఇప్పుడు నార్లు పోసుకోవాలనుకునే రైతులు కేవలం స్వల్పకాలిక (125 రోజుల కన్నా తక్కువ) వరి రకాలను మాత్రమే విత్తుకోవాలి. నేరుగా విత్తే పద్ధతులపై (దమ్ముచేసి లేదా దమ్ము చేయకుండా) రైతాంగం శ్రద్ధ పెట్టాలి. పత్తి: జూలై 20 వరకు విత్తుకోవచ్చు.ౖ తేలిక నేలల్లో 50–60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60–75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. పత్తిలో అంతరపంటగా కంది మంచి లాభాలు ఇస్తుంది. కాబట్టి అంతర పంటగా కందిని సాగు చేపట్టాలి. కంది పంట: సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఆగష్టు 15 వరకు కందిని విత్తుకోవచ్చు. పెసర, మినుము, వేరుశనగ, పత్తి, ఆముదం సహా ఇతర పంటలతో అంతర పంటగానూ విత్తుకోవచ్చు. సోయాచిక్కుడు: జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే జూలై మొదటి వారంలో విత్తినా సోయాలో మంచి దిగుబడులు సాధించవచ్చు. మొక్కజొన్న: జూలై 15 వరకు విత్తుకోవచ్చు. నీటి ఎద్దడిని మొక్కజొన్న తట్టుకోలేదు. కాబట్టి బోదె, సాళ్ళ పద్ధతి ఆచరించడం ద్వారా పంటకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉంచవచ్చు. పెసర, మినుము: ఈ పంటలనుౖ జూలై 15 వరకు విత్తుకోవచ్చు. సరైన మొక్కల సంఖ్యను పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఇతర ఆరుతడి పంటలైన ఆముదం, పొద్దు తిరుగుడు, ఉలువలను జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఆందోళన పడవలసిన అవసరం లేదు. -
ద్రవ్యోల్బణంపై రుతుపవనాల ప్రభావం
ముంబై: భారత్‌లో రుతువవనాలు ఆలస్యం అవ్వడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని జర్మనీకి చెందని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. మే నెల ద్రవ్యోల్బణం డేటా శాంతించినట్టు అధికారిక గణాంకాలు చూపించినా కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324)లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది ఆర్బీఐ అంచనా 5.1 శాతానికి దగ్గరగానే ఉంది. విశ్లేషకులు అయితే 5 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘రుతుపవన వర్షాలు ప్రస్తుతం సాధారణ స్థాయికి 53 శాతం తక్కువగా ఉన్నాయి. వర్షపాతం బలహీనంగా ఉన్నప్పుడు ఆహారం ధరలు పెరిగిపోతాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. అందుకని, భారత్‌కు సంబంధించి ద్రవ్యోల్బణం రిస్క్‌ల విషయంలో ఇప్పటి వరకైతే సంతృప్తికి అవకాశం లేదు’’అని డాయిష్ బ్యాంక్ తెలిపింది. జూలై, ఆగస్ట్‌లో ఆహార ధరలు పెరగకుండా, అదృష్టం తోడయితేనే రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం, అంతకంటే తక్కువలో ఉండొచ్చని పేర్కొంది. వర్షాకాలంలో జూలై నెల కీలకమని, సాధారణంగా ఆహార ధరలు ఈ నెలలోనే ఎక్కువగా పెరుగుతాయని వివరించింది. చివరిగా 2009, 2014 సంవత్సరాల్లో వర్షాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో జూలైలోనే ధరలు అధికంగా పెరిగినట్టు గుర్తు చేసింది. ఇప్పటి వరకు నైరుతి రుతుపవన సీజన్లో 53 శాతం వర్షపాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం. కూరగాయాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటోల ధరలు రానున్న నెలల్లో గణనీయంగా పెరగొచ్చని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. 2023లో ఎల్‌నినో రిస్క్ ఉన్నందున వర్షాలు ఆలస్యంగా రావడం ద్రవ్యోల్బణం పరంగా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. వృద్ధిపైనా ప్రభావం రుతుపవనాలు బలహీనంగా ఉంటే అది దేశ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం చూపించొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. వర్షాలు నిరాశపరిచి, వ్యవసాయ వృద్ధి 2004, 2009, 2014 కరువు సంవత్సాల్లో మాదిరే 1 శాతం స్థాయిలో ఉంటే, జీడీపీ వృద్ధి 0.30 శాతం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. -
