Pranahita-Chevella project
-
ప్రాణహిత పడుకున్నట్లే..!
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా అతీగతీ లేని ప్రాణహిత ప్రాజెక్టుకు మున్ముందూ అవే పరిస్థితులు దాపురించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపు లతో ప్రాణహిత ప్రాజెక్టు పూర్తిగా పడకేసే సూచనలున్నాయి. 2017–18 బడ్జెట్లో భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగినా, పనులు జరగక నిధులన్నీ నీరసపడగా.. ఈ ఏడాది ఏకంగా బడ్జెట్‌ను సగం తగ్గించి రూ.350 కోట్లకే పరిమితం చేయడం ద్వారా ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. నిధులున్నా నీరసం 2008లో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని గతంలో నిర్ణ యించగా, దాన్ని తదనంతరం రెండు లక్షల ఎకరాలకు పెంచింది. దీనికి అనుగుణంగా రూ.6,465 కోట్లకు అంచనాలు సవరిం చింది. ఇక అటవీ, వన్యప్రాణి అనుమతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులో భాగంగా నిర్మించే తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని ఒకటిన్నర కిలోమీటర్ దూరం పైకి జరిపింది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడంతో నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలకు తగ్గింది. అయితే గేట్ల సంఖ్య, పొడవు పెరగడం వంటి కారణాలతో నిర్మాణ వ్యయం రూ.965 కోట్ల నుంచి రూ.1,912 కోట్లకు పెరిగింది. అయితే పెరిగిన వ్యయాన్ని 2008–09 ఎస్ఎస్ఆర్ లెక్కల ఆధారంగా గణించగా.. తాజా ఎస్ఎస్ఆర్ రేట్లను పరిగణనలోకి తీసుకొంటే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగినా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఈ అనుమతి వచ్చిన తర్వాతే టెండర్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. దీనికి తోడు బ్యారేజీ నిర్మా ణానికి 665 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా ఈ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో పాటే బ్యారేజీ నుంచి 72 కిలోమీటర్ల మేర కాల్వల తవ్వకం చేయాల్సి ఉన్నా ఆ పనులు అంతంత మాత్రంగానే జరుగుతు న్నాయి. గత ఏడాది రూ.775.40 కోట్లు కేటాయించినా 106.46 కోట్లే ఖర్చయ్యాయి. ఈ బడ్జెట్లో మిగిలేది రూ.83 కోట్లే! ఇక ప్రాజెక్టు మొత్తానికి 508 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉండగా, దీనికి కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ మొదటి దశ అనుమతి వచ్చి 8 నెలలైంది. దీనికి రూ.102 కోట్ల పరిహారాన్ని చెల్లిస్తే రెండో దశ అనుమతి లభించే అవకాశం ఉన్నా, నిధులు విడుదల చేయలేదు. ఇక వన్యమృగ సంరక్షణ ప్రాంతం లో మరో 622 హెక్టార్ల భూమి బదలా యింపునకు కూడా మొదటి దశ అనుమతి లభించింది. దీనికి పరిహారంగా రూ.165 కోట్లు మేర అవసరం అవుతున్నాయి. ఈ పరిహార ప్రతిపాదనలకు ఇంకా తుదిరూపు రాకపోవడంతో 2017–18లో కేటాయించిన బడ్జెట్‌ను రూ.220 కోట్లకు సవరించారు. ఇందులో రూ.106.46 కోట్లే ఖర్చవగా మిగిలిన నిధులు ఈ నెలాఖరులోగా విడుదల చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో అటవీ, వన్యప్రాణి పరిహా రానికి రూ.267 కోట్లను 2018–19 బడ్జెట్లో కేటాయించిన రూ.350 కోట్ల నుంచే ఖర్చు చేయాల్సి ఉంది. అదే జరిగితే మిగతా భూ సేకరణ, ఇతర పనులకు మిగిలింది రూ.83 కోట్లే. ఈ నిధులతో ప్రాణహిత ప్రాజెక్టు పనులెలా సాగుతాయన్నది ప్రశ్న. -
మహారాష్ట్రకు మేలు చేస్తున్న కేసీఆర్: జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తమ్మిడిహెట్టి వద్ద కాకుండా, మేడిగడ్డ వద్ద నిర్మించి మహారాష్ట్రకు మేలు, తెలంగాణకు అన్యా యం చేస్తున్నారని ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే తమ్మిడిహెట్టి వద్ద కాకుండా ప్రాజెక్టులను కిందికి మార్చారన్నారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే అయిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా కాళేశ్వరం వద్ద శంకుస్థాపన చేశారన్నారు. కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టారన్నా రు. ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం తేల్చకుండానే పనులు చేయడం వల్ల రైతులు నష్టపోతారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ్మిడిహెట్టి-మేడిగడ్డ మధ్య నీటిని మహారాష్ట్ర అక్రమంగా వాడుకోవడానికి అవకాశం కల్పించారని ఆరోపించారు. -
హరీష్‌రావు, భట్టి వాగ్వాదం
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా తెలంగాణను ప్రభుత్వం మహారాష్ట్రకు తాకట్టు పెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, భారీగా పెంచిన వ్యయాలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, భట్టి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. భట్టి మాట్లాడుతూ...ప్రభుత్వ సొంత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.36 వేల కోట్ల నుంచి రూ. 86 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. -
'ఆ ఒప్పందం వెనుక మతలబు ఏంటి?'
కరీంనగర్: మహారాష్ట్రతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పందంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మహా ఒప్పందం పేరిట తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ చిన్నాభిన్నం చేశారంటూ ఆర్మూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ అనాలోచిత విధానానికి, అహంకారానికి నిదర్శనమంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టు పెట్టారంటూ దుయ్యబట్టారు. మహారాష్ట్రతో కుదిరిన తాజా ఒప్పందంతో ఆర్థిక భారంతో పాటు, నీటి హక్కులను కోల్పోతామని చెప్పారు. ఏక పక్షంగా కుదుర్చుకున్న ఒప్పందం వెనుక మతలబు ఏమిటీ? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే 1800 ఎకరాలు ముంపునకు గురవుతుందని అప్పట్లో అభ్యంతరం తెలిపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడెలా ఒప్పుకుంటారని సూటిగా ప్రశ్నించారు. అయితే 2012లోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌పై పృథ్వీరాజ్ చౌహాన్ ఒప్పందం చేసుకుందంటూ ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ మేధావులు, విద్యార్థులు మహా ఒప్పందంపై మేల్కోనాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మహా ఒప్పందం, ప్రాజెక్ట్‌ల రీ డిజైన్‌పై తెలంగాణ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఏమీ చేయకుండా నిర్లక్ష్యం చేసి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించడానికి ఒప్పందం కుదుర్చుకుందంటూ విమర్శించారు. మహారాష్ట్ర బీజేపీ, తెలంగాణ టీఆర్ఎస్లు ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నాయని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. -
ప్రైవేటు యూనివర్సిటీలకు పచ్చజెండా!
