NPS
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ము
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై రిటైర్మెంట్ సొమ్ము భారీగా పెరగనుంది. ఈ మేరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో నిబంధనలను ప్రభుత్వం సవరించింది. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత విషయాలను నియంత్రించడానికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021ని నోటిఫై చేసింది.కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ఎన్పీఎస్ కింద ఉద్యోగి ప్రాథమిక వేతనంలో యజమాని చెల్లించే మొత్తాన్ని 14 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రతిపాదించారు. కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్,పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పెన్షనర్ల సంక్షేమ విభాగం ఎన్పీఎస్ కింద చెల్లించే మొత్తాలను వివరిస్తూ కొత్త ఆఫీస్ మెమోరాండమ్‌ను విడుదల చేసింది.సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021లోని రూల్ 7 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగి జీతంలో 14 శాతాన్ని వారి వ్యక్తిగత పెన్షన్ ఖాతాకు ప్రతి నెలా జమ చేస్తుంది. మెడికల్ లీవ్, ఉన్నత విద్య కోసం వెళ్లడం కొన్ని సందర్భాలలో మినహా ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించని సమయంలో ప్రభుత్వం కూడా తన వంతు మొత్తాన్ని చెల్లించదు.ఇక ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ ఉద్యోగికి చెల్లించే జీవనాధార భత్యంపై ఆధారపడి ఉంటాయి. సస్పెన్షన్ కాలం తరువాత ఒకవేళ అది జీతం చెల్లించాల్సిన డ్యూటీ లేదా సెలవుగా వర్గీకరిస్తే ఆ మేరకు ప్రభుత్వం చందాలను సర్దుబాటు చేస్తుంది. ఉద్యోగులు ఫారిన్ సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎన్పీఎస్ చందాలకు సంబంధించి కూడా మెమోరాండం వివరించింది. ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి. -
NPS Vatsalya: పిల్లల కోసం ప్రత్యేక పథకం ప్రారంభం
పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఈ పెన్షన్ ఖాతాలను తెరవచ్చు. 2024-25 యూనియన్ బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ మైనర్ పిల్లలకు పెన్షన్ పొదుపును ప్రారంభించచ్చు. ఇది భారతీయ పౌరులతోపాటు ఎన్ఆర్ఐలకు కూడా సౌకర్యవంతమైన దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా పిల్లలకి 18 ఏళ్లు నిండగానే ప్రామాణిక ఎన్పీఎస్ ఖాతాగా మారుతుంది. తద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం నిరంతర పెట్టుబడిని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్లు లేదా ఈ-ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబై సర్వీస్ సెంటర్లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కొత్త ఖాతాలను నమోదు చేసి సింబాలిక్ ప్రాన్ (PRAN-పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) కార్డ్‌లను జారీ చేసింది. ఐసీఐసీఐ, యాక్సిస్‌తో సహా ప్రధాన బ్యాంకులు ఈ పథకాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చాయి.వీటిలో పెట్టిన మొత్తాన్ని ఈక్విటీలు, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా వచ్చే రిటర్న్స్‌ను ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్పస్ ఫండ్‌ను ఖాతాదారు 60 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది. అయితే మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత విద్య, అనారోగ్యం వంటి కారణాలకు పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. -
కొత్త పెన్షన్ విధానానికి కేంద్రం ఆమోదం.. కీలకాంశాలు..
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్)ను అమలు చేసేలా విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఎస్ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. దాంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) స్థానంలో కొత్త యూపీఎస్‌ను అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.యూపీఎస్ విధానంలోని కీలకాంశాలు..ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం జమచేసి పెట్టుబడి పెట్టేది. ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారు. అయితే యూపీఎస్‌లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కనీస సర్వీసు 25 సంవత్సరాలు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హులు. ఒకవేళ 25 ఏళ్లు పూర్తి అవ్వకపోతే దామాషా ప్రకారం 10-25 ఏళ్లలోపు పెన్షన్ లెక్కించి ఇస్తారు.కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటేనే యూపీఎస్ కిందకు వస్తారు. అలా కేవలం పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కనిష్ఠంగా రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆపై 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. 25 ఏళ్ల సర్వీసు దాటితే పూర్తి పెన్షన్ వస్తుంది.ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కాబట్టి యూపీఎస్ కింద ఇచ్చే పెన్షన్‌లోనూ ఏటా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఇస్తారు. దాంతో కిందటి ఏడాది కంటే ప్రస్తుత ఏడాదికి ఎక్కువ పెన్షన్ అందుతుంది.యూపీఎస్ విధానంలో చేరిన పెన్షనర్లు మరణిస్తే అప్పటివరకు తాము తీసుకుంటున్న పెన్షన్‌లో 60 శాతం వారి భాగస్వామికి ఇస్తారు.యూపీఎస్ నిబంధనల ప్రకారం 1/10వ వంతు సుపర్ అన్యూయేషన్(మొత్తం సర్వీసును లెక్కించి చెల్లించే నగదు) చెల్లిస్తారు. బేసిక్ వేతనంలో 1/10వ వంతును పరిగణనలోకి తీసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సర్వీసు పూర్తయిన వెంటనే ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ చెల్లింపునకు, పెన్షన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.కొత్త యూపీఎస్ విధానానికి మారాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాలను అనుసరించి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు సిద్ధంగా ఉండాలి.నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే యూపీఎస్ కొంత మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను భర్తీ చేయదని కొందరు చెబుతున్నారు. ఇదిలాఉండగా, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతుండగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తిరాష్ట్రాల వాటాపై పర్యవేక్షణయూపీఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం కోరుతోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో కొన్ని రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటాను జమ చేయకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కేవలం గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బుమీదే ఆధారపడే ఉద్యోగులకు కొత్త విధానం కొంత ఊరట చేకూరుస్తుందనే వాదనలున్నాయి. కానీ ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలు తప్పకుండా వాటి వాటాను సైతం జమచేసేలా పర్యవేక్షణ ఉండాలని విశ్లేషకులు కోరుతున్నారు. -
ఎన్పీఎస్ కొత్త రూల్.. ఎలా లాగిన్ చేయాలో తెలుసా..
కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో అనేక ఆర్థిక సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్పీఎస్) లాగిన్ అయ్యే విధానంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అన్ని అకౌంట్లు ఆధార్‌తో లింక్ అవుతున్న తరుణంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్‌ను ప్రవేశపెట్టింది. దాంతో పాత విధానంలోకాకుండా కొత్త పద్ధతిలో ఎన్పీఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా లాగిన్ చేయాలంటే.. ఎన్పీఎస్ వెబ్సైట్లో పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్)/ ఇంటర్నెట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐపీఐఎన్)తో లాగిన్ కావాలి. తర్వాత పీఆర్ఏఎన్/ ఐపీఐఎన్ టాబ్‌పై క్లిక్ చేయాలి. ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద ఉండే క్యాప్చా కోడ్‌ను టైప్ చేయాలి. తర్వాత తెరుచుకునే విండోలో ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే ఎన్పీఎస్ ఖాతా ఓపెన్ అవుతుంది. ఇదీ చదవండి: ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం -
NPS ఖాతాను తిరిగి ఎలా యాక్టివేట్ చేయాలి
-
ఎన్పీఎస్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడమెలా?
నేను 2019లో పన్ను ఆదా కోసం ఎన్పీఎస్ సాధనంలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుందామని అనుకుంటున్నాను. ఎలా ఉపసంహరించుకోవాలి? – కల్పేష్ వర్మ ఎన్పీఎస్ టైర్–1 పెట్టుబడులకు 60 ఏళ్లు వచ్చే వరకు లాకిన్ ఉంటుంది. ఈ లోపే ఎన్పీఎస్ నుంచి బ్యాలన్స్‌ను ఉపసంహరించుకోవాలంటే, అందుకు కొన్ని షరతులు వరిస్తాయి. ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు వంటి అవసరాలకు ఎన్పీఎస్ నిధి నుంచి కేవలం 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అది కూడా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావాలి. మీరు 2019లో ఇన్వెస్ట్ చేశారంటున్నారు. మూడేళ్ల కాలం పూర్తయింది. కనుక సమకూరిన నిధి నుంచి 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ ఖాతాను శాశ్వతంగా మూసివేయదలిస్తే, ఆరంభించి పదేళ్లు ముగిసిన తర్వాతే అది సాధ్యపడుతుంది. పదేళ్లలో ఏర్పడిన నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో నెలవారీ పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎన్పీఎస్ ఖాతాలో పదేళ్ల తర్వాత కూడా మొత్తం నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే, అప్పుడు నూరు శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగేందుకు సీఆర్ఏ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఉపసంహరణకు కారణాన్ని పేర్కొనాలి. బ్యాంక్ అకౌంట్, కాంటాక్ట్ వివరాలను ధ్రువీకరించాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. అప్పటి నుంచి ఐదు పనిదినాల్లో మీ ఉపసంహరణ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది. ఇతర మార్గాలు లేకపోతే తప్ప, ముందస్తు ఉపసంహరణను ఎంపిక చేసుకోవద్దన్నదే మా సలహా. విశ్రాంత జీవనం కోసం ఉద్దేశించిన నిధిని ఉపసంహరించుకోకుండా నిరాశ పరచడమే ఈ పథకంలోని షరతుల ఉద్దేశ్యం. ఎన్పీఎస్ పెట్టుబడుల్లో గరిష్టంగా 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రిటైర్మెంట్ కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు సహేతుకమేనని చెప్పుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
Tax saving: ..ఇలా చేస్తే అదనంగా పన్ను ఆదా!
