Revenue department
-
మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడో నెలలోనూ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా రూ. 140 కోట్ల ఆదాయం తగ్గిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ఆదాయం విషయంలో రూ. 1,000 కోట్లకుపైగా వెనుకబడి ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. గత 3 నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల పట్టుకుంటోంది. వరుసగా రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మందగించడంపై ఆందోళన చెందుతోంది. అన్ని జిల్లాల్లోనూ అదే వరుస.. అక్టోబర్ నెలలో పరిస్థితిని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మందగించాయి. ఆదిలాబాద్ మొదలు హైదరాబాద్ (సౌత్) వరకు 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో లావాదేవీల సంఖ్య, రాబడి తగ్గింది. గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 12 వేల లావాదేవీలు తగ్గిపోయాయి. అంటే సగటున రోజుకు 400 లావాదేవీలు తగ్గాయన్న మాట. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 91,619 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా ఈ ఏడాది 79,562 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ కావడం గమనార్హం. ఇక జిల్లాలవారీగా పరిశీలిస్తే రంగారెడ్డిలో గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 94 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఈ జిల్లాలో సుమారు 1,600 లావాదేవీలు కూడా తగ్గాయి. హైదరాబాద్, హైదరాబాద్ (సౌత్), మేడ్చల్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ లాంటి జిల్లాల్లోనూ లావాదేవీల గణాంకాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ‘హైడ్రా’అక్రమ కట్టడాల కూల్చివేతల కారణంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఆస్తుల కొనుగోళ్లు మందగించాయని అంటున్నారు. దీనికితోడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలోనే ఇతర జిల్లాల్లోనూ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. -
హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్‌డ్రా
సాక్షి, హైదరాబాద్: చెరువులు, నీటి వనరుల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’తో.. భూములు, ఆస్తుల కొనుగోళ్లపై ప్రభావం పడింది. జిల్లాల్లోనూ హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపట్టడంతో.. రాష్ట్రవ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. సుమారు రెండు నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా 30శాతానికిపైగా తగ్గింది. 20వేలకుపైగా లావాదేవీలు తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క నెలలో రూ.300 కోట్లు తగ్గిపోయి.. రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ ఒక్క నెలలోనే రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 99,528 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి, ప్రభుత్వానికి రూ.955.12 కోట్ల ఆదాయం సమకూరింది. అదే ఈసారి సెప్టెంబర్‌లో 80,115 లావాదేవీలు జరిగి, రూ.650.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 2023 సెప్టెంబర్‌లో 21,407 లావాదేవీలు జరిగితే.. ఈసారి సెప్టెంబర్‌లో 16,687 లావాదేవీలే జరిగాయి. సుమారు ఐదువేల లావాదేవీలు తగ్గాయి. మేడ్చల్, పటాన్చెరు రిజిస్ట్రేషన్ జిల్లాల్లోనూ 4 వేల చొప్పున లావాదేవీలు తగ్గడం గమనార్హం. మొదట బాగానే ఉన్నా.. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 10.04 లక్షల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి.. ప్రభుత్వానికి రూ.7,229.88 కోట్లు రాబడి సమకూరింది. అదే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 9.19 లక్షల లావాదేవీలతో రూ.7,291.28 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే స్వల్పంగా రూ.61.4 కోట్ల పెరుగుదల కనిపిస్తున్నా.. అది ఆస్తుల రేట్లు పెరగడం, తొలి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా జరగడం వల్ల సమకూరినదేనని రిజిస్ట్రేషన్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆర్థిక సంవత్సరం మొదట్లో రిజిస్ట్రేషన్లు, ఆదాయం గణనీయంగా పెరిగినా.. తర్వాత ఒక్కసారిగా తగ్గిపోయిందని స్పష్టమవుతోంది. ధరల పెంపు.. హైడ్రా దెబ్బ.. ఎల్ఆర్ఎస్ పేరుతో ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్న కారణంగా.. చాలా మంది డీటీసీపీ లేఔట్ల వైపు చూస్తున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ తెలిపారు. డీటీసీపీ ఫీజులు కూడా భారీగా పెరగడంతో చాలా మంది వెంచర్లు చేయడం లేదని.. వెంచర్లు చేసినా యుటిలిటీస్, కమ్యూనిటీ, పార్కుల పేరిట ఎక్కువగా భూమి వదలాల్సి రావడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ధరలు పెంచేశాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ‘హైడ్రా’ పేరిట కూల్చివేతలు చేపట్టడంతో.. కొనుగోలుదారుల్లో తెలియని భయం నెలకొందని వివరించారు. ప్లాట్లు అమ్ముదామంటే కొనేవాళ్లు లేరని.. చదరపు గజం ధర రూ.5 వేలకు మించి ఉన్న ప్లాట్ల విషయంలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వంటి విషయాలను పరిశీలించుకునేలోపు కొనుగోలు దారుల మనసు మారిపోతోందని చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఇది ఇప్పటితో అయిపోలేదని, రిజిస్ట్రేషన్ లావాదేవీలు మరింత తగ్గుతాయని అంచనా వేశారు. ఇందుకు చాలా కారణాలున్నా.. ‘హైడ్రా’ ప్రభావం కూడా గణనీయంగా ఉందని పేర్కొన్నారు. హైడ్రాతో తారుమారురాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట చేస్తున్న హడావుడితో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చినా..యుద్ధ ప్రాతిపదికన కూల్చివేతలు చేపట్టడంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది. అటు కొనుగోలుదారుల్లో, ఇటు డెవలపర్లలో గుబులు కనిపిస్తోంది. కొనుగోలుదారులు కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉండటంతో అమ్మకాలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందుల్లో పడటంతో దీనిపై ఆధారపడిన ఇతర రంగాలు కూడా కుదేలవుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.– రావుల గోపాల్ యాదవ్, మోకిలా, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా -
హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ మూసీ కార్యక్రమంలో రెండో రోజు కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. దీంతో, అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది. బాధితులు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సర్వే చేస్తూ రెవెన్యూ అధికారులు రెండో రోజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారు. కూల్చివేయబోయే ఇళ్లకు నెంబరింగ్ ఇస్తూ మార్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. గురువారం దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో తమ ఇళ్లకు మార్క్ చేయకుండా అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో, పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.మరోవైపు.. శని, ఆదివారాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా ప్లాన్ చేసింది. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెండు రోజుల్లో కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. దీని కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చదవండి: నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్ -