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ * బడ్జెట్ సమావేశాలే ప్రధాన ఎజెండా * కొత్త మైనింగ్ విధానం సహా 25 అంశాలపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. వీసీల నియామకం, ప్రైవేటు వర్సిటీలకు అనుమతి, ఒక మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వీలుగా ఏపీ ఉన్నత విద్యా చట్టం లో మార్పు లు చేస్తూ తెలంగాణకు అన్వయిం చుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు అనుగుణంగా అంచనాల్లో, పరిపాలనా అనుమతుల్లో మా ర్పులను వేగవంతం చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని, 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లో ఆదివారం కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగ పాఠానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టే ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు సంబంధించి కేబినెట్లో పలు సవరణలతో ఆమోదం పొందాల్సి ఉంది. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల ప్రాజెక్టులకు రూ.5,813 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ నిర్ణయానికి ఆమోదం పొందాల్సి ఉంది. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల రీడిజైనింగ్పైనా, మిడ్‌మానేరు నిర్వాసితులకు మరింత లబ్ధి చేకూరేలా పరిహారం ప్యాకేజీ చెల్లింపుల్లో మార్పులు చేర్పులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. నీటిపారుదల విభాగంలో సూపర్ న్యూమరీ పోస్టుల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)లను మరో ఏడాది పాటు కొనసాగించాలనే ప్రతిపాదనను ఎజెండాలో పొందుపరిచారు. కొత్త మైనింగ్ విధానం కొత్త మైనింగ్ విధానానికి కేబినెట్లో ఆమోద ముద్ర వేస్తారు. హమాలీ కుటుంబాల్లో పట్టభద్రులుగా ఉన్న మహిళలకు ప్రోత్సాహకం ఇచ్చే అంశం ఎజెండాలో ఉంది. ఆర్టీసీకి రూ.500 కోట్ల గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథకు నాబార్డు నుంచి రూ.1,900 కోట్ల రుణం, హడ్కో నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్సప్లై బోర్డుకు తీసుకునే రుణానికి ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాలను చర్చిస్తారు. ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌లు తెచ్చింది. వాటిని చట్టంగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లులు పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిషరీస్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపన, బేగంపేట క్యాంపు ఆఫీసు సమీపంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు మూడెకరాల స్థలం కేటాయింపు, మెదక్ జిల్లాలోని ముచ్చర్ల సమీపంలో 50 ఎకరాలను టీఎస్ఐఐసీకి కేటాయింపు అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల మైనారిటీ విభాగంలో 20 రెగ్యులర్ పోస్టులు, 19 ఔట్ సోర్సింగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య విభాగంలో 23 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి కేబినెట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
‘మేడిగడ్డ’కు రూ.5,813 కోట్లు
మూడు బ్యారేజీల నిర్మాణానికి నిధుల కేటాయింపు..ఉత్తర్వులు జారీ మహారాష్ట్రతో పక్షంలోగా ఒప్పందం! సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద చేపట్టనున్న మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీలకు రూ.5,813 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం పరిపాలనా అనుమతులిచ్చింది. ఇందులో మేడిగడ్డ బ్యారేజీకి రూ. 2,591 కోట్లు, అన్నారం బ్యారేజీకి రూ. 1,785 కోట్లు, సుందిళ్ల బ్యారేజీకి రూ. 1,437 కోట్లు కేటాయించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషీ విడివిడిగా ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తంగా 21.29 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ బ్యారేజీలను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులతో కేవలం బ్యారేజీలు, గేట్ల నిర్మాణం మాత్రమే చేపట్టనున్నారు. పంప్‌హౌస్, మోటార్లు వంటి సివిల్ అండ్ ఎలక్ట్రోమెకానికల్ పనులకు సంబంధించి విడిగా అంచనాలు తయారు కానున్నాయి. వీటి నిర్మాణానికి దాదాపు రూ.6 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిన అధికారులు ప్రస్తుతం తుది అంచనాలు సిద్ధం చేస్తున్నారు. మూడు బ్యారేజీలను మూడు ప్యాకేజీలుగా పరిగణిస్తూ అధికారులు విడివిడిగా వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. కాగా, మేడిగడ్డపై మహారాష్ట్ర ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైన వెంటనే ఒప్పందాలపై ఇరు రాష్ట్రాలు సంతకాలు చేయనున్నాయి. ఈ ప్రక్రియ మరో 10-15 రోజుల్లోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. -
పెరిగిన ‘కాళేశ్వరం’ బ్యారేజీల వ్యయం
♦ మూడు బ్యారేజీలకు వ్యాప్కోస్ అంచనా రూ.4,743 కోట్లు ♦ తాజా ప్రభుత్వ అంచనాలతో రూ.6,481.72 కోట్లకు చేరిక సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించదలిచిన బ్యారేజీల అంచనా వ్యయం క్రమంగా పెరుగుతోంది. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గాల మధ్య తలపెట్టిన మూడు బ్యారేజీల నిర్మాణానికి గతంలో వ్యాప్కోస్ వేసిన అంచనా, తాజాగా నీటిపారుదల శాఖ వేసిన అంచనాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. వ్యాప్కోస్ అంచనా రూ.4,743 కోట్లు ఉండగా, తాజా అంచనా రూ.6,481.72 కోట్లుగా ఉంది. ప్రస్తుత అంచనా రూ.1738.72 కోట్లు అధికంగా ఉంది. ఇంకా పంప్‌హౌజ్‌ల వ్యయాలను సైతం సిద్ధం చేస్తే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశముంది. భారీగా పెరిగిన అంచనా... మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తంగా 21.29 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 103 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఎత్తులో 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో, మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి 14 కి.మీ. దాటాక 124 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద గోదావరి ప్రవాహపు ప్రాంతంలో అన్నారం వద్ద 3.52 టీఎంసీలతో, 25 కి.మీ. తర్వాత 134 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సుందిళ్ల వద్ద 1.62 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాల కోసం రెండు వేర్వేరు ఎస్ఎస్ఆర్ల ప్రకారం వ్యాప్కోస్ అంచనాలు సిద్ధం చేసింది. ఈపీసీ పద్ధతిన కుదుర్చుకున్న సమయానికి 2007-08లో ఉన్న ఎస్ఎస్ఆర్ ప్రకారం లెక్కిస్తే మూడు బ్యారేజీలకు రూ.3,649 కోట్లు ఖర్చు కానుంది. అదే ప్రస్తుత రేట్ల ప్రకారం లెక్కిస్తే వ్యయం రూ.4,743 కోట్ల మేర ఉండనుంది. ఇక్కడ వ్యత్యాసం రూ.1,094 కోట్లుగా అధికారులు గుర్తించారు. అయితే పాత రేట్ల ప్రకారం పనులు చే యడం సాధ్యం కాదని కాంట్రాక్టుర్లు తేల్చిచెప్పడంతో కొత్త రేట్ల ప్రకారమే మళ్లీ టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చేసిన సూచనలకు అనుగుణంగా చిన్నపాటి మార్పులు చేస్తూ బ్యారేజీల తాజా అంచనాలను సిద్ధం చేసింది. మూడు బ్యారేజీలకు కలిపి 6,481.72 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. వ్యాప్కోస్ అంచనాతో పోలిస్తే అంచనా ఏకంగా రూ.1,738.72 కోట్లు పెరిగింది. తాజా అంచనాలో అత్యధికంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.3,438.72 కోట్లు కానుంది. అన్నారం బ్యారేజీకి రూ.1,738.72 కోట్లు, సుందిళ్ల బ్యారేజీకి రూ.1,461 కోట్లు వ్యయ అంచనా వేశారు. ఈ బ్యారేజీల పనులను ప్రారంభించేందుకు వీలుగా అంచనాలను ఆమోదించాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంగళవారం ప్రభుత్వానికి లేఖ రాసింది. రెండేళ్ల కాల వ్యవధిలో ఈ పనులను పూర్తిచేసేందుకు వీలుగా తక్షణమే ఆమోదం తెలపాలని కోరింది. -
ప్రాణహిత ప్యాకేజీ 9లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్యాకేజీ 9లో భాగంగా మిడ్‌మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు ఉన్న పనుల్లో మార్పులు చేస్తూ ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. వచ్చే రెండేళ్లలో ఈ పనులు పూర్తిచేసేలా మార్పులను ఆమోదిస్తున్నట్లు పేర్కొంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రతిపాదిత డిజైన్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం... ఎల్లంపల్లి నుంచి కొమరవెల్లి మల్లన్నసాగర్ వరకు పలు మార్పులు చేసింది. వీటి మధ్యలో ఉండే అనంతగిరి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.7 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీలకు పెంచగా, ఇమామాబాద్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 0.8 టీఎంసీలకు తగ్గించింది. కొమరవెల్లి మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని 1.50 టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచింది. తాజాగా మిడ్‌మానేరు, అప్పర్ మానేరు మధ్యలో ఉన్న మలక్‌పేట బ్యారేజీ సామర్థ్యాన్ని 0.35 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచిం ది. నిజానికి ప్యాకేజీ 9 కింద మొత్తంగా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పనులకు మొత్తంగా రూ.714.96 కోట్ల అంచనాతో పనులు చేపట్టగా... రూ. 62 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. -
‘ప్రాణహిత’ ప్యాకేజీల అంచనాలు పైపైకి!