పన్ను ఆదా కోసం సెక్షన్ 80సీ కింద ఇప్పటికే రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. దీనికి అదనంగా పన్ను ఆదా కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – రాకేశ్ వర్మ ఐటీ చట్టం సెక్షన్ 80సీ కింద గరిష్ట పరిమితి రూ.1.5 లక్షల మేరకు ఇప్పటికే మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అప్పుడు అదనపు పన్ను ఆదా కోసం మీ ముందున్న మార్గం నేషనల్ పెన్షన్ సిస్టమ్ టైర్–1. రిటైర్మెంట్ పథకమైన ఎన్‌పీఎస్‌లో గరిష్టంగా రూ.50,000 పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 80సీకి అదనంగా కల్పించిన ప్రయోజనం ఇది. విశ్రాంత జీవనం కోసం నిధి ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యాన్ని సాకారం చేసేందుకు వీలుగా 2004లో కేంద్ర సర్కారు ఎన్పీఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 18–70 ఏళ్ల వయసు పరిధిలోని ఎవరైనా ఇందులో చేరేందుకు అర్హులే. ఒక ఏడాదిలో ఇందులో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. ఇందులో చేసిన పెట్టుబడి ఏదైనా కానీ 60 ఏళ్ల వరకు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. అంటే అప్పటి వరకు లాకిన్ అయి ఉంటుంది. కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైన సందర్భాల్లోనే దీన్నుంచి ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. ఇటీవలి తీసుకొచ్చిన సవరణ నేపథ్యంలో 60 ఏళ్లు నిండిన తర్వాత.. నెల లేదా త్రైమాసికం లేదా ఏడాదికోసారి క్రమంగా కావాల్సినంత ఉపసంహరించుకోవడానికి వీలు ఏర్పడింది. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే వారు 2 రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఆటో లేదా యాక్టివ్. ఆటో ఆప్షన్ ఎంపిక చేసుకోవడం కొంత బెటర్. ఈ ఆప్షన్లో ఈక్విటీలకు కేటాయింపులు ఇన్వెస్టర్ వయసు ఆధారంగా మారుతుంటాయి. ఉదాహరణకు ఇన్వెస్టర్ వయసు 35 ఏళ్లు అనుకుందాం. 100 నుంచి 35 ఏళ్లు తీసివేయగా, మిగిలిన మేర (65%) ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఇన్వెస్టర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. యాక్టివ్ ఆప్షన్లో ఈక్విటీలకు గరిష్టంగా 75% వరకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఈక్విటీ కేటాయింపులు పోను, మిగిలినదాన్ని డెట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు కేటాయించొచ్చు. - సమాధానం: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పన్ను ఆదాలో ఎన్పీఎస్ టాప్.. రెండో స్థానంలో ఈఎల్ఎస్ఎస్
న్యూఢిల్లీ: పన్ను ఆదా కోసం ఏ సాధనంలో ఇన్వెస్ట్ చేయాలా? అన్న సందేహించే వారికి ఎన్పీఎస్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు.! పన్ను ఆదాతోపాటు ఉద్యోగ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఎన్పీఎస్ ఒక మంచి మార్గం అవుతుంది. రాబడులు ఒక్కటే కాకుండా, పెట్టుబడులకు భద్రత, సౌలభ్యం, లిక్విడిటీ, వ్యయాలు, పారదర్శకత, పెట్టుబడుల్లో సౌలభ్యం తదితర అంశాల పరంగా ఎన్పీఎస్ ముందున్నట్టు ఓ సంస్థ నిర్వహించి అధ్యయనంలో తెలిసింది. వరుసగా రెండో ఏడాది పన్ను ఆదాకు టాప్ సాధనంగా నిలిచింది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. అదనంగా, సెక్షన్ 80సీసీడీ (1బి) కింద రూ.50,000ను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ఆదా పొందొచ్చు. ఇక కంపెనీ ఉద్యోగి తరఫున ఎన్‌పీఎస్‌లో జమలపైనా సెక్షన్ 80సీసీడీ (2) కింద.. వేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్ ద్వారా ఈక్విటీలకు 75 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఈక్విడి, డెట్ ఎంపికల ఆధారంగా ఇందులో సగటు వార్షిక రాబడులు 8–16 శాతం మధ్య ఉంటాయి. పన్ను ఆదా, లిక్విడిటీ, రాబడులు వీటన్నింటి విషయంలో ఎన్పీఎస్ తర్వాత ఈఎల్ఎస్ఎస్ రెండో స్థానంలో ఉంది. -
ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను పాటిస్తూ కేంద్రం ఎన్‌పీఎస్‌లో మార్పులు!
ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో ఈ ఏడాది చివరి నాటికి మార్పులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేస్తున్న కొన్ని మార్పులను ఈ ఏడాది చివరిలో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగి చివరిగా తీసుకున్న బేసిక్ జీతంలో 40-50% ఆధారంగా పెన్షన్‌కు హామీ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను అనుసరించాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ పెన్షన్ కార్పస్‌లో లోటును పూరించడం మార్కెట్‌పై ఆధారపడుతుందన్నారు. ప్రస్తుతం ఎన్‌సీఎస్‌లో భాగంగా ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 10% జమ చేస్తారు. ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో మరో 14% జమ చేస్తుంది. అయితే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టబోయే ప్రతిపాదనల్లో ద్రవ్యోల్బణం అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రాబోయే సమావేశంలో దీనిపై మరింత చర్చించే అవకాశం ఉందని ఆ అధికారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పెన్షనర్లు డీఏతో పాటు తాము చివరిగా డ్రా చేసిన బేసిక్ జీతంలో 50% పొందే వీలుంది. ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి జాతీయ పెన్షన్ విధానాన్ని సవరించాలని, పాత పెన్షన్ విధానాన్ని పోలిన పథకాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఝార్ఖండ్ వంటి కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీని కింద రాష్ట్రాలు తమ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్‌పై అధిక భారాన్ని భరిస్తున్నాయి. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధించిన కేంద్రం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) రెగ్యులేటర్ అయిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం..ఎన్పీఎస్ నిర్వహణలో ఉన్న రూ.9 లక్షల కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వాటా 79% ఉంది. మార్చి 31, 2023 నాటికి ఎన్పీఎస్ అందించే వివిధ పథకాల ద్వారా 6.3కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఇందులో 60.72 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 23.86 లక్షల మంది ఉన్నారు. -
ఎన్పీఎస్, ఈపీఎఫ్ - రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
నాకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులు ఉండగా, వీటిని విక్రయించాను. ఈ లాభం లక్షలోపు ఉంది. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షలోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదని విన్నాను. అయితే, ఈ లాభాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాలా? అవసరం లేదా? – గురుమూర్తి మీ వార్షికాదాయం ఆదాయపన్ను వర్తించే శ్లాబులో ఉంటే తప్పకుండా రిటర్నులు వేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయాల్సిన ప్రతి ఒక్కరూ పన్ను పరిధిలోకి రాని మూలధన లాభం ఉన్నప్పటికీ దాన్ని రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. లిస్టెడ్ కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు కలిగినా లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఏడాదికి మించి కలిగి ఉంటే, వాటిపై వచ్చే లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)గా పేర్కొంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభం వస్తే, ఆ మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) ఆధారంగా మీరు దాఖలు చేయాల్సిన వార్షిక రిటర్నుల పత్రాల్లో ఈ వివరాలు ముందుగానే నింపి ఉంటాయి. కనీస ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఆదాయం ఉంటే, పన్ను వర్తించని మూలధన లాభాలను వెల్లడించక్కర్లేదు. ఆదాయపన్ను పాత విధానం కింద సీనియర్ సిటిజన్లు అయితే (60 ఏళ్లు నిండిన) వార్షికాదాయం రూ.3 లక్షలు ప్రాథమిక పన్ను మిహాయింపు పరిమితిగా ఉంది. 80 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.5లక్షలుగా ఉంది. మిగిలిన వారికి రూ.2.5 లక్షలుగా ఉంది. నూతన పన్ను విధానంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆదాయపన్ను మినహాయింపు కనీస పరిమితి రూ.2.5 లక్షలుగానే ఉంది. వార్షిక ఆదాయ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్నప్పటికీ, వాస్తవ ఆదాయం ఇంతకంటే తక్కువగా ఉన్న వారు మూలధన లాభాలు (స్వల్పకాల, దీర్ఘకాల) కలిగి ఉంటే, ఆ మొత్తాన్ని కనీస పరిమితి కింద భర్తీ చేసుకోవచ్చు ఉదాహరణకు వార్షికాదాయం రూ.1.8 లక్షలుగానే ఉండి, మూలధన లాభం రూ.