ఏపీ ప్రజలకు తీపికబురు.. మరో 3 రోజుల్లో..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి అమరావతి: నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు తీపికబురు. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 18–21 మధ్య రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో 19 నుంచి చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని వెల్లడించారు. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు. కాగా రాష్ట్రంలో కొన్నాళ్లుగా ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఇంకా భగ్గుమంటూనే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవాల్సిన తరుణంలో మరింతగా సెగలు కక్కుతున్నాయి. సాధారణం కంటే 6 నుంచి 10 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. ఇలా మూడు వారాలుగా తీవ్ర వడగాడ్పులు వీయని రోజు లేదు. ఏరోజుకారోజే ఉష్ణతాపం తగ్గుతుంది.. ఇక వాతావరణం చల్లబడుతుంది అని ఆశించిన వారికి ఆశాభంగమే అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అవి మరింత తీవ్రరూపం దాల్చి ఏకంగా 47 డిగ్రీలకు చేరువగా రికార్డయ్యాయి. ఈ వేసవి సీజనులో తొలిసారిగా కాకినాడ జిల్లా సామర్లకోటలో 46.8, తునిలో 46.4 (ఇది సాధారణంకంటే 10.5 డిగ్రీలు అధికం) డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా తూర్పు గోదావరి, ప్రకాశం, విజయనగరం, తిరుపతి, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పల్నాడు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో 45–46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపాయి. శుక్రవారం రాష్ట్రంలో 370 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 132 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. నేడు 264 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు రాష్ట్రంలో మరో మూడు, నాలుగు రోజులు సెగలు కొనసాగనున్నాయి. శనివారం బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లోని 264 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 42 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 203 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ పరిస్థితుల దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భవన నిర్మాణ కారి్మకులు, ట్రక్ డ్రైవర్లు, రైతులు, వ్యవసాయ కూలీలు వడగాడ్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించారు. వాయవ్య గాలుల వల్లే.. కాగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంతలా అట్టుడికిపోవడానికి వాయవ్య గాలులే కారణమని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి రాజస్థాన్ నుంచి వేడితో కూడిన పొడిగాలులు వీస్తున్నాయని, అవి దిశ మార్చుకుని నైరుతి లేదా దక్షిణ గాలులు వీచే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆరు రోజుల క్రితం రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని పుట్టపర్తి, శ్రీహరికోటలకు చేరుకుని అక్కడే తటస్థంగా ఉండిపోయాయి. దీంతో రుతుపవనాల విస్తరణ జరగక రాష్ట్రంలో వర్షాలు కురవలేదు.. ఉష్ణోగ్రతలూ తగ్గుముఖం పట్టలేదు. -
మండే ఎండలు.. వడగాల్పులు
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రధానంగా అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా కరీంనగర్ జిల్లా తంగులలో 45.4 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 42.2 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 25.2 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. -
ఎదురుచూపులు