ముసాయిదానే.. కొత్త చట్టం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికార్డులకు సంబంధించిన ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 (ఆర్వోఆర్)’ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు మినహా ముసాయిదా కింద రూపొందించిన అంశాలనే చట్టం రూపంలో అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త్వరలోనే దీనిపై ఓ స్పష్టత ఇస్తారని.. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. దాంతోపాటు ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేస్తారా? లేక అసెంబ్లీలో పెట్టిన బిల్లుపై విస్తృతంగా చర్చించి చట్టంగా చేస్తారా? అన్న దానిపై మాత్రం తర్జనభర్జన కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈనెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఆర్డినెన్స్ వచ్చే అవకాశం లేదని అంటున్నాయి. అయితే కేబినెట్ ఎజెండాపై బుధవారం స్పష్టత వస్తుందని, ఎజెండాలో భూముల చట్టం ఆర్డినెన్స్ ఉంటే రూపకల్పన, జారీ ఏర్పాట్లకు సిద్ధంగానే ఉన్నామని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా బిల్లు ఇదే.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్వోఆర్–2024’ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్వోఆర్–2020 చట్టంలో పరిష్కరించలేని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ 20 సెక్షన్లతో ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. 1936, 1948, 1971, 2020 నాటి ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి, వాటి అమలుతో చేకూరిన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టం ముసాయిదాను తయారు చేసింది. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాల అంచనాల ప్రకారం రూపొందించిన ఈ ముసాయిదాలో పాస్ పుస్తకాలు రాని భూముల సమస్యల పరిష్కారం, కొత్త రికార్డును ఎప్పుడైనా తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ లాంటి వెసులుబాట్లు కల్పిస్తూ అనేక అంశాలను ముసాయిదాలో పొందుపరిచారు. బిల్లు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్వోఆర్ చట్టానికి రెండోసారి మార్పు జరుగుతోంది. 2020లో బీఆర్ఎస్ హయాంలో ఆర్వోఆర్–2020 చట్టం అమల్లోకి తెచ్చారు. అందులోని అనేక అంశాలకు సవరణలు, మార్పు చేర్పులతో ఆర్వోఆర్–2024ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు పెట్టింది. ముసాయిదాపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి 23 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మంత్రులు, రెవెన్యూ శాఖ సీనియర్ అధికారులు, భూచట్టాల నిపుణులు, మేధావులు, సామాన్యులు.. ఇలా అన్ని వర్గాలు అభిప్రాయాలు స్వీకరించింది. ఈ వివరాలతో జిల్లాల కలెక్టర్లు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ మూడు అంశాలే కీలకం ప్రజలతోపాటు భూచట్టాల నిపుణుల నుంచి వచ్చిన అనేక సూచనలు, సలహాల్లో మూడు అంశాలు కీలకమని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ప్రతిపాదన ముసాయిదా చట్టంలో లేదని.. భూసమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు. అయితే రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు, ఆర్ఓఆర్ చట్టానికి సంబంధం లేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అయితే భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బీలో పెట్టిన 18లక్షల ఎకరాల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉందని అంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వొచ్చని, లేదా ముసాయిదా చట్టంలోని సెక్షన్–4 ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇక అప్పీల్, రివిజన్లకు సంబంధించిన అంశంలోనూ చాలా సూచనలు వచ్చాయి. తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్రే్టషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్‌ను కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్‌కు చేసుకోవాలని.. సెకండ్ అప్పీల్‌ను సీసీఎల్ఏకు, రివిజన్ కోసం ప్రభుత్వానికి లేదంటే సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చట్టంలో ప్రతిపాదించారు. అయితే ఈ అప్పీల్ అవకాశం ఆర్డీవో స్థాయిలోనూ ఉండాలని పలువురు సూచించారు. రిజిస్రే్టషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి అని.. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూఆధార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇస్తామన్న ప్రతిపాదనలపైనా పలు సూచనలు వచ్చాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. సాదాబైనామాలకు అవకాశం ఆర్వోఆర్–2024 చట్టం అమల్లోకి వస్తే పెండింగ్‌లో ఉన్న 9.4 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రత్యేక సెక్షన్లో ప్రతిపాదించారు. ఇక అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి ఈ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదనే విమర్శలున్నాయి. అయితే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడానికి, ఆర్వోఆర్ చట్టానికి సంబంధం లేదని.. అసైన్డ్ భూములపై హక్కులు రావాలంటే హక్కుల బదలాయింపు నిషేధిత చట్టాన్ని (పీవోటీ) సవరించాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు వివరిస్తున్నాయి. మొత్తమ్మీద ముసాయిదా చట్టంలో ఒకట్రెండు అంశాల్లోనే మార్పు ఉంటుందని.. అది కూడా మార్గదర్శకాలు తయారు చేసినప్పుడు వాటిలో పొందుపరుస్తారని పేర్కొంటున్నాయి. -
భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులుఅనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్‌కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్‌కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్‌కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు. వారి హక్కులను హరించడమే.. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్‌కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి MLRIT కాలేజీకి రెవిన్యూశాఖ నోటీసులు
-
మళ్లీ భూసర్వే.. పహాణీల నమోదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికా ర్డులను పారదర్శకంగా నిర్వహించడం కోసం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024’ పేరిట ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకు రానుంది. దీనికి సంబంధించి ముసాయిదా ప్రతిని ప్రజలకు అందుబాటులో ఉంచింది. అందులోని అంశాలపై ప్రజల నుంచి సల హాలు, సూచనలను ఆహ్వానించింది. దీనితో వేలాది మంది నుంచి స్పందన వస్తోంది. కానీ ఇందులో సలహాలు, సూచనల కన్నా సందేహాలే ఎక్కువగా ఉంటున్నాయని రెవెన్యూ వర్గాల సమాచారం. ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సందేహాలకు అధికారికంగా జవాబు ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ‘ఆర్వోఆర్–2024’ ముసాయిదా చట్టంలోని అంశాలపై ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న సందేహాలను ‘సాక్షి’ సేకరించింది. వాటిని భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డితోపాటు కొందరు రెవెన్యూ అధికారుల ముందుపెట్టి.. ఆయా సందేహాలకు సమాధానాలను రాబట్టింది. ఆ సందేహాలు, సమాధానాలు ఇవీ..సందేహం: కొత్త ఆర్వోఆర్ చట్టం తేవాల్సిన అవసరమేంటి?సమాధానం: ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం లోపభూయిష్టంగా ఉంది. చాలా సమస్యలకు అందులో పరిష్కారం లేదు. సాదాబైనామాల పరిష్కార నిబంధన లేదు. అప్పీలు వ్యవస్థ లేదు. రికార్డులో ఏ సమస్య వచ్చినా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ధరణి పోర్టల్‌లో సవరణలు చేసే అధికారాన్ని కూడా ఆ చట్టం ఎవరికీ కల్పించలేదు. ధరణి సవరణలకు చట్టబద్ధత కావాలంటే చట్టం మారాల్సిందే.