లక్ష వచ్చి ఉంటే, అప్పుడు బేసిక్ పరిమితిలో మిగిలిన రూ.70వేలను భర్తీ చేసుకోవచ్చు. ఇది పోను మిగిలిన రూ.30వేలపైనే మూలధన లాభాల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా కాకుండా మీ ఆదాయం రూ.2.5 లక్షలకు పైన ఉంటే, అప్పుడు మూలధన లాభాలను రిటర్నుల్లో వెల్లడించి నిబంధనల కింద పన్ను చెల్లించాల్సిందే. ప్రస్తుతం నేను పనిచేస్తున్న సంస్థలో నా నెలవారీ వేతనం నుంచి ఈపీఎఫ్ పథకానికి చందాలు వెళుతున్నాయి. నేను వచ్చే ఏడాది నేను పదవీ విమరణ తీసుకోబోతున్నాను. పీఎఫ్ నిధి సుమారు రూ.50 లక్షలుగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్పీఎస్కు మారేందుకు కార్యాలయం నాకు ఆప్షన్ ఇచ్చింది. మరి నేను ఎన్పీఎస్కు మారాలా? అది నాకు ప్రయోజనమేనా? – రాజేష్ కుమార్ భాసిన్ రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఎన్పీఎస్, ఈపీఎఫ్ రెండూ ముఖ్యమైన పథకాలుగా ఉన్నాయి. ఈపీఎఫ్ అనేది మీ వేతనం నుంచి తప్పకుండా మినహాయించే ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడమే ఇందులోని ఉద్దేశం. పదవీ విమరణ సమయంలో చేతికి అందే మొత్తంపై పన్ను ఉండదు. ఎన్పీఎస్ అనేది స్వచ్ఛంద పథకం. పదవీ విరమణ నిధి ఏర్పాటుకు ఇది కూడా ఒక సాధనం. మీరు మరో ఏడాదిలో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఈపీఎఫ్ ద్వారా ఇప్పటికే నిధిని సమకూర్చుకున్నారు. కనుక ఈ సమయంలో ఎన్పీఎస్కు మారడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. వేచి చూసి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఈపీఎఫ్ నిధిని మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునేట్టు అయితే, మీ ఉద్దేశ్యాలకు అనుగుణంగా సాధనాలను ఎంపిక చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకోకపోతే అప్పుడు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. స్వచ్ఛందంగా అయినా ఎన్పీఎస్ ఖాతాను 70 ఏళ్ల వరకు తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
భారీగా పెరిగిన పెన్షన్ స్కీముల ఆస్తులు
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 10 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టు 23న ఈ మైలురాయిని అధిగమించినట్లు పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. రెండేళ్ల 10 నెలల కాలంలో ఏయూఎం రూ. 5 లక్షల కోట్ల నుంచి రెట్టింపైనట్లు వివరించారు. ఎన్పీఎస్, ఏపీవై చందాదారుల సంఖ్య 6.62 కోట్ల పైచిలుకు చేరినట్లు మహంతి చెప్పారు. 2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రకటించిన ఎన్పీఎస్ను 2009 నుంచి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దేశ పౌరులు దీన్ని స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు. మరోవైపు, 2015 జూన్ 1న ఏపీవైని కేంద్రం ఆవిష్కరించింది. 60 ఏళ్లు దాటిన చందాదారులు తాము కోరుకున్నంత నిధిని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌పై కసరత్తు తుది దశలో ఉందని, అక్టోబర్ లేదా నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని మహంతి వివరించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ చందాదారులు 60 ఏళ్లు దాటితే 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంది. మిగతా 40 శాతం మొత్తం తప్పనిసరిగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. -
నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 45 శాతం పెన్షన్? ఆర్థిక శాఖ వివరణ
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కింద వారు ఉద్యోగ విరమణకు మందు చివరిగా అందుకున్న వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం ఒక కమిటీ చర్చిస్తోందని, ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పేర్కొంది. ఎన్పీఎస్ కింద ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పెన్షన్ ఖచ్చితమైన శాతం గురించి పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. ‘గత బడ్జెట్ సెషన్లో లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ, ప్రస్తుతం చర్చల స్థితిలో ఉంది. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ధారణలకు రాలేదు’ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారి చివరి వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్ వచ్చేలా నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించాలని భావిస్తోందంటూ రాయిటర్స్ కథనం వెలువరించింది. This is in reference to a news report carried in various news papers, purporting to give details of certain specific percentage of pension being proposed by the Government for the employees under National Pension System #NPS. This news report is false. The Committee, set up… — Ministry of Finance (@FinMinIndia) June 22, 2023 ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే! -
నేషనల్ పెన్షన్ స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం?
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఓల్డ్ పెన్షన్ స్కీం వర్సెస్ నేషనల్ పెన్షన్ స్కీం అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. పాత పింఛను విధానం కాకుండా ఇతర మార్గాలను అన్వేషించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమల్లో ఉన్న ఎన్పీఎస్ పథకం కింద ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి వేతనంలో 40 - 45 శాతం పెన్షన్‌గా అందుకునేలా మార్పులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. కొత్త పెన్షన్ విధానం అమలులో సాధ్యసాధ్యాలు, కేంద్ర రాష్ట్రాలపై రుణ భారం వంటి ఇతర అంశాలపై రివ్యూ జరిపేలా ఏప్రిల్ నెలలో కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. తాజాగా, ఆ కమిటీ సభ్యులు కేంద్రానికి ఓ రిపోర్ట్‌ను అందించారు. దాని ఆధారంగా ఎన్పీఎస్ చందాదారులు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఆఖరి నెల జీతంలో 40 - 45 శాతం పెన్షన్‌గా వచ్చేలా హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం అందుబాటులోకి ఉన్న ఎన్‌పీఎస్‌లో ఉద్యోగి తన వాటాగా 10 శాతం చెల్లించాలి. ప్రభుత్వం తన వాటాగా 14 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని డెట్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేస్తారు. అయితే, ఎన్పీఎస్ కింద పెన్షన్ మొత్తానికి ఎలాంటి హామీ ఉండదు. -
పెన్షన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త!
పెన్షన్ లబ్ధిదారలకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) శుభవార్త చెప్పింది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షన్ దారులు వారి నిర్ణయం ప్రకారం.. ఎంత నగదు కావాలనుకుంటే అంత నగదు విత్ డ్రా చేసుకోవచ్చని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మొహంతీ తెలిపారు. సిస్టమెటిక్ విత్‌డ్రా ప్లాన్‌లో భాగంగా 60 ఏళ్ల నుంచి 75 ఏళ్లలోపు నేషన్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) పెన్షన్ దారులు ఒకనెల, మూడు నెలలు, ఆరు నెలలు డబ్బుల్ని డ్రా చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ దారులు 60 ఏళ్ల తర్వాత తన రీటైర్మెంట్ సొమ్మును మొత్తం డ్రా చేసుకునేందుకు వీలు లేదు. కేవలం 60 శాతం మాత్రమే ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ఏడాదికి కొంత మొత్తాన్ని తీసుకునే సౌకర్యం ఉంది. తాజాగా, ఆ పథకంలో మార్పులు చేస్తున్నామని.. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు దీపక్ మొహంతీ పేర్కొన్నారు. ఇక, ఈ మార్పులతో ఎవరైతే 60 శాతం పెన్షన్‌ను ఒకేసారి తీసుకునేందుకు ఇష్టపడని వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దీంతో పాటు, ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన వారు 70 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. ఇప్పుడు ఆ కాలాన్ని మరో ఐదేళ్లు అంటే 75ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చివరిగా :: దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. చదవండి : సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట! -
ఎన్పీఎస్ నుంచి నెలవారీ ఆదాయం
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద క్రమం తప్పకుండా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తీసుకురానున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. దీంతో 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ ఖాతాదారులు అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి కావాల్సినంతే ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రతిపాదన పురోగతి దశలో ఉంది. దాదాపు వచ్చే త్రైమాసికం చివరి నాటికి ఈ పథకంతో ముందుకు వస్తాం’’అని మహంతి చెప్పారు. ప్రస్తుతం ఎన్పీఎస్ పథకంలో 60 ఏళ్లు నిండిన వారు అప్పటి వరకు సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకుని, మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. అంతేకానీ, నెలవారీ ఇంత చొప్పున తీసుకునే అవకాశం లేదు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ను అమల్లోకి తీసుకొస్తే అప్పుడు పింఛనుదారులు నెలవారీ లేదా మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికొకసారి.. వీటిల్లో తమకు అనువైన ఆప్షన్ ఎంపిక చేసుకుని, క్రమం తప్పకుండా ఆదాయం పొందొచ్చు. ఇలా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకోవడానికి పీఎఫ్ఆర్డీఏ అవకాశం కల్పించనుంది. ‘‘నా నిధిపై మంచి రాబడులు వస్తున్నప్పుడు ఆ మొత్తాన్ని ఎందుకు కొనసాగించకూడదు. ఎందుకు యాన్యుటీ తీసుకోవాలనే అభ్యర్థనలు వస్తున్నాయి’’అని మహంతి తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, యాన్యుటీని వాయిదా వేసుకోవచ్చని, దీనివల్ల తర్వాత అధిక మొత్తంలో పింఛను వస్తుందని చెప్పారు. తాము తీసుకురాబోయే మార్పుతో, చందాదారులు 40 శాతం నిధితో డిఫర్డ్ యాన్యుటీని ఎంపిక చేసుకుని, మిగిలిన 60 శాతం ఫండ్‌ను క్రమం తప్పకుండా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. -