ధర్మం నాలుగుపాదాలా నడిచే రాజ్యంలో క్రమం తప్పకుండా వానలు కురుస్తాయని ప్రతీతి. ఇప్పుడు ధర్మం ఎన్ని పాదాలతో నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధర్మం ఎంత కుంటి నడక నడుస్తున్నా, ఈ భూమ్మీద చెట్టూ చేమా, పిట్టా పిచుకా, పశువులూ మనుషులూ మనుగడ సాగించాలంటే తప్పకుండా వానలు కురవాల్సిందే! ఈసారి వేసవి తన తీవ్రతను తారస్థాయిలో చూపుతోంది. ఎండలు మండి పడుతున్నాయి. సూర్యుడింకా నడినెత్తికి రాకముందే నడివీథుల్లో నిప్పులు చెరుగుతున్నాయి. రుతు పవనాలు ఇప్పటికే కేరళ తీరానికి చేరుకున్నాయి. నేడో రేపో ఇక్కడకూ చేరుకుంటాయి. వానలు కురిపిస్తాయి. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం జనాలు చాతకాల్లా వానల కోసం ఎదురు చూస్తున్నారు. ఉక్కపోతలతో అల్లాడిన జనాలకు నాలుగు చినుకులే ఊరట! వాన చినుకుల కోసం నెర్రెలువారిన నేల ఆవురావురుమని ఎదురుచూస్తుంది. మన ప్రాచీన సాహిత్యంలో చాతక పక్షులు ఎదురుచూపులకు ప్రతీకలు. చాతక పక్షులు వాన చినుకుల నీటిని మాత్రమే తాగుతాయని, అందుకే అవి వానల కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటాయని పురాణ సాహిత్యం చెప్పేమాట! శాస్త్రీయ వాస్తవాలు మరోలా ఉన్నా, మన కవులు చాతకపక్షులను ఎదురుచూపులకు ప్రతీకగానే ఎంచుకున్నారు. ‘హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః/ కోకః కోకనదప్రియ ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా/ చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో/ గౌరీనాథ భవత్పదాబ్జ యుగళం కైవల్య సౌఖ్యప్రదం’ అన్నారు ఆదిశంకరులు. తామరతూళ్లనే ఆహారంగా తినే హంసలు తామరలతో నిండిన సరోవరాల కోసం ఎదురుచూస్తాయి. వాన చినుకులను మాత్రమే తాగే చాతకాలు వానలు కురిపించే కారుమబ్బుల కోసం ఎదురుచూస్తాయి. వెన్నెలనే ఆహారంగా తీసుకునే చాతకాలు చంద్రోదయం కోసం ఎదురుచూస్తాయి. అలాగే అసలైన భక్తుడు పరమేశ్వరుడి సాన్నిధ్యం కోసం ఎదురుచూస్తాడట! శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణావతారం దాల్చి భూలోకంలో పుట్టాడు. అప్పుడు వైకుంఠవాసులు శ్రీమహావిష్ణువు రాక కోసం లిప్త ఒక యుగంగా నిరీక్షించినట్లు దివాకర్ల వెంకటావధాని తన ‘కలి పరాజయము’లో వర్ణించారు. నిజానికి మనుషుల బతుకులే ఎదురుచూపుల మయం. బడికి వెళ్లే వయసులో సెలవుల కోసం ఎదురుచూపులు. కాలేజీ కుర్రకారుకు ప్రేమికుల కోసం ఎదురుచూపులు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూపులు. ఉద్యోగులకు నెలకోసారి వచ్చే జీతాల కోసం ఎదురుచూపులు. జబ్బుచేసి ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యుడి దర్శనం కోసం ఎదురుచూపులు. జీవితంలో సింహభాగం ఇలా ఎదురుచూపులతోనే గడిచిపోతుంది. ‘ఒకవేళ ఏవైనా ఎదురుచూపులు నెరవేరకపోతే ఆశ్చర్యపోవద్దు. దాన్నే మనం జీవితమంటాం’ అని ఆస్ట్రియన్ సంతతికి చెందిన బ్రిటిష్ మానసిక విశ్లేషకురాలు అనా ఫ్రాయిడ్ వ్యాఖ్యానించింది. జీవితంలో చాలా ఎదురుచూపులు ఉంటాయి. సాధారణంగా వాటిలో నెరవేరనివే ఎక్కువ! ఎదురుచూపులు నెరవేరినప్పుడు సంతోషాన్నిస్తాయి. నెరవేరని ఎదురుచూపులు నిరాశలో ముంచేస్తాయి. ‘ఈ లోకంలో మనుషులు భ్రమల్లో బతుకుతూ ఎల్లప్పుడూ ఏదో ఒకదాని కోసం ఎదురుచూస్తూనే ఉంటారు– ఒక్క ముక్కలో చెప్పాలంటే, కోరికలతో సతమతమవుతుంటారు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో ఎవరి ఎదురుచూపులు వారికి ఉండనే ఉంటాయి. అయితే, సాహిత్యంలో ప్రేయసీ ప్రియుల ఎదురుచూపులకే అమిత ప్రాధాన్యమిచ్చారు మన కవులు. భావకవిత్వం సాహితీలోకాన్ని కమ్మేసిన కాలంలో మన కవులు ఊహాసుందరుల కోసం ఎదురుచూపులు చూస్తూ, వీసెల కొద్ది విరహగీతాలు రాశారు. ‘ప్రబల కష్ట పరంపరల్ ప్రతిఘటించి/ నిల్చిపోయితి నీకయి నేటివఱకు!/ ఈ నిరీక్షణ పరిణామ మేమి యగునొ?’ అని చివరకు శ్రీశ్రీ కూడా తన గీతపద్యాలలో ఎదురుచూపుల వగపును వడబోశారు. ‘చిన్ని చిన్ని చిన్ని చెట్ల/ వన్నె వన్నె వన్నె పూల/ ఏరి ఇంద్రచాప మట్లు/ కట్టినాను నీకు మాల/ కాని, ఇచటికి ప్రియురాల!