ధరణి సమస్యలను ఈ చట్టం ఎలా పరిష్కరిస్తుంది?– ధరణి పోర్టల్‌లో చేర్చకుండా పార్ట్–బి పేరిట పక్కన పెట్టిన భూములను రికార్డుల్లోకి ఎక్కించడానికి కొత్త చట్టంలో నిబంధన ఉంది. దాదాపు 18లక్షల ఎకరాల భూమికి ఈ చట్టం ద్వారా మోక్షం కలుగుతుంది. ధరణిలో చేర్చిన తర్వాత నమోదైన తప్పుల సవరణకు కూడా చట్టబద్ధత ఏర్పడుతుంది.రైతుల వద్ద ఉన్న పాస్‌బుక్‌లు రద్దవుతాయా?– రద్దు కావు. ప్రస్తుతమున్న ధరణి రికార్డు కొనసాగుతుంది. కానీ తప్పొప్పులను సవరించవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టి, కొత్త రికార్డు తయారు చేయాలనుకుంటే మాత్రం కొత్త రికార్డుతోపాటు కొత్త పాస్‌బుక్‌లు వస్తాయి. ముసాయిదా చట్టంలో ఈ మేరకు నిబంధన ఉంది.ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ వస్తుందా?– ధరణి పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ వస్తుంది. అయితే భూమాత అనే పేరు ఏదీ ముసాయిదా చట్టంలో లేదు. ధరణి అనేది ఆర్వోఆర్ రికార్డు నిర్వహించే పోర్టల్. ఈ పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ వస్తుంది. దానికి ప్రభుత్వం ఇష్ట్రపకారం ఏ పేరైనా పెట్టవచ్చు.ఇప్పుడు జరుగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులొస్తాయి?– స్లాట్ బుకింగ్ కొనసాగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులుంటాయి.ఆటోమేటిక్ మ్యుటేషన్ రద్దు అవుతుందా?– పాత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగితే ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరిగిపోతుంది. కొత్త చట్టం ముసాయిదా ప్రకారం ఈ మ్యుటేషన్ ఆగిపోదు. కానీ సరైన కారణాలుంటే మ్యుటేషన్ నిలిపేయవచ్చు. డబుల్ రిజిస్ట్రేషన్లకు, మోసపు లావాదేవీలకు ఈ నిబంధనతో చెక్ పడుతుంది. వారసత్వం, భాగం పంపకాలు, కోర్టు కేసులు, ఇతర మార్గాల్లో వచ్చే భూములపైనా విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు.ఈ చట్టం అమల్లోకి వస్తే భూముల సర్వే మళ్లీ నిర్వహిస్తారా?– భూములను మళ్లీ సర్వే చేయాలనే చట్టం చెబుతోంది. ముసాయిదా చట్టం ప్రకారం భూఆధార్ కార్డు జారీ చేయాలంటే సర్వే చేయాల్సిందే. తాత్కాలిక భూఆధార్ ఇవ్వాలన్నా రికార్డుల ప్రక్షాళన చేయాల్సిందే. భూఆధార్ కార్డు ఇవ్వాలా, వద్దా అన్నది ప్రభుత్వ అభీష్టం. ఈ మేరకు చట్టంలోని నిబంధనల్లో వెసులుబాటు ఉంది.ఈ చట్టం వస్తే మళ్లీ పహాణీ రాస్తారా?– పహాణీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్న నిబంధన 1971 చట్టంలో ఉంది. కానీ 2020లో తొలగించారు. మళ్లీ ఇప్పుడు అప్డేట్ చేసే నిబంధన పెట్టారు. ముసాయిదాలోని సెక్షన్ 13 దీని గురించే చెబుతోంది.ఈ చట్టంతో అసైన్డ్ భూములకు హక్కులు వస్తాయా?– ఆర్వోఆర్ చట్టం అన్ని సమస్యలకు పరిష్కారం చూపదు. అసైన్డ్ భూములకు పట్టా హక్కు కావాలంటే మారాల్సింది ఆర్వోఆర్ చట్టం కాదు.. పీవోటీ చట్టం. కాబట్టి ఈ చట్టం ద్వారా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు రావు.కౌలు రైతుల పేర్లు నమోదు చేస్తారా?– కౌలుదారుల నమోదు ప్రక్రియ కూడా ఆర్వోఆర్ చట్టం పరిధిలోకి రాదు. కౌలుదార్ల చట్టం–1950, రుణ అర్హత కార్డుల చట్టం– 2011 ప్రకారం కౌలుదారుల నమోదు జరుగుతుంది. ఆ చట్టాల పరిధిలో కౌలుదారుల గుర్తింపు జరుగుతుంది.ఈ చట్టం ప్రకారం కాస్తు కాలం నమోదు ఉంటుందా?– 1996లో గ్రామ రెవెన్యూ లెక్కల నిర్వహణ గురించి ప్రత్యేక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం పహాణీల నిర్వహణ ఉంటుంది. ఆర్వోఆర్ చట్టం పరిధిలోకి ఈ అంశం రాదు. కాస్తు కాలం ఉంచాలా, వద్దా అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.ఈ చట్టం ద్వారా టైటిల్ గ్యారంటీ ఇస్తారా?– కొత్త చట్టానికి ల్యాండ్ టైటిల్‌కు సంబంధం లేదు. ఈ చట్టం హక్కులకు స్పష్టత మాత్రమే ఇస్తుంది. టైటిల్ గ్యారంటీ ఇచ్చేది వేరే చట్టం.మ్యుటేషన్ సమయంలో మ్యాప్ కావాలన్న నిబంధన రైతులను ఇబ్బంది పెట్టేది కాదా?– ఆర్వోఆర్ చట్టంలోని అన్ని నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చేవి కాదు. కొన్ని వెంటనే అమల్లోకి వస్తే.. మరికొన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొందుపర్చినవి. ఈ మ్యాప్ నిబంధనను అమలు విషయంలో ప్రభుత్వానికి సమయం ఉంటుంది. వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. ఒకవేళ మ్యాప్ నిబంధన అమల్లోకి రావాలంటే సర్వేయర్ల వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉంటుంది.(సాదాబైనామాలు, భూఆధార్కార్డులు, కోర్టులు, అప్పీళ్లు, ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం రేపటి సంచికలో..) -
సీటుకు నోటు! టీడీపీ నేతల వసూళ్ల పర్వం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ పెద్దలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే పచ్చముఠాలు ఇసుక దోపిడీ నుంచి భూ దందాలతో బరి తెగిస్తున్నాయి. అంతటితో సంతృప్తి చెందకుండా ఇది బదిలీల సీజన్ కావడంతో అందులోనూ సొమ్ము చేసుకుంటున్నాయి. వేలం పాటల తరహాలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగిపోతోంది. బదిలీలలో పైరవీలు నడుస్తుండడంతో అధికారులంతా అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ, మహిళలపై అఘాయిత్యాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితి దారుణంగా ఉండగా మరోపక్క అధికార పార్టీ నేతలు బదిలీలలో అందినకాడికి వసూలు చేసుకుంటున్నారు! ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో బదిలీలను అవకాశంగా మార్చుకుని వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఉద్యోగుల బదిలీలు జరుగుతుండటంతో హోదాను బట్టి రేటు నిర్ణయించి వసూళ్లకు దిగారు. తమ్ముడు తమ్ముడే..! పేకాట పేకాటే! అన్నట్లుగా తమకు కొమ్ము కాసే ఖాకీలను నియమించుకోవడంతోపాటు పోలీస్ స్టేషన్లకు అందే నెలవారీ మామూళ్లపైనా కన్నేశారు. ఇకపై నేరుగా తమకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. రూ.కోట్లలో బేరసారాలు..కొత్త సర్కారు కొలువుదీరిన వెంటనే బదిలీలపై కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించాలన్నా, కోరుకున్న చోటకు పోస్టింగ్ ఇవ్వాలన్నా అధికారి స్థాయి, పరిధిని బట్టి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీవోల నుంచి ఎమ్మార్వోల దాకా ఎస్ఐ నుంచి సీఐ దాకా రేట్లు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. తిరుపతి ఆర్డీవో పోస్టు కోసం ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి ఇస్తామంటూ అధికార పార్టీ నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీర్ఘకాలం జిల్లాలో పనిచేసిన ఓ అధికారి రూ.3 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ తహశీల్దార్ తిరుపతి రూరల్ ఎమ్మార్వో పోస్టు కోసం భారీ మొత్తం ఇస్తానంటూ అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. కొమ్ము కాయాల్సిందే...!