కేంద్ర ఉద్యోగుల్లో కొందరికి పాత పెన్షన్
న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ విధానం(ఎన్పీఎస్) అమల్లోకి వచ్చిన 2003 డిసెంబర్ 22వ తేదీకి ముందే ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ‘పాత పెన్షన్’ స్వీకరించే అవకాశం పొందారు. అంటే ఆ తేదీ కంటే ముందే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్/అడ్వర్ట్టైజ్డ్ చేసిన పోస్టుల్లో చేరిన ఉద్యోగులు మాత్రమే పాత పెన్షన్ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో చేరేందుకు వన్–టైమ్ ఆప్షన్ ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్ర సిబ్బంది శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ‘ఎన్పీఎస్ నోటిఫికేషన్‌కు ముందే ప్రకటించిన పోస్టులు/ఖాళీలకు అనుగుణంగా ఎంపికైనందున పాత పెన్షన్ స్కీమ్‌ను తమకు వర్తింపజేయాలని 2003 డిసెంబర్ 22కు ముందు కేంద్ర ఉద్యోగాల్లో చేరిన వారి వినతులు మాకు అందాయి. పలు రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనళ్లు వెలువర్చిన తీర్పులు, ఆ ఉద్యోగుల అభ్యర్థనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఉత్వర్వులో కేంద్రం పేర్కొంది. -
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్పీఎస్ కింద బ్యాంకు యజమాని అందించే సహకారాన్ని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. దీని వల్ల బ్యాంకు ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పెరగనుంది. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్‌లో పెన్షన్ పొందనున్నారు. ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్ రూ.30,000-35,000కు పెరగనున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) తెలిపింది.(చదవండి: కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు) పెన్షన్ కాంట్రిబ్యూషన్ పెంపు ఇంతకు ముందు వివిధ వర్గాల పెన్షనర్లకు 15, 20, 30 శాతం స్లాబ్ రేట్లలో చెల్లించాల్సిన ఫ్యామిలీ పెన్షన్‌ను ఎలాంటి క్యాప్ లేకుండా చూడాలని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(ఐబీఏ) ప్రభుత్వానికి నివేదించింది. వేలాది బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో ఉన్న పెన్షన్ కాంట్రిబ్యూషన్ 10 శాతం నుంచి 14 శాతానికి పెరుగుతుంది అని డీఎఫ్ఎస్ కార్యదర్శి దేబాషిష్ పాండా తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం లాభదాయకంగా మారాయని, వారు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందరని, మార్కెట్ నుంచి డబ్బును సేకరిస్తున్నారని పాండా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. "2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.26,016 కోట్ల నష్టంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.31,817 కోట్ల లాభాన్ని నివేదించాయి. ఐదేళ్ల నష్టాల తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు లాభాన్ని నివేదించడం ఇది మొదటిసారి. మార్చి 2021 నాటికి మొత్తం స్థూల నిరర్థక ఆస్తులు రూ.6.16 లక్షల కోట్లుగా ఉన్నాయి, మార్చి 2020 నుంచి రూ.62,000 కోట్లు తగ్గాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉన్న మోసల సంఖ్యతో 3,704తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో మోసాల సంఖ్య 2,903కు తగ్గినట్లు" ఆమె పేర్కొన్నారు. -
కనీస రాబడులతో వినూత్న పెన్షన్ పథకం
ముంబై: వినూత్నమైన పెన్షన్ ప్లాన్లను తీసుకురావడం దిశగా పనిచేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఇందులో కనీస రాబడుల హామీతో ఒక పథకం ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బంధోపాధ్యాయ అన్నారు. పీఎఫ్ఆర్డీఏ నియంత్రణలో ప్రస్తుతం ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలు కొనసాగుతుండగా.. మరింత మంది చందాదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన పెన్షన్ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామని బంధోపాధ్యాయ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ ఉత్పత్తి తీసుకువచ్చే విషయంలో యాక్చుయరీలు సాయమందించాలని బంధోపాధ్యాయ కోరారు. యాక్చుయరీల నుంచి వచ్చే సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగే సమయంలో సభ్యులకు అధిక రేట్లతో కూడిన పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్‌ను అందించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు. మార్కెట్ ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లకు అనుగుణంగా ఉండే భిన్నమైన యాన్యుటీ ఉత్పత్తుల అవసరం ఉందన్నారు. క్రమానుగతంగా కావాల్సినంత వెనక్కి తీసుకునే ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) మాదిరి యాన్యుటీ ప్లాన్లు కావాలన్నారు. పెన్షన్ ఎంత రావచ్చన్న అంచనాలను ప్రస్తుత, నూతన చందాదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు బంధోపాధ్యాయ చెప్పారు. -
ఎన్పీఎస్ నుంచి ఉపసంహరణ
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) చందాదారులకు ‘పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ’(పీఎఫ్ఆర్డీఏ) వెసులుబాటు కల్పించింది. ఎన్పీఎస్ చందాదారులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకోవాల్సి వస్తే ఖర్చుల కోసం ఎన్పీఎస్ నిధి నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. కాగా, ఏపీవై చందాదారులకు ఇది వర్తించదు. ఈపీఎఫ్‌వో..ఉపసంహరణ రూ.280 కోట్లు కాగా, ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతించడంతో.. ఇప్పటి వరకు రూ.280 కోట్ల విలువకు సంబంధించి 1.37 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్‌వో శుక్రవారం ప్రకటించింది. ఈపీఎఫ్ నిధిలో చందాదారుని వాటా మొత్తం నుంచి 75 శాతం లేదా మూడు నెలల మూలవేతనం, కరువు భత్యం ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. -
నేడు, రేపు బ్యాంకుల బంద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నేడు, రేపు (శుక్ర, శనివారం) బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనున్నారు. ఈ రెండు రోజులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు సాగవని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ తొలగింపు వంటి 11 డిమాండ్లతో కార్మిక శాఖ, కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని.. అందుకే సమ్మెకు సిద్ధమయ్యామని యూఎఫ్‌బీయూ తెలిపింది. శుక్ర, శనివారాల్లో జరగనున్న సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యూ, ఎన్ఓబీఓ బ్యాంకింగ్ సంఘాలు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. గ్రామీణ బ్యాంకులు మాత్రమే సమ్మెలో పాల్గొనడం లేదని, మద్దతు మాత్రం తెలుపుతున్నట్లు ఆల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో మార్చి 11, 12, 13 తేదీల్లో కూడా సమ్మె ఉంటుందని యూఎఫ్‌బీయూ హెచ్చరించింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజు కూడా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలోనే పాల్గొంటారు. 2వ తేదీ ఆదివారం. అంటే వరుసగా 3 రోజులు బ్యాం కులు పనిచేయవు. పునఃప్రారంభం సోమవారమే. -
ఎన్పీఎస్కు పూర్తిగా పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వ చందాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే, ఎన్పీఎస్ నుంచి రిటైర్మెంట్ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను ఉండదని తెలిపారు. దీంతో పీపీఎఫ్, ఈపీఎఫ్ పథకాల మాదిరే ఎన్పీఎస్కు కూడా ఈఈఈ హోదా (మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు) లభించనుంది. కార్యదర్శుల కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వ చందాను 14 శాతానికి పెంచాలని గత వారమే కేబినెట్ నిర్ణయం తీసుకుందని జైట్లీ వెల్లడించారు. ఆర్థిక బిల్లులో మార్పులు చేసిన తర్వాత ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రయోజనాలు అమల్లోకి రానున్నాయని అధికార వర్గాల సమాచారం. ప్రభుత్వ నిర్ణయం 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించనుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించి కేంద్రం నమూనాను అనుసరించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని జైట్లీ అభిప్రాయపడ్డారు. మీడియాకు మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం... ఇకపై ఈ ప్రయోజనాలు ప్రస్తుత నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ నాటికి సమకూరిన నిధి నుంచి 40 శాతం మొత్తంతో తక్షణం పెన్షన్ వచ్చే యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై పన్ను లేదు. మిగిలిన 60 శాతాన్ని ఎన్పీఎస్ చందాదారులు తీసేసుకోవచ్చు. ఇందులో 40 శాతాన్ని పన్ను మినహాయింపు ఇస్తూ మిగిలిన 20 శాతంపై పన్ను అమలు చేస్తున్నారు. ఇకపై ఉపసంహరించుకునే మొత్తం 60 శాతంపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ వెసులుబాటు ఎన్పీఎస్ చందాదారులు అందరికీ వర్తిస్తుంది. ఇప్పటి వరకు టైర్–1 కింద జమ చేసే వాటికే పన్ను మినహాయింపు ఉండగా, కొత్తగా టైర్–2కింద జమచేసే మొత్తంలో రూ.1.5 లక్షలకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును కేంద్రం కల్పించింది. ఇందుకు గాను టైర్–2 ఖాతా కింద జమలపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. ఎన్‌పీఎస్‌లో టైర్–1 అకౌంట్లో జమలను 60 ఏళ్లు వచ్చే వరకు ఉపసంహరించుకోవడానికి లేదు. కొన్ని ప్రత్యేక కారణాల్లోనే ఇందుకు అనుమతిస్తారు. టైర్–2 అకౌంట్ అన్నది స్వచ్చందంగా పొదుపునకు ఉద్దేశించిన అకౌంట్. టైర్–1 అకౌంట్‌కు అనుబంధంగా ప్రారంభించుకోవచ్చు. ఎప్పుడు అవసరమైనా ఇందులో మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇకపై మూడేళ్ల పాటు టైర్–2 అకౌంట్ డిపాజిట్లను వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి బేసిక్ వేతనంపై 14 శాతం ప్రభుత్వ చందాగా లభిస్తుంది. ఇది ప్రస్తుతం 10 శాతంగా ఉంది. ఇక ఉద్యోగుల వాటా 10 శాతంలో ఎటువంటి మార్పు లేదు. ఈ నిర్ణయం 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2,840 కోట్లను అదనంగా భరించాల్సి వస్తుంది. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ పథకంగా ఎన్పీఎస్ అమలవుతున్న విషయం గమనార్హం. ఎన్‌పీఎస్‌లో డెట్, ఈక్విటీల్లోనూ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించనుంది. అలాగే, తమకు నచ్చిన ఫండ్ మేనేజర్ సంస్థలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుత మూడు ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలకే అవకాశం ఉండగా, ఇకపై 8 ఫండ్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. -
6 నెలల్లో 22 లక్షల కొత్త కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని మోదీ సర్కార్‌పై విపక్షాలు, విమర్శకులు విరుచుకుపడుతున్న వేళ ప్రభుత్వానికి తీపికబురు అందింది. గత ఆరు నెలల్లో ( ఫిబ్రవరి 28 వరకూ) దేశంలో దాదాపు 22 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఈపీఎఫ్ఓ, ఎన్‌పీఎస్‌లు జారీ చేసిన తాజా పేరోల్ జాబితా వెల్లడించింది. ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం 31 లక్షల మంది ఉద్యోగులు కొత్తగా ఖాతా తెరిచారని..వీరిలో 18.5 లక్షల మంది 18-25 సంవత్సరాల వయసు వారున్నారని, వీరంతా కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారని అంచనా. ఇక 3.5 లక్షల మంది కేంద్ర ఇతర ప్రభుత్వ ఉద్యోగులు నూతన ఖాతాలు తెరిచారని ఈ రెండింటినీ కలుపుకుని దేశంలో కొత్తగా 22 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని తేలింది. ఈపీఎఫ్ఓ, ఎన్‌పీఎస్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) సైతం గణాంకాలను వెల్లడింది. గత ఆరునెలల్లో ఈఎస్ఐసీ కొత్తగా 18-25 సంవత్సరాల వయసున్న 8.3 లక్షల మందికి బీమా కల్పించినట్టు ప్రకటించింది. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా వీరు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారని వెల్లడైతే గత ఆరునెలల్లో 30 లక్షల మందికి పైగా ఉపాధి లభించినట్టువుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. -
పెద్ద వయసులో ఎన్పీఎస్ ఓకేనా?
మ్యూచువల్ ఫండ్స్ నుంచి పాక్షికంగా విత్‌డ్రాయల్స్ జరిపితే, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ–లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) వర్తిస్తుందా ? ఏ విధంగా లెక్కిస్తారు ? – రాజేశ్వరి, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్స్ నుంచి పాక్షికంగా విత్‌డ్రాయల్స్ జరిపినా దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) వర్తిస్తుంది. ఫస్ట్–ఇన్–ఫస్ట్–అవుట్(ఎఫ్‌ఐఎఫ్‌ఓ) ప్రిన్సిపుల్ ప్రకారం ఎల్టీసీజీ వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. మొదటగా మీరు కొనుగోలు చేసిన యూనిట్లను మొదటగా విక్రయించాలి. మీరు కొనుగోలు చేసినప్పటి తేదీ నుంచి విక్రయించినప్పటి తేదీని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. రెండింటి మధ్య తేడా ఏడాదిని మించితే ఈ విక్రయాలపై వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ తేడా 365 రోజుల లోపే ఉంటే ఈ యూనిట్ల విక్రయాలపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా లెక్కిస్తారు. ఎల్టీసీజీ విధింపు కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇప్పుడు యులిప్‌లు ఆకర్షణీయమని మిత్రులంటున్నారు. వారి అభిప్రాయం సరైనదేనా ? – శేఖర్, విజయవాడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరి యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ)లపై ఎల్టీసీజీ ప్రభావం ఉండదు. ఈ ఒక్క కారణంతో యులిప్‌లు ఇన్వెస్ట్ చేయడానికి ఆకర్షణీయ సాధనాలని చెప్పలేము. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పారదర్శకతకు పెద్ద పీట వేస్తాయి. వీటికి లిక్విడిటీ అధికం. వీటికి వ్యయాలు కూడా తక్కువగా ఉంటాయి. ఒక ఫండ్ మంచి పనితీరు కనబరచలేకపోతే, మరో ఫండ్‌లోకి మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చు. యులిప్‌ల విషయా నికొస్తే, వీటి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. సరెండర్ చార్జీలు, ఇతర వ్యయాలు అధికంగా ఉంటాయి. యులిప్‌ల కాస్ట్ క్లెయిమ్ తక్కువగా ఉంటుంది. కానీ, యులిప్‌లు పారదర్శకంగా ఉండవని పలువురు ఇన్వెస్టర్లు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. మరోవైపు బీమాను, ఇన్వెస్ట్‌మెంట్‌ను కలగలపి మదుపు చేస్తే, ఈ రెండు అంశాల్లోనూ తగిన రాబడులను మీరు పొందలేరు. మీ బీమా అవసరాలను యులిప్‌లు పూర్తిగా తీర్చలేవు. అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా తగిన స్థాయిలో రాబడులనూ ఇవ్వలేవు. కొన్ని యులిప్‌లు మంచి రాబడులు ఇచ్చిన దృష్టాంతాలు ఉన్నాయి. అయితే బీమా అవసరాల దృష్ట్యా చూస్తే, యులిప్‌లు సరైన సాధనాలు కావని చెప్పవచ్చు. అందుకని ఎప్పుడూ, ఇన్వెస్ట్‌మెంట్‌ను, బీమాను కలగలపకండి. బీమా అవసరాల కోసం టర్మ్ బీమా పాలసీలను తీసుకోండి. వీటిల్లో బీమా కవరేజ్ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్ తక్కువగానూ ఉంటుంది. నా వయస్సు 63 ఏళ్లు. ఇంకా పనిచేస్తున్నాను. అదనంగా పన్ను ప్రయో జనాలు పొందొచ్చనే ఉద్దేశంతోనే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. – వెంకట్, హైదరాబాద్ ఈ వయస్సులో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. 65 సంవత్సరాల వరకూ ఎన్‌పీఎస్‌లో చేరే అవకాశం ఉంది. అయితే మీరు ఇప్పుడు చేరితే మరో రెండేళ్లలోనే మీరు ఇన్వెస్ట్ చేసిన, ఇన్వెస్ట్ చేసిన మొత్తాలపై సమకూరిన రాబడుల్లో 40 శాతం మేరకు యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన రెండేళ్ల కాలానికే మీరు ఇన్వెస్ట్ చేసే దాంట్లో 40 శాతం యాన్యుటీ రూపంలో ఆగిపోతుంది. దీనికి బదులుగా.. మీరు ఇంకా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఎన్పీఎస్ కంటే ఎక్కువ రాబడులు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ మొత్తం లాభాలు రూ.లక్షను మించినప్పుడు మాత్రమే ఈ 10 శాతం పన్ను భారం ఉంటుంది. ఏదైనా మంచి మల్టీ–క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. అంతేకాని, 62 ఏళ్ల వయస్సులో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. ఐసీఐసీఐ ఇలీట్ వెల్త్ స్కీమ్ టూలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. బీమా అవసరాలు, పన్ను ప్రయోజనాలు కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యతగా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ) కంటే మెరుగైన రాబడులను ఇస్తుందని, మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే నష్ట భయం తక్కువని మిత్రుడొకరు చెబుతున్నారు. ఈ స్కీమ్‌కు లాక్–ఇన్ పీరియడ్ ఐదేళ్లు, 20 ఏళ్ల పాటు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడికి ఈ స్కీమ్‌ను పరిశీలించవచ్చా ? – ఆనంద్, నెల్లూరు ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యతా అంశమైతే, ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన నిర్ణయం కాదు. ఐసీఐసీఐ ప్రు లైఫ్ ఇలీట్ వెల్త్ టూ అనేది ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఈ స్కీమ్‌లో చార్జీలు అధికం. ఇక బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. దీనిలో బీమా కవరేజ్ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ కోసం మంచి రేటింగ్ఉన్న డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోండి. ఒకటి, లేదా రెండు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో కనీసం ఐదు నుంచి ఎనిమిదేళ్లు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. సొంత ఇల్లు కట్టుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈ విధానాన్ని అనుసరిస్తే, మంచి ప్రయోజనాలు పొందవచ్చు. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎన్పీఎస్ ఎందుకు వద్దట?