/ నీవింకను రావదేల?’ అంటూ పఠాభి తన ‘నిరీక్షణ’లోని నిట్టూర్పులతో సెగలు రేపారు. అష్టవిధ నాయికలలో విరహోత్కంఠిత తన నాయకుని కోసం అనుక్షణం ఎదురుచూస్తూ, విరహతాపాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ‘భర్త ఆఫీసునన్ బందిౖయె పోయినన్/ ఎదురు తెన్నులు జూచు నింతి యిపుడు/... కాంతుడు రాకున్న క్షణము లుత్కంఠమ్మె/ భారాన క్షణములు కదలునెపుడు/... వేగిపోవును తన భర్త జాగుజేయ/నామె యందమైన కనులె యలసిపోవు’ అంటూ ఆధునిక విరహోత్కంఠితల ఎదురుచూపుల విరహతాపాన్ని కొనకళ్ల ఫణీంద్రరావు చమత్కారంగా రాశారు. ఆముష్మికుల ఎదురుచూపులు భగవత్ సాన్నిధ్యం కోసం కావచ్చు, విరహిణుల ఎదురుచూపులు తమ నాయకుల కోసం కావచ్చు, భావకవుల ఎదురుచూపులు ఊహాసుందరీమణుల కోసం కావచ్చు గాని, సామాన్యులు మాత్రం ఎప్పుడొస్తాయో తెలియని మంచిరోజుల కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. నడివేసవిలో వానల కోసం ఎదురుచూస్తే, కొద్దిరోజులకైనా నాలుగు చినుకులు కురుస్తాయేమో గాని, సామాన్యులు మంచిరోజుల కోసం ఎన్నాళ్లు ఎదురుచూపులు చూడాలో ఎవరూ చెప్పలేరు. అయినా, జనాలు ఎంతో ఆశతో మంచిరోజుల కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. మనసులో ఆశల దీపాలు వెలుగుతున్నంత సేపూ ఎదురుచూపులు బాధించవు. ఎదురుచూపులు చూసే శక్తి కోసమైనా ఆశలను అడుగంటిపోకుండా కాపాడుకోవాలి. -
ఏపీకి చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : కేరళలోకి ప్రవేశించిన రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. గత 24 గంటల్లో వాటి గమనంలో వేగం పెరగడంతో రెండు రోజుల్లోనే అవి రాయలసీమను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి రుతుపవనాలు ఆంధ్రా ప్రాంతానికి రావడానికి సాధారణంగా 4 రోజులు పడుతుంది. ఇప్పుడు ఒకరోజు ముందుగానే అంటే ఆదివారానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను ప్రభావంతో రుతుపవనాలు బంగాళాఖాతంలో శ్రీలంక కింది భాగం నుంచి విస్తరిస్తున్నాయి. 3 రోజుల్లోనే అవి పైభాగానికి వచ్చి శుక్రవారం తమిళనాడు, కర్ణాటక వరకు విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉంది. నిప్పుల వానలా రాష్ట్రంలో ఎండలు రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి పూర్తిగా విస్తరించే వరకు ఎండల తీవ్రత కొనసాగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు నిప్పుల వానను తలపిస్తున్నాయి. జూన్ రెండో వారం మొదలైనా భానుడి ప్రతాపం కొనసాగుతోంది. రోహిణి కార్తె వెళ్లాక వచ్చే మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడుతుంది. కానీ ప్రస్తుతం మృగశిర కార్తె ప్రవేశించినా రోహిణి కార్తె ఎండలనే తలపిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43–45 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పలుచోట్ల వడగాడ్పులు, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. కోస్తాలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం ఎగువ ప్రాంతంలో ఉన్న గాలుల్లో కూడా పొడి శాతం ఎక్కువ ఉంది. దీనివల్లే ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ఏప్రిల్‌లో వచ్చిన మోకా తుపాను బంగాళాఖాతంలో ఉన్న తడి గాలులన్నింటినీ లాగేసుకోవడంతో ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను వల్ల కొంత వేడి వాతావరణం ఉంటుంది. దీనికితోడు రాజస్థాన్ నుంచి వచ్చే గాలులు కూడా పొడిగానే ఉంటున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 45.5 డిగ్రీలు నమోదైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, కాకినాడ జిల్లా కరపలో 45.3, తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 45.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కొండాయిగూడెంలో 45.2 డిగ్రీలు, గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
మిక్స్డ్ వెదర్‌తో మహా డేంజర్! డాక్టర్ల కీలక సూచనలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వేసవి కాలం చివరి రోజుల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రమంతా ఉదయం నుంచే 40 నుంచి 45 డిగ్రీల ఎండలు హీటెక్కిస్తున్నాయి. వడగాడ్పులతోపాటు అప్పుడప్పుడు సాయంత్రం అకస్మాత్తుగా గాలివాన కురియడంతో వాతావరణం చల్లబడుతోంది. అదీగాక వేసవి సీజన్ ముగిసిపోతుండటంతో ఎండలు చండప్రచండంగా మారుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ నివేదికలున్నా.. ప్రతీ ఏడాది ఇవి ఆలస్యంగానే వస్తున్నాయి. అందువల్ల మరికొన్ని రోజులపాటు ఇలాంటి ‘మిక్స్డ్ వెదర్’తోనే ప్రజలు నెట్టుకురాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాతావరణంలో బ్యాక్టీరియాలు, వైరస్లు చురుగ్గా ఉండి దాడి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా మసలుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలి అటు వేడి, ఇటు చల్లదనం వంటి మధ్యస్థ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు యాక్టివ్‌గా ఉంటాయి. మన శరీరాలు కూడా అటు వేడికి, ఇటు చల్లటి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అలాంటి సమయం కోసం వైరస్లు, బ్యాక్టీరియాలు వేచిచూసి దాడిచేస్తాయి. టైఫాయిడ్, సీజనల్ జ్వరాలు, గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లుయెంజా వైరస్ల వంటివి వచ్చే అవకాశాలు అధికమవుతాయి. ఇలాంటి వాటికి ఆహారాన్నే ఔషధంగా మార్చుకుని తిప్పికొట్టాలి. ఫ్రైడ్ పదార్ధాలు, జంక్‌ఫుడ్ వంటివి మానేయాలి. అప్పటికప్పుడు వేడిగా తయారుచేసిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీరు లేదా పరిశుభ్రమైన నీటిని తాగాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే వ్యాధినిరోధక« శక్తిని పెంచుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి తీవ్ర ఎండ వేడిమి నుంచి చల్లటి వాతావరణానికి మారినపుడు అనేక జబ్బులు వ్యాపిస్తాయి. ఇంకా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నందున వడదెబ్బ తగులకుండా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగడంతోపాటు సహజమైన పళ్లరసాలు వంటివి తీసుకోవాలి. దోమలు, ఎలుకలు వంటి వాటి ద్వారా నీరు.. గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతాయి. డెంగీ, మలేరియా వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం నీటిలో తడిచిన ప్రతీసారి ఫ్రెష్‌గా స్నానం చేయాలి. ఏడాదికోసారి ఫ్లూవ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. -
మాన్సూన్ బూస్ట్: సెన్సెక్స్ దౌడు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో దూకుడు ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంతాకేలతో భారీగా లాభపడిన సెన్సెక్స్ ఆ జోరును కంటిన్యూ చేసింది. ఒక దశలో1110 పాయింట్లకు పైగా ఎగిసి 56 వేల ఎగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 16650 కీలక మద్దతు స్థాయికి ఎగువన పటిష్టంగా కదలాడింది. అయితే మిడ్‌సెషన్‌నుంచి అమ్మకాల దోరణి ఫలితంగా సెన్సెక్స్ సెన్సెక్స్ 1041 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్లు లాభంతో స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళకు రానున్నాయని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ, ఆటో ఐటీ రంగాలు భారీ లాభాలనార్జించాయి. 