కూటమి నేతలకు కొమ్ము కాయడంతోపాటు మామూళ్లు అందించే ఖాకీలపై కన్నేసి ఉంచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ సీఐ పోస్టు కోసం స్థానిక ఎమ్మెల్యే రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావటంతో గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించేందుకు సైతం రేట్లు నిర్ణయించడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ⇒ కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కోసం ఓ సీఐ రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకోగా ప్రస్తుతం రూ.10 లక్షలు ఇచ్చారు. లెటర్, డీవో (డ్యూటీ ఆర్డర్) రాగానే మిగతాది చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ సర్కిల్‌కు భారీ ఆదాయం ఉంది. కర్నూలు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్‌తో పాటు మట్కా, పేకాట, రేషన్ బియ్యం అక్రమ రవాణా తదితర వ్యవహారాలతో పాటు నిత్యం స్టేషన్లో పంచాయతీలు జరుగుతుంటాయి. దీంతో డబ్బులు కట్టినా ఇక్కడ సంపాదనకు ఢోకా లేదనే భరోసాతో ఆఫర్ ఇచ్చారు. ⇒ ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ కోసం ఓ సీఐ రూ.20 లక్షలు స్థానిక నేతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆదోనిలో పని చేసిన ఆయన ప్రస్తుతం లూప్లైన్లో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆయనకు లెటర్ ఇవ్వగా త్రిసభ్య కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇక ఎమ్మిగనూరు టౌన్ సర్కిల్‌కు కూడా రూ.20 లక్షలకు స్థానిక నేతతో బేరం కుదిరినట్లు సమాచారం. ⇒ నంద్యాలలో ఆర్డీవో, తహసీల్దార్ కుర్చీ కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. నంద్యాల లోని రెవెన్యూ శాఖ అధికారి కుర్చీ కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పని చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో డివిజన్ స్థాయి పోస్టు కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లించేందుకు పలువురు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో డీఎస్పీ పోస్టు కోసం రూ.10 లక్షలు, చాగలమర్రి ఎస్ఐ పోస్టుకు రూ.5 లక్షల చొప్పున స్థానిక ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ⇒ కాకినాడ జిల్లాలో కాకినాడ సహా ప్రధాన సర్కిళ్లలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరింది. ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ డివిజన్లోని సర్కిల్స్‌లో నియోజక వర్గ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉండగా పిఠాపురం సమీప సర్కిల్స్‌లో స్థానిక నేతల అనుచరుల హవా రాజ్యమేలుతోంది. గతంలో పలు వివాదాలు మూటగట్టుకుని బదిలీపై పొరుగు సర్కిల్స్‌కు వెళ్లిన ఇన్స్పెక్టర్లు డబ్బు కట్టలతో నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం కాకినాడ టూ టౌన్ నుంచి బదిలీపై వెళ్లిన ఓ సీఐ లక్షలు సమర్పించైనా తిరిగి వచ్చేయాలనే పట్టుదలతో నియోజకవర్గ నేతతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి రూ.30 నుంచి రూ.40 లక్షలు ఇచ్చుకునేలా బేరసారాలు జరుగుతున్నాయి. పలువురు పంచాయతీ సెక్రటరీలు ప్రస్తుతం ఉన్న మండలంలోనే కొనసాగేందుకు మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి కాకినాడ జిల్లాలో అదే పోస్టులో కొనసాగేందుకు ఓ ప్రజాప్రతినిధికి రూ.20 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. జిల్లా పరిషత్‌లో ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పని చేసిన ఒక అధికారి తిరిగి అదే పోస్టు కోసం రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు!⇒ అనంతపురంలో ఆదాయం బాగున్న ఓ పోలీస్‌స్టేషన్‌కు సీఐగా వచ్చేందుకు ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరో డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రూ.5 లక్షల దాకా ఇస్తానని చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురం జిల్లాకే చెందిన ఓ అధికారి పుట్టపర్తి బదిలీ అయ్యేందుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. పరిటాల కుటుంబానికి సన్నిహితుడైన ఆయన పుట్టపర్తిలో ఓ జిల్లా శాఖ ఇన్‌చార్జీగా వచ్చేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. రూ.15 లక్షలు ఇస్తానని పరిటాల కుటుంబం ద్వారా ఓ మంత్రిని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్, పరిటాల సునీతకు తొత్తుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కదిరి లేదా ధర్మవరం సబ్ డివిజన్లో సీఐ పోస్టు కోసం రూ.10 లక్షలు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు.⇒ శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ తమకు కావాల్సిన ఎమ్మార్వో, ఎస్ఐ, సీఐల జాబితా తయారు చేసుకున్నారు. ఇక అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం!⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో తమ వద్దకు వచ్చిన అధికారుల పేర్లు నమోదు చేసుకుంటున్న ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా వారి గురించి ఆరా తీస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తమకు అనుకూలంగా పనిచేసిన అధికారులను తిరిగి తెచ్చుకునే పనిలో ఉన్నారు. చేపల చెరువులతోపాటు పందాలు, పేకాట ఎక్కువగా జరిగే భీమవరం, ఉండి, ఆచంటలో పోస్టింగ్‌కు భారీగా డిమాండ్ ఉంది. అమలాపురం రూరల్ సీఐ బదిలీ వ్యవహారం టీడీపీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీయటంతో ఈ పంచాయతీ టీడీపీ అధిష్టానం, డీజీపీ వద్దకు వెళ్లింది. ⇒ ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరంలో ఎస్ఈ పోస్టు కోసం ఐదుగురు పోటీ పడుతుండగా మాజీ మంత్రి జవహర్ బావమరిది కూడా లైన్లో ఉన్నారు. పోస్టు కోసం రూ.50 లక్షల ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. ⇒ అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో పని చేసేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రెండు జాబితాలు సిద్ధం చేశారు.⇒ విశాఖ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడలో తహశీల్దారు, ఎస్ఐ, సీఐ పోస్టులకు గిరాకీ ఉంది. జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జీ రెండు జాబితాలు సిద్ధం చేసుకున్నారు. భీమిలిలోనూ అధికార పార్టీకి చెందిన కీలక నేత బేరాలు కుదుర్చుకున్నారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభంలో చేరేవారి జాబితా సిద్ధమైంది.⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కందుకూరు, గుడ్లూరు, కావలి రూరల్, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఆత్మకూరు, పొదలకూరు, నెల్లూరు వేదాయపాలెం, నవాబుపేట, నెల్లూరు రూరల్, వెంకటాచలం అర్బన్ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్‌లకు భారీ డిమాండ్ ఉంది. ⇒ ప్రకాశం జిల్లాలో టీడీపీ పెద్దల సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించాలని కొన్ని సర్కిళ్ల పరిధిలో తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. తహసీల్దార్లు ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ⇒ విజయనగరం జిల్లాలో ఏ పదవిలోనూ లేకపోయినా టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తన బంగ్లా నుంచే యంత్రాంగాన్ని శాసిస్తున్నారు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో అధికారులు ఆమె అనుచరుల చుట్టూ తిరుగుతున్నారు. కీలక స్థానాల కోసం అదితి కొన్ని పేర్లు కలెక్టరుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో దాదాపుగా తమ కులం వారికే పోస్టింగ్‌లు ఇచ్చేలా ఆయన తండ్రి కొండలరావు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల (జనసేన) ఎమ్మెల్యే లోకం మాధవి కూడా తమకు అనుకూలమైన తహసీల్దార్ల పేర్లను కలెక్టరేట్‌కు పంపినట్లు సమాచారం. కిమిడి కళావెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలితకుమారి సైతం ఇప్పటికే సిఫారసు లేఖలను కలెక్టరేట్‌కు పంపించారు. ⇒ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కొత్తపేట, లాలాపేట పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌లన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. కొత్తపేటకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐని, లాలాపేటకు కాపు సామాజిక వర్గానికి చెందిన సీఐని నియమించండంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాత గుంటూరు స్టేషన్‌కు మాత్రమే సీఐ నియామకాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు అప్పగించినట్లు చెబుతున్నారు. -
ఆదాయం పెంచాల్సిందే.. ఖజానా నింపేందుకు సంస్కరణలు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేందుకు వీలైనన్ని సంస్కరణలు తీసుకుని రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు ఆదాయం రావాలంటే ఆయా శాఖలు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేటేషన్లు, రవాణా శాఖల ఉన్నతాధికారులతో సీఎం దాదాపు నాలుగు గంటలపాటు సమీక్షించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగాలని, పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకుని, ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఆదాయం వచ్చే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని స్పష్టంచేశారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జీఎస్టీ రాబడిపై దృష్టి పెట్టండి నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకొని రాబడి సాధించాలన్నారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్షిస్తానని, అలాగే, ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీని పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం చెప్పారు. వాణిజ్య పన్నుల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా విమాన ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదు? ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు ఆదాయం పెరగకపోవటానికి కారణమేంటని సీఎం రేవంత్ ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని ఈ సందర్భంగా చర్చ జరిగింది. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పరిమిత కాలం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయటం ద్వారా వాహనాల అమ్మకాలపై ఏమైనా ప్రభావం పడిందా అన్న అంశంపై అధ్యయనం చేయాలని సీఎం నిర్దేశించారు. రియల్ ఎస్టేట్‌కు అనుకూలం రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతోపాటు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఈ ఆరు నెలల్లో వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా అదే మాదిరి పుంజుకుంటాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేటేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను అరికట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్‌లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎకరం రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూ.4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ విలువను రూ.4–5 లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది. అయితే ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000, అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ (చదరపు అడుగు) రూ.1,500గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తు 90 శాతం పూర్తయిందని, సోమవారం సాయంత్రానికి రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమరి్పంచనున్నాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల 25వ తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆర్సీసీ నిర్మాణాలు, రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు కేటగిరీల్లో వ్యవసాయ భూముల విలువల సవరణ రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు (ఎక్కువ సర్వే నంబర్లలో ఇదే విలువ ఉంటుంది), రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు (వెంచర్లకు) వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు..ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించనున్నారు. హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను రూ.40–50 లక్షల వరకు సవరించే అవకాశముందని, వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న (ప్లాట్లుగా చేసేందుకు) భూమి విలువను రూ.కోటి వరకు సవరిస్తారని తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూములకు, హైవేల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, ఇతర నగర అభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు, ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతోందని అంటున్నారు. వాణిజ్య ప్రాంతాలు మిస్ కాకుండా ప్రత్యేక దృష్టి తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ అయిన డోర్ నంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాణిజ్య డోర్ నంబర్లను ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికీ సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్‌గా జరిగేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క కమర్షియల్ డోర్ నంబర్ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరుగుతోంది. తక్కువ ఉన్న చోట భారీగా.. సవరణ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలను రూపొందించుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటోంది. బహిరంగ మార్కెట్ విలువకు, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట (ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో) ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రోచర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల 40 నుంచి 100 శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు సవరణలుండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించనున్నారు. మొత్తం మీద ఈ విలువల సవరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీతో పూర్తి కానుండగా, అదే రోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మరోమారు విలువల్లో మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది. -
పరిపాలనలో ‘రెవెన్యూ’ కీలకం
కుత్బుల్లాపూర్: రెవెన్యూ శాఖ పరిపాలనలో కీలకమని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తీరు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కొంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్విసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వం ఆ శాఖను నిర్విర్యం చేసిందని, భూరికార్డులను ధరణి పేరుతో అస్తవ్యస్తంగా నిర్వహించడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖను పటిష్టపరిచి రైతులకు న్యాయం చేస్తామని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడారు. ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ స్థాయిలో సేవలకు ఆటంకం కలగకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరారు. కార్యక్రమానికి సుమారు 5వేలకు పైగా రెవెన్యూ ఉద్యోగులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
భూ చరిత్రలో కొత్త శకం
ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవుతాయి. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్ట పరంగా కన్‌క్లూజివ్ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్‌క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మార్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కిపైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైట్లింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ ► భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ► ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేతప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకీ వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ► ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. టైటిల్ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే ► టైటిల్ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1బిలో ఉన్నా, అడంగల్‌లో ఉన్నా, ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజెంటివ్ రైట్స్ అనేవారు. 1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్ అని భావించేవారు. ► ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్ హయాం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి ఎవరిదో ఉండదు. ► టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రిజెంటివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్ రిజిస్టర్‌గా మారనున్న ఆర్ఓఆర్ రికార్డు ► ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్ రిజిస్టర్లను నిర్ధిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలోనే రిజిస్టర్లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతోంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ► పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీ సర్వేలో రూపొందించిన డిజిటల్ రికార్డులను ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం ప్రకారం ఆర్ఓఆర్ రికార్డు టైటిల్ రిజిస్టర్‌గా మారుతుందని చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధివిధానాలు రూపొందించనుంది. గొప్ప ముందడుగు ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్‌కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. ఇది ఒక ల్యాండ్ మార్క్ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చట్టం అమలులో పేదల కోసం పారా లీగల్ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరియెంటేషన్ అవసరం. ఇది ఆర్ఓఆర్ చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేస్తే ఐదేళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. – ఎం సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష
-
రక్షణ విస్మరించి.. అడ్డగించి.. ‘కోట్‌పల్లి’కి పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్న అధికారులు
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరచి.. అక్కడికి ఎవ్వరూ రాకుండా నిషేధం విధించడం విమర్శలకు తావిస్తోంది. జనవరి 16న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు ఈత కోసం ప్రాజెక్టుకు వచ్చి నీట మునిగి చనిపోయారు. దీన్ని సాకుగా చూపి పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించి ఇలా నిషేధం విధించడం ఏమిటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో కోట్‌పల్లికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ నీటిలో సరదాగా ఆడుకొని సేద తీరుతారు. యువతీ యువకులు గంటల తరబడి నీటిలో సరదాగా ఈత కొడతారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే తలమానికమైన ఈ ప్రాజెక్టును పర్యాటక రంగానికి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్ద కాయ కింగ్ బోటింగ్ సైతం నిషేధించారు. 6 నెలల గడిచినా బోటింగ్ సంస్థకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకొని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు పర్యాటకులు, బోటింగ్‌కు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
రిజిస్ట్రేషన్ కాగానే యాజమాన్య హక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మ్యుటేషన్ (యాజమాన్య హక్కు బదిలీ) విధానాన్ని సులభతరం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇప్పుడున్న విధానంలో క్లిష్టతరంగా ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, నిర్దిష్ట గడువులో ఆ శాఖ దాన్ని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతోంది. మధ్యలో కొన్ని వివాదాలకు సైతం ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఎంతో ప్రహసనంగా ఉన్న మ్యుటేషన్ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిరంతరం సమీక్షలతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా.. మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తీసుకు రానున్నారు. రూపొందిన ప్రత్యేక అప్లికేషన్.. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌కు, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించారు. తత్ఫలితంగా ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ జరిగిందంటే రెవెన్యూ రికార్డుల్లోనూ యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. రెవెన్యూ వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైన మార్పుగా చెబుతున్నారు. ఆటో మ్యుటేషన్ విధానాన్ని తొలుత భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యుటేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ప్రభుత్వ భూమిని రక్షించడం కోసమే పెన్సింగ్:ఆర్డీవో
-
ములుగు జాతీయ రహదారి పనుల్లో ఫారెస్ట్ X రెవెన్యూ
ములుగు: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఆరెపల్లి నుంచి ములుగు మండలం గట్టమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు అనుమతులు రావడంతో సంబంధిత శాఖ టెండర్ పిలిచి పనులు చేపట్టింది. ములుగు మండల పరిధిలోని మహ్మద్‌గౌస్ పల్లి నుంచి మల్లంపల్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాకారం ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 598, 599, 680 పరిధిలోని కెనాల్ నుంచి జాకారం సాంఘీక సంక్షేమ గురుకులం పక్కన ఉన్న నాగిరెడ్డికుంట వరకు, గట్టమ్మ ఆలయం నుంచి పానేస కాల్వ వరకు పనులు నిలిచిపోయాయి. ఈ భూమి మాదంటే మాది అంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య ఉత్పన్నం అయ్యింది. వేరే దగ్గర భూమి ఇవ్వాలని.. వాస్తవానికి కెనాల్ నుంచి ఇరువైపులా ఉన్న భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్ని సంవత్సరాలుగా అటవీ శాఖ సంరక్షించుకుంటూ వస్తోంది. ఎన్‌హెచ్ రోడ్డు పక్కన విలువైన టేకు, కొడిశ, నల్లమద్ది, ఏరుమద్ది, బిలుగు, సండ్ర, గుల్మోహర్, సిస్సు, నెమలినార, నారేప, చిందుగ వంటి చెట్లను ఇతరులు కొట్టకుండా ఈ ప్రదేశం చుట్టూ ట్రెంచ్ వేసింది. అయితే ఇప్పుడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 53/2, 53/19 భూమి రెవెన్యూకు సంబంధించిన ఆస్తి అని పంచాయతీని మొదటికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారులు తమతమ దగ్గర ఉన్న ఆధారాలతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా విషయం కొలిక్కి రాలేదు. జాతీయ రహదారి పక్కన ఉన్న భూమి మా దేనని, ఒక వేళ విస్తరణకు భూమిని తీసుకుంటే ఇరువైపులా 12.5 మీటర్ల చొప్పున 11.34 ఎకరాల భూమిని మరోచోట అప్పగించాలని అటవీ శాఖ ప్రపోజల్ పెట్టింది. అయితే దీనికి రెవెన్యూ శాఖ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉన్న చెట్లను కొట్టేసే క్రమంలో కాంపన్స్ట్రేషనరీ ఎఫారెస్ట్రేషన్ కింద రూ.16 లక్షలు చెల్లించాలని పెట్టిన ప్రపోజల్స్‌కు సైతం ససేమీరా ఒప్పుకోకపోవడంతో అప్పటి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ పలుమార్లు పనులకు అడ్డుతగిలినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో డీఎఫ్‌ఓపై ఫిర్యాదులు అందాయని, ఆయన బదిలీకి ఇది ఒక కారణమని తెలుస్తుంది. గతంలోనూ అంతే.