♦ 11, 12 ప్యాకేజీల్లో మార్పులతో భారీగా పెరగనున్న వ్యయం ♦ రూ.3,500 కోట్లు పెరగనున్న వ్యయం ♦ మరో 7 కి.మీ. పెరగనున్న టన్నెల్ నిర్మాణం సాక్షి, హైదరాబాద్: పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు, రాజధాని నగర తాగు అవసరాలకు ఉద్దేశించిన ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు అంచనాలు పైపైకి ఎగబాకుతున్నాయి. రీ డిజైన్‌లో భాగంగా కొత్తగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపుతో నిర్మించే కొత్త బ్యారేజీలతోనే భారం రూ.10 వేల కోట్లకు పెరుగుతుండగా, ప్రాజెక్టులో భాగంగా ఉన్న ప్యాకేజీ 11 నుంచి 14 వరకు జరుగుతున్న మార్పులతో భారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు వ్యయం రూ.50 వేల కోట్లకు చేరుతుందని అంచనా ఉండగా, ఇవన్నీ తేలితే వాస్తవ వ్యయం ఎంత పెరుగుతుందనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మారిన ప్రతిపాదనల మేరకు సామర్థ్యం పెంచిన రిజర్వాయర్లన్నీ ప్రాజెక్టు లింకు-4లో మిడ్‌మానేరు నుంచి పాలముపర్తి వరకు గల 11 నుంచి 14 ప్యాకేజీల్లో ఉన్నాయి. ఇందులో 11, 12 ప్యాకేజీల్లో చేయాల్సిన మార్పులు, పెరిగే వ్యయ భారంపై అంచనాలు సిద్ధంకాగా, 13, 14 ప్యాకేజీలపై ఇంకా తేల్చాల్సి ఉంది. ప్యాకేజీ 11ను మొత్తంగా రూ.2,500 కోట్లతో చేపట్టగా, ఇందులో భాగంగా ఉన్న ఇమామాబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 0.8 టీఎంసీకి తగ్గించగా, తర్వాతి ప్యాకేజీలో ఉండే మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని 1.5 నుంచి 50 టీఎంసీలకు పెంచారు. దీనికి అనుగుణంగా కాల్వల డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 241 క్యూమెక్కుల నుంచి 301.25 క్యూమెక్కులకు పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ 5 పంపులకు తోడు అదనంగా మరో పంపును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మొత్తానికి రూ.500 కోట్ల అదనపు వ్యయం అవుతుందని తేల్చారు. ఇక ప్యాకేజీ 12లో మల్లన్నసాగర్ సామర్థ్యం పెంచినందున ఇక్కడ కాల్వల డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 213 క్యూమెక్కుల నుంచి 329 క్యూమెక్కులకు పెంచగా, పంపులను 6 నుంచి 8కి పెంచారు. ఇక్కడ ఈ ప్యాకేజీల 9.18 కిలోమీటర్ల టన్నెల్ ఉండగా ఇప్పుడది మరో 7 కి.మీ. పెరిగి 16.18 కి.మీ.కి చేరింది. ప్రస్తుతం టన్నెల్, కాల్వల వెడల్పు, అదనపు పంపులకు కలిపి రూ.1,520 కోట్ల మేర వ్యయం పెరగనుండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి అదనంగా మరో రూ.1,500 కోట్ల అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా రెండు ప్యాకేజీల్లో కలిపి రూ.3,500 కోట్ల అదనపు వ్యయాన్ని ఇప్పటి వరకు లెక్కగట్టారు. -
తుమ్మిడిహెట్టికి ఓకే!
* 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీకి మహారాష్ట్ర సూత్రప్రాయ అంగీకారం * ముంపుపై అధ్యయనం చేశాక మేడిగడ్డపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి * మహారాష్ట్ర మంత్రితో హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం సమావేశం * 29, 30వ తేదీల్లో రాష్ట్ర అధికారులతో మరోమారు హైదరాబాద్‌లో భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీని ముంపు ఉండని స్థాయిలో నిర్మించేందుకు మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ముంపు లేనందున.. ఆ ఎత్తు తమకు సమ్మతేమనని పేర్కొంది. కాళేశ్వరం దిగువన నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ముంపుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాకే నిర్ణయం చెబుతామని చెప్పింది. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రాణహిత అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నాగ్‌పూర్‌లో సమావేశం.. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలతో ముంపు విషయమై మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆ రాష్ట్ర మంత్రులు గిరీష్ మహాజన్, విజయ్ శివతరే, జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో... మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఉన్నతాధికారుల బృందం చర్చలు జరిపింది. తొలుత గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రూపొందిస్తున్న పథకాలను హరీశ్ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో నీటి పంపకాలే ప్రధాన ప్రాతిపదికగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. నీటి వనరుల అభివృద్ధి విషయంలో ప్రజలు ఆశలు పెట్టుకున్నారని.. అందుకు తగినట్లుగా రాబోయే ఐదేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. సాగునీటి వనరుల అభివృద్ధితో రైతుల ఆత్మహత్యలను పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించి ఆ ప్రకారంగా కాలువల తవ్వకాన్ని కూడా ప్రారంభించిందన్నారు. దానిపై మహారాష్ట్ర అభ్యంతరాలతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం వ్యక్తం చేసిన అనుమానాలను దృష్టిలో పెట్టుకుని... తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను అన్వేషించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అధ్యయనం చేసి గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించిందని మంత్రి చెప్పారు. ఈ ఎత్తులో ముంపు మొత్తం నది గర్భంలోనే ఉంటుందని వ్యాప్కోస్ అధ్యయనంలో తేలిందన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు పరిమితం చేసి, మిగతా జిల్లాల అవసరాలకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేలా పథకాన్ని రూపొందించిందని వివరిస్తూ... ఈ రెండు బ్యారేజీలకు అనుమతివ్వాలని కోరారు. అధ్యయనం చేశాక నిర్ణయం తెలంగాణ వాదనలు విన్న మహారాష్ట్ర బృందం తుమ్మిడిహెట్టిపై సానుకూలత తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్ణయాన్ని చెప్పలేదు. మేడిగడ్డ వద్ద సర్వేలో తేలిన ముంపు వివరాలను తాము ధ్రువీకరించుకోవాల్సి ఉందని.. వారంలో ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రాణహిత బోర్డు సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. పెన్‌గంగ బ్యారేజీ నిర్మాణంపైనా బోర్డు సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకుందామని పేర్కొంది. -
ముంపుపై నేడు మహారాష్ట్రతో చర్చలు
తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ నిర్మాణంపై సంప్రదింపులు నేడు నాగ్‌పూర్‌కు హరీశ్‌రావు హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్చలు జరపనుంది. ఈ ప్రాజెక్టులో మార్పులతో మహారాష్ట్రలో ముంపు బాగా తగ్గిపోతున్న దృష్ట్యా వాటి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ మేర కు మంత్రి హరీశ్‌రావు. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సీఈ హరిరామ్, ఓఎస్డీ శ్రీధర్ దే శ్పాండే తదితరుల బృందం మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లి.. అక్కడ ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్‌తో భేటీ కానుంది. తొలి నుంచి ‘ముంపు’ సమస్య.. ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తొలుత రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలన్న నిర్ణయాన్ని మహారాష్ట్ర వ్యతిరేకించింది. తమ భూభాగంలోని ముంపును అంగీకరించబోమని ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్‌తో చర్చల సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాలు 152 మీటర్ల ఎత్తు నుంచి 148 మీటర్ల వరకు వివిధ స్థాయి లో మహారాష్ట్రలో ఉండే ముంపు ప్రాంతంపై సంయుక్త సర్వే చేశాయి. 152 మీటర్ల వద్ద 7,460 ఎకరాలు, 151 మీటర్ల వద్ద 6,105.69 ఎకరాలు, 150 మీటర్ల వద్ద 4,944.038 ఎకరాల మేర ముంపు ఉంటుందని గుర్తించారు. చివరికి 148 మీటర్ల ఎత్తుపై అధికారుల స్థాయి చర్చల్లో అంగీకారం కుదిరింది. దీంతోనూ మహారాష్ట్రలో కొంతమేర ముంపు ఉండనున్న దృష్ట్యా.. దీనికి మహారాష్ట్ర అంగీకారం తెలపాల్సి ఉంది. మేడిగడ్డతోనూ.. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే 40 నుంచి 45 టీఎంసీలకు మించి నీటిని తరలించే అవకాశం లేకపోవడంతో... ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసింది. సుమారు 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద నుంచి నీటిని తరలించాలని నిర్ణయించిం ది. మేడిగడ్డ నుంచి గోదావరి పరీవాహకాన్ని ఉపయోగించుకుంటూ మధ్యలో 2 బ్యారేజీలు నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజీతోనూ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కొంతమేర ముంపు ఉంటుంది. దీనిని 103 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో 1,331 హెక్టార్లు, 102 మీటర్లలో అయితే 955, 101 మీటర్లతో 626, 100 మీటర్లతో 356, 99 మీటర్లతో 196, 98 మీటర్లతో 77, 97 మీటర్ల ఎత్తుతో 59 హెక్టార్ల మేర ముంపు ఉంటుందని గుర్తించారు. అయితే 100 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని సర్కారు భావిస్తోంది. దీంతో ముంపుపై మహారాష్ట్ర అంగీకారం కోరే అవకాశాలున్నాయి. దానికి అంగీకరించకపోతే 99 మీటర్ల ఎత్తుకు అయినా ఒప్పించాలని.. ఈ ఎత్తులో ముంపు నదీ గర్భంలోనే ఉంటుందని స్పష్టం చేయనున్నారు. మంత్రుల చర్చల్లో వచ్చే ఫలితం మేరకు త్వరలోనే సీఎం స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందాలు చేసుకోనున్నారు. -