పన్ను పరంగా ఆదాకు అవకాశమివ్వటం...రిటైరయిన తరవాత పింఛన్ ఉండని వారికి భరోసా కల్పించటం.. ఈ రెండే ప్రధాన లక్ష్యాలుగా దేశంలో జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) ప్రారంభమయింది. ఉద్యోగుల్లో చాలా మందికి పింఛన్ లేదు కనక... వారిని దృష్టిలో పెట్టుకుని ఆరంభించిన పథకమిది. నిజానికి దేశంలో అత్యధికులు పింఛన్ అవకాశం లేనివారే!! కానీ వారిలో చాలా మంది ఎన్పీఎస్వైపు చూడటం లేదు. ఎందుకని? దీన్లో ఉన్న లోపాలేంటి? సరిదిద్దాల్సిన అంశాలేంటి? ఇదే విషయమై ఈ మధ్య జాతీయ స్థాయిలో ఓ సర్వే జరిగింది. దాన్లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాల సమాహారమే ఈ కథనం... జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) పన్ను ఆదాకు వీలు కల్పించినా 60వ ఏట వరకు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటానికి అవకాశం లేదు. ఈ లాకిన్ వ్యవధి చాలా మందికి నచ్చటం లేదు. ఇక పథకం కాల వ్యవధి ముగిసిన తర్వాత... అంటే 60వ ఏట చేతికొచ్చే నిధిలో 60 శాతంపై పన్ను విధిస్తున్నారు. ఇది మరికొందరికి నచ్చటం లేదు. కాల వ్యవధి తీరిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను విధిస్తున్నారు కాబట్టి... పెట్టుబడి పెట్టేటపుడు పన్ను మినహాయింపు ఇస్తున్నా అది ఇవ్వనట్టేనని కొందరి భావన. ఈ తరహా కారాణాలే వారిని ఎన్పీఎస్కు దూరంగా ఉండేలా చేస్తున్నాయంటూ ఈ సర్వేలో వెల్లడైంది. వాటిపై నిపుణుల అభిప్రాయాలు కూడా ఇన్వెస్టర్ల మనోభావాలకు తగ్గట్టే ఉన్నాయి. ఎన్పీఎస్ కార్పస్‌పై పన్ను భారమే!! ఈపీఎఫ్, పీపీఎఫ్ మాదిరిగా కాకుండా ఒక్క ఎన్‌పీఎస్‌లో మాత్రం గడువు ముగింపునాటికి చేతికొచ్చే నిధిలో 40 శాతమే పన్ను రహితం. మిగతా 60 శాతంపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నే ఎన్పీఎస్కు పెద్ద విఘాతం. పైపెచ్చు పన్ను రహితంగా తీసుకున్న 40 శాతం నిధులను తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్‌లో పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇది కూడా పన్ను పరిధిలోకి వచ్చినట్టేనని, యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతి నెలా వచ్చే పెన్షన్ ఆదాయం పన్ను పరిధిలోకి రావడమే కారణమని అవుట్‌లుక్ ఏషియా క్యాపిటల్ సీఈవో మనోజ్ నాగ్‌పాల్ అభిప్రాయపడ్డారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ హేమంత్ సైతం ఎన్పీఎస్పై పన్ను సమంజసం కాదని అంగీకరించారు. అయితే, పన్ను తగ్గించుకోవడానికి మార్గాలున్నాయన్నది ఆయన అభిప్రాయం. ‘‘40 శాతం కార్పస్‌పై పన్ను లేదు. మరో 40 శాతాన్ని యాన్యుటీలో పెట్టడం ద్వారా దానిపై కూడా పన్ను లేకుండా తప్పించుకోవచ్చు. మిగిలిన 20 శాతంపై కూడా పన్ను వద్దనుకున్నారనుకోండి. దాన్ని కూడా యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని హేమంత్ సూచించారు. ‘‘రిటైర్మెంట్ తర్వాత కూడా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్పీఎస్ అనుమతిస్తోంది. 70వ సంవత్సరం వచ్చే వరకు వాయిదాల రూపంలో వెనక్కి తీసుకోవచ్చు. సరైన ఉపసంహరణ ప్రణాళికతో పన్నును సున్నాకు తగ్గించుకునే అవకాశం ఉంది’’ అనేది ఆయన అభిప్రాయం. కాకపోతే యాన్యుటీ ప్లాన్‌పై నెలనెలా వచ్చే పెన్షన్.. పన్ను పరిధిలోనే ఉంటుందనేది గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్‌లో మాదిరి ఎన్‌పీఎస్‌లో పన్ను ప్రయోజనాలు లేవనేది మనోజ్ నాగ్‌పాల్ అభిప్రాయం. ‘‘స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. డెట్ పథకాల రాబడులపై మాత్రం మూడేళ్ల తర్వాత తక్కువ పన్ను రేటుకు తోడు ద్రవ్యోల్బణం తీసివేత ప్రయోజనం ఉంది’’ అన్నారాయన. వాస్తవానికి మన దేశంలో పన్ను ప్రయోజనాలే ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న మాట వాస్తవం. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలోనూ అధికులు పన్ను ఆదా ఉద్దేశంతో పెడుతున్నవారేనని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈపీఎఫ్ కంటే ఎన్పీఎస్ మెరుగైన రాబడులిస్తున్నప్పటికీ... వీటిపై పన్ను ప్రయోజనం లేకపోవడం ప్రతికూలం. ఈపీఎఫ్ మాదిరిగా ఎన్‌పీఎస్‌లోనూ పన్ను ప్రయోజనాలుంటేనే... దాన్నుంచి ఎన్పీఎస్కు మారతారన్న అంచనాలున్నాయి. ఈక్విటీలకు పరిమితి ఇబ్బందే! సాధారణంగా యువ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. రిస్క్ తీసుకునే సామర్థ్యమే వారి ఆసక్తికి కారణం. కానీ ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్ట పరిమితి 50 శాతమే. లైఫ్ సైకిల్ ఫండ్ ఆప్షన్లో ఈక్విటీలకు 75 శాతం వరకూ కేటాయింపులకు అవకాశం ఉన్నప్పటికీ వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీ వాటా తగ్గుతుంది. ఈ పరిమితి వల్ల ఈక్విటీల నుంచి గణనీయమైన రాబడులు రాకుండా పోతాయనేది ఫైనాన్షియల్ ప్లానర్ల అభిప్రాయం. అవగాహన కలిగిన ఇన్వెస్టర్లయితే వేటికి ఎంత మేర పెట్టుబడులు వెళ్లాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారనేది మనీ హన్స్ వ్యవస్థాపకురాలు హన్సి మెహరోత్రా అభిప్రాయం. ‘‘రిటైర్మెంట్ అనేది సుదీర్ఘ కాల లక్ష్యం. కాబట్టి తక్కువ ఫీజులతో గణనీయమైన రాబడులందించే పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మార్పులకు అవకాశం ఉండకూడదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు ఉన్న పరిమితిని తొలగించి 100 శాతం పెట్టుబడులకు అనుమతించినట్టయితే పదవీ విరమణకు ఇది సరైన సాధనం అవుతుందనేది నా అభిప్రాయం’’ అన్నారామె. అయితే, ఇదే విషయమై సుశీల్ ఫైనాన్స్ వెల్త్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెండ్ ముకేశ్షా స్పందిస్తూ... ‘‘ఎన్పీఎస్ రిటైర్మెంట్ కోసం ఉద్దేశించింది. ఈక్విటీలకు 50 శాతం పరిమితితో మార్కెట్లలో తీవ్రమైన హెచ్చు, తగ్గుల నుంచి రక్షణ ఉంటుంది. అదే సమయంలో స్థిరాదాయ పథకాల కంటే అధిక రాబడులకు వీలు కల్పిస్తుంది’’ అని పేర్కొన్నారు. 