4.22శాతం లాభంతో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్‌గా నిలవగా, రియలన్స్, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం, యూపీఎల్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డిఎఫ్‌సి, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టి, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, టైటన్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఎన్ఎస్ఈలో కోటక్ మహీంద్ర, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, ఓఎన్జీసీ, డా. రెడ్డీస్, ఐటీసీ బాగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభపడింది. ఈక్విటీ మార్కెట్ల దన్నుతో ఆరంభంలోనే 77.46 వద్ద 12 పైసలు ఎగిసింది. చివరికి 77.50 వద్ద ముగిసింది. మే 20తో వారంలో దేశీయ విదేశీ మారక నిల్వలు పది వారాల పాటు క్షీణించిన తర్వాత తొలిసారి పుంజుకున్నాయి. 4 బిలియన్ డాలర్ల పైగా పెరిగాయి. -
మరో ఐదురోజుల్లో రుతుపవనాలు ఏపీలో ప్రవేశించే అవకాశం
-
నీటి సంరక్షణ అందరి బాధ్యత
న్యూఢిల్లీ: దేశంలో నీటి సంరక్షణ అందరి బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రుతుపవనాలు ప్రవేశించడానికి ముందే చెరువులు, కాల్వలు, సరస్సుల్లో పూడికలు తీసి ప్రతీ వాన చినుకుని సంరక్షించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని వాన చినుకులు ఎప్పుడు పడినా, ఎక్కడ పడినా బొట్టు బొట్టు ఒడిసిపట్టి సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాల్వలు నిర్వహణపై కేంద్ర జల మంత్రిత్వ శాఖ క్యాచ్ ది రెయిన్ అనే 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన బబితా రాజ్పుట్ నీటి సంరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని అభినందించారు. తమ గ్రామంలో ఎండిపోయిన చెరువులకి జలకళ తీసుకువస్తున్న ఆమె కృషి అందరికీ ఆదర్శమన్నారు. తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది ప్రపంచంలోనే అత్యంత పురాతమైన భాషల్లో ఒకటైన తమిళం నేర్చుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉందని ప్రధాని∙మోదీ అన్నారు. తమిళం చాలా అందమైన భాషని, సుసంపన్నమైన సాహి త్యం ఉన్న ఆ భాషని నేర్చుకోలేకపోవడం లోటుగా ఉంటుందని చెప్పారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు అపర్ణ రెడ్డిజీ అడిగిన ఓ చ్రిన్న ప్రశ్న అయినప్పటికీ తనని వెంటాడిందని అన్నారు. ‘‘మీరు చాలా ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానిగా కూడా ఉన్నారు. జీవితంలో ఏదైనా మిస్ అయ్యారా’’అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమైందన్నారు. ఆ తర్వా త ఆలోచిస్తే తమిళ భాషని నేర్చుకోవడం మిస్ అయినట్టుగా అనిపించిందని ప్రధాని వివరించారు. పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి ప్రస్తావన ఈ సందర్భంగా ప్రధాని హైదరాబాద్ రైతు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెంకటరెడ్డి లాంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందాలని సూచించారు. డి–విటమిన్ అధికంగా ఉండే వరి, గోధుమ రకాలను వెంకటరెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థ నుంచి పేటెంట్ కూడా పొందారని తెలిపారు. ఆయనను గత ఏడాది పద్మశ్రీతో గౌరవించుకోవడం గర్వకారణమన్నారు. -
కోస్తాలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలుల వల్ల రుతుపవనాలు కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోకి వచ్చాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఉత్తర తమిళనాడు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
పెరిగిన ఎండల తీవ్రత
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం కూడా కొనసాగింది. రుతుపవనాలు బలహీనపడడంతో ఎండలు మండుతున్నాయి. అక్కడక్కడా వర్షాలు పడినా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. అమరావతిలో 36, విజయవాడలో 35.5, కడపలో 35.9, గుంటూరులో 36, రాజమహేంద్రవరంలో 36.2, ఏలూరులో 34.6, విజయనగరంలో 34, చిత్తూరులో 33.9, విశాఖపట్నంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు పలుచోట్ల వర్షాలు ► ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ► దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ► రానున్న 48 గంటల్లో ఉత్తర దిశ వైపు ప్రయాణిస్తూ అల్పపీడనం బలహీనపడుతుంది. ► దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