‘మేడిగడ్డ’కు 10,300 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే పనులకు రూ. 10,300 కోట్ల వ్యయ అంచనాతో ప్రణాళిక సిద్ధమైంది. ఈ మార్గం లో మొత్తం 21.29 టీఎంసీల సామర్థ్యంతో 3 బ్యారేజీలు నిర్మిస్తారు. 4 లిఫ్టుల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకు 700 మెగావాట్ల విద్యుత్ అవసరమని తేలింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీని 100 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్ర భూభాగంలో ముంపు ఉండనున్న దృష్ట్యా... ముంపు లేకుండా బ్యారేజీ ఎత్తును రెండు మూడు మీటర్లు తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సర్వే సంస్థ వ్యాప్కోస్ ముసాయిదా నివేదిక (డ్రాఫ్ట్)ను శుక్రవారం మంత్రి హరీశ్‌రావుకు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులకు అందజేసింది. ఈ నివేదికపై రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి... అనంతరం ముంపు సమస్యలపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. రూ. 1,400 కోట్లు పెరిగింది.. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టికి బదులుగా... కరీంనగర్ జిల్లా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి కాలువల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాలువల మార్గంలో ఎన్టీపీసీలతో పాటు పర్యావరణ, అటవీ అడ్డంకులు ఉన్నందున.. గోదావరి ప్రవాహ మార్గాన్ని వాడుకోవాలని నిర్ణయించారు. దీనిపై నెల రోజులుగా లైడార్ సర్వే చేసిన వ్యాప్కోస్ ముసాయిదా నివేదికను శుక్రవారం అందజేసింది. దీని ప్రకారం.. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల పూర్తి స్థాయి నిల్వ ఎత్తు(ఫుల్ రిజర్వాయర్ లెవెల్-ఎఫ్ఆర్ఎల్)తో గరిష్టంగా 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీని నిర్మిస్తారు. దీని నుంచి 14 కిలోమీటర్ల దిగువన 120 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద అన్నారం వద్ద 3.52 టీఎంసీలతో బ్యారేజీ, మరో 25 కిలోమీటర్ల దిగువన 130 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సుందిళ్ల వద్ద 1.62 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ చేపడతారు. ఈ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 10 నుంచి 20 మీటర్ల ఎత్తుతో నాలుగు లిఫ్టులు.. 700 మెగావాట్ల విద్యుత్ అవసరం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ. 3,400 కోట్లు, అన్నారం బ్యారేజీకి రూ. 1,600 కోట్లు, సుందిళ్లకు రూ. 1,400 కోట్లతో పాటు పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాలకు కలిపి రూ. 10,300 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే ప్రాజెక్టు ఆరంభించిన సమయానికి ఈపీసీ పద్ధతిలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అప్పటి స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల(ఎస్ఎస్ఆర్) ప్రకారం ఈ పనుల విలువ రూ. 8,900 కోట్లే. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ప్రకారమే చేయాల్సి ఉండటంతో వ్యయ అంచనా రూ.1,400 కోట్ల మేర పెరి గింది. ఈ నివేదికను పరిశీలన నిమిత్తం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)కుపంపా రు. అక్కడ మార్పులంటే ఈ వ్యయ అంచనాల్లోనూ మార్పులు జరిగే అవకాశముంది. మేడిగడ్డతో మహారాష్ట్రలో ముంపు మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో చేపట్టే బ్యారేజీతో రాష్ట్రంలో 500 ఎకరాలు, మహారాష్ట్రలో 400 ఎకరాల మేర ముంపు ఉంటుందని గుర్తించారు. ఈ స్థాయి ముంపును మహారాష్ట్ర అంగీకరించే పరిస్థితి లేనందున.. బ్యారేజీ ఎత్తును % మీటర్లు తగ్గించాలని భావిస్తున్నారు. 100 నుంచి 97 మీటర్ల వరకు వివిధ ఎత్తులో ముంపు ఎలా ఉంటుందన్నది తేల్చాలని వ్యాప్కోస్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో జలరవాణాకు వీలుగా బ్యారేజీల నిర్మాణ ప్రణాళిక తయారు చేయాలని సీడీవోకు సూచించారు. -
రెండు కాదు.. ఐదు ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించడంలో మరింత మెరుగైన డిజైన్‌కు కృషి జరగాలని నీటిపారుదలరంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గాల్లో గోదావరి నదీ ప్రవాహపు దారిలో ప్రతిపాదించిన రెండు బ్యారేజీలకు తోడు మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. ఐదు నిర్మాణాల వల్ల పైప్‌లైన్ నిర్మాణం, వ్యయం తగ్గుతాయని, వీటికితోడు నౌకాయానం, జలవిద్యుదుత్పత్తికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో అన్నారం, సుండెళ్ల ప్రాంతం వద్ద బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలపై వ్యాప్కోస్ సర్వే చేస్తుండటం, జనవరి నుంచి పనులు ఆరంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో ఆయన సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హనుమంతరావు ఇంకా ఏమన్నారంటే... నిర్ణయం సరైందే కానీ.. సాంకేతికంగా చూస్తే తుమ్మిడిహెట్టి వద్ద కన్నా మేడిగడ్డ వద్దే నీటి లభ్యత అధికం. మేడిగడ్డ వద్ద ప్రాణహిత.. గోదావరిలో కలుస్తుంది. ఈ పరీవాహకంలో సగటు వర్షపాతం ఎక్కువ. అయితే తుమ్మిడిహెట్టి 152 మీటర్ల ఎత్తులో ఉంటే 100 మీటర్ల వద్ద మేడిగడ్డ ఉంటుంది. దీంతో తుమ్మిడిహెట్టి కంటే అదనంగా 52 మీటర్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అదనంగా పంపింగ్ చేయాల్సి రావడంతో 10 శాతం ఖర్చు అదనమవుతుంది. ఇదొక్కటే అననుకూల అంశం. అయితే నీటి లభ్యత ముఖ్యమైనందున మేడిగడ్డ తప్పనిసరి. వ్యాప్కోస్ సూచిస్తున్నట్లు రెండు బ్యారేజీలు సరిపోవు. మరో 3 బ్యారేజీలు కడితే ప్రయోజనాలు ఎక్కువ. కాళేశ్వరం వద్ద 4 మీటర్ల బ్యాక్‌వాటర్ లోతు ఉండే ప్రాంతంలో ఒక బ్యారేజీ నిర్మించాలి. ఆ బ్యారేజీ లోపలే పంప్‌హౌజ్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడి నుంచి 16 మీటర్ల ఎత్తులో నీటిని లిఫ్ట్ చేయాలి. దీని బ్యాక్‌వాటర్ మళ్లీ 4 మీటర్ల లోతు వచ్చినప్పుడు ఇంకో బ్యారేజీ నిర్మాణం చేయాలి. దీని నుంచి మరలా 16 మీటర్ల ఎత్తులో లిఫ్టు చేయాలి. ఇదే పద్ధతిన మూడు, నాలుగు, ఐదు బ్యారేజీల నిర్మాణం చేయాలి. అంటే ప్రతీ బ్యారేజీ వద్ద 12 మీటర్ల ఎత్తులో (మొత్తం 16 మీటర్ల ఎత్తులో 4 మీటర్ల లోతు ఉంటుంది కాబట్టి దాన్ని తీసివేయాలి) 5 బ్యారేజీలు కడితే మొత్తం 60 మీటర్ల ఎత్తులో ఎల్లంపల్లికి నీరు చేరుతుంది. ఒకవేళ ఎక్కడైనా బ్యారేజీ ఎత్తును పెంచుతూ పోతే నాలుగు కట్టినా సరిపోతాయి. దీనివల్ల ఎల్లంపల్లికి వరద వచ్చినప్పుడు నీరు పొర్లితే ఎల్లంపల్లి సహా 5 బ్యారేజీల్లో జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. నీరు పొర్లని సమయంలో మాత్రమే నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని రివర్సబుల్ పంపింగ్ అంటారు. ఈ విధానం నాగార్జునసాగర్, శ్రీశైలంలో ఉంది. ఇక 4 మీటర్ల కనీస లోతు ఉంటున్నందున నౌకాయానానికి అనువుగా ఉం టుంది. రెండు బ్యారేజీలు కడితే అది సాధ్యం కాదు. పైప్‌లైన్ నిర్మాణం ఉండనందున నీటి పారుదల నిరోధక ఒత్తిడి (ఫ్రిక్షనల్ లాస్) ఉండదు. పైప్‌లైన్ నిర్మాణమైతే మరో 50 మీటర్ల అదనపు ఎత్తుకు నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. చేవెళ్లకు ప్రాణహితే సరి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు నీటిని అందించేందుకు ప్రాణహిత ప్రాజెక్టే అత్యుత్తమం. చేవెళ్లకు ప్రాణహిత ద్వారా ఇవ్వదలిచిన నీరు పూర్తిగా నికర జలాలు. కానీ పాలమూరు-రంగారెడ్డి ద్వారా చేవెళ్లకు నీరివ్వాలంటే అదనపు జలాలపై ఆధారపడాలి. నిజానికి కృష్ణా జలాల్లో అదనపు జలాలు కేవలం మూడేళ్లలో ఒకమారు మాత్ర మే లభ్యమవుతాయి. ప్రస్తుతం బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకొస్తే నాలుగేళ్లలో ఒకమారు మాత్రమే ఈ లభ్యత ఉంటుంది. కృష్ణా జలాల్లో 258 టీఎంసీల అదనపు జలాలను మహారాష్ట్ర, కర్ణాటకలకు ట్రిబ్యునల్ కేటాయించింది. ఏపీకి సైతం అదనపు జలాలు కేటాయించినా, పై రాష్ట్రాలు వినియోగించుకోకుండా ఉంటేనే అవి అందుబాటులోకి వస్తాయి. ఈ దృష్ట్యా చేవెళ్లకు ప్రాణహిత ద్వారానే నీటిని అందించడం మేలు. -
జలకళ తీసుకొద్దాం!