50 శాతం పరిమితి తొలగించి 100 శాతం ఈక్విటీలకు అనుమతిస్తే స్వల్ప కాలం నుంచి మధ్య కాలంలో ప్రతికూల రాబడులకు దారితీయవచ్చని, మార్కెట్లు డౌన్‌సైడ్‌లో ఉంటే రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారి పెట్టుబడుల విలువ తరిగిపోతుందని చెప్పారాయన. యాన్యుటీలో తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్? ఎన్పీఎస్ నిధిలో 40 శాతాన్ని తప్పనిసరిగా పెన్షన్ యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. యాన్యుటీ ప్లాన్‌లో రాబడులు చాలా తక్కువ. దీంతో గడువు ముగిశాక చేతికందే నిధులను తమ స్వేచ్ఛ కొద్దీ ఎక్కువ రాబడులొచ్చే చోట పెట్టే హక్కు ఇన్వెస్టర్లకు లేదు. ఇది కూడా ఎన్పీఎస్ వైపు చాలా మంది చూడకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి. 40 శాతం కార్పస్‌తో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడం అన్నది పదవీ విరమణ తర్వాత ద్రవ్యోల్బణంతో పోరాడే సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని ఆర్థిక నిపుణుడు, ఐఐటీ ప్రొఫెసర్ కూడా అయిన ఎం.పట్టాభిరామ్ అభిప్రాయపడ్డారు. 6 శాతం ద్రవ్యోల్బణం ఐదేళ్ల కాలంలో కొనుగోలు శక్తిని 25 శాతం మేర హరిస్తుందని, 12 ఏళ్లలో 50 శాతాన్ని తగ్గిస్తుందని చెప్పారు. ఇక పన్ను ఆదా కోసమని 60 శాతం కార్పస్‌ను యాన్యుటీలో ఇన్వెస్ట్ చేసే వారు మరింత నష్టపోవాల్సి వస్తుందన్నారు. అయితే... తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలన్న నిబంధనతో రిటైర్ అయిన వ్యక్తి జీవిత కాలం పాటు పెన్షన్ అందుకోవచ్చనేది హేమంత్ నాగ్‌పాల్ అభిప్రాయం. ఈ వాదనను కోటక్ పెన్షన్ ఫండ్ సీఈవో సందీప్ శ్రీఖండే కూడా సమర్థించారు. ‘‘సామాన్యుల చేతికి ఏక మొత్తంలో డబ్బులందితే ఆ మొత్తాన్ని వెంటనే ఖర్చు చేసే ధోరణి పెద్ద ప్రతికూలత. వీరు రిటైర్మెంట్ నిధులను పిల్లల విద్య లేదా వివాహాలు లేదా ఇంటి అవసరాలకు ఖర్చు చేస్తుండడం సాధారణంగా జరుగుతుంటుంది. దీంతో పెన్షన్ నిధికి మిగిలేది తక్కువే’’ అని శ్రీఖండే వివరించారు. యాన్యుటీ రేట్లు ఆకర్షణీయంగా లేకపోవడం మరో ప్రధానమైన అంశం. రూ.50 లక్షలు యాన్యుటీ ప్లాన్‌లో పెడితే, ప్రతీ నెలా వచ్చే పెన్షన్ రూ.30,000 స్థాయిలోనే ఉంటుంది. మరో సమస్య యాన్యుటీ నుంచి అందుకునే పెన్షన్ మొత్తంపై పన్ను అమలవడం. యాన్యుటీల నుంచి అందుకునే పెన్షన్‌పై పన్ను ప్రయోజనాలు కల్పిస్తే ఎన్పీఎస్ మరింత ప్రాచుర్యంలోకి వస్తుందనేది నిపుణుల మాట. అలాగే, ఎన్పీఎస్ కార్పస్‌ను ఇతర పెన్షన్ సాధనాలైన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ప్రధానమంత్రి వయవందన యోజన వంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తే బావుంటుందన్నారు. కనీసం ఎన్పీఎస్ ఇన్వెస్టర్లకు ప్రత్యేక వడ్డీ రేటును ఆఫర్ చేయాలని వారు కోరారు. 60 ఏళ్ల లాకిన్ కాస్త ఇబ్బందే... ఎన్పీఎస్ చందాదారులు 60 ఏళ్లు వచ్చేలోపు పెట్టుబడులను పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఈ నిబంధన నచ్చని వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఆర్థిక సలహాదారులు సైతం పెట్టుబడులను ముందుగా తీసుకునే స్వేచ్ఛ ఉండాలంటున్నారు. అయితే, 60వ ఏడు రాకముందే పెట్టుబడులను వెనక్కి తీసుకోవటానికున్న ఒకే మార్గం... 80 శాతం నిధులన్ని యాన్యుటీలో పెట్టి చేయటం. అపుడు 20 శాతం నిధులే ఇన్వెస్టర్‌కు మిగులుతాయి. ఈ పథకంలో మొత్తం మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలకూ అవకాశం ఉన్నా ప్రత్యేక అవసరాలకు పరిమితం చేశారు. రెండు ఉపసంహరణల మధ్య విరామ సమయం ఐదేళ్లుగా ఉంది. కానీ ఈ విధమైన నియం త్రణల వల్ల విద్య, వివాహం అవసరాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, ఈ నియంత్రణలను ఎత్తివేస్తే రిటైర్మెంట్ ప్రణాళిక దెబ్బతింటుందని వాదించే వారూ ఉన్నారు. ‘‘దీర్ఘకాల సాధనాల్లో పెట్టుబడులను కొనసాగించడం ద్వారా అధిక రాబడులను ఆర్జించొచ్చు. విశ్రాంత జీవనం కోసం చేస్తున్న పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సింది ఇదే. కేవలం డబ్బుల్ని వెనక్కి తీసుకోవటం మాత్రమే కాదు. దీనివల్ల దీర్ఘకాలంలో రెట్టింపయ్యే ప్రతిఫలాన్ని కోల్పోయినట్టవుతుంది’’ అని విలిస్ టవర్స్ వాట్సన్ దక్షిణాసియా విభాగం హెడ్ కులిన్ పటేల్ తెలిపారు. ‘‘ఉపసంహరణలపై ఎన్పీఎస్ నిబంధనలు సమంజసంగానే ఉన్నాయి. పెట్టుబడుల్ని వెంటనే వెనక్కి తీసుకోకుండా నిరుత్సాహపరచడం వల్ల రిటైర్మెంట్కు భారీ మొత్తంలో నిధి సమకూరే అవకాశం ఉంటుంది. నిజమైన వైద్య అవసరాలకు పెట్టుబడులను పాక్షికంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఎటూ ఉంది’’ అన్నారాయన. రాబడులకు హామీ లేదు! రాబడులపై ఎటువంటి హామీ లేకపోవడమే కార్మిక సంఘాలు ఎన్పీఎస్ను వ్యతిరేకించడానికి కారణం. దీన్ని పెన్షన్ పథకం అని పిలవకూడదని, ఎందుకంటే పెన్షన్ ఎంత వస్తుందనేది నిర్వచించకపోవడమేనని వాదన. ఎన్పీఎస్ అన్నది మార్కెట్లు బాగా పెరిగినందున ప్రస్తుతానికి బాగానే కనిపిస్తుందని, డౌన్‌ట్రెండ్‌లో దీనికి భిన్నమైన పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు. ఒకవేళ మార్కెట్లు పతనమైన సంవత్సరంలో పదవీ విరమణకు వచ్చిన వారి పరిస్థితి ఏంటి? మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ 5–10 ఏళ్ల పాటు కొనసాగితే రిటైర్మెంట్ ప్రణాళిక తల్లకిందులవుతుంది కదా? అనేవి వారి ప్రశ్నలు. అయితే, ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలే కాకుండా పూర్తిగా గిల్ట్ ఫండ్స్, బాండ్లలో పెట్టుబడులు పెట్టే ఆప్షన్లను ఎంచుకునే అవకాశమూ ఉంది. రిస్క్ భరించలేని వారు వీటిని ఎంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎన్‌పీఎస్‌లో గత ఏడాది కాలంలో గిల్ట్‌ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే కేవలం 2 శాతమే తక్కువ రాబడులనిచ్చాయి. దీంతో ఇవి రిస్క్ తీసుకోలేని వారికి ఉత్తమ ఆప్షన్‌గా పేర్కొంటున్నారు. ఏ అంశాన్ని ఎందరు ఇబ్బందిగా భావిస్తున్నారు...? ఎన్పీఎస్ నిధిపై పన్ను వేయడం 35 % ఈక్విటీలపై పరిమితి 12 % యాన్యుటీ తప్పనిసరి చేయడం 31 % 60 ఏళ్లలోపు వెనక్కి తీసుకోలేకపోవడం 44 % మార్కెట్ ఆధారిత రాబడులు 7 % -
ఈపీఎఫ్.. ఎన్పీఎస్...విరమణ తరవాత నేస్తాలివే!