ఎకానమీకి వ్యవసాయం ఆశాకిరణం
ముంబై: దేశవ్యాప్తంగా బలంగా విస్తరించిన రుతుపవనాలు, మంచి వర్షపాతంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల ఉత్పత్తి భారీగా పెరగనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడి 5–6 శాతం ఎక్కువగా ఉంటుందని, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో, ఉత్పాదకత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయం బలంగా ఉండడం అన్నది కరోనాతో బలహీనపడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ 21 నాటికి దీర్ఘకాల సగటు కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు.. దీని ఫలితంగా చాలా రాష్ట్రాల్లో పంటల విత్తుకు దోహపడినట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. ఖరీఫ్ సీజన్ 2020లో 109 మిలియన్ హెక్టార్లలో 2–3 శాతం అధికంగా విత్తు వేయడం ఉంటుందని పేర్కొంది. వరి సాగు పెరగనుందని, మంచి వర్షాలకు తోడు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వలసపోవడం దోహదపడే అంశాలుగా తెలిపింది. లాభదాయకత కూడా ఎక్కువే.. కరోనా కారణంగా సరఫరా పరంగా ఏర్పడిన అవాంతరాలతో రైతులు అధికంగా పాడైపోయే గుణమున్న టమాటా వంటి వాటికి బదులు తక్కువ పాడైపోయే స్వభావం కలిగిన వంకాయ, బెండకాయ వంటి పంటలకు మళ్లినట్టు క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగు భారీగా పెరగడం వల్ల పలు నిత్యావసర వస్తువల ధరలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగు లాభదాయకత మొత్తం మీద 3–5% అధికం కానుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. సాగు విస్తీర్ణంపెరగడం, అధిక ఉత్పాదకత, కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ కొనుగోళ్లు మద్దతునిస్తాయని వివరించింది. యాపిల్ సాగులో లాభదాయకత మెరుగుపడుతుందని, పత్తి, మొక్కజొన్న ధరలపై ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. ఏపీ తదితర రాష్ట్రాల్లో జోరుగా వరిసాగు కార్మికులు వలసపోవడం వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులే నేరుగా విత్తనాలను వేయనున్నారు. ఇది తక్కువ ఉత్పాదకతకు దారితీయనుంది. కానీ, అదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కార్మికులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల విత్తడంలో వృద్ధి కనిపించనుంది. దీంతో మొత్తం మీద గతేడాది కంటే ఖరీఫ్ సీజన్ 2020లో వరి ఉత్పాదకత పెరగనుంది. ఉత్తర భారత రైతులకు ఖరీఫ్ సీజన్ 2020 ఎంతో లాభాన్ని మిగల్చనుంది. పంటల సాగు మిశ్రమంగా ఉండడానికి తోడు ప్రభుత్వ కొనుగోళ్లు అధికంగా ఉండడం వల్లే ఇది సాధ్యం కానుంది. – హేతల్ గాంధీ, క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ -
నేడు పలుచోట్ల భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రుతుపవనాల కారణంగా ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అదే జిల్లా ఎల్లారెడ్డిలో 8, బాన్సువాడలో 7, లింగంపేటలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలావుండగా తెలంగాణలో జూన్ ఒకటో తేదీ నుంచి 22వ తేదీ వరకు 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అందులో నిర్మల్ జిల్లాలో అత్యంత ఎక్కువగా 78 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. జగిత్యాల జిల్లాలో మాత్రం 5 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. రుతుపవనాలు మొదలైన రోజు రంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే ఏకంగా 479 శాతం అధిక వర్షపాతం నమోదైంది.