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ పనుల్లో భాగంగా స్థల సేకరణ సమయంలో రెవెన్యూ–అటవీ అధికారులకు భూమి హద్దుల విషయంలో ఇదే విధంగా జరిగింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టడం అటవీ అధికారులు అడ్డుకోవడం పలుమార్లు జరిగింది. దీంతో అటవీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై ఎఫ్‌సీ–1980 చట్టం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఎన్‌హెచ్ అధికారులకు నోటీసులు ఎన్‌హెచ్ విస్తరణ విషయం లోలోపల చిలికిచిలికి గాలివానగా మారుతుందని ఇరుశాఖల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులతో ఇటు పీసీసీఎఫ్, అటు సీఎస్‌కు ఫైల్స్ అందాయని సమాచారం. దీంతో స్పందించిన పీసీసీఎఫ్ నేషనల్ హైవే వరంగల్ డివిజన్ అధికారులకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్(ఎఫ్‌సీ)–1980 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు నేషనల్ హైవే ఇరువైపులా చెట్లకు సంబంధించిన సర్వే చేపట్టకూడదని సిరికల్చర్, హార్టికల్చర్ అధికారులకు ఎఫ్‌సీ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చింది. అయినా అధికారులు చెట్లకు నంబరింగ్ ఇస్తున్నట్లుగా అటవీ అధికారవర్గాలు చెబుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని అటవీ అధికారులు పట్టుపట్టి కూర్చున్నారు. ఈ విషయంలో ఇరుశాఖల రాష్ట్రస్థాయి అధికారులు రాజీకి వస్తే తప్పా కెనాల్ నుంచి నాగిరెడ్డి కుంట వరకు, డీబీఎం–38 కెనాల్(పానేసా కాల్వ) నుంచి గట్టమ్మ మధ్యలో విస్తరణ పనులు జరిగేలా కనిపించడం లేదు. -
81 శాతం భూరికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే నేపథ్యంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల స్వచ్చికరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) రాష్ట్రవ్యాప్తంగా 81 శాతం పూర్తయింది. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూహక్కు పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో రికార్డుల ప్రక్షాళన అత్యంత కీలకంగా మారింది. రీసర్వే ప్రారంభించాలంటే రికార్డులను అప్డేట్ చేయడం తప్పనిసరి. వెబ్‌ల్యాండ్ అడంగల్‌లను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడడం, అడంగల్‌లో పట్టాదారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం, పట్టాదారు, అనుభవదారుల వివరాల కరెక్షన్, అప్డేషన్, పట్టాదారు డేటాబేస్‌ను అప్డేట్ చేయడం వంటివన్నీ కచ్చితంగా పూర్తిచేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ పూర్తిచేసిన తర్వాతే సర్వే బృందాలు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే రికార్డుల స్వచ్చికరణపై ప్రత్యేకదృష్టి సారించి చేస్తున్నారు. 26 జిల్లాల్లోని 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇప్పటివరకు 14,235 గ్రామాల్లో (81 శాతం) పూర్తయింది. అల్లూరి జిల్లాలో 25 శాతం మాత్రమే అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణను పూర్తిచేశారు. అనంతపురం జిల్లాలో 504 గ్రామాలకు 504, కర్నూలు జిల్లాలో 472కి 472, నంద్యాల జిల్లాలో 441కి 441 గ్రామాల్లో స్వచ్చికరణ పూర్తయింది. చిత్తూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 99 శాతం స్వచ్చికరణ పూర్తయింది. ఈ జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో మాత్రమే ఇంకా పూర్తికావాల్సి ఉంది. సత్యసాయి, తూర్పుగోదావరి, ప శ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో 98 శాతం స్వచ్ఛీకరణ పూర్తయింది. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 25 శాతం స్వచ్ఛీకరణనే పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 44 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61 శాతం స్వచ్చికరణ పూర్తయింది. రెండునెలల్లో అన్ని జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణ పూర్తిచేసేందుకు రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించి పనిచేస్తోంది. -
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్ర : మంత్రి ధర్మాన
-
ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష
-
రెవెన్యూ, ద్రవ్య లోటు తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ, ద్రవ్యలోటును తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక శాఖ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)లో ఇటీవల సవరణలు చేసింది. ప్రస్తుత సంవత్సరపు ఆర్థిక విధాన వ్యూహం, మధ్యకాలిక ఆర్థిక విధానాన్ని ఎఫ్ఆర్బీఎం పత్రంలో ఆర్థిక శాఖ దీనిని వెల్లడించింది. 2025–26 ఏడాది నాటికి రెవెన్యూ లోటును 2.4 శాతానికి.. ద్రవ్యలోటును 3.5 శాతానికి తగ్గించనున్నట్లు అందులో పేర్కొంది. అప్పుల శాతం కూడా తగ్గింపు ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులను 2025–26 నాటికి 35.5 శాతానికి తగ్గించాలని కూడా ఆర్థిక శాఖ లక్ష్యంగా నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23)లో ఎఫ్ఆర్బీఎం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 36.30గా ఉంది. అయితే, దీనిని 32.79 శాతానికే పరిమితం చేయనున్నట్లు రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థికశాఖ పేర్కొంది. అంతకుముందు 2021–22 బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35% ఉంటాయని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు అప్పులు 32.51 శాతానికి తగ్గాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ద్రవ్యలోటు 5% ఉంటుందని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు ద్రవ్యలోటు 3.18 శాతానికి తగ్గింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం చట్టాల్లో సవరణలు చేసుకున్నాయి. అదే తరహాలో ఏపీ కూడా సవరణలు చేయడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ద్రవ్య, రెవెన్యూ లోటును తగ్గించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. పన్ను ఎగవేతలను, లీకేజీలను నిరోధించడం ద్వారా రాష్ట్ర సొంత ఆదాయం పెంచుకోవాలని, లావాదేవీల వ్యయాన్ని తగ్గించడంతో పాటు మరింత సమర్ధవంతంగా పన్ను, పన్నేతర ఆదాయాలను రాబట్టుకోవాలని నిర్ణయించింది. -
సర్వే బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భూముల సర్వే సహా ఇతర ముఖ్యమైన మండల సర్వేయర్ల బాధ్యతలను వీరికి బదలాయించింది. సర్వేను వేగంగా నిర్వహించి దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల సర్వేయర్లు మండలానికి ఒక్కరే ఉండడంతో సర్వే వ్యవహారాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వే కోసం భూయజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. దీనిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే పనులు వేగంగా పూర్తి చేసేందుకు మండల సర్వేయర్ల బాధ్యతలను గ్రామ, వార్డు సర్వేయర్లకు అప్పగించింది. 1983 తర్వాత.. గ్రామ స్థాయికి సర్వే సర్వీసు ప్రధానంగా రికార్డుల ప్రకారం భూముల సరిహద్దుల్ని నిర్ధారించే ఎఫ్.లైన్ సర్వీసును గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్), ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్), పీపీఎం (ప్రోపర్టీ పార్సిల్ మ్యాప్) ప్రకారం భౌతికంగా క్షేత్రస్థాయిలో హద్దుల్ని తెలిపేదాన్ని ఎఫ్ లైన్ సర్వీసుగా చెబుతారు. ఎవరైనా తమ భూములు, స్థలాల్ని విక్రయించినప్పుడు, భూమి హద్దుల్ని తనిఖీ చేసుకోవాలనుకున్నప్పుడు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. 