♦ రిటైర్మెంట్ కోసం ఇవే నయమంటున్న నిపుణులు ♦ ఈపీఎఫ్ సురక్షిత పథకం, రాబడులు తక్కువ ♦ ఎన్పీఎస్ రాబడులు ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువే ♦ అయినప్పటికీ దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ♦ విశ్రాంత జీవనం హాయిగా సాగేందుకు రెండూ అవసరమే! జీతంపై ఆధారపడినవారు ఈ రోజు ఎలా గడుస్తోందో చూసుకోవటంతో పాటు... మున్ముందు ఎలా గడుస్తుందో కూడా ఆలోచించాలి. రిటైర్మెంట్ కోసం పన్ను ఆదాతో పాటు మంచి నిధిని సమకూర్చుకోవాలనుకుంటే ఈపీఎఫ్, ఎన్పీఎస్ మెరుగైన చాయిస్ అంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్లు. ఈపీఎఫ్, ఎన్పీఎస్!! ఈ రెండింటిలోనూ రాబడులు ఎలా ఉంటాయ్? రిస్క్ ఏంటి? పన్ను ప్రయోజనాలు ఎలా ఉంటాయ్? రెండింటి మధ్య తేడా ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ఎందుకంటే ఈ రెండూ భిన్నమైన ప్రయోజనాలను అందిస్తాయి. ‘‘ఈపీఎఫ్ డెట్ విభాగానికి చెందినది. ఎన్పీఎస్ డెట్‌తోపాటు ఈక్విటీ మార్కెట్లోనూ పెట్టుబడికి వీలు కల్పించే సాధనం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను అందించే సాధనం’’ అనేది బ్యాంక్ బజార్ తాలూకు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విభాగం హెడ్ అజిత్ నరసింహన్ మాట. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఈపీఎఫ్ అన్నది ప్రతి నెలా వేతనం నుంచి కొంత ఇన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లే సాధనం. రిటైర్మెంట్ లేదా ఆకస్మిక మరణం సందర్భాల్లో ఫండ్ అంతా చెల్లిస్తారు. దీర్ఘకాలానికి పెట్టుబడిపై వడ్డీని, ఆ వడ్డీపై మరింత వడ్డీని సమకూర్చే సాధనమిది. సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలన్నిట్లోకీ ఎక్కువ రాబడి ఇస్తున్నది ఇదే. ప్రస్తుతం వడ్డీ రేటు 8.65 శాతం ఉంది. జీవితంలో కీలక అవసరాలైన పిల్లల విద్య, వివాహం, సొంతిల్లు వంటి వాటి కోసం పాక్షిక ఉపసంహరణలకు ఇందులో వీలుంది. ఏదైనా అనారోగ్యం పాలైన సందర్భాల్లో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. ఒక కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత తిరిగి మరో ఉద్యోగం సంపాదించలేకుంటే అప్పుడు కూడా ఈపీఎఫ్ నిధి మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. వేతన జీవులకు ఈపీఎఫ్‌తోపాటు, ఈపీఎస్ (ఉద్యోగ పెన్షన్ స్కీమ్) కూడా ఉంది. బేసిక్ వేతనం, డీఏ ఈ రెండింటి మొత్తంలో 12 శాతం ఉద్యోగి వాటాగా, మరో 12 శాతం సంస్థ వాటాగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు జమ చేస్తారు. అంటే 24 శాతం ఉద్యోగి భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడిగా వెళుతుంది. అయితే, ఉద్యోగి వాటా 12 శాతం భవిష్యనిధి కింద జమ అవుతుంది. సంస్థ వాటా 12 శాతంలో 8.33 శాతం ఈపీఎఫ్ కోసం, మిగిలిన 3.67 శాతం ఈపీఎస్ కోసం కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈపీఎఫ్ వాటాల కింద జమైన మొత్తం, దానిపై వడ్డీ కలిపి రిటైర్మెంట్ తర్వాత చెల్లించడం జరుగుతుంది. ఈపీఎస్ కింద జమైన మొత్తంపై నిర్ణీత శాతం సంబంధిత వ్యక్తికి ప్రతీ నెలా పింఛనుగా అందుతుంది. అయితే, ఇది చాలా స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే కేవలం 3.67 శాతమే జమవుతుంది గనుక. ఈపీఎఫ్‌లో రాబడులకు హామీ ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) వేతన జీవులు, ఈపీఎఫ్ పరిధిలో ఉన్నవారు, స్వయం ఉపాధిలో ఉన్నవారు, 18 ఏళ్లు దాటిన వారు ఎవరైనా ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు. ఎన్ఎస్డీఎల్కు చెందిన సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) దగ్గర ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఇలా చేరిన వారికి శాశ్వత రిటైర్ ఖాతా నంబర్ (ప్రాన్) కేటాయిస్తారు. ఏడాదిలో కనీసం రూ.6,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో టైర్–1, టైర్–2 అని రెండున్నాయి. టైర్1లో ఉపసంహరణకు అవకాశం లేదు. టైర్–2లో నగదు వెనక్కి తీసేసుకోవచ్చు. అయితే, టైర్–2 ఖాతా కావాలంటే అప్పటికే టైర్–1 ప్రారంభించి, యాక్టివ్‌గా ఉండాలి. ఎన్‌పీఎస్‌లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పరమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే గడువు తర్వాత మొత్తం నిధిలో 40 శాతాన్ని యాన్యుటీ పథకంలో నెలనెలా పెన్షన్ కోసం గాను ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఎన్‌పీఎస్‌లో రిస్క్ ఆధారిత పెట్టుబడులకు గాను మూడు వర్గీకరణలు చేశారు. అస్సెట్ క్లాస్ ఈ అంటే ఈక్విటీ, అస్సెట్ క్లాస్ సీ అంటే కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలు. అస్సెట్ క్లాస్ జీ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు ఉద్దేశించినవి. ఈక్విటీల్లో రిస్క్ అధికం, రాబడులూ అధికమే. కార్పొరేట్ డెట్ సెక్యూరిటీల్లో రిస్క్ మధ్యస్థంగా ఉంటుంది. రాబడులు మోస్తరుగా ఉంటాయి. ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిస్క్ తక్కువ, రాబడులు తక్కువ. ఇన్వెస్టర్లు తమ రిస్క్ ఆధారంగా వీటిని ఎంచుకోవచ్చు. ఈక్విటీలో గరిష్ట పెట్టుబడులు 50 శాతానికే పరిమితం. కనుక రిస్క్ భరించే వారు ఈక్విటీకి 50 శాతం పోను మిగిలిన పెట్టుబడికి కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఏదో ఒక దానిని లేదా రెండింటినీ ఎంచుకోవచ్చు. మూడూ కోరుకుంటే వేటికి ఎంత వాటా కేటాయించాలన్నది ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఏది బెటర్? ఎన్పీఎస్ అన్నది పూర్తిగా రిటైర్మెంట్ కోసం ఉద్దేశించినది. ఈపీఎఫ్‌ను మాత్రం రిటైర్మెంట్కు, సొంతిల్లు, ఇతర లక్ష్యాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో 60 ఏళ్లు వచ్చిన తర్వాత కాల వ్యవధి తీరుతుంది. అప్పుడు సమకూరిన నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. 40 శాతాన్ని యాన్యుటీ పథకంలో పింఛను కోసం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు రాకముందే పథకం నుంచి తప్పుకుంటానంటే సమకూరిన నిధిలో 80 శాతాన్ని యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్నే వెనక్కి ఇస్తారు. ఎన్‌పీఎస్‌లోనూ పెట్టుబడుల ఉపసంహణకు అవకాశం ఉంది. పదేళ్ల తర్వాత మొత్తం నిధిలో 25 శాతాన్ని డ్రా చేసుకోవచ్చు. ప్రత్యేక అవసరాల కోసమే దీన్ని పరిమితం చేశారు. మొత్తం కాల వ్యవధి తీరేలోపు ఇలా మూడు సార్లు డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు. పన్ను ప్రయోజనాలు ఈపీఎఫ్‌లో చేసే పెట్టుబడులు సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టారనుకోండి. అప్పుడు అదనంగా మరో రూ.50,000ల వరకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై సెక్షన్ 80సీసీడీ (1బి) కింద పన్ను మినహాయంపు పొందే సౌలభ్యం ఉంది. అంటే రూ.2.50 లక్షలు బేసిక్ మినహాయింపు, అదనంగా సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల మినహాయింపు పోను మరో రూ.50,000లపై ఎన్పీఎస్ రూపేణా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఏడాదికి రూ.4.5 లక్షలు ఆపైన ఆదాయం ఉన్న వారికి ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ విధమైన ప్రయోజనం కూడా ఉంది. ఇక ఉపసంహరణ సమయంలో పన్ను మినహాయింపు లేని పథకం ఇది. చివర్లో సమకూరిన నిధిలో 40 శాతం యాన్యుటీకి వెళుతుంది. 20 శాతంపై ఆదాయపన్ను చెల్లించాలి. మిగిలిన 40 శాతం పన్ను రహితం. రాబడి ఏ స్థాయిలో ఉంటుంది? ఈపీఎఫ్‌లో 2016–17 సంవత్సరానికి గాను కేంద్రం 8.65 శాతం వడ్డీ రేటును ఇచ్చింది. ఎన్‌పీఎస్‌లో మార్కెట్ అనుసంధానిత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో రాబడులు ఎక్కువగా ఉన్నాయి. ఏడాదిలో 20 శాతానికిపైగా రాబడులను ఇచ్చిన పథకాలు ఉన్నాయి. నిజానికి ఈ రెండూ భిన్న అవసరాలను తీర్చేవి గనుక రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. రిటైర్మెంట్కు ముందు ఎదురయ్యే కీలక లక్ష్యాలకు ఈపీఎఫ్ నిధి ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్‌ను కదిలించకుండా తమ అవసరాలను తీర్చుకోగలిగితే రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్, ఎన్పీఎస్ రెండూ కలిపి పెద్ద నిధి సమకూరుతుంది. దాన్ని సరైన రాబడినిచ్చే పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మలి జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు.