Trupti Desai
-
షిర్డీ.. ఆమెకు అనుమతి లేదు
ముంబై: సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై షిర్డీ అధికారులు అంక్షలు విధించారు. డిసెంబర్ 8 నుంచి 11 అర్ధరాత్రి వరకు తృప్తి దేశాయ్‌కు షిర్డీ ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గోవింద్ షిండే నోటీసులు జారీ చేశారు. తృప్తి దేశాయ్ ఆలయంలోకి ప్రవేశిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు. షిర్డీతో పాటు దాని పక్కనే ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలో కూడా ఆమె ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఆమె తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆలయంలోకి ప్రవేశించడానికి చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, షిర్డీ ఆలయంలోకి వచ్చే భక్తుల సంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలని ఆలయ అధికారులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిపై తృప్తి దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు ఆ పోస్టర్లను తొలగించాలని.. లేకపోతే తానే ఇతర కార్యకర్తలతో డిసెంబర్ 10న ఆలయం వద్దకు చేరుకుని వాటిని తొలగిస్తానని తృప్తి దేశాయ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆమెకు నోటీసులు జారీచేశారు. (ప్లీజ్.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి) అయితే తమ భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని షిర్డీ ట్రస్ట్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. షిర్డీకి వచ్చే కొందరి వస్త్రాధారణపై భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేవలం షిర్డీ వచ్చేవారికి అభ్యర్థన చేసే విధంగా ఆలయ పరిసరాల్లో పోస్టర్లు అంటించినట్టు చెప్పారు. ఇక, ఈ పోస్టర్లకు సంబంధించి ట్రస్ట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాసినట్లు తృప్తి దేశాయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘దేవాలయం పవిత్రతను ఎలా కాపాడాలో భక్తులకు బాగా తెలుసు. ఈ పోస్టర్లును తొలగించకపోతే.. మేం ఇక్కడికి వచ్చి వాటిని తొలగిస్తాం. డిసెంబర్ 10 మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి మేం ఇక్కడకు చేరుకుంటాం’అని హెచ్చరించారు. -
శబరిమల: మహిళా కార్యకర్తపై కారంపొడితో దాడి
తిరువనంతపురం: కేరళలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మహిళా హక్కుల నేత తృప్తి దేశాయ్‌తోపాటు మొత్తం ఆరుగురు మహిళలు శబరిమల కేరళ వచ్చారు. శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భద్రత కల్పించాలంటూ కొచ్చి సిటీ పోలీసు కమిషనర్‌ను వారు ఆశ్రయించారు. అయితే, వారి బృందంలో ఒకరైన బిందు అమ్మినిపై సీపీ కార్యాలయం ఎదుటే దాడి జరిగింది. హిందూ సంస్థల కార్యకర్త ఒకరు కారంపొడి స్ప్రేతో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గత జనవరిలో హిందూ సంస్థల కళ్లుగప్పి బిందు అమ్మిని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తాజాగా కూడా తృప్తి దేశాయ్‌తో కలిసి మరోసారి అయ్యప్పను దర్శించుకోవడానికి ఆమె వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో బిందుతోపాటు తృప్తి దేశాయ్ బృందాన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టు సమీక్షకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రచారం కోసం శబరిమలకు వచ్చే మహిళలకు భద్రత కల్పించలేమంటూ కేరళ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాకే తాము కేరళను వీడి వెళతామని తృప్తి దేశాయ్ చెప్తున్నారు. దేశంలో అందరికీ సమాన హక్కులుంటాయని రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇవాళ.. మమ్మల్ని ఇలా అడ్డుకోవడం, దాడులు చేయడం తమను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. -
ఆంక్షలపై అసంతృప్తి
నల్ల దుస్తులలో అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. పడిపూజలు జరుగుతున్నాయి. దీక్షలో ఉన్నవారు శబరిమల ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఇదే సమయంలో సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ తాను శబరిమలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించినా, కల్పించకపోయినా సరే, తాను దర్శనానికి వెళ్లేది వెళ్లేదేననికచ్చితంగా చెప్పారామె. మరోవైపు కేరళ దేవాదాయ మంత్రి సురేంద్రన్ మాత్రం ‘ఆలయంలోకి ప్రవేశించ డానికి ప్రయత్నించే మహిళలకు రక్షణ కల్పించడం అనేది ఉండదు’ అంతే కచ్చితంగా చెప్పారు. అయినా తృప్తికి ఏమిటింత పట్టు? ఆమె పట్టుదల వెనుక పరిస్థితులు ఎలాంటివి? భారత రాజ్యాంగంలో మగవాళ్లు, మహిళలు సమానమే అని ఉంది. మరి ధార్మిక సంస్థల్లో ఈ రకమైన లింగ వివక్ష ఎందుకు అనేది తృప్తీ దేశాయ్ ప్రశ్న. దేశాయ్.. దేశానికి ధార్మిక సంస్థల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న కార్యకర్తగానే తెలుసు. కానీ ఆమె అంతకు ముందు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఆమెది çపుణెలోని సామాన్య కుటుంబం. మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆమె తండ్రి ఇంటిని వదిలి ఆశ్రమాలకు వెళ్లిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలను పెంచి పోషించాల్సిన బాధ్యత తృప్తి తల్లి మీద పడింది. తృప్తి పుణెలో ఉమెన్స్ యూనివర్సిటీలో హోమ్‌సైన్స్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఏడాది తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తృప్తి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి మురికివాడల్లో సేవ చేశారు. పన్నెండేళ్ల కిందట మహారాష్ట్రలోని అజిత్ కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన యాభై కోట్ల కుంభకోణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు తృప్తి. ఆ బ్యాంకు అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ది. అజిత్ పవార్ దిష్టిబొమ్మను తగులబెట్టిన ఆందోళనలో తృప్తి నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణతో ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు అవినీతికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించిన నేపథ్యం కూడా ఉంది. ‘భూమాత బ్రిగేడ్’ స్థాపన ఒక సామాన్యమైన అమ్మాయి.. సామాజిక కార్యకర్తగా మారడానికి, వ్యవస్థలో కరడుగట్టి ఉన్న లోపాలను ప్రశ్నిస్తూ గళం విప్పడానికి, వివక్షను ఎలుగెత్తుతూ పిడికిలి బిగించడానికి వెనుక పెద్ద మధనమే జరిగి ఉండాలి. అగాధమంత అసంతృప్తి ఏదో ఆమెను ఆవరించి ఉండాలి. తండ్రి తన బాధ్యతల నుంచి పారిపోవడం, తల్లి కుటుంబ బరువు మోయాల్సి రావడం తృప్తి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. బాధ్యతలను గాలికొదిలేసి సన్యాసం స్వీకరించిన మగవాడికి మాత్రం ఆలయాల్లోకి సగౌరవంగా స్వాగతం పలుకుతూ, ఆడవాళ్ల పట్ల వివక్ష చూపించడాన్ని ఆమె సహించలేకపోయారు. భూమాత బ్రిగేడ్ పేరుతో 2010లో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ధార్మిక ప్రదేశాల్లో అమలవుతున్న లింగ వివక్ష మీద పోరాటానికి సిద్ధమయ్యారు. శని శింగణాపూర్ విజయం మహారాష్ట్రలోని శనిశింగణాపూర్‌లోని శనిదేవుడి ఆలయంలోకి మగవాళ్లకు మాత్రమే ప్రవేశం ఉండేది. తృప్తి లేవదీసిన ఉద్యమంతో సుప్రీంకోర్టు ఆ ఆంక్షను తొలగించింది. తర్వాత 2016 ఏప్రిల్‌లో ముంబయిలోని హాజీ అలీ దర్గాలోకి ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. అదే ఏడాది మే నెలలో ఆమె కట్టుదిట్టమైన భద్రత నడుమ మసీదు గర్భగుడిలోకి మహిళలకు అనుమతి లేని నియమాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఆ మసీదులోని మిగతా భాగంలోకి ప్రవేశించారు. అలాగే నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయంలో మగవాళ్లలాగానే తడివస్త్రాలతో గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే కొల్హాపూర్‌లో మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కొల్హాపూర్ లక్ష్మీదేవిని అర్చించుకోవడానికి మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత తృప్తీదేశాయ్ మరికొందరు కార్యకర్తలతోపాటు ‘విజయ్ ర్యాలీ’ నిర్వహించారు. అయితే భక్తులు ఆ ర్యాలీని అడ్డుకుని తృప్తీదేశాయ్ని గాయపరిచారు. మహాలక్ష్మి ఆలయంలోకి చీరతోనే రావాలనే నియమాన్ని ఉల్లంఘించి సల్వార్ కమీజ్‌తో రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మీద దాడి జరిగింది. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నెలలో శబరిమల ఆలయంలో ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆమెను కొచ్చి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ‘మహిళల గొంతు నొక్కడమే’ ఈ ఏడాది ఆలయం తెరిచిన తర్వాత తిరిగి ప్రవేశానికి ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమ వయసులో ఉన్న మహిళల ప్రవేశం మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం మీద న్యాయమూరులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో తీర్పు కోసం విస్తృత ధర్మాసనాన్ని అప్పగించారు గత ఏడాది మహిళలకు రక్షణ కల్పించిన కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఆ ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం రక్షణ బాధ్యత చేపట్టకపోవడం మహిళల గొంతుకను అణచివేయడమే అంటున్నారు తృప్తీదేశాయ్ ఆవేశంగా, ఆవేదనగా. – మంజీర ►తృప్తీ దేశాయ్ నాస్తికురాలని కొందరు, హిందూ వ్యతిరేకి అని కొందరు అభివర్ణించడాన్ని ఆమె భర్త ప్రశాంత్ తప్పు పట్టారు. ఆమె పరమభక్తురాలని, కొల్హాపూర్‌లోని గగన్‌గిరి మహారాజ్ భక్తురాలని చెప్పారాయన. ఆమె తన కొడుకును కూడా ఆస్తికవాదిగానేపెంచుతోందని, ఆమె పోరాటం స్త్రీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మాత్రమేనని అంటారు ప్రశాంత్. ►అయ్యప్ప దర్శనం కోసం శబరిమల చేరుకున్న భక్తులతో శనివారం నాడు కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం. అదేరోజు.. వయోపరిమితి నిబంధనలకు విరుద్ధంగా దర్శనం కోసం వచ్చిన కొంతమంది మహిళా భక్తులను ఆలయ నిర్వాహ కులు ‘పంబ’ ప్రాంతం నుంచే వెనక్కు పంపించేశారు. అలా పంపించడం వివక్షేనని తృప్తీ దేశాయ్ అంటున్నారు. ఎన్ని ఆంక్షలున్నా తను అయ్యప్పను దర్శించుకునే తీరుతానని ఆమె ప్రకటించారు. -
వెనుతిరిగిన తృప్తి దేశాయ్
తిరువనంతపురం : భక్తుల శరణు ఘోషతో మారుమోగాల్సిన అయ్యప్ప సన్నిధానం నిరసనకారుల నినాదాలతో హోరెత్తుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తరువాత శబరిమల ఆలయాన్ని ఇప్పటికి మూడు సార్లు తెరిచారు. కానీ ప్రతి సారి అయ్యప్ప సన్నిధానం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా వార్షిక మండల దీక్ష సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఈ సందర్భంగా తాను శబరిమలలో ప్రవేశించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకునే తీరతానని శపథం చేసి శుక్రవారం కొచ్చి చేరుకున్నారు సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్. కానీ నిరసనకారులు ఆమెను కొచ్చి విమానాశ్రయం వద్దే అడ్డుకున్నారు. ఆలయానికి వెల్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. 14 గంటల నిరసనల అనంతరం తృప్తి దేశాయ్, ఆమెతో పాటు వచ్చిన మరో 6గురు కార్యకర్తలు ముంబై తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరికి ముంబై విమానాశ్రయంలో కూడా నిరసనల సెగ తగిలింది. ఎందుకు ఇంత అత్యుత్సాహం : తస్లిమా నస్రీన్ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ శబరిమల వివాదంపై స్పందించారు. ‘మహిళా కార్యకర్తలంతా శబరిమల ఆలయాన్ని సందర్శించడానికి ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. శబరిమల బదులు గ్రామాలకు వెళ్లి అక్కడ మహిళ పట్ల జరుగుతున్న గృహహింస, అత్యాచారం, వేధింపులు, నిరక్షరాస్యత, సమాన వేతనం, ఆరోగ్యం, ఉద్యోగం చేసే స్వేచ్ఛ వంటి అంశాల గురించి పోరాడితే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. I do not understand why women activists are so eager to enter Sabarimala. Better they should enter the villages where women suffer from domestic violence, rape, sexual abuse,hate, where girls have no access to education, heath-care,and no freedom to take a job or get equal pay. — taslima nasreen (@taslimanasreen) November 16, 2018 -
ఉద్రిక్తతల నడుమ తెరుచుకున్న శబరిమల ఆలయం
కోచి/శబరిమల/పంబ: భారీ పోలీసు బందోబస్తు, అయ్యప్ప భక్తుల శరణు ఘోష మధ్య శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ రాకతో కోచిలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రి వరకు కొనసాగాయి. పోలీసుల సూచనతో ఆమె తిరిగి పుణె వెళ్లిపోయారు. ఆలయంలోకి రుతుస్రావం వయసు మహిళలనూ అనుమతించాలన్న ఉత్తర్వుల అమలుకు సుప్రీంకోర్టును సమయం కోరనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు(టీడీబీ) తెలిపింది. భారీగా భక్తుల రాక శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయ తలుపులను ప్రధాన పూజారి కందరారు రాజీ వరు తెరిచారు. పూజారులు ఎంఎల్ వాసుదేవన్ నంబూద్రి, ఎంఎన్ నారాయణన్ నంబూద్రి అయ్యప్ప, మలిక్కపురమ్ పూజల బాధ్యతలను స్వీకరించారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఇరుముడులతో తరలివచ్చిన వందలాది భక్తుల శరణు ఘోషతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. దర్శనం క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. నేటి నుంచి డిసెంబర్ 27 వరకు అంటే మండల పూజలు జరిగే 41 రోజుల పాటు భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. జనవరి 14వ తేదీన జరిగే మకరవిలక్కు పూజల కోసం తిరిగి డిసెంబర్ 30 నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. సుప్రీం తలుపుతడతాం: టీడీబీ నేటి నుంచి మండల పూజలు ప్రారంభం కానున్న దృష్ట్యా టీడీబీ అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ శుక్రవారం బోర్డు సభ్యులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. రుతుస్రావ వయసు మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆందోళనలు సాగుతుండటంపై వారు చర్చించారు. టీడీబీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉత్తర్వుల అమలుకు మరికొంత సమయం కావాలంటూ శని లేదా సోమవారాల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఆలయం వద్ద భారీ బందోబస్తు ఆలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. గురువారం అర్ధరాత్రి నుంచి 144వ సెక్షన్ నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. 