♦ 160 టీఎంసీల ప్రాణహిత నీటిని మళ్లించేందుకు 16 రిజర్వాయర్లు ♦ గతంలో ఉన్నవి 10 రిజర్వాయర్లు, 16 టీఎంసీల సామర్థ్యం ఉన్నవే ♦ {పస్తుత రిజర్వాయర్లతో 125 టీఎంసీల మేర నిల్వ ♦ కొత్తగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, ఎల్లారెడ్డిలలో 7 రిజర్వాయర్లు ♦ కొత్త ప్రణాళికకు సీఎం సూత్రప్రాయ ఆమోదం సాక్షి, హైదరాబాద్: పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు, రాజధాని తాగు అవసరాలకు ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కేటాయించిన నీటినంతా ఒకేమారు ఒడిసిపట్టేలా బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. వాస్తవ సమగ్ర నివేదిక(డీపీఆర్)ల్లో ఉన్న పలు రిజర్వాయర్ల తొలగింపు, కొత్తగా పలుచోట్ల నిర్మాణం చేసేలా తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాణహితపై ప్రతిపాదిత మేడిగడ్డ నుంచి 160 టీఎంసీల మళ్లింపు, ఇందులో ఒకేమారు 125 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉండేలా రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. కొత్త రిజ ర్వాయర్లలో ఏకంగా 20 టీఎంసీల మేర సామర్థ్యం కలిగిన 7 రిజర్వాయర్లను నిజామాబాద్ జిల్లాలోనే నిర్మించేలా కొత్త డిజైన్ సిద్ధం చేశా రు. అప్పటి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి రంగారెడ్డికి ప్రాణహిత నీటిని మళ్లించే క్రమం లో మొత్తంగా 10 రిజర్వాయర్లను ప్రతి పాదించింది. ఇందులో తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు మేడారం, మలక్‌పేట్, అనంతగిరి, ఇమాంబాద్, తడ్కపల్లి, పాములపర్తి, బస్వాపూర్, తిప్పారం, చేవెళ్ల రిజర్వాయర్లను మొత్తంగా 16 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టాలని భావించారు. మళ్లింపు నీటిని నిల్వ చేసేందుకు ఇవేం సరిపోవన్న ఉద్దేశంతో సిద్ధిపేటలోని తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5 టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గంలోని పాములపర్తిని ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలోని బస్వాపూర్ రిజర్వాయర్‌ను సైతం ఒక టీఎంసీ నుంచి 11 టీఎంసీలకు పెంచాలని, కొత్తగా గంధమలలో 10 టీఎం సీల రిజర్వాయర్‌ను చేపట్టాలని మరో నిర్ణ యం తీసుకుంది. ఈ తరుణంలోనే పాములపర్తి నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నీటి తరలింపునకు కామారెడ్డి నియోజకవర్గంలో 4, ఎల్లారెడ్డిలో 3 రిజర్వాయర్లను కొత్తగా ప్రతిపాదించారు. కామారెడ్డిలో తలమడ్ల, తిమ్మక్కపల్లి, ఖాజాపూర్, ఇసాయిపేట్, ఎల్లారెడ్డిలో మోతె, గుజ్జాల్, కోటెవాడి చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలని నిర్ణయించినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటి సామర్థ్యం 18-20 టీఎంసీలు ఉంటుందంటున్నాయి. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్లలో నిల్వ సామర్థ్యం 16 నుంచి 125 టీఎంసీలకు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. తిప్పారం, చేవెళ్ల రద్దు: ఇక పాములపర్తి నుంచి శామీర్‌పేట చెరువు మీదుగా చేవెళ్లకు నీటిని మళ్లించే విషయమై ఆదివారం అర్ధరాత్రి వరకు వ్యాప్కోస్ ప్రతి నిధులు, ప్రాజెక్టు అధికారులతో జరిపిన సమావేశంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మెదక్ జిల్లాలోని తిప్పారం రిజర్వాయర్‌తో పాటు చేవెళ్ల వద్ద 3 టీఎంసీల రిజర్వాయర్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ప్రాణహిత నుంచి నీటిని చేవెళ్లకు తీసుకురావడం కష్టమని సీఎం ప్రకటించినా, రంగారెడ్డి జిల్లాకు చెందిన విపక్ష నాయకులు ఆందోళన చేస్తుండటంతో చేవెళ్లకు నీటి అంశంపై నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. లైడార్ సర్వే పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెబుతున్నా.. ఆదివారం సమావేశంలో ఈ అంశాన్ని మర్చిపోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం. -
‘ప్రాణహిత’కు దారేదీ?
♦ ‘కాకతీయ’ నుంచి ఎస్సారెస్పీకి నీటి మళ్లింపుపై భిన్నాభిప్రాయాలు ♦ ప్యాకేజీ 7 నుంచి ‘ఎస్సారెస్పీ’కి నీరివ్వాలంటున్న నిపుణులు ♦ ఆ నీటికి సమానంగా ఎస్సారెస్పీ నీటిని తీసుకోవాలని సూచన ♦ అలా అయితేనే ప్రాజెక్టు వ్యయ భారం తగ్గుతుందని వెల్లడి ♦ తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు పెను భారమే! ♦ రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఎక్కువైతే ఎత్తిపోతల ఖర్చు వృథా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు జరుగుతుండగా తాజాగా ప్రాజెక్టు కింద నిర్ణయించిన ఆయకట్టుకు ఎటు నుంచి నీళ్లివ్వాలన్న అంశం కొత్త చర్చకు తెరలేపింది. ప్రాజెక్టు పాత డిజైన్ మేరకే ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు ప్రాణహిత నీటిని ఇవ్వాలని, దానికి ప్రతిగా ప్రాణహిత పరిధి ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీటిని మళ్లించాలని ఇంజనీరింగ్ నిపుణులు సూచించినా ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుండటం ప్రాజెక్టు వ్యయంపై పెను భారం మోపనుంది. పాత డిజైనే హితం..! పాత డిజైన్ మేరకు మేడారం నుంచి మొదలయ్యే ప్యాకేజీ 7లో ఉన్న కాకతీయ కెనాల్ క్రాసింగ్ నుంచి దిగువన ఉన్న ఎస్సారెస్పీ ఆయకట్టుకు ప్రాణహిత నీటి నే ఇవ్వాల్సి ఉంటుంది. 32 టీఎంసీల మేర ప్రాణహిత నీటిని ఎస్సారెస్పీ ఆయకట్టుకు మళ్లించేలా దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ మళ్లిస్తున్న నీటికిబదులుగా అంతే పరిమాణంలో నీటిని ఎస్పారెస్పీ నుంచి తీసుకొని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రాణహిత 20, 21, 22, 27, 28 ప్యాకేజీల్లో ఉన్న 2.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు మళ్లిస్తూ సమతూకం చేసేలా ప్రణాళిక వేశారు. ఎస్సారెస్పీ దిగువ ఆయకట్టుకు ఏటా ఆగస్టు చివరి వారం వరకు నీళ్లిచ్చే పరిస్థితులు లేక పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే ప్రాణహిత నీటిని మళ్లిస్తే అక్కడ జూన్, జూలైల్లోనే నీటిని ఇవ్వగలగడంతోపాటు 120 కి.మీ. దూరాన ఉన్న నిజామాబాద్ ఆయకట్టుకు ప్రాణహిత నీటిని మళ్లించడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న కారణంతో ఈ డిజైన్ రూపొందించారు. అయితే ప్రాణహిత నీటిని మిడ్‌మానేరుకు తేగలుకుతున్నట్లే లోయర్ మానేరు డ్యామ్‌కు కూడా నీటినితెస్తే ప్యాకేజీ 7 అవసరం లేదన్న ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచి హల్దీవాగు, మంజీరా వాగుల నుంచి గ్రావిటీ ద్వారా నిజామాబాద్‌కు నీళ్లిస్తామని చెబుతోంది. అయితే తడ్కపల్లి, పాములపర్తికి నీటిని ఎత్తిపోసేందుకు వేల కోట్లు ఖర్చవుతుందని, కరెంట్ ఖర్చు, ముంపూ భారీగానే ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చెబుతున్నారు. ఎత్తిపోతలకు భారీ ఖర్చు... టీఎంసీ సామర్ధ్యం ఉన్న పాములపర్తి రిజర్వాయర్‌ను 20 టీఎంసీలకు, తడ్కపల్లిని 50 టీఎంసీలకు పెంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి 510 మీటర్ల ఎత్తులో ఉన్న తడ్కపల్లికి టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు 50 మిలియన్ యూనిట్ల ఖర్చవుతుంది. యూనిట్‌కు రూ.5 మేర లెక్కించినా టీఎంసీ నీటికే రూ. 25 కోట్ల ఖర్చవుతుంది. 50 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఏటా సుమారు రూ. 1,250 కోట్లు ఖర్చు కానుంది. 600 మీటర్ల ఎత్తునున్న పాములపర్తికి నీటిని ఎత్తిపోసేందుకు టీఎంసీకి 60 మిలియన్ యూనిట్ల చొప్పున రూ. 30 కోట్ల వరకు ఖర్చవుతుంది. అంటే 20 టీఎంసీలకు రూ. 600 కోట్ల మేర ఖర్చుంటుంది. రిజర్వాయర్లలో 50 టీఎంసీల మేర నీటి నిల్వ చేస్తే అందులో 15 శాతం ఆవిరి నష్టాలు ఉంటాయి. అంటే ఒక్క తడ్కపల్లిలో ఏటా 7.5 టీఎంసీల మేర ఆవిరైతే, వాటిని ఎత్తిపోసేందుకు ఖర్చయ్యే రూ.175 కోట్లు ఏటా వృథాగా పోయినట్లే. అదీగాక తడ్కపల్లి, పాములపర్తి నుంచి నీటిని నిజాంసాగర్‌కు తరలిస్తే ప్రతి టీఎంసీలో 0.50 టీఎంసీ ఆవిరి, ఇతర నష్టాలుంటాయి. ఇక ప్యాకేజీ 7 నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీటిని తరలిస్తే అక్కడా ప్రతి టీఎంసీకి 4 మిలియన్ యూనిట్ల ఖర్చు జరిగే అవకాశం ఉండగా మొత్తంమీద 32 టీఎంసీలకు భారీ ఖర్చయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొంటే పాత డిజైనే మేలని ఇంజనీర్లు చెబుతున్నారు. -
సర్వే పూర్తయ్యాకే ప్రాణహిత నీటిపై నిర్ణయం
రంగారెడ్డికి నీరందించడంపై మంత్రి హరీశ్‌రావు వెల్లడి ‘పాలమూరు’ ద్వారా తక్కువ లిఫ్టులతో ఎక్కువ నీరిచ్చే అవకాశం కాంగ్రెస్ హయాంలో ఎనిమిదేళ్లలో కేవలం రూ. 26 కోట్ల పనులే చేశారు కాంగ్రెస్ నేతలపై మంత్రి ధ్వజం హైదరాబాద్: ప్రస్తుతం గోదావరి నదిపై కొనసాగుతున్న లైడార్ సర్వే పూర్తయ్యాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రాణహితపై ప్రస్తుతం రీ ఇంజనీరింగ్ జరుగుతోందని, సమగ్ర నివేదిక వచ్చాకే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు సుమారు 690 కిలోమీటర్ల దూరం ఉందని, ఐదు లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుతో 130 కిలోమీటర్ల దూరంనుంచి మూడు లిఫ్టులతోనే ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వొచ్చని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతోపాటు ప్రాణహిత నీటిని చేవెళ్ల వరకు అందించాలని ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు దీనిపై చర్చిం చేందుకు జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో జలసౌధలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిజైన్ మార్పునకు గల కారణాలనుఈ సందర్భంగా మంత్రి జిల్లా నేతలకు వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రంగారెడ్డి జిల్లాలో అదనపు ఆయకట్టుకు నీరిచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ఎనిమిదేళ్ల హయాంలో ఒక్క ఎకరమైనా భూసేకరణ చేయలేదు. జిల్లాలో ఉండే నాలుగు ప్యాకేజీల్లో రూ.4,200 కోట్లకు టెండర్లు పిలవగా కేవలం రూ.194 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఇందులోనూ పనులు చేసింది కేవలం రూ.26 కోట్లకే కాగా మిగతా మొత్తాలను మొబిలైజేషన్, సర్వేల పేరిట జేబుల్లో నింపుకున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకోని సబితా ఇంద్రారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి వంటి నేతలకు ధర్నా చేసే నైతిక హక్కు లేదు’ అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆయకట్టుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 2.70 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామన్నారు. ‘మిషన్’ రెండో ఫేజ్ పనులకు సిద్ధం కండి మిషన్ కాకతీయ రెండో ఫేజ్ పనులను వచ్చే జనవరి నుంచి ఆరంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, అప్పటిలోగా చెరువుల టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆ శాఖ అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ పనులపై సోమవారం మంత్రి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
'అనవసర రాద్ధాంతం చేస్తున్నారు'
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఆ పార్టీ నాయకులు పెదవి కూడా విప్పలేదని ఆరోపించారు. భావితరాలకు నీరు ఇవ్వాలని తాము ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రంగారెడ్డి జిల్లాలో 24 వేల ఎకరాలు అవసరమయితే 24 ఎకరాలు కూడా సేకరించలేదని ఆరోపించారు. లైడార్ సర్వే తర్వాత ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 26 కోట్లు అని తెలిపారు. తక్కుల లిఫ్టుల సాయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హరీశ్ రావు హామీయిచ్చారు. -
రెండేళ్లలో ప్రాణహిత తొలిదశ!
2017 ఖరీఫ్ నాటికి 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కార్యాచరణ * కాళేశ్వరం నుంచి సిద్దిపేట వరకు పూర్తిచేసేలా ప్రణాళిక * కాళేశ్వరం-ఎల్లంపల్లి మధ్య సర్వే.. డిజైన్ పూర్తికాగానే పనుల ప్రారంభం * 2022లోగా మొత్తం ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యం * ఏటా రూ.4 వేల కోట్లపైన ఖర్చుచేస్తేనే పనుల పూర్తికి అవకాశం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు కరువు పీడిత జిల్లాలకు సాగు, తాగునీటి సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తొలిదశను రెండేళ్లలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా 2017 ఖరీఫ్ నాటికి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. మొత్తంగా 2022 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తిచేసి... నిర్ణీత తాగు, సాగు లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం ఏటా బడ్జెట్లో రూ.4వేల కోట్లకు పైగా కేటాయించాలని భావిస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2008లో అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. ప్రాణహితలో లభ్యతగా ఉండే 160 టీఎంసీల గోదావరి నీటితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టగా... ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాత డిజైన్ ప్రకారం ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలను తీరుస్తామని... కాళేశ్వరం దిగువన మేటిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మించి నీటిని ఎల్లంపల్లికి మళ్లించి దిగువ ప్రాంతాలకు నీటిని అందిస్తామని పేర్కొంది. మేటిగడ్డ-ఎల్లంపల్లి మధ్య పనులకు సంబంధించి మంగళవారం నుంచి ఆ ప్రాంతంలో లైడార్ సర్వే జరుగనుంది. ఈ ప్రక్రియను సెప్టెంబర్ చివరి నాటికి ముగించి డిజైన్‌కు తుదిరూపు ఇవ్వాలని భావిస్తోంది. డిజైన్ పూర్తవగానే ఇక్కడి పనులకు శ్రీకారం చుట్టనుంది. అప్పటివరకు వేగంగా ఎల్లంపల్లి దిగువ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది కూడా. అయితే కొత్త డిజైన్‌తో అదనపు వ్యయం కలిపితే ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.44 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు రూ.9,290 కోట్ల మేర ఖర్చు జరిగింది. ఈ లెక్కన మరో రూ.35 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,515 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.519.26 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ ఖర్చంతా పాత బకాయిల చెల్లింపునకు వెచ్చించినవే. ఇకముందు అనుకున్న మేర లక్ష్యాలను చేరాలంటే ఏటా రూ.నాలుగైదు వేల కోట్ల వరకు వెచ్చించాల్సిందే. దీంతో నిధుల సమీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది. సిద్దిపేట వరకు తొలిదశ కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు డిజైన్ పూర్తయిన వెంటనే పనులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటిని మేటిగడ్డ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌మానేరు మీదుగా సిద్దిపేటలో నిర్మిస్తున్న తడ్కపల్లి రిజర్వాయర్ వరకు తీసుకురావాలనేది తొలిదశ ప్రణాళికగా చెబుతున్నారు. ఈ తొలిదశ పరిధిలో ఉండే సుమారు 2.50 లక్షల ఎకరాలకు 2017 ఖరీఫ్ నాటికి నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. రెండో దశలో 2018-19 నాటికి మరో నాలుగు లక్షల ఎకరాలు, 2022 నాటికి పూర్తిలక్ష్యాన్ని చేరుకునేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
ఇక ‘ప్రాణహిత’ పరుగు!