1983కి ముందు సర్వే శాఖలో కింది స్థాయిలో ఉన్న తాలూకా సర్వేయర్ ఈ పని చేసేవారు. ఆ తర్వాత మండల వ్యవస్థ రావడంతో మండల సర్వేయర్లు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువచ్చి గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పారు. సచివాలయాల్లో ప్రత్యేకంగా 11 వేల మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు మండల సర్వేయర్ల బాధ్యతల్ని వాళ్లకి అప్పగించి సర్వే సర్వీసుల్ని ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. ఇందుకనుగుణంగా సర్వే ప్రక్రియలో మార్పులు చేసింది. 15 రోజుల్లో సర్వే దరఖాస్తును పరిష్కరించాలని నిర్దేశించింది. గ్రామ సర్వేయర్ సర్వే నిర్వహించాల్సిన విధానం, అభ్యంతరాల పరిశీలన, దరఖాస్తును తిరస్కరిస్తే ఏ కారణాలతో తిరస్కరించాలో మార్గదర్శకాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే భూముల రికార్డుల నిర్వహణను కూడా వారికే అప్పగించింది. (క్లిక్: సంక్షేమాభివృద్ధి పథకాలు ఆపేయాలట!) 27 రోజుల్లో సబ్ డివిజన్ పూర్తి చేయాలి భూముల సబ్ డివిజన్ బాధ్యతను కూడా మండల సర్వేయర్ నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించింది. భూముల రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్, సబ్ డివిజన్ చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో సబ్ డివిజన్ కేసుల్ని వేగంగా పూర్తి చేసేందుకు ఆ బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. స్క్రుటినీ బాధ్యతల్ని మాత్రం మండల సర్వేయర్లు చేస్తారు. 27 రోజుల్లో సర్వే సబ్ డివిజన్ పూర్తి చేయాలని నిర్దేశించింది. సర్వే దరఖాస్తుల తిరస్కరణ ఆర్డీవో, సబ్ కలెక్టర్ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు సర్క్యులర్లను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ విడుదల చేశారు. (క్లిక్: ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు) -
రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో... రాష్ట్రం రియల్ రికార్డు
సాక్షి, అమరావతి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2021–22లో ఏకంగా రూ.7,327.24 కోట్ల ఆదాయాన్ని (35 శాతం వృద్ధి) అర్జించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఇది నిదర్శనంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రియల్ బూమ్‌తో రికార్డులు సృష్టించామని గొప్పలు చెప్పుకున్న టీడీపీ హయాంతో పోల్చితే ఈ ఆదాయం చాలా ఎక్కువ కావడం విశేషం. కోవిడ్‌తో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైనా 35 శాతం వృద్ధి రేటు నమోదైంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళుతుందనేందుకు ఇదే ఉదాహరణ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ పాలనలో ఏ సంవత్సరమూ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5 వేల కోట్లు దాటలేదు. 2014లో 13.70 లక్షలు మాత్రమే ఉన్న రిజిస్ట్రేషన్లు తాజాగా 20.76 లక్షలు దాటాయి. దీన్నిబట్టి స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. దూకుడు ఇలా.. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 59.15% వృద్ధి రేటుతో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలవగా 7.40 శాతం వృద్ధితో అనంతపురం చివరి స్థానంలో ఉంది. ఎక్కువ ఆదాయం విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లభించింది. విశాఖపట్నం జిల్లా నుంచి రూ.1,117.45 కోట్ల అత్యధిక ఆదాయం లభించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అతి తక్కువగా రూ.203.61 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి నిదర్శనం రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరగడం శుభ పరిణామం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది నిదర్శనం. రిజిస్ట్రేషన్ల శాఖలో పలు మార్పులు తెచ్చాం. ప్రజల సంక్షేమం, మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్లే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ.7327.24 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరింది. – రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్) సత్వర సేవలతోపాటు ఆదాయం ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు మెరుగైన ఆదాయాన్ని సాధించాం. ఆదాయానికి గండి పడుతున్న చోట కొద్దిపాటి మార్పులతో సత్ఫలితాలు వచ్చాయి. – వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (చదవండి: చైనా చదువులపై తస్మాత్ జాగ్రత్త) -
ఆందోళనలో ఆ 22 వేల మంది ఉద్యోగులు.. కేసీఆర్ కనికరిస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా (వీఆర్ఏ) పని చేస్తున్న 22 వేల మంది సిబ్బంది పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏళ్ల తరబడి వేతనాలు పెరగకపోవడం, పదోన్నతులు రాకపోవడంతో పాటు వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తమ భవిష్యత్తు ఏంటనే బెంగ వీఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులకు పట్టుకుంది. తమను రెవెన్యూలోనే కొనసాగిస్తారా? ఎంతమందిని కొనసాగిస్తారు? ఇతర శాఖలకు పంపుతారా? అసలు ఉద్యోగాలను ఉంచుతారా? తీసేస్తా రా? అనే సందేహాలు వీఆర్ఏ వర్గాల్లో వ్యక్తమ వుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు పేస్కే ల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళన బాట పట్టారు. అన్నీ పెండింగ్‌లోనే.. క్షేత్రస్థాయిలో జరిగే రెవెన్యూ కార్యకలాపాలకు సహాయకులుగా ఉండేందుకు ప్రభుత్వం వీఆర్ఏలను నియమించింది. వీరిలో కొందరిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయగా, చాలామందిని నేరుగానే నియమించింది. 2007 నుంచి వీరికి నెలకు రూ.10,500 వేతనం ఇస్తున్నారు. టీఏ, డీఏలు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,400, పట్టణ ప్రాంతాల్లో రూ.11,500 చొప్పున వేతనం వస్తోంది. అయితే తమకు ఉద్యోగ భద్రత కోసం పేస్కేల్ వర్తింపజేయాలని వీఆర్ఏలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పేస్కేల్ అమల్లోకి వస్తే హెల్త్‌కార్డులు వస్తాయని, టీఏ, డీఏలతో పాటు అన్ని అల వెన్సులు క్రమం తప్పకుండా పెరుగుతాయనే ఆలోచనతో వీఆర్ఏలు ఈ డిమాండ్ చేస్తు న్నారు. వాస్తవానికి వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పదోన్నతులు ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారు. వీటితో పాటు డైరెక్ట్ వీఆర్ఏల సర్వీసులను క్రమబద్ధీకరించే అంశం కూడా పెండింగ్‌లోనే ఉంది. మూడు రకాలుగా వర్గీకరణ! విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తోన్న వీఆర్ఏలను మూడు రకాలుగా వర్గీకరించాలని ఉన్నతస్థాయిలో ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. అందులో 3,300 మందికి పైగా వీఆర్ఏలను సాగునీటి శాఖలో లష్కర్లుగా పంపాలన్న దానిపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. ఇక మిగిలిన వారిని స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పేరుతో వర్గీకరించారు. స్కిల్డ్ ఉద్యోగులను రెవెన్యూలోనే కొనసాగించాలని, గ్రామానికొకరిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, మిగిలిన 8–9 వేల మందిని అన్‌స్కిల్డ్ కేటగిరీలో చేర్చగా, వీరిని ఏం చేస్తారన్నదే తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే వీఆర్ఏలు సోమ, మంగళ వారాల్లో ధర్నాలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏ, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ కోరారు. వీఆర్ఏల డిమాండ్లివే.. ♦సీఎం హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ వర్తింపజేయాలి. ♦55 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ♦అర్హులైన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. ♦అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ♦విధుల్లో భాగంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.