20 మంది సభ్యుల కమాండో బృందం, 234 మందితో కూడిన బాంబ్ స్క్వాడ్, 800పైగా మహిళా పోలీసులతోపాటు మొత్తం 15వేల మందిని వివిధ ప్రాంతాల్లో బందోబస్తుకు వినియోగిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత సన్నిధానంలో ఉండేందుకు భక్తులను అనుమతించడం లేదు. కనీస వసతుల కొరత ఆలయ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆరోపిస్తున్నారు. టాయిలెట్లు, విశ్రాంతి గదులు దొరక్క తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మహిళా భక్తులు తెలిపారు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని మరికొందరు చెప్పారు. టీడీబీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమయిందని ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల ఆరోపించారు. వెళ్తున్నా.. మళ్లీ వస్తా! సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ రాకపై కోచిలో బీజేపీ కార్యకర్తలు, భక్తులు తదితరుల నిరసనలతో ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. తృప్తి దేశాయ్, మరో ఆరుగురు మహిళలతో కలిసి శుక్రవారం వేకువజామున 4.40 గంటల సమయంలో పుణె నుంచి విమానంలో కోచికి చేరుకున్నారు. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వారిని ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ‘శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెప్పడంతో వెనుదిరిగి వెళ్తున్నా. కానీ, త్వరలోనే వస్తాం. ఆలయంలో పూజలు చేస్తా’ అని తృప్తి అన్నారు. ఆమెను విమానాశ్రయంలోనే అడ్డుకున్న సుమారు 200 మంది ఆందోళనకారులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టులో అభివాదం చేస్తున్న తృప్తి -
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత
-
కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో తృప్తి దేశాయ్ అడ్డగింత
తిరువనంతపురం: శబరిమలకు బయలుదేరిన భూమాత బ్రిగేడ్ చీఫ్, సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ను శుక్రవారం ఉదయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు నిలిపివేశారు. విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ గేట్ వెలుపల పెద్దసంఖ్యలో నిరసనకారులు గుమికూడి నినాదాలు చేస్తుండటంతో ఆరుగురు మహిళా యాత్రికులతో తెల్లవారుజామున 4.40 గంటలకు కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తృప్తి దేశాయ్ బృందాన్ని పోలీసులు బయటకు అనుమతించలేదు. కాగా శబరిమల వచ్చేందుకు తన ప్రయాణ ఏర్పాట్లను వివరిస్తూ తమకు భద్రత కల్పించాలని కోరుతూ తృప్తి దేశాయ్ బుధవారం కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. తృప్తి రాకను పసిగట్టిన హిందూ సంస్ధల కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు ఆమె పర్యటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శబరిమలకు వెళ్లకుండా ఆమెను నిరోధించేందుకు విమనాశ్రయం వెలుపల పెద్ద ఎత్తు ఆందోళనకు దిగాయి. కాగా, శబరిమలకు బయలుదేరిన తమను హతమారుస్తామని, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, పోలీసులు తమకు ఎలాంఇ భద్రత కల్పించకపోయినా శబరిమలకు వెళ్లి తీరుతామని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. మరోవైపు తన శబరిమల యాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆమె మెయిల్ చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హిందూ సంస్థలతో పాటు బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయం వద్ద భారీ భద్రత తృప్తి దేశాయ్ శబరిమలను సందర్శిస్తారనే సమాచారంతో పెద్ద సంఖ్యలో నిరసనకారులు కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప దర్శనం అయ్యాకే తిరుగుముఖం పడతానని తృప్తి దేశాయ్ తేల్చిచెబుతుండటం, ఆమెను అడ్డుకుంటామంటూ నిరసనకారులు నినాదాలతో హోరెత్తిస్తుండటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బలగాలను భారీగా మోహరించారు. -
నాకేదైనా జరిగితే కేరళ సీఎం,డీజీపీలదే బాధ్యత
-
17న శబరిమలకు తృప్తి దేశాయ్
తిరువనంతపురం/ న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ నెల 17న తాను కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామిని దర్శించుకుంటానని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు మహిళలతో కలసి తాను ఆలయానికి వెళ్తున్నట్లు తెలిపారు. దర్శనసమయంలో తనకు రక్షణ కల్పించాలని ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్‌లను కోరింది. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టనివ్వ బోమని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో వారిని అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోౖ వెపు, తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం మరోసారి నిరాకరించింది. శబరిమల తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లపై జనవరి 22న ఓపెన్ కోర్టులో విచారణ చేపడతామని తెలిపింది. -
'ఆమెను ఆలయంలోకి వెళ్లనీయం'
కొచ్చి: శబరిమల ఆలయంలోకి మహిళ హక్కుల కార్యకర్తలను అనుమతించబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. తృప్తి దేశాయ్ ను అడ్డుకుంటామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆలయ సంప్రదాయాలను అందరూ గౌరవించాలని అన్నారు. 'శబరిమల ఆలయం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడి ఆచారాలు, మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందే. మహిళలకు ఆలయ ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు సంప్రదాయ ఆచారాలు కొనసాగుతాయ'ని మంత్రి స్పష్టం చేశారు. ఆలయాల్లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్.. వెయ్యి మంది మహిళలతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
తృప్తి దేశాయ్ కు ‘బిగ్ బాస్’ ఆఫర్
ముంబై: ఆలయాల్లో మహిళల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ కు ’బిగ్ బాస్’ ఆఫర్ వచ్చింది. వివాదస్పద సెలబ్రిటీ రియాలిటీ షో ‘బిగ్ బాగ్ 10’ లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని తృప్తి దేశాయ్ ధ్రువీకరించారు. అయితే ఒక షరతుపై ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమని ఆమె తెలిపారు. ఇందులో పోటీపడే వారందరూ మహిళలు ఉండాలని ఆమె షరతు పెట్టారు. తన షరతుకు అంగీకరిస్తే పాల్గొంటానని వెల్లడించారు. అక్టోబర్ 16 నుంచి బిగ్ బాగ్ 10 కార్యక్రమం ప్రారంభమవుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి సామాన్యులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారని అంటున్నారు. సుల్తాన్, వ్యోమగామి వేషంలో సల్మాన్ ఖాన్.. ప్రొమోస్ లో కనిపిస్తున్నాడు. -
నడిరోడ్డులో యువకుడిని బాదేసిన తృప్తి దేశాయ్
-
నడిరోడ్డులో యువకుడిని బాదేసిన తృప్తి దేశాయ్
మహిళలకు ప్రవేశం లేదని చెప్పే ఆలయాల్లోకి వెళ్లి.. అక్కడ తాము సైతం పూజలు చేస్తామంటూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ తాజాగా ఓ యువకుడిని నడిరోడ్డులో చితకబాదేసింది. చెప్పులతో కొట్టింది. ఒక మహిళతో సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోడానికి నిరాకరించినందుకు అతడికి ఈ శిక్ష విధించింది. మహిళా హక్కుల కార్యకర్త అయిన తృప్తి తన సహచరులతో కలిసి శ్రీకాంత్ లోంఢే అనే వ్యక్తిని పుణె-అహ్మద్‌నగర్ రోడ్డుపై శిర్వాల్ అనే గ్రామం వద్ద నడిరోడ్డులో అందరూ చూస్తుండగా చెప్పులతో కొట్టింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని తృప్తి ఆరోపించింది. ఇప్పుడామె గర్భవతి అయ్యిందని.. అబార్షన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆమె చేయించుకున్న తర్వాత కూడా పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అతడు ఇంతకుముందు మరో ఇద్దరు మహిళలను కూడా ఇలాగే మోసం చేశాడని, దాంతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఏమీ కనపడలేదని చెప్పింది. లోంఢేను తృప్తి దేశాయ్ కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. అయితే.. ఇదంతా పబ్లిసిటీ స్టంటేనని, ఇలా జనాన్ని శిక్షించడం తృప్తి దేశాయ్ మానుకోవాలని కొందరు కామెంట్లు పెట్టారు. సామాజిక కార్యకర్తలమని చెప్పుకొనేవాళ్లు ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమకు ఇష్టం వచ్చినట్లు న్యాయం చెబుతుంటే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుందని విశ్వంభర్ చౌదరి అనే సామాజిక కార్యకర్త అన్నారు. -
'భక్తులపై దాదాగిరి చెల్లదు'
నాసిక్: భక్తులపై దాదాగిరి చేయడాన్ని ఒప్పుకోబోమని ఆలయాల్లో మహిళల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ అన్నారు. నాసిక్ లోని కపలేశ్వర్ ఆలయంలో పూజలు చేసేందుకు తమను అనుమతించలేదని ఆమె తెలిపారు. పలువురు మహిళలతో కలిసి ఆలయ గర్భగుడిలోకివెళ్లేందుకు రెండోసారి ప్రయత్నించిన ఆమెను పూజారులు అడ్డుకున్నారు. భక్తుల పట్ల కులవివక్ష చూపుతున్నారని తృప్తి దేశాయ్ ఆరోపించారు. గతంలో ఆలయప్రవేశానికి ప్రయత్నించినప్పుడు తాము నిమ్న కులాలకు చెందిన వారిమని చెప్పగా, పూజారులు తమను బయటకు గెంటేశారని వెల్లడించారు. ఆలయ ధర్మకర్తలు తమను గర్భగుడిలోకి అనుమతించాలని చెప్పినప్పటికీ పూజారులు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. -
హజీ అలీ దర్గాలో తృప్తి దేశాయ్ ప్రార్థనలు
న్యూఢిల్లీ : భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ఎట్టకేలకు ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. పోలీసులు భద్రత మధ్య ఆమె గురువారం ఉదయం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తృప్తి దేశాయ్ మాట్లాడుతూ... స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించేందుకే తమ పోరాటం అన్నారు. మరొకసారి గర్భగుడికి వెళ్లి ప్రార్థనలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పోలీసులు ఈసారి తమకు సహకరించారని తృప్తి పేర్కొన్నారు. హజీ అలీ దర్గాలోకి ఏప్రిల్ 28న తృప్తి దేశాయ్‌తో పాటు పలువురు మహిళలు లోనికి ప్రవేశించేందుకు యత్నించగా, పోలీసులతో పాటు స్థానిక ముస్లింలు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆమె దర్గాలోకి ప్రవేశించగలిగినా... దర్గాలోని ముఖ్యప్రాంతం (గర్భగుడి)లోకి మాత్రం వెళ్లలేకపోయారు. కాగా ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం తృప్తి దేశాయ్ గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్, త్రయంబకేశ్వర్ ఆలయాల ప్రవేశం అనంతరం హజీ అలీ దర్గా ప్రవేశం చేశారు. -
దర్గాలోకి వస్తే రంగు పడుద్ది!
ముంబైలోని హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తే.. భూమాత రణరాగిణి బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్‌పై నల్లసిరా చల్లుతామని ఏఐఎంఐఎం హెచ్చరించింది. హజీ ఆలి దర్గాలోని లోపలి చాంబర్లోకి మహిళల ప్రవేశం నిషేధం. అయితే, దీనిని ధిక్కరిస్తూ.. గురువారం తమ మహిళ కార్యకర్తలతో కలిసి హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తామని తృప్తి దేశాయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తృప్తి దేశాయ్ ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బలవంతంగా ఆమె హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తే.. ఆమెపై మేం నల్ల సిరా చల్లుతాం' అని ఎంఐఎం మహారాష్ట్ర నేత హజీ రఫత్ స్పష్టం చేశారు. ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం వివక్ష చూపడమేనంటూ తృప్తి దేశాయ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హజీ ఆలి దర్గా జంక్షన్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించాలని ఆమె నేతృత్వంలోని బిగ్రేడ్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ దర్గాలో మహిళలకూ ప్రార్థనల్లో సమాన అవకాశాలు కల్పించాలని తృప్తి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్గా పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృప్తి ప్రకటనను వ్యతిరేకిస్తూ శివసేన నేత హజి ఆరాఫత్ ఇప్పటికే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. -
'ఆర్ఎస్ఎస్ లోకి మహిళలను తీసుకోండి'
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆలయాల్లో స్త్రీల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్ డిమాండ్ చేశారు. మహిళల ఓట్లుతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఆర్ఎస్ఎస్ కూడా తమ సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆమె అన్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు లేఖ రాయనున్నట్టు చెప్పారు. స్త్రీ,పురుష సమాన హక్కుల కోసం మోహన్ భాగవత్ మద్దతు కోరతామన్నారు. తృప్తి దేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే. -
'అక్కడికెళ్తే నిన్ను చెప్పులతో కొడతారు'
ముంబై : మహిళా హక్కుల కార్యకర్త, భూమాత రణరాగిణి బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ని ఉద్దేశించి శివసేన ముస్లిం నాయకుడు ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చేవారం ముంబైలోని హజీ ఆలి దర్గాలోని ప్రవేశిస్తే.. ఆమెను చెప్పులతో తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. 'హజీ ఆలి దర్గాలోకి ప్రవేశించి మజార్‌ను తాకుతామని తృప్తి దేశాయ్ చెప్తోంది. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆమెకు చెప్పులతో స్వాగతం తప్పదు' అని శివసేన నాయకుడు హజి ఆరాఫత్ షైక్ తెలిపారు. 2014లో ఎమ్మెన్నెస్ నుంచి శివసేనలో చేరిన షైక్ మాట్లాడుతూ 'నా మతం తరఫున నేను గళమెత్తుతాను. మజార్‌ను తాకేందుకు ఆమెను అనుమతించను. ముస్లిం మహిళలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు' అని చెప్పారు. హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తి దేశాయ్ ఇటీవల హజీ ఆలి దర్గాలోకి కూడా ప్రవేశిస్తామని ప్రకటించింది. స్త్రీలకు ప్రవేశం లేని ఈ దర్గాలో మహిళలతో కలిసి ప్రార్థనలు నిర్వహిస్తామని ఆమె తెలిపింది. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన షైక్.. దర్గాలోకి ప్రవేశించాలన్న తృప్తి ప్రయత్నం వెనుక కుట్ర దాగి ఉందని, ముంబైలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఈ కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. మరోవైపు ఈ నెల 28న హజీ ఆలి దర్గాలోకి తాము ప్రవేశించి తీరుతామని, శివసేన బెదిరింపులకు తలొగ్గబోమని తృప్తి దేశాయ్ స్పష్టం చేస్తున్నారు. -
మహిళలు సాధించిన మరో భారీ విజయం
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి మహిళల్ని అనుమతించడంపై భూమాత బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు సాధికారత సాధించే దిశలో మరో పెద్ద విజయమని అని వ్యాఖ్యానించారు. ఇక ముందు మహిళలు, పురుషులు సమానంగా గర్భగుడిలో పూజలు నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ నాసిక్ లెక్టర్ డీఎస్ కుష్వా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తృప్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అంతకుముందే ప్రతిరోజూ గంటసేపు గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలని దేవస్థానం ట్రస్టు నిర్ణయించింది. అయితే వారు తడి నూలు వస్త్రాలు లేదా పట్టు వస్త్రాలు ధరించాలని షరతు పెట్టింది. ఈ నిబంధనలను తృప్తి, సహా మరికొంతమంది మహిళా ఉద్యమకారులు పోరాటానికి దిగారు. అటు ఆలయ ప్రవేశం విషయంలో స్త్రీ పురుష సమానత్వం పాటించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. -
చరిత్రను తిరగరాస్తున్న మహిళ
కొత్త కోణం సంప్రదాయాలను కాలానుగుణంగా మార్చుకోవడం ద్వారానే ఏ సమాజమైనా ముందుకు సాగగలదనేది చరిత్ర చెప్పిన సత్యం. గతంలో ఇలా చాలా సంప్రదాయాలను మనం మార్చుకున్నాం. మహిళలు, అంటరానివారు, శూద్రులు విద్యకు అర్హులు కారని ఒకప్పుడు అన్నారు. ఈ ఆధునిక యుగంలో వర్ణాశ్రమ ధర్మానికి కాలం చెల్లింది. అయినా కుల సమాజం, మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఇలాంటి వివక్షల ప్రతిఘటనకు సామాన్యుల చేతి ఆయుధంగా మారింది. స్త్రీపురుష అసమానతల దుస్సంప్రదాయాలకు చెంపపెట్టులాంటి విలక్షణ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. తలొంచాల్సింది రాజ్యాంగానికేగాని దేవుడికి కాదని స్ఫురింపజేసే తీర్పది. వందల యేళ్ళ సనాతన సంప్రదాయాల పేరిట స్త్రీల ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తున్న పురుషాధిపత్య భావజాలాన్ని ధిక్కరించారు సమానత్వాన్ని కోరుతున్న ఆధునిక మహిళలు. పోలీసు వలయాలు, బారికేడ్లు, పురుషపుంగవుల భౌతిక దాడులు ఏవీ ఆ మహిళా శక్తి ముందు నిలవలేకపోయాయి. ఈ పోరాటాన్ని నడిపిన మహిళా సేన పేరు భూమాత బ్రిగేడ్. దాని నాయకురాలు తృప్తి దేశాయ్, మహారాష్ట్ర, అహ్మద్‌నగర్ జిల్లాలోని శనిసింగనాపూర్ దేవాలయంలోకి గత నాలుగు వందల ఏళ్లుగా మహిళలకు ప్రవేశం లేదు. గత ఏడాది నవంబర్ 29న ఒక మహిళ శని దేవాలయ మూలవిరాట్ దగ్గరికి వెళ్ళాలని చేసిన ప్రయత్నాన్ని పూజారులు అడ్డుకున్నారు. అది తెలుసుకున్న భూమాత బ్రిగేడ్ ఆ దుస్సంప్రదాయాన్ని బద్దలుకొడుతూ డిసెంబర్ 20న ఆలయ ప్రవేశానికి ప్రయత్నించగా ఆలయ భద్రతా సిబ్బంది వారిని అడ్డగించారు. మళ్లీ వస్తాం, ఆలయప్రవేశం చేస్తామన్న భూమాత బ్రిగేడ్వారు... అన్నట్టే జనవరి 26న తిరిగి వచ్చారు. ఆలయ వర్గాలతో ఘర్షణ జరిగింది. ఆ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. స్త్రీల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం, అది స్త్రీల హక్కుల ఉల్లంఘన అంటూ వారు మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సనాతనవాదానికి చెంపపెట్టు ఈనెల మొదటి వారంలో హైకోర్టు వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దేవాలయ ప్రవేశానికి మహిళలు, పురుషుల మధ్య వివక్ష చూపకూడదని అది తేల్చి చెప్పడం సనాతనవాదులకు చెంపపెట్టయింది. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను అనుమతించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ సంప్రదాయం కన్నా రాజ్యాంగానికి, చట్టానికి విలువ ఇవ్వాలనీ, పౌరులంతా చట్టం ముందు సమానులేననీ, ఏవో సాకులు చూపి ప్రాథమిక హక్కులను హరించకూడదనీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు విడివిడిగా ఇచ్చిన ఆదేశాలు మన రాజ్యాంగ స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం బహిరంగ ప్రదేశాలు, ఇతర ప్రజోపయోగ ఉమ్మడి స్థలాల ప్రవేశం, వినియోగంలో ఎటువంటి వివక్ష చూపరాదు. అలాంటి ప్రదేశాల్లో పిల్లలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీల ప్రవేశానికి ఏవైనా ఆటంకాలు ఉంటే, వాటిని తొలగించడానికి ప్రభుత్వాలు చట్టాలు కూడా చేయవచ్చునని అదే ఆర్టికల్ స్పష్టంగా తెలిపింది. అయితే మన దేశంలో రాజ్యాంగం అమలయ్యే పరిస్థితులు వేరు. మన కులాల సమాజం మనుషులను ఒక్కటిగా గాక, గుంపులుగా విడగొట్టింది. వివిధ కులాల మధ్య సమాన సంబంధాలు లేవు. ఉన్నత, అధమ భేదాలు శాస్త్ర సమ్మతమని శాస్త్రాలు, స్మృతులు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఫలితంగా మన సమాజం అనైక్యత, అసమానత, అజ్ఞానం వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. బ్రిటిష్ పాలన, విదేశీ చదువులు, ఇతర సామాజిక ఉద్యమాలు ఈ పరిస్థితులలో మార్పును తేవడానికి ప్రయత్నించాయి. కానీ అవేవీ సరైన ఫలితాలను ఇవ్వలేదు. సామాజిక ఉద్యమాలు, స్వాతంత్య్రోద్యమం ప్రజల్లో నూతన చైతన్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో సాగిన కుల వ్యతిరేక ఉద్యమం దేశ రాజకీయాలను బలంగా ప్రభావితం చేసింది. దానికి అనుగుణంగానే గత సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రజాస్వామ్య పునాదులపై ఆధునిక రాజ్యాంగ రూపకల్పన సాగింది. కాలంచెల్లిన గత సంప్రదాయాలను తిరస్కరించి, సమానత్వ పునాదులపై సరికొత్తగా రూపుదిద్దుకున్న ప్రణాళికే మన రాజ్యాంగం. కాలానుగుణంగా మారితేనే పురోగతి అందుకే అంబేడ్కర్ ప్రజలందరూ సమైక్యంగా ఆమోదించుకున్న రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని అభివర్ణించారు. రాజ్యాంగం పీఠికలోనే, భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని ప్రకటించారు. ప్రాతినిధ్య విధానం ద్వారా భారత రాజ్యాంగ సభ నిర్మాణమైనందున దీనికి ప్రజలందరి ఆమోదం ఉన్నదనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ సగర్వంగా ప్రకటించారు. అందువల్ల భారత రాజ్యాంగం, సంప్రదాయం కన్నా ఉన్నతమైనదని ప్రకటించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉన్న రాజ్యాంగ నిబద్ధత మరో మారు స్పష్టం అయ్యింది. ఇదే సందర్భంలో మరో విషయాన్ని కూడా మనం మననం చేసుకోవాల్సి ఉంది. అదేమిటంటే భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయస్థానాల బాధ్యతలను కూడా చాలా స్పష్టంగా నిర్ధారించారు. రాజ్యాంగం అమలు సక్రమంగా జరుగుతున్నదా లేదా? లేకపోతే దానిని సక్రమంగా అమలు చేయడానికి కావాల్సిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు అందించాల్సి ఉంటుందని, అమలు పర్యవేక్షణా బాధ్యతలు కోర్టులపై ఉంటాయనే విషయాన్ని రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగ సభలోనే తేల్చి చెప్పారు. సంప్రదాయాలను కాలానుగుణంగా మార్చుకోవడం ద్వారానే ఏ సమాజమైనా ముందుకు సాగగలదనేది చరిత్ర చెప్పిన సత్యం. అంతేకానీ, శనీశ్వర దేవాలయంలోకి మహిళలు వెళితే అత్యాచారాలు జరుగుతాయని, షిరిడీ సాయిబాబాను మొక్కడం వల్లనే మహారాష్ట్రను కరువు పీడిస్తోందని చెప్పే పీఠాధిపతుల మాటలను ఏ సమాజమూ అంగీకరించజాలదు. గతంలో అమలులో ఉన్న సంప్రదాయాలను చాలా వాటినే మనం మార్చుకున్నాం. సముద్రం మీద ప్రయాణం చేస్తే కుల భ్రష్టులవుతారన్నారని సముద్రాలు దాటడం మానలేదు. మహిళలు, అంటరానివారు, శూద్రులు విద్యకు అర్హులు కారని ఒకప్పుడు అన్నారు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారమే వృత్తులు చేయాలని శాసించారు. ఈ ఆధునిక యుగంలో వర్ణాశ్రమ ధర్మానికి కాలం చెల్లింది. అయినా కుల సమాజం, మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఇలాంటి వివక్షల ప్రతిఘటనకు సామాన్యుల ఆయుధంగా మారింది. ‘భూమాత బ్రిగేడ్’ కు ఈ వివక్షను ఎదుర్కొనే నైతిక ధైర్యాన్ని కలిగించినది రాజ్యాంగమే. భూమాత బ్రిగేడ్ పోరాటాన్ని హిందూయేతర శక్తుల కుట్రగా భావించడానికి వీల్లేదు. దాని నేత తృప్తి దేశాయ్ నూటికి నూరుపాళ్లు తాను హిందువునని ప్రకటించుకున్నారు. అంతేకాదు, పుణేలోని ఆమె ఇల్లు సైతం హిందూ ధర్మానికి అనుగుణంగానే ఉంది. ఆమె బాబా రాందేవ్, అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కార్యకర్తగా పనిచేశారు. ఒక సగటు భారత మహిళ సనాతన సంప్రదాయాలను సవాలు చేసింది, సాంప్రదాయక స్త్రీ వివక్షని ధిక్కరించింది. పరిస్థితులకు అనుగుణంగా హిందూ సంప్రదాయాలను మార్చుకోవాల్సిన ఆవశ్యకతను ఇది గుర్తు చేస్తోంది. మహిళా హక్కులకు ఆదిలోనే హంసపాదు నిజానికి అంబేడ్కర్, రాజ్యాంగ రచనా సమయంలోనే మహిళలకు కుటుంబ వ్యవహారాల్లో, ఆస్తి పంపకాల్లో సమాన భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. తద్వారా అప్పటి వరకు వివిధ కులాలు, తెగలు అనుసరిస్తున్న ఆచారాల స్థానంలో ఒక ఉమ్మడి విధానాన్ని క్రోడీకరించాలని అంబేడ్కర్ ఆశించారు. మొదట, జవహర్లాల్ నెహ్రూ, ఆయన మంత్రిమండలి యావత్తూ దీనికి ఆమోదం తెలిపినప్పటికీ, సభలో దీనిని వ్యతిరేకించడంతో... మహిళల సమానత్వ హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన చరిత్రాత్మక ప్రయత్నం విఫలమైంది. ఒక్క దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ తప్ప రాజ్యాంగ సభలోని మహిళా సభ్యులు సైతం దీనికి మద్దతుగా నిలవకపోవడం ఆయనను బాధ పెట్టింది. ఆయన ప్రతిపాదన ప్రకారం భార్యకు, కూతురికి ఆస్తిలో సమాన హక్కులుండాలి. భర్త హింసలు పెడుతుంటే, నిత్యం వేధిస్తుంటే విడాకులు తీసుకునే స్వేచ్ఛ భార్యకుండాలి. ఏ కులం నుంచైనా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం, కులాంతర వివాహాలు చేసుకునే హక్కు ఉండాలి. విడాకుల సమయంలో పిల్లలు ఉన్నట్లయితే వారి పోషణకు భరణం వంటి తదితర అంశాలను సైతం ఆయన ప్రతిపాదించారు. 1952 ఎన్నికల్లో హిందువుల ఓట్లు రావేమోనని భయపడిన నెహ్రూ... అంబేడ్కర్ రూపొందించిన ఆ బిల్లును సభలో ఆమోదించే సాహసం చేయలేదు. దీంతో 1951లోనే అంబేడ్కర్, నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. ఆ తర్వాత అదే హిందూ కోడ్ బిల్లులోని అంశాలను విడివిడి చట్టాలుగా ఆమోదించారు. అందులో హిందూ వివాహచట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ పిల్లల సంరక్షణ చట్టం, హిందూ దత్తత చట్టం లాంటివి ముఖ్యమైనవి. ఆనాడు అంబేడ్కర్ నాటిన విత్తనాలే ఆ తర్వాత మహిళా ఉద్యమాలుగా, తదనంతరం అనేక రక్షణ చట్టాలుగా మనకు ఫలాలనిచ్చాయి. అయితే ఆర్థిక సామాజిక అంతరాలతో పాటు స్త్రీపురుష అంతరాలను ఛేదించేందుకు నాడు అంబేడ్కర్ సూచించిన మార్గం హిందూ కోడ్ బిల్లు. దానిని అందుకోలేకపోయినా, అంబేడ్కర్ ఆశించిన స్త్రీల రాజకీయ హక్కును... చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సైతం ఆమోద ముద్ర వేయకపోవడానికి కారణం కొనసాగుతున్న అసమానతలు, చట్టసభల్లోని పురుషస్వామ్యమేననేది స్పష్టమే. పురుషాధిపత్య భావజాలానికి స్వస్తిపలికే భూమాత బ్రిగేడ్ ఉద్యమాల వంటి పోరాటాలు ఉప్పెనలై శాసనసభలు, చట్టసభలు, దేవాలయాలను చుట్టుముట్టాల్సిందే. వ్యాసకర్త :మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
నన్ను హత్యచేయాలనే వచ్చారు
మహారాష్ట్ర ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడి విజయం సాధించిన భూమాత రణరాగిణి బ్రిగేడ్ నాయకురాలు తృప్తిదేశాయ్ తనపై కొందరు శివసేన, ఇతర సంస్థల కార్యకర్తలు దాడిచేయడంపై నిరసన వ్యక్తంచేశారు. కొల్హాపురీ మహాలక్ష్మి ఊరేగింపు సందర్భంగా తనపై దాడిచేసిన వారు తనను హత్యచేయాలనే పథకంతో వచ్చారని ఆరోపించారు. ఆమె గుడిలోంచి సజీవంగా బయటకు రావడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించారని మీడియాకు తెలిపారు. మహిళల్ని జుట్టుపట్టుకొని లాగి, దుస్తులను చించి అవమానించారని తృప్తి విమర్శించారు. చివరికి పూజారులు సైతం తమను దుర్భాషలాడారని వాపోయారు. తనకు పక్షవాతం సోకే అవకాశాలున్నాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిపారు. బుధవారం నాటి ఆందోళనలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తృప్తి దేశాయ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మీడియాకు వివరించారు. ఆమె డీహైడ్రేట్ అయ్యారని, లో షుగర్, లో బీపీతో బాధపడుతున్నారని ఆమెకు చికిత్స అందిస్తున్న డా.అర్జున్ అద్నాయ్ తెలిపారు. దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తిదేశాయ్, బుధవారం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో వస్త్రధారణ నియమాలను ఉల్లంఘించి మరో సంచలనం సృష్టించారు. ఇతర కార్యకర్తలతో కలిసి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలు సల్వార్ కమీజ్ ధరించి ఆలయంలోకి ప్రవేశించడంపై శివసేన, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. తరాని చౌక్‌లో వారిని అడ్డుకోవడంతో దేవాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రస్ కోడ్‌ను పాటించాలని పోలీసులు, పురోహితులు కూడా పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. చీరకట్టులో మాత్రమే గర్భగుడిలోకి రావాలని పోలీసులు, ఆలయ అధికారులు పెట్టిన ఆంక్షలను ధిక్కరించి ఆమె సల్వార్ కమీజ్ లో దర్శనం చేసుకున్నారు. భక్తులు, పూజారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమె వారిని తోసేసి గుడిలోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ ఎస్పీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో తృప్తి సహా, పలువురు మహిళలను ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకున్నారు. -
‘శని’ గుళ్లోకి మహిళలకు ప్రవేశం
నిషేధాన్ని ఎత్తివేస్తూ శని శింగ్నాపూర్ ఆలయ ట్రస్టు నిర్ణయం సాక్షి, ముంబై: వివాదాస్పద శని శింగ్నాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేశారు. మహారాష్ట్రీయుల కొత్త సంవ త్సరం ‘గుడి పాడ్వా’ కానుకగా ఆలయ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ట్రస్టు సభ్యులు.. బాంబే హైకోర్టు ఆదేశాల్ని అనుసరిస్తూ అందరినీ శనిదేవుడ్ని కొలిచేందుకు అనుమతించాలని నిర్ణయించారు. నిర్ణయం అనంతరం తృప్తిదేశాయ్ ఆధ్వర్యంలో భూమాతా బ్రిగేడ్ సభ్యులు శనిదేవునికి పూజలు చేశారు. కోర్టు ఆదేశాలను పాటించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రస్టీ సాయారాం బన్కర్ చెప్పారు.ఇక నుంచి ఎలాంటి వివ క్షా ఉండదని.. శుక్రవారమే అందరి కోసం గుడి తలుపులు తెరిచి ఉంచామని ఆలయ ప్రతినిధి హరిదాస్ గేవాలే తెలిపారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా మహిళల్లో ఆనందం వ్యకమైంది. దశాబ్దాల కట్టుబాట్లకు ముగింపు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శని శింగ్నాపూర్లోకి మహిళల్ని అనుమతించాలంటూ గత కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దశాబ్దాల కట్టుబాట్లను బద్దలుకొడుతూ గతేడాది నవంబరులో శనిదేవునికి ఓ మహిళ తైలాభిషేకం చేసింది. ఈ సంఘటన అనంతరం అనేక సంఘాలు ముందుకొచ్చి మహిళలకు ప్రవేశంపై పోరాటం చేశాయి. ‘భూమాతా రణరాగిని బ్రిగేడ్’ ఆధ్వర్యంలో తృప్తి దేశాయ్(32) మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఆలయంలోకి వెళ్లేందుకు అనేకసార్లు ప్రయత్నించారు. దేవుడ్ని పూజించేందుకు మహిళల్ని అనుమతించాలని, శని శింగ్నాపూర్ ఆలయ ప్రవేశం కల్పించాలంటూ బాంబే హైకోర్టు ఏప్రిల్ 1న ఆదేశించింది. ఆందోళన నేపథ్యంలో పురుషులకు కూడా మండపంపైన ఉండే శని శిలకు తైలాభిషేకాన్ని ట్రస్టు నిషేధించింది. ఈ విషయంలో గ్రామస్తులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల మధ్య వివాదం ఏర్పడింది. కొందరు పురుషులు శనిదేవుని శిలకు జలాభిషేకం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఆలయ ట్రస్ట్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశాలు, మహిళా సంఘాల నిరసనలపై సుదీర్ఘంగా చర్చించి ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. లింగవివక్ష వద్దని ముందునుంచి చెబుతున్నామని సీఎం ఫడ్నవిస్ అన్నారు. ఎట్టకేలకు శని శింగ్నాపూర్ ఆలయ ట్రస్టు మహిళలకు ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఆనందం కలిగించింది: తృప్తి దేశాయి కొంత ఆలస్యమైనా ఆలయ ట్రస్టు నిర్ణయం ఆనందం కలిగించిందని భూమాతా బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్ అన్నారు. ఇదో చారిత్రాత్మకమైన రోజని, ఈ నిర్ణయం దేశంలో లింగ సమానత్వానికి దోహదపడుతుందన్నారు. -
దైవ సాక్షిగా...
సమాజంలో అందరికీ సమానావకాశాలు దక్కాలని, ఏ రూపంలోనూ వివక్ష ఉండ రాదని మన రాజ్యాంగం చెబుతున్నా ఏదో ఒక స్థాయిలో అది కొనసాగుతూనే ఉంది. మిగిలిన వివక్షలను గుర్తించినంత సులభంగా లింగ వివక్షను గుర్తించడం, దాన్ని పారదోలడం కష్టం. అందులోనూ ఆ వివక్ష కుటుంబ విలువల పేరిట... మత విశ్వాసాలు లేదా నమ్మకాల పేరిట అమలులో ఉంటే దానితో వ్యవహరిం చడం మరింత కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలోని శనిసింగనా పూర్లో ఉన్న శనీశ్వరాలయం ప్రధాన వేదికపైకి మహిళలను అనుమతించరాదన్న 400 ఏళ్లనాటి నిబంధనను తొలగిస్తున్నట్టు ఆ ఆలయ ట్రస్టు శుక్రవారం చేసిన ప్రకటన చాలామందికి ఊరటనిస్తుంది. అయితే ఈ మార్పు అంత సులభంగా రాలేదు. మహిళల విషయంలో వివక్ష చూపుతున్న ఆ నిబంధనను నిరసిస్తూ, ‘ప్రార్ధించే హక్కు’ కల్పించాలని కోరుతూ గత ఆరేడు నెలలుగా భూమాత రణ రంగిని బ్రిగేడ్(బీఆర్బీ) ఆధ్వర్యాన ఉద్యమం సాగుతోంది. ఆలయప్రవేశానికి వారు చేసిన ప్రయత్నాలను గతంలో పోలీసులు వమ్ము చేశారు. ఆలయ ప్రవేశంలో ఎలాంటి వివక్షా పాటించరాదని 1956 నాటి మహారాష్ట్ర హిందూ ప్రార్థనా స్థలాల చట్టం చెబుతుండగా...అందుకు విరుద్ధమైన పోకడలపై ఎందుకు చర్య తీసుకోరని బొంబాయి హైకోర్టు చీవాట్లు పెట్టాక మహారాష్ట్ర సర్కారు అయిష్టంగానే అయినా కాస్త కదిలింది. కానీ ఆ తీర్పు వచ్చిన మర్నాడు శనీశ్వరాలయంలోని వేదికపైకి వెళ్లబోయిన మహిళలను కొందరు స్థానికులు అడ్డుకోవడమేకాక బీఆర్బీ నాయకు రాలు తృప్తి దేశాయ్‌పై దాడిచేశారు. వివక్షాపూరిత నిబంధనను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ట్రస్టు ప్రకటించిన వెంటనే మహిళలు ఆలయంలో పూజలు చేశారు. అసలు ఒక సకలాతీత శక్తి ఉందా, లేదా అనేది వేరే చర్చ. అలాంటి శక్తి ఉన్నదని నమ్మేవారి విషయంలో వివక్ష అమలు కావడమేమిటన్నదే కీలక ప్రశ్న. నిజానికి ఈ ప్రాతిపదికనే 15 సంవత్సరాలక్రితం హేతువాది నరేంద్ర దభోల్కర్ (ఆయనను రెండేళ్లక్రితం కొందరు దుండగులు కాల్చిచంపారు.)ఆధ్వర్యంలో శనిసింగనాపూర్‌కు తొలిసారి పాదయాత్ర సాగింది. మహిళలపై వివక్ష చూపరా దంటూ ఆయన 2011లో బొంబాయి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మన రాజ్యాంగంలోని 14వ అధికరణ పౌరులందరినీ సమానంగా చూడాలని చెబు తోంది. 15వ అధికరణ అన్ని రకాల వివక్షనూ నిషేధించింది. 25వ అధికరణ ఏ మతాన్నయినా అనుసరించే స్వేచ్ఛనిస్తున్నది. శనిసింగనాపూర్లో ఈ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని లక్ష్మీశాస్త్రి అనే మహిళ నిరుడు డిసెంబర్లో సుప్రీం కోర్టుకు ఫిర్యాదుచేశారు. అంతకు నెలరోజులక్రితం ఒక మహిళ బారికేడ్లను దాటు కుని శని దేవత కొలువై ఉన్న వేదికనెక్కితే ఆ వేదిక మైలపడిందని భావించి అక్కడి పూజారులు సంప్రోక్షణ చేశారని ఆమె ఆరోపించారు. ఇలాంటి పోకడలు వెగటు పుట్టించడమే కాదు...సమాజంలో దురభిప్రాయాలను వ్యాప్తిచేస్తాయి. సమాజంపై మత విశ్వాసాలు, ఆచారాల ప్రభావం ప్రగాఢంగా ఉంటుంది. ఎప్పుడో ఏదో ఒక దశలో, ఎవరి ప్రయోజనం కోసమో ఏర్పరిచిన నిబంధన కాలక్రమేణా ఆచారంగా మారి అమలవుతుంటే...అది ఆ మతాభిప్రాయంగా చలామణి అవుతుంటే అందు వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. పురాతనకాలంనుంచీ అమలులో ఉన్నది గనుక దాన్ని పాటించితీరాలని, లేనట్టయితే అరిష్టం జరుగుతుందని బెదరగొట్టే వారు బయల్దేరతారు. మహిళలు ‘తక్కువ స్థాయివారు’ గనుకే కొన్ని ఆలయాల్లో వారికి ప్రవేశం ఉండదన్న అపోహను కొనసాగనిస్తే... అది సమాజంలో అనేక రకాల వివక్షకు తోవలు పరుస్తుంది. వాటన్నిటికీ సాధికారత కలగజేస్తుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మి ఆలయం గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై 2,000 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని అయిదేళ్లకిందట ఎంతో ఆందోళన జరిగాక తొలగించారు. ఆ రాష్ట్రంలోనే ఉన్న త్రయంబకేశ్వర్ గర్భాల యంలో కూడా మహిళల అనుమతిపై ఆంక్షలున్నాయి. వివక్ష కూడదన్న బొంబాయి హైకోర్టు ఆదేశాల తర్వాత ఈమధ్యే ఆ ఆలయం పురుషుల ప్రవేశంపై కూడా ఆంక్షలు విధించి మరో రూపంలో ‘సమానత్వాన్ని’ పాటించడం మొదలెట్టింది. శబరిమల ఆలయంలో 10-50 సంవత్సరాల మధ్యనున్న ఆడవాళ్లు అయ్యప్ప స్వామి దర్శనానికి రాకూడదన్న ఆంక్షలున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్నప్పుడు ఆ ఆలయ ప్రధాన అర్చకుడు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. రుతుక్రమ సమయంలో మహిళలు ‘స్వచ్ఛంగా’ ఉండరు గనుకే ఇలాంటి సంప్రదాయం అమలవుతున్నదని ఆయన చెప్పారు. అంతేకాదు... రుతుక్రమాన్ని కనిపెట్టే యంత్రం అందుబాటులోకొస్తే మహిళల ఆలయ ప్రవేశానికి అంగీకరిస్తానన్నారు. సహజంగానే ఈ వ్యాఖ్యలు అందరిలోనూ ఆగ్రహావేశాలను రగిల్చాయి. ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి. కుల, మత,వర్గాలకు అతీతంగా అంద రినీ దర్శనానికి అనుమతించే అయ్యప్పస్వామి ఆలయంలో కేవలం మహిళల విష యంలో మాత్రమే ఈ వివక్ష ఎందుకన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఈమధ్యే తీసుకొచ్చిన నిబంధనపై కూడా ఉద్యమం సాగుతోంది. ముస్లిమేతరులను దర్గాలోకి అనుమతిస్తూ స్వీయ మతంలోని మహిళలపై ఆంక్షలేమిటన్నదే ఆ ఉద్యమం సంధిస్తున్న ప్రశ్న. ఈ చరాచర ప్రపంచం సర్వమూ భగవంతుని సృష్టే అని నమ్మినప్పుడు వివక్ష పాటించడం అర్ధంలేని విషయం. ఆచారాలైనా, సంప్రదాయాలైనా మనం ఏర్పరుచుకున్నవే. అవి సమాజంలో కొందరిని హీనంగా చూస్తున్నాయని, బాధిస్తున్నాయని గ్రహించినప్పుడు వాటిని సవరించుకోవడమే విజ్ఞత అనిపించుకుంటుంది. ఆలస్యంగానైనా అలాంటి విజ్ఞత ప్రదర్శించినందుకు శనీశ్వరాలయ ట్రస్టును అభినందించాలి. ఇతర ప్రార్థనాలయాలకు సైతం ఇది ఆదర్శంకావాలి. -
దర్శనమయ్యేదాక కదలం!
ముంబై: మహారాష్ట్రలోని శనిశింగానాపూర్ ఆలయ ప్రవేశం విషయంలో భూమాత బ్రిగేడ్ సంస్థ మళ్లీ పోరుబాట పట్టింది. భూమాత బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్ నేతృత్వంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు శని ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం.. వారిని అడ్డుకుంటూ స్థానికులు ఆందోళన నిర్వహించడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమ తమను ఆలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంపై తృప్తి దేశాయ్ మండిపడ్డారు. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి దర్శనం చేసుకునేదాక కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. మహారాష్ట్రలోని ఆలయాన్నింటిలోకి మహిళలను వెళ్లేందుకు అనుమతించాలని బొంబాయి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శని ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన భూమాత బ్రిగేడ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తృప్తి దేశాయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు రక్షణ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించగా.. అందుకు విరుద్ధంగా వారు తమను అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. తాము ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేయబోమని, ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటే మహారాష్ట్ర సీఎం, హోంమంత్రిపై కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయంలోకి వెళ్లేందుకు తమకు పోలీసులు సహకరించాలని కోరారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తృప్తి దేశాయ్ సహా భూమాత బ్రిగేడ్ కార్యకర్తలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఆందోళన నిర్వహిస్తున్న స్థానికులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. -
శని శింగనాపూర్ ఆలయం వద్ద ఉద్రిక్తత
ముంబయి : మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు తరలివచ్చిన 'భూమాత’ మహిళా సంఘం చీఫ్ తృప్తి దేశాయ్‌తో పాటు మహిళలను శనివారం అడ్డుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించరాదంటూ వారిని స్థానికులతో పాటు ఎన్సీపీ కార్యకర్తలు, ఆలయ ట్రస్ట్ సిబ్బంది అడ్డు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆలయంలోకి ప్రవేశించనివ్వకపోవటంపై తృప్తి దేశాయ్ మాట్లాడుతూ ... కోర్టు అనుమతి ఇచ్చినా తమను లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. తాము వెనకడుగు వేసేది లేదని ఆమె తెలిపారు. మరోవైపు తృప్తి దేశాయ్‌కి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... తాము మహిళలను ఆలయంలోకి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కాగా మహారాష్ట్రలో ఆలయాల్లోకి మహిళలను అనుమతించకపోవడం ఇకపై కుదరదు. పూజా స్థలాల్లోకి వెళ్లడం అందరి ప్రాథమిక హక్కు అని, దాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని హైకోర్టు పేర్కొంది. శతాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, లింగ వివక్షకు పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శని శింగనాపూర్ లాంటి ఆలయ గర్భగుడిలోకి మహిళలను అనుమతించకపోవడాన్ని చేసిన పిల్‌ను పరిష్కరిస్తూ తీర్పు చెప్పింది. ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే వారికి 6 నెలల శిక్ష విధించేలా చట్టం ఉంది.