పనులను వేగిరం చేయాలని సీఎం ఆదేశం ♦ తుమ్మిడి హెట్టి దిగువ, అన్ని కెనాల్ పనులకు లైన్‌క్లియర్ ♦ ఒకట్రెండు రోజుల్లో పనుల ఆరంభానికి అవకాశం ♦ ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో రూ.9,290 కోట్ల పనులు పూర్తి ♦ లైడార్ సర్వే హెలికాప్టర్‌ను ఢిల్లీలో పరీక్షించిన రక్షణశాఖ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో సమూల మార్పులకు దిగిన కారణంగా ప్రాజెక్టు పరిధిలోని అన్ని పనులను నిలిపివేసిన ప్రభుత్వం..తాజాగా గతంలో చేపట్టిన పనులన్నింటినీ పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ దిగువన ఎల్లంపల్లి వరకు చేపట్టిన పనులతో పాటు, ఆ దిగువ ప్యాకేజీ పనులను సైతం యథావిధిగా తిరిగి ఆరంభింపజేయాలని సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టమైన అదేశాలు ఇచ్చారు. అయితే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నందున, దీనిపై స్పష్టత వచ్చే వరకు నిర్మాణ పనులను పక్కనపెట్టాలని ఆయన సూచించినట్లుగా సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో ఒకట్రెండు రోజుల్లో కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ప్రాణహిత-చేవెళ్ల తొలి డిజైన్ మేరకు ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి, అటునుంచి మిడ్‌మానేరు తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వేసిన ప్రణాళికల ప్రకారం రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనుల్లో ఇప్పటికే రూ.9,290.26 కోట్ల పనులు పూర్తయ్యాయి. పనులకు ఓకే.. అయితే తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాల దృష్ట్యా ప్రాణహిత నీటిని అక్కడినుంచి కాకుండా, కాళేశ్వరం దిగువనుంచి తీసుకోవాలని నిర్ణయించారు. కొత్త డిజైన్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీనిపై సమగ్ర నివేదిక వచ్చేంతవరకు పనులు నిలిపివేయాలని ఏప్రిల్‌లో నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్లను ఆదేశించింది. దీంతో ఐదు నెలలుగా పనులన్నీ నిలిచిపోయాయి. కాగా, ప్రస్తుతం ప్రాణహిత ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసి తుమ్మిడిహెట్టిని కొనసాగిస్తూనే, కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.15వేల కోట్ల పనుల్లో రూ.4 వేల కోట్ల కెనాల్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను యాథావిధిగా కొనసాగించాలని ఆదివారం అర్ధరాత్రి వరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని ఏ ఎత్తులో కట్టాలన్న దానిపై మరోదఫా మహారాష్ట్రతో చర్చల అనంతరం నిర్ణయం చేద్దామని, ఆ తర్వాతే పనులు చేద్దామని సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ పనులతో పాటే మిడ్‌మానేరు దిగువన రూ.22,866 కోట్లతో చేపట్టిన పనులను వేగిరంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రెండు రోజుల్లో లైడార్ హెలికాప్టర్రాక.. ఇక కాళేశ్వరం ప్రాంతంలో చేయదలిచిన లైడార్ సర్వే పనులకు రంగం సిద్ధమైంది. బెంగళూరుకు చెందిన హెలికాప్టర్‌ను ఆదివారం ఢిల్లీకి తరలించగా, అక్కడ ప్రత్యేక పరికరాలు అమర్చిన అనంతరం రక్షణ శాఖ దాన్ని పరీక్షించింది. దీనికోసం వ్యాప్కోస్ సర్వే సంస్థ రూ.2.50 కోట్లు వెచ్చించనుంది. ఈ హెలికాప్టర్ హైదరాబాద్ చేరుకునేందుకు మరో రెండు రోజులు పడుతుందని, ఆ వెంటనే సర్వే పనులను మొదలుపెడుతుందని అధికారులు చెబుతున్నారు. -
‘ప్రాణహిత-చేవెళ్ల’ డిజైన్ మార్చొద్దు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాను తప్పించే ప్రభుత్వ ఆలోచనపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. ప్రస్తుత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టును చేపట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రాజకీయ పార్టీల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో జిల్లాకు అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై పోరాడేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్‌ను కన్వీనర్‌గా నియమించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పి.సబితారెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు పాలనాపరమైన అన్ని అనుమతులు వచ్చి.. పనులు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధంతరంగా జిల్లాను తొలగించడాన్ని తప్పుబట్టారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అసెం బ్లీని స్తంభింపజేస్తే ప్రభుత్వం దిగిరావడం ఖాయమన్నారు. అలాగే, ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమిస్తేనే ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు లేనందున లక్షలాది ఎకరాలు బీడువారాయని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో ఈ భూములు తిరిగి పచ్చబారుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్, రంగారెడ్డి, కోదండరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్, సీపీఎం నేత నరసింహులు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, లోక్‌సత్తా నేత రామ్మోహన్రావు, ప్రజా చైతన్య వేదిక ప్రతినిధి కొమ్మిడి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'అది కేసీఆర్ సొంత వ్యవహారం కాదు'
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సాధించేందుకు పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణ పీసీసీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శాసనసభలో చర్చించాలని, ఇది కేసీఆర్ సొంత విషయం కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ప్రాజెక్టును మరోచోటికి మారిస్తే ఖజానా భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
బ్యారేజీ కాదు.. ఆనకట్ట!
తుమ్మిడిహెట్టిపై రాష్ట్ర ప్రభుత్వం యోచన * బ్యారేజీకి రూ.1,800 కోట్ల ఖర్చు.. ఆనకట్టకు రూ.200 కోట్లు * ప్రాణహిత-చేవెళ్లపై అధికారులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో స్వల్ప మార్పులు చేయాలని యోచిస్తోంది. బ్యారేజీ కి బదులు ఆనకట్ట నిర్మించే దిశగా ఆలోచనలు చేస్తోంది. వ్యయం తగ్గించడంతోపాటు మహారాష్ట్ర నుంచి ముంపు వివాదం లేకుండా ఉండేందుకే ఆనకట్ట నిర్మాణం వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణ అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది. 6 టీఎంసీలకు అంత ఖర్చు అక్కర్లేదు.. 160 టీఎంసీల గోదావరి నీటితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం... పాత డిజైన్ ప్రకారం ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఉంటుందని, అక్కడ్నుంచి నీటిని మళ్లించి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలను తీరుస్తామని చెబుతోంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు కుదించి నీటిని నిల్వ చేయాలని భావించింది. అయితే ఇందుకు సుమారు రూ.1,800 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం ఉంది. కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఇంతస్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే బ్యారేజీ బదులు ఆనకట్ట కట్టాలని యోచిస్తోంది. 2 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే ఎత్తులో కేవలం రూ.200 కోట్ల ఖర్చుతో దీన్ని చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆనకట్టలో నిల్వ చేసిన నీటిని... అవసరాన్ని బట్టి 80 నుంచి 120 రోజుల పాటు 15 టీఎంసీల వరకు మళ్లించుకోవచ్చని, దీనిద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 1.50 లక్షల ఎకరాలకు నీరందించవచ్చన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణం ఏ ఎత్తులో చేపట్టినా ముంపుపై మహారాష్ట్రకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీకి బదులు ఆనకట్ట వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఒకట్రెండు టీఎంసీలు ఉంటే దాన్ని ఆనకట్టగా, 2 నుంచి 8 టీఎంసీల వరకు ఉంటే బ్యారేజీగా పరిగణిస్తారు. లైడార్ సర్వేకు ఓకే కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో లైడార్ సర్వే నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. ఇప్పటికే ఇక్కడ సర్వే చేసేందుకు కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు అనుమతినిచ్చాయి. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు ప్రాజెక్టుల డిజైన్‌లో మార్పుచేర్పుల్లో భాగంగా మరో రెండు రిజార్వయర్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచనుంది. ఇప్పటికే మెదక్ జిల్లాలోని పాములపర్తి, తడ్కపల్లి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా నల్లగొండ జిల్లాలోని బస్వాపూర్, గంధమల రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గంధమల రిజర్వాయర్‌ను 0.5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు, బస్వాపూర్ రిజర్వాయర్‌ను 0.8 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు కాళేశ్వరం, ఎల్లంపల్లి అలైన్మెంట్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లుగా సమాచారం. -
కాళేశ్వరం బ్యారేజీని మొదలుపెడదాం
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పులో భాగంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ నిర్మాణ విషయమై స్పష్టత వచ్చినందున ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ముంపు లేకుండా చేపట్టే బ్యారేజీ నిర్మాణాన్ని ఏ ఎత్తులో చేపట్టాలన్న దానిపై ప్రాజెక్టు సర్వే బాధ్యతలు చూస్తున్న వ్యాప్కోస్ సమర్పించిన నివేదిక పూర్తి సంతృప్తికరంగా ఉన్న దృష్ట్యా, దీనిపై శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం దిగువన నీటి ప్రవాహం ఎక్కువ రోజులుంటుందని, లభ్యత సైతం గణనీయంగా ఉందని ఇప్పటికే వ్యాప్కోస్ ప్రాధమికంగా నిర్ధారించింది. ఎలాంటి అంతరాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేకుండా ఇక్కడి నుంచి నీర్ణిత నీటిని రాష్ట్రానికి మళ్లించుకోగలిగితే, ఆ తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే ప్రాజెక్టు కింద నిర్ణయించిన సాగు, తాగు నీటి లక్ష్యాలను చేరుకోవచ్చని నివేదించింది. మేటిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తును 102మీటర్ల ఎత్తుతో నిర్మించి 100మీటర్ల వరకే నీటిని నిల్వ చేసి ముంపు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఎత్తులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసే ఆస్కారం ఉండటంతో పాటు సుమారు 120 రోజుల పాటు నీటి లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి వరకు కాల్వల అలైన్‌మెంట్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కాల్వల అలైన్మెంట్లలో 22 క్లిష్టమైన పాయింట్లను గుర్తించిన సంస్థ వాటికి ప్రత్యామ్నాయాలపై సర్వే చేస్తోంది. దీంతో పాటే త్వరలోనే ఈ ప్రాంతంలో లైడార్ సర్వే సైతం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియంతా జరిగి తుది నివేదిక వచ్చేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశాల దృష్ట్యా అప్పటిరవకు బ్యారేజీ నిర్మాణాన్ని ఆరంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. పనులు ఆరంభించడం ద్వారా ప్రాజెక్టును జాప్యం చేస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవాలనే ఉద్ధేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై శనివారం నాటి కేబినెట్ భేటీలో చర్చిస్తారని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. -
ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చడం తగదు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రం మొత్తమ్మీద గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాణహిత నీటిని గాటుకు కట్టి.. కాళేశ్వరం నుంచి నీటిని తీసుకొని నిధులను ఎత్తిపోస్తారా? అని సూటిగా ప్రశ్నించింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సరిగా జరగనందువల్లే తుమ్మిడిహెట్టిపై ఆ రాష్ట్రం అభ్యంతరాలు లేవనెత్తిందని.. ఇప్పటికైనా సీఎం సుహృద్భావ చర్చలకు పూనుకోవాలని సమావేశం సూచించింది. తప్పుడు నివేదికలిచ్చిన ‘వ్యాప్కోస్’పై న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నీళ్లపై అనుమానాలను నివృత్తి చేయాలన్న ఉద్యమకారులను పిచ్చోళ్లు, సన్నాసులు అన్న కేసీఆర్.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత పథకాన్ని చేపట్టాలని తీర్మానం చేసింది. గురువారం ప్రాణహిత-చేవెళ్ల-కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలపై తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ నేతృత్వంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, టీడీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, బీజేపీ తరఫున ప్రేమ్‌చంద్రారెడ్డి, రిటైర్డ్ జడ్డి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జల సాధన సమితి నేత నైనాల గోవర్ధన్, న్యూడెమోక్రసీ నేత వెంకటేశ్వర్రావు, ఓయూ జేఏసీ నేతలు దుర్గం భాస్కర్, ఆదిలాబాద్ జిల్లా నేతలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ‘రాష్ట్రంలోని సహజ వనరులన్నింటినీ తాను, హరీశ్, కేటీఆర్, కవిత పంచుకుంటే నాల్గున్నర కోట్ల జనాలకు పంచినట్లే అన్న ధోరణి కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఇది సరికాదు. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి వద్దే బ్యారేజీ కట్టాలి’ - మల్లు భట్టి విక్రమార్క ‘20 శాతం పనులు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను విస్మరించి కొత్త ఎత్తిపోతలు చేపట్టే అవసరం ఏమొచ్చింది. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు’ - పెద్దిరెడ్డి, టీడీపీ ‘తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించవచ్చు. అదే కాళేశ్వరం అయితే నీటిని ఎత్తిపోయాలి. నిధులు ఎత్తిపోసేందుకే కాళేశ్వరం అంటున్నారు కేసీఆర్’ - నైనాల గోవర్ధన్, జల సాధన సమితి ‘తుమ్మిడిహెట్టి వద్ద చిన్న బ్యారేజీ, కాళేశ్వరం వద్ద మరో బ్యారేజీ అంటే మొత్తంగా రూ. 37 వేల కోట్లు ఖర్చు కాదా? కాబట్టి తుమ్మిడిహెట్టి వద్దే బ్యారేజీ నిర్మించాలి. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం ‘2008లో ఒకమారు ఓ నివేదిక ఇచ్చి ఇప్పుడు దాన్నే తప్పు పడుతూ మరో విధంగా మాట్లాడుతున్న వ్యాప్కోస్పై న్యాయ విచారణ జరిపించాలి’ - జస్టిస్ చంద్రకుమార్ -
కాళేశ్వరం ఎత్తిపోతలపై దుష్ర్పచారం
సాక్షి, హైదరాబాద్: ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పెదవి విప్పని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టీడీపీ నాయకుడు నర్సిరెడ్డి ఇపుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో బుధవారం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టవద్దనేదే వీరి లక్ష్యమని విమర్శించారు. తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం వల్ల ఆదిలాబాద్‌కు నష్టమని దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తవ్విన కాల్వలను ఉపయోగించుకుంటాం, ముంపు లేకుండా బ్యారేజీ నిర్మించి నీళ్లిస్తాం. బ్యారేజీ మారినా పాత పద్ధతిని కొనసాగిస్తాం ’ అని మంత్రి అన్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే అదనంగా లక్ష ఎకరాలకు నీరిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత సరిగా లేనందునే కాళేశ్వరాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రాజెక్టు ఖర్చు విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే, ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.1,900 కోట్లు ఖర్చు అవుతుందని, అదే కాళేశ్వరం దిగువన 20 కిలోమీటర్ల వద్ద మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీకు రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని హరీశ్ పేర్కొన్నారు. విపక్షాలు అబద్దాలు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత -చేవెళ్లపై అప్పటి మహారాష్ట్ర సీఎం అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. చివరకు లగడపాటి రాజగోపాల్ వంటి తెలంగాణ బద్ధ వ్యతిరేకులకూ ఆశ్రయమిచ్చిన షబ్బీర్ అలీ వంటి నాయకులూ విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బి.గణేష్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కలను చంటి పిల్లల్లా పెంచండి తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను చంటి పిల్లల్లా సంరక్షించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 150 వ్యవ సాయ మార్కెట్ యార్డుల్లో హరితహారం కార్యక్రమం అమలు తీరుపై బుధవారం వాట్సప్ ద్వారా సమీక్షించారు. ఒక్కో మార్కెట్ యార్డు పరిధిలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. మార్కెట్ యార్డుల వారీగా ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారనే అంశంపై మంత్రి వివరాలు సేకరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జోన్లవారీగా అధికారులు బృందాలుగా ఏర్పడి ఇప్పటి వరకు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. మార్కెట్ యార్డులలో హరితహారం కార్యక్రమం అమలవుతున్న తీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.